కర్నూలుకి చెందిన ఉపాధ్యాయుడు మారుతీ పౌరోహితం తన కథల సంపుటి “ఊరిమర్లు”ద్వారా పాఠకులకు తెలుసు. “ప్రణయ హంపీ” తన మొదటి నవల. హైదరాబాద్కి చెందిన “ఛాయ” ఈ నవలను ప్రచురించింది. ఇప్పటికే పాఠకులకు చేరువై, విమర్శకుల, పాఠకుల నుండి మన్ననలు పొందుతోంది. తన తొలి నవలగా చారిత్రక అంశాన్ని, అందునా విజయనగర సామ్రాజ్య చరిత్రను మలుపు తిప్పిన ఓ పెద్ద యుద్ధ కాలాన్ని ఎందుకు ఎంచుకున్నాడో… ఉదయనితో ఇలా పంచుకున్నాడు.
ప్రణయ హంపీ రాయడానికి మిమ్మల్ని పురిగొల్పిన అంశాలు ఏవీ?
జవాబు : నేను వృత్తిరీత్యా 2010 వరకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కావడం కారణంగా పాఠశాలల్లో సాంఘికశాస్త్రాన్ని భోదిస్తూ ఉండేవాడిని. బై చాయిస్ కూడా నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని కావాలని కోరుకున్నవాడిని. సాంఘికశాస్త్ర భోదన పట్ల నాకు ఉండే అభిరుచి కార్, గార్డెన్ చైల్డ్, డి.డి.కోశాంబి, రొమిల్లా థాపర్ వంటి వారు వ్రాసిన చరిత్ర పుస్తకాలను విస్తృతంగా చదివేట్లు చేసింది.
ఇటీవల కాలంలో ‘కాల చక్రం’ పేరుతొ అంధ్రప్రదేశ్ లో సాయి పాపినేని గారు , వాడ్రేవు చినవీరభద్రుడు గారు వంటి వారి ఆద్వర్యంలో చారిత్రిక కథల రచన ఆవశ్యకతను తెలుపుతూ ఒక కార్య శాల జరిగింది. అందులో చారిత్రిక కాల్పనిక రచనలు రావలసిన అవసరాన్ని గుర్తించి విరివిగా రచయితలు అటువంటి కథలు వ్రాయవలసినదిగా వారు పిలుపును ఇచ్చారు. ఆలస్యంగా కథారచనలో ప్రవేశించిన నాకు సాంఘిక శాస్త్రాలపట్ల ఉన్న ఆసక్తి నన్ను ఈ పిలుపుకు స్పందించేట్లు చేసింది.
నేను రాయలసీమ అస్థిత్వ ఉద్యమంలో ప్రత్యక్షంగా , పరోక్షంగా పాల్గొంటున్న రాయలసీమ వాదిని. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగినపుడు రాజకీయ నాయకుల స్వార్థం వలన మనం బళ్ళారిని, హంపినీ కోల్పోపోయామని వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి పెద్దలు అభిప్రాయపడ్డారు. దీనివలన రాయలసీమకు చాలా నష్టం వాటిల్లిందని చెబుతూ ఉంటారు. హంపీని ఆంద్రుల సాంస్కృతిక రాజధానిగా కొందరు వర్ణించారు. అందువలన నాకు హంపీతో ఒక emotional attachement ఉంది. దానితో పాటు మా అమ్మగారిది బళ్ళారి జిల్లాలోని బలకుంది గ్రామం పుట్టినిల్లు కావడం మూలానా, అమ్మ వైపు బందువులు అందరూ కర్నాటకలో ఉండడం మూలానా నేను తరచుగా బళ్ళారి జిల్లాకు వెళుతూ ఉంటాను. మా అమ్మ నాన్నల కర్మకాండలే కాకుండా మా అమ్మ వైపు బందువుల మరణాంతర క్రియలు హంపిలోనే చేస్తుండడం కారణంగా ఎక్కువరోజులు హంపీలో ఉండవలసి వస్తోంది. హంపీలో ఉన్నన్ని రోజులు అది మన సాంస్కృతిక రాజధాని కదాఅనే ఉద్వేగానికి గురి అవుతుంటాను.
పైన పేర్కొన్న మూడు కారణాలు నేను “ప్రణయ హంపీ” వ్రాయడానికి పురికొల్పిన అంశాలు.
విజయనగర రాయల సామ్రాజ్యం అనగానే రోడ్డు పక్కన రత్నాలు పోసి అమ్మినదే తెలుసు. కానీ, ఇందులో ఇతర విషయాలూ చర్చకు వచ్చాయి. ముఖ్యంగా వేశ్యలనుండి వసూలు చేసిన పన్నులతో కైజీతగాల్లకు జీతం చెల్లించడం లాంటివి. ఇవి ఎందుకని సాహిత్యంలో చోటు చేసుకోలేదు?
జవాబు: అది చరిత్రను చూసేవారి దృష్టి కోణం బట్టి ఉంటుంది. ప్రాచీన, మధ్యయుగాలలో సాహిత్యం రాజాశ్రయంగా ఉండింది కాబట్టి మీరు చెప్పిన విషయాలు సాహిత్యంలో అంతర్భాగం అయ్యే అవకాశం తక్కువ. కొంతమంది సాహితీవేత్తలు కొంత ప్రయత్నాలు చేసినా అవి ప్రచారానికి నోచుకోలేదు. అత్యాధునిక సమాజంలో ఉన్నామని అనుకొంటున్న ఈరోజుల్లో కూడా పాలకుల పరిపాలనలోని లోపాలను సాహిత్యం ద్వారా ఎత్తి చూపుతున్నవారు జైళ్ళల్లో మగ్గుతున్న విషయం మనం చూస్తున్నాం.
యుద్ధం అనగానే గెలుపు – ఓటములతో పాటూ మానవ విధ్వంసం ఉంటుంది. సాహిత్యం ఎక్కువగా గెలుపు ఓటముల గురించి చర్చినంతగా విధ్వంసాన్ని చర్చించలేదు. ఇందులో మనుషుల భావోద్వేగాలే ప్రధానంగా ఉన్నాయి. ఆ స్టాండ్ తీస్కోవడానికి గల కారణం ఏమిటి?
జవాబు: దానికి సామాన్య మానవుడి దృష్టి కోణంలో చరిత్రను చూడడమే ప్రధాన కారణం. R.S. రావు గారు తన” అభివృద్ధి వెలుగు నీడలు” అనే పుస్తకంలో పేర్కొన్నట్లు దీపపు స్తంభం దగ్గర దాని చుట్టూ ఉండే చీకటి లాంటిది మీరు చెప్పిన విషయం. ముప్పై ఆరు రకాల పన్నులు చెల్లించి విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రధాన కారకులు అయిన సామాన్యుల వేదనలు ఎక్కడ కూడా వివరంగా ప్రస్తావింపబడలేదు. సమకాలీనంగా జరుగుతున్న గాజా, యుక్రెయిన్ యుద్ధాలను కూడా తళ్ళికోట యుద్ధం నెపమున వ్యాఖ్యానించడానికి అవకాశం కల్పించుకొన్నాను.
ప్రేమ అనేది సున్నిత అంశం. ఏ ఘర్షణల్లో అయినా మొదట గాయపడేది ప్రేమే. ఇందులో ప్రేమ, ప్రేమికుల ఇతివృత్తంగానే నవల నడచింది. ప్రేమ చుట్టుతా ఓ రాజ్య చరిత్రను, యుద్ధాన్ని చెప్పొచ్చు అని ఎలా అనిపించింది.
జవాబు: సమకాలీన విద్యావిధానంలో విద్య యొక్క లక్ష్యం మారిపోయింది. ఒకప్పుడు మనం అంతా పిల్లవాడి సర్వతోముఖాభివృద్దికి తోడ్పడడమే విద్య యొక్క లక్ష్యం అని భావించాం. ఈరోజు విద్య యొక్క లక్ష్యం మార్కెట్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను విద్యార్థులకు అందించడంగా ఉంది. అంటే విధ్య మార్కెట్ సరుకు అయ్యింది. అందువలన సామాజిక శాస్త్రాల అధ్యయనం యొక్క ప్రాధాన్యతను ఎవరూ గుర్తించడం లేదు. ముఖ్యంగా చరిత్ర అధ్యయనం పట్ల ఈ కాలపు యువత ఆసక్తిని చూపడం లేదు. అందువలన చారిత్రిక విషయాలను నేటి యువతతో చదివించాలి అంటే ప్రేమకథ ద్వారా వారి దృష్టిని ఆకర్షించవచ్చనేది నా అభిప్రాయం.
నవల ముగిసే సరికి కథా నాయకుడు, కథా నాయికతో పాటూ ‘వలంది’ కూడా గుర్తుండిపోతుంది. ఆ పాత్రను కొనసాగిస్తే బాగుండేది కదా?
జవాబు: కొనసాగించక పోతేనే వలంది గుర్తు ఉంటుంది మనందరకూ. ఒక మిత్రుడు నాతో వలంది పాత్ర నన్ను వెంటాడుతోంది అన్నాడు. ఆమె బాధ ఏదైతే ఉందో దానికి మరణమే ముగింపు ఆ పరిస్థితుల్లో. ఆమె పాత్రను కొనసాగించి ఉంటె ఆమె సున్నితత్వం గురించి చెప్పిన విషయాలకు నమ్మిక ఉండేది కాదు.
ఇటీవల తెలుగులో చారిత్రిక నవలా రచన ఎక్కువగా జరుగుతోంది. యువతరం కూడా ఆ వైపు వెళ్తుంది. ఇది మీ మొదటి నవల. మీరూ చారిత్రిక అంశాన్నే ఎంచుకున్నారు? దీనికి కారణమేమి?
జవాబు: మీరు అడిగిన మొదటి ప్రశ్న సమాధానం లోనే దీనికి కూడా సమాధానం ఉంది. సాంఘిక శాస్త్ర భోదనపట్ల అభిరుచి, కాలచక్రం వర్క్ షాప్ లో పెద్దలు ఇచ్చిన పిలుపు, హంపీ పట్టణంతో నాకున్న ఉద్వేగభరితమైన attachment దీనికి కారణాలు. స్థానికతతో కూడిన చారిత్రక నవలలకు ఆదరణ ఉంటోంది. తమను తాము తధాత్మీకరణ చెందడానికి వాటిలో అవకాశం ఉండడం ఒక కారణం కావచ్చు. నా వరకైతే రాయలసీమ ఆస్థిత్వ స్పృహ ప్రధాన కారణం.
మారుతి గారు ఇంటర్వ్యూ బావుంది
నవల రాయడం వెనుక ఉద్దేశం నన్ను ఆకట్టుకుంది
ఈ నవల నేను చదివాను చాలా మోహంగా ఉంది
ఉదయిని టీముకు
రచయితకు
హృదయపూర్వక ధన్యవాదాలు
ధన్యవాదాలు తెలుగు వెంకటేష్ గారూ !