డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 10

గ్రెగరి మరణవార్త తెలిసిన తర్వాత పన్నెండవ రోజున పెట్రో నుండి మెలఖోవులకు ఒకేసారి రెండు ఉత్తరాలు వచ్చాయి. దున్యక్ష వాటిని పోస్ట్ ఆఫీసులోనే చదివి, ఒక్క ఉదుటున ఇంటికి పరుగు పెట్టింది, బలంగా వీచే గాలి వల్ల గాలిలో ఎగిరే ఎండు గడ్డి పరకలా ఇంటికి వచ్చి అక్కడ కంచె దగ్గర కూలబడింది.

            ఆ చర్య గ్రామంలో గందరగోళాన్ని, ఆ ఇంట్లో ఒక తెలియని ఉద్వేగం కలిగేలా చేసింది.

    ‘గ్రీషా బతికే ఉన్నాడు!… మన గ్రీషా బతికే ఉన్నాడు!’ కాస్త దూరంలో ఉండగానే ఆమె రొప్పుతూ అరిచింది.  ‘పెట్రో తన ఉత్తరంలో అదే రాసాడు! గ్రీషా గాయపడ్డాడు, చనిపోలేదు…. తను బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు!’ అంది.

   ‘తల్లిదండ్రులకు నా నమస్కారాలు’, సెప్టెంబర్ 20 వ తేదీని రాసిన ఉత్తర ప్రారంభ వాక్యాలుగా రాసాడు పెట్రో.’మన గ్రీషా చావును గెలిచాడు, ఇప్పుడు బావున్నాడు. ఆ దేవుడి దయ వల్ల మీ అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కమియోంకా స్ట్రుమిలోవా పట్టణం దగ్గర ఉన్న గ్రెగరి రెజిమెంట్ యుద్ధంలో ఉండగా, ఆ దళానికి చెందిన కొందరు కోసాక్కులు, ఒక హంగేరియా సైనికుడు తన ఖడ్గంతో గ్రెగరిని పొడిస్తే అతను గుర్రం నుండి కింద పడిపోవడం చూశారు.అదే అందరికి తెలిసిన విషయం. నేను ఎన్ని రకాలుగా అడిగినా,ఇంతకుమించి ఏ వివరము రాబట్టలేకపోయాను. తర్వాత మా దళంలోకి మైఖేల్ కొషివోయ్ వార్తావాహకుడిగా వచ్చినప్పుడే అతని ద్వారా నాకు గ్రెగరి గురించి ఇంకొన్ని విషయాలు తెలిసాయి. గ్రెగరి ఆ మైదానంలో రాత్రి వరకు అలాగే పడి ఉన్నాడట,ఆ తర్వాత స్పృహలోకి వచ్చి పాకుతూ ఎలాగో నడిచే ప్రయత్నం చేశాడట.నక్షత్రాల ద్వారా దారిని గుర్తిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు తనకు గాయపడిన ఓ అధికారి తారసపడ్డాడట. ఆ గాయపడిన అధికారి బ్రిటిష్ సైన్యంలో ఓ లూయిటెంట్ కాల్నల్, తూటాలు ఆయన పొట్ట మరియు కాళ్ళల్లో దిగబడ్డాయి.గ్రెగరి ఆయన్ని భుజాల మీద వేసుకుని,ఆరు వెరస్టుల దూరం నడిచాడట. ఈ సేవకు గుర్తింపుగా గ్రెగరికి సెయింట్ జార్జ్ క్రాస్ పతకంతో సత్కరించడమే కాకుండా,జూనియర్ సార్జెంట్ అధికారిగా పదోన్నతి కూడా ఇచ్చారట. దీని గురించి ఆలోచించండి!గ్రెగరి గాయం పెద్దదేమీ కాదు,లోతుగా దిగలేదు,పై చర్మం మాత్రం చీరుకుపోయింది,అతని తలపై కొద్దిగా చర్మం కూడా పోయింది; కాకపోతే గుర్రం మీద నుండి కింద పడటం వల్ల స్పృహ తప్పాడు,అంతే! ఇక ఇప్పుడు మళ్ళీ అతను యుద్ధంలో యధావిధిగా పాల్గొంటూ ఉన్నాడని నాకు మైఖేల్ చెప్పాడు. ఇలా రాస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను గుర్రం జీను మీద పెట్టుకుని రాస్తూ ఉండటం వల్ల,అక్షరాలు స్పష్టంగా రాయలేకపోతున్నాను.’

            పెట్రో తన తరువాతి ఉత్తరంలో డాన్ ఉద్యానవనాల్లో ఉండే ఎండిన చెర్రీలను పంపమని, అలాగే తన కుటుంబాన్ని తనను మరచిపోకుండా తరచూ ఉత్తరాలు రాయమని రాసాడు. అలాగే అక్కడ ఉన్న కోసాక్కులు గ్రెగరి తన గుర్రాన్ని సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పడంతో ఆ విషయం గురించి సోదరుడిని తిట్టాడు కూడా. అది పెట్రో సొంత గుర్రం కావడం వల్ల దాని పట్ల నిర్లక్ష్యం అతనికి సహించరానిదిగా అనిపించింది. అందుకని ఈ విషయం గురించి గ్రెగరికి తండ్రిని స్వయంగా రాయమని రాసాడు.

   “కోసాక్కుల ద్వారా అతనికి నేను చెప్పేది ఏమిటంటే ఒకవేళ అతను ఆ గుర్రాన్ని తన సొంత గుర్రంలా చూసుకోకపోతే, వాడు జార్జ్ క్రాస్ మెడల్ సాధించినా సరే వాడి ముక్కు చితకకొడతాను’, అని పెట్రో రాసాడు, దాని తర్వాత పలకరింపులతో ముగించాడు. ఎంత ధైర్యంగా ఉన్నట్టు ఆ ఉత్తరంలో రాసినా, వాన చినుకులతో మసకబారిన అక్షరాలు ఏదో తెలియని విషాదం మోసుకొచ్చినట్టే ఉంది. పెట్రోకి కూడా అక్కడ అంత బాగోలేదని అర్థమైపోతుంది.

  సంతోషంగా ఉన్న పాంటెలిని చూడటం మాత్రం జాలి గొలుపుతుంది. అతను ఆ రెండు ఉత్తరాలు తీసుకుని ఆ గ్రామంలో తిరుగుతూ  చదువుకున్న వారి దృష్టిలో పడేలా వారి చేత పదే పదే గట్టిగా చదివించుకున్నాడు. నిజానికి అతను వినడానికి కాదు అలా చదివించుకుంది, తన సంతోషాన్ని అందరికి తెలియజేయడానికి, అందరితో పంచుకోవడానికి.

  ‘ఆహా!మా గ్రీషా ఎలా ఉన్నాడో చూడండి!’ అంటూ డెక్క లాంటి తన చేతిని పైకి ఎత్తితే, ఆ ఉత్తరం చదువుతున్న పాఠకుడు పెట్రో ఆ ఉత్తరంలో గ్రెగరి గాయపడిన లూయిటెంట్ కల్నల్ ను ఆరు వెరస్టుల దూరం తన వెనుక వేసుకుని మోసుకు వెళ్ళిన దృశ్యానికి వెళ్ళేవాడు.

            ‘ఈ మొత్తం గ్రామంలో నా కొడుక్కే మొదటి క్రాస్ పతకం వచ్చింది’, ఆ వృద్ధుడు ఎంతో గర్వంగా దాని గురించి చెబుతూ, అసూయ నిండిన కళ్ళల్లోకి చూస్తూ ఆ ఉత్తరాలను తిరిగి తీసుకుని, వాటిని తిరిగి తన టోపీ లోపల కుట్టి ఉన్న చిన్న జేబులాంటి దానిలోకి తోసేసి, మరలా అది చదివే ఇంకో వ్యక్తిని  వెతుక్కునే వాడు.

   సెర్జి ప్లాటోనోవిచ్ మొఖోవ్ స్వయంగా తన కొట్టు కిటికీలో నుంచి ఆ వృద్ధుడిని గుర్తించి, బయటకు వచ్చి, తన టోపీ తీసేసి, ఆయన్ని పలకరించాడు.

   ‘ప్రోకోఫోవిచ్, లోపలికి రండి.’

  ఆ వ్యాపారస్తుడు ఆ వృద్ధుడి చేతిని తన తెల్లటి అరచేతిలోకి తీసుకున్నాడు.

   ‘అభినందనలు, అభినందనలు… అటువంటి కొడుకు ఉండటం గర్వకారణం-అతని గొప్పతనం గురించి తండ్రిగా అందరికి చెప్పడం కూడా బావుంది!నేను అతని సాహసం గురించి  వార్తా పత్రికల్లో చదివాను.’

  ‘ఏంటి, ఇది పేపర్ లో వచ్చిందా?’ హఠాత్తుగా గొంతు ఎండిపోవడంతో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది పాంటెలెకి.

 ‘అవును, దాని గురించి నివేదిక వచ్చింది. నేను చదివాను.’

సెర్జి ప్లాటోనోవిచ్ స్వయంగా ఉత్తమ టర్కీ పొగాకును, ఖరీదైన తీపి పదార్దాలను తూకం కూడా చక్కగా ప్యాక్ చేసి,ఒక సంచిలో నింపి, పాంటెలి చేతికి అవి అందిస్తూ, ‘మీరు ఈ సారి గ్రెగరి పాంటెలేవిచ్ కు రాసినప్పుడు, నా ఆశీస్సులు కూడా తెలియజేయండి’, అన్నాడు.

‘ఓ దేవుడా!తప్పకుండా రాస్తాను! దేవుడికి కృతజ్ఞతలు!ఎంతటి గౌరవం గ్రీషాకు!.. ఇప్పుడు ఈ గ్రామం అంతా తన గురించే మాట్లాడుకుంటూ ఉంది. నేను ఏ రోజు కోసం వేచి చూస్తూ ఉన్నానో అది వచ్చింది…’ ఆ వృద్ధుడు మొఖోవ్ కొట్టు మెట్లు దిగుతూ తనలో తానే అనుకున్నాడు.

            ముక్కు చీదుకుంటూ, తన బుగ్గ పైకి కారుతున్న కన్నీటి చుక్కను తన చొక్కా చేతితో తుడుచుకుంటూ, తనలో తానే ఇలా అనుకున్నాడు.’నేను ముసలివాడిని అయిపోతున్నట్టున్నాను. తేలికగా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి…. ఓ పాంటెలి, పాంటెలి, ఒకప్పటి మనిషివి కాదు నువ్వు! ఒకప్పుడు చెకుముకిరాయిలా గట్టిగా ఉండేవాడివి, రెండు వందల కేజీల బరువున్న సంచులు కూడా అవలీలగా ఎత్తేసే వాడివి. కానీ ఇప్పుడు? గ్రీషా నా బలాన్ని లాగేసుకున్నాడు, తను బలంగా అయ్యాడు.’

   అతను తీపి పదార్దాల ప్యాకెట్ ను తన ఛాతికి అనించి పెట్టుకుని, ఆ వీధిలో కుంటుతూ నడుస్తూ ఉంటే, కొక్కిరాయి పిట్ట చివ్వడి నేల మీద తచ్చాడుతున్నట్టు అతని ఆలోచనలు కూడా గ్రెగరి చుట్టూ తిరుగుతున్నాయి, పెట్రో ఉత్తరంలో మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే. అదే సమయంలో అతని వియ్యంకుడు మిరోన్ కోర్షునోవ్ ఎదురొచ్చాడు. ముందే ఆయనే పాంటెలె ని పలకరించాడు.

‘ఓ వియ్యంకుడా! ఒక్క నిమిషం ఆగు!’

  యుద్ధం ప్రకటించిన రోజు నుండి వారు గ్రెగరి ఇల్లు విడిచి వెళ్ళినతర్వాత, రెండు కుటుంబాల మధ్య విరోధం ఏర్పడకపోయినా,కొంత మేరకు ఆ అనుబంధం మాత్రం బీటలు వారింది. మిరోన్ కు నటాల్య పుట్టింటిని వదిలి తనను వదిలేసిన భర్త వెంట కుక్క పిల్లలా తిరుగుతూ, తనను తాను అవమానించుకోవడమే కాకుండా తను కూడా అవమానపడేలా చేసిన ఆమె అంటే చాలా కోపంగా ఉంది.

    ‘ఆ వీధి కుక్క!’ తన కుటుంబ పరిధిలో కూతురిని అతను అలానే సంబోధించే వాడు.’తను ఎందుకు ఈ తండ్రి ఇంట్లో ఉండకూడదు? అత్తారింటికి అలా ఏదో అక్కడ ఇక్కడ స్థితి బావున్నట్టు వెళ్ళిపోవడం ఏమిటి? కన్న తండ్రి అవమానపడేలా చేసింది! ఇప్పుడు దాని వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను!మూర్ఖురాలు!’మిరోన్ పాంటెలి దగ్గరకు వెళ్ళి, మచ్చలతో ఉన్న తన చేతిని ముందుకు చాచాడు.

   ‘మీరు బాగున్నారా!’

  ‘దేవుడి దయ వల్ల!’

  ‘షాపింగ్ చేస్తున్నారా?’

   పాంటెలి తన కుడి చేయి పైకెత్తి అవునన్నట్టు తల ఊపాడు.

  ‘ఇవన్నీ వీరోచితంగా ప్రవర్తించిన నా కొడుక్కి బహుమనాలు. సెర్జి ప్లాటోనోవిచ్, నా కొడుకు సాహసం గురించి పత్రికల్లో చదివి,సంతోషంగా ఈ తీపి పదార్ధాలు మరియు ఖరీదైన పోగాకు ఇచ్చాడు. తన ఆశీస్సులను వీటితో పాటు అందించమని చెప్పాడు. ఇది చెప్తూ, ఆయన కన్నీరు కూడా కార్చాడు, నమ్ముతావా, వియ్యంకుడా నువ్వు?’ పాంటెలి గొప్పలు చెబుతూ, మిరోన్ ముఖంలోకి చూస్తూ, అతని మనసులో ఏముందో ఊహించే ప్రయత్నం చేశాడు.

     చీకటి,వెలుగు రెండు కలిసిన ఓ వింతైన కాంతి మిరోన్ కళ్ళల్లో ఆ వృద్ధుడికి కనిపించింది, కాసేపటికి అది ఓ రకమైన ఎగతాళిగా మారింది.

    ‘ఓ!అవునా!’, మిరోన్ తనలో తానే గొణుక్కుంటూ, అక్కడి నుండి దూరంగా వీధి అవతలి వైపుకు వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

    పాంటెలి అతని వెనుకే వేగంగా పరుగుపెట్టినట్టు నడుస్తూ,తన చేతిలో ఉన్న తీపి పదార్ధాల సంచిని కోపంతో వణుకుతున్న వేళ్ళతో తెరిచాడు.

    ‘ఇదిగో, ఈ చాక్లెట్ తీసుకోండి! దయ చేసి,ఒకటి తీసుకోండి. మీ అల్లుడి తరపున నేను ఇది మీకు ఇస్తున్నాను….మీ జీవితంలో ఏ తియ్యదనం లేదు,కనీసం ఇది తీసుకుంటే బావుంటుందేమో. ఎవరికి తెలుసు మీ కొడుకు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి గౌరవాన్నే పొందుతాడేమో?’ పాంటెలి వ్యంగ్యంగా అన్నాడు.

   ‘నువ్వు నా గురించి ఏం మాట్లాడకు. నువ్వు ఇదంతా నాకు చెప్పాల్సిన పని లేదు.’

   ‘ఒకటి తీసుకోండి,నా కోసం!’పాంటెలి అతిశయోక్తిత కూడిన వినయంతో అడిగాడు,తన వియ్యంకుడి ముందుకు వస్తూ. ముడతలు పడి ఉన్న అతని చేతి వేళ్ళు అప్పటికే ఆ చాక్లెట్ పైన ఉన్న వెండి రంగు ర్యాపర్ ను తొలగించాయి.

    ‘మాకు తీపికి అలవాటు పడలేదు’,మిరోన్ ముందుకు చాచి ఉన్న పాంటెలి చేతిని పక్కకు తోసేస్తూ అన్నాడు. ‘మాకు అవి తినే అలవాటు లేదు,అంతేకాదు మా పళ్ళు ఇతరులు పంచే తియ్యదనాన్ని దయతో స్వీకరించలేవు. అయినా నువ్వు నీ కొడుకు పేరు చెప్పుకుని అలా అడుక్కోకూడదు. నీకు నిజంగా అవసరం ఉంటే,నా దగ్గరకు రా. నేను ఎప్పుడు నా అల్లుడికి సాయం చేయడానికి ముందుంటాను. ఎంతైనా నటాల్య మీ తిండే తింటుంది కదా.కనుక నేను తప్పకుండా మీ పేదరికంలో మిమ్మల్ని ఆదుకుంటాను.’

    ‘మా కుటుంబంలో ఎవరూ కూడా అడుక్కోలేదు,నీ చెక్క లాంటి నాలుకతో అలా అబద్ధాలు మాట్లాడకు, వియ్యంకుడా!నీలో చాలా గర్వాతిశయం ఉంది,ఇప్పటికే అది హద్దులు దాటింది! బహుశా నీకు అంత ఐశ్వర్యం ఉన్నా సరే నీ కూతురు నిన్ను వదిలి మా దగ్గరకు అందుకే వచ్చిందనుకుంటా!’

   ‘ఇక ఆపు!’అతని మాటల్ని మిరోన్ మధ్యలోనే అడ్డుకున్నాడు. ‘ఇప్పుడు మనం గొడవ పడాల్సిన అవసరం లేదు. నేను గొడవ పడటానికి రాలేదు;కాబట్టి శాంతించయ్యా. పద,అలా వెళ్తూ మాట్లాడుకుందాము. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి.’

   ‘అయినా మనం మాట్లాడుకోవాల్సింది ఏమి లేదు.’

   ‘ఉంది.రా.’

   మిరోన్ పాంటెలి చేతిని పట్టుకుని తన పక్కకు లాగాడు. వాళ్ళు అక్కడ ఉన్న ఇళ్ళను దాటి,పచ్చిక బీడు వైపు వచ్చారు.

   ‘అసలు ఇదంతా ఏమిటి?’పాంటెలి కాస్త నెమ్మదించి,శాంతంగా అడిగాడు.

  అతను పక్క నుండి మచ్చలతో ఉన్న మిరోన్ ముఖంలోకి చూశాడు. మిరోన్ తన ప్యాంటును పైకి లాక్కుని అక్కడ ఉన్న ఓ చిన్న కాలువ దగ్గర కూర్చుని పొగాకు సంచిని బయటకు తీసి, దానిలో చక్కటి చేతతో ఉన్న అంచులలో నుండి పొగాకును బయటకు తీశాడు.

    ‘సరే,ప్రోకోఫోవిచ్,నువ్వు ఏ విషయం లేకుండా పందెం కోడిలా నాతో పోట్లాటకు దిగావు. కానీ అది బంధువుల మధ్య మంచిది కాదు. అది మంచిదేనా చెప్పు? సరే అసలు విషయం ఏమిటంటే’, అతని స్వరం ధృఢంగా మారిపోయింది. ‘ఇంకా ఎంత కాలం నీ కొడుకు నా కూతురుని ఇలా వెధవను చేస్తాడు? అది చెప్పు నాకు!’

    ‘నువ్వే వెళ్ళి అతన్ని అది అడుగు.’

   ‘అది నేను అడగాల్సిన విషయం కాదు. మీ ఇంటికి యజమానివి నువ్వు ,అందుకే ఇప్పుడు నేను నీతో ఈ విషయం మాట్లాడుతున్నాను.’

   పాంటెలి తన చేతిలో ఉన్న చాక్లెట్ ను గట్టిగా నొక్కడంతో అతని చేయి అంతా అది అంటుకుపోయింది. అతను ఆ చేతిని అక్కడ ఉన్న మట్టితో తుడుచుకుని, సిగరెట్టు చేసుకునే పనిలో పడ్డాడు. ఒక కాగితం ముక్కలో టర్కీ పొగాకును నింపి మిరోన్ కు అందించాడు.ఎటువంటి సంశయం లేకుండా మిరోన్ దాన్ని అందుకుని, దానితోనే ఒక సిగరెట్ తనకోసం చేసుకున్నాడు. ఇద్దరూ సిగరెట్లు వెలిగించారు. ఆ పొగ ఒక చిన్న మేఘంలా వారి తల పైన గాలికి తిరుగుతూ ఉంది కాసేపు. అక్కడ ఉన్న గడ్డి మొక్కలు కూడా ఆ గాలికి ఒక్కసారిగా పైకి లేచాయి.

   ఆ రోజు ఎండ తీవ్రత క్షీణించి ఉంది. వసంత కాలపు ప్రశాంతత  జోలపాటలా ఉంది. ఆకాశంలో కూడా వేసవికాలపు ఎర్ర ఛాయలు పోయి నీలి రంగు కమ్ముకుంది. యాపిల్ చెట్టు ఆకులు ఎక్కడి నుండి వచ్చి ఆ కాలువ దగ్గరలో పడి ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలి. ఎప్పుడు కనిపించే రహదారి కూడా ఇప్పుడు వంపు తిరిగి ఉన్న కొండలో మాయమైపోయినట్టు ఉంది. ఆ కొండ వెనుకగా ఉన్న ఎన్నో తెలియని ప్రదేశాల వైపుకి ఆ కొండ సూచిస్తున్నట్టు ఉంది. ఇళ్ళల్లో ఉంటూ,రోజూవారి పనులతో, జనాలు తీరిక లేకుండా శ్రమపడుతూ ఉంటే, ఆ రహదారి మార్గం మాత్రం ఎవరికి తెలియనంత దూరం వరకు విస్తరించి ఉంది. వేగంగా వీస్తూ ఉన్న గాలి వల్ల,దుమ్ము పైకి లేస్తూ ఉంది.

    ‘ ఈ పొగాకు గడ్డిలా బలహీనంగా ఉంది’, మిరోన్ పొగ వదులుతూ అన్నాడు.

   ‘అవును,కానీ బాగానే ఉంది’,పాంటెలి ఆమోదిస్తున్నట్టు అన్నాడు.

   ‘సరే,ఇక సమాధానం చెప్పు’, సిగరెట్ పీకను కింద పడేసి, నెమ్మదిగా అడిగాడు మిరోన్.

  ‘గ్రెగరి దాని గురించి ఏమి రాయడు. ఈ సమయంలో అతను గాయపడి ఉన్నాడు.’

   ‘నేను విన్నాను.’

  ‘ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు.బహుశా ఈ సారి అతన్ని సరిగ్గా చంపుతారేమో!ఏమంటారు?’

    ‘కానీ ఇది ఎంత కాలం ఇలానే నడుస్తుంది!’మిరోన్ అతన్ని అడ్డుకుంటూ,నిరసనగా,ఓ రకమైన గందరగోళంతో అన్నాడు. ‘తను ఇప్పుడు బతుకుతున్న తీరు-ఒక అమ్మాయిలా కాదు,ఒక స్త్రీలా కాదు,కనీసం ఒక గౌరవ విధవ కూడా కాదు. నిజంగా ఇది సిగ్గు పడాల్సిన విషయం,అవమానకరమైన విషయం.ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు ఆ సంబంధాలు కుదిర్చే వాళ్ళను ఇంట్లో అడుగు కూడా పెట్టనిచ్చే వాడిని కాదు. ఖచ్చితంగా రానిచ్చే వాడిని కాదు! ఓ,వియ్యంకుడా…ప్రతి మనిషికి తన బిడ్డ మీద ప్రేమ ఉంటుంది……మనలో ఉండే రక్తమే మనల్ని అలా ఉండేలా చేస్తుంది.’

    ‘కానీ నేను ఏం చేయగలను?’పాంటెలి కోపంతో ఎదురుదాడిలోకి దిగాడు.

  ‘ఇది చెప్పు …..నా కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోవడం నాకు సంతోషంగా ఉందని అనుకుంటున్నావా? దాని వల్ల నాకేమైనా మేలు జరిగిందా? ఏం మనుషులు మీరు!’

  ‘నువ్వు అతనికి రాయాలి’, మిరోన్ కింద ఉన్న మట్టిని కొద్దికొద్దిగా కాలువలోకి వేస్తూ కొనసాగించాడు, ‘ఒకేసారి ఏది తేల్చేయమని చెప్పు.’

  ‘వాడికి దాని వల్ల ఓ బిడ్డ కూడా పుట్టింది…’

   ‘అలా అయితే భార్య వల్ల కూడా ఇంకో బిడ్డ పుడుతుంది!’ మిరోన్ అరిచాడు,అతని ముఖం ఎర్రగా మారిపోయింది. ‘అసలు అతను ఒక మనిషితో అలా ఎలా ఉండగలడు?ఎలా? అతని కోసం ఒకసారి తన ప్రాణం తీసుకోబోయే అంగవైకల్యంతో మిగిలింది….ఇక తనను అలా సమాధి వరకు తీసుకుపోవాల్సిందేనా? అసలు అతనికి హృదయం లేదా?’ మిరోన్ స్వరం ఒక్కసారిగా చిన్నపాటి శోకంతో నిండిపోయింది. ఒక చేయి గుండె మీద పెట్టుకుని, ఇంకో చేతిని పాంటెలి కోటు మీద వేస్తూ, ‘లేకపోతే అది తోడేలు గుండా?’ అని అడిగాడు.

     పాంటెలి దీర్ఘంగా నిట్టూర్చి,తల పక్కకు తిప్పుకున్నాడు.

    ‘….ఆ స్త్రీ అతని మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతుంది,అతను లేకుండా ఆమెకు జీవితమే లేదు. తను కేవలం మీ ఇంట్లో పనులు చేసే పనిమనిషి అంతే!’

   ‘తను మాకు మీ కన్నా కూడా ఎక్కువ మా ఇంట్లో! మాటలు తిన్నగా రానివ్వు!’అరుస్తూ,పాంటెలి లేచి నిలబడ్డాడు.

   వారిద్దరూ విభిన్న దిక్కుల్లో ఒకరినొకరు కనీసం చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

                                                    *      *    *  

   ఎప్పుడైతే జీవితం ఓ ఒడ్డుకి చేరాలని అనుకుంటుందో, అప్పుడు అది అనేక పాయలుగా చీలి, తర్వాత ఎటువైపు మళ్ళుతుందో తెలియనివ్వకుండా ఒక మోసపూరిత పద్ధతిలో సాగుతుంది. ఈ రోజు ఎండిపోయి ఉన్నట్టు ఉన్న ప్రవాహం కూడా రేపు నీటితో కళకళలాడుతూ పచ్చగా మారిపోవచ్చు.

            అనుకోకుండా నటాల్య మనసులో ఎలాగైనా అక్సిన్యను కలిసి ఎలాగైనా యాగ్డోనోయ్ లో ఉన్న అక్సిన్య దగ్గరకు వెళ్ళి, ఆమెను గ్రెగరిని వదిలేయమని అర్థించాలన్న కోరిక ఆమెలో బలపడిపోయింది. ఎందుకో తెలియకపోయినా, అంతా అక్సిన్య చేతుల్లోనే అంతా ఉన్నట్టు, ఆమెను గట్టిగా ప్రాధేయపడితే, గ్రెగరి తన దగ్గరకు తిరిగి వచ్చేస్తాడని, తను పూర్వంలానే సంతోషంగా ఉండవచ్చని అనుకుంది. అది నిజంగా సాధ్యమయ్యే పనా కాదా, ఈ వింత అభ్యర్థన గురించి అక్సిన్య ఎలా స్పందిస్తుంది అన్న విషయం గురించి ఆమె ఆలోచించలేదు. ఏదో తెలియని గాఢ సుషుప్తి లో తీసుకున్నట్టు ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు పరచాలన్న తీవ్రత ఆమెకు కలిగింది. ఆ నెల ఆఖరులో మెలఖోవులకు గ్రెగరి నుండి ఓ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసాక, అతను నటాల్య బాగోగుల గురించి కూడా విచారిస్తూ, ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని చూపించాడు. అతను ఏ కారణంతో అది చేసినా సరే, నటాల్యకు తను తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిచేందుకు ఒక ఊతం వచ్చినట్లు అయ్యింది. తర్వాతి ఆదివారం యాగ్డోనోయ్  వెళ్ళడానికి ఆమె సిద్ధమైంది.

      ‘ఎక్కడికి వెళ్తున్నావు, నటాల్య?’ నటాల్య ముఖాన్ని అద్దంలో గమనిస్తూ అడిగింది దున్యక్ష.

   ‘మా పుట్టింటికి వెళ్తున్నాను’, నటాల్య అబద్ధమాడింది. ఆ చర్య వల్ల  అవమానం, నైతిక పతనాన్ని ఆహ్వానిస్తున్నట్టు భావించిన ఆమె ముఖంలోకి రక్తం పొంగింది.

   ‘నువ్వు సరదాగా నాతో ఓ సాయంత్రం బయటకు ఒక్కసారి రావచ్చుగా, నటాల్య? కుదిరితే ఈ రాత్రికే రావచ్చుగా?’దర్య తను ముస్తాబు అవుతూ అడిగింది.

    ‘నాకు తెలియదు, నేను వస్తానని అనుకోవడం లేదు.’

   ‘ఓ! నువ్వో సన్యాసిని లా ఉంటావు. మన మొగుళ్ళు దూరంగా ఉన్నప్పుడు మనకు దొరికే సమయం ఇదే’, దర్య కన్ను కొడుతూ, కొంటెగా అంటూ, దాదాపుగా ముందుకు వంగి, నీలం రంగులో ఉన్న తన గౌను అంచులు అద్దంలో పరిశీలిస్తూ అంది.

    దర్య లో పెట్రో వెళ్ళినప్పటి నుండి చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. ఆమె భర్త లేకపోవడం అన్నది ఆ మార్పులకు పునాదిలా ఉంది. ఆమె కళ్ళల్లో ఓ రకమైన ఓ రకమైన అసహనం, ఆమె కళ్ళల్లో, శరీర కదలికల్లో కనిపిస్తూ ఉంది. ఆదివారాల నాడు ప్రత్యేకంగా ముస్తాబై, సాయంత్రం సమావేశాల నుండి చాలా ఆలస్యంగా వచ్చేది.కంటి కింద నల్లబడ్డ చారలతో, కోపంతో ఇంటికి తిరిగి వచ్చి, నటాల్యతో ఫిర్యాదు చేస్తున్నట్టు అనేది.’ఇది ఎంత బాధాకరమైన విషయం…. యుద్ధం కోసం మంచి కోసాక్కులందరిని తీసుకుపోయారు, ఇక ఈ ఊర్లో ముసలివాళ్ళు, కుర్రవాళ్ళు తప్ప ఎవరూ లేరు.’

     ‘దాని వల్ల నీకు నచ్చే నష్టం ఏమిటి?’

      ‘ఎందుకు లేదు, తప్పకుండా ఉంది!’దర్య ఆశ్చర్యంగా అంది. ‘సాయంత్రాలు సరదాగా గడపటానికి ఎవరూ లేరు. నేను ఒంటరిగా బయటకు వెళ్ళే అవకాశం మిల్లుకి వెళ్ళినప్పుడే వస్తుంది కానీ అప్పుడు కూడా మావయ్య నన్ను గమనిస్తూ ఉండటం వల్ల ఏది వీలు కాదు’, అని  వివరిస్తున్నట్టుగా  అంది.

            ‘అసలు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఒంటరిగా, మగ తోడు లేకుండా ఇన్నాళ్ళుగా?’ ఏ మాత్రం సిగ్గు, సంకోచం లేకుండా నటాల్యను అడిగింది దర్య.

   ‘ఇక చాలు ఆపు… సిగ్గు లేని దానా!’నటాల్య లజ్జతో కందిపోయిన ముఖంతో అంది.

   ‘నీకు కావాలని కూడా అనిపించదా?’

   ‘చూస్తూ ఉంటే నువ్వు ఈ వ్యవహారాల్లో ఉన్నట్టు ఉందే?’

   ‘అవును అమ్మాయి!’ దర్య తన ముఖం గులాబీ వర్ణంలోకి మారి, కనుబొమ్మలు పైకి ఎగిసి పడేవరకు నవ్వుతూనే ఉంది.

   ‘నేను ఎందుకు ఈ విషయం దాచి పెట్టాలి… నేను ఎవరో ఒక ముసలి వాడినైనా తగులుకుంటాను. ఖచ్చితంగా చేస్తాను!ఇప్పటికే పెట్రో  వెళ్ళి రెండు నెలలు గడిచిపోయింది.’

   ‘దీని వల్ల నువ్వు సమస్యల్లో చిక్కుకుంటావు, దర్య.’

   ‘నీ ముసలి ముచ్చట్లు ఆపు ఇంకా! అయినా ఇది ఎంత రహస్యంగా జరిగిపోతుందో నాకు తెలుసు. నువ్వే ఇంత మంచి అవకాశం వదులుకుంటున్నావు!’

   ‘నాకు అటువంటి అవకాశాలు ఏవి వద్దు.’

దర్య ఆమె వైపు కోపంగా చూస్తూ, చిన్నగా ఉండే తన పళ్ళతో పెదాలు కొరుక్కుంటూ, ‘ఆ తర్వాతి రాత్రి అటామాన్ కొడుకు తిమోషా మాంట్ స్కోవ్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. చెమట పట్టి ఉన్నాడు. అతను ఏం మొదలుపెడదామన్నా భయంతో ఉన్నాడని నాకు అర్థమైంది. అతను మెల్లగా తన చేతిని నా చంక దగ్గర పెట్టాడు, ఆ చేయి కూడా వణుకుతూ ఉంది. కాసేపు నేను భరించాను కానీ ఆ తర్వాత నా వల్ల కాలేదు. ఒకవేళ అతను కొద్దిగా మగాడిలా ప్రవర్తించి ఉంటే ఎలా ఉండేదో కానీ… వాడు ఇంకా పిల్లాడే! వాడికి పదహారేళ్ళ కన్నా ఎక్కువ వయసుండదు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళే దొరుకుతున్నారు. అలా నేను మౌనంగా ఉన్నాను…. వాడు నన్ను గోకుతూ ఉన్నాడు, తర్వాత గుసగుసగా “మా ధాన్యపు కొట్టం దగ్గరకు వెళ్దాము” అన్నాడు. ‘అప్పుడు నేను వాడికి ఇవ్వాల్సింది ఇచ్చాను!…’

దర్య చిలిపిగా నవ్వుతూ ఉంటే, సగం మూసినట్టు ఉన్న కళ్ళల్లో ఆ సంతోషపు వెలుగు కనిపిస్తూ ఉంది.

   ‘వాడికి తగ్గట్టు బుద్ధి చెప్పాను! “ఒరేయ్ కుర్రకుంకా! అని ఇంకేదో అంటూ, పైకి లేచాను. “ఒరేయ్! నీ వయసుకు నువ్వు అలా ఎలా అడగగలవు? నువ్వు పక్క తడపటం మాని ఎన్నాళ్ళు అయ్యింది?” వాడికి బుద్ధి వచ్చేలా అన్నాను!’

   ఆమెకు నటాల్యతో ఉన్న అనుబంధం చాలా సాదాసీదాగా, స్నేహపూర్వకంగా ఉండేది. మొదట్లో దర్యకు ఆమె పట్ల ఉండే అయిష్టత ఇప్పుడు పోయింది. వేరైన వ్యక్తిత్వాలతో ఉన్న ఆ ఇద్దరు అలా కలిసిపోయారు.

  నటాల్య కోటు ధరించి బయటకు వచ్చింది.

   దర్య ఆమెకు బయట ఎదురొచ్చింది.

   ‘ఈ రోజు రాత్రి నా కోసం నువ్వు తలుపు తెరుస్తావా?’

  ‘నేను ఈ రాత్రి మా వాళ్ళతో ఉండొచ్చు.’

దర్య తన ముక్కు మధ్యలో తన దువ్వెనతో చిన్నగా గోక్కుకుంటూ, తన తల ఊపింది.

   ‘సరే అయితే. నాకు దున్యక్షను అడగాలని లేదు, కానీ తప్పేలా లేదు.’

   నటాల్య ఇలినిచ్న తో తన కుటుంబాన్ని చూడటానికి వెళ్తున్నానని చెప్పి, బయల్దేరింది. మార్కెట్ నుండి బండ్లు కూడలి వైపు పోతూ ఉన్నాయి. కొంతమంది అప్పుడే చర్చి నుండి బయటకు వస్తున్నారు. నటాల్య రెండు సందులు ముందుకు నడిచి, మూడో సందులోకి వేగంగా వెళ్ళింది. త్వరత్వరగా కొండా పైకి ఎక్కి, ఒకేఒక్క సారి పై నుండి వెనక్కి చూసింది. ఆ గ్రామమంతా సూర్యకాంతితో నిండిపోయి,సున్నం వేసి ఉన్న గదులు తెల్లగా మెరుస్తూ , ఏటవాలుగా ఉన్న మిల్లు పైకప్పు మీద సూర్యకాంతి  పడుతూ నాట్యం చేస్తున్నట్టు ఉంది.

                           *     *     *

    యుద్ధం వల్ల యాగ్డోనోయ్  లోని మగవారు కూడా అక్కడ నుండి యుద్ధరoగానికి పోవాల్సి వచ్చింది. వెనియామిన్, టిఖోన్ వెళ్ళిపోవడంగా ఆ ఎస్టేట్ అంతా మందకోడిగా, నీరసంగా మారిపోయి, ఒంటరిగా అయిపోయినట్టు ఉంది. వృద్ధ జనరల్ కు సహాయకారుడిగా ఉన్న వెనియామిన్ స్థానాన్ని ఇప్పుడు అక్సిన్య తీసుకుంది. భారీకాయంతో ఏ మాత్రం తగ్గే సూచనలు లేని లుకేరియా పెరడు పనులు, కోళ్ళ ఫారం పనులు చూసుకోసాగింది. సాక్షా తాత గుర్రపు శాల పనులతో పాటు, తోటమాలి పనులు కూడా చేస్తున్నాడు. ఇంకా ఆ ఎస్టేట్ లో చేరిన కొత్త వ్యక్తి గుర్రపు బండి నడిపే కోసాక్కు నిఖిటిచ్. వయసులో పెద్దవాడు, హుందాగా ఉండేవాడు.

            ఆ సంవత్సరం జనరల్ తను పంటలు వేసే స్థలాన్ని తగ్గించాడు. కొన్ని జతల గుర్రాలను సైన్యం కోసం ఇచ్చాడు, కేవలం పునరత్పత్తికి తోడ్పడే మేలైన గుర్రాలను, ఎస్టేట్ పనుల కోసం డాన్ ప్రాంతపు మూడు గుర్రాలను మాత్రమే ఉంచాడు.  జనరల్ వేటతో సమయాన్ని గడుపుతూ, తోడుగా నిఖిటిచ్ అడవి కోళ్ళను తరుముతూ ఉంటే,అప్పుడప్పుడు తోడేళ్ళను వేటాడుతూ సమయం గడిపేవాడు.

            గ్రెగరి నుండి అక్సిన్యకు అప్పుడప్పుడు క్లుప్తంగా రాసిన ఉత్తరాలు వచ్చేవి.ఆ ఉత్తరాల్లో తాను బాగున్నట్టు, సైన్యంలో అలవాటు పడిపోయినట్టు రాసేవాడు. నిరాసక్తత వల్లో లేక ఆమె ముందు తన బలహీనతను ప్రదర్శించడం ఇష్టం లేక, అతను ఎప్పుడూ కూడా ఆమెను గురించి తపిస్తున్నట్టు గానీ తనకు అక్కడ ఇబ్బందిగా ఉందనిగాని రాసేవాడు కాదు. అతని ఉత్తరాల్లో ఓ రకమైన ఆహ్లాదత ఉండేది, కానీ అది బలవంతంగా తెచ్చిపెట్టుకున్నట్టు ఉండేది. ఈ మధ్య వచ్చిన అతని ఉత్తరాల్లో ఒక వాక్యం మాత్రం బరువైనదే,’….. నేను ఎప్పుడు యుద్ధంలోనే ఉంటున్నాను, యుద్ధం. చేయడం, చావును నాతో పాటు మోయడం చాలా అలసటను కలిగిస్తుంది నాకు.’ ప్రతి ఉత్తరంలో అతను తన కూతురు గురించి అడుగుతూ రాసేవాడు. ‘…. నా చిట్టి తాన్య  ఏం చేస్తుంది , ఇప్పుడు చూడటానికి ఎలా ఉందో రాయి. తర్వాతి రాత్రి కలలో నాకు తను ఎదిగిపోయినట్టు, ఎర్ర డ్రస్ వేసుకున్నట్టు కనిపించింది.’

   బయటకు చూడటానికి అక్సిన్య బాగానే ఉన్నట్టు కనిపించేది. ఎప్పుడైతే ఆ పాప తండ్రి గ్రెగరి అనే ఆమె నిర్దారణకు వచ్చిందో, అప్పటి నుండే ఆమెకు అతని మీద ఉన్న ప్రేమ   ఆ పాప మీద కూడా కలిగేలా చేసింది. కాలం ఇచ్చిన సాక్ష్యం తిరుగులేనిదిగా ఉంది. బంగారపు వర్ణంలో ఉండే పాప జుట్టు ఇప్పుడు నల్లటి ఉంగరాల జుట్టుగా మారింది, కళ్ళు కూడా రంగు మారాయి, ఇంకా నల్లగా. రోజురోజుకి తండ్రి పోలికలు ఆ పాపలో కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి, ఆఖరికి ఆ పాప నవ్వు కూడా గ్రెగరిని తలపించేలా ఉంది, ఆ నవ్వులో మెలఖోవుల మొరటుతనం ఉంది. ఇప్పుడు అక్సిన్యకు ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న అనుమానం లేసుమాత్రం కూడా లేదు, అందుకే ఆ బిడ్డతో ఆమె అనుబంధం బలపడింది. పూర్వంలా ఆ ఊయల దగ్గరకు  వెళ్ళి, ఆ పాప ముఖంలో తను అసహ్యించుకునే స్టీఫెన్ పోలికలు ఏవైనా కనబడతాయేమోనన్న వెతికే అనుభవంలో కలిగిన విముఖత ఇప్పుడు లేదు.

            రోజులు గడిచిపోతూ, అక్సిన్య హృదయంలో చెడు అవక్షేపాలను ముద్రిస్తూనే ఉన్నాయి. తను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలకు ఏమవుతుందో అన్న భయం ఆమె మెదడులో నాటుకుపోయి, ఆమె మెలకువగా ఉన్నంతసేపు వెంటాడుతూనే ఉంది. రాత్రుళ్ళు కూడా ఆ భయం వదలకుండా ఉండటంతో అప్పటివరకు కూడదీసుకున్న ధైర్యం కాస్త వీగిపోయేది. అక్సిన్య అటువంటి రాత్రుల్లో కన్నీరు కారుస్తూ, ఎవరికి వినపడకుండా ఏడుస్తూ ఉండేది. తన వల్ల పాప నిద్రలేవకూడదని పిడికిళ్ళు బిగపట్టి  దుఃఖాన్ని అణచుకునేది. నైతిక వేదనను భౌతిక వేదనతో భర్తీ చేసే ప్రయత్నం చేసేది. ఆమె కన్నీళ్ళు ఆ పాప న్యాప్కిన్ లను తడిపేసేవి, ఆ సమయంలో ఆమె బాల్యపు అమాయకత్వంతో ఇలా అనుకునేది, ‘ఈ బిడ్డ గ్రెగరి బిడ్డ, నేను తన తోడు లేక ఎంత బాధ పడుతున్నానో కనీసం ఈ పసి గుండె ద్వారా అయినా తనకు చేరుతుందేమో.’

            అటువంటి రాత్రులు గడిచిన తర్వాత ఉదయం ఆమె ఎవరో చితకబాదినట్టు బాధతో నిద్ర లేచేది. ఆమె శరీరమంతా నొప్పిగా ఉండేది, వెండి సుత్తితో ఎద మీద కొడుతున్నట్టు ఉండేది, ఒక రకమైన పరిపూర్ణ దుఃఖం యవ్వనవతి పెదాల్లా ఉండే ఆమె పెదవుల అంచుపై   ఉండేది. అటువంటి రాత్రులు క్రమక్రమంగా ఆమెను వయసు పైబడినదానిలా చేస్తున్నాయి.

            ఒక ఆదివారం ఆమె యజమానికి అల్పాహారం పెట్టి,వాకిట్లోకి వచ్చింది. ఎవరో ఒక స్త్రీ గేటు దగ్గర ఉంది. ముఖానికి చుట్టూ ఉన్న తెల్ల చేతి రుమాల మధ్యలో నుండి ఆమె కళ్ళలో ఏదో జ్వాల రగులుతున్నట్టు భయం కొల్పేలా ఉన్నట్టు అనిపించింది. గేటు గడియ తీసి ఆమె లోపలికి వచ్చింది. ఆమెను నటాల్యగా గుర్తించేసరికి అక్సిన్య ముఖం పాలిపోయింది, మెల్లగా ఆమె వైపు నడిచింది. వాకిలి మధ్యలో ఆ ఇద్దరూ కలిశారు. నటాల్య బూట్లు దుమ్ము పట్టి ఉన్నాయి. ఆమె ఆగి, జీవం లేనట్టు ఉన్న చేతులను పక్కకు వదిలేసినట్టు జార్చి, గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, ఆకృతి కోల్పోయి వంగినట్టు ఉన్న మెడను సరి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, ఆ ప్రయత్నం వల్ల ఆమె దృష్టి ఇంకోవైపు చూస్తున్నట్టు ఉంది.

  ‘నేను నిన్ను చూడటానికి వచ్చాను అక్సిన్యా’, తడారిపోయిన పెదాలను నాలుకతో తడుపుకుంటూ అంది.

            అక్సిన్య వెంటనే వేగంగా  ఆ గది కిటికీల వైపు చూసి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా పని వాళ్ళ క్వార్టర్స్ లో ఉన్న తన గది వైపు నడిచింది. నటాల్య ఆమెను అనుసరించింది. అక్సిన్య ముందు నడుస్తూ ఉంటే ఆమె గౌను కింద నేలకు తాకుతూ చేస్తున్న శబ్దం నటాల్య చెవికి నొప్పిగా అనిపించింది, అనేక ఆలోచనలు ఆమె మెదడులో తిరుగుతూ ఉంటే ఒక్క ఆలోచన దగ్గర ఆమె ఆగింది,’ఈ వేడి వల్ల అనుకుంటా… నా చెవులు ఇలా నొప్పిగా అనిపిస్తున్నాయి.’

              అక్సిన్య నటాల్యను లోపలికి రానిచ్చి, తర్వాత తలుపు వేసింది. ఆ తర్వాత ఆమె ఆ గది మధ్యలో నిలబడి, తన చేతులని కోటు కింద ఉంచింది. ఇప్పుడు ఈ ఆట మొత్తం ఆమె అధీనంలో ఉంది.

   ‘ఎందుకు ఇక్కడికి వచ్చావు?’ సున్నితంగా, గుసగుసగా అడిగింది.

  ‘నేను తాగడానికి మంచినీరు దొరుకుతుందా….’ నటాల్య అడుగుతూనే ఉన్నా, ఆమె కళ్ళు మాత్రం ఆపాటికే ఆ గదిని గాలిస్తూ ఉన్నాయి.

   అక్సిన్య కాసేపు మౌనంగా ఉంది. నటాల్య  మాట్లాడటం మొదలుపెట్టింది, మధ్యలో గొంతు పెంచడానికి అతికష్టం మీద ప్రయత్నం చేస్తూ.

    ‘నువ్వు నా భర్తను నా నుండి లాక్కున్నావు.. నాకు గ్రెగరిని తిరిగి ఇచ్చేయి! నువ్వు…. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు…. చూడు  నేను ఎలా అయిపోయానో….’

  ‘నీ భర్తను నీకు తిరిగి ఇవ్వాలా?’పళ్ళు కొరుకుతూ అంది. ఆ మాటలు రాయి మీద పడ్డ వాన చినుకుల్లా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా, తీవ్రంగా, ‘నీ భర్తా? ఎవరి గురించి అడుగుతున్నావు? అది ఇప్పటికే ఆలస్యం అయిపోయింది… ఇప్పుడు అడిగే సమయం దాటిపోయింది!’

  అక్సిన్య ముందుకు వచ్చి, శరీరమంతా వయ్యారంగా ఊపుతూ, వెటకారంగా నవ్వుతూ అంది.

  ఆమె తన శత్రువు ముఖంలోకి ఎగతాళిగా చూసింది. ఇక్కడ న్యాయబద్ధంగా వివాహమై కూడా వదిలివేయబడ్డ భార్య, ఆమె ముందు లజ్జ, అవమాన భారాలతో నిండి నిలబడి ఉంటే; ఆమె దుఃఖానికి కారణమై, ఆమె నుండి గ్రెగరిని దూరం చేసి, ఆమె గుండెకోతకు కారణమైన స్త్రీ ఆమె ఎదురుగా ఉంది. ఒకప్పుడు ఇదే బాధ  అక్సిన్య అనుభవిస్తున్న సమయంలో, ఈ స్త్రీ అతనితో సంతోషంగా కాలం గడుపుతూ, అతను తన కోసం వదిలేసిన స్త్రీని తలుచుకుని నవ్వుకుంటూ ఉండి ఉంటుంది.

            ‘అందుకని నువ్వు ఇప్పుడు నన్ను అతన్ని వదిలేయమని అడగడానికి వచ్చావు!’అక్సిన్య రొప్పుతూ అంది. ‘నువ్వో విషమున్న పామువి! గ్రెగరిని నా నుండి దోచుకున్నది నువ్వు. అవును, అది నువ్వే! నేను కాదు!అతను నాతో ఉంటున్నాడని తెలిసి కూడా నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకున్నావు? నాది అనుకున్నవాడు నాకు దక్కాడు, తను నావాడే. అతని వల్ల నాకు ఒక బిడ్డ కూడా ఉంది, కానీ నువ్వు…’

   ద్వేషంతో ఆమె నటాల్య కళ్ళలోకి చూస్తూ, ఎప్పటి నుండో ఆమె మనసులో నిండిపోయి ఉన్న కోపాన్ని వెళ్ళగక్కింది.

   ‘గ్రీషా నావాడు. నేను ఎవరికోసం అతన్ని వదులుకోను!… అతను నావాడే! నా వాడే! నీకు వినిపిస్తుందా? నావాడే!… ఇక బయటకు పో, సిగ్గులేని కుక్క! నువ్వు అతనికి భార్యవే కాదు. నువ్వు నా బిడ్డ నుండి తండ్రిని దూరం చేద్దామనుకుంటున్నావా? ఓహో, నువ్వు ఎందుకు ముందే రాలేదు? ఎందుకు రాలేదు? హా…’

నటాల్య పక్కకు ఉన్న బల్ల దగ్గరకు జరిగి, తన తల కిందకు వంచి, చేతులతో ముఖం కప్పుకుంది.

  ‘నువ్వు నీ సొంత భర్తను వదిలేసావు… అలా అరవకు.’

   ‘నాకు గ్రీషా తప్ప వేరే భర్త లేడు. ఈ ప్రపంచంలో నాకు తను తప్ప ఎవరూ లేరు!’

   గుండె లోతుల్లో  జ్వాలలా రగులుతున్న కోపంతో అక్సిన్య, చేతి రుమాలు పక్కకు జరగడం వల్ల కిందకు జారిన నటాల్య నల్ల కురుల వైపు చూస్తూ అంది.

   ‘ఇంకా అతనికి నువ్వు కావాలని అనుకుంటున్నావా? ఒక్కసారి వంగిపోయి ఉన్న నీ మెడను అద్దంలో చూసుకో! ఇప్పుడు నీ అందంతో అతన్ని కట్టిపడేయగలనని అనుకుంటున్నావా? నువ్వు చక్కగా ఉన్నప్పుడే అతను నిన్ను వదిలేశాడు. ఇప్పుడు అతనికి ఈ అవిటిది నచ్చుతుందని ఎలా అనుకుంటున్నావు ? నీకు ఎప్పటికీ గ్రీషా దక్కడు. ఇదే నేను నీకు చెప్పేది. ఇక బయటకు పో!’

    అక్సిన్య తన గూడు తన నుండి దూరం కాకుండా ఉండటానికి, పూర్వ జీవితంలో బాధ మరలా అనుభవించే స్థితి రాకుండా ఉండటానికి శాయశక్తులా పోరాడుతూ ఉన్నట్టు ఉంది. నటాల్య మెడ కొద్దిగా వంగి ఉన్నప్పటికి,ఆమె పూర్వంలానే అందంగా ఉన్నదన్న నిజం కూడా గుర్తించింది. ఆమె బుగ్గలు,నోరు సమయంతో పాటు వృద్ధాప్యపు చిహ్నాలు సూచిస్తూ లేకుండా యవ్వనంలో ఉన్నట్టే ఉంటే;అక్సిన్య కళ్ళకింద అపటికే ముడతలు ఏర్పడి ఉన్నాయి,దానికి కూడా నిందించాల్సింది నటాల్యనే అనుకుంది ఆమె.

   ‘నేను నిన్ను అడగటం వల్ల నీ మనసు మారుతుందన్న ఆశ ఉండే నేను వచ్చానని అనుకుంటున్నావా?’ బాధతో నిండిన కళ్ళతో అడిగింది నటాల్య.

   ‘అయితే మరి ఎందుకు వచ్చావు?’ అక్సిన్య గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అడిగింది.

   ‘గుండెకోత భరించలేక.’

   ఆ మాటల ధ్వనికి అక్సిన్య కూతురు నిద్ర లేచి,ఏడుపు అందుకుంది. ఆ తల్లి బిడ్డను చేతుల్లోకి తీసుకుని,కింద కూర్చుని, కిటికీ వైపుకి తిరిగింది. ఆ బిడ్డను చూడగానే, నటాల్య ఒళ్ళంతా ఒణికిపోతూ, గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అనిపించింది. ఆ బిడ్డ ముఖంలో ఆమెకు పసి కుతూహలంతో చూస్తూ ఉన్న గ్రెగరి  కళ్ళు కనిపించాయి.

   ఆమె వాకిట్లోకి వచ్చేసింది, ఆమె కళ్ళు అంతా కన్నీళ్లు నిండి ఉన్నాయి. అక్సిన్య ఆమెకు వీడ్కోలు చెప్పే ప్రయత్నం ఏమి చేయలేదు,బయటకు రాలేదు.

   ఒక రెండు నిముషాల తర్వాత సాష్కా లోపలికి వచ్చాడు.

   ‘ఆ వచ్చిన స్త్రీ ఎవరు?’ నిజాన్ని ఊహిస్తూనే ఆమెను అడిగాడు.

   ‘గ్రామం నుండి ఎవరో తెలిసిన ఆవిడ.’

   నటాల్య ఆ ఎస్టేట్ నుండి మూడు వెరస్టుల దూరం నడిచి,అక్కడ ఉన్న ఓ ముళ్ళపొద దగ్గర కూలబడింది. ఆమె మనసంతా చెప్పలేని వేదనతో నిండిపోయి,శూన్యత ఆవరించినట్టు అయిపోయింది. ఆ పాప ముఖంలో చూసిన గ్రెగరి నల్లటి కళ్ళు ఆమె మనోదృశ్యంలో పదేపదే ప్రత్యక్షమవుతున్నాయి.

                            *      *     *

            గ్రెగరి ఆ రాత్రి జరిగింది అతి కష్టం. మీద స్పష్టంగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.ఆ రోజు తెలవారుతూ ఉండగా, అతనికి మెలకువ వచ్చింది. క్షవరం చేసిన తర్వాత గడ్డం దగ్గర చిన్నగా పెరిగిన జుట్టును తడుముకుంటూ,తల పగిలిపోతున్నట్టు కలుగుతున్న నొప్పి వల్ల మూలుగుతూ లేచాడు. ఎంతో ప్రయత్నం మీద తన చేయి పైకి ఎత్తి, చిక్కులు పడి ఉన్న తన ముంగురులను తాకాడు, అది ఎండిన రక్తంతో తడిచి ఉంది. ఆ పచ్చి గాయం పైన అతని వేలు తగలడం వల్ల మండుతున్న బొగ్గు పడినట్టు అనిపించింది. బాధతో పళ్ళు బిగపట్టి, వెనక్కి వాలాడు. ఉదయపు మంచు వల్ల నేల మీద రాలిన పండుటాకులు గాలికి కదులుతూ శబ్దం చేస్తూ ఉన్నాయి. చెట్టు కొమ్మల నల్లటి నీడలు ఆకాశానికి వ్యతిరేక దిశలో పడుతూ ఉంటే, నక్షత్రాలు ఆకాశంలో తళుక్కుమంటున్నాయి. గ్రెగరి కళ్ళు పెద్దవి చేసి, రెప్ప వాల్చకుండా వాటి వైపు చూస్తూ ఉన్నాడు;అతని కళ్ళకు అవి నక్షత్రాల్లా కాకుండా నీలం-పసుపు రంగు మిళితమైన వింతైన ఫలాలు కాడాల నుండి వేలాడుతున్నట్టు అనిపించింది.

            అప్పటికి ఏం జరిగిందో పూర్తి గ్రహింపుకి  వచ్చాక, అతనికి ఒక్కసారి ఒళ్ళు జలదరించినట్టు అనిపించింది. వెంటనే కాళ్ళ మీద, రెండు చేతులు కూడా నేలకు అనించి, పళ్ళు బిగపట్టి పాకడం మొదలుపెట్టాడు. నొప్పి ఒక్కసారిగా శరీరమంతా పాకి, తీవ్రమైన బాధ కలిగిస్తూ ఉంది. అలా ఎంతోసేపు పాకిన తర్వాత, అతను తన చుట్టూ చూశాడు. అంతక్రితం అతను స్పృహ కోల్పోయి పడి ఉన్న చెట్టు కేవలం యాభై అడుగుల దూరంలోనే కనిపించింది. ఓ శవం మీదుగా పాకుతూ ఉంటే, అతని మోచేతులు లోతుకు పోయినట్టు ఉన్న ఆ పొట్టకు తగిలాయి.అప్పటికే ఎక్కువ రక్తం కోల్పోవడంతో, చిన్న పిల్లాడిలా ఏడ్చి, పక్కనే మంచుతో తడిసి ఉన్న గడ్డిని స్పృహ కోల్పోకుండా ఉండటానికి నమిలాడు. వెల్లకిలా పడి ఉన్న ఆయుధాల పేటిక పక్కన, అతను అతి కష్టం మీద లేచి నిలబడి,కొద్దిగా తూలుతూనే,నడక మొదలుపెట్టాడు.నెమ్మదిగా శక్తి కూడగట్టుకుని, అడుగుల్లో వేగం పెంచుకుని, తూర్పు దిక్కులో దారిని వెతుక్కుంటూ బయలుదేరాడు.

            అడవిని దాటుతూ ఉండగా, అతనికి ఓ హెచ్చరిక వినబడింది.

   ‘నా దగ్గరకు వస్తే కాల్చేస్తాను.’

   ఒక తుపాకీ తూటా వేరే దిక్కులో పేలింది. గ్రెగరి ఆ శబ్దం వచ్చిన దిక్కు వైపుకి చూశాడు.

అక్కడ ఓ పైన్ చెట్టు పక్కన ఒక మనిషి మోచేతి సాయంతో నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.

   ‘ఎవరు నువ్వు?’ తన గొంతునే అపరిచిత స్వరంలా వింటూ గ్రెగరి అడిగాడు.

   ‘నువ్వు రష్యా వాడివా? ఓ దేవుడా!.. ఇటు రా!’ ఆ చెట్టు దగ్గర ఉన్న వ్యక్తి నేల మీద కూలబడుతూ పిలిచాడు.

   గ్రెగరి అతని వద్దకు వెళ్ళాడు.

   ‘కిందకు వంగు.’

   ‘నేను వంగలేను.’

   ‘ఎందుకు?’

‘నేను వంగితే కిందపడి పోయి మరలా పైకి లేవలేను. నా తలలో గాయం అయ్యింది.’

  ‘నువ్వు యే యూనిట్ కి చెందినవాడివి?’

  ‘పన్నెండవ డాన్ రెజిమెంట్.’

   ‘కొసాక్కు, నాకు సాయం చేయి.’

‘సార్, నేను పడిపోతాను.'(గ్రెగరి ఆఫీసరు కోటు మీద ఉన్న పదవిని సూచించే బాడ్జిని చూశాడు.)

‘కనీసం, నాకు చెయ్యి అయినా అందించు.’

   గ్రెగరి ఆ అధికారికి సాయం చేస్తే, వాళ్ళిద్దరూ కలిసి నడిచారు. ఆ గాయపడిన అధికారి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ, గ్రెగరి భుజం మీద తన బరువు వేయసాగాడు. మధ్యలో ఉన్న ఒక గుంటలో నుండి వెళ్తూ పైకి ఎక్కుతూ, ఇక ఓపిక లేక, ఆ అధికారి గ్రెగరి చొక్కా పట్టుకుని, నొప్పితో బాధగా,’కొసాక్కు, నన్ను ఇక్కడ వదిలేయ్…. నా కడుపులో గాయం అయ్యింది. తూటా సరిగ్గా ఇక్కడ నుండి దూసుకుపోయింది.’

  కళ్లద్దాల వెనుక ఉన్న ఆ కళ్ళల్లో కాంతి తగ్గిపోతూ ఉంటే, శ్వాస కోసం ఉక్కిరిబిక్కిరి అవుతూ, కొద్ది క్షణాలకు ఆయన స్పృహ కోల్పోయాడు. గ్రెగరి ఆయన్ని ఎత్తుకుని, కింద పడుతూ, పైకి లేస్తూ, ఎలాగో మోసుకుంటూ వెళ్ళాడు. రెండు సార్లు ఆ బరువు మోయలేక కింద వదిలేసినా, మరలా వెనక్కి వచ్చి, ఎలాగో తంటాలు పడుతూ, ఏదో కలలో నడుస్తున్నట్టు నడిచాడు. ఆ ఉదయం పదకొండు గంటలకు సైన్యరక్షణ సిబ్బంది వారిని చూసి, డ్రస్సింగ్ స్టేషన్ కు తీసుకువెళ్ళింది.

            ఒక రోజు తర్వాత గ్రెగరి ఎవరికి చెప్పకుండా తన తలకు  రక్తం మరకలతో ఉన్న  ఆ కట్టును. తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

  ‘నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?’ ఆ దళపు అధికారి ఆశ్చర్యపోతూ అడిగాడు.

   ‘సార్, నేను రెజిమెంటుకి తిరిగి వచ్చాను.’

  గ్రెగరి తర్వాత చూసిన వ్యక్తి ఆ దళపు సార్జెంట్ అధికారి.

  ‘సార్, నా గుర్రం ఎక్కడ ఉంది?’

  ‘అబ్బాయి, నీ గుర్రం సురక్షితంగా ఉంది. ఆస్ట్రీయన్లను తరిమి కొట్టాక, ఆ గుర్రాన్ని అక్కడ నుండే తీసుకువచ్చాము. నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ మేము నీ ఆత్మకై ప్రార్థన చేస్తూ ఉన్నాము.’

  ‘మీరు చాలా తొందర పడ్డారు’, గ్రెగరి నవ్వుతూ అన్నాడు.

                        అధికారుల లేఖ సంగ్రహం  

తొమ్మిదవ డ్రాగూన్ రెజిమెంట్ కమాండర్ అయిన కల్నల్ గుస్తావ్ గ్రోస్ బర్గ్ జీవితాన్ని కాపాడినందుకు గాను, పన్నెండవ డాన్ కొసాక్కు రెజిమెంటుకి చెందిన గ్రెగరి మెలఖోవుకు కార్పొరల్ పదోన్నతిని ప్రకటిస్తూ, నాలుగవ తరగతికి చెందిన సెయింట్ జార్జ్ క్రాస్ పతకాన్ని కూడా ఇవ్వబోతున్నాము.

            ఆ దళం కామోనిస్కా స్ట్రుమిలోవా పట్టణంలో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తర్వాతి రాత్రి బయలుదేరారు. గ్రెగరి తన బృందం నివసించిన ఇంటికి వెళ్ళి, తన గుర్రాన్ని పరీక్షించాడు.ఒక జత లోదుస్తులు, ఒక తువాలు జీను సంచిలో కనిపించలేదు.

            ‘నా కళ్ళముందే వాళ్ళు ఇక్కడ ఉన్నవి దోచుకుని వెళ్ళిపోయారు గ్రెగరి’, మైఖేల్ కోషివోయ్ అపరాధ భావంతో ఒప్పుకుంటున్నట్టు అన్నాడు. ఆ గుర్రాన్ని సంరక్షించే బాధ్యత అతనికే అప్పగించబడింది.

            ‘ఆ పదాతి దళం గుంపుగుంపులుగా ఇక్కడికి వచ్చారు. చాలా వస్తువులు తీసుకుపోయారు.’

  ‘ఏదైనా తీసుకుపోని, నాకు ఏది అక్కర్లేదు… నా తల పై పట్టీ వేసుకోవడానికి ఏదైనా గుడ్డ కావాలి, అంతే. రక్తం కారుతూ ఉంది.’

  ‘నా తువాలు తీసుకో.’

  వాళ్ళు మాట్లాడుకుంటున్న పశువులశాలలోకి ఊర్యుపిన్ వచ్చాడు. అతను వారి మధ్య ఏం జరగనట్టే ఆత్మీయంగా చేయి ముందుకు చాచాడు.

  ‘ఓ, మెలఖోవ్… మొత్తానికి బతికి బయటపడ్డావు.’

‘అవును.’

  ‘నీ నుదురుపై రక్తం ఉంది, తుడుచుకో.’

‘ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది.’

‘నిన్ను వాళ్ళు ఏం చేశారో చూడని.’

 ఉర్యుపిన్ గ్రెగరి తల కిందకు లాగి చూశాడు.

  ‘నువ్వు ఎందుకు వాళ్ళని నీ తలను గొరగనిచ్చావు? చూడటానికి ఎలా ఉన్నావో…! ఆ వైద్యులు నిన్ను ఇంకా చెత్తలా చేస్తారు. నన్ను నీకు వైద్యం చేయని.’

గ్రెగరి అనుమతి కోసం ఎదురు చూడకుండా, అతను వెంటనే తన సరంజామా ఉన్న సంచిని బయటకు తీసి, అందులో ఉన్న గన్ పౌడర్ ను చెమటతో తడిగా ఉన్న తన అరచేతిలో వేసుకున్నాడు.

  ‘నాకు ఒక సాలెపురుగు తీసుకురా, మైఖేల్!’

            కోషివోయ్ తన ఖడ్గంతో పైన దూలానికి ఉన్న ఒక సాలెపురుగును లాగి, అతనికి అందించాడు. అదే ఖడ్గంతో ఉర్యుపిన్ కింద నేలను తవ్వి కొద్దిగా మట్టిని బయటకు తీసి, దానిని సాలెపురుగు, గన్ పౌడర్ తో కలిపి, ఆ మిశ్రమాన్ని కాసేపు నమిలాడు. అప్పుడు పేస్టులా ఏర్పడిన దాన్ని రక్తం కారుతూ ఉన్న గాయం మీద అద్ది , నవ్వాడు.

   ‘మూడు రోజుల్లో ఆ గాయం పోతుంది. చూడు, నేను నిన్ను ఎలా చూసుకుంటున్నానో, నువ్వు నన్ను ముందు కాల్చి పడెయ్యాలని అనుకున్నా సరే.’

  ‘నీ శ్రద్ధకు ధన్యవాదములు. కానీ నిన్ను చంపి ఉంటే, నేను చేసిన పాపాల సంఖ్యలో ఒకటి తగ్గేది.’

  ‘నువ్వు ఏదైనా సూటిగా మాట్లాడతావు.’

  ‘నన్ను దేవుడు ఎలా తయారు చేసాడో నేను అలానే ఉన్నాను. ఇంతకి నా తల పైన ఎలా ఉంది?’

  ‘ఏడు ఇంచుల లోతుకి తెగింది.ఇది వారి జ్ఞాపకార్థముగా నీకు మిగిలిపోతుంది.’

  ‘నేను ఎప్పటికీ మర్చిపోను.’

   ‘నువ్వు మర్చిపోవాలన్నా మర్చిపోలేవు. ఆ ఆస్ట్రియా వాళ్ళు పదునైన ఖడ్గాలు  వాడలేదు. పదును లేని కత్తితో నిన్ను దాడి చేశారు. నీ జీవితాంతం తల మీద ఇది ఒక మచ్చలా ఉండిపోతుంది.’

‘అది ప్రమాదకరమైన గాయం కాకపోవడం వల్ల నువ్వు అదృష్టవంతుడివి, గ్రెగరి, లేకపోతే నిన్ను మేము పరాయి దేశపు భూమిలో పాతిపెట్టాల్సి వచ్చేది’,కోషివోయ్ నవ్వుతూ అన్నాడు.

   ‘ఇప్పుడు నేను ఈ టోపీని  ఏం చేయను?’

  గ్రెగరి తన చేతుల్లో చిరిగిపోయి, రక్తంలో తడిసిపోయి ఉన్న టోపీ వైపు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు.

  ‘దాన్ని పక్కన పడేయ్, కుక్కలు తింటాయి.’

  ‘అబ్బాయిలు, ఒకసారి ఇటు రండి!’ ఎవరో లోపలి నుండి అరిచారు.

  కొసాక్కులు ఆ పశువులశాల నుండి బయటకు వెళ్ళారు. ఆ గుర్రం గ్రెగరి వెళ్తూ ఉంటే కళ్ళు తిప్పుతూ, బాధతో మూలిగింది.

   ‘అది నీ కోసం బాధ పడుతూ ఉంది, గ్రెగరి’, కోషివోయ్ గుర్రం వైపు తల తిప్పుతూ అన్నాడు.’నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అసలు తిండి తినలేదు, చిన్నగా మూలుగుతున్నట్టు సకిలీస్తూనే ఉంది.

‘ఆ రోజు ఇక్కడి నుండి బయటకు వెళ్ళడానికి మార్గం చూస్తూ ఉన్నప్పుడు, నేను దాన్ని పిలుస్తూనే ఉన్నాను’, గ్రెగరి తల పక్కకు తిప్పి, బొంగురు గొంతుతో అన్నాడు.’నన్ను ఎప్పటికీ విడిచి పెట్టదని అనుకున్నాను, కానీ దాన్ని పట్టుకోవడం కష్టమైంది, వేరే వాళ్ళను దగ్గరకు రానివ్వదు’, కొనసాగించాడు.

  ‘అవును, ఎలాగో చూశాము. దాన్ని తాడుతో కట్టేయాల్సి వచ్చింది.’

  ‘ఇది నిజంగా చాలా మంచి గుర్రం, నా అన్న పెట్రోది.’అలా అంటూ తన కళ్ళల్లో తిరుగుతున్న నీరు కనబడకూడదని పక్కకు తిరిగాడు.

   వాళ్ళు ఇంట్లోకి అడుగుపెట్టారు. ముందు గదిలో మంచం మీద ఉన్న చాప నేల మీద పరిచి ఉంటే, దాని మీద గురక పెడుతూ ఎగోర్ జార్కోవ్ నిద్రపోతూ ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆ గదిని చూస్తేనే యజమానులు కంగారుగా విడిచి పెట్టి వెళ్ళారని అర్ధమవుతుంది. పగిలి ఉన్న వంట గది వస్తువులు, చిందరవందరగా పడి ఉన్న కాగితాలు, పుస్తకాలు, తేనె మరకలతో ఉన్న కొన్ని బట్టలు, పిల్లల బొమ్మలు, పాత బూట్లు, నేలంతా పిండి చిమ్మినట్టు ఉండటం వంటివి వారి తొందరకు సాక్ష్యలుగా ఉన్నాయి.

  యెమిల్యాన్ గ్రోషేవ్, ప్రొఖోర్ జికోవ్ బల్ల మీద కొంత స్థలాన్ని శుభ్రం చేసి, భోజనం తింటున్నారు. దూడలా ఉండే ప్రొఖోర్ కళ్ళు గ్రెగరిని చూడగానే పత్తిలా విచ్చుకున్నాయి.

   ‘గ్రీ… షా…!ఎక్కడి నుంచి వచ్చావు?’

  ‘వేరే ప్రపంచం నుండి.’

  ‘వెళ్ళి త్వరగా తనకు కూడా సూప్ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు?’ ఉర్యుపిన్ ఉరిమినట్టు అన్నాడు.

   ‘వంటగది పక్కనే ఉంది. నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను.’

  ప్రొఖోర్ నములుతూనే  వంట గది వైపు వెళ్ళాడు.

  గ్రెగరి అలసిపోయి అతను అంతకుముందు కూర్చున్న చోటులో కూర్చున్నాడు.

  ‘నేను ఆఖరి సారిగా ఎప్పుడు తిన్నానో నాకు గుర్తు లేదు,’, నవ్వుతూ అన్నాడు.

            ‘మూడవ దళానికి చెందిన యూనిట్లు పట్టణం గుండా వెళ్తూ ఉంది. ఆ పట్టణమంతా కూడా పదాతి దళాలతో, కిక్కిరిసి ఉన్న రైళ్ళతో, ఆశ్విక దళాలతో హడావుడిగా ఉంది. కూడళ్ళు రద్దీగా ఉండటంతో, ఆ శబ్దాలు ఆఖరికి తలుపు వేసిన  ఆ ఇంటి లోపలికి కూడా వినిపిస్తున్నాయి.

            ప్రొఖోర్ ఒక రేకు డబ్బాలో సూపుతో పాటు, ఒక కాగితంలో ఉడకపెట్టిన కుట్టు (బక్ వీట్ అంటారు ;ఇవి ఓ రకమైన గోధుమలు)తో ప్రత్యక్షమయ్యాడు.

   ‘ఈ కుట్టు ఎక్కడ పెట్టను?’

   ‘ఇక్కడ ఒక పెనం ఉంది, దానిలో పెట్టు.’ గ్రోషేవ్ కిటికీ గుమ్మం దగ్గర ఓ కుండలా ఉన్నదాన్ని తీసుకున్నాడు, దాని వాడకం గురించి తెలియకపోయినా.

   ప్రొఖోర్ ముఖం చిట్లించాడు.’ఆ పెనం నుండి వాసన కంపు వస్తుంది.’

  ‘అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందు దానిలో పెట్టు, తర్వాత ఆలోచించవచ్చు.’

  ప్రొఖోర్ చుట్టూ ఉన్న కాగితం తీయగానే, మెత్తగా జావలా ఉన్న ఆ కుట్టు చుట్టూ వెన్నతో , పొగలు కక్కుతూ ఉంది. వాళ్ళు తింటూనే మాట్లాడుకున్నారు.

‘పక్క ఇంట్లోనే పర్వతఫిరంగుల దళం  వాళ్ళ గుర్రాలకు ఆహరం పెడుతూ ఉంది. వాళ్ళ అధికారి తను పేపర్ లో చదివింది ఇలా చెప్పాడు ;ఆ జర్మన్లకు సాయంగా ఉంటామన్న దేశాలు కూడా అండగా లేవట.’

  ‘మెలఖోవ్, ఈ ఉదయం ఓ విషయం జరిగింది, కానీ నువ్వు లేవు’, ఉర్యుపిన్ నోటి నిండా ఉన్న కుట్టి తింటూ త్రేన్పుతూ,’మనకు ధన్యవాదములు చెబుతూ ఒక సందేశం వచ్చింది.’

 ‘ఎవరి నుండి?’

‘మన విభాగ ముఖ్య అధికారి, లూయిటెంట్ జనరల్, వన్ డేవిడ్, ఉదయం తనిఖీకి వచ్చి, హంగేరి హుస్సార్ల నుండి దళాన్ని కాపాడినందుకు ధన్యవాదములు చెప్పాడు. వాళ్ళు దాదాపుగా తుపాకీలతో సహా పారిపోయారు, తెలుసా. “బాగా పోరాడారు, కొసాక్కులు. మీ సేవలను జార్ మరియు మీ పితృభూమి ఎప్పటికీ మర్చిపోదు”, అన్నాడు.

   గ్రెగరి అదేమి పట్టించుకోనట్టు చూశాడు.

వీధి అంతా అరుపులతో, తుపాకీలు, ఫిరంగులు పెళుతున్న శబ్దాలతో నిండిపోయింది ఒక్కసారిగా.

‘బయటకు రండి!’ ఒక గొంతు బయటి నుండి అరిచింది.

  స్పూన్లను అక్కడే పడేసి, కొసాక్కులు బయటకు పరిగెత్తారు. ఒక విమానం అప్పుడే పైన వలయాకారంలో తిరుగుతూ,  ఇంజిన్ శబ్దంతో చెవుల్లో రొద పెడుతూ ఉంది.

‘కంచె కిందగా ఉండండి. వాళ్ళు ఏ క్షణంలో అయినా బాంబులు వేయొచ్చు. అటు పక్కనే వాళ్ళ దళం కూడా ఉంది!’ ఉర్యుపిన్ అరిచాడు.

  ‘యెగోర్ ని నిద్ర లేపండి. ఆ మెత్తటి చాపలోనే చంపబడతాడు.’

  ‘తుపాకులు తెచ్చుకోండి.’

కిందకు సగం వంగి, సైనికులు వీధుల్లో పరిగెడుతూ ఉన్నారు. పక్క వాకిట్లో నుండి ఒక గుర్రపు సకిలింపు, ఆజ్ఞ వినిపించాయి. గ్రెగరి తన తుపాకిలో తూటాలు నింపి, కంచె వైపు చూశాడు.అక్కడ తుపాకీలతో సిద్ధంగా ఉన్న సైనికులు ఒక్కసారిగా పరిగెడుతూ,తమ ఆయుధాలను ఒక పాకలోకి చేరుస్తున్నారు. నీలంగా ఉన్న ఆకాశంలోకి గ్రెగరి చూస్తూ ఉంటే, ఆ విమానం ఆకాశంలో ఓ పక్షిలా అరుస్తున్నట్టు ఎగురుతున్నట్టు ఉంది;కొద్ది క్షణాల్లో అందులో నుండి ఏదో విరిగి, సూర్య కాంతిలా మారింది.ఆ విస్పోటనం ఆ చిన్న ఇంటిని కుదిపేసింది, కొసాక్కులు వాకిట్లో ఓ వైపు ఉన్నారు. పక్క ఇంటి నుండి గుర్రం బాధతో మూలుగుతున్న శబ్దం వినిపించింది. ఘాటుగా ఉన్న భాస్వరం మంటలు ఆ కంచె అవతల చిన్నగా పైకి లేచాయి.

  ‘కిందకు వంగండి!’ఉర్యుపిన్ అరుస్తూ, వాకిలిలోకి దూకాడు.

   గ్రెగరి అతని వెనుక దూకి, కంచెకు పక్కగా పడ్డాడు. ఆ విమానం వెనక్కి వెళ్ళి పోతూ ఉంటే, అల్యూమినియం లోహంతో ఉన్న దాని రెక్క  భాగం ఒక్కసారిగా మెరిసినట్టు అనిపించింది. ఆ వీధి అంతా తుపాకుల, ఫిరంగుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది.

            గ్రెగరి తన తుపాకిలో తూటాలు నింపుతున్నప్పుడు, ఇంకో పెద్ద విస్పోటనం జరిగి అతన్ని ఆ కంచె నుండి ఇంకో కొన్ని అడుగుల దూరంలో ఎగిరి పడేలా చేసింది. కింద భూమి కొంత చీలినట్టు అయ్యి, దుమ్ము అతని కళ్ళల్లో పడింది.

  ఉర్యుపిన్ అతన్ని జాగ్రత్తగా నిల్చోవడానికి సాయం చేశాడు. అతని ఎడమ కన్నులో విపరీతమైన నొప్పి కలిగి, తాత్కాలికంగా ఆ కంటికి అంధత్వం వచ్చినట్టయింది;కుడి కంటిని బలవంతంగా తెరిచే ప్రయత్నం చేశాడు. సగం పైగా ఇల్లు ధ్వంసం అయిపోయింది, ఇటుకలు ఎర్ర రంగు దిబ్బలోకి మారిపోయాయి. అస్తవ్యస్తంగా ఉన్న వాకిట్లోకి యెగోర్ జార్కోవ్ తన చేతులు, మోకాళ్ళ మీద పాకుతూ వచ్చాడు. అతను ముఖమంతా రక్తంతో ఎర్ర చారికలు కట్టింది. పైకి ఏడవకపోయినా, కన్నీళ్ళు అతని చెక్కిళ్ల నుండి కిందకు జారుతూ ఉన్నాయి. తొడ కింద ఉన్న దాదాపుగా తెగి, సన్న చర్మపు పీలికలా ఊడిపోవడానికి సిద్ధమై వేలాడుతున్నట్టు ఉంటే, ఇంకో కాలు తెగి ఎక్కడ పడిందో కనిపించలేదు.

            తన చేతులు నెమ్మదిగా కదిలిస్తూ, చిన్న పిల్లాడు ఏడ్చినట్టు బిగ్గరగా ఏడ్చాడు. కాసేపటికి ఆ ఏడుపు ఆగిపోయింది. అతను పక్కకు వాలిపోయి, దుమ్ము, గుర్రాల visarjaala తో ఉన్న తడి నేలలో తన తల పెట్టాడు. అతన్ని ఓదార్చడానికి ఎవరూ వెళ్ళలేదు.

  ‘అతన్ని పైకి ఎత్తండి!’తన చేతిని గట్టిగా ఎడమ కంటికి అడ్డంగా పెట్టుకుంటూ గ్రెగరి అరిచాడు.

  ఆశ్విక దళానికి చెందిన కొందరు వ్యక్తులు వాకిట్లోకి పరిగెత్తారు. అప్పుడే ఇంటి ముందు నుండి వెళ్తున్న ఓ గుర్రపు బండి ఆగింది.

   ‘ముందుకు కదలండి!ఎందుకు ఆగారు? మూర్ఖుల్లారా!’ఓ అధికారి అరుస్తూనే ముందుకు వెళ్ళాడు.

ఒక నల్లటి కోటు ధరించిన వృద్ధుడు, ఇద్దరు స్త్రీలు ఎక్కడి నుండి అక్కడికి వచ్చారు. జార్కోవ్ చుట్టూ గుంపుగా జనాలు నిలబడ్డారు. గ్రెగరి అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చింది చూశాడు. అప్పటికి అతని శ్వాస బాగానే ఆడుతూ ఉన్నా, బాధతో విలవిలలాడుతూ ఉన్నాడు. పచ్చగా మారిన అతని నుదురు మీద చెమట పట్టి ఉంది.

   ‘అతన్ని పైకి లేపండి!మీరు మనుషులా లేక దయ్యాలా?’

  ‘అంత తలలు బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు!’ గుర్రం మీద వెళ్తూ అక్కడ ఆగిన ఓ పొడుగైన వ్యక్తి అన్నాడు. “అతన్ని పైకి ఎత్తాలా? అతన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అతని పని అయిపోయిందని తెలియడం లేదు?”

  ‘రెండు కాళ్ళు పోయాయి.’

  ‘ఆ రక్తం వైపు చూడండి!’

‘వైద్య సేవకులు ఎక్కడా?’

  ‘వాళ్ళు  వచ్చినా ప్రయోజనం ఏముంది?’

  ‘అతను ఇంకా స్పృహ తప్పలేదు.’

  ఉర్యుపిన్ అతని భుజం మీద తాకాడు, గ్రెగరి చుట్టూ చూశాడు.

 ‘అతన్ని కదపొద్దు’,ఉర్యుపిన్ గుసగుసగా అన్నాడు.

‘అవతలివైపుకి కూడా వెళ్ళి చూడు.’

గ్రెగరి భుజం మీద చేయి వేస్తూ లేచి, అతను జనాల నుండి బయటకు నడిచాడు. తర్వాత గ్రెగరి కూడా చుట్టూ చూసి, తను కూడా గేటు వైపు నడిచాడు. జార్కోవ్ పేగులు పొట్ట కింద బయట పడి గులాబీ రంగు కట్టలా ఉన్నాయి. అందులో కొంత భాగం ఇసుక, గుర్రాల మల విసర్జనతో కలిసిపోయి, ఉబ్బి ఉంది. చావుకు దగ్గరలో ఉన్న ఆ వ్యక్తి చేయి పక్కకు పడిపోయింది.

అతని ముఖం పై ఏదైనా కప్పండి’, ఎవరో సూచించారు.

  జార్కోవ్ హఠాత్తుగా ఓపిక తెచ్చుకుని, తన తలను పైకెత్తి, గట్టిగా అరిచాడు:

  ‘సోదరులారా, నాకు ముగింపునివ్వండి!అలా చూడటం వల్ల లాభం ఏముంది?… ఆ… ఈ నొప్పిని భరించలేకపోతున్నాను. నన్ను ఇక చంపెయ్యండి!’

                                      *     *   *

            బండి ముందుకు వెళ్తూ, ఊగుతూ ఉంటే, చక్రాల శబ్దంలో ఉన్న వింతైన లయ, చిన్నపాటి జోలపాటలా ఉంది. సగం సీటు అంతా లాంతరు దీపపు వెలుగుతో నిండిపోయింది.పక్షం రోజుల్లో ఒక్కసారి ఇలా పూర్తిగా సాగదీసుకుని,ఏ బాధ్యతలు లేకుండా, ఇక జీవితంలో ఏ ప్రమాదం లేదని, చావు దగ్గరలో లేదని గ్రహింపుతో ఉండటం ఎంత సంతోషం!వీటిల్లో ఇంకా ఉత్తమైనదేమిటి అంటే వింతగా ఉండే బండి చక్రాల చప్పుడు వింటూ, ప్రతి మలుపు కూడా యుద్ధం నుండి దూరంగా తీసుకువెళ్ళడం. గ్రెగరి అలానే పడుకుని, ఆ శబ్దం వింటూ, తన పాదాల వైపు చూసుకుంటూ, ఆ రోజే ధరించిన కొత్త లోదుస్తుల సౌకర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి బయట చర్మం అంతా మురికిగా ఉంటే, ఆ లోపలి భాగం మాత్రం శుభ్రమైనది అన్నట్టు అనిపించేలా చేసింది.

            అతని ప్రశాంతత కాస్త ఎడమ కన్నులో మొదలైన నొప్పి వల్ల చెదిరిపోయింది. అది కాసేపు తగ్గినట్టుగా అనిపించి,మళ్ళీ హఠాత్తుగా వెనక్కి వస్తుంది,ఏదో అగ్ని కంటిలో మండుతున్నట్టు అనిపిస్తూ,తెలియకుండానే కంటి చుట్టూ కట్టిన బ్యాండెజ్ కన్నీళ్ళతో తడిచేలా చేస్తుంది. కామిన్యోకా -స్ట్రుమిలోవా లో ఉన్న ఆసుపత్రిలో ఉన్న ఓ కుర్ర యూదు వైద్యుడు గ్రెగరి కంటిని పరీక్షించి,ఒక కాగితం పై ఏదో రాశాడు.

  ‘నిన్ను అవతలి వైపు ఉన్న ప్రాంతం దగ్గరకు పంపించాలి. నీ కంటి పరిస్థితి బాలేదు.’

‘నేను ఒంటి కన్ను వాడిని అవుతానా?”

  ‘ఖచ్చితంగా కాదు’, ఏ మాత్రం దాచుకోకుండా పైకే తన భయాన్ని వ్యక్తం చేసిన గ్రెగరి ముఖంలోకి చూస్తూ ఆ వైద్యుడు ఓదార్పుగా అన్నాడు. ‘కానీ నీ కంటికి చికిత్స అవసరం, బహుశా ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. నిన్ను అవతలి ప్రాంతాలకు అంటే పెట్రోగ్రాడ్ లేదా మాస్కో దగ్గరకు పంపించాల్సి వస్తుంది.’

    ‘మీ దయకు ధన్యవాదములు.’

    ‘నువ్వు ఏమి భయపడకు, నీ కన్ను మామూలు అయిపోతుంది.’ ఆ వైద్యుడు గ్రెగరి భుజం మీద అనునయంగా తడుతూ, ఆ కాగితాన్ని    గ్రెగరి చేతిలో పెట్టి,మెల్లగా అతన్ని బయటకు నెట్టి, ఆ వైద్యుడు తన ఆపరేషన్ కు సిద్ధమవ్వసాగాడు. వారు ఆ రాత్రికి మాస్కో చేరుకున్నారు. బాగా గాయపడిన వారిని స్ట్రెచర్స్ మీద తీసుకువెళ్ళారు ఆసుపత్రి సిబ్బంది. ఎవరైతే సాయం అవసరం లేకుండా నడవగలిగే పరిస్థితిలో ఉన్నారో వారి పేర్లు తీసుకుని వారిని ప్లాట్ ఫారం మీదకు రమ్మని చెప్పారు. ఆ రైలు పర్యవేక్షణ చేస్తున్న వైద్యుడు గ్రెగరి పేరు పిలిచి, అతన్ని ఓ నర్సుకు అప్పజెబుతూ, ‘డాక్టర్ స్నేగిర్యోవ్ ఆసుపత్రి, కోల్ పాచిని వీధి’అన్నాడు.

‘నీ వస్తువులన్నీ తెచ్చుకున్నావా?’ఆ నర్సు అడిగింది.

  ‘ఒక కొసాక్కుకు పెద్ద వస్తువులు ఏమి ఉంటాయి? ఒక జీను సంచి, ఒక కోటు, అంతే.’

  ‘అయితే నాతో రా.’

  ఆమె తన జుట్టును టోపీ కిందకు లాగి, వేగంగా ముందుకు నడవసాగింది. గ్రెగరి ఆమెను అనుసరించాడు. ఒక టాక్సీ మాట్లాడింది ఆమె.

            ఆ పెద్ద పట్టణ రణగొణ ధ్వనులు, ట్రాము కారుల శబ్దాలు, నీలపు రంగులో వెలుగుతున్న లైట్లు గ్రెగరిని ఎంతో అబ్బురపడేలా చేసాయి. అతను ఆ టాక్సీలో వెనుక సీటులో ఆనుకుని, ఆ వీధుల వైపు కుతూహలంతో చూస్తూ ఉన్నాడు; అర్థరాత్రి దాటినా సరే ఆ వీధులన్నీ జన సంచారంతోనే ఉన్నాయి. ఈ వాతావరణానికి జతగా ఓ అపరిచిత స్త్రీ అతని పక్కన కూర్చోవడం అతనిలో ఓ వింత ఉద్రేకాన్ని కలిగించింది.

            మాస్కోలో అప్పటికే వసంతం వచ్చేసింది. ఆ విశాలమైన వీధుల్లో నాటబడిన చెట్లు ఆ వీధి లైట్ల వెలుగులో పచ్చగా మెరుస్తున్నాయి.ఆ రాత్రి ఇబ్బంది కలిగించేంత చలిగా ఉంది. ఫుట్ పాత్ నక్షత్రాల వెలుగులో తేమగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం మధ్యలో ఉన్నట్టు కనిపిస్తున్న నక్షత్రాలు నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధి వైపుకి వెళ్తున్నట్టుగా గ్రెగరికి అనిపించింది.

            ఆ దారిలో గుర్రపు డెక్కల శబ్దం వినవచ్చింది. ఆ గుర్రపు బగ్గీని తోలుతున్న వ్యక్తి ప్రీస్ట్ లాగా పొడుగైన నీలపు రంగు కోటు ధరించాడు. తన సీటులో నుండి పైకి లేచి, పగ్గాలు అందుకుని గుర్రాన్ని అదిలిస్తున్నాడు. ఎక్కడో పట్టణానికి దూరంగా రైళ్ళు వెళ్తున్న శబ్దం వస్తుంది. ‘బహుశా ఎవరో ఈ పాటికి డాన్ వైపు వెళ్తూ ఉన్నారేమో’ఈ ఆలోచన గ్రేగరి మనసులో ఇంటిపై బెంగ కలిగేలా చేసింది.

   ‘నువ్వు నిద్రపోతున్నావా?’నర్సు అడిగింది.

  ‘లేదు.’

  ‘మనం త్వరగానే అక్కడికి వెళ్ళిపోతాము.’

  ‘మీరు ఏం చెప్పారు, మేడం?’ ఆ టాక్సీ డ్రైవర్ వెనక్కి చూస్తూ అడిగాడు.

  ‘తొందరగా పోనివ్వు.’

ఓ ఇంట్లో కట్టిన కొలనులో నీళ్ళు ప్రవహిస్తూ ఉంటే, ఆ ఇంటిని దాటినప్పుడు ఆ తేమ వల్ల టాక్సీలో చలి ఇంకా పెరిగింది.

  ‘ఇక్కడ ఇలా నీటిని ఇంట్లో కూడా ఉంచుకుంటారన్న మాట. డాన్ లో లా కాదు ఇక్కడ’, గ్రెగరి తనలో తాను అనుకున్నాడు.నేల మీద రాలిన ఆకుల మీద బండి రబ్బరు టైర్లు వెళ్ళడంతో అవి నలుగుతున్న శబ్దం వచ్చింది.

   ఆ డ్రైవర్ ఓ మూడు అంతస్తుల భవనం ముందు బండి ఆపాడు. గ్రెగరి తన కోటును సరిచేసుకుని, దాదాపుగా కిందకు దూకాడు.

  ‘నీ చేతిని ఇవ్వు’, నర్సు ముందుకు వంగుతూ అడిగింది.

  గ్రెగరి మృదువుగా ఉన్న ఆ చిన్న చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె దిగడానికి సాయం చేశాడు.

‘నీ నుండి సైనికుడి చెమట వాసన వస్తుంది’, చక్కగా అలంకరించుకుని ఉన్న ఆ నర్సు అన్నది, నవ్వుతూ. ఆమె డోర్ బెల్ కొట్టింది.

   ‘నువ్వు అక్కడే ఉండాల్సింది నర్స్. అక్కడ ఉండి ఉంటే నువ్వు కూడా ఇంకా మురికి పట్టిన వాసనతో ఉండేదానివి’, గ్రెగరి కోపంగా అన్నాడు.

            ఓ సహాయకుడు తలుపు తీసాడు. మొదటి అంతస్తుకి వారు మెట్లు ఎక్కారు. అక్కడ నర్సు మరలా డోర్ బెల్ కొట్టింది. అక్కడ తెల్ల కోటు ధరించిన ఓ స్త్రీ  వారిని ఆహ్వానించింది. గుండ్రటి బల్ల దగ్గర గ్రెగరి కూర్చున్నాడు.ఆ నర్సు నెమ్మదిగా ఆ తెల్ల కోటు ధరించిన స్త్రీతో ఏదో చెప్తూ ఉంటే, ఆమె రాసుకుంటూ ఉంది.

            భిన్న రంగుల్లో ఉన్న కళ్లద్దాలు ధరించిన అనేక తలలు ఆ పక్కనున్న మూలలో ఉన్న గదుల్లో నుండి బయటకు చూస్తూ ఉన్నాయి.

   ‘నీ కోటు తియ్యి’, తెల్ల కోటు స్త్రీ గ్రెగరికి చెప్పింది.

తెల్ల కోటు ధరించిన ఓ అటెండెంట్, గ్రెగరి కోటును  అందుకుని, అతన్ని స్నానాల గది వైపు నడిపించాడు.

   ‘బట్టలన్నీ విప్పు.’

   ‘ఎందుకు?’

      ‘నువ్వు ఇప్పుడు స్నానం చేయబోతున్నావు.’

  గ్రెగరి బట్టలు విప్పుతూ, ఆ గదిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అతను టబ్బులో ఉష్ణోగ్రత గమనిస్తూ, వేడి నీళ్ళు నింపాడు. గ్రెగరిని అందులోకి వెళ్ళమన్నాడు.

  ‘ఇది నా కోసం కాదు’, గ్రెగరి జుట్టుతో ఉన్న తన కాలుని చూస్తూ సిగ్గుతో అన్నాడు.

  ఆ అటెండెంట్ గ్రెగరి స్నానం చేయడానికి సాయం చేసి, అతనికి ఓ టవల్, లోదుస్తులు, బెల్టుతో ఉన్న ఒక డ్రస్సింగ్ గౌను, చెప్పులు ఇచ్చాడు.

   ‘మరి నా బట్టల సంగతి ఏమిటి?’గ్రెగరి ఆశ్చర్యంగా అడిగాడు.

   ‘నువ్వు హాస్పటల్ లో ఇదే వేసుకుంటావు. నువ్వు తిరిగి వెళ్లిపోయేటప్పుడు నీ బట్టలు నీకు ఇచ్చేస్తారు.’

  గ్రెగరి ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న అద్దంలో తనను తాను గుర్తించలేకపోయాడు.

నల్లగా, ఎత్తుగా,మచ్చలతో ఉన్న బుగ్గలతో, తలపైకి కూడా ఉన్న బ్యాండెజ్ తో, డ్రస్సింగ్ గౌన్ లో తనను తాను చూసుకుంటే గ్రెగరికి పూర్వపు రూపం కన్నా భిన్నంగా అనిపించింది. అతని గడ్డం కత్తిరించబడి ఉండటం వల్ల ఇప్పుడు అది చిన్నగా ఉంది.

   ‘ఈ జీవితం వల్ల నేను ఇంకా కుర్రవాడిలా కనబడుతున్నాను’, నవ్వుకుంటూ, తనలో తానే అనుకున్నాడు.

   ‘ఆరవ వార్డు, కుడి వైపు మూడో తలుపు’, అటెండెంట్ అతనికి దారి చెప్పాడు.

  గ్రెగరి పెద్దగా ఉన్న ఆ గదిలోకి ప్రవేశించాక, నీలపు రంగు కళ్లద్దాలు ధరించిన ఓ ప్రీస్ట్ అతని దగ్గరకు వచ్చాడు.

   ‘ఓ, కొత్త పొరుగువాడివా? నిన్ను చూడటం సంతోషంగా ఉంది. ఇక్కడ పెద్ద ఒంటరితనం ఉండదు. నేను జరాసిక్ కు చెందిన వాడిని’, స్నేహంగా పలకరించి, గ్రెగరికి కుర్చీ చూపించాడు.

    కొన్ని నిమిషాల తర్వాత లావుగా ఉన్న ఓ అసిస్టెంట్ డాక్టర్ చూడటానికి అసహ్యంగా ఉన్న ముఖంతో గదిలోకి అడుగు పెట్టింది.

   ‘మెలఖోవ్, నాతో రా. నీ కంటిని పరీక్షించాలి’, బొంగురు గొంతుతో అని, బయటకు నడిస్తే, గ్రెగరి ఆమెను అనుసరించాడు.

     *   *  *

     షివేల్ ప్రాంత నైరుతి దిక్కులో ఉన్న  సైనిక దళం శత్రుసైన్య ఆశ్విక దళాన్ని ఆకస్మికంగా భీకర దాడి చేయాలని నిర్ణయించుకుంది.దీని నుండి వారు తేరుకొక మునుపే, ఆశ్విక దళం మరలా అక్కడ సమాచార కేంద్రాన్ని ధ్వంసం చేస్తే, శత్రుసైన్యం ఇలా వెనుకనుండి వచ్చే దాడికి సంసిద్ధంగా ఉండకపోవడం వల్ల గందరగోళంలో పడుతుందని కూడా అనుకున్నారు. ఆ సైన్యపు అధికారులు ఈ పథకం విజయం మీద గట్టి నమ్మకం పెట్టుకున్నారు.సైనిక దళాన్ని అక్కడ హాజరుపరిచారు. అక్కడకు బదిలీ అయ్యి వచ్చిన రెజిమెంట్లలో లూయిటెంట్  లిస్ట్ నిట్ స్కీ ఉన్న కోసాక్కు రెజిమెంట్ కూడా ఉంది. ఈ దాడిని ఆగస్టు 28 న జరపాలని నిర్ణయించినప్పటికి, వాన వల్ల అది 29 కు వాయిదా వేయబడింది.

    ఆ ఉదయం మొత్తం విభాగమంతటిని ఈ దాడి చేయడానికి సిద్ధం చేయడానికి ఒక చోట చేర్చారు.

శత్రువును పక్క దారి పట్టించడానికి పదాతి దళం ఎనిమిది వెరస్టుల దూరంలో ఒక దాడి చేయడానికి పంపించారు ;దానితో పాటు రెండు ఆశ్విక దళాల బృందాలు కూడా వేరే దిక్కులో పంపబడ్డాయి, శత్రువును అయోమయంలో పడేయ్యడానికి.

   కనుచూపు మేరలో ఎక్కడా శత్రు సైన్యపు జాడలు కనబడలేదు. తన దళం నుండి ఒక వెరస్టు దూరంలో లిస్ట్ నిట్స్కి కి ఒక వరుసగా నీడలా కందకాలు కనిపించాయి. వారి వెనుకే అప్పుడే తెల్లవారుతున్న ఉదయంతో పాటు, పెరిగి ఉన్న వరి మొక్కలు కూడా వారి చుట్టూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

   శత్రు సైన్యానికి ఈ దాడి గురించి ముందు ఏ సమాచారం లేదు, వారూ ఊహించనూ లేదు.28 వ తేదీ రాత్రి శత్రు దళాలు వారి కందకాల నుండి వెనక్కి ఓ ఆరు వెరస్టుల దూరం వరకు  వెళ్ళిపోయి, రష్యన్ ఆశ్విక దళాలను వేధించే రహస్య ఆయుధాలను (మెషిన్ గన్స్) మాత్రం ఉంచారు ఆ ప్రాంతమంతా.

   అప్పుడే మేఘాల చాటు నుండి సూర్యుడు బయటకు వస్తున్నాడు, అయినప్పటికీ కింద నేల ఇంకా మంచుతోనే కప్పబడి ఉంది. దాడి చేయవలసిందిగా ఆజ్ఞ ఇవ్వడంతో సైన్యమంతా ఒక్కసారిగా సిద్ధమై ముందుకు పోయింది. వేల డెక్కల శబ్దాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. లిస్ట్ నిట్స్కి  తన గుర్రం ఒకేసారి దౌడు తీయకుండా ఆపి, మెల్లగా తీసుకువెళ్ళాడు. ఒక వెరస్టున్నర దూరం వెళ్ళాక వారికి చుట్టూ వరి పంట ఉంది. దాదాపు నడుము పై ఎత్తుగా ఉన్న ఆ మొక్కలు  మరియు కలుపు మొక్కలు వల్ల గుర్రాలతో వెళ్ళడం వారికి కష్టమైపోయింది. వారి ముందు ఎరుపు -గోధుమ రంగు మిళితమైన వరి వారి ముందు ఎత్తుగా ప్రత్యక్షమై ఉంటే, వెనుక వరి గుర్రపు డెక్కల కింద నలిగిపోయి ఉంది. నాలుగు వెరస్టుల దూరం వచ్చేసరికి గుర్రాలు అలసిపోయి, రొప్పుతున్నాయి. కానీ ఇంకా శత్రువు జాడ కనిపించలేదు. ఆ దళపు కమాండర్ వైపు లిస్ట్ నిట్స్కి చూశాడు; మేజర్ ముఖం ఏమి పాలుపోకుండా, నిరాశతో నిండి ఉంది.

            ఆ అసాధ్యమైన దారిలో ఆరు వెరస్టులు ప్రయాణించేసరికి గుర్రాలలో శక్తి అంతా హరించుకుపోయింది. కొన్ని దాదాపుగా కింద కూలబడిపోయాయి. మేలు జాతివి కూడా చాలా నీరసపడిపోయాయి. సరిగ్గా అదే సమయంలో ఆస్ట్రీయా మెషిన్ గన్ల కాల్పులు మొదలయ్యాయి. మొత్తం సైన్యాన్నే ఆ కాల్పులు చిన్నాభిన్నం చేసాయి. వుహలన్లు మొదట భయపడి వెనక్కి తిరిగారు, తర్వాత కొసాక్కు రెజిమెంటు కంపించింది;వారు కంగారు, భయంతో ఉన్నప్పుడే ఫిరంగులు, మెషిన్ గన్ల దాడి రెట్టింపయ్యింది. ముందు చూపు లేకుండా శత్రువు మీద వారు ప్రయోగించిన వ్యూహం తిరిగి వారి మీదకే తిరగబడింది.కొన్ని రెజిమెంట్లు సగం సైన్యాన్ని, గుర్రాలను కోల్పోయాయి. లిస్ట్ నిట్స్కి  రెజిమెంటులో దాదాపుగా నాలుగు వందల మంది మామూలు సైన్యం,పదహారు మంది ఆఫీసర్లు మరణించారు.

            లిస్ట్ నిట్స్కి గుర్రాన్ని కింద నుండి కాల్చడం వల్ల, అతనికి కూడా రెండు గాయాలు, తలలోనూ, కాలులోనూ అయ్యాయి. అదే సమయంలో అతనికి దగ్గరగా ఉన్న సార్జెంట్ మేజర్ చెబోటర్యొవ్ తన గుర్రం మీద నుండి కిందకు దుమికి, లిస్ట్ నిట్స్కి  ని జాగ్రత్తగా జీను మీద నుండి పడిపోకుండా దించాడు.

            ఆ విభాగపు ప్రధాన అధికారి అయిన గొలోవాచోవ్, సాధారణ సైన్య కల్నల్ గా ఉన్నవాడు, ఆ దాడి ఫోటోలు తీసి తర్వాత తన అధికారులకు చూపించాడు. లూయిటెంట్ చెర్యాకోవ్, ఆ దాడి వల్ల గాయపడి ఉండి, ఆ బాధతో గొలోవాచోవ్ ను ముఖం మీద గుద్ది, తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ దారిలో అటూ ఇటూ పరుగులు పెడుతూ వెళ్తూ ఉన్న కొసాక్కులు గొలోవాచోవ్ మీద ఎక్కి తొక్కి, ఆ శవాన్ని పక్కనే ఉన్న మురుగు కాలువ దగ్గర పడేసారు. అలా అద్భుతంగా మొదలైన ఆ ఎత్తుగడ ఘోర వైఫల్యం చెందింది.

   వార్సాలో ఉన్న ఒక ఆసుపత్రి నుండి లిస్ట్ నిట్స్కి  తన తండ్రికి తాను కోలుకున్న వెంటనే యాగ్డో నాయ్  కి తన సెలవులో వస్తానని రాసాడు. ఆ ఉత్తరం అందాక, ఆ వృద్ధుడు తన గదిలో తలుపు వేసుకుని, లోపలే రోజంతా ఉండి, తర్వాత రోజు ఉరమబోయే మేఘంలా నల్లటి ముఖంతో బయటకు వచ్చాడు. డ్రోష్కీ కి గుర్రపు బండి కట్టమని నిఖిచ్ కి చెప్పి, అల్పాహారం చేసాక, వ్యోషెన్ స్కాయాకు వెళ్ళాడు. అక్కడి నుండి కొడుక్కి నాలుగు వందల రూబుళ్ళు టెలిగ్రాఫ్ ద్వారా పంపి,దానితో పాటు ఒక ఉత్తరం కూడా రాసాడు.

            నా ప్రియమైన పుత్రుడా, నువ్వు అక్కడ అలాంటి సేవతో పునీతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భవనాల్లో కాకుండా అక్కడ ఉండటమే గౌరవనీయమైన విషయం. నువ్వు నీ అంతరాత్మ పట్ల నిజాయితీగా ఉండటం నాకు గర్వంగా ఉంది. మన కుటుంబంలో ఎవరికీ ఈ గౌరవం దక్కలేదు. ఈ విషయంలో మీ తాతగారు అవమానపడి, యాగ్డోనాయ్ లో తన మిగిలిన రోజులు పాలకుల నుండి క్షమ లేకుండా దుర్బరంగా బతికారు. నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని ప్రార్థిస్తున్నాను. ఒక్క విషయం గుర్తు పెట్టుకో, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. మీ అత్తయ్య నిన్ను అడిగినట్టు చెప్పమంది. ఆమె బాగానే ఉంది. ఇక నా విషయానికి వస్తే, రాయాల్సింది ఏమి లేదు. నేను ఎలా బతుకుతానో నీకు తెలుసు. ఇక అక్కడ ఏం జరుగుతూ ఉంది? అక్కడ బుద్ధి ఉన్న వారెవరూ అధికారంలో లేరా? నేను వార్తాపత్రికల్లో వచ్చే నివేదికలు నమ్మను.

            అవన్నీ మొదలు నుండి చివర వరకు అసత్యాలని నా పూర్వ అనుభవం వల్ల నాకూ తెలుసు. యెవజిని, మనం తప్పక యుద్ధంలో గెలుస్తాము కదా?

   నీ రాకకై నేను అసహనంతో ఎదురుచూస్తూ ఉంటాను.

            వృద్ధుడైన లిస్ట్ నిట్ స్కీ తన జీవితం గురించి రాయడానికి ఏమి లేదన్నది నిజమే. అది ఎప్పుడు ఒకే గాటిన కట్టినట్టు అసలు మారకుండా, నిరాసక్తంగా ఉంది. ఉన్న ఒకే ఒక మార్పు ఏమిటంటే కూలీల వేతనాలు పెరగడం, మందు కావాల్సినంత దొరక్కపోవడం మాత్రమే. ఆ జనరల్ తరచూ తాగుతూ, ఎక్కువ చిరాకు పడుతూ, అందరిలో లోపాలు ఎంచేవాడు. ఒకరోజు అతను వేళ కానీ వేళలో అక్సిన్యను పిలిచి,’నువ్వు సరిగ్గా పని చేయడం లేదు. నిన్న నువ్వు తెచ్చిన అల్పాహారం ఎందుకు బల్ల వద్దకు వచ్చేసరికి చల్లగా ఉంది? కాఫీ ఇచ్చిన గ్లాసూ ఎందుకు శుభ్రంగా కడగలేదు? ఇది ఇలాగే కొనసాగితే, నేను నిన్ను పనిలో నుండి తీసేస్తాను… అర్ధమైందా? తీసేస్తాను నిన్ను! నాకు శుభ్రత లేని వారిని భరించే ఓపిక లేదు!’ గాల్లో చేయి పైకి ఎత్తి, ఆమెను హెచ్చరిస్తున్నట్టు,’నీకు వినబడుతుందా? నేను అలాంటివారిని భరించలేను!’ అని అరిచాడు.

            అప్పటివరకు పెదాలు బిగపట్టుకుని ఉన్న అక్సిన్య ఉన్నట్టుండి కన్నీళ్ళు పెట్టుకుంది.

   ‘నికోలాయ్ అలెక్సే యేవిచ్! నా పాప అనారోగ్యంతో ఉంది. కొద్ది సేపు నేను ఈ పనుల నుండి విరామం ఇప్పించరా… తనను ఒక్క క్షణం కూడా వదిలి ఉండే పరిస్థితి లేదు.’

  ‘ఏమైంది పాపకు?’

‘తన నోరు వాచిపోయి, నాలు ఎర్రబడిపోయింది.అది తన ప్రాణం తీసేస్తుంది.’

 ‘స్కార్లెట్ జ్వరం వచ్చిందా? మూర్ఖురాలా, ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? తెలివిమాలిన దానా, ఆ దయ్యం నిన్ను మింగా!పరిగెత్తుకుంటూ వెళ్ళి నిఖిచ్ కి చెప్పు త్వరగా బండి కట్టుకుని స్టానిట్సా కు వెళ్ళి వైద్యుడిని తీసుకురమ్మని.కాస్త మాములుగా ఉండు!’

   ఉరుములా ఉరుముతున్న ఆ వృద్ధుడి నుండి గబగబా పరిగెత్తింది అక్సిన్య.

    ‘నువ్వో తెలివితక్కువ దానివి!మూర్ఖురాలివి!’

 ఆ తర్వాతి ఉదయం నిఖిచ్ ఒక  సహాయ వైద్యుడిని తీసుకువచ్చాడు. అక్సిన్య ప్రశ్నలేమి పట్టించుకోకుండా విపరీతమైన జ్వరంతో స్పృహ లేకుండా పడి ఉన్న పాపను అతను పరీక్షించాడు.

తర్వాత సూటిగా ఇంట్లోకి జనరల్ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే హాలులో నిలబడి ఉన్న లిస్ట్ నిట్స్కి సాధారణ మర్యాదలు ఏమి పట్టించుకోకుండా, అడిగాడు.

‘ఆ పాపకు ఏమైంది?’ తనను పలకరించినా దానికేమి ప్రాముఖ్యత ఇవ్వకుండా అడిగాడు.

‘స్కార్లెట్ జ్వరం, సార్.’

‘ఏమైనా బాగయ్యే అవకాశం ఉందా? నీకు నమ్మకం ఉందా?’

  ‘చాలా తక్కువశాతం పాప బతికే అవకాశం ఉంది. తను బహుశా చచ్చిపోవచ్చు….ఆ పాప వయసు కూడా పరిగణలోకి తీసుకోవాలి.’

  ‘వెధవా!’ జనరల్ ముఖం ఎర్రగా మారిపోయింది.’నీకు వైద్య కళాశాలలో ఏమి బోధించారు? వెళ్ళి వైద్యం చేయు’, అని అరిచి, బిత్తరపోయిన ఆ వైద్యుడి ముఖం మీదే తలుపు వేసి, ఆ హాలులో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు.

   అక్సిన్య ఆ తలుపు తట్టి, లోపలికి వచ్చింది.

   ‘ఆ వైద్యుడిని స్టేషన్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి బండి కావాలంట.’

  ఆ వృద్ధుడు ఒక్కరిగా వెనక్కి తిరిగాడు.

  ‘వెళ్ళి వాడికి చెప్పు, వాడో చవట అని. పాపకు వైద్యం చేసేవరకు ఇక్కడి నుండి వెళ్ళేదిలేదని కూడా చెప్పు. వాడికి ఒక గది ఇచ్చి, వసతి చూడు!’ ఎముకలగూడులా ఉన్న తన పిడికిలి బిగస్తూ ఆయన అరిచాడు.  ‘వాడికి కావాల్సింది ఏదైనా సరే పెట్టండి, పందెం కోడిలా మేపండి, కానీ అతను మాత్రం ఇక్కడ నుండి ఇప్పుడే వెళ్ళడం లేదు!’

            ఆయన కిటికీ దగ్గరకు వెళ్ళి, కిటికీ పై చేతి వేళ్ళతో దరువు వేసి, ఆయా చేతుల్లో చిన్నప్పుడు కొడుకు ఉన్న ఫోటో వైపు ఆ బిడ్డను గుర్తు పట్టలేనట్టు చూస్తూ ఉండిపోయాడు.

            తన కూతురు జబ్బు పడిన రోజున, అక్సిన్య నటాల్య అన్న ఒక మాట గుర్తుకు తెచ్చుకుంది,’నా కన్నీళ్ళు నీవి అవుతాయి…’అందుకే, ఆమె నటాల్యను అవమానించినందుకు దేవుడు తనను ఇలా శిక్షిస్తున్నాడని అనుకుంది.

   తన కూతురు ప్రాణానికి ఏమవుతుందో అన్న భయంతో ఆమె బుర్ర సరిగా పని చేయలేదు, అటూ ఇటూ బాధతో తిరుగుతూ పనులు కూడా సరిగ్గా చేయలేకపోయింది.

            ‘దేవుడు ఖచ్చితంగా తనను నా నుండి దూరం చేయడు కదా?’ ఈ ఆలోచన ఆమె మెదడును తొలిచేయసాగింది, దాన్ని నమ్మలేకపోతుంది, నమ్మడానికి ఆమె మనసు ఒప్పుకోవడం లేదు, ఆమె దేవుడికి ప్రార్థిస్తూ, దీనంగా తన బిడ్డను కాపాడమని వేడుకోసాగింది.

  ‘ఓ దేవుడా, నన్ను క్షమించు!… తనను నా నుండి దూరం చేయకు!దయ చేసి నా మీద దయ చూపించు!’

  కానీ ఆ జబ్బు కొద్ది కొద్దిగా బిడ్డ శరీరం నుండి ప్రాణాన్ని హరిస్తూ ఉంది. ఆ పాప వెనక్కి వాలి పడుకుని ఉంటే, ఉబ్బిన గొంతు నుండి ఆమె తీసుకునే శ్వాస చిన్న గురక శబ్దంలా వస్తూ ఉంది. పని వాళ్ళ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న వైద్యుడు రోజుకి మూడు నుండి నాలుగుసార్లు వచ్చి పాపను చూసి వెళ్ళేవాడు. సాయంత్రాల్లో అతను వసారాలో నిలబడి, పొగ కాలుస్తూ ఆకాశంలోకి చూస్తూ ఉండేవాడు.

  అక్సిన్య మోకాళ్ళ మీదే కూర్చుని బిడ్డ పక్కన రాత్రుళ్ళు గడిపేది.ప్రతి రాత్రి గట్టి గురక కన్నా బాధగా అరిచే చిన్నపాటి అరుపులా మారిన ఆ పాప బాధ ఆ తల్లి గుండెను కోసేస్తూ ఉండేది.

   ‘అ.. మ్మా..’ఆ చిన్న గొంతు బాధతో గొణిగేది.

  ‘పాప, నా ప్రాణమా!’ ఆ తల్లి మౌనంగానే తల్లిని పిలిచేది.

‘నా చిన్ని పుష్పమా! నన్ను వదిలిపోకు, తాన్యా!నా వైపు చూడు, బంగారు తల్లి, నీ కళ్ళు తెరిచి చూడు!ఇప్పుడు నిద్ర లే!నా చిన్ని ప్రాణమా, నా చిట్టి తల్లి… ఓ దేవుడా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు?’

అప్పుడప్పుడు ఆ చిన్నారి మండుతున్న తన కనులు తెరిచే ప్రయత్నం చేసేది. చెడు రక్తంతో ఆ కళ్ళు ఉబ్బి ఉన్నాయి, వాటితోనే దీనంగా తల్లి వైపు చూసేది.తల్లి ఆ చూపును అర్థం చేసుకునే లోపే, ఆ కళ్ళు వెంటనే మూసుకుపోయేవి.

    ఆ పాప తల్లి ఒడిలోనే మరణించింది. ఆ బుల్లి నీలపు రంగులో ఉన్న నోరు చివరి క్షణాల్లో బాధతో చిన్నగా మూలుగుతూ, నోరు అలా తెరుచుకుని ఉండిపోయి, శరీరమంతా ఒణుకుతూ;శరీరమంతా చెమట పట్టి, కళ్ళు సగం పైగా మూసుకుపోయి, ఆ పాప తల్లి ఒడిలో తల వాల్చేసింది. ఆ మెలఖోవ్ కన్ను ఆశ్చర్యంగా చూస్తున్నట్టే మూతబడిపోయింది.

            సరసు దగ్గర, పొప్లార్ చెట్టు పక్కన సాష్కా చిన్న సమాధి తవ్వాడు,ఆ చిన్న శవపేటికను తన చేతులతో తెచ్చి,త్వరపడటం అతని గుణం కాకపోయినా,త్వరగా పూడ్చి పెట్టాడు. తర్వాత చాలా సేపు ఓపికగా అక్సిన్య అక్కడి నుండి వస్తుందని ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు అతను గట్టిగా ముక్కు చీది, గుర్రపుశాలకు వెళ్ళాడు. అక్కడ ఎండుగడ్డి కట్టలో పెట్టి ఉన్న మందు సీసా బయటకు తీసాడు, అది గటగటా తాగుతూ,’ఆ పిల్ల పవిత్ర ఆత్మ శాంతించు గాక!’అన్నాడు.

   అతను తాగుతూ, తల మధ్యలో ఊపుతూ, మెత్తగా చేసిన టమాటోని నంజుకుంటూ, బాధగా ఆ సీసా వైపు చూస్తూ, ‘నువ్వు నన్ను మర్చిపోకు పిల్లా, నేను నిన్ను మర్చిపోను’, అంటూ ఏడ్చాడు.

   మూడు వారాల తర్వాత యెవజిని లిస్ట్ నిట్స్కి తనకు సెలవు ఇచ్చినట్టు, ఇంటికి వస్తున్నట్టు టెలిగ్రామ్ పంపించాడు. మూడు గుర్రపు బండ్లు అతన్ని ఇంటికి తీసుకు రావడానికి స్టేషన్ కు పంపబడ్డాయి. పనివాళ్ళందరికి పనులు అప్పగించబడ్డాయి.కోళ్ళు ల, బాతులు చంపబడ్డాయి, సాష్కా చంపిన గొర్రెకు మసాలా పట్టుస్తూ సాష్కా తీరిక లేకుండా ఉన్నాడు. పెద్ద ఎత్తున అతిథులను ఆహ్వానించి వేడుక జరపడానికి తగిన సన్నాహాలే జరుగుతున్నాయి.

  అతను వస్తున్న సందర్భంలో అతనికి మేళతాళాలతో ఆహ్వానం పలకడానికి ఒక బృందాన్ని కామెంకా ప్రాంతం దగ్గరకు కూడా పంపించడం జరిగింది. ఆ కుర్ర యజమాని రాత్రికి వచ్చాడు. చిన్న పాటి మంచు వర్షం కురుస్తూ ఉంటే, లాంతరు దీపాల వెలుగు అక్కడ నీటి మడుగులో నీడలా కనిపిస్తూ ఉంది. మెడలో గంటలు మొగుతూ ఉండగా గుర్రాలు వాకిట్లోకి అడుగుపెట్టాయి. నవ్వుతూ, సంతోషంగా ఉన్న యెవజిని బండిలో నుండి బయటకు దిగి, తన పొడుగైన కోటును సాష్కా చేయి మీద వేసి, మెట్లు ఎక్కుతూ ఉంటే కొద్దిగా కుంటుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కొడుకుని కలవడానికి వచ్చే హడావుడిలో జనరల్ మధ్యలో ఉన్న సామానుకి తగిలినా, అది పట్టించుకోకుండా కొడుకు దగ్గరకు వెళ్ళాడు.

            అక్సిన్య భోజనాల గదిలో ఆ రాత్రి భోజనం సిద్ధం చేసి ఆ విషయం చెప్పడానికి వచ్చింది. ఆ గది తలుపుకి ఉన్న చిన్న రంద్రం నుండి ఆమె లోపలికి చూసింది. జనరల్ కొడుకుని పట్టుకుని, భుజాల మీద ముద్దు పెట్టాడు;ముడతలతో ఉన్న ఆయన మెడ వణుకుతూ ఉంది.కొద్ది నిమిషాల తర్వాత అక్సిన్య మరలా చూసినప్పుడు, సైన్యంలో ధరించే తన బిగుతైన చొక్కా  బొత్తాలు తీసి, నేల మీద పరిచి ఉన్న ఒక పెద్ద మ్యాప్ ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు.

            వృద్ధ జనరల్, పడక కుర్చీలో కూర్చుని, తన పైపు లో నుండి పొగను రింగురింగులుగా వదులుతూ, కుర్చీలో ముందుకు వెనక్కి ఊగుతూ ఉన్నాడు.

            ‘అలెక్స్ వ్? అసాధ్యం!నేను నమ్మలేను.’

  యెవజిని నెమ్మదిగా వాదిస్తూనే ఉన్నాడు, తన వేలుతో మ్యాప్ మీది గీతలను తడుముతూ. ఈలోపు వృద్ధుడు కొద్దిగా దురుసుగా బదులిచ్చాడు.

   ‘ఈ విషయంలో మాత్రం ఆ కమాండర్ -ఇన్ -చీఫ్ పొరబడ్డాడు. ఇది కేవలం ముందుచూపు లేకపోవడం వల్ల జరిగింది!నువ్వు నేను చెప్పేది వింటానంటే, యెవజిని, ఇలాగే రష్యా-జపాన్ యుద్ధ సమయంలో కూడా జరిగింది.’

   అక్సిన్య తలుపు తట్టింది.

   ‘ఏంటి? భోజనం సిద్ధమైపోయిందా? ఒక్క నిమిషం.’

ఆ వృద్ధుడు సరదాగా, నవ్వుతూ బయటకు వచ్చాడు, ఆయన కళ్ళల్లో యవ్వన కాంతి కనిపిస్తుంది. అతను కొడుకుతో కలిసి ఒక రోజు ముందే భూమి నుండి తవ్వి తీసిన మందు సీసాను తాగారు. తేదీ చెరిగిపోయినట్టు ఉన్నా, 1879 సంవత్సరం మాత్రం పచ్చటి లేబుల్ మీద కనిపిస్తూనే ఉంది.

  భోజనం వడ్డిస్తున్నప్పుడు వారి సంతోషకరమైన ముఖాలు చూస్తూ ఉంటే అక్సిన్యలో ఒంటరితనపు ఆలోచనలు అధికమయ్యాయి.కన్నీళ్ళతో కొట్టుకుపోని దుఃఖంతో ఆమె మనసు గాయపడి ఉంది. తన పాప చనిపోయిన మొదటి రోజుల్లో తనివితీరా ఏడ్వాలని అనుకుంది. ఆ ఏడుపు ఆమె గొంతులోనే ఆగిపోయి, కన్నీళ్ళు బయటకు రాలేదు, గుండె భారం మాత్రం రెట్టింపు అయ్యింది. ఆమె ఎక్కువ సేపు నిద్ర పోతూ,ఆ కలత నిద్రలో ఓదార్పు పొందే ప్రయత్నం చేసేది.కానీ కలల్లో కూడా ఏడుస్తూ ఉన్న బిడ్డే కనిపించేది. కొన్నిసార్లు ఆ బిడ్డ తన పక్కనే ఉన్నట్టు, బ్రతికే ఉన్నట్టు,మధ్యలో పీలవంగా ‘అమ్మా… అమ్మా..’అని పిలుస్తున్నట్టు, ఆమె ఊహించుకునేది. ‘నా ప్రాణమా.. చిట్టి తల్లి..’అని ఆమె పెదాలు వణుకుతూ ఉండేవి.

  ఆమె మెలకువగా ఉన్న సమయంలో కూడా ఆ చిన్న బిడ్డ ఆమె మోకాళ్ళను పట్టుకుని వెనుక తిరుగుతున్నట్టు అనిపించి, ఆమె హఠాత్తుగా ఆ బిడ్డను అందుకోవడానికి కిందకు వంగి,ఆమె అది ఆమె ఊహ అని అక్కడ ఏమి లేకపోవడంతో గ్రహించేది.

   తను వచ్చిన మూడవ రోజున, యెవజిని వృద్ధుడైన సాష్కాతో గుర్రపుశాల దగ్గర దాదాపు చీకటి పడేవరకు, పూర్వపు రోజుల్లో డాన్ ప్రాంతంలో కోసాక్కుల స్వేచ్చా జీవితం గురించి కథలు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు.అతను గుర్రపు శాల నుండి బయటకు వచ్చేసరికి పావు తక్కువ ఎనిమిది అయ్యింది. ఆ వాకిట్లో చల్లగా గాలి వీస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే కాళ్ళ కింద బురద బూట్లకు అంటుతూ ఉంది. యవ్వనంలో ఉన్నట్టు వెలుగుతూ ఉన్న చంద్రుడు అప్పుడే మబ్బుల చాటు నుండి బయటకు వచ్చాడు. ఆ వెలుతురులో యెవజిని వాచ్ చూసి,పని వాళ్ళ క్వార్టర్స్ వైపు నడిచాడు. మెట్ల దగ్గర సిగరెట్ వెలిగించుకుని, ఒక నిమిషం ఆలోచించి, భుజాలు ఎగరేసి, గది వైపు నడిచాడు.తలుపును జాగ్రత్తగా తెరిచాడు, తలుపు కిర్రుమని తెరుచుకుంది. అక్సిన్య గదిలోకి అడుగుపెట్టి, అగ్గిపెట్టె వెలిగించాడు.

  ‘ఎవరక్కడ?’పక్క బట్టలు సర్దుతూ అక్సిన్య అడిగింది.

  ‘నేనే.’

  ‘నేను బట్టలు మార్చుకుంటాను.’

  ‘అదంతా అవసరం లేదు. నేను ఒక్క నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండను.’

తన కోటును పక్కన పడేసి, మంచం. అంచు మీద కూర్చున్నాడు.

   ‘నీ కూతురు చనిపోయింది కదూ!’

  ‘అవును’, అక్సిన్య గొణిగింది.

  ‘నువ్వు చాలా మారిపోయావు. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. కన్నబిడ్డను కోల్పోవడం ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించుకోగలను. కానీ నిన్ను నువ్వు ఇలా బాధించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఆ పాపను తిరిగి తీసుకురాలేవు. ఇంకా పిల్లలను కనే యవ్వనం నీకు ఉంది. నిజంగా నువ్వు ఇంత విచారపడకు!నువ్వు మామూలు మనిషివి కావాలి… ఆ బిడ్డ చావుతో నువ్వు ఏమి కోల్పోలేదు. ఒక్కసారి ఆలోచించు, మంచి జీవితం నీ ముందు ఉంది.’

   యెవజిని అక్సిన్య చేతిని పట్టుకుని, ఓ రకమైన ఆత్మీయ అధికారంతో దాన్ని నొక్కాడు. అతని స్వరం తగ్గిపోయి, మెల్లగా గుసగుసల్లోకి మారిపోయింది. అక్సిన్య దుఃఖంతో చిన్నగా ఏడుస్తూ ఉంటే, అతను కన్నీళ్ళతో ఉన్న ఆమె బుగ్గలను, కళ్ళను ముద్దు పెట్టుకున్నాడు.

            జాలి, ఆత్మీయతతో ఓ స్త్రీ హృదయాన్ని గెలవడం తేలిక. తన నిస్సహాయపు అంధత్వంలో అక్సిన్య అతన్ని తన పూర్వపు ఉద్రేకం, కోరికతో అల్లుకుపోయింది. ఎప్పుడైతే ఆ లజ్జతో కూడిన కామపు వాంఛ చల్లారిపోయిందో, ఆమె కళ్ళు తెరిచి, చిన్నగా అరిచి,బయటకు పరిగెత్తింది. యెవజిని తలుపు తెరిచి, ఆమె వెనుకే వేగంగా వెళ్ళాడు. అతను వెళ్తూ తన కోటును తీసుకుని, గుర్రం వద్దకు వెళ్ళే సరికి రొప్పుతున్నాడు.అతను ఇంటి వరండా దగ్గరకు వచ్చి, మెట్లు ఎక్కే సమయానికి, అతను తృప్తిగా నవ్వుకున్నాడు. అతనికి సంతోషంగా ఉంది.

            అతను మంచం మీద పడుకుని తన ఛాతి మీద మెత్తటి చర్మాన్ని రుద్దుకుంటూ, ‘గౌరవంగా ఆలోచిస్తే ఇది తప్పు, అనైతిక చర్యే. గ్రెగరి… నేను నా పొరుగు వాడైన నీకు అన్యాయం చేశాను. కానీ యుద్ధంలో నా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాను. ఒక వేళ తూటా కొద్దిగా పక్కకు తగిలి ఉంటే, సరాసరి నా తలలోకి దూసుకుపోయేది. ఈ పాటికే కింద పడి ఉన్న నా శరీరాన్ని పురుగులు తింటూ ఉండేవి. ప్రతి నిమిషం జీవించాలి, కామ కోర్కెలు అనుభవించాలి. నాకు ఇది అర్హమైనదే!’ ఒక్క క్షణం అతని ఆలోచనలు అతన్నే భయపెట్టినా, కానీ కళ్ళ ముందు యుద్ధంలో గుర్రం మీద నుండి గాయపడి కింద పడిన దృశ్యం ప్రత్యక్షమవడంతో, అంతుకుముందు చిత్రం మాయమైంది. నిద్రలోకి జారుకుంటూ,’నేను దీని గురించి రేపు ఆలోచిస్తాను. ఇప్పుడు ఇది నిద్ర పోవాల్సిన సమయం..’అనుకుంటూ నిద్రపోయాడు.

  తర్వాత రోజు ఉదయం, అక్సిన్య తో అతను ఒంటరిగా భోజనాల గదిలో ఉన్నప్పుడు, అతను ఆమె దగ్గరగా వచ్చి, చిలిపిగా నవ్వాడు. ఆమె గోడకు ఆనుకుని, గుసగుసగా,  ‘నా దగ్గరగా రాకు, దయ్యమా!’ అంది.

    కానీ జీవితం ఎప్పుడు రాయబడని చట్టాలనే అనుసరిస్తుంది. మూడు రోజుల తర్వాత యెవజిని అక్సిన్య గదికి రాత్రి వచ్చాడు, కానీ అతను తిరస్కరించబడలేదు.

   *  *  *

  స్నేగిర్యోవ్ కంటి ఆసుపత్రిని ఆనుకుని ఒక చిన్న తోట ఉంది.  మాస్కో వెనుక వీధుల్లో ఉండే అనేక తోటల్లానే అది కూడా ఏ  ఆసక్తి కలిగించకుండా, ఒక రకమైన యాంత్రికతతో నిండి ఉన్న నగర ఆవరణ స్థబ్దత పోగొట్టకుండా, అడవుల్లో ఉండే క్రూర స్వేచ్చకు సంకేతంలా  బాధా స్మృతులను గుర్తు చేసేలా ఉంది.అప్పటికే వసంతం రావడంతో ఆ వైద్యశాల తోట దారంతా ఎండిన రకరకాల ఆకులు, ఉదయం పడిన మంచు వల్ల తేమతో ఉన్న పువ్వులు, అక్కడి తోట అంతా మంచు బిందువులతో నిండిన పచ్చదనoలా ఉంది. మామూలు రోజుల్లో రోగులు ఆ దారి గుండా అటుఇటూ నడుస్తూ ఉండేవారు, దగ్గర్లో ఉన్న చర్చి గంటల శబ్దం వింటూ. వాతావరణం సరిగ్గా లేని రోజుల్లో (ఆ సంవత్సరం దాదాపుగా సరిగా లేని వాతావరణమే)వారు ఒక వార్డు నుండి ఇంకో వార్డుకు తిరిగేవారు, లేదా నిశ్శబ్దంగా తమ పడకల మీద కూర్చునేవారు, తమంటే తమకు నచ్చనట్టే, ఇతరుల సాంగత్యం కూడా నచ్చక.

            అక్కడకు వచ్చే వారిలో ఎక్కువమంది మామూలు పౌరులే. యుద్ధంలో గాయపడిన వారందరిని ఒక వార్డులో ఉంచేవారు.వారు ఐదుగురు ఉన్నారు. ఎత్తుగా, గోధుమరంగు జుట్టుతో, క్షవరం చేసిన గడ్డం, నీలి కళ్ళతో  లాటివియా దేశస్తుడైన జాన్ వారేకిస్, యవ్వన అందంతో మిసమిసలాడుతూ ఇరవై ఎనిమిదేళ్ల వయసుతో, ఆశ్విక దళంలో పని చేసి, వ్లాదిమిర్ప్రావిన్సుకు చెందిన ఇరాన్ వృబ్లెవస్కీ; సైబిరీయా గురిగాడైన కోసిక్;ఎల్లప్పుడూ అసహనంతో ఉండే సైనికుడైన బర్డిన్, మరియు గ్రెగరి మెలఖోవ్. సెప్టెంబర్ నెల చివరిలో ఇంకో కొత్త రోగిని తీసుకువచ్చారు. సాయంత్రం తేయాకు సమయంలో తలుపు దగ్గర పెద్ద శబ్దం కావడంతో గ్రెగరి అటువైపు చూశాడు. హాలులోకి ముగ్గురు మనుషులు ప్రవేశించారు;ఒక నర్సు, వాయువ్య కాకసెస్ ప్రాంతానికి చెందిన    వస్త్రాధారణతో ఒకతను, మూడో వ్యక్తి, వీరికి ఆసరాగా ఇంకో ఇద్దరూ. చూస్తూ ఉంటే అతను ఇప్పుడే స్టేషన్ నుండి వచ్చినట్టు అనిపిస్తుంది,మురికిపట్టి ఉన్న అతని సైనిక దుస్తుల మీద ఉన్న రక్తపు మరకలు ఛాతీ వరకు ఉండేసరికి.అదే రోజు సాయంత్రం అతనికి ఆపరేషన్ చేశారు. చిన్నపాటి ఏర్పాట్లతోనే (చికిత్సకు కావాల్సిన పరికరాలను స్టెరిలైజ్ చేస్తున్న ధ్వనులు వినబడుతూ ఉన్నాయి) ఆ కొత్త రోగిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్ళారు. కొన్ని నిమిషాల తర్వాత చిన్నగా పాడుతున్న స్వరం వినిపించింది.

            క్లోరోఫామ్ ప్రభావం వల్ల ఆ కొత్త రోగి పాడుతూ, అర్థం కాని భాషలో వారిని తిడుతూ ఉండగానే, అతని ఎడమ కంటిలో ఉన్న గాజు ముక్కను వైద్యుడు తొలగించాడు. అది అయిపోయాక, గాయపడితి ఉన్న రోగులతో కలిపి అతన్ని ఉంచారు. ఒక రోజు తర్వాత ఆ క్లోరోఫామ్ ప్రభావపు మత్తు విడిపోయాక, అతను  జర్మనీ దగ్గరలో ఉన్న వెర్బర్గ్ దగ్గర గాయపడ్డాడని, తన పేరు గరాంజా అని, తను ఆయుధాల దళంలో పని చేస్తున్నానని, చెర్నిగోవ్ ప్రావిన్సుకి చెందినవాడినని చెప్పాడు. అతనికి గ్రెగరితో గాఢానుబంధం ఏర్పడటానికి కొద్ది రోజులే పట్టింది;వారి పడకలు పక్కపక్కనే ఉండేవి. సాయంత్రం వైద్యుడు వచ్చి చూసి వెళ్ళాక, గుసగుసగా ఎంతో సేపు సంభాషించుకునేవారు.

   ‘సరే కోసాక్కు, విషయాలు ఎలా ఉన్నాయి?’

  ‘బురద అంత మకిలంగా ఉన్నాయి.’

  ‘నీ కన్ను ఎలా ఉంది?’

  ‘ఇంజెక్షన్లు ఇస్తున్నారు.’

  ‘ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు?’

  ‘పద్దెనిమిది.’

  ‘నీకు అవి చాలా నొప్పిని కలిగిస్తాయా?’

  ‘లేదు, చాలా సంతోషంగా ఉంటుంది.’

  ‘అలా అయితే ఆ కన్నును పీకి పారేయ్యమను.’

  ‘మనందరం ఒంటి కన్నువారం కావాల్సిన అవసరం లేదు.’

  ‘అవుననుకో.’

            వ్యంగ్యంగా ప్రవర్తించే గ్రెగరి పొరుగు రోగి ఎప్పుడూ ప్రతి విషయం పట్ల అసంతృప్తి ప్రదర్శించేవాడు. ప్రభుత్వాన్ని, యుద్దాన్ని, తన తలరాతని, ఆ హాస్పటల్ లోని ఆహారాన్ని, వంట వారిని, వైద్యులను, తనకు ఏది దృష్టికి వస్తే దాన్ని తెగ తిట్టేవాడు.

  ‘అసలు నువ్వు, నేను ఎందుకు యుద్ధం చేస్తున్నాము, అబ్బాయి?’

  ‘మిగిలినవారు ఎందుకు  చేస్తున్నారో అందుకే.’

  ‘ఇలా కాదు, నాకు సరైన సమాధానం చెప్పు.’

  ‘ఇక చాలు పడుకో.’

  ‘ఓ! నువ్వు ఒక వెధవ్వి. నువ్వు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. మనం బూర్జువాల కోసం ఈ యుద్ధం చేస్తున్నాము, నీకు అది కనబడటం లేదా? అసలు ఈ బూర్జువాలు ఎలాంటివారు? జనపనార తోటల్లో ఉన్న పక్షి లాంటిది ఈ వ్యవస్థ.’

   అతను గ్రెగరికి కొత్త పదాలు వివరించేవాడు, అతని వివరణలో ఎదుటివారిని ఒప్పించే ధ్రుడత్వం ఉండేది.

‘అలా ఆపకుండా వాగకు! నీ ఉక్రెనియన్ బాష నాకు అర్థమవ్వడం లేదు’, గ్రెగరి అతన్ని మధ్యలో అడ్డుకునేవాడు.

   *    *  *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *