ఆంధ్రుల శిల్ప, చిత్ర కళలు

Spread the love

పూర్వకాలమునుంచీ ఆంధ్రులు లలిత కళలన్నింటిలోను మహోన్నత స్థానము వహించి, ఇతర దేశాలవారికి మార్గదర్శకులై వుండేవారు. కవిత్వంలో, శిల్పంలో, చిత్రలేఖనంలో, సంగీతం, నాట్యంలో ఆలయ నిర్మాణంలో, ఇతర కళావస్తు నిర్మాణ పరిశ్రమలోను – పురాతనాంధ్రచరిత్రకాలం నుంచీ మొన్న మొన్నటివరకు – తమ ప్రత్యేకత, ప్రతిభ, ప్రజ్ఞ, వ్యుత్పన్నత ప్రదర్శించినారు.

ఆంధ్రులు మహా సామ్రాజ్యాలను నిర్మించారు. పరిసర రాజ్యాల పై ఛత్రాధిపత్యము వహించారు. పూర్వ పశ్చిమ సముద్రతరంగాలలో జయభేరీలు మ్రోగినవి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విద్యా నగరేంద్రులు ఒకరితర్వాత ఒకరు శ్వేతాంధ్రచ్ఛత్రాన్ని ముడవకుండా, దాని అలంకార రత్నకాంతులను దశదిశలకు వ్యాపింపజేశారు. ఆ సామ్రాజ్యాల కాలాలలో శిల్పాది లలితకళలు మహోన్నత శిఖరాలపైకుబికిపోయినవి.

పూర్వాంధ్ర శిల్పుల ఈ శిల్ప చిత్రలేఖన ప్రతిభ కన్నులార దర్శించి, వెనకటి మన ఔన్నత్యానికి ఉప్పొంగి, ముందు రాబోవు మన శిల్పకృషికి ఉత్సాహవంతులై నూత్న దీక్షోన్ముఖులు కావాలంటే ప్రతి ఆంధ్రుడు అజంతా, ఎల్లోరా, నాసిక, కార్లేకన్హేరీ గుహలు, కోనూరు, కొలనిపాక, ఒరంగల్లు, పాలంపేట, విజయవాడ, అల్లూరు, గరికపాడు, ఘంటశాల, అమరావతి, నాగార్జునకొండ, మాచెర్ల, చేజెర్ల, చేబ్రోలు, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, గోలి, రామిరెడ్డిపాలెం, వేంగి, ఆరుగొలను, గుంటపల్లి, రాజమహేంద్రవరం, భీమవరము, ద్రాక్షారామము, శాలిహుండము, రామతీర్థము, సంఘారామము, విజయనగరము, సింహాచలము, ముఖలింగము, పూరి, కోణార్క, జగన్నాథము, బాపట్ల, కొండవీడు, నెల్లూరు, కాళహస్తి, తిరుపతికొండ, చిన్నపట్టణము, తాడిపత్రి, గుత్తి, హంపి, పెనుగొండ, లేపాక్షి, కంచి, మహాబలిపురము, పక్షితీర్ధము, తంజావూరు, తిరుచునాపల్లి, మధుర, రామేశ్వరము మొదలగు ప్రదేశాలకు వెళ్ళవలెను.

కళాతత్త్వ విచారణ పాశ్చాత్యులు ఒక రకంగాను, మనవారు ఒక రకంగాను చేసియున్నారు. జర్మను పండితులు మొట్టమొదటగా పాశ్చాత్య భావాలలో భారతీయ భావాలను జొనిపి, సౌందర్యతత్త్వ, కళాతత్త్వ విచారణలో క్రొత్త పంథాలు త్రొక్కారు. క్షణమాత్రం వాటి అన్నింటిమీద దృష్టిని త్రిప్పుదాము. శుక్రాచార్యులువారు,

“ధ్యాన యోగస్య సంసిద్ధే ప్రతిమా లక్షణం స్మృతమ్

 ప్రతిమా కారకో మర్యో యథాధ్యాన రతోభవేత్,

 తథా నాన్యేణ మార్గేణ ప్రత్యక్షేణాపివా ఖలు

 దేవానాం ప్రతిబింబాని కుర్యాచ్ఛేయ స్కరాణిచ,

స్వర్యాణి మనవాదీనా మస్వర్గాణ్య శుభానిచ

 అపి శ్రేయస్కరం నృణాందేవలంబిను లక్షణం

 సలక్షణం మర్యబింబం నహి శ్రేయస్కరం సదా”,

అని భారతీయ శిల్పం యొక్క ఆశయం అగ్ని పురాణంలో చెప్పారు.

 “ధర్మార్థ కామమోక్షషు వైచక్షణ్యం కళాసుచ” అని చెప్పియున్నారు.

 “చిస్మయ సాద్వితీయస్య నిష్కలస్సా శరీరిణ:

ఉపాసకానాం కార్యర్థం బ్రహ్మణో రూపకల్పనా” అనిన్నీ ;

“సాధకానాం హితార్ధయా బ్రహ్మణో రూపకల్పనా” అవిన్నీ కులార్ణవతంత్రమందు చెప్పియున్నారు. ఏ శిల్పకారుడైనా కళ – భగవదన్వేషణార్థం, ధర్మార్థ కామమోక్షాది చతుర్విధ పురుషార్థం అని, స్పష్టంగా చెప్పాడు.

భగవంతుడే సత్యం, శివం, సుందరం అయినట్టివాడు. కాబట్టి ఆ సత్యాన్ని, ఆ శివస్వరూపాన్ని, ఆ సౌందర్యతత్తాన్ని భావించడం, రూపించడం కళాలక్షణం, శిల్పలక్షణం.

ఈ కళాస్వరూపాలు సంగీతము, కవిత్వము, చిత్రలేఖనము, శిల్పము, నృత్యము. ఆలయ నిర్మాణము కదా ! ఈ విద్యలు పూర్వకర్మ సముపార్జిత శక్తి వల్ల జనించినవి. అందరికి భగవంతుని ఛాయయైన ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం ఉంది. ఆ ప్రకృతి భౌతికరూపంగా ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అలాంటి అప్పుడు, ఆ ప్రకృతిలో తన మనస్సుకిగాని, హృదయానికిగాని, బుద్ధికిగాని, ఆత్మకుగానీ ఆనందం కలిగించే ఒక దృశ్యం, ఒక రూపం, ఒక జీవితం, ఒక భావము కళాశక్తి గలిగిన రసజ్ఞునికి గోచరించినప్పుడు అతనిలో వుండే కళాశక్తిపైకి ఒక స్వరూపంగా జన్మించాలని ఆవేదన పొందడంచేత, కళాస్వరూపం ఉద్భవిస్తూన్నది. ఆ కళాస్వరూపంలో ఒక ముఖ్యలక్షణం ఆనందం. ఆ సృష్టి భాషాస్వరూపమైతే కవిత్వము, వర్ణస్వరూపమైతే చిత్రలేఖనము, మూర్తి స్వరూపమైతే నృత్యము, భవనస్వరూపమైతే ఆలయము అగును.

కళాతత్త్వ విచారణచేస్తూ పాశ్చాత్యులు రెండుమార్గాలు త్రొక్కారు. ఒకటి గ్రీకుపంథా, రెండవది జర్మనుపంథా. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, ప్లాటినస్ మొదలైన వార్లంతా నీతివాదమార్గాన్నే వెళ్ళారు. చాలా కాలంవరకు ఆ నీతివాదమే కళాతత్త్వజ్ఞులు ప్రకటించారు. కానీ కళాస్రష్టలు మాత్రం, ఈ తత్త్వ విచారణతో అవసరం లేకుండా భౌతికము, మనోమయము అయిన సౌందర్యాన్ని గ్రీకు, ఇటలీ దేశములలో సృష్టించి, లోకమున కనుగ్రహించారు. ఫ్రెంచి దేశస్థుడైన మోకెట్ శిల్పి, జపాన్ చిత్రలేఖన సౌందర్యం దర్శించి “అనుభవ చిత్రలేఖన సంప్రదాయం (Impressionism) సృష్టించేవరకు పాశ్చాత్యశిల్పులందరూ గ్రీకుశిల్పులనే అనుగమించారు” అన్నాడు.

భారతీయ సంప్రదాయ ప్రపంచమును సందర్శించి ఆనందించిన జర్మన్ పండితులు కళాతత్త్వ విచారణలో రెండవ మార్గం త్రొక్కినారు. అది భారతీయవాదానికి దూరపు బిడ్డ. ఈ వాదంలో ముఖ్యుడైన హెగెన్ చెప్పిన మాటలు మనవి  చేసుకొంటాను.

“అనంతతత్త్వము యొక్క భౌతిక మూర్తి సందర్శనమే కళ….జ్ఞానేంద్రియముల ద్వారా భాసించు భావమే సౌందర్యము .అనేకత్వము యొక్క ఏకదేశిత్వమే సౌందర్య స్వరూపము. ప్రకృతి సౌందర్యము; కళయందే సౌందర్యము యొక్క పరమ సందర్శనము కలుగుచున్నది.”

భారతీయ శిల్పాన్ని సందర్శించి, ఆ ఆశయము శిల్పము యొక్క పరమోద్దేశములని లోకానికి వెల్లడించి చెప్పిన పాశ్చాత్య సౌందర్య తత్త్వజ్ఞుల మాటలను స్మరించటం నా విధియై యున్నది.

ఎరిక్ జీవ్ “In all Indian art there is a recognition of the fact art is primarily prophecy – that is a translation into material form of the inspiration man receives from God.” అన్నారు.

“కళ యొక్క మూలసూత్రం ప్రవచన స్వరూపమన్న సత్యమునే ఆదర్శముగా ఉంచుకొనినట్లు భారతీయ శిల్పమునందు మనకు ద్యోతకమగుతున్నది. భగవంతుని నుండి మనుష్యుడు పొందు ఆవేశము యొక్క భౌతికానువాదమే కళ.”

ప్రఖ్యాత ఫ్రెంచి శిల్ప కారుడైన రోడిన్, నటరాజమూర్తిని దర్శించినప్పుడు :

“Full blown in life, the river of life, the air, the sun, the sensibility to be in an overflow that is how it appears to us-the art of India”.

“జీవిత మహాప్రవాహములో జన్మించి, కాంతిలో విలసిల్లి, దెసలవ్యపించి, జీవితాన్ని అధిగమించిన శక్తిని అలవరించి ప్రల్లమైనది భారతీయ శిల్పం” అన్నాడు.

“గ్రీకు శిల్పము, మనుష్యుని యొక్క ఉచ్ఛ స్థితియే భగవంతునిగా సంభవించినది. కానీ, హైందవ భావనము దీనికి విపరీతముగా నడిచినది. అది, భగవంతుని మనుష్యుని యొక్క పరిపూర్ణత్వముగా భావించలేదు; కాని పరిపూర్ణముగాని భగవంతునిగ మనుష్యుని ఎంచినది, అనగా నియమితుడైన భగవంతుడని తాత్పర్యము.

శాతవాహనుల కాలమునకు ముందు ఉండే శిల్పము ఎక్కువగ దొరకలేదు. చంద్రగుప్తుడు రాజ్యం చేసేనాటికి ఆంధ్రులు అత్యున్నతమయిన స్థితిలో ఉన్నారని మెగస్తనీసు వ్రాసినాడు గదా! అప్పటికే ఆంధ్రుల శిల్ప చమత్కృతి విజృంభించి ఉండవలెను. లేనియెడల, హఠాత్తుగా శాతవాహనుల శిల్పము అంత స్వల్పకాలములో వృద్ధి పొందియుండదు.

శాతవాహనశిల్పము నానాటికి విజృంభించి, ఆంధ్రులు బౌద్ధమతము స్వీకరించేటప్పటికి, మంచి ఉన్నతస్థితిలోనికి  వచ్చినది.

కొందరు శాతవాహన చక్రవర్తులు గాంధారదేశములో రాజ్యమేర్పరచుకొన్న యవనరాజుల శిల్పుల్ని తీసుకొనివచ్చి, వారి చేత శిల్పం చెక్కించిన్నీ, వారి పాదాల మ్రోల ఆంధ్రశిల్పులకు శిక్షణ కల్పించిన్నీ, ఆంధ్ర శిల్పమంతా అల్లించారని వాదిస్తారు. ఈ వాదన పరిశీలనాశక్తి లేనివాళ్ళకు రుచించవచ్చునేమో!

గాంధారశిల్పానికిన్నీ ఆంధ్రశిల్పానికిన్నీ సంబంధము ఏమి ఉన్నది? గాంధారశిల్పం వృద్ధిపొందిన రోజుల్లోనే, సమకాలికంగా ఉత్తర హిందూస్థానములో ప్రపుల్లమై యున్న భారతీయ శిల్ప విన్యాసము గాంధార విన్యాసమునకు సంపూర్ణముగా దూరమైయున్నది. మూర్తివిన్యాసములో, అలంకార శిల్పరచనలో, శిల్ప సమయగాంభీర్యతలో, గాంధార శిల్పము భారతీయ శిల్పమునకు ఏమాత్రము చేరలేదు.

గాంధార శిల్పమునకు చాలాకాలము పూర్వముననే ఉన్న శిల్పమును ఒక నటియొక్క విగ్రహము పాటలీపుత్రములో త్రవ్వినప్పుడు దొరికినది. దీనిని గురించి డాక్టరు స్పూనరీగారు : “పాట్నా మ్యూజియములోని ముఖ్యమైన నిధి” అన్నారు. ఈ శిల్పము పోలికలే అన్నిట గలిగినది శాతవాహన శిల్పము. గాంధారశిల్పము భారతీయశిల్పమునకేమి సహాయము చేయలేదు గానీ, భారతీయశిల్పము నుండి గాంధారశిల్పము ఎన్నియో శిల్పరీతుల నలవరచుకొన్నది. దీనిని గురించే నివేదితాదేవి 1910 సంవత్సరంలో ‘మాడరన్ రివ్యూ’లో చాలా వ్యాసములు రచించినది. అందులో ఒక వాక్యమును మాత్రము ఉదహరిస్తాను.

“While Gandhara Art made no contribution whatever to the Indian Ideal of Buddhahood, it captured Buddha. Magadha has produced symbols whose dignity Gandhara was never able to approach.”

“గాంధార శిల్పము బుద్ధత్వ ఆశయమునకు ఏమీ నివేదించలేకపోయినా, బుద్ధుని మాత్రము సంగ్రహించినది. మగధ సంప్రదాయాలలో జనించిన శిల్ప సమయాలను గాంధార శిల్పమెన్నటికిని గ్రాహ్యము చేసికొనలేకపోయినది.”

పలనాడులో దొరుకు పాలరాతివంటి ఒక విధమైన తెల్లనిరాతితో ఈ శిల్పసంపద మూర్తీభవించినది. మూర్తి విన్యాసలాలిత్యము జీవితాన్ని శిల్పరూపంగా సర్వరస పూరితమై ఒప్పేటట్టు చేసే ఓజస్సు, సంయుక్త శిల్పాలను గూర్చే నేర్పు ఆంధ్రదేశ మందంతటను వర్షము కురిపించినారు.

అమరావతిలో అశోకచక్రవర్తి కాలంలో నిర్మింపబడిన స్తూపం నానాటికీ వృద్ధి పొంది, వాసిష్ఠీపుత్ర పులుమావి శాతవాహనుని కాలంనాటికి ఉత్తమస్థితికి వచ్చింది.

శాతవాహనుల బౌద్ధశిల్ప చరిత్ర రెండు భాగములుగా విభజించవలసి ఉంటుంది. ప్రథమచరిత్ర, క్రీస్తుకు పూర్వకాలం నాటిది. ద్వితీయయుగము, క్రీస్తు వెనుక రెండవశతాబ్దం వరకు విజృంభించినది. రూపకల్పనలో, శిల్పవిన్యాసంలో, ఈ రెండురకాల శిల్పవిన్యాసమునకు తేడాలు కన్పిస్తవి.

ఈ మొదటియుగమందలి శిల్పము అమరావతి, జగ్గయ్యపేట, కార్లీ, నాసిక మొదలగు స్థలములలో కనబడుతుంది. ఈ కాలమందలి శిల్పంలో ఆభరణములు తక్కువ; ఆడంబరము లేదు.

రెండవయుగమైన క్రీస్తు తర్వాత శకముల నాటి స్థితి, మనకు జగ్గయ్యపేట, కార్లీ, నాసిక, గుంటుపల్లి మొదలయిన శిల్పాలలో కనబడుతుంది. ఈ శిల్పంలో మొదటి యుగంలోని శక్తి యున్నది. అప్పుడప్పుడే విగ్రహాలకు సౌకుమార్యత ఏర్పడుతుంది. విగ్రహాలు పెద్దవి, ఏకతలశిల్పము, ఆ శిల్పంలో లోతు తక్కువతో చెక్కడము. ఈ శిల్పము అజంతా ప్రథమ చిత్రలేఖనము వలనే ఉంటుంది. ఆభరణాలు, శిల్పభంగులు, తలకట్టుల ఎన్నో పోలికలున్నవి.

పిమ్మట కొంతకాలమునకు, శాతవాహన శిల్పం, అమరావతి, నాసికలలో సువ్యక్తమైయున్నది. ఈ యుగము, క్రీస్తు యుగపు ద్వితీయశతాబ్దము నాటిది. ఈ శిల్పములో నాగార్జునాచార్యులు మహాశక్తి గోచరిస్తూ ఉంటుంది. పందొమ్మిదవ శతాబ్దాంతాన త్రవ్వితే దొరికినవి. అమరావతీ మహాచైత్యంలోని శిల్పం కొంచెం ఇంచుమించుగా ఈ కాలంనాటిది. ఈశిల్పంలో బుద్ధదేవుని జాతకగాథలన్ని శిల్పించారు. ఈ కాలపు శిల్పము, విన్యాసలాలిత్యము, విన్నాణము, గంభీరశక్తి పూర్ణముగా వెదజల్లింది.

ఏ మతవిషయక భావమైనా సర్వజీవిత సంబంధమైనదని, ఆంధ్రులు తమ శిల్పమందు చూపినారు. శాంతభూయిష్ఠమైన యోగభావముగాని, చలనభూయిష్ఠమైన సాధారణజీవిత భావముగాని, ఆంధ్రులు అత్యంత నిపుణతతో మూర్తీభవింపజేసినారు. బాహ్య ప్రకృత్యను కరణవాదులు లోపమెంచజాలని బాహ్య స్వరూపసౌందర్యముచే, ఆశయ స్వరూపమైన శిల్ప సత్యమునకు పరిచర్య చేయించినారు. జంతువులను శిల్పించడములో నేమి, మానవ జీవితములోని రసవత్తర ఘట్టములను శిల్పించడములోనేమి ఆంధ్రశిల్పులు తమ చాతుర్యాన్ని విరజిమ్మినారు. ఆనంద కుమారస్వామిగారు ఈ సందర్భములో,

“The memory picture or rather a synthetic image based on past experience is from first to last the essential foundation of Indian Art; We cannot recognise here any such innate striving towards realism as that which becomes apparent soon after the primitive developments in Greek and Christian Art. The Indian  method is always one of visualisation, unconscious in primitive, systematised in the Nature art. Indian art is always a language employing symbols valid only by tradition and convention” అన్నారు.

“స్మృతి చిత్రము, అనగా జీవితమును పరిశీలించిన పూర్వజ్ఞానముననుసరించి మూర్తి కల్పనజేసుకొనుట, అనాది నుండియు భారతీయ శిల్పమునకు ముఖ్య సూత్రమైన పునాది. భారతీయ శిల్పములో బాహ్యప్రకృత్యనుకరణానికి ప్రయత్నము లేదు. అట్టి ప్రయత్నము గ్రీకు పాశ్చాత్య క్రైస్తవ శిల్పములలో నున్నది. భారతశిల్పము ఎప్పుడును సర్వానుభూతి సంగ్రహ దృష్టి స్వరూపము. ఈ దృష్టి ప్రథమంలో ఉద్భవించి, సహజంగా రానురాను అత్యంత సమగ్రమైన శాస్త్రస్వరూపము దాల్చినది. భారతశిల్పము యొక్క ముఖ్య పరిభాషశిల్పసమయమే.”

ఈ విషయము దేనికి చెప్పవలసి వచ్చినదంటే, పాశ్చాత్యులలో చాలామందిన్నీ, ఆంగ్లమానస పుత్రత్వము సంపాదించుకొన్న మనలో కొందరున్నూ, ఆంధ్ర శాతవాహనశిల్పము అనగా బాహ్యప్రకృత్యనుకరణ భూయిష్టమై ఉండేదనిన్ని, నానాటికి ఆంధ్ర శిల్పులు ఇతర భారత శిల్పులతో పాటు మతావేశములోపడి శిల్పసత్యాన్ని కూలద్రోసి, శిల్పమును సమయభూయిష్టము చేసినారనిన్నీ అంటూ ఉంటారు. వారికి భారత శిల్పసత్యము గోచరింపలేదని మాత్రం మనవి చేస్తున్నాను. భారత శిల్పసత్యమైన శిల్ప సమయ ప్రజ్ఞకు దూరమును, అపశ్రుతియుగాని బాహ్యసౌందర్యమును ఆంధ్రశిల్పులు మూర్తీభవింప జేసినారు, అంతే. ఆంధ్రదేశములో బౌద్ధమతము విజృంభింపని కాలములోగాని, నిండివున్న కాలములోగాని, ఆంధ్రశిల్పులు ఈ సంప్రదాయమును ఎప్పుడున్నూ మరచిపోలేదు.

సాంచీస్తూపము, స్తూపము చుట్టూ ఉన్న ద్వారములు ఆంధ్రశిల్పులు నిర్మించినవే. నాసికలోని గుహలు, అజంతాలోని మొదటి గుహలు, ఔరంగాబాదులోని గుహలు పూర్వశాతవాహనులు నిర్మించినవే. ఆది దినాలలో వారు బుద్ధుని జీవితము ఏ ఛత్రరూపంగానో, చక్రరూపంగానో, పాదచిహ్నరూపంగానో చిత్రించేవారు. తరువాత తరువాత, బుద్ధుని యొక్క మూర్తిని విన్యాసముచేయ ప్రారంభించినారు. స్తూపము చుట్టూకట్టే రాతికంచెలు, ద్వారములు ముద్దులు మూటకట్టునట్లు సృష్టించినారు. ఈ రాతి కంచెలలోని ఫలకములలోను, స్తంభములలోను బౌద్ధగాథలు, సాధారణ మానవజీవిత సంబంధమైన దృశ్యములు, శిల్ప నృత్యమైన అలంకారశిల్పము, గుజ్జు బాలురు, యక్షులు, నాగములు, లెక్కలున్న గుఱ్ఱములు, జానపద జీవిత దృశ్యములు, రాజసభలు, వనవిహారాలు మొదలగు అద్భుత శిల్పవిషయాలను అల్లివేశారు. పోయిన శిల్పములు పోగా, మిగిలిన ఆంధ్ర శాతవాహనశిల్పములు లండను, బెర్లిను, మదరాసు, కలకత్తా, బోస్టన్ మొదలగు మ్యూజియముల నలంకరించుచున్నవి.

ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యము విచ్ఛిన్నమైన తరువాత, నాగార్జునకొండలో పర్వత విజయపురము రాజధానిగా ఏలిన ఇక్ష్వాకులు సామ్రాట్టులైనారు. నాగార్జున కొండ అనగానే ఆంధ్ర చరిత్రలో మహాద్భుత పురుషుడైన నాగార్జునుడు మన కళ్ల ఎదుట మూర్తీభవిస్తాడు. ఇతడు బుద్ధుని తర్వాత బుద్ధుని యంత జ్ఞాని. నాడు ప్రపంచమున వెలిగిన పరంజ్యోతి. ఇతడు స్థాపించిన సంఘారామ మహావిద్యాపరిషత్తు సర్వకళలను దేశములకు వెదజల్లినది. ఈతడు నిర్మాణం చేయించిన శిల్పములు విదేశములలోను వన్నెకెక్కినవి. నేటి నాగార్జునకొండలో బయల్వెడలిన శిల్పము శాతవాహన శిల్పానికి అనుగుబిడ్డ. వీరి శిల్పము విన్యాసములో, లాలిత్యములో, గంభీరతలో శాతవాహనశిల్పానికి వన్నెలు తీర్చినది. స్తూపము చుట్టూ అతికించిన తెల్లని పాలరాతిమీద చెక్కిన ఈ శిల్పము, బౌద్ధ జాతకగాథలను ప్రత్యక్షంచేస్తూ ఉన్నది. సంఘజీవితములో అలంకార శిల్పము, నాట్యశిల్పము దివ్య ప్రపంచమై భాసించినవి.

ఇక్ష్వాకుల రాజ్యమైన వెనుక, వేంగీలోని సాలంకాయనులు, బృహత్పాలాయనులు, కృష్ణాజిల్లాలోని విష్ణుకుండినులు ఒకరితర్వాత నొకరు మహారాజులైనారు. వీరి కాలంనాటి శిల్పము ఇంకా బయల్పడలేదు.

పల్లవులు ఆంధ్రులన్న విషయము ఎవరూ అనుమానించదగినది గాదు. పలనాడు లేక పల్లవనాడుకు చెందినవారు. తమ రాజ్యమును విస్తరింపజేసుకొని నెల్లూరు, కాంచీపురములదాటి – శాతవాహన రాజ్యం క్షీణించినప్పుడు – కాంచీపురములో స్వతంత్రులై చక్రవర్తులైరి. క్రీ.వె. నాలుగయిదు శతాబ్దములలోనే వీరు, ఆంధ్ర శాతవాహన శిల్పానికి ప్రేమ పుత్రికయైన శిల్పాన్ని, మహాబలిపురంలో మూర్తీభవింపజేసినాడు.

త్రిలోచనపల్లవుడు ప్రథమ పల్లవ రాజులలో ఒకడు. పల్లవబొగ్గ. క్రీ.శ. 100 సం॥న వీరికి ఒక ప్రధాన స్థలముగా ఉన్నట్టు మహావంశముగా చెప్పబడియున్నది. వీరి సామ్రాజ్యము ఒంగోలు నుంచి కాంచీపురము వరకు, కాంచీపురము నుండి పుదుక్కోట వరకూ విస్తరించియున్నది.

నాడు : కాకుల కలకలము, తూర్పున ఉషాకన్య చిరునవ్వుల కాంతులు ప్రసరిస్తున్నది. మందమలయానిలాలు, సముద్రఘోష, వెనుక ప్రక్కనే పక్షితీర్థపు కొండలు. “బలి యిక్కడ పరిపాలించాడా? నిశాంభాసురుని ఓడించిన ఆంధ్ర విష్ణు సార్వభౌముడు బలి భక్తిని సంపాదించుకొన్నాడా ? సామంతుడై, స్వామిభక్తి యున్నప్పుటికీ, ఏనాటికైనా తన సామ్రాజ్యానికి ముప్పు తీసుకొస్తాడని దూరాన ఉన్న బలిద్వీపాలకు తరిమేశాడా, ఆంధ్రవిష్ణువు?” అని ఊహించుకుంటూ నేను బలేశ్వరమునకు వెళ్లేటప్పటికి భళ్లున తెల్లవారింది. శిథిలాలయాలు, జీర్ణ శిల్ప సంపద, పాడుపడిన గోపురాలు సందర్శించినప్పుడు, యెవ్వడో రాక్షసుడు తన కర్కశహస్తముతో జీవితాన్ని పిండివేసినట్టుగా వుంటుంది. దీనిలోని చక్కని దేవాలయము – సగము సముద్రములో స్నానము చేస్తూ క్షణంలో మాయమైపోవుటకు సిద్ధంగా వుండినట్లు – జూచి ఒక నిట్టూర్పు విడిచి, అలాగే ఉండిపోయాను!

ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యము యొక్క చిట్టచివరలో, ఆంధ్రశాతవాహనశిల్పం తన తేజాన్ని చాలావరకు కోల్పోయింది. అలాంటి సమయంలో మహాబలిపురములో పల్లవులు నూత్నశక్తిని ఉద్దీపనమొనర్చి, ఆంధ్రశిల్పంలో ఒక నూతనశకము ప్రారంభించారు. మహాబలిపుర శిల్పాన్ని గురించి ఆనందకుమారస్వామిగారు ఇట్లు వచించారు.

“సంచలన శక్తివంతమై, స్వేచ్ఛాపూర్వకమైన విన్యాసము కలిగియున్నది. వీరపురుషుని సింహమధ్యము, విశాల భుజస్కంధము, స్త్రీ మూర్తుల ఘనకుచాలతో ఈ శిల్పము లాలిత్య భూయిష్ఠమై, విచిత్రమైన సున్నితాన్ని కలిగియున్నది.”

 ఆంధ్రశిల్పులు నాసిక గుహల నిర్మించిన శక్తితో మహాబలిపురప్రాంతాల గుహలను దొలిచినారు. ఆ గుహలలో శిల్పము సంకల్పించినారు. ఒకే రాతిని రథస్వరూపమైన దేవాలయము క్రింద చెక్కినారు. కొండ ప్రక్కన రాతిపైన శిల్పసంపదను వెదజల్లినారు. కోతులు, గొడుగుపట్టుకొని వెళ్ళు పురోహితుడు, వృద్ధతపస్వి మొదలైనవెన్నియో శిల్పించినారు. రానురాను సముద్రతీరమున కనబడిన గుడివంటి గుళ్ళను నిర్మించినారు. అవి కట్టడపు గుళ్ళు !

మొదటి మహేంద్రవర్మ; మొదటి, రెండవ నరసింహవర్మల కాలములో మహాబలిపుర శిల్పము రూపము తాల్చినది. ఇవి రాతి రథములు, పూర్వకాలపు చైత్యాలు, విహారాలలో నుంచి ఉద్భవించిన దేవాలయ స్వరూపాలు.

విష్ణుకుండినుల కాలంలోనే తూర్పుతీరంలో నేటి గోదావరి, విశాఖపట్నం, గంజాం జిల్లాలు కళింగరాజ్యమని పేరు పొందినవి. ఆ కళింగదేశమును గాంగవంశజులు, సాలంకాయన విష్ణుకుండినులతో సమకాలికులై స్థాపించినారు. శాతవాహనుల కాలంలోనే ఖారవేలాది కళింగరాజులు ప్రసిద్ధి కెక్కిరి గదా ! ఈ కళింగదేశ శిల్పులే రానురాను ముఖలింగం దగ్గరను, శాలిహుండాం దగ్గరను, రామతీర్ధములోను శిల్ప నిర్మాణము కావించిరి. ఈ ప్రథమ గాంగశిల్పము ఇప్పటికిన్నీ శక్తి సమన్వితమై కనిపించుచున్నది.

చాళుక్యులు ఘూర్జర దేశాన్నుంచి వచ్చిన క్షత్రియులమని చెప్పుకొంటారు. వారు ప్రథమంలో వాతాపీ నగరంలో రాజ్యస్థాపనం జేసారు. శాతవాహనులలో కొందరు పడమటి తీరంలో చాలాకాలము విజృంభించేయుండిరి. ఈ ఆంధ్రశాతవాహనుల పశ్చిమ రాజ్యాలలో అజంతా, ఎల్లోరా మొదలైన ప్రదేశాలు ఇమిడి ఉండేవి. పూర్వకాలపు ఓజస్సు కోల్పోయినా, ఈ రాజ్యాలలోని శిల్పులు ఎల్లోరా పర్వతములోని పెద్ద గుహలను నిర్మించారు; అజంతా గుహలను నిర్మించారు. బలహీనులైన ఈ శాతవాహనుల నోడించి, ఉత్తరాన్నుంచి వచ్చిన చాళుక్యులు రాజ్యము స్థాపించారు. వీరు వచ్చి, విజృంభించుచున్న తమ నూత్నశక్తితో, వాతాపి నగర గుహల్లో శిల్ప సంపదను వెదజల్లింపజేసినారు.

ఈ చాళుక్యుల ఉధృతము నానాటికి అధికమై దక్షిణానికి హర్షుని రాకుండా చేసినది. వీరు తమ రాజ్యాన్ని విస్తరించుకొని తూర్పు తీర రాజ్యాన్ని నెగ్గి, వేంగీ పల్లవుల నాక్రమించారు. (పశ్చిమ చాళుక్యుల వేంగి రాజప్రతినిధి కుబ్జ విష్ణువర్ధనుడు) వీరు స్వతంత్రించి తూర్పు చాళుక్యులై, సంపూర్ణాంధ్రత్వములో స్నాతులై ఆంధ్ర చాళుక్యులైనారు. వీరు నానాటికీ విజృంభించి పల్లవ రాజ్యము సంపూర్ణముగా ఆక్రమించుకొని, పల్లవ రాజులను నాశనం చేశారు. చోళులతో వియ్యాలంది, తమ చక్రవర్తినే (రాజరాజ కులోత్తుంగచోళుని) అచట చక్రవర్తిగా చేసారు.

కులోత్తుంగచోళదేవుని మూలంగా చాళుక్య చోళరాజ్యములు రెండున్ను ఏకమయినట్లే, ఈ రెండు రాజ్యములందలి నాగరికత, సంస్కృతి, కళ కొంతవరకు ఏకమయినవి. కుంభకోణము, చిదంబరము, తిరువన్నామలై మొదలగు స్థలములందలి శిల్పములో ఆంధ్రశిల్ప ప్రభావము కనబడుతున్నది.

ఈ చాళుక్యులు ప్రథమంలో జైన మతావలంబకులై, తరువాత శైవమతదీక్ష వహించారు. కాబట్టి ఆంధ్రదేశంలో మొదట జైనశిల్పం తీసుకొని వచ్చినవారు వీరే. బసవేశ్వరుని శకమైన వెనుక చాళుక్యులందరు జైనమతావలంబదీక్షులు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం, ద్రాక్షారామము, సింహాచలం, భీమవరం, సామర్లకోట ఇంకా అనేక గ్రామాలలో వీరు శైవమతావేశులై శిల్పం వెదజల్లినారు. సముద్రతీరాలలో అనేక చిన్నగుళ్ళు చాళుక్యుల కాలములో వెలసినవే.

ఒక్క ప్రదేశంలోను చాళుక్యుల శిల్ప సంపద పిండు కట్టలేదు. కొంత మహాబలిపురములోనున్న శక్తియు, కొంత లాలిత్యమును సమ్మిళితము జేసి – అప్పుడే ఉద్భవించిన అనేక శిల్ప గ్రంథాలననుసరించి – చాళుక్యశిల్పము వెలిసింది. ఈ నాటికిని ఈ తూర్పు తీర జిల్లాలలోని హీనస్థితికి వెళ్ళిన చాళుక్య సంప్రదాయములోని ఆంధ్రశిల్పులు, మూర్తి కల్పన చేస్తున్నారు. రాజమహేంద్రవరం మ్యూజియములోను, మార్కేండేయస్వామి గుడిలోను, బిక్కవోలు, సింహాచలము గుళ్ళలోను, భీమవరపు భీమేశ్వరస్వామి కోవెలలోను, ఆంధ్ర జాతీయ కళాశాలలోను, బెజవాడ, మద్రాసు మ్యూజియములలోను, ఆంధ్ర చాళుక్య శిల్పము యొక్క ఉచ్ఛస్థితిలో రూపము పొందిన విగ్రహాలు కనబడుతవి,

ముఖలింగం రాజధానిగా రాజ్యమేలిన తరువాత గాంగులు, చాళుక్యులతో పాటు తమ శిల్ప చమత్కృతిని జగన్నాథంలోను, కోణార్కలోను, ముఖలింగంలోను పరమాద్భుతమైన స్వరూపాలతో ప్రత్యక్షం చేసినారు. కోణార్కలో సూర్యదేవాలయము నిర్మించిన ఆంధ్రశిల్పులు, మహాబలిపురంలోని శిల్పులకు సంపూర్ణంగా ఆత్మపుత్రులే ! దేవాలయము అంతా ఒక మహారథం క్రింద చిత్రింపబడివున్నది. రథంలాగే గుర్రాలు జవము, తేజస్సుగలిగినటువంటి మూర్తులు. కోణార్క సూర్యరథ దేవాలయాన్ని నిర్మించినది నరసింహగాంగుడు. భువనేశ్వరములో ఈ గాంగవంశమువారు నిర్మించిన దేవాలయములు పరమలాలిత్యాన్ని చేకూర్చుచున్నవి.

బర్మాకు, బలిద్వీపానికీ, జవద్వీపానికీ, కాంభోజదేశానికీ ఆంధ్రులు వలసపోయి రాజ్యాలు ఏర్పరచినట్లు, చరిత్రవల్ల స్ఫుటమౌతున్నది. జావాలోని బరోబదూరులో కలిసిన శిల్పము, అమరావతిలోని ఆంధ్రశాతవాహన శిల్పాన్ని అన్ని విధాలా పోలివున్నది. శ్రీకాకుళాన్నుంచి మోటుపల్లి నుంచి ఆంధ్రుల నావలు శ్వేతహంసలలా తెరచాప లెత్తుకొని – ఆంధ్రశాతవాహనుల నాటి నుంచి – రోమక, పారశీక, అయిగుప్తాది దేశాలతోను; సువర్ణ, బలి, జావా మొదలైన ద్వీపాలకు వర్తకమునకై వెళ్లేవి. ఈ తూర్పు ద్వీపాలలో వలసరాజ్యాలు ఏర్పరచారు. బరోబదూరులోని జ్ఞానబుద్ధుడు, ప్రజ్ఞాపరిమితాదేవి, అలంకార శిల్పము, సాంఘికశిల్పము అన్నీ ధాన్యకటకనగరంలోని నాగార్జునకొండ శిల్పాన్ని పోలివున్నవి. చివరకు బలిద్వీపము, జవద్వీపములలోని ఆచార వ్యవహారాదులు, శిల్పము, నృత్యము చాళుక్యుల, కాకతీయుల కాలంనాటివి.

కాంబోడియాదేశంలో, ఆంధ్ర బ్రాహ్మణుడు ఆ దేశపు రాజకుమార్తెను వివాహమాడి, అక్కడి రాజ్యవంశానికి ప్రధానపురుషుడైనాడు. ఆంధ్ర శిల్పులున్నూ, వారి శిష్యులైన ఆ దేశవాసులున్ను, ఆంగకరువాటులో ప్రత్యక్షమవుతూవున్న ఆ దేశశిల్పాన్ని జీవింపచేశారు.

పాలంపేట, హనుమకొండలలోని శిల్పము రసప్రవాహంలో ముంచెత్తుతుంది. నాట్యము, నృత్యము, తాండవము, లాస్యము, ఉదయ సంధ్యానృత్యము, సాయంసంధ్యానృత్యము, మూడు జగాల పథాలలో ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు సర్వకళాజనకుడయిన పరమేశ్వరుడు, భౌమ్యాచార – ఆకాశాచార సర్వతాళములు, సర్వకరణాంగ విక్షేపణలు, అభినయ విలాసాలు, చిదానందలయములను ఆత్మపంథాలలో మూర్తింపగలిగిన మాయాశిల్పాన్ని కల్గించగల్గారంటే, కాకతీయుల శిల్పశక్తి వర్ణింపలేము! పాలంపేటలోని నృత్యమూర్తులు, ఓరుగల్లులోని నృత్యమూర్తులు, ఉన్నత శిల్పాలు రాజపుత్ర చిత్రలేఖన సూక్ష్మాన్ని సంపూర్ణంగా మరపించే సూక్ష్మశిల్పము, విశ్వమంతా నృత్యగాంధర్వమై సాక్షాత్కరిస్తుంది. నందులు, ఏనుగులు, హంసలు, మృదంగ వాద్యములు ఆ చుట్టుపట్ల ప్రత్యక్షములై వున్నవి. కాకతీయ శిల్ప చమత్కృతి అంతా లాలిత్యభూయిష్టమై కైశికీ వృత్తి స్వరూపమై వున్నది. కాకతీయ దేవాలయ స్వరూపాలు ఆకైశికీ వృత్తినే పుణికి పుచ్చుకొన్నవి. వృత్త రూపమయిన అలంకార శిల్పము ఈ గుళ్ళలోని గర్భాలయ ద్వారాలలో నిర్మితములైనవి. స్తంభాలున్నా, చాళుక్య స్తంభాలకన్న శేముషీత్వము సంపాదించుకొన్నవి. కాకతి చక్రవర్తుల శిల్పవైభవము కాకతిదేశమంతా పంటలు పండినది !

రసజ్ఞులగు మీరందరూ, హంపిని ఒకమాటు సందర్శించవలసినదని వినయపూర్వకంగా వేడుకొంటున్నాను. ఆ తుంగభద్రా తీరాన మనుచరిత్రను, ఆముక్తమాల్యదను సంస్కరింపజేసేటట్టి – ఒరనుండి పెరికిన ఖడ్గపు తళతళలు, శత్రురాజులు తమ కిరీటాలు తీసి రాయలసార్వభౌముని పాదాల సమర్పించునట్టి దృశ్యము, కళ్ల యెదుట నాట్యమాడింపజేసేటట్టి ఉత్కృష్ట శిల్ప సంపద విరిగి శకలాలై, కొన్ని యోజనాల స్థలమున పడివున్నదంటే యే రసజ్ఞుని ఆత్మ, హృదయము, దేహము, గడ్డకట్టి ఆ నల్లరాళ్ళతోపాటు రాయియై పడిపోదు !

ఓ విజయనగర సామ్రాజ్యమా ! నీతోపాటు రాయల ఔన్నత్వము యొక్క ఆఖరి వెలుగు ఆరిపోయినది. ఉత్తమ శిల్పము భూగర్భమున ఒలికిపోయినది. ఆంధ్ర మహోదారహృదయము దివ్యమైన ఒక్క హారతి కర్పూరపు వెలుగు వెలిగి, ఆత్మార్పణ చేసికొన్నది !

ఎల్లోరాను మరపించే గంభీరత, ఒరంగల్లు శిల్పాన్ని మరపించే లాలిత్యము, శాతవాహన కళావైభవాన్ని మరపించే కళాచమత్కృతి, రాయలశ వైశాల్యములో తాండవించిపోయినవి. మహాబలిపురములో ఉన్న ఏకశిలా దేవాలయ సృష్టి విరూపాక్షుని రథమందు వెలుగై, తళుకై వెలిగింది. హనుమకొండలో ఉన్న సహస్రమండపము హంపీలో ఎక్కువ తేజస్సుతో పునర్జన్మమెత్తినది. ఆ స్తంభములు గాన మొనరిస్తవట!

అదే ఆ కృష్ణదేవుడు తులాభారము తూగినట్టి తులాస్తంభ నిర్మాణము ! ఆ మహారాజులు జలక్రీడలాడు స్నాన కమలాకరం ! అదే, సార్వభౌముల మహాభవనము ! ఇక్కడ ఏనుగులశాల రాళ్ళు పరచియుండి, నేటికిని చెక్కుచెదరదు. విజయనగర రాజవీధిని నడచి గణేశుని గుడి, పంపాపతి గుడి దర్శించి తీరవలె. హజారరాముని గుడిలో చక్రవర్తుల సింహాసన శిలావేదికపైన ప్రత్యక్షమయ్యే శిల్పసంపదను ఎంత వర్ణించినా తీరదు. ఈ సందర్భములో ఆ శిల్పమును గురించి వ్రాసిన మేజర్ ఎన్. డబుల్యూ. వాక్ స్టాఫ్ మాటలు జ్ఞప్తికి వస్తున్నవి :

“నిధులు కట్టిన శిల్ప సంపద… వస్తు విన్యాసరచనలో, ఆత్మ విశ్వాసములో, శిల్ప సామర్థ్యములో విజయనగర శిల్పమునకు జోడైన శిల్పము లేదని మనము చెప్పవచ్చును.”

శ్రీ కృష్ణరాయ సార్వభౌములు తన సేనా నాయకులైన తెలుగు నాయకులను రాజప్రతినిధులుగా చాలా చోట్ల ఉంచినాడు. తంజావూరిలో, మధురలో, కేరళములో ఈ నాయకులు రాజ్యభారాలు వహించి, తమ పాలనలో ఉన్న దేశాన్ని అభ్యుదయ స్థితికి తీసుకొనివచ్చి, పరిపాలన చేసేవారు.

ఆ రోజుల్లోను, తర్వాత విజయనగరసామ్రాజ్యం విచ్ఛిన్నమై చక్రవర్తులు నామమాత్రులై ఉన్న రోజుల్లోను ఈ నాయక రాజులే, మహమ్మదీయులు శిథిలం చేసిన మధుర, తంజావూరు, శ్రీరంగం, రామేశ్వరం మొదలయిన పుణ్యక్షేత్రాలలోని పవిత్ర దేవాలయాలను పునరుద్ధరణచేయడంలో చోళ, పాండ్య శిల్పాలకు వన్నెగూర్చే అద్భుతశిల్పం అల్లించివేశారు. విమానాలు, మండపాలు, గోపురాలు, విగ్రహాలు, తోరణాలు క్రొత్తవి అనేకం, వివిధ మూర్తి స్వరూపుడైన భగవంతునికి అర్పించారు.

విజయనగరసామ్రాజ్యము విజృంభించక ముందు, కాకతీయసామ్రాజ్యము విచ్ఛినమైన వెనుక, ఆంధ్రదేశమంతా రెడ్డి రాజ్యాలు ఏర్పడినవి. చాళుక్య సామ్రాజ్యాల మధ్యకాలంలో విజృంభించిన చిన్న చిన్న రాజ్యములు అన్నియు కాకతీయ సామ్రాజ్య శిల్ప విధానాన్ననుసరించి అనేక శిల్పాలను దేవాలయములలో ప్రతిష్ఠింపజేసినారు.

కాకతీయ శిల్పము మైసూరురాజ్యమునందు ప్రవేశించి హలేబేడు మొదలయిన ప్రదేశములలోని శిల్ప లాలిత్యముగా వెలిసి, పుష్కలముగా విజృంభించినది.

ఆంధ్రదేశములో శిల్పము నానాటికీ క్షీణించిపోయినది. ఈనాడు శిలా శిల్పముగానీ, దారు శిల్పముగానీ, లోహ శిల్పముగానీ మచ్చునకైనా కనిపించుట లేదు. చేబ్రోలులో ఒక మహమ్మదీయ శిల్పి ఉన్నాడు. అతడు ఆంధ్ర శిల్పుల వంశీకుడు. చేబ్రోలులో ఒక మండపమున్నూ, మండపము అడుగుభాగమున చుట్టూ ఎర్రరాతి మీద జంతు శిల్పములున్నూ విన్యాసం చేసినాడు. శిల్ప దీక్ష వహించిన వారిలో, ఆంధ్రులలో నారాయణరావుగారు మొదలగు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. కానీ, ఈ శిల్పకళను పునరుద్ధరించవలసిన విధి ఆంధ్ర మహాజనులపైన లేదా.?

శిల్పము వలెనే ఆంధ్రదేశములో చిత్రలేఖనము మహోన్నతదశకు వెళ్లినదనే నిదర్శనములు అనేకములున్నవి. కవిత్వమునకు చిత్రలేఖనకు సాదృశ్యము అధికముగానున్నది. రామచరిత్రము రామాయణము చదివి తెలుసుకొన్నట్లే చదువుకొన్న వారికి చదువుకోని వారికి ఆహ్లాదం ఇచ్చేటట్టు రామకథ మన దేవాలయ కుడ్యములమీద చిత్రించేశారు. శిలతో, దారువుతో, లోహంతో శిల్ప విన్యాసం చెయ్యడం కష్టం; కానీ ఫలకాలపై, కుడ్యాలపై చిత్రరచన చెయ్యడం అంత కష్టం గాదు. పూర్వం రాకుమారులు, రాకుమార్తెలు చిత్రరచన చేస్తూవున్నట్లు పురాణాలు గాథలు స్పష్టంగా చెప్పుచున్నవి. వాత్స్యాయన కామసూత్రాలలోను, విష్ణుధర్మోత్తరములోను చిత్రలేఖన గురించీ, రంగులను గురించీ, కుంచెలను గురించి స్పష్టంగా వర్ణించినారు. శిల్పము వలెనే చిత్రలేఖనము శాశ్వతముకాదు. కాబట్టి, ఈనాడు ఆంధ్ర చిత్రకళా చరిత్ర వ్రాయడం సుగమం కాదు. తక్కిన హిందూ దేశములోని దేవాలయములతో పాటు, ఆంధ్రదేశములోని చిత్రలేఖనము వృద్ధి పొందిన మాట నిజము. వాత్స్యాయన కామసూత్రములలో చిత్రలేఖనకు షడంగాలను వాత్స్యాయనుడు బోధించినాడు. ఆదిసూత్రకర్త నారాయణుడు, విశ్వకర్మకు చిత్ర సూత్రములను ఉపదేశించెను.

చూ :-

కం. ఆ విశ్వకర్మ నిర్మిత

దేవ విమానుండు నిఖిల దివ్యాభరణ

 శ్రీవిరచన పరితోషిత

దేవుడు శిల్ప ప్రజాపతియునై నెగడెన్.

“రూపబేధ ప్రమాణాని భావ లావణ్యయో గజనమ్, సాదృశ్యం వర్ణికాభంగ మితి చిత్రం షడంగకమ్” అని చెప్పబడియున్నది. కొంచెము వివరించిన, ఈ భావము రూపము యొక్క బాలమూర్తి, కుమారమూర్తి, నరమూర్తి, క్రూరమూర్తి, అసురమూర్తి మొదలయిన తారతమ్యములను తెలియజేసేదనీ; ప్రమాణ – ఏ మూర్తి కొలత ఎంతో నిర్ణయించేదనీ; భావము – బహిరంతర స్వరూపములుగలిగి నవరస ప్రపుష్టమై వ్యక్తీకరణము తెలియజేసేదనీ; లావణ్యయోజనము – వివిధ విగ్రహాల యొక్క వర్ణాలను కర్కశాలుగా చిత్రించాలో, లలితంగా రంగులుపూయాలో నిర్ణయించేదనీ; సాదృశ్యమనగా – సంప్రదాయపారంపర్య మనకు సంక్రమించిన విధానాన్ని సాదృశ్యంగా తీసుకొని ఆ ప్రకారం మూర్తివిన్యాసం చేయుటనీ; (ఉదాహరణగా ఇందుముఖి అన్నప్పుడు చంద్రుడు, ఆ సాదృశ్యాన్ని అనుసరించి ముఖం వ్రాయాలి.) సాదృశ్యం శిల్ప సమయమనిన్నీ; వర్ణికాభంగము అంటే ఆకాశానికి ఏ వర్ణమో, ఏ మూర్తికి ఎట్టిరంగులు ఇవ్వాలో నిర్ణయించేదనీ – తెలుస్తుంది. చిత్రాల్లో గూడా కవిత్వంలో లాగే గర్భచిత్రాలు, బంధ చిత్రాలు అనేక రకాలున్నవి.

క్రీ.పూ. రెండవ శతాబ్దమందలి జోగిరామ గుహలయందలి చిత్రములు; అమరావతి, ఉండవల్లి, భట్టిప్రోలు, ఘంటసాల, జగ్గయ్యపేట, చినగంజాము మొదలైన ప్రదేశములలోని బౌద్ధసూప్తాలలోని శిల్పములు; అజంతా, కార్లీ, ఎలిఫెంటా, ఎల్లోరా, గుహలందలి చిత్రశిల్పములు; మన దేవాలయ, గోపుర ప్రాకారములందలి దక్షిణ ద్రావిడ చిత్రములు – ఇవన్నియు మన చిత్ర సంపదలోని ముత్యాలరాసులు !

ఆంధ్ర శాతవాహనకాలంలో చిత్రలేఖనము హిమాలయపు గౌరీశంకర శృంగస్థానము వరకు వెళ్లినది. ఆంధ్రశాతవాహనులు అంతరించే వరకు, అజంతా గుహలు నిర్మించి, చిత్రించినది ఆంధ్రులే ! అజంతాలోని పదియవ గుహలో, ప్రాచీన ఆంధ్ర శాతవాహనులు సభాశిల్పి ఆ గుహ నిర్మించి, శిల్పించినట్లు శాసనమున్నది.

నా గురువుగారును, రాజమండ్రి ఆరు కాలేజి పూర్వపు ప్రిన్సిపాలునగు కూల్డ్రే దొరగారు అజంతా చిత్రలేఖనముల గురించి వ్రాసిన వాక్యములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. “The colour scheme at once temperate, rich and bold, conveys the notion of dewy freshness in a hot and somber field. “మితమై, శోభావంతమై, శక్తిపూర్ణమై, ఉష్ణభూమికపైని తుషారార్ధ కోమలత్వానుభూతి నిచ్చుచున్నది.”

“The olden painting therefore, at Ajanta, represents no primitive beginning but an art of some maturity, not the first efforts of individuals groping in the darkness of inexperience but the finished work of a school of artists trained in a high art manifesting great and ancient traditions.” అనగా :

“అజంతాలోని తొలి చిత్రలేఖనము భారతీయ శిల్పము యొక్క ప్రాథమిక దశకాదు; ఆ శిల్పపు పరిణితదశ. అది, అనుభవాంధకారములో ప్రాకులాడు వ్యక్తుల ప్రాథమిక ప్రయత్నము కాదు; మహోత్కృష్టమైనటువంటి పురాతన సంప్రదాయ సిద్ధమైన ఉత్తమ కళానిష్ణాతులగు శిల్పుల పరిపూర్ణ శిల్ప రచన” అని అన్నారు పెర్సి బ్రౌనుగారు.

బొంబాయిలో శిల్పాచార్యులుగా ఉండి అజంతా శిల్పాలన్నిటికి ప్రతిరూపములు తీసి, అజంతాను గురించి యుద్ధంధము రచించిన గ్రిఫిత్ గారిలా అన్నారు.

“The artists, who painted there were giants in execution”

పల్లవరాజైన మొదటి మహేంద్రవర్మ కాలములో చిత్రలేఖనము ఉచ్ఛస్థితికి వచ్చినది. ఆ చిత్రలేఖన నాటి గుళ్ల నిండా యుండేది. కాల గర్భమున జీర్ణమైన భాగములు పోను, శీతన్నవాసాల గుహలలోను, పుదుక్కోట సంస్థానములోను, పల్లవ చిత్రలేఖన కీర్తిచిహ్నములుగా నిలిచిన భాగములు చూడవచ్చును. శీతన్నవాసాలలోని చిత్రలేఖనము, అజంతా చిత్రలేఖన సంప్రదాయాన్ని పోలి వుంటుంది. ఇవి జైన గుహలు. ఈ చిత్ర లేఖనము కొన్ని నూతనమైన లాలిత్యాలను గూడా స్వీకరించుకొన్నది.

ఎల్లోరా శిల్పులు, అజంతా శిల్పులకు చిత్రలేఖనంలో కొంచెమైనా తగ్గిపోరు. కైలాసాలయము అంతా చిత్రలేఖనంతో నిండి వుండేది. ఇదివరకా వెల్లక్రింద అణిగివున్న ఈ చిత్రలేఖనము, నైజాము ప్రభుత్వపు పురాతన శిల్ప శాఖాధ్యక్షుడయిన జనాబ్ యాజాగారి కృషి వలన, (మిగిలిన ఏ కొంచెమో) బయలుపడింది. ఆ చిత్ర కల్పనను నైజాము ప్రభుత్వమువారు గ్రంథ రూపముగా ప్రకటించారు.

కాకతిచక్రవర్తుల చిత్రలేఖన కళ ‘క్రీడాభిరామము’ మొదలైన గ్రంథాలలో అభివర్ణితమైనదిగాని ప్రత్యక్షముగా లేదు. నశించిపోయినది.

రాయల కాలమునాటికి చిత్రలేఖనము విరివిగా యుండెనని గ్రంథములు చెప్పుచున్నవి. లేపాక్షి నగరమందలి దేవాలయ కుడ్యములమీద, అజంతా చిత్రలేఖనా సంప్రదాయ జనితమైన చిత్రలేఖనా పద్ధతి కొంత తక్కువ స్థితికి వచ్చినను, సౌందర్య స్వరూపమును ఏమాత్రమును గోల్పోకుండ ఉన్నది. ఆ బొమ్మలు ఎక్కడను ప్రకటనగా లేదు.

ఇప్పుడు అవనీంద్రనాథ్ సంప్రదాయము అనుసరించిన్నీ, బొంబాయిలోని సాల్మన్ గారి సంప్రదాయము అనుసరించిన్నీ, ఆంధ్రదేశంలో నవీన చిత్రకారులు, చిత్రాధిదేవతకు సతులొనర్చడానికి సంసిద్ధులయ్యారు. దామెర్ల రామారావు చిత్రలేఖనలో నూత్నశకారంభము చేయ దీక్ష వహించాడు గానీ, మాయగా, ఆకాలమృత్యువు అతన్ని మాయం చేసింది. ప్రమోదకుమార చటోపాధ్యాయుని కడ, ఆంధ్ర జాతీయకళాశాలలో ఒక సంప్రదాయము ప్రారంభమైనది. ఆయన పాదాలకడ కౌతా రామమోహనశాస్త్రి, ఆనందమోహనశాస్త్రి, గుఱ్ఱం మల్లయ్య, తేజోమూర్తుల కేశవరావు, నేనూ దీక్ష వహించాము. నా శిష్యులు కొందరు సెలవు పుచ్చుకొని, ఆయా స్థలాల్లో చిత్రలేఖనం వెదజల్లుతున్నారు. మద్రాసు ప్రభుత్వ కళాశాలలో ఎస్.వి.ఎస్. రామారావు, సుబ్బారావు, నారాయణరావు, దుర్గారావు, గోఖలే మొదలైన యువకులు, అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి మొదలగు యువతులు దేవీ ప్రసాదరాయునికడ విద్యనారంభించి, వృద్ధి చెంది పేరు ప్రతిష్ఠలు సంపాదించుకొంటున్నారు. దామెర్ల రామరాయని శిష్యుడును, స్నేహితుడును అయిన వరదా వెంకటరత్నం గారును, రామారాయని సహోదరి శ్రీమతి బుచ్చికృష్ణమ్మగారును, రామారాయని సంప్రదాయము వృద్ధి పొందిస్తున్నారు. పెనుగొండలో సి. ఎస్. వెంకట్రావు గారున్ను, భీమవరంలో అంకాల సుబ్బారావుగారున్ను, ఏలూరులో మొక్కపాటి కృష్ణమూర్తి, పిలకా నరసింహమూర్తి, సీతాదేవి గార్లున్ను కళాదేవిని పూజిస్తున్నారు. శాంతినికేతనము వెళ్లి, నందలాలు కడ మోకరించి కళ నభ్యసించి, శ్రీమతులు కృష్ణాబాయి, కమలాబాయి, సరోజని మొదలగువారు చిత్రలేఖనంలో ప్రఖ్యాతి వహించియున్నారు.

ఆంధ్రదేశంలో గృహనిర్మాణము పూర్వము ఏయే పంథాలు అనుసరించిందో విస్పష్టంగా చిత్రించడానికి ఆధారములు బహుళంగా లేవు. ప్రతియుగంలోను ఆలయ నిర్మాణము, స్తంభ నిర్మాణము ఏయే విధాలుగా మార్పు చెందుతూ వచ్చినదో ఆ పరిణామాన్ని దర్శించడానికి మిగిలినవి కొన్ని ఆలయములు, వాటిలోని స్తంభ నిర్మాణమే!

మన పూర్వుల దివ్యహర్మ్యములు, రాజప్రసాదములు పురాణ, బ్రాహ్మణ, ఐతిహాసిక గాథలలో వర్ణింపబడి వున్నవి. రామాయణములోని రావణాసురుని అంతఃపుర వర్ణననుబట్టి ఊహించినచో, ఆనాటి ప్రాసాదాలకు నేటి మన భవన నిర్మాణము సరిపోలదని చెప్పవచ్చును. మొహంజొదారో, హరప్పా, సింధునదీ ప్రాంతములో బయల్పడిన పట్టణాలను పరిశీలిస్తే మన భారతదేశములోని నిర్మాణము, వైభవము మనకు గోచరిస్తుంది !

శాతవాహనులు వారి యాజమాన్యం క్రింద కార్లే గుహలను క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దమున నిర్మాణము చేసిరి. కార్లే గుహల తర్వాత, బాజ్ గుహలు, నాసిక గుహలు, కన్హేరి గుహలు, ఔరంగాబాద్, అజంతా గుహలు నిర్మాణము కాబడినవి. ఈ గుహాలలో చైత్యములనీ, విహారములనీ రెండు రకములు, చైత్యములు దేవాలయముల వంటివి; విహారములు బౌద్ధ క్షపణకులు నివసించే గుహలు. చైత్యము శిఖర సంయుతమైన అర్థానుస్వారంలాగు వుంటుంది. లోపలకు వెళ్లగానే గజపుష్టాకారాంతర్భాగం కనిపిస్తుంది. ముఖద్వారానికి ఎదురుగాను, గుహ అవతల చివరను, బుద్ధధర్మ చిహ్నమైన స్తూపశిల్పము చేయబడి వుంటుంది. క్రమేపి ఈ రచనా విధానం అంతటా అల్లుకుపోయింది !

ఈ చైత్యగుహలే, ఇటికలతో, రాళ్ళతో, నిర్మించిన చైత్యాలుగా మారినవి. అమరావతి, నాగార్జునకొండ, భట్టిప్రోలు, జగ్గయ్యపేట మొదలైన ప్రదేశాలలోని చైత్యములలో పూజా స్వరూపమైన స్తూపమున్నూ, రానురాను బుద్ధ విగ్రహములున్నూ గలిగి పూజనీయములైనవి. దానితో విగ్రహపూజ ఏర్పడినది. ప్రథమాన్ని నిర్మించిన ఈ చైత్యబౌద్ధదేవాలయాన్ని, తర్వాత వచ్చిన బ్రాహ్మణ మతావలంబులు ఆ విగ్రహాన్ని తీసివేసిగాని, ఆ విగ్రహాలకే వైష్ణవ, శైవ స్వరూపాలిచ్చిగాని, వీటిని హిందూ దేవాలయములుగా మార్చినారు. అట్టి దేవాలయమొకటి చేజర్లలోనున్నది.

విహారములు పెద్దవి. అవి మూడు నాలుగు వందల జనులు పట్టు సభామందిరములు. ఇవి సింహద్వారములు కలిగి, కుడ్యోపరిభాగములు లతావితాన చిత్రసంయుతాలై వున్నవి. విహారముల ముందు మొగసాలయున్న, లోపలి సింహద్వారమున కెదురుగా గర్భగుహయున్నూ వుండును. ఆదిలో, గర్భ గుహలో బుద్ధ మూర్తి చిహ్నములుగాని, రానురాను విగ్రహములను గాని ప్రతిష్ఠించేవారు. సభకు చుట్టున్ను సన్యాసులు నివసించడానికి గదులు చెక్కివున్నారు. వెలుగు వచ్చు ఆధారమేమీ లేకుండీ, చీకటి కోణములై యున్నవి. ఒక పెడ శయనించడానికి శిలావేదికలు చెక్కబడినవి.

ఈ విహారస్వరూపాలలో హిందువులు, ప్రథమ దేవాలయములను రాతిలో చెక్కినారు. హిందూ విహారములలో బౌద్ధ విహారములలోవలె భిక్షుకులుండు గదులులేవు. బౌద్ధమతము వల్ల ఆంధ్రదేశములో మొదట ఉద్భవించిన కట్టడము స్తూపము. అశోకుడు కళింగదేశములోను, శాతవాహన ముఖ్యపట్టణమైన ధాన్యకటకములోను, భట్టిప్రోలులోను స్తూపములు నిర్మించెను. జగ్గయ్యపేట స్తూపమున్నూ గుంటపల్లి స్తూపమున్నూ క్రీ.పూ. రెండవశతాబ్దము నాటివి. అప్పుడే తెలివాహనది గట్టున, రామతీర్ధములోను చిన్న చిన్న స్తూపముల నిర్మించిరి. ఇవి రాను రాను పెద్దవి చేయబడి, ఛత్ర శిఖరాలు గలిగి, వివిధ శిల్పములచే అలంకరింపబడి, పూర్వసౌందర్యమును ప్రతిబింబింపచేయుచున్నవి. ఉత్తర హిందూస్థానంలోని సాంచీ మొదలైన ప్రదేశములలో స్తూపములున్నవి. మన ఘంటసాల, గుడివాడలలో ఉన్న స్తూపములు రెండవ శతాబ్దము నాటివే !

అమరావతి, నాగార్జునకొండ, గుమ్మిడిమర్రు స్తూపశిల్పాలు, ఆయా ప్రదేశాలలో ప్రకాశించిన స్తూప స్వరూపాలలో శిల్పము చేయబడియున్నవి. స్తూపము కోడిగ్రుడ్డు అడుగు భాగము కొట్టివేసి బోర్లించినట్లుండును. ఇవన్నీ పల్నాటి తెల్లపాలరాయితో కట్టిరి. స్తూపానికి నాలుగు ప్రక్కలా నాలుగు అరుగులున్నవి. ఆనాటి శిల్పులు గుహా, చైత్య శిల్పాలను సమ్మిళితం జేసి, ఉద్భవింపజేసినారు. స్తూపాలన్నిటి చుట్టూ, మొదట కర్రతో నిర్మించినటిన్నీ తరువాత నల్లరాతితో నిర్మించినట్టిన్నీ, ఆ తరువాత తరువాత పాలరాతితో నిర్మించినటిన్నీ కంచెలు కట్టుచుండెడివారు. పొడుగునా నిలువు దూలాలు, మూడు అడ్డ దూలాలతో ఈ కంచెలు నిర్మించినారు. ఈ తెల్లరాతి కంచెల మీద అద్భుతమైన శిల్పము, ప్రతిభాపూరితమై ఉండేది!

సాంచీలోని మహాస్తూపం చుట్టున్నూ నాలుగు పాణిద్వారాలున్నవి. ఈ నాలుగు శిల్ప ద్వారాలున్ను ప్రపంచాద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని పుణికి పుచ్చుకొన్నవి. ఈ ద్వారములు నిండా మహావిన్యాసమైన శిల్ప కల్పన వున్నది. ప్రథమంగా స్తంభములన్నీ దారుశిల్ప స్వరూపాలు. పూర్వకాలం నుంచీ కీర్తి స్తంభాలు, జయస్తంభాలు, సహగమన స్తంభాలు, శాసన స్తంభాలు, దీపస్తంభాలు మొదలైనవి భారత దేశమంతటా నిండి వుండేవని కావ్యాది గ్రంథాలు చెప్పుతున్నవి. అయినా నేటి వరకు నిలిచివున్నవి మనదేశములో అశోకస్తంభాలే! ప్రథమంలో అశోకచక్రవర్తి, శిలాస్తంభాలే కాకుండా లోహస్తంభాలు గూడా చెక్కించినాడు. ఒక లోహతుల్య స్తంభమును పాశ్చాత్యులు బర్మింగ్ హోమ్క తీసుకొని పోయి, అచ్చటి వారి మ్యూజియములో పెట్టుకొనినారు. ఇప్పుడు ఢిల్లీలో ఒక అశోకుని స్తంభము, కుతుబ్మీనారులోనున్నది. మన ఆంధ్రదేశములోని స్తూపాల చుట్టున్ను ఆయకస్తంభాలు, ధర్మచక్ర స్తంభాలు మొదలైనవి గలవు.

క్రీ.శ. 3వ శతాబ్దిలోనే, శాతవాహనశిల్పము నుంచి ఉద్భవించిన పల్లవశిల్పము కాంచి, మహాబలిపురములోను, నెల్లూరు జిల్లా భైరవకోనలోను ఆలయ శిల్పమై పరిఢవిల్లినది. మహాబలిపురంలో ఉన్న రథస్వరూపాలు కొన్ని చైత్యములలాగు, కొన్ని విహారాకృతి కలిగియున్నవి. పశ్చిమ చాళుక్యులు కట్టించిన బాదామి నగరమును, అజంతా, కార్లే, నాసిక మొదలైన గుహలను జూచి, హైందవ సంప్రదాయంతో నిర్మించారు. పల్లవాలయ శిల్ప నిర్మాణము, చాళుక్య ఆలయ నిర్మాణము గమనించి రాష్ట్రకూటులు ఎల్లోరాలో పరమాద్భుతమైన గుహలను నిర్మించారు. ఈ ఎల్లోరా గుహలోని ఆలయములు, స్తంభాలు, యాత్రికమందిరములు మొదమండపము, కళ్యాణమండపము మొదలైన నిర్మాణములతో – విశ్వకర్మ దేవుని నిర్మాణములాగు, వికసించినవి. పాలంపేటలో బార్హట్ గుహలు ఉన్నత కళాసంపద గలిగినవి.

కాకతీయుల వెనుక రాయలయుగ శిల్పులు కాకతీయ శిల్పానికి వన్నెలుదిద్దే ఆలయ నిర్మాణాన్ని హంపి, తాడిపర్తి, పెనుగొండ, లేపాక్షి స్తూపాలు దగ్గరవున్నట్టి స్తంభనిర్మాణములోను పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, గాంగులు, తెలుగు చోళులు, విజయనగరం శిల్పుల పనితనంలోను, రూపుగొన్నవి. విజయనగరంలోని సప్తస్వరస్తంభాలు జగత్తులోని రసజ్ఞులందరుకున్ను అద్భుతరసాన్ని నివేదిస్తున్నవి ! హంపిలోని పద్మ ప్రాసాదము, ఏనుగులశాల, మహాసభావేదిక, వాని సోపానాది నిర్మాణములు హైందవరాజుల రసజ్ఞతను చాటుచున్నవి. విజయనగర విజయద్వారాలు గోపుర ద్వారాలు ఇప్పటికీ విచిత్రమైయున్నవి.

సింహాచలం మొదలగు అనేక చోట్ల చేయించినారు. రాయల సామంతపాలకులోన నాయకులు మధుర, తంజనగరములలో కట్టించిన ఆలయములు, తిరుమలనాయకుడు చేయించిన మధురవిమానం రాజమందిరములు, ద్వారములు అద్భుతము కొలుపుతూ ఉంటవి. ఈయన రాజమందిరము, ఒక్క మేకుగాని కఱ్ఱగాని ఉపయోగించని మహాభవనము. స్తంభాలు చిన్న చిన్న గోపురాలంత ఉన్నవి. ఆంధ్ర గాంగశిల్పులు ముఖలింగం, కోణార్క, భువనేశ్వరం జగన్నాథపురం ప్రదేశములలో, చాళుక్యాది ఆలయ నిర్మాణానికి సరిపోని వేరొకశిల్ప స్వరూపమైన ఆలయ నిర్మాణం నిర్మించినారు.

అజంతా బౌద్ధ గుహలలోను, అమరావతీలైనవన్నిటిని ఒక్కరాయైన పై నుండి తీసుకొని రాకుండా నిర్మింపజేసిరి. బెజవాడ, రాజమహేంద్రవరములలో చాళుక్యులు నిర్మించిన సుందరమైన దేవాలయములు వెలసినవి.

చాళుక్యుల తరువాత కాకతీయ ఆలయనిర్మాణము ఇంకా పుష్టిని చేకూర్చుకొని, మూలవిరాట్టున్న విమానములు, అర్ధమండపము ముఖదేవాలయముల ముందర ముఖ్య, విమానంకన్నా గోపురాలను ప్రథమంలో నిర్మించినది కుళోత్తుంగచోళుడు, దీన్ని అనుసరించి నాయకరాజులున్నూ దక్షిణమున గోపురనిర్మాణం చేయించిరి. చిదంబర గోపురం కుళోత్తుంగుడే నిర్మింపజేసినాడట ! పాలకొల్లు, మంగళగిరి, తిరుపతి, నెల్లూరులలోని ఆలయములు ఎత్తై, ఆశ్చర్యము గొలుపుతూ ఉంటివి. గాంగశిల్పులు నిర్మించిన విమానములు అంబరచుంబితాలైయున్నవి. తరువాత మనదేశమున వర్ధిల్లినది మహమ్మదీయ నిర్మాణము.

గోలుకొండ, బీదరు, అహమ్మద్ నగరము, హైదారాబాదు, ఓరుగల్లు, చైన్ననగరములలో బహమనీరాజుల యొక్కయు, నైజాము, కర్నాటక నవాబుల యొక్కయు మసీదుల, మీనారుల సౌందర్యం లోచనగోచరమవుతుంది.

ఆంధ్రులు వలసపోయిన బర్మా, జావా, బోర్మియో మొదలైన ప్రదేశములలో గూడా ఆంధ్రకళా నైపుణ్యం ఆ పరిసరముల కనువైన స్వరూపం దాల్చి – ప్రతిభావంతంగా భాసిస్తున్నది !

  *    *  *

అడివి బాపిరాజు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *