తెలుగు చారిత్రక నవలా సాహిత్యంలో మరో ఆణి ముత్యం

సుధాకర్ గారి వృత్తి వాణిజ్య నౌకాయానం. ప్రవృత్తి రచనా వ్యాసంగం. వారి ప్రవృత్తికి దారి దీపమై నిలిచిన నవల కీ.శే. శీలావీర్రాజు గారి విరచిత ‘మైనా’ ఈ నవలకి తొలి ప్రేరణ. సుధాకర్ గారు ముంబైలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, భీమిలీ కెప్టెన్ లారీతో స్నేహం కలిసింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లారీ గారి తండ్రి, బర్మా ఆయిల్ కంపెనీలో మేనేజర్‌గా రంగూన్‌లో సరఫరా బాధ్యతలను నిర్వహించారు. సుధాకర్ గారు లారీ ద్వారా రంగూన్ యుద్ధ బీభత్సాల వివరాలను విని, ఈ నవలా రచనకు, అందుకు సంబంధించిన పరిశోధనకు పూనుకున్నారు. ఈ పుస్తకాన్ని క్రిందటేడు మరణించిన కేప్టెన్ లారీకి అంకితం ఇచ్చారు.
తాను సేకరించిన సమాచారాన్ని మిళితం చేస్తూ ఈ అద్భుతమైన నవలను వ్రాశారు ఉణుదుర్తి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక నిర్ధిష్టకథా వస్తువుతో వ్రాసిన నవల కాదు. కాల ప్రవాహంలో సాగిపోయిన అనేక సంఘటనల సమాహారానికి తన కల్పనను జోడించి, జలపాత వేగ సదృశ పఠనీయతతో వ్రాసిన నవల. స్థూలంగా ఇదీ నవలా నేపధ్యం:
నవలలో ప్రధాన పాత్రధారులు టైలర్ కనకరాజు, డ్రైవర్ రాంబాబు, రాంబాబు భార్య భవానీ; ఈ పాత్రలన్నింటినీ సంధిస్తూ కథనాన్ని నడిపించే కమ్యూనిస్ట్ కార్యకర్త నాయుడు. వీళ్లంతా బ్రతుకు తెరువుకోసం బర్మా చేరుకున్నవాళ్లే. నాయుడు మినహా అంతా దళితులే.
రాంబాబు ఎంతో చురుకైన వాడు. సోంపేట హైస్కూల్లో చదువుకున్న వాళ్ళ కులం పిల్లలో ఎస్సెల్సీ పాసైన మొదటి విద్యార్ధి రాంబాబే కావడం విశేషం. అతను విశాఖపట్నంలో వున్నప్పుడు కొంతకాలం ఆయిల్ ఇంజన్ మెకానిక్ గ్గాను, కొంతకాలం కారు డ్రైవర్ గాను పనిచేశాడు. తెల్ల దొరల డ్రైవర్‌గా అతనికి వారితో ఎలా మెలగాలో తెలిసొచ్చింది; ఇంగ్లీష్ మాట్లాడడం గూడా నేర్చుకున్నారు. పెళ్ళి తరువాత రాంబాబు భార్యతో పాటు రంగూన్ లోని అక్కా బావల దగ్గరికి చేరతాడు – ఓ తెల్లదొర దగ్గర డ్రైవర్‌గా. భవాని అదే దొర ఇంట్లో వంట మనిషిగా కుదురుకుంటుంది. ఇంతవరకైతే ఈ నవల ఓ సాధారణ నవలే. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాలే ఈ నవల ఉత్కృష్టత ఎంటో పాఠకులకు తెలిసొస్తుంది.
భూగోళమంతటా రెండో ప్రపంచ యుద్ధమేఘాలు అలుముకుంటున్న రోజులవి. ఈ సారి జర్మన్లు మునుపటికన్నా మరింత దూకుడుగా ఎప్పుడు, ఎవరి మీద విరుచుకుపడతారోనన్న భయంతో ప్రతి దేశం ఉలిక్కి పడుతున్న సందర్భం. అటువంటి సమయంలో త్వరలోనే జర్మనీ మిత్ర దేశమైన జపాను రంగూన్ మీద దాడి చేయబోతుందన్న వార్త దేశమంతటా హల్చల్ చేస్తుంటుంది. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన కనకరాజు, తనదైన రీతిలో, కళింగాంధ్ర భాషలో రాంబాబుకి హితబోధ చేస్తాడు.
జపాన్ వారి భయంతో కట్టుబట్టలతో బర్మానుండి పరుగులుతీసిన భారతీయులలో తెలుగువారి సంఖ్య అధికం. యుద్ధం మూలంగా సముద్రమార్గం మూసుకు పోతుందనే దశలో కనకరాజు, అతని భార్య దుర్గ (రాంబాబు అక్క) ఓడ టిక్కెట్లు దక్కించుకుంటారు. అయితే వారి తిరుగు ప్రయాణం, దారుణమైన విషాదంగా ముగుస్తుంది. రంగూన్ నుండి ఇండియాకు భూమార్గాన రావడానికి రెండు దారులుంటాయి. ఒకటి దొరలు వెళ్ళే ‘తెల్లదారి’ అంటారు. రెండవది వలస కూలీల ‘నల్లదారి’. ఈ రెండు దారుల్లోనూ మనల్ని నడిపిస్తాడు రచయిత. ఆ వివరాలు తెలియాలంటే ప్రతి పాఠకుడూ ఈ నవలను తప్పకుండా చదవాల్సిందే. ఈ నవలలోని కొన్ని విశేషాలను, వాక్యాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను.
ఓ చోట అద్భుమైన సన్నివేశం వస్తుంది; అనాథాశ్రమంలో పెరిగిన మూగ బాలుడు. అంధబాలిక అయిన అతని అక్క – వీరిరువురి చుట్టూ సాగే ఈ సంఘటనను రచయిత హృద్యంగాను, రసవత్తరంగానూ పండించారు. అది చదివుతుంటే పాఠకుల మనసంతా ఇదీ అని చెప్పలేని ఒక తీయని బాధతో కమ్ముకుపోతుంది.
మరొక చోట కనకరాజు పాత్ర ద్వారా దర్జీ పనికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పాఠకుల కళ్ళ ముందుకు తీసుకువచ్చిన నవలాకారుని విషయ సేకరణ సామర్ధ్యం మనకు తేటతెల్లంగా తెలిసివస్తుంది.
మాటల సందర్భంలో నాయుడు ఆనాటి రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ ‘యుద్ధం, అంతర్యుద్ధం, విప్లవం’ అనే ఓ శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తాడు.
“సామ్రాజ్యవాదులు యుద్ధాన్ని తీసుకొస్తారు; శ్రామికవర్గ శత్రువులు అంతర్యుద్ధాన్ని తీసుకొస్తారు; కమ్యూనిస్టులు విప్లవాన్ని తీసుకొస్తారు,” అన్న యుద్ధక్రమాన్ని వివరించే గొప్ప సత్యాన్ని ఖాన్ పాత్రద్వారా పాఠకులకు అందిస్తారు రచయిత.
“పబ్లిక్ సెక్టార్ వృద్ధి చెందితే, ప్రైవేట్ సెక్టార్ మనల్ని కబళించకుండా కాపాడుకుంటే అదే సోషలిజం,” అంటూ మరో పాత్ర ద్వారా ఎంతో సూక్ష్మంగా తెలియజేస్తాడు రచయిత.
అలాగే సామాన్యుల జీవితాల్లో యుద్ధాలు, కరువులు సృష్టించే దారుణ విషాదాలను మన కండ్ల ముందు నిలిపి, బొమ్మకట్టి సాక్షాత్కరింపజేస్తాడు.
చివరికి రెండో ప్రపంచ యుద్ధం ఏవిధంగా ముగిసిపోయింది? ఈ నవలాకాలం (1941-51) మన సమజానికి మిగిల్చిన గుణపాఠాలేమిటి? నాయుడు, రాంబాబు, భవానీలు ఏమవుతారు? అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే తప్పకుండా నవల చదివి తెలుసుకోవాల్సిందే.
సుధాకర్ గారు ఇప్పటివరకు 1. తూరుపు గాలులు, 2. చలిచీమల కవాతు, 3. యారాడ కొండ, 4. తధాగతుని అడుగుజాడలు అనే పుస్తకాలను వెలువరించారు. ప్రతి రచనకూ తనలోని రచయితకు మరింత పదును పెట్టుకుంటూ పాఠకులలో తనదైన ఓ ప్రత్యేక ముద్రను ప్రదర్శిస్తున్న ఉణుదుర్తిగారి నుండి ముందుముందు మరిన్ని మంచి రచనలను ఆశించవచ్చును.
చివరిగా సాహసించి నేనో మాట చెప్పాలనుకుంటున్నాను. తెలుగులో ఏ కవి, రచయిత అయినా ఒక పుస్తకాన్ని ప్రచురిస్తే దాని ధరను ఎన్ని పేజీలుంటే అన్ని రూపాయలుగా నిర్ణయిస్తూ రావడం ఒక అప్రకటిత ఆనవాయితీగా వస్తుంది. ఆ లెక్కన చూస్తే ఈ పుస్తకం ధర రూ.170/- ఉండాలి. కానీ దీని ధరను ప్రచురణకర్తలు రూ.300/-లుగా నిర్ణయించారు.
ఒక మంచి నవలను వ్రాసిన రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారికి, దానిని తెలుగు పాఠక లోకానికి అందించిన ATA పబ్లికేషన్స్ వారికి మనఃపూర్వక అభినందనలు అందజేస్తున్నాను.
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్.

One thought on “తెలుగు చారిత్రక నవలా సాహిత్యంలో మరో ఆణి ముత్యం

  1. Sudhakar garu — great writer
    But this novel is so so — not interested / not impressive
    Compare to all his work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *