టాల్ స్టాయ్ గురించి గోర్కీ

Spread the love

నేను ఒలెయీజ్‌ లో వున్నప్పుడు యథాలాపంగా రాసుకున్న నోట్సు మీద  దీన్ని రాశాను. లియో టాల్‌స్టాయ్‌ అప్పుడు గ్రాస్పాలో వున్నాడు. మొదట్లో,తీవ్రంగా  జబ్బుపడి తర్వాత కోలుకుంటూ వున్నాడు. నానా రకాల కాగితం ముక్కలమీదా రాసుకున్నయీ నోట్సు పోయిందనే అనుకున్నాను. కాని యీ మధ్యనే కొంత దొరికింది.యాస్నయా పొల్యానా నుంచి టాల్‌స్టాయ్‌ “నిష్క్రమిం”చాడనీ, ఆయన చనిపోయాడనీ  అనుకుని నేను రాసిన అసంపూర్తి ఉత్తరాన్ని ఒక్క అక్షరం కూడా మార్చకుండా యధాతథంగా ఉంచేస్తున్నాను. నేను దాన్ని పూర్తి చెయ్యలేదు, యేమంటే చెయ్యలేను…

1

భగవద్భావం అనేది మరి దేనికంటేనూ కూడా యొక్కువ తరచుగా ఆయన చేసినటువంటిది. ఒకో అప్పుడు అది ఒక భావనగా కాకుండా తనమీద ప్రబలంగా వున్నదనుకునే దేని మీదనో ఉద్విగ్నమైన ప్రతిఘటనగా కనిపిస్తుంది. తను మాట్లాడాలని అనుకుంటున్నంతగా ఆయన దాన్ని గురించి  మాట్లాడడు. కాని దాన్ని గురించే పదేపదే అనుకుంటూ వుంటాడు. అది వార్థక్యమనో, ఆసన్న మృత్యు అనుమానమనో నేను అనుకోను.శ్రేష్ఠమైన మానవ అహం వల్ల  వచ్చి  వుండవచ్చు. ఆయన, లియో టాల్‌స్టాయ్‌, అవమానకరంగా యేదో  స్ట్రెప్టోకోకన్ యిచ్చకి లొంగిపోవడం అనేది బహుశా కొంత అన్యాయం జరిగిందన్న దాని ఫలితమూ కావచ్చు. ఆయన గనక ప్రకృతి శాస్త్రజ్ఞుడు అయివుంటే అద్భుతమైన పరికల్పనలు చేసి మహత్తరమైన ఆవిష్కరణలు చేసి వుండేవాడు.

2

  ఆయన చేతులు ఆశ్చర్యకరంగా వున్నాయి-అందవికారంగా,నరాల పొంగరింపు వల్ల రూపం కోల్పోయి.అయినా మహాద్భుతంగా వ్యక్తీకరంగా, పూర్తి సృజనాత్మక శక్తితో వుంటాయి. బహుశా లియొనార్డో డా విన్చికి  అలాంటి చేతులు వుండి వుంటాయి. అలాంటి చేతులతో దేన్నైనా చెయ్యవచ్చు. ఒకో అప్పుడు మాట్లాడుతూ వుండగా ఆయన వేళ్ళని కదిలిస్తాడు. మెల్లిగా వేళ్లని ముడుస్తూ, ఒక బరువైన అద్భుతమైన మాటని అనేటప్పుడు మళ్ళీ చాస్తూ వుంటాడు. ఆయన ఒక దేవుడి లాగా వుంటాడు; ఒక శాబత్ కాదు, లేకపోతే ఒలింపస్ నుంచి వచ్చే దేవుడూ కాదు, కాని “బంగారు లైమ్ చెట్టుకింద మేపిల్ కొయ్య సింహాసనం మీద కూర్చున్న” ఓ రష్యన్ దేముడిలాగా వుంటాడు. ఆయన అంత ఠీవిగా వుండకపోవచ్చుగాని, దేవుళ్ళందరికంటే కూడా అధికంగా జిత్తులమారిగా వుంటాడు బహుశా.

3

       సులెర్ జీత్ స్కీ పట్ల ఆయనకి మార్దవం వుంది. చేహొవ్ పట్ల ఆయనకి పితృవాత్సల్యం వుంది. యీ ప్రేమలో సృష్టికర్త అహం గోచరించవచ్చు. కాని సులెర్ జీత్ స్కీ కి సంబంధించి ఆయన అనుభూతి మార్దవమైందే; నిరంతర ఆసక్తి కరమైందే, యీ మంత్రగాణ్ణి యెన్నటికీ విసుగెత్తించలేని అద్భుతావహమైందే. యీ అనుభూతిలో యేదో అసంబద్ధమైంది వుంది, తన రామచిలక పట్లా, కుక్క పట్ల పిల్లి పట్లా ఓ వృద్దకన్యకి వుండే ప్రేమ లాంటిది. యేదో తెలియని వింత ప్రపంచం నుంచి వచ్చిన ఆశ్చర్యకరమైన స్వేచ్ఛా విహంగం సులెర్ జీత్ స్కీ  కి అతనిలాంటి ఓ వందమందికి ఒక స్థానిక పట్టణపు స్వరూప స్వభావాలని మార్చేసే శక్తి వుంటుంది. వాళ్ళు దాని ఆకారాన్ని చెదర గొట్టేస్తారు; ఒక అవిశ్రాంత, అప్రతిహత మేధ కోసం కాంక్షతోటి దాని స్వభావాన్ని నింపేస్తారు. సులెర్ జీత్ స్కీ ని ప్రేమించడం సులభమూ సంతోషమూనూ. ఆడవాళ్ళు అతన్ని అలక్ష్యం చెయ్యడం చూస్తే నాకాశ్చర్యమూ, ఆగ్రహమూ కలుగుతాయి. కాని బహుశా యీ అలక్ష్యం మాటున యుక్తిగా దాగిన హెచ్చరిక వుందేమో. సులెర్ జీత్ స్కీ  మీద నమ్మకం పెట్టుకోవడం అనేది లేదు. రేపటికి అతను యెలా వుంటాడో? అతను బహుశా ఒక బాంబు విసరచ్చు, కల్లుదుకాణం పాటగాళ్ళ బృందంలో చేరవచ్చు. అతనిలో మూడు యుగాలకి సరిపడా శక్తి వుంది. అతనిలో యెంత జీవితాన్ని ప్రజల్వలిస్తోందంటే యెర్రగా కాలిన యినుమునుంచి వచ్చినట్టుగా అతను రవ్వలు చిమ్ముతున్నట్టు వుంటాడు.

కాని ఒకసారి ఆయనకి సులెర్ జీత్ స్కీ  మీద చెడ్డ కోపం వచ్చేసింది- సులెర్ జీత్ స్కీ యెప్పుడూ అరాచకత్వం వేపే మొగ్గివుంటూ, వ్యక్తి స్వేచ్ఛని గురించి తీవ్రంగా వాదించడం పట్ల యిష్టపడ్డాడు. అతను అలా చేసినప్పుడల్లా టాల్ స్టాయ్ వేళాకోళం చేసేవాడు.

              క్రొపోత్కిన్ రాకుమారుడి సున్నితమైన కరపత్రం ఒకదాన్ని సులెర్ జీత్ స్కీ దొరకపుచ్చుకోవడం నాకు గుర్తు. దానితోటి ఉత్సాహపడిపోయి, రోజంతా అరాచకత్వపు వివేకంమీద, మహా ఉపద్రవకరమైన పద్ధతిలో తాత్వికరిస్తూనే వుండిపోయాడు.

“అబ్బబ్బ, యింక చాలు, నేను భరించలేకుండా వున్నాను” అన్నాడు టాల్ స్టాయ్ చిరచిరలాడుతూ. “చిలకలాగా ఒకే మాట స్వేచ్ఛ, స్వేచ్ఛ అని వల్లిస్తున్నావు. దానర్థం యేమిటి? ఉదాహరణకి నువ్వనుకున్నట్టే, ఆ మాటకి నీ అర్థంలోనే నీకు స్వేచ్ఛ వచ్చిందీ అనుకో, దాని ఫలితం యేమిటి? తాత్వికంగా చెప్పాలంటే, మట్టులేని శూన్యం, జీవితంలో ఆచరణలో నువ్వు సోమరిపోతుగా, బైరాగిగా తయారవుతావు. నువ్వు భావించుకున్న రీతిలో నువ్వు స్వేచ్ఛాయుతుడివి అయితే నిన్ను జీవితానికి, మానవులకి బంధించేది యేమిటి వుంటుంది? చూడు- పక్షులు స్వేచ్ఛగానే వున్నాయి, కాని అవి గూళ్ళు కట్టుకుంటాయి. నువ్వు గూడు కట్టుకోవుగాని, యెక్కడ వీలుంటే అక్కడ గండు పిల్లిలాగా కామేచ్చని తీర్చుకుంటావంతే. ఒక్క క్షణం గంభీరంగా ఆలోచించుకో, నీకు తెలుస్తుంది, అంత్య అర్థంలో స్వేచ్ఛ అనే పదానికి అర్థం శూన్యం, ఉత్తది, నిరాకారమైన కాళీ అని.”

కోపంతో కనుబొమలు ముడుచుకుని ఆయన ఒక క్షణం ఆగి, యింకొంచెం మృదువుగా అన్నాడు:

“క్రీస్తు స్వేచ్ఛాయుతుడే, అలాగే బుద్ధుడూనూ. వాళ్ళిద్దరూ ప్రపంచపు పాపాలని తాము భరించి, ఐచ్ఛికంగా ప్రాపంచిక జీవిత కారాగృహంలోకి ప్రవేశించారు. మరి యెవళ్ళూ యింక అది దాటి ముందుకు పోలేదు- ఎవ్వరూ! నువ్వూ నేనూ- మనం యేం చేశాం; మనమంతా మన పొరుగు వాడి పట్ల మన బాధ్యతనుంచి స్వేచ్ఛని కోరుతున్నాం, కచ్చితంగా మనల్ని మానవులనిగా చేసింది యీ విధే అయినప్పటికీ, యిది లేకపోయినట్లయితే మనం జంతువుల్లా బతకాల్సినప్పటికీ….”

ఆయన పదాలు చప్పరించాడు.

“అయినా ఉన్నతంగా యెలా బతకాలా అనేదాన్ని గురించి నువ్వు వాదిస్తున్నావు. దానివల్ల యేం పెద్ద లభించదు, అదే సమయంలో మరీ కొంచెమూ కాదు. ముఖం అంతా నల్లబడి పోయే దాకా నాతో వాదిస్తున్నావు గాని నన్ను కొట్టవు, కనీసం తిట్టవు. నిజంగా నువ్వు స్వేచ్ఛాయుతుడివని భావిస్తే, నువ్వు నన్ను చంపెయ్యాలి అంతే.”

యింకోసారి ఆగి ఆయన మళ్ళీ అన్నాడు:

“స్వేచ్ఛ -అంటే ప్రతీదీ, ప్రతివాడూ నాతో ఏకీభవించినట్టన్న మాట. అయితే అప్పుడు నేనింక యెంత మాత్రమూ వుండను, యేమంటే మనం పోటీలోనూ, వైరుధ్యంలోనూ వున్నప్పుడు మాత్రమే మనల్ని గురించిన స్పృహతో వుంటాం.”

4

“అల్ప సంఖ్యాకులకి భగవంతుడు కావాలి యేమంటే వాళ్ళకి మిగతా అన్నీ వున్నాయి; అధిక సంఖ్యాకులకి భగవంతుడు కావాలి యేమంటే వాళ్ళకి యేమీ లేదు. “

లేకపోతే నేను యింకోలా చెబుతాను: అధిక సంఖ్యాకులు పిరికితనం వల్లనే భగవంతుణ్ణి నమ్ముతారు. కొద్దిమంది మాత్రమే ఆత్మ పూర్ణత్వం వల్ల నమ్ముతారు.

“మీకు హాన్స్ ఏండర్సన్ అద్భుత కథలు యిష్టమేనా?” అని ఆయన సాలోచనగా అడిగాడు. “మార్కో వొవ్ చిక్ అనువాదంలో అని ప్రచురితమైనప్పుడు నాకు అర్థం కాలేదు. కాని పదేళ్ళ తర్వాత ఆ పుస్తకం తీసుకుని మళ్ళీ చదివాను. ఏండర్సన్ ఒంటరి జీవి అని నాకు వున్నట్టుండి అవగతం అయింది. చాలా ఒంటరి మనిషి. అతని జీవితం గురించి నాకు యేమీ తెలీదు. అతను శుద్ధ విలాస పురుషుడు, తిరుగుబోతు అనుకుంటాను. కాని అది అతను ఒంటరిగాడు అనే నా విశ్వాసాన్ని దృఢ పరుస్తుందంతే. అందుకనే అతను పిల్లల వేపు దృష్టి సారించి వుంటాడు, పిల్లలు పెద్ద వాళ్ళకంటే యెక్కువ దయగా వుంటారనుకుని. కాని అది తప్పు. పిల్లలు ఎవళ్ళ పట్లా జాలిపడరు, వాళ్ళకి జాలి అంటే తెలీదు.”

5

బౌద్ధమత ప్రశ్నోత్తర రూపబోధని చదవమని ఆయన నాకు సలహా యిచ్చాడు. క్రీస్తుని గురించీ, బుద్ధుణ్ణి గురించీ ఆయన మాట్లాడే దాంటో యెప్పుడూ యేదో భావావేగభరితమైంది వుండేది. ఆయన మాటల్లో ఉత్సాహం గాని కరుణ గాని వుండేది కాదు, హృదయ జ్వాలనుంచి పుట్టిన కణం ఒక్కటీ వుండేది కాదు. క్రీస్తుని అమాయకునిగా దయారునిగా ఆయన భావిస్తున్నాడనుకుంటాను. ఆయన క్రీస్తుని సంభావించినా ప్రేమిస్తూ వుండటం సందిగ్ధం. క్రీస్తు గనక ఒక రష్యన్ పల్లెకి వస్తే ఆడపిల్లలు పరిహాసంగా చూస్తారని ఆయన భయపడుతున్నట్టుంది.

6

ప్రతిదానికీ, ప్రతివాళ్ళకీ పరాయిగా వుండి యిల్లూ వాకిలీ లేకుండా గుడి నుంచి గుడికి, మఠం నుండి మఠానికి వేలాది మైళ్ళు, చేతిలో కర్రలు పట్టుకుని జీవితమంతా తిరుగుతూ భూమ్మీద సంచరించే యాత్రీకుల్ని ఆయన స్ఫురింపచేస్తాడు. యీ ప్రపంచం వాళ్ళకి సంబంధించింది కాదు- భగవంతుడూనూ. వాళ్ళు అలవాటు  కొద్దీ ప్రార్థిస్తారు. కాని హృదంతరాళంలో పరమేశ్వరుని ద్వేషిస్తారు. ఎందుకు దేముడు వాళ్ళని భూమ్మీదకి, ప్రపంచపుటంచులకి తరుముతాడు – యెందుకు? వాళ్ళు మానవులని వూరికే మొద్దుల్లాగా, వృక్షాల వేళ్ళలాగా, రోడ్డుమీద పడివుండే రాళ్ళల్లాగా పరిగణిస్తారు – వాటి మీద యెవళ్ళేనా తొట్రు పడతారు, ఒకో అప్పుడు వాటివల్ల దెబ్బలు తగిలించుకుంటారు. అవి లేకుండానే యెవళ్ళేనా గడపవచ్చు, కాని ప్రజలతో పోలిక లేనట్టుగా, వాళ్ళతో తమ విభేదం పట్ల గర్విస్తూ వున్నట్టుగా వాళ్ళని ఆశ్చర్యపరచడం ఒకో అప్పుడు తమాషాగా వుంటుంది.

7

“ఫ్రెడరిక్ ప్రష్యా యుక్తిగా ఒకటి చెప్పాడు: ‘ప్రతివాళ్ళూ తమ ఆత్మని a sa facon రక్షించుకోవాలి.’ ‘మీకిష్టమైన దాన్ని వూహించుకోండి, కాని విధేయత చూపించండి,’ అనీ ఆయనే అన్నాడు. చనిపోతూ ఆయన అంగీకరించాడు: ‘బానిసలని పరిపాలించడంతోటి నాకు అలుపు వచ్చింది.’ గొప్ప వాళ్ళనుకునే వాళ్ళంతా యెప్పుడూ స్వవచోవ్యాఘాతానికి గురవుతూనే వుంటారు. వాళ్ళకి వుండే మిగతా దోషాలలాగానే దీన్ని వాళ్ళలో క్షమించడం జరుగుతుంది. అయినా స్వవచో వ్యాఘాతం దోషం కాదు కదా: మూఢుడే మొండిగా వుంటాడు, తను అన్నదాన్ని ఖండించుకోడు. అవును. ఫ్రెడరిక్ వింత మనిషి- ఆయన్ని జర్మన్లు తమ అత్యుత్తమ చక్రవర్తిగా పరిగణించారు, అయినా, ఆయన వాళ్ళని భరించలేకపోయాడు; ఆయనకి గ్యోతే ” అన్నా వైలేండ్ అన్నా కూడా యిష్టం లేకపోయింది….”

8

బాల్ మంట్  పద్యాల గురించి మాట్లాడుతూ “కాల్పనికత్వం అనేది సత్యం కళ్ళల్లోకి చూడాలంటే వుండే భయమే” అన్నాడాయన రాత్రి. సులెర్ జీత్ స్కీ   దాంతో యేకీభవించలేదు, కొన్నిటిని యెంతో అనుభూతితో చదివాడు, తన ఉద్రేకంలో  తడబడుతూ.

“అది కవిత్వం కాదు, అది పాండిత్య ప్రకర్ష, శుద్ద చెత్త మాటల గారడీ. కవిత్వం నిసర్గంగా వుంటుంది.

నేనేం పాడతానో నాకు తెలీదు,

కాని నా పాట నాలోనే పొంగుతుంది.

అని ఫేత్ రాసినప్పుడు అతను కవిత్వాన్ని గురించి ప్రజల నిజమైన అనుభూతిని వ్యక్తం చేస్తున్నాడు. తను యేం పాడుతున్నదీ రైతు క్కూడా తెలీదు; వూరికే అతను ఓయ్ హాయ్, ఓలాలాయ్ అని పాడతాడంతే. అతని హృదయపు అడుగునుంచి . నిజమైన పాట వెలువడుతుంది పక్షులు పాడినట్టు. మీ కొత్త కవులు కల్పించడం  తప్ప మరేం చెయ్యరు.

9

ఆయన జబ్బు ఆయన్ని యెండగట్టేసింది. ఆయనలో వున్నదేన్నో మండించేసింది. ఆయన యింకా తేలిగ్గా, యింకా స్వచ్ఛంగా, ఆంతరంగికంగా మరింత యెక్కువగా జీవితానికి అలవాటుపడ్డట్టుగా వున్నాడు. ఆయన నేత్రాలు యింకా నిశితం అయ్యాయి, ఆయన చూపు యింకా తీక్షణం అయింది. ఆయన శ్రద్ధగా వింటున్నాడు, ఎన్నడనగా మరచిపోయిందాన్ని గుర్తు చేసుకుంటున్నట్టు వుంది లేదా నూతనమైంది. దేని కోసమో, యింతకు ముందు తెలియని దాని కోసం నిబ్బరంగా నిరీక్షిస్తున్నట్టు వుంది. యాస్నయా పొల్యానాలో ఆయన తన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికి, తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్న వాడిలాగా నాకు కనిపించాడు.

10

ఆయన గనక మత్స్యం అయివుంటే ఆయన వాసం ఖాయంగా మహా సముద్రం అయివుండేది, ఆయన ఎన్నటికీ తీరస్థ సముద్రంలో యీది వుండేవాడు కాదు, నదుల్లో సంగతి సరేసరి. యిక్కడ బోలెడు పరిగలు చుట్టుపక్కల దూసుకుపోతున్నాయి. ఆయన చెప్పేదాంట్లో వాటికి ఆసక్తి లేదు. వాటికా అవసరమూ లేదు. ఆయన మౌనం వాటిని భయపెట్టదు, మరేవిధంగానూ దానిమీద ప్రభావమూ చూపించదు. ఆయనకి నిజమైన మౌనిలాగా మహా గంభీరంగా, సమర్థవంతంగా మౌనంగా వుండటం తెలుసు. తనని పట్టి పీడించే విషయాల గురించి యెంతో యెక్కువగా ఆయన మాట్లాడతాడు, అయినా ఆయన చెప్పంది యెంతో మిగిలిపోయిందనే యెవళ్ళేనా అనుకుంటారు. ఆయన యెవ్వరికీ చెప్పలేనివీ వున్నాయి. బహుశా తను భయపడే ఆలోచనలూ ఆయనకి వున్నాయి.

11

క్రీస్తు బాప్తిజం చేయించిన కుర్రవాడి కథకి సంబంధించిన ఆసక్తికరమైన పాఠాంతరాన్ని ఆయనకి యెవరో పంపారు. ఆయన ఆ కథని  సులెర్ జీత్ స్కీ  కీ చేహొవ్కీ యెంతో ఉత్సాహంతో చదివి వినిపించాడు- అద్భుతంగా చదివాడు! భూస్వాములని పిశాచాలు పీడించే పద్ధతిలో ఆయనకి ప్రత్యేకం ఆసక్తి కలిగించింది యేదో వుండింది, సరిగా రుచించనిది యేదో నాకు అందులో వుండింది. ఆయన నిజాయితీరహితంగా వుండ గలగలేడు, కాని యిది నిజాయితీ అయితే యింకా అధ్వాన్నం.

అప్పుడు ఆయన అన్నాడు:

“చూడండి రైతులు యెంత బాగా కథలు చెప్తారో. ప్రతీదీ సులభంగా, కొద్ది మాటలతో, యెంతో అనుభూతితో నిండి వుంటుంది. సిసలైన తెలివి యెల్లప్పుడూ సంక్షేపంగా వుంటుంది – ‘ప్రభూ మా మీద దయచూపించు’లో లాగా.”

కాని అది క్రూరమైన కథ.

12

నాపట్ల ఆయన ఆసక్తి మానవజాతిశాస్త్ర పరమైంది. ఆయనకి సంబంధించి నేను తనకి బాగా తక్కువ తెలిసిన తెగ సభ్యుణ్ణి – యింకేం కాదు.

13

నా కథ “ఆంబోతు” ఆయనకి చదివి వినిపించాను. ఆయన యెంతగానో నవ్వి “భాషా చాతుర్యం” తెలిసినందుకు నన్ను మెచ్చుకున్నాడు.

“కాని మాటలని యెలా వాడాలో మీకు తెలీదు. మీ రైతులంతా పటాటోపంగా మాట్లాడతారు. వాస్తవ జీవితంలో రైతులు బడుద్దాయిల్లాగా, మోటుగా మాట్లాడతారు, వాళ్ళేం అంటున్నదీ మొదట్లో మీరు చెప్పలేరు. అలా కావాల్సికే చెయ్యడం జరుగుతుంది, అవతలి వాణ్ణి నడిపించుకుని పోవాలీ అన్న కోరిక వాళ్ళ మాటల జడత్వం మాటున కప్పడిపోయి వుంటుంది. నిజమైన రైతు యెవ్వడూ తన మనసులో వున్న దాన్ని నేరుగా చెప్పడు, అలాంటిది అతనికి నప్పదు. మనుషులు ఓ బడుద్దాయి దగ్గరకు అమాయకంగా కపటం లేకుండా వస్తారని అతనికి తెలుసు, అదే సరిగ్గా అతనికి కావాల్సింది. అతని ముందు ఆవులించినట్టు వుంటారు, అతను తక్షణం మీ పేగులు లెక్క పెట్టేస్తాడు. అతను అనుమానస్తుడు, తన రహస్య ఆలోచనలని భార్యకి చెప్పడానికి కూడా భయపడతాడు. కాని మీ కథల్లో ప్రతీదీ నేరుగా వుంటుంది, ప్రతి కథలోనూ పండితమ్మన్యుల గుంపు వుంటుంది. వాళ్ళు చమత్కార భరితమైన సూక్తులు మాట్లాడతారు. అది సరిగాదు, ఆ మాట కొస్తే – సూక్తులు రష్యన్ భాషకి నప్పవు.”

“మరి సామెతలు, ఉక్తులు మాట యేమిటి?”

“అది వేరు, వాటిని నిన్న గాక మొన్ననే యేం కనిపెట్టలేదు.”

 “మీరే సూక్తులతో మాట్లాడతారే.”

” ఎన్నడూ లేదు! యేం, మీరు ప్రతిదాన్నీ నగిషీ చెక్క ప్రయత్నిస్తారు లొంగకండి, ఎవరన్నా భయపడకండి – అప్పుడు మీరు సజావుగా వుంటారు….”

14

నన్ను చదవమని ఆయన యిచ్చిన డైరీలో ఒక వింత సూక్తి నాకు ఆశ్చర్యం కలిగించింది. “భగవంతుడు నా కామన.”

డైరీ తిరిగి యిచ్చేసేటప్పుడు దాని అర్ధం యేమిటని అడిగాను.

“ఓ అసంపూర్తి ఆలోచన” అన్నాడాయన, ఆ పేజీకేసి చూస్తూ కళ్ళు లగ్నం చేసి. “నేను చెప్పాలనుకున్నది అందుకోవాలని…. వుహుఁ, అది కాదు….” ఆయన నవ్వాడు, నోటు పుస్తకాన్ని ముడిచేసి తన అంగీ పద్దె జేబులో పెట్టేసుకున్నాడు. భగవంతుడితో ఆయన సంబంధాలు అనిర్దిష్టంగా వున్నాయి. ఒకో అప్పుడు అవి “ఒకే గుహలో వున్న రెండు ఎలుగుబంట్లు” లాగా నాకు అనిపిస్తాయి.

15

విజ్ఞానశాస్త్రం మీద.

“ఓ నాటు రసవాది కల్పించిన పోతకడ్డీ బంగారం శాస్త్రం అనేది. మీరు దాన్ని సులభతరం చేసి, ప్రతి ఒక్కళ్ళకీ అవగతం అయేటట్టు చెయ్యాలనుకుంటారు – వేరే మాటల్లో చెల్లని డబ్బుని ముద్రించాలని. ప్రజలు యీ డబ్బుకి వున్న అసలు విలువని గుర్తించినప్పుడు మిమ్మల్ని అభినందించరు.”

16

సంభాషణలో ఆయనకిష్టమైన విషయాలు భగవంతుడూ, రైతూ, స్త్రీ. సాహిత్యాన్ని గురించి ఆయన అరుదుగా, తక్కువగా మాట్లాడేవాడు, అదేదో తనకి పరాయి విషయం అయినట్టు. ఆడవాళ్ళ పట్ల ఆయనకి వున్న దృక్పథం పరమ శత్రుత్వ వైముఖ్యం. వాళ్ళని శిక్షించడమంతగా మరిదేన్నీ ఆయన యిష్టపడడు – వాళ్ళు కిట్టీ  లాగా, నతాషా రొస్తోవా లాగా సామాన్యమైన ఆడవాళ్ళయితే తప్ప. తను పొందడానికి సాధ్యమైనంత ఆనందాన్ని పొందని మగవాని పగా యిది? లేకపోతే “శరీరపు అవమానకరమైన సహజ ప్రేరణల” పట్ల జీవాత్మ వైమనుస్యమా? యేది యేమైనా అది శత్రుత్వం, అదీ చాలా చేదైనది, “ఆన్నా కరేనినా”లో లాగా. ఆదివారం నాడు రూసో “కనఫెషన్సు”ని గురించి చేహొవ్తోనూ, యెల్పాతియేవ్ స్కీతోనూ చర్చిస్తూ “శరీరపు అవమానకరమైన సహజ ప్రేరణల”ని గురించి ఆయన చాలా ‘మాట్లాడేడు. సులెర్ జీత్ స్కీ ఆయన మాటలని రాసిపెట్టాడు. కాని తర్వాత కాఫీ తయారుచేస్తూ, అతను తన నోట్సుని స్పిరిట్ లేంప్ మంటలో కాల్చేశాడు. అంతకు ముందు అతను ఇబ్సన్ ని గురించి టాల్స్టాయ్ అన్న మాటలనీ కాల్చేశాడు, అలాగే వివాహ క్రతువులోని ప్రతీకల మీద తన నోట్సునీ పోగొట్టుకున్నాడు, వివాహ క్రతువులోని ప్రతీకల మీద టాల్ స్టాయ్  విపరీతమైన క్రైస్తవేతర వ్యాఖ్యలు చేశాడు, అవి వి.రొజొనోవ్  వ్యాఖ్యలతో సరిపోతాయి.

17

యీ ఉదయం ఫెయొదోసియా నుంచి కొంతమంది ష్తు౦దిస్తులు  యిక్కడికి  వచ్చారు. రోజంతా ఆయన రైతులు గురించి ఉత్సాహంగా మాట్లాడుతూనే వున్నాడు.

మధ్యాహ్నం భోజనాల వేళప్పుడు ఆయన అన్నాడు:

“మీరు వాళ్ళని చూసి వుండాల్సింది – యిద్దరూ దారుఢ్యంగా గుండుల్లా వున్నారు. వాళ్ళల్లో ఒకతను అన్నాడు: ‘మేం రమ్మన కుండా వచ్చాం’ అని రెండో అతను ‘పొమ్మనకుండానే పోమా మరి’ అన్నాడు.” ఆయన పసిపిల్లల్లాంటి నవ్వునవ్వుతూ  వూగిపోయాడు.

భోజనాల తర్వాత, వరండాలో:

“మనం మొత్తానికి ప్రజల భాషని త్వరలోనే అర్థం చేసుకోకుండా పోతాం. మనం యిప్పుడు ‘అభివృద్ధి సిద్ధాంతం’ గురించీ, ‘చరిత్రలో వ్యక్తి పాత్రల’ గురించీ ‘శాస్త్ర పరిణామం’ గురించీ ‘అతిసారం’ గురించీ మాట్లాడతాం. ‘అయ్య, గడ్డి మేటులో సూదికోసం వెదకి లాభం లేదు’ అంటాడు రైతు. సకల సిద్ధాంతాలూ, చరిత్రా, పరిణామం యెందుకూ కొరగాకుండా, పరిహాసాస్పదం అయిపోతాయి. యేమంటే రైతు వాటిని అర్థం చేసుకోలేడు, వాటి అవసరం అతనికి లేదు. కాని రైతు మనకంటే గట్టిగా వుంటాడు, యెక్కువగా నిలుస్తాడు. మరి మనం (యేమో, యెవరికి తెలుసు?) అస్తూరీ తెగలాగా అయిపోతామేమో. వాళ్ళని గురించి ఒక పండితుడికి చెప్పార్ట: ‘అస్తూరీలందరూ నాశనం అయిపోయారు, కాని వాళ్ళ భాషలోని కొన్ని పదాలు తెలిసిన చిలక మాత్రం ఒకటి యింకా వుంది’ అని.”

18

“ఆడది మగవాడికంటే భౌతికంగా యెక్కువ నిజాయితీతో వుంటుంది. కాని ఆమె ఆలోచనలు అనృతమైనవి. ఆమె అబద్ధం ఆడినప్పుడు తనే నమ్మదు. రూసో అయితే అబద్ధమూ ఆడాడు, నమ్మనూ నమ్మాడు.”

19

“తను నమ్మని దాన్ని కొలిచినందుకు తన జీవితమంతా తననీ, యితరుల్ని శిక్షించుకున్నట్టు దొస్తోయేవ్ స్కీ  తన ఉన్మత్త పాత్రలలో ఒక పాత్ర గురించి రాశాడు. అది అతను తన గురించే రాసుకున్నాడు లేదా అతను తన గురించే అలా సులభంగా చెప్పగలిగి వుండేవాడు.”

20

ఆయనకి నంగనాచిలాగా చిక్కుపెట్టే ప్రశ్నలు వెయ్యడం అంటే యిష్టం:

“మిమ్మల్ని గురించి మీరే మనుకుంటున్నారు?”

 “మీరు మీ ఆవిడ్ని ప్రేమిస్తున్నారా?”

“మా అబ్బాయి లెవ్ ప్రతిభావంతుడేనను కుంటున్నారా?”

“మీకు సోఫ్యా అంటే యిష్టమేనా?”

ఆయనతో అబద్ధం చెప్పడం అసాధ్యం.

ఒకసారి ఆయన అడిగాడు:

“మీకు నేనంటే యిష్టమేనా?”

యిది రష్యన్ వీరుడి వినోదం. ఆయన యేదో కుస్తీకి తయారవుతున్నట్టు పరీక్షపెట్టేవాడు. యెప్పుడు యేదో ప్రయత్నించేవాడు. యిది సరదాగానే వుంది, కాని నేను దాన్ని గురించి పట్టించుకున్నానని అనుకోను. ఆయనో రాక్షసుడు, నేనింకా పసివాణ్ణి, నన్ను ఆయన ఒంటరిగా వదిలి పెట్టెయ్యాలి.

21

“డికెన్స్ చాలా తెలివైన సంగతి ఒకటి చెప్పాడు: ‘కడదాకా మీరు దాని కోసం పోరాడుతూనే వుండాలి అన్న షరతుమీదనే మీరు జీవిస్తున్నారు’ అని. మొత్తంమీద అతను భావావేగపూరిత, వాగ్భాహుళ్య రచయిత, అంత తెలివైన వాడు కాదు. ఆయన మరెవ్వళ్ళూ చెయ్యలేనట్టుగా నవలా నిర్మాణం చేస్తాడనుకోండి, ఖాయంగా బాల్టాక్ కంటే బాగా చేస్తాడు. ఎవరో అన్నారు: ‘పుస్తకాలు రాయాలీ అనే యావతో చాలా మందే వుంటారు, కాని ఎవరూ అవంటే సిగ్గుపడరు. ‘ బాల్జాక్ కి  లేదు, డికెన్స్ కు  లేదు, యిద్దరూ కూడా చెత్త చాలా రాశారు. అయినా బాల్జాక్ మేధావి, అంటే మేధావి అని పిలవగలిగేది వున్నవాడు….”

“”అధోజనం” నుంచి కొన్ని రంగాలని చదివి వినిపించాను. ఆయన శ్రద్ధగా  విని, అప్పుడు అడిగాడు:

“యిది రాయాలని యెందు కనిపించింది మీకు?”

నేను చెప్పగలిగినంత మేరకి ఆయనకి వివరించి చెప్పాను.

“మీరు పందెం కోడిలాగా అన్నిటి కేసీ దూసుకుపోతారు. యేం, యింకో విషయం- మీరెప్పుడూ కూడా పొరలనీ, పగుళ్ళనీ మీ రంగుతోనే సాపు చెయ్య ప్రయత్నిస్తున్నారు. హాన్స్ ఏండర్సన్ తను రాసిన ఓ కథలో అంటాడు: ‘బంగారు పూత పోతుంది, తోలు అట్ట మిగులుతుంది’ అని. మన రైతులు అంటారు: ‘ప్రతీదీ నశించి పోతుంది, సత్యం ఒక్కటే నిలుస్తుంది’ అని. రంగు పులమకండి, తర్వాత అది మీకే యెక్కువ చెరువు. తర్వాత, మీ భాష మరీ వడిగా వుంది, చమక్కులతో నిండి వుంది, అది బాగోదు. మీరు యింకా తేలిగ్గా రాయాలి, మనుషులు యెప్పుడూ సాదాగానే మాట్లాడతారు. పైకి పొంతన లేనట్టు కనిపించినా వాళ్ళు చెప్పదలచుకున్నది బాగానే చెప్తారు. ఎవరో చదువుకున్నావిడ అన్నట్టు ‘నాలుగు మూడు కంటే యెక్కువైనప్పుడు మూడవది నాలుగవ దాని కంటే గొప్పది యెలా అవుతుంది?’ అని రైతు యెవడూ అడగడు. చమక్కుల రాత అవసరం లేదు.”

ఆయన సంతృప్తి చెందినట్టు లేదు, నేను చదివి వినిపించింది ఆయనకి నచ్చనే లేదని తెలుస్తూనే వుంది. కొంచెంసేపు అయిం తర్వాత ఆయన నా పైగా చూస్తూ, చిరచిరలాడుతూ అన్నాడు:

“మీ ముసలతను ప్రేమాస్పదుడు కాడు. అతని మంచితనంతో యెవరికీ నమ్మకం లేదు. ఆ నటుడు బాగా వున్నాడు. మీరు ‘చదువు ఫలితం’ చదివారా? అందులో సరిగ్గా మీ నటుడిలాంటి వంటవాడు ఒకడున్నాడు. నాటకాలు రాయడం మహా కష్టం. మీ జారిణి బాగుంది. వాళ్ళు బహుశా వాస్తవానికి అలానే వుంటారు. అలాంటి వాళ్ళని కలుసుకున్నారా?”

“ఆ …”

“తెలుస్తూనే వుంది. సత్యం యెప్పుడూ మరుగున వుండదు. కాని మీరు రచయిత దృష్టినుంచి అమితంగా మాట్లాడుతున్నారు. అందుకనే మీ నాయకులు నిజమైన పాత్రలు కారు, వాళ్ళంతా మరీ ఒక్కలాగే వుంటారు. మీరు బహుశా ఆడవాళ్ళని అర్థం చేసుకోలేరు, మీరు ఆడవాళ్ళని గురించి రాయలేరు. మీ ఆడవాళ్ళు యెవళ్ళకీ గుర్తువుండరు….”

మమ్మల్ని టీ తాగడానికి రమ్మని పిలవడానికి టాల్ స్టాయ్  కోడలు వచ్చింది. ఆయన లేచి గబగబా అవతలికి వెళ్ళిపోయాడు, ఆ సంభాషణని ముగించేస్తున్నందుకు  సంతోష పడుతున్నట్టుగా.

23

“మీకు వచ్చిన అతి భీకరమైన కల యేమిటి?”

నాకు యెప్పుడో గాని కలలు రావు, నా కలల్ని గుర్తుపెట్టుకోవడమూ కష్టం నాకు. కాని రెండు మాత్రం గుర్తుండిపోయాయి. బహుశా వాటిని నా జీవితాంతం మర్చిపోనేమో.

కాంతి విహీనంగా, కిరణరహితంగా, క్షుధార్తుడి వంటిమీద పుళ్ళలాగా గుండ్రంగా, చదునుగా వున్న నక్షత్రాలతోటి జబ్బుపడి, మురిగిపోయి, ఆకుపచ్చ పసుప్పచ్చ రంగుగా వున్న ఆకాశం నా కలలోకి వచ్చింది. మురిగిపోయిన ఆకాశంమీద నక్షత్రాలకి మధ్యగా ఎర్రటి మెరుపు తీగ పాకుతోంది. ఆ మెరుపు దాదాపు పాములాగా వుంది. అది యే నక్షత్రాన్నేనా తాకితే, ఆ నక్షత్రం ఒక గోళం లాగా ఉబ్బిపోయి, నిశ్శబ్దంగా బద్దలైపోయేది. దాని జాగాలో పొగదమ్ములాగా మిగిలిపోయి ఒక నల్లని మచ్చ, తక్షణం మురిగిపోయిన, నీటిలాంటి ఆకాశంలో మాయమైపోయేది. అలా అన్ని నక్షత్రాలూ ఒక దాని తర్వాత ఒకటి పేలిపోయాయి. ఆకాశాన్ని యింకా యెక్కువగా తమస్సు ఆవరించింది, ఆకాశం యింకా యెక్కువ భీకరంగా కనిపించింది. అప్పుడు అంతా ముద్దగట్టుకు పోయినట్టూ, ఉడికిపోయినట్టూ కనిపించి, ఓ రకమైన నీటి హల్వాలాగా ముక్కలై నా నెత్తిమీద పడిపోయింది. ఆ ఖాళీ జాగాల మధ్యన యీ ముక్కలు నగిషీ చేసిన యినప నల్లని ఉపిరితలం లాగా ప్రకాశించాయి.

టాల్ స్టాయ్ అన్నాడు:

“మీరు ఖగోళశాస్త్రం గురించి యెదో విజ్ఞానశాస్త్ర గ్రంథం చదువుతూ వుండి వుండాలి. అందుకనే మీకీ పీడకల వచ్చి వుంటుంది. యిక ఆ రెండోకల యేమిటి?”

రెండోకల: మంచు కప్పిన బయలు. కాగితం లాగా చదునుగా వుంది, ఓ గుట్టగాని, చెట్టుగాని, పొదగాని లేవు. వూరికే ఒక్క కొమ్మ రెమ్మ మాత్రం మంచులో నుంచి బయటికి చొచ్చుకుని వచ్చింది. ఆ నిర్జీవపు బీటి మధ్యగా యీ అంచునుంచి ఆ అంచుకు కనిపించీ కనిపించని పసుప్పచ్చని రోడ్డు పీలిక విస్తరించుకుంది. ఒక జత బూడిద రంగు ఫెల్టు బూట్లు వాటంతట అవే మెల్లిగా దానిమీద అంగలు  వేసుకుంటూ పోయాయి.

ఆయన గుబురుగా, జీమూతంలా వుండే కనుబొమ్మల్ని పైకెత్తి, నాకేసి తదేక ధ్యానంగా చూశాడు. కొంచెంసేపాగి అన్నాడు:

“అది భయంకరంగా వుంది. నిజంగా మీరు కలగన్నారా- కల్పించలేదు కదా? పుస్తక సంబంధమైందేదో యిందులో వుంది. ”

వున్నట్టుండి ఆయన ఆగ్రహపడుతున్నట్టనిపించింది. ఒక వేలితో మోకాలిమీద తాటించుకుంటూ, కటువుగా చిరచిరలాడుతూ అన్నాడు.

“మీరు తాగరు కదా. మీరు యెప్పుడేనా తాగుడుకి అలవాటుపడ్డట్టూ కనిపించరు. అయినా యీ కలల్లో యేదో తాగుడుకి అలవాటు పడినటువంటిది. వుంది. హోఫ్ మన్  అని ఒక జర్మన్ రచయిత వుండేవాడు. ఆయన పేకాట బల్లలు అటూ యిటూ పరిగెత్తిపోతున్నట్టుగా,ఆ బాపతుదంతా వుండేదట-సరే,ఆయన బాగా తాగేవాడనుకోండి. బూట్లు వాటంతట అవే అంగలు వేసుకుంటూ పోవడం నిజంగా భయంకరంగా వుంది. ఒక వేళ మీరు దీన్ని కల్పించినా యిది చాలా బాగుంది. భీకరంగా వుంది!”

గడ్డం నిండుగా ఆయన చిరునవ్వు నవ్వాడు, దాంతోటి ఆయన చెక్కిళ్ళు  కెంపెక్కాయి.

“వూహించండి. హఠాత్తుగా ఓ పేకాట బల్ల వీధిలో పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది – తెలుసుగా, కొయ్య కాళ్ళు వంగిపోయి, దాని పలకలు టపటప కొట్టుకుంటూ వుంటే, సుద్దపొడి రేగుతూ – మీరు ఆ ఆకుపచ్చ ముతక ఉన్ని గుడ్డ మీద ఆకారాలని కూడా స్పష్టం చేసుకోగలరు. అది పరిగెత్తిపోయింది, యేమంటే కొందరు ఎక్సైజ్ వాళ్ళు వరసగా మూడు రోజులు దానిమీద వింట్ పేకాట ఆడారు. దాంతో అది యిక తట్టుకోలేకపోయింది.”

ఆయన నవ్వాడు. నామీద ఆయనకి నమ్మకం లేకపోబట్టి నేను కొంచెం కష్టపెట్టుకున్నానని ఆయన గమనించే వుంటాడు.

“మీకు కష్టం కలిగింది, మీ కల గ్రంథస్థంగా నాక్కనిపించబట్టి. కష్ట పెట్టుకోకండి. ఒకో అప్పుడు యెవళ్ళేనా యెలా తెలియకుండా కల్పనలు చేసేస్తారో నాకు తెలుసు. అవి యెంత వింతగా వుంటాయంటే, వాటిని వూరికే నమ్మలేం అంతే. అప్పుడు వాటిని కలగన్నా మనుకుంటారు.”

యీ సాయంత్రం మేం బయట నడుస్తూ వుంటే, ఆయన నా చెయ్యిపట్టుకుని అన్నాడు:

“బూట్లు నడవడం- దుస్సహం కదూ? వాటంతటవే, తపా తపా – కింద మంచు కరకరమంటూ వుంటుంది. అవును, యిది చాలా బాగుంది. అయినా మీరు చాలా చాలా పుస్తక పాండిత్యం వాళ్ళు. కోప్పడకండి – కాని అది మంచిది కాదు, తెలుసా అది మీకు ఆటంకం.”

ఆయనకంటే యెక్కువ పుస్తక జ్ఞానిగా వుంటానని నేను అనుకోను. సరిగా నాకు ఆయన తనేం చెప్పినప్పటికీ కూడా, పరమ హేతువాదిగా కనిపించాడు.

24

ఆయన యెక్కడినుంచో దూరంనుంచి, మనుషులు విభిన్నంగా ఆలోచించి, అనుభూతి చెందే చోటినుంచి, ఒకళ్ళనొకళ్ళు భిన్నంగా ఆదరించుకునే చోటినుంచి, మనం చరించినట్టుగా చరించను కూడా చరించని చోటినుంచీ, ఒక భిన్నమైన భాషని మాట్లాడే చోటినుంచీ అప్పుడే దిగివచ్చినట్టుగా కనిపించేవాడు. అలిసిపోయి, నెరిసిపోయి, మరో భూమినుంచి వచ్చిన దుమ్ముతో దుమ్ము కొట్టుకుపోయి ఆయన ఒక మూల కూర్చుంటాడు. ప్రతివాళ్ళ కేసి ఒక పరాయివాడి లాగానో, లేకపోతే మూక బధిరుడి లాగానో గుడ్లప్పగించి శ్రద్ధగా చూస్తూ వుండేవాడు.

నిన్న సాయంత్రం భోజనానికి ముందు, సరిగ్గా అలాగే, యెక్కడినుంచో సుదూర తీరం నుంచి వచ్చినట్టుగా డ్రాయింగు రూములోకి వచ్చి చూస్తూ వున్నాడు. అప్పుడు నిశ్శబ్దంగా సోఫామీద ఓ క్షణం కూర్చుని, వూగుతూ, అరచేతులతో మోకాళ్ళని రుద్దుకుంటూ, ముఖం ముడతలు పడేట్టు చేసుకుని, హఠాత్తుగా అన్నాడు:

“అది అంతం కాదు, కాదు, కాదు.”

ఎవరో ఒకతను నార బట్టలు యిస్త్రీ పెట్టెలాగా బండగా, గమ్ముగా వుండే అతను ఆయన్ని అడిగాడు:

“అంటే యేమిటి?”

ఆయన అతని కేసి నిశ్చలంగా చూసి, వంగి, డా. నికీతిన్, యెల్ పాతి యేవ్ స్కీ , నేనూ కూర్చుని వున్న వరంగా కేసి చూసి మమ్మల్ని అడిగాడు:

“మీరు యేమిటి మాట్లాడుకుంటున్నారు?”

“ప్లేవ్ గురించి.”

“ప్లేవె…. ప్లేవె….” అని ఆయన సాలోచనగా రెట్టించాడు. మాటమాటకీ మధ్యన, తనెప్పుడూ ఆ పేరు వినివుండనట్టు, ఆగుతూ అన్నాడు.

25

“నాకు తాగుబోతులంటే యిష్టం లేదు. కాని ఒకటి రెండు గ్లాసులు తర్వాత ఆసక్తికరంగా తయారయ్యే వాళ్ళని నేను యెరుగుదును. వాళ్ళకి హాస్యం వస్తుంది. ఆలోచనకి అందం వస్తుంది. ఒక సూటిదనం, ఒక వాగ్ధాటి వస్తాయి. అవి వాళ్ళు  మామూలుగా వున్నప్పుడు వుండవు. అప్పుడు నేను వైన్ ని  అభినందించగలను.”

తనూ, టాల్ స్టాయ్  కలిసి వీధిలో వెడుతూ వుంటే, టాల్ స్టాయ్  దూరంలో కవచధారులైన యిద్దరు ఆశ్విక సైనికుల్ని గమనించాడని సులెర్ జీత్ స్కీ అన్నాడు. వాళ్ళు ధరించిన యిత్తడి ఛాతీ ఫలకాలు యెండలో మెరుస్తూ వుంటే, వాళ్ల బూటు మడమల్లోని లోహపు ముళ్ళు గణగణమంటూ వుంటే వాళ్ళిద్దరూ కలిసి యెదిగినట్టుగా నడిచారు. వాళ్ళ ముఖాలు కూడా యౌవనంతోటీ దారుఢ్యంతోటీ కళకళ లాడిపోయాయి.

టాల్ స్టాయ్  వాళ్ళని తిట్టడం మొదలెట్టాడు.

“యేం దాంభికమైన మౌఢ్యం! కొరడాతోటి శిక్షితమైన జంతువులు తప్ప….” ఆ అశ్విక సైనికులు పక్కనుంచి పోయినప్పుడు ఆయన నిశ్చలంగా నుంచుండిపోయాడు, వాళ్ళని ఆదరపూర్వకమైన చూపుతో దర్శిస్తూ, అభినందన పూర్వకంగా అన్నాడు:

“అయినా, వాళ్ళు అందంగా లేరూ! ప్రాచీన రోమన్లు, ఏహ్ దారుఢ్యం, అందం – ఓరి దేముడా! మానవుడిలో అందం యెంత అద్భుతం- యెంత అద్భుతం!”

26

బాగా యెండగా వున్న ఓ రోజున ఆయన దిగువ రోడ్డు మీద నన్ను దాటిపోయాడు. ఆయన లివాదియా దిశలో స్వారీ చేసుకుపోతున్నాడు, కుదురుగా వుండే చిన్న తాతార్ గుర్రం యెక్కాడు. నెరిసిపోయి, కేశ భూయిష్టంగా, పుట్ట గొడుగులాంటి తెల్లటి పల్చని ఫెల్ట్ టోపీ పెట్టుకుని భూతంలాగా వున్నాడు.

ఆయన గుర్రం కళ్ళెం పట్టుకుని ఆపి నాతో మాట్లాడాడు. ఆయన రికాబు పక్కనే వెడుతూ, మిగతా విషయాలతో బాటుగా, నాకు వి. కొరొలేంకొ నుంచి ఉ త్తరం వచ్చిందని చెప్పాను. టాల్ స్టాయ్  కోపంతో గడ్డాన్ని ఆడించాడు.

“అతనికి దేవుడంటే నమ్మకం వుందా?”

“నాకు తెలీదు.”

“మీకు అతి ముఖ్యమైన విషయం తెలీదు. ఆయనకి విశ్వాసం వుంది. కాని నాస్తికుల ముందు ఒప్పుకోవడానికి సిగ్గు.”

ఆయన గొణుగుతూ, అసహనంగా, కళ్ళని కోపంగా ముడుస్తూ మాట్లాడాడు. నేను ఆయనని ఆపు చేస్తున్నానని నాకు తెలుసు, ఆయిన్ని వెళ్లనివ్వడానికన్నట్టు నేను దారియిస్తే, ఆయన నన్ను ఆపాడు.

“యేమిటి సంగతి? నేను మెల్లిగా స్వారీ చేస్తున్నాను.”

మళ్ళీ గుర్రుమన్నాడు:

“మీ అంద్రేయప్ నాస్తికులన్నా బెరుకే, కాని అతను దేముడున్నాడని  నమ్ముతాడు, అతనికి దేముడంటే భయం.”

గ్రాండ్ డ్యూక్ ఎ. రొమానొవ్ ఎస్టేట్ శివారులో రోడ్డుమీద ముగ్గురు రొమానావ్లు దగ్గరగా నుంచున్నారు, మాట్లాడుకుంటూ- ఆయ్-తోడర్ ఎస్టేట్ యజమాని, గియోర్గీ, యింకో ఆయనా ముగ్గురూ కూడా చక్కగా పొడుగ్గా వున్న మనుషులు. రోడ్డుకి అడ్డంగా ఒంటి గుర్రపు బండీ, ఓ జీను గుర్రం వున్నాయి. టాల్ స్టాయ్ వెళ్ళలేకపోయాడు. ఆయన రొమానొవ్ల కేసి కటువుగా, నిర్బంధంగా చూశాడు. కాని వాళ్ళు మాకు వెనక్కి తిరిగి నుంచున్నారు. జీను గుర్రం కాళ్ళు కదిల్చి, పక్కకి మళ్ళింది, టాల్ స్టాయ్  గుర్రాన్ని వెళ్ళనిస్తూ.

నిశ్శబ్దంగా ఓ క్షణమో, రెండు క్షణాలో స్వారీ చేశాక ఆయన అన్నాడు:

 “వాళ్ళు నన్ను గుర్తుపట్టారు, మొరటు మనుషులు!”

యింకో క్షణం తర్వాత:

“గుర్రానికి తెలిసింది తను టాల్ స్టాయ్ కి  దారి యివ్వాలని.”

27

“మీ సంగతి మీరే జాగ్రత్త పడండి, మొట్టమొదటగా మీ కోసం, అప్పుడు మీరు యితరుల కోసం యెంతో చేస్తారు.”

28

“మాకు ‘తెలుసు’ అని మనం అంటున్నప్పుడు మన ఉద్దేశం యేమిటి? నేను టాల్ స్టాయ్ ననీ , రచయితననీ, నాకు భార్య వుందనీ, పిల్లలు వున్నారనీ, నెరిసిన జుట్టు వుందనీ, అందవిహీనమైన ముఖం వుందనీ, గడ్డం వుందనీ నాకు తెలుసు- అదంతా నా పాస్ పోర్ట్ లో  వుంది. కాని పాస్ పోర్టుల్లో వాళ్ళు ఆత్మల్ని యెక్కించలేరు. నా ఆత్మని గురించి నాకు తెలిసిందల్లా యేమిటంటే అది భగవత్సాన్నిధ్యం కోసం తహతహలాడుతోంది. కాని భగవంతుడెవరు? నా ఆత్మ ఒక అణువుగా భాగమైనదేదో అది అంతే. ఆలోచించడం నేర్చుకున్న వాడెవడికైనా నమ్మడం కష్టం, కాని యెవరేనా గానీ విశ్వాసం ద్వారానే భగవంతునిలో జీవించగలరు. తెర్తులియాన్ అన్నాడు:’ఆలోచన చెడ్డది.’

29

విసుగు తెప్పించే బోధననున్నాగానీ, యీ ఆశ్చర్యకరమైన వ్యక్తి  అపరిమితమైన బహుముఖ ప్రజ్ఞావంతుడు.

యివాళ పార్కులో గ్రాస్పా  ముల్లాతోటి మాట్లాడుతూ, ఆయన, తన కడపటి రోజులని గురించి ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చిన పల్లెటూరి నాటు మనిషిలా . నమ్మకం కలిగేటట్టు ప్రవర్తించాడు. అసలే చిన్నగా వున్న తనుయింకా చిన్నగా అయిపో ప్రయత్నిస్తున్నట్టు కనిపించాడు. పట్టుగా, దృఢంగా వున్న తాతార్ పక్కన నుంచుని, ఉత్పన్నమైన సమస్యలతో మునిగిపోయి జీవిత పరమార్థాన్ని గురించి అప్పుడే చికిత్స చేసుకుంటున్న చిన్న వృద్ధుడిలాగా ఆయన కనిపించాడు. తన గుబురు కనుబొమలని ఆశ్చర్యంతో యెత్తి, నిశితమైన కళ్ళు బెరుగ్గా మిటకరిస్తూ, ఆయన వాటి సునిశిత తేజస్సుని మసక కమ్ముతున్నట్టు వుంది. ఆయన గవేషణాత్మక దృక్కు ఆ ముల్లాగారి వెడల్పాటి ముఖం మీదే నిశ్చలంగా వుంది. ప్రజలకి చిత్త విభ్రమం కలిగించే నిశతత్వం ఆయన కనుపాపల్లో అదృశ్యం అయింది. కొరాన్ నుంచీ , న్యూటెస్టమెంట్ నుంచీ పద్య భాగాలు చదువుతూ, అత్యద్భుతమైన నైపుణ్యంతోటి ప్రవక్తల ప్రవచనాలని ఉల్లేఖిస్తూ జీవిత పరమార్థం గురించీ ఆత్మని గురించీ, భగవంతుణ్ణి గురించీ “కుర్ర తరహా” ప్రశ్నలు ఆయన ముల్లాని అడిగాడు. వాస్తవానికి ఆయన నాటకంలో వేషం వేస్తున్నట్టు వుంది. అది కూడా యెంతో నైపుణ్యంతోటి, గొప్ప కళాకారుడికో, రుషికో సాధ్యమైనట్టు.

కొద్ది రోజుల కితం తనేయేవ్ తోటి  సులెర్ జీత్ స్కీ తోటి సంగీతం గురించి మాట్లాడుతూ ఆయన దాని అందం గురించి పసితనపు పారవశ్యంలో ములిగి పోయాడు. తన పారవశ్యాన్ని ఆనందించినట్టు మీకు కనిపిస్తుంది- లేదా వాటిని అనుభూతం చేసుకోగల సామర్థ్యాన్ని. షోపెన్ హవర్ అంత బాగా, అంత గంభీరంగా యెవరూ సంగీతాన్ని గురించి రాయలేదని అన్నాడు. ఆ విషయంచెపుతూ ఆయన ఫెత్ ని  గురించి సరదా అయిన కథ చెప్పాడు. సంగీతాన్ని “ఆత్మ చేసే మూగ ప్రార్థన” అన్నాడు.

“మూగ యెందుకని?” అని సులెర్ జీత్ స్కీ అడిగాడు.

“యెందుకంటే దానికి మాటలు లేవుగనక. ధ్వనుల్లో ఆలోచనల్లో కంటే యెక్కువ ఆత్మ వుంది. ఆలోచన అనేది రాగి నాణాలు వున్న పర్సులాంటిది, ధ్వని అనేది దేని వల్లా ఖిలం పట్టనిది, అంతరంగికంగా పరిశుద్ధమైంది.”

ఆయన వున్నట్టుండి అత్యుత్తమమైన అతి మృదువైన కుర్ర తరహా మాటలని హత్తుకునే వాటిని యెంపిక చేసుకుంటూ, ఆనందంతో వాటిని వాడాడు. అప్పుడు గడ్డంలోనుంచి చిరునవ్వు తొణుకుతూ వుంటే మృదువుగా, దాదాపు లాలిస్తున్నట్టుగా  అన్నాడు:

“సంగీతకారులంతా బడుద్దాయిలే. సంగీతకారుడు యెంత ప్రతిభావంతుడైతే,  అంత సంకుచితంగా వుంటాడు. వింత యేమిటంటే దాదాపు వాళ్ళంతా దైవభీతి పరులే.”

30

చేహొవ్ కి  టెలిఫోన్ లో :  

“యివాళ నాకు యెంతో ఆనందదాయకమైన రోజు నాకు యెంతో సంతోషంగా వుంది, మీరు కూడా సంతోషంగా వుండాలని కోరుతున్నాను. ముఖ్యంగా మీరు! మీరు యెంతో మంచివాళ్ళు, యెంత మంచివాళ్ళో!”

31

యెవళ్ళేనా తప్పుడు విషయాలు చెప్పినప్పుడు ఆయన వినడు, నమ్మడు. వాస్తవానికి ఆయన అడగడు, ప్రశ్నిస్తాడు. అపురూపమైన వస్తువుల్ని సేకరించే వాడి లాగా ఆయన తను పోగుచేసిన వాటి సారూప్యతని చెడగొట్టని వాటినే అంగీకరిస్తాడు.

32

 టపా చూసుకుంటూ:

“వాళ్ళు పెద్ద గొడవ చేస్తున్నారు, వాళ్ళు రాస్తున్నారు. నే చనిపోయాక, వాళ్ళు అంటారు, ఓ యేడాది తర్వాత: ‘టాల్ స్టాయ్ ? చెప్పులు కుట్టబోయిన కౌంటే కదూ? తర్వాత యేదో యింకోటీ, యింకోటీ జరిగింది ఆయనకే కదూ?’

33

తను దాచుకున్న వస్తువు హఠాత్తుగా దొరికిన వాడికి వుండే కుటిల, ఆత్మ తృప్తిపూర్వక మందహాసం ఆయన వదనంమీద యెక్కువ సార్లు నాకు కనిపించింది. అతను దేన్నో దాచుకున్నాడు, ఆ జాగా మర్చిపోయాడు. చాలా రోజులు రహస్య ఆందోళనలో గడిపాడు, నిరంతరంగా ఆశ్చర్యపడుతూ: నాకు అంతగా అవసరమైన యీ వస్తువుని యెక్కడ పెట్టి వుంటాను? తన ఆందోళనని, నష్టాన్ని యెవరేనా చూస్తారేమోనని దాంతోటి యేదో అనిష్టకరమైంది, తనకి నచ్చని దాన్ని చేస్తారని భయం. హఠాత్తుగా ఆయనకి గుర్తువస్తుంది, అది దొరుకుతుంది. ఆనందంతో మునకలై పోయి యొక యెంత మాత్రమూ దాన్ని దాచుకోవాల్సిన బాధ లేకుండా, ఆయన ప్రతివాళ్ళ కేసి “యిప్పుడు మీరు నన్ను గాయపర్చలేరు!” అంటున్నట్టు  చూస్తాడు.

తనకి దొరికిందాన్ని గురించి, అది యెక్కడ దొరికిందో దాన్ని గురించి ఒక్క ముక్క కూడా చెప్పడు.

ఆయన్ని చూసి యెప్పుడూ ఆశ్చర్యపడకుండా వుండలేను. కాని ఆయన్ని తరచుగా చూడాలంటే కష్టం. నేను ఒకే యింట్లో – ఒకే గది సంగతి చెప్పనే అక్కర్లేదనుకోండి ఆయనతో వుండలేను. ఆయనతో వుండడం అంటే, యెండలో యేదీ నిలవకుండా మాడిపోయిన మైదానం మీద, సూర్యుడు తనే దగ్దమైపోయి, అవధిలేని అంధకార నిశీధిని సూచిస్తూ వుండే చోట వుండటమన్న మాట.

మీకు సరిగ్గా ఉత్తరం పోస్టు చేసిం తర్వాత “టాల్ స్టాయ్ కనిపించకుండా పారిపోయిన విషయం” గురించి టెలెగ్రామ్ వచ్చింది. అయినా మీకు రాస్తున్నాను, మీతో యింకా మానసిక సంబంధాన్ని అనుభూతి చెందుతూ వున్నాను.

యీ వార్తకి సంబంధించి నేను చెప్పాలని భావించుకునేదంతా గందరగోళంగా వుంటుంది, బహుశా కటువుగా, నిర్దాక్షిణ్యంగా వుండవచ్చు- నన్ను మన్నించాలి- యెవరో నా పీక పట్టుకుని నులిమేస్తున్నట్టు వుంది నాకు.

ఆయన నాతో దీర్ఘంగా చాలా మాట్లాడాడు. నేను గాస్ప్రాలో, క్రిమియాలో వున్నప్పుడు తరచుగా ఆయన్ని చూడ్డానికి వెళ్ళేవాణ్ణి. ఆయనకి కూడా నన్ను చూడ్డానికి రావడం యిష్టం. నేను ఆయన పుస్తకాలని చిత్తశుద్ధితో, ప్రేమతో చదివాను. అంచేత, నేను చెప్పబోయేది చాలా సాహసభరితమైందైనా, ఆయన్ని గురించి సామాన్యంగా వుండే అభిప్రాయానికి వ్యతిరిక్తంగా వున్నా, నేను ఆయన్ని గురించి అనుకునేదాన్ని చెప్పడానికి నాకు హక్కు వున్నట్టు కనిపిస్తుంది. మేధావి అని పిలవడానికి యింతకంటే అర్హమైన మనిషి లేడనీ, యింతకంటే సంక్లిష్టపూరితంగా, స్వీయ వైరుధ్యభరితంగా, ప్రతిదాంట్లోనూ- అవును, ప్రతిదాంట్లోనూ యెక్కువ అద్భుతావహంగా వున్న మనిషి లేడనీ నాకు మిగతా అందరికి లాగానే తెలుసు. ఆయన ప్రత్యేకార్థంలోనూ, విస్తృతార్థంలోనూ కూడా అద్భుతమైన వ్యక్తి, ఒక రకంగా మాటల్లో పెట్టలేనిలాంటిది అది. అందరికీ నానా రకాల వాళ్ళకీ నేను అరిచి చెప్ప బుద్ధి పుట్టేట్టు నన్ను చేసేది యేదో వుంది ఆయనలో: చూడండి, యెలాంటి దివ్యమైన మనిషి యీ భూగోళంమీద వున్నాడో! యేమంటే ఆయన సర్వవ్యాపకుడు, తొట్టతొలిగా మానవుడు- మానవాళిలో మనిషి.

కౌంట్ లియో టాల్ స్టాయ్  అనే మనిషి జీవితాన్ని “మునిపుంగవుడైన లియో” జీవితంగా మార్చాలని ఆయన చేసే నిరంకుశ మూర్ఖ ప్రయత్నాలంటే నాకు యెప్పుడూ వైముఖ్యమే. చాలాకాలం “బాధ” పడడానికి ఆయన తన మట్టుకి తను యాతనపడుతున్నాడు, తెలుసా. తను దాన్ని యింకా సాధించలేకపోయినందుకు యెంత విచారిస్తున్నదీ ఆయన యెవ్ గేని సొలొవ్యోవ్ తోటీ,సులర్ జీత్ స్కీ తోటి చెప్పాడు. తన సంకల్ప బలాన్ని పరీక్షించుకుందామనే సహజమైన కోరికవల్లనే వూరికే ఆయన బాధపడదామనుకోలేదు. కాని తన సిద్ధాంతాల కండపుష్టిని పరీక్షించుకోవాలన్న- నేను రెట్టించి అంటున్నాను- మొండి ఉద్దేశ్యంతోటి తన బోధనని ప్రబలంగా వుంచుకోవడానికి, బాధపడ్డం ద్వారా దాన్ని జనం దృష్టిలో పవిత్రం చెయ్యడానికి, వాళ్ళు దాన్ని అంగీకరించేటట్టు చెయ్యడనికి – ఒత్తిడి చెయ్యడానికి, ఆయన బాధపడబోయాడు, తెలిసిందా, – ఒత్తిడి చెయ్యడానికి. యేమంటే ఆయనకి తెలుసు, తన బోధన విశ్వాసం కలిగించేటట్టుగా వుండదని. ఆయన డైరీలు ప్రచురితమైనప్పుడు సంశయాత్మకత తాలూకు మంచి మచ్చుతునకల్ని కొన్నింటిని తన సిద్ధాంతానికీ, వ్యక్తిత్వానికీ అనువర్తింపచేసుకుని వుండటం మీకు కనిపిస్తుంది. “స్వతను త్యాగులూ బాధపడేవాళ్ళూ దాదాపుగా విధిగా నిరంకుశులూ పీడకులూ” అని ఆయనకి తెలుసు- ఆయనకి ప్రతీదీ తెలుసు. అయినా ఆయన అంటాడు: “నేను నా భావాలకోసం బాధపడవలసివస్తే అవి పూర్తిగా భిన్నమైన ముద్రని కలిగిస్తాయి.” ఆయనలో అది యెప్పుడూ నాకు వెగటు కలిగించింది, యేమంటే అందులో నన్ను నిర్బంధించాలన్న ప్రయత్నం, నా అంతరాత్మ మీద పెత్తనం చెయ్యాలన్న కోరిక, దాన్ని అమర వీరుడి రక్తదర్శనంతో మిరుమిట్లు కొలిపేటట్టు చెయ్యడం, నా మెడ చుట్టూ మూఢ భావాల కాడిని పెట్టడం అనే ప్రయత్నం అనుభూతం చేసుకోకుండా వుండలేకపోయాను.

 మరో ప్రపంచంలోని అమరత్వాన్ని కీర్తిస్తూ ఆయన స్తోత్ర గీతాలు దాదాపు ప్రతిచోటా, అస్తమానూ పాడుతూనే వున్నాడు. కాని యీ ప్రపంచంలోని అమరత్వం ఆయన అభిరుచికి సరిపడుతుంది. ఆ మాటకి వున్న సిసలైన అర్థంలో ఒక జాతీయ రచయిత అయిన యీయన తన బ్రహ్మాండమైన ఆత్మలో జాతికి గల అన్ని చెడ్డ లక్షణాలనీ, మన చరిత్ర చిత్రహింసలు మనమీద విధించిన అంగవైకల్యాన్నీ, యిముడ్చుకున్నాడు….. ఆయనలో వున్న ప్రతీదీ జాతీయమైందే. ఆయన మొత్తం బోధ అంతా శుద్ధ తిరోగమనం, ఆటవికం; దేన్నైతే జయించాలని మనం విదిలించుకో ప్రయత్నిస్తున్నామో అది.

1905లో ఆయన రాసిన ఉత్తరం “మేధావులూ, రాజ్యమూ, ప్రజలూ” అన్న యెంతటి విద్వేషభరితమైన, అసహ్యమైన ఉత్తరం అది! దాన్ని గుర్తు చేసుకోండి . దాని అంతటా కూడా కసిగా వుండే అసమ్మతీయుని ధోరణి “నేను నీకు చెప్పాను కదా!” అనేది కనిపిస్తూనే వుంటుంది. ఆ సందర్భంగా నేను ఆయనకి ఒక జవాబు రాశాను “రష్యన్ ప్రజల గురించీ, వాళ్ళ పేరుమీదుగా మనం రాసే హక్కుని ఎన్నడగానో పోగొట్టుకున్నామని” నాతోటి ఆయన అన్నమాటల మీదే ఆధారపడి. యేమంటే తనతోటి మనసు విప్పి మాట్లాడదామని వచ్చే మనుషులు చెప్పేది వినడానికే ఆయన అయిష్టంగా వుంటాడు. దానికి నేనే సాక్షిని. నా ఉత్తరం కటువుగా వుండింది. నేను దాన్ని పోస్టు చెయ్యలేదు.

తన భావాలకి వీలైనంత అత్యుత్తమ ప్రాముఖ్యం యిచ్చే ఆశతోటి బహుశా కడసారి లంఘనం అనేదాన్ని ఆయన చేస్తున్నాడు. వసీలీ బుస్లాయెవ్ లాగా ఆయనకి అలాంటి లంఘనలంటే యిష్టం. కాని యెప్పుడూ తన పవిత్రత్వపు రుజువు కోసమూ పరివేషం కోసం ప్రయత్నాల వైపూనే అవి వుంటాయి. యిది బలవంతంగా తమ అభిప్రాయాలని యితరులమీద రుద్దడం లాంటిది, ఆయన బోధనలకి రష్యా ప్రాచీన చరిత్రవల్లా, మేధావి వైయక్తిక బాధవల్లా సమర్థన వచ్చినా. పాపాన్ని గురించిన చింతనవల్లా, జీవించాలనే కోరికకి లొంగడం వల్లా పవిత్రత సాధింపబడుతుంది.

విద్వేషానికి దగ్గరగా వుండే అనుభూతుల్ని నాలో రెచ్చగొట్టిందీ, నా హృదయం మీద మహా భారంగా పడేదీ టాల్ స్టాయ్ లో  చాలా వుండింది. అసాధారణంగా ఉబ్బిన ఆయన అహం ఒక కిరాతకమైన దృగ్విషయం, దాదాపు అమానుషం. నిజమే, ఆయన గొప్పవాడే! ఆయన మాట్లాడుతున్న విషయాలకు తోడుగా, ఆయన చెప్పకుండా నిశ్శబ్దంగా వుండిపోయింది చాలా వుంది – ఆఖరికి తన డైరీల్లో కూడా గురించి ఆయన బహుశా యే ప్రాణికీ చెప్పడేమో. యీ “యేదో” యెప్పుడేనా, తాత్కాలికంగా, ఆయన మాటల్లో అనుభూతం అవుతుంది. దానికి సంబంధించిన సూచనలు ఆయన నాకూ, ఎల్.సులర్ జీత్ స్కీ  చదవమని యిచ్చిన రెండు డైరీల్లోనూ వుంది. “చెప్పబడిన దాన్నంతటినీ నిరాకరించడం” లాంటి దేవిలాగానో అది నాకు కనిపించింది – అవధిలేని నిరాశ, ఒంటరితనమూ వున్న గడ్డమీద పుట్టి పెరిగిన అంత్యంత గాఢత్వమూ దుష్కీర్తిగల నాస్త్యర్థక సిద్ధాంతంగా కనిపించింది. అలాంటి నిరాశనీ, ఒంటరితన్నాని యేదీ నాశనం చెయ్యలేకపోయింది, దాన్ని అంతకుముందు యెవ్వరూ అంతటి హడలిపోయే స్పష్టత తోటి అనుభూతం చేసుకుని వుండలేదు. ఆయన మొండిగా, హృదంతరాళంలో మానవులపట్ల ఉదాసీనంగా వుండేవాడుగా నన్ను నిశ్చేష్టితం చేశాడు. ఆయన యెంత ఉన్నతంగా, యెంత యెక్కువ శక్తివంతంగా వాళ్ళకంటే వున్నాడంటే, వాళ్ళని ఆయన కీటకాల కింద చూసేవాడు. వాళ్లు వ్యాపకాలన్నీ ఆయనకు పరిహాసాస్పదంగా, దయనీయంగా కనిపించాయి. ఆయన వాళ్ళనుంచి యెక్కడి దూరంగా నిర్జన ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ తన సర్వ ఆత్మశక్తులు కేంద్రీకరణతోటీ, ఆయన అన్నిటికంటే అతిముఖ్యమైందాన్ని” యేకాంతలో పరిశీలిస్తాడు – అది మృత్యువు.

తన యావజ్జీవితమూ ఆయన మృత్యువంటే భయపడ్డాడు. అసహ్యించుకున్నాడు. యావజ్జీవితమూ ఆయన్ని “అర్జమాస్ భీతి” వెంటాడుతూనే వుంది – తను, టాల్ స్టాయ్ , చనిపోవాల్సిందేనా? సర్వప్రపంచమూ, విశ్వమూ ఆయనకేసి చూస్తోంది. చైనానుంచి, ఇండియా నుంచి అమెరికానుంచి సజీవ, కంపిత తంత్రులు ఆయనకేసి విస్తరించుకున్నాయు. ఆయన ఆత్మ అందరిదీ, అన్ని కాలాలదీ. ప్రకృతి తన నియమాలకి మినహాయింపు చేసి ఆయనమీద- మానవులందరిలోకీ యీ ఒక్కని మీదే – భౌతిక అమరత్వాన్ని ప్రాసాదించకూడదూ? అద్భుతాల్లో నమ్మకం పెట్టుకునే అవివేకి కానంతటి హేతుబద్ధుడే అనుకోండి ఆయన. అయినా, మరో పక్క ఆయన తిరుగుబాటుదారుడు, పరిశోధకుడు, అజ్ఞాతమైన బారకాసులు యెదురుపడితే భయంతోటీ, విచారంతోటీ కకావికలైన నూతన అశిక్షిత సైనికుడిలాగా వున్నాడు ఆయన. గాస్ప్రాలో, జబ్బునుంచి కోలుకున్నాక, లెవ్ షెస్తోవ్” పుస్తకం “నిచ్ఛే”, కౌంట్ టాల్ స్టాయ్ బోధనల్లోని మంచీ, చెడూ” అన్న పుస్తకం చదివాక, తనకి “ఆ పుస్తకం నచ్చలేదు” అన్నాడు. చేహొవ్ ఆ వ్యాఖ్యకి జవాబుగా ఆయన అన్నమాటలు నాకు గుర్తువున్నాయి:

“మరి నాకు యిది సరదాగా వుండింది. కృతకంగా రాసిందే, కాని చెడ్డగా లేదు, యిది ఆసక్తికరంగానే వుంది. వాళ్ళు గనక చిత్తశుద్ధితో వుంటే, నాకు సినిక్ లంటే  యిష్టమే, తెలుసా? అతను యెక్కణ్ణి అంటాడు- ‘సత్యం అవసరం లేదు’ అని. అతను నూటికి నూరుపాళ్ళూ ఒప్పు – సత్యం యేమిటి అతనికి? అతను యెలాగేనా చనిపోతాడు.”

“ఒక సారంటూ మనిషి ఆలోచించడం నేర్చుకుంటే, అతని సకల ఆలోచనలూ తన మృత్యువుతోనే ముడిపడి వుంటాయి. వేదాంతులంతా అంతే. మరి సత్యాలవల్ల మంచి యేమిటి, మృత్యువు ఖాయంగా సమీపించేటప్పుడు?”

సత్యం అందరికీ సమమేనని ఆయన వివరించడం మొదలుపెట్టాడు- భగవంతుడిపట్ల ప్రేమ. కాని ఆయన యీ విషయం గురించి మొక్కుబడిగా, అలసటగా మాట్లాడాడు. భోజనాలయ్యాక, వరండాలో ఆయన మళ్ళీ ఆ పుస్తకాన్ని తీసుకుని రచయిత “టాల్ స్టాయ్, దొస్తోయేవ్ స్కీ , నిచ్చేలాంటి వాళ్ళు తమ ప్రశ్నలకి సమాధానం లేకుండా బతకలేరు. మరి యేదీ లేకపోవడం కంటే యేదో ఒక సమాధానం మెరుగు” అన్న మాటలు చెప్పిన భాగం తీసి నవ్వుతూ అన్నారు:

“యేం గుండెలు దీసిన క్షురకారుడు. నేను నన్ను మోసం చేసుకుంటున్నానని అంటా అంటే నేను యితరుల్ని కూడా మోసం చేస్తున్నట్టే కదా. యిదే స్పష్టంగా  వుండే తీర్పు…”

సులెర్ జీత్ స్కీ  అడిగాడు: ” ‘క్షురకారుడెందుకని?”

“యేముందీ,” అన్నాడాయన సాలోచనగా, “అతను షోకైన విలాస పురుషుడు  అని నాకు  వూరికే అనిపించిందంతే. పల్లెలో తన రైతు మేనమామ పెళ్ళికి మాస్కోనుంచి వచ్చిన క్షురకారుడు నాకు గుర్తువచ్చాడు. అద్భుతమైన నడవడిక అందుకనే యెవరన్నా అసహ్యించుకుంటాడు.”

నేను యీ సంభాషణని మక్కికి మక్కి యిస్తున్నాను. నాకు అది చాలా స్పష్టంగా గుర్తుంది. నేను దాన్ని రాసి పెట్టుకున్నాను కూడాను, నన్ను తాకిన ప్రతిదాని లాగా.సులెర్ జీత్ స్కీ  ,నేనూ చాలా నోట్సు రాసుకున్నాం. కాని సులెర్ జీత్ స్కీ   తన నోట్సు పోగొట్టుకున్నాడు. అతను మహా అజాగ్రత్త మనిషి. అతను టాల్ స్టాయ్ ను  అభిమానించినా ఆయనపట్ల అతని వైఖరి కొంచెం వింతగా, దాదాపు అనుగ్రహ పూర్వకంగా వుండేది. నేను కూడా నా నోట్సు యెక్కడ్నో పెట్టాను, దొరకలేదు. బహుశా రష్యాలో వుందేమో. నేను టాల్ స్టాయ్ ని చాలా సన్నిహితంగా పరిశీలించాను. యేమంటే నేను ఒక వాస్తవమైన, సజీవమైన విశ్వాసం వున్న మనిషి కోసం యెప్పుడూ అన్వేషించాను, జీవితాంతం అన్వేషిస్తూనే వుంటాను. పైగా, మన సంస్కృతీ రాహిత్యం గురించి, ఒకప్పుడు చేహొవ్ ఫిర్యాదు చేసినందుకూను:

“చూడండి, గ్యోతే అన్న ప్రతి మాటనీ రాసిపెట్టేశారు, కాని టాల్ స్టాయ్  మాట అలిఖితంగా వుండిపోతుంది. అది భయంకరమైన రష్యన్ స్వభావం, యేమంటారు! తర్వాత జనం కళ్ళు నులుముకుని లేచి జ్ఞాపకాలు రాయడం మొదలుపెడతారు, శుద్ద వక్రీకరణలతో.”

సరే సంగతి చూద్దాం – షెస్తోవ్  విషయం:

‘అస్తమానూ భయంకరమైన మాయ దృశ్యాలకేసి చూస్తూ యెవరూ _జీవించలేరు’ అంటాడాయన ఒకడు యేం చెయ్యగలిగేదీ, యేం చెయ్యలేకపోయేదీ ఆయనకి యెలా తెలుసు? తను మాయ దృశ్యాలని చూసినట్టు అతనికి తెలిస్తే, తను చిల్లర విషయాలు రాయడు. యేదో గంభీరమైందాంతోటే వ్యాపకం పెట్టుకుంటాడు.తన జీవితాంతం బుద్ధుడు చేసినట్టు…”

యీ వృద్ధమంత్రగాడు మృత్యువుతో క్రీడిస్తున్నట్టూ, దానితో సల్లాపం ఆడుతున్నట్టూ, యేదో రకంగా దానినుంచి యెక్కువ కొట్టెయ్యాలనుకుంటున్నట్టూ నువ్వంటే నాకు భయంలేదు, నువ్వంటే నాకిష్టం, నీకోసమే నేను నిరీక్షిస్తున్నాను అంటున్న ఒకో అప్పుడు అనిపిస్తుంది. మళ్లీ అంతసేపూ ఆయన చిన్న, నిశిత నేత్రాలు వెదుకుతూనే వుంటాయి- నువ్వెలాంటి దానివి? నీ వెనక్కాల యేముంది? నువ్వు నన్ను సమూలంగా నాశనం చేసేద్దామనుకుంటున్నావా? లేకపోతే నాలో యేదేనా మిగుల్తుందా?

“నేను సంతోషంగా వున్నాను, చెడ్డ ఆనందంగా వున్నాను, యెంతో ఆనందంగా వున్నాను!” అనే ఆయన మాటలు వింత అనుభూతిని కలిగిస్తాయి. మరి – తక్షణం తర్వాత: “అయ్యో, బాధపడ్డమా!” బాధపడ్డం – అది కూడా ఆయనలో నిజాయితీగా వున్నదే. యింకా రోగం నుంచి కోలుకుంటూ వుండగానే, ఆయన జైల్లో వుండడానికో, ప్రవాసం పోవడానికో, ఒక్క ముక్కలో చెప్పాలంటే అమరత్వ కిరీటం ధరించడానికో చిత్తశుద్ధిగా సంతోషిస్తాడనే. అమరత్వం అనేది మృత్యువుని సమంజసం చేస్తుందనీ, దాన్ని యింకా అవగతం చేస్తుందనీ, ఆమోదయోగ్యం చేస్తుందనీ – బాహ్య, లాంఛన దృక్పథం నుండి – ఆయన అనుకుంటున్నాడా? ఆయన యెన్నడూ ఆనందాన్ని పూర్తిగా చూడలేదని నాకు నమ్మకం- “వివేకవంతమైన పుస్తకాల్లో” గాని, “అశ్వాన్ని అధిరోహించినప్పుడు” గాని, “మగువలు బాహుబంధాల్లో” గాని ఆయన “ఐహిక స్వర్గపు” సంపూర్ణ ఆనందాన్ని అనుభవించలేదు. దానికి ఆయన మరీ హేతుబద్ధ మనస్తత్వంతో నిండిపోయాడు, జీవితాన్నీ ప్రజలనీ బాగా అవగతం చేసుకున్నాడు. ఆయన మాటలు మరి కొన్ని:

“కాలిఫ్ అబ్దుర్ రహమాన్కి జీవితంలో పద్నాలుగు ఆనందదాయకమైన రోజులు వున్నాయి, నాకు అన్ని వున్నాయని నేను అనుకోను. అంతా యెందుకంటే నేను యెప్పుడూ నాకోసం బతకలేదు, నా ఆత్మకోసం బతకలేదు- నాకు తెలీదు యెలా బతకాలో – యెప్పుడూ ప్రదర్శన కోసం, యితరుల కోసం బతికాను.”

మేం వచ్చేస్తూ వుంటే చేహొవ్ అన్నాడు: “ఆయనయెన్నడూ ఆనందంగా లేడంటే నేను నమ్మను.” అని. నేను నమ్ముతాను. ఆయన లేడు. కాని “ప్రదర్శన కోసం” ఆయన బతికాడన్నది నిజం కాదు. ఆయన యెప్పుడూ తనకి అధికంగా వున్నదాన్ని, భిక్షుకులకి మాదిరి, యితరులకి యిచ్చాడు. వాళ్ళచేత పనులని “చేయించడం”- చదవడం, నడవడం, శాకాల మీద జీవించడం, రైతుని అభిమానించడం, లియో టాల్ స్టాయ్  హేతుభరిత, మతపర భావాల నిర్దుష్టతని విశ్వసించడం లాంటివి చేయించడం ఆయనకి యిష్టం. వాళ్ళని వదిలించుకోవాలంటే – మనుషులకి వాళ్ళని తృప్తిపరిచేదో, వ్యాపకం కలిగించేదో దేన్నో వాళ్ళకి యివ్వాలి. వాళ్ళు ఆయన్ని యేకాంతంగా అలవాటు పడిన హింసకి, కాని ఒకో అప్పుడు సుఖవంతమైన యేకాంతానికి, మట్టులేని బురదని యెదుర్కొంటూ “ఆ మహత్తరమైన విషయపు” సమస్యని యెదుర్కొంటూ వుండేట్టు యెందుకు వదలరు?

రష్యన్ భోధకులంతా, ఒక్క అవ్వకూమ్  తప్పిస్తే, ఒక మేరకి తీఖన్ జదోన్ స్కీ  కూడా, చురుకైన, సజీవమైన విశ్వాసం లేని స్తబ్ధులు. నా “అధోజనం”లో అలాంటి ముసలాణ్ణి చిత్రించ ప్రయత్నించాను – లుకా. ఆయనకి ఆసక్తి కలిగించింది మనుషులు కాదు “నానా రకాల జవాబు”లూనూ. ఆయనకి ప్రజలు తారసపడకుండా లేరు, . వాళ్ళని వూరడించేవాడు, కాని వాళ్ళు తన దారిలో వుండకుండా వుండేందుకనే. కాని అలాంటి వ్యక్తుల మొత్తం వేదాంతం, మొత్తం బోధన గుప్త యేహ్యంతో వాళ్ళు వితరణ చేసే దానమే అవుతుంది. వాళ్ళ బోధన మాటున శోకభరితమూ క్షుద్రమూ అయిన మాటలు వినిపిస్తాయి:

“నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి! భగవంతుణ్ణి మీ పొరుగువాళ్ళనీ ప్రేమించండి, కాని నన్ను మాత్రం ఒంటరిగా వదిలిపెట్టండి! భగవంతుణ్ణి నిందించండి, దూరంగా విసిరేసిన వాళ్ళని ప్రేమించండి, కాని నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి! నన్ను వంటరిగా వదిలిపెట్టండి యేమంటే నేను మానవుణ్ణి, మరి… చనిపోవాలని రాసిపెట్టి వున్నవాణ్ణి.”

అయ్యో! జీవితం యిలా వుంది, వుండబోతుంది! యిది మరోలా యెన్నటికీ వుండదు, యేమంటే మానవ మాత్రులు పీడనకి, చిత్రహింసకి గురవుతారు, భయంకరంగా వేర్పాటై పోతారు, తమ ఆత్మలని రసహీనం చేసే యేకాంతంతో ఒంటరితనంతో సర్వబంధితులైపోతారు. టాల్ స్టాయ్ చర్చితో రాజీ పడిపోతే నేనేం ఆశ్చర్యపడను. దాని తర్కం దానికి వుంటుంది – మనుషులంతా సమంగానే అప్రముఖులు, బిషప్పులు కూడా. నిజం చెప్పాలంటే యిది ఆయనకి రాజీపడ్డం కాదు, వ్యక్తిగతంగా ఆయనకి యీ చర్య వూరికే ఒక తార్కికమైన అడుగు: “నన్ను అసహించుకునే వాళ్ళని నేను క్షమిస్తాను.” ఒక క్రైస్తవ చర్యే. కాని దానికింద ఒక తేలికైన, నిశితమైన యెత్తిపొడుపు వుంది. మూఢులమీద తెలివైన వాని ప్రతీకారంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు.

కాని నేను రాయాలనుకున్నట్టు రాయటం లేదు, లేదా నేను రాయాలనుకున్న వాటిని గురించీ రాయటం లేదు. నా ఆత్మ ఘోషిస్తోంది, నాముందు వినాశనం : మిణుకుమంటోంది. పత్రికలు యిప్పుడే వచ్చాయి, యెలా వుండేదీ నేను చూడగలను. ప్రపంచపు మీ భాగంలో ఒక ఐతిహ్యం నిర్మితమవుతోంది “అనగా అనగా ఒకప్పుడు సోమరులు, పరాన్న భుక్కులూ వుండే వాళ్ళు, వాళ్ళు సృష్టించారు – ఒక ఋషిని. ”యిది – మనదేశానికి యెంత అనర్థం దాపురింపచేస్తుందో వూహించండి, అదీ సామాన్య జనం తమ తలల్ని నిరాశతో వేలాడేసుకుంటూ వున్నప్పుడు; అధికుల ఆత్మలు శూన్యంగా, నిష్ఫలంగా వున్నప్పుడు; యెంపిక అయిన వాళ్ళ ఆత్మలు విచారంతో నిండిపోయినప్పుడు. యీ క్షుధార్త, ధ్వంసిత హృదయాలు అభూతకల్పన కోసం వెంపరలాడుతున్నాయి. తమ బాధని పోగొట్టుగోడానికి, తమ చిత్రహింసల నుంచి వూరట పొందడానికి జనం తహతహ లాడుతున్నారు. అది సరిగ్గా ఆయన కోరుకొన్న అభూతకల్పనే, సరిగ్గా అంత అవాంఛితమైందే- ఒక పవిత్ర మానవుడి జీవితం, ఒక ఋషి జీవితం- మరి ఆయనలో వుండే గొప్పదనమూ, పవిత్రతా యేమిటంటే ఆయన మానవుడు, ఉన్మత్తకర, వేదనాత్మక సౌందర్యపు మానవుడు, మనుషులలోని మానవుడు. నేను యిక్కడ స్వవచోవ్యాఘాత దోషానికి గురవుతున్నట్టు వుంది, అయినా ఫరవాలేదు. తన కోసం కాకుండా యితరుల కోసం భగవంతుణ్ణి అన్వేషిస్తున్న మనిషి ఆయన, అలా అయితే తను తన నిర్జన స్థలంలో శాంతితో వుండవచ్చు. ఆయన మనకి నూతన నిబంధనని యిచ్చాడు. క్రీస్తులోని అంతర్గత వైరుధ్యాలని మనం మరిచిపోయేటందుకు గాను, తను క్రీస్తు రూపాన్ని సులభతరం చేశాడు, ఆయనలోని తీవ్ర అంశాల్ని తగ్గించాడు, వాటి స్థానంలో “నన్ను పంపించిన ఆయన యిచ్ఛకి విధేయం”గా వుండటాన్ని పెట్టాడు. టాల్స్టాయ్ నూతన నిబంధన యింకా అధికంగా ఆమోదయోగ్యమనీ, రష్యన్ ప్రజల “వ్యాధుల”కి బాగా నప్పుతుందనీ అనడాన్ని వ్యతిరేకించనక్కర్లేదు. యీ ప్రజలకి యేదేనా యివ్వాలి, యేమంటే వాళ్లు మూల్గులతో యీ భూమిని కుదిపేస్తున్నారు, ఆ “మహత్తర విషయం” నుంచి టాల్స్టాయ్ దృష్టిని పక్కకి మళ్ళిస్తున్నారు, ఫిర్యాదుచేస్తున్నారు. మరి “యుద్ధమూ- శాంతీ” యింకా ఆ పంథాలో యీ వ్యధిత రష్యా గడ్డకి వున్న బాధనీ, దుఃఖాన్నీ ఉపశమింప చెయ్యడానికి  యేమీ చెయ్యలేదు.

“యుద్ధమూ -శాంతీ” గురించి ఆయనే అన్నాడు: “అనవసరమైన వినయాన్ని పక్కన పెట్టి చెపితే, అది మరో ‘ఇలియడ్.’  ఎమ్. చైకోవ్ స్కీ  టాల్ స్టాయ్  ముఖతః ఆయన “బాల్యం,” “యుక్తవయస్సు” గురించి అలాంటి అంచనా వేసినట్టు విన్నాడు.

కొంత మంది పత్రికా విలేకరులు యిప్పుడే నేపుల్స్ నుంచి వచ్చారు – ఒకతను రోమ్ నుంచి పరిగెత్తుకుని వచ్చాడు కూడానూ. టాల్ స్టాయ్  “పారిపోవడం” గురించి నేను యేమనుకుంటున్నదీ చెప్పమని వాళ్ళు నన్ను అడిగారు- అవును వాళ్ళు అలానే అన్నారు – “పారిపోవడం.” నేను వాళ్ళతో మాట్లాడ్డానికి ఒప్పుకోలేదు. బహుశా మీకు అర్థం అవుతుంది, నా మనస్సు అల్లకల్లోలంగా వుందని – టాల్ స్టాయ్  ఋషి అవడం నేను కోరును. ఆయన్ని పాపాత్ముడిగానే వుండనివ్వండి. పాపమయ ప్రపంచపు హృదయానికి చేరువగా, యెప్పటికీ మన ప్రతి ఒక్కళ్ళ హృదయాలకీ దగ్గరగా వుండనివ్వండి. పూస్కినూ, ఆయనా – యింతకంటే ప్రియమైందీ, అధికమైందీ లేదు మనకి….

లియో టాల్ స్టాయ్  చనిపోయాడు.

ఒక టెలిగ్రామ్ వచ్చింది. సాదా మాటల్లో వుంది – ఆయన చనిపోయాడు.

యిది గుండెమీద కొట్టిన దెబ్బ. నేను బాధతోటీ, దుఃఖంతోటీ రోదించాను. యిప్పుడు అర్థనిశ్చేష్టిత స్థితిలో నేను ఆయన్ని నాకు తెలిసినట్టుగా, నేను ఆయన్ని చూసినట్టుగా చిత్రించుకున్నాను. ఆయన్ని గురించి మాట్లాడాలనే ఒక వ్యధాకలిత కోరిక పుట్టింది. మరణశయ్య మీద, సెలయేటి పర్యంకం మీద నున్నటి రాయిలాగా వుండి, నిస్సందేహంగా ఆ వంచనాత్మక చిరునవ్వుతోటి – యెంతో సంపూర్తిగా నిర్లిప్తంగా- నెరిసిన గెడ్డం మాటున నిశ్శబ్దంగా దాగిన చిరునవ్వుతోటి చిత్రించుకున్నాను. ఆయన చేతులు ఆఖరికి ప్రశాంతంగా ముడుచుకుపోయాయి – అవి వాటి కష్టమైన పనిని పూర్తిచేశాయి.

ఆయన నిశితమైన కళ్ళు గుర్తుకు వచ్చాయి- అవి ప్రతిదాని గుండానూ చొచ్చుకు చూసేవి – ఆయన వేళ్ళు, యెప్పుడూ గాలిలో యేదో గీస్తున్నట్టే వుండేవి; ఆయన సంభాషణ, ఆయన ఛలోక్తులు, ఆయనకి యిష్టమైన రైతు పదాలు, మరి వింతగా అనిర్దిష్టంగా వుండే ఆయన కంఠధ్వని గుర్తుకు వచ్చాయి. ఆ మానవుడు యెంతటి జీవితాన్ని ఆలింగనం చేసుకున్నదీ, యెంత మానవాతీతమైన తెలివితో వున్నదీ – యెంత అధిమానుషమైనదీ గోచరమైంది.

ఒకసారి నేను ఆయన్ని బహుశా యెవ్వరూ చూసి వుండనట్టు చూశాను.గ్రాస్సా  వైపు సముద్రం ఒడ్డున నడుస్తూవుంటే, యుసూపొవ్ ఎస్టేట్ బయట, రాళ్ళమీద కూర్చున్న ఆయన చిన్న, కోణాకార విగ్రహాన్ని హఠాత్తుగా చూశాను. ముడతలు  పడిపోయిన వెలిబూది సూటు వేసుకుని, నలిగిపోయిన టోపీ పెట్టుకున్నాడు. ఆయన చేతులమీద చుబుకం ఆన్చి, వేళ్ళ మధ్య నుంచి గడ్డపు నెరిసిన వెంట్రుకలు కిందకి జారుతూ వుంటే, సముద్రం కేసి చూస్తూ అక్కడ కూర్చున్నాడు. ఆయన ఆదాలని శ్యామలమైన అలలు వినయ పూర్వకంగా, ఆప్యాయంగా తాకుతున్నాయి, తమ కథని ఆ వృద్ధమంత్రగానికి చెబుతున్నట్టు. ఆ రోజు వెలుతురు దోబూచులాడుతోంది. రాళ్ళమీద మేఘాల నీడలు జారిపోతూ వున్నాయి, దాంతోటి ఆ ముసలాయన, కాసేపు వెలుతురులోనూ, కాసేపు ఛాయలోనూ గోచరమయ్యాడు. ఆ రాళ్ళు పెద్దవి. పెద్ద – పగుళ్ళు వాటిలో వున్నాయి. ఘాటైన సముద్రపు నాచు వాటిని కప్పేసింది- అంతకు ముందు రోజున పెను తుఫాన్ వీచింది. సకల విషయాల ఆరంభ ప్రయోజనాలూ తెలిసి, యీ భూమ్మీద రాళ్ళకీ, గడ్డికీ మహోధధిలోని నీటికీ, మానవుడికీ, శిలనుంచి సూర్యుడిదాకా సకల ప్రపంచానికీ అంతం యేమా అని ఆశ్చర్యపడే ఒక పురాతన శిలకి హఠాత్తుగా జీవం వచ్చినట్టుగా ఆయన నాకు అనిపించాడు. సముద్రం ఆయన ఆత్మలో ఒక భాగమైపోయినట్టుగా వుంది. ఆయన చుట్టూతా ఉద్భూతమై ఆయనలో భాగమైనట్టుగా వుంది. దీర్ఘాలోచనామన్న అచేతనత్వంలో మునిగిపోయిన ఆ ముసలాయన తన దిగువన వున్న నిర్వేదంలో, యీ భూమిపైన సమున్నత నీలి శూన్యంలో గవేషణ కోసం అదృశ్యమై అక్కడికి తనే- తన యిచ్ఛా యేకాగ్రత వల్ల – ఆ అలల్ని ఆమంత్రణం చేస్తూ, ఉచ్చాటనం చేస్తూ వున్నట్టుగా, శిలల్ని లేపుతూ వాటిని మారుస్తూ వున్నట్టుండే మేఘాల నీడల కదలికలకి దర్శకత్వం వహిస్తూ వున్నట్టుగా యేదో అశరీరవాణిలా, మనోహరంగా, గంభీరంగా వున్నట్టు భాసించాడు. ఆయన తన చేతిని ఆడించడానికి ఉద్భూత మవబోతున్నట్టూ, సముద్రం నిశ్చలంగా, గాజులాగా స్వచ్ఛమైనట్టూ, శిలలు స్థానభ్రంశం చెంది రోదించినట్టూ, పరివేష్టితమైన దానంతటికీ జీవం వచ్చినట్టూ, ప్రతీదీ తన స్వరాన్ని తెచ్చుకుని అగణిత జిహ్వాలతో ఆయన్ని గురించి, ఆయనకి వ్యతిరేకంగా భాషించినట్టూ నాకు హఠాత్తుగా, ఒక ఉ న్మత్త క్షణంలో భ్రమ కలిగింది. ఆ క్షణంలో నేనేం అనుకున్నానా అన్నదాన్ని మాటల్లో పెట్టడం అసంభవం- నా మనసులో పారవశ్యమూ, భయవిహ్వలతా రెండూ వున్నాయి. అప్పుడు సకలమూ ఆనందభరిత ఆలోచనలో మిళితం అయిపోయింది:

“యీ మానవుడు యిక్కడ జీవించినంత కాలం నేనీ లోకంలో అనాధని గాను.”

అప్పుడు కాళ్ళకింద వున్న గులక రాళ్ళు చప్పుడు చెయ్యకుండా, నేను జాగ్రత్తగా, ఆయన దీక్షని భగ్నం చెయ్యడానికి యిష్టపడక వెనక్కి తిరిగాను, మరి యిప్పుడు- నేను అనాధని అయినట్టు బాధపడుతున్నాను. నేను రాస్తూ వుంటే నా కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతూ వున్నాయి- యింత ఓదార్పు లేకుండా, యింత నిరాశాభరితంగా, యింత కటువుగా రోదించలేదు. ఆయన్ని నేను ప్రేమించినట్టు కూడా నాకు తెలీదు, అయినా ఆయనపట్ల నాఅనుభూతి ప్రేమో, పగో యేమిటి అయితేనేం; ఆయన సర్వదా నా హృదయంలో అనుభూతుల్ని కదిలించాడు, అపరిమిత, అద్భుత ఆందోళనని కలిగించాడు. ఆయన జాగృతం చేసిన అనామోదిత, వైర భావాలు పీడిత రూపాలు ధరించక, ఆత్మని విస్తృతం చేస్తూ, దాన్ని యింకా అనుభూతి నిశితం చేస్తూ, దానికి యింకా అధిక శక్తిని యిస్తూ లోపల బద్దలయ్యేట్టు వుండేవి. తన కాలి మడమలతోటి యీ నేల యెగుడుదిగుళ్ళని చదునుచేసి ఆయన ఒక దాపు చలనంతో, హఠాత్తుగా ఒక తలుపు వెనకనుంచి గాని, ఒక మూలగాని, యీ భూమి ఉపరితలం మీద నిరంతరంగా చలించేదానికి అలవాటుపడ్డ మనిషికి వుండే చిన్న, తేలికైన, వేగవంతమైన అడుగులతో ముందుకు వస్తూ, ఆయన బొటన వేళ్ళు పటకాలో పెట్టుకుని, ఒక క్షణం ఆగి, చుట్టూతా శోధనాత్మక చూపులతో చూస్తూ- ఆ చూపు నూతనమైన ప్రతిదాన్నీ గ్రహించి, తక్షణం దాని ప్రాముఖ్యాన్ని ఆపోశన పట్టేసేది – వస్తూవుంటే ఆయన చాలా గంభీరంగా వుండేవాడు.

“బాగున్నారా?”

యీ మాటలకి నేను యెప్పుడూ యీ మాదిరిగా తాత్పర్యం చెప్పుకునేవాణ్ణి: “బాగున్నారా- యిందులో మీకు అర్థం కాని, నాకు సంతోషం గాని లేవు అయినా వూరికే అదే. బాగున్నారా!”

లోపలికి వచ్చేవాడు ఆయన- చిన్న మనిషి. తక్షణం ప్రతివాడూ ఆయనకంటే చిన్నగా కనిపించేవాడు. ఆయనకి వున్న రైతు గడ్డం, ముతకగా అయినా అసాధారణంగా వున్న చేతులు, సాదా బట్టలు, ఆయన కులాసా అయిన సర్వబాహ్య ప్రజాస్వామిక రూపం చాలా మందిని మోసగించేవి.

“ఓ మీరా బాబూ! అయితే మీరేనన్నమాట! ఆఖరికి మా మాతృభూమి అత్యున్నత పుత్రుని చూసే మహత్తర సంతృప్తి నాకు దక్కింది! వందనాలు, వందనాలు, నా నతులు అందుకోండి!”

అది మాస్కో- రష్యన్ పద్ధతి, సాదాగా ఆత్మీయంగా వుండేది. కాని మళ్ళీ యింకో రష్యను పద్ధతీ వుంది- “నిస్సంకోచంగా ఆలోచించే” పద్ధతి-

“టాల్ స్టాయ్ గారు! మీ మతపర, తాత్విక అభిప్రాయాలతో విభేదిస్తున్నాకానీ మిమ్మల్ని వ్యక్తిగా మహత్తర కళాకారుడిగా మన్నిస్తూ….

అప్పుడు వున్నట్టుండి రైతు గడ్డం కిందనుంచి, ముడతలు పడిన మామూలు అంగీ కిందనుంచి పాత రష్యన్ పెద్దమనిషి, అద్భుతమైన గొప్పవంశీకుగు బయటపడేవాడు – నిర్మొహమాటస్తులు, విద్యావంతులు, తదితరులు కొయ్యబారిపోయే వాళ్ళు. యీ గొప్పింటివాణ్ణి చూడ్డం, ఆయన హావభావాల ఔన్నత్యాన్నీ సొగసునీ, ఆయన భాషణలోని సగర్వ ప్రత్యేకతనీ గమనించడం, ఆయన నిర్నిరోధ పదబంధువు విశిష్టమైన సూటిదనాన్ని వినడం ఆనందదాయకంగా వుండేది. భూస్వామ్య దాసులతో వ్యవహరించడానికి తగ్గంత చక్కని పెద్దమనిషి తీరు ఆయనలో వుండేది. వైభవోపేత ప్రభువుని ఆయనలో వాళ్ళు ఆవాహనచేస్తే, వాళ్ళు వూరికే వినమ్రులై కీచుమనేటట్టు చేసే రీతిలో వాళ్ళని అధఃకరించే అలవోక అయిన తేలికతనంతో టాల్స్టాయ్ ప్రభువుగా వాళ్ళ ముందు దర్శనమిచ్చేవాడు.

నేను ఒకసారి యాస్నయా పొల్యానానుంచి మాస్కోదాకా యీ “సాదా” రష్యన్లు ఒకరితో ప్రయాణం చేశాను. తిరిగి స్థిమితపడ్డానికి అతనికి చాలా వ్యవధి పట్టింది. అతను జాలిగా వుండే చిరునవ్వుతో పరధ్యానంగా అంటూనే వున్నాడు:

“అబ్బ, యేం చిత్తుగా ఓడిపోయాం! ఆయన ఉగ్రంగా లేడూ, ఆహా!” అప్పుడు అతను అనుతాపపడుతూ అన్నాడు:

“ఆఁ, నేనేమో ఆయన అరాచకవాది అనుకున్నాను! ప్రతివాళ్ళూ ఆయన్ని అరాచకవాది అనే అంటూ వుంటారు, వాళ్ళు అన్నదాన్ని నేను నమ్మాను….”

ఆయన సంపన్నుడు, పెద్ద పారిశ్రామికవేత్త, ఆయనకి పెద్ద పొట్ట వుంది, అపక్వ మాంస ఖండం రంగులాంటి కొవ్వు బలిసిన ముఖం వుంది- ఆయన టాల్ స్టాయ్ ను  అరాచకవాది అని యెందుకు అనుకున్నాడు? యిది రష్యన్ స్వభావానికి సంబంధించిన “గాఢమైన రహస్యాల్లో” ఒకటిగా వుండిపోతుంది.

సంతోషపెట్టాలని టాల్ స్టాయ్  అనుకుంటే ఆయన అందమైన తెలివైన ఆడ దానికంటే ఆ పనిని బాగా చేస్తాడు. ఆయన వైవిధ్యపూరితమైన బృందం పరివేష్టించి వుండగా కూర్చుంటాడు- గ్రాండ్ డ్యూక్, రంగులు వేసే మనిషి, యాల్తానుంచి వచ్చిన సోషల్ డెమోక్రట్ ఒకాయన, ష్తు౦దిస్టు, ఒకాయన ఒక సంగీతకారుడు, కౌంటెన్ ఎస్టేటు మేనేజరు, ఒక కవి- అంతా ఆయన కేసి మోహపూరిత నేత్రాలతో చూస్తున్నారు. ఆయన వాళ్ళకి లావోత్సె తాత్విక చింతనని వివరిస్తున్నాడు. ఆయన యేకకాలమందు కొన్ని వాయిద్యాలని – మద్దెలని, డోలుని, అకార్డియన్ని, పిల్లనగ్రోవిని- వాయించే సామర్థ్యం వున్న ఒంటి మనిషి వాయిద్య బృందంలాగా నాకు కనిపించాడు. యిప్పుడు ఆయన కేసి చూడాలని నేను ఆత్రపడుతున్నాను- నేను మరి ఆయన్ని యిక యెన్నటికీ  చూడలేను.

పత్రికా విలేకరులు యిక్కడ వున్నారు. లియో టాల్ స్టాయ్ చనిపోయాడన్నది  పుకారనీ, నిజం కాదనీ రోమ్ కి  టెలిగ్రామ్ వచ్చిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు నానా రభసా, కోలాహలమూ చేశారు. వాగాడంబరంగా రష్యాపట్ల సానుభూతి వ్యక్తం చేశారు. రష్యన్ పత్రికలు సందేహానికి తావులేకుండానే చేస్తున్నాయి.

ఆయనతో అబద్దం చెప్పడం అసంభవం- జాలి వల్లనేనా సరే. యే సానుభూతీ కలిగించకుండానే ఆయన విపరీతమైన జబ్బుతో వుండి వుండవచ్చు. అలాంటి మనుషులకి జాలి చూపించడం బుద్ధిహీనం. అలాంటి వాళ్ళని బాగా చూసుకోవాలి, పదిలపరచుకోవాలి. దుమ్ము కొట్టుకుపోయిన, నిర్దయాత్మక పదాలని వాళ్ళమీద  చిలకరించకూడదు.

“మీకు నేనంటే యిష్టం లేదు, కదా?” అని ఆయన అడిగాడు.

 “అవును, యిష్టం లేదు” అనేదే వుండవలసిన సమాధానం.

“మీకు నేనంటే అభిమానం లేదు, వుందా?”

“ఉహుఁ, యివాళ మీరంటే నాకు అభిమానం లేదు.”

ఆయన వేసే ప్రశ్నలు నిర్దాక్షిణ్యంగా వుంటాయి, ఆయన సమాధానాలు ముభావంగా వుంటాయి, ఋషులకు సరిపోయేటట్టు.

ఆయన గతాన్ని గురించి ఘనంగా మాట్లాడాడు, అన్నిటికంటే అధికంగా తుర్గేనెవ్ గురించి. ఫెత్ ని  గురించి ఆయన యెప్పుడూ సరదాగా సంతోషపు చిన్నెలని కనబరుస్తూనే మాట్లాడాడు. నెక్రాసొవ్ ని  గురించి ముభావంగా, సంశయాత్మకంగా మాట్లాడేడు. కాని మామూలుగా రచయితల్ని గురించి వాళ్ళు తన పిల్లలైనట్టు మాట్లాడాడు. మరి ఆయన తండ్రి, వాళ్ళ దోషాలన్నీ తెలిసిన వాడులాగా వుండినా, వాళ్ళల్లో మంచికంటే చెడే యెక్కువ చెయ్యడానికి కృతనిశ్చయుడైనట్టు వుండేవాడు. ఆయన యెప్పుడు యెవ్వరిని గురించి నిందాత్మకంగా మాట్లాడినా ఆయన వాళ్ళ గురించి శ్రోతలకి జ్ఞాన దానం చేస్తున్నట్టే నాకు అనిపించేది. ఆయన విమర్శలని వినడం వికలం చేసేది. యెవళ్ళేనాగానీ తమ కళ్ళని అప్రయత్నంగానే ఆయన నిశితమైన చిరునవ్వు కింద వాల్చేవాళ్ళు – ఎవళ్ళకీ జ్ఞాపకంలో యేం మిగిలేది  కాదు.

ఉస్పేన్ స్కీ తూల మాండలికంలో రాసాడనీ, ఆయనకి ప్రతిభ లేదనీ ఓసారి తీవ్రంగా వాదించాడు. అయినా నేను వుండగానే చేహొవ్ తోటి అన్నాడు:

“యిదిగో రచయిత యిక్కడ వున్నాడు ! చిత్తశుద్ధి వల్ల యెవరికేనా గానీ దొస్తో యేవిస్కీని గుర్తుకు తెస్తాడు; కాని దొస్తోయేవ్ స్కీ కి చమత్కారం చెయ్యడమన్నా, ప్రదర్శించుకోవడమన్నా యిష్టం. ఉస్పేన్ స్కీ యింకా చాలా సాదాగా,చిత్తశుద్ధితో వుంటాడు. ఆయనకి భగవంతునిలో విశ్వాసం గనక వుండి వున్నట్లయితే, ఆయన  ఖాయంగా అసమ్మతీయుడై వుండేవాడు.”

” కాని ఆయన తూల రచయిత అనీ, ప్రతిభ లేనివాడనీ మీరు అన్నారు.”

 ఆయన కళ్ళు గుబురు కనుబొమలకింద అదృశ్యమైపోయాయి. ఆయన అన్నాడు:

“ఆయన బాగా రాయలేదు. దాన్ని భాష అంటారా? మాటలకంటే యెక్కువగా విరామ చిహ్నాలు. ప్రతిభ అనేది ప్రేమ. ప్రేమించేవాడు ప్రతిభావంతుడు. ప్రేమికుల కేసి చూడండి- వాళ్ళంతా ప్రతిభావంతులే.”

ఆయన దొస్తోయేవ్ స్కీ గురించి స్పష్టంగా కనిపించేటువంటి అనిష్టతతో, బిర్రుగా, దాటవేస్తూ మాట్లాడడు, దేన్నో అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్టు.

“ఆయన కన్ఫ్యూషియన్ వి గాని, బౌద్ధులవి గాని సిద్ధాంతాలు చదివి వుండాల్సింది. అవి ఆయన్ని స్వస్థపరిచేవి. ప్రతి ఒక్కళ్ళూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అది. ఆయన తీవ్ర యింద్రియాసక్తి గల మనిషి- ఆయనకి ఆగ్రహం వచ్చినప్పుడు ఆయన బట్టతల భాగంమీద దద్దుర్లు కనిపించేవి, చెవులు మెలితిరిగేవి. యెక్కువ బాధపడేవాడు, ఆలోచించడం యెలాగో ఆయనకి తెలీదు. ఆయన ఫోరియరిస్టుల నుంచీ ఆలోచించడం నేర్చుకున్నాడు. తర్వాత జీవితాంతం వాళ్ళని ద్వేషించాడు. ఆయన రక్తంలో యూదు సంబంధమైనదేదో వుంది. ఆయన అపనమ్మకస్తుడు, దాంభికుడు, కబ్జాకోరు, దీనుడు. అంతమంది జనం ఆయన్ని చదివారన్నది ఆశ్చర్యం – యెందుకనో నాకు అర్థం కాదు. యేమైనా అది కష్టమైందీ, వ్యర్థమైందీ – ఆ ‘ఇడియట్లూ,’ ‘యువకులూ’, రస్కోల్ నికోవ్ లూ, మిగిలినవాళ్ళూ ఒక్క పిసరు అలా వుండరు. ప్రతీదీ యింకా చాలా సులభంగా, యింకా యెక్కువ అవగతం అయ్యేట్టుగా వుంటుంది వాస్తవానికి. మాటకి, యిప్పుడు లెస్కోప్ని చూడండి, జనం యెందుకు చదవడం లేదు? అతను నిజమైన రచయిత- మీరు అతని పుస్తకాలు చదివారా?”

“ఓ, నాకు అతనంటే అభిమానం, ముఖ్యంగా అతని భాష!”

“అతనికి భాష అద్భుతంగా తెలుసు, దాంతోటి అతను యేమైనా చెయ్యగలడు. అతనంటే మీకు యిష్టంగా వుండటం చిత్రం. మీలో రష్యనేతరమైందేదో వుంది, మీ ఆలోచనలు రష్యన్ ఆలోచనలు కావు- అలా అంటున్నానని యేం అనుకోకండి, యేం, కష్ట పెట్టుకుంటున్నారా? నేను ముసలివాణ్ణి, ఆధునిక సాహిత్యాన్ని అర్థం చేసుకొనే శక్తి నాకు యిక లేకపోవచ్చును. కాని యిది యేదో రకంగా రష్యనేతరమైందని నాకు యెప్పుడూ అనిపిస్తుంది. మనుషులు ఒక వింత రకమైన పద్యాలు రాస్తున్నారు- యీ పద్యాలు యెందుకో నాకు తెలీదు, అవి యెవరి కోసమో నాకు తెలీదు. మనం కవిత్వాన్ని రాయడం పూష్కిన్ నుంచి, త్యూత్ చెవ్ నుండి నేర్చుకోవాలి. మీరున్నారే” – ఆయన చేహొవ్ కేసి తిరిగాడు – “మీరు రష్యన్. అవును, మీరు చాలా చాలా రష్యన్.”

ఆయన ఆర్ద్రపూరితమైన చిరునవ్వుతో చేహొవ్ భుజం చుట్టూతా తన చేతిని వేశాడు. చేహోవ్ లో  అది యిబ్బందిగా అనిపించింది. ఆయన తన యింటిని గురించీ, తాతార్ల గురించీ మంద్రస్వరంతో మాట్లాడ్డం మొదలపెట్టాడు.

ఆయనకి చేహొవ్ అంటే అభిమానం. చేహొవ్ కేసి చూసినప్పుడు, ఆయన చూపు దాదాపు ఆ క్షణంలో మృదువుగా అయిపోయి, చేహొవ్ వదనాన్ని లాలిస్తున్నట్టుగా వుండేది. ఒక రోజున చేహొవ్ పార్కులోని ఒక దారిలో అలెగ్జాంద్రా ల్వోవ్ నాతో  నడుస్తున్నాడు. టాల్ స్టాయ్  అప్పట్లో యింకా జబ్బుగా వున్నాడు. వరండాలో వున్న పడక కుర్చీలో కూర్చుని తన మొత్తం జీవంతోటి అవతలికి చేహొవ్ కేసి వెళ్ళిపోతున్నట్టు  వుంది.

“యేం సొగసైన, సెభాషైన మనిషి ! అణకువా నిదానంగా ఒక పడుచు స్త్రీలాగా వున్నాడు. అతను నడవడం కూడా ఆడపిల్లలాగే వుంటుంది. వూరికే అద్భుతంగా వున్నాడు!” అని లోగొంతుకలో అన్నాడాయన.

ఒకరోజు సాయంత్రం సంధ్యా సమయంలో, కనుబొమలు ముడుచుకుని, అవి మెలి తిరిగి వుంటే, ఆయన మాకు తన “స్వామి సేర్గెయ్”లోని ఒక దృవ్యం చదివి వినిపించాడు. ఆ ఆడమనిషి యీ మునిని ప్రలోభ పెట్టే దృశ్యం అది. ఆయన దాన్ని సరాసరి చదివేసి, తల పైకి యెత్తి, కళ్ళు మూసుకుని స్పష్టంగా అన్నాడు:

“ముసలాడు బాగానే రాశాడు చాలా బాగా!”

దాన్ని యెంత సరసమైన సారళ్యంతో చెప్పడం జరిగిందంటే, తన సొంత రచనలోని సౌందర్యాన్ని అభినందించడం యెంత చిత్తశుద్ధిగా వుందంటే, నాకు అప్పుడు కలిగిన పారవశ్యం నేను యెన్నటికీ మర్చిపోలేను- నేను యెన్నటికీ మాటల్లో పెట్టలేని పారవశ్యం అది, దాన్ని గుంభనగా వుంచుకోడానికి నాకు బ్రహ్మ ప్రయత్నం అయింది! నా హృదయమే నిశ్చలంగా అయినట్టు అనిపించింది, ఆ ఉత్తర క్షణంలోనే ప్రతీదీ పునరుద్భూతమై, కళగా, నూతనంగా అయినట్టు అనిపించింది.

ఆయన భాషణలోని అవర్ణ్య ప్రత్యేక ముగ్డత్వ౦,అంతటి యెడ తెగని పునరుక్తులతో, రైతులకుండేలాంటి సాదాతనంతో నిండిపోయి పైకి అంత అసమంజసంగా వుండేది. ఆయన మాట్లాడుతూ వుంటే పరిశీలించిన వాళ్ళకే అది అవగతం అవుతుంది. ఆయన ఉదాత్తానుదాత్త స్వరంలోనూ, ఆయన కవళికల జీవత్వంలోనూ మాత్రమే కాదు ఆయన మాటల శక్తి వున్నది, ఆయన కళ్ళ క్రీడలో డేది. ఆయనవి నేను యెన్నడూ చూడనటువంటి అనర్గళ భాషణాయుత నేత్రాలు. ఒక్క జత కళ్ళల్లో టాల్ స్టాయ్ కు  వెయ్యి నేత్రాలు వుండేవి.

సులెర్ జీత్ స్కీ , చేహొవ్, సెర్గెయ్ టాల్ స్టాయ్ , యెవరో యింకో ఆయనా పార్కులో ఆడవాళ్ళని గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు వున్నట్టుండి ఆయన అన్నాడు:

“ఒక కాలు శ్మశానంలో వున్నప్పుడు, ఆడవాళ్ళని గురించి నిజం చెపుతాను. అప్పుడు శవపేటికలోకి దూకేసి మూత మూసేసుకుంటాను – అప్పుడు వచ్చి నన్ను పట్టుకోండి!” ఆయన కళ్ళు యెంత తృణీకారంగా, భయంకరంగా మెరిసాయంటే కొన్ని క్షణాలు యెవరూ మాట్లాడలేదు.

ఆ రకంగా ఆయనలో వసీలీ బుస్లాయెవ్ పొగరూ, ఫాదర్ అవ్వకూమ్ మొండి తనంలో కొంతా, వీటికిపైగా, లేకపోతే వాటికి తోడుగా, చాదాయెవ్  సంశయాత్మకత కొంతా దాగి వుండి, కలిసి పోయాయని నాకు అనిపిస్తుంది. అవ్వకూమ్ అంశ కళాకారుడి ఆత్మని క్షోభపెడుతూ బోధించింది. ఆయనలో వున్న నోవ్ గొరొద్ పొగరుమోతు డాంటెనీ, స్కేక్స్ పియర్ నీ నిందిస్తాడు. చాదాయెవ్ అంశ వీటిమీద సరదాగా మురుస్తుంది – యీ ఆత్మ క్షోభలని.

విజ్ఞానశాస్త్రాన్నీ, రాజ్యసూత్రాన్నీ నిందింపచేసేటట్టు చేసేది ఆయనలో వున్న పురాతన రష్యన్- మానవత్వ పథం మీద జీవితాన్ని నిర్మించాలని అసంఖ్యాక ప్రయత్నాలు చేసి విఫలం కావడంవల్ల ఉదాసీన అరాచకత్వం వైపు తరుమబడ్డ రష్యన్.

యిక్కడో విశిష్టమైన విషయం వుంది: యేదో అగోచర సద్యోవబోధవల్ల, ‘సింప్లిసిస్సిమస్’ వ్యంగ్య చిత్రకారుడు ఒలాఫ్ గుల్ బ్రాన్ సన్  టాల్ స్టాయ్ లో  వున్న బుస్లాయెవ్ లక్షణాన్ని కనిపెట్టాడు. అతను గీసిన ఆ బొమ్మకేసి శ్రద్ధగా చూడండి: నిజమైన లియో టాల్ స్టాయ్ కి  యెంత పోలిక వుందో, లోతుగా వున్న కళ్ళల్లోంచి యెలాంటి పొగరుమోతు మనసు మీకేసి చూస్తూ వుంటుందో మీకు తెలుస్తుంది. యే మూఢ నమ్మకాలూ, పనికి మాలిన విశ్వాసాలూ లేని వ్యక్తికిగల, దేన్నీ పవిత్రంగా యెంచని వ్యక్తికిగల మనస్సు అది.

యీయన, యీ మాంత్రికుడు, ప్రతి ఒక్కళ్లకీ పరాయివాడు, సర్వవ్యాపక సత్యాన్ని తాను నిరర్థకంగా అన్వేషించిన ఆలోచనా నిర్జనావాసాల్లో ఒంటరిగా ప్రయాణిస్తూ నాముందు వున్నాడు. నేను ఆయన్ని దర్శిస్తున్నాను. ఆయనని పోగొట్టుకున్నామన్న బాధ అధికమైందే అయినా, ఆ మానవుణ్ణి చూడగలిగామన్న గర్వం నా బాధని, దుఃఖాన్ని ఉపశమింప చేస్తోంది.

“టాల్ స్టాయన్ల”  మధ్యలో టాల్ స్టాయ్ ని చూడ్డం చిత్రంగా వుంటుంది. ఆయన వాళ్ళ మధ్య సమున్నత శిఖరఘంటలాగా నుంచుంటాడు. ఆ గంట నిరంతరంగా ప్రపంచమంతటి కేసీ మోగుతూనే వుంటుంది, ఆయన చుట్టూ చిన్నగా, బెరుగ్గా వుండే చిన్న కుక్కలు ఘంటా నాదానికి అనుగుణంగా అరుస్తూ ఒకదాన్ని ఒకటి అనుమానంగా, తమలో యెవరు ఉత్తమంగా అరుస్తున్నారో గమనించడానికన్నట్టుగా, చూసుకుంటూ వుంటే. యీ జనం యాస్నయా పొల్యానా యింటినీ, కౌంటెస్ పానినా భవంతినీ ఒక వంచనాత్మకతతో, పిరికితనంతో, బేరంతో, వారసత్వాల ఆశలతో నింపేశారనే నాకెప్పుడూ అనిపించేది. యీ “టాల్ స్టాయన్లకీ, శునకాస్థికలని యేదో పవిత్ర స్మృతి చిహ్నాలని చెప్పి మోసుకుపోతూ రష్యా యీ అంచునుంచి ఆ అంచుదాకా గమించే యాత్రీకులకీ మధ్యన ఉమ్మడిగా వుండేదేదో వుంది. యీ భగవద్దూతలలో ఒకడు కోడిపెట్ట మీద జాలి కొద్దీ కోడిగుడ్డుని తినడం యాస్నయా పొల్యానాలో నిరాకరించడమూ, తూలలోని స్టేషన్ కాంటీన్లో అంగలార్చుకుంటూ “ఆ ముసలాడు అతిశయోక్తులు చెపుతున్నాడు” అని మాంసాన్ని ఆబగా మెక్కడమూ నాకు తెలుసు.

దాదాపు వాళ్లంతా నిట్టూరుస్తూ, చుంబిస్తూనే వున్నారు. అందరికీ స్వేద పూరిత, అస్థిరహిత హస్తాలూ, వంచనాత్మక నేత్రాలూ వున్నాయి. అదే సమయంలో తమ ప్రాపంచిక వ్యవహారాలని చాలా నేర్పుగా సవరించుకునే లౌకిక జీవులూ వున్నారు.

టాల్ స్టాయ్ యీ “టాల్ స్టాయన్లను”ని అసలైన విలువతోనే అంచనా కట్టాడనుకోండి. అలాగే ఆయన సుకుమారంగా ప్రేమించి, యెప్పుడూ యౌవనోత్సాహంతోటీ, మెప్పుతో చెప్పే సులెర్ జీత్ స్కీ కూడానూ. తను టాల్ స్టాయ్  సిద్ధాంతాలని అనుసరించడం వల్ల తన జీవితం యెంత సులభమైందీ, తన ఆత్మ యెంత పరిశుద్ధమైందీ అనర్గళంగా ఒకాయన యాస్నయా పొల్యానాలో వర్ణించేశాడు ఓ రోజున. టాల్ స్టాయ్  నాకేసి వంగి మెల్లిగా అన్నాడు:

“వాడు అబద్ధం ఆడుతున్నాడు, దొంగవెధవ, కాని నాకు సంతోషం  కలుగుతుందని అలా చేస్తున్నాడు.”

ఆయనకి సంతోషం కలిగిద్దామని ప్రయత్నించిన వాళ్లు చాలామంది వున్నారు. నిజంగా బాగా చేసినవాళ్లు నాకు యెవళ్లూ కనిపించలేదు. తనకి మామూలుగా వుండే విషయాలని గురించి, అంటే సార్వజనీన క్షమ, యిరుగుపొరుగుల్ని ప్రేమించడం, నూతన నిబంధన, బుద్దమతం లాంటి వాటి గురించి నాతోటి ఆయన యెప్పుడూ మాట్లాడలేదు, యిదంతా కూడా “నాబోటి వాళ్ళకి కాదు” అని గుర్తించి. దాన్ని నేను యెంతగానో అభినందించాను.

ఆయన కిష్టమైనప్పుడు మనోహరంగా ఔచిత్యంతోటీ, సానుభూతిగానూ, సౌమ్యంగానూ వుండగలడు. అప్పుడు ఆయన మాట ఉల్లాసకరమైన సాదాతనంతోటీ, నాజూకుతనంతోటీ వుండేది. కాని ఒకో అప్పుడు ఆయన చెప్పేది వినడం యిబ్బందిగా వుండేది. ఆయన ఆడవాళ్లని గురించి మాట్లాడే తీరు నాకు యెప్పుడూ నచ్చలేదు. యీ విషయంలో ఆయన మరీ “సాదా మనిషి”లాగా మాట్లాడేవాడు. ఆయన మాటల్లో యేదో అస్వాభావికమైందీ, నిజాయితీ లోపించిందీ కనిపించేది. కాని అదే సమయంలో పరమవైయక్తికంగా కనిపించేది. తను యెవరి వల్లో గాయపడ్డట్టూ, దాన్ని యెన్నటికీ మర్చిపోవడం గాని, మన్నించడం గాని చెయ్యలేనట్టూ వుండేది. ఆయనతోటి పరిచయం అయిన తొలి సాయంకాలం నన్ను తనతోటి తన అధ్యయన మందిరానికి తీసుకుని వెళ్లాడు. నా యెదురుగా కూర్చుని “వారెంకా ఒలేసొవా” గురించీ, “యిరవై ఆరుమంది పురుషులూ, ఒక అమ్మాయీ” గురించీ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఆయన స్వరం నన్ను నీళ్లు కార్చేసింది. పూర్తిగా మనసు వికలమైంది. ఆరోగ్యవంతమైన యువతికి సిగ్గు సహజం కాదని ఆయన అంత కటువుగా ముతగ్గా నన్ను ఒప్పించడానికి ప్రయత్నం  చేశాడు.

“ఏ పిల్లకేనా గానీ పదిహేను యేళ్లు నిండి, ఆరోగ్యంగా వుంటే ఆమె తనని యెవళ్ళేనా ముద్దుపెట్టుకోవాలనీ, తనతో సరసాలాడాలనీ కోరుకుంటుంది. ఆమె మనసు దానికి తెలియని లేదా అర్థం కాని దాంతోటి గిర్రున తిరిగి పోతుంది, దాన్నే జనం కన్యాత్వం అనీ, సిగ్గు అనీ అంటారు. కాని యీ దురవగాహమైంది తప్పదనీ, న్యాయమనీ ఆమె శరీరానికి తెలుసు. ఆమె మనసు యెలా వున్నా యీ ధర్మ పరిపూర్తిని ఆపేక్షిస్తుంది. మీ వారెంకా ఒలేసొవా ఆరోగ్యవంతంగా వున్నట్టే వుంది, కాని ఆమె అనుభూతులు పాండు రోగికి వుండే లాంటివి -అదంతా తప్పు!”

నేను ఆయన్ని ఖండించలేదు. హఠాత్తుగా ఆయన నా జీవితం గురించీ, నా చదువు సంధ్యల గురించీ, నేను చదివే పుస్తకాల గురించీ అడుగుతూ దయాన్వితుడుగా, సానుభూతిపరుడుగా మారిపోయాడు.

“వాళ్ళన్నట్టు మీరు నిజంగానే బాగా చదువుకున్నవాళ్లా? యేం, కొరొలేంకొ నిజంగా సంగీతకారుడా ?”

“కాదేమో, నాకు తెలియదు.”

“మీకు తెలీదా? మీకు ఆయన కథలు యిష్టమేనా?”

“చాలా.”

“అది వైరుధ్యం వల్ల. ఆయన లిరిక్. మీలో లిరికల్ గా  యేదీ లేదు. మీరు వెల్ట్ మాన్ రాసినవి చదివారా?”

“ఆ…”

“మంచి రచయిత. తేట అయిన బుద్ధి వున్నవాడు, కచ్చితంగా వుంటాడు. ఎప్పుడూ ఉత్ప్రేక్షించడు. ఒకో అప్పుడు గోగొల్ కంటే మెరుగనిపిస్తాడు. అతనికి బాల్జాక్ తెలుసు. గోగొల్ మర్లీన్ స్కీ  ని అనుకరించాడు, తెలుసా?”

గోగొల్ బహుశా హాఫ్మన్ చేతా, స్టెర్న్ చేతా, ఓ విధంగా డికెన్స్ చేతా ప్రభావితుడైనాడని నేను అన్నప్పుడు ఆయన నా కేసి ఓ చూపు విసిరి అన్నాడు:

“ఆ ముక్క యెక్కడ చదివారు? చదవలేదా? మీరు చెప్పింది సబబు కాదు. గోగొల్ డికెన్స్ రాసినవి చదివాడని అనుకోను. కాని మీరు నిజంగా చాలా చదివారు- జాగ్రత్త – అది ప్రమాదం. కొల్ త్సోవ్ అలాగే నాశనం అయిపోయాడు.”

నన్ను సాగనంపుతూ ఆయన తన చేతులు నా చుట్టూ వేసి, ముద్దుపెట్టుకుని అన్నాడు:

“మీరు నిజమైన రైతు! రచయితలలో మీకు చాలా గడ్డు రోజులు వుంటాయి. అయినా మిమ్మల్ని యెవరూ బెదరగొట్టనివ్వకండి. యెప్పుడూ మీరు యేమనుకుంటున్నదీ చెప్పండి, ఒకో అప్పుడు అది మొరటుగా వున్నా పట్టించుకోకండి. తెలివైన వాళ్లు అర్థం చేసుకుంటారు.”

యీ తొలి సమావేశం నామీద ద్వంద్వ ప్రభావాన్ని కలగ చేసింది- టాల్ స్టాయ్ ను  కలుసుకున్నందుకు నాకు సంతోషంగానూ వుండింది, గర్వంగానూ వుండింది. కాని ఆయన సంభాషణ యేదో క్రాస్ ఎగ్జామినేషన్ లాగా వుండింది. “కోసక్కులు”, “కొలబద్ద,” “యుద్ధమూ – శాంతి” రచయితని కాకుండా, నా పట్ల అనుగ్రహం చూపించి, నాతో ఓ రకమైన “జనరంజక” ఫక్కీలో, బజారు భాషని ఉ పయోగిస్తూ మాట్లాడ్డం అవసరమైనట్టుగా భావించే పెద్దమనిషిని కలుసుకున్నట్టుగా నాకు అనిపించింది. అది ఆయన్ని గురించి నాకు వున్న భావాన్ని తలకిందులు చేసింది-నేను అలవాటు పడిపోయిన భావం, నాకు ప్రియమైన భావం.

నేను ఆ తర్వాత ఆయన్ని చూసింది యాస్నయా పొల్యానాలో. ఆకురాలు కాలంలో, బాగా చినుకులు పడుతూ వున్న నిరుత్సాహపూరితమైన రోజు అది. ఆయన బరువైన ఓవరకోటు వేసుకుని, మామూలుగా నీళ్ళల్లో నడవడానికి పని కొచ్చే యెత్తు ఆయన కుంటల్నీ, కయ్యల్నీ యౌవనభరిత చురుకుదనంతో దాటుతూ, చెట్ల కొమ్మలనుంచి నీటి బిందువుల్ని నెత్తిమీద పడేటట్టు చేసుకుంటూ వున్నాడు. అంతసేపూ తనకి యీ బర్చ్ పొదల్లోనే షెన్షన్ (ఫెత్) యేవిధంగా షోపెన్ వర్ని గురించి ప్రజ్ఞా పూరితమైన వివరణ యిచ్చిందీ చెబుతూనే వున్నాడు. ఆయన చెమ్మగిలిన, మెరిసే బర్చ్ కాండాలని ప్రేమగా నిమిరాడు.

“యీ మధ్యన కొన్ని పద్యాలు చదివాను:

పుట్టగొడుగుల్లేవు, కాని శూన్య భాగాలన్నీ

చెమ్మగిలిన పుట్టగొడుగుల వాసనా భరితంగా వున్నాయి.

-బాగుంది, బాగా పరిశీలించినది.”

హఠాత్తుగా ఒక కుందేలు మా కాళ్ళకింద నుంచి ఠకామని దూసుకుని వచ్చింది. మహా ఆవేశపడిపోయి టాల్స్టాయ్ ఎగిరి గెంతువేశాడు. ఆయన చెక్కిళ్ళు మెరుపెక్కాయి. ఆయన “ఉస్కో!” మని గట్టిగా అరిచాడు. అప్పుడు నాకేసి వర్ణించలేని చిరునవ్వు నవ్వుతూ చూసి, యుక్తివంతమైన, నిసర్గ హాసం చేశాడు. ఆ క్షణంలో ఆయన అభినందనీయంగా వున్నాడు.

యింకోసారి పార్కులో ఓ గద్దని చూశాడు. అది యింటి పెరటి పైన యెత్తులో యెగురుతోంది. పైన చక్కర్లు కొడుతోంది. అప్పుడు కాసేపు నిశ్చలంగా ఆడుతూ, కిందికి దూసుకురావాల్నా లేక ఓ క్షణం ఆగాల్నా అన్నట్టుగా రెక్కల్ని నీరసంగా ఆడించేది. టాల్ స్టాయ్ కు  వెంటనే చురుకు పుట్టింది. ఆయన కంటిమీద నీడగా అరచేతిని పెట్టుకుని, కంపితంగా గొణిగాడు:

“యీ దొంగభడవ మన కోడిపెట్టల కోసం చూస్తోంది! చూడండి, చూడండి – యిదిగో – ఓ! దానికి భయంగా వుంది. బహుశా బండివాడు అక్కడ వున్నాడేమో- మనం బండివాణ్ణి పిలవాలి….’

ఆయన పిలిచాడు. ఆయన కేక వెయ్యగానే గద్ద బెదిరిపారిపోయింది.

టాల్ స్టాయ్  నిట్టూర్చి, తనని తను నిందించుకుంటున్నట్టే అన్నాడు:

“నేను అరిచి వుండకూడదు- అరవకపోతే అది కోడిని పట్టేసి వుండేదే….”

ఓ సారి ఆయనతోటి త్బిలీసిని గురించి మాట్లాడుతూ వున్నప్పుడు నేను వి.బెర్వీ – ఫ్లెరోవ్ స్కీ  పేరు ప్రస్తావించాను.

“మీకు ఆయన తెలుసా?” అని టాల్ స్టాయ్  ఆతృతగా అడిగాడు. “ఆయన్ని గురించి నాకు యేమన్నా చెప్పండి.”

ప్లెరోవ్ స్కీ  పొడుగ్గా వుంటాడనీ, బారుగా వుండే గడ్డం వుంటుందనీ, పల్చగా వుంటాడనీ పెద్ద కళ్లుంటాయనీ, కొత్త నారగుడ్డ అంగీ వేసుకుంటాడనీ, ఎర్ర వైన్లో ఉడికించిన పెద్ద అన్నం సంచీ ఆయన బెల్ట్ నుంచి వేలాడుతూ వుంటుందనీ, పెద్ద కాన్వాస్ గొడుగు మోసుకుపోతాడనీ చెప్పాను. నాతో బాటుగా ట్రాన్స్ కకేషియన్ కొండల రస్తాలో దిమ్మరిలా తిరిగాడనీ చెప్పాను. అక్కడ ఒక చిన్న గొందిలో ఓ ఆంబోతు యెదురైందనీ, కోపంతో వున్న ఆ జంతువుని తెరిచిన గొడుగుతో బెదిరిస్తూ, అంతసేపు అగాథంలోకి పడిపోయే ప్రమాదం వున్నా వెనక్కి తగ్గుతూనే, పారిపోయామనీ చెప్పాను. హఠాత్తుగా టాల్స్టాయ్ కళ్లల్లో నాకు నీళ్ళు తిరగడం కనిపించింది. యిబ్బంది పడిపోయి ఆ విషయం తెంచేశాను.

“ఫరవాలేదు, చెప్పండి, చెప్పండి! వూరికే ఒక సహృదయుణ్ణి గురించి వినడం వల్ల కలిగిన సంతోషం యిది! ఆయన యెంత ఆసక్తికరమైన మనిషి అయివుంటాడు! సరిగ్గా నేను ఆయన అలాగే వుంటాడని వూహించుకున్నాను- మిగిలిన వాళ్లల్లా కాదు! ప్రగతికాముక రచయితలందరిలోకి ఆయనే అత్యంత పరిణతుడైన వాడూ, తెలివైన వాడూనూ. మన మొత్తం నాగరికత అంతా అనాగరికమైందనీ, సంస్కృతి అనేది శాంతికాముక తెగల వ్యవహారమనీ, బలహీనుల వ్యవహారమనీ, బలవంతులది కాదనీ, జీవనం కోసం పోరాటం అనేది చెడుని సమర్థించడనికి కల్పించిన అబద్ధం అని ఆయన తన పుస్తకంలో సమర్థవంతంగా చూపించాడు. మీరు మాతో అంగీకరించరనుకోండి, సందేహం లేదు. కాని దొ అంగీకరిస్తాడు ఆయన పోల్ ఆస్టియే గుర్తుకు తెచ్చుకోండి.”

“ఉదాహరణకి, యూరప్ చరిత్రలో నార్మన్ల పాత్రని ఫ్లెరోవ్ స్కీ  సిద్ధాంతంతో యెవరేనా సమాధానపడ్డం యెలాగ?”

“ఓ, నార్మన్లా! అది వేరే విషయం.”

సమాధానం తటక్కన స్ఫురించకపోతే ఆయన “అది వేరే విషయం” అంటాడు.

టాల్ స్టాయ్ కు  సాహిత్యం గురించి మాట్లాడ్డం యిష్టం వుండదనీ, రచయిత వ్యక్తిత్వంపట్ల గాఢమైన ఆసక్తి వుందనీ అనుకోవడంలో నేను పొరపడలేదనే అనుకుంటున్నాను. నేను చాలా సార్లు ఆయన ప్రశ్నలని విన్నాను. “మీకు ఆయన తెలుసా? ఆయన యెలా వుంటాడు? ఆయన యెక్కడ పుట్టాడు?” ఆయన అభిప్రాయాలు అస్తమానూ ఆ వ్యక్తిని ఒక ప్రత్యేక కోణం నుంచి ప్రదర్శించేవి.

వి. కొరొలేంకొ గురించి ఆయన సాలోచనగా అన్నాడు:

“ఆయన రష్యన్ కారు. అంచేత మనం చూసుకునే దానికంటే స్పష్టంగా మన జీవితాల్ని గురించి ఆయన బాగా చూడగలడు.”

తను అంత మార్దవంగా ప్రేమించిన చేహొవ్ గురించి:

“ఆయన వృత్తి ఆయన్ని పాడుచేసింది. ఆయన డాక్టరు కాకపోయి వున్నట్టయితే యింకా బాగా రాసి వుండేవాడు.”

ఒక యువ రచయితని గురించి ఆయన అన్నాడు:

“అతను ఇంగ్లీషువాడిలా వుండాలని చూస్తాడు. మాస్కో జనం ఆ విషయంలో లాభం లేదు.”

“మీరు కాల్పనికులు. మీ కువాల్ దాలూ  అందరూ శుద్ధ కల్పనలు” అని ఆయన నాతో యెక్కువ సార్లే అన్నాడు.

కువాల్ దాని జీవితం నుంచి గ్రహించడం జరిగిందని నేను అన్నాను.

“అతను మీకెక్కడ తగిలాడో చెప్పండి.”

నేను కువాల్ దా  పేరుతోటి వర్ణించిన మనిషిని మొదటి సారిగా కజన్ న్యాయాధిపతి కొలొంతాయెవ్ కార్యాలయంలో చూసిన దృశ్యంతో ఆయన మహా  సరదా పడిపోయాడు.

“గొప్ప వంశం! గొప్ప వంశం! – అదీ యిది!” అన్నాడాయన నవ్వుతూ, కళ్లు తుడుచుకుంటూ. “కాని యేం ముచ్చటైన, సరదా పుట్టించే మనిషి! మీరు రాసే దానికంటే బాగా చెప్తారు కథలు. మీరు కాల్పనిక రచయితలు- మీకు తెలుసా- కాల్పనికవాదులు కల్పించే వాళ్లు. మీరు ఆ విషయాన్ని ఒప్పుకొంటే మంచిది.”

వాస్తవ జీవితంలో మనుషులు యెలా వుంటే తమకి యిష్టమో చూపిస్తూ యేదో మేరకి రచయితలు అందరూ కల్పించే వాళ్లేనని నేను అన్నాను. నాకు కార్యాచరణ శీలురైన మనుషులంటే, జీవితంలోని చెడు నంతటినీ తమ సర్వ శక్తులతోటీ, యింకా వస్తే హింసతోటి కూడా ప్రతిఘటించే వాళ్ళంటే యిష్టమని కూడా నేను చెప్పాను.

“కాని హింసే ప్రధానమైన చెడు!” అని అరిచాడాయన నా చేతిని తీసుకుంటూ. “దాన్నుంచి మీరు యెలా తప్పించుకుంటారు, రచయితా? ‘నా తోటి – అది కల్పన కాదు. అది బాగుంది యేమంటే కల్పితం కాదు తనకు మీరు కల్పించడం మొదలు పెట్టినప్పుడే మీ జనం అంతా యోధుల్లాగా  తయారయిపోతారు. ”

తప్పని సరి మర్కట సమ “తోటి పథికులు” మన చుట్టూతా పూర్తిగా వున్నంత కాలం, మనం నిర్మించే ప్రతీదీ యిసకమీద, విద్వేషభరిత పరిసరంలో వుంటుందని  నేను అన్నాను.

తన మోచేత్తోటి నన్ను మెల్లిగా పొడుస్తూ ఆయన చిరునవ్వు నవ్వాడు.

“దీన్నుంచి చాలా, చాలా ప్రమాదకరమైన నిర్ధారణలని తియ్యవచ్చు. మీరు నిజమైన సోషలిస్టు కాదు. మీరు కాల్పనికవాదులు. కాల్పనికవాదులు రాచరికవాదులై వుండాలి, వాళ్లు యెప్పుడూ వున్నట్టుగా.”

“విక్టోర్ హ్యూగో విషయం యేమిటి?”

“విక్టోర్ హ్యూగో సంగతి వేరు. నాకు నచ్చడు. గోల మనిషి.”

నేనేం చదువుతున్నానూ అని ఆయన తరుచుగా అడిగేవాడు. తన దృష్టిలో నేను మంచి వాటిని యెన్నుకోలేదని యెప్పుడూ నిందిస్తూనే వుండేవాడు.

“గిబ్బన్ ” కొస్తామారొవ్ ” కంటే అధ్వాన్నం. మీరు మొమ్సెన్ ని  చదవాలి. పెద్దగా విసుగు పుట్టిస్తాడనుకోండి, కాని కండ వుంది.”

నేను చదివిన తొలి పుస్తకం అనేది వుంటే అది “జెంగాన్నో సోదరులు” అని తెలియగానే ఆయన మహా మండిపోయాడు.

“అదీ మరి- చెత్త నవల! అదీ మిమ్మల్ని పాడుచేసింది. ఫ్రెంచి రచయితలు ముగ్గురు వున్నారు- స్టెండాల్, బాల్జాక్, ఫ్లోబెర్ – కావలిస్తే మపాసాని కూడా కలుపుకోవచ్చు. కాని చేహొవ్ అతని కంటే మెరుగు. గొనూర్ సోదరులు శుద్ధ విదూషకులు, గంభీరంగా వుంటామని వాళ్ళు నటిస్తారంతే. తమలాంటి కల్పిత రచయితలు సృష్టించిన దాన్నుంచే వాళ్లు జీవితాన్ని గురించి తెలుసుకున్నారు, కాని యెవళ్ళకీ వాళ్ల రచనలు అక్కర్లేదు.”

నేను ఆయనతో ఏకీభవించలేదు. దాంతోటి టాల్ స్టాయ్ కి  కోపం వచ్చింది. వ్యతిరేకించడం ఆయన ఒప్పుకోలేడు. ఆయన వాదనలు ఒకో అప్పుడు చిత్రంగా మొండిపట్టుతో వుండేవి.

“హీన స్థితికి రావడం అనే లాంటిదేమీ లేదు” అన్నాడాయన. “అదంతా ఇటాలియన్ లొంబ్రోసో కల్పన.”

రష్యాలోని వర్తక కుటుంబాల చరిత్రనుంచి ఒక వాస్తవం తర్వాత యింక  వాస్తవాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన అన్నాడు:

“అది నిజంగాదు, అదంతా గడుసు పుస్తకాలనుంచి వస్తుంది….”

నాకు తెలిసిన ఒక వర్తక కుటుంబంలోని మూడు తరాల కథని ఆయనకి  చెప్పాను – ప్రత్యేకమైన నిర్దాక్షిణ్యంతో హీనస్థితిని వర్ణించిన కథ అది. నా చొక్కా  చెయ్యిని ఆందోళనతో గుంజుతూ ఆయన చాటాడు:

“అది నిజం! నాకు తెలుసు – తూలలో రెండు కుటుంబాలు వున్నాయి. మీరు రాయాల్సింది అలాంటి దాన్ని గురించి. సూక్ష్మంలో పెద్ద నవల- నేనన్నది అర్థం అయిందా? అదీ చేయ్యాల్సిన పద్ధతి!”

ఆయన కళ్ళు ఆత్రంగా మెరిశాయి.

“కాని వాళ్లంతా యోధులైపోతారు.”

“ఒక్కళ్లూ కారు! అది చాలా గంభీరమైంది. మొత్తం కుటుంబం కోసం తపస్సు చెయ్యబోయే సన్యాసి కావడం యెవరేనా – అది అద్భుతం. అదీ అసలైన జీవితం. మీరు పాపం చేస్తారు. నేను పోయి మీ పాపాలని విమోచన చేస్తాను. యిక మిగిలిన వాడు- విసుగెత్తిన ఆక్రమణదారు- అదీ నిజమే. అలాంటి వాడికి తాగడం, పశువులా ప్రవర్తించడం, వ్యభిచరించడం, ప్రతివాళ్లనీ ప్రేమించడం, హఠాత్తుగా హత్య చేసుకోవడం – అదెంత బాగుంది! దొంగల్లోనూ, దిమ్మరిగాళ్లల్లోనూ వీరుల కోసం వెదకకుండా మీరు రాయాల్సింది అలాంటి దాన్ని గురించి. వీరులు అనేది అబద్ధం, కల్పనలు. మనుష్యమాత్రులు తప్ప, ప్రజలు తప్ప యింకేం లేదు- అంతే!”

నా కథల్లోకి చొచ్చుకువచ్చిన అతిశయోక్తుల్ని ఆయన నాకు తరచుగా చూపిస్తూ వుండేవాడు. కాని ఒకసారి “మృత జీవులు” రెండవ భాగం గురించి మాట్లాడుతూ, సరదాగా చిరునవ్వు నవ్వుతూ ఆయన అన్నాడు: 

“మనమంతా అతి నిస్సందేహంగా నేల విడిచి సాముచేసే రచయితలమే. అప్పుడు రాస్తూనే వుండగా వున్నట్టుండి ఓ పాత్ర పట్ల జాలిపడతాం, ఆ పాత్రకి సల్లక్షణాలు యివ్వ ప్రయత్నిస్తాం, లేకపోతే యింకో పాత్రని తగ్గిస్తాం మొదటిది తులనాత్మక పరిశీలనలో మరీ దిగిపోకూడదని.”

 తక్షణం నిర్దాక్షిణ్యమైన న్యాయ నిర్ణేత గంభీర స్వరంతో:

అందుకనే నేనంటాను కళ అబద్ధం, వంచన, అహేతుకం, మానవాళికి అపకారం చేస్తుంది. మీరు వాస్తవ జీవితాన్ని గురించి వున్నదున్నట్టు రాయరు, జీవితం పట్ల మీకున్న అభిప్రాయాలని గురించి రాస్తారు, జీవితాన్ని గురించి మీరు అనుకునేది  తెలుసుకోవడం వల్ల యెవడికేనా యేమిటి లాభం? అది యెవడిక్కావాలి? దానివల్ల  యేమిటి లాభం?”

ఒకో అప్పుడు ఆయన ఆలోచనలూ, అనుభూతులూ నాకు తిక్కగా, ఆ . మాటకొస్తే కావాల్సినవి వక్రించుకున్నట్టుగా కనిపించేవి. కాని తరచుగా ఆయన, భగవంతుణ్ణి నిర్భీతిగా ప్రశ్నించే జాబ్లగా కఠోర నియమభరిత సూటిదనంతో శ్రోతల్ని తాకి లొంగ దీసుకునేవాడు.

ఒక రోజున నేను ఆయనతోటి ద్యుల్ బేర్ నుంచి  ఆయ్ తోడర్ కి  దిగువ రోడ్డుమీద నడుస్తున్నాను. మెల్లిగా, ఒక యువకుడిలాగా, అంగలు వేస్తూ తనకి మామూలుగా వుండే దానికంటే యెక్కువ ఆందోళనని వ్యక్తం చేస్తూ:

“శరీరం అనేది బాగా సుశిక్షితమైన కుక్కలాగా వుండాలి ఆత్మకి, అది ఆత్మ దాన్ని యెక్కడెక్కడికి పంపినా అక్కడికల్లా వెడుతూ వుండాలి. మరి మనల్ని చూడండి! శరీరం అడ్డు అదుపూ లేకుండా విచ్చల విడిగా వుంటుంది, ఆత్మ దాన్ని దారీతెన్నూ తోచనట్టు నిస్సహాయంగా అనుసరిస్తుంది” అన్నాడు.

ఆయన ఛాతీని గుండెకి పైభాగంలో తీవ్రంగా రుద్దుకున్నాడు, కనుబొమలు పైకి యెత్తాడు, యేదో ఆలోచిస్తున్నట్టు అన్నాడు:

“మాస్కోలో, సూఖరెవ్ స్కయా గోపురం దగ్గర, ఒక గొందిలో నేనొక సారి ఒక తాగుబోతు ముండని చూశాను- అప్పుడు ఆకురాలు కాలం. ఆమె కాలిబాట దగ్గర పడి వుంది. సరిగ్గా ఆమె మెడకిందనుంచి, వీపుకింద నుంచి మురికి నీరు కాలవలాగా ప్రవహిస్తోంది. ఆమె అక్కడ ఆ చల్లని నీళ్లల్లో, లేవలేక, గొణుగుతూ, పొర్లుతూ, తడిలో దొర్లుతూ పడివుంది.”

ఆయన వణికాడు. ఒక క్షణం కళ్లు మూసుకున్నాడు. తల పంకించాడు. లోగొంతుకలో అన్నాడు:

   “యిక్కడ కూర్చుందాం. తాగుబోతు ఆడదాని కంటే భయంకరమైందీ, వెలపరంగా వుండేదీ యింకేమీ లేదు. వెళ్ళి ఆమె లేవడానికి సాయం చేద్దామాఅనుకున్నాను, కాని చెయ్యలేకపోయాను, ముడుచుకుపోయాను. ఆమె మొత్తం జిగటగా,చెమ్మగా వుంది. ఆమెని తాకిం తర్వాత మరి నెల రోజుల పాటు మీ చేతులు మకిలి పోదు దారుణం! పక్కనే బాట అంచు రాళ్లల్లో ఒకదాని మీద బూడిద రంగు కళ్లూ చక్కటి జుట్టూ వున్న కుర్రాడొకడు కూర్చుని వున్నాడు. వాడి కళ్లలో నీళ్లు తిరుగుతూ, చెక్కిళ్ల మీద నుంచి జారిపోతుంది. వాడు ఎగబీలుస్తూ నిస్సహాయంగా అరుస్తున్నాడు.

“అమ్మా ఆఆఆ…. లే….”

క్షణక్షణానికీ ఆమె చేతులు కదిపి, గుర్రుమని, తల యెత్తి మళ్లీ బురదలో  పడిపోయేది.”

ఆయన గమ్మునైపోయాడు, అప్పుడు చుట్టూతా చూసి, యిబ్బందికరంగా దాదాపు గుసగుసమంటున్నట్టు రెట్టించాడు:

“దారుణం! దారుణం! మీరెప్పుడేనా తాగుబోతు ఆడదాన్ని చూశారా? చూశారా- ఓరి, భగవంతుడా! దాన్ని గురించి రాయకండి, రాయకూడదు.”

“యెందుకని?”

నా కళ్లల్లోకి చూసి చిరునవ్వు నవ్వుతూ ఆయన రెట్టిస్తూ అన్నాడు: “యెందుకనా?”

అప్పుడు ఆయన సాలోచనగా, మెల్లిగా అన్నాడు:

“నాకు తెలీదు. నేను వూరికే – పాశవికత్వాన్ని గురించి రాయడం లజ్జాకరంగా వుంటుంది. అయినా – యెందుకని? ప్రతిదాన్ని గురించి రాసెయ్యాల్సిందే….’

ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన వాటిని తుడిచేసుకుని, అంతసేపూ చిరునవ్వు నవ్వుతూనే వున్నాడు, తన జేబురుమాలు కేసి చూశాడు, మళ్లీ ముఖపు ముడతల మీదనుంచి కన్నీళ్లు జారిపోయాయి.

“నేను యేడుస్తున్నాను” అన్నాడాయన. “నేను వృద్ధుణ్ణి. భయంకరమైన దేన్ని గురించి ఆలోచించినా నా హృదయం దడదడ మంటుంది.”

తర్వాత నన్ను మెల్లిగా పొడుస్తూ:

“మీరు కూడా యెక్కువ కాలం బతుకుతారు. అయినా ప్రతీదీ మారకుండానే వుండిపోతుంది. మరి మీరు కూడా యిప్పుడు నేను యేడ్చేదానికంటే కసిగా, రైతు ఆడవాళ్లు అన్నట్టు, ఎక్కువ ‘కన్నీరు మున్నీరు’గా యేడుస్తారు…. కాని ప్రతిదాన్ని కుర్రాడు కష్టపెట్టుకుంటాడు, వాడు మిమ్మల్ని నిందిస్తాడు- అది సత్యం కాదు, గురించి రాయాల్సిందే, ప్రతిదాన్ని గురించీ. లేకపోతే ఆ చక్కని జుట్టు వున్న చిన్న అంటాడతను – మొత్తం సత్యం కాదు. వాడు సత్యం అంటే పట్టుగా వుంటాడు.”

ఆయన మొత్తం కుదుపుకుని, బుజ్జగిస్తున్నట్టు అన్నాడు:

“సర్లెండి, యేదేనా చెప్పండి, మీరు బాగా మాట్లాడతారు. ఒక పిల్లవాణ్ణి గురించో, మీ గురించో యేదేనా చెప్పండి. మీరు కూడా ఒకప్పుడు పిల్లవాడే నన్నది నమ్మడం కొంచెం కష్టంగా వుంటుంది, మీరు అలాంటి వింత మనిషి, మీరు పుట్టడమే పెద్దవాళ్లల్లాగా పుట్టారేమో. మీ ఆలోచనల్లో కుర్ర తరహాగా వుండేదీ, అపరిణతమైందీ. చాలా వుంది. అయినా మీకు జీవితం గురించి చాలా యెక్కువ తెలుసు- మీకు యింక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వూఁ, యేదేనా చెప్పండి….”

ఆయన ఒక పైన్ చెట్టు వెల్లడిగా వున్న వేళ్లమీద సుఖాసీనుడయ్యాడు, పైన్ ఆకులమీద చీమలు కదలికల హడావుడి చూస్తూ.

యిక్కడ, ఉత్తర ప్రాంతం వాడికి వింతగా వైవిధ్యభరితంగా వున్న ప్రకృతి మధ్య పుష్కలంగా, నిర్లజ్జగా ధారాళంగా పెరిగిన వృక్షతతి మధ్యలో కూర్చున్నాడు లియో టాల్స్టాయ్. ఆయన నామమే ఆయన ఆంతరిక శక్తికి సూచకంగా వుంది- చిన్న మానవుడు, తనేదో ముతక, గంభీర భూగర్భ వేరు అయినట్టు మెలితిరిగి ముడతలు పోయినవాడు. ఆడంబరంగా వుండే క్రిమియా ప్రకృతి మధ్య, నేను మళ్లీ అంటున్నాను, ఆయన తన సముచిత స్థానంలో వున్నట్టు, అదే సమయంలో స్థానభ్రంశం చెందినట్టు కనిపించాడు. చాలా పురాతన మానవుడొకడు, తన గ్రామీణ అధిపతి, నిర్మాతా అయినవాడు, తనే స్థాపించిన ప్రాంతం మొత్తానికి అధిపతి ఆర్థిక వ్యవస్థకి ఒక వంద సంవత్సరాల విరామం తర్వాత వచ్చినట్టు వుంది. తను మరిచిపోయింది యెంతో వుంది, తనకి కొత్తదైంది యెంతో వుంది; విషయాలు వుండాల్సినట్టే వున్నాయి, కాని సరిగ్గా కాదు, యేది వుండాల్సినట్టు లేదో యెందుకనో వెంటనే తను గమనించాల్సినట్టు వున్నాయి.

అనుభవజ్ఞుడైన భూచరుడిలాగా ఆయన వేగవంతంగా, హడావుడిగా వుండే నడకతోటి దారుల్లో అటూ యిటూ తిరుగుతున్నాడు. ఒక రాయి గాని, ఒక ఆలోచన గాని దృష్టి పధంలో నుంచి తప్పిపోలేని ఆయన నిశిత దృక్కు కొలత వేస్తూ పరీక్షిస్తూ, తులనాత్మకంగా పరిశీలిస్తూ చూస్తోంది. ఆయన తన నిరంతర ఆలోచన అనే సజీవ బీజాల్ని విత్తుతున్నాడు. ఆయన సులెర్ జీత్ స్కీ తోటి అన్నాడు:

“నువ్వు యేం చదవవు సులెర్ జీత్ స్కీ అది చాలా చెడ్డది, స్వాతిశయం. గోర్కీ తెగ చదువుతాడు. అదీ తప్పు-ఆత్మవిశ్వాసం లేకపోవడం. నేను తెగ రాస్తాను, అదీ సరిగాదు యేమంటే నేను వార్థక్యపు దాంభికం వల్ల, ప్రతి వాళ్లనీ నాకు లాగానే ఆలోచించేటట్టు చేయాలనే కోరిక వల్ల అలా రాస్తాను. నా ఆలోచనా విధానం నాకు ఒప్పే కావచ్చు, అది గోర్కీకి తప్పుగా కనిపించినా గానీ. సరే, నుప్పు అసలు ఆలోచించనే ఆలోచించవు, కళ్లు చికిలించి చుట్టూతా చూస్తావు దేన్నేనా పట్టుకునేందుకు. నీకు సంబంధం యే మాత్రం లేని వాటిని పట్టుకుంటావు- నువ్వు తరచుగా అలా చేశావు. నువ్వు పట్టుకుని వేలాడతావు. నువ్వు పట్టుకుని వేలాడే వస్తువు నీ నుంచి జారిపోతూ వుంటే, దాన్ని వదిలేస్తావు. చేహోవ్ ది  మంచి కథ వుంది- “ది డార్లింగ్” – నువ్వు అందులోని ఆడమనిషి లాంటి వాడివి.”

“యేరకంగా?” అని నవ్వాడు సులెర్ జీత్ స్కీ.

“నువ్వు ప్రేమించడానికి యెప్పుడూ తయారుగానే వుంటావు కాని యెంచుకోవడం యెలాగో నీకు తెలీదు. నీ శక్తిని చిల్లర విషయాల మీద వెదజల్లేస్తావు.”

“ప్రతివాళ్లూ అంతే కాదేమిటి?”

“ప్రతివాళ్లూనా?” ఖంగుమన్నాడు టాల్ స్టాయ్. “ఉహుఁ, కాదు – ప్రతివాళ్లూ కాదు.”

హఠాత్తుగా ఆయన నా మీద విరుచుకుపడ్డాడు:

“మీరు దేముణ్ణి యెందుకు నమ్మరు?”

“నాకు విశ్వాసం లేదు.”

“అది నిజం కాదు. మీరు స్వతహాగా విశ్వాసం వున్నవాళ్లు. దేవుడు లేకుండా లాక్కురాలేరు మీరు. త్వరలోనే మీకు అది అనుభూతం అవుతుంది. మీరు నమ్మరు, యేమంటే మీరు మొండి వాళ్లు కాబట్టి, మీరు విసుగు చెందిన వాళ్లు కాబట్టి – మీకు యిష్టమైన రీతిలో ప్రపంచం తయారయి లేదు. కొంత మంది సిగ్గువల్ల నాస్తికులుగా వుంటారు. యువకులు ఒకో అప్పుడు అలా వుంటారు. వాళ్లు కొంతమంది ఆడవాళ్లని ఆరాధిస్తారు, కాని దాన్ని ప్రదర్శించుకోవడం భరించలేరు. అపార్థానికి గురవుతామేమోనని భయపడతారు, పై పెచ్చు వాళ్ళకి ధైర్యం లేదు. విశ్వాసానికి, ప్రేమ లాగానే, ధైర్యం కావాలి, సాహసం కావాలి. మీరు మీ అంతట అనుకోవాలి: ‘నేను విశ్వసిస్తున్నాను’ అని. మరి ప్రతీదీ చక్కబడుతుంది. ప్రతీదీ యెలా వుండాలని మీరు కోరుకుంటారో అలా వుంటుంది. ప్రతీదీ మీకు విశదం అవుతుంది, మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఉదాహరణకి మీరు ప్రేమించేది చాలా వుంది. విశ్వాసం అనేది ప్రేమ విశ్వాసంగా మారుతుంది. మగాళ్ళు ప్రేమించేది ప్రపంచంలో యెప్పుడూ అత్యుత్తమమైన స్త్రీలనే, ప్రతివాడూ ప్రపంచంలో అత్యుత్తమమైన స్త్రీనే ప్రేమిస్తాడు. మరి అదుగో అక్కడే వుంది – అదే విశ్వాసం. నాస్తికుడు ప్రేమించలేడు. వాడు యివాళ ఒకళ్లని ప్రేమిస్తాడు, ఓ యేడాది కాలంలో యింకొకళ్లని ప్రేమిస్తాడు. అలాంటి వాడి చి తిరుగుబోతుది. అది గొడ్డుది, అది ఒప్పు కాదు. మీరు విశ్వసించే వాళ్లుగా జన్మించారు, మీ ప్రకృతికి విరుద్ధంగా పోవడం కోసం ప్రయత్నించి లాభం లేదు. మీరు యెప్పుడూ అంటూనే వున్నారు- సౌందర్యం అని. సౌందర్యం అంటే యేమిటి? అత్యుత్తమమైందీ, పరిపూర్ణమైందీనీ – భగవంతుడు.”

అంతకు ముందు ఆయన యెప్పుడూ నాతో యీ విషయాల గురించి మాట్లాడలేదు, ఆ విషయపు ప్రాముఖ్యం, అనుకోకుండా అది రావడం నన్ను నిశ్చేష్టితం చేసి, దాదాపుగా నన్ను ముంచేత్తేశాయి. నేను యేమీ అనలేదు. సోఫా మీద కూర్చుని, కాళ్లు మడిచి గడ్డం పై నుంచి ఒక విజయసూచక మందహాసం దోగాడగా నా కేసి ఒక వేలు చూపిస్తూ అన్నాడు:

“యేం చెప్పకుండా దాన్నుంచి మీరు తప్పించుకోలేరు తెలుసా!”

నేను, భగవంతుణ్ణి నమ్మని వాణ్ణి, దొంగగా, దాదాపు పిరికిగా వుండే చూపుతో ఆయన కేసి చూసి నాలో నేను అనుకున్నాను:

“యీ మానవుడు దేవుడిలా వున్నాడు.”

  *   *  *


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *