ఆనందం

Spread the love

రాత్రి పన్నెండు గంటల వేళ.

            మిత్యా కుల్దరోవ్ జుట్టు సరిచేసుకుంటూ తన తల్లిదండ్రుల యింట్లోకి దూసుకొచ్చి గదులన్నీ కలియదిరిగాడు. అతని మొహంలో ఆనందం తాండవిస్తోంది. అప్పటికే అతని తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించారు. అతని చెల్లెలు మంచంపై పడుకుని, నవల ఆఖరి పేజీ చదువుతోంది. బడి పిల్లలైన అతని తమ్ముళ్ళిద్దరూ గాఢనిద్రలో ఉన్నారు.

“ఏమైంది నీకు? నువ్వెక్కణ్ణించి వస్తున్నావు?” అరిచారు అతని తల్లిదండ్రులు ఆశ్చర్యంగా.

“ఓహ్, అడగకండి. నేనిలాంటిది ఊహించనే లేదు. అసలిలా జరుగుతుందని  కలలో కూడా అనుకోలేదు. ఇదంతా ఏమాత్రం నమ్మశక్యంగా లేదు!” అన్నాడు మిత్యా.

            అతను పకపక నవ్వుతూ అక్కడున్న వాలు కుర్చీలో కూలబడ్డాడు. అతనెంత సంతోషంగా ఉన్నాడంటే యింకొక్క నిమిషం కూడా నిలబడి ఉండడం అతని వల్లకాలేదు.

             “ఇలా చూడండి, యిదే మాత్రం నమ్మశక్యం కాదు. మీరు ఊహించను కూడా  లేరు!”

            అతని చెల్లెలు పక్క మీంచి లేచి, దుప్పటి చుట్టుకుని, అన్నయ్య దగ్గరకు పరిగెత్తింది. తమ్ముళ్ళిద్దరూ కూడా నిద్రలేచారు.

            “ఏమైందసలు? నువ్వు నువ్వుగా లేవు!”

            “అమ్మా, ఎందుకంటే నేను చాలా…. చాలా సంతోషంగా ఉన్నాను గనుక! నీకు తెలుసా, యిప్పుడు రష్యా అంతటా నాపేరు మార్మోగిపోతుంది, తెలుసా? రష్యా అంతటా! యిప్పటి వరకూ ద్మిత్రీ కుల్దరోవ్ అనే రిజిస్ట్రేషన్ గుమాస్తా ఉన్నాడని కేవలం మీకు మాత్రమే తెలుసు. కానీ యిప్పుడో! రష్యా, రష్యా అంతటికీ తెలుసు, తెలుసా?”

“అమ్మా? ఓరి దేవుడా, నేనిది నమ్మలేను తండ్రీ!”

            మిత్యా పైకి లేచి, అన్ని గదులూ ఉత్సాహంగా కలియదిరిగి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు.

            “ఏం, ఏం జరిగిందనలు? కొంచెం అర్థం అయ్యేట్టు చెప్పు!”

            “మీరసలు అడవి మృగాల్లా బ్రతుకుతారు. వార్తా పత్రికల మొహం కూడా చూడరు.  పత్రికల్లో ఎన్ని ఆసక్తికర కథనాలు ప్రచురిస్తారో మీకేమైనా తెలుసా? ఎబ్బే! ఏదైనా సంఘటను జరిగిందంటే, అది వెంటనే పత్రికల్లో వస్తుంది, తెలుసా? ఏదీ దాగదు! అయ్యో, దేవుడా! నేనెంత సంతోషంగా ఉన్నానో కదా! కేవలం ప్రముఖులైన వారి పేర్లే పత్రికలకెక్కుతాయి. తెల్సా? యిప్పుడు నా పేరు కూడా పత్రికల కెక్కింది. ఓహ్!”

“నువ్వేమంటున్నావు? ఎక్కడ, ఏదీ?”

            తండ్రి మొహం వెలవెల పోయింది. తల్లి దైవ ప్రతిమవైపు చూసి శిలువ వేసుకుంది. చిన్న లాగూ, చొక్కాలలో వున్న తమ్ముళ్ళిద్దరూ పక్కమీంచి ఒక్క గెంతు గెంతి అన్న దగ్గరకు  చేరారు.

            “ఔను, నిజంగానే! నా పేరు పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు రష్యా అందరికీ నేనెవరో తెలుసు! అమ్మా, ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది. ఈ పత్రికను జాగ్రత్తగా దాచిపెట్టు. మనం అప్పుడప్పుడూ చదువుకోవచ్చు కదా, ఏమంటావు? యింద, యిదుగో!”

            మిత్యా తన జేబులోంచి ఒక వార్తాపత్రిక ప్రతిని పైకితీసి, తన తండ్రి చేతికిచ్చి, అందులో నీలం పెన్సిల్ తో  గీతగీసిన పేరాని చూపించాడు.

            “చదవండి!”

            తండ్రి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు.

            “చదవండి మరి!”

            తల్లి మరొకసారి దైవప్రతిమవైపు చూసి, శిలువ వేసుకుంది. తండ్రి గొంతు సవరించుకుని, చదవడం ప్రారంభించాడు! “డిసెంబర్ నెల 29వ తేదీ రాత్రి పదకొండు గంటల వేళ, ‘ద్మిత్రీ కుల్దరోవ్’ అనే రిజిస్ట్రేషన్ గుమాస్తా….

            “చూసారా, చూసారా? ఊ కానివ్వండి, యింకా చదవండి!”

“……….ద్మిత్రీ కుల్దరోవ్ అనే రిజిస్ట్రేషన్ గుమస్తా లిటిల్ బ్రన్నోయాలోని కోళిహిన్  భవంతిలో వున్న సారాయి దుకాణం నుంచి తప్పతాగిన స్థితిలో బయటకు వస్తూ…

            “ఆఁ, అదే, నేనూ, సెమ్సెన్ పెట్రోవిచ్ కలిసి అదంతా సరిగ్గా ఉన్నదున్నట్టు వర్ణించారు అక్కడ.”

            “…….తప్పతాగిన స్థితిలో బయటకు వస్తూ, యుహ్ నోవ్ స్కీ  జిల్లా దురికినో గ్రామవాసి అయిన యివాన్ ద్రాతోవ్ కి  చెందిన స్లెడ్జి బండి క్రింద పడిపోయాడు. ఆ సంఘటనకు బెదిరిపోయిన గుర్రం బండిలో కూర్చున్న మాస్కోకు చెందిన వ్యాపారి స్టెహిన్  బ్యకోవ్ తో  సహా బండిని కుల్దరోవ్ పైనుంచి పోనిచ్చి వీధుల్లో పరుగులు తీసింది. చివరకు ఎలాగైతేనేం కొంతమంది పనివాళ్ళు కలిసి గుర్రాన్ని పట్టుకుని బండిని ఆపగలిగారు. అపస్మారక స్థితిలో వున్న కుల్దరోవ్ ని  ముందుగా ఠాణాకు తరలించగా అక్కడ ఒక వైద్యుడు వచ్చి పరీక్ష చెయ్యడం జరిగింది. అతని తలపై తగిలిన గాయం….

            “అదే కాడి తగిలింది నాన్నా, ఊఁ చదవండి, మిగతాది కూడా చదవండి”

            “…..అతని తలపై తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని తేలింది. ఈ సంఘటనపై తగువిధంగా నివేదిక యివ్వడం జరిగింది. గాయపడ్డ వ్యక్తికి వైద్యసహాయం  అందించడం జరిగింది….

            “చల్లటి నీళ్ళతో నా తలని వెనక మర్దన చేసుకొమ్మని వాళ్ళు చెప్పారు చూసారా నాన్నా? చదివేరా? ఇప్పుడిది రష్యా అంతటా తెలుస్తుంది. అది యిలా యివ్వండి”

            మిత్యా ఆ పత్రికను లాక్కుని, మడిచి జేబులో పెట్టుకున్నాడు.

            “నేను మకారోవ్ ల  యింటికి పరుగెత్తుకెళ్ళి యిది చూపిస్తాను…. యింకా యివానిట్స్ కీ లకీ, నతాస్యా యివానోవ్నాకీ, ఆనిసిమ్ వాసిల్సేవిచ్ కీ…. అందరికీ చూపించాలి. నేను తొందరగా వెళ్ళాలి. శలవు!”

            కుచ్చుటోపీ నెత్తిమీద పెట్టుకుని, విజయగర్వంతో, మిత్యా ఆనందంగా వీధిలోకి పరుగుతీసాడు.

    *     *   *

Anton Chekhov
Aruna Prasad

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *