కామ్రేడ్

జీపు దూరాన నిలబడుంది. మాణిక్యం ఆ దిశగా నడిచి నడిచి అతడి నడక మందగించింది. జీపు ఆకాశం నుంచి ఊడిపడినట్లు అనిపించింది. అడవి చుట్టూ మాడిపోయిన ముళ్ళపొదలతో నిండిపోయింది. బండరాళ్ళలు ఉవ్వెత్తున కెరటాల్లా పైకెగసి గుట్టలా పేరుకుపోయినట్టున్నాయి. ఆ మార్గంలో ఎటువంటి జనసంచారం లేదు. ఏవో కొన్ని పిచ్చుకలు ముళ్ళపొదల నుంచి చేత్తో ఒక్కసారిగా విసిరినట్టు ఎగిరొచ్చి టీట్…టీట్ అని శబ్దం చేస్తూ దుమ్ము పేరుకుపోయిన నేలపై విస్తృతంగా తమ చిన్న ముక్కులతో పొడుస్తూ ఉన్నవి. అతని బూట్ల అలికిడితో అలల్లా ఒవ్వెత్తున ఎగసి తిరిగి ఆ పొదలమాటుకే వెనుతిరిగాయి.

ముళ్ళ వలన గాలి చీల్చి వేయబడుతున్నట్టు హోరుమనే శబ్దం రేకెత్తింది. చుట్టూ అటువంటి వందలాది హోరుగాలుల శబ్దం. ఎండుటాకుల్లో ఝల్లుమనే మట్టి శబ్దం, వర్షపు చినుకుల్లా వినిపిస్తోంది. అతని అడుగుల చప్పుడు ఎటు నుంచి ఎటో ప్రతిధ్వనించి, తిరిగి అతనినే వచ్చి చేరుకుంది. జీపు నీడ నేలపైజారి, ఎర్రరేగడి మన్నును తాకింది. ఆ నీడ చూసేందుకు తేమలా భ్రమింపజేస్తోంది. ఈ నల్లతుమ్మ ముళ్ళపొదల అడవిలో మట్టిలో తేమన్నదే ఏ మాత్రం లేదు. చెట్ల ఆకులను ఉన్నఫలంగా పొయ్యిలో వేసి మంటపెట్టొచ్చు. ఈ ముళ్ళ మొక్కల్లో దరిదాపుగా ఆకులు కూడా లేవు. ఆకులన్నింటిని ముళ్ళుగా మార్చుకున్నాయి. లోహంల్లా నల్లగా పదునైన ముళ్ళు. వాటి గురించిన వివరం తెలియనివారెవరు వాటిని ఏ మాత్రం మొక్కలని భావించరు.

ఆ దరిద్రపుగొట్టు తుపాకీని ఎడమ వైపు నుండి కుడి భుజానికి మార్చుకున్నాడు. అసలు అది అంత బరువెందుకున్నదన్న సంగతి అతనికి ఏ మాత్రం అర్ధం కాలేదు. అతడు సర్వీసుకు చేరిన రోజు నుంచి, అది అతడి వెంటే ఉంది. దరిదాపుగా అది అతడి చేతిలోనూ, ఒడిలోనూ ఉంటుంది. పలుమార్లు రాత్రిళ్ళలో పడుకునేటప్పుడు కూడా దానిని అతడి పక్కనే ఉంచుకునేవాడు. “కట్టుకున్న పెళ్ళాం కూడా ఇంతలా అంటిపెట్టుకుని పడుకోదేమో చూసుకో. నువ్వు చూస్తూ ఉండరా, ఏదో ఒక రోజు ఇది నా బిడ్డను కడుపున మోసి కనబోతుంది” అని అన్నాడు మాదైయన్. ఆ రోజు గుడారంలో అందరూ పగలబడి నవ్వారు.

ఆ తుపాకీని చూసినప్పుడల్లా అతడికి ఒక కుక్కను చూసినట్టు అనిపిస్తుంటుంది. తుపాకీ గొట్టం కుక్క నాలుకలా పొడుగ్గా మెరుస్తోంది; అది ఎప్పుడూ అతడి వెన్నంటే ఉంటుంది. అదీ కాకుంటే విక్రమాదిత్యుడు బేతాళుడు కథలో వచ్చే బేతాళుడు అని కూడా అనుకోవచ్చు. అయితే ఎటువంటి ప్రశ్నలు వెయ్యదనుకోండి; మౌనంగానే ఉంటుంది; చల్లనిది; నడిచేటప్పుడు మెల్లగా మెడకు, తొడకు కిందామీదా రాసుకొంటుంది. నిజానికి ఎటువంటి ప్రశ్నలు వెయ్యదా ఏమిటీ? లేదంటే ఆ ప్రశ్నలకు అతడు చెవొగ్గడా? అది ఏవేవో పొడుపుకథలని వేస్తోంది. అవి తనెన్నడూ విప్పలేనివి.

అతడు జీపు వద్దకు వెళ్ళేంతవరకు జీపును తప్పించి, తక్కిన వాటన్నంటిని గమనించాడు. అది తప్పించి మిగిలిన వాటన్నంటి గురించి ఆలోచించాడు. ఆ జీపును చేరుకునేలోపు తన ముందున్నటువంటి జీవితాన్ని పూర్తిగా జీవించాలనే కోరిక కలిగిన వాడిలా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ, నెమ్మదిగా నడిచాడు. అయితే దగ్గరకు వెళ్ళగానే అతడి మనసు యథాస్థితికి చేరుకుంది. తక్షణం ఏదో బరువును కోల్పోయినవాడిలా అతని శరీరం నిటారుగా నిలబడింది. పెద్దగా నిట్టూర్పు విడిచి తిరిగి వచ్చి ముందు సీటు వద్దకు వెళ్ళి సెల్యూట్ కొట్టాడు.

హెడ్ కానిస్టేబుల్ ముందు సీటులో కూర్చున్నాడు. ఎడమ చేతిలోనున్న తుపాకీని ఒడిలో పెట్టుకుని దానిపై తన కుడి చేతిని మోపాడు. అతనితో మాట్లాడుతూనే కళ్ళు అటూఇటూ దిక్కులు చూశాయి. “ఏమయ్యా , నువ్వు ఒక్కడివి మాత్రమేనా?” అన్నాడు.

‘అవును సార్, నిన్న నంజప్పన్‌ను తోడు పంపిస్తామన్నారు. ఈరోజు రావలసినవాడిని వెన్నాంపట్టికి వెళ్ళమ్మన్నారు. అక్కడ మినిస్టర్ వస్తున్నారన్నారు…”

“ఏం రావడమో  ఏమిటో… ప్రతి వారం ఇన్స్‌పెక్షన్ల పేరుతో ఎవడో ఒకడు వచ్చి మన ప్రాణాలు తోడేస్తున్నారు. సరే వచ్చి కూర్చో” అన్నాడు.

అతడు వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు “ఇదిగోనయ్యా, ఇది తీసుకో … రెండిటిని కలిపి తాళం వెయ్యి” అని తాళం చెవిని చేతికందించాడు.

అతడు తాళం తీసుకుని జీపు వెనుకకు వెళ్ళి ఊచను పట్టుకుని, పాదం మోపే చోట కాలు ఆనించి పైకి ఎక్కాడు. ఆ క్షణంలోనే లోపలున్న వ్యక్తిని గమనించాడు. అతడు చింపిరి జుత్తు, ఏపుగా పెరిగిన గడ్డం కలిగిన అరవై ఏళ్ళ వృద్ధుడు. అతడి కుడి చేతికి సంకెళ్ళు వేసి జీపు సీటు ఊచతో కలిపి తాళం వేయబడింది. పసుపు రంగు చొక్కాపై రెండు పైబొత్తాలు విప్పబడి, లుంగీతో కూర్చునున్నాడు. కాలికున్న రబ్బరు చెప్పులు చూసేందుకు కొత్తగా ఉన్నాయి. బహుశా అవి పోలీసులు ఇచ్చినవి అయ్యుండొచ్చు.

ఆ పెద్దాయన అతడిని చూసి నవ్వాడు. అరిగిపోయిన పళ్ళు. నల్లబడ్డ పెదాలు, అయినప్పటికీ నవ్వు అందంగా ఉంది. అతడు కళ్ళు కిందకు దించుకున్నాడు. కూర్చుగానే తాళం చెవితో అతడి సంకెళ్ళ తాళం విప్పి, రెండో భాగాన్ని తన చేతితో కలిపి తాళం వేశాడు.

“ఇప్పుడు మీరు కూడా అరెస్ట్ అయ్యారన్నమాట” అన్నాడు ఆ వ్యక్తి.

“అయ్యా కోనారు(తమిళనాడులోని ఒక జాతి వారు), ఆ ఎధవ వెటకారాలే వద్దనేది…మూసుకుని సైలెంటుగా రండి.. లేదంటే?” అని అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“ఏం చేస్తారేటి? కొడతారా… అయ్య బాబోయ్ నాకు  భయం వేస్తోంది” అన్నాడు కోనార్. అతడి వైపు చూసి రెప్పలు ఆడిస్తూ “కొడతారట.. మనం చూడని దెబ్బలా? గతవారం రోజులుగా దెబ్బల్లో  ఎన్ని వెరైటీలున్నాయో అన్నీ రుచి చూశాను… అయ్యా, పెన్నాగరంలో ఒకడు సినిమా పాటలు పాడుతూ మరీ కొడుతున్నాడు… ఆడికి అదేం మాయరోగమో, ఏమిటో?”

“కాస్త మాట్లకుండా ఉంటారా”  అని అతడు చాలా నెమ్మదిగా అన్నాడు.

“ఏం? మీరు మాట్లాడకూడదు, అది మీ డ్యూటీ గనుక. నేనెందుకు మాట్లాడకూడదు? మాట్లాడే రోజున మాట్లాడుతూనే ఉన్నాను” అన్నాడు కోనార్. “వెళ్ళేలోపు మాట్లాడి మాట్లాడి మిమ్మల్ని కూడా మా వైపు తిప్పుకుంటాను, ఏమంటావు? ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం మీ నోటి వెంట పలికేలా చేస్తాను.. ఏమంటావు?”

“ఊరుకుంటారా లేదా? అని హెడ్ కానిస్టేబుల్ గద్దించాడు.

“కుదరదు, అయ్యా! భారతదేశంలో కూడు లేదు, గూడు లేదు. ఏ బొచ్చు లేదు. అయితే ఎటువంటి హద్దులు లేకుండా మిగిలింది పీల్చే గాలి, మాటాడేందుకు బాషేగా… దాన్ని కూడా వదిలేసుకోమంటారా?”

“ఏం దరిద్రమో, ఎలాగో తగలడండి…” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“నా పేరు కార్‌మేఘం. కార్‌మేఘ కోనార్. కోనార్ అని చెబితే మీ చుట్టు పక్కలవాళ్ళకి బాగా తెలుసు, ఏమంటావు?” అన్నాడు. “కుటుంబం, వ్యక్తిగత ఆస్తులు, సమాజం అనబడే పుస్తకం గురించి మీరు వినే ఉంటారు. ఏంగిల్స్ రాసింది. దాన్ని వివరిస్తూ నేనొక పుస్తకం రాశాను. అది కోనార్ ప్రసంగం అని కొంతమంది వెటకారాలాడతారు.”

“కొంతమంది అంటే? అని మాణిక్యం తెలియక నోరు జారాడు.

“ఎమ్.ఎన్.ఈ.కె. పార్టీ వాళ్ళు.. మేము ఎమ్.జె.ఈ.కె. పార్టీ అని తెలుసుగా. మేము తల్లి పార్టీ అయితే, అది మా నుండి విడిపోయిన సమూహం. సిద్ధాంతాల సమస్యనే, ఏమంటావు? మేము భారతీయ విప్లవం గురించి మాట్లాడుతాం. వాళ్ళు ముందుగా తమిళనాడులో విప్లవం తీసుకురావాలి అని అంటుంటారు. మరి అటువంటప్పుడు పంచాయితీ స్థాయిలో మార్పులు తీసుకురావోచ్చుగా? ఏమంటారు? ‘నూరు సుమాలు వికసించని, వేయి ఆలోచనలు సంఘర్షించని’ అన్నాడు మావో. ఈనాయాళ్ళు తంగేడు పువ్వులా వీధి పొడుగునా పుయ్యాలనుకుంటున్నారు. ‘విప్లవం చీలిపోనిది’ అంటాడు మావో… అందుకే గొడవ; సిద్ధాంతాల గొడవ వస్తే ఆ మరుక్షణమే మాటల రభస మొదలెడతాం. అది మా అలవాటు, ఏమంటావు? అయ్య గుత్తుక్కను కొడుకు తెంచుతాడు. అదే మా స్టైల్…ఇంతకీ బీడీ ఉందా?”

మాణిక్యం కాస్త సంకోచించాడు. హెడ్ కానిస్టేబుల్ ఇవ్వమని సైగ చేశాడు.

దానితో అతడు ఒక బీడీ తీసిచ్చి, తనే స్వయంగా వెలిగించాడు. ఆయన బుగ్గ సొట్టపోయేలా లోపలికి లాగి, ముక్కు ద్వారా పైకి పొగ వదిలాడు.

“కాస్త రిలాక్స్ అవుదాం. ఈ బీడీ ఉందే, అది దేవుడు రెస్ట్ తీసుకుంటూ సృష్టించింది… పొగను గుప్పున బయటకి వదిలేటప్పుడు పోరా నువ్వు నా వెంట్రుకతో సమానమనే భావన ఒకటుంటుంది చూశారు. అటువంటప్పుడు పక్కన మార్క్స్‌నో, మావో వచ్చినాసరే అదే భావనే ఉంటుంది…. ఏమంటావు?”

అయన తరుచూ ఏమంటావు అనే ఊతపదాన్ని వాడటం మాణిక్యం గమనించాడు. అతడు అది గమనించడన్న సంగతి అతడికి కూడా అర్ధమయ్యింది. “అదా తమ్ముడూ, క్లాసులు తీసీ తీసీ సగం మాస్టారుగానే మారిపోయాను… ఏమంటావు?” అన్నాడు.

మాణిక్యం పక్కున నవ్వాడు.

“తమ్ముడూ! తమరికి చదువు ఎక్కనట్టుంది. లేదంటే ఇలా దరిద్రాన్ని వెంటేసుకుని అడువులెమ్మట తిరిగే ఉద్యోగానికి వచ్చుండే వాడివి కాదు” అన్నాడు కోనార్.

“ఏంటయ్యా వెటకారమా? అన్నాడు హెడ్ కానిస్టేబుల్ చిరాకుగా.

“చ…చా, ఊరికే సరదాగా అన్నాను… తమరు చక్రవర్తి కదా? చేతిలో తుపాకీ వుందిగా. ‘అధికారం తుపాకీ గొట్టం ద్వారానే వస్తోంది’ అన్నాడు మార్క్స్…” ఆయన బీడీ చివరి పఫ్‌ను లోపలికి గట్టిగా దమ్ముకట్టి లాగి “అయినా తూటాలు వుండాలిగా… ఉందికదా?” అన్నాడు.

“ఏమయ్యా, నిన్ను కాల్చేందుకు కావలసినన్ని తూటాలు ఉన్నాయి… చాలా?” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“ఆహాహాహా! అబ్బా అందుకేగా తీసుకువెళుతున్నారు…. మరీ మంచిది…” అన్నాడు కోనార్.

మాణిక్యం గుండెలు అదరడం మొదలయ్యాయి.

“అయ్యా! ఎందుకీ మాటలు? చూడండి తమ్ముడెలా భయపడిపోతున్నాడో” అన్నాడు కోనార్.

హెడ్ కానిస్టేబుల్ వెనక్కి తిరిగి అతడిని చూసి “నీ కెన్నెళ్ళయ్యా సర్వీసూ?”

మాణిక్యం చెప్పిన సమాధానం ఆయన చెవిన సరిగ్గా పడలేదు.

“ఏంటయ్యా?”

“సార్! ఆరేళ్ళు”

“ఆరేళ్ళా? అడవిలో ఎన్నేళ్ళు?”

“అయ్యా! మూడేళ్ళు…”

“మూడేళ్ళయ్యి కూడా ఇంకా రిబ్బను కటింగ్ కాలేదా?…. తుపాకీ పేల్చావా?”

అతడి నుండి ఎటువంటి సమాధానంలేదు.

“ఏంటీ? పేల్చావా?”

“అయ్యా! శిక్షణ లేదు…”

“దాన్ని చేత్తో ఆడిస్తున్నట్టే… మనిషిని చంపెందుకే, ఆడోళ్ళతో పాటు వుంది…”

అతడు మారు మాట్లాడలేదు.

“పేల్చావా?”

“లేదయ్యా”

“అందుకే ఇలా ఉన్నావు, తుప్పట్టిన తుపాకీలా… ఈ మనిషిని కాల్చు”

అతడు గుండెలు అదిరిపడి కోనారును చూశాడు. ఆయన కన్ను కొట్టాడు.

“పోండి సార్, మీరు మరీను, మరీ చిన్న పిల్లోడ్ని పోయి భయపెడుతూ” అన్నాడు కోనార్. “తమ్ముడూ, ఇంతకీ నీది ఏ ఊరు?”

“అయ్యా!” అన్నాడు.

“నన్ను కూడా అయ్యా అని అంటున్నారు, కామ్రేడ్ అనండి”

“అదికాదు”

“సరే, అయితే కోనార్ అని పిలవండి.”

“అలాగేనండీ”

“చెప్పండి, ఇంతకీ మీది ఏ ఊరు?”

“సెంగోట్టై”

“అరెరేయ్ , మనది తెన్కాశి” అన్నాడు కోనార్. “అయితే ఇది మనూరి బాష కాదే.”

“అవన్నీ ఎప్పుడో పోయాయి” అన్నాడు మాణిక్యం.

“సర్వీసులో అడుగెట్టగానే ముందుగా పోయేది అదే… అందరికీ భాష ఒకటే, నోరు ఒకటే” అన్నాడు హెడ్ కానిస్టేబుల్. ‘మనల్ని చూస్తే ఎవడైనా నాగర్కోయిల్ అనుకుంటారా?”

“ఇంట్లో ఎవరెవరున్నారు?” అన్నాడు కోనార్.

“నాన్న, అమ్మ, ఒక చెల్లి”

“ఇంకా పెళ్ళి కాలేదా?”

“లేదండీ”

“పెళ్ళికి పిల్లని చూస్తున్నారు కదు”

“అవునండీ”

“కట్టుకునే పిల్లకి ఏం ఇష్టమని అడిగి చూడండి. ఏం ఇష్టమో చెప్పడం తెలియక పిల్ల  బిక్కమొహం వేస్తే గనుక ఆమెనే కట్టుకోండి, ఏమంటారు?” అన్నాడు కోనార్. “ఎందుకంటే ఫలానానే కావాలని చెప్పలేకుంటేనే పేదవాడి బతుకులో సంతోషమనేది ఎంతోకొంత మిగులుంటుంది…”

“ఏమయ్యా ? నువ్వు తమిళ మాస్టారివేగా? పిల్లలకు తిరుక్కురళ్(శ్రీ సూక్తం), నాలడియార్ అని చెప్పుకు తిరగొచ్చుగా? అది వదిలేసి…” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“ఉండుండొచ్చు” అన్నాడు కోనార్. “అయితే ఆ గడ్డాలోడు (తిరువళ్ళువర్) ధర్మం గురించి ఏనాడో బల్లగుద్దినట్టు ముందే రాసి పెట్టాడుగా…. ‘తలచుచుండ్రు ప్రేమ ధర్మంబుతోడని వీరత్వము ప్రేమతోనే తగును తీర్చ’. ప్రేమ కేవలం ధర్మానికి మాత్రమే తోడుంటుందని కాదు. దాని కంటే ఎంతో క్రూరమైన వీరత్వానికి కూడా ప్రేమ తోడుంటుంది. వంద రెట్లు ప్రేమ వుంటుంది…. మనం ప్రేమ లేకుండా జీవించలేము ఏమంటావు?”

“ఆహా…ప్రేమ వుండటం వలెనే, ఇద్దరు పోలీసులను పిట్టలు కాల్చినట్టు కాల్చి పారేశావు కదా? పైగా అందులో ఒకడి తలను నరికి రోడ్డువోరగా పడేశావు కదు” అని హెడ్ కానిస్టేబుల్ అన్నాడు.

“ప్రేమ వలెనే… ఏసు వద్ద, గాంధీ వద్ద ఏ ప్రేమయితే ఉందో అదే ప్రేమ వలెనే.”

“ఏమయ్యా! ఆ పోలీసోడు ఏం చేశాడనయ్యా? ఇంతకీ అతని పేరెంటని తెలుసా నీకు? అందులో ఒకడి పేరు తమిళ్ సెల్వన్, ఇంకొకడు రాజేంద్రన్…. ఇద్దరూ సాధారణ కానిస్టేబుళ్ళు. దాదాపు నాలుగు వేల రూపాయల బేసిక్ పే. నాలుగు వేలు డి.ఎ., రిస్క్ అలవెన్స్ వెయ్యి రూపాయలు… అన్నీపోనూ జీతం పదివేల కంటే తక్కువే ఉంటుంది. ఇక్కడ క్యాంపులో పెట్టింది తిని, కిక్కురుమనకుండా ఉంటే ఊరికి ఎనిమిది వేల రూపాయలు మనియార్డర్ చేసుకునే వెసులుబాటు ఉండేది. దానికి అడ్డమైనోళ్ళ కాళ్ళు నాకాలి… ఆడిని కాల్చి పారదెబ్బి, నువ్వేంటి విప్లవం బొచ్చు పీకుతూ కూర్చున్నవా?…నీయమ్మా, నిన్నూ…” అని అరిచి హెడ్ కానిస్టేబుల్ పైకి లేచాడు.

“వాళ్ళెవరని నాకు తెలియదు, కానీ ఎలా బతుకుతున్నారని మాత్రం తెలుసు” అన్నాడు కోనార్. “వాళ్ళు కూడా పేదోళ్ళే. అయితే వాళ్ళు యూనిఫారం తొడుక్కున్నారు… వాళ్ళే తమంతట తాముగా మా చేతికి చిక్కారు.”

“వాళ్ళనెందుకురా చంపావు” అని హెడ్ కానిస్టేబుల్ కోనారును లాగి లెంపకాయ కొట్టాడు. అయితే దెబ్బ గురి తప్పి పక్కనున్న ఇనుప ఊచకు తగిలింది.

కోనార్ నవ్వాడు. మళ్ళీ మాణిక్యంతో “చంపేశాను… మీలాంటోళ్ళను ఇద్దరినీ…” అన్నాడు.

మాణిక్యం ఏం మాట్లాడకుండా అతడివైపే చూశాడు.

“భయం వేస్తుందా?”

అతడు అవునని తలాడించాడు.

“ఆ మాత్రం భయం ఉండాల్లే.. ఆ భయం కోసమే ఇవన్నీ” అన్నాడు కోనార్. “మొత్తమ్మీద భయం చూపించాంగా?”

“ఆ భయానికి, మూడింతల భయం ఈ రోజు చూపించేస్తే పోలా” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

బండి ఆగింది.

“ఏంటయ్యా?” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“సార్! పంచర్ అయ్యిందనుకుంటాను.”

“మంచిదయ్యింది, నేను కూడా ఒంటేలు పోసుకోవాలి” అన్నాడు కోనార్.

వాళ్ళు కిందకి దిగారు. కోనార్ అడవికి వెళ్ళడంతో, మాణిక్యం కూడా వెంట వెళ్ళాడు. ఇద్దరూ ఒంటేలు పోసుకున్నారు.

కోనార్ నిలబడి ఆకాశం వైపు చూశాడు. చుట్టూ వరుసగా పేర్చినట్టువున్న కొండలు. ఆ కొండలన్నీ వట్టిపోయినట్టు వున్నాయి. ఆకాశం మేఘాలు లేకుండా స్థిమితంగా వుంది.

“మనది తెన్కాశీ… మొట్టమొదటిసారిగా ఏ ముళ్ళ అడవికి పనికొచ్చినప్పుడు తెల్లబోయి చూసి ఏడ్చాను… ఊరుకి తిరుగు ప్రయాణంలో పోదామనుకున్నాను. రాజీనామా చేసేసి బయలుదేరడం కూడా జరిగింది, ఏమంటావు? కూడా ఉన్నవాళ్ళు వెంటబడి లాక్కొచ్చారు… మాస్టారు పనంటే అంత సులువు కాదు. అప్పట్లో ఆ పనికి లంచాలు గించాలు ఏవి లేవుగాని, తీవ్రమైన పోటీ అయితే ఉండేది… ఒక సంవత్సరం ఓపిక పట్టు, బదిలీ చేయించుకోవచ్చు అని ఓదార్చేవారు… ఏడాది కాలాన్ని ఒక్కో రోజుగా లెక్కబెడుతూ కూర్చున్నాను. ఏమంటావు? అయితే ఒక సంవత్సరం తిరగ్గానే ఈ మట్టిపైనే పాతుకుపోయాను… ఈ అమాయక జనానికి పక్కూళ్ళలో జనం మూడుపూటలా తింటున్నారన్నా సంగతే తెలియదు. తమ్ముడూ! అన్నంలో నంచుకునేందుకు ఒక పదార్ధముంటుందన్న విషయమే ఇక్కడెవరికీ తెలియదు. వేపుడు, కలుసు కూర పెడితే అన్నిటిని కలిపి ముద్దలు చేసి తినేస్తారు, ఏమంటావు? వీళ్ళు కూర అని ఒకటి వండేదే ఏడాదికి ఏ నాలుగు సార్లో మాత్రమే. తప్పితే మిగిలిన రోజులన్నీ రాగి సంకటే, ఏమంటావు? ఏడాది పొడవునా? సంకటి, చింతపండు, కంబళి వీటన్నిటిని కలగలిపితే అదే ధర్మపురి… మరేం లేదు. నెత్తి మీదకి రాజరాజ చోళుడు వచ్చేళ్ళాడు, తెల్లోడు వచ్చేళ్ళాడు. గాంధీ వచ్చేళ్ళాడు… ఇలాగే బతుకువెళ్ళదీస్తున్నాం… ఇక్కడే ఉండిపోయాను, ఏమంటావు?”

“ఇంకో బీడీ దొరుకుతుందా?” అన్నాడు  “ఈ ఆకాశం వైపు చూసి ఒక పఫ్ లాగాలి.”

మాణిక్యం తిరిగి చూశాడు.

“ఆయన ఏమి అనరులే , ఇవ్వండి.”

అతడు బీడీని వెలిగించి ఇచ్చాడు. అతడు దాన్ని లోతుగా లోపలికి పీల్చి దమ్ము కట్టి, గట్టిగా పొగను బయటకి వదిలాడు. “నాకు ఇక్కడ నచ్చిందే ఆ ఆకాశమే, ఏమంటావు? ఇలాంటొక ఆకాశం మా వూరిలో లేనేలేదు… నీలం రంగులో, నలువైపులా గుండ్రంగా ఒక ఆకాశం… ఈ మట్టి నాకు నచ్చింది అంటే మీరు ఆశ్చర్యపోతారు… ఈ నల్లతుమ్మ ముళ్ళు… చూడండి ఇందులో ముళ్ళు మాత్రమే వున్నాయి. ఎంత భయపడుంటే వాటి వంటిని ఇలా నిండా ముళ్ళతో కప్పుకుని వుండిఉంటుంది.… ఇక్కడ ముళ్ళపంది ఉంది… దానిక్కూడా వంటి నిండా ముళ్ళే. కాలితో గట్టిగా నేలను ఒక్క అదుము అదిమితే చాలు, భయంతో దొర్లుతూ ముళ్ళు నిక్కబొడుచుకుంటాయి… పాపం ఈ అమాయకపుగొట్టు మట్టి… ఇందులో ఏడాదికి నాలుగైదుసార్లే వర్షాలు పడతాయి… ఆ నీటిని చుక్కా చుక్కా తాగుతూ ఏడాది పొడుగునా ఇలా ఊపిరి పోసుకుంటుంది. ఏమంటావు? పాపం తమ్ముడూ ఈ మట్టికి గనుక మీరు అలవాటు పడితే అది మీకే నచ్చేస్తుంది. ఈ తెన్కాశీ మట్టి ఉందే, అది చెవులకు ఈడుపులు ధరించి, కండాంగి చీర కట్టి, తాంబూలం వేసిన నోటితో నవ్వుతూవుండే అమ్మలాంటిది. ఇక ఈ ఊరు, చింకి పాత చీర కట్టి, చెవి కన్నంలో ముళ్ళుగుచ్చుకుని ఎండకు నల్లబడి, ఆకలితో అర్రులు చాచిన అమ్మలాంటిది. ఆమెను చూసినప్పుడల్లా మనసు పరితపించిపోతుంది. ఏమంటావు?

“ఇక్కడే ఉండిపోయారా?”

“అవును, ఇక్కడే పెళ్ళి చేసుకున్నాను. ఒక బిడ్డ.”

“వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు?”

“పోలీసులు పట్టుకున్నారు… ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేదు. బహుశా చచ్చిపోయి ఉండాలి…. మీ వాళ్ళు ఎలాగు వదలరుగా…”

అతడు మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు.

“దాని గురించి మీరేం దిగులుపడాల్సిన అవసరం లేదులే… ఇదంతా పెద్ద డ్రామా. మీ పాత్రలో మీరు నటిస్తున్నారు. నా పాత్రలో నేను నటిస్తున్నాను, ఏమంటావు?” అన్నాడు కోనార్.

“మాస్టారుగా పని చేశారా?” అన్నాడు రొప్పుతూ మాణిక్యం. తన ఉద్వేగాలను మళ్ళించేందుకే ఆ విషయం అడిగాడు.

“అవును, తమిళ మాస్టారు. ఈ కొండ ప్రాంతల్లో ఒక దిక్కుమాలిన సమస్యవుంది. ఇక్కడ ఉన్నోళ్ళకు తమిళ బాష కూడా పరాయి భాషే. వీళ్ళు మాట్లాడేది ఇంకో రకమైన భాష. అది అటు తమిళమూ కాదు, ఇటు కన్నడమూ కాదు. ఇంకో రకమైన బాష. సినిమా చూసినా వాళ్ళకి అర్ధమయి చావదు, ఏమంటావు? దీనికి తోడు, వీళ్ళకి మనం స్వచ్చమైన తమిళం నేర్పించాలి… తమిళ భాషకు మనకే నాలుక పిడచగట్టుకుపోతుంది. ఇంతకంటే దారుణం ఏం చెప్పాలి, ఆషామాషీ పని కాదు. వందమంది విద్యార్ధుల్లో ఒకరిద్దరు మాత్రమే వృద్ధిలోకి వస్తారు. వేలాది మొక్కల పేర్లు చెబుతారు, పక్షులు గుర్తులు చెబుతారు. అయితే నాలుగవ తరగతి దేవుడికి పాడే వందనం కంఠస్తం చెయ్యడం కూడా వాళ్ళకు చేతకాదు. ఏమంటావు? ఎనిమిదో క్లాసుకు అలాగే వచ్చేస్తాడు…”

ఇద్దరూ తిరిగొచ్చి నల్లరాతి మీద కూర్చున్నారు.

అతడు నలువైపులా చూస్తూన్నాడు. “ఎంత అందమైనది ఇక్కడి  మట్టి. మన వూరి మట్టి ఎప్పుడూ ఎగిరెగిరిపడుతూనే ఉంటుంది. ఇక్కడ గాఢమైన ప్రశాంతతో ఉంటుంది. మన వూరి మట్టి, రైతు లాంటిది. దానికి ఎప్పుడూ కంగారు. ఈ వూరి మట్టి మేకలకాపరి లాంటిది. మేకలను తోలితే కాసేపటి తర్వాత ఉన్నఫలంగా సగం కళ్ళుమూసుకుని కూలబడాల్సిందే, ఏమంటావు?’

వారి చుట్టూ ఉన్న మట్టిని తదేకంగా చూస్తూ ఉన్నారు. డ్రైవర్ జీపుచక్రాన్ని విప్పుతున్నాడు. హెడ్ కానిస్టేబుల్ పక్కన నిలబడి అతనితో మాట్లాడుతున్నాడు.

“ఇక్కడ వయర్లెస్ సిగ్నల్ అందుతుందా?”

“అందదు” అన్నాడు మాణిక్యం.

“అప్పుడు దారి తప్పిపోతే గతేంటి? లేదా ఏదైనా దాడి జరిగితే?

“తెలియదు”

“ఏదో మీ చావు మీరు చావండి అన్నట్టు అడవిలో కళ్ళుగట్టి వదిలేసినట్టు ఉంది, ఏమంటావు?”

మాణిక్యం నవ్వుకున్నాడు.

“బాధగా వుంది తమ్ముడు” అన్నాడు. “ఊరికే ఒకటో క్లాసు కుర్రోళ్ళలా ఉన్నారు ఈ పోలీసులు. ఎస్.పి.డి. అని చెప్పి డెప్యుటేషన్ మీద పంపిస్తునే ఉన్నారు” తుపాకీని చూసి “ఇంతకీ అందులో తూటాలు ఉన్నాయా?” అన్నాడు.

“ఉన్నాయి”

“పేలుతుందా?”

అతడు ఏ సమాధానం చెప్పలేదు.

“ఏముంది మహా అయితే ట్రిగ్గర్ పనిచెయదు… అన్నీ కూడా రెండవ ప్రపంచయుద్ధం నాటి తుపాకులు… ఏదో పేరుకి ఇచ్చి సాగనంపుతున్నారు… ఒక తోడు కోసం… చేతిలో ఇది ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది, ఏమంటావు?”

మాణిక్యం టక్కున నవ్వి “అయితే ప్రమాదం ఎదురైతే మాత్రం వాటిని విసిరేసి పారిపోతాం” అన్నాడు.

అయన పగలబడి నవ్వి “అలా చేయొచ్చా తమ్ముడూ? మిమ్మల్ని నమ్మి వచ్చినదాన్ని ఇలా మధ్యలో వదిలేయోచ్చా? అన్నాడు.

“అయ్యా, ఎందుకు మా వాళ్ళని చంపారు?”

“అయ్యా అని ఇంకోసారి అనొద్దు, కామ్రేడ్. లేదంటే పేరు పెట్టి పిలవండి”

“సరేనండి”

“పూచాట్టి అనే ఊరి పేరు వినే వుంటారు?”

“అవును”

“అక్కడ ఏం జరిగింది?”

 అతడు ఏం చెప్పలేదు.

“చెప్పండి, మీ వెర్షన్ ఏమిటో చెప్పండి?”

“కల్తీ సారాయి వేట”

“అది కల్తీ సారాయి గ్రామం. అక్కడ రైడుకు వెళ్ళారు మీ వాళ్ళు. ఊరోళ్ళు చుట్టుముట్టి తన్నారు. మీరు చేసిన ఎదురుదాడిలో కొందరు మరణించారు..కదా?

“అవును”

“అది అడవి మధ్యలో ఉన్న ఊరు. నలువైపులా అడవి. పోలీసు చెక్ పోస్ట్ దాటకుండా ఇంకో ఊరులోకి అడుపెట్టడం ఏ మాత్రం సాధ్యం కాదు. అటువంటిది పోలీసుల కళ్ళుగప్పి గ్రామమంతా కల్తీ సారాయి కాస్తుందా?”

“కాదా?”

“చెప్పండి. చుట్టూ అడవి ఉంది. వాళ్ళ వృత్తి తేనె తియ్యడం. అడవి వస్తువులు తీసుకొచ్చి అమ్మడం. అందులోనే వాళ్ళకి కావలసినన్ని డబ్బులు గిట్టుబాటు అవుతాయి. పైగా అడవిలో వేట ఎలాగు ఉండనే వుంది, దుంపలు, ధాన్యం బాగా దొరుకుతాయి. ఇక వాళ్ళెందుకు సారాయి కాయాలి? ఏమంటావు? దానికి కావలసిన తాయిలం ఎక్కడి నుండి వస్తోంది? దాన్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు ఎవడు?”

“తెలియదు”

“వాళ్ళని బెదిరించి సారాయి కాయించారు. కాయని వాళ్ళన్ని కొట్టి అడవిలో వేటాడారని కేసు బనాయించారు… ఊరంతటిని కల్తీ సారాయి గ్రామంగా మార్చి ఇరవై ఏళ్ళుగా వాళ్ళ చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నారు… అలా పెట్టుకున్నారు మీ వాళ్ళు. ఏమంటావు? యజమానులు,సర్కార్, సారాయి కాంట్రాక్ట్ తీసినవాడు, సారాయి కాయించి దాన్ని తీసుకుని సర్కార్ వారి సారాయిలో కలిపి అమ్మి, ఇలా పెద్ద ఎత్తున లాభం చవిచూశారు…”

“ఓహ్..” అన్నాడు.

“ఇరవై ఏళ్ళు కల్తీ సారాయి కాచిన గ్రామంలో ఒక ఇంటికి కూడా పైకప్పు లేదు మరి. కనీసం ఒక్క కుటుంబంలో కూడా ఒక రేడియో లేదు. ఒక్క ఆడదానికి కూడా గురిగింజ ఎత్తు బంగారం కూడా లేదు. ఏమంటావు? అయితే కొని అమ్మిన వాళ్ళంతా ఈ రోజు కోటీశ్వరులు … అటువంటప్పుడు ఇక్కడ నేరస్తులెవరు?”

“ఇవన్నీ నాకు అర్ధం కావయ్యా?”

“అర్ధం కావాలి. ఎందుకంటే మీరు కూడా ఈ డ్రామాలో నటించడం మొదలెట్టారు గనుక” అన్నాడు కోనార్. “ఇరవై ఏళ్ళుగా కాస్తున్నారు, హటాత్తుగా సర్కార్ సారాయి ఇంకొకడి చేతులు మారింది. వాడు పోలీసులను పంపించి గ్రామాన్ని నాశనం చేయమన్నాడు. చేసేశారు, ఏమంటావు?”

“మరీ వాళ్ళు కూడా చెయ్యి చేసుకున్నారుగా?

“రాత్రిల్లో వాడి ఊరును చుట్టుముట్టి ఆడోళ్ళను, మనుష్యులను ఎత్తుకెళ్ళితే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా?”

“అంటే?”

“ఏంటి అయితే? ఒకలిద్దరు కాదు, మొత్తం అత్యాచారం చెయ్యబడ్డ ఆడోళ్ళు ఎనభై మంది. చచ్చినోళ్ళు పద్దెనిమిది మంది. అందర్నీ ఒకే నూతిలో నరికి పారేశారు, ఏమంటావు?”

“వాళ్ళు కూడా చెయ్యి చేసుకున్నారుగా”

“మీలో చచ్చిన వాళ్ళెంత?”

“ఎవరూ లేరు”

“ఏంటి లేదు? ఒక్కడు కూడా చావలేదు… అటువంటప్పుడు కొట్టింది ఎవరంటావు?”

“ఇందులో నేను చెప్పేందుకు ఏంలేదండీ”

“ఎందుకు కొట్టారు అని చెప్పమంటావా? భయం కోసం. పోలీసులంటే అంటే కుక్కిన పేనులా భయపడుండాలి, అందుకోసం. ఊరి వాళ్ళను పిలిపించి సారాయి కాయడాన్ని ఆపు చేయించారు. ఏమంటావు? ఇరవై ఏళ్ళుగా కాచి సంపాదించినవాళ్ళు. కాయడం వదల్లేదు. పాతోళ్ళు కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు బెదిరించేందుకు వస్తే కూడా బెదరకుండా నిలబడ్డారు. అందుకే పోలీసులకు మంట. ఏంటీ, మాకు భయపడరా? భయమంటే ఏమిటో చూపిస్తాం అని కొట్టారు. ఏమంటావు? కొట్టడం కూడా మనిషికి భయం కలిగించదు. కానీ ఈ అత్యాచారం ఉంది చూశావూ అది కంటతడి పెట్టిచేస్తుంది. ఏమంటావు? ఒక్కొక్కరిలో తమ భార్యాబిడ్డల్ని తలుచుకుని దడ పుట్టిచేస్తుంది. అందువలనే పటాలమంతా అత్యాచారానికి పాల్పడుతోంది.”

“పటాలమంతా అని అనగలరా?” అన్నాడు మాణిక్యం.

“అవును.. పటాలమంతాను… ఇటు చూడు, చచ్చినోడు, చంపినోడు ఇద్దరూ ఒక ఊరోళ్ళు, ఒక జాతి వాళ్ళే. ఓ వర్గం మాత్రం అందులో యునిఫారం తొడుక్కుంది, అదొక్కటే ఇద్దరి మధ్యా తేడా?”

“అది వాళ్ళ ఉద్యోగం” అన్నాడు మాణిక్యం.

“చూడు తమ్ముడూ, ఏట్టేల్లకాలం జనాల్ని బానిసలుగా ఉంచేది ఏంటో తెలుసా? దెబ్బలా? తన్నులా?చావా? ఏమంటావు? ఇవేమీ కాదు. ఎంతమందిని కొట్టగలరు? అందరినీ చంపేస్తే వాళ్ళ కాలి కింద బానిసనేవాడు ఒక్కడుండడు కదా? ఏమంటావు? కేవలం బానిసను బంధించే సంకెళ్ళు భయం మాత్రమే. ఏదో అయిపోద్ది అనే భయం. ఉన్నది కూడా కోల్పోతాము అనే భయం…మనం ఏమి చెయ్యలేము అనే భయం. ఏమంటావు? వాళ్ళనలా బంధించే భయం సంకెళ్ళను తెంపితే చాలు. విడుదలనేది వస్తోంది. ఇప్పుడు ఆ భయాన్ని సమూలంగా తెంపేశాంగా? ఈ రోజు నుండి అదే విధంగా మరో గూడెంలోకి మీరు అడుగెట్టగలరా? ఏమంటావు? ఈ రోజు మీ వెన్నులో వణుకు పుట్టిందిగా? దాన్ని వాళ్ళు కూడా గమనించారు. ఓహో, అయితే మనం కొడితే వీళ్ళకి కూడా నొప్పి పుడుతుందని గ్రహించారు. మనల్ని చూసి వీళ్ళు కూడా భయపడుతున్నారని గ్రహించారు. అదే… అందుకే, ఏమంటావు?”

అతడు ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. అందులో మరో రకమైన భావం ఉంది. అతడికి ఆయన్ని చూసేందుకు భయమేసింది.

“ఆ గ్రామాన్నే సమూలంగా మీ వాళ్ళు కొల్లగొట్టారు. అప్పటికది కేవలం ఒక ‘దినతంది’ పత్రిక  వార్త మాత్రమే. ఒక  విచారణ కమిషన్ వేశారు.  దానికి ఇంతవరకు ఏ రిపోర్టు ఇచ్చిన దాఖలా లేదు. అక్కడితో ముగిసిపోయింది. ఏమంటావు?  అయితే మీ మీద ఓ దెబ్బ పడంగానే మీ ప్రభుత్వమే  దిగొచ్చిందిగా?  ఇప్పుడు మీ అధికారులు గూడమంతా తిరిగి అందరితో  శాంతిచర్చలు చేస్తున్నారుగా?  ఈ రోజు మీ మినిస్టరొచ్చి  మేకలకు, ఆవులకు కూడా లోన్లు ఇస్తున్నాడుగా?  ఏమంటావు? పునాదుల మీద కొడితేనే కదయ్యా బిల్డింగులు కదులుతాయి… వణికించామా?”

“పోలీసులు మరీ మీరన్నట్టు అంత తేలికగా ఓడిపోరు” అన్నాడు మాణిక్యం.

“చూశావా, పోలీస్ ట్రైనింగ్ బుద్ది బయటపడింది, చూశావా? అందుకే అనేది పోలీసులు ఎప్పుడు పోలీసులే. యూనిఫారం అంటే ఆషామాషీ అనుకున్నావా? ఊరికేనా ఆ తెల్లోడు సృష్టించాడు?”

“నేనూ పోలీసునే, కాదనడం లేదు” అన్నాడు మాణిక్యం.

“మరి ఇంకేంటి” అన్నాడు కోనార్. “ఈ బూట్లు, తుపాకీ దొరకగానే ఒక్కసారిగా ఒళ్ళు పులకరించిపోయుంటుందే. రోజులతరబడి డ్యూటీ ఉన్నా, లేకున్నా బాగా వేసుకుని తిరుగుంటావే… తుపాకీని కింద దింపలేకపోయుంటావే.”

అతను వెనక్కి తిరిగాడు.

“అదే మనిషి స్వభావం; అధికారం, మనిషికి అదే కావాలి.”

“ఏం మీకొద్దా? ఇప్పుడు మీరిలా తుపాకులు మోసుకు తిరిగేది కూడా ఆ అధికారం కోసమే కదా? ఇప్పుడు మీ పేరు చెబితే అందరూ హడలెత్తిపోతున్నారు, ఏం అందులో మీకు సంతోషం కలగదా?”

“నిజం చెప్పాలి అంటే, వుంది” అన్నాడు కోనార్. “అది మీలోనూ వుంది…. లేదంటే మాతో ఎందుకు గొడవకు దిగాలి? అధికారం ఎక్కడ ఉంటుందో, అక్కడ దాన్ని చేజిక్కించుకోవడం కోసం యుద్ధం కూడా తప్పక ఉంటుంది.”

“నాకు ఎటువంటి అధికారము లేదు. నేను కేవలం కూలి దండుని.”

“లేదు, అది అలా కాదు. ఆ యూనిఫారం తొడుక్కున్నావు. కనుక నువ్వు కూడా పోలీసే. దానికి సంబధించినవన్నీ నీ చేతికి వచ్చేస్తాయి.”

“నా దగ్గర అటువంటివి ఏమి లేవు.  ఇప్పటికిప్పుడు ఈ దరిద్రాన్ని కింద పారేసి, ఒక పలుగూపార చేతిలోకి తీసుకోమన్నా తీసుకుంటాను.”

“తియ్యలేవు”

అతడు అయన గొంతు విని తిరిగి చూశాడు.

“తీసుకోరు”

“ఎందుకు?”

“ఎందుకంటే నువ్వు పోలీస్ గనుక”

“కాదు”

“అవును” అన్నాడు బల్లగుద్దినట్టు గట్టిగా. “ఆ బేతాళుడు భుజమెక్కాడు. అది ఇక ఎన్నటికీ కిందకు దిగదు. రిటైర్ అయ్యాక కూడా అది కిందకు దిగదు. ఆపై మీ పరాక్రమాల గురించి అడ్డూ ఆపు లేకుండా మాట్లాడుతూనేవుంటారు”

అతడు కోపంతో “అసలు నా గురించి మీకు ఏం తెలుసనీ?” అన్నాడు.

“మనుష్యుల గురించి తెలుసు…”

“మనుష్యులందరి గురించి తెలుసా?”

“అందరిలో ప్రాథమికంగా ఉండే ఒక విషయం గురించి బాగా తెలుసు.”

టైర్ బిగించిన తరువాత మంచినీళ్ళ సీసాతో చేతులు కడుక్కున్నాడు. హెడ్ కానిస్టేబుల్ రమ్మని చెయ్యి ఊపాడు.

వాళ్ళు జీపు ఎక్కారు.

“ఏంటయ్యా, కుర్రోడ్ని అప్పుడే కమ్యునిస్టూని చేసినట్టున్నావే” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“ఇప్పుడిప్పుడే మారుతూ ఉన్నాడు” అని కోనార్ నవ్వాడు.

“మరీ మంచిది, మీలో ఒకడు మిమ్మల్ని చంపితే మంచిదేగా?”

“దానికెందుకయ్యా వీళ్ళు? మా ప్రత్యర్ధి వర్గాన్ని పిలిస్తే పోలా? రెక్కలు కట్టుకుని వాలిపోతారు, ఏమంటారు?” అన్నాడు కోనార్.

“మీ ఇరు వర్గాలు విప్లవం కోసమే పోరాడుతున్నారు. మరి అటువంటప్పుడు ఇంకెందుకు మీలో మీకు గొడవలు? తిరువారూరులో ఒకడ్ని వేసేశారుగా?”

“విప్లవం రాకున్నా పర్వాలేదు, ప్రత్యర్ధివర్గం మాత్రం అడుగు పెట్టకూడదు. అదే మా పాలసీ, ఏమంటారు?” కోనార్ నవ్వాడు. “కాస్త మంచి నీళ్ళు ఇవ్వండయ్యా.”

మాణిక్యం మంచినీళ్ళు అందించాడు. ఆయన నీళ్ళసీసాని తీసుకుని గుటక్…గుటక్ అని తాగాడు.

జీపు ముందుకు వెళుతూ వుంది. ఇరువైపులా అడవి మౌనంగా వెనక్కెళ్ళుతుంది. కొండలు మెల్లగా ముందుకువెళ్ళాయి..

“ఈ దారిలో ఎనుగులుంటాయా? అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“ఇక్కడా? వర్షాకాలంలో కంటపడతాయి… కర్ణాటక ఏనుగు. దానికీ నీళ్ళు కావాలిగా? అన్నాడు కోనార్.

“ఈ కొండలపై రోడ్లన్నిటిని ఇకపై మరమ్మత్తు  చేయొద్దని పైనుంచి ఉత్తరువు…. ఇప్పుడే నడుం నొప్పితో ఇరిగిపోయినట్టువుంది…” అన్నాడు హెడ్ కానిస్టేబుల్. “ఇకపై గుర్రం మీదే స్వారీ చెయ్యాలి లాగుంది.”

“ఎందుకు? యుద్దటాంకుల మీదే పోతే పోలా? అన్నాడు కోనార్.

“మీ ముఖానికి ఈ డొక్కు జీపే ఎక్కువ.

“వచ్చేశామా?” అన్నాడు కోనార్.

“లేదు పోతూనే వుండండి, చోటు చెబుతామని ఉత్తరువు జారీ చేశారు” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“ఏం సినిమా చూశారు తమ్ముడూ?” అని అన్నాడు కోనార్

“ఈ మధ్య ఏం చూడలేదు” అన్నాడు మాణిక్యం.

“ఎందుకు?”

“రిజర్వ్ ఫారెస్టులో వుంది.”

“ఒక్కసారిగా రాత్రిలో లగెత్తి సెకండ్ షో చూడొచ్చుగా?”

“ఏమయ్యో కుర్రాడు చావడానికి దారి  చెబుతున్నావా?”

“మా వాళ్ళు మరి ఏం అంత నేర్పుగా వేటాడరులెండి….  బేవర్స్ గాళ్ళు సార్”

రీరీ అని సౌండ్ చేసింది వయర్లెస్.

“వచ్చింది” అన్నగానే చెయ్యి అడ్డుపెట్టి జీపును  ఆపమని చెప్పి దిగేసి అటువైపు నిలబడి మాట్లాడాడు హెడ్ కానిస్టేబుల్.

“ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ వస్తుందేమో?”  అన్నాడు కోనార్.

 మాణిక్యం గుండెలదరడం  మొదలయ్యాయి.

హెడ్ కానిస్టేబుల్  వచ్చి కూర్చుని  వెళ్ళవయ్యా అన్నాడు,  “అలాగే”

జీపు మట్టిరోడ్డు మీదుగా ముళ్ళ అడవి గుండా పెళ్ళిచేరుకుంది. కొండవోరగా వంపు. చెరువు అత్యంత లోతులో ఉంది. హొగనకల్ మీదుగా పారుతోంది కావేరి.

“ఒర లోంచి పైకి తీసిన కత్తిలా ఉంది కదూ”  అన్నాడు కోనార్..

“హుమ్”

“కావేరి… దాని నిండా నీళ్ళు. ఆ నీటిని పైకి తీసుకురావచ్చు.  అయితే చేసే మనిషే లేడు. ఈ జనానికి అడగడానికి నోట్లో నాలుక లేదు.”

“పైనుంచి దుమ్ము అలలా ఎగసిపడి పైకి రేగి రోడ్డును కమ్ముకుంది.  ఇంకోవైపు పల్లం.

“చూసి నడపండి… లేదంటే నాతోపాటు మీరు ముగ్గురు కూడా కైలాసం చేరుకుంటారు”

“ఊరుకోవయ్యా” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

ముళ్ళతో నిండిన అడవి.  ఒక అడవికోడి అడ్డంగా పరుగులు తీసింది.

“కోసి కూరవండితే యమరుచిగా ఉంటుంది” అన్నాడు కోనార్.

“మేము తినము” అన్నాడు మాణిక్యం.

“ఎందువలన?”

“వేటాడటం నేరం” అన్నాడు మాణిక్యం.

“అయితే ఊళ్ళోకెళ్ళి జనాలు పెంచే కోళ్ళు, మేకలు మాత్రం ఎత్తుకెళ్ళొచ్చు కదా?”

“సైలెంటుగా వస్తావా లేదా?”  అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“చివరి వాంగ్మూలంలా, కొన్ని చివరి జోకులు కూడా ఉన్నాయి…”

“నోరు మూసుకో.”

 “చివరిగా ఒక తిరుక్కురళ్  చెప్పొచ్చా? తిరుక్కురళ్?  తమిళప్రబంధం, ఏమనుకుంటున్నారో.”

“షటప్”

“భోక్తలకనువైన భుక్తినుత్పత్తికి, శక్తి వర్షమదియే భుక్తియౌను” అన్నాడు కోనార్. “మంచి పాట కాదు?  ఆ రోజుల్లోనే తుపాకీ గురించి పాడారు.”

వాళ్ళు ఒక కొండ దిగువకు చేరుకున్నారు. బండరాళ్ళతో చుట్టూ రాళ్ళు నిండిన ప్రదేశం. ఒక ఆవరణలా ఉంది.

“మంచి బండరాయి” అన్నాడు కోనార్.

“దిగు” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

మాణిక్యం కోనారుతో దిగాడు. డ్రైవర్ దిగి వచ్చినదారెమ్మట నడుచుకుంటూ కంటికి కనిపించనంత దూరానికెళ్ళి కనుమరుగయ్యాడు.

“తాళం తీస్తావా?”  అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

మాణిక్యం తాళం తెరిచాడు.  అతడి చేతులు వణికాయి. తాళంచెవి జారిపోయింది.

“నెమ్మదిగా, నాకేం కంగారు లేదు” అన్నాడు కోనార్.

అతడు ఆయనను బండికి తాళంవేసి ఆయన దగ్గరకు వెళ్ళాడు. హెడ్ కానిస్టేబుల్ ఒక సిగరెట్టును  వెలిగించుకున్నాడు.  కంగారులో అతని చేతులు, పెదవులు వణికాయి.

“ఏంటయ్యా?”

మాణిక్యం ఏం మాట్లాడలేదు. అతడికి గుండెలు అదురుతున్నాయి.

“ఏంటయ్యా, ఆ మనిషిని తాళం వేసి తాళంచెవిని తీసుకొని నాతో పాటు ఉంచుకోవాలని నాకు తెలియదా?  ఎందుకు నీకు ఇచ్చాను?”

మాణిక్యం దిగ్బ్రాంతితో చూశాడు.

“నువ్వు అనుకుంటే ఆ మనిషి తాళం తెరిచి వదిలేసుండొచ్చు…  ఆ మనిషికి ఈ అడవి కొట్టినపిండి…  తప్పించుకొనుండేవాడు.”

“అయ్యా!”

“మహా అయితే ఏముంది?  సస్పెన్షన్….  నాకొక సస్పెన్షన్. ఈ దరిద్రపుగొట్టు అడవిలో ఉండేబదులు ఒకవేళ అదే సరైనదారో ఏమోమరి”

“కాదు సార్!”

“బాధ్యత, ఏమంటావు?”

“సార్!”

“సరి సర్లే. వాడి తలరాత అంతే”  అని హెడ్ కానిస్టేబుల్  సిగరెట్టు  విసిరాడు. “మనం అతను దాకున్నటువంటి చోటును చూస్తున్నాం. సరెండర్ అవ్వమంటున్నాం. అతను కాల్పులు జరుపుతున్నాడు. మనం ఎదురు కాల్పులు జరుపుతున్నాం.  చనిపోతాడు. ఇదే కదా ఈ నాటకం ముంగింపు, అంతేనా?”

“సార్!”

“ఆ మనిషిని చిన్న బండరాయి పక్కన నిలబెట్టు…  నువ్వు ఇటువైపు వచ్చి నిలబడు…  ఇక్కడ నిలబడి కాల్చు.”

“నేనా సార్?”

“అవును నువ్వే…  నీకు వెంటనే ప్రమోషన్ దొరుకుతుంది.

 అతడేమి మాట్లాడలేదు.

“కానిస్టేబులుగా ఉంటే చివరి వరకు కానిస్టేబులే. రిటైర్ అయ్యేలోపు  హెడ్ కానిస్టేబుల్ అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ వచ్చి ఆ తర్వాత పైస్థాయికి వెళితే, డి.ఎస్.పి. వరకు అవ్వచ్చు…”

అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు.  అతని చేతిలో తుపాకీ వణికింది.

“ఇంకా కాల్చనేలేదు?”

“అవును సార్”

“నువ్వు బాగా గురిపెడతావని అన్నారు…పైగా కళ్ళు కూడా బాగానే ఉన్నాయి…. అతడు ఈ పక్కనే నిలబడతాడు… కాల్చు, తూటా తగులుతుంది…”

“సరే”

“సరే, వెళ్ళి తాళం విప్పేసి తీసుకురా”

“సరే”  అన్నాడు మాణిక్యం. అతని గొంతు తడబడింది.

“కాల్చేటప్పుడు  అతడు పరిగెత్తాలి…  అప్పుడే చూసేందుకు సహజంగా ఉంటుంది”  అన్నాడు హెడ్ కానిస్టేబుల్ “దానితోపాటు  మనక్కూడా  అందులో ఒక  చిన్న సంతృప్తి ఉంటుంది. పైగా కట్టేసి కాల్చితే,  తర్వాత మనకే లేనిపోని ఇబ్బంది అవుతోంది.”

“అలాగే సార్”

“వెళ్ళు” అన్నాడు  హెడ్ కానిస్టేబుల్.  అని ఇంకొక సిగరెట్టు వెలిగించాడు.

అతడు జీప్ దగ్గరకు వెళ్ళాడు. తాళం చెవితో సంకెళ్ళను విప్పాడు.  తడబడిన గొంతుతో “ అయ్యా,  నేను సంకెళ్ళు  విప్పి వదిలేస్తాను,  మీరు పారిపోండి”  అన్నాడు.

“వద్దు తమ్ముడు, మీకెందుకు లేనిపోని సమస్యలు?”

“ఏముంటుంది. ఒక సస్పెన్షన్ వస్తుంది అంతేగా. అది కూడా మంచిదే…  తిరిగి ఊరికే వెళ్ళిపోతాను.”

“మరి ఆయనకి ఏ సమస్య ఉండదా?”

“ఆయనే అన్నారు”

“వద్దు” అని నిట్టూర్పు  విడిచాడు.

“ఎందుకు,  అదేం లేదు… పారిపోండి” అన్నాడు మాణిక్యం.

“పారిపోవచ్చు. ఎలాగైతేనేం ఈ ఏడాదిలోపు మా ప్రత్యర్థి వర్గమే నన్ను చంపేస్తారు.  ఏమంటావు?  నాకది అవమానం.  ఏమంటావు? పోలీసు కాల్పుల్లో  చస్తేనే నాకు గౌరవం.  నేను ఆ పద్ధతిలోనే చావాలి. ఇక్కడ నాకొక  స్మారకచిహ్నం కూడా పెడతారు. ప్రతి సంవత్సరం అంజలి ఘటించేందుకు ఒకట్రెండు వ్యాసాలు కూడా రాస్తారు…  దానికోసమేగా ఇంతగా పాటుపడ్డాను…  ఏమంటావు?  అదే సరైన ముగింపు” అన్నాడు కోనార్.

“అయ్యా!” అని చేతులు పట్టుకున్నాడు మాణిక్యం.

“వద్దు తమ్ముడు…  నేను చావడానికి ఇష్టపడుతున్నాను. దానికి నువ్వు ఎటువంటి పాపబీతికి లోనుకావద్దు.  పైగా అది మీ డ్యూటీ. ఇది నా తలరాత.”

“అయ్యా!”  అన్నప్పుడు మాణిక్యం గొంతు పూడుకుపోయి, కన్నీరు ముంచుకొచ్చింది.

“చ..చ..  ఏంటిది?  ఇవన్నీ అవసరమా?  ఇదొక డ్రామా.  త్వరగా కానిచేద్దాం” అన్నాడు కోనార్.

“ఏంటయ్యా! ఇంకా ఏం జరుగుతుందయ్యా అక్కడ?”  అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

మాణిక్యం సంకెళ్ళను విప్పాడు. కోనారును నడిపించుకు వెళ్ళి ఆ చిన్న బండరాయి పక్కన నిలబెట్టాడు.

“ఏమయ్యా  వెనక్కి తిప్పి నిలబెట్టవయ్యా….  కళ్ళుచూస్తునా కలుస్తావ్?”  అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

“వెనకనుంచి చూసి నేను కాల్చలేను సార్.”

“నీ ఇష్టం” అన్నాడు హెడ్ కానిస్టేబుల్.  ఇంకొక సిగరెట్టును వణుకుతున్న చేతితో వెలిగించాడు.

 మాణిక్యం పక్కకు వచ్చి నిలబడ్డాడు. తుపాకీని తీసుకున్నాడు.

“ఇప్పుడే బేతాళుడి  చేతికి పని పడింది, ఏమంటావు?”

“సార్!”

“కాల్చు”

అతడు తుపాకీకి ఉన్నలాక్కును తీశాడు. ఆ శబ్దంలో కోనార్ శరీరం ఒక్క క్షణం అదిరిపడింది.  అతడి శరీరంలో ఒకవిధమైన వణుకు ప్రవహించింది. కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. ముఖం బిగుసుకుపోయింది.

“కాల్చవయ్యా”

మాణిక్యం గురి చూశాడు.  అతడు చెయ్యి ట్రిగ్గర్ పై వణికింది.  తుపాకీ జారిపోయేలా ఉంది.

“ఆర్డర్, షూట్!”  అన్నాడు హెడ్ కానిస్టేబుల్.

 మాణిక్యం కాల్చాడు.  తూటా గురితప్పి బండరాయికి తగిలి ముక్కలుగా చెదిరిపడింది.  రాళ్ళ గుట్టలు బూమ్…బూమ్ అనే శబ్దం చేశాయి.

కోనార్ కాళ్ళూచేతులు వణుకుతూ, శరీరం తుళ్ళి పడుతూ ఉక్కరిబిక్కిరయ్యాడు. ఆపై ఒక్క ఎగురు ఎగిరి పరుగెత్తడం మొదలెట్టాడు.

అతడు ఆయన రాళ్ళ మీద నుంచి ఎగిరి పరిగెత్తడం చూశాడు.  మళ్ళీ తుపాకీని ఎత్తి గురి చూసి కాల్చాడు.

 కొండలు దద్దరిల్లాయి. కోనార్ దెబ్బతిన్నవాడిలా ముందుకు తూలిపడి, మట్టిని కరుచుకొని, కాళ్ళు చేతులకు దుమ్ము కమ్ముకోవడంతో, గిలగిలా తన్నుకుని నెమ్మదిగా చనిపోయాడు.

అతడు తుపాకీని కింద పడేసి లేచి నిలబడ్డాడు. అతని కాళ్ళూచేతులు వణకలేదు. ఒక బీడీని నిదానంగా వెలిగించాడు.

హెడ్ కానిస్టేబుల్ పక్కకెళ్ళి ముందుకువంగి కోనార్ శరీరాన్ని తాకి చూశాడు. కుదిపి చూసిన తర్వాత లేచి, అతనికి బొటనవేలును చూపించాడు.

అతడు గుప్పున బీడీ పొగ వదులుతూ కొండలవైపు చూస్తూ నిలబడ్డాడు.

(ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈ కథ ఆధారంగానే విడుదలై సినిమాను తెరకెక్కించారు)

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.

Jeya mohan

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

jeyamohan.writer@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *