డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 11

Spread the love

‘నీకు ఏ అర్థం కావడం లేదు?’

 ‘కొంచెం నెమ్మదిగా మాట్లాడు.’

 ‘నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను, అబ్బాయి. నువ్వు నీ జార్ కోసం ఉన్నానని అంటున్నావు, అసలు ఆ జార్ ఎవరు? ఎటువంటి వ్యక్తి? ఆ జారు ఒక తాగుబోతు, ఆ జారు భార్య ఒక వేశ్య, ఈ యజమానులందరూ యుద్ధం చేయకుండా బాగానే ఉన్నారు, కాని ఈ యుద్ధం మాత్రం మన మెడలకు ఉరిలాగా బిగుసుకుపోతూ ఉంది. నీకు అర్థమైందా? అది విషయం!ఫ్యాక్టరీ యజమాని తన వోడ్కా తను తాగుతాడు, సైనికుడు తన కష్టం తను పడతాడు, వారిద్దరికి కష్ట సమయమే. ఫ్యాక్టరీ యజమానికి తన డబ్బు సంచులు తనకే వస్తాయి, పని వాడికి జీతాలు వస్తాయి, ఇలా ఉంటాయి విషయాలు. బాగా పని చేయి, కోసాక్కు. నీకు త్వరలోనే ఇంకొక పెద్ద పథకం వస్తుంది, పెద్దది!’ అతను సాధారణంగా ఉక్రెనియన్ భాషలోనే మాట్లాడతాడు, కానీ కొన్నిసార్లు ఉద్రేకంతో అతను రష్యన్ బాషలోకి దిగుతూ, దానిని తిట్లతో నింపుతూ, తన మనసులోని భావాన్ని సరిగ్గా చెప్పేవాడు.

            రోజు రోజుకి అతను గ్రెగరి మొదడుని అతను అంతకుముందు ఎరుగని నిజాలతో నింపేస్తూ, యుద్దానికి అసలు కారణాలు చెప్తూ, నిరంకుశత్వాన్ని అవహేళన చేసేవాడు. గ్రెగరి ప్రతివాదన చేసే ప్రయత్నం చేసినా, కానీ గరాంజా అతన్ని తన సాధారణ పద్ధతిలో భయపెట్టే ప్రశ్నలతో ఎదురు మాట్లాడకుండా చేయడంతో, తప్పక గ్రెగరి ఒప్పుకోవాల్సి వచ్చేది.

    అన్నిటి కన్నా దారుణమైన విషయం ఏమిటంటే గరాంజా చెప్పేది సరైనదే అని గ్రెగరికి మనసులో అనిపించడం, దాని వల్ల అతనికి బదులివ్వడానికి ఏ వాదన లేకపోవడం ;నిజానికి అసలు అతనికి ప్రతివాదన చేయడానికి ఏ అంశం లేకపోవడం,అతను ఎంత ప్రయత్నించినా దానిని కనుగొనలేకపోవడం. గ్రెగరికి ఈ తెలివైన మరియు ఉద్రేకపరుడైన ఉక్రెనియన్ నెమ్మదిగా తన మనసులో అప్పటి వరకు జార్ పట్ల, పితృభూమి పట్ల, కోసాక్కుల మిలిటరీ బాధ్యతల పట్ల ఉన్న అభిప్రాయాలన్నీ తారుమారు చేస్తున్నాడని గ్రహింపు వచ్చింది. కానీ ఆ గ్రహింపు అతనికి భయంకరంగా తోచింది.

            గరాంజా వచ్చిన నెల నుండి గ్రెగరి జీవితం అప్పటివరకు నిలబడిన ఆలోచనల పునాదులన్నీ కూడా కూలిపోయాయి. అప్పటికే భయంకరమైన యుద్ధ అసంబద్ధత వల్ల అణగదొక్కబడి, బలహీనపడి ఉన్న ఆ మనసుకి కేవలం ఒక చిన్న ఆలంబన చాలు. ఆ ఆలంబనతో పాటు ఆలోచన కూడా మొలకెత్తిoది, గ్రెగరి సాధారణత్వాన్ని, సూటిగా ఆలోచించే మెదడును సవాలు చేస్తూ. తను అర్థం చేసుకోలేని స్థాయిలో ఉన్న పరిష్కారాల గురించి ఆలోచించడం మానేసి గ్రెగరి గరాంజా సమాధానాల్లోనే వాటిని వెతుక్కోవడంలో సంతోషం పొందేవాడు.

   ఒక అర్థరాత్రి గ్రెగరి హఠాత్తుగా నిద్ర లేచి, గరాంజాను నిద్ర లేపి అతని మంచం అంచు మీద కూర్చున్నాడు. సెప్టెంబర్ మాసపు చంద్రుడి వెలుగు కిటికీ గుండా లోపలికి పడుతూ ఉంది. నల్లగా, పగుళ్ళు ఏర్పడిన భూమిలా అతని ముఖం మీది ముడతలు, కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు ఆ చీకటిలో కూడా గరాంజా ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అతను ఆవులిస్తూ, చలికి వణుకుతూ దుప్పటి కాళ్ళ చుట్టూ కప్పుకుంటూ లేచాడు.

   ‘నువ్వు ఇంకా ఎందుకు నిద్ర పోలేదు?’

  ‘నేను నిద్ర పోలేను. నాకు నిద్ర రావడం లేదు. నాకు ఇది వివరంగా చెప్పు. యుద్ధం కొందరికి మంచి, కొందరికి చెడు ఎలా చేస్తుంది….’

  ‘హా..’, గరాంజా మరలా ఆవులించాడు గట్టిగా.

  ‘ఒక్క నిమిషం ఆగు!’ గ్రెగరి కోపంతో రగిలిపోతూ గుసగుసగా అన్నాడు.’నువ్వు వాళ్ళు మనల్ని ధనవంతుల క్షేమం కోసం మనల్ని చావు అంచుల దాకా పంపిస్తున్నారని అన్నావు. అయితే మామూలు జనం సంగతి ఏమిటి? వారికి అర్థం కాదా? లేకపోతే వారికి ఎవరూ అర్థమయ్యేలా చెప్పరా? ఎవరో ఒకరు ముందుకొచ్చి, “సోదరులారా, చూడండి మీరు ఎవరి కోసం చనిపోతున్నారో, ఎవరి కోసం మీ రక్తం ధార పోస్తున్నారో.”

  “ఎవరో ఒకరు ముందుకు రావడమా? నీకు పిచ్చి పట్టిందా? ఇక్కడ మనల్ని చూడు, పొలాల్లో బాతుల్లా గుసగుసలాడుతున్నాము, కానీ ప్రయత్నించి బయటకు వెళ్ళి మాట్లాడి చూడు, మరుక్షణం నీ గుండెల్లో తూటా దిగుతుంది. జనం మూగవారిలా ఉంటున్నారు. ఈ యుద్ధం తప్పక వారిని మేల్కొల్పుతుంది. ఉరుము తర్వాత తుఫాను వచ్చి తీరుతుంది.’

  ‘అయితే మనం ఏం చేద్దాం? పాము లాంటోడా చెప్పు. నువ్వు నా గుండెల్లో జ్వాల రగిలించావు.’

  ‘నీ గుండె నీకు ఏమని చెప్తుంది?’

   ‘నాకు ఏం అర్థం కావడం లేదు’, గ్రెగరి ఒప్పుకున్నాడు.

‘ఎవడైనా ఎత్తయిన కొండ మీద నుండి కిందకు తోసేయ్యబోతే, నేనే వాడిని కిందకు తోస్తాను.మనం తుపాకీలను కూడా అలాగే మన వైపుకి మార్చుకోవాలి. జనాల్ని ఈ నరకంలోకి పంపుతున్న వారిని ముందుగా మనం కాల్చి పారేయ్యాలి. నేను ఒక విషయం చెప్తాను’, గరాంజా లేచి కూర్చుని, ఒక్కసారిగా పళ్ళు బయట పెట్టి, చేతులు చాస్తూ, ‘ఒక పెద్ద అలతో ఇదంతా కొట్టుకుపోతుంది’, అన్నాడు.

‘అంటే, నువ్వు చెప్తున్న దాని ప్రకారం… ప్రతిది తలక్రిందులు అవుతుందని అంటున్నావా?’

‘అవును. మన పాత బడిన బట్టల్ని పారేసినట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా పడిపోయేలా చేయాలి. మర్యాదస్తులుగా ఉంటూ జనాలని నరకం అనుభవించేలా చేస్తున్న వారి పని పట్టాలి.’

  ‘మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, యుద్ధం గురించి ఏం చేస్తారు? పురుషులు ఇంకా యుద్ధం చేయాలన్న ఆసక్తితోనే ఉంటారు. ఒకవేళ మనం వద్దనుకున్నా, మన పిల్లలు దాని పట్ల శ్రద్ధ చూపిస్తారు. యుద్దానికి ముగింపు ఎలా పలకగలము? అనాది నుండి యుద్దాన్ని జీవితంలో భాగం చేసుకున్న   క్రమంలో దీనిని ఎలానిర్మూలించగలము?’

‘అవును, అనాది నుండే యుద్ధం ఉందన్న మాట నిజమే, రక్త పిపాస ఉన్న ప్రభుత్వాలు ఉన్నంతకాలం అది కొనసాగుతూనే ఉంటుంది. అది అలాగే ఉంది! కానీ ప్రతి దేశంలోని ప

శ్రామికుల ప్రభుత్వం ఉంటే, అప్పుడు వారు యుద్దానికి వెళ్ళరు. ఈ మార్పు కోసం నువ్వు పని చేయాలి. అంతేకాదు ఇదే జరుగుతుంది, వాళ్ళు ఏం చేసినా ఇదే జరుగుతుంది!జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాల్లో శ్రామికుల మరియు రైతుల ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు మనం ఒకరితో ఒకరం యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? ఈ సరిహద్దుల గొడవలు, ద్వేషాలు ఇక వద్దు!అప్పుడు ప్రపంచమంతా ఎంతో అందంగా మారిపోతుంది. ఓహో!’ గట్టిగా నిట్టూరుస్తూ, పై పెదవి కొరుక్కుంటూ, వెలుగుతున్న కళ్ళతో ఏదో లోకంలో విహరిస్తున్నవాడిలా నవ్వాడు.’ఓ గ్రీషా! ఆ రోజు చూడటం కోసం నా రక్తపు బిందువులన్నీ చిందిస్తాను… నా హృదయం ఆ రోజు చూడటం కోసం ఎంతగానో తపిస్తూ ఉంది…’

            ఆ రోజు దాదాపుగా ఉదయపు వెలుతురు ప్రసరించేవరకు వారిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఉదయం అవుతున్న సమయంలో అసహనంతో గ్రెగరి నిద్రలోకి జారుకున్నాడు.

            ఉదయానికి కొన్ని స్వరాలతో పాటు బిగ్గరగా ఒక ఏడుపు వినిపించడంతో మెలకువ వచ్చింది. ఇవాన్ వృబ్ లెవస్కీ తన తల పడక మీద వాల్చేసి, ఏడుస్తూ, మూలుగుతూ ఉన్నాడు. ఒక నర్సు, జాన్ వారేకిస్ మరియు కోసిక్ అతని చుట్టూ నిలబడి ఉన్నారు.

 ‘అతను ఎందుకలా ఏడుస్తున్నాడు?’బర్డిన్ చిన్నగా, తల చుట్టూ ఉన్న దుప్పటి తొలగిస్తూ అడిగాడు.

  ‘అతను తన కన్ను పగలగొట్టుకున్నాడు. అతను దాన్ని గాజులో నుంచి తీస్తూ, కింద పడేసాడు’, కోసిక్ ఓ రకమైన ద్వేషపూరితమైన తృప్తితో అన్నాడు, జాలితో కాకుండా.

            రష్యాలో మూలాలున్న ఒక జర్మన్ దేశస్తుడు,కృత్రిమ కళ్ళ వ్యాపారం చేస్తున్నాడు. దేశభక్తి ఉద్వేగంతో అతడు ఆ కళ్ళను ఉచితంగానే అందిస్తున్నాడు. కేవలం క్రితం రోజే, ఎంతో అధునాతనంగా ఉన్న ఒక గాజు కన్ను, నీలి రంగుతో అచ్చు గుద్దినట్టు సహజంగానే ఉన్న, వృబ్ లెవస్కీ కోసం ఎంపిక చేయబడింది. అది అతనికి అమర్చగానే, అతను నవ్వుతూ చిన్న పిల్లవాడిలాగా గంతులు వేసాడు.

            ‘నేను ఇంటికి వెళ్ళగానే, నేను అందంగా ఉన్న ఓ అమ్మాయిని చూసి, ముందు ఆమెను పెళ్ళాడి, తర్వాత నాది గాజు కన్ను అని చెబుతాను’, తన వ్లాదిమిర్ యాసలో సాగదీస్తూ చెప్పాడు.

            ‘అతను తప్పక అలానే చేస్తాడు!’ ఎప్పుడూ బొద్దింక కొరికిన గౌను వేసుకున్న ఓ అమ్మాయి గురించి చిన్న పాట పాడే బుర్డిన్ నవ్వుతూ అన్నాడు.

   కానీ ఇప్పుడు ఓ దురదృష్టకరమైన ప్రమాదం వల్ల అందగాడైన ఓ యువకుడు తన గ్రామానికి ఒంటి కన్ను వాడిగా తిరిగి వెళ్తాడు.

  ‘వాళ్ళు కొత్తది ఇంకొకటి ఇస్తారు నీకు, ఏడవడం ఆపు’, గ్రెగరి ఓదారుస్తూ అన్నాడు.

లేదు, వాళ్ళు ఇవ్వరు. ఒక కొత్త కన్ను విలువ ఎంతో తెలుసా.. మూడు వందల రూబుళ్ళు. వాళ్ళు ఇంకొకటి ఇవ్వరు.’

  ‘అందులోనూ అది నిజంగా చాలా అందంగా ఉంది. ప్రతి నరం కూడా అందులోకి ఇంకిపోయినట్టు ఉంది’, కోసిక్ కొనసాగింపుగా అన్నాడు.

 ఉదయం తేయాకు తాగాక  వృబలెవస్కీ సహాయ వైద్యుడితో కలిసి జర్మన్ దేశస్తుడి దుకాణంకు వెళ్ళాడు. అక్కడ ఆ జర్మన్ అతని కోసం ఇంకో కన్ను ఇచ్చాడు.

  ‘జర్మన్లు రష్యన్ల కన్నా ఎంతో మంచివారు!’ వృబలెవస్కీ ఉత్సాహంగా అన్నాడు.’అదే రష్యన్ వ్యాపారి అయితే పిచ్చి తిట్లు తిట్టేవాడు, కానీ ఇతను ఒక్క మాట కూడా అనలేదు.

  సెప్టెంబర్ గడిచిపోయింది. గడిచిపోతున్న రోజులను కాలం చాలా జాగ్రత్తగా లెక్కిస్తున్నట్టుగా ఉంది. అక్కడ ఉన్నవారు అంతా ఎంతో నిరాసక్తంగా కాలాన్ని గడిపేవారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి రోగికి తేయాకుతో పాటు వెన్న రాసి ఉన్న రెండు ఫ్రెంచ్ బ్రెడ్డు ముక్కలు ప్లేటులో అందించేవారు. రాత్రి వారు భోజనాలు చేసాక కూడా ఆకలితోనే ఉండేవారు. సాయంత్రం సమయాల్లో వారు ఎక్కువ తేయాకు తాగుతూ, మధ్యలో చల్లటి నీరు తాగుతూ ఉండేవారు, వైవిధ్యాన్ని ప్రయత్నించే దిశలో. రోగులు వస్తూ వెళ్తూ ఉన్నారు. యుద్ధంలో గాయపడ్డ వారు ఉన్న వార్డును అక్కడ ఉన్నవారు ‘మిలిటరీ వార్డు’అని పిలిచేవారు. ఆ వార్డు నుండి ముందు వెళ్ళింది కోసిక్. అతని తర్వాత వారేకిస్ కూడా వెళ్ళిపోయాడు. అక్టోబర్ చివరిలో గ్రెగరికి ఆ అవకాశం వచ్చింది.

   అందంగా, చక్కగా క్షవరం చేసుకుని ఉన్న డాక్టర్ స్నేగిర్యోవ్ ఒక చీకటి గదిలో అక్షరాలు ఉన్న బోర్డు తగిలించి, వాటి ద్వారా గ్రెగరి దృష్టిని పరీక్షించి సంతృప్తి చెందాడు. అతన్ని ఆ కంటి ఆసుపత్రి నుండి విడుదల చేసి అక్కడ నుండి ఇంకో   ట్వెరస్కాయా     వీధుల్లోకి పంపించారు, ఎందుకంటే అతని తల పైన ఉన్న గాయం అనుకోకుండా మరలా పెద్దదై, కొద్దిగా క్రీములు కూడా చేరుతూ ఉన్నాయి.

  ‘మనం తప్పకుండా మరలా కలుద్దాము’, గ్రెగరి గరాంజాకు వీడ్కోలు పలుకుతూ అన్నాడు.

  ‘పర్వతాలు ఎప్పుడూ కలవ్వు, కానీ మనం మనుషులం.’

‘సరే ఉక్రెనియా వాడా, నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు నాకు అన్ని స్పష్టంగా తెలుస్తున్నాయి,నేను తేల్చాల్సిన లెక్కలు కూడా ఉన్నాయి.’

 ‘నువ్వు నీ రేజిమెంటుకు తిరిగి వెళ్ళాక, అక్కడ ఉన్న కోసాక్కులతో కూడా ఇది మాట్లాడు.’

  ‘తప్పకుండా.’

  ‘ఒకవేళ నువ్వు ఎప్పుడైనా చెర్నిగోవ్ దారిలో వెళ్తే, అక్కడ ఉన్నా గోరోఖోవా గ్రామంలో ఆండ్రి గరాంజా అనే కంసాలి గురించి అడుగు. నేను నువ్వు ఎప్పుడు వచ్చినా సంతోషిస్తాను. వీడ్కోలు, మిత్రమా!’

   వారిద్దరూ ఒకరినొకరు కౌగలించుకున్నారు. తర్వాత చాలా సేపటి వరకు గ్రెగరి ఆ ఉక్రెనియా వ్యక్తిని అతని ఒంటి కన్ను, ముడతలు పడ్డ ముఖం, స్నేహపూర్వక చిరునవ్వుతో ఉన్న వ్యక్తిగానే మదిలో నిలుపుకున్నాడు.

  గ్రెగరి ఇంకొక ఆసుపత్రిలో పది రోజులు గడిపాడు. గరాంజా చెప్పిన విషయాలు అతని మెదడులోకి మెల్లగా ఇంకుతూ ఉంటే, ఇంకా పూర్తిగా ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో అతనిలో ఘర్షణ జరుగుతూనే ఉంది. అతను ఆ వార్డులో ఉన్న వారితో ఎప్పుడో కాని మాట్లాడేవాడు కాదు, అతని మెదడులో ఉన్న గందరగోళం అతని ప్రతి కదలికలోనూ కనిపిస్తూ ఉండేది. రష్యన్ లా లేకుండా ఉన్న గ్రెగరి ముఖంలోకి చూసిన ఆ శాఖ పర్యవేక్ష వైద్యుడు, ‘కలవరపాటుతో ఉన్నవాడు’ అని అతన్ని చూడగానే అనుకున్నాడు.

            గ్రెగరి ముందు కొన్ని రోజులు జ్వరంతో మంచం మీదే పడి ఉన్నాడు, ఆ సమయంలో కూడా అతని మెదడులో ఆలోచనా ప్రవాహం ఆగలేదు. ఆ సమయంలోనే ఒక ఘటన జరిగింది.

            వోరోనేజ్ నుండి ఇంటికి వెళ్తున్న ఓ అధికారి తాను ఆసుపత్రికి వస్తున్నట్టు తెలియజేసాడు. ఆ రోజు ఉదయమే తెలియడంతో ఆ ఆసుపత్రి సిబ్బంది అంతా మంటల్లో చిక్కుకున్న ఎలుకల్లా అటూఇటూ కంగారుగా తిరుగుతూ ఉన్నారు. గాయపడిన వారిని వీలైనంతలో చక్కటి వేషధారణలోకి మార్చారు; పడకలకే పరిమితమైన రోగులను పైకి లేపి మరి పక్కలు మార్చారు. ఒక జూనియర్ వైద్యుడు అంతా తిరుగుతూ రోగులతో ఆ అధికారితో ఎంత గౌరవంగా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో బోధిస్తూ ఉన్నాడు.ఈ వాతావరణం వల్ల అందరూ జాగురుకులై పోయారు, ఆ అధికారి రాకమునుపే వారంతా గుసగుసల్లోకి మారిపోయారు. మధ్యాహ్నం వేళ ద్వారం వద్ద ఒక మోటార్ బండి శబ్దం వినిపించింది. ఆసుపత్రి ద్వారం వద్ద అనేకమంది స్వాగతం పలికాక ఆ అధికారి లోపలికి అడుగుపెట్టాడు. (ఆ గాయపడిన వారిలో ఒకడు, ఎప్పుడూ సరదాగా ఉంటూ జోకులు వేసేవాడు, వాళ్ళు వెళ్ళిపోయాక  అక్కడున్న మిగిలిన రోగులతో, ఆ అతిధి వచ్చే సమయానికి హాస్పటల్ పైన ఉన్న ఎర్ర జెండా కూడా  ఆ రోజు గాలి లేకపోయినా సరే అటూ ఇటూ ఎగురుతూ ఆయనకు ఆహ్వానం పలికిందని, అక్కడ దగ్గరలో ఉన్న క్షవరశాలలో కనిపించిన క్రీస్తు బొమ్మను చూసి అధికారి వినమగ్రంగా వంగి క్రాస్ రూపంలో దేవునికి ప్రార్థన చేసాడని కూడా చెప్పాడు) అధికారి తనిఖీ మొదలైంది. ఆ అధికారి తన హోదాకు, ఆ పరిస్థితికి తగ్గట్టు ప్రశ్నలు వేసాడు;అక్కడ గాయపడ్డ వారు జూనియర్ వైద్యుడి సలహా మేరకు  మాములుగా కన్నా అధిక ఆశ్చర్యాన్ని ప్రదర్శించేలా కళ్ళు పెద్దవి చేసి,’అవును, యువర్ హైనెస్’, ‘లేదు, యువర్ హైనెస్’ అని సమాధానాలు ఇచ్చారు. వారు చెప్పిన సమాధానాలకు ఆ ఆసుపత్రి అధికారి వ్యాఖ్యలు జోడించాడు. అతను పాములా మెలికలు తిరుగుతూ, చూడటానికి జాలి గోలిపెలా ఉన్నాడు. ఆ రాజ్యపు అధికారి ఒక్కో పడక దగ్గరకు వచ్చి ఒక్కొక్కరికి రాజముద్రలు ఇచ్చాడు. ఖరీదైన సెంట్ల వాసనతో పాటు ఆ అధికారిని అనుసరిస్తూ ఉన్న బృందాన్ని గ్రెగరి చూస్తూ ఉన్నాడు. గడ్డం చేసుకోకుండా, కళ్ళల్లోకి రక్తం పొంగుతూ ఉండగా, గోధుమ రంగులో అతని బుగ్గల దగ్గర ఉన్న చర్మం గట్టిపడుతూ, తన పడక పక్కన నిలబడి ఉన్న గ్రెగరిలో ఓ రకమైన ఉద్వేగాన్ని కలిగిస్తూ ఉంది.

            ‘ఇక్కడ ఉన్నవారు వారే, ఎవరికోసమైతే మేము ఇల్లు, వాకిలి వదులుకొని చావు అంచులకు పయనిస్తున్నామో వారే. దరిద్రపు వెధవలు!మా వెనుక రక్తం పీల్చే పేలలాంటివారు!… ఇక వీడు! వీడి లాంటి వాడిని తృప్తి పరచడానికా మేము ఏ తప్పు చేయని జనుల ధాన్యాన్ని దోచుకుని, వారిని కిరాతకంగా చంపాము? వీరి కోసమేనా నేను ఎంతో బాధను అనుభవించింది? దీని వల్ల కలిగిన భయం? మమ్మల్ని మా కుటుంబాల నుండి వేరు చేసి, ఆకలితో బారక్లలో ఉంచి…’ ఈ ఆలోచనలు అతని మెదడులో తిరుగుతూ ఉన్నాయి. మనసులో రగులుతున్న ఆ కోపం వల్ల అతని శరీరం కొద్దిగా వణికింది.’ఎంత లావుగా, నున్నగా ఉన్నారు మీరంతా!అసలు మిమ్మల్ని అక్కడకు పంపించాలి, పనికిమాలిన వెధవల్లారా!గుర్రం మీద, వెనుక తుపాకీ తగిలించి, చలిలో, మంచులో కుళ్ళిన ఆహారపదార్ధాలు తింటూ మీరు కూడా ఆ జీవితం అనుభవించాలి!’

            గ్రెగరి ఆ అధికార బృందాన్ని గమనిస్తూనే, తీక్షణంగా ఆ అధికారి బుగ్గల వైపు చూశాడు.

   ‘ఇతను ఒక డాన్ కోసాక్కు. ఇతని సేవలకు ఒక సెయింట్ జార్జ్ క్రాస్ తో కూడా సత్కరించబడ్డాడు’, ఆ ఆసుపత్రి పెద్ద కొద్దిగా ముందుకు వంగి వినయంగా ఆ మాటకు ఇంకొంత సమాచారం తానే ఆ క్రాస్ పొందినట్టు జోడించి చెప్పాడు.

   ‘ఏ స్టానిట్సా వాడివి నువ్వు?’ ఒక రాజముద్రికను చేతిలో సిద్ధంగా ఉంచుకుని, ఆ అధికారి అడిగాడు.

  ‘వ్యోషెన్ స్కాయా, మీ హైనెస్.’

   ‘నువ్వు ఆ క్రాస్ ను ఎలా సాధించావు?’

            ఆ మెరుస్తూ ఉన్న కళ్ళల్లో ఓ రకమైన ఆసక్తి, తృప్తి ఒకేసారి కనిపించాయి. ఆ అధికారి ఎడమ కనుబొమ్మ ఒక్కసారి పైకి లేవడం వల్ల ఆ ముఖంలో ఆసక్తి ఇంకా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక్క క్షణంలో గ్రెగరికి తెలియకుండానే ఒళ్ళంతా చల్లబడి, గుండెల్లో ఏదో నొప్పిగా అనిపించింది. ఎప్పుడైనా అటువంటి పరిస్థితుల్లో అతనికి అలా జరగడం ఎప్పుడూ ఉంది. అతని పెదవులు వణుకుతూ, కళ్ళు అదురుతూ ఉన్నాయి.

  ‘నేను.. నేను అది… బాత్రూంకి వెళ్ళాలి, మీ హైనెస్… ఒకటికి వెళ్ళాలి..’ గ్రెగరి విరిగిన కొమ్మలా వంగిపోయి ఆ పడక చుట్టూ మెలితిరుగుతున్న విన్యాసం చేశాడు.

            ఆ అధికారి ఎడమ కనుబొమ్మ ఒక్కసారిగా పక్కకు తిరిగింది, రాజముద్రతో ఉన్న అతని చేయి మధ్యలోనే ఆగిపోయింది. ఉబ్బి ఉన్న అతని పెదవులు ఆశ్చర్యంగా గుండ్రంగా అయ్యాయి.తన పక్కనే తెలబడ్డ వెంట్రుకలతో ఉన్న జనరల్ తో అతను ఏదో ఇంగ్లీష్ లో చెప్పాడు. ఆ కాసేపట్లోనే ఏదో తెలియని గందరగోళం ఆ ప్రదేశంలో వ్యాపించింది. పొడుగ్గా మిలిటరీ యూనిఫారం ధరించిన ఓ అధికారి, తన చేత్తో కన్నును రుద్దుకున్నాడు,మూడో అతను ప్రశ్నార్థకంగా నాలుగోవాడి వైపు చూశాడు. గౌరవపూర్వకంగా నవ్వుతూ, తెల్ల వెంట్రుకలతో ఉన్న జనరల్ ఏదో ఇంగ్లీషుల్లో ఆ అధికారికి చెప్పాడు. ఆ తర్వాత ఆ అధికారి తన చేతిలోని రాజముద్రను గ్రెగరి చేతుల్లో ఉంచి, అతని భుజం మీద తట్టాడు.

   ఆ అధికారి బృందమంతా అక్కడనుండి వెళ్ళిపోయాక గ్రెగరి మంచం మీద కూలబడి, దిండులో తల దూర్చి, వణుకుతూనే ఉన్నాడు కొన్ని నిమిషాల వరకు. అతను నవ్వుతున్నాడో, ఏడుస్తున్నాడో చెప్పడం దాదాపు అసాధ్యమే. కానీ అతను లేచేసరికి ఆ కళ్ళు కాంతివంతంగా ఉన్నాయి. అతన్ని వెంటనే ఆ ఆసుపత్రి పెద్ద ఆఫీసుకు పిలవడం జరిగింది.

            ‘పనికిమాలినోడా!’అక్కడున్న డాక్టర్ తిట్లతో మొదలెట్టాడు, తన గడ్డాన్ని సరిచేసుకుంటూ.

   ‘నన్ను అలా మర్యాద లేకుండా పిలవొద్దు, వెధవా!’గ్రెగరి తల ఎత్తి కోపంగా అతనికి ఎదురు సమాధానం చెప్పాడు.

  ‘ఇక్కడ మీ వాళ్ళు ఎంతోమంది లేరు!’ రోషంతో తన మాటలని కొనసాగిస్తూ,’ఇక నన్ను ఇంటికి పంపించండి’, అన్నాడు గ్రెగరి.

  తనను తాను స్థిమితపరుచుకుని ఆ వైద్యుడు నెమ్మదిగా,’తప్పకుండా పంపిస్తాము. ఎక్కడో ఓ చోటికి పో!’ అన్నాడు.

  గ్రెగరి ఓ రకమైన తృప్తికరమైన నవ్వుతో, సంతోషంగా బయటకు వచ్చాడు.

            రాజ్యాధికారి సమక్షంలో అతని అనాగరిక ప్రవర్తనకు ఆ ఆసుపత్రి యాజమాన్యం అతనికి శిక్షగా మూడురోజులు తిండి పెట్టలేదు. అదే వార్డులో ఉన్న అతని తోటి రోగులు, సున్నిత మనస్కుడైన అక్కడి వంటవాడు అతని ఆకలిని తీర్చారు ఆ మూడురోజులు.

                                                     *   *  *

అధ్యాయం-24

   నవంబర్ మూడవ తేదీ రాత్రి,గ్రెగరి  మెలఖోవ్ స్టేషన్ నుండి మొదటి కోసాక్కు గ్రామమైన నిజ్ని-యాబ్లోనోవ్స్కీ కి చేరుకున్నాడు. అక్కడి నుండి కొద్ది వెరస్టుల దూరంలోనే యాగ్డోనోయ్ ఎస్టేట్ ఉంది. అక్కడ ఉన్న ఇళ్ళను దాటుతూ, తన అడుగుల చప్పుడుతో కుక్కల నిద్రకు భంగం కలిగిస్తూ,నడుస్తూ ఉంటే; నది వైపు ఉన్న చెట్ల నుండి కొందరు కుర్రాళ్ళు పాడుతున్న పాట వినిపిస్తూ ఉంది.

            చెట్ల గుండా,మెరుస్తున్న ఖడ్గాలతో

            పెద్ద మీసాలతో ఓ బృందం యుద్ధానికి బయల్దేరింది

            ఒక కుర్ర ఆధికారి దానికి నాయకత్వం వహిస్తే

            వందమంది కోసాక్కులు అతని వెనుక నడిచారు 

ఓ మధురమైన స్వరం ప్రతిధ్వనించేలా ఆ పాటను కొనసాగించింది.

      భయపడకండి సోదరులారా,నన్ను అనుసరించండి!

వెంటనే గుంపుగా కొన్ని స్వరాలు ఆ పాటను అందుకున్నాయి.

  త్వరగా ప్రాకారాలు ఎక్కండి!

   శత్రువు దగ్గరకు మొదట చేరుకునేవాడికి

   గౌరవం ,కీర్తి దక్కుతాయి!

కోసాక్కు పాటల్లో కూడా ఉండే అలాంటి పదాలు,ఒకప్పుడు తను కూడా పాడినవి గుర్తుకొచ్చి గ్రెగరి హృదయంలో ఏదో తెలియని హాయి,సాన్నిహిత్యం కలిగేలా చేశాయి.అతని కళ్ళు మంట పెడుతూ ఉంటే, అతని గుండెలో ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. ఆ కోసాక్కుల ఇళ్ళ నుండి వస్తున్న చిమ్ని పొగను పీల్చుకుంటూనే, గ్రెగరి ఆ గ్రామంలో నడుస్తూ ఉన్నాడు,అతన్ని ఆ పాట వెంబడిస్తూ ఉంటే.

        ప్రాకారాల ముందు మేము నిలబడి ఉన్నాము

      తేనెటీగల్లా తూటాలు మా చుట్టూ రొద చేస్తున్నాయి

      డాన్ కోసాక్కులు అందరి కన్నా ధైర్యంతో

     బాకులతో,కరవాలాలతో వాటిని ఎదుర్కున్నారు!

      ‘నేను ఇలా పాడి చాలా కాలం అయ్యింది. దాదాపుగా నేను కుర్రాడిగా ఉన్నప్పుడే అలా పాడింది. ఇప్పుడు నా గొంతు ఎండిపోయింది, జీవితం నా నుండి ఆ పాటను లాగేసుకుంది. ఇప్పుడు నేను, నీ సెలవు కాలంలో, ఇంకొకరి భార్య దగ్గరకు వెళ్తున్నాను. నాకంటూ సొంత ఇల్లు లేదు, లోయలో చిక్కుకున్న తోడేలులా ఉంది నా పరిస్థితి.’ గ్రెగరి ఆలోచనల్లో ముంగి తేలుతూ, ఒకరకమైన నిరాసక్తతతో అడుగులు వేస్తూ,తన జీవితంలో అనుకోకుండా జరిగిపోయిన మలుపుల గురించి తనను తానే కించపరుచుకుంటూ ఉన్నాడు. ఆ గ్రామం అంచున ఏటవాలుగా ఉన్న కొండను ఎక్కి,వెనక్కి తిరిగి చూశాడు. ఆఖరి ఇంటి కిటికీ దగ్గర వెలిగించి ఉన్న లాంతరు వెలుగులో ఒక వయసు మళ్ళిన కోసాక్కు స్త్రీ తన కుట్టు మిషన్ దగ్గర కూర్చునట్టు కనబడింది.

  గ్రెగరి ఆ దారి దాటి, ముందు కాస్త తేమగా గడ్డితో ఉన్న ప్రాంతంలో అడుగు పెట్టాడు. చిర్ దగ్గర్లో ఉన్న ఏదో ఒక గ్రామంలో ఆ రాత్రి గడపాలని, తర్వాతి రోజు ఉదయం కల్లా యాగ్డోనోయ్ చేరుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. అతను గ్రాకోవ్ గ్రామం చేరుకునేసరికి అర్థరాత్రి అయ్యింది. సరిహద్దుల్లో ఉన్న ఒక ఇంటి దగ్గర ఆగి, పూర్తిగా తెల్లవారక ముందే అతను బయల్దేరాడు.

     అతను యాగ్డోనోయ్ చేరుకునేసరికి ఇంకా చీకటిగానే ఉంది. సూటిగా కంచె దగ్గరకు వెళ్ళి,గుర్రపుశాల వైపు నడుస్తూ ఉంటే అతనికి సాష్కా తాత దగ్గు వినిపించింది.

  ‘సాష్కా తాతా….నిద్ర పోతున్నావా?’

   ‘ఆగు,ఎవరది? నాకు ఈ గొంతు తెలుసు. ….ఎవరై ఉండొచ్చు? ‘

  వృద్ధుడైన సాష్కా తన భుజాల చుట్టూ కోటు కప్పుకుని బయటకు వచ్చాడు.

   ‘ఓ దేవుడా! గ్రెగరి! ఎక్కడినుండి ఊడిపడ్డావు? అతిథిలా వచ్చావు!’

      వారిద్దరూ ఒకరినొకరు కౌగలించుకున్నారు. సాష్కా తల పైకెత్తి గ్రెగరి కళ్ళలోకి చూస్తూ, ‘లోపలికి రా,పొగ కాలుద్దాము’,అన్నాడు.

  ‘లేదు, రేపు వస్తాను. ఇప్పుడు నేను వెళ్ళాలి.’

   ‘లోపలికి రా,నేను చెప్తున్నా కదా…’

   ఇష్టం లేకపోయినా, గ్రెగరి అతన్ని అనుసరించాడు. అతను అక్కడ ఉన్న చెక్క మంచం మీద కూర్చుని, ఆ వృద్ధుడు గొంతు సవరించుకుంటున్నంత సేపు మౌనంగా ఉన్నాడు.

   ‘సరే,తాత, ఎలా ఉన్నావు? ఇంకా బతికే ఉన్నావు,ఉత్సాహంగా ఉన్నావు కూడా’,సరదాగా అన్నాడు.

  ‘ఏదో నడుస్తూ ఉంది. నేను చెకుముకి రాయి లాంటి వాడిని. ఎప్పటికి ఇలానే ఉంటాను.’

    ‘అక్సిన్య  ఎలా ఉంది?’

   ‘అక్సిన్యా……. ఆమె బాగానే ఉంది,దేవుడి దయ వల్ల.’

   ఆ వృద్ధుడు  గట్టిగా దగ్గుతూ అన్నాడు. గ్రెగరికి అతను తన గందరగోళాన్ని దాచే ప్రయత్నంలో అలా ఉన్నాడని అర్థమైంది.

    ‘మీరు నా చిట్టి తాన్యను ఎక్కడ పాతిపెట్టారు?’

   ‘ఆ తోటలో,పోప్లార్ చెట్టు కింద.’

   ‘సరే, ఇంకా నువ్వు నాకు చెప్పాల్సిన విషయాలు ఏమున్నాయి?’

  ‘నన్ను ఈ దగ్గు పట్టుకుంది గ్రెగరి. దీని వల్ల నాకు…..’

  ‘ఇక విషయానికి రా!’

  ‘ప్రతిఒక్కరూ బాగానే ఉన్నారు. యజమాని,ఆయన తాగుతూనే ఉన్నాడు…..ఆ వెధవ,ఏ కారణం లేకుండానే ఎప్పుడూ తాగుతూ ఉంటాడు.’

   ‘మరి అక్సిన్య విషయం ఏమిటి?’

  ‘అక్సిన్య? ఆమె ఇప్పుడు పనిమనిషిగా చేస్తూ ఉంది.’

   ‘నాకు తెలుసు.’

    ‘ఒక సిగరెట్ వెలిగించుకోవచ్చు కదా? నా దగ్గర మంచివి ఉన్నాయి,ఒకటి ఇవ్వనా?’

    ‘నాకు ఇప్పుడు కాల్చాలని లేదు. సరే,ఇక విషయానికి రా లేకపోతే నేను వెళ్ళిపోతాను.నాకు ఏమి అనిపిస్తుంది అంటే…..’ఆ చెక్క మంచం కిర్రుమంటూ ఉంటే ఒక్క క్షణం ఆగి,ఆ వృద్ధుడి వైపు తిరిగి కొనసాగించాడు, ‘నువ్వు నాకేదో చెప్పాలని అనుకుంటున్నావు కానీ దాన్ని నా నుంచి దాచిపెడుతున్నావు అని. ఇక ఆలస్యం చేయకుండా,అదేంటో చెప్పు.’

   ‘నేను చెప్తాను!’

  ‘చెప్పు!’

   ‘నేను చెప్తాను. ఇక నేను ఈ విషయం దాచలేను, గ్రెగరి. ఇది నీకు తెలియకుండా ఉంచడం వల్ల నేనే బాధపడాల్సి వస్తుంది.’

  ‘అయితే చెప్పు మరి’, గ్రెగరి అంటూనే ఆత్మీయంగానే అయినా బలంగా తన చేతిని ఆ వృద్ధుడి భుజం మీద వేశాడు.ఆ వృద్ధుడి మాటల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.

 ‘నువ్వు పాముకు పాలు పోస్తున్నావు!’ ఉన్నట్టుండి,గొంతు పెద్దది చేస్తూ, తన చేతిని వింతగా తిప్పుతూ అన్నాడు. ఒక నిమిషం ఆగాడు. ‘విషం ఉన్న పాము! ఆమె ఆ యెవజెనితో సంబంధం పెట్టుకుంది. దీనికి నువ్వు ఏమంటావు?’

   మాట్లాడుతూ ఉంటే ఒక ఉమ్ము బిందువు అతని బుగ్గల మీద నుండి కిందకు జారింది. దాన్ని అతను చేతితో తుడిచి , చేతిని తన పైజామాతో శుభ్రం చేసుకున్నాడు.

   ‘నీకు ఖచ్చితంగా తెలుసా?’

  ‘నా కళ్ళతో స్వయంగా నేను చూశాను. అతను ఆమె దగ్గరకు ప్రతి రాత్రి వస్తాడు. కావాలంటే నువ్వే ఇప్పుడు వెళ్ళి చూడు,ఇప్పుడు ఆమెతోనే ఉంటాడు.’

  ‘అంటే ఇలా జరుగుతూ ఉందన్నమాట…..’ గ్రెగరి మెటికల శబ్దం వచ్చేంత గట్టిగా పిడికిలి బిగించాడు. చాలా సేపు అలానే తల కిందకు వాల్చుకుని, కొంత స్థిమితపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుర్రాల మెడల్లో ఉండే గంటలు మోగుతున్న శబ్దం లాంటిది అతని చెవుల్లో వినిపిస్తూ ఉంది.

‘స్త్రీ ఒక పిల్లి లాంటిది. ఎవరూ దాన్ని ఆదరిస్తే వారికి దగ్గరైపోతుంది. వాళ్ళను నమ్మవద్దు.!’ సాష్కా అతనితో అన్నాడు.

  అతను గ్రెగరి కోసం ఒక సిగరెట్టు చుట్టి,దాన్ని వెలిగించి అతని చేతిలో పెట్టాడు.

  ‘పొగ కాల్చుకో.’

   గ్రెగరి నోటితో ఊది ఆ సిగరెట్టుని ఆర్పేసి,ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పని వాళ్ళ  క్వార్టర్స్ కిటికీ దగ్గర కాసేపు ఆగాడు, గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎన్నోసార్లు తలుపు తట్టడానికి చేయెత్తి, చేయి విరిగిపోయినట్టుగా ఆగిపోయాడు. మొదటిసారి చిన్నగా తట్టి,తర్వాత కొంతసేపు గోడకు ఆనుకుని నిలబడి,ఆపకుండా కిటికీ మీద కొడుతూనే ఉన్నాడు. ఆ కిటికీ అద్దంలో ఆ రాత్రి విరిగిపోయినట్టు అతనికి అనిపించింది.

      ఆ అద్దంలో నుండే అతనికి అక్సిన్య ముఖం అతనికి కనబడింది,అందులో భయం కూడా అతను గమనించాడు. ఆమె తలుపు తెరిచి,గట్టిగా అరిచింది. గ్రెగరి ఆమెను తన చేతుల్లోకి ఒక్కసారిగా తీసుకుని, ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు.

  ‘ఓ! ఎలా కిటికీ మీద కొడుతూనే ఉన్నావు! నేను నిద్రలో ఉన్నాను…..నువ్వు వస్తావని అనుకోలేదు….నా ప్రియుడా!’

  ‘నాకు చలిగా ఉంది.’

   అతని శరీరం  చలికి వణుకుతున్నట్టు ఉన్నా, అతని చేతులు మాత్రం కాలుతున్నట్టు వేడిగా ఉండటం అక్సిన్య గమనించింది. ఆమె కొంత గందరగోళ పడి, ఆ గదిలో కంగారుగా అటుయిటూ తిరుగుతూ, గుండ్రంగా ఉన్న తన భుజాల మీద ఓ మెత్తటి పట్టు శాలువా వేసుకుని,తలుపు దగ్గర దీపం వెలిగించింది.

   ‘నేను నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు….నువ్వు నాకు ఉత్తరం రాసి కూడా చాలా కాలం అయ్యింది….నేను నువ్వు ఇప్పట్లో రావనుకున్నాను….నీకు నేను రాసిన చివరి ఉత్తరం అందిందా? నేను నీకు తినడానికి ఏమైనా పంపిద్దామనుకున్నాను కానీ,కాస్త వేచి చూద్దామని ఆగాను. అంటే నీవు ఉత్తరం రాసాక పంపిద్దామని అనుకున్నాను,అంతే.’

     ఆమె మధ్యమధ్యలో గ్రెగరి వైపు చూస్తూ ఉందిఅతికించుకున్నట్టు  ఉన్న బలవంతపు నవ్వు ఆమె ఎర్ర్తి పెదాలపై ఉంది.

    గ్రెగరి తన కోటు తీయకుండానే పక్కనే ఉన్న బెంచీ మీద కూర్చున్నాడు. గడ్డం చేయని అతని ముఖం ఎర్రగా ఉంది, టోపీ వల్ల అతని కళ్ళు స్పష్టంగా కనిపించడం లేదు. అతను దాన్ని తీసేద్దామనుకుని,మరలా వెంటనే తన నిర్ణయం మార్చుకుని, జేబులో నుంచి పర్సు బయటకు తీసి, కాగితం కోసం జేబులో వెతికాడు. వెతుకుతూనే ,అక్సిన్య ముఖంలోకి పరీక్షగా చూశాడు.

   అతను లేని కాలంలో ఇంకా అందంగా తయారైనట్టు అతనికి అనిపించింది.

    కొద్దిగా వయసు పైబడినట్టు ఉన్నట్టు లేదు ఇప్పుడు ఆ ముఖం! కేవలం ఆ జుట్టు,కళ్ళు మాత్రమే పూర్వంలాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరినైనా నిగ్రహం కోల్పోయేలా చేయగల ఆ సౌందర్యం మాత్రం తనది కాదు. అయినా తనది ఎలా అవుతుంది,ఆమె ఓ పెద్దమనిషి కొడుక్కి ఉంపుడుకత్తే అయితే.

            ‘నువ్వు…. నువ్వు చూడటానికి పనిమనిషిలా లేవు, యజమానురాలిలా ఉన్నావు.’

  భయపడుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ, బలవంతంగా నవ్వింది.

  తన బట్టల సంచితో సహా తలుపు దగ్గరకు వెళ్ళాడు గ్రెగరి.

  ‘ఎక్కడకు వెళ్తున్నావు?’

   ‘బయటకు, పొగ కాల్చుకోవడానికి.’

   ‘గుడ్లు దాదాపుగా ఉడికిపోయాయి. కాసేపు ఉండొచ్చుగా?’

   ‘ఒక్క నిమిషంలో వచ్చేస్తాను.’

   వాకిట్లోకి వచ్చాక గ్రెగరి ఆ సంచి తెరిచి, అందులో ఒక శుభ్రమైన  చొక్కాలో మడతపెట్ట,అందమైన చేతతో ఉన్న ఒక శాలువాను బయటకు తీసాడు. దానిని అతను జిటోమెర్ లోని ఓ వీధిలో అమ్ముతూ ఉన్న వర్తకుడి నుండి రెండు రూబుల్స్ కి కొన్నాడు. అప్పటి నుండి దానిని తన ప్రాణంగా కాపాడుకున్నాడు. వాళ్ళు మార్చింగ్ చేసేటప్పుడు ఒకసారి దానిని బయటకు తీసి, ఇంద్రధనుస్సు రంగులతో అందంగా ఉన్న దానిని చూసి మురిసిపోతూ, దానిని చూసినప్పుడు అక్సిన్య కళ్ళల్లో కనిపించే సంతోషపు మెరుపును ఊహిస్తూ ఉండేవాడు. ఎంత శోచనీయమైన బహుమతిగా అది ఇప్పుడు మారిపోయింది!డాన్ ఎగువ ప్రాంతంలో ధనవంతుడైన భూస్వామి కొడుకు ఐశ్వర్యంతో అతను ఎలా పోటీ పడగలడు, విరోధం పెంచుకోగలడు? మూగగా తనకే వినిపిస్తున్న తన ఏడుపును గొంతులోనే దిగమింగుకుని, గ్రెగరి ఆ శాలువాను ముక్కలు ముక్కలుగా చేసి, వాటిని దూరంగా మెట్ల కిందకు విసిరేసాడు. ఆ సంచిని కూడా బయట ఉన్న బెంచీ మీదకు విసిరేసి, గది లోపలికి వెళ్ళాడు.

   ‘ఇక్కడ కూర్చో గ్రీషా, నీ బూట్లు తీస్తాను.’

  మొరటు పనులు చేయకపోవడం వల్ల మృదువుగా ఉన్న తన తెల్లటి చేతులతో ఆమె భారీగా ఉన్న గ్రెగరి సైనిక బూట్లను తీసింది, అతని మోకాళ్ళ మీద చేతులు వేసి, గట్టిగా ఏడుపు అందుకుంది. గ్రెగరి ఆమె ఏడుపు ఆపేవరకు ఆగి,’ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చూడటం నీకు సంతోషంగా లేదా?’ అని అడిగాడు.

   తర్వాత కాసేపటికి అతను నిద్ర పోయాడు.

  అక్సిన్య వాకిట్లోకి కోటు కూడా ధరించకుండా ఎముకలు కొరికే చలిలో బయటకు వచ్చి, బలమైన చల్ల గాలులు చెవిలోకి వీస్తూ ఉన్నా, లెక్కచేయకుండా అలాగే ఓ బెంచీని ఆనుకుని నిలబడి పూర్తిగా తెల్లవారేవరకు కదలకుండా ఉండిపోయింది.

   ఆ ఉదయం గ్రెగరి తన కోటు ధరించి, యజమాని ఇంటికి వెళ్ళాడు. వృద్ధ జనరల్ వాకిట్లో నిలబడి ఉన్నాడు, పసుపు రంగు టోపీ, చలికి ఆగే కోటు ధరించి ఉన్నాడు.

  ‘మొత్తానికి వచ్చాడు, సెయింట్ జార్జ్ వీరుడు. నువ్వు నిజమైన మగాడిలా ఎదిగిపోయావు ఇప్పుడు!’

  ఆయన గ్రెగరికి సెల్యూట్ చేసి, తన చేయి ముందుకు చాచాడు.

  ‘ఎక్కువ కాలం ఉండబోతున్నావా?’

   ‘రెండు వారాలు, సార్.’

   ‘నీ కూతురిని పాతిపెట్టాము, బాధాకరమైన ఘటన.’

  గ్రెగరి ఏం మాట్లాడలేదు. తన మేజోళ్ళు పైకి లాక్కుంటూ యెవజిని బయటకు వచ్చాడు.

‘గ్రెగరి? ఎక్కడ నుండి ఊడిపడ్డావు?’

 గ్రెగరి కళ్ళ ముందు అంతా ఒక్కసారిగా శూన్యంగా మారిపోయింది, కానీ అతను నవ్వాడు.

  ‘మాస్కో నుండి, సెలవు మీద.’

  ‘ఓ, అదా విషయం! నీకు కంటిలో గాయమయ్యింది కదా?’

  ‘అవును.’

   ‘నేను దాని గురించి విన్నాను. ఎంత బాగా మారిపోయాడు… కదా నాన్నా?’ అలా అంటూ గ్రెగరిని చూసి తల ఊపి, పశువులశాల వైపుకి తిరిగాడు.

‘నిఖిటిచ్, గుర్రపు బండి తీసుకురా!’

హుందాగా ఉన్న నిఖిటిచ్ బండి సిద్ధం చేసి, ఓ రకమైన వెటకారంతో గ్రెగరి వైపు చూసి, వాకిటి ముందుకు వచ్చాడు. మంచు పట్టి ఉన్న  ఆ నేల ఆ బండి చక్రాలు కిర్రుమన్నాయి.

  ‘సార్, నన్ను ఈ బండి నడపనివ్వండి, పూర్వంలాగా’, గ్రెగరి నవ్వుతూనే అభ్యర్ధనగా అడిగాడు.

వీడికి ఏ అనుమానం రాలేదు, పాపం’, యెవజిని తృప్తిగా నవ్వుకుంటూ ఉంటే అతని కళ్ళల్లో ఓ వెలుగు గ్రెగరి దృష్టిని దాటిపోలేదు.

   ‘సరే అయితే, అలా వెళదాం పదా..’

  ‘ఏంటి ఇది? ఇప్పుడే ఇంటికి వచ్చి అప్పుడే నీ భార్యను వదిలేసి బయటకు వెళ్తున్నావా? నీకు తనతో ఉండాలని లేదా?’ వృద్ధ జనరల్ నవ్వుతూ అడిగాడు.

  గ్రెగరి నవ్వాడు.

 ‘భార్య ఎలుగుబంటి కాదు, అడవుల్లోకి పారిపోదు.’

  అతను బండి ఎక్కి, కొరడాను తన సీటు కింద పెట్టి, పగ్గాలు అందుకున్నాడు.

  ‘నేను నీకు మంచి ప్రయాణం ఉండేలా చూస్తాను, యెవజిని నికోలాయేవిచ్.’

  ‘దానికి తగ్గ బహుమానం నీకు తప్పకుండా ఉంటుంది.’

  ‘మీకు నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అక్సిన్యను ఇలా ఉంచినందుకు… ఆమె పోషణ చూసినందుకు.’

  మాట్లాడుతూ ఉంటే గ్రెగరి స్వరంలో హఠాత్తుగా వచ్చిన మార్పు ఆ లూయిటెంట్ మనసులో అనుమానం కలిగేలా చేసింది. నిజంగానే అతనికి తెలియదా? చెత్త! తెలియకుండా ఎలా ఉంటుంది? అసాధ్యం!అతను వెనక్కి వాలి ఒక సిగరెట్టు వెలిగించుకున్నాడు.

‘మరి ఎక్కువ సేపు కాకుండా చూసుకోండి’, వృద్ధ జనరల్ వెనుక నుండి అరిచాడు.

  మంచుతో తేమ పట్టి ఉన్న దుమ్ము ఆ చక్రాల కింద పడి నలిగి పైకి లేచింది, ఆ బండి ముందుకు వెళ్తూ ఉంటే.

  గ్రెగరి పగ్గాలతో గుర్రాన్ని గట్టిగా అదిలించి, వేగం పెంచాడు. ఒక పావుగంటలో వారు కొండకు అవతల వైపు ఉన్నారు. ఒక్క గెంతుతో గ్రెగరి బండి నుండి కిందకు దూకి, తన సీటు కింద ఉన్న కొరడాను బయటకు తీసాడు.

  ‘ఏంటిది?’  లూయిటెంట్ ముఖం చిట్లించుకుంటూ అడిగాడు.

  ‘ఏంటో చూపిస్తాను నీకు.’

గ్రెగరి కొరడాను బలంగా గాలిలోకి తిప్పి, లూయిటెంట్ ముఖానికి తగిలేలా బలంగా కొట్టాడు. తన పట్టు మార్చుకుంటూ, కొరడాతో గట్టిగా ముఖం మీద, చేతుల మీద అతను తేరుకునే వ్యవధి ఇవ్వకుండా కొట్టాడు. కళ్ళజోడు పగిలిపోయి, దానికి మధ్యలో ఉన్న కొక్కేo అతని కనుబొమ్మల పైన గాయం చేసింది. రక్తం అతని కళ్ళ మీదకు కారుతూ ఉంది. మొదట్లో, లూయిటెంట్ తన చేతులని ముఖానికి అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేసాడు, కానీ ఆ దెబ్బలు ఇంకా బలంగా, వేగంగా అతని మీద పడుతూనే ఉన్నాయి. ప్రవాహంలా కారుతున్న రక్తంతో మారిపోయిన ముఖంతో అతను ఒక్క ఉదుటున పైకి  కోపంతి లేచి,తనను తాను ఆ దెబ్బల నుండి కాపాడుకోవాలనుకున్నాడు, కానీ అప్పటికే గ్రెగరి ఒక అడుగు వెనక్కి వేసి, తన పిడికిలితో అతని కుడి చేతి మీద గట్టి దెబ్బ వేసాడు.

  ‘ఇది అక్సిన్య కోసం!ఇది నా కోసం!ఇది అక్సిన్య కోసం! ఇది నా కోసం!ఇంకొకటి అక్సిన్య కోసం! నా కోసం!’

  ఆ కొరడా గాలిలోకి లేస్తూ మళ్ళీ వేగంగా ఆ లూయిటెంట్ శరీరంపై నాట్యం చేస్తుంది. తరువాత గ్రెగరి బలంగా అతన్ని కిందకు లాగి, రోడ్డు మీద ఇడుస్తూ, తన బలమైన బూట్లతో గట్టిగా తన్నాడు. ఇక కొట్టడానికి ఏ మాత్రం శక్తి మిగలకుండా ఉన్న స్థితిలో అతను వేగంగా ఆ బండి ఎక్కి, గుర్రాన్ని దౌడు తీయించాడు. గేటు దగ్గర, బండి వదిలేసి, ఆ కొరడాను వంచి, ఊడిపోయిన బొత్తాలతో కోటు జారిపోతూ ఉంటే, అతను పని వాళ్ళ క్వార్టర్స్ వైపు పరుగు పెట్టాడు.

గట్టి శబ్దంతో తలుపు తెరవబడటంతో అక్సిన్య వెనక్కి తిరిగి చూసింది.

  ‘లంజా!… కుక్కా!..’

  ఆ కొరడా గాలిలో నుండి ఆమె ముఖం మీద చాలా సార్లు బలంగా తాకింది.

గ్రెగరి రోప్పుతూ వాకిట్లోకి వచ్చి, సాష్కా ప్రశ్నలు పట్టించుకోకుండా, ఎస్టేట్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అక్సిన్య తేరుకొని బయటకు వచ్చి, అతని దగ్గరకు పరుగు పెట్టేసరికే అతను ఒక మైలు దూరం వెళ్ళిపోయాడు.

  బాగా రోప్పుతూ, అతని చేతిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ, అతని పక్కనే నడుస్తూ ఉంది అక్సిన్య.

   ఆ కూడలి లో మైదానం దగ్గర ఉన్న చిన్న మందిరం దగ్గర, ఒక వింతైన స్వరంతో వినపడి వినపడకుండా ఆమె,’గ్రీషా, నన్ను క్షమించు!’ అంది.

  గ్రెగరి పళ్ళు కొరుకుతూ, తన భుజాలు వెనక్కి అనుకుని, తన కోటును సరిచేసుకున్నాడు.

  అక్సిన్య ఆ మందిరం దగ్గరే నిలబడిపోయింది. గ్రెగరి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా, తన వైపు చేతులు చాస్తూ పిలుస్తున్న ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.

    అతను ఆ కొండ దాటి, టాటరస్కయి గ్రామంలో అడుగు పెట్టేటప్పటికి కూడా తన చేతిలో కొరడా ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అతను దాన్ని పక్కన పడేసి, పెద్ద అంగలతో వీధి గుండా నడిచాడు.ఆశ్చర్యంతో ఎన్నో ముఖాలు కిటికీల గుండా చూస్తూ ఉంటే, దారిలో ఎదురైన స్త్రీలు అతన్ని గుర్తు పట్టి, చిరునవ్వుతో పలకరించారు.

తన ఇంటి గేటు దగ్గర, నల్లటి కళ్ళతో అందంగా ఉన్న ఓ స్త్రీ అతనికి ఎదురొచ్చింది. ఆమె బుగ్గల పక్కన తన చేతులతో , ఆమె ముఖం పైకి ఎత్తి ఆమెను దున్యక్షగా గుర్తించాడు.

   పాంటెలి కుంటుకుంటూ వసారా నుండి వాకిట్లోకి వచ్చాడు, ఇంటి లోపల అతని తల్లి పెద్ద ఏడుపు అందుకుంది. గ్రెగరి తన ఎడమ చేత్తో తండ్రిని కౌగలించుకుంటే, అతని కుడి చేతి మీద దున్యక్ష ముద్దు పెట్టుకుంది.

   గ్రెగరి మెట్లు ఎక్కి వాకిట్లో నుండి వసారాలోకి వచ్చాడు. వయసు మళ్ళిన అతని తల్లి కుర్రదానిలా పరిగెత్తి, అతన్ని ఇక ఎక్కడికి వెళ్ళనివ్వను అన్నట్టు గట్టిగా పట్టుకుని, ఏడ్చి, ఏదో గొణిగినా అది అర్థం కాలేదు. ఇంటి లోపల పడిపోకుండా గోడను ఆసరా చేసుకుని నిలబడ్డ నటాల్య పాలిపోయిన ముఖం మీద బాధతో కూడిన నవ్వు తాండవమాడింది, గ్రెగరి ఆమె వైపు చూసేవరకు.

        *   *   *

     ఆ రాత్రి పాంటెలి తన భార్య భుజం మీద చిన్నగా తట్టి, గుసగుసగా,  ‘ఏ శబ్దం చేయకుండా, వెళ్ళి చూడు. వాళ్లిద్దరూ కలిసి పడుకున్నారో లేదో చూడు.’

  ‘నేను వారిద్దరికి కలిపే పక్క వేశాను.’

   ‘వెళ్ళి, ఒకసారి చూడు.’

   ఇలినిచ్నా తలుపు సందులో నుంచి ముందు గదిలోకి చూసి, వెనక్కి వచ్చింది.

  ‘వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు.’

 ‘దేవునికి ధన్యవాదములు! దేవునికి ధన్యవాదములు!’ ఆ వృద్ధుడి మోకాళ్ళ మీద కూర్చుని, ప్రార్థన చేసాడు.

    *    *   *

   నాలుగవ భాగం

అధ్యాయం-1

  1916 వ సంవత్సరం.,అక్టోబర్ నెల, ప్రిపెట్ మార్షెస్ ప్రాంతం. హోరు గాలి,వానతో కలిసిన రాత్రి అది. కందకాలపై ఉన్న బాడవ నేల ఆల్డర్ వృక్షాలతో నిండి ఉంది. ముందంతా ముళ్ళ కంచె. కందకాలలో చల్లగాలులు.ఎవరైనా వస్తున్నారేమో చూడటానికి నిర్మించిన వేదిక అంతా తడిసిపోయింది. అప్పుడప్పుడు మధ్యమధ్యలో అక్కడ ఉన్న నివాసాల నుండి వస్తున్న వెలుతురు. ఒక అధికారి నివాసం ముందు అప్పుడే భారీ విగ్రహంతో ఉన్న ఒక వ్యక్తి ఒక్క నిమిషం ఆగి, తడి చేతివేళ్ళతో తను వేసుకున్న కోటు బటన్లు తడుముతూ, హడావుడిగా వాటిని తీసేసి, ఆ కోటుని ఒకసారి దులిపి,బురద పట్టి ఉన్న బూట్లను అక్కడ ఉన్న ఎండు గడ్డికి తుడిచి, అప్పుడు ఆ తలుపు ముందుకు తోసి,తెరిచి, తల కిందకు వంచి,లోపలికి నడిచాడు.

   వెలిగించి ఉన్న కిరసనాయిలు లాంతరు వెలుగు ఆ కొత్త వ్యక్తి ముఖంగా మెరిసింది. బొత్తాలు పెట్టుకోకుండా ఉన్న జాకెట్ వేసుకుని ఉన్న ఓ అధికారి, తన పడక మీద నుండి ఆవులిస్తూ,లేచాడు.

  ‘వాన పడుతుందా?’

  ‘అవును’,ఆ వ్యక్తి బదులిస్తూ, తన కోటుని,టోపీని తలుపు  దగ్గర ఉన్న మేకుకి తగిలించాడు.’ఇక్కడ వెచ్చగా ఉంది. మీరు బాగా కష్టపడి వేడిమి ఉండేలా చేశారు.’

  ‘మేము ఎప్పటి నుండో స్టవ్ పెట్టే ఉంచాము. ఇక్కడ ఉన్న చెడ్డ విషయం ఏమిటంటే నేల కింద ఉన్న పొర నుండి నీరు లోపలికి చొచ్చుకువస్తాయి. ఈ వర్షాల వల్ల జీవితం నరకప్రాయంగా తయారైంది. నువ్వు ఏమంటావు,బంచక్?’

  జుట్టుతో ఉన్న తన చేతులను రుద్దుకుంటూ, బంచక్ తన భుజాలు వంచి, స్టవ్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నాడు.

   ‘కొన్ని చెక్కలు కిందకు దించండి. మన డగ్ అవుట్ (కందకాలలో నివాసం కోసం తవ్వే ఆకారాన్ని డగ్ అవుట్ అంటారు) బావుంది. పాదరక్షలు లేకుండా నడవొచ్చు. లిస్ట్ నిట్ స్కీ ఎక్కడ ఉన్నాడు?’

  ‘పడుకున్నాడు.’

   ‘ఎప్పటి నుండి?’

   ‘తన రౌండ్లు పూర్తయ్యాక పడుకున్నాడు.’

   ‘ఇది అతన్ని నిద్ర లేపదగిన సమయమేనా?’

   ‘వెళ్ళి లేపు.మేము కాసేపు చదరంగం ఆడుకుంటాము.’

బంచక్ తన కనుబొమ్మల మధ్య ఉన్న తడిని చూపుడు వేలుతో తుడుచుకుంటూ, తల పైకి ఎత్తకుండా, ‘యెవజిని నికోలాయేవిచ్’,అని పిలిచాడు.

‘ఇంకా పడుకునే ఉన్నాను’, నెరిసిన జుట్టుతో ఉన్న ఒక అధికారి బదులిచ్చాడు.

‘యెవజిని నికోలాయేవిచ్!’

  ‘హా,ఏంటి?’ లిస్ట్ నిట్ స్కీ తన మోచేతి మీద నుండి లేస్తూ అడిగాడు.

   ‘చదరంగం ఆడతారా?’

   లిస్ట్ నిట్ స్కీ కాలు కదిలించి, తన మోచేత్తో తన ఛాతిని రుద్దుకున్నాడు.

    వారు మొదటి ఆట ముగించేసరికి ,ఐదవ దళానికి చెందిన ఇద్దరు అధికారులు-మేజర్ కాల్మికోవ్ ,లూయిటెంట్ చుబోవ్ వచ్చారు.

  ‘ఒక వార్త!’ గుమ్మం దగ్గరి నుండే అరుస్తూ అన్నాడు కాల్మికోవ్. ‘రెజిమెంట్ మొత్తాన్ని యుద్ధ భూమి నుండి తొలగించవచ్చు!’

   ‘ఆ వార్త ఎక్కడి నుండి వచ్చింది?’అప్పటికే నెరుస్తున్న జుట్టుతో ఉన్న అధికారి కెప్టెన్ మెర్కులోవ్ నవ్వుతూ అడిగాడు.

   ‘పెట్యా మామా,నన్ను నమ్మవా?’

   ‘నిజం చెప్పాలంటే,నమ్మను.’

   ‘ఆయుధ దళ అధికారి నాకు ఫోన్ లో చెప్పాడు. అతనికి ఎలా తెలుసంటారా? అతనికి తెలుసు ఎందుకంటే  విభాగ ప్రధానకార్యాలయం నుండి అతను నిన్నే వచ్చాడు.’

  ‘అప్పుడు నేను హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేస్తాను.’

  చుబోవ్ సంతోషంగా నవ్వుతూ , స్నానం చేస్తున్న దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉన్నాడు.

 ‘ఇక్కడ మనకు కావాల్సింది ఒక బాయిలర్ అంతే,ఇక్కడ మనకు కావాల్సినన్ని నీరు ఉన్నాయి.’

  ‘నువ్వు ఇంకా తడిగానే ఉన్నావు,అబ్బాయి’, కాల్మికోవ్ అక్కడ దుంగలతో ఏర్పాటు చేసిన గోడను, నేలను చూస్తూ అన్నాడు.

  ‘బయటే ఒక పెద్ద సరస్సు ఉంది.’

   ‘నువ్వు ఈ వాతావరణంలో ఆ సరస్సు దారి గుండా క్షేమంగా వచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి’, బంచక్ ఆ సంభాషణలో భాగమవుతూ అన్నాడు.

   ‘నేల గట్టిగా ఉంటే,మనం దాడి చేయవచ్చు, అయినప్పటికీ మనం ఇక్కడ ఒక పెట్టె తుటాలు ఒక వారంలో పూర్తి చేస్తాము.’

   ‘ ఈ నరకకూపంలో పడి ఉండటం కంటే దాడి చేయడమే మేలు.’

    పెట్యా మామా, వాళ్ళు కొసాక్కులను ఉంచుతున్నది అందుకు కాదు. కొసాక్కులు యుద్ధంలో అంతరించిపోవడం వారికి ఇష్టం లేదు. నీకు అది తెలియానట్లు నటించకు.’

  ‘అయితే ఎందుకు ఇలా ఉంచుతున్నారో నీకు తెలుసా?’

   ‘సరైన సమయం వచ్చినప్పుడు, ప్రభుత్వానికి సమస్య  వచ్చినప్పుడు,కొసాక్కుల సాయం తీసుకోవడానికి.’

  ‘అదంతా చెత్త’, కాల్మికోవ్ ఆ మాటల్ని కొట్టిపారేస్తూ అన్నాడు.

  ‘ఎందుకలా?’

   ‘ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి.’

  ‘ఓ, కాల్మికోవ్, నిజాన్ని ఒప్పుకోకుండా ఉండటం ఎందుకు?’

  ‘ఏ నిజం?’

  ‘ఇది అందరికి తెలిసిందే.నీకు మాత్రమే తెలియనట్టు ఎందుకు నటిస్తావు?’

   ‘దయచేసి అందరూ శ్రద్ధగా వినండి!’చుబోవ్ ఆ వాతావరణాన్ని తేలిక బరుస్తూ బంచక్ వైపు చూపిస్తూ, ‘కార్నెట్ బంచక్ ఇప్పుడు అతను  కల గన్న ప్రజాస్వామ్య పుస్తకం చదువుతాడు’, అన్నాడు.

   ‘నీకు ఇది హాస్యంగా ఉందా?’బంచక్ పొడిగా నవ్వుతూ, అక్కడి నుండి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ‘సరే, ఇక్కడితో వదిలేయండి.ప్రతి మనిషికి సొంత అభిప్రాయాలుంటాయి. నేను చెప్పేది ఏమిటంటే పోయిన సంవత్సరం మధ్య నుండి మనం ఏమి చూడలేదు. ఈ వ్యూహ యుద్ధం మొదలైనప్పటి నుండి, కొసాక్కులందరూ  క్షేమంగా ఈ మూలల్లో ఉన్నారు. సరైన సమయం వచ్చేవరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది.’

   ‘ఆ తర్వాత?’ లిస్ట్ నిట్ స్కీ చదరంగ పావు కదిలిస్తూ అడిగాడు.

   ‘అప్పుడు, ఎప్పుడైతే యుద్ధ భూమిలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయో, ఎప్పుడైతే అనివార్యమవుతుందో, ప్రజలు యుద్ధం అంటే విసిగి పోయి ఉంటారో,ఎప్పుడైతే విప్లవాలు పెరిగిపోతాయో, అప్పుడు వాళ్ళు ఆ తిరుగుబాటును అంతం చేయడానికి కొసాక్కులను తీసుకువెళ్తారు. ఈ అత్యవసర పరిస్థితి కోసమే ప్రభుత్వం కొసాక్కులను ఇలా క్షేమ ప్రాంతంలో ఉంచుతున్నది. ఎప్పుడైతే సమయం వస్తుందో,అప్పుడు ఆ  తిరుగుబాట్లను అంతం చేయడానికి మనల్ని పిలుస్తారు.’

  ‘నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీ ఊహలన్నీ సత్యానికి దూరంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే.అసలు ఏం జరగబోతుందో ఎవరూ ఊహించలేరు. అసలు నీకు భవిష్యత్తులో జరగబోయే ఈ విప్లవాల గురించి ఎలా తెలుసు? మనం ఇంకో ఊహ కూడా చేద్దాము-ఒకవేళ జర్మనీ ని మన వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడించి, ఈ యుద్ధాన్ని అద్భుతంగా ముగిస్తే,అప్పుడు నువ్వు కొసాక్కులకు ఏ పాత్ర ఇస్తావు?’

   బంచక్ చిరునవ్వు నవ్వాడు.

   ‘అసలు అలా జరుగుతుందని ఊహించలేము, ఇది జరిగే ఊహ కాదు.’

‘అక్కడ యుద్ధం తీవ్రంగా జరుగుతుంది…’

‘ఇంకా తీవ్రంగా మారుతుంది’, బంచక్ గా నమ్మకంగా అన్నాడు.

‘నువ్వు సెలవు నుండి ఎప్పుడు తిరిగి వచ్చావు?’కాల్మకోవ్ అడిగాడు.

‘మొన్న వచ్చాను.’

  బంచక్ తన పెదవులు గుండ్రంగా చేసి, నాలుక గుండా పొగ బయటకు వదులుతూ,సిగరెట్ పీకను కింద పడేశాడు.

  ‘ఎక్కడున్నావు?’

  ‘పెట్రోగ్రాడ్ లో.’

  ‘సరే,అయితే రాజధాని ఎలా ఉంది? చాలా బాగుంది కదా? ఒక్క వారం అక్కడ ఉండే అవకాశం కోసం నేను దేనినైనా వదులుకుంటాను!’

  ‘అంతా ఏం బాగాలేదు’, బంచక్ జాగ్రత్తగా పదాలు సరిచూసుకుంటూ కొనసాగించాడు.

‘బ్రెడ్డు కొరత ఉంది. శ్రామిక వర్గాలు ఉండే జిల్లాల్లో ఆకలి,అసంతృప్తి  రాజ్యమేలుతున్నాయి. విప్లవం నిశ్శబ్దంగా వృద్ధి చెందుతూ ఉంది.’

 ‘మనం ఈ యుద్ధం నుండి బయట పడేసరికి ఊహించనిదే ఏదో జరిగేలా ఉంది. మీరేమనుకుంటున్నారు?’ మెర్కులోవ్ చుట్టూ ఉన్న అధికారుల వైపు చూస్తూ అడిగాడు.

 ‘రష్యాకు,జపాన్ కు మధ్య జరిగిన యుద్ధం వల్లే 1905 లో విప్లవం వచ్చింది.అలాగే ఈ యుద్ధం కూడా ఓ కొత్త విప్లవానికి నాంది అవుతుంది. విప్లవం మాత్రమే కాదు,ప్రచ్చన్న యుద్ధం కూడా తలెత్తవచ్చు.’

   లిస్ట్ నిట్ స్కీ బంచక్ చెప్పింది విని, అతన్ని అడ్డుకోవడానికన్నట్టు సంజ్ఞ చేసి, లేచి అటూ ఇటూ తిరగసాగాడు. అతను మాట్లాడేటప్పుడు అణచుకున్న కోపం అతని స్వరంలో వినిపించింది.

    ‘నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మనలో ఓ రకమైన  …’-వంగి ఉన్న బంచక్ భుజాల వైపు చూస్తూ మరలా కొనసాగించాడు, ‘వ్యక్తి  ఉన్నారు. నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే మాతృభూమి పట్ల,యుద్ధం పట్ల అతని  దృక్పథం గురించి నాకు అర్థం కావడం లేదు. …ఒక సంభాషణలో తనకు తానే పరోక్షంగా మనం యుద్ధంలో ఓడిపోతే తనకు బావుంటుంది అన్నట్టు అన్నాడు.నాకు నువ్వు సరిగ్గా అర్ధమయ్యావా,బంచక్?’

‘అవును,నేను మనం ఓడిపోతే బావుండనే అనుకుంటున్నాను.’

   ‘అదే ఎందుకు? ఒక వ్యక్తికి రాజకీయ అభిప్రాయాలూ ఏ రకంగా ఉన్నాసరే,సొంత దేశం ఓటమి కోరుకోవడం …నిజంగా దేశద్రోహం. మర్యాద కల ఏ మనిషికైనా అది అవమానకర చర్య!’

  ‘డ్యూమా లో ఉన్న బొల్షివిక్ బృందం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ ఓటమికి సహకరిస్తూ ఉంది!’మెర్కులోవ్ మధ్యలో అడ్డుకుంటూ అన్నాడు.

  ‘నువ్వు వాళ్ళను సమర్థిస్తావా,బంచక్?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.

  ‘నేను ఓటమిని కోరుకుంటే తప్పకుండా సమర్ధిస్తాను. ఆర్ ఎస్ డి ఎల్ పి సభ్యుడినై, ఒక బొల్షివిక్ ను అయ్యి ఉండి, మా ప్రజాస్వామిక పార్టీ గురించి దాని లక్ష్యాలు పంచుకోకుండా ఉంటే చిత్రంగా ఉంటుంది. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, యెవజిని లిస్ట్ నిట్ స్కీ, మీ లాంటి విద్యావంతులు కూడా రాజకీయాల గురించి ఏమి తెలుసుకోకుండా ఉండటం.’

  ‘వీటన్నిటిని పక్కన పెడితే, రాజ్యానికి కట్టుబడిన ఒక సైనికుడిని నేను. ఈ ‘సామాజిక బృందాల’ పేరు వింటేనే నాకు కోపం వస్తుంది.’

  బంచక్ చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ, ‘వీటన్నిటిని పక్కన పెడితే నువ్వు ఒక పనికిమాలిన వెధవ్వి. ఏదో నిన్ను నువ్వు గొప్పవాడిగా భావించుకుంటూ తృప్తిపడుతున్నవాడివ’,తనలో తానే అనుకున్నాడు.

   ‘అల్లా తప్ప మరో దైవం లేదు…’

  ‘సైన్యంలో జీవితం గడపటం అద్భుతమైన విషయం. మనందరం రాజకీయ విషయాలకు దూరంగా ఉంటూ,అవి మనకు సంబంధించని విషయలుగా వ్యవహరించాలి’, మెర్కులోవ్ మధ్యలో కల్పించుకుంటూ  అన్నాడు.

     మేజర్ కాల్మికోవ్ కూర్చుని తన పొడుగైన గడ్డాన్ని సవరించుకుంటూ ఉన్నాడు,ఆ మంగోలియన్ కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు. చుబోవ్ తన పడక మీద పడుకుని ఆ సంభాషణ వింటూ, గోడకు తగిలించిన చిత్రం వైపు చూస్తూ ఉన్నాడు.ఆ చిత్రం గీసింది మెర్కులోవ్. అర్ధనగ్నంగా ఉన్న ఒక స్త్రీ,ఆమె ముఖం మాగ్డాలేన్ లా ఉంది. ఆమె అచ్చాదన లేని తన రొమ్ము వైపు చూస్తూ, చిలిపిగా నవ్వుతూ ఉంది. తన ఎడమ చేతి రెండు వేళ్ళతో ఆమె గోధుమ రంగులో ఉన్న చనుమొనను ఎత్తింది,నవ్వుతున్న ఆమె కళ్ళల్లో ఒక కాంతి. కింద పడిపోకుండా ఉండటానికి ఆమె ఒక భుజం కొద్దిగా ఎత్తింది,మెడ దగ్గర కనిపిస్తున్న ఎముకల మీద వెలుతురు పడుతూ ఉంది. ఆ చిత్రంలో ఆమె నిలబడిన తీరులో  ఏదో తెలియని రాజసం,సత్యం ఉన్నట్టు ఉంది,ఆ చిత్రానికి ఉన్న రంగులు కూడా అద్భుతంగా ఉన్నాయి. చుబోవ్ ప్రశంసాపూర్వకంగా దాని వైపే చూస్తూ ఉన్నాడు, అప్పుడు మాట్లాడిన మాటలేవి అతని మనసుకి ఇంకలేదు.

  ‘ఎంత బావుంది!’ అతను అబ్బురంతో ఆ చిత్రపటం నుండి ముఖం పక్కకు తిప్పుతూ అన్నాడు,దురదృష్టవశాత్తూ అదే క్షణంలో బంచక్, ‘…..ఈ రాచరికం,జార్ తప్పకుండా ఏదో ఒక రోజు నాశనమవుతారు,దానిలో ఏ సందేహం లేదు’,అన్నాడు.

  లిస్ట్ నిట్ స్కీ సిగరెట్టు చూడుతూ, వెటకారంగా నవ్వుతూ, బంచక్ వైపు కాసేపు, చుబోవ్ వైపు కాసేపు చూశాడు.

   ‘మెర్కులోవ్,నువ్వు గొప్ప చిత్రకారుడివి!’ చుబోవ్ కన్ను కొడుతూ అన్నాడు.

   ‘అదేం లేదు,ఏదో వ్యాపకం అంతే..’

      ‘మనం కొన్ని వందల, వేల సైనికులను కోల్పోవచ్చు కానీ ఈ భూమిలో పుట్టిన ప్రతివాడికి  ఈ పితృభూమిని శత్రువుల నుండి కాపాడాల్సిన బాధ్యత ఉంది.’లిస్ట్ నిట్ స్కీ సిగరెట్టు వెలిగించుకుని, చేతి రుమాలుతో కళ్ళద్దాలను తుడుచుకుంటూ,బంచక్ వైపు చూస్తూ అన్నాడు.

  ‘ఇక్కడ ఉన్న శ్రామికులకు పితృభూమి లేదు’,’భూమి’అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు బంచక్. ‘ఆ మార్క్స్ మాటల్లో లోతైన సత్యం ఉంది. మాకు పితృభూమి ఇప్పుడు లేదు,ఇంతకుముందు లేదు. దేశభక్తి అనేది మీ శ్వాసలో జీర్ణించుకుపోయిన అంశం! మిమ్మల్ని పెంచి,పోషించింది ఈ శాపగ్రస్థ భూమి,కానీ మేము ….కలుపుమొక్కల్లా,చెద పురుగుల్లా ఉన్నాము ఇక్కడ……మీరు,మేము కలిసి ఇక్కడ కలిసి ఉండలేము.’

  తన పక్క జేబులో నుండి కొన్ని కాగితాలు బయటకు తీసి, తన వీపు లిస్ట్ నిట్ స్కీ కి కనబడేలా నిలబడి,కాగితాల్లో తనకు కావాల్సింది వెతుకుతూ, పక్కనే ఉన్న బల్ల వద్దకు వెళ్ళి, ఒక వార్తాపత్రికను అక్కడ పరిచాడు.

  ‘మీరు వింటారా?’ అతను లిస్ట్ నిట్ స్కీ వైపు తిరుగుతూ అన్నాడు.

  ‘దేని గురించి?’

   ‘యుద్ధం గురించిన రాసిన ఒక వ్యాసం. దానిలో ఒక భాగం నేను చదువుతాను. నేను మీలా విద్యావంతుడిని కాదు,సరిగ్గా చదవలేకపోవచ్చు. కానీ మీకు అంతా అర్ధమవుతుందనే అనుకుంటున్నాను.’

  ‘   “సోషలిస్టు ఉద్యమం పాత ఆలోచనలతో కఠినంగా ఉన్న పితృభూమి చట్రంలో అమరలేకపోయింది. ఇది ఒక కొత్త మనుషుల సమూహాలను తయారు చేస్తుంది. దీని ద్వారా ప్రతి దేశానికి చెందిన శ్రామిక వర్గ నిత్యావసరాలు,ఆశయాలు,లక్ష్యాలు అంతర్జాతీయ సమైక్యతతో నెరవేరుతాయి. ఇది జరగాలంటే ప్రస్తుతం ఉన్న అడ్డంకులు కూల్చి వేయబడాలి. శ్రామికులని విడగొట్టి,’పితృభూమి రక్షణ కోసం’అనే కల్పిత మరియు కృత్రిమమైన అంశంతో తమ కోసం పని చేసేలా చేసే ఈ బూర్జువా వ్యవస్థకు రాజకీయ అవగాహన ఉన్న శ్రామిక వర్గం అన్ని దేశాల్లోన్ని శ్రామిక వర్గాలతో కలిసి, ఈ బూర్జువా వ్యవస్థను కూలదోసి బదులు చెప్తారు.

   ‘  ” ఈ బూర్జువా వ్యవస్థ సామ్రాజ్యవాద దోపిడిని ‘జాతీయ యుద్ధం’గా చిత్రీకరించి శ్రామికులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది.’ శ్రామిక వర్గం ఈ మోసాన్ని గుర్తించి, ఈ సామ్రాజ్యవాద యుద్ధం ప్రచ్చన్న యుద్ధంగా మారాలని ప్రకటించింది. స్టట్ గార్ట్ మరియు బాసిల్ తీర్మానాల్లో ఈ నినాదమే ప్రకటించారు. ఇది యుద్ధాన్ని ఉద్దేశించింది కాదు,కానీ ఈ యుద్ధం మాత్రం ప్రత్యేకంగా ‘పితృభూమి రక్షణ’కోసం కాకుండా ‘పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం’ కొరకు , యుద్ధం సృష్టించిన నష్టాలను మూలం చేసుకుని,పారిస్ కమ్యూన్ ను నిదర్శనంగా తీసుకుని సృష్టించబడింది. ఇది మొదట దేశాల మధ్య యుద్ధంగా మొదలై తర్వాత ప్రచ్చన్న యుద్ధంగా మారే దశకు ఉదాహరణ. నిజం చెప్పాలంటే, ఇటువంటి మార్పు అంత సులభం కాదు, చిటికెలో జరిగిపోయే పని కూడా కాదు. కానీ ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ వల్ల సంభవిస్తున్న ప్రమాదాల వల్ల ఈ మార్పు అనివార్యం ,మరి ముఖ్యంగా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ అంతం కోసం దీని ఆవశ్యకత మరింతగా ఉంది. ఈ దిశలో,కేవలం ఈ దిశలో మాత్రమే సోషలిస్టులు తమ కార్యకలాపాలు నిర్వహించాలి. కనుక ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ప్రోత్సహించడమో లేక తమ సొంత దేశాల్లో వర్గోన్మాదాన్ని రెచ్చగొట్టడమో వారి పని కాదు. కానీ ఈ బూర్జువా వ్యవస్థలో ఉన్న అటువంటి వర్గోన్మాదానికి వ్యతిరేకంగా కేవలం న్యాయస్థానాలనే నమ్ముకోకుండా పోరాడాలి ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థలు కూడా ఈ బూర్జువా వ్యవస్థకే తల ఒగ్గి ఉంటాయి. ఇటువంటి ఆలోచనా దృక్పథం వల్లే ప్రచ్చన్న యుద్ధం ఏదో ఒక సందర్భంలో ఈ యూరోపియన్ ఖండంలో సంభవిస్తుంది. క్రైస్తవ బోధకులు బోధించే రకంగా (వీరు దేశ భక్తి,మానవత్వం,శాంతి గురించి బోధిస్తారు కానీ వీరు కన్నా గొప్ప అవకాశవాదులు ఎవరూ ఉండరు) యుద్ధం అనేది ప్రమాదమో లేక పాపమో కాదు,పెట్టుబడిదారి వ్యవస్థలో సంభవించే ఒక దశ మాత్రమే,అది న్యాయబద్ధమైంది కూడా. ఇప్పుడు యుద్ధం అనేది ప్రజా యుద్ధంగా మారింది. ఈ మారిన కొత్త సత్యం వల్ల మనమంతా ఈ మారే కొత్త వర్గంతో కలిసిపోవాలి ఎందుకంటే యుద్ధ సమయంలో వ్యక్తుల్లో ఉండే ఈ ఆలోచనలు యుద్ధాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. యుద్ధంలో బలవంతంగా పాల్గొనడానికి వ్యతిరేకత బలపడొచ్చు. యుద్ధానికి నిరసనగా ఉద్యమాలు జరగొచ్చు. ఇదంతా ఇప్పుడు వినడానికి పనికిమాలిన విషయంగా అనిపించవచ్చు,ఎందుకంటే సాయుధ వ్యవస్థతో బలంగా ఉన్న బూర్జువా వ్యవస్థతో నిరాయుధులుగా పోరాడటం ఒక పిరికి కలే కావచ్చు ,ఎన్నో అంతర్యుద్ధాలు   జరగకుండా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ నాశనం అవుతుందని అనుకోవడం సాహసమే కావచ్చు. కానీ ఈ సమయంలో ప్రతి సోషలిస్టుకి ఈ పోరాటాన్ని ఉదృతం చేయాల్సిన బాధ్యత ఉంది.’శాంతి కోసం ఏమైనా చేయాలి’ అనే పవిత్ర ముసుగుతో ఉండే పనికిమాలిన భావాలని వ్యతిరేకించాలి. ఇక ప్రచ్చన్న యుద్ధ శంఖం పూరించండి. సామ్రాజ్యవాదం యూరోపియన్ సంస్కృతితో జూదమాడుతుంది. ఎన్నో విప్లవాలు ఊపిరి పోసుకోకపోతే ఇలాంటి యుద్ధాలు ఎన్నో సంభవిస్తాయి. ఇదే ‘ఆఖరి యుద్ధం’అనే మాట కేవలం బూర్జువా వ్యవస్థ సృష్టించే భ్రమ అంతే…”

    అప్పటివరకూ నెమ్మదిగా,ప్రశాంతంగా చదువుతూ ఉన్న బంచక్ చివరి వాక్యాల దగ్గరకు వచ్చేసరికి గొంతు పెంచి,అప్పటికే తన వైపే దృష్టి నిలిపిన అందరినీ చూస్తూ ఒక్క క్షణం ఆగి మరలా కొనసాగించాడు,”ఈ రోజు కాకపోతే రేపు, ఈ యుద్ధంలో కాకపోతే,తర్వాత వచ్చే దానిలో, శ్రామిక వర్గం తప్పక అంతర్యుద్ధంతో వందల వేల సంఖ్యలో కార్మికులనే కాదు,ఈ బూర్జువా వ్యవస్థ సృష్టించే వర్గోన్మాదంతోనూ,యుద్ధాలు సృష్టించే విధ్వంసాలతోనూ  విసిగిపోయిన లక్షల మంది సామాన్య జనం ఎవరైతే బూర్జువా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారో వారు  కూడా ఒక్కటై,జాగురుకులై, తమ దేశంలోని మరియు ప్రపంచంలోని బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకటవుతారు…”

   కాసేపు మౌనం రాజ్యమేలింది. “అది రష్యాలో అచ్చు వేయలేదు కదా?’మెర్కులోవ్ అడిగాడు తర్వాత.

‘లేదు.’

  ‘మరి ఎక్కడ?’

  ‘జెనీవాలో. 1914 లో ప్రచురించబడిన సోషల్ డెమోక్రాట్ పత్రిక 33 వ సంచికలోది.’

  ‘ఎవరు రాశారు?’

 ‘లెనిన్.’

  ‘అతను …..బొల్షివిక్కుల నాయకుడు కదా?’

బంచక్ ఆ ప్రశ్నకు సమాధానమివ్వలేదు;ఆ పత్రికను మడత పెడుతూ ఉంటే అతని చేతి వేళ్ళు వణుకుతూ ఉన్నాయి. మెర్కులోవ్ నెరిసిన తన జుట్టును సరిచేసుకుంటూ,ఇతరుల వైపు చూడకుండా, “ఇతగాడికి గొప్పగా ఒప్పించే శక్తి ఉంది……ఒక్కసారి ఆగిపోయి ఇంకోలా ఆలోచించేలా చేస్తున్నాయి ఈ విషయాలు…”అన్నాడు.

  వెంటనే లిస్ట్ నిట్ స్కీ కోపంతో ఆ సంభాషణను అందుకున్నాడు. ఆ కోపంతోనే అతను తన చొక్కా పై బొత్తాన్ని పెట్టుకుని,వేగంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే,అతని మాటలు సంచిలో నుండి కిందకు పడే బఠానీల్లా ఉన్నాయి.

  ‘ఈ వ్యాసం రాయడం అనేది ఒక జాలి గొలిపే ప్రయత్నం. ఈ వ్యాసం రాసిన వాడిని దేశ సరిహద్దుల నుండి బహిష్కరిస్తే,అతను ఏదో చరిత్రను తారుమారు చేద్దామనే వెర్రి ఆలోచనతో ఉన్నాడు. వాస్తవంలో ఇటువంటి జోస్యాల వల్ల విజయం సిద్ధించదు,ముఖ్యంగా ఇటువంటివి అయితే జరిగే అవకాశమే లేదు. నిజమైన రష్యన్ ఎవరైనా సరే ఇలాంటి ఉన్మాద రాతలను ద్వేషిస్తాడు. పనికిమాలిన రాతలు!దేశాల మధ్య యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలట! ఎంత అసహ్యంగా ఉంది ఆ ఆలోచన!’

    లిస్ట్ నిట్ స్కీ బంచక్ వైపు అసహ్యంతో చూశాడు. బంచక్ తల వంచుకుని, ఆ కాగితాల్లో ఏదో వెతుకుతూ ఉన్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. లిస్ట్ నిట్ స్కీ తన వాక్యాలను విచ్చు కత్తుల్లా వదిలినా, అతని సన్నటి స్వరం వల్ల  వాటి ప్రభావం బలంగా లేదు.

  ‘బంచక్!’కాల్మికోవ్ గట్టిగా పిలిచాడు. ‘లిస్ట్ నిట్ స్కీ, నువ్వు ఒక్క నిమిషం ఆగు!…బంచక్,నీకు వినబడుతుందా? …సరే అయితే, ఈ యుద్ధం కాస్త అంతర్యుద్ధంగా మారుతుందని అనుకుందాము. అప్పుడు ఏం జరుగుతుంది? సరే,మీరు ఈ రాచరిక వ్యవస్థను కూలదోస్తారు. అప్పుడు మీకు ఎలాంటి ప్రభుత్వం కావాలి?ఎటువంటి అధికారం కావాలి?’

‘శ్రామిక వర్గానికి నిజమైన అధికారం ఉండాలి.’

  ‘అంటే పార్లమెంటా?’

‘మీరు అంత లోతుగా ఆలోచించలేకపోతున్నారు’, బంచక్ నవ్వుతూ అన్నాడు.

‘అయితే ఏంటి?’

 ‘శ్రామిక వర్గానికే అధికారం ఉండాలి.’

 ‘ఓ,అంతేనా? మరి అయితే సాధారణ రైతులు,మేధావులు సంగతి ఏమిటి? వారి పాత్ర ఏమిటి?’

  ‘రైతాంగం మమ్మల్ని అనుసరిస్తుంది. కొందరు మేధావులు కూడా అంతే. ఇక మిగిలిన వారి విషయానికి వస్తే…మేము ఇలా చేస్తాము వాళ్ళని!’ అప్పటి వరకు తన చేతిలో ఉన్న కాగిగాన్ని గట్టిగా చేత్తో ముక్కలు చేసి, నోట్లో వేసుకుని నములుతూ, ‘ఇది మేము చేసేది వాళ్ళతో!’అన్నాడు.

‘నువ్వు చాలా ఎత్తుకి ఎగురుతున్నావు’, లిస్ట్ నిట్ స్కీ వెటకారంగా అన్నాడు.

‘కిందకు కూడా అదే వైభవంతో నిలబడగలము’, బంచక్ బదులిచ్చాడు.

‘కిందకు వచ్చే ముందు దెబ్బలు తగలకుండా అక్కడ గడ్డి పరుచుకుంటే బావుంటుంది.’

  ‘అసలు నువ్వు ఎందుకు ఈ యుద్ధంలో పాల్గొంటున్నావు? అసలు నీ అభిపాయాలకు విరుద్ధమైన చోటు కదా ఇది? ఎంత విచిత్రంగా ఉంది!ఈ మనిషి యుద్ధాన్ని వ్యతిరేకిస్తాడు,అది తన వారి ధ్వంసానికి ……..వారిని ఏమంటారు? -అతని వర్గ సోదరులు,మళ్ళీ హఠాత్తుగా ఇతను ఒక అధికారిగా మారిపోతాడు!’

  కాల్మికోవ్ తన బూట్లను భూమి కేసి కొడుతూ,నవ్వుతూ అన్నాడు.

  ‘ఎంతమంది జర్మన్ కార్మికులను నువ్వు, నీ ఆయుధ దళ అధికారులు అంతం చేశారు?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.

  బంచక్ ఆ కాగితాలలో ఏదో వెతుకుతూ, బల్ల మీద చేతులు ఆనిస్తూ, ‘నేను ఎంతమంది జర్మన్ కార్మికులను కాల్చి చంపాను ….అది ఒక ప్రశ్న. నేను స్వచ్చందంగా ఇందులోకి వచ్చాను ఎందుకంటే ఎలాగూ వచ్చి తీరాలి కనుక. ఈ కందకాల్లో నేను నేర్చుకున్నది తప్పక భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. …అవును,భవిష్యత్తులో తప్పక ఉపయోగపడుతుంది. వినండి ఇక్కడ ఏమి రాసుందో. “నేటి సైన్యాన్నే తీసుకోండి. ఒక పకడ్బందీ వ్యవస్థకు అది ఒక నిదర్శనం. ఈ వ్యవస్థ ఎందుకింత కట్టుదిట్టంగా ఉందంటే సందర్భానికి తగ్గట్టు మార్పులు చేసుకునే వీలు ఉంటుంది కనుక. దానితో పాటు లక్షల మందికి ఒకే ఆశయం ఉండేలా చేయగలుగుతుంది కూడా. ఈ లక్షల మంది నేడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ ఇళ్ళల్లో ఉన్నారు, రేపు ఆజ్ఞ అందుకోగానే వీరంతా వెంటనే తమ కర్తవ్యంలో భాగంగా వెంటనే యుద్ధంలో భాగమైపోతారు. ఈ రోజు వాళ్ళు కందకాల్లో ఉంటారు ,ఇదే నెలల తరబడి జరగొచ్చు; రేపు మళ్ళీ ఇంకో రకమైన యుద్ధ వ్యూహంతో దాడి కూడా చేస్తారు . ఈ రోజు వాళ్ళు తూటాలు మరియు ఆయుధాల నుండి తమను తాము రక్షించుకోవడానికి అద్భుతాలు చేస్తారు. మరలా రేపు యుద్ధంలో ముఖాముఖీ ముష్టి యుద్ధం కూడా చేస్తారు. ఈ రోజు బొగ్గు గనుల్లో దాక్కున్న వాళ్ళే రేపు గాలిలో ఎగిరే ఆయుధాల్లో ఉన్న వారి మీద కూడా యుద్ధం చేస్తారు. ఇలా ఒకే లక్ష్యంతో సాగేవారు లక్షల్లో ఉన్నప్పుడూ తమ ప్రవర్తనను,భాషను, ప్రాంతాన్ని,కార్యకలాపాలను ,ఆయుధాలను,వ్యూహాలను మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మార్చుకుంటారు.ఇదే సమర్ధవంతమైన వ్యవస్థ అంటే.

  ” ఇదే బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రామిక వర్గానికి కూడా వర్తిస్తుంది.కానీ ఇప్పుడు విప్లవం ఊపిరి పోసుకునే పరిస్థితి లేదు….”

  ‘ ‘పరిస్థితి’  అంటే?’ చుబోవ్ మధ్యలోనే అడ్డుకుంటూ అడిగాడు.

   అపుడే నిద్ర లో నుండి లేచిన వాడిలా,బొటనవేలుతో నుదురు రుద్దుకుంటూ,ప్రశ్న అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాడు.

  ‘నేను నిన్ను ‘ఆ పరిస్థితి ‘అంటే ఏంటని అడిగాను.’

  ‘చూడండి,నాకు మీరు అడిగింది అర్ధమైంది. కానీ నేను దాన్ని సరిగ్గా వివరించలేను….’ బంచక్ ముఖంలో అమాయకమైన చిరునవ్వు మెరిసింది.గంభీరంగా ఉండే ఆ ముఖంలో ఆ నవ్వు విచిత్రంగా ఉంది. ఒక పరిస్థితి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది,దాన్ని ఏవి ప్రభావితం చేస్తాయి అనేగా.అంతే కదా?’

  లిస్ట్ నిట్ స్కీ చిన్నగా అవునన్నట్టు తల ఊపాడు.

  ‘చదువు.’

  “ఈ రోజు ఉద్యమం ఊపిరి పోసుకునే పరిస్థితి లేదు,శ్రామిక వర్గంలోనూ,సామాన్య జనంలోనూ వారికి అశాంతిని,ఆందోళనను కలిగించే సందర్భాలు లేవు. ఈ రోజు నీ చేతికో బాలెట్ పేపర్ ఇస్తారు-దాన్ని తీసుకో, దాన్ని నీ శత్రువులకు వ్యతిరేకంగా ఎలా వాడాలో నేర్చుకో,అంతే తప్ప జయలుకి వెళ్ళాల్సి వస్తుందన్న భయంతో పార్లమెంటులో సీటు కోసం కక్కుర్తి పడేవారిలా వ్యవహరించకు. రేపన్న రోజున అదే బాలెట్ కాగితాన్ని నీ చేతి నుండి లాక్కుని ఒక తుపాకీనో లేకపోతే విధ్వంసాన్ని సృష్టించాడనికి ఏదో ఒక ఆయుధాన్ని నీ చేతిలో పెట్టొచ్చు, యుద్ధంతో భయపడుతూ పిరికి ఏడుపులు ఏడ్చే వారిని పట్టించుకోకు;ఈ ప్రపంచంలో ఇంకా ఎంతో చెడు మిగిలి ఉంది,దాని నుండి శ్రామిక వర్గానికి విముక్తి కలగాలంటే ఖడ్గమో,అగ్నో తప్పక అవసరం అవుతాయి. కోపం,నిస్సహాయత శ్రామిక వర్గంలో బలపడి, విప్లవం పుట్టే పరిస్థితి ఉండే సందర్భం వచ్చినప్పుడు, కొత్త సంస్థలను స్థాపించి; ఈ మారణాయుధాలనే నీ ప్రభుత్వం మరియు బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా ఉపయోగించు…..”

   తలుపు తట్టిన శబ్దం,వెనువెంటనే ఐదవ దళం సార్జెంట్ మేజర్ రాకతో బంచక్ మాటలకు అడ్డు పడ్డాయి.

  ‘సార్, రెజిమెంటు ప్రధాన కార్యాలయం నుండి ఒక వార్త వచ్చింది’,అని కాల్మికోవ్ తో అన్నాడు అతను.

  కాల్మికోవ్,చుబోవ్ వెంటనే తమ కోట్లను ధరించి బయటకు వెళ్ళిపోయారు. మెర్కులోవ్ తనలో తానే  చిన్నగా ఈల వేసుకుంటూ, కింద కూర్చుని, ఒక చిత్రం గీయడానికి సిద్ధమయ్యాడు. లిస్ట్ నిట్ స్కీ తన మీసాన్ని సవరించుకుంటూ,అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే బంచక్ కూడా అక్కడి నుండి బయలుదేరాడు. తన ఎడమ చేత్తో కాలర్ ని,కుడి చేత్తో కోటు అంచులు  పట్టుకుని, బురదతో నిండి ఉన్న ఆ కందకం బయటి నుండి నడిచాడు. బలంగా గాలి వీస్తూ ఉంది. ఆ చీకట్లో నడుస్తూ బంచక్ తనలో తానే నవ్వుకున్నాడు. అతను తన డగవుట్ వచ్చేసరికి  తేమ నిండిన నేల,కుళ్లిన ఆల్డర్ చెట్టు ఆకుల వాసన అతన్ని పలకరించాయి. తుపాకీ దళాల కమాండర్ నిద్ర పోతున్నాడు. పెద్ద నల్లటి మీసంతో ఉన్న అతని ముఖం కొద్దిగా ఉబ్బి ఉంది (అప్పటికే అతను మూడు రాత్రులు నిద్ర పోకుండా పేకాట ఆడి ఉన్నాడు). బంచక్ తనకు సైనికుడికిగా ఉన్నప్పుడు ఇచ్చిన సంచిని వెతికి,అందులో ఉన్న కాగితాలను తీసుకుని,తలుపు వద్దకు వచ్చి,అక్కడ ఉన్న మంటలో వాటిని కాల్చేశాడు. రెండు డబ్బాల నిండుగా మాంసాన్ని, కొన్ని గుప్పిళ్ళ  తూటాలను ప్యాంటు జేబులో వేసుకుని బయటకు నడిచాడు. అతను తలుపు తెరిచేసరికి,చల్లటి గాలి అతని ముఖాన్ని తాకి, అప్పుడే అతను తగలబెట్టిన కాగితాల బూడిద గాలి వల్ల ఎగిరి గుమ్మం దగ్గర పడింది,అక్కడ ఉన్న దీపం కూడా ఆరిపోయింది.

   బంచక్ వెళ్ళిపోయిన తర్వాత,లిస్ట్ నిట్ స్కీ ఇంకో ఐదు నిమిషాల పాటు మౌనంగా తన డగవుట్ దగ్గర అటూయిటూ తిరుగుతూ ఉన్నాడు. తర్వాత బల్ల దగ్గరకు వెళ్ళాడు. మెర్కులోవ్ తన తలను ఒక వైపుకి తిప్పి ఏదో చిత్రం గీస్తూ ఉన్నాడు.పదునుగా చెక్కిన అతని పెన్సిల్ ఆ కాగితం మీద అటూయిటూ తిరుగుతూ ఉంది. బలవంతపు నవ్వుతో బంచక్ ముఖం ఆ కాగితం నుండి పైకి చూస్తూ ఉంది.

    ‘నిజంగా అతనిది ఒక గంభీరమైన ముఖం’,ఆ చిత్రాన్ని కొద్ది దూరంలో పెట్టి, లిస్ట్ నిట్ స్కీ వైపు తిరుగుతూ అన్నాడు మెర్కులోవ్.

   ‘సరే, నువ్వు ఏమనుకుంటున్నావు?’ఇంకొకతను అడిగాడు.

  ‘నాకు తెలిస్తే బావుండేది! అతనొక విచిత్రమైన వాడు. అతను అంత స్పష్టంగా చెప్పాడు కనుక ఇప్పుడు అంతా బాగా తెలిసినట్టే ఉంది. కానీ దీని వల్ల అతని గురించి ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అతను కోసాక్కుల్లో ప్రసిద్ధి చెందిన వాడు,ముఖ్యంగా ఆయుధ శాఖలో.నువ్వు గమనించలేదా?’తనను దేని గురించి అడిగాడో అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తూ సమాధానమిచ్చాడు మెర్కులోవ్.

  ‘అవును’, లిస్ట్ నిట్ స్కీ ఆమోదిస్తున్నట్టు అన్నాడు.

  ‘ఆయుధ శాఖలో ఆ ఫిరంగులతో ఉండేవాళ్ళంతా బొల్షివిక్కులే ఇతగాడికి. అదే అతని పని కూడా. అతను తన పేకాట ముక్కలను ఆ బల్ల మీదే ఉంచుతాడు. ఎందుకో తెలుసా?మనకు కోపం తెప్పించడానికి అనుకుంటా! అతనికి మనం అతని అభిప్రాయాలతో ఏకీభవించమని తెలుసు అయినా కానీ ఎందుకో ఈ రోజు ఇదంతా చెప్పాడు. చూడడానికి మామూలుగా కనిపించినా,అతనో ప్రమాదకరమైన వ్యక్తే.’

  బంచక్ విచిత్ర ప్రవర్తన గురించి చర్చ జరుగుతున్న సమయంలో,మెర్కులోవ్ ఆ చిత్రాన్ని ఒక పక్కకు పెట్టి, బట్టలు మార్చుకున్నాడు. తడిగా ఉన్న తన సాక్సులను స్టవ్ దగ్గర పెట్టి, తన చేతి గడియారాన్ని తీసి, సిగరెట్టు కాల్చాడు. వెంటనే నిద్రపోయాడు. మెర్కులోవ్ ఒక అరగంట ముందు కూర్చున్న స్టూలు మీద లిస్ట్ నిట్ స్కీ కూర్చుని, ఆ చిత్రం గీసిన కాగితాన్ని ఇంకో వైపుకి తిప్పి, పెన్సిల్ ను పదునుగా చెక్కి, ఈ కింది సందేశం రాశాడు.

   యువర్ ఎక్సలెన్సీ కి,

    నేను ఇంతకుముందు మీకు తెలియజేసిన నా ఊహలు ఇప్పుడే నిజమేనని తేలాయి. ఈ రోజు మా రెజిమెంటు అధికారులతో జరిగిన సంభాషణలో కార్నెట్ బంచక్ (మేజర్ కాల్మికోవ్, ఐదవ దళానికి చెందిన లూయీటెంట్ చుబోవ్,మూడవ దళానికి చెందిన కెప్టెన్ మెర్కులోవ్ కూడా నాతో పాటు ఈ సంఘటన జరిగినప్పుడు ఉన్నారు),నాకు కారణాలు అస్పష్టంగా ఉన్నా,అతను తన రాజకీయ విశ్వాసాలను అనుసరించే చేసే కార్యకలాపాల గురించి చెప్పాడు.బహుశా తనున్న పార్టీ నాయకత్వ ఆదేశాలను అనుసరించి అతను అలా చేస్తుండవచ్చు. అతను నిషేదించబడిన సాహిత్యాన్ని కూడా తనతో ఉంచుకున్నాడు. ఉదాహరణకు,అతను జెనీవాలో ప్రచురించబడిన తన పార్టీ వార్తాపత్రికైన ‘ది సోషల్ డెమొక్రాట్’ లోని కొంత భాగం చదివి వినిపించాడు. నిస్సందేహంగా కార్నెట్ బంచక్ మా రెజిమెంటులో తప్పక విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు(అతను అసలు ఈ ఉద్దేశ్యంతోనే స్వచ్చందంగా ఇక్కడ చేరినట్టు ఉన్నాడు). ఈ భావాజాలాన్ని ఆయుధ దళ సైనికుల్లో నింపడమే అతని లక్ష్యం. వారిని సులభంగానే ప్రభావితం చేయొచ్చు కూడా. అతని ప్రమాదకరమైన ప్రభావం వల్ల రెజిమెంటు నైతిక స్థైర్యం దెబ్బ తిన్నది. ఇప్పటికే కొన్ని ఆజ్ఞలు పాటించడానికి విముఖత ఏర్పడుతూ ఉంది,ఇప్పటికే ఈ విషయాన్ని గురించి మా విభాగ కార్యాలయానికి తెలియజేశాను.

      కార్నెట్ బంచక్ ఈ మధ్యే సెలవు నుండి తిరిగి  వచ్చాడు (అతను ఈ సెలవులో పెట్రోగ్రాడ్ లో గడిపాడు). తనతో పాటు విద్రోహ పూర్వక సాహిత్యాన్ని కూడా తెచ్చాడు;అతను ఇప్పుడు తప్పకుండా తన కార్యకలాపాలను విస్తృత పరిచే ప్రయత్నం చేస్తాడు.

   జరిగిన విషయాలని బట్టి నేను ఈ కింది అభిప్రాయాలు స్పష్టం చేయాలనుకుంటున్నాను:

అ)కార్నెట్ బంచక్ నేరం నిరూపించబడింది(ఆ సంభాషణ జరిగినప్పుడు ఉన్న అధికారులు ప్రమాణ పూర్వకంగా నా మాటతో ఏకీభవిస్తారు); ఆ)అతను విద్రోహ చర్యలను ఎదుర్కోవడానికి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కోర్ట్ మార్షల్ కు గురయ్యేలా చేయాలి; ఇ)ఆయుధ దళంలో ఉన్నవారందరిని ఒక్కసారి జాగ్రత్తగా పరీక్షించి,అందులో ప్రమాదపూర్వకంగా అనిపించిన వారందరి మీద తగు చర్యలు తీసుకుని,మిగిలిన వారిని ఆ దళం నుండి తప్పించడమో లేకపోతే వేరే దళంలో కలపడమో చేయాలి.

     దేశానికి , మన రాచరిక వ్యవస్థకి సేవ చేయాలన్న ఆశయంతో నేను చేసిన సూచనలను దయచేసి నిర్లక్ష్య పరచవద్దని వేడుకుంటున్నాను. ఇదే ఉత్తరం కాపీ మిగిలిన అధికార విభాగాలకు కూడా పంపుతున్నాను.

                                                                                                 మేజర్ యెవజిని లిస్ట్ నిట్ స్కీ

ఏడవ సెక్టర్

అక్టోబర్ 20, 1916

     ఆ తర్వాతి ఉదయం లిస్ట్ నిట్ స్కీ తన నివేదికను ఒక ప్రత్యేక సందేశకుడి ద్వారా విభాగ కార్యాలయానికి పంపించి, అల్పాహారం తిని, తన డగవుట్ నుండి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న ఒక పిట్ట గోడ వెనుక ఉన్న ఆ బాడవనేల దగ్గర ఉన్న ముళ్ళ కంచెల మీద మంచు పట్టి ఉంది. ఆ కందకం దగ్గర ఉన్న బురద ఒక ఇంచు లోతుంది. పిట్ట గోడల దగ్గర ఉన్న ఇనుము కవచాల దగ్గర కోశాక్కులూ కొందరు టీ కోసం వేడి పెడుతుంటే,ఇంకొందరు పొగ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

   ‘ఆ కవచాల మీద మంట పెట్టొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీకు బుర్రలు లేవా అర్థం చేసుకోవడానికి?’ఆ మంట చుట్టూ కూర్చుని ఉన్న కొసాక్కుల బృందం వైపు వెళ్తూ లిస్ట్ నిట్ స్కీ అరిచాడు.

   ఇద్దరు అయిష్టంగానే అక్కడి నుండి లేచారు; మిగిలిన వారు తమ కోట్ల చుట్టూ చేతులు వేసుకుని అలాగే ఉండిపోయారు. నల్ల శరీర ఛాయతో,పెద్ద గడ్డంతో, వెండి చెవి పోగు వేలాడుతూ ఉన్న ఒక కొసాక్కు ఆ మంటలోకి కొన్ని ఎండిన ఆకులు వేస్తూ బదులిచ్చాడు.

   ‘మేము కూడా అవి లేకుండానే చేయడానికే ఇష్టపడతాము,సార్. కానీ అవి లేకుండా మంట ఎలా వెలిగించాలి? చుట్టూ చూడండి ఎంత నీరు ఉందో!’

  ‘ఆ కవచం తొలగించండి!’

  ‘అలా అయితే మేము ఆకలితో ఉండాలా? అంతేనా?’ స్ఫోటకం మచ్చలతో ఉన్న ఒక కొసాక్కు నవ్వుతూ అన్నాడు.

  ‘ఇక చాలు! అది తీసెయ్యండి!’ లిస్ట్ నిట్ స్కీ ఆ టీ కాచే పాత్ర కింద మంట కోసం పెట్టిన ఎండిన ఆకులను తన బూటు కాళ్లతో నలిపేస్తూ అన్నాడు.

  అప్పటికే కాగిన వేడినీళ్ళను తీస్తూ చెవి పొగున్న కొసాక్కు చిన్నగా నవ్వాడు.

  ‘అబ్బాయిలూ,మీ టీ సిద్ధంగా ఉంది’,అని చిన్నగా గొణిగాడు.

 మేజర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే కొసాక్కులు చూస్తూ ఉన్నారు. గడ్డంతో ఉన్న కొసాక్కు ముఖం ఎర్రగా మారిపోయింది.

‘మన ముఖాల మీద ఉమ్మేసినంత పని చేసాడు, వెధవా!’కోపంతో అన్నాడు.

  తుపాకిని భుజానికి తగిలించుకున్న ఇంకో కొసాక్కు ఆ మాటలకు నిట్టూర్చాడు.

  నాలుగవ దళ విభాగం దారి గుండా వెళ్తూ ఉంటే లిస్ట్ నిట్ స్కీకి మెర్కులోవ్ ఎదురొచ్చాడు. అతను అప్పటికే రోప్పుతూ ఉన్నాడు,ఊపిరి అందనట్టు ఉన్నాడు.అతను లిస్ట్ నిట్ స్కీ ని పక్కకు తీసుకువెళ్ళి, చెవిలో రహస్యం చెప్తున్నట్టు చెప్పాడు.

 ‘మీకు ఈ వార్త తెలిసిందా? బంచక్ రాత్రి పారిపోయాడు.’

‘ఏమిటి? బంచక్?’

‘అతను పారిపోయాడు. తుపాకీల విభాగపు కమాండర్ ఇగ్నటిచ్ కూడా బంచక్ డగవుట్ లోనే ఉంటున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం బంచక్ రాత్రి అక్కడికి వెళ్ళలేదట. అంటే అతను ఇక్కడ మనతో మాట్లాడి వెళ్ళాకే వెళ్ళిపోయి ఉంటాడు.’

  లిస్ట్ నిట్ స్కీ తన కళ్లద్దాలను తుడుచుకుంటూ, ముఖం చిట్లించాడు.

   ‘మీరు దీని వల్ల బాధ పడుతున్నారా?’మెర్కులోవ్ అతన్ని చూస్తూ అడిగాడు.

  ‘బాధా? నాకా? మతుండే మాట్లాడుతున్నావా? నేనెందుకు బాధ పడాలి? నాకు ఆశ్చర్యంగా ఉంది, అంతే.’

    * * *

 అధ్యాయం-2

       తర్వాతి రోజు ఉదయం కలవరపడుతూ ఒక సార్జెంట్ మేజర్ లిస్ట్ నిట్ స్కీ డగ్ అవుట్ దగ్గరకు వచ్చాడు. అతను దగ్గుతూనే తను చెప్పాలనుకున్న విషయం చెప్పాడు.

       ‘ సార్, ఈ ఉదయం కొందరు కొసాక్కులు కందకాల్లో ఈ కాగితాలు కనుగొన్నారు. ఇవి కొద్దిగా ఇబ్బంది కలిగించేవే. ఈ విషయం మీకు నివేదిస్తే మంచిదని వచ్చాను. లేకపోతే తర్వాత మనమందరం సమస్యల్లో ఇరుక్కోవచ్చు.’

    ‘ఏమిటా కాగితాలు?’ కూర్చున్న చోటు నుండి లేస్తూ అడిగాడు లిస్ట్ నిట్ స్కీ.

 ఆ సార్జెంట్ మేజర్ తన చేతిలో నలిగిపోయి ఉన్న కొన్ని పాంప్లేట్లను అందించాడు.

   అచ్చులో ఉన్న అక్షరాలు నాసి రకం కాగితాల మీద ముద్రించబడి ఉన్నాయి. లిస్ట్ నిట్ స్కీ కళ్ళు ఆ అక్షరాల వెంట పరిగెత్తాయి.

                                                                                         ప్రపంచ దేశాల కార్మికులారా,ఏకం కండి!

                                  కామ్రేడ్ సైనికులారా!

         ఈ దుర్మార్గ యుద్ధం రెండేళ్ల నుండి జరుగుతూనే ఉంది. ఈ రెండేళ్ల నుండి మీరు కందకాల్లో మగ్గిపోతూ,మీకు అపరిచితమైన మరియు ఆసక్తి లేని వారి లాభాల కోసం పోరాడుతూనే ఉన్నారు. వందల వేల మంది చనిపోయారు,గాయపడ్డారు; వేల మంది అనాధలుగా,విధవులుగా మారారు. ఈ ఊచకోత ఫలితం ఇది! మీరు దేని కోసం యుద్ధం చేస్తున్నారు? ఎవరి ఆసక్తులకు మీరు రక్షణగా నిలబడుతున్నారు?  జార్ ప్రభుత్వం కొత్త భూములను ఆక్రమించడానికి, ఆ భూముల్లో ఉన్నావారిని కూడా పోలాండ్ మరియు ఇతర దేశాల్ని  బానిసల్ని చేసుకున్నట్టు చేసుకోవడానికే సైనికుల్ని యుద్ధ రంగానికి పంపుతున్నది. ఈ ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ కూడా తమ పరిశ్రమల్లో పని చేస్తూ, తమ లాభాల కోసం శ్రమించే శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం నిలబడరు.కానీ తమ లాభాల కోసం సాయుధ దళాలను సిద్ధం చేసుకుంటారు. మీరు మూర్ఖుల వలె, వారి ప్రయోజనాల కోసం మీలానే బాధ పడే శ్రామిక జనులతోనే తలపడుతూ,ప్రాణాలు కోల్పోతున్నారు.

    ఇప్పటికే మీ సోదరుల రక్తం చిందింది చాలు! శ్రామిక జనులారా,ఏకం కండి!ఆస్ట్రియా సైనికుడో లేకపోతే జర్మన్ సైనికుడో మీ శత్రువు కాదు. వారు కూడా మీ లానే అమాయకులు, మీ సొంత జారు, పారిశ్రామిక వేత్తలు, భూస్వాములు మీకు అసలైన శత్రువులు. వారిని అంతం చేయడానికి తుపాకీలు పట్టుకోండి. జర్మన్,ఆస్ట్రియా సైనికులతో ఒకటవ్వండి. మిమ్మల్ని ఒకరికి ఒకరు శత్రువులుగా మార్చి వినోదం చూస్తున్న వారి ఆట కట్టించండి. మీరంతా సోదరులే, ఒక కష్టాన్ని పంచుకుంటున్నారు కూడా,అసలు మీరు ఈ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఈ నిరంకుశత్వం నశించాలి! ఈ సామ్రాజ్యవాద యుద్ధం నశించాలి! ఈ ప్రపంచ శ్రామిక వర్గ ఐకమత్యం వర్ధిల్లాలి!

ఆఖరి వాక్యాలు చదివే సమయానికి లిస్ట్ నిట్ స్కీ రొప్పుతూ ఉన్నాడు. ఏదో చెడు జరగబోతుందన్న ఆలోచన కలగడంతో,’ఇది మొదలైంది’, ద్వేషంతో అనుకున్నాడు.ఆ రెజిమెంటు కమాండర్ కు ఫోన్ చేసి, జరిగింది చెప్పాడు.

   ‘మీ ఆజ్ఞ ఏమిటి, ఎక్సలెన్సీ?’అని అడిగాడు.

  చుట్టూ దోమల రొదతో ఆ జనరల్ మాటలు కత్తిరించబడ్డట్టు వినిపించాయి.

  ‘సార్జెంట్ మేజర్, దళపు అధికారులను నీతో తీసుకు వెళ్ళి అంతా వెతకండి. మొత్తం రెజిమెంటు మీదా సోదాలు చేయండి. ఆఖరికి అధికారులు కూడా మినహాయింపు కాదు. నేను విభాగపు ముఖ్య కార్యాలయానికి ఈ రోజు ఫోన్ చేసి ఎప్పుడు రెజిమెంటుని బదిలీ చేసే ఆలోచనలో ఉన్నారో కనుక్కుంటాను. వారిని వేగంగా చేయమని అడుగుతాను.ఒకవేళ ఏమైనా దొరికితే వెంటనే నాకు తెలియజేయి.’

  ‘నాకు తెలిసి ఇది ఆ ఆయుధ దళ పని అని అనుకుంటున్నాను.’

 ‘అవునా? అయితే నేను వెంటనే ఇగ్నటిచ్ ను మొత్తం కొసాక్కుల మీదా సోదాలు జరుపమని ఆజ్ఞాపిస్తాను.గుడ్ డే, మేజర్.’

లిస్ట్ నిట్ స్కీ తన డగవుట్ దగ్గర దళపు అధికారులను సమావేశపరిచి ఆ రెజిమెంటు కమాండర్ ఆజ్ఞ గురించి చెప్పాడు.

‘కానీ ఇది అసంబద్ధమైనది!అంటే మేము ఒకరినొకరం తనిఖీ చేసుకోవాలా?’మెర్కులోవ్ కోపంగా అన్నాడు.

 ‘ముందు నీ వంతే, లిస్ట్ నిట్ స్కీ!’ యవ్వనంలో ఉన్న లూయీటెంట్ రాజ్ దొర్సెవ్ అరిచాడు.

 ‘కాగితాలలో పేర్లు రాద్దాము.’

  ‘అక్షర క్రమాన్ని పాటిద్దాము.’

  ‘హాస్యాలు పక్కన పెట్టండి!మా రెజిమెంటులో ఏ అధికారిని అనుమానించాల్సిన అవసరం లేదు. కార్నెట్ బంచక్ మాత్రమే దీనికి కారకుడు,కానీ అతను ఇప్పుడు ఇక్కడ లేడు.కానీ కొసాక్కులను మాత్రం సోదా చేయాల్సిందే. మీ సార్జెంట్ మేజర్ ని పిలవండి’, లిస్ట్ నిట్ స్కీ కటువుగా అన్నాడు.

   మూడు సెయింట్ జార్జ్ పతకాలతో ఉన్న వృద్ధ కొసాక్కు అయిన సార్జెంట్ మేజర్  ,ముందుకు వచ్చి,చిన్నగా దగ్గి, తన చుట్టూ ఉన్న అధికారుల వైపు చూశాడు.

  ‘మీ దళంలో అనుమానించదగిన వ్యక్తులు ఎవరు? ఎవరు ఈ ప్రకటనలు పంచుతున్నారని అనుకుంటున్నావు?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.

  ‘మా దళంలో అటువంటి వారు ఎవరూ లేరు,సార్’, సార్జెంట్ మేజర్ నమ్మకంగా చెప్పాడు.

  ‘కానీ ఈ ప్రకటనలు మీ దళంలోనే దొరికాయి. ఎవరైన అపరిచితులు మీ కందకాల్లోకి వచ్చారా?’

‘ఇతర దళాలకు చెందిన వారు కూడా ఎవరూ రాలేదు.’

  ‘అయితే మనమే వెళ్ళి ,వెతకడమే మేలు’, మెర్కులోవ్ అతని మాటలు పట్టించుకోకుండా,తలుపు వైపుకి నడిచాడు.

  సోదా మొదలైంది. కొసాక్కుల ముఖాల్లో భావాలు మారిపోయాయి. ఆ అధికారులు ఆ కొసాక్కుల సంచుల్లో వెతుకుతూ ఉంటే కొందరు విచారంగా ఉంటే,ఇంకొందరు ఆ అధికారుల వైపు భయంగా చూస్తున్నారు,మరికొందరు తమలో తామే నవ్వుకుంటున్నారు.

  ‘మీరు ఏం వెతుకుతున్నారో మాకు కూడా చెప్పొచ్చు కదా? ఏదైనా దొంగిలించబడింది అంటే తప్పక ఎవరో ఒకరు దాన్ని చూసే ఉంటారు’, పహరా బృందపు నాయకుడు అడిగాడు.

ఆ వెతుకులాటలో ఏమి దొరకలేదు. మొదటి దళానికి చెందిన ఒక కొసాక్కు జేబులో ఒక చిరిగిపోయిన కాగితం మాత్రమే దొరికింది.

  ‘నువ్వు దీన్ని చదివావా?’మెర్కులోవ్ అనుమానంగా అడిగాడు.

  ‘నేను దాన్ని సిగరెట్టు చుట్టుకోవడానికి తీసుకున్నాను’, ఆ కొసాక్కు కళ్ళు కూడా పైకి ఎత్తకుండా నవ్వుతూ అన్నాడు.

  ‘దేనికి నవ్వుతున్నావు?’లిస్ట్ నిట్ స్కీ అరిచాడు. అతని ముఖం ఎర్రగా మారిపోయింది,కోపంతో అతని ముక్కుపుటాలు అదురుతున్నాయి.

  ఆ కొసాక్కు ముఖం నుండి ఆ నవ్వు ఎవరో లాక్కున్నట్టు మాయమైపోయింది.

  ‘నన్ను క్షమించండి సార్. నాకు చదవడమే రాదు. సిగరెట్టు చుట్టుకోవడానికి ఏ కాగితం లేకపోవడం వల్ల నేను దాన్ని తీసుకున్నాను. నా దగ్గర పొగాకు ఉంది కానీ కాగితం లేదు,అందుకనే అది తీసుకున్నాను.’

  క్రోధం నిండిన స్వరంతో ఆ కొసాక్కు బదులిచ్చాడు.

  లిస్ట్ నిట్ స్కీ అతనికి దగ్గరలో ఉమ్మేసి,అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అధికారులు అతన్ని అనుసరించారు.

  ఒక రోజు తర్వాత ఆ రెజిమెంటును ఆ ప్రాంతం నుండి ఒక పది వెరస్టుల దూరంలో ఉన్న వెనుక ప్రాంతానికి బదిలీ చేశారు. సాయుధ దళానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి,కోర్ట్ మార్షల్ చేశారు. మిగిలిన వారిని రిజర్వ్ దళానికి లేకపోతే రెండవ కొసాక్కు విభాగానికి మార్చారు. ఈ కొద్ది రోజుల విరామ సమయంలో రెజిమెంటులో ఉన్నవారు కాస్త చురుకుగా మారారు. కొసాక్కులు చక్కగా క్షవరం చేసుకున్నారు. కాకపోతే కందకాల్లో ఉన్నప్పుడూ చేసుకున్నట్టు మొరటుగా కాదు. అక్కడ ఉన్నప్పుడు ‘పిగ్ సింగింగ్’అనే మొరటు పద్ధతిలో గడ్డం చేసుకునేవారు. గడ్డం దగ్గర నిప్పు వెలిగించి,మంట చర్మాన్ని తాకే లోపు ఒక తడి గుడ్డతో జుట్టును లాగేవారు.అది చాలా నొప్పి కలిగించే ప్రక్రియ.

   ‘పిగ్ సింగి కావాలా?’మంగలి అక్కడ ఉన్నప్పుడూ అడగటం సాధారణంగా జరిగేది.

   ఈ విరామ సమయంలో కొసాక్కులు ఉత్సాహంగా,సంతోషంగా ఉన్నారు. కానీ లిస్ట్ నిట్ స్కీ , మిగిలిన అధికారులకి మాత్రం ఈ సంతోషం ఈ రోజు ఉంటే రేపు ఉండదు అని అనుభవంతో తెలియడం వల్ల మాములుగానే ఉన్నారు. కందకాలలో అనుభవాల గురించి మాట్లాడినా సరే ,వారందరి ముఖాల్లో ఓ రకమైన విచారం కనబడేది. అక్కడ ఉండటం వారికి మరణ సదృశంగా అనిపించింది,వారి నైతిక స్థైర్యాన్ని కూడా కొంత దెబ్బ తీసింది. ఒక లక్ష్యంతో ఉండే మనిషికి అక్కడ అలా ఉండిపోవటం ఎంత భయంకరంగా  ఉంటుందో లిస్ట్ నిట్ స్కీకి తెలుసు. 

  *   *   *


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *