ఇప్పటివా ఈ కొండలూ వాగులూ! ఎప్పటి నుంచో ఉన్నవే! మనకు నిత్యమూ దృశ్యానందం కలిగిస్తూ ఉన్నవే!
కానీ, మహాకవులైనవారికి ఆ దృశ్యమాధురి ఒక అవ్యక్తమైన ఆత్మానుభవం కలిగిస్తుంది, ఆ అనుభవం లోకోత్తరంగా ఉంటుంది. నవనవోన్మేషమైన భావస్పూర్తికి ప్రేరకం అవుతుంది. కవి అంతరంగంలో అలా చమత్కృతమైన తటిల్లత వంటి భావ రేఖ – వాక్యమై, కావ్యమై – అలా నిలచిపోతుంది – ఎన్ని వేలఏళ్లు గడిచినా – కాలం చెక్కిలిపై అద్దిన చేర్చుక్కలాగు.
ఏనాటిది మేఘసందేశ కావ్యం। విరహజనుల వేదనార్తికంతటికీ ప్రతీకంగా నిలచిపోయిన అద్భుత ప్రణయగీతం।
ఆషాఢమాసపు తొలకరిమేఘాన్ని ముందుగా చూచినవాడు – వియోగ వ్యధితార్తుడు యక్షుడుకాదు. మహాకవి కాళిదాసు. అందుకే కలిగింది మేఘానికి ఒక కావ్యత్వసిద్ధి! కవికి ఉండే దర్శనశక్తి అటువంటిది.
తెలుగుదేశం చేసుకొన్న పుణ్యం – భవిష్యత్కవిసమ్రాట్టు విశ్వనాథరసరాట్టు ఒకనాడు భద్రాచలాన్ని, అక్కడి అటవీ ప్రాంతాన్ని సందర్శించటం.
ఆ అడవిదారిలో ‘వెన్నెలబయలు’ దాటి, ‘రాళ్లవాగు’ దాటి ముందుకు వెళితే – ఎదురుగా ఒక రమణీయదృశ్యం.
స్థిరంగా నిలచి ఉన్న కొండ – ఆ కొండను చుట్టుకు వలయాలుగా ప్రవహించే అందాలవాగు. అంతకు మించి, మరీ అందంగా వినిపించిన ‘కిన్నెరసాని’ అనే ఆ వాగు పేరు.
పరమ భావుకుడైన విద్వత్కవి విశ్వనాథ గుండెలో లోలోతున ఏవో మధుర భావస్పందనలు ప్రకంపించాయి, కవికీ, కిన్నెరవాగుకూ మధ్య ఏదో జననాంతర సౌహృదం ఉండినదన్న విషయం స్పష్టమైపోయింది. ఆత్మగతమైన ఆ అనుభవం కవి అంతరంగాన్ని సుకుమారంగా తాకి రాగరంజితం చేసింది. రమణీయ భావప్రకంపనలు పరంపరగా తరుముకు వచ్చాయి. కవిని రగిలించిన ఆ భావావేశం – గళంలో తారట్లాడి, భావరాగతాళయుక్తంగా జాలువారి వచ్చిన పాట కిన్నెరసాని పాట అయింది.
రాళ్లవాగు దాటి- పధాంతరములు దాటి
అచట కిన్నెరసాని – నా యాత్మయందు
నిప్పటికి దాని సంగీతమే నదించు
అది – మహత్కవి విశ్వనాధ సత్యనారాయణగారి ఆత్మ పలికిన సంగీతం. ఆ సంగీతానికి పలుకూ కులుకూ చేర్చి, ఒడుపూ ఒయ్యారం నేర్పి – అడుగడుగునా సజీవ జీవధర్మంతో సాగించిన అపురూపపు గేయరచన – ‘కిన్నెరసాని పాటలు’:
అసువులీ దేహమున నున్నంత వరకు
నేను విడలేను కిన్నెరసాని వాగు
నా మనస్సును లాగికొన్న దతిలోక
దివ్య మోహనముగ బాడి తెనుగుపాట।
పాడినది కిన్నెరసాని యా? భావ విలీశమైన
విశ్వనాథ వాణియా।
ఎవరు వినిపిస్తే నేమి అది అందమైన తెనుగు పాట. తీపిచేదుల బ్రతుకుపాట.
ఇక్కడ జరిగిన చమత్కారం ఏమిటంటే – ఆ తేనెపాటల కిన్నెరవాగు – అచ్చమైన తెలుగింటి పడుచుగా కవికి సాక్షాత్కరించటం. నదిగా ఆమె చుట్టుకొని తిరుగుతున్న ఆ కొండశిల – విధివైచిత్రి వల్ల శిలాకృతి పొందిన ఆమె పతి కావడం. ఆ ఇద్దరినీ చుట్టుకోని కవి ఊహలో ఒక సమ్మోహకమైన జీవత్కథ ఏర్పడిపోవడం!
కిన్నెరవాగులో కవి దర్శించిన తెనుగువంపు, తెనుంగుమెత్తన, తెనుంగుప్రతిభ – అంతాకలసి వాకలుకట్టిన తెనుగు తనమై, పాటగా జాలువారింది
అదంతా సరే ! పాటే ఎందుకు ? కిన్నెరకథను ప్రౌఢ కవితాకావ్యంగానూ మలచవచ్చుకదా !
విద్వద్విరాణ్మూర్తి విశ్వనాథ – జటిలసమాసఘటనాప్రయోగచాతురీధురీణుడు – ఇంతటి తేనెతేటల పాటలను కూర్చి ఆలపించడం ఎట్లా సాధ్యమయింది !
సర్వ ప్రక్రియా పరివ్యాప్తంగా సాగి – అంచులు ముట్టిన విశ్వనాథ సాహితీమూర్తిమత్వం అంతటిది కదా !
కవి మనసును ఆవహించినది – కన్నీటి జాలుగా వ్యక్తమైన తెలుగు ఇల్లాలి జాలి కథ. అందుకే రసోచిత ప్రయోగదక్షుడైన విశ్వనాథ – కిన్నెర కరుణకథ కోసం – ఒక రీతిని – గుండె గొంతుకలో కొట్లాడి ఉబికి వచ్చే గానగీతిని – ఎన్నుకొనడం.
కవి ఊహకెక్కిన నాతి కిన్నెరసాని, నాద కిన్నెరసాని గా మారగా – కవి మాటలే పాటల ఊటలై రూపుకట్టాయి.
ఏమిపాట అది ! పాటకు ఊపిరి ఊదిన ప్రతి శబ్దమూ ఒకదానికొకటి ప్రాణమిత్రమై పోవడమే ! అలా ఒక దానిని మరొకటి పొదువుకొని పాటైపోయిన ప్రతి శబ్దమూ పరిమళం వొలికించటమే ! ఒక మనోహరలయతో శ్రుతి కూర్చుకొన్న రాగమై, భావశబ్దలయలు ఒక్కటైపోయి సాగిన రసధార కిన్నెరపాట, ఆ పాట నినదిస్తే ‘కప్పురములు కుప్పలుగా’ పోసినట్లు పరిమళం విరియజల్లుతుంది. విరిపొట్లం విప్పుకొన్నట్లూ అవుతుంది. ఆవిరిపొట్లం విప్పినప్పటి కిన్నెర కథాసౌరభం ఎటువంటిదంటే…
తెలుగింట పుట్టి పెరిగిన పిల్ల కిన్నెర. ఉద్విగ్నహృదయ పెళ్లి పేరంటమూ జరిగి అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. పెనిమిటి ప్రేమమూర్తే ! అత్తతోనే వచ్చింది చిక్కు తెలుగులోగిళ్లలో అత్త మెచ్చిన కోడళ్లు ఉండటం అరుదే కదా! కిన్నెరకూ తప్పలేదు అత్తపోరు ! ఎప్పుడూ కోడలిపైన ఏదో ఒక నింద వేయటమే పనిగా పెట్టుకొన్నది.
భర్త ఉన్నాడు కొంత మెత్తనివాడేమో – అటు అమ్మనూ అదుపు చేయలేడు, ఇటు ఆలిని ఆదరించుకోలేడు. ఒకనాడు . కిన్నెరను అనరాని మాటలే అన్నది ఆ అత్త, అటు అత్త ఆర, ఇటు భర్త మౌనం – ఆపుకోలేని దుఃఖంతో వేగిపోయింది – కిన్నెర. కోపావేశంతో ముందు వెనుకలు ఆలోచించకుండా ఇల్లు వదలి అడవుల వెంట పరుగు తీసింది, అది చూచి, భయంతో, ఆందోళనతో, ఆమె వెంటే పరుగు తీశాడు ఆమెభర్త. ఎలాగో ఆమెను అందుకొని, కౌగిలిలో హత్తుకొని, తనను విడిచి వెళ్ళవద్దని వేడుకొన్నాడు. ప్రేమ విహ్వాలుడైన ఆమెభర్త – తనవల్ల తప్పేజరిగిందని, తనను క్షమించమని, తనను వదలి వెళ్లవద్దని – పరిపరి విధాల వేడుకొన్నాడు,
అప్పుడొక కరుణాద్భుతమైన చిత్రం జరిగింది. భర్త కౌగిలి నుంచి జారిపోతున్నది కిన్నెర -కరిగి కరిగి నీరై, యేరై పారుతున్నది. దిగ్భ్రాంతితో భర్త ఆమెను ఇంకా కౌగిట పొదుపుకోవాలని చూసాడు ఆమె జడ పట్టుకొన్నాడు, అతడి చేతిలో జడకు బదులుగా నీటిపొరలు కాల్వలు కట్టాయి, చీర కొంగును ఒడిచి పట్టుకొన్నాడు. చేతిలో కొంగు జారిపోయి తడి మిగిలింది.
ఇది కిన్నెరవాగు పుట్టుకకు నేపధ్యకథ. కరిగినీరైన శోకమై కిన్నెరవాగు జలజలా పారింది, కిన్నెర భర్త ఆమె కోసం దుః ఖించి దుఃఖించి స్థాణువైనాడు, భర్త శోకం కరడుకట్టిన శిలాకృతి ! భార్యశోకం నిలువునా నీరయిన రసాకృతి ! కరుణం అతడిలో ఘనీభవించింది, ఆమెలో ద్రవీభవించింది, ఇది కల్పనా ? కల్పన అయితే ఎంత బాగుండును ! అనిపిస్తుంది కానీ ఇది స్త్రీ పురుష సంబంధాలలోని సంఘర్షణలకు అద్దంపట్టే నిష్టురమైన జీవనసత్యం !
కిన్నెర పుట్టుక
ఓహో కిన్నెరసానీ ! ఓహో కిన్నెరసానీ!
ఊహా మాత్రము లోపల – నిలువవేలదే జవరాలా !
అంటూ, చేజారిపోతున్న కిన్నెరను ఆపుకోవాలని ఆక్రోశిస్తున్నాడు అతడు. ఊహామాత్రము లోపల కూడా నిలువలేనంత వేగరితనం ప్రదర్శించింది ఆమె !
ఆమె అట్లా కరిగిపోతూ – తన జీవమును కూడా తరలించుకు పోతున్నదట!
కానీ తనవల్ల కొంత తప్పే జరిగింది, అయితే మాత్రం అంత కోపమా ! తనకు ఇంతటి శిక్షా !
“నీవి సుకుమారమైన పాదాలు’ – ఇదివరలో రాళ్లమీద కాలు పెట్టటానికి ఓర్వలేని దానవు. ఈ బండరాళ్ల మీదుగా ఎట్లా ప్రవహించి వెళతావు ! ఓహో ప్రియురాలా! నిను కౌగిట అదుముకొన్నప్పటి నా తనువు పులకలు ఇంకా అణగి పోనేలేదు. అంతలోనే మాయమైపోతివే !”
ఇట్లా యేడిచి యేడిచి కిన్నెర భర్త కంఠం సన్నపడింది. క్రమంగా కాయం కొయ్యబారింది. అతడిలో పొంగిన దుఃఖమే కరళ్లు కట్టి అతడిని కఠినశిలగా మార్చివేసింది.
కిన్నెర నడకలు
కరిగింది కరిగింది – కరిగింది కరిగింది
కరిగి కిన్నెరసాని వరదలై పారింది,
తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది
పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది
ఆ ‘కరిగింది’ అన్న పదం అన్నిసార్లు చెప్పడం ఎందుకూ! ఆ కరగటంలో కిన్నెర పడిన వేదననీ, బాధనీ కనులకు కట్టించటానికే !
“సుళ్లుగా తిరిగి వొదుగుల్లు పోయి, నురుగుల్లు గ్రక్కి, కడరాళ్లు నడిచి, పచ్చికలు గడిచి, సుడులలో మొరిసి, కడలందు వొరిసి, జడలుగాకట్టి, తళతళా మెరసి, బిరబిరా నడచి, బుసబుసా పొంగి” – సాగి పోతూ కిన్నెర వెనక్కుతిరిగి శిలగా మారిన భర్తను నివ్వెరపోయి చూచింది. అక్కడే అతడిని చుట్టుకుచుట్టుకు తిరిగింది, కానీ ముందుకు పారే జలలక్షణాన్ని ఆపుకోలేక పోయింది,
ఓనాథ ఓనాథ
నాకు మల్లే నీవు నదివోలెపారరా !
అంటూ జాలిపాట పాడింది తాను తొందరపడి ఇల్లువదలి వచ్చి ఇట్లా నదిగా మారినందుకు వగచింది, మళ్లీ మనిషిగా మారాలనుకున్నా కుదిరే పనికాదు. తనపైన పతికి ఇంత ప్రేమ ఉన్నవిషయం తెలుసుకోలేకపోయినందుకు తనను తానే నిందించుకొంది.
‘అటువంటి పతితోడు – అటువంటి కాపురం
బిటు చేసుకొంటి నంచెక్కడా లేనంత
వగచెంది వనిత కిన్నెరసాని ‘
వనరి వనరి-ఇక తన కర్మ మింతే అని అనుకొన్నది, తొందరపడి తనకు తానే చేతులారా చేటు చేసుకున్నానని యేడ్చింది. ఎంత ఏడ్చినా శిల కరగదు. తాను ముందుకు పోకా తప్పదు, తల్లి దగ్గరనుండి తన మెడకు పలుపోసి లాగగాబడ్డట్టి లేగలా -ఎంతో కష్టంతో ముందుకు సాగింది కిన్నెర. పరికిణీ తొక్కాడు పది యేండ్ల కన్నెలా చిన్నిగంతులు వేయు తెల్ల నాంచెయ్యలాతెలి తారకల వెంట వెలుగులా – తలిరు పూవుల వెంట తావిలా. తెలుగు పాటల వెంట తిపిలా – సాగిపోయే కిన్నెరవాగును – అభం శుభం తెలియని పసి బాలికగా చిత్రించి – కిన్నెర మౌర్ఖ్యమంతా కనులకు కట్టించిన భావచిత్రాలు – కిన్నెర నడకలు.
కిన్నెర నృత్యము – కిన్నెర సంగీతము
ఇంతటితో ఎవరి త్రోవ వారిదయింది. కాలం ఆగదు, అది ఎంతటి దుర్భర దుఃఖానుభవమైనా, కాలక్రమంలో ఆ తీవ్రత కొంత తగ్గిపోవటం సహజం, కాలగమనంతో పాటూ ఆ తీవ్రదుఃఖం స్మృతిరూపంలో కొనసాగగా మళ్లీ సహజప్రవృత్తులతో జీవితం సాగి పోతుంటుంది. ఈ స్థితి కిన్నెరకూ ఏర్పడింది, గుండె రాయిచేసుకొని కిన్నెర ప్రవాహధోరణిలో ముందుకే సాగి పోయింది. ప్రవహిస్తున్నప్పటి కిన్నెర హావభావవిలాసాలన్నీ కిన్నెర నృత్యము, కిన్నెర సంగీతము అన్న రెండు ఖండికలలో దర్శనం ఇస్తాయి. నది ప్రవహిస్తున్నప్పటి పొంగుల్నీ, తరగల్నీ, నురుగుల్నీ, తుంపర్లనీ – నృత్య సంగీతలక్షణాలకు అన్వయించి – అత్యద్భుతంగా వర్ణించిన ఖండికలు ఇవి. భావతాళలయాశ్రితమైన, నృత్య, సంగీత కళాత్మకగీతాలుగా – మానవీయమైన అనుభవ దర్పణాలుగా రూపొందిన రసమయ రాగభావనలు ఇవి.
“చిటి తరంగాలతో, పొటి తరంగాలతో ప్రారంభమవుతుంది కిన్నెర నృత్యం. చిటిలు కెరటాలతో, పెటిలు కెరటాలతో జల్లు తుంపురులతో – కొల్లి తుంపురులతో – రంగారు నలలతో – పొంగారు ననలతో – చెంగు చెంగున దూకి – క్రొంగొత్త శృంగారములు వొలికి” –
“చిన్నారి నడలతో, పొన్నారి నడలతో వన్నె వన్నెలు పోయి చిరు వెల్గు సోనలై సిరులొల్కు సోనలై – మృదు తాండవము చేసి – జిలుగు టందియలతో, కులుకు కొన్నడలతో-వెలది కిన్నెరసాని తెనుగువాగై పారి- నెత్తావి తెనుగు పాటలు” పాడిందట.
ఈ విధంగా – నృత్య నృత్యాత్మకమైన సాత్విక, ఉదృత నృత్యాభినయ విన్యాసాలన్నిటినీ – ప్రతీక లక్షణంతో – పారే ఏరుని ఆడిపాడే నర్తకిగా మన కనులముందు సాక్షాత్కరింప చేస్తాడు కవి విశ్వనాథ,
“క్రొంగొత్త తేనె కాలువలూరినట్టు – అమృతంపు వాన చినుకులు జారినట్లు – తేనెలై – కలకండ సోనలై – వానలై – చాన కిన్నెరపాట” – సాగిందట !
ఇది కిన్నెర సంగీతం, కవి ఊహలో మెరిసి – ఏటి తరగలలో రవళించిన ధ్వనితరంగం !
కిన్నెర పాటకు పరవశమై – ఆ అడవీ, అప్పటి కాలంకూడా మంత్రముగ్ధమైనాయి, ఆ సంగీతమంతా వొంట పట్టించుకుని అసలు ఆ అడవే ఒకపాట అయిపోయింది, ఒక రాగ సుధాస్రవంతిగా కిన్నెరపాట – ఆత్మగానమై కవిమదిలో మారుమ్రోగిన పాట – ఆ పాట వెంటే మనమూ !
కడలి పొంగు
సంసారజీవితంలో మనసుకు కష్టం తగిలి. భర్తను వదలి వచ్చింది కిన్నెర. గుండె దిటవుచేసుకుని నృత్యానికీ, సంగీతానికి అంకితమైపోయి క్రొత్తజీవితం ప్రారంభించింది. అడవితల్లి ఆమెను ఆదరించింది.
బ్రతుకు అట్లా స్వేచ్ఛగా సాగిపోతుండగా కిన్నెరకు మళ్లీ ఒక బెడద వచ్చి పడింది, ఆ బెడద కడలి, సొగసు కిన్నెరసాని అందచందాల గురించీ, ఆటపాటల గురించీ విన్నాడు కడలిరాజు, ఎవరు చెప్పారో ఏమో అతడికి కిన్నెర గురించి !
గాలి పిల్లలె పోయి ఊదెనో మొగిలు కన్నెలె పోయి చెప్పెనో – కాని కడలిరాజుకు కిన్నెరను చూడాలనీ, తనదాన్ని చేసుకోవాలనీ తగని కోరిక పెంచుకొన్నాడు. అసలే పొంగుల రాయడు ! ఏమి చేశాడటా! సొగసు కిన్నెరసాని చూడాలె ననిపించి ఉర్రట్ట లూచెనూ మిర్రెక్కి చూచెనూ!
గగనమ్ము కొసదాక కెరటాలు ఉరికించి దూరాలు చూచెనూ – బారలూ చాచెనూ తగునా ఇది అతనికి ! ఎన్నేళ్లు వచ్చాయి వొంటిమీదకు ! ఇప్పటికి ఎంతమంది భార్యలు ! గంగ యమునలు లేరా ! నలుగురికి చెప్పవలసిన పెద్దమనిషి – ఇదేమి ప్రవర్తన! అడవి గుసగుసలు పోయింది.
కడలి ఔద్ధత్యం చూచి కిన్నెర భయంతో వణికిపోయింది. ఎంత కష్టం ! ఎంత దుఃఖం – చిన్న కిన్నెరకు!
కిన్నెర దుఃఖము
అది కిన్నెర దుఃఖమా ! తరతరాల నుంచీ స్త్రీజాతి అనుభవిస్తున్న దుఃఖానికి సంకేతమా ! మగవాని ధూర్తతకు బలి కాబడుతున్న స్త్రీ మాత్రమే ఎరిగిన దుఃఖమా !
కిన్నెరకు ఈ కష్టం రావలసి రాలేదు, తాను చేసిన తప్పిదమే కడలి రూపంలో కాటేయటానికి వచ్చింది, పశ్చాత్తాప దుఃఖంతో “కిన్నెర బొట్టుబొట్టుకొక వేయియెదలుగా తరగతరగకొక వేయినోళ్లుగా”
ఏడ్చి ఏడ్చి జలమెల్ల నెర్రనయి – తను వెల్ల నల్లనయి, ఏడ్చిఏడ్చి నురుసుల్లు తెల్లనయి – ఏడ్చిఏడ్చి నడకల్లు వేగమయి సాగిపోయే కిన్నెర దుఃఖంతో అడవి అంతా పాలు పంచుకుంది, అయితే వచ్చిన ఆపద మాత్రం తీర్చలేదు కదా అడవితల్లి!
అప్పుడొక విశేషం జరిగిపోయింది కిన్నెర ఏడుపు అంచెలంచెలుగా గోదావరినది చెవికిసోకింది, కిన్నెర దుఃఖానికి కారణం ఆమెకు తెలిసిపోయింది. జాలిగల తల్లి – గోదావరి కరుణతో కరిగిపోయింది. కెరటాల హస్తాలు చాచి కిన్నెరను తాకి అభయం అందించింది.
అది ఒక అద్భుత సన్నివేశం జీవితంలో ఆటుపోటులన్నీ కాచి వడపోసి అనుభవశాలి అయిన ప్రౌఢవనిత – అమాయికంగా ఆపదలో చిక్కుకొని దుఃఖిస్తున్న అమ్మాయిని రెండుచేతులా పొదువుకుని వెన్నునిమిరి అభయం చెపుతున్నప్పటి మానవీయమైన హృదయస్పర్శకు కవి చిత్రించిన దృశ్యరూపం ! ఇది – కరుణరసద్రష్ట అయిన మహాకవికి మాత్రమే సాధ్యమయ్యే సజీవ సన్నివేశ కల్పనం !
గోదావరీ సంగమము
గోదావరి నదిమాత్రమే కాదు. ఎదుటివారి కష్టాలకు చలించిపోయే కరుణాంతరంగ, న్యాయం, ధర్మం, గురైరిగిన దొడ్డతల్లి. ఆమె ‘గొప్ప గుణములు చాన
“నీ కష్టాలన్నీ ఎరుగుదును నేను. నీకిక భయంలేదు తల్లీ ! నేనున్నాను నీకు” – అంటూ కిన్నెరకు ధైర్యం చెప్పింది. తల్లి బిడ్డను పొదుపుకొన్నట్లుగా, అక్క చెల్లెలిని ఆదరించినట్లుగా – కిన్నెరను దగ్గరకు తీసుకుని కడుపులో పెట్టుకొన్నది.
గోదావరీదేవి గొప్పవంశపు రాణి. ఆమెను కాదనే సత్తా ఎవరికుంది? సముద్రమంతటి వాడికైనా ఎన్ని గుండెలు ! – కథ అడ్డం తిరగనే తిరిగింది !
ఏమిచేస్తాడు ఇక ఆ కడలిరాజు ! చేసేది లేక, తన పొంగునంతా దించుకొని, సాధురూపం పొంది చల్లబడి పోయాడు.
కిన్నెరకు భయంతీరింది. గోదావరితో కలిసిపోయి ముందుకు సాగింది. ప్రశాంతంగా –
“గోధుమల వన్నె తెలిక్రొత్త మబ్బులజంట
ఊది కలసిన యట్లూ
వీధిలో పెద్దక్క పిన్నక్క నవ్వుల
బోదెలో దిగినయట్లూ – ” కలిసిపోయారు – గోదావరీ కిన్నెరసానీ!
ఆ కలసిపోవడంలోనూ ఏమి సొగసు !
అట్లా – గోదావరీదేవి ‘కోరి కిన్నెరసాని – సాది తనలో కలుపుకొన్నది – నీటి పాదులో గ్రుచ్చెత్తుకొన్నది!
కిన్నెర వైభవము
కిన్నెర గోదావరిలో చేరుకోవటంతో కథ అయిపోయిందా ? అయినట్టే ! కాని కాలేదు !
విశ్వనాథ అంతటి జీవచైతన్య కళాద్రష్టకు, భావమహితాత్మునకు – ఈ ముగింపు అసంపూర్ణమే ! ఇంకా / ఏమంటే – చెప్పవలసింది ఏదో మిగిలే ఉండిపోయింది ! ఆ మిగిలిపోయింది. కిన్నెర అస్థిత్వవైభవవర్ణనంతో కథకు స్వస్తిచెప్పటం !
గోదావరిలో కలిసిపోయినా, కిన్నెరకు నామరూపాలు లేకుండా పోలేదు. ఆమె అస్థిత్వం స్థిరమైనదనీ, ప్రవాహరూపంలో కిన్నెర చిరంజీవిగా సాగుతూనే ఉన్నదనీ – చెప్పడం కవి అభిమతం.
కిన్నెర వాగు ప్రవహిస్తూనే ఉంది. ఒకొక్క కాలంలో ఒకొక్క రూపు – ఒకొక్క ఋుతువులో ఒకొక్క తూగుతో సాగి పారే కిన్నెర విన్యాస వైభవమంతా కవి ఒక మహా సౌందర్యతృష్ణతో దర్శించి అపూర్వమైన వర్ణనలతో కనులకుకట్టించిన ఖండిక – కిన్నెర వైభవము.
“ఉషః కాలములో. క్రొంబోద్దు వేళలో, గాలిలో చిరువెట్ట పుట్టిన ప్రొద్దెక్కిన వేళలో, జాము జామున్న పొద్దెక్కిన తరువాతనూ, సూర్యకాంతి నడిమింట మెరసిమండే పట్టపగటి వేళలో, ప్రొద్దువారిన వేళ, ముదిప్రొద్దు క్రుంకినవేళ, రాత్రి – నడిరాత్రి వేళ – కిన్నెర ఎట్లా నడిచిందో ! ఎట్లా కనిపించిందో ! చెప్పడం కష్టం ! కవి ఊహకు అందిన సౌందర్యతీరాలను అందుకొని చూడగలిగితే తప్ప విప్పిచెప్పడం కష్టం !
“ఋతువు ఋతువున మారు రుచులలో
కారుకారున మారు కాంతిలో
తెలుగు సత్కలిరాజు పలుకందుకోలేని
చవులూరి చవులూరి జలముల ప్రోవులై
కదిలేను కిన్నెరా – సాగేను కిన్నెరా !
ఇంతగా, ఇంతగా, గుండె తీపుగా వర్ణించినా కూడా కిన్నెర మాధుర్యాన్ని తెలుగు సత్కవిరాజు పలుకు అందుకోలేక పోయిందనటం ఏ కారణం చేత ! తనివి తీరని కవితారసతౌల్యం చేత !
భద్రాద్రి రామయ్య భక్తులగుండెలో కొలువై ఉన్నన్నినాళ్లు కిన్నెరసాని ప్రవహిస్తూనే ఉంటుంది. మరి ఈ నేలమీద తెలుగుజాతి ఉన్నంతకాలమూ – నిర్భరకరుణ రసవాహినిగా కిన్నెరసాని పాట సాగుతూ – గుండెలను తడపుతూనే ఉంటుంది.
అది రసహృదయుల హృత్తంత్రులను మ్రోయించే విశ్వనాథ కవితావాణి కనుకా –
ప్రకృతిలో పరమాత్మీయమైన మానవీయప్రకృతిని దర్శనం చేయించిన జీవద్వాణి కనుకా-
* * *
