నిఖిల్ ఉత్తరాలు

Spread the love

పదింబావుకి కిటికీ దగ్గర నిలబడతాను పోస్ట్‌మాన్  కోసం నిరీక్షిస్తూ. అతను పదిన్నర ప్రాంతంలో వస్తుంటాడు. నాకు రోజూ ఉత్తరం అంటూ ఉండదు. ఒకోసారి నాకేదో ఉత్తరం వచ్చినా నాకు నిరుత్సాహమే అవుతుంది. నేనీ గదికి రాకముందు ఇందులో ఒక డాక్టరు ఉండేవాడు. అతనీ గది వదిలి వెళ్లిపోయి మూడు సంవత్సరాలయింది. అయినా ఏవో చాలా మందుల కంపెనీలు వాళ్ల మందుల గురించి చెప్పే కాగితాల్ని అతని పేరుకి పంపిస్తూ వుంటాయి. వారానికి రెండుసార్లయినా అలాంటి ఉత్తరాలు వస్తుంటాయి. నేను తలుపు దగ్గరకి పరుగెత్తి, ఆ కవరుని పట్టుకుంటాను, కాని అందులో ఉన్నదంతా నేనింతకుముందెప్పుడూ వినని, పేర్లు పలకలేని మందుల గురించి సిఫారసులు, ‘టెండరిల్’- సత్వరం కీళ్లవాపుల్ని తగ్గిస్తుంది. ‘బుటాజో లిజోన్’- నాటకీయంగా నొప్పులకి జవాబు, ‘యూరాక్స్ హైడ్రోకార్టిజోన్- క్లిష్టమైన చర్మవ్యాధుల సమస్యలకు సులభ పరిష్కారం, ‘కెనామినా’ ఎలర్జీలకు మంచి నియంత్రణ ఇత్యాదులు… ఇదంతా నన్ను గొప్పగా విసిగిస్తుంది. కాని ఆ కంపెనీలకు “అయ్యల్లారా డాక్టరుగారు ఇక్కడ ఇప్పుడు నివసించడంలేద”ని చెబుతూ ఉత్తరాలు రాయడానికి ఓపికలేదు. కాబట్టి డాక్టరు  ఉత్తరాలు నాకు ఇంకా వస్తూనే ఉంటాయి.

అయితే ఒక్కోసారి నాకు కావల్సిన ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రం నేను ఎప్పుడూ ఊహించని ఉత్తరం. కొన్ని నెలలక్రితం అలాంటిదొకటి వచ్చింది. అది ఇలా:

16 అక్టోబరు

 ప్రియమైన బ్రహ్మదత్తా,

 నువ్వు ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యపడతావని తెలుసు. నేను నీకు బహుశా జ్ఞాపకం వున్నా లేకపోయినా సరే నేను మాత్రం నీకు రాయాలి. నేనొక నివేదిక తయారుచేస్తున్నాను. ఈ లేఖ దాని  గురించి.

మా జనరల్ మేనేజర్ గారు ఈ నివేదిక 15 డిసెంబరు లోగా కావాలన్నారు. అంటే నాకు ఈ పని చెయ్యడానికి ఒక్క రెండు నెలలు మాత్రం గడువు. మరి ఇదంతా టైపు చెయ్యడానికి, ఇంకా పదిరోజులయినా పక్కకి పెట్టాలి. ఇంకెవరితోనో టైప్ చెయ్యమనడానికి వీలులేదు. నేను టైప్ చేస్తే, రెండు వేళ్లతోనే చెయ్యగలను కాబట్టి- మరి దీనంతటికీ నాకు చాలా సమయం పడుతుంది.

అసలు ఇది నా మొదటి నివేదిక కాదు. గతంలో కొన్ని తయారుచేశాను. కాని ఇలాంటిది ఎప్పుడూ చెయ్యలేదు. ప్రతి విషయానికీ ఇది కీలకం. అయితే ఈ నివేదికని చదివి జనరల్ మేనేజర్ గారు చాలా సంతోషించి నాకు ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఇస్తారని ఏమీ నమ్మకం లేదు. అదీకాక అసలు దీన్ని చదివి ఆయన తప్పకుండా ఇష్టపడతారా అన్నది కూడా ఎవరికి తెలుసు? ఒక్కోసారి ఒక అధ్వాన్నమైన నివేదికని వారు చదివి దానిలోని వైరుధ్యాన్ని కూడా లెక్కచెయ్యకుండా దాన్ని ఇష్టపడ్డం కూడా చూశాను. అయితే అతన్ని మనం తప్పుపట్టలేము. ఎందుకంటే ఏ నివేదిక ఏ నిర్దిష్టమైన ప్రయోజనానికి ఉపయోగపడుతుందో ఆయనకి మాత్రమే తెలుసు. మనకి అంతా తెలియదు కాబట్టి మనం ఆయనలో ఈ అవకతవకలు చూస్తాము.

కానీ ఈ నివేదికని నేను అత్యంత జాగ్రత్తగా తయారుచెయ్యాలి. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు ఈ సమస్యమీదే నివేదికలు సమర్పించారు. (నేను వాటిని చూడడంలేదు). మా నివేదికల మధ్య ఏవేనా తేడాలు వుంటే జి. ఎమ్. గారు తప్పకుండా మరింత ఆరా తీస్తారు. అదీ కాక ఇంకొకరో ఇద్దరో ఇదే సమస్య మీద నివేదికల్ని రాస్తున్నారని కూడా ఒక పుకారు ఉంది. తప్పకుండా నా నివేదికని మిగతా వాటితో సరిపోలుస్తారు.

ముఖ్యంగా నాకు విచారం కలిగించేదేమిటంటే, ఈ నివేదిక రాయడం పూర్తి అయిపోగానే దాని ఆచూకీ కూడా నా దగ్గర ఉండదు. ఎందుకంటే దీనికి కాపీ తీసి ఉంచుకోవడానికి పర్మిషన్ లేదు. ఈ నివేదికా అంతకుముందు ఏవేనా నోట్సు రాసుకునివుంటే అవీ మొదటి రాత ప్రతులూ అన్నీ పంపించేయాలి. ఒక నివేదికను ఎంతో శ్రమకి ఓర్చి ఎంతో జాగ్రత్తగా తయారుచేసి పంపిస్తాము. కాని దాని జ్ఞాపికగా ఏదీ ఉంచుకోవడానికి వీలులేదు.

ఆ కారణంగా నేను నీకు రాస్తున్నాను. ఇది వెర్రి సాహసం అవ్వొచ్చు.  కొంతమంది దీన్ని వెర్రితనం అనొచ్చు. నా ప్రణాళికలు తప్పుగా పరిణమిస్తే నేను ఏ ప్రమాదాన్ని, ఘోరాన్ని ఎదుర్కోవాలో చెప్పలేను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నా పథకం ఏమిటంటే: రహస్యంగా నివేదిక కాపీ ఒకటి నీకు పంపిస్తాను. నా అందరి బంధువుల స్నేహితుల డేటా అంతా నా కంపెనీ దగ్గర ఉంది. కాబట్టి దీన్ని వాళ్లెవకరికేనా పంపించడం మూర్ఖత్వం. నీ దగ్గర ఇది వుంటే, కాస్త తక్కువ ప్రమాదం. నువ్వు నా పాత స్కూలు విద్యార్థివి కాబట్టి ఈ మాత్రం సహాయం నాకు చెయ్యగలవా?

నా చిరునామా రాయడం లేదు. కంపెనీకి ఈ విషయాలు తెలియకూడదు. పంజ్వానీ సిండికేట్ వారికి నా చిరునామా దొరకడం మంచిది కాదు (వాళ్లకి ఇప్పటికే దొరికిపోయిందేమో) పంజ్వానీ సిండికేట్ వాళ్లు మా కంపెనీ కొన్ని రహస్యాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నారు. మా ఉత్తర ప్రత్యుత్తరాల మీద నిఘా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి కొన్ని రోజుల తరవాత నాకు రాయాలంటే ఏ చిరునామాకి రాయాలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఇంతే.

నీ

నిఖిల్ దేవ్ .

దేవ్. మొదట ఈ పేరు నన్ను కలవర పెట్టింది. కానీ, ‘ఒక పాత స్కూలు సహవిద్యార్థి అన్న మాటలు నాలో ఏదో గంటను మోగించాయి. నిఖిల్ దేవ్  జమ్‍షెడ్‍పూర్‍లో ఒక ప్రాథమిక పాఠశాలలో నా సహవిద్యార్ధి. నిజంగా అతనితో నేనెప్పుడూ సన్నిహితంగా లేను. అప్పటి నా దగ్గర మిత్రుల్ని కూడా పూర్తిగా మరిచిపోయాను. మరి ఈ నిఖిల్‍ను  ఎలా జ్ఞాపకం ఉంచుకోగలను! నా జ్ఞాపకాల్ని తరిచి తరిచి చూస్తే, కళ్లద్దాలు పెట్టుకున్న సన్నపాటి అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు. అదే నా జ్ఞాపకంలో గుచ్చిపెట్టింది.

ఉత్తరం టైప్ చేసి ఉంది. సంతకం కూడా టైప్ లోనే. పోస్ట్‌మాన్  చదవడానికి ప్రయత్నించాడు, కాని అది బాగా కనిపించలేదు. ఎక్కడ అది పోస్ట్ చెయ్యబడిందో తెలియలేదు.

అలాంటి ఉత్తరం వస్తే ఎవరు ఏమి చేస్తారు? దాన్ని మూడు నాలుగు సార్లు చదివి నా డెస్క్ డ్రాయర్లో పడేశాను. ఓ రెండు వారాల తరువాత ఇంకో ఉత్తరం అందింది. అది ఇలా:

25 అక్టోబరు

ప్రియమైన బ్రహ్మా,

గత నాలుగు రోజుల్నుంచీ నీకు రాయడానికి అవకాశం కోసం వెతుకుతున్నాను. ఇంకో ముప్పై అయిదు నిమిషాల్లో పూర్తి చెయ్యాలి. బహుశా కొన్ని రోజుల క్రితం నీకు ఒక నివేదిక గురించి రాశాను. అసలు సంగతి ఏమిటంటే, నేను ఎలాంటి నివేదికా రాయటంలేదు. అయితే నేను నీకు రాసిందంతా అబద్ధం అనీ కాదు.

నేను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తిరుగుతున్నానని బహుశా నీకు రాసి వుంటాను. నేను గత మూడు నెలల నుంచీ ఈ గదిలోనే ఉంటున్నానని చెబితే ఆశ్చర్యపడకు. ఒకసారి రాత్రీ పగలూ కూడా ప్రదేశాలు మారుస్తూఉంటే ఒకే చోట వుంటున్నానేమో అని అనిపిస్తుంటుంది. అలా అని దానివలన ఎక్కువ తేడా కనిపిస్తుంటుందా అంటే అదేమీ లేదు.

తప్పుడు సమాచారం సంగతి ఇదే (సమాచారం అనేది ముఖ్యంగా తప్పుడు సమాచారమే ఈ అజ్ఞానపు యుగంలో)

నేనిప్పుడు వివరణ కావాలని పంతం పట్టి ఒక ఉత్తరం రాస్తున్నాను. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరణ కావాలని రాయడానికి ఇదే సమయం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం చేస్తున్నాను. కాని సర్వీస్ కండిషన్లేమిటో నాకు స్పష్టంగా తెలియదు.

కాబట్టి ఈ దిగువ అంశాల్ని నేను లేవదీస్తున్నాను.

1. ఏ అధికారులు నా పైస్థాయివారో, ఎవరు నా కిందివాళ్లో స్పష్టంగా తెలియజెయ్యండి. నాకు అనుమానమేమిటంటే నాకు ఆజ్ఞలు ఇచ్చే కొందరు అధికారులు నిజంగా నా శ్రేణికి కిందవాళ్ళు. నేను కొంతమందికి ఆజ్ఞలు ఇస్తుంటాను కాని వాళ్ళు వాటిని లెక్క చెయ్యరు. వాళ్ళు నా పై శ్రేణివాళ్లేమో. అయితే ఎవరి ఆజ్ఞల్ని అయితే నేను లెక్కచెయ్యనో వాళ్ళు నా పై శ్రేణివాళ్లేమో అని కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నా ఆజ్ఞల్ని పక్కకి పెట్టే కొంతమంది అసలు నా కిందివాళ్ళేమో కాబట్టి ఎవరి ఆజ్ఞలు ఎవరు శిరసావహించాలి?

2. ఇంకొక ముఖ్యమైన పాయింటు. నాకు సమానంగా వున్న శ్రేణిలో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎంతమంది? వాళ్ళని నేను ఎలా చూడాలి? వాళ్ల దగ్గర్నుంచి ఎటువంటి నడవడిక ఆశించవచ్చు?

3. మాకు వచ్చిన ఒక సర్క్యులర్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, మాకు ఉద్యోగపు కాలంలో వచ్చే మొత్తం జీతం అంతా మేము పదవీ విరమణ చేసినపుడు వస్తుందని, మరయితే సమయం రాకముందే విరమణ చేస్తే ఏమైనా వస్తుందా? వస్తే ఎంత?

4. నా డెస్కును దక్షిణ ముఖంగా పెట్టుకొంటే ఏమైనా అభ్యంతరం ఉందా?

5. ఎర్ర సిరా వాడవచ్చా?

 6. ఉద్యోగాలకని దరఖాస్తులు పెట్టేవాళ్ళని ఎన్నాళ్లు లైన్లో వెయిట్ చేయించవచ్చు?

7. ప్రతి కాగితాన్ని వాటర్ మార్క్ ఉందో లేదా పరిశీలించాలా?

ఇంకా కొన్ని ప్రశ్నలు నా మనసులో ఉండే ఉంటాయి. వాటికి ఇంకా రూపం రాలేదు. కాబట్టి ఇప్పుడు వాటిని కాగితం మీద పెట్టలేను. ఈ పై పాయింట్ల మీద నీ అభిప్రాయం ఏమిటో తెలిపితే సంతోషిస్తాను.

ఇంకో ముఖ్యమైన విషయం. వీటి మీద క్లారిఫికేషన్ కావాలని డిమాండ్ చేద్దామనే ఉంది కాని ఏ రుతువులో మీ ఎంటర్ ప్రైజ్ చేస్తే మంచిదో తెలియదు. నా ఉద్దేశంలో వర్షాకాలం అయితే మంచిది. ఇళ్ళూ అవీ తెల్లగా తడిగా ఉంటాయి. వీధుల్లో గొడుగులు తేలుతూ ఉంటాయి. కిటికీ దగ్గర కాలి ఉంటుంది. కాని కొంతమంది చలికాలం అయితే  మంచిది అని అంటారు. ఏమో మరి.

అసలు ఇబ్బంది ఏమిటంటే ప్రస్తుతం ఏ రుతువో తెలియకుండా ఉంది. ఈ  ఉత్తరం పైన 28 అక్టోబరు అని రాశాను కాని దానికి పెద్ద అర్థమంటూ లేదు. ఇక్కడ ఒక చిన్న కిటికీలోంచి పైకి చూస్తే ఆకాశంలో మేఘాలు అసలు లేవు. ఇప్పుడు చాలా వేడిగా ఉందని అనలేము. అలా అని చలిగా అని కూడా చెప్పలేము. అలాంటప్పుడు దీన్ని వేసవికాలం అనవచ్చా కాకపోతే, వేసవి కాలపు మొదటి రోజులు అనో? లేక చివరి రోజులు అనో? మూడు రోజుల క్రితం సాయంత్రం చల్లటి గాలి వీచింది. అవును. నాకో స్వెటర్ కావాలని కూడా అడిగేను. అది తొడుక్కుంటే సుఖంగా ఉండేను. కాని ఆ రాత్రి మధ్యలో ఎప్పుడో లేస్తే, ఒళ్ళంతా చెమటలు, ఒకటే వేడి, స్వెటర్ తీసి పారేశాను. మళ్ళీ దాని అవసరం లేకపోయింది. అలా అని ఇది చలికాలం కాదని ఒట్టేసి చెప్పగలరా? చాలాసార్లు చలికాలం అసలు చలిగానే ఉండదు.

మరి ఇది చలి లేని చలికాలం అయితే మరి ఇది వర్షాకాలం అయివుండొచ్చు కదా? వర్షాలు లేని వర్షాకాలం?

అలా అని వర్షాలు లేవని కాదు. నిన్న పొద్దున కిటికీలోంచి చూస్తే, వీధంతా పూర్తిగా తడిసి ఉంది. గోడల వేపు చూశాను. కాని గోడలు నీటిని త్వరగా పీలుస్తాయి. కాబట్టి చెప్పలేకపోయాను. ఏమో, తెల్లవారుజామునే వచ్చి వాళ్లు వీధంతా కడిగి ఉండొచ్చు. కాని ఈమధ్య వాళ్ళు వీధులు కడగడం మానేశారని జ్ఞాపకం. అయితే మళ్ళీ మొదలు పెట్టారేమో. అప్పుడప్పుడోసారి కడగటం మొదలు పెట్టుండొచ్చు. కాబట్టి, నిన్న వర్షం పడిందో, వాళ్ళు వీధి కడిగారో చెప్పడం నాకు కష్టం.

ఏ రుతువూ నా దుఃఖం అన్యాయం చెయ్యలేదు. నువ్వు ఈ గొడవలూ ఈ  సమస్యల మధ్య నలుగుతున్న నన్ను రక్షించగలిగితే బాగుంటుంది. నువ్వు బొంబాయిలో ఉంటావు కాబట్టి నీకిలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. నీ దగ్గర్నుంచి జవాబు వచ్చేటప్పటికి నేను ప్రణాళికగా రాయబోయే ఉత్తరానికి మనసులో ఒక నిర్ధిష్టమైన రూపు వస్తుంది.

యీసారి కూడా నీకు నా చిరునామా రాయటంలేదని మళ్లీ చెప్పనక్కర్లేదు. క్రితం ఉత్తరంలో ఎందుకో బోధపరిచాను. మళ్లీ మళ్లీ సాకులు చెప్పవలసిన అవసరం రాకూడదు.

కొద్దిరోజుల్లో నువ్వు నాతో ఎలా టచ్ లోకి రాగలవో చెప్తాను. అంతా భవిష్యత్తు బావుంది. ఋతువే బాగోలేదు.

ఉత్తరం ఇక్కడ ఆగిపోయింది. చప్పున రాయటం ఆపేసినట్లు సంతకం లేదు. నీలిరంగు నోట్ పేపరు లావుగా పక్కకి ఒరిగిపోయే అక్షరాలు. తనదికాని చేతిరాతతో ఉద్దేశపూర్వకంగా రాసినట్లు అనిపించింది.

ఉత్తరం మీద పోస్ట్ మార్కు చదవగలిగాను. ఇంతకుముందు వచ్చిన ఉత్తరం పైన పట్నపు పోస్టు మార్కులాగే ఉంది.

కొద్దిరోజుల తరువాత ఇంకో ఉత్తరం అందుకున్నాను.

ప్రియమైన బ్రహ్మా

నేను రాజీనామా ఇవ్వడానికి తయారవుతున్నాను. మరింక లాభం లేదు.

ఈ ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచే నా మనసులో అనుకుంటున్నదల్లా మరేమీ కాదు. ఎలా ఈ రాజీనామా ఉత్తరం రాయాలనే (ఇప్పుడు తెలుసును నాకు)

రాజీనామా ఇచ్చేసిన తరువాత నీ దగ్గరకొచ్చి ఉండొచ్చా?

మనమిద్దరమూ బాగానే కలిసి ఉండొచ్చని అనుకుంటున్నాను.

ఆలోచించు.

మళ్లీ రాస్తాను.

ఈ ఉత్తరానికి తారీఖు లేదు. దస్తూరీ కూడా ఇంకోలా ఉంది. గుండ్రటి అక్షరాలు, మాటల మధ్య పెద్ద ఖాళీలు, ఒక్కో మాట ఒక ద్వీపంలాగ.

ఉత్తరం గురించి దీర్ఘంగా ఆలోచిం చాను. కాస్త చికాకు కూడా పడ్డాను. నా దగ్గర నాతో ఉండడానికి అతనికి హక్కు ఉంది? ఇదేం న్యాయంగా లేదు. నిజం చెప్పాలంటే ఎవరిదో అడ్రసు సంపాదించావు కదా అని వాళ్ల దగ్గరకు వెళ్ళి వాళ్లతో ఉంటారా ఎవరైనా? నా గురించి అతనికి ఏమిటి తెలుసు? నాకేదైనా ఉద్యోగం ఉందో లేదో తెలుసా? నాకు పెళ్లయిందో లేదో అని? నాకు పిల్లలెందరని ?ఎంతమంది ఆడపిల్లలు, వాళ్ల వయస్సులు ఎంత, నా ఇల్లు ఎలా ఉంటుంది, గదులెన్ని, మా నాన్న బతికున్నాడా?

మా అమ్మ, నా ఆర్థిక పరిస్థితి?

ఉత్తరాలయితే పర్వాలేదు. కానీ మనిషి. నన్ను నేను ఆపుకున్నాను. నిజంగానే అతను వచ్చి నాతో ఉంటే అని నన్ను నేనే అడిగాను. ఈ గదిలో గత మూడు సంవత్సరాలుగా ఒక్కణ్ణి జీవిస్తున్నాను. ఇందులో నేను తప్ప ఇంకెవ్వరూ నిద్రపోలేరు. నేను బట్టలన్నీ విప్పి పారేసి నగ్నంగా పడుకుంటాను. మరి అతను ఇక్కడ ఉంటానంటే అది ఎలా సాధ్యం? ఒంటిమీద ఏమైనా బట్టలుంటే నాకు నిద్ర పట్టదు. అంటే అర్ధం రాత్రి తర్వాత ప్రతి రాత్రి నిద్రలేకుండా ఉండడమే.

అలా అనుకుంటూ ఆందోళన పడ్డాను. రెండు రోజుల తరువాత ఇంకో ఉత్తరం వచ్చింది.

ప్రియమైన బ్రహ్మా

నాకీ ఉద్యోగం వచ్చినప్పుడు, రాజీనామా గురించి ఆలోచించడం అన్నది ఉత్త తెలివితక్కువతనమే అన్న ఊహ ఉండేది. మరలాంటప్పుడు రాజీనామా గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం ఎందుకు చేశాను? కాస్త ఉషారుగా ఉండాలని కాబోలు. కానీ రాజీనామా ఉత్తరం రాయడం గురించే నా ఆలోచన అంతా? నాకేమిటి కావాలనుకుంటున్నాను? ఆ మాటలు నా బుర్రలో ఏమిటి చేస్తున్నాయి?

నేను రాద్దామనుకున్నదంతా వేరే విషయమని ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తోంది. నిజం చెప్పాలంటే, నేను ఒక నిందారోపణపూర్వక లేఖని రాద్దామని గట్టిగా ప్రయత్నిస్తుండేవాణ్ణి అన్నమాట. అంతట్నీ కరెక్ట్‌గా చూస్తూ రాద్దామని.

అలాంటి విషయాల్లో ఎవరైనాసరే జాగ్రత్తగా ఉండాలి. ప్రతిమాటా ఆచితూచి వెయ్యాలి. ప్రతి విషయాన్ని సరిగ్గా బేరీజు వేస్తూ వాడాలి. అటువంటి కష్టతరమైన పనిని చెయ్యడానికి నాకు కావాల్సిన పరిపక్వత ఉందని నమ్ముతున్నాను. కాబట్టి ఇదంతా పూర్తి అవ్వాలని నిశ్చయించుకున్నాను.

గత కొన్ని నెలలుగా మా కంపెనీ విషయాల్ని చాలా దగ్గరగా నిశితంగా స్టడీ చేస్తున్నాను. ముఖ్యంగా మా జి.ఎమ్ ప్రవర్తన. ఈ మధ్య పంజ్వానీ సిండికేట్ మా పరిశ్రమల రహస్యాల్ని చేజిక్కించుకుంది. వాళ్లు ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టారు. దీనంతటికీ వెనుక జి.ఎమ్. గారే ఉన్నారని నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది. ఇంకా కొన్ని విషయాల్ని కూడా  నేను గమనించాను.

కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ తో  కలిపి బోర్డ్ అఫ్ డైరక్టర్స్‌కి  ఒక సుదీర్ఘమైన లేఖ రాద్దామని తయారు చేస్తున్నాను.

అందుకని ఇప్పుడు నీ సహాయం కావాలి. ఈ ఉత్తరాల్ని పంపడం అంత క్షేమంకాదు. కాబట్టి దాన్ని నీకు పోస్ట్‌లో  పంపిస్తాను. నువ్వు దాన్నంతటినీ టైప్ చేసి, వాళ్లకి పంపి, అసలుని కాల్చేయాలి.

ఇంకా కొన్ని విషయాలు నీకు రాయాలి. కాని మిగిలిన సమయం తక్కువ.

నీ,

సచ్చిదానంద్

ఈ ఉత్తరం టైపు చేసి వుంది, సంతకం తప్ప.  

వింత ఏమిటంటే అతను నా దగ్గరకి వచ్చి ఉండడం అవదని నాకు విచారంగా ఉంది.! అతన్ని రిసీవ్ చేసుకునేందుకు రైల్ స్టేషన్‌కి వెళ్లి వుండును. అతని సూట్‌కేస్ మోసి ఉండును. గదిలో ఉన్న ఒక కోటు కొక్కీకి అతని కోటు తగిలించి వుందును. అతను తన టూత్ బ్రష్ తెచ్చు కోడం మరచిపోయి వుంటే, మేడ కిందకి పరుగెత్తి ఒకటి కొని అతనికి యిచ్చివుందును. సినిమాలకి తీసుకుని వెళ్లి వుండేవాణ్ణి. అతన్ని ఏవో ప్రశ్నలడిగి అతనితో అభిప్రాయాల్ని తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహం వుంది నాకు!

మరో రెండున్నర నెలల దాకా అతన్నించి ఉత్తరం లేదు. అతన్ని మరిచిపోతేనే మంచిదని నిశ్చయించాను. ఆ సమయంలో, ఒకరోజు ఉత్తరం వచ్చింది.

2 ఫిబ్రవరి 1967

ప్రియమైన బ్రహ్మదత్తా

 ప్రతీది  దేని జాగాలో అది పడుతోంది. నేను ఎందుకు ఒక నిందారోపణ ఉత్తరం రాద్దామనుకున్నానో నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నిందారోపణ చెయ్యడం కూడానా!

నిందారోపణలు కూర్చి రాద్దామని కూచున్నాను కాని అసలు క్షమాభిక్ష కోరుకుంటూ రాస్తున్నాను అని త్వరలోనే తెలిసిపోయింది నాకు.

అవును, క్షమించమని అర్థించాను. ఎందుకని?

పెన్సిలు చెక్కుకుంటున్నప్పుడు పైకి చూశానని, మూడో సందు వంపు కోసం వెనక్కి చూశానని, పొద్దున్నే నోరు కడుక్కోకుండానే లోటస్ ఆఫ్ ది ట్రూ లా’ చదివానని, కిటికీలో ఆపిల్ ముక్క పెట్టి అలా కుళ్ళబెట్టేనని, కొత్తగా వచ్చిన వార్తాపత్రికని విప్పి వాసన చూశానని, దీపస్తంభాన్ని ముట్టుకోలేదని, ఆకుపచ్చగ్లాసు లోంచి నీళ్ళు తాగేనని, దేవీదాస్ బషీ అన్న పేరు ఉచ్చరించానని, ఓ మేకుని దాచానని, చిన్న పిల్లల పాటలు రాద్దామనుకున్నానని, రాసిన మాటల్ని తుడిచేద్దామనుకున్నానని, అద్దం మీద ఊదేనని.

ఇప్పుడు నీకు ఉత్తరాలు రాసినందుకూ.

ఇదే ఆఖరు

ఏ కారణమూ లేకుండా నీకు రాయలేదని మాత్రం నా అంతకి నేను అనుకుంటున్నా. నేను ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే, నా ఉత్తరాలన్నిట్నీ కాల్చేయమని- దీనితో సహా- అని అడుగుదామని. చాలా అనుభవించాను యిప్పటి దాకా.

సంతకం

ఉత్తరంలో సంతకం ఇంగ్లీషులో వుంది, కాని సంతకం చదవలేకపోయాను పేరు మొదట్లో ‘సి’ లేక ‘ఓ’ అనొచ్చు.

అతన్ని పూర్తిగా పూర్తిగా మరిచిపోవాలింక, అని అనుకున్నాను. అతని ఉత్తరాల్ని మాత్రం చింపేయలేకపోయాను. నా డెస్కు అరలో వాటన్నిట్నీ పడేశాను.

   ఆ తరువాత  కాగితం సంచుల్ని తయారు చెయ్యడం పనిలో మునిగిపోయి ఉత్తరాలు సంగతంతా మరిచిపోయాను. నెల తరువాత ఒక ఉత్తరం వచ్చింది.

బ్రహ్మా,

ఉత్తరం మొదలుపెట్టాను గాని ఏం రాయాలో తెలియలేదు. కాబట్టి చింపేశాను. మళ్ళీ కూచున్నాను. మళ్ళీ చింపేశాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించేను. నాలుగు రోజులు బుర్ర అంతా వెతికిన తరువాత. ఈసారి

ఈసారి ఏమిటి రాయాలో తెలుసు. నా గురించి అంతా రాయాలి. నా కోసం మాత్రమే.

ముందు ఏమిటుందో స్పష్టంగా తెలుస్తోంది. అయితే దాని గురించి  ఏ ఆదుర్దా లేదు. మొన్నంటే మొన్న తెలిసింది మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో  చాలామంది పంజ్వానీ సిండికేటికి చెందిన వారేనని. నాకు యింక దానితో పనిలేదు. నిన్ను ఆఖరిమాటగా ఒకటి అడుగుతున్నాను. నా గురించి రాస్తున్న ఈ ఉత్తరం మా కంపెనీ వాళ్ళ- అదే, పంజ్వానీ సిండికేట్ కంపెనీ… చేతుల్లోకి పడకూడదు. నువ్వు యిక్కడకి వచ్చి దీన్ని తీసుకుపోగలవా?

 దీన్ని పోస్ట్ చెయ్యలేను అంతా అయిపోయి వుంటుంది.

ఎడ్రస్: /సాఫల్య

 డాక్టర్ అంబేద్కర్ రోడ్

 ఓల్డ్ అంధవన బీహార్

సాహిబ్ గంజ్ .

నా గదిలో డస్క్ డ్రాయర్ లో ఒక నోట్ పుస్తకం నీకు కనిపిస్తుంది. కవర్ మీద  నెహ్రూ బొమ్మ వుంటుంది. కాగితాలకి రూల్స్ గీతలు వుండవు. దీన్ని నువ్వు తీసుకోవాలి.

నేనెందుకిది రాస్తున్నానంటే, బహుశా నువ్వొచ్చేటప్పటికి నేను యిక్కడ వుండను.

ఉత్తరానికి తారీఖు లేదు. సంతకం లేదు. ఏదో నోట్ బుక్ లోంచి చింపిన కాగితం మీద రాసి వుంది. ప్రతి మాట లోని ప్రతి అక్షరం మెల్లగా అతికష్టంతో రాసినట్లు వుంది.

నేను సందిగ్ధంలో పడ్డాను. ఏం చెయ్యాలో తెలియలేదు. సాహిబ్ గంజ్ కి  వెళ్ళాలా? ఒకవేపు నాకు వెళ్ళాలనే వుంది. ఇంకోవేపు, నేను వెళ్ళడం, ఉత్త తెలివితక్కువతనమేమో అనిపిస్తోంది. నేను ఈ ఉత్తరాన్ని నిజంగా నమ్మవచ్చా? తీరా వెళ్తే, అంతా ఒక వ్యర్ధమైన దూర ప్రయాణమే అవుతుందేమో. డబ్బు దండగ, ప్రయాణమే అవుతుందేమో నేను కాగితం సంచులు తయారుచేసి కొంత డబ్బు సంపాదించాననుకోండి. అయినా….

రెండు రోజులు మనసు ఊగిసలాడింది. నిద్ర కష్టం అయింది. మూడో రోజు ఉదయం లేచి స్నానం చేసి సూట్ కేస్లో కొన్ని ఏవో కుక్కుకొని, రైలు స్టేషనుకి వెళ్లేడు.

సాహిబ్ గంజ్ స్టేషన్లో దిగి ఊళ్లోకి వెళ్లేడు. అంతా గలీజుగా ఉంది ఊళ్లో. తారురోడ్లేగాని, సందులాంటి రోడ్లు, అంతా ధూళి. రోజంతా ప్రయాణం చేసినందువల్ల ఒళ్లంతా నొప్పులు. కళ్లు భారంగా వున్నాయి. దరిదాపు  సాయంత్రం అయింది. కాని యింకా వేడిగా పొడిగా  వుంది గాలి.

అంబేద్కర్ రోడ్ చేరేసరికి బాగానే సమయం పట్టింది. ఎవరూ నాకు సరిగ్గా దారి చెప్పలేదు. మనుష్యులు బద్ధకంగా ఉన్నారు. ఇళ్లముందు మెట్లమీదో లేక నులకమంచాల మీదో బద్ధకంగా కూచుని వున్నారు.

పాత అంధవనం ఊరంతటికీ ఒక పాత భాగం అని ఎవరో చెప్పేరు. ఊరవతల బుద్ధుడి కాలం నించీ వచ్చిన పేరుతో చిన్న  అడివిలాంటి జాగా, ‘అంధవనం’ అంటే గుడ్డివాళ్ల అడివి అని అన్నారు. ఇప్పుడు ఊరు ఆ అడివిని మింగింది ‘అభివృద్ధి’  పేరు మీద.

ఇళ్ల పైభాగాల మీంచి సూర్యకాంతి మాయమయిపోతున్న సమయంలో అంబేద్కర్ రోడ్డు చేరుకున్నా. వీధి చివరలో ఒక చిన్న హోటల్ ఉంది. కొంచెం దూరం తరువాత ఒక కిరాణా దుకాణం. ఎడమవైపు ఆకాశంలో ఒక పొగ నాళిక ఊగుతోంది. రోడ్డు మీద ఒక చచ్చిన కాకి చుట్టూ చేరిన పిల్లల మధ్యలోంచి నడిచాను. కుడివేపు ఒక గేటుకి ‘సాఫల్య’ అని బోర్డు తగిలించి వుంది. అది ఒక ఒంటి అంతస్తు మేడ. పాతదే కాని యీ మధ్యనే రంగువేయించినట్లుంది. గేట్లోంచి లోపలికి వెళ్లేను.

 ఓ రెండు  నిమిషాలు నిలబడ్డాను. లోపల నిశ్శబ్దంగా వుంది. ఒక ముసలాయన పైకి వచ్చాడు.

‘ఎవరైనా’ ‘దేవ్’ అన్న పేరుగలవాళ్ళు యిక్కడ వున్నారా?

‘మీరెవరు?

‘ఒక స్నేహితుణ్ణి. బ్రహ్మదత్త! ‘

ముసలాయన బుర్ర ఊపేడు. నన్ను వేచి ఉండమని సౌంజ్ఞ చేసి లోపలికి వెళ్లేడు. ఒక తాళాల గుత్తితో పైకి వచ్చి వెనక వున్న మెట్ల మించి తనని అనుసరించమని కదిలేడు.

కర్రమెట్లు కిరకిర శబ్దంలో కలిసి ముసలాయన గొంతు: ‘హాస్పిటల్ వాళ్లు పొద్దున్నే బాడీని తీసుకపోయారు. హాస్పిటల్‍కి  తన దేహాన్ని యిప్పించెయ్యమని అడిగాడు.

ముసలాయన గదితలుపు తెరిచాడు. లోపలికి అడుగు పెట్టేను. చుట్టు చూశాను. ఒక మంచం, పుస్తకాలు, డెస్క్ మీద ఒక దీపం ఒక ఏష్ ట్రే . రెండు సిగరెట్ పాకెట్లు. చొక్కాలు గోడమీద రెండు మేకులకి వేళ్లాడుతూ ఉన్నాయి. మూలలో ఒక పెద్ద పెట్టే. నేను హతాశుడైనానని, నాకు నవ్వొచ్చింది.

ముసలాయన నా పక్కన నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నేను ముందుకి అడుగు వేశాను. డెస్క్ డ్రాయర్ లాగేను. కాగితాలు, నోట్ పుస్తకాలు, కలాలు, పెన్సిళ్లు, కాస్త చిల్లర నాణేలు. నోట్ పుస్తకాలు వెతికి, నెహ్రూ బొమ్మవున్నది పైకి తీశాను. దాన్ని నా సూట్ కేసులో పెట్టేను. తాళం వేశాను. ముసలాయన్ని ఓసారి చూశాను. నాకు ఏదో యివ్వడానికి ఆయన పక్కకి కదిలేడు. గదిలోంచి పైకి వచ్చాను. ముసలాయన గదికి తాళం వేస్తూంటే నేను మేడమెట్ల మీంచి దిగేను.

ప్రయాణంలో నోట్‌బుక్  తెరవలేదు. ఇంటికి చేరిన తరువాతే తెరిచాను.

నోట్ బుక్ అంతా ఖాళీ, ఆఖరిపేజీలో అడ్డదిడ్డమైన చేరాతతో ‘నిఖిల్’ అని రాసి వుంది.

పేజీ తరువాత పేజీ తిప్పుతూ పుస్తకం అంతా మళ్ళీ చూశాను. ఇదేనా అతను చెప్పిన పుస్తకం? కవర్ మీద నెహ్రూ బొమ్మ వుంది. ఎవరైనా నాకంటే ముందు అతని గదిలోకి వెళ్లేరా? వెళ్ళి అసలు పుస్తకాన్ని తీసుకుపోయారా? ముసలాయన్ని నమ్మవచ్చా? ఎవరో నాకంటే ముందు ఆ డ్రాయర్ తెరిచి అంతా వెతికేరని భావన వచ్చింది. అప్పుడు ఆ భావన వచ్చిందేమో అని యిప్పుడు అనుకుంటున్నాను. ఏమో నేను పొరపాటు పడ్డానేమో? ఎవరేనా డ్రాయర్ అంతా వెతికారేమో? ముసలాయన వెతికేడేమో ఏదైనా డబ్బు ఉందేమోని.

మళ్లీ పుస్తకం ఆఖరి పేజీకి తిప్పేను…

అతనిదేనా యీ దస్తూరీ? అదైనా నాకు బాగా నమ్మకం కుదరలేదు. అతని మొదటి ఉత్తరంలో టైపుచేసిన సంతకం ఉంది. ఆ తరువాత ఉత్తరాలన్నిట్లోనూ వేరేవేరే పేర్లతో వేరేవేరే సంతకాలు ఉన్నాయి.

అసలు ఆ ఉత్తరాలన్నీ అతనే రాశాడని ఒట్టేసి చెప్పగలనా? ఒక మనిషే రాశాడని గాని? ఉత్తరాలన్నీ ఎవరికేనా చూపిస్తే అతను, యీ ఉత్తరాలన్నిట్నీ నువ్వే రాశావు’ అని అంటే అది అబద్దం అని ఎలా రుజువు చేయగలను. ఇవి ఉత్త శూన్యంలోంచి పుట్టాయని ఎవరైనా అనటానికి ఆస్కారం ఉంది.

నోట్ బుక్ యిప్పటికీ నా దగ్గరే వుంది. పేజీల్ని తిరిగి తిరిగీ తిప్పడంవలన అవి కుక్క చెవుల మార్కులతో నలిగిపోయి వున్నాయి.

త్రిపుర

రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు (2 సెప్టెంబర్ 1928 - 24 మే 2013), త్రిపురగా ప్రసిద్ధి చెందారు , ఆయన  ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లా పురుషోత్తంపూర్ లో 2 సెప్టెంబర్ 1928 న జన్మించారు. తెలుగు సాహిత్యంలో  త్రిపుర కథలది  ప్రత్యేకమైన శైలి.  కథలతోపాటు కాఫ్కా కవితలు, స్వశకలాలు  వంటి కవితా సంకలనాలు కూడా వెలువరించారు.

విలాస్ సరంగ్

విలాస్ సారంగ్ మరాఠీ రచయిత. ఇంగ్లీషులోనూ మరాఠీలోనూ అనేక రచనలు చేసేసారు.   ఆయన కథలు అనేక భాషలలోకి అనువాదమయ్యాయి. Women in Cages కథల పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. కొంత కవిత్వం కూడా రాశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *