తెలుగు సాహిత్య రంగం లోకి ప్రభంజనం లా దూసుకు వచ్చిన వాడు వడ్డెర చండీదాస్ .1972-73 ప్రాంతాలలో “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో “హిమజ్వాల” అనే పేరుతో సీరియల్ వస్తూ వుండేది.నేనప్పటికి తొమ్మిదో తరగతి ముగించి పదో తరగతి లోకి ప్రవేశించాను.కొత్త సీరియల్ గదా ఆసక్తిగా చదవడం మొదలు పెట్టాను నాలుగయిదు వారాలు ఓపిక పట్టాను “ఎబ్బే ఏమీ లాభం లా ఇది మనకు నడవదు” అని చదవడం మానేశాను.(అప్పటికి వారపత్రికల సీరియల్సు లో తేలికపాటి వచనం చదివే అలవాటు కదా మరి) కానీ నాలుగయిదు వారాల తర్వాత నా స్నేహితురాలొకామె “ఈ సీరియల్ బాగానే వున్నట్టుంది” అంది. మళ్లీ అప్పుడు నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవడం మొదలు పెట్టాను. ఒక కొత్తరకం అనుభూతికి లోనయ్యాను.ఆయన రాసే తెలుగు వచనానికి అలవాటు పడ్డాను.అనుభూతిలోని గాఢతను ఆస్వాదించాను.

చండీదాస్ రాసేది తెలుగు భాషలోనే అయినా ఆయన భావ వ్యక్తీకరణ కొత్తగా వుండేది,ఆయన సృష్టించే పద బంధాలు కొత్తగా వుండేవి.అంతేకాదు ఆయన ఆలోచనా ధోరణి కూడా కొత్తగా అనిపించేది.ఆయన తెలుగు భాషలో ఒక కొత్త ఒరవడి సృష్టించాడనడంలో సందేహం లేదు.ఆయన వాడిన “స్నానించి,గాత్రించి,కేంద్రించి” లాంటి పదాలను సొంతం చేసుకుని మేము కూడా అప్పుడప్పుడూ అలాగే మాట్లాడుకునే వాళ్లం.
చండీదాస్ వచ్చేటప్పటికి తెలుగు సాహిత్యం లో ప్రేమ ప్రాతిపదికగా రాసే నవలలూ ,సీరియల్సూ రాజ్యమేలుతున్నాయి.అందులోనూ రచయిత్రులు విరివిగా రాస్తున్న కాలం .పాఠకులంతా ఆ మత్తులో జోగుతున్నారు.అలాంటి సమయంలో వెలువడిన “హిమజ్వాల” సాహితీ లోకాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేటట్టూ,ఒక కుదుపుకి లోనయ్యేట్టూ చేసింది.
పాఠకులని అంతగా ఆకర్షించిన దేమిటీ ఆయన రచనలలో ?అని చూస్తే—-
కవితాత్మకమైన వచనంతో,అతిసహజమైన సంభాషణలతో,లోతైన గాఢమైన భావతీవ్రతతో పాఠకులకొక కొత్త టానిక్ తయారు చేసి ఇచ్చాడాయన.
అంతేకాదు జేమ్స్ జాయిస్ “యులిసిస్ “నవలలోనూ,బుచ్చిబాబు “చైతన్య స్రవంతి” అనే కథలోనూ రాసిన “స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్ నెస్ “ధోరణిలో “హిమజ్వాల” లో నాయికా,నాయకులైన కృష్ణ చైతన్య,గీతాదేవిల అంతరంగ కథనాన్ని చిత్రీకరించాడు.ఈ పని ఆయన చాలా అద్భుతంగా చేశాడు నిజం చెప్పాలంటే బుచ్చిబాబుకంటే బాగా నిర్వహించాడు “యులిసిస్ “నేను చదవలేదు ,ఒకటో రెండో మాత్రమే జేమ్స్ జాయిస్ కథలు చదివాను కాబట్టి అతని తో పోల్చి చెప్పలేను.

అసలు ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్నెస్ అంటే యేమిటీ అంటే మానవుని మనసులో అనునిత్యం చెలరేగే ఆలోచనల గొలుసు .ఆ ఆలోచనల గొలుసును పట్టుకుని గుర్తుపెట్టుకుని అలాగే చిక్కురొక్కురుగా అర్థం పర్థం లేనట్టుగా,ఒక దాని కొకటి సంబంధం లేనట్టుగా వున్నవాటిని పేర్చి రాయడం సామాన్యమైన పని కాదు సామాన్యులు చేసేది కాదు .ఇలా రాసే ధోరణిని తెలుగులో “చైతన్యస్రవంతి”అని పిలుస్తున్నారు.ఇలా రాయడం యెందుకు అంటే ఒక మనిషి బాహ్య ప్రవర్తనకూ,అతని అంతశ్చేతనలో గూడుకట్టుకుని వున్నఅనుభూతులకూ, భయాలకు వున్న సన్నని సంబంధాన్ని తెలపడానికీ,అవే మనిషి వ్యక్తిత్వాన్నీ,నిర్ణయాలనీ శాసిస్తాయి అని చెప్పడానికీ అనుకుంటున్నాను.
హిమజ్వాలలో కథానాయిక గీతాదేవి పాత్ర,కథానాయకుడు కృష్ణ చైతన్య పాత్రా చాలా ఉదాత్తంగా మలచబడ్డాయి.చదువూ,అందం,తెలివితేటలూ పుష్కలంగా వుండి,ఒకరి భావాలకు మరొకరు స్పందించ గలిగిన మనసులు కలిగి వుండి కూడా వారిద్దరూ కలిసి జీవితం గడపలేక పోతారు,అంతర్గతంగా వెంటాడే భయాలూ,సందేహాలతో.

ఎవరి దోవలో వారు జీవితం లో విడివిడిగా బతికినా ఒకరి మనసులో ఒకరు మెదులుతూనే వుంటారు.గీతాదేవి శివరామ్ అనే అతన్ని పెళ్లాడుతుంది.రసజీవి అయిన గీతాదేవికీ,మామూలు జీవి అయిన శివరామ్ కీ లంకె కుదరదు .జీవితం రసాభాస అవుతోందని గమనించిన ఆమె అతన్నుండీ విడిపోతుంది.ఆమె కిఇంకో బంధంలో కావలసిన సాంత్వన దొరుకుతుంది.
కృష్ణ చైతన్య దేశమంతా తిరిగి తన అంతశ్చేతనలో గూడుకట్టుకున్న భయాలను వదిలించుకుని ,తనకు కావలసింది గీతాదేవి మాత్రమే అని తెలుసుకుని ఆమె దగ్గరకు తిరిగి వస్తాడు.కానీ వారిరువురి జీవితాలూ కలవవని, ఆమె తేల్చి చెబుతుంది,అతను తన ఆశవీడడు .ఈ లోపే ఆమె జీవితం ముగిసిపోతుంది అర్థాంతరంగా.ఈ కథని ఆయన యెంత బాగా ఒక బిగితో అల్లిన వలలాగా యెలా అల్లుకు వచ్చాడో చదివితే కానీ తెలియదు.అది కథకాదు వారి జీవితాలే అనిపిస్తుంది.
అసలు నవల పేరే విచిత్రంగా వుంటుంది రెండు విరుధ్ధమైన అర్థాలున్న పదాలు కలపడం. హిమం అంటే చల్లదనం,జ్వాల అంటే వేడి.హిమం లా కనపడే చల్లదనంలో అంతర్లీనంగా జ్వాల రగులుతూ వుంటుందనీ,మనిషిలో కూడా పరస్పర విరుధ్ధమైన భావాలు చెలరేగుతూ వుంటాయని ,అసలు మనిషే ఒక వైరుధ్యాల పుట్ట అని అర్థమేమో అనిపించింది నాకు ఈ నవల చదివాక.

హుందాతనం,తెలివీ,అందం,చతురంగా సంభాషించే నేర్పూ,జీవితాన్ని ధైర్యంగా యెదుర్కునే ఓర్పూ వున్న గీతాదేవి లాంటి ఇంకో నాయిక నాకు మన సమకాలీన తెలుగు సాహిత్యంలో కనపడలేదు.ఆమె చాలా ప్రత్యేకం.
ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను—-
“స్నానం చెయ్యండి ,చెమటకూడా పట్టింది” అంటాడు కృష్ణచైతన్య ,వీథిలో కారు గుద్ది దుమ్ములోా పడిపోయిన ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాక.
దానికామె చెమటను చేతితో తుడుచుకుంటూ”చెమట తుడుచుకుంటే పోతుంది జీవితం పోదు” అంటుంది
“గట్టిగా తుడుచుకుంటే పోతుంది” అంటాడతను
“అంత గట్టిగా తుడుచుకోగలిగినప్పుడు,పోవాలిసిన అవసరం కనిపించదేమో” అంటుంది ఆమె.చూశారా ఆ సంభాషణా చాతుర్యం!

ఫిలాసఫీ ప్రొఫెసర్ గా పనిచేసే కృష్ణచైతన్య పాత్ర కూడా చాలా హుందాగా తీర్చిదిద్దారు.తత్త్వ శాస్త్రం గురించీ,ఆర్ట్ గురించీ,ప్రపంచ సాహిత్యం గురించీ అతని పరిజ్ఞానం పాఠకులని ఎడ్యుకేట్ చేసేటట్టుగా వుంటుంది.
ఈ నవలలో నచ్చే ఇంకో పాత్ర శశాంక ఇతను మొదట్లో కృష్ణచైతన్య మిత్రుడు,ఆ తర్వాత గీతాదేవికి కూడా మిత్రుడౌతాడు.అతను పాత్రికేయుడుగా పని చేస్తూ వుంటాడు.అతని మాటల ధోరణీ,అతని స్నేహశీలతా అతని పాత్రతో ప్రేమలో పడేటట్టు చేస్తాయి.
ఈ నవల చదివి ముగ్ధురాలయిపోయిన నా స్నేహితురాలొకామె తన ఇద్దరు పిల్లలకీ ఒకరికి కృష్ణచైతన్య అనీ,ఇంకొకరికి శశాంక అనీ పేర్లు పెట్టుకుంది.
హిమజ్వాల నవల వెలువడిన ఆరేళ్లకి సాహిత్య అకాడెమీ వారు అవార్డు ప్రకటించారట
చండీదాస్ ఆ అవార్డును తిరస్కరించారు.
హిమజ్వాల సీరియలీకరించిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారే,పదిసంవత్సరాల తర్వాత అంటే 1983లో తిరిగి ఆంధ్రజ్యోతి వారపత్రికలో చండీదాస్ గారి “అనుక్షణికం” నవలని సీరియల్ గా ప్రచురించారు సుమారు రెండు సంవత్సరాలు నడిచింది.
ఇది 1971–80మధ్య గడచిన దశాబ్దకాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వివిధ విభాగాల విద్యార్థుల జీవన చిత్రణ.అందులో రమారమీ రెండువందల పాత్రల దాకా వుంటాయి.ఆ దశాబ్ద కాలంలో జరిగిన రాజకీయ,ఆర్థిక,సామాజిక విషయాలూ అవి విద్యార్థి జీవితం మీదా,ప్రజా జీవితం మీదా చూపిన ప్రభావాలూ,ఆ కాలంలో నడచిన ఉద్యమాలూ ,యూనివర్సిటీ లో కనపడే వాటి జాడలూ ఇవన్నీ చర్చించిన ఈ నవల వడ్డెర చండీదాస్ సృష్టించిన వాటన్నింటిలో అతని మాగ్నమ్ ఒపస్ .ఇందులో వున్నవి కథలు కాదు జీవిత శకలాలు.ఇందులో వచ్చే పాత్రలన్నీ జీవితంలోనుంచీ నడచి వచ్చినట్టుంటాయి .అలాగే ఈ నవలలో ఆయన స్పృశించని అంశం లేదు.ఆనాటి సినిమాలూ,రాజకీయాలూ,ఆర్టూ,సంగీతమూ ,సాహిత్యమూ,అరసం,విరసం గ్రూపులగురించీ,కమ్యూనిస్ట్ ఉద్యమం గురించీ,రాడికల్సూ నక్సలైట్ల గురించీఒకటని లేదు సమస్త విషయాలూ సందర్భానుసారంగా వస్తూనే వుంటాయి.”శివదీక్షాపరురాలనురా” అనే ఘనం శీనయ్య శృంగారపదం గురించి మొట్టమొదటగా నాకు తెలిసింది ఈ నవల ద్వారానే.వరాహశాస్త్రి అనే పాత్ర ప్రవేశిస్తున్నప్పుడల్లా ఈ శృంగారపదం లోని ఒక చరణాన్ని హమ్ చేసుకుంటూ వస్తాడు.నేను వి.ఎ.కె. రంగారావు గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఈ శృంగార పదం గురించి అడిగితే “అది మీకెలా తెలుసూ!” అని ఆయన ఆశ్చర్య పోయారు.
ఈ నవలలో వచ్చే ప్రతి పాత్రనీ ఇంటి పేర్లతో సహా ,వీలైతే ఊరి నేపథ్యంతో సహా పరిచయం చేయడం వల్ల ఆపాత్రని చాలా తేలిగ్గాఐడెంటిఫై చేయగలుగుతాం పైగా ఆ పాత్ర స్వరూప,స్వభావాలని ఊహించుకోవడానికి పెద్దగా కష్టపడక్కరలేదు.ఇలా ఇంటిపేర్లు రాయడం మొదలు పెట్టింది నాకు తెలిసి ఈయనే తర్వాత ఈయన్ని చాలామంది అనుకరించారు.
అనుక్షణికం లో వచ్చే పాత్రలన్నీ సజీవంగా,రక్తమాంసాలతో మన మధ్యకు నడిచి వచ్చినట్టుంటే ఒక్క పాత్ర మాత్రం దీనికి మినహాయింపుగా వుంటుంది
ఆ పాత్ర పేరు కూడా సాధారణంగా వినపడే పేరు కాదు.అదే స్వప్నరాగలీన.ఇది చండీదాస్ తన ఊహా ప్రపంచం నుండీ,తన కలల పంటగా సృష్టించినట్టు కనపడుతుంది.ఈ నవలలో వాస్తవానికి దూరంగా abstract గా కనపడే పాత్ర ఇదొకటే.ఆమె జీవితం కూడా “హిమజ్వాల” లో గీతాదేవి లాగా ట్రాజెడీ గా ముగియడం ఒక విషాదం.
అన్ని పాత్రలలోనూ ప్రత్యేకంగా వుండి,తామరాకు మీద నీటి బొట్టులా యేమీ అంటించుకోకుండా,అవసరమైతే తన చుట్టూ వుండేవాళ్లకు సరైనా సలహాలిచ్చి మార్గదర్శకత్వం వహిస్తూ
శ్రీకృష్ణ పరమాత్మలా అనిపించే పాత్ర శ్రీపతి.అతను ఈ నవలకు ఇరుసు లాంటి వాడు.
ఇంకా ఇలా అన్ని పాత్రల గురించి కాదు కనీసం కొన్ని పాత్రల గురించి చెప్పాలన్నా అదే ఒక పెద్ద ఉద్గ్రంథమౌతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పాత్రకా పాత్రే దానికి ప్రత్యేకమైన స్వరూప స్వభావాలతో సంచరిస్తుంది
అచ్చులో 776పేజీలున్న ఈ నవల చదవడం ఒక అనుభవం.
తెలుగు సాహిత్యం లో ఇలాంటి నవల ఇప్పటి వరకూ రాలేదని నా అభిప్రాయం ఇకముందు వస్తుందని కూడా చెప్పలేము .
కాకపోతే ఒక్కటే చిన్న ఇబ్బంది వందకి పైగా పాత్రలున్న ఈ నవల చదవాలంటే మొదట్లో కొంత ఓర్పు వుండాలి. కథలోకి వచ్చాక ఆటోమాటిగ్గా ఆసాంతం చదివిస్తుంది.
పుస్తకం మొదలు పెట్టిన కొంతమంది ఇన్నిపాత్రలొస్తున్నాయేంటీ అని కన్ఫ్యూజ్ అయిపోయి చదవడం మానేశాం అని చెప్పడం నేను విన్నాను .
అందుకే నేనేమనుకుంటానంటే ఈ నవలలో వచ్చే పాత్రల పేర్లన్నీ ఒక లిస్ట్ రాసి ,వారిని ఒక్కొక్కరినీ పరిచయం చేస్తూ పుస్తకం మొదట్లోనే రెండు పేజీలు కేటాయిస్తే బాగుంటుందని.
అప్పుడు పుస్తకం చదవడం సులువవుతుందని.
నేను ఇప్పటికీ బైబిల్ లాగానో,భగవద్గీత లాగానో “అనుక్షణికం” పుస్తకం తీసి యే పేజీ వస్తే ఆ పేజీ చదువుకుంటూ పోతా! అంత ఇష్టం నాకీ పుస్తకమంటే.
అసలు “అనుక్షణికం” పేరు చూశారా యెలా పెట్టారో! ప్రతి క్షణం నశించేదే(క్షణికమైనది) అయితే నశించిన ప్రతీక్షణం వెనకా మళ్లీ ఇంకోక్షణం పుడుతూనే వుంటుంది నశిస్తూనే వుంటుంది.ఇది ఒక అంతులేని వలయం అని సూచిస్తున్నారనిపించింది.ఆయన పుస్తకాలలో అంతర్లీనంగా ఆయన ప్రతిపాదించే తత్త్వశాస్త్రసిధ్ధాంతాలున్నాయి అంటారు ఆయన స్నేహితులు అడ్లూరి రఘురాజు గారు అందుకే.
వడ్డెర చండీదాస్ గారి రచనలు మనకి లభ్యమయ్యేవి— “హిమజ్వాల”,”అనుక్షణికం” అనే రెండు నవలలూ,”చీకట్లోంచి చీకట్లోకి” అనే కథల పుస్తకం”Desire and liberation” అనే దర్శన శాస్త్ర గ్రంథం, “హిమోహ రాగిణి” అనే కర్ణాటక సంగీత కృతులూ,అడ్లూరి రఘురాజుకి రాసిన లేఖలు “ప్రేమతో” “.వడ్డెర చండీదాస్ దర్శనమూ -సాహిత్యమూ”( అడ్లూరు రఘురాజు రాసింది.)

ఇందులో Desire and liberation అనేది తత్త్వశాస్త్రానికి చెందిన దర్శన శాస్త్ర గ్రంథం. దీనిని యూనివర్సిటీ పనిపైన తిరుపతి వచ్చిన శాంతినికేతన్ ప్రొఫెసర్ కాళిదాస భట్టాచార్యగారు అనుకోకుండా చూడటం తటస్థించింది.ఆ రాతప్రతిలోని దార్శనిక దృక్పథానికీ,కొత్తదనానికీ ముగ్థుడయి ఆయన దానిని తనతో పాటు తీసుకువెళ్లి అధ్యయనం చేసి ,ఒక సుదీర్ఘమయిన ముందుమాట రాసి ఆ పుస్తకం ప్రచురించమని ప్రోత్సహించారు.అంతేకాదు ఈ రచన అందరకూ అర్థమయ్యేటట్లుగా విపులమైన వివరణ రాయమని సూచించి ,చండీదాస్ గారి మాటకూడా తీసుకున్నారు .అయితే దానిని విపులీకరించే పని తాను చేయలేనని ఆయన అడ్లూరి రఘురాజు గారికి అప్పజెప్పారు.రాజుగారు ఆ పుస్తకం పైన దాదాపు పధ్నాలుగు సంవత్సరాలు కృషిచేసి ,అది పబ్లిష్ అవబోతోందని 2005 లో ఆయనను కలిసి చెప్పినప్పుడు చాలా సంతోషించారు.చివరికి అది 2017లో ఆయన పోయిన పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రచురించబడింది.
నాకు తత్త్వశాస్త్రం గురించి అవగాహన లేదు కాబట్టి నాకు అది కొరుకుడు పడదేమోననే అనుమానంతో నేనా పుస్తకం ముట్టుకోలేదు.
ఆయన ఆటోబయోగ్రఫీ బ్యాంక్ లాకర్ లో వుందంటున్నారు అదింకా బయటకు రాలేదు,ఇంకా అముద్రిత రచనలున్నాయేమో తెలియదు.
ఆయన వ్యక్తిగత వివరాలు పెద్దగా తెలియవు.ఆయన అప్పుడప్పుడూ అరుదుగా ఇచ్చిన ఇంటర్వ్యూలు,ఆయన రాసిన వ్యాసాలూ ,అక్కడక్కడా ఆయన గురించి పేపర్లలో వచ్చిన సమాచారం ఇదంతా క్రోడీకరించి నేను తెలుసుకున్న విశేషాలు మీకు అందిస్తున్నాను.
వడ్డెర చండీదాస్ అసలు పేరు చెరుకూరి .సుబ్రహ్మణ్యేశ్వరరావు.ఆయన 1937నవంబర్ 30వ తేదీన కృష్ణాజిల్లా,పామర్రు మండలానికి చెందిన పెరిశేపల్లి గ్రామంలో జన్మించారు.తాతపేరు సుబ్బయ్య చౌదరి.తండ్రి చంద్రమౌళి,తల్లి సీతామహాలక్ష్మి.ఆయనకు
సుమారు నాలుగుసంవత్సరాల వయసులో వారి కుటుంబమంతా తెలంగాణా ప్రాంతానికి(నిజామాబాద్ ప్రాంతానికి) వలస వెళ్లింది.ఆయన చదువుకోవడమంతా అక్కడే .ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో ఫిలాసఫీ ఎం.ఏ,తర్వాత జీ.పాల్ .సార్త్ర్ రచన “బీయింగ్ అండ్ నథింగ్ నెస్ ” మీద పి.హెచ్ .డి చేశారు.
యస్వీ యూనివర్సిటీ తిరుపతి లో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో రీడర్ గా పనిచేశారు.
ఆ కాలంలోనే “హిమజ్వాల” రాశారు.నిజానికి హిమజ్వాల
1960ప్రాంతాలలో తనలో రూపుదిద్దుకుందనీ,1961లో మొదటి అధ్యాయం రాసి పక్కన పడేశాననీ తిరిగి యేడేళ్ల తర్వాత 1968లో ఒక ఆర్నెల్ల కాలంలో దానిని పూర్తి చేశాననీ”అర్థానుస్వారం” అనే వ్యాసంలో చెప్పుకొచ్చారు.హిమ జ్వాల ప్రచురించ బడే కాలంలోనే అంటే 1972 ప్రాంతాలలో అప్పటి దాకా సి.యస్ .రావని పిలవబడుతున్న ఆయన “వడ్డెర చండీదాస్ “అనే కలం పేరు పెట్టుకున్నారు.ఆ తర్వాత అదే పేరును గెజెట్ నోటిఫికేషన్ ద్వారా సొంత పేరుగా మార్చుకున్నారు.శ్రామిక కులానికి సంకేతం అయిన వడ్డెర పదాన్నీ,బెంగాలీ కవీ,శాక్తేయుడూ అయిన చండీదాస్ పేరునీ
కలిపి తన పేరును రూపొందిచుకున్నారట ఆయన.అయితే దగ్గర వాళ్లకీ,బంధువులకీ రాసే ఉత్తరాల్లో” ఇట్లు మీ సుబ్బులు” అని సంతకం పెట్టేవారట.
చండీదాస్ గారు పోయాక ఆయన సహాధ్యాయీ,సన్నిహితంగా మెలగిన ఆచార్య చేకూరి రామారావు “నా సుబ్బులు వెళ్లిపోయాడు”అని నివాళి వ్యాసం రాశారు.
ఆయన 1990ప్రాంతాల వరకూ యస్వీ యూనివర్సిటీ లో పని చేసి ,తర్వాత స్వఛ్ఛంద పదవీ విరమణ చేశారు.ఆ తర్వాత తిరుపతి లోనే భవానీ నగర్ లో ఓ మూడంతస్తుల భవనం మేడమీద చిన్నగదిలో నివాసం వుండేవారు.
ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వారు కారు మహామౌని లా వుండేవారు.ఎవరైనా వచ్చి పలకరించి యేదైనా అడిగితే తనకు చెప్పాలని అనిపిస్తే చెప్పేవారు లేదంటే లేదు.
ఆయనకు నచ్చిన వ్యాపకాలు కర్ణాటక శాస్త్రీయ సంగీతం వినడం.రేడియో వినడం,టీ.వీ.లో తనకిష్టమైన కార్యక్రమాలు చూడటం.
ఆయనకు గాయత్రి వీణంటే “ఇష్టం,చాలా ఇష్టం ,చాలాచాలా ఇష్టం” .తనకి నచ్చిన విషయం యేదైనా అలాగే మూడుసార్లు నొక్కి చెపుతారు.తనవి స్ట్రాంగ్ లైక్స్ డిస్లైక్సూ అని కూడా చెపుతారు.
గాయత్రి వీణ గురించి లేఖలలో యెన్ని సార్లు చెప్పారో లెఖ్ఖేలేదు ,ఉత్తగా ఇష్టం అని రాయడమే కాక “నాకంటే చిన్నదైనా ఆమెకు వినమ్ర పాదాభివందనం” అని రాయడం ఆయనకున్న తీవ్రమైన ఇష్తాన్ని తెలియ జేస్తోంది.
శాస్త్రీయ సంగీతంలో బాలమురళీని,బిస్మిల్లా ఖాన్ నీ,యం.యస్ సుబ్బలక్ష్మిని అభిమానించేవారు.రవిశంకర్ సితార్ ని ఇష్ట పడేవారు.పాత తెలుగుసినిమాపాటలు బాగా వినేవారు .ఘంటసాల గొంతు “సాక్సొఫోన్ లో తేనె నింపినట్టు వుంటుందనీ”,సుశీల గొంతు వీణ పలికినట్టుంటుందనీ రాశారు.చిత్ర గొంతంటే చాలా ఇష్టం.
హిందీ గాయకులలో మహ్మద్ రఫీ ఇష్టం,గాయనుల్లో లతా అంటే ఇష్టం .గీతా దత్ గొంతు బాంసురీ లా,లతగొంతు సితార్ లా ధ్వనిస్తుందంటారు
నూర్జహాన్ ,సురయ్యా ఇద్దరూ చాలా ఇష్టం.
హిందీ సినిమా నాయికల్లో మధుబాల,మీనాకుమారి,వైజయంతి మాల,లీనా చందా వర్కర్ లంటే అభిమానం.
హిందీ సినిమా హీరోలలో దిలీప్ కుమార్ అంటే అభిమానం
“దేవదాస్ “సినిమా హిందీ,తెలుగు లలో తీసిన వన్నీ చూశారు అన్నిటిలో నాగేశ్వరరావు దేవదాసే ఇష్టమట.
తెలుగు సినిమా హీరోయిన్లలో సావిత్రి,కృష్ణకుమారి ఇష్టమైన వాళ్లు.
సినిమా సంగీత దర్శకులలో హిందీలో రోషన్ ,యస్ .డి.బర్మన్,మదన్ మోహన్లని ఇష్టపడితే తెలుగులో ఘంటసాల ,కె.వి మహదేవన్లని ఇష్టపడేవారు.
కూచిపూడి నాట్యాన్నీ,శోభానాయుడినీ బాగా అభిమానిస్తారు
ఆయనకి ఇష్టం లేని వారి లిస్ట్ కూడా పెద్దదే
పియానో,సంతూర్ ,సరోద్ వాయిద్యాలిష్టం లేదు
చార్లీ చాప్లిన్ నటన ఇష్టంలేదు
చిట్టి బాబు వీణ ఇష్టం లేదు
భీమ్ సేన్ జోషి గానం ఇష్టం లేదు
కె.యల్ .సైగల్ ఇష్టం లేదు.
ఇక పుస్తకాల విషయాని కొస్తే ఆయన రోజూ మూడు పుస్తకాలు పారాయణ చేసేవారట.
అవి బుచ్చిబాబు “చివరకు మిగిలేది”
ఆలూరి బైరాగి “ఆగమగీతి”
శ్రీశ్రీ “మహాప్రస్థానం”
అమితంగా ఆరాధించింది బుచ్చిబాబుని. “హిమజ్వాల” నవల బుచ్చిబాబుకి అంకితమిచ్చారు .చలం అంటే కూడా ఇష్టం ఆయన రాసిన మహాప్రస్థానానికి ముందుమాట కంఠతా వచ్చు.తనకు తాను ఒక శైలి యేర్పరుచుకోవడానికి బుచ్చిబాబు రచనలూ,చలం రచనలూ తోడ్పడ్డాయని చెబుతారు. తెలుగు భాషన్నా ,తెలుగుదేశమన్నా అభిమానమని లేఖల్లో ఒకచోట రాశారు.
నచ్చిన కవిత్వం యెక్కడ కనపడినా మెచ్చుకునే వారు త్రిపురనేని శ్రీనివాస్ కవిత్వాన్నీ,”శిలాలోలిత” గా పేరు మార్చుకున్న లక్ష్మి గారి కవిత్వాన్ని మెచ్చుకుంటూ రాశారు..
ఆయన తల్లిదండ్రుల గురించి ఒక రెండు చోట్ల ప్రస్తావించారు
“మా అమ్మా నాన్నలు సమస్తమూ నా ఇష్టానికే వదిలేశారు.వాళ్లు నాకు నేర్పిందేమీ లేదు.వాళ్లనుంచి మంచితనమూ,యెవరినీ దేనికీ నిర్బంధించక పోవడమూ నేర్చుకున్నాను.మా నాన్న జీవకళ వున్న నలుపు.మా అమ్మ పసిమి రంగు.నిజాం దేశంలో స్కూల్లో ఉర్దూ మాత్రమే నేర్పే వాళ్లు.ఇంటిలో మా అమ్మ తెలుగు నేర్పేది”.
“హిమజ్వాల సీరియలైజ్ అవుతున్నప్పుడు వారం వారం మా అమ్మ మా నాన్నకి చదివి వినిపిస్తుండేది”
అవీ వారు చెప్పిన వారి అమ్మా నాన్నల సంగతులు.
ఆయన కి భార్య,ఒక కుమార్తె వున్నారు.కుమార్తె మెడికల్ డాక్టరనీ అమెరికాలో వుంటున్నారనీ,తానొక సారి అమెరికా వెళ్లి కొన్నాళ్లు వుండి వచ్చాననీ లేఖలలో రాశారు.
అలా సుమారు పదిహేను సంవత్సరాల కాలం ఒక చిన్న గదిలో రోజంతా సంగీతం వింటూ ,తన కిష్టమైన రెండు మూడు పుస్తకాలే చదువుతూ ,అప్పుడప్పుడూ టి.వీ చూస్తూ ,ఎప్పుడయినా యెవరితోనైనా ఇష్టమయితే క్లుప్తంగా మాట్లాడుతూ ,బతకడానికి అవసరమైనంత కొంచె ఉడకేసుకు తింటూ,నెలకొక్క సారి మాత్రం పెన్షన్ తీసుకుని,వాళ్లమ్మాయికి ఫోన్ చెయ్యడానికి బయటి ప్రపంచం మొహం చూస్తూ ఒక మౌన తపస్విలా గడిపిన ఆయనకి 2005 జనవరిలో సుస్తీ చేసింది.
మొదట్లో తిరుపతి రూయా ఆస్పత్రిలో కొంత చికిత్స జరిగాక విజయవాడ నాగార్జున ఆస్పత్రికి తరలించారు.కానీ లాభం లేకపోయింది 2005 జనవరి 30వ తేదీ మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు .అలా ఆయన మౌన గానం విశ్వగానం లో లీనమయింది అయితేనేం ఆయన సృష్టించి “హిమ జ్వాల,అనుక్షణికం” అనుక్షణం ఆయన అభిమానులని
పలకరిస్తూనే వుంటాయి….

నేనూ చదివాను ఆ రోజుల్లోనే హిమజ్వాల , అనుక్షణికం. ఎందుకో తెలీదు అప్పుడు ఆ రచన చాలా నచ్చింది. ముఖ్యంగా ఆ పేరు స్వప్న రాగలీన చాలా యేళ్ళు , నా ఆలోచనలలో అలా తిరుగుతూ వుండేది. ఇప్పటికీ…
బాగా రాసారండీ!
వడ్డెర చండీదాస్ గారి గురించి.. ఏ కాస్త విషయం కనబడినా ఆత్రంగా చదివేంత అభిమానిని. మీ లాగే చిన్నతనం లోనే చదివాను. ఇప్పుడు మీ సమగ్ర సమీక్ష చదివాక మళ్ళీ ఆ పుస్తకాలు రెండూ చదవాలని ఉంది.
ఒక విషయం. చండీదాస్ గారి రచనలు చదివాక ఇంకెటువంటి ఫిక్షన్ నచ్చదు.
Bhargavi Garu
Try to find his autobiography –
Request
Plus find his daughters phone number – I will request her
GREAT WRITER
———BUCHI REDDY
USA