మన మధ్య పరుచుకున్న నిశ్శబ్దాన్ని పక్కకు జరపడానికో, ఏదో ఒక జ్ఞాపకం చివ్వున తలెత్తో నన్ను అడుగుతావు.. ” ఎలా వున్నావు నేస్తం ” అని. రహదారి నడకను అడిగినట్టు.కొన్ని ప్రశ్నల్ని ఒలిచి చూస్తే గంభీరతను పోగొట్టుకుంటాయని భయం. తలూపుతాను.నువ్వు ఊహించని ప్రతిస్పందన అది. నిరాశ నీ కనుపాపల మీద కదలాడుతూ వుంటుంది. ఎన్ని నిరాశల్ని గుండెలో వేసుకుంటే అది ప్రేమవుతుందో ఎవరూ చెప్పలేరు.
మన మధ్య గడ్డకట్టిన సముద్రాన్ని కరిగించాలనో, ఏదో ఒక స్వప్నం చటుక్కున కదలడం వల్లనో పెదవులపైకి ఒక పాటను లాక్కుంటావు. పాడేటప్పుడు నువ్వు జనానికి లోకానికి భయపడ్డట్టు కనబడవు. కానీ నీ పాటలో ఒకప్పటి మార్మికత ఉండదు. కొంత వివరణ వచ్చి చేరుతుంది. అప్పటి మార్మికత నీ పదాలదో మనమప్పుడు కూర్చున్న కాలం ఒడ్డుదో అర్థం కాదు.
మన మధ్య నడిచిన స్నేహాన్ని వదులుకోలేకో, ఏదో ఒక పాత జ్ఞాపకంగా మన పరిచయాన్ని అశ్రద్ధ చేయలేకో నువ్వు సన్నివేశంలో సరిగా ఇమలేకపోతావు. నీ లోపల నువ్వు ప్రాణం పోసుకోనంత వరకే. ఒక్కసారి నీలో నువ్వు మొలకెత్తాక జీవితం సగానికి సగం సంఘర్షణలోనే గడుస్తుంది. అంత శాంతిని ఇచ్చేదే ఐతే దాన్ని ప్రేమని ఎందుకంటాం.
మన మధ్య తీగలు అల్లుకున్నట్టు అల్లుకున్న హృదయాలు మెలిపడో, ఒకింత నిన్ను నువ్వు దాచుకోవడం చేతకాకో బయటపడి పోతావు.. “ఇక నేను వెళ్ళిరానా” అని మాటైతే అంటావు కానీ కదల్లేవు. లంగరేసిన సముద్రాన్ని కదిలించలేవు. మనసు మీద ఒక పేరు రాసుకున్నాక కాలిపోయే వరకూ తుడుపుకోలేం.
కళ్ళకు సమాధానం చెప్పుకోలేక నువ్వు తడి ఇసుకలో పాదాలను వదిలి వెళ్ళిపోతావు. ప్రేమలో ఒంటరితనానికి చోటుండదు. ఒంటరితనం మిగిలేది ఎదురుచూపుల్లోనే. ప్రేమంటే ఎదురుచూపులు కాదు. నిరీక్షణ.అది ఒత్తుల్ని సరిదిద్ది టీచర్ వేసే అదనపు మార్కులాంటిది. రైల్వే గేటు వద్ద నిలబడి కిటికీ లోంచి చేయూపే పేరు తెలియని పాపకు చేతులూపడం లాంటిది. నక్షత్రాన్ని అందుకోవాలని జీవితాంతం గిరగిరా తిరిగే భూమి నడక లాంటిది.