ఆకలిగొన్న వారి పక్షమే సాహిత్యం

Spread the love

సాహిత్యమంటే అర్ధం వెలుగు. సాహిత్యపు ధర్మం దుర్వాసన నుండి మనిషిని సువాసన దిశగా ముందుకు నడిపించడమే. అందుకు అతిగొప్ప నిదర్శనం మహాభారతమే.

మనలో చాలామందికి మహాభారతంలో సత్యవతి అనే పురాణ స్త్రీ తెలుసుండొచ్చు. ఆమె ఒక పడవను నడిపే సరంగి. పరవళ్ళు తొక్కే గంగా జలంలో మనుష్యులను ఇవతలి తీరం నుండి అవతలి తీరానికి తీసుకువెళ్ళే ఆ సరంగి మహిళ ఎంతో సౌందర్యవతి.

ఆమె దేహం నుండి ఎప్పుడూ వీచే చేపల కంపు వలన ఆమె వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడరు, ప్రేమించరు.

ఒకరోజు పరాశర మహర్షి సత్యవతిని కలిశారు. ఆమెపై మనసు పారేసుకొని, మోహ పారవశ్యుడై, ఆమె కూడా అందుకు సమ్మతించడం వలన వారి కలయిక వలన వ్యాసుడు జన్మించాడు. ఈ ప్రపంచపు అత్యంత గొప్ప తత్వజ్ఞాని, కావ్యకర్తగానే అతడు మన అందరికీ సుపరిచితుడు. వ్యాసుడు జన్మించి భూమిపై పడ్డ మరుక్షణమే ఎన్నో ఏళ్ళుగా సత్యవతి దేహం నుండి వెలువడుతున్న చేపల కంపు ఆమె నుండి కనుమరుగవుతోంది.

ఒకనిపై కళ లేదా సాహిత్యపు వాసన వీచేటప్పుడు అతనిలో గతంలో వున్నటువంటి అన్ని రకాల దుర్వాసనలు, మాలిన్యాలు తొలగిపోతాయని ఈ కథ ద్వారా మనకు అవగతమవుతోంది.

సత్యవతికి పుట్టిన మరో ఇద్దరు కొడుకులు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వారు అంబిక, అంబాలిక అనే ఇద్దరు యువరాణులను వివాహమాడారు. అయితే ఆ వెనువెంటనే ఆ ఇద్దరూ పుత్రులు చనిపోయారు. రాణులు ఇద్దరు యవ్వనంలోనే వైధవ్యం అనుభవించడంతో సత్యవతి భీష్మునితో మొరపెట్టుకుంటుంది.

ఇకపై ఈ రాజ్యాన్ని ముందుకు నడిపించేందుకు నాకు సంతతి కావాలి. కొత్తతరం రావాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకు ఏం చెయ్యాలి? అని అడుగుతోంది.

అందుకు భీష్ముడి వద్ద ఎటువంటి సమాధానం లేదు.

అప్పుడు సత్యవతి తన దివ్యదృష్టితో ఒక విషయాన్ని చూస్తోంది. నాకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు గతంలో పరాశర మహర్షి వలన కలిగినవాడు. ‘అమ్మా!  నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ కళ్ళెదుట ప్రత్యక్షమవుతాను’ అని చెప్పి భూమిపై పడ్డ మరుక్షణమే అక్కడి నుండి వ్యాసుడు అదృశ్యామవుతాడు. సత్యవతి అతడిని మనసులో తలచిన మరుక్షణమే ఆమె ఎదుట ప్రత్యక్షమవుతాడు.

వ్యాసుడు ఆ ఇద్దరి విధవలను పెళ్ళి చేసుకునేందుకు సమ్మతిస్తాడు. అంబిక, అంబాలిక ఇద్దరూ వ్యాసుడు ఎంతో బలవంతుడు, ధృడకాయుడు, అందగాడనుకొని కలలు కంటారు. కానీ వ్యాసుడు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. ఐదడుగుల కంటే తక్కువ ఎత్తు, ఏ మాత్రం పొంతన లేని కురూపి రూపం, చెమట కంపు కొడుతూ ఉంటాడు.

అంబిక పడక గదిలోకి వ్యాసుడు ప్రవేశించగానే, అతడి రూపం చూసి భయపడి ఆమె తన కళ్ళు మూసుకొంటుంది. వారి రూపంలోనే గుడ్డివాడు అయినటువంటి ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు.

కళ, సాహిత్యము ఎదురుపడినపుడు ఎవరైతే తమ కళ్ళను మూసుకుంటారో వాళ్ళు గుడ్డివాళ్ళగానే మిగిలిపోతారు. వారిని చీకటి కమ్ముకొంటుంది. వారి ద్వారానే విశ్వంలో యుద్ధాలు మొదలవుతాయి. వారి వలనే సమాజ శాంతికి భంగం కలుగుతుందని మహాభారతం చెబుతుంది.

ఆ తరువాత అంబాలిక వస్తోంది. వ్యాసుడ్ని చూసిన ఆ మరుక్షణమే ఆమె ముఖం వాడిపోతుంది. ఆమెకు మగతనం లేని పాండురాజు జన్మిస్తాడు. గుడ్డివాని నుండి, మగతనం లేని వారి నుండి మనకు ఎటువంటి సత్ఫలితాలు లభ్యంకావు. మనం ఏళ్ళతరబడి ఇటువంటివారి వలనే పరిపాలించబడుతున్నాం. వారి ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ కళా, సాహిత్యం అన్నవి ఉత్పాదన లేని, చీకటి పేరుకుపోయిన మనసుతో నిండిన వారిపై  ఎదురొడ్డి నిలిచే యుద్ధప్రకటన.

సాహిత్యం ఎప్పుడూ నిస్సహాయులు, ఆకలిగొన్నవారి పక్షం నిలబడే ఒక మహాశక్తిగా పరిణమించాలి.

– సంతోష్ ఏచ్చిక్కానం

Santhosh Aechikkanam

1971 లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో సంతోష్ ఏచ్చిక్కానం జన్మించారు. సంతోష్ తన 41 వ యేటనే ఉపాధ్యాయ వృత్తిని విడిచి పూర్తి స్థాయి రచయితగా కొనసాగుతున్నారు. మళయాళంలో తన 'బిర్యాని' కథ పెనుసంచలానాన్ని సృష్టించింది. కేరళ సాహిత్య చరిత్రలో 1,00,000 కు పైగా కాపీలు అమ్ముడు పోయిన కథా సంకలనంగా రికార్డుల కెక్కింది. ఇంతవరకు తన రచనలకి గాను 25 అవార్డ్స్ అందుకున్నారు. అందులో కొమలా కథకుగాను కేరళ సాహిత్య అకాడమీ కథా పురస్కారం, ఢిల్లీ కథా పురస్కార్, కలకత్తా భాషా పరిషత్ పురస్కార్ కీలకమైనవి.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *