“నేనెందుకు రాసేను?” అనే ప్రశ్న “నేనెందుకు పుట్టేను?” అనే ప్రశ్న లాంటిదనీ ఇటువంటి ప్రశ్నలకి సరియైన సమాధానాలు దొరక్క యుగయుగాల నించీ మానవుడు గిజగిజలాడుతున్నాడనీ ఆ మధ్య డాక్టర్ కె.వి.ఆర్. నరసింహంగారు చెప్పేరు. కాని వాటికి సమాధానాలు వెతకడం మానవులు మానరని కూడా ఆయన చెప్పేరు.
“ఎందుకు రాయడం?” అనే భోగట్టా అందరికీ తెలియడానికి వీలుగా ప్రతి రచయితా తనెందుకు ఫలానా కథ కాని కావ్యం కాని రాసేడో ఆనెస్ట్ గా నిజాయితీతో చెప్తే బావుంటుందని నాకు తోస్తోంది. వారు చెప్పినదాన్ని బట్టి అందులోంచి “ఎందుకు రాయడం?” అనే అసలు ప్రశ్నకి సమాధానం కొంతగానైనా లాగొచ్చునేమోననే ఆశకూడా నాలో ఉంది.
నా గురించి చెప్పవలిసొస్తే….
నా సాహిత్యపు లక్ష్యాల గురించి నేను చాలాకాలం వరకూ ఆలోచించలేదు. ఆలోచన ప్రారంభించిన తరువాతనైనా ఆ విషయం గురించి సరిగ్గా ఎప్పుడూ ఆలోచించలేదు. కనీసం, అందుగురించి పెద్దలు రాసిన గ్రంథాలైనా చదవలేదు. రాయడం మాత్రం కొన్ని కథలూ ఒక నవలా రెండు నాటకాలూ ఒక నాటికా రాసేన్నేను. “అవి ఏ ప్రేరణవల్ల రాయడం జరిగింది? ఏం సాధిద్దామని ఏ ఉద్దేశంతో అవి రాసేను? అవి ఎవరికోసం రాసేను” అనే ప్రశ్నలకి సమాధానాలు నాకు తెలిసినమట్టుకు, జ్ఞాపకం ఉన్నంతమట్టుకు, చెప్పడానికి ప్రయత్నిస్తాను. “ఎందుకు రాసేను?” అనే ఒక్క ప్రశ్నలోనూ ఈ మూడు ప్రశ్నలూ ఇమిడి ఉన్నాయని నే ననుకుంటాను.
మొదటిసారిగా నడక నేర్చుకున్న పిల్లణ్ని నడక నేర్చిన ఆ క్షణంలో (చాలా రోజుల క్రిందట) నేను చూడ్డం జరిగింది. అప్పటి ఆ పిల్లాడి సంతోషాన్నీ, ఉత్సాహాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. రాత్రి ఎనిమిదిగంటలయింది. హాల్లో విద్యుద్దీపం ధగధగలాడుతోంది. పడుతూ లేస్తూ పకపక నవ్వుతూ రెండు చేతులూ జాచి బాలెన్స్ చేసుకుంటూ నడిచే ఆ నెలల పిల్లడి సంతోషం, సంరంభం – ఆదృశ్యం అంతా కూడా నాకిప్పుడు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది.
నడవగలిగినందుకు సంతోషం ప్రకటించేడే తప్ప ఆ సమయంలో ఆ పిల్లడు “నడక ఎందుకు?” అనే విషయం గురించి ఆలోచించి ఉండడని మనందరికీ కూడా తెలుసు. ప్రతి మానవుడూ నడుస్తాడు. నడవాల్సిన అవసరానికి నడవ గలిగిన శక్తి అతనికుంది. ఆ తరువాత పెద్దవుతూన్న కొద్దీ “ఈ నడక ఎందుకోసం? ఎక్కడికి” అనే ప్రశ్న ఎదురువుతుంది. బడికి వెళ్ళడానికా లేక బడి ఎగ్గొట్టడానికా? స్నేహితుణ్ని మీటవటానికా? లేక అతను లేనప్పుడు అతని చెల్లెల్ని చెరచడానికా? అడవిలో ఆపదలో ఉన్నవాడి పెళ్లాన్ని ఎత్తుకుపోడానికా లేక అలా అందుకోసం వెళ్ళేవాణ్ని ఎదిరించి ఆపడానికా? ఆటకా, పాటకా, ప్రణయానికా, (సాయం విహారానికా) చోరీకా, జూదానికా, హత్యకా? పుణ్యానికా లేక పాపానికా? ఎందుకీ పిల్లినడకలు? ఎక్కడికి ఈ తొందర పరుగులు?
అనే ప్రశ్నలన్నీ ఆ తరువాత మనం వేసుకొని సమాధానాలు తెలుసుకోవలసుంటుంది.
అదే విధంగా…
రచనా శక్తి లేక కల్పనాశక్తి ప్రతి మానవుడిలోనూ ఉంటుందని నేను తలుస్తున్నాను. అది రకరకాల రూపాల్లో బైటపడవచ్చు. ఆ శక్తే కాని మానవుడికి లేకపోయినట్లయితే ఈ సంఘం ఈ నాగరికత ఈ పురోగమనం ఏదీ ఉండదనీ, మనకీ పశువులకీ మధ్య తేడా ఉండకపోననీ నేననుకుంటాను. ఊహా, కల్పనా ఉండబట్టే మానవుడు అంకెలు, అక్షరాలు, ఇళ్ళు, మేడలు, మరలు, మందులు, దీపాలు, పంకాలు, పాటలు, పుస్తకాలు, దయ్యాలు- దేవతలు అన్నింటినీ కనిపెట్టగలిగేడని నేను భావిస్తాను. ప్రకృతిని పరిశీలించడం, అందుమీదట వూహించడం అనే శక్తులు (లేక) గుణాలు పండితులకీ పామరులకీ అందరికీ ఉంటాయనీ, ఉన్నాయనీ నేను తలుస్తాను. అందర్లోనూ ఉన్నట్టే నాలో కూడా కల్పనాశక్తి (కొద్దిమేరకి) ఉందనీ, నన్నది అనేక రంగాల్లోకి దింపినట్టే కథల్లో కూడా దింపిందనీ నేననుకొంటున్నాను.
చిన్నప్పుడు రామాయణం భారతం కథలు వినడం వల్ల చిన్నప్పుడే కథలంటే నాకు సరదా కలిగింది. ఆ తరవాత (Bsthosi) అపరాధ పరిశోధక నవల్లు చదివేక నాకు సరదా హెచ్చయింది. నాక్కూడా ఓ డిటెక్టివ్ నవల రాయాలని సరదా వేసింది. మా అన్నయ్యకి తమ్ముళ్ళకి కూడా నాలాగే కథలంటే చాలా సరదా ఉండేది. అయితే వాళ్ళు నాలాగ కథ రాయడానికి ఎందుకు ప్రయత్నం చెయ్యలేదో నేను చెప్పలేను. మా అన్నయ్య బొమ్మలు బాగా వేసేవాడు. మా తమ్ముడు పద్యాలు చెప్పడానికి సరదాపడేవాడు. మా ఆఖరి తమ్ముడు అయిదోయేటనే పేకాట అద్భుతంగా ఆడేవాడు. నేను నా తొమ్మిది లేక యేట ఒక డిటెక్టివ్ నవల రాయడానికి ప్రయత్నించేసి పది పదిహేను పేజీలు రాసేను. పెద్దవాళ్ళలాగా మనవూఁ రాసేద్దాం అనే సరదాతోనూ, మా ఇంట్లోవాళ్ళ దగ్గర గొప్ప కోసవూఁ ఆ ప్రయత్నం చేసేనని ఇప్పుడు అనుకొంటున్నాను. నాకు తెలిసిన పరిసర ప్రాంతాల్లే అందులో వర్ణించినట్టుగా నాకిప్పుడు బాగా గుర్తుంది. మేం ఆ రోజులో విశాఖపట్నంలో బీచికి దగ్గిరగా ఉంటూ ఉండేవాళ్ళం. నేను రాయబోయిన ఆనవల్లో పత్తేదారు నారాయణరావు (మానాన్న గారి పేరు నారాయణమూర్తి) లైట్ హవుస్ నుంచి పూటగెడ్డవైపుకి నడుస్తూంటే (సాయంకాలపు నీడల్లో) బీచిని ఉన్న బ్రహ్మచెముడు డొంకలు బ్రహ్మరాక్షసుల్లా కనిపించేయి; సముద్రం పెద్దగా చప్పుడు చేసింది; ఈదురుగాలి హోరున వీచింది. అదీ నేను చేసిన కథా ప్రారంభం – కథా రచనకి అది నా ప్రథమ ప్రయత్నం.
“అది ఎందుకు రాసేను!” అని ఆలోచించి సమాధానం చెప్పాలంటే కొంత వరకూ కరక్టుగా చెప్పగలనని నేననుకుంటాను.
పెద్దలు చెప్పిన కథలు వినీ చదివి నాకు కథల్లో ఆసక్తి కలిగింది. పెద్దవాళ్ళని ఇమిటేట్ చేద్దామనే ఉత్సాహం అప్పట్లో నాకు చాలా ఉండేదని ఇప్పుడు నాకు బాగా స్పష్టంగా తెలుస్తోంది. అది అప్పుడు నాకు చాలా గొప్పగా కూడా తోచింది. ఆ కథరాయడం నేను మా ఇంట్లో వాళ్ళంతా చదవాలనే సరదాతో రాసేను. “నా కథ ఎవరూ చదవడానికి వీల్లేదు. నేను ఇదెవరికీ ఇవ్వను” అని నే రాసిన కాయితాలు ఎంత గట్టిగా పట్టుకు తిరిగినా, ఆ కాయితాలు మా యింట్లోవాళ్ళు బలవంతంగా లాక్కొని చదివితే బావుండునని అనిపించడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. వాళ్ళు చివరికి బలవంతంగా ఆ కాయితాలు లాక్కొని నేను రాసింది చదివి పకపకమని నవ్వినప్పటికీ నేను ఆ పాటైనా రాయగలగడం చూసి వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారని గమనించి నేను గర్వించడం నాకు చాలా బాగా గుర్తుంది. పెద్దలు నడిచినట్టు మనవూఁ నడవగలం అనే గొప్పతనం చాడ్డం కోసం ఆ కథ రాసేనని నేనిప్పుడు నమ్ముతున్నాను.
మా క్లాస్మేట్సు (సెకెండ్ ఫాంలో) కొంతమంది రాస్తున్నారని తెలియడంతో రాయాలనే సరదా నాకు హెచ్చయింది. “అబ్బూరి రాజేశ్వరరావు రాసేస్తున్నాడు; పన్యాల రంగనాధరావు రాసేస్తున్నాడు. మనం కూడా ఎందుకు రాయకూడదు!” అనే పోటీ స్పిరిటుతో నేను అతి రహస్యంగా కొన్ని కథలు పరపర రాసేసేను. అవి ఎవరికీ చూపించలేదు. తరువాత రోజుల్లో రసపుత్ర రాజులే మన అసలయిన తెలుగు రాజులని చెప్పి వాళ్ళంటే చాలా అభిమానం వుండేది. అంచేత రసపుత్ర వీరుల గురించి పెద్ద నవల రాసేద్దామని ఓ నలభై పేజీలు రాసి మరింక ఆ నవల ఎలా కొనసాగించాలో తెలియక ఆపేశాను. అది నేను థర్డుఫాం చదువుతున్నప్పుడు. ఆ రోజులలోనే నేను సెక్స్ తో నిండిన కథలు చదవడం జరిగింది.
సెక్స్ కథలు చిన్నప్పుడే చదివి జీవితం కొంతవరకూ పాడుచేసుకున్న వాళ్ళెవరయినా వున్నారో లేదో కాని నేను మాత్రం వున్నాను. ఈ కథల ప్రభావం అందరికీ చెడ్డగా పరిణమించకపోవచ్చు. నాలో మాత్రం అవి చెడ్డనే కలిగించేయి గాని మంచిని కలిగించలేదు. డాక్టర్ పావ్ లోవ్ గారు కుక్కని గంట మోతకి కట్టిపడేసినట్లు లేతవయసు పిల్లల్ని సెక్సు వాంఛలకి కట్టిపడేయటం చాలా సులభం అని నేను నమ్ముతాను. అది సులభమే కాని మంచిది కాదని నేను తలుస్తాను. అది నాకు చెడ్డ తప్ప మంచి చెయ్యలేదనే విషయం స్వానుభవం వల్ల నాకు బాగా తెలుసు. నా ఒక్కళ్ళో అటువంటి చెడ్డ కలిగించే ఉద్దేశ్యంతో వారు ఆ కథలు రాసివుండరని కూడా నేను నమ్ముతున్నాను. కాని ఆ కథలు చదవడం వలన ఆ తరువాత రోజులలో మనుచరిత్ర దగ్గరనుంచి మైదానం వరకూ ఏ పుస్తకం చదివినా సెక్సుకోసం తప్ప మరొకందుకోసం నేను చదవలేకపోయాను. అటువంటి పుస్తకాలు చిన్నప్పుడే సెక్సు కోసమే చదవడం వలన నేను కొన్ని తప్పుదార్లు పట్టడం జరిగింది.
అటు తరువాత నా రచనలలో కూడా కొన్ని తప్పుదార్లు తొక్కడం జరిగింది. “బూతుగా రాస్తే రాస్తాను. నాయిష్టం. నువ్వెవడివి అడగడానికి? చదువుతే చదువు లేకపోతే ఫో” అనగలిగిన నిర్లక్ష్యం కూడా ఆ తరువాత నాలో పెరిగింది. చెలరేగిన కామ ప్రభావం వలన నేను చిన్నప్పుడు “ఏది రాస్తేనేం? నాయిష్టం వచ్చింది నే రాస్తాను” అనే నిర్లక్ష్యం వలన పెద్దయ్యాక కూడా సెక్సీ కథలు రాసేను. నేను నా పదిహేనోయేట “దేముడు చేసేడు” అని ఓ కథ రాసేను. నా అచ్చయిన కథల్లో అదే మొదటిది. పేదింటి ఆడపిల్లని చెరిచిన పెద్దింటివాడ్ని పాము కరుస్తుంది. వాడు చచ్చిపోతాడు. అదీ కథ. అందులో ఆ పేదింటి ఆడమనిషిని వర్ణించినప్పుడు పాఠకుల్లో కామ భావాలు కలిగేలా నేను కోరి వర్ణించేను. అంతకు ముందు కూడా నేను కొన్ని (అచ్చవని) అటువంటి కథలు రాసేను. అంత చిన్న వయసులో ఆ విధంగా రాయడం అది చాలా మేరకి నాతప్పే అయినప్పటికీ, చిన్నవాళ్ళకి పెద్దపుస్తకాలు అందుబాటులో వుంచిన పెద్దల సంఘానిక్కూడా ఆ తప్పుకి కొంత జవాబుదారీ వుందని నేను అనుకొంటూ వుంటాను.
లోకంలో డబ్బున్నవాళ్ళూ డబ్బు లేనివాళ్ళూ ఉంటారనీ, వాళ్ళకీ వీళ్లకి మధ్య చాలా తేడాలుంటాయనీ నాకు తొమ్మిది లేక పదోయేట నుంచీ బాగా తెలుసు. డబ్బులో వుండే సౌఖ్యాలూ, లేమిలో వుండే దుఃఖాలూ, ధనం కల్పించే గొప్ప గర్వం మదాంధతా, లేమి కల్పించే నిస్పృహా నైచ్యం దైన్యం అవన్నీ కూడా నా జీవితం లోంచి నేను తెలుసుకొన్నాను. అదంతా చిన్నప్పుడే (అస్పష్టంగా అయినా) తెలుసుకోవడంచేత యిప్పటికి కాని స్వతహాగా డబ్బుగలవారి కుటుంబాలకే చెంది వాళ్ళమధ్యనే వుంటూ కూడా నా మనసుని ఆ బాధ ఆ ఆవేదన పట్టుకు వదలటం లేదు. మరింక వదలదు. కారణాంతరాలవల్ల డబ్బులేనివాడుగా అవడం వల్ల నాలో పరస్పర విరుద్ధమైన వాంఛలూ, సరదాలూ, చింతలూ చిరాకులూ, ఆశలూ నిరాశలూ, నిర్లక్ష్యతా బాధ్యతా అన్నీ ఒకేసారిగా ఉంటూ వచ్చేయి. వాటిని వ్యక్తీకరించడంలో నాలోనించి రకరకాల కథలొచ్చేయని నేను తలుస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ కూడా నాకు కుష్ఠురోగాన్ని చూస్తే ఎంత భయమో దారిద్య్ర్యం అంటే అంత భయం. దారిద్య్రం ఎవ్వరికీ, నా పగవాడిక్కూడా, ఉండకూడదని నేను అనుకొంటూ ఉంటాను. నేను పేదవాళ్లని చాలామట్టుకు క్షమించగలను. కాని డబ్బున్నవాళ్ళని క్షమించలేను. తెలిసి కూడా తమ సాటివారికి ద్రోహం చేసే పేదవాళ్ళని క్షమించలేను. డబ్బు సంపాదించేక పేదవాళ్ళని మర్చిపోయిన (పేద) వాళ్ళని క్షమించలేను.
నా పదిహేనోయేట, నేను చార్లెస్ డికెన్స్ నవలలు చదవడం ప్రారంభించేను. సెక్సీగా లేకపోయినా ఆయన నవలలు బాగానే ఉన్నాయనిపించేయి! నాలో “మంచి” అంటూ ఏదైనా ఉంటే అందుకు డికెన్స్ మహాశయుడు కొంత కారణం అని నేను నమ్ముతాను. జీవితంలో మంచి మనుషుల్నీ చెడ్డమనుషుల్నీ కళ్ళక్కట్టినట్టు నాకు ఆయన చూపించేరు. “మంచి” యెడల నాకు ఉండే అభిమానాన్ని ఎక్కువ చేసేరు. డికెన్స్ గారి నవలలు చదివేక నాకు ఆయనలా నవల్లు రాసేయాలనిపించేది. 1938-1941 మధ్య నేను రాసిన కథల్లో ఆయన ప్రభావం కనిపించకపోవచ్చు. కాని పేదవాళ్ళ గురించి రాయాలనీ రాయొచ్చుననీ నాకు డికేన్స్ గారి వల్లనే తెలిసింది. ఆ తరువాత 1938-42 మధ్య నేను వోడ్ హవుసు గారి నవల్లు చదివేను. ఆయన విషబాహువుల్లోంచి నేను బైటపడేసరికి చాలా కాలం పట్టింది. నల్లవాళ్ళ పీకలమీంచి తమ సామ్రాజ్య రథాన్ని నడిపించుకుపోయిన బ్రిటిష్ ప్రభువులు “నిజంగా (??) ఎంత మంచివాళ్ళు! ఎంత అమాయకులు! వాళ్ళ సరదాలు ఎంత ఇన్నోసెంటు! వాళ్ళకి ఎవరైనా అంటే ఎంత దయ, ఎంత జాలి!” అనే అభిప్రాయాలు (కథల్రాయాలనే సరదాతో పాటు) వోడ్ హవుసుగారు నాలో కలిగించేరు. కథ వ్రాయాలనే సరదా నాలో ఎక్కువ అవడానికి మరోకారణం నేను ఆంటన్ ఛెకోవ్ గారు రాసిన కథలు చదివేను. శ్రీశ్రీశ్రీగారు గేయాలు రాసినట్టుగా అటువంటి చక్కటిభాషలో ఛెకోవ్ గారు రాసిన కథలవంటి కథలు రాసేయాలని నాకు కోరిగ్గా ఉండేది.
ఛెకోవ్ గారు రాసిన “మిజరీ” అనే కథ ‘దౌర్భాగ్యం’ అనే పేరిట అప్పట్లో నేను అనుసరించేశాను. ఆ రోజుల్లో నేను రాసిన కథలు ఎక్కువే అయినప్పటికీ పబ్లిష్ అయినవి చాలా తక్కువ. మహాత్మాగాంధీగారు చదువుకున్న వారంతా పల్లెటూళ్లుపోయి పల్లె ప్రజల్ని బాగుచెయ్యాలనేవారు. దాని గురించి నేను కథ రాసేను. మా తుమ్మపాల గ్రామంలో కొత్తగా పంచదారమిల్లు పెట్టేరు. వెంటనే నేను ఒక కార్మికుడి కష్టం గురించి కథ రాసేను. “నిష్కల్మషమైన ప్రేమ” గురించి నేను చాలా కథలు చదివేను. అటువంటి ప్రేమ గురించి నేనూ ఓ కథ రాసి పారేసేను. ఆ రోజుల్లో ఎంత చదివి ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఉద్యోగం సంపాదించడం మాత్రం కష్టంగా ఉండేది. ఆ విషయం గురించి “పంజరంలో చిలక” అని నేనో కథ రాసేను. ఈ కథలు నా క్లాసుమేట్సు, స్నేహితులూ, తెలిసినవాళ్ళూ చదువుతే నాకు చాలా సరదాగా వుండేది. పైవాళ్ళెవరో ఎక్కడో చదవొచ్చునని తెలిసినా, వారి గురించి నేనెప్పుడు ఆలోచించలేదు. నేను రాసిన కథలు మా బంధువులంతా చదవాలని నాకు చాలా కోరిగ్గా ఉండేది. అదంతా ఆ రోజుల సంగతి.
1941 సం॥రం తరువాత ఏడెనిమిదేళ్ళ వరకూ అంటే 1948-49 వరకూ నేనేమీ రాయలేదు. రాయాలనే సరదా నాకు చిన్నతనంలో ఎక్కువగా ఉండేది. బాగా రాయగలనని కూడా నేను అనుకొనేవాణ్ని. ఆ తరువాత ఓ రోజున నేను రాసిన కథలు గురించి తల్చుకుని నాకు చాలా నవ్వొచ్చింది. ఏదైనా బాగా రాయడం అటుంచి కనీసం, బొక్కిగా కూడా నేనేదీ రాయలేనని నా కెందుకోగాని అనిపించింది. దానితో రచనా ప్రయత్నం చాలాకాలం ఆపుచేసేసేను.
ఒకానొకప్పుడు నేను కథలు రాసేననే సంగతి నాకు ఆ తరవాత అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూండేది. ఆ సంగతి ఓ నాడు నేను నా భార్యతో చెప్పేను. ఆమె నన్ను చాలా క్యూరియాసిటీతో చూసింది. నేను కథ వ్రాయగలిగి ఉండడం ఆమెకి చాలా గమ్మత్తుగా తోచింది. నేను సర్కస్ బఫూనుగా ఉండేవాణ్నని చెప్తే వింతపడ్డట్టు ఆమె చాలా వింతపడిపోయి, “ఓ కథ రాయకూడదూ?” అంటూ తిరిగి ఆ నా పాత ట్రిక్కులొకసారి చూపించమన్నట్టుగా రోజూ అడుగుతూ ఉండేది. ఆమె గురించి తిరిగి నేను కథయడంలోకి దిగేను. అటుతరువాత రాసిన చాలా కథలు ఆమె చదవడం కోసవేఁ రాసేను. ఆ కథలు పైవాళ్ళు చదివి ఆనందించాలని నేనెప్పుడూ అనుకోలేదు.
నా భార్య కోరిన మీదట ఏం కథ రాద్దామా అని ఆలోచించేను. కాని నాకేమీ తట్టింది కాదు. అప్పట్లో నేను మతకలహాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాణ్ణి, హిందువులూ, మహమ్మదీయులు పొడుచుకు పొడుచుకు కొన్ని లక్షల మంది చచ్చిపోయేరు. ఈ ఈర్యలూ అసూయలూ, ఈ తీవ్ర కోపాలూ ఘోరద్వేషాలు మనుషుల్ని పట్టుకుని మరింక ఎన్నటికీ వదలవేమోనని అనిపించేది. చచ్చి దెయ్యాలయితేనే తప్ప, బతికుండుగా మాత్రం మనుషులు మంచికి మారరనే అభిప్రాయం నాలో కలిగింది. ఆ విషయం తెలియజేస్తూ “దయ్యాలకు ద్వేషాలేవు” అని ఓ కథ రాసేను. ద్వేషాలు మనిషిని వదలవు మనుషుల కంటే దయ్యాలే నయం అని ఈ కథలో చెప్పేన్నేను. ఆ కథ మా ఆవిడి అంతగా నచ్చలేదు. మనుషులు కంటే దయ్యాలే నయం అంటే ఎలా నచ్చుతుంది? నచ్చలేదు. కాని ఖాళీ బుట్టలోంచి గారడీవాడు కుందేల్ని లాగినట్లుగా ఖాళీకాయితం మీద నేనే కథ అల్లగలగడం ఆమెని ఆశ్చర్యచకితురాలను చేసింది. ఈ ట్రిక్కు ఆమెకోసం నేను చాలాసార్లు రిపీట్ చేసేను.
కథ రాయడం నాకదో తమాషాగా ఉండేది; అందుచేత తమాషా కథలు రాయడానికి నేను ప్రయత్నం చేసి ఆ కథలు రాసేను గాని అవి బాగా రాయలేక పోయేను. సెక్సు రాయడం సులభం కాబట్టి సెక్సు మిళాయించి కొన్ని కథలు రాసేను. సెక్సు వెదజల్లటం తప్పు అని తెల్సినప్పటికీ అదేమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా రాసేను. అది కొంతమందికి తప్పవొచ్చునేమోగాని “మనకి” తప్పు కాదని సమాధానం చెప్పుకొని సమర్థించుకొని సరిపెట్టేసుకొనేవాణ్ణి. నేను ఏదో విధంగా ఎక్కువ్వాళ్ళ జాబితాకి చెందిన వాణ్ణని అనుకొంటూ వుండేవాణ్ణి. పుట్టుక చేతా డబ్బువల్లా “ఎక్కువతనం” రాదని మాత్రం నేను అప్పుడు కూడా నమ్మేవాణ్ణి. మరైతే నీ “ఎక్కువతనం ఎందులో వుందీ?” అని ఎవరైనా ఆ రోజులలో అడిగివుంటే “మనం చాలా మందికంటే హయ్ లీ కల్చర్డ్ గదా.” అని సమాధానం చెప్పి ఉండేవాణ్ణి “హయ్ కల్చర్ అంటే ఏఁవిఁటి?” అని కాలర్ పట్టుకు నిలదీసి అడిగితే మాత్రం సమాధానం చెప్పి ఉండలేక పోయేవాణ్ణి.
నా గురించి నేను ఎంతటి ఎక్కువ్వాణ్నని అనేసుకున్నప్పటికీ ఆర్థికంగా చాలా తక్కువ్వాణ్నని ఆ రోజుల్లో నాకు బాగా తెలుసు. నా జీవితం చాలా ఇబ్బందులతో కూడుకొని కలతలలో నిండిపోయి ఉండేది. నాకు చాలా చిరాగ్గా గ్లూమీగా ఉండేది. అందుచేత నేను ‘ఎక్కువ్వాళ్ళ’ నిర్లక్ష్యంతో బేఖాతరు కథలు రాస్తూనే “తక్కువ్వాళ్ళ” చింతలతో కూడుకున్న కథలు కూడా రాస్తుండేవాణ్ణి. నాలోని సారోని నేను బాగా ఉండలేకపోయుండొచ్చు. ఆ సారో కథలు అందరూ కాని, నా భార్యతప్ప ఎవరైనా వ్యక్తం చేసి చదువుతారని చదవాలని కాని నేను స్పష్టంగా అనుకోలేదు. అటువంటి “ఇబ్బంది కథలు” రాస్తే చదివి ఆనందించే వాళ్లుంటారని నేను తలంచలేదు కూడాను. అసలు కథలు ఎవరూ ప్రకటించరేమోననే డిఫిడెన్సుతో కూడా నేనా కథలు రాసేను. “విలువలు” “నీడలు” “మెరుపు మెరిసింది” “జరీ అంచు తెల్లచీర” “ఇద్దరు పిల్లలు” “కిటికీ” వగైరా కథలు నేను ఆవిధమైన మూడ్లోనే రాసేను.
1952 సం॥రంలో “అల్పజీవి” అనే నవల రాసేను. చిన్నవాళ్ళకి చిన్నతగవులే మహావిషమసమస్య అవుతాయనే సంగతి మాత్రం నేను ఆ నవల్లో తీసుకున్నాను. అంతే చెప్పదలచుకున్నాను. “ఏ పరిస్థితుల్లో ఏ మనుషులు ఎందుకు ఏ విధంగా ప్రవర్తిస్తారు?” అనే విషయం గురించి నేను అప్పట్లో గట్టిగా ఏమీ ఆలోచించలేదు. ఆ నవల రాయడానికి ముందు నేను కొన్నాళ్ళపాటు ఓ వెయ్యిమంది గుమాస్తాలతో కలిసి పనిచేసేను. గుమాస్తాలు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. అందుచేత ఆ నవల్లో చిన్నవాడిగా చిత్రించడానికి గుమాస్తా పాత్రని తీసుకున్నాను. నవల ప్రారంభించినప్పుడు గుమాస్తా యెడల సానుభూతి తెలియజేద్దామనుకున్నాను. కాని నవల చివరికి వచ్చేసరికి ఆ పాత్ర యెడల నాకు సానుభూతి చాలా తగ్గిపోయింది. ఎందుచేత తగ్గిపోయిందో మాత్రం నేను తెలుసుకోలేకపోయాను. ఆ నవల పెద్దలయిన వారెవ్వరూ చదవగలరని నేను అనుకోలేదు. పనీపాటూలేని కుర్రవాళ్ళెవరైనా చదవగలరేమో అనుకున్నాను. ‘పెద్దవాళ్లు’ అంటే ‘భారతి’ పాఠకులని అప్పట్లో నా లెక్క ‘భారతి’ వారు ఆ నవల ప్రచురిస్తామంటే నేను చాలా ఆశ్చర్యపోయేను. ఆ నవల మారుపేరుతో కాకుండా నాపేరుతోనే పబ్లిష్ అవడం నాకు చాలా సిగ్గువేసి చిరాకువేసింది. ఇప్పుడు మారుపేరు వాడ్డం మానేసేను. సిగ్గుపోయింది. చిరాకు మాత్రం మిగిలిపోయింది. కథకులు “గొప్పవాళ్లు” అనే నా చిన్నప్పటి భావన పూర్తిగా తుడుచుకుపోయింది.
“అల్పజీవి” నవల రాసిన పిమ్మట నాచదువ్వల్ల వచ్చిన అనుభవం నా మిగతా జీవితానుభవానికి జోడించి కొన్ని విషయాలు తెలుసుకున్నా లేకపోయినా తెలుసుకున్నానను కొంటున్నాను.
లోకంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. (విస్ మేజర్ మినహా) చాలా అన్యాయాలకి మానవులే కారణం. ఈ అన్యాయానికి కారణం ఇదీ అని తెలిసినవాళ్ళు చాలామందున్నారు. అన్యాయాలవల్ల లాభాలు పొందుతూన్నవాళ్ళు అసలు కారణాలు చెప్పరు. అన్యాయాలకి భయపడ్డవాళ్ళు (అసలు కారణాలు తెలుసుకున్న వాళ్ళయినప్పటికీ) అసలు కారణాలు చెప్పరు, ఈ అన్యాయాల వల్ల దెబ్బతినేవాళ్ళకి అసలు కారణాలు సరిగ్గా తెలియవు; తెలుసుకొని అన్యాయాన్ని ఎదిరించబోతే, లాభాలు పొందేవాళ్ళు వాళ్ళని అణచి పారేయడానికి ప్రయత్నం చేస్తారు. అన్యాయాన్ని ఎదిరించేవాళ్ళు చిట్టచివరికి, అన్యాయాలవల్ల బాధపడే వాళ్ళే అవుతారు కాని మరొకరు అవరు.
నేనే తెలుసుకున్న (తెలుసుకున్నాననుకుంటూన్న) విషయాలు చాలా మందికి తెలిసిన అవొచ్చు. కాని ఈ సంగతులు తెలిసిన తరవాత నా చుట్టూ జరిగే విషయాలు నాకు కొంత స్పష్టంగా బోధపడసాగేయి. బోధపడ్డ విషయాలు కథ రూపంలో కనిపించసాగేయి. కుక్కపిల్లా వగైరా కథల్లోనూ “ఆరు సారా కథ” ల్లోనూ “నిజం రాసేను. ఇవి రాసినప్పుడు (రాస్తూన్నప్పుడు కూడా) అదివరకు అంతగా లేని సరదా నాటకంలోనూ “విషాదం” నాటికలోనూ ఈ విషయాలు చెబుదామనే సరదాతో. ఒకటి నాలో పుట్టుకొచ్చింది. (లేదా ఎక్కువయింది). ఇవి అందరూ చదువుతే బావుండునని అనుకుంటూ ఉండేవాణ్ని. అవి రాస్తూన్నపుడు “ఇది శ్రీశ్రీ చదువుతే ఏమంటారు?’ కొడవటిగంటి ఏమనుకుంటారు? కాళీపట్నం రామారావు బావుందంటారా, అనరా?” అని ఈ విధంగా అనుకొంటూ ఉండేవాణ్ణి. రాస్తున్నప్పుడు రచయితకి అస్పష్టంగా అయినా ఏదో ఒక ఆడియన్సు ఉంటుందని నేను అనుకుంటాను.
నాకోపం, తాపం, నా దుఃఖం, సంతోషం, నా సరదా, నా క్యూరియాసిటీ వగైరాలు ఇతరులకి తెలియచెయ్యడానిక్కూడా నేను కథలు రాసేనను కొంటున్నాను. నా మీద నాకు ఉండే అసహ్యం కొద్దీ కూడా నేను కొంతగా రచన చేసేను. అగ్గిపుల్ల అనే కథలో శేషగిరిలా నేను ఉండగలనని నాకు నమ్మకం ఉంది. అటువంటి వాళ్ళంటే నాకు అసహ్యం. అసహ్యం ఈ కథలో వ్యక్తం అయిందని నేను తలుస్తాను. రొట్టెముక్క అనే కథలో వచ్చే మూర్తి కవిలాంటివాళ్ళని చూస్తే నాకు ఇష్టం లేదు. వాళ్లు దొంగ రచయితలని నా అభిప్రాయం. అలా నేను ఎప్పటికీ ఉండకుండా ఉండేందుగ్గాను ఇటువంటి పాత్రని నాకు చిత్రించుకొని అటువంటి వాళ్ళమీద పర్మనెంటు అసహ్యాన్ని పెట్టుకున్నాను.
నేను అడ్వకేట్ ని . ప్రాక్టీసు చేస్తున్నాను. కోర్టుకి వెళ్ళిన కొన్నాళ్ళ వరకూ కూడా నాకు దేవుడంటే చాలా భక్తి ఉండేదని చెప్పాలి. (ఇప్పటికీ దేవుడు ఉన్నాడనే నమ్మకం పూర్తిగా పోలేదేమో) ఎవరి మట్టుకువాళ్ళు తమకి సాయం చెయ్యాలని దేవుణ్ని ప్రార్థించకూడదు. అది స్వార్థం, అందరూ బాగుండేట్లు చెయ్యమని భగవంతుణ్ని మనం ప్రార్థించాలి – అని చిన్నప్పుడు మా ఇంట్లోవాళ్ళ వల్ల నేను నేర్చుకున్నాను. అందుచేత నేను దేవుణ్ని ప్రార్థించినప్పుడల్లా భూలోకాన్ని అతడు ఆశీర్వదిస్తున్నట్లుగా రూపకల్పన చేసుకొని ప్రార్థించేవాడ్ని. అప్పటి నా ఆవేదన ఇప్పుడు తల్చుకొంటూంటే నాకు ఏడుపూ నవ్వూ కూడా వస్తాయి. కోర్టుకి వచ్చిన కొన్నాళ్ళకి (నాకు) సంఘాన్ని ప్రస్తుతం నడిపించే శక్తులు దుర్మార్గపూఁ, దౌర్జన్యపూఁ, దోపిడి, అబద్ధం, అన్యాయం అని నా కంటికి స్పష్టంగా కనిపించింది. న్యాయం కోసం, నిజం కోసం ఎంత విలవిల్లాడి, ఎంతటి తహతహతో భగవంతుణ్ని ప్రార్థించినా లాభం ఉండదని నా అనుభవం వల్ల నాకు తోచింది. అందుమీదట నా మనసు చాలా కష్టపడింది. దేవుడి యెడల రోజు రోజుకీ నాకు నమ్మకం తగ్గిపోసాగింది. (దేవుడు ఉన్నాడనే ప్రిజమ్ప్షన్ మీద) అతడంటే కోపం రాసాగింది. చివరికి దేవుడు ఉన్నప్పటికీ కూడా పేదవాడికి సాయం చెయ్యడనే నమ్మకం నాకు గట్టిగా కలిగిపోయింది. అతని మీద నాకు ఉండే దుఃఖం వ్యక్తం చేస్తేనేగాని నేను ఉండలేకపోయాను. ఆరు సారాకథల్లోనూ నిజం నాటకంలోనూ ఎండ అనే కథలోనూ విషాదం అనే నాటికలో కొంతగానూ నేను నా విసుగునీ దుఃఖాన్నీ వ్యక్తం చేసుకున్నాను. దేవుడు లేడనుకోడం కంటే దేవుడు ఉన్నాడనుకోడమే నాకు ఒకప్పుడు ఇష్టంగా ఉంటుంది; లేడనుకొంటే ద్వేషించడానికి నాకెవరూ ఉండరు. ఎంచేతనంటే రాజుని ద్వేషించడం కష్టం (ప్రమాదం); దేవుణ్ని ద్వేషించడం సులభం. (ప్రస్తుతం కొంత ప్రమాదరహితం) కాని మానవులు మానవుల్ని పెట్టే బాధల గురించి (చాలా మంది ఉన్నాడనుకునే) భగవంతుణ్ని ప్రార్థించి కాని నిందించి కాని ప్రయోజనం లేదని నేను తెలుసుకున్నాను, నమ్ముతున్నాను. నా నమ్మకం ఇతరులకి తెలియజేయాలనే కోరిక నాలో ఎందుకు కలిగిందో నేను స్పష్టంగా చెప్పలేను. ఒకరు తెలుసుకున్నాననుకున్న విషయాలు ఇంకొకరితో చెప్పడమే లేకపోతే చెప్పాలనే కోరిక లేకపోతే మనుష్యులం ఈ విధంగా ఉండనే ఉండము.
“ఎందుకు రాసేను?” అనే ప్రశ్నకి నాకు తెలిసిన సమాధానం చెప్పేను. “ఎందుకు రాయాలి” అనే ప్రశ్నకి సరైన జవాబు నాకు తెలియదు; (లేక) నాకు తెలిసిన జవాబు సరైంది కాకపోవచ్చు. కాని, చెప్పుకుందికి ప్రయత్నిస్తాను.
లోకంలో మంచి చెడ్డా అనేవి ఉంటూ వస్తున్నాయి. వాటి మధ్య నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ పోరాటపు స్థాయి ఒకప్పుడు ఉన్నంత తీవ్రంగా ఇంకొకప్పుడు ఉండకపోవచ్చు. కాని మంచి చెడ్డల మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంటుందని నేను అనుకుంటాను.
ప్రతి రచయిత కూడా రెండు, మూడు లేక ఎన్నో కొన్ని మజిలీలు చేసి చివరికి ఈ మంచి చెడ్డల క్రాస్ రోడ్సుకి వస్తారనీ రాక తప్పదనీ నేను నమ్ముతాను. అప్పుడు అతను పాఠకుడికి తను ఏ మార్గం చూపించాలో నిశ్చయం చేసుకుంటాడు. ఆ దారంట వెళ్ళమని అందరికీ చెప్తాడు.
గొప్ప ప్రతిభ గల రచయితలు అని చాలా మంది వప్పుకునే రచయితలు కొంతమంది ఉన్నారనేది నిర్వివాదమైన విషయం. ఆ ప్రతిభగల రచయితల రచనలు కొన్ని నన్ను చెడ్డకి తిప్పేయనీ, కొన్ని నాకు మంచిని చూపించేయనీ నాకు తెలుసు. అందుచేత కవిత్వానికి మనుష్యుల్ని ఎటో అటు మళ్ళించే శక్తికలదని నేను నమ్ముతాను. నిజాన్ని తెలుసుకోడం, అందులో మంచి చెడ్డలేవో నిర్ణయించుకోడం, మనుష్యుల్ని మంచికి మళ్ళించడానికి ప్రయత్నించడం రచయితల కర్తవ్యం అని ప్రస్తుతం నేను అనుకొంటున్నాను. ప్రతి రచయితా కూడా తను రాస్తున్నది రావణుడ్ని సమర్ధించి రాముణ్ని ఓడించడానికో , లేక సీతని విడిపించి న్యాయాన్ని గెలిపించడానికా అనే విషయం సీతాదేవిని ఎత్తుకుపోవడం న్యాయమో అన్యాయమో రచయిత నిర్ణయించు తేల్చుకోవల్సుంటుందని తలుస్తాను. కాని ఈ విషయం తేల్చుకునేముందు రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోవడం న్యాయమో అన్యాయమో రచయిత నిర్ణయించుకోవలసుంటుంది. ప్రతి రచయితా కూడా తను ఎవరి మంచికోసం రాయాలో ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయించుకుంటారని నేను అనుకుంటాను.
అందుచేత రచయిత ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హాని చెడ్డకి సహాయవూఁ చెయ్యకూడదని నేను భావిస్తాను. ఇది తెలుసుకుందికీ తెలియజెప్పడానికే నేనిదంతా రాసేను.
(1965 నవంబరు, ‘విశాఖ’ పత్రిక)
(రావిశాస్త్రిగారు విశాఖ రచయితలకు ఈ శీర్షిక యిచ్చి (1963 సెప్టెంబరు) రాయించారు. ఈ జవాబు మీదే రచయిత దృక్పథం ఆధారపడి ఉంటుంది. వీటిలో రచయితలు ఆత్మవిమర్శ చేసుకున్నారు. విశాఖ రచయితలను ఈ వ్యాసాలు ఒక మలుపు తిప్పాయి. గొప్ప కనువిప్పు కలిగించాయి. ఆ తరువాతే శ్రీ కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ కథ రాశారు.)
నాకు రాయాలని !
నాకు రాయాలని లేదు.
ఎందుచేతనంటే:
ఈ ఎండకి పసలేదు. ఆరీ ఆరని గాయం చాలా ఉంది. ఈ వెన్నెల వెలివెలి బూడిదలా ఉంది. ఈ గాలంతా బిగిసిపోయి చచ్చింది. ఈ చెట్లన్నీ ముసిరిగా ముణుచుకుపోయేయి. ఈ నీడలన్నీ కొరడ బారిపోయాయి. ఈ నదులన్నీ ఇసకై పోయేయి. ఈ సముద్రమంతా చల్లారిపోయింది.
నాకు రాయాలని లేదు.
ప్రభువులంతా ఏడురంగుల నీడల్లో మునిగితేలి మురుస్తున్నారు. పచ్చినెత్తుర్ని పరమాన్నం వండుకొంటున్నారు. వారి గుమాస్తాలు మందడి గోడల తగువుల్లో తన్నుకొంటున్నారు; వారి కూలీలు యూనియన్ తగువుల్లో కురుపాండవుల్ని మరిపిస్తున్నారు. అంతేకాదు, పచ్చడిమెతుకులే పదివేలనుకొంటున్నారు. దేవతా వస్త్రాలే దివ్య వస్త్రాలనుకొంటున్నారు.
నాకు రాయాలని లేదు; ఎంచేతనంటే మరి చూడండి.
నీతులు గోతుల్లోకి పోతున్నాయి. పాపాలు కొండలెక్కి కోటలు కట్టుకొంటున్నాయి. వారి బందూకులు బ్రహ్మచెముడు డొంకల్లా పెరుగుతున్నాయి. జనాన్ని వేటాడుతున్నాయి.
నాకు రాయాలని లేదు.
ఇటు జనంలో అజ్ఞానం అక్షరంగా ఉంది. అటు పాలకుల తుపాకీలకి అక్షరాలు పూల తోరణాలు కడుతున్నాయి. ఎక్కడ చూసినా మబ్బుగానూ, గబ్బుగానూ ఉంది.
అయితే సరేకాని నాకు అందుకే రాయాలని వుందేమో, ఈ ఎండని నాకు వెండిలా మండించాలని వుంది; ఈ వెన్నెల్ని మంచినీటితో కడగాలని వుంది; ఈ గాలికి ప్రాణంపోసి పరిగెట్టించాలని వుంది; ఈ కొమ్మల్ని కెరటాల్లా లేపించాలని వుంది. ఆ నీడల్ని చెలరేగింపించాలని వుంది; ఈ సంద్రాన్ని ఉడుకు లెత్తించాలని వుంది; ఈ నదులన్నీ నయాగరా జలాలు కావాలని ఉంది.
అవును నాకు రాయాలనే వుంది.
నాకు ఈ ప్రభువుల్ని ఈడ్చి ఎండబెట్టాలని వుంది; వారి గుమాస్తాలని గుద్ది కూర్చోపెట్టాలని ఉంది; కూలి కులాలన్నీ ఏకం కావాలని ఉంది, పచ్చడిమెతుకులూ దేవతా వస్త్రాలూ మాత్రమే వారికి పరమార్థం కాకూడదని ఉంది.
నాకు రాయాలని వుంది. ఎందుకంటే-
నీతుల బంగారాన్ని తవ్వి తీయవలసి వుంది. కొండల మీద కోటల్ని కూల్చవలసి వుంది. బ్రహ్మచెముడు డొంకల్ని దుంపనాశనం చెయ్యవలసి వుంది. అక్షర అజ్ఞానాన్ని తన్ని తోసేయవలసి వుంది. పాలకుల బందూకుల ప్రాణాల్ని జనసేన తీయవలసి వుంది.
అవును, నాకు రాయాలని వుంది.
జ్ఞానదీపం వెలగాలి. మబ్బులన్నీ తొలగాలి. మంచిగంధం తీయాలి.
(28 మార్చి 1980 ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో “నిషారా” పేరుతో అచ్చయ్యింది)
ఆఖర్నో మాట
. ఈ నవల్లోని రచనా విధానానికి ఆధారం కొంతమట్టుకు జేమ్స్ జాయిస్ గారి రచనలు ఎక్కువమేరకి శ్రీశ్రీగారి రచనలూను. ఆ రచయితల ప్రతిభ ఈ రచయితకి లేదు. వారి ప్రభావం మాత్రం ఈ నవల్లో కనిపిస్తుంది. ఇందులో సుబ్బయ్య పాత్రకి శ్రీశ్రీ గారి ‘కోనేటిరావు’ కొంతగా నమూనా; నిజజీవితంలో చాలా నమూనాలు. ఈ నవలకి పెట్టిన పేరు నాకు తట్టినది కాదు. ‘భారతి’ సంపాదక వర్గంలో ఉండే శ్రీ సత్యనారాయణరావుగారు సూచించినది. వారికి నా కృతజ్ఞత.
మరోమాట.
ఈ నవల చివరి భాగాలు రాస్తూన్నప్పుడు నాకు సుబ్బయ్యంటే అసహ్యం వేసింది. గవరయ్య చెప్పినట్టు, వాడు దొంగవెధవేననే నమ్మకంతో ఉండిపోయేను.
అయితే –
దేముళ్లూ, రాజులూ, రచయితలూ మంచిగా ఉండాలనీ, సంతానానికి సన్మార్గం చూపించాలనీ విన్నాను. అందుచేత, ‘పత్రిక’ లోంచి ‘పుస్తకం’లోకి వచ్చినప్పుడు సుబ్బయ్యకీ ఆత్మవిమర్శనా జ్ఞానం కలిగింది. తన దుస్థితిని కొంతగా గుర్తుంచుకొని, మంచి మార్గాన వెళ్ళేవాళ్ళా కనిపిస్తాడు నవల చివర్న. చివరికి అతనాదారంట వెళ్ళొచ్చు మానొచ్చు. అది అతని యిష్టం.
ఇంకో మాట.
ఆదినుంచీ కూడా మానవుడు సద్గుణాలన్నింట్లోనూ ధైర్యాన్నే (‘కరేజ్’నే) ప్రధానంగా ఉత్తమంగా ఎందుకు పరిగణించాలి? అనే ప్రశ్నకి శామ్యూల్ జాన్సన్ మహాశయుని సమాధానం ….. because, unless a man has that virtue, he has no security for preserving any other. ధైర్యం ఉంటేనే మిగతా సద్గుణాలుంటాయనే గ్యారంటీ ఉంది. అది లేకపోతే ఆ గ్యారంటీ లేదు.
పాపుల్లో సాహసులూ ఉంటారు. భయస్తులూ ఉంటారు. కాని-
భయానికీ మంచికీ పొందిక లేదు. పిరికివారెవరూ కూడా మంచివారు కాజాలరు; మంచికి నిలబడలేరు, ఇందుకు ఎంతో గ్యారంటీ ఉంది.
మంచిగా ఉండాలంటే గుండెనిబ్బరం చాలా ఉండాలి.
31-5-1961
(తన అసలు పేరుతో అచ్చయిన తొలిరచన ‘అల్పజీవి’ నవల భారతిలో 1953 జనవరి నుంచీ సీరియల్ గా వచ్చింది. ఎనిమిదేళ్ళ తర్వాత రెండో ముద్రణకు రాసిన ముందుమాట.)
రచయిత మనవి
నేను మొదట కథలు రాసినప్పుడు సరదా కోసవూఁ గొప్ప కోసవూఁ తప్ప మరెందు గురించి రాయలేదు. మనం కూడా కథలు రాసేం, అవి పత్రికల్లో పడ్డాయి అంటే నాకు . గొప్పగా ఉండేది. కాని రానురాను ఆ పంథా మారిపోయింది. వయసుతోపాటు అనుభవంతో పాటు మనసు కూడా మారుతుందనుకుంటాను. ఈ నాటకం నేను నా గొప్ప కాని, నాకు ఊసుపోక కాని రాసింది కాదు. ఇందులో జరిగిన అన్యాయాల వంటి అన్యాయాలు నిజజీవితంలో అదేస్థాయిలో నిత్యం జరక్కపోయినా ఏదో ఒక స్థాయిలో మాత్రం నిత్యం జరుగుతూనే వున్నాయి. ప్రస్తుతం మనదేశంలో ప్రతిరోజూ ప్రతిచోట కూడా ఎందరో కొందరమాయకులు వాళ్ళు చెయ్యని నేరాలకు శిక్షలనుభవించడం జరుగుతోందని నేను ఖచ్చితంగా, ఘంటాపథంగా, ఛాలెంజి చేసి చెప్పగలను. కాని, ఆ మాత్రం ఈ మాత్రం డబ్బూ, పలుకుబడీ, పదవీ, హోదా కలవాడెవడూ మాత్రం ఆ పరిస్థితుల్లో పడ్డు, ఇరుక్కోడు; ఒకవేళ, పడినా ఇరుక్కున్నా పైకి తప్పించుకోగలడు. మరైతే ఆ విధంగా అన్యాయానికి గురి అవుతున్నదెవరు? మిగతా అలగా జనం! ఆ విధంగా అన్యాయానికి గురవుతున్నది వాళ్ళే. వాళ్ళ గురించే దీనులు, హీనులు, పతితులు, భ్రష్టులు, బానిసలు, పీడితులు, అని చెప్పి కవులు రిఫర్ చేస్తుంటారు. వాళ్ళు ఉన్నారనే విషయాన్ని పెద్దలంతా వప్పుకుంటారు. వాళ్ళని ఉద్ధరించవలసిన ఆవశ్యకత ఉన్నదని కూడా వప్పుకుంటారు. కానీ, వాళ్ళని బాగుచెయ్యడం కోసం పెద్దలెవరూ ఏమీ చెయ్యడం మాత్రం కనిపించదు. లంచాలు జేబుల్లోకి వెళ్తున్నాయి. లాభాలు బ్యాంకుల్లోకి వెళ్తున్నాయి. రాజకీయవేత్తలు ఖద్దరుబట్టలు తొడుగుకొని పార్లమెంటుకి వెళ్తున్నారు. దేశంలో అందర్నీ ఉద్ధరించడానికి ఆర్థిక మంత్రులు కోట్లమీద అప్పుకోసం ప్రతి దేశానికి వెళ్తున్నారు. దేముడు చెప్పిన న్యాయాన్ని నిలబెట్టేందుకు స్వాములు, మౌలీలు, బిషప్పులు రోజూ ఉపన్యాసాలకి వెళ్తున్నారు. కాని ఏ పాపం ఎరుగని వాళ్ళు మాత్రం జెయిళ్ళలోను, జెయిళ్ళ బయటకూడా మగ్గుతూనే వున్నారు. పాపంలా పెరిగిన పెద్దవారు ఎన్ని పాపాలు చేసినా వారే పెద్దవారుగా ప్రభువులుగా వుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు కాక దొరకదు. తనకన్యాయం జరిగితే ఎదుర్కొందికి పేదవాడికి సంఘంలో అవకాశం లేదు. లేకకాదు. ఈ పరిస్థితి మారాలని నాకుంది, అందుకనే ఈ నాటకం రాసేను.
“రత్తాలు రాంబాబు” గురించి
“రత్తాలు రాంబాబు” గురించి ‘ఆంధ్రజ్యోతి’ వారి అభిప్రాయవేదికలో వచ్చే విమర్శలు మరిన్ని ప్రతివిమర్శల గురించి నేను ‘జవాబు’ ఇస్తే బావుంటుందన్నట్టుగా శ్రీ పాలడుగు వెంకటేశ్వరరావుగారి లేఖ వల్ల నాకు బోధపడింది.
1. విమర్శ విడిచిపెట్టి విమర్శకుల మీద వ్యక్తిగతంగా విసుర్లు విసరడం మంచిదికాదని నా అభిప్రాయం.
2. కథరాసేక, దాన్ని మరింక విడిచిపెట్టక, దాని మానాన్న దాన్ని బతకనివ్వ (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు దాన్ని సాకుతూ సంరక్షించుకొంటూ సమర్థించుకొంట నెత్తిని పెట్టుకొని తిరగడం నాకు ఇష్టం లేదు.
3. నిజానికి దగ్గరగా ఉంటే కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది. లేకపోతే పోతుంది.
4. “రత్తాలు-రాంబాబు” నవల గురించి ఏమైనా తెలియాలంటే అది నవలవల్లే తెలియాలి కాని, నావల్ల కాదు.
రాచకొండ విశ్వనాథశాస్త్రి
విశాఖపట్నం-2.
(రత్తాలు-రాంబాబు నవల 1975లో ఎమర్జెన్సీలో శ్రీ రావిశాస్త్రి జైల్లో వున్నప్పుడు ప్రారంభించేరు. ‘ఆంధ్రజ్యోతి’ సచిత్రవారపత్రికలో 1970లో సీరియల్ గా అచ్చవుతున్నప్పుడు, ఆ నవల మీద ‘విమర్శ’ ప్రతి విమర్శలతో ఓ పెద్ద దుమారం రేగింది. ఆ సందర్భంలో రాసిన జవాబు. )
మూడు కథల బంగారానికి ముందు కొన్ని మాటలు
ఈ మూడు కథల బంగారాన్ని చిన్నకథగా రాయాలని ప్రారంభిస్తే ఇదొక చిన్న నవలగా మారి పెరిగింది. నేను సృష్టించాలనుకొన్న కొన్ని పాత్రలు అవి సృష్టించబడ్డాక అవి నావశం తప్పి పారిపోగా వాటిని నిలబెట్టి ఆపడంలో నాకు కష్టమేకాక నవల రాయడంలో కొంత ఆలస్యం అయింది.
ఇందులోని పాత్రలు నిజజీవితంలో ప్రత్యేకంగా ఏ వ్యక్తినీ ఉద్దేశించి రాసినవి కావు. ఆ విషయం నాకు బాగా తెలుసుకాబట్టి దాన్ని నేను బాగా నమ్ముతాను. ఈ విషయాన్ని పాఠకులు కూడా నామాట హామీ మీద నమ్మగలిగినవాళ్ళు నమ్ముతారు. నమ్మలేనివాళ్ళు నమ్మలేకపోతారు. పోతే, మన తెలుగువాళ్ళకి ఇంటిపేర్లు కూడా వుంటాయి. కాబట్టి కొన్ని పాత్రలకి ఇంటిపేర్లు చెప్పాను. కాని అటువంటి పేర్లు గల వ్యక్తులు నిజంగా ఉన్నా అటువంటి వారి నెవరినీ నాకు తెలీదు. అటువంటి వారి నెవ్వర్నీ ఉద్దేశించి ఇందులో నేను ఏ విషయమూ రాయలేదు.
మరొక విషయం వుంది. ఇందులో అవినీతి గురించీ పోలీసులు గురించీ అవినీతి పరులైన పోలీసుల గురించి ప్రస్తావన వుంది. అందు గురించి కొంత చెప్పవలసి వుంది. నేను ఎవరో పాశ్చాత్య రచయిత రాయగా ఎక్కడో చదివేను. అతను అవినీతి (‘ఈవిల్’) గురించి చెప్తూ మంచివాళ్ళు కొంతమంది అవినీతిని మొదటిసారిగా చూసి అసహ్యించుకుంటారంటాడు. ఆ తరువాత కొంతకాలానికి వారికి ఆ అవినీతి యెడల నిర్లిప్తత ఏర్పడుతుందట. ఆ నిర్లిప్తతలోంచి కొంతకాలానికి అభిమానం చిగురిస్తుందట. ఆ అభిమానం చివరికి మంచివారు ఆ అవినీతిని ఆలింగనం చేసుకొందికి దారితీస్తుందట. మన తెలుగులో కూడా “ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారు” అనే సామెత వుంది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా ఎలా మారుతారో చెప్పడానికే ఈ సామెతని చాలా మంది ఉపయోగించగా నేను విన్నాను.
అవినీతితో ఎక్కువ సంబంధం, సహవాసం (స్నేహం కాదు) అవినీతిని అరికట్టవలసిన వాళ్ళకే ఎక్కువ ఏర్పడుతుంది. పైన చెప్పిన పాశ్చాత్య రచయిత చెప్పిన అసహ్యం, నిర్లిప్తత, అభిమానం, ఆలింగనం అన్నీ కూడా అవినీతియెడల ఏర్పడడానికి – అందుచేతనే – పోలీసుల్లోనే ఎక్కువ అవకాశం వుంటుంది. కాని, అందరు పోలీసు వారూ కూడా ఇందులోని సూర్రావు హెడ్డు లాంటివారేనని నేను అనను. కాని, పోలీసు ఫోర్సులో అటువంటివాళ్లు చాలామంది వుండడానికి ఎక్కువ అవకాశం వుందని నేను అనగలను అంటున్నాను. ఆ మాటకొస్తే క్రిమినల్ సైడు ప్రాక్టీసు చేసే ప్లీడర్లకి కూడా జీవితంలోని అవినీతితో నిత్యసంబంధం వుంటుంది. అందుచేత సూర్రావెడ్డు గారంత ప్రబుద్ధులు లేకపోయినప్పటికీ దాదాపు తత్తుల్యులు వారిలో కూడా వుండగలరని సూర్రావెడ్డు లాగే నేను కూడా నమ్ముతాను.
కాని, పోలీసుల గురించి మరొక విషయం చెప్పవలసి వుంది. వారిలో ఎవరెంత నీతిమంతులైనా సరే, ఎవరెంత అవినీతిపరులైనా సరే వారు ఆ నీతికి నిలబడిగాని ఆ అవినీతికి లోబడిగాని ఏనాటికీ ప్రజలపక్షం వుండరు. ముమ్మాటికీ ఎల్లప్పుడూ తమప్రభుత్వ పక్షమే వుండి తీరుతారు. ఈ మాట అన్ని దేశాలలోనూ నిజం. మన దేశంలో మరీ నిజం. నాలుగుకోట్ల రూపాయలు కురిపించి ఇచ్చినప్పటికీ అవి పుచ్చుకుంటాడే కాని ఈ దేశంలో ఏ ఒక్క పోలీసూ కూడా ఏ నక్సలైటుకైనా సాయం చెయ్యడు – వాళ్ళే గెల్చిపోతున్నారనే గొప్పభయం గుండెల్లోంచి పుట్టుకొస్తే తప్ప!
15-4-1982
విజ్ఞప్తి
ఈ నవల ఒళ్లు దగ్గరపెట్టుకొని కొంచెం భయంతోనూ కొంత భక్తితోనూ కూడా రాసేను. నిజాయితీతో కూడా రాసేనని అనుకొంటున్నాను.
ఇందులోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు. ఎవ్వర్నీ ఉద్దేశించి చిత్రించినవి ఎంతమాత్రం కానేకావు. ఈ నవల్లో కొంతవరకూ కుల ప్రస్తావనా (బ్రాహ్మలు అనబడే వారిలో), శాఖాభేద ప్రస్తావన కొంతమేరకీ వుంది. కాని పాత్రల్ని వ్యక్తులుగానే వర్ణించేనుకు ఆయాకులాల శాఖల ప్రతినిధులుగా ఎంతమాత్రం చిత్రీకరించలేదు.
నేను వెలనాటి బ్రాహ్మణులు అని పిలువబడే శాఖలో పుట్టేను. కాని, బ్రాహ్మణ సాంప్రదాయంలో పెరగలేదు. మా నాన్నగారూ, అమ్మగారూ కూడా కుంభకోణం గురువుగారు అని మా ఇంట్లో పిలువబడే మాస్టర్ సి.వి.వి. గారికి అనుంగు శిష్యులుగా వుండేవారు. నాకు తెలిసినంత మట్టుకు వారి శిష్యులకి కులమత భేదాలు లేవు. ఆ సాంప్రదాయమే నాదికూడా.
నాకు మృత్యువు ఆసన్నం అవుతోంది. నేను ఎవ్వర్నీ మోసం చేసి, అబద్ధాలు ఆడి మూటగట్టుకొని మోసుకుపోవలసింది ఏమీ లేదు.
అందుచేత –
ఈ నవల్లో తప్పులు ఏమైనా చేసి వుంటే వాటిని క్షమించమని పాఠకులకి విజ్ఞప్తి చేసుకొంటున్నాను.
రాచకొండ విశ్వనాథశాస్త్రి
10-4-1993, విశాఖపట్నం-2
(ఇల్లు నవల రచనాకాలం 28-2-1992, 10-4-1993, స్వాతి వారపత్రికలో సీరియల్ 11-6-1993 – 1-10-1993, ఆర్.కె. పబ్లికేషన్స్ పుస్తక ప్రచురణ 21-11-1993.)
ప్రవేశం
ఇది ఇల్లు: చిట్టెమ్మగారి ఇల్లు. ఇందులో అడుగు పెట్టేముందు నావి కొన్ని మాటలు దయచేసి వినమని ప్రార్థన.
మహాకవి శ్రీశ్రీ గారు చెప్పేరు-
“ఏ దేశ చరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం”
“జెంగిజఖాన్, తామర్లేనూ,
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ, సికందరూ ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహా హంతకుడు”
ఆయన చెప్పినట్టు ఇప్పుడు పరపీడన, ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా ప్రబలిపోయి వుండి – మహాహంతకులు మర్యాదస్థుల్లా తిరుగుతున్నారు. ఇది కొంతవరకూ దృష్టిలో వుంచుకొని ఇది రాయడానికి చిన్న ప్రయత్నం చేసేను.
మహాపురుషుల్లాగే మహాకవులు ఏ కొద్దిమందో వుంటారు. వారిలో ధూర్జటి కవి ఒక మహాకవి అని నా అభిప్రాయం. ఈయనే రాసిన ఇంటి గురించి విశేషాలు ఆయన క్రీస్తుశకం పదహారో శతాబ్దంలో చెప్పేడు. పరిస్థితి అప్పటికీ ఇప్పటికీ ఒక్కలాగే వుంది.
“జాతుల్ సెప్పుట సేవ సేయుట మృషల్ సంధించుట న్యాయ వి
ఖ్యాతిం బొందుట కొండెకాడగుట హింసారంభకుండౌట మి
ధ్యాతాత్పర్యము లాడుటన్నియు బరద్రవ్యంబు నాశించి; యీ
శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీ కాళహస్తీశ్వరా!”
అని ఆనాడు వాపోయేడు ఆయన. ఆయన చెప్పిన జాడ్యం ఇంతవరకూ మనల్ని వదల్లేదు. అనేది ఈ ఇంటి గురించి చదివినా చదవకపోయినా మీకు తెలుసునని నాకు తెలుసు.
సంస్కృతంలో ‘అస్తి’ ‘నాస్తి’ అనే పదాలున్నాయి. వాటి అర్థాలు మనకి అనవసరం. కానీ ‘ఆస్తి’ అంటే మీకూ నాకూ అందరికీ తెలుసు – అది ఒక భయంకరమైన భూతం లాంటిది.
ఆంగ్లేయుల్లో ఒక మహాకవి వున్నాడు. ఆయన ఒక నాటకంలో ఒకరి స్వగతం రాసేడు. నేను తర్జుమాలో తరిఖీదు పొందలేదు. అసలు ఏమిటో ఈ కింద పొందుపరుస్తున్నాను.
My conscience hath a thousand several tongues,
And every tongue brings in a several tales,
And every tale condemns me for a villain,
Perjury, per’jury, in the highest degree,
All several sins, all used in each degree,
Murder, stern murder, in the direst degree,
Throng to the bar, crying all ‘Guilty, Guilty’.
అది మహాకవి విలియం షేక్స్పియర్ చేసిన రచన. ఆస్తి అనే భూతానికి అంతంలో అంటూ వుంటే ఆ స్వగతం దానికి సరిగ్గా సరిపోతుంది, అన్వయిస్తుంది.
“నా అంతరాత్మకి
నాలుగు వేల నెత్తుటి నాలికలున్నయ్
నాలిక నాలికా మీకొక నెత్తుటి కథ చెప్తుంది
కథకథా ప్రతికథా
నేనొక మహాపాపినని చాటిచెప్తుంది.
నమ్మించి ద్రోహాలు దేమునిసాక్షిగా అబద్ధాలు
కత్తితో కంఠం మీద నరుకులు తడిగుడ్డతో గొంతుక్కోతలు
నే చేసిన నేరాలు ఘోరాలు
అన్నీ కూడా
వీడు
నీచాతి నీచుడు నరరూప రాక్షసుడు
అతి దుర్మార్గుడు మహాపాతకుడు
అని
న్యాయస్థానంలో నిక్కచ్చిగా నిలబడి
నిరూపించి చెప్తాయి!
పరుల కష్టాన్ని దోచుకొని పరద్రవ్యాన్ని కాజేసే పరమ దుర్మార్గులు ఎంత మంది ఎలా వుంటారో ఈ ఇంటికి వస్తే మీకు కొద్దిగా తెలుస్తుంది.
రాచకొండ విశ్వనాథశాస్త్రీ
విశాఖపట్నం-2
10.4.1993
(‘ఇల్లు’ నవలకి ముందుమాట)
బాధ్యత – భద్రత
1952వ సంవత్సరంలో అదివరకులా మారుపేరుతో కాకుండా నా పృతో ‘అల్పజీవి’ అనే నవల రాశాను. అది 1953వ సంవత్సరం జనవరి నెల నుండి భారతిలో ప్రచురించబడింది. అంతకుముందు నా పేరు తెలియని చాలామందికి నా పేరు వెల్లడి అయింది. శ్రీశ్రీ గారికీ, కొడవటిగంటి కుటుంబరావుగారికి కూడా నా పేరు తెలిసింది. ‘అల్పజీవి’ని వారు కూడా గమనించేరు అనేసరికి నాకు గాబరా వేసింది. భయం వేసింది. అప్పుడు మనం ఎందుకు రాస్తున్నాము అనే విషయం గురించి కొంతగా ఆలోచించక తప్పింది కాదు. అంతవరకు నేను ఏదో తమాషాకి ఇష్టం వచ్చినట్టు బాధ్యతారహితంగా రాసేవాడిని. నా సరదాలే నేను చూసుకున్నాను కానీ “ఈ రచనల వల్ల చదివేవారు ఏమౌతారు? వారికి ఇది మంచి అవుతుందా లేక చెడ్డ అవుతుందా?” అని ప్రశ్నించుకోలేదు ‘అల్పజీవి’ గురించి అంతమంది అడిగేసరికి ఆ తరువాత రాసిన ప్రతి విషయం గురించి నా మట్టుకు నేను ప్రశ్నించుకుని నా మట్టుకు నాకు ఇది మంచిది అవుతుంది అని తోస్తేనే రాస్తూ వచ్చేను. ఇది ప్రతి రచయితకి ఎప్పుడో ఒకప్పుడు తప్పదు అని భావిస్తాను.
లోకంలో ధనబలం, అధికారబలం రెండూ ఉన్నాయి. ఈ రెండూ సాధారణంగా జోడుగా వెళుతూ ఉంటాయి. వీటివల్ల బాధింపబడేవాళ్ళు కూడా ఎక్కువ మంది వుంటారు. ఆ ఎక్కువ మందిలో నేనూ ఒకణ్ణి. అందుచేత అటువంటి వారి గురించి రాస్తే ఎక్కువ మంచి జరుగుతుంది అనే అభిప్రాయం నాలో అస్పష్టంగా కలిగింది. అధికార మదానికీ ధన మదానికి వ్యతిరేకంగా నేను రాస్తూ వచ్చేను. ఇది 1953 తరువాత నేను రాసిన ప్రతి విషయంలోనూ స్పష్టం అవుతుంది.
అలాగ కాకుండా పాఠకుడి పరమానందమే ధ్యేయంగా పెట్టుకుని డబ్బు, అధికారం కలవారి ఆనందమే పరమావధిగా పెట్టుకొని రాసే రచయితలు చాలామంది వున్నారు. సాధారణంగా వారి ధ్యేయం ఏమిటో వారు చెప్పరు. కాని, రాసిన ప్రతి విషయంలోనూ అది తెలుస్తుంది. అటువంటి రచయితలు ఎంత బాగా రాసినప్పటికీ వాళ్ళను చూస్తే నాకు ఇష్టంలేదు.
పాఠకుల్లో బీదవాళ్లూ ఉంటారు, డబ్బుగలవారూ ఉంటారు. రచయితలు ఇరువర్గాల్లోని ఎవరినో ఒకరిని దృష్టిలో వుంచుకుని రాసే స్థితికి ఎప్పుడో ఒకప్పుడు వస్తారు. ఇరువర్గాల వారిని దృష్టిలో వుంచుకొని రాసినా కూడా, ఇప్పటి గొప్పా, బీద పరిస్థితిని మార్చవలసిన అవసరం లేకుండా ఇతర విషయాల మీద రాస్తారు. కొంతమంది రచయితలు ‘ఈ పరిస్థితి మార్చబడదు, ఇది ఇలా ఉండవలసిందే’ అనే భావంతో రాస్తారు. కొంతమంది ‘ఈ పరిస్థితి మారితీరా’లనే పట్టుదలతో రాస్తారు. ‘ఈ పరిస్థితితో సంబంధం లేకుండా ప్రస్తుతం ఆనందమే పరమావధి’ అనే భావంతో రాసే రచయితలని చూస్తే నాకిష్టంలేదు. గొప్పా బీదా భేదం పోతే జనం ఏ విధంగా జీవించేదీ నేను ఇప్పుడు ఊహించుకోలేను. కానీ ఈ పరిస్థితీ ఈ విధంగా ఉండకూడదు. మారితీరాలి.
రచయితలు దొరికిపోరు. గుంభనంగా రాయగలరు. డబ్బుగలవారిని సమర్ధించే రచయితలు ఇంకా ఎక్కువ గుంభనంగా వుంటారు. అయితే వారిని కనిపెట్టాలంటే ఒక మార్గం ఉంది….
అది ఏమిటంటే, గొప్పవారు ఎవరినయితే సన్మానిస్తున్నారో వారు సాధారణంగా బీదవారికి వ్యతిరేకులే అయివుంటారు.
ఇవాళ పోలీసుశాఖలో అధికారబలం, ధనబలం కలిసేవున్నాయి. అందుచేత, ఏ రచయితనైనా సరే (బ్రతికివున్న వారిని) ఆ శాఖ వారు సన్మానించేరూ అంటే బీదవారు ఆ రచయిత తమకి వ్యతిరేకి అని తెలుసుకోవాలి.
ఎవరి బాధ్యత వారికి తెలియకపోయినప్పటికీ ఎవరి భద్రత వారికి తెలుస్తుంది.
(గొప్పా, బీదాతో సంబంధంలేని రచన తరచూ అపరాధ పరిశోధనే అవుతుంది. ఎందుకంటే దొంగల్ని పట్టించుకోవడం అందరికీ ఇష్టమే. గొప్పవారికైతే అది మరీ ఇష్టం. వారు ఎలా గొప్పవారు అయినదీ వారికి తెలుస్తుంది. పట్టుబడిన వారి కథల వల్ల వారు పాఠాలు నేర్చుకుంటారు.)
17-9-1993
(రావిశాస్త్రి గారి చివరి వ్యాసం – జాషువా ప్రత్యేక సావనీర్ అక్టోబర్ 1993)
* * *