సాగరంలో ఒక కల్లోల కెరటం పుట్టినట్లు, నిశ్చలతటాకాన్ని ఒక గాలి తెర సంక్షోభ పరచి నట్లు, తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో ముంచెత్తిన జలపాతం చలం(1894 – 1979)! అన్వేషణే – జీవిత అన్వేషణే – పరమార్థంగా బ్రదికినవారు చలం! వారి రచనల్లో, ఆత్మఘర్షణ, అంతర్వీక్షణ అడుగడుగున కనిపిస్తాయి. ఈ ఆత్మధర్మాన్వేషణకు ఊతగా, తను జీవిస్తున్న సమాజంలోని వ్యక్తి సంస్కరణను గ్రహించారు. సామాజిక కట్టుబాట్లకు మూగగా బలి అవుతున్న స్త్రీకి కూడా హృదయముందని, స్వతంత్రగా ఆలోచించగల్గిన మేధస్సు ఉందని గుర్తించి, స్త్రీ స్వేచ్ఛకోసం తమ రచనల ద్వారా సమాజంతో నిరంతరం పోరాటం సాగించిన ధీరుడు చలం!
“నా రచనలు నా జీవిత సమరాన్నే ప్రతిబింబించాయి. నాకు సంఘ సంస్కరణాభిలాష ఎక్కువ. మనుష్యులు వ్యక్తిగతంగా ఉన్నతులు కావాలనేదే నా దేవుల్లాట” అన్న చలం దృష్టిలో సత్యాన్వేషణ అంటే అబద్ధాన్ని నమ్మ కుండా ఉండటం మాత్రమే కాదు, ఎక్కడ సత్యమైనదాన్ని నమ్మకుండా ఉండలేకపోవటం కూడా అని అర్థం.!
“మనకి సంపూర్ణమైన సత్యస్వరూపం తెలియదు. కనుక ఏది సత్యం, ఏది నిత్యం – అని అడుగుతూ కూర్చోనక్కరలేదు. ఏనాటికి మనకి నిజమని నిశ్చయంగా తోస్తూందో, ఆనాటి కి అది నిజం.” అని అన్వేషణ ప్రారంభించిన చలం, “ఆధ్యాత్మికయత్నమంటే ఉద్దేశ్యం…హద్దులూ, లోపాలు లేని తీవ్రమైన నిరంతరమైన శృంగారకలాపమని చెప్పుకోవడమే కాదు, తక్కిన ఛిద్రమైన యత్నాలనుంచి, వెర్రికలలనుంచి, దిగుళ్లనుంచి, నిరాశలనుంచి కాపాడుతుంది యీ దీక్ష…” అని నమ్ముతూ, కాలక్రమేణ సత్యాన్వేషణ కొనసాగించే మార్గంలో ప్రతి అడుగు శ్రమే, అయినా మధురం” అంటారు. ఒక ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకి జవాబుగా చలం, “అమీనా, అరుణ, జీవితాదర్శం నవలల్లోనే కాదు, నా సీరియస్ రచనలన్నింటిలో …. ఏదో దూరాన, నా కళ్ళకందని, పేరులేని దేని కోసమో ఎడతెగని నిర్ణిద్ర అన్వేషణ కనబడుతుంది.” అని చెప్పిన మాటలు గుర్తింపదగినవి. బి.నరసింగరావుగారన్నట్లు, ‘ఒక మనిషి మనీషిగా ఎదుగుతున్న క్రమంలో, శృంగారస్థాయి నుంచి ప్రేమ స్థాయికి ఎదిగి, క్రమంగా ఆధ్యాత్మిక స్థాయినందుకున్న పరిణామం’ వీరి జీవితంలోనే కాదు, ఆ జీవితానికద్దంపట్టే వీరి రచనల్లో కూడా కనిపిస్తుంది.
ఈ అంశం మరికొంత స్పష్టంగా వీరి రూపక రచనల్లో మనం గమనించవచ్చు ‘చిత్రాంగి’ అనే రూపకంతో 1922 లో ప్రారంభమై, 1977 లో ‘పురూరవ’ దాకా సాగిన వీరి చారిత్రక, పౌరాణిక రూపక రచన, సత్యాన్వేషణలో వీరు దాటి వచ్చిన తీరాలకు అద్దం పడుతుంది. వీరి రూపక రచనలకు ప్రధాన కారణం, లోపాలను సంస్కరించాలన్న సత్యాన్వేషణా దృష్టి కావడాన్ని మనం గమనించవచ్చు. “… పాత పతివ్రతల్లోని అనుకరణీయమైన ఉత్తమ గుణాల్ని మాత్రమే గాక, వారి లోపాలన్నిటినీ ఆదర్శాలనటం వల్లనే వారిని తిరగవ్రాయవలసి వచ్చింది” అంటారు చలం.
తన చుట్టూ ఉన్న సమాజంలో బాల్యంనుంచి తాను చూస్తున్న అర్థంలేని ఆచారవ్యవహారాలు, మూర్ఖత్వానికి ప్రతీకలుగా నిలిచిన కొన్ని సామాజికపరమైన కట్టుబాట్లు, ఆ కట్టుబాట్ల పేరిట నిర్దాక్షిణ్యంగా వివక్షకు గురి కాబడుతున్న స్త్రీల జీవితాలు – వీరిలో అంతర్మథనానికి దారితీశాయి. ఫలితంగా సత్యధర్మాన్వేషణాశీలత, స్త్రీ విముక్తిపట్ల ఆర్ద్రతా, అర్థరహితమైన సామాజిక కట్టుబాట్లపై తిరుగుబాటు, చలంగారిలో మరింతగా వికసించి, తరతరాలుగా సంప్రదాయాల పేరుతో, సంఘనీతి పేరుతో బలిగావింపబడుతున్న స్త్రీల జీవితాలను ఒక కొత్త కోణంలో దర్శింపజేశాయి. నిజమైన పాతివ్రత్యానికి అర్థం, ‘చుట్టూ ఆనందాన్ని వెలిగించే శాంతి’ అని నమ్మిన చలం, పాతివ్రత్యం పేరుతో క్షోభలకు గురైన సీత, సావిత్రి, చంద్రమతి, ద్రౌపది వంటి పాత్రలను వ్యక్తిత్వ మున్న పాత్రలుగా తిరగరాశారు. అటువంటి పాత్రల్లో సావిత్రి పాత్ర వీరి చేతిలో రూపకంగా రూపుదిద్దుకున్న తీరు గమనింపదగినది.
ధర్మరాజుకు మార్కండేయ మహర్షి సావిత్రి కథను చెప్పినట్లు మహాభారతారణ్య పర్వంలో ఉంది. అశ్వపతి కుమార్తె సావిత్రి, రాజ్యాన్ని కోల్పోయి, అడవిలో ఉంటున్న ద్యుమత్సేనుని కుమారుడు సత్యవంతుని మరణకాలాన్ని గూర్చి తెలిసి కూడా, అతడిని వివాహమాడి, అతడు మరణించినపుడు, యమధర్మరాజును తన వాక్చాతుర్యంతో మెప్పించి, భర్త ప్రాణాలను సావిత్రి వరంగా పొందడం, ఆ కథ సారాంశం! అదే కథ ఆంధ్ర సాహిత్యంలో ‘శృంగార సావిత్రి’ , ‘సావిత్రీ చరిత్రము’ మున్నగు రచనలుగా రూపుదిద్దుకున్నాయి. నిగూఢతత్త్వ నిరూపణకు ప్రతీకగా సావిత్రిని అన్వేషించిన ఆధ్యాత్మికపరమైన రచనలు(ఉదాహరణకు అరవిందుల సావిత్రి) కూడా వెలిశాయి. ఈ కథే చలం గారిచేత, రూపకంగా మలచబడింది.
సంఘంలోని వ్యక్తులు ఉన్నతులు అయినప్పుడే , సంఘం ఔన్నత్యాన్ని పొందుతుందని వీరి అభిప్రాయం! ఈ వ్యక్తి సంస్కరణాభిలాష , కళాభినివేశం, మార్మికత వైపు మొగ్గూ, తమ రచనల్లోని ప్రధాన లక్షణాలంటారు చలం. ఈ మూడు అంశాల మేలి కలయిక ఈ సావిత్రి రూపకం. ఎనిమిది రంగాలుగా విభజింపబడిన యీ రూపకంలో సావిత్రి, సత్యవంతుడు, యమధర్మరాజు, అశ్వపతి పాత్రలతో బాటు చంద్రిక అన్న ఒక కల్పిత పాత్ర కూడా కనబడుతుంది. భారతంలో దాదాపు ఒక సంవత్సరంపాటు జరిగినట్లుగా వున్న యీ కథను రెండు రోజుల్లో జరిగినట్లుగా చిత్రించారు చలం.
సత్యవంతుని మొదటి సారి చూడగానే, ‘జన్మజన్మలకు తెలిసినట్లుంది’ అని భావించి, “నిన్ను భర్తగా తాకితే మృతి పొందుతాడు. కాబట్టి అతడిని కలుసుకోకు “ – అని చెప్పిన తండ్రిమాటలను పెడచెవిని బెట్టి, అతడినే భర్తగా భావిస్తుంది సావిత్రి. తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువాతకు లోనైన సత్యవంతుని చూచి, “సమస్త జీవనాధారమైన ప్రణయాన్ని నిగ్గుదీసి, కేంద్రీకరింపజేసి, మృత్యువనే నవజీవనం తాగించి, హాలాహలాన్ని అమృతంగా మారుస్తాను” అంటుంది. ప్రేమకు అసాధ్యమన్నది లేదని, ప్రేమిస్తున్న హృదయం ఒకటి యెండి శూన్యమయిందంటే సృష్టి సర్వం శూన్యమవుతుందని నమ్మిన సావిత్రి, మృత్యువును జయింపలేని ప్రేమ, ప్రేమకాదని, తన ప్రేమతో అతణ్ణి బ్రదికించుకోగలనని యమునితోపాటు బయలు దేరుతుంది.
యముడు ఆమెను పరీక్షించడానికి, చంద్రికను సత్యవంతునితో ఉన్నట్లు చేయడమే గాక, తాను సత్యవంతుని రూపంలో సావిత్రిని చేరుతాడు. కాని ఇరవైవేలమంది సత్యవంతులున్నా, నిర్మలమైన తన ఆత్మ పొరబడక, అసలు వ్యక్తిని గుర్తించగలదని, దృఢంగా పల్కిన సావిత్రి దగ్గర పరాజితుడే అవుతాడు. చివరగా సత్యవంతుని – తన తపః శక్తిని ధారపోసి బ్రతికించగలనని, అందుకు ప్రతిఫలంగా సావిత్రి తనకు కావాలని, నిర్దేశించిన యముని కోరికను ఆమె అంగీకరిస్తుంది. కాని “ప్రేమ, పాతివ్రత్యం – యీ రెండింటిలో దేన్ని నిలుపుకోవాలి” అన్న సంఘర్షణలో, “ప్రేమను నమ్మేవాళ్ళకు లోకాన్ని జయించి యిస్తుంది ప్రేమ… ఆ ప్రేమకి అడ్డం వస్తే అన్నీ తొలగిపోవలసినవే” – అని నిశ్చయించుకుంటుంది, సావిత్రి. పాతివ్రత్యం పేరితో అహేతుకమైన లక్షణాలను అంటగట్టిన పురాణాల్లోని కథలను పునః పరిశీలించి, పాతివ్రత్య మనే ధర్మం కన్న, సమస్తాన్ని త్యాగం చేయగలిగిన శక్తిని యిచ్చే ప్రేమద్వారా మనిషి దేన్నైనా సాధించ వచ్చుననే సత్యాన్ని చాటిచెప్పిన రూపకం చలం సావిత్రి.
విధికి తలవంచే అమాయకురాలైన స్త్రీగా కాక, పాతివ్రత్యమహిమతో భర్తను బ్రదికించుకున్న పౌరాణిక స్త్రీలా గాక, ప్రేమతో, ఆత్మ విశ్వాసంతో, విజయం సాధించిన వీర వనితగా సావిత్రిని చిత్రించారు చలం! తక్కిన పాత్రలన్నీ, సన్నివేశ కల్పనలన్నీ ఈ లక్షణానికి ఉద్దీపనలే! యమునిపాత్ర నిర్మాణంలో కూడా, యీ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మూల భారతంలోని యముడు, సావిత్రియొక్క, “ఉదార వాగ్భంగికి మెచ్చి, ఆమె కల్మశ రహితములైన మాటలకు సంతోషించి, ఆమె విశేష ధర్మతత్పరతను గుర్తించి, వరములిచ్చినవారు. “ఏడు మాటలాడిన యంత నెట్టివారు నార్యజనులకు జుట్టంబులగుదురు.” కాన, బంధుభావంతో వరమిమ్మని కోరిన సావిత్రి ధర్మజ్ఞతకు ప్రసన్న చిత్తుడై, సత్యవంతుని బ్రదికించినవాడు.
కాని చలం ‘సావిత్రి’ లోని యముడు, స్వయంగా ఆమె ప్రేమలోని నైర్మల్యాన్ని పరీక్షించినవాడు. దయకు ప్రతీకగా చిత్రింపబడిన వాడు. సావిత్రిపై పితృవాత్సల్యంతో బాటు, తాను పెడుతున్న పరీక్షలో తానే ఓడి, ఆమె గెలుపొందాలన్న ఆకాంక్ష కలిగి ఉండటమే గాక, ఆమె ఆవేదనకు తాను బాధ పడుతూ, “ప్రేమమూర్తి నా బిడ్డ నలిగి పోతూ ఉంది. … ఆ కళ్ళలోంచి ద్వేషం, భీషణ జ్వాలలు చిమ్ముతో వుంటే, వోర్చుకొని ఎట్లా నిలబడటం..” అని దిగులు పడినవాడు. యముడు అంతటి కరుణామూర్తి గనుకే, సావిత్రీ సత్యవంతులచే కీర్తింపబడినాడు.
ఈ రూపకాన్ని బాగా పరిశీలిస్తే, యిది చలం మనోగతభావాలకు, ముఖ్యంగా మృత్యువును గురించిన ఆలోచనలకు అద్దంపట్టే విధానాన్ని కూడా గుర్తించగలం. ప్రేమ మృత్యువాతావరణానికి కూడా ఎంతగా సజీవతను ఆపాదించగలదో, సానుకూల దృక్పథాన్ని పెంపొందించగలదో, జీవితాలకెంత చేతనను కలిగించగలదో, ఇందులో నిరూపించారు. అంతేగాదు, “మృత్యువంటే అర్థం ‘నేను’ అనే భావం నశించడం” – అని భావించిన చలం, ‘మృత్యువు తర్వాత పునర్జన్మ ఉంది అనుకోవడం మిథ్య’ అంటారు. అయితే, మృత్యువు తరువాత మిగలము అనుకోవడము కూడా కష్టం! ఎందుకంటే, యింతగొప్పగా సమర్థించుకొనే యీ ‘నేను’, ఏమవుతున్నట్లు?”అని ప్రశ్నించుకుంటారు చలం. అందుకే, “మనుషులు చీకట్లో పుట్టి, చీకట్లో చస్తారు. కానీ జాతి మాత్రం, వెదుకుతోంది దేనికోసమో!… అశాంతిని పోగొట్టేందుకు ప్రేమ మాత్రం చాలదు.జ్ఞానం తోడు ఉండాలి. ఈ సాధనకు మానవుడు, మనోశక్తిని సాధించాలి. దానికి ఏకాగ్రత అవసరం…” అంటారు చలం! ఈ అంశాన్ని నిరూపించేందుకే సర్వశక్తులను ఏకోన్ముఖం చేసుకుని, ప్రేమతో ఏకాగ్రతను సాధించిన పాత్రగా, ‘మన చేతుల్లోనే వుంది,మన జీవన మాధుర్యం’ అని నమ్మిన పాత్రగా సావిత్రిని మలిచారు..
పాతివ్రత్యమంటే నిజమైన అర్థమేమిటా, అని నిర్వచించే ప్రయత్నంలో భాగంగా, వ్రాయబడిన సావిత్రి రూపకం, చలం సాగించిన ఆధ్యాత్మికాన్వేషణలో ఒక మెట్టుగా ఉపకరించడాన్ని మనం గమనించగలం! ‘చిత్రాంగి’ తో ప్రారంభమయిన, ప్రేమ ఆలంబనగా సాగిన వీరి అన్వేషణ, ‘సావిత్రి’తో ప్రేమలో ఏకాగ్రతను సాధిస్తూ, అంతఃకరణ ప్రమాణానికి, సాంఘికమైన కట్టుబాట్లకు మధ్యగల భేదాన్ని ‘సీత అగ్నిప్రవేశం’వంటి రూపకాలలో ప్రశ్నించుకుంటూ, సౌందర్య వాంఛ, కామశక్తి మొదలైనవన్నీ, యీశ్వరుని పాదాల చెంత అర్పించే పుష్పాలుగా మారాలి’ అని ‘జయదేవ’ నాటికి మనసుకు హెచ్చరికలు చేసుకుంటూ, ‘పురూరవ’ నాటికి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత శిఖరాలను దర్శింప గలిగింది.
అందుకే సావిత్రి కథలో చలం చేసిన మార్పులు, సావిత్రిని ధీరవనితగా రూపకల్పన చేసేందుకు మాత్రమే ఉపకరించలేదు. సమాజాన్ని గాక, సమాజంలోని కృత్రిమమైన, అర్థరహితమైన కట్టుబాట్లను, ధిక్కరిస్తూ, కొనసాగించిన వారి సత్యాన్వేషణకు, ‘వ్యక్తిలోని నిజమైన చేతనే సంఘాన్ని కూడా చైతన్యవంతం చేస్తుంది’ అన్న వారి ఆదర్శానికి కూడా అద్దంపట్టే రచనగా, యీ సావిత్రి రూపకానికొక స్థానాన్ని కల్పించడంలో కూడా తోడ్పడ్డాయి- అని మనం గమనించవచ్చు.
‘బిడ్డల శిక్షణ’ వంటి అరుదైన రచనలను, ‘మ్యూజింగ్స్’ వంటి అపురూపమైన రచనలను అందించిన చలం, తన ఆత్మధర్మాన్వేషణనకు సాహిత్యాన్ని ఎలా సాధనంగా మలుచుకున్నారో, నిత్యసత్యాన్వేషిగా, సాగించిన ప్రయాణంలో అంతర్ముఖత్వాన్ని సాధించి, ఎలా పరిణితి చెందారో తెలిపే రచనల్లో ‘సావిత్రి’ రూపకానికున్న స్థానం గణింపదగినది.
ఆధారం:
- సావిత్రి.. రూపకం..చలం
- మ్యూజింగ్స్.. చలం
- చలం యితర రూపకాలు
డా. రాయదుర్గం విజయలక్ష్మి
డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.