అనువాద సాహిత్యం (తెలుగులోకి – తెలుగులోంచి)

Spread the love

అనువాద సాహిత్యాన్ని గురించి యిటీవలి కాలంలో ఆంధ్రదేశంలో వ్యాపించిన కొన్ని అపప్రథలను గురించి ప్రస్తావించడం యిక్కడ అప్రస్తుతం కాదనుకొంటాను.

అనువాద సాహిత్యం చదవడమూ, దాన్ని ఆదరించడమూ బానిస బుద్ధిని సూచిస్తుందన్నది అపప్రథే అయినప్పటికీ, యిటీవలికాలంలో అనువాద సాహిత్యంపట్ల ఆంధ్రదేశంలో ఎందుకోగాని అనాదరణ ప్రబలిందనడం మాత్రం యధార్థం.

సాహిత్యం అచ్చంగా భాష ఒక్కటే కాదు. అందులో జాతీయాలూ, సంప్రదాయాలూ కూడా వుంటాయి. అనువాదకులు వాటిని కూడా శ్రమపడి అనుసరించి, అనువదిస్తేనే అనువాదాలు ఫలప్రదమవుతాయి. రసస్ఫూర్తిని కల్గిస్తాయి. ఆటువంటి అనువాదాలు పాఠకుల దృక్పథాన్నే కాకుండా, రచయితల దృక్పథాన్ని కూడా విశాలం చేస్తాయి. అటువంటి రసవంతమైన ఆనువాదాలు ఎక్కువగా రాకపోవడమే అనువాదాలపట్ల యిటీవల ప్రబలిన తేలిక భావానికి కారణమా? పరిశీలించాల్సి వుంది.

అనువాదాలు యితర భాషానువాదాల నుండి కాకుండా మూలభాష  నుండి చేసుకోవడం వాంఛనీయం. సోవియట్ యూనియన్ లో యిదే పద్దతి విస్తృతమైన స్థాయిలో అనుసరింపబడుతూండటం మనందరికీ తెలిసినదే.

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు ఆనువాదాలను గురించి చెప్తూ అన్న ఈ క్రింది మాటలు గమనార్థాలు : “నేను సొంతంగా రాశాను. అనువాదాలూ ఈ చేశాను. నా అనుభవంలో, సొంత రచనకన్న అనువాదాలు నాలుగింతలు కష్టం”.

* *   *

తెలుగులో మౌలిక మైన రచనలుగా చలామణీ అయిన, అవుతున్న అనేక రచనలకు యితర భాషల్లో మాతృకలుండటం నిశితదృష్టితో గ్రంథ  పఠనం చేసేవారికి తెలిసిన సత్యం. వచ్చిన చిక్కూ, బాధా ఏమిటంటే, యివి అనువాదాలు లేక, అనుసరణలు అని రచయితలు చెప్పక పోవడం; అలా చెప్పుకోవడం నామోషీగా భావించడమే : అనువాదం చేయడం మౌలిక రచనకన్న ఏవిధంగానూ తీసిపోదని అటు రచయితలూ, యిటు పాఠకులూ గ్రహించిననాడు యిలాటి అప్రదిష్టపనులు జరుగవనీ, దౌర్భాగ్యపు పద్ధతులు అనుసరింపబడవనీ గట్టిగా చెప్పవచ్చు.

ఈ దృష్టితో తెలుగులో అనువాద సాహిత్యంపై నేను చేసిన పరిశీలనను  మీ ముందుంచుతాను.

* * *

తెలుగులో వెలుగులోకి వచ్చిన ఆదికావ్యం ‘మహాభారతమే’ అనువాదం కావడం తెలుగుభాషకొక ప్రత్యేకత అనే చెప్పాలి. తదాదిగా సంస్కృతం నుండి తెలుగు భాషలోకి అనూదితాలైన గ్రంథాల సంఖ్యను అంచనా వెయ్యడం ఏమంత తేలికైన పని కాదు. అనువాదాల వలన తెలుగు సారస్వతం సుసం పన్నమైనదే గాని, అది కోలుపోయినదేమీ లేదు.

అలాగే దేశ, విదేశీభాషల్లోని నిగ్గును అనువాదాల రూపంలో లోకి తెచ్చుకొని, తెలుగు సాహిత్యాన్ని మరింత సంపద్విలసితం చేసుకోడానికి అపారమైన కృషే జరిగింది. ఆ నిగ్గుతోబాటు ఎంతో తప్పా తాలూ కూడా అనువాదాల రూపంలో తెలుగులో ప్రవేశించాయి.  

అందుకనే, యితర భాషలనుండి అనువాదాలు చేసుకునేటప్పుడు విచక్షణతో కూడిన ఒక ప్రణాళిక ననుసరించి చేసుకోవడం అవసరం. లేకపోతే అది వాపేగాని బలుపు కాబోదు.

అలాగే, యీ అనువాద కార్యక్రమం ఏకముఖంగా సాగకూడదు. పరస్పరం ఒక భాషనుండి మరొక భాషలోకి జరగాలి. విచక్షణతో జరగాలి. తగుమాత్రంగా జరగాలి.

అలాకాక, అతిగా జరిగిననాడు స్వభాషలో సృజనాత్మక కృషి కొంత దెబ్బతినే ప్రమాదంకూడా లేకపోలేదు.

ఈ ఆదాన ప్రదానాలన్నవి సమతూకంలో జరగకపోతే, వివిధ భాషలు మాట్లాడే జాతులమధ్య, దేశాల మధ్య అనువాదాలు పరస్పర సదవగాహనకూ, సద్భావానికి తోడ్పడవలసినంతగా తోడ్పడజాలవు.

తెలుగు భాషలో వచ్చిన యితర భాషా సాహిత్యనువాదాలను స్థాలీపులాకంగా సింహావలోకనం చేసుకుంటే, యీ  రంగంలో ముందు ముందు  జరగవలసిన కృషి యేమిటో తేలికగా అవగతమవుతుంది.

సంస్కృత సాహిత్యం తర్వాత, తెలుగులోకి ఎక్కువగా వచ్చినవి ఆంగ్లాను వాదాలు.  సుమారు రెండు శతాబ్దాల పరిపాలన కాలంలో  బ్రిటిష్ రాజభాషయైన ఇంగ్లీషులో విద్యాబోధన జరగడమే దీనికి మూలకారణం. ఆంగ్ల భాషా సంపర్కంవల్ల ఆంగ్ల సాహిత్యంతోనేగాక రష్యన్, ఫ్రెంచి

తదితర పాశ్చాత్య భాషా సాహిత్యాలతో కూడా మనకు, పరిచయం  ఏర్పడింది. తెలుగువారి దృష్టి విశాలమైంది. అంతర్జాతీయతా దృక్పథం  అలవడింది. పారిశ్రామిక నాగరికతా ప్రభావంవల్ల ఆయా విదేశ భాషల్లో నిత్య నూతన రూపాల్లో వెలువడుతున్న సాహిత్యం తెలుగువారికి అందుబాటులోకి  వచ్చింది. తద్వారా స్వాతంత్ర్యం, శాంతి, అభ్యుదయం, జాతుల మధ్య సమానత్వభావం, స్త్రీ పురుష సమానత్వం, సమాజంలో అట్టడుగున పడి మగ్గుతున్న వర్గాలవారి దయనీయస్థితి, ప్రపంచంలోని  సంపదనంతటినీ కష్టించి సృష్టించే కష్టజీవులకు తిండి, బట్ట, యిల్లు మొదలైన కనీస నిత్య జీవితావసరాలు కూడా తీరని సమాజాల ఉనికి, 1848 నాటి విప్లవాలు, అమెరికన్ విప్లవం, ఫ్రెంచి విప్లవం, ప్రపంచ చరిత్రనే పెద్ద మలుపుతిప్పిన 1917 నాటి రష్యన్ మహా విప్లవాలకు సంబంధించిన వివరాలు, విశేషాలు తెలుగువారికి వివిధ సాహిత్యరూపాల్లో అందుబాటులోకి వచ్చాయి. వారిలో అభ్యుదయ భావస్పందన ప్రారంభమైంది. ఇంగ్లీషునుండి తెలుగులోకి పుంఖాను పుంఖాలుగా అనువాదాలు వెలువడ్డాయి.

ఆంగ్లభాష నుండి వెలువడినన్ని ఆనువాదాలు దేశీయ భాషల్లో ఏ ఒక్క దానినుండి తెలుగులోకి రాకపోవడం గమనార్హమైన విషయం.

కందుకూరి వీరేశలింగంగారి కాలం నుండి తెలుగులో ఆధునిక పాశ్చాత్య సాహిత్యమే కాక, మనదేశంలోని యితర భాషా సాహిత్యాలు కూడా అనువాదాల రూపంలో అవతరించాయి. వాటిలో వంగ, హిందీ సాహిత్యాలు ప్రధా నంగా పేర్కొనదగినవి.

జాతీయోద్యమ క్రమంలో జాతీయ భాషోద్యమం ప్రారంభమైంది. దక్షిణాదిన దక్షిణ భారత హిందీ ప్రచారసభ స్థాపించబడింది. లక్షలాదిమంది హిందీ భాషాభ్యాసానికి పూనుకొన్నారు. హిందీ సాహిత్యానువాదం ప్రారంభమై హిందీ కావ్యాలు, నాటకాలు, నవలలు, కథలు తెలుగులోకి అనువదింప బడ్డాయి. హిందీ పదాలు తెలుగులోకి వచ్చాయి.

మఖన్ లాల్  చతుర్వేది, మైధిలీశరణ్ గుప్తల  కవితా ఛాయలు, వేదుల, కరుణశ్రీల కావ్యాలలో కనిపిస్తాయి.

సుమిత్రానందన్ పంత్ రసవత్తర కవితలకు రాచకొండ నరసింహమూర్తి, బైరాగి, దాశరథి, దండమూడి మహీధర్, దుర్గానంద్, నాయని సుబ్బారావులు చేసిన అనువాదాలు ఆకాశవాణిలో ప్రసారితమై తదుపరి ”స్రవంతి’ ప్రత్యేక సంచికలో ప్రచురింపబడ్డాయి.

భాగవతుల నరసింహశర్మ, మైలవరపు సూర్యనారాయణమూర్తి, ఏలూరుపాటి లక్ష్మీసరస్వతి, కేశవతీర్థ స్వామి ప్రభృతులు తులసీదాస్ రామ చరిత మానసాన్ని అనువదించారు.

మీరాబాయి పదాలను ఓరుగంటి రామచంద్రయ్య అనువదించారు.

శ్రీ వావిలాల సోమయాజులు జయశంకర ప్రసాద్ ‘కామాయని’ని అనువదించారు.

కష్టజీవుల పట్ల సానుభూతి కలిగిన హేతువాది రామారీ సింహా ‘దినకర్’ వ్రాసిన ‘కురుక్షేత్ర’ కావ్యం తెలుగులోకి అనువదింపబడింది.

ప్రేమచంద్ గొప్ప ప్రజా రచయిత. అభ్యుదయ రచయితల ఉద్యమ సంస్థాపకుల్లో ఒకరు. జమీందారీ వ్యవస్థను నిరసిస్తూ, కష్టజీవులైన రైతులపట్ల సానుభూతిని ప్రకటించే నవలలు, కథలు, వ్యాసాలు అనేకం రచించారాయన. దాదాపు అవన్నీ కూడా తెలుగులోకి అట్లూరి పిచ్చేశ్వరరావు, ఛాయేశ్వర్, ఆలూరి భుజంగరావు ప్రభృతులచే అనువదింపబడ్డాయి.

జైనేంద్ర కుమార్, బృందావన్ లాల్ వర్మ, ఇలా చంద్రజోషి మొదలైనవారి రచనలుకూడ తెనిగింపబడ్డాయి.

ప్రముఖ అభ్యుదయ రచయిత మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ నవలలు సింహ సేనాపతి, వోల్గా సేగంగా, జయయౌధేయ, విస్మృత యాత్రికుడు ఘుమక్కడ్  శాస్త్ర మొదలైనవి తెలుగులోకి ఆలూరి భుజంగరావు, అల్లూరి సత్యనారాయణరాజులు అనువదించారు.

యశపాల్ ‘దివా’ మొదలైన రచనలు శ్రీ పోలు శేషగిరిరావుచే అనువదింపబడ్డాయి. శ్రీ పి. వి. నరసింహారావు శ్రీ విశ్వనాధ వెయ్యిపడగలు ‘సహస్రఫణ్’  పేర హిందీలోకి అనువదించారు.

అయితే, తెలుగునుండి హిందీలోకి అనువదింపబడిన రచనల సంఖ్య మాత్రం చాలా పరిమితంగా వుంది. ఉన్నవ లక్ష్మీనారాయణగారి “మాలపల్లి”, అరిగెపూడి రమేష్ చౌదరిచే అడవి బాపిరాజుగారి “నారాయణరావు” హిందీలోకి అనువదింపబడ్డాయి. వారణాసి రామమూర్తి “రేణు” వేమన కవిత్వాన్ని, డి. హేమలతాదేవి కొన్ని కథలను అనువదించారు.

‘           జ్ఞానోదయ’ హిందీ మాసపత్రికలోను, ‘సారిక’, ‘ధర్మయుగ్’ పత్రికలలోను కొన్ని తెలుగు కథలు హిందీ అనువాదాలు ప్రచురింపబడ్డాయి.

‘మాథ్యమ్’ అనే హిందీ మాసపత్రిక 1968 లో ఆంధ్ర విశేషాంక్ ను  ప్రచురించింది. శ్రీ పి. బాలకృష్ణారావు సంపాదకత్వాన వెలువడిన యీ ప్రత్యేక సంచికలో శ్రీయుతులు సి. శివరామమూర్తి, ఓరుగంటి రామచంద్రయ్య, శ్రీశ్రీ, కాళోజీ, తిలక్, దాశరథి, నారాయణ రెడ్డి, వజీర్ రహ్మాన్, మహ్మద్ ఇస్మాయిల్, బలివాడ కాంతారావుల కవితలు, కథల అనువాదాలు ప్రచురింపబడ్డాయి. ఆంధ్ర విశ్వసాహితి భీమసేన్ నిర్మల్ సంపాదకత్వాన ప్రచురించిన ‘తెలుగుకి అచ్చీ కహానియాఁ’లో గోపీచంద్, పద్మరాజు, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, పోతుకూచి, భాస్కరభట్ల, వనశ్రీ, ఇసుకపల్లి, కె. వివేకానందమూ ర్తిల కథానువాదాలు ప్రచురింపబడ్డాయి.

హిందీ అనువాదాలు చేసిన వారిలో బైరాగి, దండమూడి మహీధర్, ఆరిగెపూడి రమేష్ చౌదరి, భీమసేన్ ‘నిర్మల్’, ‘రేణు’, వల్లబ్, బాలశౌరి రెడ్డి -ప్రభుృతులు గణనీయులు.

ఆంగ్లేయ సంస్కృతినీ, విద్యా విధానాన్నీ అవగతం చేసుకొని, రాజకీయంగా చైతన్యవంతమైన వంగదేశం మిగిలిన రాష్ట్రాలకన్న సాంఘిక, సాహిత్యాది రంగాల్లో ముందడుగేసింది. “వంగదేశం యీనాడు ఆలోచించిన విషయాన్ని భారతదేశం మరునాడు భావిస్తుంది”, అని గోపాలకృష్ణ గోఖలే మన్ననలు బడసింది. అలాంటి వంగదేశ సాహిత్య ప్రభావం ఆశయావేశ సామ్యం గలిగిన ఆంధ్రులపై విశేషంగా పడింది.

మహర్షి దేవేంద్రనాధ టాగూర్ స్వీయచరిత్ర, బ్రహ్మసమాజ సాహిత్యం, రాజా రామమోహనరాయ్, రామకృష్ణ పరమహంస, వివేకానందుల సాహిత్యం తెలుగులోకి వచ్చింది.

వంగభాషలోకి బైబిలును అనువదించిన డాక్టరు విలియం కేరీయే తెలుగులోకికూడా బైబిలును అనువదించడం గమనార్హమైన విశేషం.

1912 లో ఆంధ్రప్రచారిణి గ్రంధమాల, తదుపరి సరస్వతీ గ్రంధ మండలి, వేగుచుక్క గ్రంధమాల, యువ ప్రచురణలు, దేశి కవితామండలి, ఆదర్శ గ్రంధమండలి, మొదలైన ప్రచురణ సంస్థలద్వారా బంకించంద్ర, రమేశ్ చంద్రదత్తు, విభూతి భూషణ భట్టాచార్య, ధీరేంధ్రనాథ్ పాల్ , రవీంద్రనాధ టాగూరు, శరత్ బాబు , ప్రభాతకుమార్ ముఖోపాధ్యాయ, నిరుపమా దేవి, ప్రబోధకుమార్ సన్యాల్ మొదలైనవారి రచనలను వేంకట పార్వతీశ్వర కవులు, చిలకమర్తి, చాగంటి శేషయ్య, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, మొసలికంటి సంజీవరావు, మల్లవరపు విశ్వేశ్వరరావు. వేలూరి శివరామశాస్త్రి, చక్రపాణి, మద్దిపట్ల సూరి, నీలకంఠం, బొందలపాటి శివరామకృష్ణ, పురాణం కుమార రాఘవశాస్త్రి ప్రభృతులు తెలుగులోకి  అనువదించారు.

ముఖ్యంగా శరత్ సాహిత్యం తెలుగునాట యింటింటా ప్రవేశం సంపాదించింది. శరత్ తెలుగు రచయితా అన్న భ్రమ కల్పించింది.

ఇటీవల టాగూర్ శతజయంతి సందర్భంగా టాగూర్ రచనల్లో అత్యధిక భాగం తెలుగులోకి అనువదింపబడి ప్రచురింపబడ్డాయి. ఆదిలో టాగూర్ రచన లను అనువదించిన కారుమూరి వైకుంఠరావు, వేంకట పార్వతీశ్వర కవులు ప్రత్యేకంగా స్మరణీయులు. ఇటీవల అకాడమీవారు, విజయవాడలోని జయంతి గ్రంధమాలవారు టాగూర్ రచనల్లో చాలావాటిని ప్రచురించారు. టాగూర్ గీతాంజలికి కూడ సింగరాచార్య, చలం, ఆచంట జానకిరామ్ ప్రభృతుల ఆనువాదాలు వెలువడ్డాయి. టాగూర్ రచనలు కొన్నింటిని శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావు, బెజవాడ గోపాలరెడ్డి, చక్రపాణి, వేలూరి శివరామశాస్త్రి, యండమూరి సత్యనారాయణ, శ్రీవాత్సవ ప్రభృతులు బెంగాలీనుండి తెలుగులోకి అనువదించారు.

ద్విజేంద్రలాల్ రాయ్ మొదలైన వారి నాటకాలు హిందీ అనువాదాల నుండి అనువదింపబడ్డాయి.

వంగభాషనుండి తెలుగులోకి నవలలు అనువదింపబడినంతగా యితర సాహిత్య ప్రక్రియలు అనువదింపబడలేదు.

అయితే, శ్రీ బొమ్మన విశ్వనాధంచే బెంగాలీలోకి అనువదింపబడిన శ్రీ పిళ్ళా సుబ్బారావుశాస్త్రి చిన్నపిల్లల నవల ‘పారిపోయిన బఠానీ’, ‘ఆంధ్రేర్ గల్ప గుచ్చ’ పేర పద్మరాజు, మా గోఖలే, కొడవటిగంటి కుటుంబరావు’ గోపీచంద్, వనశ్రీ, చలం, సురవరం ప్రతాపరెడ్డి గారల కథలు మినహాయించితే బెంగాలీ భాషలోకి అనువదింపబడిన తెలుగు పుస్తకాల సంఖ్య చాలా స్వల్పం.

గతంలో కొంతకాలం ఆంధ్ర నాయకరాజుల పాలనలో ఉన్న ఒరిస్సా రాష్ట్రం ఆంధ్రకు ఉత్తర సరిహద్దులో ఉంది. కాగా, తెలుగు సాహిత్య ప్రభావం ఒరియా సాహిత్యంపై విశేషంగా ఉంది. ‘ఒరియా భాషలో కవి కావాలంటే తెలుగు సాహిత్యంకూడా రావాలి’ అనే భావాన్ని వ్యక్తంచేసే జానపద గేయమొకటి యీ నాటికి ఒరిస్సాలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒరియా-తెలుగు భాషల్లో పాండిత్యం గలిగి, ఒక భాషనుండి మరో భాషలోకి అనువాదాలు చేసిన శిష్టుకరణ రచయితలు, తెలుగు, ఒరియాల మిశ్రమ భాషలో రచనలు చేసిన గంజాంజిల్లా వాసి కుప్పిలి వెంకటనరసు, గౌరహరి పరిచ్ఛాలు తెలుగు సాహిత్యాన్ని పూర్వకాలంలో ఒరియా భాషలోకి అనువదించారు.

‘ఆంధ్రుల సహవాస సంపర్కంలో ఒరియా సారస్వతం గడించుకున్న సంపద ఒరియా సరస్వతి రత్నభాండారంలో యుగయుగాలవరకూ నిలిచి ఉంటుంది’ – అని ఒరియా భాషాకోశకర్త శ్రీ గోపాలచంద్ర ప్రహరాజు రాశారు.

ధర్మాంగద పురాణాన్ని ఒరియా భాషలో రచించిన దీనబంధుకవి ‘ఈ గ్రంథం తెలుగులో ఉండేది. దాన్నే నేను ఓఢ్ర౦లో  చెప్పాను’ అని  1750 ప్రాంతంలో రాశారు.

16వ శతాబ్దంలో నందాపుర సంస్థానంలో దివానుగాను, ఆస్థాన కవి గాను ఉన్న డొంకాడ గోపీనాధుడు ఒరియా భాషలో సిద్ధేశ్వరదాసుడు రచించిన విచిత్ర రామాయణాన్ని తెలుగులో వచన కావ్యంగా రచించాడు. గోపీనాధ వచన రామాయణం తెలుగులో విశేషవ్యాప్తి పొందింది. అంతేకాకుండా గోపీనాధ రామాయణం ఆధారంగా నలుగురైదుగురు కవులు పద్యరామాయణ కావ్యాలు రాయడాన్ని బట్టి గోపీనాధ రామాయణ ప్రాశస్త్యం తెలియ వస్తుంది.

17 వ శతాబ్దంలో కహ్నుదాసు. ఒరియా భాషలో రచించిన ‘రామ రసామృత సింధువు’ను శ్రీ గండ్రేటి గురయ్య తెలుగువచనంలోకి అనువదించారు.

ఇటీవలి కాలంలో శ్రీ పురిపండా అప్పలస్వామి ‘మట్టి మనుషులు,’ ‘అమృత సంతానం’ మొదలైన ఒరియా నవలలను తెలుగులోకి, కొన్ని తెలుగు కథలను ఒరియా భాషలోకి అనువదించారు. అభ్యుదయ కవిశ్రీ సోచిరౌత్ రాయ్ గేయాన్ని శ్రీ ఎస్. టి. పి. రామానుజాచార్యులు తెలుగులోకి అనువదించారు.

కన్నడ, ఆంధ్ర భాషలకు లిపిలోనే కాక సాహిత్య సంప్రదాయాల్లో అనేక పోలికలున్నాయి.

కన్నడ కవిత్రయం పంపడు, రన్నడు, పొన్నడు- తెలుగు గడ్డమీద ఉండి కన్నడ కావ్యాలు రచించారు.

వేంగీ నివాసి అయిన నాగవర్మ కన్నడంలో కావ్యాలోకనం, వస్తు కోశం, కర్ణాట భాషా భూషణం రచించాడు.

ప్రభువులు కన్నడిగులు కావడమే యిందుకు కారణంగా కనిపిస్తుంది.  

శ్రీ మాస్తి వేంకటేశయ్య కన్నడ గ్రంథాలు తెలుగులోకి అనువదింపబడ్డాయి.

కన్నడ రచయిత్రి త్రివేణి రచించిన వెండి మబ్బు, తామరకొలను, సంఘర్షణ మొదలైన నవలలను శర్వాణి, కల్యాణి అనువదించారు. అవి మొదట ధారావాహికంగా వారపత్రికలోను, తర్వాత పుస్తకరూపంలోను ప్రచురింపబడి తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. శ్రీ ఎస్. ఎల్. బైరప్ప రాసిన ‘వంశవృక్ష’ నవలను శ్రీ సనగరం నాగభూషణం తెలుగులోకి అనువదించారు.

పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణాన్ని, పిడపర్తి సోమనాథుడు కన్నడంలో పద్య బసవ పురాణంగా రచించాడు.

సోమనాథుని బసవ పురాణాన్నీ, భీమకవి పండితారాధ్య చరిత్రని నీలకంఠాచార్యుడు కన్నడ భాషలోకి అనువదించాడు,

తెలుగు – కన్నడ భాషల్లో ఆదాన ప్రదానాలు బాగానే జరిగాయి.

 ఆధునిక యుగంలో వీరేశలింగంగారి ‘రాజశేఖర చరిత్ర’ కన్నడంలోకి అనువదింపబడింది.

ఇటీవలికాలంలో తెలుగు నుంచి ఆత్రేయ నాటకాలు, ద్వివేదుల విశాలాక్షి నవల ‘మారిన విలువలు’, మరికొన్ని తెలుగు నవలలు కన్నడంలోకి అనువదింపబడ్డాయి.

శ్రీ గురజాడ ‘కన్యాశుల్కం’ కూడా కన్నడ భాషలోకి అనువదింపబడింది.  

మరాఠీ సాహిత్యంలో కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు అపారమైన కృషిచేసి అందులో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

మరాఠీ నుండి తెలుగులోకి ఎక్కువ పుస్తకాలను అనువదించిన వారిలో శ్రీ ఎన్. జగన్నాథ్ ఒకరు. గంగాధర గాడ్గిల్ , మొదలైనవారి నాటకాలను జగన్నాథ్ అనువదించారు.

ధర్మానంద కోశాంబీ గ్రంథాన్ని ‘బుద్ధ భగవానుడు’ పేరున పుట్టపర్తి నారాయణాచార్యులు, హరిభావ్ ఆప్టే నవల అబలా జీవితం పేరున శ్రీ పి.వి. నరసింహారావు అనువదించారు.

గంగాధర గాడ్గిల్ , వసుంధరా పట్వర్ధన్, స్నేహలతా దస్నూర్ కర్  పూ. బా. భావేల కథలను శ్రీ చంద్రమౌళి (హరి వెంకటసుబ్బారావు) అనువదించి ‘చెలిమి’ కథల సంపుటిగా ప్రచురించారు.

శ్రీ దివాకర్ల వెంకటావధాని ‘ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర’  మరాఠీలోకి అనువదింపబడింది.

శ్రీ చంద్రమౌళి రాసిన ‘స్పర్థ’ అనే కథ స్నేహలతా దిస్నూర్ కర్ చే  మరాఠీలోకి అనువదింపబడింది.

తమిళ భాషలోని కంబ రామాయణాన్ని శ్రీ పూతలపట్టు శ్రీరాములు, తిరుక్కురల్ ను  ముదిగంటి జగ్గన్న శాస్త్రి ప్రభృతులు అనువదించారు.

ఎమ్. ఎస్. కమల, కె. సభాలు కొన్ని తమిళ కథలను తెలుగులోకి అనువదించారు.

జయకాంతన్ రచించిన ‘నీలాంటి ఒకరు’ అనే నవలకు సాక్షి (ఎ. వి. రమణయ్య) అనువదించారు.

“వసుచరిత్ర” కూడా తమిళ భాషలోకి అనువదింపబడింది.

గుజరాతీనుండి గాంధీ ఆత్మకథను శ్రీ వేలూరి శివరామశాస్త్రి తెలుగులోకి అనువదించారు.

శ్రీ వేమూరి ఆంజనేయశర్మ, శ్రీ చంద్రమౌళి కొన్ని గుజరాతీ కథలను తెలుగులోకి అనువదించారు.

గాలిబ్ గేయాలను శ్రీ దాశరథి అనువదించారు.

శ్రీ బూర్గుల రామకృష్ణరావు కూడ కొన్ని ఉర్దూ రచనలను తెనిగించారు.

ప్రఖ్యాత ఉర్దూ అభ్యుదయ మహాకవి ముఖ్దుమ్  ఆంగారం సింగారం రంగరించి రచించిన రసవత్తర గేయాలను ప్రఖ్యాత తెలుగు అభ్యుదయకవి శ్రీ శ్రీ గజ్జెల మల్లారెడ్డి తెలుగులోకి అనువదించారు. నారాయణరెడ్డి, దాశరథి, కౌముది, రాంభట్ల కూడ ముఖ్దుమ్ గేయాలు కొన్నింటిని అనువదించారు.

ప్రఖ్యాత ఉర్దూ అభ్యుదయ రచయిత శ్రీ కిషన్ చందర్ నవలలు, కథలు కొన్నింటిని నేరుగా ఉర్దూ నుండి ‘జ్ఞానేంద్ర’ అనువదించారు. కిషన్ చందర్ కథలు, విద్రోహి, దాదర వంతెన, హాంగ్ కాంగ్ సుందరి, ఇసుక మేడలు అనువదించారు.

కీ. శే. శ్రీ అట్లూరి పిచ్చేశ్వరరావు కిషన్ చందర్ రాసిన ‘గాడిద ఆత్మకథ’, పేకముక్కలు, అనే నవలలను అనువదించారు.

కిషన్ చందర్ రచనల్లో జైత్రయాత్ర (కబ్ ఖేత్ జాగే), పదిరూపాయల నోటు, అశ్రువాహిని, విరిగిన విగ్రహాలు అనే నవలలను శ్రీ పోలు శేషగిరిరావు, స్వరాజ్యంలో పెద్దబాలశిక్ష’ అన్న వ్యంగ్య గ్రంథాన్ని శ్రీ ఎన్. జగన్నాధ్, ‘ఐదుగురు లోఫర్లు’ అన్న వ్యంగ్య నవలనూ ‘జంగ్లీ’ అన్న నవలనూ శ్రీమతి నిడమర్తి శ్యామలాదేవి, శ్రీ నిడమర్తి ఉమారాజేశ్వరరావులు ఆనువదించారు. పై అనువాదాలన్నీ హిందీ అనువాదాలనుండి జరిగాయి.

వ్యాసం మొదట్లో ఇంగ్లీషు భాషనుండి తెలుగులోకి పుంఖాను పుంఖాలుగా వచ్చిన అనువాదాల సంగతి ప్రస్తావించుకున్నాం. అందుకు బదులుగా తెలుగునుండి ఇంగ్లీషులోకి జరిగిన అనువాదాల సంగతికూడా పరిశీలిద్దాం.

తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు రచించిన సి.పి. బ్రౌన్ వేమన పద్యాలను కూడ ఇంగ్లీషులోకి అనువదించారు.

పాలగుమ్మి పద్మరాజుగారి ‘గాలివాన’ కథ ఇంగ్లీషు అనువాదానికి ప్రపంచ కథానికల పోటీలో బహుమతి లభించింది.

ప్రపంచ కథానికల పోటీకి తెలుగుభాష నుంచి పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘నీలి’, బొమ్మి రెడ్డిపల్లి సూర్యారావు ‘దొంగలున్నారు జాగ్రత్త’, తెన్నేటి సూరి ‘భారతి’, హితశ్రీ ‘స్త్రీ’ అనే కథలు ఆంగ్లభాషలోకి వెళ్ళాయి.

ఇటీవల వాడ్రేవు పతంజలి సంపాదకత్వాన ‘ఏన్ ఏంథోలజీ ఆఫ్ తెలుగు స్టోరీస్’ పేరున తెలుగు కథలు ఇంగ్లీషు అనువాదాలు వెలువడ్డాయి.

గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్నీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు కొన్నింటినీ శ్రీ ఎస్.ఎన్. జయంతి ఇంగ్లీషులోకి అనువదించారు.

శ్రీశ్రీ తన మహాప్రస్థాన గీతాలను ‘త్రీ ఛీర్స్ టు మాన్’ ఇంగ్లీషులోకి స్వయంగా అనువదించారు. శ్రీ రోణంకి కూడా కొన్ని మహా ప్రస్థాన గేయాలను అనువదించారు.

శ్రీయుతులు రాయప్రోలు శ్రీనివాస్, రాయప్రోలు రాజశేఖర్, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఛాయాదేవి, ఆచంట జానకిరామ్, ఎ. మురళీధర్, చంద్రమౌళి, ఎస్. ఎమ్. వై. శాస్త్రి, కపిల కాశీపతి, బాలాంత్రపు రజనీకాంత రావు, పద్మరాజు ప్రభృతులు తెలుగు కథలను ఇంగ్లీషులోకి అనువదించిన వారిలో ముఖ్యులు.

ఇందిరా ధనరాజ్ గిర్, శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ ‘ఋతు ఘోష ‘ను ఇంగ్లీషులోకి అనువదించారు.

స్పర్థ , అనామకుడు, ఆశాజ్యోతి, చుట్టరికం, తామరాకూ. నీటిబొట్టూ అన్న తన కథలను శ్రీ చంద్రమౌళి ఇంగ్లీషులోకి అనువదించారు.

పై వివరాలను పరిశీలించినట్లయితే, విశిష్టమైన తెలుగు రచనలను మరింత ఉత్తమ స్థాయిలో ఇంగ్లీషులోకి అనువదింప చెయ్యవలసిన అవసరం విశేషంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ వ్యాప్తి కలిగిన ఇంగ్లీషు భాషలోకి వెళ్ళిననాడే తెలుగు రచనలకు అంతర్జాతీయ పరిగణన, యితర ప్రపంచ భాష ‘కి అనువదింపబడే అవకాశం కలుగుతాయి. ఈ దిశగా విశేషమైన కృషి క్రమబద్ధంగా జరగవలసి వుంది. ఇందుకు సాహిత్య అకాడమీలు, విశ్వవిద్యా లయాలు, సాహిత్య సంస్థలు, ప్రముఖ ప్రచురణాలయాలు పూనుకొనవలసి వుంది.

వివిధ భారతీయభాషా రచనల అనువాదాలను ప్రచురిస్తున్న ‘ఇంప్రింట్,’ ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ పత్రికలద్వారా, ‘సమీక్ష’, ‘యూనిట్’ వంటి సంచికల ద్వారా జరుగుతున్న కృషి గణనీయమైనది.

ఇతర భారతీయ భాషల్లోకి, ఇంగ్లీషులోకి తెలుగులో వెలువడే ఉత్తమ రచనలను అనువాదానికిగాను ఎన్నుకునేందుకు సౌలభ్యం కల్పించే ఏర్పాటు జరగడం అవసరం. ఒక సంవత్సరం పూర్తికాగానే, ఆ సంవత్సరంలో వెలు వడిన ఉత్తమ కథలను, ఉత్తమ కవితలను ఎన్నుకొని సంపుటలుగా వెలువరించడమే దీనికి మార్గం.

ఫ్రెంచి సాహిత్యంకూడా తెలుగులోకి వచ్చింది. బీదలపాట్లు పేర విక్టర్ హ్యూగో లేమిజరిబ్లే, ఘంటారావం పేర ఆయనదే హంచ్ బాక్  ఆఫ్ నాటర్ డాం, ఎమిలీ జోలా ‘నానా’ మొదలైన నవలలు తెలుగులో వెలువడ్డాయి. హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు మోలియర్ నాటకాలను అనుసరించి తెలుగులో అనేక రచనలు చేశారు. రోమారోలా ‘జీన్ క్రిస్తోఫ్’ను మానవుడు పేర శ్రీ విద్వాన్ విశ్వం అనువదించారు.

జర్మన్ భాషలోంచి అనేక కథలను డా॥ వి.ఎన్. శర్మ తెలుగులోకి అనువదించారు.

క్లాన్యూ క్రాంజ్ రచించిన ‘బారికేడ్స్ ఆఫ్ బెర్లిన్’ అనే జర్మన్ నవలను ‘అన్నా’ పేర శ్రీ నిడమ అశ్వినీకుమారదత్తు అనువదించారు.

ఇటాలియన్ రచయిత ఇగ్నేషియో నైలోన్ రాసిన ‘ఫాంటమారా’ అనే నవలను శ్రీ నిడమర్తి అశ్వినీ కుమారదత్తు అనువదించారు.

తెలుగులోకి రష్యన్ సాహిత్యం విరివిగానే అనూదితమైంది. అయితే, దాదాపు అవన్నీకూడా ఇంగ్లీషు అనువాదాల ఆధారంగా మాత్రమే అనువదింపబడ్డాయి. రష్యన్ నుండి విశ్వవిఖ్యాత రష్యన్ రచయితలు టాల్ స్టాయ్, గోర్కీ, పుష్కిన్, కుప్రిన్, షోల హొవ్, చేహొవ్, గొగోల్, దొసయేవ్ స్కీ , తుర్దేనెవ్, మయకోవ్ స్కీ , పదయేవ్, పౌస్తోవ్ స్కీ , మకరెంకో ప్రభృతుల రచనలనేకం తెలుగులోకి అనువదించబడ్డాయి. అలాగే కమ్యూనిస్టు రచనలు కూడ విరివిగా తెలుగులోకి అనువదించబడ్డాయి.

ముఖ్యంగా గోర్కీ ‘అమ్మ’ అనువాదం ఆంధ్రదేశంలో తెచ్చిన భావ విప్లవం అనల్పం.

భారతీయ భాషల్లోనుండి రష్యన్ భాషలోకి కూడా అనువాదాలు జరుగుతున్నాయి. తెలుగులోనుండి శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ‘ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర’, గురజాడ ‘కన్యాశుల్కం’, పాలగుమ్మి పద్మరాజు, కుటుంబ రావు, మునిమాణిక్యం వగైరాల కథలు, శ్రీశ్రీ, ముఖ్దుమ్ , తుమ్మల, రెంటాల, అనిశెట్టి, చిరంజీవి ప్రభృతుల గేయాల అనువాదాలు రష్యన్ భాషలో ప్రచురింపబడ్డాయి.

అభ్యుదయ భావాలు కలిగిన ఆంధ్ర యువతీ యువకులకు, రచయితలకు, కవులకు “మరో ప్రపంచపు” మహా ప్రపంచపు అగ్ని కిరీటపు నిగనిగలు, ఎర్ర బావుటా ధగధగలు అభ్యుదయకర రచనల అనువాదాల రూపంలోనే ఎక్కువగా దర్శనమిచ్చాయంటే అతిశయోక్తి కాదేమో.

అటువంటి అభ్యుదయ సాహిత్యం ఒక ప్రణాళిక ప్రకారం క్రమబద్ధంగా విదేశీభాషల నుండి తెలుగులోకి, తెలుగునుండి విదేశీ భాషల్లోకి, అలాగే, యితర భారతీయ భాషల నుండి తెలుగులోకి, తెలుగునుండి ఇతర భారతీయ భాషల్లోకీ అనువదింపబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అనువాదాలు చెయ్యడమన్నది తక్కువస్థాయి సాహిత్య కృషి అన్న దురభిప్రాయమొకటి యిటీవల వ్యా ప్తిలోకి వస్తోంది. ఇది చాలా హానికరమైన భావన. ఈ భావననుండి బయటపడటం అవసరం.

తెలుగులో వెలువడిన అభ్యుదయ రచనల్లో నిగ్గనదగిన వాటిని యితర భారతీయ భాషల్లోకి, ఇంగ్లీషులోకి అనువదించడంలో తమవంతు బాధ్యతను అభ్యుదయ రచయితలు పూర్తిచేస్తారని ఆశిద్దాం.

(ఈ వ్యాసరచనలో పురిపండా, చంద్రమౌళిగారల రచనలు నాకు తోడ్పడ్డాయి. వారికి నా కృతజ్ఞతలు.)

 (1970 జూలై 4వ తేదీన హైద్రాబాదులో జరిగిన అభ్యుదయ సాహిత్య సదస్సులో చదివిన ప్రసంగ వ్యాసం.)

(విశాలాంధ్ర, ది. 11.3.73 ఆదివారం)

నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

Spread the love

One thought on “అనువాద సాహిత్యం (తెలుగులోకి – తెలుగులోంచి)

  1. నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, వెనక్కం
    I am Ganesh, Tamil Reasearch Scholar, Banaras Hindu University, Varanasi. My research work is Tamil – Telugu translation Study..
    I want know about this more details, so please give me details
    తమిళ భాషలోని కంబ రామాయణాన్ని శ్రీ పూతలపట్టు శ్రీరాములు, తిరుక్కురల్ ను ముదిగంటి జగ్గన్న శాస్త్రి ప్రభృతులు అనువదించారు.

    ఎమ్. ఎస్. కమల, కె. సభాలు కొన్ని తమిళ కథలను తెలుగులోకి అనువదించారు.

    జయకాంతన్ రచించిన ‘నీలాంటి ఒకరు’ అనే నవలకు సాక్షి (ఎ. వి. రమణయ్య) అనువదించారు.

    “వసుచరిత్ర” కూడా తమిళ భాషలోకి అనువదింపబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *