సెప్టెంబర్ 2
‘యుద్ధం-శాంతి’లో టాల్ స్టాయ్ ఒక ప్రకరణంలో ఓ చోట, శత్రు సైన్యాల గురించి,కనిపించని ఓ అజ్ఞాత రేఖ ఎలా చావుకి బతుక్కి మధ్య సరిహద్దు గీతలా నిలబడుతుందో రాశాడు నికొలాయ్ రోస్తోవ్ ఉన్న దళం మీద దాడి జరిగినప్పుడు, ఆ గీత అతని దృష్టిలో మెదిలింది. ఆ ప్రకరణాన్ని ఈ సందర్బంగా నేను గుర్తు తెచ్చుకున్నాను, ఈ ఉదయం మేము జర్మన్ల మీద దాడికి దిగాము.
ఈ ఉదయం నుండి గొప్ప శతాగ్ని దళాల అండతో, మా పదాతి దళాలను వేధిస్తూ ఉన్నాయి. మా 241,273 రెజిమెంట్లలోని సైనికులందరూ భయంతో పారిపోతూ ఉన్నట్టు నాకు అనిపించింది.సరైన ఆయుధాలు, శతాగ్ని దళాల సహకారం లేకుండా యుద్ధ బరిలో దిగడం వారిలో నిస్పృహను కలిగించింది.అప్పటికే శత్రువుల ఆయుధాల శక్తికి మూడవ వంతు సైనికులు చనిపోతే, మిగిలిన వారిని జర్మన్ సైనికులు తరుముతూ ఉన్నారు. అప్పుడు అడవి లోపలి ప్రాంతంలో ఉన్న మా రెజిమెంటు ఒక్కసారిగా ముందుకు దుమికింది. ఈ విషయాన్ని నేను ఇలానే గుర్తు పెట్టుకున్నాను. మేము తిజ్విచ్చి గ్రామాన్ని ఉదయం మూడు, నాలుగు గంటల సమయంలో విడిచి పెట్టాము. ఉదయం రాకముందు ఆ చీకటి ఎంతో చిక్కగా ఉంది. ఆ గాలి ఓట్స్ వాసనను మోసుకు వస్తూ ఉంది. మా రెజిమెంటు దళాల వారీగా ముందుకు సాగింది. మేము ముందు దారిలో మలుపు తిరిగాక పొలాల్లో చిక్కుకుపోయాము. గుర్రాలు ముందుకు వెళ్తూ ఉంటే వాటి డెక్కలు ఓట్స్ మీద ఉన్న మంచును రాలేలా చేస్తున్నాయి.
మంచి కోటు ధరించినా సరే ఎంతో చల్లగా ఉంది. అలా మా రెజిమెంటు ఓ లక్ష్యం లేకుండా అలా ఆ పొలాల్లో ఓ గంట సేపు తిరిగాక, ఓ అధికారి అటుగా వచ్చి, మా రెజిమెంటు కమాండర్ కు ఓ ఆజ్ఞ పత్రం ఇచ్చాడు. మా ముసలోడు దాన్ని అసంతృప్తితో చదవడం పూర్తి చేశాక, మా రెజిమెంటు అడవిలోకి పయనమైంది. ఆ ఇరుకు దారిలో వెళ్ళడం కష్టమైపోయింది. అక్కడకు ఎడమ దిక్కులో ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ నుండి వినవస్తున్న ధ్వనులను బట్టి అనేక జర్మనీ యుద్ధ దళాలు భీకరంగా యుద్ధం చేస్తున్నట్టు అనిపించింది. ఫిరంగుల ధ్వనులు అలల్లా వస్తూ ఉంటే, అక్కడ అడవిలో ఉన్న చెట్లే మా మీద కోపంతో అలా శబ్దం చేస్తున్నాయేమో అనిపించింది. సూర్యోదయం వరకు ఆ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాసేపు సంతోషంతో అరుపులు, మధ్యలో నిశ్శబ్దం, తర్వాత ఫిరంగుల మోతలు!ఆ క్షణాల్లో నా మనసులో ఎంతో బాధ, నేను స్పష్టంగా ఊహించుకోగలిగిన దృశ్యం ఒక్కటే,కానీ ఆ దృశ్యం నాకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది… అది యుద్ధ బరిలో ఉన్న మా పదాతి దళం.
నాకు వదులు బట్టలతో ఉన్న ఆ ఆకారాలు, సరిగ్గా లేని బూట్లతో అడుగులు తడబడుతూ, కిందకు కూలిపోతూ ఉంటే, చెమటపట్టియన్ ఆ శరీరాలు శవాలుగా మారుతూ ఉంటే,వెనుక నుండి వినిపించే జర్మన్ల నవ్వులు, వారి ఫిరంగుల మోతలు.ఆ రెండు రెజిమెంట్లలో సైనికులు దాదాపుగా అందరూ నేలకు ఒరిగిపోయారు, మిగిలిన కొందరు ప్రాణాలు కోసం పారిపోతూ ఉన్నారు. వారిని వదలకుండా జర్మన్ హుస్సార్లు వెంబడిస్తూ ఉన్నారు. వారికి మేము దాదాపు ఏడువందల అడుగుల దూరంలో ఉన్నాము. అప్పుడే ఒక ఆజ్ఞ జారీచేయబడింది. వెంటనే మేము సన్నద్దులమయ్యాము. బిగ్గరగా ఒకటే పదం నాకు వినిపించింది,’ముందుకు కదలండి!’ఒక్క నిమిషం భయంతో ఆగినా, వెంటనే సర్దుకుని ముందుకు మెరుపు వేగంతో దూసుకుపోయాము. గుర్రాలు కూడా మా మనసును అర్థం చేసుకుని వేగాన్ని అందుకున్నాయి. నేను చుట్టూ చూశాను, నా వెనుక రెజిమెంట్ కమాండర్, ఇంకో ఇద్దరు అధికారులు ఉన్నారు.అవును, ఇదే చావుకు, బతుక్కి మధ్య ఉండే గీత. హా, మేము కూడా ఆ సరిహద్దు దగ్గరకు వచ్చేసాము. హుస్సార్లు ఒక్క నిమిషం ఆగి, వెనక్కి తిరిగారు.నా కళ్ళ ముందే లూయిటెంట్ చెర్నెస్తోవ్ ఒక జర్మనీ హుస్సార్ ను నరికాడు. ఆరవ దళానికి చెందిన ఒక కొసాక్కు ఒక జర్మనీ వాడిని దాటి, పిచ్చిగా అతని గుర్రన్ని గాయపరిచి , అతన్ని నరికాడు. ఆ కరవాలానికి రక్తంతో నిండిన చర్మం వేలాడుతూ ఉంది. ఇది ఊహించనిది!దానికి పేరు కూడా పెట్టలేము!తిరిగి వెళ్తున్నప్పుడు నేను చెర్నెస్తోవ్ ముఖం చూశాను, ఎంతో సంతోషంగా, గర్వంగా ఉన్నాడు;ఒక వ్యక్తిని హత్య చేసినట్టు కాకుండా పేకాట ఆడుతూ, గెలిచినవాడిలా ఉన్నాడు. లూయిటెంట్ చెర్నెస్తోవ్ ఇంతటితో ఆగడు. అతను సమర్థుడే!
సెప్టెంబర్ 4
మేము విశ్రాంతి తీసుకుంటున్నాము. నాలుగవ విభాగానికి చెందిన రెండో సైన్య దళం సరిహద్దు ప్రాంతంలో ఉంది. మమ్మల్ని కొబ్లినో అనే చిన్న పట్టణంలో ఉంచారు.ఈ ఉదయం, పదకొండవ దళానికి చెందిన అశ్విక దళం, ఉరల్ నది ప్రాంతంలో స్థిరపడిన కొసాక్కులు ఆ పట్టణం గుండా ముందుకు సాగారు. ఇంకా పశ్చిమ దిశలో యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధ ధ్వనులు గర్జనల్లా వినబడుతూనే ఉన్నాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత నేను సైనికుల కోసం ఉన్న ఆసుపత్రికి వెళ్ళాను.
అప్పుడే గాయపడిన వారిని తీసుకుని ఓ రైలు వచ్చింది. స్ట్రెచర్ ల మీద గాయపడిన వారి శరీరాలను ఎక్కిస్తూ, నవ్వుతూ ఉన్నారు కొందరు. నేను వారి దగ్గరకు వెళ్ళాను. అప్పుడే ఓ వైద్య సహాయకుడి సాయంతో ఎత్తుగా ఉన్న ఓ సైనికుడు కిందకు దిగాడు.”నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది కొసాక్కు?”అని నన్ను అడిగాడు అతను. “నా వెనుక తూటాలు దింపారు!'” ఆ సహాయకుడు ఆ గాయాల గురించి అడిగితే అతను వివరంగా చెప్తూ ఉన్నాడు. ఈ లోపు ఓ నర్సు వచ్చింది. ఆమెను చూడగానే నాకు ఓ రకమైన నీరసం వచ్చి, బండికి ఆనుకున్నాను.లిజా పోలికలతో ఉంది ఆమె. అవే కళ్ళు, అదే గుండ్రటి ముఖం, ఆఖరి ఆ ముక్కు, గొంతు కూడా. స్వరం కూడా ఒకే మాదిరిగా ఉంది. లేకపోతే నేను ఇదంతా ఊహిస్తూ ఉన్నానా? అలా అయితే, ఇక నేను ఏ స్త్రీని కలిసినా ఇలాగే పోలికలు చూస్తానేమో!
సెప్టెంబర్ 5
గుర్రాలకు ఒక రోజుకి సరిపడా మేత పెట్టి, అవి విశ్రాంతి తీసుకున్నాక , మేము మరలా యుద్ధ ప్రాంతానికి వెళ్ళాము.భౌతికంగా నేను ధ్వంసమై పోయి ఉన్నాను.యుద్ధ ఆరంభాన్ని సూచించే వాయిద్యం మోగింది. ఇక నేను శత్రువు శరీరంలో తూటాలు దింపడానికి సిద్ధమయ్యాను.
* * *
దళపు కమాండర్ రెజిమెంట్ల ప్రధానకార్యాలయానికి ఒక సందేశం పంపించడానికి గ్రెగరి మెలఖోవుని పంపించాడు.ఆ మధ్యే యుద్ధం జరిగిన జిల్లా గుండా గ్రెగరి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రహదారి దగ్గర ఒక కొసాక్కు మరణించి ఉండటం గమనించాడు. గుర్రాల డెక్కలు రేపిన దుమ్ముతో ఉన్న దారిలో అతని తల నేలకు ఆని ఉంది. గ్రేగరి గుర్రం దిగి, తన ముక్కు మూసుకుని, (అప్పటికే ఆ శరీరం కుళ్ళిన వాసన వస్తూ ఉంది)ఆ శరీరాన్ని వెతికాడు.అతని ప్యాంటు జేబులో ఈ నోట్ పుస్తకం, ఒక పెన్సిలు, పర్సు దొరికాయి. అప్పటికే కుళ్ళిపోతూ ఉన్న ఆ మనిషి పాలిపోయిన ముఖాన్ని గ్రెగరి చూశాడు. అతని ఛాతి, ముక్కు దగ్గర చర్మం అప్పటికే నల్ల రంగులోకి మారుతూ ఉంది;ఆ నుదురు మీద ఉన్న గీతలపై దుమ్ము పట్టి ఉంది.
గ్రెగరి ఆ చనిపోయిన వ్యక్తి జేబులో దొరికిన చేతి రుమాలుతో ఆ ముఖాన్ని కప్పి, ప్రధాన కార్యాలయం వైపు సాగిపోయాడు, మధ్యమధ్యలో వెనక్కి చూస్తూ. అతను ఆ నోట్ పుస్తకాన్ని ఆ ప్రధాన కార్యాలయంలో ఉన్న గుమాస్తాలకు ఇచ్చాడు. వారు గుంపుగా చేరి, అది చదువుతూ ఆ చనిపోయిన వ్యక్తి జీవితం గురించి, అతని ఆలోచనలు, కోరికల గురించి పగలబడి నవ్వుకున్నారు.
* * *
అధ్యాయం-12
లెస్జోవ్ ను ఆక్రమించిన తర్వాత పదకొండవ ఆశ్విక దళ విభాగం స్టానిస్లావా, రాడ్జిలోవో మరియు బ్రాడి ప్రాంతాలపై దాడి చేసింది. ఆగస్టు పదిహేనున కామింకో స్టృమిలోవా పట్టణం సరిహద్దుల్లో తర్వాతి యుద్ధ వ్యూహానికి ఆ విభాగం సిద్ధమవుతూ ఉంది. తర్వాత పదాతి దళం వ్యూహాన్ని అనుసరించి ముఖ్య భాగంలో ఉంచబడింది. కూడళ్ళలో సిబ్బంది మరియు సైన్యానికి కావాల్సినవి కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయబడింది. ఆ సరిహద్దు బాల్టిక్ కు దక్షిణంగా మరణ మృదంగంలా ఉంది. కార్యాలయాలు అన్ని కూడా ప్రణాళికలు రచించడంలో తీరిక లేకుండా ఉన్నాయి. జనరల్స్ మ్యాప్స్ చూడటంలో మునిగిపోతే, వార్తాహకులు ఆజ్ఞలు మోసుకుంటూ అటూ ఇటూ గుర్రాల మీద దౌడు తీస్తూనే ఉన్నారు, వందల,వేల సైనికులు మరణిస్తూనే ఉన్నారు. శక్తివంతమైన శత్రు ఆశ్విక దళాలు పట్టణంలోకి రాబోతున్నాయని నిఘా బృందాలు నివేదికలు ఇచ్చాయి. కొసాక్కుల పహరా బృందాలు అడవుల్లో ఆ శత్రువులతో ఎదురుదాడులకు దిగాయి.
ఈ యుద్ధం జరుగుతూనే ఉన్నా, తన అన్న వెళ్ళినప్పటి నుండి, గ్రెగరి మామూలు మనిషి కావడానికి,మానసిక స్థిరత్వం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదనంగా వచ్చిన రిజర్వు దళంలోకి మూడవ దళంలోని సభ్యులను కూడా కొందరిని తీసుకున్నారు. వారిలో ఒకడు,అలెక్సి ఉర్యుపిన్,కాజన్ స్కాయా స్టానిట్సాకు చెందిన వాడు. అతన్ని కూడా గ్రెగరి ఉండే దళంలోనే ఉంచారు. ఎత్తుగా, కొద్దిగా వంగినట్టు ఉండే భుజాలతో,పెద్ద గడ్డంతో ; భయం లేకుండా ,ఎప్పుడు నవ్వుతూ ఉండే కళ్ళతో ఉండేవాడు అతను. ఇంకా యవ్వనంలోనే ఉన్నా బట్టతలతో,కేవలం పుర్రెకి పక్కల కొద్ది గోధుమ రంగు జుట్టుతో ఉండేవాడు. కొసాక్కులు వంపులు తిరిగినట్టు ఉండే ఆ వెంట్రుకల వలన ‘కర్లి’అనే ముద్దుపేరు కూడా పెట్టారు.
బ్రాడి దగ్గర యుద్ధం తర్వాత రెజిమెంటుకి ఒక రోజు విశ్రాంతి ఇవ్వబడింది. గ్రెగరి, కర్లీ ఒకే ఇంట్లో ఉన్నారు. వారిద్దరి మధ్య సంభాషణ మొదలైంది.
‘నిన్ను చూస్తే ఉంటే,సత్తువ పోయిన వాడిలా ఉన్నావు , మెలఖోవ్.’
‘సత్తువ పోయిన వాడిలానా?’
‘అవును, ఏదో జబ్బు పడిన వాడిలా అనిపిస్తున్నావు’, కర్లీ వివరించాడు.
కట్టేసి ఉన్న గుర్రాలకు మేత పెట్టి, అక్కడ ఉన్న కంచె దగ్గర సిగరెట్టు వెలిగించుకుంటూ నిలబడ్డారు. హుస్సార్లు నలుగురు నలుగురుగా వీధుల గుండా గుర్రాల మీద వెళ్తున్నారు.
ఇంకా శవాలు కంచెల మీద నుండి వేలాడుతూనే ఉన్నాయి (ఆస్ట్రియా వారిని తరిమి గొడుతున్న సమయంలో ఆ వీధుల్లో గొడవలు జరిగాయి), తగలబెట్టిన ప్రార్థనాలయం నుండి ఇంకా పొగ వెలువడుతూనే ఉంది. ఆ పట్టణం విధ్వంస చిత్రంగా మారి, సాయంకాలపు సౌందర్యాన్ని కోల్పోయినట్టు ఉంది.
‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను’, గ్రెగరి పక్కకు తిరిగి, ఉమ్మి వేస్తూ అన్నాడు.
‘ఇక చాలు!నాకు కనబడుతుంది.’
‘నీకు ఏం కనబడుతుంది?’
‘భయపడుతున్నావు కదా? చావుకి?’
‘నువ్వు వెధవ్వి’, గ్రెగరి నొసలు చిట్లిస్తూ విముఖతతో అన్నాడు.
‘అయితే ఇది చెప్పు, నువ్వు ఎవరినైనా చంపావా?’ ఉర్యుపిన్ గ్రెగరి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు.
‘అవును. అయితే ఏంటి?’
‘నీ అంతరాత్మ దాని గురించి క్షోభిస్తుందా?’
‘క్షోభా?’ గ్రెగరి ఓ పొడి నవ్వు నవ్వాడు.
కర్లీ తన ఖడ్గం బయటకు తీసాడు.
‘నీ తల దీనితో నరికేయమంటావా?’
‘ఆ తర్వాత?’
‘నాకు అసలు దాని గురించి బాధే ఉండదు. నాకు ఏ జాలి లేదు!’ఉర్యుపిన్ కళ్ళు నవ్వుతున్నా, గ్రెగరి అతని స్వరం, అదురుతున్న నాసికలు గమనించి, అతను చెప్తుందినిజమే అని గ్రహించాడు.
‘నువ్వు ఒక వెర్రి వాడివి’, అతని ముఖంలోకి చూస్తూ అన్నాడు గ్రెగరి.
‘నువ్వొక పిరికి గుండె ఉన్నవాడివి. నీకు బాల్కానోవ్ ఖడ్గపోటు తెలుసా? చూడు!’
ఆ దగ్గరలో ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని ఉర్యుపిన్ ఎంచుకుని, దాని వైపు భుజాలు వంచి, ఆ దూరాన్ని కళ్ళతోనే కొలుస్తూ, నడిచాడు.
పొడుగ్గా, కండపుష్టితో ఉన్న అతని చేతులు, నిశ్చలంగా ఉన్నాయి.
‘ఇటు చూడు!’
అతను తన ఖడ్గాన్నిపైకి మెల్లగా ఎత్తి, కిందకు కొద్దిగా వంగి, హఠాత్తుగా ఏటవాలుగా బలంగా ఆ చెట్టు మీద వేటు వేసాడు. ఆ చెట్టు కింద వేర్ల నుండి ఐదు అడుగుల ఎత్తులో తెగి, కుప్పకూలిపోయింది. దాని కొమ్మలు పక్కనే ఉన్న ఇంటి కిటికీకి, గోడకు వాలిపోయాయి.
‘నువ్వు చూసావా ఇది? నేర్చుకో. బాల్కానోవ్ ఒక అటామన్. అతని గురించి విన్నావా?
అతని ఖడ్గం పాదరసంతో నిండి ఉండేది. దాన్ని ఎత్తడం కష్టంగా ఉన్నా, ఒక వేటుతో గుర్రాన్ని రెండు ముక్కలు చేయగలదు. అలా!’అంటూ కూలిన చెట్టు వైపు చూపించాడు.
ఆ ఖడ్గ వేటు నైపుణ్యంలో ఉన్న క్లిష్టతను అర్ధం చేసుకుని, నేర్చుకోవడానికి గ్రెగరికి చాలా సమయం పట్టింది.
‘నువ్వు బలవంతుడివే కానీ చేతిలో ఖడ్గం ఉన్న మూర్ఖుడివి. ఇది చేసే పధ్ధతి ఇది’, కర్లీ అతనికి బోధించాడు, అతని ఖడ్గం లక్ష్యాన్ని గొప్ప బలంతో,ఒక వేటుతో రెండుగా చీల్చేది.
‘ధైర్యంతో మనిషిని రెండుగా చీల్చు. నిజానికి మనిషి ముద్దలా మెత్తగా ఉంటాడు’,కర్లీ నవ్వుతూ, సూచించాడు.’అసలు ఇదంతా దేని గురించి అని ఆలోచించొద్దు. నువ్వు ఒక కొసాక్కువి. ఏ ఆలోచన లేకుండా మనుషులను రెండు ముక్కలు చేయడమే నీ కర్తవ్యం. యుద్ధంలో ఒక మనిషిని చంపడం పవిత్ర కార్యం. ఆ దేవుడు నువ్వు ఒక్కో మనిషిని చంపినప్పుడల్లా నీ ఒక్కో పాపాన్ని క్షమిస్తాడు.విషపూరిత పాముని చంపినట్టే ఇక్కడ చంపడం కూడా.నువ్వు అవసరం లేకుండా సాధు జంతువులకు ఏ హాని చేయకూడదు. కానీ మనిషిని ధ్వంసం చేయి. మనిషి ప్రమాదకరమైన వాడు.
వాడు అశుభ్రమైనవాడు, భూమిని పుట్టకొక్కుల వలె నాశనం చేస్తాడు.’
గ్రెగరి అభ్యంతరాలకు బదులుగా అతను, ముఖం చిట్లించి, మౌనంగా ఉండేవాడు.
ఉర్యుపిన్ ను చూసి గుర్రాలు ఏ కారణం లేకుండా భయపడటం గ్రెగరిని ఆశ్చర్యపరిచేది. అతను గుర్రాలు కట్టేసి ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు, వాటి చెవులు మనిషి కాకుండా ఏదో క్రూర జంతువు దగ్గరకు వస్తున్నట్టు కదలకుండా ఉండేవి.ఆ దళం స్టానిస్లాసజ్ సమీపంలో ఉన్న అడవి దగ్గరకు వచ్చినప్పుడు ఆ దళాధికారి దళం అంతా గుర్రాలు దిగి వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. కొందరికి ఆ గుర్రాలను అక్కడి నుండి దూరంగా సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లే బాధ్యత అప్పగించబడింది.ఉర్యుపిన్ కి మొదట ఆ పని అప్పగిస్తే, తన వల్ల కాదని తేల్చి చెప్పేసాడు.
‘ఉర్యుపిన్, వెధవా, ఏంటి నీకు ఆటలుగా ఉందా? నువ్వు ఎందుకు గుర్రాలను తీసుకెళ్ళవు?’ ఆ దళపు సార్జెంట్ అరిచాడు.
‘అవి నన్ను చూస్తేనే భయపడుతున్నాయి, నిజంగా!’ కర్లీ ఎప్పటిలా నవ్వుతూ చెప్పాడు.
అతను ఎన్నడూ గుర్రాల సంరక్షణ చూడలేదు. అతను తన గుర్రంతో ఎంతో సున్నితంగా ఉండేవాడు, దాన్ని బాగా చేసుకునేవాడు.కానీ అతని గుర్రం మాత్రం అతను దగ్గరకు రాగానే భయంతో అస్థిరంగా కదులుతూ ఉండేది.
‘సరే, ఓ ఉత్తముడా, ఇప్పుడు చెప్పు గుర్రాలు నువ్వు దగ్గరకు వస్తే ఎందుకు భయపడతాయి?’ గ్రెగరి ఒక రోజు అడిగాడు.
‘ఎవరికీ తెలుసు? నేను వాటితో దయగానే ఉంటాను’, భుజాలెగరేస్తూ అన్నాడు ఉర్యుపిన్.
‘అవి తాగుబోతుని కూడా వాసనతో పసిగట్టేస్తాయి. వాటికి వాళ్ళంటే భయం. కానీ నువ్వు ఎప్పుడూ తాగి వెళ్ళవు.’
‘నాకు ఉక్కు లాంటి గుండె ఉంది. బహుశా అది పసిగట్టి ఉంటాయి.’
‘ఎవరికీ తెలుసు? నేను వాటితో దయగానే ఉంటాను’, భుజాలెగరేస్తూ అన్నాడు ఉర్యుపిన్.
‘అవి తాగుబోతుని కూడా వాసనతో పసిగట్టేస్తాయి. వాటికి వాళ్ళంటే భయం. కానీ నువ్వు ఎప్పుడూ తాగి వెళ్ళవు.’
‘నాకు ఉక్కు లాంటి గుండె ఉంది. బహుశా అది పసిగట్టి ఉంటాయి.’
కామింకా స్ట్రుమిలోవా దగ్గర మూడవ దళమంతా ఆ దళపు అధికారితో కలిసి పహారాకు వెళ్ళారు. అంతకు ఒక రోజు ముందు జెక్ నుండి పారిపోయి వచ్చిన ఒక సిపాయి ఆ దళపు అధికారికి ఆస్ట్రియా సైన్యం గోరోషి-స్టావీన్ స్కీ సరిహద్దు దగ్గర దాడి చేసే అవకాశం ఉందని చెప్పాడు.శత్రువులు చొచ్చుకువచ్చే అవకాశం ఉన్న దారి ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి.ఆ దళపు అధికారి నలుగురు కొసాక్కులను ఆ దళపు సార్జెంట్ తో అడవి మొదట్లో ఉంచి, మిగిలిన వాళ్ళతో కలిసి తర్వాతి కొండ నుండి స్పష్టంగా కనిపిస్తూ ఉన్న ఒక పొలం వైపు వెళ్ళారు.గ్రెగరి, ఆ దళపు సార్జెంట్, యువ కొసాక్కులు -సిలాంటేవ్, ఉర్యుపిన్, మైఖేల్ కోషివోయ్ ఒక బృందంగా ఏర్పడి,అడవి పక్కన పైన ఒక సిలువ బొమ్మతో ఉన్న ఒక చిన్న మందిరం దగ్గర గుర్రాల మీద ఉన్నారు.
సార్జెంట్ వారిని గుర్రాల మీద నుండి దిగమని చెప్పాడు.
”కుర్రాల్లారా, కిందకు దిగండి.కొషివోయ్, గుర్రాలను ఆ చెట్ల వెనక్కి తీసుకువెళ్ళు.అక్కడకు,ఎక్కువ చెట్లు ఉన్న చోటుకు’,అని అన్నాడు సార్జెంట్.
ఆ కొసాక్కులు అందరూ ఆ వృక్షాల వెనక విశ్రాంతి తీసుకుంటూ,పొగ కాలుస్తూ ఉంటే, సార్జెంట్ తన బైనాక్యులర్స్ నుండి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక పది అడుగుల దూరంలో ఇంకా పంటకు రాని వరి పొలం ఉంది. ఒక అరగంట దాకా కొసాక్కులు కబుర్లు చెప్పుకున్నారు. పక్కన ఉన్న పట్టణానికి కుడి వైపు నుండి ఆయుధాలు శబ్దాలు గట్టిగా వినిపించాయి. గ్రెగరి మెల్లగా ముందున్న వరి పొలం దగ్గరకు పాక్కుంటూ వెళ్ళి, ఇంకా పక్వానికి రాని గింజలను చేతితో నలిపి, నోటిలో వేసి నమిలాడు.
‘ఆస్ట్రియా వాళ్ళు!’ సార్జెంట్ చిన్న స్వరంతో అరిచాడు.
‘ఎక్కడా?’ సైలేంటెవ్ ఉలిక్కిపడుతూ అడిగాడు.
‘అడవి లోపలి నుండి వస్తున్నారు. అదిగో అక్కడ కుడి వైపు నుండి!’
గుర్రాల మీద కొందరు గుంపులుగా వస్తూ ఉండటం ఇప్పుడు అందరికీ కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఆగి, ఆ అడవి మొత్తాన్ని ఒకసారి పరిశీలనగా చూసి, కొసాక్కులు ఉన్న దిక్కు వైపు బయల్దేరారు.
‘మెలఖోవ్!’ సార్జెంట్ పిలిచాడు.
గ్రెగరి ఆ పొలం నుండి వెనక్కి వచ్చాడు.
‘వాళ్ళను ఇంకా దగ్గరకు రానిద్దాము,ఆ తర్వాత వారి మీద దాడి చేద్దాము. మీ తుపాకీలను సిద్ధం చేసుకోండి,అబ్బాయిలు!’ సార్జెంట్ గుసగుసగా అన్నట్టు అన్నాడు.
గుర్రాల మీద ముందుకు వస్తూ ఉన్నవారు కుడి వైపుకి తిరిగి, నడక వేగంతో వస్తున్నారు. ఒక వృక్షం వెనుక ఉన్న నలుగురు కొసాక్కులు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.
వారిలో ఒక కుర్రవాడు ఏదో మాట్లాడుతున్న శబ్దం వారికి వినిపించింది.
గ్రెగరి తన తల పైకెత్తాడు. అందమైన దుస్తులు ధరించిన ఆరుగురు హంగేరియా హుస్సార్లు ఒక గుంపుగా వస్తున్నారు. వారి నాయకుడు, ఒక పెద్ద నల్ల గుర్రంపై కూర్చుని,తన తుపాకిని పట్టుకుని,గట్టిగా నవ్వుతూ ఉన్నాడు.
‘ఇదే సరైన సమయం,దాడి చేయండి’,సార్జెంట్ చిన్నగా అన్నాడు.
ఆ బృందం దాడికి సిద్ధమై,ముందుకు వస్తూ ఉన్న ధ్వని ప్రతిధ్వనించింది.
‘ఏమైంది?’ ఆ చెట్ల వెనుక నుండి కొషివోయ్ అరుస్తూ, ‘ఆగండి!పిచ్చి పట్టిందా మీకు? ఆగండి!’అంటూ గుర్రాల మీద అరిచాడు.అతని స్వరం చాలా పెద్దగా ఉంది.
వెంటనే ఆ హుస్సార్లు విడిపోయి ఆ పొలం గుండా పారిపోసాగారు. వారిలో ఒకడు,నల్ల గుర్రం ముందు ముందు వెళ్తూ ఉన్నవాడు, గాలిలోకి పేల్చాడు. వారిలో ఆఖరి వాడు, గుర్రం మెడ మీదకి వంగి, ఎడమ చేత్తో టోపీ పట్టుకుని వెనక్కి తిరిగి చూశాడు.
ఉర్యుపిన్ ఒక్క ఉదుటున ముందుకు దూకి,పరిగెత్తాడు. అతని తన చేతిలో తుపాకిని పట్టుకుని,ఆ పొలంలో ముందుకు వెళ్ళాడు. ఒక వంద అడుగుల దూరం తర్వాత కింద పడిపోయి ఉన్న ఒక గుర్రం పైకి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంది. యజమాని దాని పక్కనే నిలబడి తన మోకాలు రుద్దుకుంటూ ఉన్నాడు. కొసాక్కులు కొద్ది దూరంలో ఉన్నప్పుడే తన చేతులు పైకెత్తి ఏదో అరిచాడు, తనను వదిలేసి ఎంతో దూరం వెళ్ళిపోయిన తన బృందాన్ని చూస్తూ.
అది ఎంత వేగంగా జరిగిందంటే ఉర్యుపిన్ అతన్ని ఖైదు చేసి తీసుకువచ్చేవరకు ఏం జరిగిందో గ్రెగరికి అర్థం కాలేదు.
‘ఓ సైనిక వీరుడా! అది తీసేయ్!’ ఆ హుస్సారు ఖడ్గం వైపు చూస్తూ అరిచాడు ఉర్యుపిన్.
ఆ సైనికుడు చిన్నగా నవ్వి,ఆ ఖడ్గ ఒరలో నుండి దాన్ని బయటకు తీయడానికి కష్టపడ్డాడు.ఆ సమయంలో అతని చేతి వేళ్ళు వణికాయి.గ్రెగరి అతనికి అది తీయడంలో సాయం చేశాడు, ఎత్తుగా, చక్కగా క్షవరం చేసి, పై పెదవి పై ఉన్న చిన్న మచ్చతో ఉన్న ఆ యువకుడు అందుకు కృతజ్ఞతగా నవ్వి, తల ఊపాడు.తన ఆయుధం నుండి తప్పించినందుకు అతను సంతోషంగా ఉన్నట్టున్నాడు. అతను కొసాక్కుల వైపు చూస్తూ, తన జేబుల్లో వెతికి, ఒక తోలు సంచి తీసి, అందులో ఉంది తీసుకోమన్నట్టు చూశాడు వారి వైపు.
‘అతను మనకు పొగాకు ఇస్తున్నాడు’, సార్జెంట్ నవ్వుతూ చెప్పి, తన జేబులో ఉన్న సిగరెట్టు చుట్టే కాగితం బయటకు తీసాడు.
‘ఉచితంగా వస్తున్న ఈ పొగాకుని ఆస్వాదించండి’, సైలెంటేవ్ నవ్వుతూ అన్నాడు.
కొసాక్కులు సిగరెట్లు చుట్టుకుని, వాటిని వెలిగించారు. ఘాటుగా ఉన్న ఆ పొగాకు నషా వారి తలలకు ఎక్కింది.
‘అతని తుపాకి ఎక్కడ ఉంది?’ పొగ కాలుస్తూ అడిగాడు సార్జెంట్.
‘ఇక్కడ’,ఒక తుపాకి తోలు పట్టితో సహా ఉన్నది తన భుజానికి తగిలించుకున్నది చూపిస్తూ అన్నాడు ఉర్యుపిన్.
‘అతన్ని దళ కార్యాలయం దగ్గరకు తీసుకువెళ్ళాలి.కార్యాలయానికి ఇక్కడ విషయాలు చేరవేసే నాలుక కావాలి. ఎవరు అతన్ని తీసుకువెళ్తారు?’దగ్గుతూ, కొసాక్కుల వైపు చూస్తూ అడిగాడు సార్జెంట్.
‘నేను’, ఉర్యుపిన్ స్వచ్చందంగా ముందుకు వచ్చాడు.
‘అయితే వెళ్ళు.’
ఆ ఖైదికి తనకు జరగబోయేది అర్ధమైనట్టు, బాధతో ఉన్న ఒక చిన్న చిరునవ్వు అతని పెదాల చివరన కనిపించినా,అతను తన భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో నైపుణ్యం సాధించినట్టు దాన్ని కనబడనియ్యకుండా చేసే ప్రయత్నం చేస్తూ, తన జేబులు కంగారుగా వెతికి అందులో ఉన్న ఒక చాక్లెట్ బార్ కొసాక్కులకు ఇస్తూ ముందుకు పెట్టాడు. .
‘నేను ఆస్ట్రియా వాడిని కాను…గ్లాసియా వాడిని’,ఏవో సైగలు చేస్తూ,ఆ కొసాక్కుల చేతుల్లో ఆ చాక్లెట్ ను పెడుతూ అతను తన బాషలో గొణిగాడు.
‘ఇంకేమైనా ఆయుధాలు ఉన్నాయా?’ సార్జెంట్ అడిగాడు. ‘నువ్వు అలా గొణగాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పేది మాకు ఎలాగూ అర్థం కాదు. నీ దగ్గర రివాల్వర్ ఉందా? ఇంకేమైనా ఆయుధాలు ఉన్నాయా?’సార్జెంట్ అతని తలకు తుపాకి గురి పెట్టి గట్టిగా మరలా అడిగాడు.
ఆఖైది గాబరాగా తల అడ్డంగా ఊపాడు.
‘లేవు!లేవు!’
వాళ్ళు వెతుకుతూ ఉంటే అతను ఏ అభ్యంతరం పెట్టలేదు. అతని బుగ్గలు వణుకుతూ ఉన్నాయి.
అతని మోకాలి దగ్గర తగిలిన దెబ్బ నుండి రక్తం కారుతూ ఉంది,అక్కడ గులాబీ రంగులో మాంసం కనబడుతూ ఉంది. అతను తన చేతి రుమాలిని దానికి అద్ది, తన పెదాలు కౌక్కుంటూ, ఆపకుండా ఏదో పిచ్చిగా మాట్లాడసాగాడు. అతని టోపీ ఇంకా చనిపోయిన అతని గుర్రం దగ్గరే పడి ఉంది. తన కంబళి, టోపీ, తన కుటుంబ చిత్రం పెట్టి ఉన్న నోట్ పుస్తకం తెచ్చుకోవడానికి అతను అనుమతి అడుగుతూ ఉన్నాడు. సార్జెంట్ అతను చెప్పేది అర్థం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి, చివరకు అర్థం కాక చేయి ఊపి, ‘అతన్ని తీసుకుపొండి’,అని ఆజ్ఞాపించాడు.
ఉర్యుపిన్ తన గుర్రాన్ని కొషివోయ్ నుండి తీసుకుని,దాని మీద ఎక్కి, తన తుపాకి సరి చేసుకుని,దాన్ని ఆ సైనికుడి వీపుకి గురి పెట్టి, ‘సైనికుడా! ముందుకు కదులు’,అన్నాడు.
ఉర్యుపిన్ నవ్వుతూ ఉండటం చూసి,ఆ సైనికుడు కూడా చిన్నగా నవ్వి, గుర్రం పక్కన నడుస్తూ, ఉర్యుపిన్ మోకాలి దగ్గర చిన్నగా ఆత్మీయంగా తట్టాడు. ఉర్యుపిన్ అతని చేతిని తోసేసి, గుర్రపు పగ్గాలు అందుకుని, అతన్ని ముందు నడిచేలా చేశాడు.
‘దయ్యమా!ముందుకు కదులు! ఏంటి ఆటలు ఆడుతున్నావా?’
ఆ ఖైది తప్పు చేసిన వాడిలా కంగారుగా ముందుకు కదిలాడు, అతని ముఖం గంభీరంగా మారిపోయింది. అతను ఒకసారి వెనక్కి తిరిగి కొసాక్కుల వైపు చూశాడు. అతని జుట్టు పై నుండి లేచి ఉంది. చక్కటి హుస్సార్ దుస్తులతో ,రింగులు తిరిగిన జుట్టుతో,ఆత్మవిశ్వాసంతో, ఏ చీకు చింతా లేనట్టు అతని నడక ఉంది. ఇలానే అతన్ని గ్రెగరి జ్ఞాపకం పెట్టుకున్నాడు.
‘మెలఖోవ్, వెళ్ళి అతని గుర్రపు జీను తీసుకురా’ సార్జెంట్ తన చేతి వేళ్ళు కాలేవరకు కాల్చిన సిగరెట్ పీకను కింద పడేస్తూ ఆజ్ఞాపించాడు.
గ్రెగరి ఆ చనిపోయిన గుర్రం జీను తీసి, తెలియకుండానే అక్కడ ఉన్న టోపీ వాసన చూశాడు. అది నాసిరకం సబ్బు,చెమట వాసనతో ఉంది. అతను ఆ టోపిని తన ఎడమ చేతిలో ఉంచుకునే,ఆ జీనును తీసుకువచ్చాడు. కొసాక్కులు ఓ వృక్షం దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని, విచిత్ర ఆకారంలో ఉన్న ఆ జీనుని చూస్తూ,ఆ సంచిలో ఏమున్నాయో వెతకసాగారు.
‘ఈ పొగాకు చాలా నాణ్యమైనది.అతన్ని ఇంకా పొగాకు మనం అడిగి ఉండాల్సింది’, శైలేంటేవ్ విచారంతో అన్నాడు.
‘హా,ఇది నిజంగానే బావుంది.’
‘గొంతు లోపలి నుండి వెన్నలా జారిపోయింది.’ సార్జెంట్ ఆ అనుభూతిని గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు.
కొన్ని నిమిషాల తర్వాత ఆ వృక్షాలకు కొద్ది దూరంలో ఒక గుర్రపు తల కనిపించింది. ఇంకా సమీపంగా వచ్చాక దాని మీద వస్తున్న ఉర్యుపిన్ కనిపించాడు.
‘ఏమైంది?అతను నీ నుండి తప్పించుకున్నాడా?’ సార్జెంట్ వ్యాకులతతో అడిగాడు.
ఉర్యుపిన్ తన కొరడాను గట్టిగా విదిలించి, కిందకు దిగి,భుజాలు విరుచుకున్నాడు.
‘ఆ ఆస్ట్రియా వాడిని ఏం చేశావు?’సార్జెంట్ ఇంకా దగ్గరకు వస్తూ అడిగాడు.
‘చంపేశాను!’ ఉర్యుపిన్ గుర్రుగా చూస్తూ అన్నాడు.
‘అతను పరిగెత్తాడు…పారిపోయే ప్రయత్నం చేశాడు.’
‘నువ్వు అతన్ని పారిపోనిచ్చావా?’
‘రోడ్డు మీదకు రాగానే అతను ప్రయత్నించాడు….నేను నా ఖడ్గంతో వేటు వేశాను .’
‘నువ్వు అబద్ధం చెప్తున్నావు!’ గ్రెగరి అరిచాడు. ‘నువ్వు అతన్ని ఏ కారణం లేకుండానే చంపావు.’
‘అసలు ఈ గొడవ అంతా దేనికి?అసలు ఈ విషయంతో నీకేమి సంబంధం?’గ్రెగరి వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఉర్యుపిన్.
‘ఏంటి?’ గ్రెగరి పైకి లేచి,అతని దగ్గరకు వెళ్ళి అన్నాడు.
‘నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు! అర్ధమైందా నీకు?’ ఉర్యుపిన్ తీవ్రంగానే అన్నాడు.
గ్రెగరి అతని తుపాకిని లాక్కున్నాడు.
కానీ వణుకుతున్న అతని వేళ్ళు ట్రిగ్గర్ ను కనుగొనలేకపోయాయి. అతని ముఖమంతా బాధగా ఉంది.
‘ఇక చాలు!’ సార్జెంట్ అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
సార్జెంట్ తోపుకి ఆ తూటా గురి తప్పి చెట్ల వెనక నుండి దూసుకుపోయింది.
‘దేవుని దయ!’ కొషివోయ్ నిట్టూరుస్తూ అన్నాడు.
సార్జెంట్ గ్రెగరిని వెనక్కి తోసేసి,అతని చేతిలో నుండి తుపాకి లాక్కుంటూ ఉన్నాడు. ఉర్యుపిన్ మాత్రం కదలకుండా ఉన్నాడు. రెండు కాళ్ళు దూరంగా పెట్టి, ఎడమ చేతిని బెల్ట్ దగ్గర ఉంచి నిశ్చలంగా ఉన్నాడు.
‘ఇంకోసారి కాల్చు!’
‘నేను నిన్ను చంపేస్తాను!’, గ్రెగరి అరుస్తూ అతనికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేశాడు.
‘ఏం చేస్తున్నావు నువ్వు? కోర్ట్ మార్షల్ కి గురవ్వాలని అనుకుంటున్నావా? కాలుస్తావా?తుపాకి కింద పడెయ్!’ సార్జెంట్ అరుస్తూ,గ్రెగరిని పక్కకు తోసి, వారిద్దరి మధ్య నిలబడ్డాడు.
‘చెత్త వాగుడు! నువ్వు నన్ను చంపవు!’ ఉర్యుపిన్ వెక్కిరిస్తున్నట్టు అని, కాళ్ళు కదిల్చాడు.
వారి వెనక్కి ప్రయాణం అయ్యేసరికి సాయంత్రమైంది. రోడ్డు పక్కన పడి రెండుగా ఉన్న ఆ శవాన్ని మొదట గ్రెగరి చూశాడు. అతను పరీక్షగా దాన్ని చూడటానికి మిగిలిన వారిని దాటుకుంటూ వేగంగా అక్కడికి వెళ్ళాడు. ఆ చనిపోయిన వాడి ముఖం రోడ్డు పక్కన ఉన్న గడ్డిలో ఉంటే,అతని చేయి వెనక్కి తిరిగి ఉంది. వాడిపోయిన ఆకులా అతని చేయి పచ్చరంగులోకి మారిపోయింది,ఆ గడ్డిలో. ఆ ఆటవిక వేటు వెనుక నుండి పడినట్టు ఉంది. వీపు నుండి పొట్ట వరకు మొత్తం చీలిపోయి ఉంది.
‘అతన్ని దారుణంగా చంపాడు’, సార్జెంట్ అక్కడి నుండి వెళ్తూ, పక్కకు తిరిగి ఉన్న చనిపోయి ఉన్న వాడి తల చూస్తూ అన్నాడు.
కొసాక్కులు నిశ్శబ్దంగా తమ దళం దగ్గరకు సాగిపోయారు. అప్పటికే చీకటి పడుతూ ఉంది . చల్లటి గాలి వీస్తూ ఉంది,మేఘం ఒకటి పశ్చిమ దిశ నుండి వస్తూ ఉంది. తడిచిన గడ్డి, కుళ్లిన మొక్కల వాసన గాలి మోసుకు వస్తూ ఉంది. గుర్రాల మెడల్లో ఉన్న గంటలు, గుర్రపు డెక్కల శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంది. సూర్యకాంతి తగ్గిపోయి,వృక్షాల వెనుక నుండి సూర్యుడు కూడా తప్పుకున్నాడు. ఉర్యుపిన్ ఒక దాని తర్వాత ఇంకొక సిగరెట్టు కాలుస్తున్నాడు. అతని మొరటు వేళ్ళు పొగాకు అంటి ఉండటం ఆ వెలుగులో కనిపిస్తుంది.
ఆ అడవి దిశకు మారిన మేఘం,ఆ సాయంత్రపు విషాదానికి చిహ్నంలా ఉంది.
* * *
అధ్యాయం-13
పట్టణం మీద దాడి ఉదయమే మొదలైంది. ఆశ్విక దళాల సాయంతో పదాతి దళాలు అడవి చాటు నుండి పొద్దు పొడవకముందే దాడి చేయాలి కానీ ఒక గందరగోళం తలెత్తింది. రెండు పదాతి దళాలు వారి దాడి ఆరంభ స్థానానికి సమయానికి చేరుకోలేకపోయాయి. వాటిల్లో ఒకటైన 211 వ దళానికి ఎడమ వైపుకి వెళ్ళమని ఆజ్ఞ వచ్చింది, ఇంకో దళం వలయాకారంలో ఏర్పడే సమయంలో హడావుడిలో కాల్పులు వారి మధ్యే జరిగాయి. దాంతో మొత్తం గజిబిజి అయిపోయింది, యుద్ధ వ్యూహం విఫలమైంది. పదాతి దళం ఈ గజిబిజిని మామూలు స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయుధ దళం ఆయుధాలను సంసిద్ధం చేస్తున్న సమయంలో, 11 వ ఆశ్విక దళం దాడికి దిగింది. చిత్తడిగా ఉన్న ఆ ప్రాంతంలో దళాలు వ్యక్తిగతంగానే దాడులకు దిగాయి. 12 వ రెజిమెంటుకి చెందిన నాలుగు,ఐదు దళాలు రిజర్వులో ఉంచబడ్డాయి; మిగిలినవి అప్పటికే దాడి చేస్తూ ఉన్నాయి. ఒక పావు గంట తర్వాత ఆ రిజర్వు బృందాలకు గుసగుసలు,నవ్వులు వినిపించాయి. మధ్యమధ్యలో కొసాక్కులు తమలో తామే మాట్లాడుకుంటున్నారు.
‘వాళ్ళు మొదలుపెట్టేశారు!’
‘అదిగో మెషీన్ గన్లు పేలుతున్న చప్పుడు!’
‘మన వాళ్ళను చంపేస్తూ ఉండి ఉంటారు,నేను పందెం కడతా కావాలంటే …’
‘ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు కదా?’
‘ఈపాటికి అక్కడికి వచ్చే ఉంటారు.’
‘తర్వాత మన వంతే.’
ఆ దళాలు అడవి మధ్యలో ఉన్నాయి,పెద్ద వృక్షాలు అడ్డుగా ఉండటం వల్ల వారికి స్పష్టంగా ఏమి కనిపించడం లేదు. ఒక పదాతి దళం ముందుకు వెళ్తూ ఉంటే, చూడటానికి హుందాగా ఉన్న వారి సార్జెంట్ మేజర్, ‘దాడి చేయొద్దు’,అని వెనుక నుండి అరిచాడు.
ఆ బృందం వేగంగా ముందుకు వెళ్తూ ఉంటే,వారి నీళ్ళ సీసాల ధ్వని కొద్ది క్షణాలు వినిపించింది,ఆ తర్వాత వారు వృక్షాల వెనుక మాయమయ్యారు.
ఆ అడవి నుండి చాలా దూరం నుండి బలహీనమైన అరుపులు,మాటలు వినిపిస్తూ,ఆగిపోతూ ఉన్నాయి.కాసేపటికి పూర్తిగా నిశ్శబ్దం.
‘ఇప్పుడు వాళ్ళు వచ్చారు!’
‘ఒకర్ని ఒకరు నరుక్కుంటున్నారు.’
వారందరూ ఏదైనా వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి వింటున్నారు,ఆ సమయంలో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. కుడి వైపు నుండి ఆస్ట్రియా ఆయుధాలు పేలుతూ ఉన్నాయి,ఆ వాతావరణం అంతా మెషిన్ గన్లు ధ్వనితో దద్దరిల్లిపోయింది.
గ్రెగరి మెలఖోవ్ తన దళం వైపు చూశాడు. వారు చాలా ఉద్రిక్తతతో ఉన్నారు,గుర్రాలు కూడా చాలా అసహనంగా ఉన్నాయి. ఉర్యుపిన్ తన టోపిని గుర్రం జీను మీద పెట్టి,తన ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటున్నాడు. గ్రెగరి పక్కనే ఉన్న కొషివోయ్ సిగరెట్టు కాలుస్తున్నాడు. నిద్ర లేని రాత్రి గడిపిన వారికి ఉద్వేగాలు కూడా తీవ్రంగా ఉన్నాయి.
ఆ దళాలు దాదాపు మూడు గంటలు వేచి చూశాయి. కాల్పుల శబ్దం వినిపిస్తూ,ఆగిపోతూ ఉంది. ఒక విమానం ఎత్తు మీద ఎగురుతూ, పైన కొన్ని గిరికిలు కొట్టి,తూర్పు దిశగా వెళ్ళిపోయింది; పై నుండి చేసిన కాల్పుల వల్ల వచ్చిన పొగ గాలిలో నిండిపోయింది.
రిజర్వు దళాలు మధ్యాహ్నం పంపబడ్డాయి. ఉన్న పొగాకు అంతా దాదాపుగా అయిపోయింది,హుస్సార్ వార్తకుడు వస్తూ ఉండటం వారిలో కుతూహలాన్ని పెంచింది. నాలుగవ దళ కమాండర్ వెంటనే తన దళాలను అడవి దారి గుండా తీసుకువెళ్ళిపోయాడు. (వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారని గ్రెగరి అనుకున్నాడు). ఇరవై నిమిషాల వరకు ఏ వ్యూహం లేకుండా పొదల గుండా వారు ప్రయాణం చేశారు. యుద్ధపు శబ్దాలు దగ్గరగా వినిపిస్తున్నాయి; ఎక్కడో,వారికి దగ్గరలోనే ఒక బృందం ఆపకుండా కాల్పులు జరుపుతుంది. ఆ తుటాలు ఆ అడవిలో మధ్యమధ్యలో చెట్లకు తగులుతూ ఉన్నాయి. ఆ అడవి నుండి దళం పొలాల్లోకి వచ్చింది. హంగేరియా హుసార్లు అర వెరస్టు దూరంలో రష్యా ఆయుధ దళాన్ని ఊచకోత కోస్తూ ఉంది.
‘సభ్యులారా! వ్యూహ ఆకారంలో ఏర్పడండి!’
వారు ఆ వరుసలో ఏర్పడే ముందే, ‘దళ సభ్యులారా,ఖడ్గాలు తీయండి,దాడి చేయండి–ముందుకు వెళ్ళండి!’ఆజ్ఞ వినిపించింది.
వెంటనే ఆ దళం తమ ఖడ్గాలు తీసింది, వేగంగా ముందుకు సాగింది.
ఆరుగురు హంగేరియా హుస్సార్లు రష్యా ఆయుధ దళం ఆయుధాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. వారిలో ఒకడు గుర్రాలను బలంగా లాగుతూ ఉంటే,ఇంకొకడు వాటిని కొడుతూ ఉంటే,మిగిలిన వాళ్ళు గుర్రాలు దిగి,ఆ ఆయుధాలు ఉన్న బండి చక్రాల దగ్గర ఉన్నారు.చాక్లెట్ రంగులో ఉన్న గుర్రంపై ఉన్న ఓ అధికారి అరుస్తూ వారికి ఆజ్ఞలు ఇస్తున్నాడు. కొసాక్కులను చూడగానే, హంగేరియా వాళ్ళు ఆ ఆయుధాలను అక్కడే వదిలేసి పారిపోయారు.
‘ఒకటి,రెండు …’గ్రెగరి గుర్రం ముందుకు వెళ్తూ దాని అడుగులు లెక్కబెడుతున్నాడు. కొద్ది క్షణాల పాటు అతని పాదం పట్టు పోయింది,భయంతో అతను పక్కకు జారిపోతూ ఉన్నాడు. పాదాన్ని సరిగ్గే పెట్టె ప్రయత్నం చేస్తూ, ఆ ఆయుధ దళంలో ఉన్న ఆరు గుర్రాలను కళ్ళు పైకెత్తి చూశాడు. మొదటి గుర్రం మీద ఉన్నవాడు దాని మెడ చుట్టూ చేతులు వేసి పడిపోయి ఉన్నాడు,అతని చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది. పుర్రె పగిలి,మెదడు బయటకు వచ్చింది. ఆ తర్వాతి క్షణమే తన గుర్రపు డెక్కల శబ్దంతో పాటు,తన గుర్రం ఒక సభ్యుడి మీద నుండి వెళ్ళడం కూడా చూశాడు. ఇద్దరూ ఆ ఆయుధ బండి పక్కన పడి ఉంటే,మూడో వాడు ఇంకొద్ది దూరంలో పడి ఉన్నాడు. ఆ క్షణంలో శైలేంటేవ్ గ్రెగరిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. గోధుమ రంగులో ఉన్న గుర్రం మీద ఉన్న అధికారి అతని కేసి గురి చేసి కాల్చాడు. .శైలేంటెవ్ కొద్దిగా కదిలి వెనక్కి పడిపోయాడు,ఏదో తెలియని విషాదాన్ని హత్తుకున్నట్టు అతను నేలను హత్తుకున్నాడు. గ్రెగరి పక్కన నుండి దాడి చేయడానికి తను వీలుండేలా చూసుకుని ఎడమ వైపుకి వెళ్ళాడు; ఇది గమనించిన ఆ అధికారి కాల్పులు మొదలుపెట్టాడు. తూటాలు అన్నీ ఖాళీ చేశాక,తన ఖడ్గాన్ని బయటకు తీశాడు. ఖడ్గ విద్యలో నైపుణ్యం ఉన్నవాడిలా మొదటి మూడు సార్లు ఆ అధికారి ఎంతో చాకచక్యంగా దాడి చేశాడు.నాలుగో సారి గ్రెగరి గుర్రం నుండి పైకి లేచి ఎదురుదాడి చేశాడు. వారి గుర్రాలు దాదాపుగా పక్క పక్కనే వెళ్తూ ఉన్నాయి. గ్రెగరికి ఆ హంగేరియా అధికారి క్షవరం చేసిన గడ్డం, అతని యూనిఫారంపై కుట్టి ఉన్న సంఖ్య కనపడుతున్నాయి. ఆఖరి క్షణంలో తన దాడి వ్యూహాన్ని మార్చి గ్రెగరి అతని మెడ మీద,భుజాల దగ్గర వేట్లు వేశాడు. ఆ హంగేరియా వాడి ఖడ్గం ఆ తర్వాత ముందుకు కదలలేదు,అతను ఆ గుర్రపు జీను మీద ముందుకు వాలిపోయాడు. ఒక రకమైన ఉపశమనం కలగడంతో గ్రెగరి అతని తలపై ఒక వేటు వేశాడు. చెవి పైన ఉన్న ఒక ఎముకలోకి ఖడ్గం దిగబడటం గ్రెగరి చూశాడు.
ఆ తర్వాతి క్షణంలోనే వెనుక నుండి తనపై పడిన వేటుతో అతను నిశ్చేష్టుడయ్యాడు. అతనికి తన నోట్లో వేడి ఉప్పు ఉన్నట్టు అనిపించింది,తను పడిపోతున్నట్టు అతని అర్థమైంది,కాసేపటికి పక్క నుండి కింద పడ్డాడు.
బలంగా కిందకు పడటంతో ఆ తీవ్రతకు ఓ క్షణం అతనికి ఈ లోక స్పృహ వచ్చింది. అతను తన కళ్ళను తెరిచాడు,కళ్ల చుట్టూ రక్తంతో నిండిపోయింది. గుర్రపు డెక్కల చప్పుడుతో ఆ ప్రాంతమంతా మార్మోగుతూ ఉంది. ఆఖరి సారిగా అతను గులాబీ రంగులో ఉన్న గుర్రపు నాసికలు చూశాడు. ‘అంతా అయిపోయింది!’ఇదే అతని మెదడులో నిండిపోయింది. అప్పుడే ఏ పెద్ద అరుపు అతని నోటి నుండి వెలువడింది. తర్వాత అంతా శూన్యం.
* * *
అధ్యాయం-14
ఆగస్టు మొదట్లో యెవజిని లిస్ట్ నిట్ స్కీ అటామన్ లైఫ్ గార్డు సేవల నుండి కొసాక్కు రెజిమెంటులోకి తనను తాను బదిలీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను దరఖాస్తు పంపిన మూడు వారాలకు ఆ రెజిమెంటులోకి బదిలీకి ఆమోదం వచ్చింది. దానికి సంబంధించిన అధికారిక లాంఛనాలు అన్ని పూర్తి చేసాక, పెట్రోగ్రాడ్ వదిలి వెళ్ళబోయే ముందు అతను తన తండ్రికి తన నిర్ణయం తెలియజేస్తూ ఒక ఉత్తరం రాశాడు.
ప్రియమైన నాన్నకు,
నేను నన్ను అటామన్ శాఖ నుండి సైన్యంలోకి బదిలీ చేయించుకోగలిగాను.ఈ రోజే నా బదిలీని ఆమోదిస్తూ,మరియు సైన్యంలో చేరడానికి అధికారిక సందేశం పంపించారు. నేను రెండవ సైనిక దళంలో చేరాల్సి ఉంటుంది. నీకు తప్పకుండా నా ఈ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించే ఉంటుంది కానీ ఈ విషయం గురించి నీకు వివరణ ఇస్తాను. ఇక్కడ ఉన్న వాతావరణం వల్ల నన్ను ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించింది. ఇక్కడ రాజ్య దర్బారులో జరిగే సమావేశాలు, మిగిలిన పనులు నాకు పెద్ద ఆసక్తిని కలిగించడం లేదు. నాకు నిజంగా ఏదైనా కార్యాశీలక పని చేయాలని ఉంది,ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏదో ఒకటి వీరుడిలా చేయాలనిపించింది. మన రక్తంలోనే ఇది ఉందని నేను అనుకుంటున్నాను. 1812 లో జరిగిన యుద్ధం నుండి లిస్ట్ నిట్ స్కీల రక్తం తమ వీరత్వంతో ఎన్నో పతకాలను సాధించింది. నేను యుద్ధానికి వెళ్తున్నాను. నేను మీ ఆశీర్వాదం కోరుతున్నాను. పోయిన వారం చక్రవర్తి గారు ప్రధాన కార్యాలయానికి వెళ్తుంటే చూశాను . నేను ఆయన్ని ఆరాధిస్తాను.నేను ఆ సమయంలో ఇంటి వ్యవహారాలు చూసుకునే గార్డుతో కలిసి ఉన్నాను. ఆయన రోడ్జియాంకో తో కలిసి వెళ్తూ,దారి మధ్యలో ఉన్న నా వైపు చూసి, ‘వీరే నా వీరులైన రక్షకులు.వీరే నాకు రానున్న ప్రమాదాల్లో అండగా ఉంటారు’,అన్నారు. నేను ఆయన్ని ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయి ఆరాధించినట్టు ఆరాధిస్తాను. నాకు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళ వయసున్న ఈ విషయం మీ ముందు ఒప్పుకోవడానికి నేను సిగ్గు పడను. కానీ ఈ భవనం చుట్టూ చక్కెర్లు కొట్టే వదంతుల విషయంలోనే నేను చాలా వ్యాకులత చెందుతూ ఉన్నాను. వాటిని నేను ఎప్పటికీ నమ్మను,నమ్మలేను. ఆ తర్వాత రోజు మేజర్ గ్రోమోవ్ చక్రవర్తి గారి గురించి అగౌరవంగా మాట్లాడినందుకు నేను దాదాపు అతన్ని కాల్చినంత పని చేశాను. ఒక పనికిమాలిన వెధవ మాత్రమే అంతగా దిగజారి అలాంటి వార్తలు ప్రచారం చేస్తాడని నేను అన్నాను. ఈ ఉదంతం అనేకమంది అధికారుల సమక్షంలోనే జరిగింది. ఆ క్షణంలో నాకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే నేను నా రివాల్వర్ బయటకు తీసి,ఒక తూటా పేల్చబోయాను. కానీ ఈ లోపే మిగిలిన అధికారులు వారించడంతో ఆగిపోయాను. రోజురోజుకి ఈ మురికిగుంటలో ఉండటం నాకు కష్టం అయిపోతూ ఉంది. ఈ గార్డుల రెజిమెంటులో, ముఖ్యంగా అధికారుల్లో నిజంగా దేశభక్తి లేదు-భయపెట్టే విషయం అయినా ఇంకొకటి ఏమిటంటే-సామ్రాజ్యం పట్ల ఇసుమంతైన ప్రేమ కూడా లేదు. వీరేమి ఉన్నత వర్గానికి చెందిన వారు కాదు,మామూలు మనుషుల కన్నా హీనమైన వారు.నిజానికి నేను ఈ రెజిమెంటు నుండి విడిపోవడానికి అసలు కారణం ఇదే.నాకు గౌరవం లేని వ్యక్తులతో కలిసి నేను పనిచేయలేను. ఇది అసలు విషయం. సరిగ్గా లేని నా చేతిరాతకు నన్ను క్షమించండి,నేను హడావుడిలో ఉన్నాను.ఇక నేను నా సూట్ కేసు మూసేసి దళం దగ్గరకు వెళ్ళాలి. జాగ్రత్తగా ఉండండి,నాన్నా! యుద్ధానికి వెళ్ళాక నేను ఇంకా వివరంగా రాస్తాను.
-మీ యెవజిని
వార్సాకు వెళ్ళే రైలు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరింది.లిస్ట్ నిట్ స్కీ స్టేషన్ కు టాక్సీ మీద వెళ్ళాడు.ముందుకు వెళ్తూ ఉంటే, వెనక్కి పోతున్నట్టు ఉన్న ఆ పెట్రోగ్రాడ్ అతనికి లైట్ల కాంతులతో వెలిగిపోతున్నట్టు అనిపించింది. స్టేషన్ అంతా జనాలతో రద్దీగా, హడావుడిగా ఉంది. అక్కడ ఉన్నవారిలో ఎక్కువ మంది సైన్యానికి చెందినవారే.పోర్టర్ లిస్ట్ నిట్ స్కీ సామాన్లను కిందకు దించి,రైలులో అతని బెర్తు దగ్గర అమర్చి, అతనిచ్చిన నాణేలును అందుకుని,అతనికి ‘హ్యాపీ జర్నీ’అని చెప్పాడు. లిస్ట్ నిట్ స్కీ తన ఖడ్గం పెట్టుకునే బెల్టును,పైనున్న కోటును తీసేసి,మెత్తగా ఉన్న బొంతను తన బెర్టు మీద పరిచాడు. అతని కింద, కిటికీ దగ్గర సన్నగా ఉన్న ఒక ప్రీస్ట్ కూర్చుని,అప్పుడే ఇంటి నుండి తెచ్చుకున్న తిండి పదార్ధాలను ఒక చిన్న బల్ల మీద పరుచుకుని తింటూ ఉన్నాడు. అతను తింటూ ఉంటే,అతని నోటి నుండి చిన్న చిన్న రొట్టె ముక్కలు కింద పడుతూ ఉన్నాయి. అతని ఎదురుగా సన్నగా,నల్లగా ఉన్న ఒక అమ్మాయి ఉంది. తన దగ్గర ఉన్న తిండి పదార్ధాల్లో కొన్ని,ఆమెకు ఇవ్వబోయాడు.
‘ఇది తిను.’
‘వద్దు.’
‘సిగ్గు పడకు. నీ లాగా సన్నగా ఉండే అమ్మాయిలు కాస్త ఎక్కువే తినాలి.’
‘కృతజ్ఞతలు.’
‘ఇదిగో ఈ పెరుగు కేకు తీసుకో. లూయిటెంట్, మీకు కూడా కొద్దిగా ఇవ్వమంటారా?’
లిస్ట్ నిట్ స్కీ పై నుండి కిందకు చూశాడు.
‘మీరు నాతో మాట్లాడుతున్నారా?’
‘అవును’, అతని వైపే చూస్తూ నవ్వుతూ అన్నాడు ఆ ప్రీస్ట్.
‘ధన్యవాదములు. కానీ నాకు ఆకలిగా లేదు.’
‘అది చాలా జాలి పడాల్సిన విషయం. దేవుడు ప్రసాదించే వాటిని కాదనకూడదు. మీరు సైన్యంలో ఉన్నారా?’
‘అవును.’
‘ఆ దేవుడు మీకు సహాయం చేయు గాక.’
నిద్రమత్తులో ఉన్న లిస్ట్ నిట్ స్కీ ఆ ప్రీస్ట్ స్వరాన్ని ఏదో దూరం నుండి వింటున్నట్టు విన్నాడు, తర్వాత కొద్దిసేపటికి అతనికి ఆ స్వరం మేజర్ గ్రోమోవ్ ది లా అనిపించింది.
‘……నాకు ఒక కుటుంబం ఉంది,ఇప్పుడు పేదరికంలో ఉన్నాము మేము.అందుకే ఇప్పుడు నేను ఓ రెజిమెంటుకి ప్రీస్ట్ గా వెళ్ళాల్సి వచ్చింది. రష్యా ప్రజలు విశ్వాసం లేకుండా జీవించలేరు. నీకు తెలుసా, ప్రతి సంవత్సరం ఈ విశ్వాసం పెరుగుతూనే ఉంది. కొందరు ఈ దారి నుండి పక్కకు నడుస్తారు,కానీ వాళ్ళంతా మేధావులు,చదువుకున్నవారు. సాధారణ ప్రజలు దైవాన్ని తప్పక నమ్ముతారు.వాళ్ళ దినచర్యలో అది ఒక భాగం ….’ఆ లోతైన గొంతు నిట్టూర్చింది,ఆ తర్వాత వేరే ఏదో విషయం మీద మాట్లాడిన మాటలు లిస్ట్ నిట్ స్కీ మెదడులోకి ఎక్కలేదు.
లిస్ట్ నిట్ స్కీ నిద్ర పోయాడు. అప్పుడే కొత్తగా ఆ బండి సీలింగ్ కు వేసిన పెయింటింగ్ వాసన, కిటికీ దగ్గర ఎవరో అరుస్తున్న ధ్వని అతను నిద్రలోకి జారుకోబోయే ముందు అతని ఇంద్రియానుభూతులు.
‘సామాన్లు పెట్టుకునే కార్యాలయమే ఒప్పుకుంది. ఈ విషయంతో నాకేం సంబంధం లేదు .’
సామాన్లు పెట్టుకునే కార్యాలయం దేనికి ఒప్పుకుంది? ఈ ప్రశ్న అతని మెదడులో ఒక నిమిషం తిష్ట వేసింది, మరలా ఆ ఆలోచన తెగిపోయింది. రెండు నిద్ర లేమి రాత్రుల తర్వాత అతను ఎంతో హాయిగా అప్పుడే కునుకు తీశాడు. ఆ రైలు పెట్రోగ్రాడ్ నుండి దాదాపు నలభై వెరస్టుల దూరం ప్రయాణం చేసేవరకు అతను నిద్ర లేవలేదు. చక్రాల చప్పుడుతో ,మధ్య మధ్యలో బండి పక్కకు ఊగుతూ ఉంది. తర్వాతి కంపార్ట్మెంటులో కొన్ని స్వరాలు కలిసి ఓ పాట పాడుకుంటున్నాయి. ఒక లాంతరు దీపపు వెలుగులో వారి నీడలు కనబడుతున్నాయి.
లిస్ట్ నిట్ స్కీ బదిలీ చేయబడ్డ రెజిమెంటు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఆ రెజిమెంటును యుద్ధ రంగం నుండి తొలగించి, కొత్త మనుషులు,గుర్రాలతో ఆ రెజిమెంటును మరలా పరిపుష్టం చేస్తున్నారు.
రెజిమెంటు ప్రధాన కార్యాలయం పెద్ద వర్తక పట్టణమైన బెరిజన్యగిలో ఉంది. దగ్గర్లో సైనిక ఆసుపత్రి ఉన్న చిన్న స్టేషన్ దగ్గర లిస్ట్ నిట్ స్కీ రైలు దిగిపోయాడు.ఆ ఆసుపత్రి అధికార వైద్యుడి ద్వారా ఆ ఆసుపత్రి నైరుత దిక్కు నుండి ఈ విభాగానికి బదిలీ చేయబడిందని, త్వరలోనే బెరిజన్య ఇవానొవ్కా ,క్రిషోవిన్ స్కోయ్ గ్రామాల గుండా వేరే చోటుకి వెళ్ళబోతుందని కూడా చెప్పాడు. ఎర్ర బడిన ముఖంతో ఆ వైద్యుడు తన పై అధికారుల గురించి, అక్కడ ఉన్న యాజమాన్యం గురించి, అప్పుడే కలిసిన కొత్త వ్యక్తితో, కిందకు జారుతున్న కళ్లద్దాలు సరి చేసుకుంటూ, ఫిర్యాదుపూర్వకంగా కోపధ్వనిలో చెప్తూ ఉన్నాడు.
‘నన్ను బెరిజన్యగి తీసుకువెళ్ళగలరా?’ లిస్ట్ నిట్ స్కీ అతని మాటల ప్రవాహానికి అడ్డొస్తూ అడిగాడు.
‘అయితే బండి ఎక్కండి, లూయిటెంట్. మాతో రండి’, అంటూ ఆ వైద్యుడు తన అంగీకారాన్ని తెలిపాడు.
ఒక్కసారిగా సన్నిహితమైనట్టు అనిపించడంతో, ఆ వైద్యుడు లిస్ట్ నిట్ స్కీ కోటు మీద ఉన్న గుండీని తిప్పుతూ, జాలి కలిగేలా మాట్లాడాడు,’ఒక్కసారి దీని గురించి ఆలోచించండి, లూయిటెంట్. ఇక్కడ నుండి రెండు వందల వెరస్టుల దూరం ఈ పశువుల బండ్లలో ప్రయాణించడం, అక్కడ చేయడానికి ఏమి లేకపోయినా ఊరికే ఉండటం;ఇంకో పక్క ఎక్కడనుండి అయితే బదిలీ చేశారో అక్కడ యుద్ధరంగంలో రక్తం ఏరులై పారుతూ, కొన్ని వందల మంది గాయపడి, మా సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.’మరలా కోపంతో కళ్ళు పెద్దవి చేసి, “అవును, రక్తం ఏరులై పారుతుంది”, అన్నదాన్ని మరలా అన్నాడు ఒత్తి పలుకుతూ.
‘అసలు ఈ గందరగోళం గురించి మీ వివరణ ఏమిటి?’లిస్ట్ నిట్ స్కీ నెమ్మదిగా అడిగాడు. \
‘వివరణ?’ ఆ వైద్యుడు తన కనుబొమ్మలు వ్యంగ్యంగా ఎత్తి, తన కళ్ళద్దాలను సరిచేసుకుంటూ అన్నాడు, ‘అధికారంలో ఉన్న వారి అలసత్వం,అహంకారం మరియు మూర్ఖత్వం,అంతే! ఆ వెధవలు వెనుక హాయిగా కూర్చుని ఇలా అస్తవ్యస్తం చేస్తారు. అసలు సామర్ధ్య దక్షత లేనే లేదు,కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. వేరేశాయెవ్ రాసిన ‘ఏ సర్జన్ నోట్స్’గుర్తుందా? అది అక్కడే ఉంది,సార్!నాలుగు కాపీలు ఉన్నాయి!’
లిస్ట్ నిట్ స్కీ అతనికి శాల్యూట్ చేసి,అక్కడి నుండి బండ్ల దగ్గరకు వెళ్ళిపోయాడు, కోపంతో వెనుక నుండి ఆ వైద్యుడు వెనుకానుండి గట్టిగా, ‘మనం యుద్ధంలో ఓడిపోబోతున్నాము,లూయిటెంట్. మనం జపాన్ వాళ్ళతో ఓడిపోయాము.కానీ దాని నుండి ఏమి నేర్చుకోలేదు.ఈ యుద్ధంలో కూడా అలానే జరుగుతుందని అనిపిస్తుంది,ఇంకా అంతకన్నా ఏమి జరుగుతుందని ఊహించగలము…’తన తల అటూ ఇటూ ఊపుతూ అన్నాడు.
ఆ వైద్యశాల బెరిజన్యగి చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. గాలి బలంగా వీస్తూ ఉంది. పడమటి దిక్కు నుండి మేఘాలు వస్తున్నాయి. పైకి చూస్తే అవి ఊదా,నలుపు మిశ్రమమై ఉన్నట్టు కనిపిస్తున్నా,కానీ కింద మాత్రం లేత రంగులోనే దర్శనమిచ్చాయి. ఆ మేఘాల మధ్యలో నదిలో మంచు పొంగుతున్నట్టు ఆ సందుల్లో సూర్యుడు అస్తమిస్తూ తన కిరణాలను ప్రసరిస్తున్నాడు. వివిధ రంగుల మిశ్రమంతో ఆ వాతావరణమంతా ఆహ్లాదకరంగా లేదు.
రోడ్డు పక్కన ఉన్న మురికిగుంట దగ్గర కాల్పులలో చనిపోయిన గుర్రం పడి ఉంది. దాని వెనుక కాలు ఒకటి కొద్దిగా పైకి లేచి ఉండి,ఆ పాదానికి ఉన్న అరిగిపోయిన బూటు మెరుస్తూ ఉంది. బండిలో వెళ్తూ ఉన్న లిస్ట్ నిట్ స్కీ ఆ చనిపోయిన గుర్రం వైపు కుతూహలంతో చూశాడు. అతనితో పాటు ఉన్న ఓ వైద్య అధికారి ఉబ్బి ఉన్న ఆ గుర్రం పొట్ట దగ్గర ఉమ్మి,’దానికదే ఎక్కువ తిని పొట్ట ఉబ్బి చచ్చిపోయింది’,లూయిటెంట్ వైపు చూస్తూ,ఎంతో నమ్మకంగా చెప్తూ,మరలా ఉమ్మబోతూ,అది మర్యాద కాదనుకుని,దానిని మింగేసి,తన చొక్కా చేత్తో పెదాలను తుడుచుకున్నాడు. ‘అది ఇప్పుడు చచ్చిపోయింది. కనీసం దానిని పక్కకు తీసి కూడా వేయలేదు ఎవరూ. ….జర్మన్లు మనం ఉన్నట్టు ఉండరు.’
‘నీకు ఎలా తెలుసు?’ పట్టలేని కోపంతో లిస్ట్ నిట్ స్కీ అతన్ని అడిగాడు,ఆ క్షణంలో అతనికి ఆ అధికారి ముఖం చూడగానే ఒక తెలియని అసహ్యం కూడా కలిగింది,ఆ ముఖంలో అతనికి అధికారం,ద్వేషంతో కలిసిన ఏమి పట్టనితనం కనిపించింది. ఆ ముఖం బూడిద వర్ణంలో,నిరాసక్తంగా, సెప్టెంబర్ లో పెరిగే దుబ్బులా; పెట్రోగ్రాడ్ నుండి యుద్ధ సరిహద్దు వరకు తను చూసిన వేలమంది సైనికుల ముఖాల కన్నా ఏ మాత్రం తేడా లేనిదిగా కనిపించింది లిస్ట్ నిట్ స్కీ కి. అవన్నీ కూడా రంగు కాంతి హీనమై ,ఏ మాత్రం తెలివి లేకుండా కేవలం మూర్ఖత్వంతో నిండి; నీలం,బూడిద రంగు,పచ్చ ఇంకా అనేక రంగులతో కూడిన కళ్ళతో ;అవన్నీ అతనికి పాతబడిన రాగి నాణేలను గుర్తుకు తెచ్చాయి.
‘నేను యుద్ధం కన్నా ముందు మూడేళ్ళు జర్మనీలో ఉన్నాను’,ఆ అధికారి ఏ హడావుడి లేకుండా నింపాదిగా బదులిచ్చాడు. ఆ స్వరంలో కూడా లీలగా అధికార అహంకారం,ద్వేషం అతని ముఖంలో గోచరించినట్టే లిస్ట్ నిట్ స్కీ కి ధ్వనించాయి. ‘నేను కొనిగ్స్ బర్గ్ లో ఉన్న సిగరెట్ల ఫ్యాక్టరీలో పని చేశాను’, అతను చెప్పుకుపోతూ,తన చేతిలో ఉన్న పగ్గాలతో గుర్రాలను అదిలించాడు.
‘ఏం మాట్లాడకండి!’లిస్ట్ నిట్ స్కీ తీవ్రంగా అని,ఆ చనిపోయిన గుర్రాన్ని చూడటానికి వెనక్కి తిరిగాడు.పెద్ద ముంగుర్లు దాని కళ్ళ మీద పడి ఉంటే,నోరు తెరుచుకుని ఉండటం వల్ల పళ్ళు కనబడుతూ ఉన్నాయి,శరీరమంతా వాన,గాలి వల్ల ఇంకా పాడైపోయి ఉంది. పైకి లేచి ఉన్న కాలు మోకాలి దగ్గర వంగి ఉంది. దాని ఆకృతిని చూసి అది మేలు జాతి గుర్రమని లూయిటెంట్ అంచనా వేశాడు.
ముందు దారి అనుకూలంగా లేకపోవడం వల్ల బండి కదులుతూ ఉంటే అదురుతూ ఉంది. ఆకాశంలోని రంగులన్నీ క్రమక్రమంగా మాయమైపోతూ ఉంటే, గాలి ఆ మేఘాలను మింగేసింది. ఆ చనిపోయిన గుర్రం కాలు విరిగిన క్రాస్ లా అలా గాలిలో లేచి ఉంది. ముందుకు వెళ్తూ ఉన్న బండిలో నుండి లిస్ట్ నిట్ స్కీ దానిని చూస్తే ఉంటే,ఆ గుర్రం అస్తమిస్తున్న సూర్యకిరణాల మధ్య మెరుస్తూ ఉన్నట్టు అనిపించింది.
వారు బెరిజన్యగి దగ్గరకు వచ్చేసరికి ,వారికి గాయపడి ఉన్న బృందం ఉన్న బండి ఒకటి ఎదురైంది.
మధ్య వయసులో, గుండుతో ఉన్న ఒక బైలో రష్యన్ మొదటి బండికి అధికారిగా ఉన్నాడు.అతను గుర్రపు కొరడాను చేతికి చుట్టుకుని గుర్రం పక్కన నడుస్తున్నాడు. తల చుట్టూ కట్లు కట్టి, టోపీ పక్కన పడిపోయి ఉన్న ఒక కొసాక్కు,మోచేతి మీద పైకి చూస్తూ ఆ బండిలో ఉన్నాడు. కళ్ళు సగం మూసుకుపోయి ఉన్న అతను ,అతను ఒక రొట్టె ముక్కను తింటూ,తర్వాత నమిలాక నల్లగా మారిన పిప్పిని బయట ఊసేస్తున్నాడు.అతని పక్కనే ఒక సైనికుడి బొక్క బోర్లాగా పడుకుని ఉన్నాడు. అతని ప్యాంటు చిరిగిపోయి ఉంది,తొడల దగ్గర రక్తం గడ్డ కట్టి ఉంది. అతను తల పైకెత్తకుండా బండబూతులు తిడుతూ ఉన్నాడు. రెండవ బండిలో ఆరుగురు సైనికులు ఉన్నారు. వారిలో ఒకడు ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నాడు.
‘….రాయబారి తమ చక్రవర్తి నుండి వచ్చి ఎలా శాంతి ఒప్పందం చేశాడో అతను చెప్తూ ఉన్నాడు. విషయం ఏమిటంటే అతను నమ్మదగినవాడే. నాకు తెలిసి అతను చెప్తుంది నిజమే అనుకుంటా.’
‘అస్సలు అలా జరిగే అవకాశమే లేదు’, తల ఊపుతూ ఇంకొకతను అన్నాడు.
‘ఎందుకు అలా జరగకూడదు,ఫిలిప్?ఒకవేళ అతను ఆ ఒప్పందం కోసమే వచ్చాడేమో?’, ఆ ఇద్దరికి వీపు చూపిస్తూ వెనక్కి తిరిగి కూర్చుని ఉన్న మూడవ వాడు అన్నాడు.
ఎర్ర బాండ్లు ఉండే కొసాక్కుల టోపీలు ఐదవ బండిలో కనిపించాయి. ఆ బండిలో కూర్చుని ఉన్న ముగ్గురు కొసాక్కులు లిస్ట్ నిట్ స్కీ ని నిశ్శబ్దంగా చూశారు. ఆ కళ్ళల్లో ఎప్పుడు అధికారులను చూసినప్పుడు కనిపించే గౌరవం లిస్ట్ నిట్ స్కీ కి కనిపించలేదు.
‘హలో ,కొసాక్కులారా!’లూయిటెంట్ వారిని పలకరించాడు.
‘హలో ‘, బండి తోలుతున్న వ్యక్తి పక్కన కూర్చుని ఉన్న ఒక కొసాక్కు నిర్లిప్తంగా సమాధానం ఇచ్చాడు.
‘మీది ఏ రెజిమెంటు?’ ఆ కొసాక్కుల భుజాల మీద ఉన్న నీలపు పట్టీ మీద ఉన్న సంఖ్యను గుర్తించే ప్రయత్నం చేస్తూ అడిగాడు.
‘పన్నెండవ రెజిమెంటు.’
‘అది ఇప్పుడు ఎక్కడ ఉంది?’
‘మాకు తెలియదు.’
‘అయితే మీరు ఎక్కడ గాయపడ్డారు?’
‘ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక గ్రామం దగ్గర …పెద్ద దూరం ఏమి లేదు.’
ఆ కొసాక్కులు వారిలో వారే గుసగుసలాడుకున్నారు. వారిలో ఒకడు ,గాయపడిన తన భుజానికి ఒక గుడ్డ కట్టుకుని, బండి నుండి కిందకు దూకాడు.
‘సార్,ఒక్క నిమిషం ఆగండి!’,అతను పాదరక్షలు లేని కాళ్ళతో ఆ దారిలో నడుస్తూ,బుల్లెట్టు దూసుకుపోయి, చీము పట్టే సూచనలతో ఉన్న భుజాన్ని రుద్దుకుంటూ,లిస్ట్ నిట్ స్కీ వైపు చూసి నవ్వాడు.
‘మీరు వ్యోషేన్ స్కాయా స్టానిట్సా కు చెందిన వారు కదా?లిస్ట్ నిట్ స్కీ కదూ మీరు?’
‘అవును.’
‘హా,మేము అనుకుంటూనే ఉన్నాము. మీ దగ్గర సిగరెట్లు ఏమైనా ఉన్నాయా,సార్? మా మీద దయ చూపించి, ఉంటే ఇవ్వండి. మేము చచ్చిపోతున్నాము.’
అతను ఆ బండి పక్కకు వచ్చాడు. లిస్ట్ నిట్ స్కీ తన సిగరెట్ల పెట్టె బయటకు తీశాడు.
‘మీరు ఒక డజను ఇవ్వగలరా? మేము ముగ్గురం ఉన్నాము’, కొసాక్కు నవ్వుతూ అడిగాడు.
లిస్ట్ నిట్ స్కీ తన పెట్టె మొత్తాన్ని ఆ కొసాక్కు చేతికి అందించాడు.
‘మీలో చాలా మంది గాయపడ్డారా?’
‘రెండు డజన్ల మంది దాకా.’
‘ఎవరైనా చనిపోయారా?’
‘చాలామందిని చంపేశారు. నాకు సిగరెట్ వెలిగించుకోవడానికి కూడా ఇవ్వండి,సార్. మీ దయకు కృతజ్ఞతలు.’ సిగరెట్టు కాలుస్తూ,అతను అరుస్తూ చెప్పాడు, ‘టాటర్ స్కై కి చెందిన ముగ్గురిని,మీ ఎస్టేట్ దగ్గర ఈ రోజు చంపేశారు. చాలా మంది కొసాక్కులను గాయపరిచారు.’
తర్వాత అతను వేగంగా నడుస్తూ బండి దగ్గరకు వెళ్ళిపోయాడు.గాలి బలంగా వీస్తూ ఉండటం వల్ల బెల్టు ధరించకపోవడం వల్ల అతని చొక్కా కొద్దిగా ఎగురుతూ ఉంది.
లిస్ట్ నిట్ స్కీ బదిలీ చేయబడ్డ రెజిమెంటు కమాండింగ్ ఆఫీసరు బెరిజన్యగిలో తన కార్యాలయంగా ఆ ప్రాంతంలో ఉండే ఒక ప్రీస్ట్ ఇంటిని తీసుకున్నాడు. ఆ కూడలి వద్ద లిస్ట్ నిట్ స్కీ తనకు బండిలో చోటిచ్చిన వైద్యుడికి వీడ్కోలు పలికి,తన దుస్తుల మీద ఉన్న దుమ్ము దులుపుకుని,ఆ దారిలో ఎదురైన వారిని దారి కనుక్కుంటూ ఆ నివాసానికి బయల్దేరాడు. ఎర్ర గడ్డంతో ఉన్న ఒక సైనికుడు అతనికి ఎదురొచ్చాడు.లూయిటెంట్ కి అతను సెల్యూట్ చేసి,ఆ ఇంటికి దారి చూపించాడు. ఆ కార్యాలయమంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక పెద్ద బల్ల దగ్గర గుమస్తాలు అందరూ కునికిపాట్లు పడుతుంటే,పెద్ద వయసులో ఉన్న ఒక మేజర్ మాత్రం ఫోనులో ఏదో హాస్య సంభాషణ చేస్తున్నాడు. కిటికీల దగ్గర దోమలు రొద చేస్తూ ఉన్నాయి. ఒక అధికారి లూయిటెంట్ ను రెజిమెంట్ కమాండర్ క్వార్టర్స్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఆ హాలులో ముఖం మీద పెద్ద గాయపు మచ్చతో పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి ఎదురయ్యాడు.
‘అవును,నేనే ఈ రెజిమెంటు కమాండర్ ని’, లిస్ట్ నిట్ స్కీ ప్రశ్నకు విసుగ్గా బదులిచ్చాడు ఆ వ్యక్తి. లిస్ట్ నిట్ స్కీ తను ఆ రెజిమెంటులో చేరుతున్నందుకు గౌరవంగా ఉందని చెప్పాడు. అతన్ని లోపలకి రమ్మని సైగ చేశాడు ఆ అధికారి. అతను లోపలికి వచ్చాక ,తలుపు మూసి, ఆ అధికారి తన వేళ్ళు జుట్టులో జొనిపి, అలసటగా, ‘నాకు నీ గురించి నిన్నే వార్త వచ్చింది.కూర్చో’,అన్నాడు.
అతను లిస్ట్ నిట్ స్కీ పూర్వ విధి నిర్వహణ గురించి,రాజధానిలో విషయాల గురించి,అతని ప్రయాణం గురించి అడిగాడు. ఈ మొత్తం సంభాషణలో అతను ఒక్కసారి కూడా తన తల ఎత్తి లూయిటెంట్ ముఖంలోకి సూటిగా చూడలేదు.
‘బహుశా యుద్ధంలో ఆయనకు బాధాకరమైన అనుభవాలు ఎదురై ఉంటాయి. చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు’,లిస్ట్ నిట్ స్కీ తనలో తానే ఆ అధికారి వైపు చూస్తూ, సానుభూతిగా అనుకున్నాడు. కానీ అతని అంచనాలకు విరుద్ధంగా,ఆ అధికారి తన ముక్కుని చేతి వేలితో గోక్కుంటూ,’మీ తోటి అధికారులతో వెళ్ళి స్నేహం చేసుకోండి లూయిటెంట్. నాకు మూడు రాత్రులుగా నిద్ర లేదు. ఇక్కడ తాగడం,పేకాడటం తప్ప వేరే పని లేదు’,అన్నాడు.
లిస్ట్ నిట్ స్కీ ఆయనకు సెల్యూట్ చేస్తూ,తన కోపాన్ని బయటకు కనిపించనివ్వకుండా ఉండటానికి చిన్నగా నవ్వాడు. ఆ అధికారి అలసిపోయి ఉన్న ముఖం, దాని మీద ఉన్న గాయపు మచ్చ వల్ల ఏర్పడిన గౌరవాన్ని కోపంతో గుర్తు తెచ్చుకుంటూ బయటకు వచ్చాడు.
* * *
అధ్యాయం-15
స్టిర్ నది గుండా వెనుక నుండి లౌస్జ్ ప్రాంతం సమీపంలో శత్రువు మీద దాడి చేసే పనిని విభాగానికి అప్పగించడం జరిగింది.
ఆ రెజిమెంటు లో ఉన్న అధికారులకు,ఆ యుద్ధ వాతావరణానికి అలవాటు పడటానికి లిస్ట్ నిట్ స్కీ కి కొన్ని రోజులు పట్టింది. అతనిలో అప్పటివరకూ ఉన్న నింపాదితనం,మత్తు అంతటితో వదిలిపోయాయి.
ఆ విభాగం తమకు అప్పగించిన పనిని ఎంతో తెలివిగా చేసింది. ఎడమ వైపు నుండి వచ్చిన శత్రు బలగాన్ని వెనుక నుండి దాడి చేసింది. లౌస్జ్ ప్రాంతం దగ్గర ఆస్ట్రియా సైన్యం,హంగేరియా ఆశ్విక దళం సాయంతో ప్రతిదాడి చేసే ప్రయత్నం చేసినా,కొసాక్కులు ఆ దాడిని తిప్పికొట్టారు. హంగేరియా దళాలు వెనక్కి తిరిగి పారిపోతూ ఉంటే కొసాక్కులు వారిని వెంబడించారు.
లిస్ట్ నిట్ స్కీ ఆ రెజిమెంటుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పారిపోతున్న శత్రువులను వెంటబడి హింసించే పని వారి బృందానికి అప్పగించబడింది. అతని అధీనంలో ఉన్న బృందంలో ఒక కోసాక్కు గాయపడ్డాడు,నలుగురు చంపబడ్డారు. బయటకు నెమ్మదిగా ఉండే ప్రయత్నం చేస్తూ, అతను ఆ గాయపడ్డ కొసాక్కు పక్క నుండి వెళ్ళాడు. అతను కుర్రవాడు, క్రాస్నోకుట్ స్కాయాకి చెందినవాడు. అతని నిస్సహాయంగా బాధతో చేస్తూ ఉన్న మూలుగులు వినపడకుండా ఉండటానికి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని పేరు లోశ్చెనోవ్,గాయపడి చనిపోయిన తన గుర్రం కిందే పడిపోయి ఉన్నాడు. అతని ముంజేతి దగ్గర గాయాలయ్యాయి, అతను తనను దాటిపోతూ ఉన్న కొసాక్కులను తనను కాపాడమని వేడుకుంటూ ఉన్నాడు. ‘నన్ను వదిలేయొద్దు సోదరులారా! దయచేసి నన్ను కాపాడండి!’
చిన్నగా వినపడుతూ ఉన్న ఆ స్వరం మెల్లగా ఆగిపోయింది. కానీ అతన్ని దాటిపోతూ ఉన్న కొసాక్కుల గుండెలను ఆ వేడుకోలు ఏ మాత్రం కదిలించలేకపోయింది; ఒకవేళ మనసులో ఎక్కడో దయ తాలూకూ చిహ్నాలు వారిలో ఉన్న ఏదో స్వార్ధం అతన్ని పట్టించుకోకుండా చేసింది. ఒక ఐదు నిమిషాలు ముందుకు వెళ్ళిన తర్వాత ఆ బృందం అప్పటికే రొప్పుతూ ఉన్న గుర్రాలకు విశ్రాంతి ఇవ్వడం కోసం ఆగాయి. చిందరవందరగా పారిపోతూ ఉన్న హంగేరియా ఆశ్విక దళాలు వారికి అరవెరస్టు దూరంలోనే ఉన్నాయి. వారి మధ్యలోనే నీలం-బూడిద రంగు కలిసిన యూనిఫారం దుస్తులు ధరించిన పదాతి దళం కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ దగ్గరలో ఉన్న కొండల దగ్గర రైలు మార్గం గుండా ఆస్ట్రియా రైలు తెల్లటి పొగను వదులుతూ వెళ్తూ ఉంది. అక్కడకు ఎడమ వైపున ఏదో బృందం తుపాకీల్లో తూటాలు నింపుతున్న శబ్దం వినిపిస్తూ ఉంది. అక్కడకు దగ్గరలో ఉన్న పొలాల్లో కాల్పులు ప్రతిధ్వనిస్తున్నాయి.
ఆ ఆశ్విక దళానికి నాయకత్వం వహిస్తున్న లూయిటెంట్ కల్నల్ సాఫ్రోనోవ్ ఆజ్ఞ ఇవ్వడంతో మూడు దళాలు వేగంగా అక్కడి నుండి దౌడు తీసాయి. గుర్రాలు కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు, గాలిలో దుమ్ము లేపుతూ సాగిపోయాయి.
ఆ రాత్రికి వారు ఒక చిన్న గ్రామం చేరుకున్నారు.
పన్నెండు మంది అధికారులకు ఒక గుడిసె ఇవ్వబడింది. వారు అందులోకి వచ్చేసరికి అలసిపోయి,ఆకలితో ఉన్నారు. దాదాపు అర్థరాత్రి సమయానికి వంట సిద్ధం అయ్యింది. కార్నెట్ చుబోవ్ వేడిగా ఉన్న క్యాబేజీ సూపుతో లోపలికి వచ్చి అందరిని నిద్ర లేపాడు.
ఒక పావుగంట తర్వాత నిద్ర ముఖాలతో ఉన్న ఆ అధికారులు అందరూ నిశ్శబ్దంగా, ఆత్రంగా, తింటూ ఉన్నారు,ఆ రెండు రోజుల యుద్ధం గురించి గుర్తూ చేసుకుంటూ.ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వారికి నిద్ర పట్టలేదు.బయటకు వచ్చి ఎండుగడ్డి మీద తమ కోట్లు వేసుకుని, వెనక్కి ఆనుకుని,సిగరెట్లు ముట్టించారు.
పొట్టిగా,లావుగా,మంగోలియా వాస్తవ్యులను జ్ఞప్తికి తెచ్చే ముఖంతో ఉన్న కెప్టెన్ కాల్మికోవ్ సంభాషణ ప్రారంభించాడు.
‘నాకు ఏ యుద్ధం లేదు!నేను నాలుగు శతాబ్దాలు ఆలస్యంగా పుట్టాను.నేను ఈ యుద్ధం ముగిసేసరికి ఉండను.’
‘జోస్యాలు చెప్పడం మాను!’ లూయిటెంట్ తెర్సింసేవ్ వెనుక నుండి గట్టిగా అన్నాడు.
‘ఇది జోస్యం కాదు.ఇది నాకు రాయబడిన విధి అంతే. నేను పూర్వ కాలానికి చెందిన వాడిని. నాకౌ ఈ ప్రపంచంలో చోటు లేదు,నిజంగానే లేదు. ఈ రోజు ఆ యుద్ధ వాతావరణంలో ముందుకు వెళ్తూ ఉంటే,నాలో కోపం కట్టలు తెంచుకుంది. అది భయాన్ని పోలి ఉండే ఒక భీభత్సమైన ఉద్వేగమే. అనేక వెరస్టుల దూరం నుండి వాళ్ళు నిన్ను కాలుస్తారు. నిన్ను నువ్వు వారికి బలిపశువుగా మార్చుకుని వారి గురికి తగిలేట్టు నీ గుర్రం మీద దౌడు తీస్తావు.’
‘కుపాల్క దగ్గర నేను ఆస్ట్రియా వాళ్ళ ఆయుధాలను చూశాను. మీలో ఎవరైనా చూసారా?’ తన మీసాలకు అంటిన సూపుని నాకుతూ, మేజర్ అటామన్ చుకొవ్ అడిగాడు.
‘అద్భుతంగా ఉంది! అది గొప్ప భద్రతా యంత్రాంగం’, అపటికే రెండవ సారి సూప్ తిన్న కార్నెట్ చుబోవ్ అన్నాడు.
‘నేను దాన్ని చూశాను కానీ దాని గురించి నేను ఏమి చెప్పలేను.ఆయుధాల విషయానికి వస్తే నాకు ఏమి తెలియదు. నా దృష్టిలో అది ఒక పెద్ద నోటితో ఉన్న ఫిరంగి అంతే.’
‘పురాతన పద్ధతుల్లో యుద్ధం చేసే వారిని చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది’, లిస్ట్ నిట్ స్కీ ని ఉద్దేశిస్తూ, కాల్మికోవ్ కొనసాగించాడు. ‘యుద్ధంలో శత్రువును ముఖాముఖి ఎదుర్కోవడం, వాడిని రెండుగా ఖడ్గంతో చీల్చడం,అదే నాకు తెలిసింది! ఇదెంటో ఆ దేవుడికే తెలియాలి!’
‘భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల్లో ఆశ్విక దళాల సంఖ్యే గణనీయంగా తగ్గిపోతుంది.’
‘ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అవి ఉండవు.’
‘దాని గురించి ఎటువంటి సందేహం లేదు.’
‘ఇటు చూడు, తెర్సింసేవ్ ,మనుషులను ఏ యంత్రాలు,ఆయుధాలు భర్తీ చేయలేవు. అది జరగని విషయమే.’
‘నేను గుర్రాల గురించి మాట్లాడుతున్నాను,మనుషుల గురించి కాదు. వాటి బదులు మోటార్ సైకిల్ లేదా కారు వాడటం జరగొచ్చు.’
నేను మోటార్ కార్లతో వెళ్ళే యుద్ధ బృందాలను ఊహించగలను.’
‘ఇదంతా చెత్త’,కాల్మికోవ్ కోపంగా అన్నాడు. ‘సైన్యంలో ఎప్పటికీ గుర్రాలే ఉపయోగపడతాయి . ఇదంతా పిచ్చి ఊహ! మనకు ఒక వంద,రెండు వందల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం, ఆశ్విక దళాలు ….’
‘యుద్ధ సరిహద్దు అంతా పెద్ద కందకాలతో నిండి పోయి ఉంటే నువ్వు ఏం చేస్తావు డ్మిట్రి దా
డాన్స్కోయి?అప్పుడు ఏం చేస్తావు, చెప్పు?’
‘ఏముంది,దాన్ని ఛేదించుకుంటూ శత్రువు ప్రాంతంలోకి దానిని చొచ్చుకుని ముందుకు పోతాను,అది ఆశ్విక దళం పని.’
‘అది కష్టం.’
‘సరే,మనం ఇక పడుకుందాము.’
‘అందరూ ఇక నిద్రపోండి.’
‘ఇక జరిగిన వాదన చాలు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. మిగిలిన వారికి కూడా కొంత విశ్రాంతి కావాలి’
అప్పటికి ఆ వాదన ఆగిపోయింది.అప్పటికే కొందరూ గురకలు పెడుతూ నిద్రలోకి జారుకున్నారు. లిస్ట్ నిట్ స్కీ,ఆ సంభాషణలో పాలుపంచుకోలేదు. కింద మెత్తగా ఉండటానికి పరిచిన గడ్డి మీద పడుకుని ,ఆ గడ్డి వాసన పీలుస్తూ ఉన్నాడు. కాల్మికోవ్ అతని పక్కన పడుకున్నాడు.
‘లూయిటెంట్, వాలంటీర్ గా వచ్చిన బంచక్ తో మాట్లాడండి.అతను మీ దళంలోనే ఉన్నాడు.ఆసక్తికరమైన మనిషి!’
‘ఏ విషయంలో?’కాల్మికోవ్ వైపు వీపు పెట్టి పడుకుంటూ అడిగాడు.
‘అతను రష్యాకు చెందిన కొసాక్కు. మాస్కోలో ఉండేవాడు. అతను మామూలు పనులు చేసే వాడే అయినా ఇలాంటి విషయాల గురించి గొప్ప అవగాహన ఉంది. అతనికి ఏ భయం లేదు, గొప్పగా గురి తప్పకుండా కాల్చగలడు.’
‘సరే,ఇక నిద్ర పోదాం’,లిస్ట్ నిట్ స్కీ బదులిచ్చాడు.
‘అవును,ఇప్పుడు మనం నిద్ర పోవాలి’, కాల్మికోవ్ దేని గురించో ఆలోచిస్తూనే ఒప్పుకున్నాడు.
‘లూయిటెంట్,నన్ను మీరు క్షమించాలి. ఆ వాసన నా పాదాల నుండే వస్తుంది….నేను నా బూట్లు రెండు వారాల నుండి తీయలేదు. నా సాక్సులు చెమట కంపు పట్టి ఉన్నాయి. దుర్వాసన వస్తుందని నాకు తెలుసు. నేను కొసాక్కుల నుండి పాదాలకు ధరించే దుస్తులు తీసుకోవాలి’,అన్నాడు అటూయిటూ అసహనంగా తన పాదాలు తిప్పుతూ కాల్మికోవ్.
‘పర్లేదు’,లిస్ట్ నిట్ స్కీ చిన్నగా అని,నిద్రలోకి జారుకున్నాడు.
కాల్మికోవ్ తో సంభాషణను లిస్ట్ నిట్ స్కీ మర్చిపోయాడు,కానీ తర్వాతి రోజు అనుకోకుండా బంచక్ ను కలిసే అవకాశం వచ్చింది. ఆ రోజు ఉదయమే ఆ దళపూ కమాండర్ అతన్ని శత్రువుల మీద నిఘా పెట్టమని ఆజ్ఞాపించాడు,దానితో పాటు ఎడమ వైపు దాడిని తిప్పి కొట్టడానికి ఉన్న పదాతి దళాన్ని కూడా ఆ పనిలో పెట్టమన్నాడు. లిస్ట్ నిట్ స్కీ ఆ ఉదయాన్నే నిద్రపోతూ ఉన్న కొసాక్కుల మధ్య ఆ దళపు సార్జెంట్ కోసం వెతుకుతూ ఉన్నాడు.
‘ఐదుగురు కొసాక్కులను పహారా కోసం గుర్రాలతో సిద్ధంగా ఉండమని చెప్పండి.త్వరగా చేయండి ఈ పని.’
ఒక ఐదు నిమిషాల తర్వాత పొట్టిగా ఉన్న ఒక కొసాక్కు,ఆ గుడిసె గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యాడు.
తన సిగరెట్టు పెట్టె నింపుకుంటున్న లిస్ట్ నిట్ స్కీ ని ఉద్దేశించి, అతను ‘సార్’ అంటూ ప్రారంభించాడు. ‘సార్జెంట్ నన్ను పహారాకు పంపించరు ఎందుకంటే ఇది నా వంతు కాదు కాబట్టి. నన్ను కూడా మీతో రావడానికి అనుమతించరా?’
‘నువ్వు ఏదైనా పథకంతో రావాలని అనుకుంటున్నావా?ఏం తప్పు చేశావు?’ఆ కొసాక్కు ముఖాన్ని పరీక్షగా చూస్తూ లూయిటెంట్ అడిగాడు.
‘నేను ఏ తప్పు చేయలేదు.’
‘అయితే నువ్వు మాతో రావచ్చు’,అక్కడి నుండి వెళ్తూ లిస్ట్ నిట్ స్కీ అన్నాడు.
‘ఒక్క నిమిషం ఆగు!’ అతను ఒక రెండు అడుగులు ముందుకు వేశాక అన్నాడు, ‘వెనక్కి రా.’
ఆ కొసాక్కు వెనక్కి తిరిగాడు.
‘సార్జెంట్ కి చెప్పు…’
‘నా పేరు బంచక్’, ఆ కొసాక్కు మధ్యలోనే అడ్డుకున్నాడు.
‘వాలంటీర్ వా?’
‘అవును.’
ఒక్క క్షణంలో ఏర్పడిన గందరగోళం నుండి తేరుకుంటూ,’నువ్వు సార్జెంట్ కి చెప్తావా……..సరే,ఏమి లేదు,నువ్వు వెళ్ళవచ్చు.నేనే స్వయంగా అతనితో చెప్తాను’,అన్నాడు లిస్ట్ నిట్ స్కీ.
అప్పటికే చీకటి పడుతూ ఉంది. ఆ పహారా బృందం ఆ గ్రామం బయట ఉన్న రక్షక పోస్టులను,అక్కడ ఉన్న సెంట్రీలను దాటి, మ్యాప్ ను అనుసరిస్తూ ముందుకు సాగింది.
వాళ్ళు ఒక అరవెరస్టు దూరం వచ్చాక, లూయిటెంట్ వేగాన్ని నడకగా మార్చాడు.
‘వాలంటీర్ బంచక్!’
‘సార్,చెప్పండి.’
‘నాకు దగ్గరగా రా.’
ఏ మాత్రం ఆకర్షణీయంగా లేని తన గుర్రంతో బంచక్,మేలు జాతి డాన్ గుర్రంతో ఉన్న లిస్ట్ నిట్ స్కీ పక్కకు వచ్చాడు.
‘నువ్వు ఏ స్టానిట్సా వాడివి?’లిస్ట్ నిట్ స్కీ అతని ముఖాన్ని పరిశీలిస్తూ అడిగాడు.
నోవోచర్ కాస్కాయా.’
‘నువ్వు ఇక్కడ వాలంటీర్ గా చేరడానికి గల కారణం నేను తెలుసుకోవచ్చా?’
‘తప్పకుండా’,ఒత్తి పలుకుతూ అంటూ,బంచక్ తన పచ్చటి కళ్ళతో లూయిటెంట్ వైపు చూశాడు. కన్ను రెప్ప కొట్టకుండా ఉన్న అతని చూపులో ఏదో ధృడత్వం ఉంది. ‘నాకు యుద్ధ కళ పట్ల ఆసక్తి ఉంది. నాకు దానిని నేర్చుకోవాలని ఉంది.’
‘దాని కోసం అనేక మిలిటరీ పాఠశాలలు ఉన్నాయి.’
‘అవి ఉన్నాయని నాకు తెలుసు.’
‘అయితే నువ్వు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’
‘అసలు సాధనలో ఇది ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను.దీని తర్వాతే పాఠాలు.’
‘ఈ యుద్ధంలోకి రాక ముందు నీ వృత్తి ఏమిటి?’
‘పని చేసేవాడిని.’
‘ఎక్కడ?’
‘పీటర్స్ బర్గ్ లో, రోస్తోవ్ డాన్ లో ,తులాలో ఉన్న ఆయుధశాలల దగ్గర పని చేశాను…నన్ను మెషీన్ గన్స్ ఉన్న బృందంలోకి బదిలీ చేయమని అడుగుదామని అనుకుంటున్నాను.’
‘నీకు మెషీన్ గన్ గురించి ఏమైనా తెలుసా?’
‘చౌచాట్, బెర్తీర్,మాడ్సెన్,మక్సిమ్,హోచ్ కిస్, వికర్స్,లూయిస్,స్క్వార్ లోస్ తుపాకీల గురించి నాకు తెలుసు.’
‘అలానా? మీ రెజిమెంటు కమాండర్ తో నీ గురించి నేను మాట్లాడతాను.’
‘దయచేసి ఆ పని చేయండి.’
లూయిటెంట్ మరలా తన పక్కన ఉన్న బలిష్టమైన ఆకారాన్ని చూశాడు.బంచక్ అతనికి డాన్ వైపు ఉండే గట్టి చెట్టు బెరడులా అనిపించాడు. అతనిలో ఏ ప్రత్యేకత లేదు. ధృఢంగా ఉన్న దవడ ఎముకలు,సవాలు చేస్తున్నట్టు ఉండే కళ్ళు మాత్రమే అతన్ని మిగిలిన ముఖాల నుండి వేరు చేసేది.
అతను ఎప్పుడో ఓ సారి నవ్వేవాడు,అది కూడా పెదవుల అంచులతో. ఆ కళ్ళు ఎప్పుడు తీక్షణంగా చూస్తూ ఉండేవాడు,అవి అంచనా వేయడానికి వీలు లేకుండా ఉండేవి.
కొంతసేపు వారు నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళారు. బంచక్ పెద్ద చేతులు పచ్చ రంగులో ఉన్న గుర్రపు జీను మీద ఉన్నాయి. లిస్ట్ నిట్ స్కీ తన సిగరెట్టు బయటకు తీసి,బంచక్ అగ్గిపుల్ల వెలిగిస్తే దాన్ని ముట్టించాడు. ఆ సమయంలో బంచక్ చెమట పట్టి ఉన్న అతని చేతిని చూశాడు. ఆ చేతి మీద గోధుమ రంగులో జుట్టు ఒత్తుగా ఉంది. లిస్ట్ నిట్ స్కీ కి ఓ క్షణం దాన్ని నిమరాలని అనిపించింది. ఆ ఘాటైన సిగరెట్టు పొగని పీలుస్తూ, లిస్ట్ నిట్ స్కీ, ‘ ఈ అడవి నుండి నువ్వు,నేను,ఇంకో కొసాక్కు ఎడమ వైపు దారి తీసుకుంటాము.నీకు కనిపించిందా ?’
‘కనిపించింది.’
‘ఒకవేళ నువ్వు మన పదాతి దళాన్ని అర వెరస్టు దూరం లోపు అందుకోలేకపోతే,నువ్వు వెనక్కి తిరుగుతావు.’
‘సరే సార్.’
వాళ్ళు అక్కడి నుండి వేగంగా సాగిపోయారు. ఆ అడవి మొత్తం పొడుగైన వృక్షాలతో, వాటి వెనుక కొద్ది దూరంలో పొదలతోనూ నిండిపోయి ఉంది. ఆ అడవి బయట ఆయుధాల ధ్వనులతో భూమి దద్దరిల్లిపోతూ ఉంటే అక్కడ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఆ నేల మంచుతో తడిచి ఉంది, అక్కడి గడ్డి గులాబీ వర్ణంలోకి మారుతూ ఉంది, ఆ వేసవి దాటిన కాలంలో పువ్వుల రంగులు చిక్కగా ఉన్నాయి, అవన్నీ చావు సమీపంలో ఉందని అరుస్తున్నట్టు ఉన్నాయి. తన బైనాక్యులర్స్ ద్వారా కొండ ప్రాంతం పరిశీలిద్దామని లిస్ట్ నిట్ స్కీ ఆ వృక్షాల దగ్గర ఆగాడు. అతని ఖడ్గం అంచు దగ్గర ఒక తేనెటీగ వాలింది.
‘పనికిమాలిన దానా!’ బంచక్ ఆ తుమ్మెదను విసుక్కుంటూ అన్నాడు.
‘ఏమిటి?’ లిస్ట్ నిట్ స్కీ తన కళ్ళను బైనాక్యులర్స్ నుండి తప్పిస్తూ అడిగాడు.
బంచక్ ఆ తేనెటీగ వైపు చూసేసరికి,లిస్ట్ నిట్ స్కీ నవ్వాడు.
‘దాని తేనె చేదుగా ఉంటుంది,నువ్వు ఏమనుకుంటున్నావు?’
అతనికి అప్పుడు బదులిచ్చింది బంచక్ కాదు. దూరం నుండి మెషీన్ గన్లు పేలుతున్న ధ్వని ఆ నిశ్శబ్దాన్ని చీల్చింది.ఆ పెద్ద వృక్షాల గుండా కొన్ని తూటాలు దూసుకు వచ్చాయి. ఒక తెగిన చిన్న కొమ్మ ఆ లూయిటెంట్ గుర్రం మెడను తాకింది.
వెంటనే వారు తమ గుర్రాల మీద వేగంగా దౌడు తీస్తూ గ్రామంలోకి వెళ్ళిపోయారు. ఆస్ట్రియా మెషీన్ గన్ల నుండి వస్తున్న శబ్దం వారికి కొద్ది దూరం వరకు వినిపిస్తూనే ఉంది.
లిస్ట్ నిట్ స్కీ ఆ తర్వాత బంచక్ ను అనేక సందర్భాల్లో కలిసినప్పటికి,ఆ కళ్ళల్లో ఉన్న ఏదో చెప్పలేని శక్తి అతన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరిచేది. ఆ ముఖం పైన మేఘంలా నీడను పరిచిన ఆ కళ్ళల్లో ఏ రహస్యం ఉందో అతను ఊహించలేకపోయాడు. మాట్లాడుతున్నప్పుడు కూడా బంచక్, ఏదో చెప్పకుండా వదిలేసినట్టు, అతని పెదవుల చివర్ల పై ఓ చిరునవ్వు ఉండేది, అతను తనకు మాత్రమే తెలిసిన ఏదో సత్యమార్గంలో నడుస్తున్నట్టు ఉండేవాడు. అతన్ని మెషిన్ గన్లు ఉన్న బృందంలోకి బదిలీ చేశారు. పది రోజుల తర్వాత, రెజిమెంటుకు విశ్రాంతి ఉన్న రోజున, లిస్ట్ నిట్ స్కీ దళపు కమాండర్ దగ్గరకు వెళ్తున్న సమయంలో బంచక్ ను కలిశాడు. బంచక్ అప్పుడే అక్కడ ఆయుధాలు ఉన్న పాకను దాటుతూ, తన మోచేత్తో చొక్కాను సరిచేసుకుంటున్నాడు.
‘ఓ వాలంటీర్!’
బంచక్ తన తల తిప్పి,పక్కకు జరిగి, సెల్యూట్ చేశాడు.
‘ఎక్కడికి వెళ్తున్నావు?’ లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.
‘దళపు కమాండర్ దగ్గరకు.’
‘అయితే మనమిద్దరం ఒకే దారిలో వెళ్ళాలి అన్నమాట?’
‘అయిఉండొచ్చు.’
వారిద్దరూ ధ్వంసం కాబడి ఉన్న ఆ గ్రామంలోని ఓ వీధి గుండా నిశ్శబ్దంగా నడుస్తూ ఉన్నారు. జనాలు ఇంకా పడిపోకుండా ఉన్న కొన్ని పాకల దగ్గరకు హడావుడిగా వెళ్తూ ఉన్నారు. కొందరు గుర్రాల మీద ముందుకు పోతున్నారు. ఆ సందు మధ్యలో ఒక సైన్యం కోసం ఏర్పాటు చేసిన వంటశాల దగ్గర కొసాక్కులు వరుసలో నిలబడి ఉన్నారు. చల్లటి గాలి వీస్తూ ఉంది.
‘సరే అయితే, నువ్వు యుద్ధం గురించి తెలుసుకుంటున్నావా?’ లిస్ట్ నిట్ స్కీ తన వెనుక ఉన్న ఉన్న బంచక్ ముఖంలోకి చూస్తూ అడిగాడు.
‘అవును ..అలాగే అనుకుంటున్నాను.’
‘ఈ యుద్ధం తర్వాత నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు?’ ఆ వాలంటీర్ చేతుల వైపు చూస్తూ లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.
‘ఒకరు విత్తితే ఇంకొకరు ఫలాలు అనుభవిస్తారు.నేను …..నేను అప్పుడు చూస్తాను’, బంచక్ కళ్ళు చిన్నవి చేస్తూ చెప్పాడు.
‘అంటే దాని అర్థం ఏమిటి?’
‘మీకు ఆ సామెత తెలుసు,లూయిటెంట్’, బంచక్ బదులిచ్చాడు.
‘సామెతలు కట్టిపెట్టి స్పష్టంగా విషయం ఏమిటో చెప్పు.’
‘అది చాలా స్పష్టంగానే ఉంది. ఇక సెలవు,లూయిటెంట్. నేను ఇక్కడ నుండి ఎడమ వైపుకి వెళ్తాను.’
రోమాలతో ఉన్న తన చేతి వేళ్ళను తన టోపీ మీద పెట్టుకుని, బంచక్ ఎడమ వైపుకి వెళ్ళిపోయాడు.
లూయిటెంట్ భుజాలేగరేసి, అతని వైపే చూస్తూ ఉండిపోయాడు.
‘ఇతను తెలివైనోడా లేక పిచ్చోడా?’ తనలో తానే కోపంగా అనుకుంటూ, అతను వేగంగా ఆ దళపు కమాండర్ కార్యాలయపు గది దగ్గరకు నడిచాడు.
* * *
అధ్యాయం-16
మూడవ లైను రిజర్వు సైన్యం కూడా రెండవ లైను రిజర్వుతో తరలి వెళ్ళిపోవడంతో, ఆ స్టానిట్సా మరియు డాన్ ప్రాంతపు గ్రామాలు పంట చేతికి వచ్చాక ఖాళీ అయిన పొలంలా మారిపోయాయి.
కానీ యుద్ధ రంగంలో ఆ మగవాళ్ళు సంవత్సరం అంతా ఎంతో భయం, బాధతోనే కాలం గడుపుతూ ఉన్నారు. చావుతో సహవాసం చేస్తూ వారు అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే;ఆ యుద్ధంలో క్రూరంగా చంపబడ్డ తమ పురుషుల కోసం కొసాక్కు స్త్రీలు ఎంతగానో విలపిస్తూ ఉండేవారు. ఆ ఏడుపు, వేదన భారం ఆ గ్రామాలన్నీ మోస్తూ ఉండేవి.’ఓ దేవుడా.. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు?’వారి ఏడుపులు అక్కడ మార్మోగుతూ ఉండేవి.
ప్రేమించబడుతూ ఉన్న వారంతా యుద్ధంతో శవాలుగా మారుతూ, ఎర్ర కొసాక్కుల రక్తం అక్కడ ప్రవహిస్తూ, శాశ్వత నిద్రలోకి వారు జారుకుంటూ ఉంటే, తుపాకుల ధ్వనులతో యుద్ధ రంగం ప్రతిధ్వనిస్తూ ఉంటే,వారి కళేబరాలు మాత్రం ఆస్ట్రియా, పోలాండ్, ప్రష్యా ల్లో కుళ్ళుతూ ఉండేవి. కనీసం ఆ తూరుపు గాలులు కూడా రోదిస్తున్న వారి భార్యల, తల్లుల స్వరాలను మోసుకు రాలేకపోయేవి.
కొసాక్కు భూమి మగతనం అంతా మాతృభూమిని విడిచి, దాడి, హింసతో పరాయి భూమిలో అంతరించిపోతూ ఉంది, యుద్ధం వల్ల.
సెప్టెంబర్ లో ఓ రోజున సన్నటి దారాలతో అల్లినట్టు ఉన్న ఇంద్రధనుస్సు టాటర్ స్కై గ్రామంలో తేలుతున్నట్టు ఉంది. ఉదయాన్ని కోల్పోయిన సూర్యుడు , నవ్వలేక నవ్వుతున్న విధవ నవ్వును ధరించినట్టు ఉన్నాడు. నీలపు రంగు ఆకాశం మాత్రం గర్వంగా, స్వచ్చంగా ఉన్నట్టు ఉంది. డాన్ కు అవతలి వైపు పచ్చ వర్ణంలో ఉన్న అడవి శోకంతో నిలబడినట్టు ఉంటే, అందులో పోప్లార్ చెట్లు జీవరహితంగా ఉంటే, ఓక్ చెట్ల ఆకులు రాలుతూ ఉంటే, మిగతా చెట్లు కూడా ఈ మార్పుకు తలలు ఊపుతున్నట్టు ఉన్నాయి.
సరిగ్గా ఆ రోజు పాంటెలి మెలఖోవ్ కు సైన్యం నుండి ఒక ఉత్తరం వచ్చింది. దున్యక్ష ఆ ఉత్తరాన్ని పోస్ట్ ఆఫీసు నుండి తెచ్చింది. ఆమెకు అది అందిస్తున్నప్పుడు, ఆ పోస్ట్ మాస్టరు తల కిందకి వంచి, తన బట్ట తలను అటూ ఇటూ ఊపుతూ, క్షమాపణ చెప్తున్న ధోరణిలో చేతులు చాచాడు.
‘నా మీద దయ ఉంచి, నన్ను క్షమించండి. కానీ నేను ఉత్తరం తెరిచాను. మీ నాన్నగారికి దీన్ని ఫిర్స్ సిడోరోవిచ్ తెరిచాడని చెప్పండి. అతను యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉద్రిక్తతను తట్టుకోలేక ఈ పని చేసాడని… నువ్వు నన్ను క్షమించాలి, అదే విషయం పాంటెలి ప్రోకోఫోవిచ్ కు కూడా చెప్పండి. అలాగే నా నమస్కారాలు తెలియజేయండి.’
ఎందుకో తెలియదు కానీ, ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు.ఆయన ముక్కు మీద సిరా మరక ఉన్నా పట్టించుకోకుండా, స్వయంగా దున్యక్షతో బయటకు వచ్చాడు. ‘నేను చేసింది తప్పుగా భావించవద్దు, దేవుడు దృష్టిలో అది పాపమే అయినా…. అది కేవలం మేము ఒకరికి ఒకరం చాలా కాలం నుండి తెలుసునన్న సాన్నిహిత్యం వల్లే…’ఎంతో ఇబ్బంది పడుతూ ఆయన పదేపదే క్షమాపణ చెప్తూ ఉంటే, ఆమె మనసు కూడా ఏదో కీడును శంకించింది.
ఆమె ఇంటికి వచ్చేసరికి వణుకుతూ ఉంది, అతి కష్టం మీద జాకెట్టులో దాచిన ఉత్తరం బయటకు తీసింది.
‘త్వరగా చదువు!’ పాంటెలి తన గడ్డం సవరించుకుంటూ అరిచాడు.
‘ఆ పోస్ట్ మాస్టరు ఈ ఉత్తరం ముందే తెరిచి చదివానని, దాని గురించి తప్పుగా అనుకోవద్దని చెప్పాడు,నాన్నా.’
‘వాడిని ఏదైనా చేసుకుని చావని! అది గ్రెగరి నుండా?’ఆ వృద్ధుడు ప్రశ్నించాడు, రొప్పుతూ ఉన్న దున్యక్ష ముఖంలోకి చూస్తూ.’అది గ్రెగరి నుండి వచ్చి ఉండాలే! లేకపోతే పెట్రో నుండా?’
‘లేదు, నాన్నా… ఈ ఉత్తరంలో చేతి వ్రాత వేరే ఎవరిదోలా ఉన్నది.’
‘అలా అయితే త్వరగా చదువు.మమ్మల్ని ఇలా భయపెట్టకు!’ ఇలినిచ్న బల్ల మీద కాళ్ళు చాపుతూ అరుస్తున్నట్టు అంది(ఆమె కాళ్ళు వాచిపోయి ఉండటం వల్ల ఆమె నడుస్తుంది అనడం కన్నా దొర్లుతుంది అనడమే సరైనది).
నటాల్య వాకిట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, స్టవ్ పక్కన నిలబడి, ఎదకు చేతులు ఆనించుకుంటూ,వంగిపోయినట్టు ఉన్న మెడను ఒక వైపుకి తిప్పింది. ఒక సూర్యకిరణంలో ఓ చిరునవ్వు సన్నగా వణికింది ఆమె పెదవులపైన. గ్రెగరి కుక్కలాగా పడి ఉన్న తన విశ్వాసాన్ని గుర్తించి,తనను పలకరిస్తూ ఏమైనా రాస్తాడని ఆమె ఆశిస్తూ ఉంది.
‘దర్య ఎక్కడ ఉంది?’ ఇలినిచ్న గుసగుసగా అంది.
‘నిశ్శబ్దంగా ఉండండి’, పాంటెలి ఎర్రబడ్డ కళ్ళతో గట్టిగా కోపంతో అని, దున్యక్ష వైపు తిరిగి,’నువ్వు చదువు, అమ్మాయి!’అన్నాడు.
‘మీకు నేను తెలియజేసేది ఏమిటంటే…’ అని దున్యక్ష మొదలుపెట్టి, బల్ల మీదకు పడిపోయి, ఒక్క పెట్టున ఏడుస్తూ .’ఓ.. నాన్నా!నాన్నా!ఓ అమ్మా!మన గ్రీషా.. ఓ!ఓ!.. మన గ్రీషాను చంపేశారు’, అంది.
పచ్చటి ఆకుల మీద నుండి ఓ తేనెటీగ కిటికీ అడ్డం మీదకు ఎగిరి ఒకటే రొద చేస్తుంది. వాకిట్లో ఓ కోడి ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే, దూరంలో ఎక్కడి నుండో పిల్లల నవ్వులు తెరిచి ఉన్న తలుపు వల్ల లోపలికి వినిపిస్తూ ఉన్నాయి. నటాల్య పెదవులపై ఉన్న సన్నని చిరునవ్వు కాస్తా మాయమయ్యేలోపే, బాధ ఆమె ముఖాన్ని ఆక్రమించింది.
పాంటెలి ఒక్కసారిగా తన తల పక్కకు తిప్పి, నేల మీద బాధతో ఏడుస్తూ ఉన్న కూతురు వైపు చూశాడు.
మీకు నేను తెలియజేసేది ఏమిటంటే, పన్నెండవ డాన్ కొసాక్ రెజిమెంటుకి చెందిన మీ అబ్బాయి,గ్రెగరి పాంటెలేవిచ్ మెలఖోవ్, సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి కామోనికా స్ట్రుమిలోవా పట్టణం దగ్గరలో జరిగిన యుద్ధంలో చంపబడ్డాడు. మీ కొడుకు వీరుడిలా మరణించాడు. తీర్చలేని మీ లోటుకి ఇది కొంత ఓదార్పు కావచ్చు. అతనికి సంబంధించిన వస్తువులన్నీ అతని సోదరుడైన pyotr మెలఖోవుకి ఇవ్వబడతాయి. అతని గుర్రం మాత్రం రెజిమెంటులోనే ఉంటుంది.
కెప్టెన్ పొల్కొవ్ నికొవ్
నాలుగవ దళ అధికారి
సెప్టెంబర్ 18,1914
గ్రెగరి చావు వార్త వినడంతోనే పాంటెలి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ కుటుంబం వారి కన్నుల ముందే అతను రోజు రోజుకి వృద్ధుడై పోతూ ఉన్నాడు. జీవితం పట్ల అతని నిరాశక్తతను ఏది కదిలించలేకపోయింది. నల్లబడిన ముఖంతో, వెనక్కి వంగిపోయి, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే, అతని మనసులోని వేదన కాంతి లేని అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉండేది.
పాంటెలి ఆ దళపు అధికారి పంపించిన ఉత్తరాన్ని తన గదిలో అరలో పెట్టుకుని, ఒక రోజులో అనేకసార్లు వాకిట్లోకి వస్తూ దున్యక్షను పదేపదే పిలుస్తూ ఉండేవాడు.
‘ఓ అమ్మాయి, ఇటు రా!’
ఆమె తండ్రి వద్దకు వెళ్ళేది.
‘గ్రెగరి గురించి రాసిన ఉత్తరాన్ని ఇటు తీసుకు వచ్చి, చదువు!’అంటూ ఆమెను ఆజ్ఞపించేవాడు, ముందు గదిలో దుఃఖిస్తూ ఉన్న భార్యను తలుపు నుండి చూస్తూ.’నీలో నువ్వే చదువుకుంటున్నట్టు నెమ్మదిగా చదువు’, అని అంటూ కన్ను గీటుతూ, తన శరీరం అంతా ముందుకు వంచుతూ, కళ్ళతో తలుపులోంచి లోపలికి చూస్తూ,’నెమ్మదిగా చదువు… లేకపోతే అమ్మ వింటుంది. ఇప్పటికే అమ్మ బాధలో ఉంది…’ అనేవాడు.
కన్నీళ్ళను తుడుచుకుంటూ దున్యక్ష మొదటి వాక్యం చదివేది, అది వింటూనే పాంటెలి మోకాళ్ళ మీద కూలబడి, చేతులు పైకెత్తి,
‘అది చాలు!మిగిలింది నాకు తెలుసు.. దాన్ని ఎక్కడ నుండి తెచ్చావో అక్కడే పెట్టు. ఏ మాత్రం శబ్దం చేయకు, లేకపోతే అమ్మ..’మరలా అంతకు ముందు మాటలే పునరుచ్చరించేవాడు.
అతని కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి, అతని తలలో తెల్లటి మచ్చలు గడ్డానికి కూడా వ్యాపించాయి. అతను తిండిపోతులా తయారై, ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడు.
తొమ్మిదవ రోజున అంతిమ కార్యక్రమం చేసిన తర్వాత, ప్రీస్ట్ విస్సారియాన్ ను ఆహ్వానించి, వీరుడైన గ్రెగరి పేరు మీద బంధువులకు విందు ఇచ్చారు.
పాంటెలి ఆ విందులో వేగంగా, ఆకలిపోతులా తింటూ ఉంటే అతని గడ్డం అంతా నూడుల్స్ తో అంటుకుపోయింది. అప్పటికే కొన్ని రోజులుగా అతని వాలకంలో మార్పును గమనించిన ఇలినిచ్న ఒక్కసారిగా కన్నీటి పర్యoతమైంది.
‘మావయ్యా !మీకు ఏమైంది?’
‘ఇప్పుడేమైంది?’ అంటూ ఆ వృద్ధుడు, తన భోజనపు పళ్లెంలో నుంచి పైకి చూస్తూ అన్నాడు.
ఇలినిచ్న తల పక్కకు తిప్పి, పక్కనే ఉన్న ఒక గుడ్డను తీసుకుని, కన్నీళ్ళను తుడుచుకుంది.
‘మావయ్యా!నువ్వు మూడు, నాలుగు రోజుల నుండి ఏమి తిననట్టు తింటున్నావు!’ దర్య కోపంగా అని, సూటిగా చూసింది.
‘ఏంటి నేను ఎక్కువ తింటున్నానా? సరే.. సరే… ఇక నేనేమి తినను’, పాంటెలి బదులిచ్చాడు. తన చుట్టూ ఉన్నవారి వైపు ఓ సారి చూసి, నోటిలో ఉంది మింగుతూ, ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు.
‘ప్రోకోఫోవిచ్!ధైర్యంగా ఉండు. నువ్వు ఇది అతిగా మనసుకు తీసుకుంటున్నట్టు లేదూ?’ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రీస్ట్ పాంటెలితో అన్నాడు.’గ్రెగరి వీర మరణం పొందాడు. దేవుడి మీద కోపం పెంచుకోకు. నీ కొడుకు జారు కోసం, పితృభూమి కోసం ముళ్ళ కిరీటం ధరించాడు. నువ్వు దానికి ఇలా బాధపడటం పాపం ప్రొకోఫోవిచ్!ఆ దేవుడు నిన్ను క్షమించడు!’
‘నాకు తెలుసు, ఫాదర్!నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాను… ఆ అధికారి నా కొడుకు వీరుడిలా మరణించాడని రాసాడు, అవును కదా?’
ఆ వృద్దుడు ఆ ప్రీస్ట్ చేతిని ముద్దాడి, అక్కడ గుమ్మానికి ఆనుకుని, కొడుకు మరణ వార్త తెలిసిన తర్వాత మొదటిసారిగా కన్నీళ్ళ పర్యంతమయ్యాడు.
ఆ రోజు అతను ఆ బాధ నుండి కోలుకోవడానికి ప్రయత్నం చేశాడు.
ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అతను ఆ బాధ నుండి కోలుకోవడానికి తమదైన శైలిలో ప్రయత్నం చేశారు.
ఎప్పుడైతే నటాల్య దున్యక్ష నుండి గ్రెగరి మరణవార్తను విన్నదో అప్పుడే ఆమె తన జీవితాన్ని అంతం చేసుకోవాలన్న ఆలోచనతో వాకిట్లోకి పరుగు తీసింది. ‘ఇక నేను బతకడానికి ఏ కారణం లేదు. ఇక నేను చనిపోవడమే నాకు ఉన్న మార్గం’, అని మనసులో అనుకుంది. దర్య ఆమెను ఆపడం వల్ల, ఆమె ఆ ప్రయత్నం చేయలేకపోయింది. తర్వాత ఒక వారం పాటు ఈ లోకపు సోయ లేకుండా ఉండిపోయింది. ఏదో కనిపించని శవం మెలఖోవుల ఇంటిని వెంటాడుతున్నట్టు ఆ ఇంట్లో అందరి శ్వాస కూడా నిశ్శబ్దంలో రాజ్యమేలుతూ ఉండేది.
* * *