ఏకాంతసేవ

తిరుగనీనాటి కాంధ్రసారస్వతమునకు వసంతోదయమైనది; నవజీవము కలిగినది; నూతన రామణీయకము చేకూరినది. వల్లరులకొక క్రొత్త సౌకుమార్యము, చివురులకొక క్రొత్తమెత్తందనము, ప్రసవములకొక క్రొత్తకమ్మందనము, మకరందనముకొక క్రొత్తమాధుర్యము, కలకంఠమునకొక క్రొత్తకంఠస్వరము. ఈ వసంతము వనలక్ష్మికొక క్రొత్తశోభ, ఒక వింత సౌందర్యము, ఒక యపూర్వలావణ్యము !!! ఆంధ్రసారస్వతచరిత్రములో నొక నూతనశకము ప్రారంభమైనది. కవులు బయలుదేరినారు; ప్రాతకవులవంటి వారుగారు; గాన మొనర్చుచున్నారు; వెనుకటి వారువలెగాదు. విషయములో మార్పు; రీతిలో మార్పు, స్వరములో మార్పు; ఔను. కాలముమారినపుడు, కాలముతో బరిస్థితులన్నియు మారినపుడు, కవిత్వముమాత్రము మారకుండునా?

ప్రాచ్యపాశ్చాత్యనాగరికతాసమ్మేళనము వలన మనవారు క్రొత్తవారైనారు. వీరికి గొన్ని నూతనాశయములలవడినవి. వీరిలో గొన్ని విచిత్రలక్షణములు కనుపట్టుచున్నవి. కవులలోగూడ నంతే ; ఆంధ్రకవులలో గూడ నంతే. వీరు పాశ్చాత్య సారస్వత పఠనము చేయనక్కఱలేదు; చేయకున్నను మారిపోవుచున్నారు; మారిపోవుచున్నట్లు లెఱుగకయే మారిపోవుచున్నారు. మారిపోవుట తప్పక మారిపోవుచున్నారు; వాతావరణముతో మారిపోవుచున్నారు. ఎట్లు?

నవ్యకవులకు స్వేచ్ఛ ప్రాణము. వీరు ప్రాణమైన గోల్పోవుదురుకాని శృంఖలముల ధరింపరు. వీరికి బ్రాణముకన్న గానము తీపు-సంకెలలో సంగీతమా ! కట్టుబాటులో గవిత్వమా?

మఱియొక చిత్రము. వీరొకరికై కవనము చెప్పరు. వీరికి యశమక్కరలేదు; ధనధాన్యముల పైగోర్కిలేదు; ఇతరులానందింతురా యను నాతురత లేదు. వీరు గానము చేయుదురు. ఏలయన – గానము చేయవలయుగనుక చేయుదురు. పాడుట వీరి కూపిరి పీల్చుట, విడుచుట ఏల పాడుదురో వీరే యెఱుగరు. చందమామ యేల చంద్రికల వెదచల్లును? పూవులేల తావుల విరజిమ్మును? నీరమేల పారును? తెమ్మెరలేల విసరును? కోయిల యేల గొంతెత్తిపాడును? పరులదనియించుటకా? తన బాగునకా? పాడకున్న బ్రతుకుగడవకా? వీరు ప్రకృతికి బిడ్డలు. ఆమె యొడిలో నిద్రింతురు; ఆమెకడ మాటలాడ నేర్తురు; ఆమెతో మాటలాడనేర్తురు; ఆమె స్తన్యము గ్రోలుదురు; ఆమెతో నాటలాడుకొందురు. ఆమెను కౌగిలింతురు. ఆమె చిరునవ్వే వీరికి వెన్నెల. ఆమె పలుకులే వీరికి గోయిల కూతలు. ఆమె వదనమే వీరికి జంద్రమండలము. ఆమె చూపులే వీరికి జుక్కలు. ఆమెయే వీరి సర్వస్వము. ఆమె పాడును; గర్జించును; ఆమె నవ్వును; బొమముడిసేయును. ఆమె కౌగిలించును; దండించును. ఎటులైన నామెను వీరు విడువరు. వారిదములు, భూరుహములు, పులుగులు, పువ్వులు, మధుపములు, మారుతములు, నక్షత్రములు; నదులు వీరికి గూరిమి నెచ్చెలులు; ప్రాణబంధువులు.

మఱియు వీరు ప్రకృతిని సులోచనములతో జూడరు; కనులతో గాంచుదురు; వీరు ప్రకృతికి దూరముగ దొలగిపోరు; చెంతజేరుదురు. వీరి ప్రకృతి పుస్తకములలోని ప్రకృతికాదు; వీరు ప్రతినిమిషము జూచి ప్రేమించు ప్రకృతియే.

కనుక వీరికి విశ్వమున బ్రేమింపదగనిది, గౌరవింపదగనిది, వర్ణింపదగనిది యెయ్యదియు లేదు. ఘనాఘనగర్జనము, కప్పకూత; కలకంఠరుతము, కాకియఱుపు; కంజాతము; గడ్డిపోచ; మృగరాజము; మూషికము – అన్నియు వీరికి సమానములే. అన్నిటిలో వీరు సౌందర్యమరయుదురు; అరసి యానందింతురు, ఆనందించి గానముచేయుదురు; “సుందరమగు వస్తువే సంతతానందదాయక” మని (A thing of beauty is a joy for ever-Keats) గంతులిడుదురు. షేక్స్పియరన్నటుల వీరికి బాదపములు భాషణములు; సెలయేళ్ళు పుస్తకములు; శిలలు ధర్మోపన్యాసములు. వర్డ్సువర్తను కవి వ్రాక్రుచ్చినరీతి నెట్టి చిన్నపూవైనను వీరి హృదయముల గంభీరభావములను బుట్టించి కన్నీరు గురియింపజేయును.

To me the meanest flower that blows can give thoughts that do often lie deep for tears.

మఱియు వీరికి సార్వభౌముని గాథవలెనే సామాన్యుని కథకూడా వర్ణనీయము. నిరుపేద నిట్టూర్పు, కలుషాత్ముని కన్నీరు, చిన్నిపాప చిఱునవ్వు, కన్నతల్లి కంటిచూపు, కాపుకన్నె కలికివలపు – ఇయ్యవికూడ వీరికి బ్రబంధము రచియింపదగు విషయములే; ఒక్కొకదానిపై నొక్కక కావ్యము విరచింతురు.

ఇట్టి వీరి కవిత్వమునకు బ్రధానలక్షణము లెవ్వి? భావనశక్తి (Imagination); బుద్ధిసూక్ష్మతకాదు; దానికంటే ఘనతరము భావనాశక్తి. ఇది కనబడని వస్తువులగాంచగలదు. వినబడనిధ్వనులు వినగలదు. పోవలేని ప్రదేశములకు బోగలదు. దీని స్వచ్ఛంద విహారమునకీ విశాలవిశ్వము చాలదు. ఒకసారి తారకాకాంతలతో దాండవమాడించును; ఒకసారి మున్నీటితరగలలో ముంచివేయును; ఇక నొక్కసారి పవనునితో బరువెత్తించును; మఱియొక్కసారి వారిదములపై బ్రయాణముచేయించును; ఇపుడు సుమములతో సౌరభముల గురియించును; ఇప్పుడు మధుపములతో మకరందము ద్రావించును; సెలయేటితో గలగల మనిపించును; పులుగులతో కలకలపాడించును; బిచ్చగానితో దిరిపమెత్తించును; రాజాధిరాజుతో సింహాసనారూఢుజేయును. పాపాత్మునితో బాష్పముల బ్రవహింపజేయును; భక్తునితోబ్రహ్మసాయుజ్యము నొందించును. స్వరములో నేమున్నదో, సంచారములో నేమున్నదో, శిరఃకంపములో నేమున్నదో, చిఱునవ్వులో నేమున్నదో, హస్తచాలనములో నేమున్నదో, యపాంగవీక్షణములో నేమున్నదో, యియ్యదియే కవికి దెలియబఱచును. మనస్సులోమనస్సును జూపించును. హృదయములో హృదయమును వ్యక్తపఱచును. మబ్బు, గాలి, పక్షి, తుమ్మెదమున్నగునవి దీని జాతిలోనివే. దీనికి గాలముతోబనిలేదు; స్థానముతోబనిలేదు; వయసుతోబనిలేదు; వస్తుతారతమ్యముతో బనిలేదు. “బురదలో బోరలు కీటకముకూడ నీశ్వరసేవ దలయెత్తుచున్నది” అని షెల్లీ చాటించినాడు.

The worm beneath the God

May lift in homage of the God

రవీంద్రనాథుడు చాటినట్లు కాటికిగాలుచాచిన కవి సర్వసమవయస్కుడే.

All have need for me; and I have no time to brood over the after-life. I am of an age with each, what matter if my hair turns grey.

భావనాశక్తియే కవిని నూతనపథముల విచిత్రగతుల నడిపించును. అందువలననే యొక మహాకవి వెట్టివానిని, బ్రియుని, గవిని గలిపి ముడిపెట్టినాడు.

The lunatic, the lover, and the poet

Are of imagination all compact

వీరు గాలిలో మేడలగట్టుదురు; ఆకృతుల గల్పింతురు; ఆ యాకృతులకు నామకరణమొనర్తురు; నివాసస్థలము నిర్మింతురు. బ్లేక్కును వెట్టివాడని లోకము నిరసింపలేదా!

కాని యీ కవుల భావనాశక్తి వెట్టివాని వికృత కల్పనాసామర్థ్యముకన్న మిన్న. మఱియు నున్నతహర్మ్యముల వర్ణించుచు “నక్షత్రములు సౌధగవాక్షములలోనికి దూరి యచటి పిల్లలకు నాటవస్తువులైన” వనుట వికృతకల్పన. “ప్రద్యుమ్నుడు చిలుకచే బ్రియురాలికి సందేశము బంపె” ననుట భావనాశక్తి. మొదటిదానిలో గొప్పలేదు; రెండవది కవిత్వమున కుండవలసిన ముఖ్యలక్షణములలో నొకటి.

ఈ భావనాశక్తి ప్రతిమానవునికిని గలదు. అట్టిచో నందులును గవులౌదురా? కారు. దీనితో నితరపరికరములు కావలయును. సౌరభము లెగజిమ్ముటకు సమీరము కావలయును. తళతళద్యుతులు మెఱయుటకు వజ్రమునకు సానరాయి కావలయును.

తన్మయీ భవనయోగ్యత, భావోద్రేకము (Emotion) దీనికి దోడుగావలయును. కవి నొకవిధమగు నుద్రేక మూగింపవలెను; ఒక యావేశమావహింపవలెను. “దుఃఖమో, మోదమో, కోపమో, వలపో, యీర్ష్యయో, భక్తియో, యతనిని మార్చివేయవలెను. అతనిచే నతనినే మఱపింప జేయవలెను. అట్టిసమయమున నతడు వలవల నేడ్చును; పకపక నవ్వును; పిచ్చికేకలిడును; పాడును; నృత్యము చేయును.

“బాజాలురా నాన్న బాజాలు,

 బాజాలురా నాన్న బాజాలు,

బాజాలుతో వచ్చె పల్లకీ అదుగో,

పల్లకీలో ఉంది పార్వతీదేవి,

పార్వతీదేవికీ జేజేలు పెట్టు

 బాజాలురా నాన్న బాజాలు

బాజాలు వచ్చాయి బాజాలు”

అని గంతులిడు చిన్నబిడ్డ కొంతవఱకు గవియగుచున్నాడు.

“ఎందుకైతే వుంచినావో బందిఖానాలో”

అని మొఱపెట్టు రామదాసు కొంతవఱకు గవి యగుచున్నాడు.

“జుట్టులో పువ్వులూ పెట్టుకున్నావా,

ముత్యాలజూకాలు పెట్టుకున్నావా,

గజ్జెల్లమొలతాడు కట్టుకున్నావా,

వచ్చి ముద్దియ్యవే వరహాలతల్లీ”

అని వాత్సల్య పరవశయై పాడు తల్లి కొంత వరకు గవయిత్రియగుచున్నది.

కంటికీ కాటుకెట్టి, కడప చంకనుబెట్టి, కన్నీరు

కడవ నిండెనుగదరా, చల్ మోహనరంగా,

నీకు నాకు జోడు అయితే, మల్లెపూల తెప్పగట్టి,

తెప్పమీద తేలిపోదాం గదరా చల్ మోహనరంగా.

అని గానమొనర్చు ప్రణయస్వరూపిణియగు పల్లెపడుచు కొంతవఱకు గవయిత్రి యగుచున్నది. “జీరంగి నీలయేణి ! నిలిచి మాట్లాడవే

నిలసి మాట్లడవే, కలిసి ముద్దులియ్యవే,

పలకనైన పలకవే ! పంచదార చిలకవే”

అని తన ప్రేమోద్దేశము వెలువఱచు శబరకుమారుడు కొంత వఱకు గవి యగుచున్నాడు. “రెండుకాళ్ళూలేవు నారాయణా,

రెండుకళ్ళూలేవు నారాయణా,

 కట్టగుడ్డాలేదు నారాయణా,

కుడువకూడూలేదు నారాయణా,

నిలువనీడాలేదు నారాయణా”

అని దైన్యముగా విలపించు భిక్షకుడు కవివలె దుఃఖతన్మయత్వము నొందుటలేదా? కవిత్వమునకు గావలసినది భావనాస్ఫోరకత్వము, (Suggestiveness) హృదయాకర్షణము, రసోజ్జృంభణము.

కాని యిట్టిపాటలకు సారస్వతచరిత్రములో శాశ్వతస్థానము, గౌరవస్థానములేదు. ఏలయన – వీనిని బుస్తకమునజదివినప్పు డొక విలక్షణమగు గానము వెలువడదు; పాడినప్పుడే యివి బాగుగనుండును. వీనిలో నొకకొఱతగలదు. చక్కని పదములు లేవు; కూర్పులేదు; కవిత్వమునకు ఛందోబద్ధమగు “మనోహరశబ్ద సముదాయము” కూడ గావలయును.

కాని కేవలము గణయతిప్రాసనియమములు నిరర్థకములు; అస్వభావాలంకారము లనావశ్యకములు. “కలము పట్టినవారెల్ల గవులు కానేరరు. హృదయభావముల వెలువఱుపకున్న, నుచితరసపోషణము గావింపకున్న నది కవితగాదు. అష్టాదశవర్ణనములు, తలదిరుగజేయు కల్పనలు, బంధములు, పద్యములో బద్యములు, ద్వ్యక్షరత్ర్యక్షర ప్రాసములు నిట్టివిచిత్ర శబ్దచమత్కృతులన్నియు వ్యర్థ వాక్యావళీ విడంబనమే కాని మనోహర కవితాగానము కాదు” సంగీతమునందేమి, చిత్రలేఖనమునందేమి, కవిత్వమునందేమి, ద్వివిధములు కలవు. నయనములలో, శ్రుతిపుటములకో యానందముగలుగజేయునవికొన్ని – హృదయమును దన్మయత్వములోముంచివేయునవికొన్ని – రవివర్మపటములు మొదటిజాతిలోనివి : అవనీంద్రనాథ టాగూరుచిత్రములు రెండవజాతిలోనివి : కంఠమాధుర్యములేని సంగీతశాస్త్రజ్ఞుల రాగాలాపన మొదటిజాతిలోనిది : గవాయిపాట రెండవజాతిలోనిది. వసుచరిత్ర మొదటిజాతిలోనిది : భాగవతము రెండవజాతిలోనిది. ఆంగ్లేయసారస్వతములో “పోపు” కవిత్వము మొదటి జాతిలోనిది. షెల్లీ (Shelley) కవిత్వము రెండవజాతిలోనిది. మొదటిరకముకంటే రెండవరకము వేయిరెట్లు ఘనతరమని నా నమ్మకము.

అదియుగాక భావనాశక్తి యున్నపుడు, తన్మయీభవనయోగ్యత కలిగినప్పుడు పదముల ప్రయత్నముగ (Spontaneity) దొరలుచుండును. కవి వ్రాసినటుల :

“భావనాబలమున్నది ప్రకృతియున్న

దిష్ట ముండిన బదముల కేమి కొఱత ?

“నదీనదపదములు, కాసారపదములు, కేదారపదములు, సైకతపదములు ఆశ్రమపదములు, ఆరామపదములు, పట్టణపదములు” అన్నియు బదములె. అందువలననే యీ పరికరములన్నియు సమకూడినపుడే పద్యములు వ్రాయవలెనని కొందఱందురు. యుద్ధనిధిసభలకో, కాంగ్రెస్సుసభలకో, యే దొరగారిమీదనో, యే సాహేబుమీదనో, యేసెట్టిమీదనో యరగంటలో మొదటియక్షరముల జదివినచో నామమువచ్చునట్లును, దుదియక్షరములు జదివినచో దీవనవచ్చునట్లును “తయారు” చేయు పద్యములు పద్యములుకావు. సాధనసామగ్రియంతయును సమకూడినప్పుడే రచించు కావ్యములు మహోత్కృష్టములై యాచంద్రార్కముగ విరాజిల్లును.

తన పాటకన్న గవిగానమే హాయిగానున్నదని కోయిల యనుకొనుచున్నట్లు టెనిసను మహాకవి వ్రాసినాడు.

“….The nightingale thought

I have sung many songs but never a one so gay

For he sings of what the world will be

when the years have died away”

అట్టికవన విశ్వరవరప్రసాదమే, దాని సౌరభం నాఘ్రాణించుటకు గవిరాజచక్రవర్తియగు నాతడే తనయూర్పు నట్టెయాపునని యొక కవికుమారుడు గర్వముతో జాటినాడు.

“God holds his swift enchanted breath

To catch the fragrance on the wind.”

 – Narendranath Chattopadhya

ఏకాంతసేవ యట్టి మహాగ్రంథములలో నగ్రస్థానము నలంకరించువానిలో నొకటి. కవనమున కుండవలసిన లక్షణము లన్నియు నిద్దానికి సంపూర్ణముగ గలవు. నూతనాంధ్ర సారస్వతములో నిట్టికావ్యము వేడొకటిలేదని నా నమ్మకము.

ప్రభాతసమయమున బ్రియురాలగు భక్తుడు హృదయేశ్వరుని గూర్చి కోయిలయై గొంతెత్తిపాడుట : కళ్యాణగీతిలో నవశయై చిక్కిన కలకంఠిని గమనించిన కళ్యాణమూర్తి కనుమొఱంగుటచే, దుర్భరవిరహానలములో బరితపించు నామె ప్రణయాధినాధుని సందర్శనమునకై ప్రార్థించుట : “ఆత్మేశుతో నైక్యమందక యున్న నొక్కింతసేపైన నోపని యామె ప్రణయస్వరూపుని బట్టి తెచ్చుటకు బ్రణయవనంబులోపలి పుష్పరథములో” భ్రమరమే బాసటగా బయలుదేరుట : “పదిలమగు పాణిద్వయముతో, నిశ్చలమగు నేత్రయుగముతో, జెదరని చిత్తముతో స్వామినర్చించు పూజాద్రవ్యసమితితో” నామె యాయత్తయై యుండుట: “శ్రీ పుష్పయోగసంసిద్ధి చేకూరుటయు, యుగయుగంబుల నుండి మ్రోగు ననంతవిశ్వగానము నిత్యనూతనగానము-మఱలమఱల బాడినదే పాటగా నామె పాడుట… ఇయ్యది

“మధురముగ, మార్ధవంబుగా, మంజులముగ

మానసానందకరముగా, మంగళముగ”

మధురపదజాలముతో మనోహరముగ వర్ణింపబడినది: “నెమ్మినెఱజాణ లాటకత్తెలుగా, కోయిలలు తోడిగాయకులుగా, దేటిరొద శ్రుతిగా, నందనవనమునకు, మందాకినీ తీరమునను, ప్రభాతసమయమునను, చంద్రికా (పులకిత) యామినులను, నింగిపై నీలాల పేరు వ్రేలునట్లు, విశ్వమంతయు వెన్నెలతీగ ప్రాకునట్లు, దిక్కులన్నియు దివ్యగానములతో నిండునట్లు, ప్రకృతియంతయు బరవశ మగునట్లు” ప్రవిమల భక్తియుక్తుడైన భక్తుడు పరమేశ్వరుని గూర్చి పాడు ప్రణయగీతము, ఇది భాగవతమువలెనే పఠింపదగినది: ప్రేమింపదగినది: శిరసావహింపదగినది.

వేయేల? ఇది విమర్శనాతీతము, వంగభాషకు రవీంద్రుని గీతాంజలి యెట్టిదో, మనయాంధ్రమున కీ మహాకవుల భక్తుల యేకాంతసేన యట్టిదని నా యభిప్రాయము.

   *    *  *

దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *