ఒక ఆకాశ శకలం

Spread the love

నేలకొరగకు నా దైవమా
నేలకొరగకు
నేలకొరిగినవారెవరు
తిరిగి లేచి నిలబడిన దాఖలా లేదు”

– Song of ganita of the first age

“బ్లూ మౌంటైన్‌ను అమ్మకానికి పెడుతున్నాను అశోక్…బహుశా ఇదే దాని చివరి రేసు అనుకుంటా…”

అతడు యజమాని నుండి ఈ మాటలు వింటున్నపుడు, సరిగ్గా ఆ పూట సూర్యుడి వెలుతురు దిగాంతం నుండి ఎంతో నెమ్మదిగా ఆకాశం దిశగా పైకి రాసాగింది. ఇంకా పచ్చికబయలులో మంచు తొలగని రేస్ ట్రాకును ఒకసారి పరికించి చూసినవాడు కాస్తా, లోగడ ఆ గుర్రంపై ఎక్కి దౌడు తీసిన రోజులను ఒకసారి గుర్తుచేసుకున్నాడు. ఆ రోజు శిక్షణ నిమిత్తం బ్లూ మౌంటైన్‌తో పాటు, అతడు కూడా గ్రౌండ్‌‌ లోపల సిద్ధంగా ఉన్నాడు. తన సంజ్ఞలను అన్ని రకలగాను అర్థం చేసుకోగలిగిన తన గుర్రంతో ‘నువ్వు ఈ ట్రాకులో పరిగెత్తబోయేది ఇదే చివరిసారి అన్న విషయం దానికి చెప్పేద్దామా?’ అని దాని మెడ ఎడమవైపున ప్రేమగా నిమిరాడు. అది కూడా ఎంతో ఉత్సాహంతో తల విదిల్చింది. ‘ఇదంతా ఒక బ్రతుకుతెరువని వెళుతున్నావు చూడు?  అసలేముందిరా ఇంతకీ ఈ గుర్రాల రేసులో?”

శిక్షణ పూర్తవ్వగానే, ప్రారంభంలోని కొన్ని విజయాలను చవి చూశాక నాన్న అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా

“రేసులో రైడ్ చేయడం ఎలా ఉంటుందోనని స్పష్టంగా నేను విడమరిచి చెప్పలేను కానీ, అది అత్యంత వేగమైన, భయానకమైన, పిచ్చెక్కించే రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్నట్టు మాత్రం ఉంటుందనిపిస్తోంది” అని నవ్వుతూ చెప్పాడు. బహుశా, ఆ గుర్రానికి కూడా అది అలాగే అనిపించుండాలి. ఆ కుతుహలం, ఆ సంతోషం ఇకపై కూడా కొనసాగుతుందా? 

ట్రైనర్ సమయం వృధా కాకూడదని అశోక్‌ను కంగారు పెట్టడంతో, గుర్రం  కూడా ఎందుకు ఇతను ఈరోజు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అని దౌడు తీసే ఆసక్తితో అడుగడుక్కి కాళ్ళు దువ్వుతోంది.

ఏడెనిమిది వారాలుగా గుర్రాల మధ్య, గుర్రంలా సంచరిస్తున్న అతడి శరీరం కూడా ఒక పిల్లగుర్రం వంటిదే. వరుసపెట్టి రేసులకు వెళ్ళి సన్నబడటం వలన కండరాలు గట్టిపడ్డాయి. గుర్రంపై కూర్చుని దౌడు తీసి, అతడి దేహం కూడా ఇప్పుడు దూది పింజలా గాల్లో తేలుతుంది. శిక్షణా సమయంలో పూర్తిగా బిగుసుకుపోయుండేవాడు. స్వతహాగానే ఈ రేస్ కోర్స్ మైదానం ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా నమ్మకాలను, అపనమ్మకాలను మూటగట్టి అక్కడి మనుష్యులకు ఏకకాలంలో అందించే నైజం గలది.  పది రూపాయలు పందెం కట్టి, వెయ్యి రూపాయలు సంపాదించినవాడు కూడా మరోరోజు లక్ష రూపాయలు పందెం కట్టి, వట్టి చేతులతో తిరిగెళ్ళే సందర్భాలు కూడా ఎదురవుతాయి. గుర్రాల పెంపకదారులు, జాకీలు, వీరితో పాటు గుర్రాలు కూడా ఇందుకు ఏ మాత్రం మినహాయింపు కాదు. విజయాలు చేకూరని సందర్భాల్లో ఒక జాకీలో గూడుకట్టుకునే శూన్యం ఎంతో  క్రూరమైనది. ఎదురయ్యే ఓటములు అతని రోజువారీ ఆహారంలో సగానికి సగం తగ్గించేసేలా చేస్తాయి. అన్నిరోజులుగా అతనితో దౌడు తీసిన గుర్రం అతని నుండి విడదీయబడటమో, లేదా గుర్రానికి బదులు అతడిని అమ్మకానికి పెట్టడమో జరుగుతోంది. ఇవి రెండూ భరించనలవి కానీ అవస్థలే. తనపై పందెం కట్టిన ఎంతోమందిని అతడి గుర్రం లక్షాధిపతులను చేసింది. అయితే పందెంలో గెలిచిన ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు ఆ గుర్రాలకు కృతజ్ఞత చెప్పిన దాఖలా లేదు. డబ్బు మీదున్న వ్యామోహంతో ఆ రేసులో సంపాదించిన మొత్తాన్ని ఇంకొక రేసులో బుకింగుకి కట్టేందుకు ఎదురుచూస్తుంటారు. గెలుపొందిన ప్రతిసారి ఊరికే సరదాగా అలా గుర్రం కళ్ళెము పట్టుకొని దారి పొడుగునా కాస్తంత దూరం ట్రాకుపై నడవడమన్నది అతడికి బాగా ఇష్టమైన విషయం. గ్యాలరీలోని ప్రేక్షకుల హర్షద్వానాలన్నీ  తన కోసమేనన్న విజయగర్వంతో గుర్రం కొన్ని నిమిషాలపాటు తల విదుల్చుతూ నడుస్తోంది. ఈ మనుషులు సంపాదించే సొమ్ములో రవ్వంత కూడా దానికి దక్కనప్పటికీ, విశ్వాసం కోసం అవి చేసిన పనికి వాటికి దక్కిన ఈ హర్షద్వానాలే అమూల్యమైన బహుమానం.

గతంలో కూడా అశోక్కి వేరే కొన్ని గుర్రాలు నడిపిన అనుభవముంది. అయితే ఈ గుర్రంతో ఉన్నటువంటి అన్యోన్యత మాత్రం మిగిలిన వేటితోను లేదు. ఒక గుర్రాన్ని మచ్చిక చేసుకోవడమన్నది అంత ఆషామాషీ వ్యవహారమేమి కాదు. రేసుకై మచ్చిక చేసుకునే గుర్రాలకు ఎప్పుడూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. ఎంతో దట్టమైన చలికాలంలో వేటకై  మచ్చిక చేసుకునే తోడేళ్ళ కంటే కూడా ఎంతో జాగ్రత్తగా మచ్చిక చేసుకోవలసిన జంతువులు ఈ గుర్రాలు.

గుర్రాలు దౌడు తీసేటప్పుడు వాటిపై ఉన్నటువంటి జాకీ బరువు వాటికి ఏ మాత్రం తెలియకూడదు. దానికి దూదిపింజలా గాలిని మోసుకెళుతున్నటువంటి మానసికస్థితి ఉండాలి. ఒక జాకీకి, గుర్రానికి ఉన్న అనుబంధం కేవలం ఒక్క పందెంతో మాత్రమే  సరిపుచ్చుకునే విషయం కానే కాదు. ఈరోజు బ్లూ మౌంటైన్ అనబడే ఈ గుర్రంతో, అశోక్ పదమూడవ రేసుకు వెళ్ళనున్నాడు. పదమూడింటిలో అతడిని పది విజయాలు వరించాయి. అది కూడా కేవలం ఒకే సీజన్లో. అతనికి సంబంధించినంతవరకు ఈరోజు జరగనున్న రేసు కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు; ఈరోజు అంత సర్వసాధారణమైన రోజేమి కాదు.

రేసుకు సిద్ధమయ్యే ఒక్కొక్క క్షణం ఎంతో కఠోరంగా ఉండడంతో పాటు ‘కొత్త గుర్రాన్ని మచ్చిక చేసుకోవడమెలా?  అనే సందిగ్ధంలో పడ్డాడు. కొద్దిరోజుల క్రితం భార్య ఆషా కొనిచ్చిన కొత్త స్కిన్నీని ఈ రోజు ఎట్టకేలకు ధరించాడు.

“ఈ రోజు బ్లూ మౌంటైన్‌ చివరి రేసు”  అని ఫోన్లో ఆషాతో చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. మరికొద్దినిమిషాల్లో ఆమె కూడా అక్కడకు రానుంది. ఆమెకు కూడా అతడిలానే, బ్లూ మౌంటైన్ మీద అమితమైన ప్రేమ. ఒంటరిగా ఉంటే గుర్రానికి సంబంధించిన ఆలోచనలు పదే పదే వెంటాడుతాయి. మనసులో ఈ రోజు రేసుకు సంబంధించిన విషయాలను పదే పదే తలపోస్తున్నాడు. అనేక సందర్భాల్లో అతడి అంచనాలు వమ్ము కాలేదు. దౌడు తీయబోయే ట్రాక్, ఆరోజు వచ్చే తోటి జాకీలు, గుర్రాలు  ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆ రోజు అతడి ఆలోచనలు ఆధారపడివుంటాయి. ఎక్కడ ఏమైదానంలో దౌడు తీసినప్పటికీ అతనికి నాలుగో నంబరు ట్రాక్ ఎంతో అదృష్టమైనది. అందులో దౌడు తీసిన ప్రతి పందెంలో దరిదాపుగా అతడే ప్రథమ స్థానంలో నిలిచేవాడు. ప్రైజ్ మనీలో అతడికి దక్కే  పదిశాతం ఆదాయంలో ఉన్న మజా ఎలా ఉంటుందని, ఆ పందెంలో ప్రథమ స్థానంలో వచ్చిన ప్రతిసారి అతనికి అవగతమయ్యేది. “ఇంత డబ్బు తీసుకెళ్ళి ఏం చేసుకోబోతున్నావురా” అని ఆకతాయితనంగా అడిగే అతని తోటి జాకీలు హావభావాల వెనుక, తాము చేజార్చుకున్న అవకాశాలు దాగి ఉండటం అతడు గమనించేవాడు.

“రెండంటే రెండు కిలోలు కండ పడితే చాలు, యజమాని మనల్ని ఇంటికి పంపించేస్తాడు. పైగా మన జీవితకాలం కూడా చాలా తక్కువ బ్రో. ఉన్నన్ని రోజులు స్పిరిట్‌తో ఉంటేనే నాలుగు డబ్బులు వెనకేయగలం?” అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెనుతిరిగేవాడు.

మధ్యాహ్నమయ్యేందుకు కాస్త ముందుగానే నీరెండలో బ్లూ మౌంటైన్‌ తన ప్రకాశవంతమైన కళ్ళతో రేసు జరిగే మైదానానికి వచ్చింది. అశోక్ చేతులను గట్టిగా ఒడిసిపట్టుకున్న ఆషా ఓదార్చేందుకు మాటలులేక పరితపించింది. అశోక్కి బ్లూ మౌంటైనే తొలి ప్రేయసి. దాని ఎడబాటును ఏ  మాటలు ఓదార్పును, ఉపశమనాన్ని కలిగించగలవు గనుక?

“చియర్ అప్ అశోక్ ఇది ఫేర్వెల్. మనమే దాన్ని సంతోషంగా ఇక్కడి నుండి సాగనంపాలి” అని ఆషా అనగానే అతడు తన తలను పైకెత్తి ఆమెను చూసి అవునన్నట్లు తలాడించాడు.

 డ్రెస్సింగు రూమ్ నుండి బయటకు వచ్చిన అతడి తలపైనున్న ఆకాశం విస్తరించసాగింది. దాని గమ్యస్థానం గురించి ఎటువంటి ఆసక్తి లేనివాడికి, తన ముందు విస్తరించిన ఒక ఆకాశపు శకలాన్ని అధిగమించి వెళ్ళడమే ఇప్పుడు తన కళ్ళ ముందున్న ఏకైక లక్ష్యం. అతడు దౌడు తీసి, అధిగమించాల్సిన దూరం నిశ్చలనమైన ఒక నీడలా తన కళ్ళల్లో నిలిచిపోగా, తన గుర్రం నోటి నుండి చొంగ రెండు పొడవైన వెండితివ్వల్లా కారింది. ఆఖరి రేసుకు నిబడుతున్నాం అనే ఎటువంటి తడబాటు లేకుండా, ఎప్పటిలా దాని శరీరం ఉత్సాహం పుంజుకునుంది. ఇంకెప్పుడూ అది రేసులో పరిగెత్తబోవదనే నిజం గుర్రంపై కూర్చున్నవాడికి మాత్రమే తెలుసు. రేసులో దౌడు తీసినన్ని రోజులు  మౌంటైనును తన గుర్రంగానే భావించేవాడు. ఈ రేసు అయ్యిన మరుక్షణమే తనను వదిలి వెళ్ళే ఆ మూగజీవి,  ఏదో ఒక క్షణంలో తన తోడు కోరి పరితపిస్తే ఏం చేయాలి? యజమానికంటే కూడా పెంచిన వాడిదగ్గరే  జంతువులన్నీ అన్యోన్యంగా మసులుకొంటాయి. ఈ రోజు తర్వాత ఈ గుర్రం ఏమైనా కావ్వొచ్చు. దానిని  అమ్మకానికో, చంపెందుకో, బహుమతిగా ఇచ్చేందుకో ఎన్నో అవకాశాలున్నాయి. చివరి మజిలీగా దానిని గెలుపుతో అక్కడి నుండి సాగనంపాలన్నదే అతడి ప్రగాడమైన వాంఛ. అది ఒక మిత్రుడిని గౌరవప్రదంగా సాగనంపే కడసారి వీడ్కోలులా ఉండాలి.

మూసివేయబడిన గేట్స్‌కి ఆవల ఆరు గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి. తనకు ఈ సారి రెండవ ట్రాక్ ఇవ్వడంతో కాస్త సందిగ్ధానికి లోనయ్యాడు. దానిని ఏ మాత్రం బయటికి వ్యక్తీకరించకని అతడి శరీరమంతా ఎప్పుడూ లేనంత కంగారు అలుముకుంది. వరుసగా నిలబడున్న గుర్రాల కాళ్ళు నిప్పులు చెరుగుతుంటే, ఎప్పుడూ స్వతహాగా తన తోటి జాకీలను చూసి నవ్వే అతడు ఈరోజు ఒక నవ్వు కూడా నవ్వలేదు. కొన్ని సందర్భాల్లో రేసుల ఫలితాలు ముందురోజే నిర్ణయించబడతాయి. రేసులో అక్కడికక్కడే గెలుపోటములు నిర్ణయించే జూదపు బుకీలు, గుర్రపు పందెం మొదలయ్యే రెండు నిమిషాలు ముందు గ్యాలరీలో ఉన్నటువంటి పంటర్ ఒకడి ద్వారా సైగ మాత్రం చేస్తే చాలు. ఆ సంబంధిత జాకీతో పాటు, మిగిలిన జాకీలకు కూడా ఆ సైగ ఒక ఉత్తర్వులాంటిదే. ఈరోజు ఒక వేళ ఫలితం ముందే నిర్ణయించబడినప్పటికీ ఇతడు గెలిచే తీరాలి. గుర్రమెక్కడం ఇదే కడసారి అయినా అతడు అందుకు సమ్మతించేవాడు. గ్యాలరీలో ఎన్నడూ లేనంత జనసందోహం. సగానికి పైగా బడా యజమానులు. వారాంతాల్లో ఇది వారికి చాలా ఆసక్తికరమైన ఆట. లాభాలు భారీ ఎత్తున ఉండట వలన దీన్ని వారు కేవలం ఒక ఆటగా మాత్రమే పరిగణించడం లేదు.

బ్లూ మౌంటైన్‌ లాగే , తను కూడా రేసుల నుంచి వైదొలగే సమయం ఆసన్నమయ్యింది. విజయాలతో విసిగివేసారి సరాసరి మనుష్యుల్లో ఒకడిగా జీవించాలనుకుంటున్నాడు. ఈ గెలుపులన్నింటిని చితి పేర్చి, ఒక కొత్త మనిషిగా, ఉదయ సూర్యునిలా తనని తాను ఆవిష్కరించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఒక్కో సూర్యుడు నిశిధీతో అంధుడవుతున్నాడు, గాలికి దుమ్ము కొట్టుకుపోతున్నాడు, అగ్నితో దహించివేయబడుతున్నాడు, నీటిలో మునుగితేలుతున్నాడు. అనుదినం సూర్యుడు తనని తాను దగ్ధం చేసుకునే ప్రకాశించగలుగుతున్నాడు. అతడికి కావలసిందల్లా ఒక కొంగొత్త అరుణోదయం. దాన్ని ఎదుర్కొనేందుకు కొత్తమనిషికి కావాల్సిన ఒక ముఖం. చలి ఒకపక్క సన్నని సూదులతో పొడుస్తుంటే, బ్లూ మౌంటైన్‌ గాల్లో అడుగడుక్కి తుమ్ముతోంది. కళ్ళు మూసి కొన్ని క్షణాల పాటు ప్రార్ధించాడు.

తుపాకీ నుండి వెలువడే తూటా శబ్దం కోసం ఎదురుచూస్తున్నటువంటి క్షణం. ఒక జాకీ, గుర్రమూ ముందుగా అలవాటు పడాల్సింది ఈ శబ్దానికే. తుపాకీ శబ్దం వినగానే ఒంట్లో కలిగే ఒక చిన్న విభ్రాంతి ఒక రేసు ఫలితాన్ని సైతం మార్చగలదు. మొత్తమ్మీద  ట్రిగ్గర్ మీద చేయపడంగానే, గుర్రం కాళ్ళను దౌడు తీసేందుకు సిద్ధంగా ఉంచుతారు. ఒక మంచి జాకీ గుర్రాన్ని ముందుకు నడపించడంతో పాటు, తను కూడా దాని మార్గంలోనే వెళ్ళాలనుకుంటాడు. అశోక్ తన గుర్రం మెడలో ముద్దు పెట్టాడు. “నువ్వు పరిగెత్తనున్న చివరి రేసిది. ఈ ప్రపంచం నిన్నూ, నన్ను మర్చిపోయినప్పటికీ ఈ రేసును ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. నమ్మకం ఎక్కడుంటుందో, అద్భుతాలు ఎప్పుడూ అక్కడే చోటుచేసుకుంటాయి. మనిద్దరి జీవితాల్లోనూ ఇది అద్భుతమైన రోజు” అని  దాని పొట్టపై చరిచి తనచుట్టూ ఉన్న వాతావరణాన్ని మెల్ల మెల్లగా మర్చిపోసాగాడు.  గమ్యస్థానం ఒక అగ్నిజ్వాలగా తనలో ప్రతిఫలించగా దానిని అధిగమించే క్షణం కోసం మనసు తహతహలాడింది.

తుపాకీ శబ్దం వినగానే ఆ ఆరు గుర్రాలు ఆ గేటును పక్కకు నెట్టి ఆమాంతం గాల్లోకి ఎగిరాయి. అతని చేతులు గుర్రానికున్న హాల్టర్ (గుర్రాన్ని నియంత్రించే కళ్ళెము) నుంచి మెల్ల మెల్లగా పిడినుండి తప్పుకున్నాయి. తను దౌడు తీయడం లేదు. గాల్లో తేలుతున్నామనే ఉద్వేగం గుర్రంలో రేకెత్తాలి. దాని పొట్టపై కాలితో తన్ని దాని పొగరును మరింత రెచ్చగొట్టాలి. అది పొగరుతో చెలరేగి, వేగం పుంజుకోవడం కోసం దాని కళ్ళేన్ని మరింత గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఆ క్షణమే దాని వేగానికి, దాని కాళ్ళు ఎన్నోరెట్లు పెరిగినట్టు అనిపించాయి. పోను పోను వాటి కాళ్ళ సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది. చివరిలో కాళ్ళే లేవన్నట్టు అనిపించింది. కేవలం ఆ దిశగా నడిపించడం మాత్రమే మిగిలుంది. ఆ దిశానిర్దేశం కాళ్ళ సహాయం లేకుండా ఏదోకవిధంగా చేయబడ్డది. నేల ఉపరితలంపై ఇప్పుడు అగ్నిజ్వాలలా ఎగసిపడింది బ్లూ మౌంటైన్. గ్యాలరీలోని వారందరూ దహించే నిప్పురూపమోకటి పరుగులు తియ్యటం మాత్రమే గమనించారు.

‘నా ప్రియతమా, నువ్వు ఎంతో మహత్తు కలిగినవాడివి. ఈ గెలుపు తాలూకా సంతోషం నీతో ఎన్నటికీ నిలిచిపోవాలి’  అని అతడి మనసు తలపోస్తున్న ఆ క్షణంలో మూడవ ట్రాకులో పరుగు తీస్తున్నటువంటి గుర్రం కాస్త  దాని ఒళ్ళు విదిల్చింది. ఆ గుర్రపు జాకీ మూర్ఖంగా గుర్రాన్ని కొట్టడంతో రేసుకి కొత్తగా అలవాటు చేయబడిన అది తమాయించుకోలేక తలను విదల్చడంతో ముందువైపు దౌడు తీస్తున్నటువంటి బ్లూ మౌంటైన్‌ వెనక భాగాన్ని రాసుకుని తాటించింది. అనూహ్యమైన ఈ రాపిడి వలన బ్లూ మౌంటైన్‌ కాస్త తడబాటుతో దౌడతీస్తున్నటువంటి ట్రాకులో నుంచి దాన్ని ముందరికాళ్ళు తడబడి పక్క, ట్రాకులో తడబడుతూ ఒరిగింది. పూర్తిగా వేగం పెంచడం మీద దృష్టిసారించిన అశోకు బ్లూ మౌంటైన్‌ తడబాటును నియంత్రించలేక పట్టుకోల్పోయాడు.  ముందుకి పడబోతున్నామనే కంగారులో రెండుసార్లు గుర్రం గెంతింది. మొదటిసారి గుర్రపు శరీరాన్ని గట్టిగా పట్టుకుని జారబడినవాడు కాస్తా, రెండవ గెంతుకు తటపటాయించాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ తన కంట్రోల్లోకి తీసుకురాలేక కళ్ళేన్ని వదిలేశాడు. ముందరికాళ్ళను నేలపై మోపలేక తడబడి, కిందపడ్డ గుర్రం, అశోకుని ట్రాకు మీద నుండి బయటకు విసిరేసింది. తన గావుకేకల వెనుక ఎటువంటి చలనమూ లేదు. తానింకా దౌడు తీస్తున్నామనే భ్రమలో, కింద పడినాసరే గుర్రం ఆవేశంగా దాని కాళ్ళను ఆడిస్తోంది. తనపై కూర్చున్నవాడిని వెతికే ప్రయాసతో తలను విదిల్చి పైకి లేచేందుకు ప్రయత్నించిన బ్లూ మౌంటైన్‌ నలువైపులా వెదకసాగింది. అశోక్ దేహం, గాయపడి ముడుచుకుపోయిన పావురంలా కుచించుకుపోయి, ఎటువంటి చలనమూ లేకుండా నేలకొరిగాడు. అతని ట్రైనర్, ఆషా,  మరికొంతమంది వేగంగా పరిగెత్తుకు వచ్చి అతనిని పైకి  లేపేసరికి అతడు స్పృహకోల్పోయున్నాడు. రేసు అయిపోయి, అందరూ అక్కడ నుంచి చెల్లాచెదురైయ్యాక కూడా, తనని ఏ ఒక్కరూ వచ్చి తీసుకెళ్ళలేదనే నిరాశతో, అశోకును వెతికివేసారి బ్లూ మౌంటైన్ మైదానంలో పరుగులు తీసింది.

జీవితంలో మరెన్నడూ గుర్రం ఎక్కలేని స్థితిలో ఆసుపత్రి నుండి తిరిగొచ్చినవాడిని కాస్తా ఆ ఇంటి నిర్మానుష్యం మరింత భయకంపితుడిని చేసింది. ఇంకెప్పుడూ జీవితంలో రేస్ కోర్స్ దిశగా తలెత్తి చూడకూడదన్నారు. తన చాతిభాగం నుండి రక్తం పొంగి ప్రవహిస్తోన్నట్టు అమితమైన వేధనకు లోనయ్యాడు అశోక్. యజమాని ఒకట్రెండుసార్లు వచ్చి పరామర్శించి వెళ్ళాడు. అతని గొంతులో ఒక విశ్వాసపాత్రుడైన పనివాడిని కోల్పోయామనే దిగులు కనబడింది. “ఆ గుర్రం వలన ఎటువంటి అదృష్టం లేదురా. పదిరేసుల్లో సంపాదించుకున్న విజయాలన్నింటినీ ఒక్కరోజులో తుడిచిపెట్టుకు పోయేలా చేసింది. ప్రాణానికి ఏమైనా అయ్యుంటే ఎవరు దిక్కు?” అన్నాడు. అతనిలాగే గుర్రం గురించి ఎవరెన్ని చెప్పినా దానికి సమాధానమివ్వడానికి అతడు ఆసక్తి చూపించలేదు. ఒంటరిగా వదిలివేయబడిన అతనిలో సదా గుర్రాలు దౌడు తీయడం మాత్రమే అతడికి ఎరుక. వెన్నెముకలోను, మెడ కింద ఎముకలు తీవ్రంగా నుజ్జునుజ్జు అయిపోవడంతో శరీరం తేరుకున్నప్పటికీ మునుపటిలా అతను తిరిగి గుర్రమెక్కి రేసులో పాల్గొనకూడదని వైద్యుల సలహా.

గుర్రం తప్ప మరే ఆలోచన లేనివాడిగా, మనుషులు లేని సమయాల్లో గుర్రం మీద కూర్చొనున్నట్టు ఊహించుకొని బయట ఉన్నటువంటి వీధివైపు చూసేవాడు. రాత్రిళ్ళు అతడి రూమ్ నుండి గుర్రాల సకలింపులను, రేసులో గుర్రాలు దౌడు తీసే శబ్దాలు  ప్రతిధ్వనిస్తున్నట్టు ఆషాతో చెప్పుకుని అమ్మ వాపోయేది. అశోక్ కళ్ళలోకి తొంగి చూసి నిజం తెలుసుకోవాలనుకున్న ఆషాకి అతడి కళ్ళు, గుర్రం కళ్ళలా మారిపోతున్నట్టు అనిపించింది. “రాత్రిళ్ళు పడుకో అశోక్,  నువ్వు మెలుకువగా ఉండి నిన్ను నువ్వు బాధపెట్టుకోవడంతో పాటు, నీ చుట్టూవున్న వాళ్ళను కూడా బాధపెట్టాలా చెప్పు? హ్మ్…”  అని అతడిని హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టేసరికి అతడు నవ్వాడు.

“అయితే నాకో హెల్ప్ చేస్తావా?  నా పాత రేసు వీడియోస్ నా ట్రైనర్ దగ్గర ఉంటాయి, అవి తీసుకొచ్చి ఇస్తావా?”  అతడి కళ్ళలో వెతుకుతున్న సమాధానాన్ని అర్థం చేసుకున్న ఆషా అది నిరాకరిస్తే గనుక తద్వారా అతడు తననే గుర్రంగా మార్చుకునే అవకాశం ఉండడంతో తీసుకువచ్చేందుకు ఒప్పుకుంది.

రాత్రీపగలు కన్నూమిన్ను తెలియకుండా టీవీలో రేస్ వీడియోలను చూస్తూ ఉండేవాడు. పాత ఘనవిజయాలనుండి తన సంతోషాలను వెలికి తీశాడు. ఆదా చేసుకున్నటువంటి డబ్బూ, ప్రేమ ఆదరణగా ఉండేసరికి శిక్షణలు, ఫుడ్ డైట్ ఏదీ లేని సరాసరి మనిషిగా జీవించడం అలవరుచుకున్నాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత యాభై కిలోలకు పైగా పెరిగిన శరీరబరువు,  ముఖము, శరీరం కాస్త ఉబ్బినట్టు మారిపోవడంతో అతడిని చూసి అతనికే నవ్వొచ్చింది. వీటన్నిటి కంటే ఇక ఎన్నటికీ చూసే అవకాశం లేనటువంటి తన గుర్రం జ్ఞాపకాలు మాత్రం ఏం చేసినా అతడి నుండి కనుమరుగయ్యేలా లేవు. దానిని కడసారి ముద్దు పెట్టి వీడ్కోలు చెప్పే అవకాశం కూడా లేని దురదృష్టం అతడిని వెంటాడింది.

“దాన్ని ఎవరు కొన్నారని నీకు తెలియదా ఆషా?”

ఆమె సమాధానం చెప్పేందుకు బదులు కోప్పడింది.

“ఇప్పుడు తెలుసుకుని ఏం చేయబోతున్నావు. సంవత్సరం పొడుగునా ఆ గుర్రంతోనే గడిపావు. గెలవకపోయినా, నిన్ను సురక్షితంగా తీసుకువచ్చి చేర్చాముగా! ఏదేమైనా అది ఒక జంతువేగా అశోక్.  దానికి మన భావోద్వేగాలేవి అర్థం కావుగా.  లివ్ ఇట్” అంది.

“అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడమాకు ఆషా. ఆ రోజు గెలవాలన్న ఒత్తిడిలో అది నేను చేసిన పొరబాటు. పాపం దానికి ఆ గుర్రమేం చేస్తుంది చెప్పు?  నా ఉద్వేగాలన్నీ దానికి అర్థం అవుతాయి ఆషా.  నేను చివరిసారిగా దాని మెడపై ముద్దు పెట్టినప్పుడు చిన్నగా కాస్త పులరింతకు లోనై ఒక్కసారిగా జూలు విదిల్చిందిగా.. అది  ప్రేమ కాక ఇంకేమిటంటావ్?

గుర్రం చివరిసారి తల విదల్చడం తనకింకా గుర్తుకుంది.

“ఏదైతేనేం…షట్ ఇకపై మనకు రేసులొద్దు; గుర్రాలూ వద్దు, మరేది వద్దు” అని  అన్న ఆషా కళ్ళలో అతను చూసిన భయాన్ని తన ఇంట్లోవాళ్ళ అందరి కళ్ళలోనూ చూశాడు. తనపై అందరికీ ఉన్నటువంటి కారుణ్యమూ, ప్రేమ నిజమైనవి. అయితే గుర్రాలు తప్ప మరేది తెలియని ఒక వ్యక్తి, ఇకపై తనేం చేయగలడు.  ఇంటి చుట్టూ వాకింగుకు వెళ్ళే మాంసపు ముద్దలా తనను తాను చూసుకునేందుకు అతడు సుముఖంగా లేడు. మానవ శరీరపు ప్రేరణ ఎన్నటికీ వట్టిపోదు. కొన్ని సమయాల్లో నియంత్రించలేనటువంటి వ్యాధులు కూడా దరి చేరనియ్యని శక్తివంతమైనవి. అటువంటి ప్రేరణలను తాను వృధా కానివ్వకూదదని నిశ్చయించుకున్నాడు.

కాస్త లేచి తిరగడం మొదలవ్వగానే పాత యజమాని ముందుకెళ్ళి ఎప్పటిలానే నిలబడ్డాడు. “సార్! నేను కొద్ది రోజులు ట్రైనరుగా పని చేస్తాను… జీతం మీకు తోచినంత ఇవ్వండి.  రేస్ తప్ప నాకింకేం తెలుసు”  అన్న అతడిని చూసేందుకు పాపంగా ఉన్నప్పటికీ, తన ఆరోగ్యం ఈ స్థితిలో పెట్టుకుని, ఇంకెలా గుర్రాన్ని, జాకీని అతడు ట్రైన్ చేయగలడు అని దిగులుపడ్డాడు.  అలాగని అతడిని తన మానాన వదిలే ఆలోచన కూడా లేదు.

“ఒక పనిచేద్దాం అశోక్,  కొత్తగా కొన్ని గుర్రాలను కొన్నాను. కొద్ది రోజులపాటు వాటన్నిటిని ట్రైన్ చెయ్. నీకు ఆరోగ్యం కాస్త కుదుటపడగానే మన దగ్గర ఉన్నటువంటి జాకీలను కలిపి ట్రైన్ చేద్దువుగాని”  అని ఉత్సాహంగా చెప్పాడు.

 అశోక్ అందుకు సంతోషంగా సమ్మతించాడు. తనకూ, గుర్రాలకూ ఉన్నటువంటి అనుబంధం అంత తేలిగ్గా తెగిపోయేది కాదు. గుర్రాల రోమాల వాసన, తుమ్ముతున్నప్పుడు వచ్చే శబ్దము అతని చుట్టూ అలుముకోవడంతో, కొత్త గుర్రాలపై అతడికున్న ఆసక్తి అతని లోపల పరిపూర్ణంగా నిండిపోయింది.

సరిగ్గా నూటఎనభై రోజుల తర్వాత మళ్ళీ పాత మనిషిగా డర్బీ యజమాని స్టడ్‍కు జీపులో వచ్చి చేరుకున్నాడు. అతనితోపాటు మరో ఇద్దరు ఆ స్టడ్‌లో ఉన్నప్పటికీ అశోక్‌పై ఉన్న మర్యాద నిమిత్తంగా వాళ్ళు అతడిని ఏ పని చేయనిచ్చేవారు కాదు.

“ఏం చెయ్యాలో మీరు ఉత్తర్వు ఇవ్వండి బాబు, మేము చూసుకుంటాం”  అని చెప్పిన వారికి కృతజ్ఞత చెప్పి, అటు నుంచి అటు గుర్రాలను చూసేందుకు వెళ్ళాడు. అన్నీ కూడా లొంగదీసుకున్న గుర్రాలే. రేసులకు అనువుగా పెంచబడ్డ వాటి పొగరు దాని శరీరమంతా ఉప్పొంగి కాంతితో మెరవసాగాయి.  కొత్త గుర్రాలతో మొదలైన ఆరోజు, అతడిని కొత్త మనిషిగా మార్చింది. బ్లూ మౌంటైన్‌ రంగులోనే, దానికుమల్లే అదేలా ఒక గుర్రం, ఈ గుంపులోనూ ఉంది. ఆరోజు గుర్రాలను స్నానం చేయించేందుకు తీసుకువెళ్ళినప్పుడు యవ్వనంలోని దాని రూపం, నీటి ఒడ్డున చలనం లేకుండా నిలబడి ఉండడాన్ని తనివితీరా చూసి ఆస్వాదించాడు. సబ్బును కొరకడం కోసం వచ్చే చిన్నచిన్న చేపలకు మధ్యన, చెరువు మట్టి కూరుకుపోయిన అడుగు బాగాన ప్రతిఫలించే గుర్రం బింబాన్ని చూస్తున్నటువంటి అతడికి ఒక క్షణం, ఇది  బ్లూ మౌంటైన్  ఆత్మ అయ్యుంటుందేమో అనిపించింది.

గుర్రాలు రేసుకు సిద్ధమవుతున్న వేళల్లో అతడి ఆత్మ మాత్రమే మైదానంలో అలరారుతుండేది. ఆ మైదానాన్ని విడిచి తను మాత్రం ఎక్కడికి వెళ్ళగలడు?  కేవలం రేస్ కోసం మాత్రమే మైదానానికి వెళ్ళినవాడు మొక్కుబడికి వెళ్ళి నిలబడి చోద్యం చూడడం సుతరాము ఇష్టం లేదు. తను పరామర్శించే గుర్రాలను శ్రద్ధతో పరిరక్షించేవాడు. తన భార్య ఆషా కొరకు హెచ్చించిన సమయం కంటే ఎక్కువ సమయం అతడు స్టడులోనే వెచ్చించడం, మొదట్లో కొన్ని రోజులు ఆమెకు బాధ కలిగించింది. ఆ తర్వాత ఆమె కూడా దానికి అలవాటు పడిపోయింది. తనను ముద్దు పెట్టేందుకు దగ్గరకొస్తే “గుర్రాలోడా నీ మీద ఒకే గుర్రం కంపు, నా దగ్గరికి రామాకు…  నువ్వు మనిషివా, గుర్రానివా అని నాకు ఒకే అనుమానంగా వుంది”  అని అతడితో సరదాగా పోట్లాడేది.

మరొక్కమారు అతడు రేస్ కోర్సులో అడుగుపెట్టిన రోజు అతడు సంరక్షించిన గుర్రం తన మొదటి విజయం ద్వారా మళ్ళీ అందరిని అతడి పేరును ఉచ్చరించేలా చేసింది. ఎవరో ఒకరి విజయం వెనుక, తన శ్రమ కూడా ఉందని అతడికి ఆత్మసంతృప్తి కలిగింది. అది నూతన భవిష్యత్తు దిశగా కల్లాకపటం లేని అతని ఆసక్తికి దక్కిన విజయం. ఆ రోజును ఎంతగానో ఆస్వాదించాడు. ఆషా అతనికి ఇష్టమైనటువంటి స్కాచ్ కొని  ఇచ్చింది. లోగడ ఫుడ్ డైట్ కారణంగా చాలా తక్కువగా తాగేవాడు. ఇప్పుడు తన ఆత్మ చల్లారే వరకు తాగుతున్నాడు.  మూడో రౌండు విస్కీ తాగిన తర్వాత, తట్టుకోలేక అతని లోపల పేరుకుపోయిన బ్లూ మౌంటైన్‌ జ్ఞాపకం వెంటాడింది.  తాగిన ప్రతిసారి దాని జ్ఞాపకం రాకమానదు. తను లేనటువంటి వెలితి ఏదో ఒక మూల ఆ జీవి బ్రతికివుంటుందిలే?  తన విజయాలు సంతోషాలు, నొప్పి, ఒంటరితనం అన్నిటిని వినేందుకు ఆషా ఉంది. మునుష్యులైతే వారి జీవితం గురించిన సాధబాధకాలను ఎవరితోను పంచుకోకుండా ఉండలేరు. పాపం ఇవన్నీ ఆ గుర్రం ఎవరితో పంచుకుంటుంది.

కొన్ని నెలలు గడిచాయి. ఇప్పుడు తన యజమానికి అన్ని తనే. గుర్రాలు, జాకీలు, గుర్రాల మీద కట్టే బెట్టింగు ఇలా ప్రతిది తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. రేస్ కోర్స్‌లో సగానికి పైగా వ్యక్తులు అతడిని చిన్న దొరగారు అనే పిలుస్తారు. బెంగుళూరులో ఎక్కువ రేసింగులు గెలిచిన ఒక జాకీని తనకోసం మాట్లాడి తీసుకురమ్మని యజమాని అతడిని పంపించాడు.  ఎన్నోరోజుల తర్వాత బయటకు ప్రయాణమవ్వడం వలన, అతడు ఆషాను వెంట తీసుకువెళ్ళాడు. అతడు రేసు విషయంగా ఈ ఊరికి అనేక సార్లు వచ్చాడు కానీ, ఇప్పుడు సాధారణంగా రావడంలో ఒకింత దిగులుంది.

రూములోనే ఉండడం ఇష్టం లేక ఆషాను ఒక సర్కస్ ప్రదర్శనకు వెంట తీసుకువెళ్ళాడు. జీవితంలో తాను చూడనున్నటువంటి మొట్టమొదటి సర్కస్ ప్రదర్శన అదే. వాస్తవానికి అతడే ఒక  కనికట్టుగాడు. కొన్ని  ఫీట్స్ పూర్తవ్వగానే, చటుక్కున ఒక గుర్రం సర్కసు మధ్యలో వచ్చి నిలబడేసరికి అతడికి ఆ గుర్రాన్ని ఎక్కడో చూసినట్టు బుర్రలో తళుక్కున మెరిసింది. అది బ్లూ మౌంటెనే అని గుర్తించేందుకు అతడికి ఎక్కువ సమయం పట్టలేదు.  దట్టమైనటువంటి మెడ వెనక జూలు కత్తిరించబడి, బాగా సంరక్షిస్తున్నట్టు అనిపించింది. మునుపటి కంటే బాగా ఏపుగా ఉంది. పరిగెత్తే అవసరం లేకపోయేసరికి, బహుశా బరువు పెరిగి ఉండవచ్చు. అయితే ఇప్పుడు దానికి ఉన్నటువంటి లక్షణాలు మరే గుర్రంలోనూ చూడలేము. అది వాల్ట్స్ నృత్యం చేస్తుంటే ఏపుగా పెరిగిన దాని అవయవాలు, కాళ్ళు, చెవులు, ముఖం,  నడుము ఇలా దాని శరీర భాగాలన్నీ దాని స్వాధీనంలోనే ఉన్నాయి. దానికి ఏమైనా అయిపోద్దేమో, అక్కడ మరేదైనా గందరగోళం ఏర్పడుతుందేమోనని అదే పనిగా భయపడుతున్నాడు. కానీ నిజానికి అక్కడ అటువంటి సంఘటనలేవి చోటుచేసుకోలేదు. తన పాత గుర్రాన్ని మళ్ళీ తిరిగి చూసినందుకు సంతోషించాలా? లేదా బాధపడాలా అన్న సంగతే అతనికి అర్ధం కాలేదు. చివరిలో సంతోషించిన వాడిలా, తనని తాను చూపించుకోవడం వలన అతడు తన బాధను లోలోపలే దాచుకోగలిగాడు. అది అక్కడ నృత్యం చేయగానే  ప్రేక్షకులందరూ హర్షద్వానాలు చేశారు. వారివారి విన్నపాలకు అనుగుణంగా అది మళ్ళీ నృత్యం చేయసాగింది. ఆపై సర్కస్ మధ్యలో నిలబడి నలుదిశలా ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ప్రేక్షకులు మళ్ళీ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. మరొక్కసారి నృత్యం చేయమని అర్ధించారు. అయితే అది అంతకు మించి నృత్యం చేసేందుకు సుతరాము ఇష్టపడలేదు. అక్కడి సంగీత వైద్యకారులకు శిరసు వంచి కృతజ్ఞతలు తెలిపింది. సంగీత వైద్యకారులు దానికి ప్రతి నమస్కారం చేశారు. దాని శిక్షకుడు ఆ ప్రదేశం విడిచి వెళ్ళివల్సిందిగా తలాడించి దానికి సైగ చేశాడు. ఆపై నవ్వుతూ దాని వెనకే నడిచాడు. అశోక్ దాన్ని దగ్గరగా పిలిచేందుకు ప్రయత్నించాడు. ప్రజల అరుపుల మధ్య అది కచ్చితంగా దానికి వినబడే అవకాశం లేదు. బహుశా బ్లూ అన్న అతడి పిలుపు మాత్రం దాని చెవిలో చిన్నగా వినబడి వుండవచ్చునేమో. కొద్ది క్షణాలపాటు అది అతడినే తదేకంగా తిరిగి చూసింది. అది అతడిని చూసిన ఆ కొద్ది క్షణాలు తన పాత బ్లూ మౌంటైన్‌లా దాని కాఫీరంగు కళ్ళు పరవశంతో మిరుమిట్లు గొలిపాయి. అతడిని చూసి మధ్య మధ్యలో కొన్నిసార్లు శరీరాన్ని విదిలించి ముందుకు వెనక్కి కుదుపుకుంటూ వెళ్ళింది.

అశోక్ ఉత్సాహంతో చప్పట్లు కొట్టి, సంతోషంగా దానిని చూస్తూ బిగ్గరగా అరిచాడు. తన ఆజ్ఞలను అతిక్రమించిన గుర్రాన్ని లోపలికి వెళ్ళమని శిక్షకుడు కటువుగా ఆదేశించాడు. చెదిరిన అశోక్ బింబాన్ని తన జ్ఞాపకాల నుంచి పక్కకు విసిరేసి, తను చూసిన ఆ కొత్తమనిషి తాలూకా బింబాన్ని తనలి నింపుకొని బ్లూ మౌంటైన్‌ తన మార్గాన అది యథాలాపంగా నడిచింది. అతని కంటే ముందు, అతని తర్వాత ఎంతోమంది దానిని సంరక్షించే ఉండివుంటారు. అంతమాత్రాన అది అందరికీ సొంతమైపోతుందా ఏంటి? తన కొత్త యజమాని ఆజ్ఞలను కొంచెం కూడా అతిక్రమించకుండా, అతడి కనుసన్నలలో నడుస్తున్న దాని వన్నె తరగని అందాన్ని ఇప్పటికీ ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు అశోక్. మరొకమారు దాన్ని పిలుద్దామా?  అని ఆలోచించి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆషాతో వడివడిగా బయటకు నడుచుకుంటూ అక్కడ నుంచి తిరిగెళ్ళిపోయాడు.

లక్ష్మీ శరవణకుమార్

1985 లో మధురైలో జన్మించిన  ‘లక్ష్మీ శరవణకుమార్’ సమకాలీన తమిళ రచయిత. స్వతహాగా రచయిత అయినటువంటి ఆయన ప్రస్తుతం సినిమా రంగంలో దర్శకత్వశాఖలో పనిచేస్తున్నారు. ఇంతవరకు 8 నవలలు, 80 కథలు రచించారు. ‘భారతీయుడు-2’ సినిమాకి జయమోహన్‌తో కలసి స్క్రిప్ట్,మాటలు రాశారు. మధ్యతరగతి మనుష్యులు వెతలు, శ్రమదోపిడి, లైంగిక దాడులు అతని కథా వస్తువులు. 2016 లో తన ‘కాణగన్’ నవలకు వరించిన యువ పురస్కార్‌ను జల్లికట్టుకు మద్దతునిస్తూ తిరస్కరించారు. ప్రస్తుతం తాను రాసిన కథనే దర్శకత్వం వహించే పనిలో నిమగ్నమయ్యారు.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *