ప్రతి వర్తమానం
కొన్ని పాత్రల క్లైమాక్స్ -
తెరలేచినట్టు
అంకం ముగిసినట్టు
నిష్క్రమించే పాత్రల నిరంతరత -
ఏ రంగు డబ్బాలో ముంచి తీసినా
నీ చేతులకు తప్ప
కాలం కుంచెకు రంగులేవీ అంటుకోవు
నిత్యవానలా ఎన్ని కన్నీళ్లున్నా
ఏ అసంకలిత దుఃఖాన్నీ
అవని తన భుజాల మీద మోయదు
సమస్త వాతావరణం
ఊపిరి బిగబట్టుకునే ప్లాట్ పాయింటో
ఆశ్చర్యపరిచే కథాగమనమో
సమ్మోహన వ్యక్తిత్వాలుండే పాత్రలో
ఏ రంగానికి ఆ రంగాన్ని
రక్తి కట్టిస్తూనే ఉంటాయి
గురి చూసి పిల్లాడేసిన గోళీకాయ
బచ్చీ చుట్టూ కునుకు తిరిగినట్టు
ఎప్పటిలా పెదాల మీద చిరునవ్వుతో
భూమి సూర్యుణ్ణి కవ్విస్తుంటుంది
సంతోషాలు ముట్టడించే రాచవీడులా
నొప్పిలేని తనానికి రాజధానవుతావో
దిగులు దిక్కుకి తలవాల్చే అలబొద్దులా
నవ్వుమాసిన తలాల మీద నల్లమబ్బవుతావో
నీ ఇంటిని నువ్వు
ఎలా చిత్రించుకుంటావో
నీ ఇష్టం
పిట్ట అరుపుని పాట అని వర్ణించిన
తొలి రసజ్ఞ శ్రోతని ఆరాధిస్తావో
పక్షి కూతని వెక్కిరింత అనుకుని
ధిక్కరిస్తావో
నీ ఇష్టం
పదహారొందల కోట్ల కళ్ళతో
కిటకిటలాడుతున్న ఈ నాటక ప్రాంగణంలో
నీ కోసం పుడమి కన్ను చెమ్మగిల్లే
ఒక్క సన్నివేశమైనా ఉంటే చాలు!
(11-07-2024 : ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా..)