నా చదువు కథ Part – 7

Spread the love

ఇంటర్మీడియట్   ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాక ఒక మూడు సంవత్సరాలు 1974  నుండీ 1977వరకూ నేను చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లోనే ఖాళీగా వుండవలసి వచ్చింది.

ఆ సమయంలో  నేను యెక్కడెక్కడి పుస్తకాలూ వెదుక్కుని చదివేదాన్ని.మాకు తెలిసిన వాళ్ల ఇళ్లల్లోనూ,స్నేహితుల ఇళ్లల్లోనూ అలమార్లలో,అటకలమీదా  వున్న పుస్తకాలూ ,మా ఊరి గ్రంథాలయంలో వున్న పుస్తకాలూ నమిలెయ్యడమే నా పని.అయితే ఆ కాలంలో నాకు జరిగిన మేలు యేమిటంటే ఏవి మంచి పుస్తకాలో,ఏవి కాలక్షేపం బఠాణీలో తెలుసుకోగలగడం.

అలా నేను చదివిన మంచి పుస్తకాలలో అగ్రగణ్యమయినది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయచరిత్ర “అనుభవాలూ-జ్ఞాపకాలూను”.ఆ తర్వాతే నేను వారి చిన్న కథలూ ,పెద్దకథలూ కూడా చదివాను.

జాను తెనుగే నాది జాతిఘనతే నాది అని చాటి చెప్పే రచనలు చేసినవారు శాస్త్రి గారు.వారిని కథా చక్రవర్తి  అనడం యెంతైనా సమంజసం.రుచిఅయిన తెలుగు వచనం రాసిన వారిలో మొదట చెప్పుకోవలసింది సుబ్రహ్మణ్య శాస్త్రి గారినే.

తెలుగు కథకి ఒక రూపాన్ని యేర్పరించిందీ,అప్పటి దాకా గ్రాంథిక భాషలో సాగుతున్న వచన రచనని అచ్చమైన వ్యావహారికం లోకి దింపి గిడుగు రామ్మూర్తి గారి వ్యావహారిక భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిందీ శాస్త్రిగారే.

శాస్త్రి గారు రచనా వ్యాసంగం లో దిగేనాటికి తెలుగు కథకి గానీ,వచనానికి గానీ ఒక ప్రామాణికమైన రూపు రేఖలు లేవు .ముళ్లూ రాళ్లతో నిండిన మార్గాన్ని సరిచేసుకుని తెలుగు సాహిత్యానికి చక్కని రాజమార్గాన్నేర్పరిచారు శాస్త్రి గారు.

వారి తర్వాత రచనలు చేసిన వారెందరికో మార్గదర్శకులయ్యారు .(అలా వారి దారిలో నడచిన వారిలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు)

అంతే కాదు వారు రచనలలో చిత్రించిన జీవితాలన్నీ అచ్చమైన తెలుగు జీవితాలు.ఆయా పాత్రలు పలికే భాషంతా రోజువారీ ప్రజలు మాట్లాడుకునే చక్కటి తెలుగు నుడికారంతో కూడిన వ్యావహారికం.

కథంతా సంభాషణలతో నడపడం ఒక గొప్ప టెక్నిక్ .ఎలా పట్టుకున్నారో గానీ శాస్త్రి గారు ఈ టెక్నిక్ ని,వారి కథలన్నీ ఈ పధ్ధతి లోనే నడుస్తాయి,మధ్య మధ్య రచయిత రావడం చాలా తక్కువ .ఆయన కథలలో నాకు బాగా నచ్చిన కథ “మార్గదర్శి” కథ మొత్తం 116పేజీలు అంతా ఒకటే డైలాగ్ .ఒక్క పాత్రే  మాట్లాడుతూ వుంటుంది  అంతే !ఎంత గొప్పగా నడిపారో కథని .ఊరికే కథ చెప్పడం కాదు తెలుగు వాడు స్వతంత్రంగా ,స్వశక్తితో యేదో ఒక పనో వ్యాపారమో చేసుకుంటూ తాను బాగుపడి ఇతరులను కూడా బాగు చెయ్యాలి ,నెల వారీ కూలికి సిధ్ధపడి ఉద్యోగాలకు యెగబడి ఆత్మ శక్తిని చంపుకోవడం మంచిది కాదు అనే  సందేశాన్ని యెంత బాగా ఉదాహరణలతో చెప్పారో !  

వ్యక్తిత్వ వికాస పుస్తకాలలో పాఠంగా చేర్చదగిన కథ ఇది.

ఉదాహరణకి ఆయన మాటలు నాలుగు చదవండి తెలుస్తుంది(ఉద్యోగం కోసం సిఫారస్ చేయమని వచ్చిన బ్రాహ్మణ యువకునితో ఒక సంపన్న వ్యాపారస్తుడు చెప్పే మాటలే ఈ కథ)——

“నేనమ్మా బ్రహ్మ మొగం నుంచీ ఊడి పడ్డానని యెత్తెత్తి కాళ్లు వెయ్యక,రైతాంగంతో సహకరించడం నేర్చుకుని వ్యవసాయం చేసుకో,లేకపోతే యేదో వర్తకం సాగించు.పెద్ద యెత్తు యెత్తలేకపోతే,యే కాఫీ హోటల్ దగ్గరో కిల్లీ దుకాణం పెట్టుకుంటే రాజాంగంగా బతకవచ్చు,పాతిక రూపాయల పెట్టుబడితో. అదికూడా చాతకాదంటావా,వంద చుట్టలూ డజను అగ్గిపెట్టెలు పుచ్చుకుని,పొద్దుటి పూట స్టీమర్ల దగ్గరా,మధ్యాహ్నం పడవల రేవుల్లోనూ,కోర్టుల దగ్గరా,సాయంత్రం సినిమాల దగ్గరా తిరుగు.అదీ ఇష్టం లేదంటావా,కుట్టు మిషన్ పెట్టుకుని మా అంగడి దగ్గర కూచో,మిషన్ నేను కొనిపెడతాను.

అదీ కాదంటావా, కావెడు గుడ్డలేవి కావాలంటే అవి ఇస్తాను,వూళ్లో తిరుగు, దమ్మిడీ పెట్టుబడి అఖ్ఖరలేదు.పైగా యెప్పటి లాభం అప్పుడే పట్టుకు పోవచ్చు.

చెరువంత మేడ మాది,జనం తక్కువగా వున్నాం,ఒక చిన్న గదీ ,వంట వసారా యిస్తాను,అద్దె యివ్వక్కర లేదు తల దాచుకో”

“కష్ట పడు ,బాగుపడు అంతే కానీ నౌకరీ యిప్పించమని నన్ను వేధించకు.నీ మొగం కలకల్లాడుతోంది,నీకు నౌకరీ కర్మం యేమీ?ఆ వర్చస్సు ధూళి ధూసరితం చేసుకోకు.కాలం గడిచిపోతోంది,లే, త్వరపడు”

“ఇంత చెప్పినా నీకింకా నౌకరీ వ్యామోహం పోదూ,ఫో—నా యెదట నుంచోకు ,వెళ్లిపో” (రచనా కాలం 1959)

చూశారుగా ఇలా ఆయన రాసిన కథలన్నీ వివిధ విషయాల పైన జాతిని జాగృతం చేసే కథలే

ఎటువంటి కథలు రాశారాయన! “వడ్లగింజలు,గులాబీ అత్తరు,ఇల్లు పట్టిన వెధవాడబడుచు,కీలెరిగిన వాత,అరికాళ్లకింద మంటలు,గూడు మారిన కొత్తరికం,తాపీ మేస్త్రీ రామదీక్షితులు బి.ఏ,ఇలాంటి తవ్వాయి వస్తే,అన్నంత పనీ జరిగింది,విమానం యెక్కబోతూనూ,ముళ్ల చెట్టూ-కమ్మని పువ్వూనూ” ఇంకా చాలా వున్నాయి.

అసలా కథల పేర్లు చూడండి చక్కని తెలుగు పేర్లు కాదూ!

నాకయితే కథల పేర్లు చదువుతుంటేనే కడుపు నిండిపోతుంది.ఆయన మొదటి కథ “ఇరువుర మొక్కచోటికే పోదము” గ్రాంథిక భాషలోనే రాశారు.కానీ తర్వాత రెండుమూడేళ్లకే తాను రాయవలసింది వ్యావహారికంలోనే అని నిర్ణయించుకుని అటువేపు మొగ్గారు.

ఆయన కథలు కేవలం బ్రాహ్మణ్యానికే చెందినవి కాక అన్ని వర్ణాలకీ,అన్ని వర్గాలకీ ,అన్ని వృత్తులక చెందినవి కావడం గొప్ప విశేషం.

“గులాబీ అత్తరు” కథలో కథానాయకుడు ముస్లిం, “సాగర సంగం” కథలో నాయికా,నాయకుడు దళితులు,”తాపీ మేస్త్రి రామ దీక్షితులు బి.ఏ” కథలో నాయకుడు తాపీ మేస్త్రీ

 “అరికాళ్లకింద మంటలు,ఇల్లు పట్టిన విధవాడబడుచు” కథలలో భర్తను కోల్పోయి చిన్నతనంలోనే విధవలుగా మారిన స్త్రీల కష్టాలూ,వారి మీద జరిగే ధాష్టీకం ,వారనుభవించే దైన్యం యెంతో హృద్యంగా రాశారు .

కథలలో ఆయన రాసే భాషకూడా   అంత బాగుండడానికి కారణం తాను స్త్రీల దగ్గర కూచుని,వారు మాట్లాడుకునే వన్నీ విని ఆకళింపుపు చేసుకుని రాయడమే అంటారు.ఇంతకన్నా స్త్రీలకు జరిగే గౌరవముందా? నన్నడిగితే ఆయన గొప్ప ఫెమినిస్ట్ అంటాను ,చాలాకథలాయనవి చదివాక కలిగిన అభిప్రాయమిది.

ఆయన కేవలం కథలే కాదు నవలలూ,నాటికలూ,ఏకాంకికలూ,ఖండ కావ్యాలూ కూడా రాశారు.ఆయన మొట్టమొదటి నవల”మిథునానురాగము”

వారి నాటికలు “వారకాంత,ప్రేమపాశం,నిగళబంధనం,రాజరాజు” మొదలైనవి.

వారు రాసిన “వీర పూజ” గొప్ప చారిత్రక గ్రంథం మొదటి ముద్రణ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి సహకారంతో వెలువడింది.

“అత్త-అల్లుడు,అలంకృతి,అభిసారిక,బాలిక,తాత” మొదలైనవి శాస్త్రిగారు రాసిన ఖండ కావ్యములు.

సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నాటికలు రాయడమే కాదు కొంతమంది మిత్రులతో కలసి ఒక నాటక సంస్థ స్థాపించి కొన్నాళ్లు నడిపారు.అడపా దడపా నాటకాలలో నటించారు,ఆడ వేషాలు కూడా వేశారు .అదే సమయంలో  సంగీతం మీద మమకారంతో వయొలిన్ నేర్చుకున్నారు కానీ యెక్కువకాలం సాగలేదు ,రచనా వ్యాసంగం మీద వున్న ఆసక్తితో దానిని మధ్యలో వదిలి వేశారు.

ఆయన పత్రికా సంపాదకుడిగా వ్యవహరిస్తూ

 “ప్రబుద్ధాంద్ర” అనే పత్రిక సుమారు తొమ్మిదేళ్లు నడిపారు.మొదటి సంవత్సరం పక్షపత్రికగా ప్రారంభమయి ,తర్వాతి సంవత్సరంలో మాస పత్రికగా మార్పు చెందింది.

శాస్త్రి గారు సంస్కృతాంధ్రములలో పండితులు కాబట్టి

ఆ పత్రికలో సంస్కృత విభాగమూ,తెలుగు విభాగమూ కూడా వుండేవనీ,కొంత కాలం తర్వాత కేవలం తెలుగవచన రచనా విభాగం మాత్రమే వుండేదనీ తెలుస్తోంది.దీనిని బట్టి ఆయన కి తెలుగు వచన రచన ప్రీతి నానాటికీ బలపడుతూ వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు.

సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అష్టావధానాలు  చేశారు కొంతకాలం.ఆయుర్వేద వైద్యం కూడా చేసేవారట .

తాము నివసిస్తున్న రాజమహేంద్రవరములో సాహిత్యసభలు జరిపి యెంతో మంది సాహితీ మూర్తులను సన్మానించారు.

ఆయన స్వభావం గురించి చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలుకొట్టినట్టుగా మాట్లాడే స్వభావం .మనసుకు నచ్చిన వ్యక్తులతో యెంతో సౌమనస్యంతో మెలుగుతారు .ఏదయినా తభావతు వచ్చిందా అవతలి మనిషి యెంతటి వాడయినా మహాత్మా గాంధీ అయినా,కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారయినా,చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారయినా జంకరు .వారెంత వరకూ వెళితే తానూ అంత వరకూ వెళతారు

ఏ ఇతర భాషల కథల ప్రభావమూ లేకుండా అచ్చంగా తెలుగు వారి జీవితాలనుండీ కథా వస్తువులనెన్నుకుని అద్భుతమైన రచనలు చేసిన శాస్త్రిగారికి ,ఈ మధురమైన వచన రచనా సామర్థ్యం యెలా అబ్బిందీ,తెలుగు భాష మీద మక్కువ కలగడానికి కారణాలేమిటీ?వారి చదువు సంధ్యలేపాటివీ? వారి కుటుంబ నేపథ్యం యేమిటీ? వారి రచనా వ్యాసంగానికి వారి కుటుంబం సహకరించిందా అడ్డు తగిలి అవరోధాలేర్పరిచిందా?

రచయితగా ఆయన అనుభవాలెలాంటివీ?ఆనాటి వారి జీవన విధానం యెలా వుండేది? వీటన్నిటికీ సమాధానాలు వారి స్వీయచరిత్ర “అనుభవాలూ–జ్ఞాపకాలూను” లో దొరుకుతాయి.

 తెలుగులో వచ్చిన స్వీయచరిత్రలన్నింటిలో తలమానికమైనది అని ప్రముఖ రచయితలెందరో ప్రశంసించారు.రాళ్లపల్లి అనంత కృష్ణశర్మా,ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రీ,జరుక్ శాస్త్రీ,విశ్వనాథ సత్యనారాయణ ,వేలూరి శివరామ శాస్త్రీ,మహిధర రామ్మోహన్రావు,పురిపండా అప్పలస్వామీ వేనోళ్ల కొనియాడారు.

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు యేమంటారంటే “అనుభవాలూ —జ్ఞాపకాలూను …..నూరేళ్ల తెలుగుతనపు కూలంకష క్రోడీకరణ కాదా….అది వేయేళ్లపాటు,పదింబదిగ చదువుకోవలసిన గ్రంథం కాదా?తెలుగు మాగాణముతోబాటు,మీగడ తరకలైన శ్రీ శాస్త్రి గారి రచనలు శాశ్వతముగా వర్థిల్లవా “అని.

ఈ స్వీయ కథ నీలంరాజు వెంకటశేషయ్య గారు కోరి రాయించుకుని వారు సంపాదకత్వం వహిస్తున్న “నవోదయ” పత్రికలో ప్రచురించారు.

టూకీగా ఈ పుస్తకం లోని సంగతులు కొన్ని మనవి చేస్తాను.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్ర పురం తాలూకా పొలమూరులో ఏప్రిల్ 23వతేదీన 1891లో జన్మించారు.తల్లిదండ్రులు లక్ష్మీపతి సోమయాజులు,మహాలక్ష్మీ సోదెమ్మ.

అనన్య సాధ్యమైన శ్రీ విద్యోపాసన కారణంగా  వచ్చిన బిరుద నామం “శ్రీపాద” అన్నది వారింటి పేరయిందట

వారిది శుధ్ధ శ్రోత్రియమైన వెలనాటి వైదిక కుటుంబము.తండ్రి గారు యజ్ఞం చేశారు.స్మార్తము,శ్రౌతము,జ్యోతిషము వారి  వంశ విద్యలు . తండ్రిగారు పంచాంగం చేయడం,ప్రశ్నచెప్పడం,జ్యోతిషం చెప్పడం చేసి సిధ్ధాంతి గారని పేరు గడించారు.శాస్త్రి గారికి ఇద్దరు అన్నలు. వారు కుల విద్యలలో నిష్ణాతులు.శాస్త్రిగారు తండ్రి గారి వద్దా ,అన్నలవద్దా  స్మార్తమూ ,శ్రౌతమూ ,జ్యోతిషమూ నేర్చుకున్నారు .సంస్కృత కావ్యాలు చదవడానికి  ,పన్నెండేళ్ల వయసులో పొరుగూరయిన వల్లూరు చేరుకున్నారు .అక్కడ గుంటూరు సీతారామ శాస్త్రి అనే గురువు దగ్గర సుమారు సంవత్సరంన్నర ,వారాలు చేస్తూ చదువుకున్నారు.

అదే సమయంలో వారికి  తెలుగు భాషమీద అభిమానం కలిగే సంఘటన ఒకటి జరిగింది

ఒక వయసుమళ్లిన వితంతు మహిళ “మదన కామరాజు కథలు” పుస్తకం ఆయన చేతిలో పెట్టి కథలు చదివి వినిపించమని కోరింది. ఆవిడకోసం పదే పదే అదే పుస్తకం చదివి పెట్టిన ఆయనకి కథలు రాయాలనీ,పద్య రచన కంటే వచన రచనే సౌలభ్యం గా వుందనీ బలంగా అనిపించ సాగింది

ఒక రకంగా ఆ పుస్తకమే తనని కథారచన లోకి దింపింది అని చెబుతారు శాస్త్రిగారు.

వల్లూరు తర్వాత దర్భా బైరాగి శాస్త్రి గారి వద్ద వేట్లపాలెంలో

సంస్కృత కావ్యాలు చదువుకున్నారు .ఇక్కడ నేర్చిన సంస్కృతం తన చదువుని చాలా ఉన్నత స్థాయి కి తీసుకువెళ్లిందనీ దురదృష్ట వశాత్తూ తోటి విద్యార్థి  అసూయతో చేసిన కొంటె పని వలన చదువు మానుకుని ఇల్లు చేరుకున్నాననీ రాశారు.

అయితే వేట్లపాలెంలో కూడా అవకాశం వున్నప్పుడల్లా కనిపించిన కథల పుస్తకమల్లా చదువుతూనే వున్నారు.

తెలుగులో కవిత్వం చెప్పి కవీశ్వరుడు అనిపించు కోవాలనీ,గజం యెత్తు పుస్తకాల వరస రాయాలనీ కలలు కనేవారు.వేట్లపాలెం నుండీ

ఇంటికి వచ్చి అన్నల వద్ద విద్యాభ్యాసం కొన సాగించారు.

కానీ ఆయన దృష్టంతా తెలుగు భాషలో వచన రచన చేయాలనీ,కథలు రాయాలనీ అని చెప్పుకున్నాం కదా,ఈయన ధోరణి కనిపెట్టిన తండ్రీ ,అన్నదమ్ములూ కులవిద్యలు వదులుకుని తెలుగులో కవిత్వం చెప్పడమేమిటని ఆక్షేపించారు.వారికి తెలుగు భాషంటే చిన్నచూపు వైదిక విద్యలమీదే కానీ,కవిత్వమూ కళలమీద గౌరవం లేదు.దీనితో అనేక అవరోధాలు కల్పించ సాగారు .

వారు అవరోధాలు కల్పించిన కొద్దీ శాస్త్రి గారిలో కవి అవ్వాలనే పట్టుదల పెరిగిపోయేది.

తనంతట తానే తంటాలు పడుతూ అన్నలకీ,తండ్రికీ తెలియకుండా చాటుమాటుగా కవిత్వ రచన చేస్తూ కొంత కాలం గడిపాక ,ఒక రెవరో వచనం రాయడం యేం గొప్పా? పద్యం రాసిన వాడే కవి అన్నారని పద్యాలు కట్టడం ఆరంభించారు .కొన్నాళ్లు కూచున్నా పద్యమే నుంచున్నా పద్యమే యే పని చేస్తున్నా పద్యమే అలా గడిచింది.

అయినా ఆయనకు మనసా వాచా ఇష్టమయిన పని తెలుగు వచన రచనే అని తెలుసుకుని మళ్లీ వచనం రాయడం ఆరంభించారు.

రచన లో మంచి సాంద్రత రావాలంటే గురువు అవసరం వుందని భావించి అప్పట్లో పిఠాపురం ఆస్థాన కవులుగా వున్న వేంకట రామకృష్ణ కవులని ఆశ్రయించారు.వీరు జంటకవులు .వీరికీ తిరుపతి వేంకట కవులని ప్రఖ్యాతి గాంచిన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రీ,దివాకర్ల తిరుపతి శాస్త్రీ గార్లకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వుండేది ఆ రోజుల్లో.

ఇరు జంటలూ ఒకరికొకరు దీటైన వారే అయినప్పటికీ శాస్త్రి గారెందుకో వేంకట రామకృష్ణ కవుల వేపే మొగ్గుచూపి పిఠాపురం చేరుకున్నారు పందొమ్మిదేళ్ల వయసులో.

అక్కడ వున్నది సంవత్సరంన్నరే అయినా తమకు లభించిన జ్ఞానం అమూల్యమైనది అని భావిస్తారు శాస్త్రిగారు.

అక్కడ వున్నప్పుడే గురువులు  పిఠాపురం కోటలో అష్టావధానం చేయడం చూశారు అందులోని మెలకువలు గురువుల వద్దనుండీ గ్రహించారు.

అష్టావధానం చేయని వాడేం కవీ అన్న వారి నోరు మూయించేలాగ అష్టావధానం చేసి ప్రశంసలూ ,మెడల్సూ పొందారు .అప్పుడు మాత్రం తండ్రిగారు కూడా తనని గుర్తించి సంతోషించారని రాసుకున్నారు.

పిఠాపురంలో వున్నప్పుడే తిరుపతి వెంకట కవుల గ్రంథాలయిన శ్రవణానందము,పాణి గ్రహీత అనే వాటిని  ఖండిస్తూ “పాణిగ్రహీతశ్రవణానంద శృంఖల” అనే గ్రంథం రాసి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి ఆగ్రహానికి గురి అయ్యారు.అయితే గురువులు నొచ్చుకున్నారు మీరెందుకు అనవసరంగా ఈ తగాదాలోకి దిగడం అని.

తర్వాత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు”శృంఖలా తృణీకరణం” అని ఈయన రాసిన దానికి జవాబిచ్చారు.శాస్త్రి గారు మరలా దానికి కూడా”గళహస్తిక” అనే పేరుతో ఖండన రాశారు గానీ వారి గురువులు ఇక ఇంతటితో దీనిని చాలించండి తగవు పెంచుకోవద్దు అనిచెప్పి ఆ గ్రంథాన్ని చించి వేశారు.శాస్త్రి గారు కూడా వారిమాట మన్నించారు.

అయితే చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు ఇదంతా కడుపులో పెట్టుకుని  ఒక సారి రాజమహేంద్రవరం లో సుబ్రహ్మణ్య శాస్త్రిగారు యెదురయినప్పుడునోటికొచ్చిన దుర్భాషలాడి మీద మీదకు వస్తే శాస్త్రి గారు కూడా యేమాత్రం తగ్గకుండా తగిన సమాధానాలు చెప్పి ఇవతలకు వచ్చారు కానీ ఈ సంఘటన చాలా దురదృష్ట కరమైనది అని రాసుకున్నారు తమ స్వీయ చరిత్రలో.

దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మాత్రం తాను కనపడితే చాలా ఔదార్యం కనపరిచే వారనీ ,ఆప్యాయంగా మాట్లాడేవారనీ రాసుకున్నారు.

గురుకుల వాసం అయిపోయి వచ్చేసేటప్పుడు వారి గురువులు కూడా శాస్త్రి గారి వచనం చాలా బాగుందనీ వచనం లోనే రచన సాగించమనీ సలహా ఇచ్చారు.

శాస్త్రిగారు రాసిన “వీరపూజ”,”మిథునానురాగము” చూసి వారి  గురువులు చాలా ముచ్చట పడ్డారు ,వారి సలహా ఫలించిందని సంతోష పడ్డారు

మల్లిడి సత్తి రెడ్డిగారనే ఒక ప్రెస్ యజమానితో మంచి స్నేహముండేది శాస్త్రి గారికి.ఆయన మంచి సాహిత్యాభిలాషి,కళాభిరుచి వున్నవాడు.ఆయన తో కలిసి ఒక నాటక సమాజం స్థాపించి ,నాటకాలు రాయడం,వాటిని పర్యవేక్షించడం,అడపా దడపా వేషాలు వేయడం కూడా చేశారు కొన్నాళ్లు శాస్త్రిగారు.ఆ సందర్భంలోనే వారికి సంగీతం మీద వ్యామోహం కలిగింది.కొన్నాళ్లు పట్టుదలగా వయొలిన్ నేర్చుకున్నారు కానీ గురువు గారు మర్మం విడిచి విద్య నేర్పటం లేదని తెలుసుకుని మానేశారు.ఇంకొకరి దగ్గర కృషిచేసి నేర్చుకోవచ్చు కానీ తన రచనా వ్యాసంగానికి సమయం చాలదనే  ఆలోచనతో సంగీత సాధన విడిచిపెట్టేశారు .కర్ణాటక సంగీతం అంటే ఆయనకున్న అభిమానం చివరి వరకూ కొనసాగింది మళ్లీ హిందూ స్థానీ సంగీతమంటే మంటే!

సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వారి “వీరపూజ” పుస్తక ప్రచురణ నిమిత్తం కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారిని కలవడానికి మద్రాసు వచ్చి ,గ్రంథ ప్రచురణ పూర్తయ్యే దాకా అక్కడే వున్నారు .ఆ సందర్భంలో గ్రంథంలో ఒక మార్పు చెయ్యమని నాగేశ్వరరావు పంతులు గారు సూచిస్తే శాస్త్రిగారు ఒప్పుకోలేదు .వారి ఆత్మ గౌరవం అలాంటిది.

ఆ సందర్భంలోనే కొమర్రాజు లక్ష్మణరావు,వైద్యరత్న పండిత డి.గోపాలా చార్యులు మొదలైన వారితో శాస్త్రి గారి అనుభవాలు చదివితీరాలి.

 శాస్త్రిగారు అనేక రచనలు చేసి మంచి రచయితగా పేరు పొందారు .తాను తలుచుకున్నట్టుగా గజం యెత్తు పుస్తకాల వరస రచించారు.ఆయన రాజమహేంద్ర వరంలో స్థిరపడ్డారు.

1956లో ఆయనకు కనకాభిషేకం జరిగింది

ఇంకా తన అనుభవాలు కొన్ని రాసే వారే కానీ ఆయన హఠాన్మరణం వలన ఈ పుస్తకం అసంపూర్తి గా మూడో భాగంలో ఆగి పోయింది.1961ఫిబ్రవరి 25వతేదీ శాస్త్రిగారు ఈ లోన్ని వీడి కీర్తికాయులయ్యారు.

చివరగా ఆయన పురిపండా అప్పల స్వామి గారికి రాసిన వీలునామా లాంటి ఉత్తరం చదివితే  ఆయన

వ్యక్తిత్వమూ,ఔన్నత్యమూ,తెలుభాషన్నా,తెలుగుజాతి అన్నా ఆయనకున్న అపారమైన ప్రేమా అర్థమవుతాయి …..

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఉత్తరం—–

పురిపండా అప్పల స్వామి గారికి!

ఇవాళ తెల్లవారాటప్పటికి నాకివాళ పక్షవాత సందేహం కలిగింది.మీరు హైద్రాబాద్ నుండీ ఎప్పుడు వస్తారు?

నాగేశ్వరరావు గారికి కథల పుస్తకాలు ఇచ్చెయ్య దలుచుకున్నాను.వెనక ఒక మాటు వారు పేజీకి మూడు రూపాయల చొప్పున బేరం చేసి స్థిర పరుచుకున్నారు.నేను కథలు పట్టుకెళ్లి ఇవ్వబోతే,డబ్బులేదు ఇప్పుడు వద్దన్నారు.

ఆ బేరం మొన్న జ్ఞాపకం చేశాను.నిజమే అప్పుడు డబ్బు లేకపోయిందన్నారు.ఇప్పుడు ఆ రేటున పైసలు చెయ్యండి.

కుదరకపోతే మీ ఇష్టం వచ్చినట్లు పైసలు చెయ్యండి.తక్కిన పుస్తకాలున్నూ యిప్పించెయ్యండి.వారికి నాలుగువేలు చిల్లర నేను బాకీ.నవలలూ,నాటకాలూ వగైరా కాపీరైట్లూ,స్టాకు అంతా యిప్పించండి.మీకు సాధ్యమైన ధరకు యిప్పించి రుణం లేదనిపించి అదనంగా యిస్తే అది నా భార్య చేతికి యివ్వండి.నా కుటుంబానికి మీరే సాయం చెయ్యగలరు.కథలు సాపు రాసి వున్నాయి.పేపర్ కటింగులున్నాయి.మందు చికిత్సకూ,తిండికి డబ్బు కావాలి.ఇప్పించండి.ఈ నెల ఇంకా అద్దె ఇవ్వలేదు.

పుస్తకాల వ్యవహారం పూర్తిగా పరిష్కరించి మరీ వెళ్లాలి మీరు.అనుభవాలు 2 విశాఖపట్టణం పంపాలి.పోషకులకూ తక్కిన వారికీ రాజమండ్రిలో మైలవరపూ,వింజమూరీ,రామచంద్రపురంలో దువ్వూరీ,చావలీ,వేపా మాత్రమే ఇచ్చాను.వేపావారు 116-యిస్తానన్నారు.ఇప్పుడే కొంత యివ్వవచ్చు.కాకినాడ సాహిత్య వేత్తగారంటే  శ్రీ పార్థసారథి గారు .వారికి నాయెడ చాలాదయ.మీరు చెప్పితే  నాకు గానీ నా కుటుంబానికి గానీ వారేమైనా సాయం చేసి చేయించవచ్చు

నా కుటుంబం చెట్టు క్రింద వుంది.మీరు సాయం చెయ్యండి.విశాఖలో కూడా ఏమైనా వీలవుతుందేమో చూడండి.

గుంటూరిలో చావలి సూర్యనారాయణ (ILTDలేబర్ ఆఫీస)66-00ఇవ్వాలి.ప్రయత్నం చేయండివారు రామచంద్రపురం గాంధీ డాక్టర్ గారి అన్న గారు.డాక్టర్ ద్వారా ప్రయత్నీంచండి.డాక్టర్ గారున్నూ రామచంద్ర పురం మిత్రుల చేత యేమైనా చేయించవచ్చు .నెల్లూరు శివరామయ్య గారేమైనా పంపవచ్చు.డాక్టర్ కనకరాజు గారున్నూ చెయ్యవచ్చు.

శ్రీ నాగేశ్వరరావు గారి విషయం– వారికి అభ్యుదయం నా చేతనైనంతా కలిగించాలనుకున్నాను.భగవంతుడిలా చేశాడు.నేను వ్యర్థుణ్ణయిపోయాను.స్నేహితులైనందుకు మీకీ శ్రమ మాత్రం కలిగిస్తున్నాను 

నాగేశ్వరరావు గారి వ్యవహారం మీరే పరిష్కరించడం నా ఆశ.మీరు మిక్కిలి ఘనంగా సన్మానించారు.మీకు శ్రమ మాత్రమే కలిగించాన్నేను.శ్రీ సింహాచలం గారి స్నేహం నాకు మహా మేరువు.వారికి నా కృతజ్ఞత సరిగా చూపించలేక పోయాను.

మీకు నేను బరువైనట్టే నిశ్చయం.మీలాగ మనసిచ్చిన వారు నాకు మరొకరు లేరు.మీ రుణం తీర్చుకోలేను.అది తీర్చుకోడానికయినా మరో జన్మం యెత్తుతాను.

ఒకటి కాదు,పది వంద ఎత్తుతాను.ఒక సామాన్యుడికి మీరూ సింహాచలం గారూ కనకాభిషేకం  చేయించారు.ఇది నాకు పరమేశ్వరుడు చేయించ లేనిది.

ఇలాంటి స్థితిలో నేను భారం అయిపోతున్నాను.విచారించను.అది తీర్చుకోడానికయినా మరో జన్మ యెత్తుతాను కనక.

నాకేమీ విచారం లేదు.నా భార్య నన్ననేక విధాల కాపాడింది.చిన్నప్పణ్ణుంచీ దాన్ని కష్టపెట్టాను గానీ సుఖపెట్టలేక పోయాను.ఇప్పుడు ఇక ఆ ఊసే లేదు కదా?

నిరర్థక జన్మ అయిపోయింది నాది.

రచనలయినా సాపు రాసి అన్నీ జాతికి సమర్పించుకోలేక పోయాను.

పరమేశ్వరుడు మీకు సకల సుఖాలూ కలిగించాలి.సారస్వత సేవలో మీకు సాఫల్యం పూర్తిగా కలిగించాలి.మీ కలం జాతిని ఉధ్ధరిస్తుంది.

  —————–శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి

ఇదంతా చదివేటప్పటికి దుఃఖం ఆపుకోలేక పోయాను నేను.ఇవి మా తెలుగు కథలు అని తెలుగు వాడు గర్వంగా నెత్తికెత్తుకోదగిన రచనలు చేసిన రచయితకి చివరికీ దైన్య స్థితి యేమిటీ? అలాంటి స్థితిలో కూడా ఆయన తన రచనలను సాపు రాసి జాతికి సమర్పించుకోలేక పోతున్నానని బాధ పడుతున్నాడే !తెలుగు జాతంటే యెంత ప్రేమ!

సంస్కృతాంధ్ర భాషలని క్షుణ్ణంగా చదువుకుని,తమ కుల విద్యలను ఔపోశన పట్టి ,వాటినన్నిటినీ తెలుగు భాష లో రచనలు చెయ్యడం కోసం తృణప్రాయంగా యెంచి వదిలి వేసిన ఆ మహానుభావుని రచనలూ,స్వీయ చరిత్రా తెలుగు భాషలో అక్షరాలు నేర్చిన అందరూ చదవ వలసిన అవసరం వుంది.అప్పుడే మనకు తెలిసింది యెంత తక్కువో తెలుస్తుంది

  • భార్గవి

Spread the love

3 thoughts on “నా చదువు కథ Part – 7

  1. శ్రీపాదవారి మీద వ్యాసం చదువుతుంటే మళ్ళా ఆ పుస్తకాల్ని తీసి చదవాలనిపించేలా ఉంది.చాలాకాలంక్రితం చదివాను.వడ్లగింజలు,అరికాళ్ళ క్రింద మంటలూ మాత్రం గుర్తున్నాయి.ఆయన కథలు చదువుతున్నంతసేపూ మన పక్కింట్లోనే జరుగుతోంది అన్నంత సహజంగా వుంటాయి.నిజమె పురిపండా అప్పలస్వామి గారికి రాసిన వుత్తరం కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది.అప్పుడప్పుడు ఇటువంటి పుస్తకాలు చదువుతుంటే తిరిగి రీఛార్జ్ అవుతాము.మీకు అభినందనలతో ధన్యవాదాలు

  2. రొంపిచర్ల భార్గవి గారి వ్యాసం బాగుంది.తెలుగు జాతికి శ్రీపాద ప్రాతః స్మరణీయుడు.
    ఈ వ్యాసం లో మా ముత్తాత ఓలేటి వేంకట రామశాస్త్రి గారి ప్రస్తావన నాకు సంతోషం కలిగించింది.
    అవధాన విద్య కోసం వేంకట రామశాస్త్రి గారి ని గురువు గా ఎంచుకున్నారు శ్రీపాద.ఆయన నీ వచనం చాలా బాగుంది, అవధానాలు వద్దు అని ప్రోత్సాహం విధించారు.
    చెళ్లపిళ్ల వేషధారణ వారి కి నచ్చలేదు, వేంకట రామశాస్త్రి గారు లాంగ్ కోటు, జేబు గడియారం తో జమీందారు లా వుండేవారు.వారి వేషం, భాష నచ్చిన శ్రీపాద వారి వద్ద శిష్యరికం చేసారు.
    ఈ సంగతులన్నీ మా కుటుంబం లో తరచు చర్చల్లో కి వచ్చేవి.

    1. ధన్యవాదాలండీ చాలా సంతోషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *