పవిత్ర జీవనం

Spread the love

సూచౌను దాటాక, ఎత్తైన నీలపు కొండలకు, వైషా సరస్సుకు మధ్య ఒక చిన్న గ్రామముంది. ఆ ఊరి పురాతన వీథులలో వరసగా రాళ్ళ తోరణాలు కట్టబడ్డాయి. చైనాలో సాధారణంగా గ్రామాల్లోను పట్టణాలలోను ఇలాంటి తోరణాలుంటాయి. అలంకారం కోసం కట్టారా అన్నట్లుంటాయి కాని నిజానికి అవి గౌరవనీయులగు విద్వాంసుల యొక్క సుగుణశీలలగు స్త్రీల యొక్క జ్ఞాపక చిహ్నాలు. చిన్నప్పుడే భర్తను కోల్పోయి యావజ్జీవమతనికే అంకితమై మరి పెండ్లాడని వితంతువుల పవిత్రతను కీర్తించుటకీ తోరణాలుకట్టేవారు. ఇట్టివి కట్టాలంటే చక్రవర్తి అనుజ్ఞకావాలి. స్త్రీలలో అట్టి అచంచల ప్రేమను పురుషులు మెచ్చుకొంటారుకాని అలా ఉండడం ఎంత కష్టమో యీ కథవల్ల తెలిసి వస్తుంది.

“మైహువా, లోపలికిరా, ఎదిగినదానవు గుమ్మం దగ్గర నిలబడొచ్చా?” అంది తల్లి, వేన్ సతి, తన కుమార్తెతో. సిగ్గుతో తలవంచుకొని లోనికి వచ్చేసింది కూతురు. ఆమె అపురూప సుందరి, ఎఱ్ఱని పెదవులు, ముత్యాలలాంటి పళ్ళు, పీచ్ పువ్వులాంటి దేహచ్ఛాయ. కొంచెం పెంకితనం, పట్టుదలా ఉన్నా మైహువా దాపరికం లేనిది. పల్లె గ్రామాల్లోనే ఇలాంటి పిల్లలుంటారు. తలవంచుకొని లోపలి దారి పట్టినా ఆమె అడుగులు అనిష్టంగానే పడుతున్నాయి. కోపంతో గుండెకొట్టుకొంటూనే ఉంది.

“తక్కిన వాళ్ళ పిల్లలు బయటికొచ్చి చూడ్డం లేదేమిటి?” అంటూ వెళ్ళిపోయింది లోపలికి. డెబ్భై, ఎనభై మంది సైనికులా వీధిని ఎక్కడికో వెళ్ళుతున్నారు. వాళ్ళ తప్పెటల ధ్వనితో నాసన్న గులకరాళ్ళ రోడ్డు ప్రతిధ్వనిస్తూ ఉంది. మగాళ్ళు ఆడాళ్ళు ఇళ్ళల్లోంచి బయటికివచ్చి సైనికులెక్కడికి పోతున్నారాయని చూస్తున్నారు. కాస్త వయస్సు మీరిన ఆడవాళ్ళు బయటి గోడదాక వచ్చి చూస్తున్నారు. యువతులు మాత్రం గుమ్మాల దగ్గర వెదురు తడకలలోంచి తాము కనపడకుండా చూస్తున్నారు.

మైహువా మాత్రం తడకలు దాటివచ్చి, ఇంటి బయట నున్న ఎత్తురాతి మీద నిలబడి చూస్తూంది. బయటపోయే వాళ్ళకి కనబడుతూంది. సైనికులకు చివర వస్తూ ఉన్న కేప్టెన్ కొంచెందూరం నుంచే ఆమెను చూశాడు. వయస్సులో ఉన్న యేచిన్నదైనా అతని కంటి కానుతుంది. అతడు ముందుకు సాగి పోతూ ఉంటే మైహువా చిరునవ్వు నవ్వింది. ఆమె సుందరముఖాన్ని తలత్రిప్పి మరోసారి చూచి ముందుకు సాగాడతడు.

ఒక దొంగల గుంపు సమీపాన్ని నీలపు కొండల్లో దాగుకొని చుట్టు ప్రక్కల ప్రాంతాల పై దాడులు దౌర్జన్యాలూ జరుపుతూంది. వాళ్ళను పట్టుకోడానికి ముప్ఫై మైళ్ళ దూరానున్న సూచ్ నుండి వచ్చిందీ సైన్యం హంచివాంగ్ కు . కాని హంచివాంగ్ లాంటి చిన్న గ్రామంలో సైనికులనుంచడానికి ఇళ్లు తక్కువ. వాళ్ళని దేవాలయాల్లో నిలిపి, ఆఫీసర్లు మాత్రం కాస్త నిద్రపోడానికైనా వీలుండే ఇళ్ళల్లో ఉంటారు. ఈ సంగతి మనస్సులో ఉండే, ఇల్లు గుర్తు పెట్టుకోడానికే కేప్టెన్ మరొకసారి చూశాడు మైహువావైపు.  సైనికులుకేర్పాట్లుచేసి, మధ్యాహ్నం వాళ్ళింటికొచ్చాడు “ఆతిథ్యం దొరుకుతుందా” అంటూ. ఆ ఇంట్లో మైహువా తల్లి, తాతమ్మ ఉన్నారు. వాళ్ళిద్దరూ వితంతువులే. ఆ ఊళ్లో రెండు మూడు నెలలు ఉంటామని, సాధారణంగా తాను ఊరులో ఉండనని, కాని ఉన్నప్పుడు పడుకోడానికి కాస్త జాగా ఇస్తే చాలునని చెప్పాడు. తరువాత మాటల్లో ఆ యింట్లో మగవాళ్ళే లేరని తెలుసు కొన్నాడు. ప్రొద్దున్న తాను చూచిన యువతి అక్కడే ఉంది. తనవాళ్ళతనికి సరే అంటే బాగుండునని ఆరాట పడుతూంది.

తాతమ్మ అరవైయేళ్ళది. ముఖం ముడతలు పడ్డాయి. నల్లని ముఖమల్ గుడ్డ తలకు కట్టుకొంది. తల్లి, వేన్ సతి, ముప్ఫైయేళ్ళది. ఆమె అందం ఏమీ తగ్గలేదు. సన్నగా పొడుగ్గా ఉంది. ముక్కు తీర్చిదిద్దినట్లు ఎత్తుగా ఉంది. నోరు చిన్నది. కూతురు రూపానికి మెరుగుపెట్టి కొంచెం శాంతం అద్దితే ఎట్లుంటుందో అలా ఉంది తల్లి. కూతురులో కనిపించే విలాసం చాంచల్యం ఆమెకు లేవు. ఆమెలో ఉద్రేకాగ్ని ఆరి పోలేదు కాని అణిగిఉంది. ఆమె ముఖంమీద ముసుగు ఉంది. సేనాధిపతి తన్ను చూడగానే చిన్న నవ్వు వచ్చినా అణుచుకొంది. తెలివి నొలుకుతూ చకచకలాడుతున్న ఆమె కళ్ళు చూడగానే ఆమెలో అర్థంచేసుకోవలసిన విషయాలు కప్పబడి ఉన్నాయని అతనికి తోచింది.

మూడుతరాల ఆడవాళ్ళున్న యీ యింట్లోకి పరాయి మగవాణ్ణి రానివ్వడం ఎన్నడూ జరగనిదే. కాని యువకోద్యోగిని చూచేసరికే స్త్రీ  హృదయానికైనా అది అంత విషయంగా తోచదు. ఒత్తుగా పెరిగిన నల్లని జుట్టు, బలిష్ఠమైన భుజస్కంధాలు, సన్నగా పొడుగ్గా చక్కని రూపురేఖలుగల మూర్తి. సాధారణంగా సైన్యాల్లో ఉండే మోటుజాతి, చదువు సదభ్యాసాలులేని బూతులు బుంగకాడు. తుప్పున ఉమ్మి వేస్తూ, విరామం లేకుండా ప్రగల్భాలు కొడుతూ, పెద్ద డాబుదర్పంతో బిర్రబిగిసే రకంకాడు. పియాంగ్ లోని సైనిక విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు. సంస్కృతి గల వాక్కు; సంస్కారం గల సభ్యత; శిష్టాచార సంపత్తి గల పెద్ద మనిషి. లీ సంగ్ అతని పేరు. లీ కుటుంబ నామం: సంగ్ అసలు పేరు.

“నా భోజనం బరువు మీకక్కరలేదు. కాస్త స్నానానికి పరుండడానికి స్థలం ఇస్తేచాలు. ఎప్పుడైనా టీ ఇస్తే ఇవ్వండి” అన్నాడు సంగు. “ఇది నీ హోదాకు తగిన ఇల్లుకాదు. కాని నీ కష్టమైతే ఊరిలో ఉన్నప్పుడిక్కడ ఉండొచ్చు” అంది వేన్ సతి. ఇల్లు కొంచెం హీనంగా ఉన్న మాట నిజమే, వెలుతురు కొంచెం తక్కువే. ఎక్కువ అలంకారాలు లేకపోయినా, ఉన్న సామాను నాగరికంగానే ఉంది. తుడిచి తుడిచి కర్ర సామాను రంగుపోయింది. ఇల్లు మట్టుకు  చక్కగా శుభ్రంగా సర్దిఉంది. వెదురుమంచం ముందున్న వసారాలో వేసి, పెరటివైపు కూతురు, తల్లి పడుకోవచ్చు. ఇంట్లో ముసలమ్మ ఉండటంవల్ల పుకార్ల కవకాశంలేదు.

అతణ్ణి చూసేసరికి వితంతువులిద్దరికి తమ మైహువాకు తగిన వరుడనిపించింది. ఆమె చక్కని చుక్క. తల్లి రూపురేఖలలోని నాజూకుతనం పూర్తిగా రాకపోయినా, ఆమె ముక్కు, అందం, కళ్ళ చకచకలు కూతురికి వచ్చాయి. ఎందరో మైహువా అందం మెచ్చుకుంటూ పెండ్లీడు వచ్చిన పిల్ల అని చూస్తున్నారు. ఐతే వెనక్కుటుంబములోని పురుషులను గూర్చి ఒక మూఢ విశ్వాసం బయలుదేరింది. అప్పుడే యీ యింట్లో ఇద్దరు వితంతువులున్నారు. తండ్రి, తాత కూడ పెళ్ళయిన కొన్నాళ్ళకే చవి పోయారు. రెండుసార్లిట్లు జరిగిన ఇంట్లో మూడవసారి మాత్రం అట్లెందుకు జరగకూడదు?  కాబట్టి మైహువాని పరిణయమాడడమంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే అన్న భయం. అదీగాక వాళ్ళకీ ఇల్లు తప్ప ఆస్తి లేదు. ఆమె అందాన్ని వలచిన యువకుల్ని వాళ్ళ తల్లిదండ్రులు మందలించేవారు. కాబట్టి యేపుగా పెరిగిన పందొమ్మిదియేండ్ల పిల్లయినా, మైహువా పెండ్లి మాట యింకా లేనేలేదు.

కేప్టెన్ లీ సంగ్ రాకతో వారింట్లో మార్పుకలిగింది. అతడు మైహువా సాంగత్యంలోనే చాలాకాలం గడిపేవాడు. ముసలమ్మ యెడల వినయవిధేయతలు, వేన్ సతి యెడల శూరుని శుభలక్షణములు గల మనోజ్ఞత, చక్కని మాటకారితనము చూపుతున్నాడు. ప్రేమికుడగుటచే ఉల్లాసం చూపేవాడు. తాను సంతోషంగా ఉండి ఇతరులను సంతోషపరచేవాడు. ఆ వితంతువుల ఇంట్లోకి ఎన్నాళ్ళనుండో లేని మగ వాని కంఠాన్ని మారుమ్రోగే నవ్వునూ తెచ్చిపెట్టాడు. ఎప్పటికీ తమతోనే ఉండిపోతాడని వారికాశ గలిగింది.

            వేన్ సతి హాలులో ఉంది. కేంపునుండి వచ్చిన సంగ్ హాలులో వేన్ సతిని కలుసుకొన్నాడు. ఒక చిన్న అలమారులో కావ్యాలు పురాణాలు ఉన్నాయి. కొన్ని చాలా పెద్ద గ్రంథాలు. ఆడవాళ్ళు చదవగలవి లాగా లేవు. కొన్ని చౌకబారు ప్రేమ కథలు నాటకాలు, కొన్ని చిన్న పిల్లల పుస్తకాలు కూడ ఉన్నాయి. పుస్తకాలు చూపుతూ కేప్టెన్ “మీ మంచి గ్రంథాలయం ఉందే” అన్నాడు.. “మీరు చూడొచ్చు ఇవి నాభర్త వి” అంది వేన్ సతి. “ఈ పిల్లల పుస్తకాలేంటి? పిల్లలులేని యీ ఇంట్లో ఇంత బాల సాహిత్యం ఉందేమిటి? అన్నాడు కేప్టెన్, వేన్ సతికి కొంచెం సిగ్గుఅయింది. “నా కంత విశేషం చదువు లేక పోయినా బాలబాలికలకు చదువు చెప్పుతున్నాను” అంది. “పిల్లల సాహిత్యం” అనే పుస్తక మొకటి, “స్త్రీ ధర్మములు” అని పాన్ ఛోవా వ్రాసిన గ్రంధమున కనేక ప్రతులు, జేమాక్వాంగ్ వ్రాసిన ” కుటుంబ గౌరవం” అనే గ్రంథం మూడు నాలుగు ప్రతులున్నాయి. పిల్లలకు బోధించుటకివే వాడేవారు.

“ఇలాగ సంపాదన చేస్తున్నారా? మీ కాధారమేమిటా అనుకొనే వాణ్ణి” అన్నాడు కేప్టెన్. ఆమె నవ్వుతూ, “ఎలాగో కాలం గడుస్తూంది. మేమిద్దరం వెనక బుడేదారీ పనిచేసేవాళ్ళం. ఇప్పుడు ఇంటి దగ్గర చదువు చెప్పుతున్నాను. ఆడపిల్లలు మంచి కోడళ్ళుగా సంచరించడానికి కావలసిన నైతిక బోధన ఇస్తానని చాలా కుటుంబాలు తమ పిల్లల్ని నావద్దకు పంపుతారు” అంది.

ఛూషీ ఉపదేశ సంపుటి తీశాడు. కన్ఫ్యూషియన్ నైతిక శాస్త్రవేత్తలకిది అభిమాన గ్రంథం. దీంట్లో వేదాంతం ఎక్కువ. “అది నా భర్తది. ఆ గ్రంథం మాలాంటి ఆడవాళ్ళకుకాదు. నాకంత చదువు లేదని చెప్పేను కదా! ఆడదానికి తల్లిగా, భార్యగా, తోబుట్టువుగా, కూతురుగా, కోడలుగా, ప్రవర్తించుకోవడంలో ప్రధాన విషయాలు తెలిస్తేచాలు. తల్లిదండ్రుల యెడల భక్తి గల్గి వినయవిధేయతలతో పవిత్ర జీవితం గడిపితేచాలు” అంది. “మీ దగ్గర నేర్చుకొన్న పిల్లలకీ గుణాలు తప్పక వస్తాయి. మీ భర్త గారు కూడా కన్ఫ్యూషియన్ మతము వారై యుండి ఉండాలి” అన్నాడు కేప్టెన్. ఆమె మాట్లాడలేదు. బహుశా భర్తను గూర్చి మాట్లాడడ మామెకు కష్టంగా తోచిందేమో. ఆమె మాటల్లో వినయమూఉంది, గర్వమూ ఉంది. ఆమె యౌవన రూపము స్నేహభావము అతణ్ణి ముగ్ధుణ్ణిచేశాయి. అతడామె కూతుర్ని ప్రేమిస్తున్నా తల్లిలోనే సంస్కృతి, దుఃఖములో పుట్టిన ఓరిమి, ఉన్నత విషయాల యెడల అనురాగం చూశాడు. అందుచేతనే ఆమె అట్టి స్థితిలో కూడ సంతృప్తి తో ఉంది. వాళ్ళ కులంలో ఆమెకొక గౌరవ స్థానం ఉందనీ. ఆమెకులం వారామెకు పవిత్రతోరణం ఎత్తించాలని ప్రయత్నాలు చేస్తున్నారని కేప్టెన్ కు  తెలియదు.

లిన్ చెంగ్ వెళ్ళి వచ్చిన తరువాత, ఒకనాడు ఆ ఇంటికి వెనక వైపు కాయగూరల తోటఉందని కేప్టెన్ గమనించాడు. వంటింట్లోంచి దారి. ఒక రోజు మైహువా సామానులు కొనడానికి వెళ్ళటంవల్ల కేప్టెన్ కు  కనబడలేదు. ఆమె ఎక్కడ అని అడగలేక తాతమ్మ ఎక్కడా అని అడిగాడు కేప్టెన్. “వెనక తోటలో ఉందేమో వెళ్ళి చూడు” అంది వేన్ సతి. ఇంటికన్న తోట విశాలంగా ఉంది. కొన్ని ఫలవృక్షాలు కొన్ని పూలమొక్కలు ఉన్నాయి.

కాబేజీ మొదలగు కాయగూరల మొక్కలు బారులుగా నాటారు. ఇరుగు పొరుగువారి గోడలు తోట కావరణ. తూర్పువైపు గేటు. దాని ప్రక్క ఒకేగది, అది తోటమాలికి. దాని ప్రక్క కోళ్ళదొడ్డి. గేటు తీసుకు వెళ్ళితే ఒక చిన్న సందుంది. ఒక పాఠకుర్చీలో కూర్చుని ముసలమ్మ ఎండకాగుతూ ఉంది. వేన్ సతి శుభ్రమైన నల్లని దుస్తులు దాల్చింది. అప్పటి ఆచార ప్రకారం తల వెండ్రుకలు ముందు కణతలవైపు ఎత్తుగా ముడి వేసింది. కేప్టెన్ తో  తోటలో తిరుగుతూంది. ఆమె ముఖంమీద వినయం గర్వం కలిసి రాణిస్తున్నాయి. కళ్ళల్లో ప్రశాంతమైన కాంతి ఉంది. ఈమె తలుచుకుంటే ఏనాడో పెండ్లాడగలిగి ఉండేది అను కొన్నాడు కేప్టెన్.

“మీరే ఈ తోటంతా పెంచారా?” అని కేప్టెన్ అడిగాడు. “లేదు చాంగ్ పెంచుతాడు” అంది వేన్స సతి. “చాంగ్ ఎవరు” అని అతడడిగాడు. “మా తోటమాలి. దోసకాయలు, పుచ్చకాయలు, కాబేజీలు ఎక్కువగాఉంటే, బజారుక్కూడా వెళ్ళి లాభానికమ్ముకొస్తాడు. ఇంత నమ్మకమైన వాణ్ణి నేను చూడలేదు. ఆ గదిలో పరుంటాడు” అని గేటు ప్రక్కగదిని చూపింది.

ప్రక్క గేటులోంచి అప్పుడే వచ్చాడు చాంగ్. నడుముకు మాత్రం గుడ్డ ఉంది. ఎండాకాలం. కండలుతీరిన అతని దేహం వెలుతురులో మెరుస్తుంది. నలభైయేళ్ళుంటాయి. తల వెండ్రుకలు పైకెగగట్టాడు. ముఖంలో అమాయకత్వం ముచ్చటేస్తూ ఉంది. అతని అంతస్థు ఏమైతేనేం? ముఖంలో బెంగా విచారం లేవు. శరీరం నవనవలాడుతూ దృఢంగా ఉంది. అతణ్ణి కేప్టెన్ కు  చూపిందామె. నూతి దగ్గరకు వెళ్ళి చాంగ్ ఒక బాల్చీడు నీరు తోడి, గుమ్మడి డొలకతో త్రాగి, తక్కింది చేతుల మీద పోసుకొని కడుక్కొన్నాడు. అతని నిరాడంబరత్వం మనోజ్ఞంగా ఉంది. నీళ్ళు త్రాగుతున్నప్పుడతని కంఠంమీద యెండ తళతళ మెరిసే సరికి వేన్ సతి పెదవులు వణికాయి.

“ఇతడు లేకపోతే మేం ఏమయిపోయేవాళ్ళమో? జీతంకూడా అడగడు. నా అనేవాండ్లు లేరు. కడుపుకు తిండి, పరుండటానికి ఇంత స్థలం ఉంటే చాలు. డబ్బెందుకంటాడు. వీళ్ళమ్మకూడ మావద్దే ఉండేది. తల్లంటే ఎంత భక్తి : ఇప్పు డొంటరివాడైపోయాడు. ఇంత స్వచ్ఛంగా, న్యాయంగా ఉండటం, కష్టపడి పని చేయడం నేనెక్కడా చూడలేదు. క్రిందటి సంవత్సర మొక షర్టు కుట్టి యిచ్చాను. అది తీసుకోడాని కొప్పించేసరికి తలప్రాణం తోకకొచ్చింది. మేమతని కిచ్చేదానికంటే, అతడే మాకెక్కువ సేవ చేస్తున్నాడు పాపం” అంది వేన్ సతి.

భోంచేసి కేప్టెన్ తోటలోకి వెళ్ళేసరికి చాంగ్ కోళ్ళదొడ్డి రాట్టలు పాతుతున్నాడు. కేప్టెన్ సాయం చేస్తానన్నాడు. తరువాత ఈ కోళ్ళదొడ్డికి వేన్ సతి జీవితంలో ఎంత ప్రాధాన్యం ఉందో అనుకొని నవ్వుకున్నాడు. జీవితంలో చిన్న విషయానికికూడా చిత్రంగా ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది.

వేన్ సతిని గూర్చి చాంగ్ తో మాట్లాడసాగాడు. “ఎంత మంచి అమ్మగారండీ”, అని చాంగ్ అందుకొన్నాడు. “ఆమె లేకపోతే మా అమ్మ ముసలి .కాలం అంత సుఖంగా గడిచేదా? వీరిద్దరికీ పవిత్ర తోరణా లెత్తించ రాజగురువులవారు ప్రయత్నిస్తున్నారట. ముసలమ్మగారి యిరవయ్యోయేట ఆమె భర్త పోయాడు. ఆమె కొక్కడే కొడుకు. ఆయనకు మా అమ్మగారిని పెళ్ళిచేశారు. ఆయన ఒకనాడు తల దువ్వు కొంటూనే నేలమీదపడి మరణించారు. చాలాకాలం అయింది. పద్దెనిమి దవయేట అమ్మగారు విధవ అయ్యారు. అప్పటి కామె గర్భిణి. పిల్లని కంది. అలాంటి వయస్సులో యావజ్జీన వైధవ్యమా? వంశం పేరు నిలిపే పుత్రుడులేని జన్మ ఏం జన్మలెండి అమ్మగారిక పెళ్ళాడనన్నారు. ఇంట్లో వంశీకుల పూజ నడపడానికన్నా ఒక పిల్లవాణ్ణి పెంచుకోమంది ముసలమ్మ గారు. కొందరికి పదేసిమంది పిల్లలు పుట్టుకొస్తారు. కొందరికి పుట్టనే పుట్టరు. ఈ ఇంట్లో పురుషులకు శాపముందన్న పాడుపేరు వచ్చింది. ఎవ్వరూ తమ పిల్లల్ని పెంపకాని కివ్వలేదు. ఆ ఒక్క కూతురు చక్కని చుక్కలాగ పెరిగింది. కేప్టెన్; నీవాపిల్లను పెండ్లాడరాదూ? మా గొప్ప . ఇల్లాలౌతుంది” అన్నాడు. చాంగ్ అమాయకత్వం చూచి కేప్టెన్ నవ్వాడు. మైహువా సొగసునితడు తనకు పొగడిచెప్పాలా?

“పవిత్ర తోరణం అంటే ఏమిటి?” అని చాంగ్ని కేప్టెన్ అడిగాడు. “తెలియదూ? ఈ ఊరు మొత్తానికొక హ్యూ కుటుంబానికే ఉంది. అలాంటి పవిత్రస్మృతి చిహ్నం. వేన్ కుటుంబం వారికి హ్యూ కుటుంబం మీద అసూయ కలింది. రాజగురువుగారి దీ వేన్ కుటుంబమే, అందుకని తమ కుటుంబంలోని యీ యిద్దరు. స్త్రీలను గూర్చి చక్రవర్తికి వ్రాశారు. ‘ముసలమ్మగారప్పుడే నలభైయేండ్లనుండి వైధవ్యం పాలిస్తూ ఉన్నారు. వీరిద్దరి పేరుమీద ఒక శిలాతోరణం కట్టించడానికి చక్రవర్తికి విన్నపం చేస్తారట” అని చాంగ్ చెప్పగా, “నిజమేనా?” అని కెప్టెన్  ఆశ్చర్యంతో ఆడిగాడు.”మీతో వేళాకోళ మాడతానా? చక్రవర్తి ఒక స్త్రీని గౌరవించడమంటే ఇదేం వేళాకోళపు సంగతా అనుజ్ఞతోపాటు చక్రవర్తి గారు వెయ్యి రూపాయలు కూడ పంపుతారట. అప్పుడు గౌరవంతోపాటు . ధనంకూడ కలిసివస్తుంది. ఆవిడ దానికి తగిందే: మా అమ్మగారింకా వయస్సులో ఉన్నారు. అందంగా ఉన్నారు. ఎంతమంది పెండ్లాడాలనుకొంటున్నారో పెండ్లాడి లేచిపోక, ముసలి అత్తగారి కోసం ఈ కుటుంబంలోనే ఉండి పోయి వృద్ధాప్యంలోనున్న అత్తగారి సేవచేస్తున్నారు. ఏమి ఇల్లాలండీ అందుకే ఆమెకు తోరణం కట్టుతున్నారు. మైహువా పెండ్లయితే పూర్వీ కుల పూజ జరుగుతుందని ఆమె విశ్వాసం.

కేప్టెన్ ప్రయాణాలమీద వెళ్తున్నాడు. వస్తున్నాడు. దొంగల్ని పట్టడంలోకంటే మైహువాను పట్టడంలోనే యెక్కువ ఆసక్తి చూపు తున్నాడు. మైహువా ప్రేమవంటి ప్రేమను కేప్టెన్ యిదివరస చూడ లేదు. అంతగా ప్రేమిస్తూ ఉంది. ఆమెకతడు వశుడయ్యాడు. అతణ్ని తానెందుకు ప్రేమిస్తూ ఉందో, అతనిలో తానేమి మెచ్చుకొంటూ ఉందో మర్మంలేని మనస్సుతో మైహువా చెప్పేసేది. ఇంత అమాయకంగా ఉన్న దున్నట్లు చెప్పే పిల్ల నిదివరకు కేప్టెన్ ఎక్కడా చూడలేదు. ఆమె మెప్పుకు కెప్టెన్ ఉబ్బిపోయేవాడు. ఆమె చిన్నతనం, చిలిపితనం, విలాసము, కేప్టెన్ కమితానందం కలిగించేవి.

వాళ్ళిద్దరి వాలకం బట్టి వాళ్ళ ప్రేమ ఇంట్లో పెద్దవాళ్ళకు స్పష్టమౌతూనే ఉంది. కేప్టెన్ కిరవై యేడేండ్లు. ఒంటరివాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి భగవన్నిర్ణీతమేనని అప్పుడే ముసలమ్మ జ్యోస్యం చెప్పుతూంది. వాళ్ళు మితిమీరి ప్రవర్తించకుండా జాగ్రత్త తీసుకొంటూనే ఉన్నారు. ముసలమ్మ పడమటి గదిలో పరుంటుంది. తల్లీ కూతురు దొడ్లో తూర్పు గదిలో పరుంటారు. భోజనాలవగానే దొడ్డి తలుపుకు తాళం వేసేస్తారు. వేన్ దొడ్డి తలపుకేగాక తమ గదికి కూడా తాళం వేస్తూనే ఉంది కాని దగా పడుతూనే ఉంది. ఎందుకంటే కేప్టెన్ ఒకొక్కప్పుడు కేంపులోనే ఉండిపోతాడు. మైహువా వెళ్ళి అతణ్ని మధ్యాహ్నం వెళ్ళి ఒక్కొక్కసారి రాత్రి అక్కడే కలుసుకొంటూంది. భోజనానికి కూడ ఆలస్యంగా వస్తుంది. కేప్టెన్ ఊరిలో లేడనుకొన్న రోజుల్లోనే ఇలాగే జరిగేది. ఒకరోజున భోజనాలయ్యాక రెండు గంటలకు వచ్చింది. అది జూలై నెల. పగటి పొద్దెక్కువ, రాత్రి పొద్దు తక్కువ. మైహువా కేప్టెన్, లిద్దరు చెట్ల నీడల్లో ఊరవతల పెద్ద సరస్సు ప్రక్కనుండి అడవులలోకి పోయేదారిని వెళ్ళారు. ఊరవతల ప్రశాంతంగా ఉంది. ఎండ తీక్షత తగ్గింది. సుందర మైన అడివిలోంచి చల్లటిగాలి వీస్తూంది. బండల మీద పట్టిన నాచు తళ తళ మెరుస్తూంది. దూరాన్ని మరోచక్కని సరస్సు ఉంది. కెప్టెన్ ప్రక్కనుంటే మైహువాకి జీవితం పరిపూర్ణం అనిపించింది. వాళ్ళిద్దరు శాశ్వతంగా ప్రేమ ప్రమాణాలు చేసుకొన్నారు. మైహువా  సంగ్ తో  తనతల్లి నెంతమంది పెండ్లాడుతామని వచ్చారో, అండాని కెంత పేరు పొందిందో, ఎలాగ అందర్నీ నిరాకరించిందో చెప్పుతూ, “అదే నేనైతే ఎప్పుడో మళ్ళీ పెళ్ళాడి ఉండేదాన్ని” అంది.

“మీ అమ్మ అంటే నీకు గర్వంలేదా” అన్నాడు సంగ్. “ఆ, ఉంది. కాని స్త్రీ ఎవరినన్నా పెండ్లాడి కాపరం చెయ్యాలి కాని ఇలాకాదు, అస్తమానం మా ఇంట్లో కన్ఫ్యూషియన్ నీతులు వల్లిస్తూ ఉంటారు. నాకు విసిగెత్తిపోయింది” అంది మైహువా. మైహువా చిన్నదికదా తల్లీ, తాతమ్మ చూపిన ఆదర్శం ఆమె హృదయంలోని పొంగు నణచలేక పోయింది.” మీ అమ్మ చేసిన పని యే మహాసుగుణవంతురాలో మాత్రమే చేయగలదు “అన్నాడు సంగ్.” ఆడదెందుకనుకున్నావు? పెళ్ళాడి, ఇల్లునడిపి, పిల్లల్ని కని పెంచడానికికాదా?” అని ఉద్రేకంతో అంది మైహువా. చిన్నతనంలో మా తండ్రి పోవడం మా తల్లి కెంత దుర్భరం! దాంట్లోను మా కాస్తులు లేవుకదా! మా అమ్మ నెంతైనా మెచ్చుకుంటాను కాని.” అని ఆగింది మైహువా. “కానీ, ఏమిటి” అన్నాడు సంగ్. “ఈ పవిత్ర తోరణాలలో నాకు నమ్మకం లేదు” అని మైహువా అనగానే కేప్టెన్ కమితాశ్చర్యం వేసింది.

“నేను పెద్దదాన్నయ్యాక యీ విషయంగూర్చి ఆలోచించేదాన్ని. మా అమ్మవి పెద్దకోరికలు. కఠిన నియమాల నవసరంగా నెత్తిమీద పెట్టుకొంటుంది. పవిత్ర వితంతువంటే ఎక్కడలేని ఖ్యాతిగదా మా అమ్మకా ఖ్యాతి కావాలి…. ఏదో వాగేస్తున్నాను” అని మైహువా తగ్గింది. వాళ్ళమ్మకు, మామ్మకు వాళ్ళ వంశంవారు కట్టబోతున్న పవిత్ర తోరణం సంగతి సంగ్ ఆమె నడిగాడు. “మా అమ్మను గూర్చి నాకు సంతోషమేకాని మనం పెండ్లాడి వెళ్ళిపోదాం. మా మామ్మ ఆరోగ్యం అంతమాత్రమే. ఒక్కతే వెయ్యిరూపాయి లేమిచేసుకొంటుంది. నా అనే వాళ్ళెవ్వరూ లేకుండా మరోఇరవై సంవత్సరాలు పనికిమాలిన కీర్తిబంధంలోపడి చివరికి సాధువమ్మగారనిపించుకొని చస్తుంది.

లీ సంగు కామె మాటలు వినోదంగా ఉన్నాయి. యౌవనంలో ఉన్న మైహువాకి నచ్చచెప్పడమెలాగ? ఇద్దరు వితంతువుల ప్రేమరహిత జీవితాల్లో పాల్గొని పరిశీలన జరిపిందికదా. ఆమె చెప్పుతూ ఉంది తెలిసే చెప్పుతూందేమో!

సూర్యుడస్తమిస్తున్నాడని చప్పున గ్రహించి, “అయ్యో, సంగూ, నేను పరిగెత్తాలి. ఇంత ఆలస్యమైందని తెలియలేదు” అంది మైహువా.

ఈ సారి కేప్టెన్ ఊరిలో లేనప్పుడొక సంగతి జరిగింది. కేప్టెన్, మైహువా కలిసి ఊరులోను, పడమటి కొండలవైపు బాట మీద తిరగడం చూచిన ఇరుగుపొరుగువారు వేన్ సతికి చెప్పారు. తల్లికూడా అంతా కనిపెట్టుతూనే ఉంది. కూతుర్ని నిలదీసి అడిగింది. ఏడుస్తూ మైహువా తన తప్పు ఒప్పుకొంది. కాని కెప్టెన్ తన్ను పెండ్లాడతానని మాట యిచ్చాడంది. తల్లికి అమితమైన ఆగ్రహావేశం కలిగింది. “నా కూతురే నా యింటి కింత అపఖ్యాతి తెస్తుందని నే నెన్నడూ అనుకోలేదు. చూడు, మీ మామ్మ నేను యీ ఊరికే ఆదర్శంగా ఉన్నాం. మన వేన్ కుటుంబానికే మచ్చ తెచ్చావు. ఇరుగుపొరుగుల కెంత లోకువైపోతాం. కూతురే — — ” అంటూ ఉంటే, కన్నీళ్లు తుడుచుకొంటూ మైహువా, “నేనేమీ సిగ్గుపడ నక్కరలేదు. అతణ్ణి ప్రేమించడం సిగ్గుబాటు పనికాదు. నాకు పెళ్ళీడు వచ్చింది. అతడు నీకు నచ్చకపోతే మరొకణ్ణి చూడు. నేనేమో వయస్కురాల్ని. ఈ ప్రేమ శూన్యపుటింట్లో కుళ్ళి చావను. నీది పవిత్ర వైధవ్యమంటావు. అది వట్టిగుల్ల జీవితం. దాంట్లో మెచ్చుకోతగ్గది. నాకేమీ కనబడలేదు” అంది.

ఆశ్చర్యంతో, దిగ్రమతో వేన్ సతి కూపిరాడలేదు. “ఏమిటే అంటున్నావు” అంటూ తూలిపోతూ ఆయాసపడుతూంది తల్లి. “ఔనే, అమ్మా ఇంకా చిన్నదానివే కదానీవు, ఎందుకు పెళ్ళాడకూడదు” అంది మైహువా. “ఆసినీతల మీద పిడుగుపడ, నీ నోరు పడిపోను” అని శపించింది కూతుర్ని.

ఆ అమాయకపు పిల్ల తప్ప మరొకరంత సూటిగా స్పష్టంగా సత్యాన్ని తెలుపలేరు. ఆమాట తల్లికి ఫిరంగి గుండులాగ తగిలింది. ఆమెకెంత భాధకలిగిందో మైహువాకు తెలియదు. మళ్ళీ పెళ్ళి అంటేనే ఆమెకు అసహ్యం, భయంకరం అది ఆలోచించతగ్గ విషయమేకాదు. ఇన్ని సంవత్సరాలు నీకు మంచి బుద్ధులు నేర్పాను, నీకు సిగ్గు, ఎగ్గూ లేదటే అంది తల్లి కోపంతో.,

వేన్ సతికి దుఃఖం ముంచు కొచ్చింది. గుండె కరిగి పోయేటట్టు యేడ్చింది. ఒక్కొక్క సందర్భంలో ఒక చిన్న మాటే ఎంతపని చేస్తుంది: ఈ పందొమ్మిది సంవత్సరాలు తనలోతాను కుమిలి పోతూ సహించిన బాధలన్నీ ఆ కనీళ్ళతో పై కుబికాయి. ఎంతబాధ పడింది: ఇన్ని సంవత్సరాల త్యాగాన్ని, సంయమనిష్ఠనూ తన కూతురే నేటికెత్తి పొడుస్తూ ఉంది: బాల్యం నుంచి నేటిదాక తన పవిత్ర వైధవ్యనియమాన్ని ఆక్షేపించిన వారి నెవరిని తాను చూడలేదు. ఇది సూర్యుణ్ణి ఆక్షేపించడం లాంటిది. తాను మళ్ళీ పెళ్ళి చేసుకోవడం యేమీ అసంభవం, అసహజం కాదు. కాని ఇన్నేండ్లూ కూడ ఆ ఆలోచన తనకు తట్టలేదు, దాన్ని గూర్చి, తర్కించినదీ లేదు. అట్టి ఉద్దేశమెప్పుడైనా ఒకప్పుడు తల యెత్తినా ఎప్పుడో దాన్ని తన మనస్సులోంచి నెట్టేసింది. ఈ నాటి వరకు దాని ప్రశంసే రాలేదు.

కూతుర్ని తిట్టడం మానేసి తానే దుఃఖంలో క్రుంగి పోయింది. తల్లిని చూచి భయమేసి మైహువా మరి మాట్లాడలేదు. కూతురి ఎత్తి పొడుపు మాటల భారం క్రింద తల్లి నలిగి పోయింది. ఔను వితంతువు దుఃఖ జీవితం డొల్ల అంటే, అది నిజం, అక్షరాలానిజం. తన చేతులతో తన ముఖాన్ని కప్పుకొని బల్ల మీద కొరిగి యేడుస్తూనే ఉంది. కాస్సే పటికి మరొక విషయం మనస్సులోకి వచ్చింది. మైహువా కేప్టెన్తో పొందే ఆనందం యదార్థమైంది. తనకు వయస్సులో అలాంటివాడు దొరికితే……..? ఏమిటో, ఆమె కంతా గందరగోళంగా ఉంది.

కేప్టెన్ వచ్చే వరకు వేచిఉండాలి. ఈలోగా కూతురు వెళ్ళి అతనికెమైనా చెప్పుతుందేమో, లేక అతనితో లేచిపోతుందేమో, అందుకని ఆమె నొక గదిలో పెట్టి తాళం బిగించారు. తరువాత మూడు రోజులకు కేప్టెన్ వచ్చాడు. వేన్ సతి మాత్రమతనికి కనబడింది. నిరుత్సాహంగా ఉంది. “మైహువా యేది?” అని అతడడిగాడు. “లోపలుంది. దానికేం బాగానే ఉంది” అంది. “బయటికి వచ్చింది కాదేం” అన్నాడు పెదవులు బిగించి, బరువు కంఠంతో” అలా అడుగుతావనే చూస్తున్నా. ఊళ్ళోనే ఉండి ఏకాంత స్థలానికి వస్తుందని చూస్తుంటావు. రాలేదేమా అని అనుకొంటున్నావు. ..”ఏకాంత స్థల మేమిటి ఈవాళే ఊరిలోకి వచ్చామ” అన్నాడు ఆశ్చర్యంగా సంగ్. “నాకంతా తెలుసు ఈ నటనలు చాలు” అంది. అణుచుకొన్న ఆగ్రహం సూచించే స్త్రీ  కంఠం అదే మొదటి సారి కేప్టెన్ వినడం. వినయం గర్వం రెండూ కలిసి ఉంటాయి ఆమెలో. అందుకే ఆమె అంత ఆకర్షణీయంగా  ఉంటుంది.

కేప్టెన్ మౌనంగా ఉన్నాడు. లోపల్నించి మైహువా పిచ్చిగా అరుస్తూంది. వినబడుతూ ఉంది. “నన్ను విడిచి పెట్టండి. సంగూ, నేనిక్కడున్నాను. రక్షించు నన్ను బయటికి తియ్యి అని బొబ్బలు పెట్టింది.” “ఏమటిదంతా”అని అరుస్తూ సంగ్ లోపలికిదూసుకు పోయాడు. మైహువా తలుపు బాదేస్తూ గోల పెట్టి యేడుస్తూంది. అతనికి వెనకాలే వేన్ సతి  వెళ్ళింది. లోపల్నించి ముసలమ్మ కూడావచ్చి నెమ్మదిగా కేప్టెన్ వైపు వెళ్ళి కంట తడి పెడ్తూ “అబ్బాయీ, ఆమెను పెండ్లాడతావా?” అంది. సంగ్ ముఖం పంచుకొన్నాడు ఆశ్చర్యంతో. అతని కర్థమైంది. లోపల్నించి సంగూ, సంగూ నన్ను విడిపించు అన్న అరుపు వస్తూనే ఉంది. “తప్పక పెండ్లాడతా ఇప్పుడింక తలుపుతీసి ఆమెతో మాట్లాడ వచ్చా?” అన్నాడు సంగ్.

తలుపు తీశాడు. మైహువా ఏడుస్తూనే వచ్చి అతని చేతుల్లో వాలి పోయింది. “నన్ను తీసుకుపో సంగ్, నన్ను తీసుకుపో” అంటూ ఏడుస్తూంది. తల్లికికూడా యేడుపు వచ్చింది. సంగ్ ఆమెను క్షమాపణ వేడుకొంటూ ఓదార్చేడు. ఆమె ఏడుపుకు ప్రస్తుత పరిస్థితికి సంబంధం లేదు. ఎందుకేడుస్తూందో ఆతనికి నిజం తెలియలేదు. సంగ్ తను చేసిం దానికి విచారించి, తప్పంతా తన మీద వేసుకొని క్షమించమన్నాడు. ఐతే పెండ్లాడే ఉద్దేశం తప్ప అతనికి మరో ఉద్దేశమెప్పుడూ లేదు. తక్షణం ఆమెను పెండ్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, వారికి విధేయుడు ఆనుకూలుడు అయిన అల్లుడుగా ఉంటాననీ చెప్పాడు. మైహువా తాను పొందుతున్న ఆనందంతో వాళ్ళమ్మకీ మామ్మకీ విస్మయం కలిగించింది.

కేప్టెన్ పెండ్లాడడానికి కొప్పుకోవడంతో ఆపదగడిచింది. దొంగల్ని పట్టేపని కూడ పూర్తి అయిందతనికి. కేప్టెన్ కుటుంబం కూడా పెండ్లి కిష్టపడ్డారు. సూచ్ లో  పెండ్లి చేసేశారు.

ప్రపంచంలో మానవుని మనస్సు గూర్చి జ్యోతిషం చెప్పలేం. కేప్టెన్ మైహువాల అల్లకల్లోలాల ప్రేమగాథ ముగిసింది. కాని దాని ప్రభావం వేన్ సతి  మీద విచిత్రంగా పనిచేయసాగింది. మూడు నెలలకే ముసలమ్మ మరణించింది. ఖనన క్రియలకు కెప్టెన్ ఒక్కడే వచ్చాడు. వేన్ సతి అతనికి పవిత్ర తోరణాలను గూర్చి చెప్పింది. రాజగురువు. తోరణాలను గూర్చి సిఫారసు చేశానని వ్రాసిన ఉత్తరం కుల పెద్ద తెచ్చి తనకు చూపాడని ఇంక దాని కడ్డుండదని చెప్పింది. ఈ తోరణాలతో కులం వారందరికీ సంబంధమున్నట్లు వారందరూ ఒకటే ఉత్సాహంతో ఉన్నారు. అప్పుడే యీ యిద్దరు వితంతువులను గూర్చి వేన్ కుటుంబం వారంతా “పవిత్ర మాత”లనే మహా గౌరవపదం వాడేస్తున్నారు. ఐతే విచిత్ర మేమిటంటే ఈ సంగతి వేన్ సతి యేమంత ఉత్సాహం లేకుండా చెప్పింది. ఆమె మాటల్లో కొంచెం సందేహధ్వని కూడా ఉంది.

“చాల గొప్ప సంగతి విన్నాను. మీకు చాలా ఉద్రేకం ఆనందం కలిగించి ఉంటుందీ వార్త “అన్నాడు సంగ్. “ఏమో. నాకేమీ తెలియదు. ఐతే, మైహువా ఎలా ఉంది?”అని మాట మార్చేసిందామె, గర్భిణిగా ఉందని కేప్టెన్ చెప్పాడు. “ఈ శుభవార్త ఇంతవరకు చెప్పేవు కాదే మిటీ?”అని ఆనందంతో ఊగిపోయింది వేన్ సతి, “ఈ సంగతికేంలెండి? మీ తోరణం సంగతీ  కంటే గొప్పదా?” అన్నాడు కేప్టెన్. “తోరణమా, ఆ ప్రసంగ మెత్తవద్దులే” అందామె. అంతటి అపురూప గౌరవంపట్ల ఆమె ఉదాసీనత అతని కాశ్చర్యం గలిగించింది. “ఖ్యాతితో ఏకాంతవాసం మరో ఇరవై సంవత్సరాలు” అన్న మైహువా మాట అతనికి జ్ఞాపకానికొచ్చింది. కాని వేన్ సతికూడా అలాగే భావిస్తుందా? “తోరణాని కొప్పుకోవచ్చం టావా?” అనిచటుక్కున అడిగిందామె. ఏమి వింత ప్రశ్న?” “లేకపోతే పిచ్చి అన్న…”అంటూ సగంపలికి నాన్చేశాడు కేప్టెన్ యేదో అనుమానం పుట్టి.“ఐతే, తోరణం కట్టాక మీ పవిత్ర వైధవ్యానికి చక్రవర్తి రక్షణవల్ల ప్రాశస్త్యం వస్తుంది” అని ముగించాడు.

దహన క్రియల అనంతరం వేన్ సతి ఇంటి కొక్కతే తిరిగి వచ్చింది. ముందు, వెనుక హాలులకింకా నల్లపరదాలు కట్టేఉన్నాయి. హాలుకు మధ్యగా మేజస్ట్రీటుగారు బహుమానంగా పంపిన తెల్లని పొడుగాటి పరదా వేలాడగట్టి ఉంది. దానిమీద “ఒక ఇల్లు, ఇద్దరు పవిత్రులు” అని వ్రాయబడి ఉంది. ఇంటికంతా ఆమె ఒక్కతే. తన భవిష్యత్తును గూర్చి ఆలోచించుకోడానికంతా వ్యవధే. భవిష్యత్తులోకి తొంగిచూసేసరి కామెకు భయం వేసింది. మొన్న మొన్నటిదాక తన అత్త తన కూతురు అల్లుడు యీ యిల్లు నవ్వులతో నింపేవారు. ఇంతలో ఎన్ని మార్పులు! కూతురు ప్రణయం, పరిణయం, అత్త మరణం, తన ఉన్నత శుష్క, ఖ్యాతి శిఖరారోహణ, పుట్టబోయే మనుమడు ఎన్ని విశేషాలు!

దహనక్రియల్లో తోటమాలి చాంగ్ చాలా సాయపడ్డాడు. తన  యజమానురాలు విచారంగా ఉండటం చూచి మరింత సాయపడసాగాడు.

మైహువా బదులితడే బజారుపనులు చేస్తున్నాడు. వేన్ సతికి ఏమీ ఇబ్బంది కలుగకుండా, ఇంటా, బయటా అన్నీ అతడే చూచుకొంటూ ఆమెకే బెంగా బెడదా లేకుండా చేస్తున్నాడు. కాయగూరలమ్మి కొంత లాభం చేసుకొస్తున్నాడు. వంటింట్లోంచి ఆమె చూస్తూనేఉండేది అతనెంత శ్రమ పడుతున్నాడో. ఒంటరితనంవల్ల ఒక్కొక్కసారి యేమీ తోచక తోటలో అతనితో మాట్లాడ్డానికి వెళ్ళేది. తోటకు అన్ని వైపులా గోడలుండటం వల్ల బయటి వాళ్ళకగపడదు. వారిద్దరికి సాన్నిహిత్య మేర్పడింది.

ఖనన సందర్భంలో కులపెద్ద రాజగురువు వద్దనుండి నూరురూపాయలు తెచ్చి యిచ్చాడు. ఇంక తోరణం తాలూకూ వెయ్యి రూపాయలు కూడ వచ్చేసినట్లే, కాని వేన్ సతి శ్రుతిమించక ముందే యేదో ఒక నిశ్చయము చేసుకోవలసి ఉంది. ఆమె ప్రఖ్యాత స్త్రీ అవుతూందని చాంగ్ పరమానందంతో అభినందిస్తూ ఆమెను చూచి గర్వపడుతున్నాడు.

చాలాసార్లు ప్రయత్నించింది కాని తాను పవిత్ర వితంతువు ఆడది. ఎలా తనంతట తాను చెప్పడం కాయగూర మొక్కల్ని గూర్చి మాట్లాడ డానికని చాలాసార్లు వెళ్ళేది. నీలాకాశంలో సూర్యుడు స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉండేవాడు. ఆమె చిరకాల శిక్షణ, సహజవినయం మనస్సులోనిమాట చెప్పనిచ్చేవికావు. పైగా చాంగ్ పూర్తిగా విధేయుడు, బహు సన్మార్గ వర్తి. ఆమెను తన యజమానురాలినిగానే కాని స్త్రీగా యెన్నడూ కలలో కూడా అనుకొని యెఱుగడు.

.           మనుమరాలి నెత్తుకొని కూతురు అల్లుడు వచ్చారు. తెల్లగా బొద్దుగా ఉన్న చంటిబిడ్డను వెచ్చగా రొమ్ము కానించుకొనేసరి కామెవళ్ళు జలదరించింది. చంటిబిడ్డనానందంతో ఎత్తుకొని ఎన్నాళ్ళయింది? అదిగాక, అప్పుడే మామ్మ అయ్యేవయస్సు తనకు వచ్చిందా? నీ కాపరం ఇంత పచ్చగా ఉన్నందుకు నా కెంతైనా ఆనందంగా ఉందే, మైహువా. బిడ్డని భర్తను చూచుకొని నీ వెంతైనా గర్వించవచ్చు ” అంది తల్లి.” మైహువా కంట ఆనందాశ్రువులు కారాయి. అమ్మ కొంత మెత్తబడిందని, తన తప్పులు క్షమించిందని అనుకొంది. కాని తాము వచ్చిన మొదటినాడే, ఆమె బెంగటిల్లిన ముఖంతో మౌనంగా, ఏకాంతంగా ఉండటం మైహువా కనిపెట్టింది. వెనుకటిలాగ తన తల్లి ఆత్మనిగ్రహం, ఆత్మసంతుష్టిగల మనిషిలాగ కనబడటంలేదు.

ఆ పిదప కేప్టెన్ అత్యాశ్చర్యకరమైన ఒక సంగతి విన్నాడు. తోటలో నేల త్రవ్వుతున్న చాంగ్ ను చూచాడు. చాంగ్ కేప్టెన్ని తన గదిలోకి తీసుకు వెళ్ళాడు. చాంగ్ ముఖంలో విచిత్రానందం, ఉబలాటం, కలవరంకూడ కనిపించాయి. ఏమి చెయ్యమంటారో చెప్పండి. నేను చదువుకొన్న వాడిని కాదుకదా” అన్నాడు చాంగ్. “సంగతేమిటి?”” అని అడిగారుకేప్టెన్. కాస్సేపు చాంగ్ నిదానించి, “మా అమ్మగారి సంగతండీ” అన్నాడు. “ఏం ఆవిడేమైనా ఆపదలో పడిందా?” “లేదు. కాని మీరే నాకు సరియైన సలహా నివ్వగలరు అన్నాడు చాంగ్.. నీక్కూడా ఈ విషయంలో యేమన్నా సంబంధం ఉందా?” అని కెప్టెన్ అడిగితే ఔనన్నాడు చాంగ్. “ముందు మీ ఇద్దరికీ జరిగిన సంగతేమిటి, కలిగిన బాధేమిటీ చెప్పు” అన్నాడు సంగ్.

చాంగ్ కు  మాట నెమ్మది. చక్కని భాషలో చెప్పలేడు. కాని కథ విన్నతరువాత కేప్టెన్ నమ్మలేకపోయాడు. అది వింటూఉంటే నిజాయితీకి పేరుపడ్డ తన అత్తగారు స్వంతసమస్య నెట్లు డొంకతిరుగుడుగా ఎదుర కున్నదో! అదే మైహువాలాంటి పిల్లయితే సూటిగా ఒక చిన్న సూచన తోనూ, ఒక ముద్దుతోనే తీర్చిపారేసేదనుకొన్నాడు.

రాత్రిళ్ళుకూడా ఎండాకాలంలో వేడిగానే ఉండటంవల్ల, చాంగ్ చాపమీద నడుముకు మాత్రం గుడ్డకట్టుకొని పరున్నాడు. వారంక్రితం ఒక రాత్రి అమ్మగారు “చాంగ్” అని పిలవడం విన్నాడు. పడమటి ఆకాశంలో చంద్రుని వెన్నెల చాంగ్ మీద పడుతూ ఉంది. ఆమె తనగది తలుపు దగ్గర నిలబడి ఉంది. చప్పున లేచి, యేం కావాలమ్మగారూ అన్నాడు. “నీకు మత్తునిద్ర. కోళ్ళ అలజడి విని మానుపిల్లి వాటినెత్తుకుపోతూందమకొన్నాను” అంది. కోళ్ళగూడు దగ్గరకు చాంగ్ పడకగది మీదుగా వెళ్ళాలి. అప్పుడు తెల్లవారగట్ల మూడయి ఉంటుంది. గడ్డి మంచుతో తడిసిపోయింది. “సరే వెళ్ళిపడుకో, మంచులో గుడ్డలు లేకుండా ఉంటే రొంపచేస్తుంది” అంది. వద్దంటున్నా ఆమెను వంటింటిదాకా చాంగ్  సాగనంపాడు.

అప్పుడప్పుడు మానుపిల్లులు కోళ్ళ కోసం కొండల్లోంచి రావడం కద్దు కాని రాత్రి కోళ్ళ అరుపు తనకు వినబడలేదు. మరునాడు వేన్ సతి  అంది, “కోళ్ళగూడు పిల్లులు జొరబడకుండా కప్పెయ్యి”. “మీకేందుకు, నేను చూసుకొంటానుగదా” అన్నాడు చాంగ్. ఇదివరకెన్నడూ ఇలాగ జరిగి ఉండలేదు. కాని మూడవనాటి రాత్రి ఒక మానుపిల్లి తీగల్లోంచి దూరి ఒక నల్లకోడిని లాక్కుపోయింది. ఒక శాలువ తనమీద ఎవరో కప్పుతూన్నట్లు తోచి చాంగ్ మేల్కొన్నాడు, వేన్ సతి తన్ను లేపు తూంది. లేచి సంగతేమిటని అడిగాడు. “ఒక మానుపిల్లి కనబడింది. గోడదూకి పారిపోయింది” అంది. ఇద్దరూ వెళ్ళి వెదికారు. తీగకొక పెద్ద కన్నం కనబడింది, పిల్లి తన కగపడ్డ స్థలం చూపింది కాని అక్కడేమీ అడుగులజాడ కనబడలేదు. మెడమీద దెబ్బతిన్న నల్లకోడి మాత్రం ప్రక్క పూల మొక్కలమీద పడి ఉంది. తన అశ్రద్ధకు చాంగ్ నొచ్చు కొన్నాడు. కాని ఆమె దయతో, దీంట్లో పోయిందేముంది? రేపు దీన్ని  కూర వండుతాను” అంది.

“మీకు సరిగా నిద్ర పట్టదేం?” అన్నాడు చాంగ్. “సాధారణంగా రాత్రిళ్ళు మేల్కొనే ఉంటాను. నిద్రలోకూడ నాకు చీమ చిటుక్కుమంటే వినబడుతుంది” అంది. ఇద్దరూ అతని గదివైపు వెళ్ళారు. ఆమె బయటే నిలబడింది. ఆమె దుస్తులమీద, వ్రేళ్ళమీద, రక్తపు చుక్కలు చూచి చాంగే కడుక్కోడానికి నీళ్ళు అందించాడు. టీ త్రాగుతారా అని అడిగాడు. మొదట వద్దంది కాని మళ్ళీ ఆలోచించి సరే అంది. ఎందుకంటే బాగా మెలుకువ వచ్చేసింది ఇక నిద్రపట్టదు. టీ తయారుచేసి మీ గదికి తెస్తానన్నాడు చాంగ్. “వద్దు, ఇక్కడే బయట చక్కగా ఉంది” అని వేన్ ఆగింది. “ఒక్క నిముషంలో తయారు చేస్తా” అని చాంగ్ అంటే, “తొందరలేదు” అంటూ ఆమె అతని పక్కమీద కూర్చుంది. అతని బల్లలు, చాప. కంబళి, పట్టిచూచి, “చాంగ్ నీకు మంచిశాలువ లేదని నే నెరుగనే ఎరుగను. ఉదయం నీకొక మంచి శాలువ ఇసా “నంది.

మరునాడు కూర వడ్డిస్తూ, పిల్లిమాట జ్ఞాపకం చేసింది. గూడు బాగుచేశావా అని అడిగింది. ‘ఆ చేశాను’ అన్నాడు. “మళ్ళీ ఈ రాత్రి కూడ పిల్లి వస్తుందేమో” అని ఆమె అంటే, “మీకెలా తెలుసు” అన్నాడు చాంగ్. “నిన్న రాత్రి దానికి కావలసింది దొరకలేదు. జడుసుకొని దొరికిన కోడిపిల్లనే పారేసింది. దానికి కోడికావాలి. అది ఎక్కడ పడిఉందో దానికి తెలుసు. అందుచేత తెలివైందైతే ఈ రాత్రి కూడా రావాలికదా?” అంది వేన్ సతి.

ఆ రాత్రి అంతా మేల్కొని చూచాడు చాంగ్ . దీపం తగ్గించి, పొదల మాటున ఒక మోకాలి పీట వేసుకొని, మానుపిల్లి నెత్తి బ్రద్దలు కొట్టడాని కొక దుడ్డు దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. చంద్రుడు నడి ఆకాశాని కొచ్చాడు. పిల్లిరాలేదు. చంద్రుడు పడమటి దిశకు వాలాడు పిల్లిరాలేదు.

చలివేస్తూంది లోనికి పోదామనుకొంటూ ఉంటే, చాంగ్ అని అమ్మ గారి మాట వినబడింది. అప్సరసలాగ తెల్లని బట్టలు కట్టుకొని వస్తుందామె. దగ్గరకొచ్చి ఏమైనా జాడ దొరికిందా అంది. లేదు అన్నాడు. నీ గదిలో కూర్చొని పొంచిచూద్దాం అంది. ఆ రాత్రి నా జీవితానికంతకూ , ఆనందమయమైన రాత్రి. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతూఉంది. నేను, వేన్ సతి దగ్గర దగ్గరగా కూర్చున్నాం. ఆమె ఆవాళ ప్రొద్దున్న ఇచ్చిన తెల్లటి దుప్పటి వాడడానికి మనస్సు పుట్టక మడతవిప్పకుండా అలాగే ఉంచాను. కిటికీలోంచి వెన్నెల వస్తూంది. ఒకళ్ళ నొకళ్ళం యుగ యుగాలనుండి ఎరిగినట్లే తోచింది.

తోటనుగూర్చి జీవితంలో కష్టసుఖాల గూర్చి వేన్ సతి  యేదో మాట్లా డుతూఉంది. నీవెందుకింకా పెండ్లాడలేదని అడిగింది. భార్యను పోషించే తాహతు నాకింకా లేదన్నాడు. ఆ వితంతువప్పుడేదో పరధ్యానంగా చూస్తూ అదోలాగ అగపడింది. ఆమె పాలిపోయిన ముఖంమీద, వజ్రాలలాంటి ఆమె కళ్ళమీద వెన్నెల మెరుస్తూంది.

చాంగ్ కు  బెదురుగా ఉంది. “నీవు నిజంగా మానవజాతి స్త్రీవా? లేక వెన్నెలలో తెల్లని దుస్తులు ధరించి తిరిగే అప్సరసవా?” అని అడి గాడు. “చాంగ్, నీకు పిచ్చా? నేను మనిషినే”అని ఆమె అంటూఉంటే చాంగ్ కామె మరింతగా మనిషి కానట్లు తోచింది. ఆమెకళ్ళు తనవైపు చూస్తున్నట్టూ ఉన్నాయి; చూడనట్లూ ఉన్నాయి. తాను మాత్రం తన కళ్లు ఆమెనుండి త్రిప్పలేకపోయాడు. “అలాగచూడకు. నేను ఆడదానినే, నన్ను ముట్టుకొనిచూడు “అని చేయిచాపిందామె. చాంగ్ ముట్టుకోగానే ఆమె దేహం గగుర్పొడిచింది. “భయం కలిగించానా. క్షమించండి” అన్నట్లు చాంగ్ చూచాడు. నిజంగా అప్సరసే అనుకొన్నా నొక క్షణం దాక” అన్నాడు. ఆమె నవ్వింది. అతని బెంగతీరింది. “చాంగ్, నిజంగా నేనంత అందంగా ఉన్నానా? ఎప్పుడూ అంత అందంగా ఉంటే ఎంత బాగుంటుంది. మనుష్యులు ప్రేమించి పెండ్లాడతారుకదా, అప్సరసలుకూడా అలాగే చేస్తారా’ అంది ఆమె. “నాకేం తెలుసు? అప్సరసలను నేనెప్పుడూ చూడలేదు,” అన్నాడు. కాని ఆమె అడిగిన తరువాత ప్రశ్న అతణ్ని కలవరపరిచింది, “నీ కీ రాత్రి అప్సరస కనబడితే యేం చేస్తావు? ప్రేమిస్తావా? నేను అప్సరసనైతే నీకిష్టమా, మనుష్యస్త్రీగానే ఉంటే నీకిష్టమా?” అంది. “ఏంటో, అమ్మగారూ, వేళాకోళం చేస్తున్నారు. నే నేమిటి? అప్పరసను ప్రేమింపగలనా” అన్నాడు. “లేదు. పరిహాసానికికాదు. నిజంగానే. మైహువా కేప్టెనులలాగ మన మిద్దరము భార్యాభర్తలుగా ఉంటే నీ కిష్టమేనా?అని అడిగింది. “ఏమిటో, మీ మాటలు నమ్మలేను. మీ పాతివ్రత్య తోరణం మాటేమిటి?” అన్నాడు చాంగ్. “తోరణానికేమిలే. నాకు నీవు కావాలి. ముసలివాళ్ళమయ్యే వరకు హాయిగా జీవించవచ్చు. ప్రజలేమనుకొంటే నాకేం. ఇరవైయేళ్ళు పవిత్ర వైధవ్యం నడిపాను. చాలదినాకు. ఇంకా ఉన్నారుగా ఆడవాళ్ళు. వాళ్ళు నడుపుతారులే” అంటూ అతణ్ని ముద్దు పెట్టుకొంది.

ఇదంతా చెప్పుతూ, చాంగ్, “కేప్టెన్, ఏం చెయ్యమంటారు? చక్రవర్తిగారి ఉద్దేశాని కడ్డుగా నేనెంతవాణ్ని నిలవడానికి? కాని అమ్మ గారేమో, ఇప్పుడే పెండ్లాడు, లేకపోతే ఇక నేను పెండ్లి చేసుకోను” అంటున్నారు. అమ్మగారే అలాంటి మాటంటున్నారంటే, చూడండి, “నన్ను పెండ్లాడి సుఖంగా ఉంటానన్నారు. కేప్టెన్, నన్ను ఏంచెయ్య మంటారు?” అని అడిగాడు,

మొదట కేప్టెన్ కు  దిగ్భ్రమ కల్గింది. నెమ్మదిగా తేరుకున్నాడు. అతని ప్రతివాక్యం జాగ్రత్తగా విన్నాడు. చివరకన్నాడు, “ఏం చెయ్యమని అడుగుతున్నావా? మూర్ఖుడా, పెండ్లాడు” అని గద్దించి, మెరుపులాగపోయి మైహువాకీ వార్త అందించాడు. మా అమ్మ చేసినపని నాకెంతో సంతో షముగా ఉందంది మైహువా, తిరిగి నెమ్మదిగా అంది. “మా అమ్మే ఆ కోడిని చంపి ఉంటుంది. నిజానికి ఛాంగ్ లాంటి మగవాళ్ళకు తోరణాలెత్తించాలి.”

రాత్రి భోజనానంతరం అత్త గారితో కేప్టెన్ అన్నాడు, ‘అమ్మా’ మాకు ఆడపిల్ల పుట్టింది. మగపిల్లవాడైతే వేన్ పేరు పెట్టి ఉందుం.’

వేన్ సతి తలెత్తి వింటూంది. నేల వైపు చూస్తూ కెప్టెన్ గంభీరంగా పలికాడు. “నేను దీన్ని గూర్చే ఆలోచిస్తున్నాను. మామ్మగారు పోయారు. మీరొక్కరే అయిపోయారు. చాంగ్ చాలా మంచివాడు. మీరొప్పుకుంటే మాట్లాడతాను. వేన్ కుటుంబం పేరు పెట్టుకొంటాడు సంతోషంగా మీరు పెండ్లాడితే.” ఆమె నాపాదమస్తకం లజ్జ ఆవరించేసింది. “ఔను, వేన్ కుటుంబం పేరు….”అంటూ తన గదిలోకి తొందరగా వెళ్ళి పోయింది. చాంగ్ తో ఆమె పెళ్ళి వేన్ కుటుంబం వారికి గొడ్డలి పెట్టులాగయింది.

తాతగారన్నారు. “ఆడదాన్ని గూర్చి ఇదమిత్థమని యెన్నటికి చెప్పలేం.”

  *    *   *

సూరాబత్తుల సుబ్రహ్మణ్యం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *