మార్పులో ‘దురస్తు’ అవసరమన్న కథలు

కథ రాయడానికి ముడి సరుకు చాలానే కావాలి. కానీ ఆ సరుకు ఎక్కడ దొరుకుతుందంటే, చాలా వరకు మన చుట్టూ ఉన్న జీవితాల్లోనే అని…ఆ సరుకు కోసం ఎక్కడికి వెళ్లాలి అంటే, గమనించిన వాటిల్లో లోతుల్లోకి అని మన తెలంగాణ కథకులు రాసినవి చదివితే తెలిసిపోతుంది. ఒక అస్తిత్వం మీద కథ సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆ కథే ఎన్నో కథలకు ముడి సరుకు కదా.! మరీ అలాంటి అస్తిత్వం ఎంత తవ్వినా తరగని కొండ లాంటిది తెలంగాణ. అది ఒక తరం కుండ బద్దలు కొట్టినట్టుగా రాసింది. మరి తెలంగాణ కథ అంటే కేవలం అస్తిత్వం మాత్రమే కాదు అని దాని తర్వాతి తరం దాన్ని బద్దలు కొడ్తు రాసింది. ఇది మాత్రమే కాదు ఇంకా చాలా జీవితం ఇక్కడ ఉంది అని కొత్త కొత్త తరం వారు రాస్తునే ఉన్నారు. గత పది సంవత్సరాలుగా అలాంటి ఆణిముత్యాల్లాంటి కథలని ఏరి ‘తెలంగాణ కథ’హారంగా అందిస్తున్నారు డా.సంగిశెట్టి శ్రీనివాస్,డా.వెల్దండి శ్రీధర్. వాళ్ల సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ కథ – 2022 పేరు ‘దురస్తు’. మరమ్మత్తు లేక బాగు చేయడమని అర్థం.

ముందు నుండే తెలంగాణ జీవితాల్లో ఏది కావాలన్నా పోరాడక తప్పని పరిస్తితులు, అది చిన్న చిన్న వాటి నుండి ఒక రాష్ట్రంగా ఏర్పడేంత వరకు పోరాటం చేయక తప్పలేదు. మరి ఏర్పడిన తర్వాత ఆగిందా అంటే, లేదు. వివక్ష చాప కింద నీరులా ఉండనే ఉంది. తెలంగాణ కథ మీద ఇంకా గట్టిగానే ఉంది. ఇవి పెద్దగా లెక్క చేయకుండా మన కథకులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే రాస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతుంది. వచ్చిన మార్పులని రాబోయే మార్పులు మీద ఎంత వరకు మేలు జరిగిందని మన కథకులు అద్భుతంగా కథలుగా తీర్చిదిద్దారు. ‘దురస్తు’లో తెలంగాణ అంటే కేవలం భౌతికంగా కాదని, ఇక్కడి ప్రజల సాంసృతిక జీవం గురించి, సామాజిక వ్యక్తిగత మార్పులు మరీ ముఖ్యంగా రాజకీయ మార్పుల గురించి కథలతో ముడి పెడుతూ సంపాదకులు రాసిన ముందు మాట తప్పక చదవాల్సిందే. రవ్వ శ్రీహరి, గద్దర్, బైరీ ఇందిర, సాయి చంద్, బాల శ్రీనివాస మూర్తి, జాహెద్ అలీ ఖాన్ లాంటి తెలంగాణ ప్రముఖుల్ని స్మరిస్తూ సంకలనం ప్రారంభించడంతో తెలంగాణ పాఠకుల గుండెకి ఇంకా దగ్గరైంది.

ఇక కథల విషయానికి వస్తే ముందుగా కథ జరుగుతున్న ప్రదేశం, పాత్రల చిత్రణ, సంభాషణలు చదువుతున్నా కొద్ది కథాంశంని పట్టుకుంటుంటే కథలో జరిగేదంతా పాఠకులు ఫీల్ అవ్వగలరు. ఈ మధ్య వస్తువుల ‘లుక్ & ఫీల్’ బాగుంటేనే కొంటున్నట్టు, పాఠకుడికి రీడ్ & ఫీల్ గా అన్పిస్తేనే కథను బుర్రలోనో మనసులోనో దాచుకోగల్గుతారు. ఎక్కడ ఎలా మొదలై, ఎక్కడ ఎలా ముగింపు వచ్చిందన్నది కథకి చాలా అవసరం. కొన్ని కథలు కేవలం మొదటి, చివరి పది లైన్స్ చదివి కూడా కథ అర్థం చేస్కోవచ్చు కానీ ఫీల్ కావాలి అంటే మొత్తం చదివితేనే ఆ రైటింగ్ లోని బ్యూటీ తెలుస్తుంది.

ఎంతో మంది కొన్ని సిద్ధాంతాలని నమ్ముకొని ఇల్లు, ఊరు ఇడిసి తుపాకి పట్టుకొని అడివిలో పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అక్కడ పరిచయమైన వ్యక్తిల్తో పెట్టుకున్న ఆశయాలను పక్కకుపెట్టి మళ్లీ సభ్యసమాజంలో కలిసిపోయ్ చివరికి ఎటువైపు వెళ్లారన్నది జూపాక సుభద్ర రాసిన కథ ‘మా సెల్లే మల్లక్క’ చదవాలసిందే.

సేయిల్స్ గర్ల్స్ అందరు ఒకే రకంగా ఉండరు, అభ్యుదయవాదం నిండిన స్త్రీ పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దారు సీనియర్ రచయిత ప్రభాకర్ జైని గారు ‘బోన్గిర్ టు లష్కర్’ కథలో. ‘రైట్ టి సిట్’ గురించి పోరాడి కథ చివరికి ఏం జరిగిందో చదివే తెలుసుకోవాల్సిందే.

సీనియర్ రచయిత పి.చంద్ రాసిన ‘స్థూపం’ కథ కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలని, ముఖ్యంగా దొరలు దోచుకునే విధానం ఎలా మారిందో, ఒక్కప్పుడున్న నక్సల్ వ్యవస్థ ఎలా ధైర్యం చెప్పేది ఇప్పుడెలా తయారైంది అనే చాలా మార్పులను కళ్లకు కట్టె సన్నివేశాలు బాగా రాసారు. స్థూపాలు తీసేసి చరిత్రను కూల్చేదామని చూసే వాళ్లకి తెలీదు, జనంకి చరిత్రలో భాగమై చెక్కుచెదరకుండా జ్ఞాపకం ఉంచుకోగలరని కథ తెలియజేస్తుంది.

యువ రచయిత విశీ(సాయి వంశీ) రాసిన ‘సుభాషిణి పెళ్లి’ కథ నేటి తరంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల్లో కూడా ఎంతో ఉన్నతమైన ఆలోచనగా ఉన్న ఒక ‘కో-లివింగ్‘ వ్యవస్థ చూపే ఒక పని మనిషి పాత్రతో చక్కగా రాసారు.తనకు సమస్యంత తాగుబోతు తనంగా ఉండే మామ పాత్ర మారి పెళ్లి చేస్కుంటే ఎంత బాగుంటుందోనని చదివిన తర్వాత ఏం పాఠకునికైన అన్పిస్తుంది. ఇలాగే ఎక్కడ బోర్ కొట్టకుండా రాసిన విధానంతో , ఇంకాస్త సీరియస్ కథాంశాలు తీస్కుంటే విశీ భవిష్యత్తు కథా ప్రపంచంలో తనదైన ముద్ర వేయగలడు.

తెలంగాణ నగర జీవితంలోని ‘హైఫై లైఫ్’ అని కన్పించే వెలుగు వెనుక ఉండే చీకటిని స్పష్టంగా కథల ద్వారా ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ జీవితాల కథల లోటును తీరుస్తున్న రచయిత మన్ ప్రీతమ్. ‘సూర్యుడి నీడ‘ కథలో హెచ్చార్ గా చేసే అమ్మాయి తనకి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇంటర్వూ గా జరిగే సంభాషణలతో ఐటీ వ్యవస్థను, ఆర్థిక మాంద్యం, మూన్ లైటింగ్, ప్రస్తుతం ఉన్న తీరును అర్థం చేసుకోవచ్చు. రాసిన విధానం అసాంతం చదివించగలదు, ముచ్చటైన ముగింపు కొత్త ఆలోచనకి దారి తీస్తుంది.

స్వర్ణ కిలారీ రాసిన ‘వెలుగు రేఖ‘ కథ ఎక్కువగా పాట ద్వారా నొస్టాల్జియా లోకి తీసుకెళ్ళి లేలేత ప్రేమ కబుర్లు చెప్తుంది. కానీ చివరికి అదే పాట వింటుంటే ప్రస్తుతం ఎవరు గుర్తొస్తున్నారో తెలిసే సరికి పాఠకునికి గుండె బరువెక్కుతుంది.

సీనియర్ రచయితైన కొట్టం రామకృష్ణారెడ్డి తెలంగాణ మాండలికలో రాసినా ‘జాయి జాదులు’ అద్భుతమైన మానవ సంబంధాలను తెలిపే కథ. పెరిగిపోతున్న భూ విలువలు, మనిషి తను పెంచుకున్న అంతస్తుల వల్ల మరో సాటి మనిషికి ఎంత దూరం వెళ్తున్నాడో చక్కగా తెలియజేసే తనం. ఏమిలేని తనంలో ఉండే బంధాల విశిష్టత కథ చివరికి వచ్చేసరికి తెలిపిన విధానం హైలెట్ అని చెప్పొచ్చు.

పదేండ్ల తెలంగాణలో భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మార్పులు వచ్చాయి. అంతటా ఆన్లైన్ బేస్డ్ డేటా ఉంచాలని చేసిన ప్రయత్నంలో, ఆ ప్రయత్నంని ఆసరాగా తీస్కొని జరుగుతున్న దోపిడిని బేస్ చేస్కొనున్న కథ బద్ది గణేష్ రాసిన ‘భూమి పట్టా’. రైతులు తమ భుమిని ఆన్లైన్ పట్టా చేయించడానికి చెప్పులరిగేలా తిరిగి పడిన పాట్లను కథలో కళ్లకు కట్టినట్టు రాసిన విధానం బాగుంది.

నాయీ బ్రాహ్మణుల ఆశ్రిత కులాల్లో తరతరాల నుండి వస్తున్న సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణయే పరమావధి గా ఇప్పటికీ ప్రాకులాడడం, కాకతాళీయంగా విశ్వబ్రాహ్మణ ఆశ్రిత కులమైన రుంజ కళాకారుడి పరిచయం, కనుమరుగైన ఆ కళను తలచుకొని ఆ ఇంటి పరిస్థితుల ను ఆసరాగా చేసుకొని జానపదుల ఆత్మగౌరవం, తండ్లాటల నేపథ్యంగా రావుల కిరణ్మయి రాసిన కథ ‘అలుకు పూత’.

ఆధునిక జీవితంలో కూడా సాంప్రదాయాల పేరుతో స్త్రీల మీద జరుగుతున్న భౌతిక, అంతర్గత దాడులను బేస్ చేస్కొని తెలంగాణ మాండలికంలో అత్యద్భుతమైన కథ పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ‘ఉల్లి పూసలు‘. కథ మొదలు నుండి ముగింపు వరకు ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే కాకుండా ఎంత డీప్ గా పాఠకులని ఆలోచింపజేయగలేటట్టు రాయడం ఎంత అవసరం అనేది ఇలాంటి సీనియర్ కథకుల కథలు చదివి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరం రచయితలకు కచ్చితంగా ఉంది. తల్లి కూతుర్ల పాత్రలు కథలో ఒదిగిన తీరు, ఆ సాంప్రదాయంని మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ జరుగుతున్న హింసను బయటపెట్టిన తీరు చాలా బాగుంది.

తెలంగాణ రాష్ట్ర పండగైన బతుకమ్మ మీద ఇప్పటికే భిన్నమైన కథలు రాసిన చందు తులసి ‘పెద్ద బతుకమ్మ ‘ అని రాష్ట్రంలో పెరిగిన భూ విలువలతో ఓ ఆడబిడ్డ ఇంట్లో ఎలాంటి పండగ వాతావరణం ఏర్పడిందో చాలా చక్కగా చిత్రించిన కథ. గుండె బరువెక్కె సంఘటనలతో కథసాగి ముగింపుకు వచ్చేసరికి కళ్లలో ఓ తడి స్పర్శ తెలుస్తుంటుంది.

వచన కవిత్వంలో తనకంటూ ఓ మంచి పేరున్న గాజోజు నాగభూషణం, ‘బుుణం’ కథతో మంచి కథకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ కథలో ఉన్న కొన్ని సంఘటనలు కొద్ది నెలల క్రితం న్యూస్ పేపర్లో కూడా రావడం గుర్తొచ్చింది. నిరక్షరాస్యత వల్ల ఎప్పుడో కొన్న భూములు రెవెన్యూ రికార్డులోకి ఎక్కించుకొనే సోయి లేక వాటిపై హక్కుల్ని కోల్పోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న రైతుల గురించి అద్భుతంగా రాసారు. ఏ మాత్రం కవిత్వం ఛాయలు కనపించకుండా, చేయి తిరిగిన కథకుడిగానే రాసినందుకు అభినందించక ఉండలేం.

మన చుట్టున్న చాలా మందిలో, తమకంటే మిగితా వాళ్లు బాగుండడం వల్లో, లేక తాము ఊహించుకున్నట్టు బతక లేక పోవడం వల్లో…లేని వాటిని నిజంగా ఉన్నట్టు నమ్మించే శక్తి వారి మాటల్లో ఉంటుంది. అలాంటి వారి గురించే స్కై బాబా రాసిన ‘ఖుష్ మిజాజ్’. అలా చెప్పుకోవడంలో ఉండే సంతృప్తి ఆ మినిషిని ఎన్ని రోజులు బ్రతికించిందో కథ చివరి వరకు చదివి తెల్సుకోవాల్సిందే.

సీనియర్ కవి,కథకులు, నవలా రచయిత రామా చంద్రమౌళి గారు రాసిన ‘ఆత్మ అగ్ని…అది నిన్ను దహిస్తుంది’ ఒక్కప్పటి తెలంగాణని కళ్లక్కట్టినట్టు చూపిస్తుంది. 75 ఏండ్ల క్రితం భారతదేశ విభజన ఎంత విషాద ఘటనగా జరిగిందో, దాదాపు పది లక్షలమంది పౌరులు ఎలా అమానుషంగా హత్య చేయబడ్డారో తెలిపే కథ. చరిత్ర తెలియకుండా ఆజాదీకా అమృత మహోత్సవ్ ఎలా జరుపుకోగలం ? లాంటి ఆలోచనలు కలియజేసే కథ.

తెలంగాణ మాండలికంలో మరొక్క చక్కని కథ సాగర్ల సత్తయ్య రాసిన ‘సారె’. కుమ్మరుల దైన్య స్థితిని చూపిస్తూ, కులవృత్తితో రెండు తరాల సంఘర్షణని కథలో చిత్రించిన విధానం బాగుంది.

రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు దాటిన కూడా, నీళ్లు నిధులు నియామకాల్లో పాలకుల చేతగాని తనం వల్ల ఎంత మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమైందో…ఓ ఉద్యమకారుడి రూపమైన కథ పసునూరి రవీందర్ రాసిన ‘జెజ్జనక’.

ఇలా 16 కథలతో ‘దురస్తు’ పది సంవత్సరాల తెలంగాణను ప్రతిబింబించింది. సంకలనం నిండా జీవితం పట్ల, సమాజం పట్ల అవగాహనతో రాసిన కథలే ఉండడం విశేషం. అనేక ఆటంకాలను ఎదుర్కుంటూనే నిబద్దతతో ఈ పని కొనసాగిస్తున్న సంపాదకులకి అభినందనలు.

కె.కావ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *