సాధన

Spread the love

“ఈ బండి బెజవాడ ఎల్లేసరికి రాత్రి పదకొండవుద్ది. ఎళ్ళడానికైతే ముందే ఎల్లిద్దిగానీ అరగంట పైన హాల్టు… టేషనులోప్లాట్‌ఫారమ్‌ కోసం ఊరిబయట వెయిటింగు..” అన్నాడు నాగేంద్రం పేపరు టీ కప్పు  పెదాలకానించుకుంటూ.

కంపార్టుమెంటులో అతడు ఎవరిని ఉద్దేశించి అన్నాడోగానీ అక్కడ కూర్చున్న అందరూ తమ ఫోనుల్లో మునిగిపోయున్నారు.

నాగేంద్రం అవకాశం వచ్చినప్పుడల్లా పక్కనున్న మనుషులతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడి ధోరణినిబట్టి ఆ రూట్లో అతడు తరచూ ప్రయాణం చేస్తుంటాడని తెలుస్తూంది.

సికింద్రాబాద్‌ నుంచి రైలు బయలుదేరి అప్పటికి అరగంటైంది. నగరం దాటాక అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇళ్ళు, మధ్యమధ్యలో పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి.

బోగీ నిండా సీట్లలోనూ, బెర్తుల మీదా ఎక్కడ పడితే అక్కడ రంగురంగుల గుడ్డలు, బ్యాగులు చిందరవందరగా వేసినట్టు కొందరు కూర్చుని, పడుకుని, వేలాడుతూ రకరకాల మనుషులు.

అప్పటిదాకా సీట్లకోసం హడావుడిగా అటూఇటూ తారాడిన వారు ఒకచోట కుదురుకున్నాక తినుబండారాల మీద పడ్డారు. కొందరు తోటి ప్రయాణికులతో నిదానంగా ముచ్చట్లలోకి దిగారు.

నాగేంద్రానికి కుడివైపున ఒంటిమీద మాసిపోయిన కాషాయ బట్టలతో కిటికీలోంచి చూపు మరల్చకుండా బయటికి చూస్తూ కూర్చున్నాడు బైరాగి. కొన్ని గుడ్డలు కుక్కిన గుడ్డసంచి అతడి ఒళ్ళో ముడతలు పడి ముడుచుకుని కూర్చుంది. అతడు తెచ్చుకున్న నీళ్ళ బాటిల్‌ పైన తగిలించి ఉంది. అతడికెదురుగా పదేళ్ళ పాప కిటికీలోంచి వెనక్కి జరిగిపోతున్న ప్రపంచాన్ని వింతగా చూస్తూంది. కంపార్టుమెంటులో వాళ్ళకి అటువైపు కిటికీల దగ్గర ఎదురెదురుగ కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళూ తలకాయలు మొబైల్‌ ఫోన్లకి అతికించేసారు. బైరాగి అప్పుడప్పుడూ ఎదురుగా కూర్చున్న పాప వంక చూపు మరల్చి వాత్సల్యపూరితంగా చూస్తున్నాడు. పాప పక్కనే కూర్చున్న తల్లి ఊరికే అటూ ఇటూ, పైకీ కిందికీ ఒకటే సంచులు తీసి సర్దుతా ఉంది. ఆమె పక్కనే కళ్ళజోడు పెట్టుకుని, ఒంటిమీద గళ్ళ చొక్కా తొడుక్కున్న ఆమె భర్త చేతులు కట్టుకుని బోగీలో జనాన్ని నిర్లిప్తంగా గమనిస్తూ కూర్చున్నాడు.

నాగేంద్రానికి ఎడమ పక్కన, సీటు చివర గళ్ళ చొక్కా వ్యక్తికి ఎదురుగా టీషర్టు తొడుక్కున్న కుర్రాడొకడు నింపాదిగా కూర్చున్నాడు. మూతిమీద లేలేత మీసాలు, పలచటి నూగు గడ్డం అతడికి పాతికేళ్ళు దాటలేదని తెలియజేస్తున్నాయి. మొదటినుంచి అతడు మిగతావారిని పట్టించుకోకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు.

నల్లగా కమిలిపోయినట్టున్న మనిషి ఒకడు మాసిపోయిన టీషర్టు  వేసుకుని మంచినీళ్ళ బాటిళ్ళ క్రేట్‌ని ఈడుస్తూ “వాటర్‌..వాటర్‌.. కూలింగ్‌ వాటర్‌” అని అరుస్తూ అవతలికి హడావుడిగా వెళ్ళిపోయాడు.

కళ్ళముందే భూమి గుండ్రంగా తిరిగినట్టు కిటికీ బయట కోతకు వచ్చిన వరిచేలు, ఎగుడుదిగుడు బంజరు భూములు, పాత పెంకుటిళ్ళతో గ్రామాలు వెనక్కి జరిగిపోతున్నాయి.

ఉన్నట్టుండి ముగ్గురు ఎత్తైన మనుషులు బోగీలోకి వచ్చి సరాసరి నాగేంద్రం పక్కన కూర్చున్న కుర్రాద్ని చుట్టుముట్టారు.వాళ్ళలో ఒకరు అతడి పేరు అడగటం, అతడు లేచి నిలబడి తన పేరు చెప్పేంతలోనే వాళ్లు అతడి పెడరెక్కలు విరిచి పట్టుకోవడం జరిగిపోయింది.

ఒక్కసారిగా బోగీలో కలకలం రేగింది. ఏమిటా అని అందరూ లేచి నిలబడ్డారు. అవతలివైపు కంపార్టమెంటులో కూర్చున్న కొందరు ప్రయాణికులు లేచి ఇవతలకి వచ్చి వింతగా చూస్తున్నారు.

వచ్చినవాళ్ళు పోలీసులేమోనని వాళ్ళని గట్టిగా అడగటానికి ఎవరూ సాహసం చేయడంలేదు.

అప్పటిదాకా డోరు దగ్గర నిలబడిన ఒక మనిషి ఇవతలకి వచ్చి “ఏమైందన్నా..” అని అడగబోయాడు.

“నీకెందుకు… పనిచూసుకోపో” అని వాళ్ళనుంచి విసురుగా సమాధానం వచ్చింది.

వాళ్ళున్న కంపార్టుమెంటుకి అవతల డోరు దగ్గర ఎవరో నిలబడి “సివిలోళ్ళు” అన్నారు.

నాగేంద్రం అప్పటిదాకా తన పక్కనే కూర్చున్న ఆ యువకుడిని నమ్మలేనట్లు పైకి కిందికి ఎగాదిగా చూసాడు.

అమాయకంగా చూసే కళ్ళు. అతడేమీ వాళ్ళకు ఎదురు తిరగలేదు. నిర్లిప్తంగా ఉన్నాడు. అతడి చూపులు ఎవరిని చూస్తున్నాయో చెప్పడం కష్టం.

“దొంగతనం కేసేమో..” అన్నారెవరో పక్కనుంచి.

“ఏమో ఎవరికి తెలుసు. అదే అయ్యుంటుంది”

వాళ్ళు అతడిని అవతలికి దాదాపు ఈడ్చుకుపోతున్నట్టు లాక్కెళ్ళారు.

“మర్డర్‌ కేసయ్యుంటుంది. అంతలా లాక్కుపోతున్నారంటే అదే మరి” అన్నారెవరో ఇంకోవైపు నుంచి.ఒకరిద్దరు వాళ్ళ వెనకాలే వెళ్ళారు. సీటు వదలడం ఇష్టం లేక మిగతావాళ్ళంతా కూర్చున్నచోటే ఉండిపోయారు.

వచ్చిన వాళ్ళ కాళ్ళకి ఉన్న నల్ల బూట్లు చూసి “అందరూ పోలీసులే” అన్నాడు డోరు దగ్గర నుంచున్న మనిషి. అంతహడావుడిలోనూ బైరాగి కూర్చున్న చోటునుంచి లేవలేదు. కానీ జరుగుతున్నదాన్ని కళ్ళు పెద్దవి చేసుకుని తీక్షణంగా చూడసాగాడు.

చివరికి అందరూ సర్జుకున్నాక బోగీలో అప్పటిదాకా ఒకరికొకరు అపరిచితులుగా ఉన్నవారు కాస్తా పోలీసులు లాక్కెళ్ళిన ఆ యువకుడి గురించి స్నేహితుల్లా మాట్లాడుకోవడం ఆరంభించారు.

ఆ యువకుడు ఖాళీచేసిన సీటుని ఆక్రమించుకున్న ఖద్దరుచొక్కా మనిషి “సికింద్రాబాదులో బోగీలో ఎవరూ లేనప్పుడు ముందే వచ్చి కూర్చున్నాడు. తప్పించుకుని పారిపోదామని అనుకున్నాడేమో” అన్నాడు తన బ్యాగు సీటుకిందకు సర్దుకుంటూ.

“అంతేనండి ఈరోజుల్లో ఎవరేమిటో… చెప్పలేం…” అన్నాడు గళ్ళచొక్కా మనిషి.

“అసలూ మావూళ్ళో…” అవతలివైపు నుంచి.

కొంతసేపు వాళ్ళు జరిగిన దానిగురించి రకరకాలుగా ముచ్చటించుకున్నారు. దాని తాలుకు అలజడి అందరి మొహాల్లోనూ కనిపిస్తూ ఉంది.

“చాయ్‌…చాయ్‌…” అంటూ యూనిఫామ్‌లో ఉన్న కేటరింగ్‌ బాయ్‌ దారికి అడ్డొచ్చినవాళ్ళని తప్పించుకుంటూ వెళ్ళాడు.ఒకచోట కూర్చోలేక, ఎక్కడా నిలవలేక భుజాల మీద బ్యాగు తగిలించుకుని జనాల మొహాలు చూసుకుంటూ ఊరికే బోగీల్లో అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ తిరుగుతున్నారు కొందరు కుర్రాళ్ళు.

కిటికీ పక్కన కూర్చున్న పాప తల్లి ఏదో చెబుతూ ఉంటే ఊకొడుతూ చేతిలో ఉన్న వస్తువుతో ఆడుకుంటూ ఉంది.పాప తండ్రి, ఆ గళ్ళచొక్కా మనిషి ఇంకా వెనక్కివాలి చేతులు కట్టుకుని బయటికి చూస్తూ కూర్చున్నాడు. నలుగురినీ మాట్లాడించడానికి ప్రయత్నించే నాగేంద్రం చెప్పడానికేం లేక తెలియని విచారంలో కూర్చుండిపోయాడు.

బోగీలో కోలాహలం సర్దుమణిగి సమయం జరిగేకొద్దీ మనుషుల మాటలు తగ్గిపోతూ వచ్చాయి. మాటలు ఆగిపోయినప్పుడల్లా బోగీ కింద నుంచి “డుగు… డుగు..” మని బోగీ చక్రాల మధ్య ఇనప చప్పుడుతోపాటు రైలు కుదుపులకు సీట్లలో కూర్చున్నవారు కొద్దిపాటి కదలికతో ముందుకీ వెనక్కీ లయబద్ధంగా ఊగుతున్నారు. కిటికీలగుండా వచ్చే గాలికి వాళ్ళ వెంట్రుకలు చెదిరి పైకి లేస్తున్నాయి. అప్పటిదాకా అందరి చేతుల్లో అటూ ఇటూ తిరిగిన దినపత్రిక నలిగి, ఒకమూలన ఇక పనికిరాకుండా పడి ఉంది.

అంతకు క్రితం జరిగినదానితో గంభీరంగా ఉన్న బైరాగి మొహం క్రమంగా ప్రసన్నంగా మారింది. అతడు తన ముందుకు వచ్చిన ప్రతిదానిని కళ్ళ చివరనుంచి కారుణ్యపూరితంగా చూడసాగేడు. కిటికీ అవతల పశ్చిమాన చెట్లమధ్య సూర్యాస్తమయం నలుపుతో కూడిన నారింజరంగును పులుముకుంటోంది.

చీకటి పడుతున్న వేళకి బండి వరంగల్‌లో ఆగింది. మళ్ళీ ప్రయాణికుల హడావుడి. బండి దిగినవాళ్ళకంటే ఎక్కేవాళ్ళు  ఎక్కువ.  సూట్‌కేసులతో, స్టీలు క్యానులు పట్టుకుని, తళతళలాడే నలగని బట్టలతో, తలలో మల్లెపూలు పెట్టుకుని బోగీలో లగేజీ నెట్టుకుంటూ సీట్లు వెతుక్కుంటున్నారు. నాగేంద్రం పక్కన కూర్చున్న ఖద్దరు చాక్కా మనిషి అక్కడే దిగిపోయాడు.అతడు కూర్చున్న చోటులో భుజం మీద బరువైన బ్యాగు తగిలించుకున్న కాలేజీ అమ్మాయి వచ్చి కూర్చుంది.

అమ్ముకునేవారు కూడా స్టేషనులో మారినట్టున్నారు. అన్నీ కొత్త మొహాలే. మళ్ళీ టీకాఫీలు అమ్మేవాళ్ళ హడావుడి మొదలైంది. ఈసారి కొత్తగా వేడివేడి బజ్జీలు, పునుగులు కూడా వచ్చాయి. గంపలో చెనిక్కాయలు పెట్టుకుని ఒక నడివయసు స్త్రీ కనిపించిన అందరినీ కొనమని అడుగుతావుంది. ఎవరో తలలో పెట్టుకున్న మల్లెపూలదండ మరువంతో కలిసి సువాసనలు వెదజల్లుతా ఉంది. రెండు గంటల ప్రయాణంతో నిస్తేజంగా మారిన మనుషుల్లో కొత్తమనుషుల రాక ఉత్సాహం తెచ్చింది.

ఈహడావుడి రాకతో అంతకుముందు జరిగిన సంఘటనని అందరూ మరిచిపోయారు.

స్టేషను దాటాక రైలు వేగంతో ఎక్కడివారక్కడ మళ్ళీ కుదురుకున్నారు.

అందరూ నిశ్శబ్దంగా ఉండేసరికి నాగేంద్రం ఎవరికో చెబుతున్నవాడికిమల్లే కిటికీలోంచి బయటికి చూస్తూ “ఖమ్మం రావడానికి ఇంకో గంట పట్టుద్దేమో” అన్నాడు.

“అబ్బే… అంతసేపా..గంటకంటే తక్కువే పడుతుంది సావి.. ” అన్నాడు బైరాగి మాట కలుపుతూ.

ఎందుకనో రైలు వేగం తగ్గి పట్టాల మధ్య “టంగ్‌ ..టంగ్‌” మని చప్పుడు వినిపిస్తావుంది.

నాగేంద్రం ‘బండి పట్టాలు మారుతుందేమో’ అని బయటికి చూసాడు. రైల్వే గేటుకి అవతల కాలిబాట మీద మేకలను ఇళ్ళకు తోలుకెళ్ళేవాళ్ళు ఉన్నచోటునే నిలబడి వెనక్కి తిరిగి కదిలే బండిని చూస్తున్నారు. నిదానంగా రైల్వేగేటుని దాటుతున్న బండి చక్రాలు పట్టాలమీద కీసుకీసుమంటున్నాయి.

కిటికీలోంచి ఎదురుగాలికి పొడవాటి గడ్డం చెదిరిపోతుండగా బైరాగి ఉన్నట్టుండి “నా చిన్నప్పుడు బొగ్గురైళ్ళు నడిచేవి” అని ఏదో గుర్తుకొచ్చినవాడిలా మొదలుపెట్టాడు.

కూర్చున్నవాళ్ళందరూ అతడివైపు తలలు తిప్పారు.

“మాది అప్పటి గుంటూరు జిల్లాలోని గురజాల… ఆ రోజుల్లో మాచర్ల నుంచి గుంటూరు దాకా బొగ్గు రైలు నడిచేది. అన్నీ మీటరు గేజీ పట్టాలే.”

“ఇప్పుడు ఆ స్టీమింజన్లు కూడా ఎవరికి తెలుసుద్ది” అని కల్పించుకున్నాడు నాగేంద్రం.

బైరాగి అతడి మాటలని పట్టించుకోకుండా చెప్పుకుపోయాడు.

“ఆరో తరగతిలో ఉండగా, ఒకరోజు నేను ఇంటికాడ చెప్పకుండా రైలెక్కి గురజాల నుంచి మాచర్ల పారిపోయాను.టికెట్టు కూడా కొనలేదు. రైల్లో నన్నెవరూ అడగలేదు.”

“చిన్న వయసులో ఏం తెలుస్తుంది? చాలా మంది ఇలాంటివి పనులు చేసే ఉంటారు. అదంతా మామూలే” అన్నాడు గళ్ళచొక్కా మనిషి

“నిజమే సావి, ఆరోజు ఆ రైలు ఎక్కడికిపోతుందో కూడా నాకు తెలవది. మాచర్లలో బండి ఆగిపోయింది. అదే ఆఖరి స్టేషను. అక్కడే దిగిపోయాను. ఆ రాత్రి స్టేషను బయట అరటిపళ్ళ బళ్ళ కింద తొక్కలు ఏరుకుని తిన్నాను. రాత్రిపూట రైల్వేస్టేషనులోనే పడుకుని అక్కడే పంపుకింద నీళ్ళు తాగాను. పగలంతా బజార్లు  తిరిగా…

“అంటే తమరికి ఈ లక్షణాలు చిన్నప్పటినుంచీ ఉన్నాయన్న మాట” అన్నాడు నాగేంద్రం నవ్వుతున్నట్టు మొహం పెట్టి.

బైరాగి నవ్వి “కావొచ్చు… అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొనసాగించాడు.

“సాయంకాలం సెంటరులో పకోడిల బండిముందు నిలబడ్డాను. చాలామంది జనం కొట్టుముందు మూగారు… కొందరు పొట్లాలు కట్టించుకుంటున్నారు. నేను నిలబడి చూస్తుండగా ఎవరో వెనకాలనుంచి నా భుజంమ్మీద చేయేసారు” అంటూ బైరాగి లేచి నిలబడి తన భుజం మీద ఆయన ఎలా చేయేసాడో నాటకీయంగా చేతులతో చేసి చూపించాడు.

తల్లి ఒడిలో కూర్చున్న పాప అతడి అభినయాన్ని అర్ధంకాక తెల్లబోయి చూసింది.

“నేను ఎనక్కి తిరిగి చూస్తే ఒంటిమీద ఖద్దరు తెల్లచొక్కా, తెల్ల ఫాంటు. పైకి ఎనిక్కి దువ్విన మట్టమైన జుట్టు. ఆయన తెల్లబట్టలు చూసి ఈయన ఏ స్కూలు హెడ్‌ మాష్టరో లేక చర్చి పాస్టరో అనుకున్నా. “ఈయన తినడానికి ఏదన్నా కొనిపెడతాడు” అని నమ్మకం కలిగింది.”

“ఆయన నన్ను రోడ్డు మీద ఒకపక్కకి తీసుకువెళ్ళాడు… నాగురించి అడిగాడు.”

“నేను ఏం మాట్లాడకుండా చేతులు కట్టుకుని నిలబడిపోయాను. అప్పటికి అన్నం తిని రెండు రోజులైంది.”

ఆయన నా సంగతి కనిపెట్టి పక్కనే ఉన్న ఒక సోడా బండి మనిషితో సోడా కొట్టించాడు.

మమ్మల్ని చూసి ఇద్దరు ముగ్గురు గుంపుగా పోగయ్యారు.

అందరి మధ్య ఆయన “ఏమిటి నీ పేరు?” అనడిగాడు.

నేను ఇంటినుంచి పారిపోయి వచ్చినట్టు అక్కడున్న వాళ్ళకు అర్థమైంది.

పోలీసు స్టేషనుకు తీసుకెళ్ళమని ఎవరో చెప్పారు.

“సరే నిన్ను పోలీసులకి అప్పజెబుతా” అని ఆయన నన్ను సైకిలు మీద కూర్చోబెట్టుకుని ఆరోజు పోలీసు స్టేషనుకి కాకుండా వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు.

ఆ ఇల్లు ఒక గవర్నమెంటు కాలనీలో ఉంది. .. అన్నీ వరుసకట్టిన దాదాపు ఒకేరకమైన ఇళ్ళు. అన్నీ తెల్లటి సున్నంతో ఉన్నాయి.

వాళ్ళది ఒక మామూలు సంసారమే. ముందు ఆయన బట్టలు చూసి బాగా ఉన్నోడేమో అనుకున్నా. మూడు గదుల గవర్నమెంటు క్వార్టర్‌. లోపల మాసిపోయిన గోడలు. పిల్లలు చాలామందే ఉన్నారు. ఆయనెంత శుభ్రంగా ఉన్నాడో ఆయన ఇల్లాలు అంత మురికిగా మసిపట్టి ఉంది. కాలేజీకి వెళ్ళే వయసున్న ఇద్దరు కొడుకులు. స్కూలుకెళ్ళే వయసులో ఇంకో ఇద్దరు మగపిల్లలు. ఆ ఇంట్లో ఆ అమ్మ కాకుండా ఇద్దరు ఆడపిల్లలు కూడా కనబడ్డారు. అందరూ చినిగిపోయిన మాసిన బట్టలు

వేసుకున్నారు. అందరికంటే చిన్నవాడు నా ఈడువాడే. మొత్తానికి పెద్ద సంసారం.

ఆ రాత్రి వాళ్ళందరితోపాటు నేను కూడా కింద కూర్చుని భోజనం చేసాను. వాళ్ళు నన్నెంతో ఆదరంగా చూసారు. నాకు ఎప్పటికీ వాళ్ళతోనే ఉండిపోతే బాగుండును అనిపించింది” అని ఆగి “ఇదంతా జరిగి దాదాపు నలభై ఏళ్ళయింది. .. ఇప్పటికీ నాకళ్ళ ముందు అదంతా జరిగినట్టే ఉంది సావి” అన్నాడు బైరాగి.

“అన్నేళ్ళయినా అంతా బానే గుర్తుంది” అన్నాడు నాగేంద్రం.

“ఆ మర్నాడు ఆయన నన్ను స్టేషనుకు తీసుకెళ్ళి టికెట్టు కొని నన్ను గురజాల బండెక్కించాడు.

ఆనాడు రైలు బయలుదేరేముందు ‘ఇంకెప్పుడూ ఇంటినుంచి పారిపోకు, ఎవరికీ చెప్పకుండా టికెట్టు లేకుండా రైలెక్కొద్దు’ అని చెప్పాడు.

బైరాగి అంతవరకు ఆగి “ఆయన చెప్పిన ఆ రెండూ పాటించలేదు .. అని చిన్నగా నవ్వి –

సరే…ఆరోజు నేను గురజాలలో బండి దిగి సరాసరి ఇంటికి వెళ్ళిపోయాను. ఆయాల నన్ను చూడగానే మా అమ్మ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది. ఆ మాపటేళ మానాన్న పని నుండి రాగానే నన్ను చూసి ఇంకెప్పుడూ అలా చేయకు” అని ఊరుకున్నాడు. అంతకు మించి ఒక్కమాట అనలేదు. ఏమన్నా అంటాడేమోనని చాలా భయపడ్డాను. ఆ సాయంత్రం మా ఇంటి ముందు వాకిట్లో పడక కుర్చీ వేసుకుని కూర్చుండిపోయాడు. ఆరోజు ఆయన నాకు కొత్తగా అనిపించాడు. ఆ తరవాత రోజుల్లో

నేనెంత తప్పుచేసినా కొట్టకుండా ఊరుకున్నాడు.

రెండు రోజుల తరవాత మా ఇంటికి పోస్టుమాను ఉత్తరం ఇచ్చిపోయాడు. మా ఇంటికి ఎప్పుడూ ఉత్తరాలు రావు.

మా అమ్మ దాన్ని మానాన్న వచ్చాక ఇద్దామని బల్ల మీద పెట్టింది. ఆమెకి చదువురాదు.

ఆ మధ్యానం నేను స్కూలు నుంచి వచ్చాక దేనికోసమో వెతుకుతుంటే కనపడ్డది ఆ పోస్టుకార్డు.

తీసుకుని చదివాను. రాసినాయన ఆ తెల్లబట్టలాయనే. నేను చెప్పిన అడ్రెసు బాగానే గుర్తుంచుకున్నాడు.

‘పిల్లలని కొట్టకూడదని, కొట్టడం వలన వచ్చే నష్టం కంటే కొట్టకుండా వచ్చే ఫలితమే ఇంకా గొప్పదని ఏదేదో రాసాడు.మొత్తానికి పిల్లలను కొట్టాద్దని ఆ ఉత్తరం సారాంశం. అందులో ఆయన పేరు ‘రామచంద్రుడు” అని ఉంది. స్కూలు టీచరు.”

“ఆయన పేరు ఇప్పటికీ బాగా గుర్తు. ఆ తరవాత ఎప్పుడూ మాచర్ల వెళ్ళింది లేదు. ఆయన్ని కలిసింది లేదు.”

“భలే గమ్మత్తయిన జ్ఞాపకం” అంది నాగేంద్రం పక్కన కూర్చున్న కాలేజీ అమ్మాయి.

“సిన్నప్పుడే ఇల్లిడిసి పారిపోయావు. ఒక సన్యాసి లక్షణాలు అప్పుడే నీలో ఉండాయనుకోవాలి” అన్నాడు నాగేంద్రం మళ్ళీ ఇందాక తనన్న మాట గుర్తుచేసుకుంటూ.

“నిజమే సావి, నాకు చదువు అబ్బలేదు. దురదృష్టమేమిటంటే ఆ తరవాత కూడా అమ్మా నాన్నల మాట నేను వినలేదు. ఆ వయసులో వాళ్ళు ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేయాలనిపిస్తుంది. ఆ వయసుకి అది అందరికీ మామూలే అనుకోండి. నేను ఆకరుసారి ఇల్లిడిసినప్పుడు నాకు సుమారు ఇరవై మూడేళ్ళుంటాయి.”

“చిన్న వయసే” అన్నాడు నాగేంద్రం విస్తుపోయి.

“అవును సావి… ఆ వయసులో ఎవరికైనా లోకానికి విరుద్ధంగా పోవాలని ఉంటుంది. అలా చేసి చివరికి జరిగేదేమీ ఉండదు. కొంతకాలమయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు అదంతా మామూలే అనిపిస్తుంది. విధిని మనమెవరం మార్చలేం కదా. ఎవరి తలరాత వాళ్ళకి రాసిపెట్టి ఉంటుంది. మనమంతా దాని ప్రకారం నడుచుకోవాల్సిందే.”

అప్పటిదాకా బైరాగి మాటలని అందరూ ఆసక్తిగా విన్నారు.

“మరి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టినాయన్ని మళ్ళీ ఎప్పుడూ చూడాలనిపించలేదా?” అన్నాడు అటువైపు కిటికీ దగ్గర కూర్చున్న కుర్రాడు. అప్పటిదాకా అతడుకూడా బైరాగి చెప్పింది వింటున్నట్టు ఎవరూ గమనించలేదు.

“లేదు నాయనా. అటువంటి ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఆయన్నే కాదు. ఇంటినుంచి పారిపోయాక మా అమ్మానాన్నలనే చూడలేదు. వాళ్ళని చూసి ఇరవై ఏళ్ళైపాయె. నాకు అన్న ఒకడు ఉండేవాడు. ఇప్పుడెక్కడున్నాడో తెలవది.”

బైరాగి ఇక తను చెప్పాల్సింది ఏమీలేదన్నట్టుగా నిట్టూర్చి సీటు వెనక్కివాలాడు.

మహబూబాబాద్‌ దాటాక రైలు సగం ఖాళీ అయినట్లు అనిపించింది. కాలేజీ అమ్మాయి కూడా అక్కడే దిగిపోయింది.దగ్గరలో స్టేషనుకూడా ఏదీ లేకపోవడంతో అక్కడ నుంచి రైలు మరింత వేగం పుంజుకుంది. కిటికీలోంచి ఈదురుగాలి కొడతా ఉంది. బయటంతా చీకటి… చీకట్లో చిక్కుకున్నట్టున్న చిక్కటి గుబురు చెట్టు దిగాలుగా నిలబడి ఉన్నాయి.

“అసలీ బైరాగి ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పినట్లో” అని నాగేంద్రం ఆలోచించాడు.

ఉన్నట్టుండి అతడికి “ఈ బైరాగోడు టికెట్టు తీసుకున్నాడా?’ అని అనుమానం కలిగింది.

రైళ్ళలో తిరిగే సన్యాసులు టికెట్టు కొనరని అతడు ఎరుగుదును. వాళ్ళని అతడు అడుక్కుతినేవారికింద జమకడతాడు.ఏ బాత్రూం దగ్గరో, డోరు దగ్గర దారి మధ్యలో న్యూస్‌పేపరు పరిచి కూర్చోక ఇలా సీటులో దర్జాగా కూర్చోవడం ఇప్పుడే చూస్తున్నాడు.

“ఇంటినుంచి పారిపోయినప్పుడు టికెట్టు కొనలేదని చెబుతున్నాడు. అంటే ఇప్పుడుగూడా అదే సంగతేమో”

“ఈ టైములో టీసీ గనక వస్తే?, ఇంక అంతే సంగతి. అయినా బైరాగోడ్ని బొక్కలోపెట్టి వాళ్ళేం బావుకుంటారు గనక”

అతడి మనసు ఎందుకో టీసీ రాకూడదనే కోరుకుంది.

“టికెట్టు కొన్నావా అనడిగితే?, మర్యాదగా ఉంటదా?”

అలా అనుకున్న పిదప ‘అబ్బే.. ఈ మనిషి అలా కనిపించడంలేదు కూడా’ అనుకున్నాడు మనసులో.

చీకటి సొరంగాన్ని తొలుస్తా పోయినట్లు రైలు గుయ్యిమని ఒకటే పోతా ఉంది. చక్రాల మధ్య నుంచి వచ్చే డుగు డుగు శబ్దం వేగం పుంజుకుంది. బోగీ కిటికీలు, తలుపుల నుంచి లోపలికీ బయటికీ రివ్వుమని కొట్టుకునే గాలిలా అతడి ఆలోచనలు శూన్యంలో కొట్టుకుంటా ఉన్నాయి.

బైరాగికి ఎదురుగా కూర్చున్న పాప తల్లి ఒడిలో తలపెట్టి నిద్రలోకి జారుకుంది. తల్లి భర్తతో ఏవో ఇంటి విషయాలు కాబోలు ముచ్చటిస్తూ ఉంది.

“ఇంతకీ మీ పేరేమిటి సావి?” నాగేంద్రం అడిగాడు.

బైరాగి నవ్వి గడ్డం నిమురుకుంటూ “అనంతయ్య” అన్నాడు.

“తల్లిదండ్రులు పెట్టిన పేరేనా? లేక మీరే మార్చుకున్నారా? సన్యాసులు పేర్లు మార్చుకుంటారని విన్నా. అందుకే అడిగాను.”

“మారిందేమీ లేదు సావి. అనంతయ్యే.. మొదట్నుంచీ అనంతయ్య నే” అన్నాడు బైరాగి.

“ఎక్కడి దాకా ప్రయాణం?”

“కాశీబుగ్గ”

“మరి ఈ బెజవాడ బండెదుకు? ఏ ఇసాపట్నం బండో పట్టుకోక?”

బైరాగి సమాధానం చెప్పలేదు. బయట అగాథంలాటి చీకట్లో అతడు తీక్షణంగా ఏం వెతుక్కుంటున్నాడో తెలీదు.

దూర ప్రయాణం చేసేవాళ్లు మాత్రమే మిగలడంతో బోగీల్లో అక్కడక్కడా అరాకొరా జనం మిగిలారు. వాళ్ళలో కొందరు ఈ రైలు ఎప్పుడు ఆగిపోతుందా, ఎప్పుడు దిగిపోదామా అన్నట్టు అసహనంగా ఉన్నారు.

చేయగలిగిందేమీ లేక ఎటూ పాలుపోక శూన్యంలో గమ్యం వెతుక్కునేవారు మరికొందరు.

నాగేంద్రానికి ఆ సాయంత్రం యువకుడిని పోలీసులు లాక్కువెళ్ళిన దృశ్యం మనసులో కదలాడింది.

‘ఆ కుర్రాడిని పోలీసులు తీసుకుపోయిన దానికీ, ఈ బైరాగోడు చెప్పినదానికీ ఏమన్నా సంబంధం ఉందా? అని అతడు ఆలోచించాడు.

‘ఆ కుర్రాడిలాగే ఈ బైరాగి కూడా గతంలో ఏదన్నా దొంగతనంలాంటిది చేసి ఇంటినుంచి పారిపోయాడా?

“ఏమో…అంతకన్నా ఇంకా పెద్ద నేరమే చేసుండొచ్చు. లేకుంటే ఆ పోలీసోళ్ళు ఆ మాదిరిగా ఎందుకు లాక్కపోతారు”

“పైగా ఈ మనిషి తన కతంతా చెప్పి ఇంటినుంచి ఎందుకు పారిపోయాడో మాత్రం చెప్పనేలేదు, అదొక్కటే చెప్పకుండా దాచిపెట్టాడు.. అడిగితే ఎలా ఉంటుంది? ఏమనుకుంటాడు?

‘సాములతోనూ, పాములతోనూ’పెట్టుకోకూడదని చిన్నప్పుడు ఎవరో చెప్పగా విన్నాడు.

చాలాసేపటి తరవాత చివరికి రైలు ఖమ్మంలో ఆగింది. ఒకరిద్దరు దిగడం తప్ప ఎక్కినవాళ్ళెవరూ కనపడలేదు. ప్లాట్‌ఫామ్‌ మీద మాత్రం జనం ఉన్నారు. రైలు అలుపు తీర్చుకుని మళ్ళీ బయలుదేరింది.

రైలు ఊరు దాటుతుండగా మెల్లగా కదిపాడు నాగేంద్రం.

“అది సరే సావి, ఇంతకీ ఎందుకెళ్ళిపోయావో సెప్పనేలేదు”

నాగేంద్రం మాటలు బైరాగి చెవిన పడ్డాయోలేవో తెలీదు. అతడు కాస్త కూడా తల ఇటు తిప్పి చూడలేదు.

మాటలు కిటికీలోంచి వచ్చే ఎదురుగాలిలో ఎటో ఎగిరిపోయాయి.

“ఇంతకీ ఈయన నా మాటలు విన్నాడా? లేక విని కూడా విననట్టు నటించాడా?”

ఏదేమైనాగాని బైరాగి తిరిగి సమాధానం చెప్పలేదు. అలానే తల కిటికీవైపు తిప్పి తీక్షణంగా బయటికి చూస్తున్నాడు. ఆ మొహంలో ప్రశాంతత పోయి గంభీరత చోటుచేసుకుంది. అంతసేపు బయటికి చూసినందుకు కాబోలు కళ్ళలో ఎర్రటి జీర బయటికి తేలింది. ముడివిడి, చెదిరిన పొడవాటి వెంట్రుకలు గాలికి ఊరికే కొట్టుకుంటున్నాయి.

“అనవసరంగా అడిగానేమో” అని నొచ్చుకున్నాడు నాగేంద్రం. “అంతేకాక నేను ఇంకా ఏమడుగుతానో అన్నట్టుగా బిగుసుకు పోయాడు” అనుకుంటూ వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాడు. అతడి ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ప్రయాణ బడలికకీ, రైలు కుదుపులకీ వెంటనే నాగేంద్రానికి నిద్రపట్టింది.

బోగీల్లో ఎక్కడివారక్కడ అయిపోయారు. ప్రయాణపు బడలికలో ఇస్త్రీ బట్టల మాదిరి ఉన్న మనుషులు నలిగిన కాగితాల మాదిరి వాడిపోయారు. అప్పటిదాకా అటూ ఇటూ తిరిగి  హడావుడి చేసిన అమ్ముకునే వాళ్ళ జాడ అసలే లేదు. చీకటి హోరులో మిణుకుమనే వీథి దీపాలు రయ్యిమని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆగాల్సిన స్టేషన్లుకూడా ఎక్కువ లేకపోవడంతో రైలు గమ్యం చేరడం తప్ప తనకు మరో పనిలేదు అన్నట్లు చీకట్లో ఒకటే టకటకా పరిగెడతా ఉంది.

కూర్చున్న చోట్లోనే నిద్రలోకి జారిపోతూ, రైలు చప్పుడికి మేలుకుంటూ, మళ్ళీ కునికిపాట్లు పడుతూ పక్కకి పడబోయి కళ్ళు తెరిచి ఉలిక్కిపడ్డాడు నాగేంద్రం.

బైరాగి కూర్చున్న కీటికీ సీటు ఖాళీగా ఉంది! పైన తగిలించిన నీళ్ళ బాటిలు కూడా అక్కడలేదు.!

‘అరె.. ఎక్కడ దిగుండాల ఈ బైరాగి.?. దిగితే మధిరలో దిగిపోయుండాల. ఎనిక్కి పోయిన స్టేషను అదే’ అనుకుని,’కాశీబుగ్గ దాకా ఎళ్తాన్నోడు దారితప్పి బెజవాడ బండెక్కాడు. మరి ఎక్కినోడు బెజవాడ దాకా వచ్చాడా అంటే అదీ లేదు… రాకుండా మద్దెలోనే మతితప్పి మధిరలో దిగిపోయుంటాడు. ఈలోగా ఆ మనిషికి ఏమి గుర్తుకొచ్చిందో. స్థిమితంలేని మనిషి కాబట్టే తిన్నగా లేడు.. ఎక్కడకి బుద్ది తిరిగితే అక్కడికి తిరుగుతున్నాడు” అనుకున్నాడు నాగేంద్రం మనసులో.

నాగేంద్రానికి చాలాసేపట్నుంచి తను వెతుక్కుంటున్న సమాధానం దొరికింది కానీ దాంతో అతడికి సంతృప్తి కలగలేదు. అది అతడి నిర్లిప్తతని ఇంకాస్త పెంచింది. ప్రయాణపు ఎదురుచూపులో అతడు దాన్ని కూడా మరిచిపోయాడు. వెనక జరిగినదంతా కనుమరుగయిపోయింది.

నాగేంద్రానికి ఎదురుగా పిల్ల తల్లి అక్కడే సీటు మీద నడుం వాల్చి, కాళ్ళు బారచాపుకుని, కప్పుకున్న చీరలోనే పసిపిల్లని పొదుపుకుని చీరని నడుం మీద నుంచి మొహానికి దుప్పటిలా అడ్డంగా కప్పుకుని పడుకుంది. ఆమె భర్త అవతల ఖాళీ అయిన సీటులో కాళ్ళు ముందుకు ముడుచుకుని గాఢనిద్రలో మునిగిపోయాడు. చీకట్లోంచి గాలికి చెలరేగే వాళ్ళ తలవెంట్రుకలను, రైలు కుదుపులకు లయబద్ధంగా కదులుతున్న వాళ్ళ శరీరాలను చూసి నాగేంద్రానికి అంతులేని విచారం కలిగింది.

చీకట్లోంచి  రివ్వుమని లోపలికి చొచ్చుకువచ్చే ఈదురు గాలితో పాటు ‘డుగు…డుగు…? మంటూ బోగీ అడుగునుంచి లయబద్ధంగా ఇటువైపుగా వచ్చే ఇనప చప్పుళ్ళ కచేరీ టకటకమని రెండు నిమిషాలు దూరంగా వెళ్ళి మళ్ళీ యిక్కడిదాకా డమడమమని వచ్చి, ఇక్కడనుంచి మరెక్కడికో టకటకమని దూరంగా పోతావుంది.

*   *  *

బి అజయ్ ప్రసాద్

బి అజయ్ ప్రసాద్ 52 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా నకరికల్లు లో 1972 జూన్ 9న జన్మించారు. దక్షిణ కోస్తాంధ్ర లోని గుంటూరు, మాచర్ల,అద్దంకి గుడ్లవల్లేరు వంటి నగరాలు, గ్రామాల్లో పెరిగారు. జీవిత సమరంలో అనేక ఆటుపోట్ల అనంతరం నిరుద్యోగిగా హైదరాబాదు మహానగరంలోనికి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్ గా జీవిక కొనసాగిస్తున్నారు.  2005లో వచ్చిన తన మొదటి కథ మరుభూమి తో రచయితగా గుర్తింపు పొందారు. ఇప్పటిదాకా 50 కి పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురించ బడ్డాయి. వాటిలో 30 కథల తో రెండు కథా సంపుటాలు 'లోయ, గాలి పొరలు' పేర్ల తో ముద్రించబడ్డాయి. కొన్ని కథలు హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో అనువదించబడ్డాయి. వీరి కథలు తమిళం లోకి అనువాదమయి 'అద్దంకి మలై' పుస్తకంగా వెలువడింది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *