నా చదువు కథ Part – 6

మనం టీనేజ్ లో వున్నప్పుడు చదివిన కొన్ని పుస్తకాలు గానీ,చూసిన సినిమాలు గానీ,విన్నపాటలు గానీ మనసు మీద  చాలా ప్రభావం చూపుతాయి.

అప్పుడు పడిన ఆముద్ర జీవితాంతం వీడదు.

అలా నా యవ్వనం లో నేను చదివిన పుస్తకం మనసులో మధుర స్మ్రతిగా నిలిచి పోయిన పుస్తకం ఆచంట జానకి రామ్ గారి “నాస్మృతి పథంలో….సాగుతున్న యాత్ర” నిజానికి ఇవి మూడు గొలుసు పుస్తకాలు.

ఇవి చదివి నేనమాంతం ఆయనతో ప్రేమలో పడిపోయాను.

అసలు నేనా వయసులో కల్పనా సాహిత్యం చదవడానికే యెక్కువ మొగ్గు చూపేదాన్ని అయితే మా గురువు గారు కస్తూరి నరసింహ మూర్తి గారు తాను చదువుకోడానికి గ్రంథాలయం నుండీ కొన్ని పుస్తకాలు తెచ్చుకునే వారు.నేను చదివే పుస్తకాలు అయిపోయి ఇంకేమీ పుస్తకాలు దొరకనప్పుడు నేను వారి దగ్గరవున్న పుస్తకాలు వెదికేదాన్ని వాటిలో యెక్కువగా నాన్ ఫిక్షన్ ,వ్యాస సంకలనాలూ వుండేవి.ఈ పుస్తకం తీసి రెండు పేజీలు చదవగానే నన్నమితంగా ఆకర్షించింది “మేష్టారూ నేనీ పుస్తకం చదివి ఇవ్వచ్చా” అని అడిగితే “తప్పకుండా చదువు మంచి పుస్తకం “అని ఇచ్చారు. 

అలా చదివిన ఆ పుస్తకం ఈ నాటికీ నా లైబ్రరీలో నాకు ఇష్టమైన పుస్తకాల సరసన కొలువు దీరి వుంటుంది.

ఇంతకీ ఏముందా పుస్తకంలో? ఎవరు ఈ ఆచంట జానకి రామ్ ? అంటే

మొదట నేను చదివినప్పుడు “నా స్మృతిపథంలో —సాగుతున్న యాత్ర ఒకటీ రెండూ భాగాలూ” మూడు విడి పుస్తకాలుగానే చదివాను.ఇప్పుడవి మూడూ కలిపి ఒకే పుస్తకంగా లభ్యమవుతున్నాయి.ఈ పుస్తకాలు ఒకరకంగా ఆయన ఆత్మకథ అయితే తన ఆంతరంగిక వివరాలు కొంత మర్మంగానూ ,తన పరిచయాలనూ,తన భావాలనూ,ఊహలనూ తేట తెల్లంగానూ ఆయన పాఠకులతో పంచుకున్నారు.ఆయన రాసిన సరళమైన,సుందరమైన వచనమూ,

ఆయనలోని భావుకతా,స్వాప్నికతా,సౌందర్యారాధనా,ఉత్తమమైన అభిరుచీ పుస్తకాన్ని అపురూపంగానూ,ఆసక్తికరంగానూ తయారు చేశాయి.

ప్రతీ వ్యాసాన్నీ ఏదైనా ఒక కవితా ఖండికతో గానీ  యేదైనా ఒక పద్యభాగంతో గానీ మొదలు పెట్టి ,దానిని తన భావాలతో ,అనుభూతులతో అనుభవాలతో అన్వయిస్తూ ఆయన రాసిన వ్యాసాలు పాఠకులను విపరీతంగా ఆకర్షించాయి.

ఉదాహరణకు పుస్తకంలో ఆయన మొదటి వ్యాసం యెలా మొదలయిందో చూడండి

“ఇవిగో ఇంకా నిద్ర లేవని,

మంచు తడి ఆరని,పారిజాతాలు!!

ఈ ధవళిమ నా భావాల స్వఛ్ఛత:

ఈ ఎరుపు నా అనురాగ రక్తిమ,

ఈ పరిమళము మన స్నేహ సౌరభము!

అందుకోవూ!!

నీ వెక్కడున్నా నీ వద్దకే వస్తాను నేను,

భిక్షాపాత్రతో గానీ

నవరత్నాలు కూర్చిన కంఠమాలతో గానీ:

ఎప్పటికీ నేను నీవాడనే!!”

ఇది జానకి రామ్ గారు రాసిన కవితే చూశారుగా ఆ పదసౌందర్యం,భావసౌందర్యం!

 “మధురాధిపతే అఖిలం మధురం” అన్నట్టు ఆయన రాసే మాటా,చేసేపనీ,చూసే చూపూ ప్రతీదీ సౌందర్యమయమే

మొట్టమొదట ఈ వ్యాసాలను నార్లవెంకటేశ్వరరావు గారు 1957లో తాను ఎడిటర్ గా పనిచేస్తున్న “ఆంధ్రప్రభ” వార పత్రికలో ప్రచురించారు “నాస్మృతి పథంలో”” అనే పేరుకూడా ఆయనే పెట్టారు.ఈ అందమైన భావ గుఛ్ఛాలనీ,ఆయన అనుభవాల,అనుభూతుల జ్ఞాపకాల మాలనీ చదివిన ఆనాటి ఆంధ్రపాఠకులు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ఆ వ్యాసాలన్నీ చదువరి యెదురుగా కూచుని అతని చేతిలో చేయి వేసి ,కేవలం అతనితోనే ఆంతరంగికంగా తన అనుభూతులను పంచుకున్నట్టుగా అనిపించేటట్టు రాయడం జానకి రాం ప్రత్యేకత.

ఎటువంటి పరిచయాలూ?ఎటువంటి అనుభవాలూ?ఎటువంటి జీవితం?ఎటువంటి స్నేహాలూ? చదువుతుంటే కించిత్తు అసూయ కూడా కలుగుతుంది ఆయన అదృష్టానికి.

మహాత్మా గాంధీ,రవీంద్రనాథ్ టాగూర్ ,జేమ్స్ కజిన్స్ ,అనిబీసెంట్ మొదలైన వారి సామీప్యం.దేవులపల్లి కృష్ణశాస్త్రి,చలం,బుచ్చిబాబు,హరీన్ ఛట్టో,కమలాదేవి,వేదుల సత్యనారాయణ,మల్లవరపు విశ్వేశ్వరరావు,శ్రీశ్రీ,ముద్దుకృష్ణ,రజనీ ,మొక్కపాటి రామ్మూర్తి,కొంపెల్ల జనార్దన రావు,బెజవాడ గోపాలరెడ్డి ,యం.యస్ సుబ్బలక్ష్మి,సదాశివం,బెంగుళూరు నాగరత్నమ్మ ,దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ,మాలతీచందూర్  ,చందూర్ గారూ ఇలా ఒకరనేమిటీ ,నేల నాలుగు చెరగులా ఏ ప్రముఖుని పేరు చెప్పినా వారితో వీరికి సాన్నిహిత్యం,స్నేహ సౌహార్దాృలు వుండకుండా వుండటం అరుదు.అలా వారితో ఆయన అనుభవాలు పంచుకుంటుంటే మాధురులూరిపోతాయి.

ఒక ప్రఖ్యాత వైద్యుడి కొడుకుగా,ఒక పేరొందిన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయనకీ పరిచయాలు లభించి వుండవచ్చు అనిపించినప్పటికీ ,ఆయన తన స్నేహశీలతతో,సౌజన్యంతో,వ్యక్తిత్వంతో వాటిని నిభాయించినతీరు అనుపమానంగా వుంటుంది.

ఇక్కడ వారికుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పుకోవాలి.

ఆయన తండ్రిగారు ఆచంట లక్ష్మీపతి ,తల్లి గారు కలవచర్ల సీతమ్మ .

లక్ష్మీపతి గారు 1904లో ఆనాటి యం.బి.సి.యమ్ (నేడది యం.బి.బి.యస్ .అని పిలవ బడుతోంది)అనే అల్లోపతీ వైద్యవిద్య లో డిగ్రీ తీసుకుని మద్రాసులో ప్రయివేట్ ప్రాక్టీసు చేస్తూ,ఆయుర్వేదం మీద మక్కువతో అందులో కూడా నిష్ణాతులయి ,ప్రముఖఆయుర్వేద వైద్య నిపుణులుగా పేరొందారు. ఎంతోమంది జమీందారులూ,రాజకీయ ప్రముఖులూ,ధనవంతులూ ఆయన వద్ద వైద్య సహాయం పొందుతూ వుండేవారు .ఆయన ఆయుర్వేద వైద్యం అభివృధ్ధికి అనేక రకాలుగా కృషిచేశారు. వివిధ మూలికల మీద రీసెర్చి కూడా జరుపుతూ అనేక వైద్య గ్రంథాలుకూడా  రాశారు.

ఆచంట జానకి రామ్  లక్ష్మీపతి గారికి రెండవ సంతానం గా1903 జూన్ పదహారవ తేదీన జన్మించారు.జానకి రామ్ కి అయిదేళ్ల వయసులో తల్లి సీతమ్మగారు హఠాన్మరణం చెందగా లక్ష్మీపతి గారు ,రుక్మిణమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నారు .ఆమె ఆరోజుల్లో మద్రాసులో బి.ఏ చదివారు,వీణ ధనమ్మాళ్ దగ్గర వీణనభ్యసించారు .అంతే కాదు రాజకీయాలలో ప్రవేశించి ఉమ్మడి మద్రాసు రాష్టృంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా వున్నపుడు రుక్మిణమ్మ గారు వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా చేశారు.మా గుంటూరు మెడికల్ కాలేజ్  పెట్టడంలో ఆవిడ ప్రధాన పాత్ర వహించారు.నేటికీ ఆవిడ శిలా విగ్రహం మా మెడికల్ కాలేజ్ లో దర్శన మిస్తూ వుంటుంది

జానకి రామ్ గారి విద్యాభ్యాసం అనిబీసెంట్ స్థాపించిన అడయార్ స్కూలులో సాగింది.ఇక్కడ ఆయన జేమ్స్ కజిన్స్ ,అరుండేల్ మొదలైన వారి శిక్షణలో ఉన్నతమైన ,సున్నితమైన భావాలు పెంపొందించుకున్నారు.ఆతర్వాత మదనపల్లెలో కాలేజ్ విద్యనభ్యసించారు,అక్కడనుండీ విజయనగరంలో రసాయన శాస్త్రంలో పట్టా సాధించారు.కొన్నాళ్లు శాంతి నికేతన్లో గడిపారు.బెంగుళూర్ లో రసాయన శాస్త్రంలో రీసెర్చ్ చేస్తూ మధ్యలో వదిలేశారు.

కొన్నాళ్లు వారి తండ్రి గారి ఇన్సూరెన్స్ కంపెనీ లో ఏజంట్ గా పనిచేస్తూ బెజవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యటించారు.

ఆ ఉద్యోగం నుండీ వైదొలగి 1938లో ఆకాశవాణిలో ప్రోగ్రామ్ ఎక్జిక్యూటివ్ గా ప్రవేశించారు.మద్రాసు కేంద్రం స్థాపించిన సమయంలో అక్కడ పని చేసిన ముగ్గురిలో వీరొకరు. తెలుగు విభాగంలోనూ,తమిళ విభాగం లోనూ కూడా పనిచేశారు.ఈ రేడియో ఉద్యోగ జీవితాన్ని ఆయన యెంతగానో ఇష్టపడ్డారు .ఆయన మనసుకి దగ్గరయిన పని అది.ఎంతోమంది కవులనీ ,కళాకారులనీ పరిచయం చేయడం వారినుండీ మంచి మంచి కవితలూ,నాటకాలూ ,పరిచయాలూ సంపాదించి అవి రేడియోలో ప్రసారం చెయ్యడం ఆయన కిష్టమైన వ్యాపకం

రేడియో ఉద్యోగం లో ఆయన ప్రసారం చేసిన గొప్ప గొప్ప రచనలలో రజనీ కాంత రావు గారి “చండీదాసు”,కృష్ణశాస్త్రి గారి “శర్మష్ఠ”  ముద్దుకృష్ణ “అనార్కలి”మొదలైనవి యెన్నో వున్నాయి.రజనీ “చండీదాసు” నాటకం ప్రసారం చేయడం అయిపోయాక ఒక్కసారిగా ఉద్వేగం తట్టుకోలేక భోరుమని యేడ్చేసిన సంగతి చెబుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఆయన రేడియోలో పని చేసేటప్పుడు పరిచయమైన బుచ్చిబాబు తో స్నేహం తర్వాత చాలా గాఢమైంది.ఆయన రాసిన నవలకు “యేకాంతం” అని పేరు పెట్టాలనుకుంటుంటే ,దానికి “చివరికి మిగిలేది” అనే పేరు బాగా సూటవుతుందని సూచించింది జానకి రామే.బుచ్చిబాబు ఆయన సూచనను మన్నించారు.ఆయన తాను చిత్రించిన చాలా చిత్రాలను  ఆంధ్ర మహిళా సభకు బహూకరించారు.

చిన్ననాడు తనలో మొలకెత్తిన చిత్ర రచనకు దేవీప్రసాద్ రాయ్ మెరుగులు దిద్దితే బుచ్చిబాబు మరింతగా ప్రోత్సహించారని చెబుతారు జానకిరామ్ .

ఆయన రచనలలో “కచ దేవయాని”,”స్వర్ణసీత””వడ్డాణము” మొదలైనవి రేడియోలో ప్రసారమయ్యాయి.

ఆలిండియా రేడియో వారి మాగజీన్ “వాణి” కి ఎడిటర్ గా సుమారు దశాబ్ద కాలం పనిచేశారు జానకి రామ్ 

అలా రేడియో లో సుమారు ఇరవైయొక్క సంవత్సరాలు పనిచేశారు.

ఏ ఉద్యోగం చేస్తున్నా ఆయన జీవితం పువ్వులూ,పరిమళాలూ,కవిత్వమూ, స్నేహాలతో పెనవేసుకు పోయి వుండేది.

ఆయన ఇంగ్లీషులోనూ,తెలుగులోనూ కూడా లోతైన ప్రవేశం వున్నవారూ ,రెండు భాషలలోనూ కవిత్వం చెప్పేవారు,రచనలు చేసేవారు.

 ఆయన రాసిన కొన్ని కథలు కృష్ణా పత్రికలో ప్రచురించ బడ్డాయి.

1969లో  సరళ సుందర వచనంలో అత్యంత భావుకతతో రవీంద్రనాథ టాగూర్ “గీతాంజలి” తెలుగులోకి అనువాదం చేశారు.చాలా మంచి అనువాదం  వీరి “గీతాంజలి” మీద కావూరి సత్యవతి గారు యం.ఫిల్ చేశారు.

వారి ఇంగ్లీషు రచన “The glimpses of thelugu literature “ని ఆంధ్రమహిళాసభ వారు 1971లో వారి జన్మదిన సందర్భంగా రిలీజ్ చేశారు.

వారు 1961నుండీ విశ్రాంత జీవితం  గడుపుతూ తిరుపతి లో వారి రెండవ భార్య శ్రీమతి ఆచంట శారదా దేవితో కలిసి వుండేవారు .ఆమె కూడా రచయిత్రి కొన్ని కథలు రాశారు.ఆమె తిరుపతి పద్మావతీ మహిళాకళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తూ వుండేవారు .వారి మొదటి భార్యగురించి వివరాలు తెలియవు.

శారదా దేవి గారు ఉద్యోగ విరమణ చేశాక వారిద్దరూ మద్రాసులో స్థిరపడ్డారు.

1994లో తొంభై యేళ్ల నిండు జీవితం గడిపి నిద్రలోనే తనువు చాలించారా ధన్యజీవి.

 జానకి రామ్ భావుకతా,భావాలూ,భాషా ,అభిరుచులూ,అనుభవాలూ ఈ తరం వారు తప్పకుండా తెలుసుకోవాలిసిన అవసరం వుంది.

వారి “గీతాంజలి” అనువాదం నుండీ ఒక గీతాన్ని అందిస్తూ  ముగిస్తాను

            20 వగీతము- –గీతాంజలి”  అనువాదము ఆచంట జానకి రామ్

“నా తోటలోని కెందమ్మి తొలిసారి

పూచినపుడు నేను మరేదో ఆలోచనలో ఉండిపోయాను–

పువ్వును చూడనేలేదు,నేను.

పూలసజ్జ బోసిగా ఉండిపోయింది:పువ్వు వాడిపోయింది.

చీటికీ మాటికీ ఏదో బెంగ ఆవహిస్తూంది నన్ను–

ఇదమిధ్ధమని చెప్పలేని బెంగ,ఉన్నట్టుండి ,మలయ మారుతము

నన్ను మేలుకొలిపి నా దీర్ఘస్వప్నాన్ని కలచి వేస్తుంది.

తొలి వసంత రాగము అవ్యక్త మధురిమతో నాలో ఏవో

క్రొత్త క్రొత్త కోరికలు రేకెత్తిస్తుంది.

—అప్పుడు నేను గుర్తింపలేకపోయాను,సుమా:

మత్తు గొలిపే ఈ మాధుర్యమంతా నాలోనే ఉన్నదనీ

ఈ తీయదనమంతా నా హృదయపుష్పములోనే

ఇమిడి ఉన్నదనీ!”

— భార్గవి

2 thoughts on “నా చదువు కథ Part – 6

  1. చాలా బాగుందండి శ్రీ ఆచంట జానకీరాం గారి జీవిత విశేషాలు, సాహితీ ప్రస్థానం, వారి సున్నితమైన శైలీ గురించిన వివరాలూ! వారి ప్రభావం మీ పఠనాసక్తిని మరింత పెంచిన తీరు అద్భుతంగా ఉంది. నాకు వారి స్వర్ణసీత చాలా ఇష్టం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *