మధ్యతరగతి వాడి కలలు కూడా కొన్ని పరిమితులని దాటి రావు. ప్రతీ పైసా లెక్కబెడుతూ సంపాదించి, ఖర్చు పెట్టటానికి కూడా పైసా పైసా లెక్కబెట్టే జీవితం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, బట్టలు మాత్రమే సరిపోవు. ఇంకా చాలానే అవసరాలుంటాయి. అసలే భూమిమీద పెరుగుతున్న జనాభా, అందరికీ సరిపడినంత స్థలం, సరిపడినన్న్ని నీళ్లు, అందరికీ సరిపడేంత ఆహారం ఆఖరికి స్వచ్చమైన గాలి కూడా అందని కాలంలోకి అడుగు పెడుతున్నాం. మరి రాబోయే కాలంలో బతికేదేలా? ఇలాంటి ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? చిన్న జీవితంలో ఇవన్నీ పెద్ద సమస్యలే కదా… ఒకవేళ మనమంతా ఇప్పుడున్న పరిమాణంలో కాకుండా లిల్లీపుట్స్ లాగా మారిపోతేనో! ఇప్పుడు మనం ఉంటున్న ఒక ఇంటి స్థానంలో కొని వందల మంది ఉండే కాలనీనే కట్టొచ్చు. ఒక పూట మనం తినే తిండి కొన్ని నెలలపాటు తినొచ్చు. ఆడుకునే ఒక బొమ్మ కారు ఖరీదులో మంచి కారు కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు తక్కువగా అనిపించే ప్రతీదీ అప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది. సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది దర్శకుడు అలెగ్జాండర్ పేన్‌కి కూడా ఆ ఆలోచనల్లోంచి వచ్చిందే ఈ సినిమా.
“మన ఊహలు వాస్తవాలైతే గొప్పగా ఉంటుందనుకుంటాం. కానీ భ్రమలు మాత్రమే తొలగిపోతాయి” మన హీరో పాల్‌కి కూడా ఇదే విషయం అర్థం అవుతుంది చివరిలో. పాల్ ఒక మధ్యతరగతి జీవి. ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలని కలలు కనే మనిషి. రోజువారీ కష్టాలు అనుభవిస్తూనే అతని భర్యతో కలిసి పైసా పైసా కూడబెట్టి ఒక ఇల్లు కొనుక్కోవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అది నెరవేరటానికి ఇంకా చాలా డబ్బు కావాలి. ఎంత వెతికినా వాళ్ల బడ్జెట్‌లో ఉండే ఇళ్లు మాత్రం దొరకటం లేదు. అదే సమయంలో టీవీలో వచ్చిన ఒక న్యూస్ చూస్తాడు. జోర్డాన్ అనే సైంటిస్ట్ మనుషులని చిన్నగా మన చేతివేలంత చిన్నగా మార్చే ప్రయోగాన్ని సాధించాడు. అలా మనుషులంతా చిన్నగా మారిపోతే ఇప్పుడు మనకు చాలీ చాలకుండా ఉన్న డబ్బు కొన్ని మిలియన్లతో సమానం అవుతుంది. కేవలం కొన్ని వందల రూపాయలతోనే ఇప్పుడు ధనవంతులు బతుకుతున్న విలాసవంతమైన జీవితాన్ని పొందొచ్చు. జోర్డాన్ చెబుతున్న మాటలు పాల్‌కి కొత్త ప్రపంచాన్ని కళ్లముందు ఉంచుతాయి.
అయిదు అంగుళాల సైజుకి మారిపోతే ఒక బొమ్మరిల్లే విలాసవంతమైన బగ్లా అవుతుంది, వందరూపాయల్లో వచ్చే టాయ్ కారు సైజు కారు సరిపోతుంది. ఈ ఆలోచన అద్బుతంగా అనిపిస్తుంది పాల్‌కి. కొన్నాళ్ల తరవాత అలా లిల్లీ పుట్‌లాగా మారిపోయిన మరో మిత్రున్ని ఒక పార్టీలో చూసిన తర్వాత తానూ, తన భార్యా అలా మారిపోతే ఈ కస్టాలు తీరిపోయినట్టే అని బావిస్తాడు. సైంటిస్ట్ జోర్డాన్ కంపెనీ ఇప్పుడు అన్ని దేశాల్లోనూ తమ సర్వీస్ ప్రారంభించింది. భార్యని ఒప్పించి ఆ కంపెనీతో మాట్లాడి కావాల్సిన డబ్బు కట్టి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటాడు. ఎట్టకేలకు అతని కష్టాలు తీరబోతున్నాయి. సాధారణ మధ్యతరగతి జీవితాన్నుంచి ధనవంతుడిగా ఉండే కొత్త జీవితంలోకి అతను అడుగు పెట్టబోతున్నాడు.
భార్యాభర్తలిద్దరూ ఇప్పుడుంటున్న ఇంటిలోని సామాగ్రినంతా అమ్మేశారు. ఇక ఆ వస్తువులన్నీ వాళ్లకి ఏమాత్రం ఉపయోగపడవు కదా. డౌన్సైజింగ్ కోసం మెక్సికోలో ఉన్న లేజర్‌ల్యాండ్ అనే ల్యాబ్‌కి వెళ్లేముందు బంధువులకీ, స్నేహితులకీ పెద్ద పార్టీ ఇస్తారు. ఎందుకంటే ఒక్కసారి చిన్నగా మారిపోతే ఇప్పుడు ఉన్న మనుషులతో కలిసి ఉండటం కుదరదు కదా. తమకంటూ ఉండే కొత్త ప్రదేశంలోకి వెళ్లిపోవాలి. ఇక ఎప్పటికీ ఈ మనుషులని కలవటం కుదరదు. ఆ పార్టీలో పాల్ స్నేహితుడు మొట్టమొదటి పాయింట్‌ని లేవనెత్తుతాడు. “మీరు చిన్నగా అయిపోతే మీకూ సాధారణ పౌరులకు ఉండే హక్కులు ఉంటాయా? మీ జీవితాలకి అత్యంత తక్కువ డబ్బు సరిపోతుంది అలాంటప్పుడు మీరు కట్టే టాక్స్ ప్రభుత్వానికి ఏమాత్రం పనికి రాదు. మరి టాక్సులు కట్టే మేమూ, కట్టని మీరు సమానం ఎలా అవుతాం?” అని అడిగిన ప్రశ్నకి పాల్ దగ్గర సమాధానం ఉండదు. ఒక సమాజం, దేశం నడవాలంటే అతి ముఖ్యమైనది ఏమిటో గుర్తు చేస్తాడు. మీరు కొత్త మన్షులుగా కాదు కొత్త జీవులుగా మారిపోతున్నారని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతాడు. అయినా పాల్ అభిప్రాయం మారదు.
మెక్సికో చేరుకున్నాక పాల్ అతని భార్యా ఇద్దరూ తమలాగే చిన్నగా మారిపోవటానికి వచ్చిన వందలమందిని చూసి ఆశ్చర్యపోతారు. వీళ్లలాగే మధ్యతరగతి జీవితాన్నుంచి తప్పించుకునే ఆశాజీవులు వాళ్లంతా. తాము చిన్నగా అయిపోతే తమ కష్టాలు కూడా తగ్గిపోతాయన్న ఆశతొ అక్కడికి వచ్చారు వాళ్లు. మొత్తానికి అన్ని రకాల ఏర్పాట్ల మధ్య ల్యాబ్‌లోకి వెళ్లిన పాల్ కొన్ని గంటల తరువాత కళ్లు తెరిచేసరికి చిన్న బొమ్మలా మారిపోయాడు. తన కొత్త రూపం, కొత్త జీవితం మొదలైందన్న సంతోషం తీరకుండానే మొదటి దెబ్బ పడుతుంది. పాల్ ల్యాబ్‌లోకి వచ్చినట్టుగానే ఆడవాళ్ల వింగ్‌లోకి కూడా వెళ్లాల్సిన అతని భార్య తన నిర్ణయం మార్చుకుంది. అతని గుండె బద్దలైంది. అంతగా ప్రేమించిన భార్యని కోల్పోయాదు. ఆనందకరమైన కొత్త జీవితం అనుకున్నది పెద్ద విషాదంతో మొదలైంది. కానీ ఇప్పుడతను ఏమీ చేయలేడు. ఒక్కసారి చిన్నగా మారిపోతే ఇక మళ్లీ పూర్వపు స్థితికి రావటం అసాధ్యం.
తనకు కేటాయించిన కొత్త వెళ్ళాలోకి ఒంటరిగానే వెళ్ళాడు. పెద్ద ఇళ్లు, కారు అన్నీ ఉన్నాయి. ఒక టెలీకాలర్‌గా కొత్త జాబ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ అతని భార్యలేని ఒంటరి జీవితం. కొత్త స్నేహితులు, కొత్త ప్రపంచం, పార్టీలతో ఈ జీవితం బాగానే ఉంది. ఇలా ప్రపంచంలోని మనుషులంతా మారిపోతే ఎవరికీ కష్టాలే ఉండవు కదా అనుకుంటున్న పాల్‌కి వాస్తవాలు అర్థం కావటం మొదలవుతుంది. అంతా ధనవంతులే అయితే మరి పని చేసేవాళ్లెవరు? సమాజంలో హెచ్చుతగ్గులు ఎలా వచ్చాయో, ఎందుకు కొనసాగుతున్నాయో అర్థం అవుతూ వస్తుంది పాల్‌కి. వివిధ దేశాలనుంచి యూఎస్‌కి మనుష్గుల అక్రమరవాణా మొదలవుతోంది. మరి ఈ చిన్న మన్షులకి కూడా ఇళ్లలో పని వాళ్ళు కావాలి, ఈ కొత్త ధనవంతుల కాలనీలని శుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులు కావాలి వాళ్లంతా ఎక్కడినుంచి వస్తారు?? ఆసియా దేశలలో ఉండే పేదవాళ్లంతా జోర్డాన్ కంపెనీలో లిల్లీపుట్స్‌గా మారిపోయి ఇక్కడికి వలస వస్తున్నారు. అలా ఒక విమానంలో ఆసియా నుంచి బాక్స్‌లో అక్రమంగా తరలిస్తున్న కొంతమంది చనిపోయారనీ వాళ్లలో ఒక అమ్మాయి మాత్రమే బతికిందనే వార్త చూస్తాడు. తర్వాత అదే అమ్మాయిని తన స్నేహితుని ఇంట్లో మందులు దొంగిలిస్తున్న సమయంలో చూస్తాడు. ఆమై పట్టుకున్న పాల్‌కి ఆమె మందులు దొంగిలించటం లేదనీ, తన ఫ్రెండ్ అనుమతితోనే వాటిని తీసుకుపోతుందని తెలుస్తుంది. అంతే కాదు ఆమె ఇక్కడికి వచ్చే క్రమంలో ఒక కాలుని కోల్పోయింది కూడా. ఆమెని చూడగానే ఎప్పుడో న్యూస్‌లో చూసిన విషయం గుర్తువస్తుంది పాల్‌కి. వియత్నాంలో సామాజిక ఉద్యమాల్లో పనిచేసిన ఎన్‌గోక్ ఆమెనే. పేదల పక్షాన నిలబడి వియత్నాం ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు జైలు జీవితం కూడా గడిపింది.అక్కడి నుంచి తప్పించుకొని ఇలా ఇక్కడికి వచ్చిందని అర్థం చేసుకుంటాడు. ఆమెతో మాట్లాడుతూ ఆమె ఉండే కాలనీలోకి అడుగు పెడతాడు పాల్. అక్కడి స్థితిని చూసి ఒక్కసారిగా అతని కలల ప్రపంచం కూలిపోతుంది. అదొక పెద్ద మురికి వాడ, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లోని మనుషులు చిన్న చిన్న గుడిసెల్లో జీవిస్తున్నారు. పేదరికం, ఆకలి… ఏదీ మారదని, ఏ ఆవిష్కరణ అయినా స్వార్థం, దోపిడీ చుట్టే ఉంటుందని అర్థమవుతూ వచ్చింది.
చిన్నగా మారిపోతే ఏ కష్టాలైతే మనుషుల జీవితాల్లో ఉండవని అనుకున్నాడో అంతా అక్కడే కనిపిస్తోంది. డబ్బున్నవాళ్లకి విలాస జీవితాన్ని ఇవ్వటానికి, పెద్ద దేశాల్లో గొప్ప జీవితం ఉంటుందనుకొని వచ్చిన వాళ్లే అంతా. ఎన్నో జబ్బులతో ఉన్న మనుషులు, కనీస అవసరాలని కూడా పొందలేని కడు పేదరికాన్ని చూస్తాడు. ఎన్‌గోక్ మందులని ఎందుకు సేకరించి తెచ్చిందో పాల్‌కి అర్థమైంది. రోజూ ఆ కాలనీకి వస్తూ అక్కడి మనుషులకు తనకు తెలిసిన వైద్యం చేస్తూ ఉంటాడు పాల్. అయితే అనుకోకుండా మళ్లీ ఒకసారి సైంటిస్ట్ జోర్డాన్‌ని కలుస్తాడు. “ఈ భూమి మీద ఇంకా ఉండటం ప్రమాదకరం, ఇక్కడ వరదలు, పెను ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మనలాంటి వాళ్లకోసం భూగర్భంలో మరో కొత్త సిటీని నిర్మిస్తున్నాను. డబ్బున్నవాళ్లంతా అక్కడికి మారిపోదాం.” అంటాడు జోర్డాన్. పాల్ కూడా తనూ, ఎమ్‌గో కలిసి అక్కడికి వెళ్ళాలనుకుంటాడు.
కానీ, ఈసారి నిర్ణయం కూడా అతనికి విషాదమే మిగిలుస్తుంది? ఏమిటా విషాదం? పాల్ ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళాడా? ఎమ్‌గో ఏమైంది? అసలు మనుషులు చిన్నగా అయిపోతే మన సమష్యలు కూడా నిజంగా చిన్నవిగా అయిపోతాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాలి. చివరి పదినిమిషాలూ మేట్ నటన మనల్ని కట్టిపడేస్తుంది.
ప్రపంచ దేశాల రాజకీయాలు, పేదరికం, ఆకలి, దోపిడీ మనుషుల మధ్య ఉండే బంధాలు, సంఘర్షణలూ చర్చిస్తూనే. కవాల్సినంత కామెడీ, సరిపడినంత ఎమోషన్స్ ప్రతీ సీన్‌లోనూ మనకు కనిపిస్తాయి. పాల్‌గా కనిపించే మేట్ డామొన్, అతని భార్యగా కనిపించే క్రిస్టిన్‌లతో పాటు ఎన్‌గోక్ లాన్ ట్రాన్‌గా నటించిన హాంగ్ చౌ (థాయ్ అమ్మాయే కానీ అమెరికాలో స్థిరపడింది) తమ పాత్రలని అద్బుతంగా పోషించారు. సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే కన్‌ఫ్యూజన్ ఏమాత్రం లేకుండా అద్బుతమైన డ్రామాగా మలచటమలో దర్శకుడు అలెగ్జాండర్ పేన్ సక్సెస్ అయ్యాడు.
2018లో వచ్చిన ఈ సినిమా మంచి ప్రశంసలని దక్కించుకుంది. సినిమా చూడాలనుకుంటే అమేజాన్ ప్రైం లో చూడొచ్చు.