భూటాన్ యాత్ర అంటే? ఆరోగ్య ఆనందాల యాత్రే పార్ట్ – 4
‘పునఖా’ కోటను తనివిదీరా చూసిన మేము ప్రధాన ద్వారం గుండా బయటకొచ్చి ఎదురుగా వున్న చెట్ల కింద నిల్చుని మాట్లాడుకుంటుండగా మా అందరికన్నా ఆఖర్న బైటకొచ్చిన గైడ్ ‘ఫేమా’ మెల్లగా మా దగ్గర కొచ్చి “సస్పెన్ షన్ బ్రిడ్జ్ చూస్తారా? లేదంటే వెళ్లిపోదామా?” అంటూ అడిగాడు.
“తప్పకుండా చూస్తాం” అన్నాన్నేను.
“చూడాలనుకుంటే ఓ కి.మీ.న్నర నడవాల్సి వుంటుంది మరి, నడుస్తారా?” అంటూ అడిగాడు ఫెమా.
నడక అనేసరికి ఆ ఎండకు భయపడిన మా మిత్రులు కొందరు వెనుకా ముందులాడుతుండగా అందరికన్నా ముందుగా మా దంపతులం ‘ఫెమా’
చూపించిన దారి పట్టుకుని ముందుకు నడవసాగాము. మా వెనుక నాగేశ్వరవు గారి దంపతులు, అందెశ్రీ గారు బయలు దేరారు. ఆ తరువాత, శీతాకాలంలో ఒకదాని వెనుక ఒకటిగా చలి చీమలు దారిపట్టి సాగినట్టు మా మిత్రులంతా మమ్ముల్ని అనుసరించారు. కొంత దూరం రోడ్డు దారి, దానికి ఇరు ప్రక్కలా రక రకాల అందమైన పూల చెట్లు కనువిందు చేస్తుంటే చూసుకుంటూ ముందుకు సాగాము. అట్లా కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ రోడ్డు అంతమై పోయి మట్టి బాట మిగిలింది. ఆ బాటకు ఎడమ పక్క పెద్ద శ్మశాన వాటిక ఎదురయ్యింది. దానిని చూడగానే నా మదిలోకి గుర్రం జాషువా గారు తరలివచ్చారు. పరాయి దేశంలోని చారిత్రక కట్టడమైన ‘పునఖా’ కోట ప్రాంగణంలో నా పదంలో పదం కలిపి పక్కనే నడుస్తున్న లోక కవి అందెశ్రీ గారు, నా మనసులో తిష్టవేసిన కళాప్రపూర్ణ జాషువా గారు. నా గొంతుకలో జాషువా గారు వ్రాసిన ఖండ కావ్యం ‘శ్మశానవాటిక’ లోని పద్యాలు గిరికీలు కొట్టసాగాయి.
“వాహ్వా..! ఇది కదా అదృష్టమంటే?” అనుకున్న నేను అంతకు ముందుకన్నా మరింత వేగంగా అడుగులు కదుపుతుండడంతో “అరే అగ్రజా! హఠాత్తుగా నీకేమైందే!? నడక జోరు పెంచినవ్?” అంటూ నొప్పి తెలియకుండా నా కాళ్ళకు బంధం వేశాడు. ఆ మాటలతో తక్షణమే చిత్త చాంచల్యంలో నుండి వెలికి వచ్చిన నేను “ఏం లేదు. ఏం లేదు పదండీ!” అంటూ నడకలో వడిని తగ్గించాను.
దాంతో నా శ్రీమతి ముఖంలో అప్రయత్నంగా కొంచం సంతృప్తి కనిపించడంతో “ఇదీ ఒకందుకు మంచిదే అయ్యిందిలే” అనుకుంటూ మరికొంత దూరం వెళ్ళగానే మా బాటకు కుడి పక్కన వెదురు తడికలతో వేసిన ఓ పందిరి కింద కీరా దోస ముక్కల్ని అమ్ముతున్నారు. మా కోసం లింగయ్య గారు తలో కాయ కొన్నాడు. తల మాడిపోతున్న ఎండలో కీరా దోస ముక్కలు అమృతం మాదిరిగా అన్పిస్తుంటే గబగబా తినేశాము. ఆ పందిరి కింద ఒక కుటుంబమే వుంది. అందులో ఏడాదిలోపు వయసున్న అందమైన పాల బుగ్గల పసివాడు ఎదురుగా వున్న మనుషుల్ని చూస్తూనే కేకలు వేస్తూ మీద దూకడానికి యత్నిస్తున్నాడు. తల్లి కూడా ఆ చిన్నవాణ్ణి ఎదుట వున్న మనుషులకు అందిస్తుంది. కొద్దిసేపు ఆ పిల్లవాడితో ఆడుకున్న కొనుగోలుదారులు, వాడి చేతిలో పదో, పరకో పెట్టి వెళుతున్నారు. ‘పాపము శమించుగాక!’. “ఆ పిల్లవాణ్ణి ఆలంబనగా చేసుకుని ఆ కుటుంబం యాత్రీకుల నుండి రోజూ అన్నో ఇన్నో పైసల సంపాదనకు అలవాటు పడ్డారా!?” అన్పించింది నాకు.
ఆ ఎండకి, ఆ ఉక్కపోతకి ఎంత నడిచినా ఊయల వంతెన రాకపోవడంతో కొంత నిరుత్సాహాని లోనవుతున్నా నడక మాత్రం ఆపకుండా ముందుకు సాగుతూనే వున్నాము.
సుమారు గంట పాటు నడిచిన తరువాత ‘పోచు’ నది ప్రవాహా సోయగాన్ని, దానికి ఇరుగడలా అలలు, అలలుగా ఆకుపచ్చ వనాలతో కల్లోల కడలి మాదిరి భయద సౌందర్యంతో మెరిసిపోతున్న కొండలు. అప్పటిదాకా మేము భరిస్తూ వస్తున్న తీవ్రమైన ఎండను సైతం ‘మాయా బజార్’ సినిమాలో నాటి మేటి ఛాయాగ్రహకుడు పండు వెన్నెల మాదిరిగా మార్చి చూపించి, ప్రేక్షకుల కళ్ళకు గొప్ప రసానుభూతిని పంచినట్టుగా మాకు మేమే అన్వయించుకుంటూ, కంటికి దూరం కాని, కాలుకి దూరం కాదన్న సామెతను గుర్తుకు తెచ్చుకుంటూ ఎట్టకేలకు ఊయల వంతెన దగ్గరికి చేరుకున్నాము.
సుమారు మూడు అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తుతో ఐదు వందల తొంభై అడుగుల పొడవుతో ‘పోచు నది’ మధ్యలో ఎక్కడా ఒక్క స్థంభం కూడా లేకుండా నిర్మించిన ఇనుప జాలీ ఊయల వంతెన అద్భుతంగా దర్శన మిచ్చింది. నదికి ఈ ఒడ్డున, ఆ ఒడ్డున ఏర్పాటు చేసిన ఆధారం మీదనే మొత్తం వంతెన నిలిచి వుండడం మానవ మేధస్సుకు నిదర్శనం. ఈ వంతెన నిర్మించడం వల్ల నదికి ఆవలి దిక్కున వున్న కొండల మీదికి అనేక మంది సాహసవంతులైన యాత్రీకులు నిత్యం ట్రెక్కింగ్ కి వెళుతుంటారు. వంతెన పొడవునా రెండు వైపులా బౌద్ధ ధర్మానికి సంబంధించిన అనేక వర్ణాలతో కూడిన జండాల తోరణాలు కట్టి వుంచడంతో, అవి గాలికి రెప రెపా ఊగుతూ అదో విధమైన మృదు మధుర ధ్వనిని వెలువరిస్తున్నాయి. వంతెనకు అతి సమీపంలో వున్న నాగజెముడు పొదలకు కాయలు విపరీతంగా కాశి ఎంతో అందంగా మెరిసిపోతూ ప్రకృతిలో దేని అందం దానిదే అన్న పరమ సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నట్టుగా గాలికి తలలు ఊపుతూ చూపరులతో మౌనంగా సంభాషిస్తున్నాయి. “ఆహా! ఏమి అందం” అనుకుంటూ నేను నా శ్రీమతి మెల్లగా వంతెన మీదికి ఎక్కాము. భయంతో మెల మెల్లగా ముందుకు వెళుతుంటే వంతెన గాలికి ఊగుతున్నట్టుగా అన్పిస్తూ మరింత భయ కారణమవ్వసాగింది. కానీ, ఆ భావన కొద్దిసేపు మాత్రమే వుంది. మా వెనుకనే అందెశ్రీ గారూ వంతెన మీదికి వచ్చారు. అట్లా మేము ముందుకు సాగిపోతున్నాకొద్ది మా బృందంలోని నాగేశ్వరరావు, సారంగపాణి గార్ల దంపతులు కూడా మెల్లగా రాసాగారు. నది నీళ్ళు తగ్గిపోవడంతో బయటపడ్డ గుండ్రటి నునుపైన రాళ్ళ మీదుగా కృష్ణ వర్ణంతో గల గల అందెల నాదంతో గుండెల్ని పులకరింపజేసె, అందంతో సాగిపోతున్న ‘పోచు’ నాదీమా తల్లి దైవీ భూత అందం వర్ణించడానికి మాటలు చాలవు. అందెశ్రీ గారితో సహా మేమిరువురం ఆవలి ఒడ్డుకు చేరుకున్నాము.
మొదట్లో ఈ నది చిన్నగా వున్నప్పుడు కలప వంతెనల మీదుగా జనం అటు, ఇటు తిరుగుతూ తమ జీవన వ్యాపకాలను నిర్వహించుకునేవారట. ఆ వంతెన వరదలకు కొట్టుకుపోతూవుంటే మరల మరల కర్ర వంతెనలను నిర్మిస్తూవచ్చారట.
ఎప్పుడైతే ఇక్కడ ‘పునఖా’ కోట నిర్మాణం జరిగిందో, అదే సమయంలో ఆనాటి మహాసాంకేతిక నిపుణుడు తంగ్తోంగ్ గ్యాల్పో నేతృత్వంలో మొట్టమొదటిసారి ఈ ఇనుప వంతెన నిర్మాణం చేపట్టారట. వంతెనకు ఆవలి ఒడ్డున షెంగన, సందింగ్ఖ, సంగఖా అనే గ్రామాలున్నాయి. అవి వ్యవసాయ ప్రధాన గ్రామాలు ఇక్కడ పండే ఎరుపు, తెలుపు బియ్యం కారణంగా ఆ ప్రాంతానికి ‘భూటాన్ దేశపు అన్నం గిన్నె అన్నపేరు వచ్చిందట. ఆ ఒడ్డుకు అతి సమీపంలో వున్న హోటేల్స్ లో దొరికే ‘చాయ్’ చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి వుంటుందట. ఎంత ప్రత్యేకమైన ‘టీ’ అయినప్పటికీ ఎండ కారణంగా దాని రుచి చూడాలన్న మనసు రాక మేము తాగలేదు. మేము ఫోటోలు తీసుకుంటుండగానే సాగంగపాణి గారి దంపతులు కూడా వచ్చి మాతో కలిశారు. కొంతసేపు అక్కడ గడిపిన తరువాత మేమంతా వెనుదిరిగాము. ఈ లోపులో మా బృందంలోని కొందరు మిత్రులు వంతెన మీదకు కొంత దూరమొచ్చి ఫోటోలు తీసుకుని, మేము వెళ్ళేటప్పటికే ఒడ్డు మీదికి చేరిపోయారు. అందరం కలిసి మెల్లగా తిరుగుబాట పట్టాము. ఆ సమయంలో వివిధ దేశాలకు చెందిన సందర్శకులను, బౌద్ధ భిక్షువులను పలుకరిస్తూ, వారితో కలిసి ఫోటోలు దిగుతూ ఎండ తీక్ష్ణనతను మా దృష్టిపథంలోకి రాకుండా జాగ్రత్తపడుతూ ముందుకు నడిచాము.
మేము బస్సు దగ్గరికి వెళ్ళే సరికి గైడ్ ఫెమా, డ్రైవర్ ఉగ్గెన్ మాకోసం ఎదురు చూస్తూ వున్నారు. ఇక దాంతో మేము ఏమాత్రం జాగు చేయకుండా వెళ్ళి బస్సులో కూర్చున్నాము.
ఓ గంట ప్రయాణం తరువాత మార్గ మద్యంలో, రోడ్డు పక్కనే వున్న ఓ పెద్ద కూరగాయల, పండ్ల దుకాణాల సముదాయం ఎదురవ్వడంతో అక్కడ ఆగాము. మేమంతా కిందికి దిగి ఎవరికి నచ్చిన పండ్లు, ఫలాలు వాళ్ళు కొనుక్కుని తిరిగి బస్సెక్కాము. రుఖేష్ అందరికీ మంచినీళ్ళ సీసాలు అందజేశాడు.
ఏక బిగీన ముందుకు సాగిన మా వాహనం సాయంత్రం నాలుగు గంటల వరకు ‘థింపు’ నగరంలోని మ్యూజియం దగ్గరికి చేరుకుంది. మ్యూజియం సందర్శనకు టిక్కెట్ ధర మనిషికి వెయ్యి రూపాయాలట. ఆ మాటలు విన్న మా బృందంలోని కొందరు మిత్రులు “వెయ్యి రూపాయలు పెట్టి అందులో చూసేదేముంటుంది? వెళ్ళేవాళ్లు వెళ్ళి చూసి రండి! మీరు వచ్చిందాకా మేము బస్సులోనే కూర్చుని వుంటాం” అంటూ చెప్పుకొచ్చారు. కానీ, అలా చెప్పడం వెనుక మా మిత్రుల ఆంతర్యం వేరే వుంది.
మేం యాత్ర వెళ్ళడం ఖాయమైన నాటి నుండే మా మిత్రులు భూటాన్ లో తులం (పది గ్రాములు) బంగారం ధర మన దగ్గరికన్నా పది, పన్నెండు వేలు తక్కువగా వుంటుందని, మగవారికి పది గ్రాములు. ఆడవారికి ఇరవై గ్రాములు. భార్యా భర్తలకు కలిపి ముప్పై గ్రాములు కొనుక్కోవచ్చునని, వాటి మీద ఎంతలేదన్నా ముప్పై వేల దాకా మిగులుతాయి. మనం పెట్టిన యాత్రా ఖర్చులో ఎంతో కొంత కలిసొస్తుందన్ననది వారి ఆలోచన. వారి ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్న మేము క్యూలో నుండి బయటకొచ్చి వారితోపాటు బస్సెక్కాము.
మమ్ముల్ని ఎక్కించుకున్న బస్సు నేరుగా వెళ్ళి హోటల్ ‘థింపు సిటీ’ ముందు ఆగింది. లోపలికి వెళుతూనే అక్కడ రిసెప్షన్ లో వున్న మేనేజర్నీ బంగారం కొనుగొలు విషయాన్ని గురించి వివరాలు అడిగారు. దానికతను “మీ దగ్గర డాలర్స్ వుంటే కొన్ని ప్రత్యేకమైన గోల్డ్ షాపుల్లో కొనుక్కోవచ్చు. ఈరోజు మార్కెట్ ధరను బట్టి మీకు ఎనిమిది నుండి పది వేల వరకు మిగిలితే మిగల వచ్చు. మీ దగ్గర డాలర్లు లేవంటే మెయిన్ బజార్లో వుండే బ్రోకర్స్ ని కలవండి! మీ కరెన్సీ మీద నాలుగు శాతం కమీషన్ తీసుకుని వాళ్ళు డాలర్స్ ఇస్తారు. దాంతో మీకు మిగులుతాయనుకున్న ఆ కాస్త డబ్బులు వాళ్ళు తినేస్తారు. ఆ గోలంతా ఎందుకు? మీ ఊళ్ళో మీకు తెలిసిన షాపులో ఒక వెయ్యి రూపాయాలు ఎక్కువైనా కొనుక్కోవడం మంచిది” అంటూ తనకు తెలిసిన విషయాలు క్షుణ్ణంగా తెలియజేశాడు.
మా లగేజ్ రుమ్స్ చేరగానే బంగారం విషయాన్ని తేల్చుకోవాలనుకున్న మిత్రులు మా కన్నా ముందే హోటల్ నుండి బయటకు వెళ్ళారు.
తరువాత మేము కూడా బయటకెళ్ళి భూటాన్ ‘హస్త కళల’ కళాకారుల దుకాణా సముదాయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి చూసొచ్చాచ్చాము.
బంగారం విషయంలో స్పష్టమైన సమాచారం లభించనందున. డాలర్ల మారకం వల్ల తమకు మిగిలే ఆ కాసిని డబ్బులు బ్రోకర్ల జేబుల్లోకి వెళతాయని అర్ధం చేసుకున్న మావాళ్ళు బంగారం కొనుగోలు ప్రయత్నాన్ని విరమించుకుని హోటల్ కి తిరిగొచ్చారు.
చివరికి మేమంతా “కొంతమంది టూర్ ఆపరేటర్స్, పాన్ బ్రోకర్స్ కలిసి సోషల్ మీడియా వేదికగా భూటాన్ లో బంగారం కొనుగోలు చేస్తే, తులానికి పది వేల దాకా మిగులుతాని చేసే ప్రచారం తప్పుడు ప్రచారం మాత్రమే కావచ్చు అనుకున్నాము.
20 ఏప్రియల్, 2024 ఉదయమే లేచి తాయారైన మేము ఎనిమిదిన్నరకల్లా కింద డైనింగ్ హాల్లోకి చేరి ఫలహారం చేశాము. మా యాత్ర ముంగింపు దశకు వచ్చింది కాబట్టి మా గైడ్ ఫెమా, డ్రైవర్ ఉగ్గెన్ రాత్రి వాళ్ళు బస చేసిన హోటల్లో రుఖేష్ ని గట్టిగానే బాదినట్టున్నారు. అందుకే వాళ్ళు లేచేసరికి సుమారు ఎనిమిది గంటలు కావస్తుంది. వాళ్ళు తయారై వచ్చిన తరువాత మా లగేజ్ ఎక్కించుకుని థింపూ నగరానికి ఉత్తర దిశగా వున్న ‘క్యూన్ సెల్ ఫోడ్రాంగ్ నేచర్ పార్క్ లో నెలకొన్న శాక్యముని గౌతమ బుద్ధుని బంగారు విగ్రహ దర్శనానికి బయలుదేరి వెళ్ళాము. అక్కడి వాళ్ళు ఆ కట్టడాన్ని బుద్ధ డోర్డెర్మా అంటారు.
ఈ ప్రతిమను ఆ దేశ చక్రవర్తి యొక్క అరవయ్యవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మించడానికి భూటాన్ ప్రభుత్వం సంకల్పించిందట. 2005 లో నిర్మాణం చేపట్టిన ఆ ప్రతిమ 25 సెప్టెంబర్, 2015వ తేదీన ఆవిష్కరించ బడింది. దాని ఎత్తు 169 అడుగులు. అది మొత్తం మూడు తంతెలుగా నిర్మించబడింది. ఇది కంచుతో నిర్మించబడి, దామి మీద బంగారు పూత పూయబడింది. ఈ భారీ ప్రతిమ లోపల ఒక లక్ష, ఇరవైఐదు వేల కంచు మీద బంగారు పూత పూయబడిన బుద్ధ ప్రతిమలు ఆర్చీల మీద వరుసలు, వరుసలుగా తీర్చి దిద్దబడి వున్నాయి. అందులో లక్ష ప్రతిమలు ఎనిమిది అంగుళాల ఎత్తుతోను, ఇరవై దువేల ప్రతిమలు పన్నెండు అంగుళాల ఎత్తు తోనూ వుంటాయి. లోపల మొత్తం నాలుగు మందిరాలుంటాయి. వాటిలో రెండు, మూడు మందిరాల్లోకి భౌద్దులు కాని వారికి అనుమతి వుండదు.
చరిత్రలో ఈ బుద్ధ ప్రతిమ నిర్మాణాన్ని గురించి మొట్ట మొదటిసారిగా యోగి సోనమ్ సాంగ్పో ద్వారా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఓ అతి పెద్ద బుద్ధ ప్రతిమ నిర్మించబడనుందని చెప్పబడింది.
ఆ తరువాత గురు పద్మసంభవ కూడా ఎనిమిదో శతాబ్దంలోనే ఈ ప్రతిమ నిర్మాణాన్ని గురించి తెలియజేశాడు.
మా బస్సు హోటల్ నుండి బుద్ధ ప్రతిమ వరకూ వచ్చే సమయంలో ఈ చరిత్రనంతా మా గైడ్ ‘ఫెమా’ ఓపిగ్గానూ వివరంగానూ తెలియజేశాడు.
మాటల మధ్యలోనే మా బస్సు వెళ్ళి ‘క్యూన్ సెల్ ఫోడ్రాంగ్ నేచర్ పార్క్’ రోడ్ లో శాక్యముని ప్రాంగణం ప్రధాన ద్వారానికి దగ్గర్లోనే ఆగింది. మేమంతా వెంటనే కిందికి దిగాము. మా అందరికన్నా ముందుగా ‘ ఫెమా’ నడుస్తుండగా మేము అతన్ని అనుసరిస్తూ ప్రాంగణంలోపల అడుగుపెట్టాము. ఆరంభంలోనే కుడిచేతి పక్కన మూడు స్థూపాలు ఎదురయ్యాయి. మా మిత్రులు ముఖ్యంగా మహిళలంతా “వాటిముందు నిల్చుని గ్రూప్ ఫోటో దిగుదాం” అన్న ప్రతిపాదన తీసుకు రావడంతో “సరే’ అంటూ అందరం కలిసి గ్రూప్ ఫోటోలు దిగాము. ఆ ఫోటోలు దిగడమే ఆలస్యం మా మిత్రులంతా ఎవరికి సన్నిహితంగా వున్న వాళ్ళతో వాళ్ళు విడిపోయి, ఆ విశాల ప్రాంగణమంతా సుడి గాలి మాదిరిగా తిరుగుతూ, ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడపసాగారు.
అదేసమయంలో మిగతా ప్రాంతాల నుండి వచ్చిన తోటి యాత్రీకులంతా వాళ్ళ వాళ్ళ గైడ్స్ ను వెంట పెట్టుకుని వాళ్ళు చెప్పే విషయాలు వింటూ. తమ సందేహాలను అడిగి తెలుసుకుంటూ తిరుగుతుంటే చూసిన నేను కొంత అసంతృప్తికిలోనైనా చేయగలిగిందేమీలేదు. కాబట్టి నా శ్రీమతితో కలిసి ప్రతిమ చుట్టూ మెల్లగా తిరుగుతుంటే ఒకటి రెండు సార్లు ‘ఫెమా’ కలిసి నిరసనగా తల ఊపుతూ ఎటెటోవెళ్ళి పోయాడు.
మేము, మాతోపాటు మిగతా మా బృంద సభ్యులంతా అనుకోకుండా కొద్దిపాటి సమయం తేడాతో ప్రతిమాంతర్భాగంలోకి చేరుకున్నాము. మమ్ముల్ని గమనిస్తూనే వున్న ‘ఫేమా’ మెల్లగా వచ్చి మమ్ముల్ని కలుసుకుని ఆ శాక్యముని ప్రతిమ నిర్మాణం వెనుక నున్న చారిత్రక, ఆథ్యాత్మిక విషయాలను ఓపిగ్గాను, క్లుప్తంగాను ఓ గంటపాటు వివరించాడు. అక్కడున్న మూర్తుల ముందు మన ‘మాయా బజార్’ సినిమాలోని పాకశాలలో ఘటోత్కజుడు (యస్వీయార్) తిన బోతున్న వివాహ వంటకాల మాదిరిగా పెద్ద పెద్ద గంగాళాల నిండా రకరకాల పిండి వంటలు ఎంతో కళాత్మకంగా పేర్చి వున్నాయి. వాటిని చూస్తుంటే నా వంటి మధుమేహ రోగులు తప్ప ఆరోగ్యవంతులంతా “అబ్బా ఎన్ని మిఠాయిలు!? తింటే ఎంత రుచిగా వుంటాయో?” అనుకోక తప్పదు మరి. ఈ రెండు మూడు రోజుల క్రితమే అక్కడ జరిగిన ఏదో ప్రత్యేక ఉత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నిరకాల మిఠాయిలను, అంత పెద్ద మొత్తంలో తయారు చేసిపెట్టారట. అవి మొత్తం అక్కడ సేవచేసే బౌద్ధ సన్యాసులు మాత్రమే తినాలట! అదో నియమమట. అట్లా మరికొంతసేపు అక్కడ గడిపిన తరువాత మేమంతా మెల్లగా బయటవున్న ప్రధాన ద్వారం దగ్గరకొచ్చాము.
గైడ్ ‘ఫెమా’ నన్నా ద్వారంలో నిలబెట్టి ఓ అద్భుతమైన ఫోటో తీశాడు. “ఆ పాయింట్లో నిల్చుని దిగితే అటువంటి ఫోటో వస్తుందని లోపలికి వెళ్ళేటప్పుడే ‘ఫెమా’ నాకు చెప్పుంటే ఆ భంగిమలో మా మిత్రులందరినీ తప్పకుండా ఫోటోలు తీసేవాణ్ణి కదా?” అనుకుంటూ అందరితో పాటు మెల్లగా బస్సు దగ్గరికి బయలుదేరాను.
బస్సు ‘పారో’ వైపుగా పరుగందుకుంది. ఆ రోజు మధ్యాహ్న భోజనం బదులు మాదగ్గర మిగిలివున్న ఫలహారాలను లింగయ్య, రేణుక, రుఖేష్ లు అందిస్తుండగా మేమంతా తినేశాము.
ఇంతలో ఏదో ఊరులో బసు ఆగింది. అక్కడ ఆ బస్ ఓనర్ కమ్ డ్రైవర్ బస్సెక్కిన వెంటనే అప్పటిదాగా స్టీరింగ్ ముందున్న డ్రైవర్ని పక్క సీట్లో కూర్చో మనిచెప్పి తను స్టీరింగ్ అందుకున్నాడు.
కొండ దారుల్లు కమ్ముకొస్తున్న మేఘాల తెరల మధ్య కనిపించీ, కనిపించని రోడ్డు మీద అతనేంత నైపుణ్యంగా బస్సును నడిపిస్తున్నాడో చూనిన మేమంతా ఆశ్చర్యపోసాగాము.
నేనిక్కడ మా బస్ డ్రైవర్ ఉగ్గెన్ గురించి ఖచ్చితంగా కొంత చెప్పాలనుకున్నాను. అతను చాలా సాత్వికుడు. ముఖంలో ఎప్పుడూ మాయని చిరునవ్వు అతనికో వరం. అయితే, ఆ చిరునవ్వు వెనుక ఎంత విషాదం దాగుందో తెలుసుకున్న మా మనసుల్లో అతని పట్ల “అయ్యో పాపం!” అన్న భావం క్షణాల్లో మొలకెత్తి మానుగా మారిపోయింది.
ఉగ్గెన్ ది ‘పారో’కి దగ్గర్లో వున్న ఓ చిన్న పల్లెటూరు. ఊళ్ళో అమ్మ, తమ్ముడూ వుంటారు. భూఠాన్లో జరిగేవన్నీ ప్రేమ వివాహాలే కదా? ఆ సాంప్రదాయంలో భాగంగానే ఉగ్గెన్ కూడా ఓ అమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఐదు సంవత్సరాల్లో ముగ్గురు ఆరోగ్యవంతులైన పిల్లలు కూడా కలిగారు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని చూసి ఊరంతా ముచ్చట పడుతుండేది. ఇంతలో ఊగ్గెన్ కి మిలట్రిలో జాబొచ్చించి. ఫోస్టింగ్ మాత్రం మన దేశంలోని ముంబైలో. అలా వెళ్ళడం వెళ్ళడం అతను నాలుగేండ్లు అక్కడే వుండిపోవాల్సి వచ్చింది. ప్రతినెలా తన కొచ్చిన జీతంలో ఖర్చులకోసం కొంత వుంచుకుని మిగతా జీతమంతా భార్యా పిల్లల కోసం ఇంటికి పంపించేవాడు.
హఠాత్తుగా ఒక రోజు వాళ్ళ ఇంటిదగ్గర్నుండి “అర్జంట్ బయలుదేరి ఇంటికి రా.” అంటూ ఫోన్ రావడంతో ఖంగారు పడిన అతను “ఏమైంది? ఏమైంది?” అంటూ ఎంతడిగినా ఇంట్లో వాళ్ళు “ముందు నువ్వు వెంటనే బయలుదేరి రా! వచ్చాక అన్నీ నీకే తెలుస్తాయి” అంటూ బదులిచ్చారు తప్ప ఎవ్వరూ అసలు విషయాన్ని గురించి వివరించలేదు. అతను “నా భార్యా, పిల్లల్తో మాట్లాడించండి!” అంటే “వాళ్ళిప్పుడు మాట్లాడలేరు” అంటూ ఫోన్ పెట్టేశారు. దాంతో అతను “నా భార్యా పిల్లలకు ఏదో అయ్యిందన్న కంగారుతో ఆఘ మీఘాల మీద నాలుగేండ్ల తరువాత ఇంటికి చేరాడు.
అమ్మాయి, ఇద్దరబ్బాయిలు ‘శాలవలు’ పొడిచిన పిట్ట పిల్లల్లా ఇంట్లో ఓ మూలకు కూర్చుని వున్నారు. ఎక్కడ చూసినా భార్య కనిపించక పోవడంతో కంగారుపడిన అతను “తనకేదో హఠాత్తుగా పెద్ద జబ్బుచేసి చనిపోలేదు కదా?” అనుకుంటూ అదే మాట వాళ్ళ అమ్మతో అన్నాడు.
కొడుకు మాటలు వింటూనే ఆ కన్న తల్లి “అట్లా చచ్చిపోయినా బావుండేది కొడుకా! నువ్వెళ్లిన నాలుగేళ్ళల్లో మూడేండ్లపాటు నిక్ఖచ్చిగా బతికింది. ఏదాడి కింద మనూరి బడికి ఓ కుర్రపంతులొచ్చాడు. అది రోజూ పిల్లల కోసం బడికి పోతూ వస్తున్న సందర్భంలో వాళ్ళకు ఎట్లా పరిచయమయ్యిందో? ఎన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్యా వ్యవహారం నడుస్తుందో? ఎంకతనో? పోయిన ఆదివారం నాడు పిల్లలకి కొత్త బట్టలు కొనుక్కొస్తానని చెప్పి ‘పారో’ కెళ్లింది. ఇక అంతే వారంరోజుల తరువాత వాళ్ళిద్దరూ పెండ్లే చేసుకున్నారని తెలిసింది. వెంటనే నీకు ఫోన్ చేశాము” అంటూ ఉగ్గెన్ తల్లి జరిగిన సంఘటనలన్నీ పూసగుచ్చినట్టు వివరించింది.
తల్లి నోటి గుండా వెలువడిన ఒక్కో మాట ఒక్కో తూటా మాదిరిగా తన గుండెల్ని ఛిద్రం చేస్తుంటే పిల్లల్ని దగ్గరికి తీసుకుని శిల్పంలా మిగిలిపోయాడు ఉగ్గెన్.
ఉగ్గెన్ ఓ మనిషిలా తిరిగి కోలుకోవడానికి ఒక ఏడాది కాలం పట్టింది. ఆ మధ్యలోనే అగ్రిమెంట్ ను బ్రేక్ చేసి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. ఎగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నందున అతనికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవి రాలేదు. పిల్లలు చిన్నవాళ్లు ఇప్పుడు నేను వేరే ఆవిడను పెండ్లి చేసుకుంటే తను పిల్లల్ని ఎలా చూసుకుంటుందో తెలియదు. కాబట్టి ఈ జన్మకింతే” అనుకుని తన కొచ్చిన డ్రైవింగ్ నే ఆసరాగా చేసుకుని పిల్లల్ని చదివించుకుంటూ ఇంటిపట్టూనే వుండిపోయాడు.
ఇప్పుడు అమ్మాయి ఢిల్లీలోను, మగపిల్లలిద్దరూ ‘పారో’ లోనూ చదువుకుంటున్నారు.
“పిల్లలు పెద్దవాళ్లయ్యారుగదా? ఇప్పుడన్నా ఎవర్నో ఒకర్ని పెండ్లీ చేసుకుంటే ఇటు నన్ను చూసుకుంటుంది. రేపు పిల్లల పెండ్లిల్లు మంచీ-చెడు అవసరాలను చూసుకుంటుంది” అనుకున్న ఉగ్గెన్ ఓ రోజు అదే విషయాన్ని వారి ముందుంచాడు .
అతను చెప్పిందంతా మౌనంగా విన్న పిల్లల్లు “మా కన్న తల్లే ఆలా చేసి వెళ్ళిన తరువాత ఇప్పుడొచ్చే ఆవిడ నీకూ, మాకూ ఏదో చేసిపెడుతుందన్న నమ్మకం నీకుంటే అలాగే చేసుకోండి నాన్నా!” అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
వాళ్ళ మాటలు విన్న ఉగ్గెన్ సిగ్గుతో చితికిపోతూ నిశ్శబ్దంగా తల వంచుకున్నాడు.
పిల్లలు తల ఎత్తుకుని తిరిగేలా వాళ్ళ కోసమే ఒంటరి పక్షిలా మిగిలిపోయాడు.
ఉగ్గెన్ జీవిత కథ విన్న మేమంతా చాలా సేపటిదాకా ఆ విషాదం నుండి తేరుకోలేక పోయాము.
ఇంతలో తను దిగిపోవాల్సిన స్టేజ్ రావడంతో మా అందరి దగ్గరా సెలవ్ తీసుని బస్ దిగిపోయాడు.
ఓనర్ కమ్ డ్రైవర్ బస్ ను పునొస్తోలింగ్ వైపుగా పరుగులు పెట్టించసాగాడు.
20 ఏప్రియల్, 2024 సాయంత్రం నాలుగ్గంటలకల్లా పునస్తోలింగ్ సరిహద్దు తనిఖీ ఆఫీస్ ముందున్న రోడ్డు మీద బస్సాపిన డ్రైవర్ వెంటనే లాగేజ్ అంతా కిందికి దించసాగాడు. మేమంతా ఎవరి సామాను వాళ్ళం అందుకుని విడి విడిగా పెట్టుకున్నాం. ఆ రద్దీ రోడ్డులో ఎక్కువసేపు బస్సాగితే పోలీసులొచ్చి కేస్ రాస్తారన్న భయంతో ఆ డ్రైవర్ కమ్ ఓనర్ మమ్ముల్నీ తొందరపెట్టసాగాడు. సామాన్లు దించిన వెంటనే మా కందరికీ లఘుశంక తీర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడడంతో వెంటనే గైడ్ ‘ఫేమా’ ను తరుణోపాయం చూపించమని అడిగాము. అతనూ కొంతసేపు ఆలోచించిన మీదట “సరే నాతో రండీ!” అంటూ అక్కడి నుండి ఉత్తర దిశగా వున్న రోడ్డు మీదుగా వేగంగా నడవసాగాడు. నేను తక్షణమే అతన్ని అనుసరించాను. ఆ రోడ్డును దాటి ఎదురుగా వున్న ఓ సందులోకి దారి తీశాడు. ఆ సందులో ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళిన తరువాత మాకు ఎడమ చేతి వైపుగా వున్న చిన్న చిన్న దుకాణాల సముదాయాన్ని దాటి ముందుకు వెళ్ళగా ఓ చిన్న హోటల్ ముందు ఆగిన ‘ఫెమా’ హోటల్ వాళ్ళతో మాట్లాడిన మీదట “లోపలికెళ్ళండీ!” అంటూ చేయి చూపించి ఆ హోటల్ వాళ్ళతో ఏదో మాట్లాడసాగాడు. అది చాలా చిన్న హోటల్. అక్కడికి నిర్మాణరంగంలో పనిచేసే కూలీలు, తదితరులొచ్చి టీ, టిఫిన్లు చేసే, అతి సాధారణ హోటల్. అందులోనే ఓ గొడపక్కగా ఏర్పాటు చేయబడిన ‘టాయ్ లేట్’ ముందుగా నేనే వెళ్ళాను. లోపలికి ఒకరికంటే ఎక్కువగా వెళ్ళే అవకాశమేలేదు. అందరికన్నా ముందుగా నా అవసరాన్ని తీర్చుకుని బయటికి రాగానే మరొకరు వెళ్ళారు. ఇంక అక్కడుండ డానికి మనస్కరించక నేను మెల్లగా వెను దిరిగి మెయిన్ రోడ్డుకు చేరుకున్నాను.
ఇంతకు ముందు నేను సందు లోపలికి వెళ్ళేప్పుడే మాకు కుడి చేతి దిక్కున వున్న ఓ కరెంట్ పోల్ కి, ఆ పక్కనే వున్న ప్రహరీ గోడకు మధ్య నున్న చిన్న ఖాళీ స్థలంలో కూర్చుని వున్న ఓ వ్యక్తి తన దైన ఓ అద్భుత లోకంలో చక్కెర్లు కొడుతున్నటుగా నా దృష్టికొచ్చినప్పటికీ నా అవసరం నన్ను తొందర పెడుతుండడంతో ఆ దృశ్యాన్ని చూసీ, చూడనట్టుగా చూస్తూ ముందుకెళ్ళి పోయాను.
తిరిగి వచ్చేటప్పుడు అప్రయత్నంగా నా దృష్టి అటు వైపుగా మళ్లింది. నేను వెళ్ళేటప్పుడు కరెంట్ స్థంబానికి, గోడకు మధ్యనున్న కొద్దిపాటి జాగాలో కూర్చుని వున్న ఆ వ్యక్తి కాస్తా.. అల వైకుంఠపురిలో, పాల కడలిలో, బూరుగు దూది పరుపులాంటి శేషనాగు చుట్టల పరుపు మీద హాయిగా పవళించి యోగనిద్రలో మినిగిపోయి లీలా వినోదాన్ని తిలకిస్తున్న విష్ణుమూర్తిలా, బురద నేలలో పడుకుని చిద్విలాసంగా తనలో తను నవ్వుకుంటూ ఏవో కలలు కంటున్నాడు.
ఆ దృశ్యాన్ని చూసిన నా లోపలి మరో మనిషి ఓ విధమైన ఆటవికానందంతో చిందులువేయసాగాడు. ఎందుకంటే, మన దేశంలో ఏ ఊరికెళ్లినా వీధికో బెల్ట్ షాప్ కన్పిస్తుంటుంది. పొద్దుగూకులూ రెక్కలిరగ కష్టం చేసిన వ్యక్తి, సాయంత్రం అయ్యేటప్పటికి కూలీ డబ్బులు తీసుకుని నేరుగా సారాదుకాణానికెళ్లి ఫూట్ గా తాగి ఇంటి కొచ్చి ఆలు బిడ్డల్ని ఏడ్పించుకుంటూ రోడ్ల మీద పడి దొర్లే మనుషుల్ని అను నిత్యం చూస్తుంటాను, అటువంటిది గత వారం రోజులుగా ఈ భూటాన్ దేశంలో తిరుగుతున్న నాకు, అంగడిలో కొత్తిమీర కట్టల మాదిరిగా అన్ని రకాల షాపుల్లోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దాల బీరువాల్లో నుండి కనిపించే విధంగా రక రకాల మద్యం సీసాలను ఏర్పాటుచేసి అమ్మే ఈ తావున, ఎంత దూరం తిరిగినా ఒక్కడంటే ఒక్కడు కూడా తాగి రోడ్డు మీద పడి దొర్లినట్టుగా కనబడక పోవడం నాకు ఆశ్చర్యాన్నే కాదు అసూయనూ కలిగించింది. అటువంటిది ఇంకో గంట, గంటన్నరలో ఈ దేశంలో నుండి వెళ్ళి పోబోతున్న సమయంలో ఓ తాగుబోతు ఇలా రోడ్డు మీద, అదీ దేశ సరిహద్దు తనిఖీ ఆఫీస్ కి మూడు నాలుగొందల అడుగుల దూరంలో ఒంటి మీద సోయిలేకుండా తాగి పడి, దొర్లడాన్ని కళ్ళారాచూసిన నా మనసుకేమైందో తెలియదుగాని, ఓ పిచ్చి ఆనందంతో కోతిలా గంతులు వేయసాగింది.
“ఓ మనిషీ! నావి రెండ్లు కండ్లు పోయినా ఫర్వాలేదు. ఎదుటి వాడిది ఒక్క కన్నైనా పోవాలనుకునే నీ తత్వమేంటో నీకైనా తెలుసునా?” అంటూ ఎవరో ఒక తత్వవేత్త వ్రాసిన పదం నా మనసులోకి వాడిశేల రాయిలా వచ్చి తగలడంలో నాలో నేనే కించిత్ సిగ్గుపడసాగాను.
ఇంతలో కడుపు బరువు దించుకున్న మా వాళ్ళు కొందరు నన్ను కలవొచ్చి “ఏంటీ!? ఇక్కడాగిపోయారు?” అంటూ ప్రశ్నించడంతో స్పృహలోకొచ్చిన నేను “ఏంలేదేంలేదు పదండి!” అంటూ అక్కణ్ణుండి కదిలి ముందుకు సాగుతున్నప్పటికీ నా మనసులో “అబ్బా! నేనెంత మూర్ఖుడిలా ఆలోచించాను? నా ఇంట్లో చెడు అలవాట్లున్న మనుషుల మాదిరిగానే ఎదుటింట్లో కూడా వుండాలనుకోవడం మూక మనస్తత్వానికి నిదర్శనం కదా? అందుకు నేనూ అతీతుణ్ణేమీకాదన్న మాట? ఇక నుండైనా ఈ గుంపు మనస్తత్వం నుండి కాస్త బయట పడడానికి గట్టిగా ప్రయత్నించాలి” అనుకుంటూ వేగంగా బస్సు దగ్గరికి చేరుకున్నాను.
నా శ్రీమతితో పాటు నాగేశ్వరరావు గారి దంపతులు, లింగయ్య గారి దంపతులు ఎటు వెళ్ళారో గాని వాళ్ళింకా రాలేదు. భాష తెలియని ప్రాంతంలో, ఎటువెళ్ళారు? ఎందుకు వెళ్ళారు?” అని నాలో నేనే సవాలక్ష ప్రశ్నలు వేసుకుంటూ వరి కల్లంలో కుప్ప నూర్చే టప్పుడు బంతి తిరిగే బక్కెద్దుమాదిరిగా అక్కడక్కడే తిరగ సాగాను. ఆ క్షణంలో ఎవర్ని గురించి ఎవరూ ఆలోచించే పరిస్థితిలో లేరు. ఎవరికి వాళ్ళు తమ లగేజ్ మోసుకుని చెకించ్ పాయింట్ రూమ్ లోపలికి వెళ్ళి పోతున్నారు.
ఇంతలో బస్ డ్రైవర్, గైడ్ వాళ్ళిద్దరూ నా దగ్గరికొచ్చి “మీ రొక్కల్లే ఇక్కడుంటే ఎట్లా? పదండీ!” అంటూ వాళ్ళు మా బ్యాగుల్తో పాటు నాగేశ్వరరావు, లింగయ్య గార్ల బ్యాగుల్నీ కూడా లాక్కుపోయి చెకింగ్ పోయింట్ ఈవల ఫుట్ పాత్ మీద పెట్టి ఎటో వెళ్ళిపోయారు.
ఇంతలో… సమూహంలో కూడా ప్రత్యేకంగా ఆలోచించే మనుషులు ఒకరిద్దరైనా తప్పకుండా వుంటారన్నదానికి నిదర్శనంగా లోపలి కెళ్ళి తమ బ్యాగుల్నీ చెకింగ్ పాయింట్ కన్వేయర్ బెల్ట్ మీదగా ఆవలికి పంపించిన సోదరి సునీత వాటి దగ్గర సారంగ పాణి గార్నుంచి తను నా దగ్గరికి పరుగెత్తుకొచ్చి “అన్నయ్యా! వదినా వాళ్ళింకా రాలేదా? ఈ సామాన్లాన్ని మీరొక్కరే లోపలికెలా తీస్కోస్తారు?” అంటూనే నా ముందున్న బ్యాగుల్లోన్నుండి నాలుగు బ్యాగుల్నీ తన రెండు చేతుల్తో గొర గొరా లోపలికి లాక్కుపోసాగింది. అది చూసిన నేను ఇక లాభంలేదనుకుని వెంటనే యాక్షన్ లోకి దిగిపోయి మొత్తం బ్యాగులన్నింటినీ గబ గబా లోపలికి లాక్కుపోయి బెల్ట్ మీద వేస్తుంటే ఆవతలి పక్కన నిల్చున్న సోదరి సునీత వాటిని అందుకొని ఒక చోట పెట్టసాగింది. ఆ వ్యవహారమంతా అయిపోగానే “బ్యాగుల్ని చూస్తుండండీ” అంటూ వాటి బాధ్యతను సునీత వాళ్ళకు అప్పగించి నా శ్రీమతి కోసం మళ్ళీ బయటకు పరుగెత్తుకెళ్ళాను. అప్పటికి వాళ్లెక్కడో ‘టీ’ తాగి నింపాదిగా వస్తూ కనిపించారు.
“ఇదేంటీపద్ధతి?” అంటూ వాళ్ళను ప్రశ్నిస్తే “వాళ్ళంతా మనను వదిలి పెట్టి వెళ్తారా?” అంటూ నాకే ఎదురు ప్రశ్న సంధించారు! “ఆ ఆవేశంలో నేనేదన్నా అంటే అదో పెద్ద రచ్చౌతుంది” అనుకున్న నేను, వాళ్ళను వెంటబెట్టుకుని మెల్లగా లోపలికెళ్ళాను. సరిగ్గా ఆదే సమయంలో మా వంతు రావడంతో మేము మా ఐ.డి. కార్డ్స్ ను కౌంటర్లలో అందించి, మా బ్యాగుల్నీ పట్టుకుని మెల మెల్లగా క్యూలో ముందుకు సాగుతూ పదినిమిషాల్లో భూటాన్ భూభాగం నుండి మన మాతృభూమి (జై గామ్) మీద పాదం మోపాము. ఆ విధంగా వారం రోజుల మా భూటాన్ యాత్ర విజయవంతంగా ముగిసింది.
మమ్ముల్ని మొదటిరోజు’ న్యూ జల్పాయి గురి’ రైల్వే స్టేషన్లో తన బస్సులో ఎక్కించుకొని ‘జై గామ్’ తీసుకొచ్చిన డ్రైవర్ సంతోష్ అదే బస్సుతో మా కోసం వచ్చి అక్కడే (జై గామ్ లోనే) వున్నాడు.
మరో గంటలో మా సామాన్లన్నింటినీ బస్సు మీది కెక్కించిన సంతోష్ అటు సిక్కిం రాజధాని గ్యాంగ్ టాక్ కి ఇటు డార్జ్ లింగ్ కి మధ్యలో వుండే ‘కలింగ్ పాంగ్’ అనే పట్టణం దిశగా పరుగులు తీయించాడు. రాత్రి పదిగంటల సమయంలో ఓ చోట రోడ్డు పక్కనున్న డాబా హోటల్లో రాత్రి భోజనాలు చేసి, పదకొండు గంటల రాత్రికి ‘కలింగ్ పాంగ్’ లోని హోటల్ “గార్డెన్ రీచ్” లో దిగాము.
(ఇంకా వుంది)