మూడవ భాగం
అధ్యాయం-8
టారజోక్ అనే చిన్న పట్టణంలో రెజిమెంటు దళాలుగా విడిపోయింది. ఆ విభాగ ప్రధాన కార్యాలయ ఆదేశాల మేరకు ఆరవ దళాన్ని మూడవ సైన్య పదాతి దళంతో కలిపి ఉంచడం జరిగింది.ఆ దళం పెలికాలియే పట్టణం వైపు సాగిపోయి, అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది.
సరిహద్దు ప్రాంతాన్ని ఇంకా సరిహద్దు దళాలు కాపలా కాస్తూ ఉన్నాయి.పదాతి దళం, శతాగ్ని దళం వెనుక నుండి వస్తూ ఉన్నాయి.జూలై 24 సాయంత్రం కల్లా 108 వ గ్లెబోవ్ రెజిమెంట్ పటాలము, ఫిరంగి బురుజు పట్టణంలోకి వచ్చాయి. దగ్గరలోని ఒక భవంతిలోనే ఆ దళపు సార్జెంట్ నాయకత్వంలో తొమ్మిది మంది కొసాక్కులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
ఇరవై ఆరవ తేదీ రాత్రి మేజర్ పోపోవ్ సార్జెంట్ మేజర్ ను, అష్టకోవ్ అనే కొసాక్కును సమావేశపరిచాడు.
అష్టకోవ్ దళం దగ్గరకు తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. మిట్కా కోర్షునోవు అప్పుడే గుర్రానికి నీళ్ళు పెట్టి వచ్చాడు.
‘నువ్వేనా అష్టకోవ్?’ అని పిలిచాడు.
‘అవును, నేనే. క్రిచ్ కోవ్ మరియు మిగిలినవాళ్లు ఎక్కడా?’
‘అక్కడ… ఇంట్లో ఉన్నారు.’
ధృఢకాయంతో, ఎత్తుగా, బలంగా, గంభీరంగా, నల్ల జుట్టుతో ఉండే అష్టకోవ్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. బల్ల దగ్గర చమురు దీపం వెలుతురులో షిగోల్కొవ్ విరిగిన నాడాను కుడుతూ ఉన్నాడు.క్రిచ్ కోవ్ తన చేతులు వెనక్కి పెట్టుకుని స్టవ్ దగ్గర నిలబడి, ఇవాన్ కోవ్ ను చూసి కన్ను కొడుతూ, ఒళ్ళంతా నీరు చేరి ఉబ్బి ఉన్న శరీరంతో మంచం మీదా పడుకుని ఉన్న ఆ ఇంటి యజమాని అయిన పోలాండ్ కు చెందిన వ్యక్తి వైపు చూపిస్తూ ఉన్నాడు. అంతకుముందే ఒక జోకు వేసుకున్నారు ఆ ఇద్దరూ, ఇవానోవ్ గులాబీ బుగ్గలు ఇంకా నవ్వు ఆపుకోలేకుండా ఉన్నాయి.
‘చూడండి అబ్బాయిలు, రేపు ఉదయం వెలుతురు రాకముందే మనం ప్రయాణామవ్వాలి.’
‘ఎక్కడికి?’ షేగోల్కొవ్ అడిగాడు, అప్పుడే సూదిలోకి దారి ఎక్కిస్తూ ఉన్న అతని చేతిలో ఉన్న సూది కింద పడిపోయింది.
‘లుబోవ్ అనే ప్రాంతానికి.’
‘ఎవరెవరు వెళ్తున్నారు?’ అప్పుడేలోపలికి వస్తూ, ఖాళీ బిందెను తలుపు దగ్గర పెడుతూ మిట్కా అడిగాడు.
‘షేగోల్కొవ్, క్రిచ్ కోవ్, ర్వాచోవ్, పోపొవ్, ఇవాన్ కోవ్.’
‘మరి నా సంగతేమిటి?’
‘నువ్వు ఇక్కడే ఉంటున్నావు, మిట్కా.’
‘మీరంతా ఎక్కడికైనా వెళ్ళి చావండి.’
క్రిచ్ కోవ్ తన చేతులను వెనక నుండి తీసి, ఎముకలు విరిగేలా ఒళ్ళు విరుచుకుంటూ, ‘ఇక్కడ నుండి ఆ లెబోవ్ ప్రాంతానికి ఎన్ని వెరస్టుల దూరం?’అని యజమానిని అడిగాడు.
‘నాలుగు మైళ్ళు.’
‘అది ఇక్కడ నుండి పెద్ద దూరం కాదు’, అష్టకోవ్ అక్కడ ఉన్న బెంచీ మీద కూర్చుని, బూట్లు తీసేస్తూ చెప్పాడు.’ఇక్కడ మన సాక్స్ లు ఎక్కడ ఆరేయ్యవచ్చు?’
వాళ్లు ఆ తర్వాతి ఉదయమే బయలుదేరారు. దారిలో రోడ్డు పక్కన కాళ్ళకు చెప్పులు లేకుండా ఉన్న ఓ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి, అక్కడ ఉన్న బావిలో నీళ్ళు తోడుతూ ఉంది. క్రిచ్ కోవ్ తన గుర్రానికి పగ్గాలు వేసి, ఆపాడు.
‘తాగడానికి మంచినీళ్ళు ఇవ్వు అమ్మాయి!’
కిందకు జీరాడుతూ ఉన్న తన గౌనును పైకి లాక్కుంటూ,పక్కనే ఉన్న చిన్న నీటి గుంటలో తన గులాబీరంగు కాళ్ళు వేసేసరికి, ఆ నీళ్ళు చిందాయి. కళ్ళతోనే నవ్వుతూ అతని దగ్గరగా వచ్చి, ఆ నీటి బిందె అందించింది. క్రిచ్ కోవ్ అది తీసుకుని, ఒక చేత్తో దాన్ని పట్టుకుని, ఇంకో చేతి దోసిట్లో నీళ్ళు తాగుతూసరిగ్గా సంభాళించుకోలేకపోవడం వల్ల ఆ నీరు చెంది అతని ప్యాంటు తడిచింది.
‘అందమైన కళ్ళు గల ఓ అమ్మాయి! ఆ దేవుడు నిన్ను రక్షించుగాక!’
‘దేవునికి స్తుతి!’
ఆమె ఆ బిందె అందుకుని, చుట్టూ చూస్తూ, నవ్వుతూ, అక్కడి నుండి వెళ్ళిపోయింది.
‘ఏంటి నవ్వుతున్నావు? రా, ఇద్దరం కలిసి తిరిగి వద్దాము!’ క్రిచ్ కోవ్ అప్పటికే జీను సరి చేసి, ముందుకు జరిగి, ఆమెకు వెనుక స్థలం ఉండేలా చూశాడు.
‘ముందుకు కదలండి!’ అష్టకోవ్ పక్కా నుండి వెళ్తూ తీస్తూ, అరిచాడు.
ర్వాచోవ్ క్రిచ్ కోవ్ వైపు అల్లరిగా చూస్తూ అన్నాడు:
‘ఆమె నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నావు కదూ?’
‘ఆమె కాళ్ళు టర్కీ కోడి కాళ్ళలా భలే ఉన్నాయి’, క్రిచ్ కోవ్ నవ్వుతూ అంటే, అందరూ ఎవరో ఆదేశించినట్టు వెనక్కి తిరిగి ఆమె వైపే చూసారు.
ఆ అమ్మాయి బావి దగ్గర వంగుతూ నీళ్ళు తోడుతూ ఉంటే, ఆమె గులాబీ రంగు కాళ్ళు ఎడంగా ఉండటం వల్ల , ఆమె పిరుదుల పైన గౌను బిగుతుగా అయ్యింది.
‘నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది..’ పోపొవ్ నిట్టూర్చాడు.
‘సరే అయితే, నీకు నా కొరడాతో పెళ్ళి చేస్తాను’, అష్టకోవ్ ప్రతిపాదించాడు.
‘పెళ్ళి కొరడాతో కాదు చేసుకోవాల్సింది…’
‘పిచ్చిపిచ్చిగా ఉందా?’
‘ తగిన శాస్తి చేయాలి నీకు!’
‘అసలు నీ మర్మాంగం కత్తిరించేయాలి!’
కొసాక్కులు మెల్లగా ముందుకు సాగిపోయారు. మెల్లగా చిన్న పట్టణ ప్రాంతమైన లుబోవ్ తర్వాత కొండ కింద నుండి దృష్టిపథంలోకి వచ్చింది. వాళ్లు దాటిన కొండ వెనుక నుండి సూర్యుడు అప్పుడే ఉదయించాడు. అక్కడ ఉన్న ఓ చెట్టు మీద ఓ పిట్ట తన మనసును పాట చేసి పాడుతూ ఉంది.
అప్పుడే శిక్షణ పూర్తి చేసుకున్న అష్టకోవ్ కు ఆ కొత్త ప్రాంతంలో ఆ దళం బాధ్యత అప్పగించబడింది.ఆ పట్టణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఆఖరి ఇంటిని తన దళ నివాసం. కోసం అతను ఎంచుకున్నాడు.దొడ్డి కాళ్ళతో, గుండుగా ఉన్న తలల
పై తెల్లటి టోపీ ధరించిన ఆ ఇంటి యజమాని కొసాక్కులను బయట ఉన్న పాక దగ్గరకు తీసుకువెళ్ళి ఎక్కడ గుర్రాలను ఉంచాలో చెప్పాడు. ఆ పాక వెనుక ఒక కంచె,దాని వెనుక పచ్చటి మొక్కలతో ఉన్న చిన్న తోట లాంటిది ఉంది. దానికి దగ్గరలో పెద్ద చెట్లతో నిండి ఉన్న గుట్ట ప్రాంతం,దానికి కొద్దిగా దూరంలో రోడ్డుకి అవతల జొన్న తోటలు ఉన్నాయి, ఆ తర్వాత పచ్చటి గడ్డి చెట్ల ప్రాంతం ఉంది. కంచె దగ్గర ఉన్న మురికిగుంట దగ్గర కొందరు కొసాక్కులు బైనాక్యులర్స్ తో తమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని గమనిస్తూ ఉంటే, ఇంకొందరు ఆ పాకలో చల్లగా ఉన్న చోట విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ పాకంతా ఎండు గడ్డి, ఊక పొట్టు,ఎలుకల విసర్జాలతో కలిసిన వాసన వస్తూ ఉంది.
ఇవాన్ కోవ్ నాగలి పక్కగా చీకటిగా ఉన్న ఓ మూల దగ్గర తన పక్క ఏర్పాటు చేసుకుని సాయంత్రం వరకు నిద్ర పోయాడు. సూర్యాస్తమయం తర్వాత అతను నిద్ర లేవాల్సి వచ్చింది. క్రిచ్ కోవ్ అతని మెడ వెనుక ఉన్న చర్మాన్ని పట్టుకుని, గట్టిగా లాగాడు. దాని వల్లే అతనికి మెలకువ వచ్చింది.
‘అబ్బా! ప్రభుత్వ సొమ్ముతో ఎలా నిగారించింది నీ చర్మం! ఇక మొద్దు నిద్ర చాలు. లేచి, జర్మన్లు వస్తారేమో కాపలా కాయి.’
‘నాతో పరిహాసాలాడకు,కోజ్మా!’
‘ఇక లే!’
‘అబ్బా….ఇక చాలు! నేను లేస్తున్నాను…నస ఆపు!’
ఇవాన్ కోవ్ పైకి లేచాడు. అతని ఎర్రబడి కొద్దిగా వాచినట్టు ఉంది. విశాలమైన భుజాలకు చిన్న మెడతో బిగించిన కాగులా ఉంటుంది అతని ముఖం. తేమగా ఉన్న నేల మీద పడుకోవడం వల్ల జలుబు చేసి,అతను చీదుతూ ఉన్నాడు. తూటాలు పెట్టుకోవడానికి ఉండే తోలు సంచిని సరిచేసుకుని,తుపాకీ అందుకుని,ఆ పాక బయటకు నడిచాడు. అప్పటి వరకు ఆ బాధ్యత తీసుకున్న స్టెగోల్ కోవ్ కూడా అతని పక్కనే నిలబడ్డాడు. ఇవాన్ కోవ్ బైనాక్యులర్స్ తో సమీపంలో ఉన్న అడవి వైపు ,నైరుతి దిక్కు వైపు చూస్తూ ఉన్నాడు.
సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో ఉన్న సూర్యుణ్ణి ఆ అడవిలోని చెట్లు కప్పేశాయి. కొందరు పిల్లలు ఆ సమీపంలో అరుస్తూ ఆడుకుంటున్నారు.ఒక స్త్రీ తన కొడుకుని పిలుస్తూ ఉంది. స్టెగోల్ కోవ్ ఒక సిగరెట్టు వెలిగించుకుని,వెళ్ళిపోతూ, ‘ఎంత బవౌంది సూర్యాస్తమయం!తప్పకుండా బలమైన గాలులు వీస్తాయి’,అన్నాడు.
‘హా ..అవును’ఇవాన్ కోవ్ ఒప్పుకున్నాడు.
ఆ రాత్రి గుర్రాలను స్వేచ్చగా వదిలేసారు.ఆ రాత్రి చీకటిలో ఆ చిన్న పట్టణం నిశ్శబ్దంగా ఉంది. ఆ తర్వాతి ఉదయం క్రిచ్ కోవ్ పాకలో ఉన్న ఇవాన్ కోవ్ ని పిలిచాడు.
‘మనం పట్టణంలోపలికి వెళదాం రా.’
‘దేనికి?’
‘ఏదో ఒకటి తిని, తాగి వద్దాం.’
‘ఏమి ఉండకపోవచ్చు’,ఇవాన్ కోవ్ అనాసక్తితో అన్నాడు.
‘ఉన్నాయి. నేను అడిగి తెలుసుకున్నాను. ఆ పెద్ద భవనం వెనుక ఒక చిన్న చిల్లు కనిపిస్తుంది, చూసావా?’క్రిచ్ కోవ్ నల్లగా ఉన్న తన మధ్య వేలితో ఓ వైపుకి చూపిస్తూ అడిగాడు.’అక్కడ ఓ యూదుడు నివసిస్తున్నాడు. అతని దగ్గర బీరు ఉంది. వెళ్దామా?’
వారిద్దరూ వెళ్తూ ఉంటే, అష్టకోవ్ వారిని పాక తలుపు దగ్గర నుండి పిలిచాడు.
‘ఎక్కడికి వెళ్తున్నారు?’
అష్టకోవ్ కన్నా సైన్యానుభావంలో సీనియర్ అయిన క్రిచ్ కోవ్ అతన్ని పట్టించుకోలేదు.
‘మేము త్వరగానే తిరిగి వచ్చేస్తాము.’
‘వెనక్కి రండి!’
‘కుక్కలా అరవకు!’
ఛాతి మీదా ఎక్కువ జుట్టుతో, పెద్ద కనుబొమ్మలతో ఉన్న ఆ ముసలి యూదుడు ఆ కొసాక్కులు లోపలికి రాగానే వినయంగా కిందకి వంగాడు.
‘బీర్ ఉందా?’
‘కొసాక్కు సార్, బీరు లేదు.’
‘మేము డబ్బులిస్తాము.’
‘ఆ దేవుడి మీద ఒట్టు, అసలు నేను దాని గురించి ఆలోచిస్తానా… నన్ను నమ్మండి, నేను నిజాయితీ ఉన్న యూదుడిని, నిజంగానే బీరు లేదు.’
‘నువ్వు అబద్దం చెప్తున్నావు!’
‘కానీ, కొసాక్కు సార్… నిజంగానే లేదు.’
‘సరే, నువ్వు ఇటు చూడు…’ క్రిచ్ కోవ్ మధ్యలో కల్పించుని, తన జేబులో ఉన్న డబ్బుల సంచి లో నుంచి ఒక నాణెం తీసి అతని అరచేతిలో పెడుతూ,’నువ్వు మాకు ఇస్తున్నావు లేకపోతే నాకు కోపం వస్తుంది’అన్నాడు.
ఆ యూదుడు తన అరచేతిలో ఉన్న నాణెంని రెండు వేళ్ళతో పట్టుకుని,తన కళ్ళు కిందకు దించుకుని వసారాలోకి వెళ్ళాడు.
ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అతను ఒక వోడ్కా సీసాతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ సీసా బయట తడిగా ఉండి, బార్లీ పొట్టు దానికి అంటి ఉంది.
‘నీ దగ్గర లేదని చెప్పావు. అది కాదు చెప్పాల్సిన పద్ధతి, వెధవా!’
‘నేను బీరు లేదని చెప్పాను.’
‘మాకు తినడానికి ఏదైనా పెట్టు.’
క్రిచ్ కోవ్ ఆ సీసా మూత తెరిచి ఒక కప్పు నిండా నింపాడు.
వాళ్ళు సగం తాగి అక్కడి నుండి బయటకు వచ్చారు.
క్రిచ్ కోవ్ చిన్న గంతు వేసి, వేగంగా నడిచాడు.
అష్టకోవ్ పాకలో ఆవులిస్తూ కూర్చుని ఉన్నాడు. అతని వెనుక కొంత దూరంలో గుర్రాలు గడ్డి మేస్తూ ఉన్నాయి.
ఆ సాయంత్రం పోపోవ్ ఒక నివేదికతో వచ్చాడు.ఆ రోజంతా ఏ పని లేకుండా గడిచిపోయింది.
సాయంత్రం రాత్రిగా మారింది. యవ్వనంలో ఉన్న చంద్రుడు ఏదో కత్తి గాటు పడిన వాడిలా ఆ పట్టణం పైన తల వాల్చుకున్నాడు.
అప్పుడప్పుడు ఆ ఇంటి వెనుక ఉన్న తోటలో పండిన ఆపిల్ పండు కింద పడుతూ ఉన్న శబ్దం వినిపిస్తుంది. దాదాపుగా అర్ధరాత్రి అవుతున్న సమయంలో ఇవాన్ కోవ్ కి గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది.అతను మురికి గుంట పక్కగా పాక్కుంటూ, ఆ శబ్దం వచ్చిన వైపు చూస్తే అతనికి ఆకాశంలో చంద్రుడిని కప్పిన ఓ మేఘం, చీకటి తప్ప ఏమి కనబడలేదు.
అతను వెంటనే పాక తలుపు దగ్గర పడుకుని ఉన్న క్రిచ్ కోవ్ ని కుదిపాడు.
‘కోజ్మా, ఎవరో గుర్రాల మీద వస్తున్నారు!నిద్ర లే!’
‘ఎక్కడ నుండి?’
‘పట్టణం వైపు నుండి.’
ఆ ఇద్దరూ బయటకు వచ్చారు. గుర్రపు డెక్కల శబ్దం ఇప్పుడు వంద అడుగుల నుండి వినబడటం వారికి స్పష్టంగా వినిపించింది.
‘పద, తోటలోకి వెళదాం… అక్కడైతే ఇంకా బాగా వినిపిస్తుంది.’
వాళ్ళు ఆ చీకట్లో ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్ళి, అక్కడ ఉన్న కంచె దగ్గర నిలబడ్డారు. గొణుగుతున్నట్టు ఎవరివో మాటలు వినబడుతున్నాయి. కిర్రుమంటున్న గుర్రపు జీన్ల శబ్దం దగ్గరవుతూ ఉంది. ఆ ధ్వనులు ఇంకా దగ్గరయ్యాయి.కొద్ది నిమిషాల్లోనే గుర్రాల మీద వస్తున్న మనుషుల ఆకారాలు కనిపించాయి.
వాళ్ళు నలుగురు నలుగురుగా ముందుకు వెళ్తున్నారు.
‘ఎవరు వెళ్ళేది అక్కడ?’
‘ఎవరైతే నీకు ఎందుకు?’ఆ బృందంలోని ఓ అధికారిక స్వరం బదులిచ్చింది.
‘ఎవరు వెళ్లేదక్కడ? చెప్పకపోతే నా తుపాకీతో కాలుస్తాను!’క్రిచ్ కోవ్ తన తుపాకీని బయటకు తీసాడు.
‘ఓ!’ అంటూ,వారిలో ఒకడు ఆ కంచె వైపుకి తన గుర్రాన్ని తెచ్చాడు.
‘ఏంటిది? సరిహద్దు పోస్టా?’
‘అవును,అదే.’
‘ఏ రెజిమెంట్?’
‘మూడవ కొసాక్కు దళం.’
‘త్రిషిన్, అక్కడ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు?’ వెనుక చీకట్లో నుండి ఎవరో అడిగారు.
ఆ ముందుకొచ్చిన వ్యక్తి, ‘ఇది కొసాక్కుల ఔట్ పోస్టు, సార్!’ అంటూ సమాధానం చెప్పాడు.
ఇంకో వ్యక్తి అక్కడికి వచ్చాడు.
‘హలో, కొసాక్కులారా!’
‘హలో’ ఇవాన్ కోవ్ కొద్ది విరామం తర్వాత బదులిచ్చాడు.
‘చాలా కాలం నుండి ఇక్కడే ఉన్నారా?’
‘లేదు, నిన్నటి నుండే.’
ఆ రెండవ వ్యక్తి సిగరెట్టు వెలిగించుకున్నాడు. ఆ వెలుతురులో క్రిచ్ కోవ్ సరిహద్దు గార్డు యూనిఫారం ధరించిన ఓ అధికారిని చూశాడు.
‘మా సరిహద్దు రెజిమెంటు సరిహద్దు నుండి వెనుదిరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి -మీరే మొదటి వరుసలో ఉండేది. బహుశా శత్రువు రేపు ఈ దిక్కులోనే రావొచ్చు ‘, ఆ అధికారి సిగరెట్టు కాలుస్తూ చెప్పాడు.
‘సార్, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు?’క్రిచ్ కోవ్ అడిగాడు.
‘ఇక్కడి నుండి రెండు వెరస్టుల దూరంలో ఉన్న దళంతో కలవడానికి వెళ్తున్నాము. ఇక కదలండి. సరే కొసాక్కులు ఇక వెళ్తాము!’
‘మీ ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నాను.’
బలమైన గాలి జాలి లేకుండా ఆ చంద్రుడి పై ఉన్న మేఘపు పట్టిని విదిలించింది. సన్నటి చంద్రకాంతి ఆ పట్టణం మీద, ఆ తోట, పాక పైన ప్రతిబింబించింది.
ఆ తర్వాతి ఉదయం వాచోవ్ ఆ దళం వద్దకు ఓ నివేదికతో వచ్చాడు. అష్టకోవ్ ఆ ఇంటి యజమానితో మాట్లాడాక కొంత పైకానికి అతని పొలంలో గుర్రాలకోసం గడ్డి కోసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళు గుర్రాలనే కట్టేసే ఉంచారు. శత్రువుతో ముఖాముఖి తలపడాల్సి వస్తుందన్న విషయం తెలియరావడంతో కొసాక్కులు ఒక్కసారిగా జాగురుకులయ్యారు. అప్పటి వరకు, వారికి సరిహద్దు సైన్యం పహారా కాస్తుందనే తెలుసు;అందుకే ఒంటరిగా ఉన్న భావన కలగలేదు. కానీ ఇప్పుడు ఆ సరిహద్దు దగ్గర ఎవరూ ఇప్పుడు లేరన్న విషయం వారి భావోద్వేగాల పై గొప్ప ప్రభావాన్నే చూపింది.
వారికి ఆతిథ్యం ఇచ్చిన యజమాని పొలం ఆ పాకకి దగ్గరలోనే ఉంది. అష్టకోవ్ ఇవాన్ కోవ్ ని, స్టెగోల్ కోవ్ ని గడ్డి కోయడానికి పంపించాడు.ఆ పొలాండ్ వాడు తన టోపీని సరిచేసుకుంటూ వారిని ఆ పొలం వైపుకి తీసుకువెళ్ళాడు. స్టెగోల్ కోవ్ గడ్డి కోస్తూ ఉంటే, ఇవాన్ కోవ్ ఆ గడ్డిని గడ్డి సంచుల్లో నింపుతూ ఉన్నాడు. ఈ లోపు అష్టకోవ్ బైనాక్యూలర్స్ పెట్టుకుని, ఆ రోడ్డు నుండి సరిహద్దు వైపు చూస్తూ ఉన్నప్పుడు,ఒక పిల్లవాడు పొలాల మీదుగా నైరుతి దిక్కు నుండి పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది.ఆ పిల్లవాడు దూరం నుండే కుక్కలు తరుముతున్న కుందేలు పిల్లలా పరిగెడుతూ, ఆ దూరం నుండే చేతులు ఊపుతూ అరుస్తూ ఉన్నాడు. రొప్పుకుంటూ అష్టకోవ్ దగ్గరకు వచ్చాడు.
‘కొసాక్కు!కొసాక్కు…. జర్మన్ వాళ్ళు…. జర్మన్ వాళ్ళు వచ్చారు!’
వదులుగా ఉండి జారిపోతూ ఉన్న చొక్కాను సరిచేసుకుంటూ, దూరంగా చూపిస్తే, అష్టకోవ్ తన బైనాక్యూలర్స్ నుండి చూస్తే, గుంపులుగా గుర్రాల మీద వస్తున్న వారు కనిపించారు.
‘క్రిచ్ కోవ్!’ అని గట్టిగా అరిచాడు.
క్రిచ్ కోవ్ ఆ పాక తలుపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, చుట్టూ చూశాడు.
‘పరుగెత్తుకెళ్లి మన వాళ్ళని పిలుచుకురా!జర్మన్లు వచ్చేసారు!జర్మన్ల పహారా బృందం వచ్చేసింది!’
క్రిచ్ కోవ్ పరిగెడుతున్న శబ్దం అతనికి వినిపించింది. తన బైనాక్యూలర్స్ గుండా మరలా ఆ వైపు చూశాడు.గుంపుల కొద్ది జర్మన్లు గుర్రాల మీద పచ్చిక బీడు దగ్గర ఉండటం అతనికి కనిపించింది.
అతనికి ఆ గుర్రాల రంగులు, ఆ యూనిఫారాల రంగు కూడా స్పష్టంగా కనిపించసాగింది. వాళ్ళు ఇరవై మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళు ఏ వ్యూహం లేకుండా మాములుగా గుంపుగా కదులుతూ ఉన్నారు;వాళ్ళు నైరుతి దిక్కు నుండి వస్తున్నారు, కానీ వారు వాయువ్య దిశలో వస్తారన్న కొసాక్కుల అంచనా తప్పింది.వాళ్ళు రోడ్డు దాటి ఆ పట్టణం పైన ఉన్న కొండ ప్రాంతాన్ని చేరుకున్నారు.
అలసటతో రొప్పుతూ నాలుక రెండు పెదాల నుండి బయటకు పెట్టి, ఇవాన్ కోవ్ తన చేతినిండుగా గడ్డి తీసుకుని సంచుల్లో నింపుతున్నాడు.దొడ్డి కాళ్ళ పొలాండ్ రైతు అతని పక్కనే నిలుచుని పొగ కాలుస్తున్నాడు.
తన చేతులను ప్యాంటు జేబుల్లో పెట్టుకుని, గడ్డి కొస్తున్న స్టెగోల్ కోవ్ వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు.
‘దీన్ని కొడవలి అంటారా ఎవరైనా?’స్టెగోల్ కోవ్ తనలో తానే గొణుక్కుంటూ అన్నాడు. ఆ తర్వాత ఆ పొలాండ్ వాడి వైపు తిరిగి,’నువ్వు దీనితో గడ్డి కోస్తావా?’అని అడిగాడు.
‘నేను కోస్తాను’, అని అతను బదులిచ్చాడు, ఒక జేబులో నుండి చేతిని బయటకు తీస్తూ.
‘నీ కొడవలి ఎందుకు పనికొస్తుందో తెలుసా నీకు… ఆడదాని ముఖ్య అవయం దగ్గర ఉండే ..’ ‘హా ‘, అతను ఒప్పుకుంటున్నట్టు తల ఆడించాడు.
ఇవాన్ కోవ్ ముసిముసిగా నవ్వుకుంటూ ఏదో అనబోయాడు కానీ అతను పక్కకు తిరిగి చూసేసరికి క్రిచ్ కోవ్ పొలం వైపు తన కరవాలాన్ని సరి చేసుకుంటూ, పరిగెత్తుకుంటూ రావడం చూశాడు.
‘పని ఆపండి!’
‘ఇప్పుడేమైంది?’ఇవాన్ కోవ్ ఆ కొడవలి అంచుని నేలకు తాకిస్తూ అడిగాడు.
‘జర్మన్లు!’
ఇవాన్ కోవ్ సంచిని కింద వదిలేశాడు. వారికి ఆతిథ్యమిచ్చిన వ్యక్తి భయంతో దాదాపు నేలను తాకేంత కిందకు వంగి, ఆపాటికే పైన తూటాలు అతని తల పైన విహరిస్తున్నట్టు భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
వాళ్ళు వెంటనే పాక దగ్గరకు వెళ్ళి, తమ గుర్రాల మీదకు ఎక్కే సరికి,రష్యన్ సైనికులు పెలికాలియే దిక్కు నుండి పట్టణంలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళు కొసాక్కుల దగ్గరకు వచ్చారు. అష్టకోవ్ ఆ దళపు కమాండర్ కు జర్మన్ పహారా దళం పట్టణం వైపుకి వస్తూ ఉందని, కొండ వరకు వచ్చేసిందని చెప్పాడు. ఆ మేజర్ తీక్షణంగా దుమ్ము పట్టి ఉన్న అతని బూట్ల వైపు చూస్తూ,’ఎంతమంది ఉన్నారు?’ అని అడిగాడు.
‘ఇరవై కంటే ఎక్కువమందే ఉన్నారు.’
‘ఇప్పుడే బయల్దేరి వారిని తరిమికొట్టండి. మేము వాళ్ళ పని పడతాము ఇక్కడ నుండే’, అతను తన దళం వైపు తిరిగి, వారికి ఆదేశం ఇచ్చి, వారితో కలిసి త్వరగా మార్చింగ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు.
కొసాక్కులు కొండ దగ్గరకు గుర్రాల మీద వచ్చేసరికి, జర్మన్లు వారి కన్నా ముందు ఉన్నారు, అప్పటికే వారు పెలికాలియే వెళ్ళే దారిలో వెళ్తున్నారు. వారి అధికారి పొట్టి తోక ఉన్న ఒక గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు.
‘వారిని వెంబడించండి!మనం వాళ్ళని రెండవ ఔట్ పోస్టు వైపు తరమాలి!’ అష్టకోవ్ ఆజ్ఞాపించాడు.
పట్టణం దగ్గర వారితో కలిసిన సరిహద్దు గార్డు కొద్దిగా ముందుకు వెళ్ళాక వెనుదిరిగాడు.’ఏమైంది? అప్పుడే ఓపిక అయిపోయిందా, సోదరుడా?’ అష్టకోవ్ వెనక్కి తిరిగి, అరిచాడు అతన్ని ఉద్దేశించి.
ఆ సరిహద్దు గార్డు వీడ్కోలు సూచనగా చేయి ఊపి,పట్టణం వైపు వెళ్ళిపోయాడు. కొసాక్కులు మధ్యస్థ వేగంతో ముందుకు వెళ్ళారు.
నీలం రంగు యూనిఫారాలు ధరించిన జర్మన్ సైనికుల బృందం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారు ఆ పట్టణానికి మూడు వెరస్టుల దూరంలో ఉన్న రెండవ ఔట్ పోస్టు వైపు వెళ్తూ ఉన్నారు.వారు ముందుకు వెళ్తూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి కొసాక్కుల వైపు చూస్తూ ఉన్నారు. ఆ ఇరువురి మధ్య దూరం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది.
‘వారి మీద కాల్పులు జరుపుదాము!’అష్టకోవ్ అరుస్తూ, గుర్రం మీద నుండి దిగాడు.
వాళ్లందరూ కూడా గుర్రాల మీదా నుండి దిగి,కాల్పులు జరిపారు.ఇవాన్ కోవ్ గుర్రం వెనుక నుండి అతన్ని ముందుకు తోసింది. అతను కింద పడేటప్పుడు ఒక జర్మన్ వాడు గుర్రం మీద నుండి కింద పడటం చూశాడు.ముందు అతను బద్ధకంగా చేతులు పక్కకు వాల్చినట్టు వాల్చి, తర్వాత రెండు చేతుల మీద బొక్క బోర్లాగా కింద పడ్డాడు. జర్మన్లు ఎవరూ ఆగలేదు, ప్రతి చర్యకు పాల్పాడలేదు, దాని బదులు వారు వేగం పెంచి ముందుకు సాగిపోయారు. బలంగా వీస్తున్న గాలి వల్ల వారి కరవాలాలు కదులుతూ ఉన్నాయి. కొసాక్కులలో మొదట అష్టకోవ్ గుర్రం పైకి ఎక్కాడు. అందరూ వారి కొరడాలు గట్టిగా అదిలించారు.
ఆ జర్మన్ పహారా బృందం ఎడమ వైపుకి తిరిగి వెళ్తూ ఉంటే, వారిని వెంబడిస్తూ వంద అడుగుల దూరంలో కొసాక్కులు ఆ పడిపోయిన జర్మన్ మీదుగా సాగిపోయారు. ఆ తర్వాత కొండ ప్రాంతం ఉండటం వల్ల దారి సుమగంగా లేదు. వారికి కొండ అవతల భాగంలో జర్మన్లు కనిపించినప్పుడల్లా కొసాక్కులు గుర్రాలు దిగి ఆ వైపు కాల్పులు జరిపేవారు.
రెండవ ఔట్ పోస్టుకి వచ్చేసరికి ఒక దళాన్ని కాల్పులతో మట్టి కరిపించారు.
‘దొరికారు!’ ఉత్సాహంగా గుర్రం మీద దౌడు తీస్తున్న క్రిచ్ కోవ్ అరిచాడు.
‘మన వాళ్ళు ఈ ఔట్ పోస్ట్ దగ్గరకు ఏ క్షణంలో అయినా రావొచ్చు!అదిగో కనిపిస్తుందే భవనం,అదే రెండవ ఔట్ పోస్ట్…’అష్టకోవ్ చిన్నగా గొణుగుతున్నట్టు అని,పొగాకు మరకలతో ఉన్న బొటన వేలితో తన తుపాకీలో తూటాలు నింపాడు.
జర్మన్లు ఏ కంగారు లేకుండా నింపాదిగా ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్తూ ఖాళీగా ఉన్న ఆ భవనం వైపు వారు చూశారు. అష్టకోవ్ గుర్రం మీద నుండే కాల్పులు జరిపాడు. ఆ జర్మన్ బృందాలలో వెనుకబడిన ఒకడు ఆ కాల్పులకి ఉలిక్కిపడి ఒక్కసారిగా వేగం పుంజుకుని గుర్రాన్ని దౌడు తీయించాడు.
రెండవ ఔట్ పోస్టు దగ్గర కొసాక్కులు అంతకుముందే రాత్రే తొలగినట్టు వారికి తర్వాత తెలిసింది. దానికి కారణం ఆ భవనం నుండి టెలిగ్రాఫ్ వైర్లు ఒక అర వెరస్టు దూరంలో తెగిపోవడం.
‘అయితే వాళ్ళని మొదటి ఔట్ పోస్టు వైపుకి తరుముదాము!’ అష్టకోవ్ మిగిలిన వాళ్ళ వైపు తిరిగి అరిచాడు.
ఆ క్షణంలో అష్టకోవ్ ముక్కు దగ్గర చర్మం తెగి ఒక నాసిక దగ్గర వేలాడుతూ ఉండటం ఇవాన్ కోవ్ గమనించాడు.
‘వాళ్ళు స్థిరంగా ఉండొచ్చు కదా!ఎందుకు ఉండరు?’తన తుపాకిని సర్దుకుంటూ ఇవాన్ కోవ్ అడిగాడు.
‘బహుశా అలా ఉంటారేమో… ఉండొచ్చు….’ గుర్రంతో పాటు రొప్పుతూ వస్తున్న స్టెగోల్ కోవ్ అరిచాడు.
జర్మన్లు ముందుకు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండానే ముందు ఉన్న లోయ ప్రాంతం వైపుకి సాగిపోయారు.అవతలి వైపు ఒక పొలం కనిపిస్తూ ఉంది;ఆ పొలంలో ఓ పక్క కలుపులు మొక్కలు పెరిగి ఉన్నాయి. అష్టకోవ్ తన టోపీని వెనక్కి లాక్కుని, తన చేతితో ముఖం మీద చెమట తుడుచుకుంటూ, వేగంగా గుర్రాన్ని ముందుకు దుమికించాడు. అతను ఇతరుల వైపు చూస్తూ, కింద ఉమ్మి,’ఇవాన్ కోవ్, కింద లోయ దగ్గరకు వెళ్ళి చూడు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో?’
ఇటుకలా ఎర్ర బడిన ముఖంతో, వెనకంతా చెమటతో తడిచి ఉన్న ఇవాన్ కోవ్ పెదవులు తడుపుకుని, ఆ దిశలో వేగంగా ముందుకు వెళ్ళాడు.
‘ఓ, ఓ దమ్ము కొడదామని ఆగాను అంతే’, అంటూ క్రిచ్ కోవ్ చిన్నగా గొణిగి, తన కొరడాతో చుట్టూ ముసురుకున్న పురుగులను అదిలించాడు.
ఇవాన్ కోవ్ గుర్రం మీద నిలబడినట్టే పోనిస్తూ ముందుకు చూస్తూ నెమ్మదిగా వెళ్తూ లోయ ప్రాంతం వైపు చూస్తూ ఉన్నాడు. మొదట అతనికి కదులుతున్న కరవాలాల చప్పుడు, దాని తర్వాత అతని కళ్ళ ఎదుట జర్మన్లు ప్రత్యక్షమయ్యారు.వాళ్ళు తమ గుర్రాలను వెనక్కి తిప్పి ఏటవాలు మార్గం వైపుకి వేగంగా వస్తున్నారు.ఆ దళం ముందు వారి నాయకుడు ఖడ్గం పైకెత్తి వేగంగా ముందుకు దూసుకువస్తున్నాడు. ఒక్క క్షణం పాటు ఆ అధికారి తన గుర్రాన్ని ముందుకు దౌడు తీయిస్తుంటే ఇవాన్ కోవ్ గడ్డం లేని అతని ముఖంలో కోపం కనిపించింది,అతను తీరిగ్గా చూద్దామనుకునేలోపే జర్మన్ల గుర్రపు డెక్కల శబ్దం అతని వెన్నులో వణుకు పుట్టించి అతన్ని భయపెట్టింది.
అష్టకోవ్ కి తన పొగాకు సంచి వెనక జేబులో పెట్టే వ్యవధి కూడా లేకపోవడంతో దాన్ని అక్కడే నేల మీద పడేశాడు.
ఇవాన్ కోవ్ వెనుక జర్మన్లు గుంపుగా రావడం మొదట గమనించిన క్రిచ్ కోవ్ వేగంగా గుర్రాన్ని ముందుకు లంఘించాడు. ఇవాన్ కోవ్ వెనుక ఉన్న జర్మన్లు అతని మీద దాడి చేయాలని వేగంగా వెంబడిస్తూ ఉన్నారు. ఇవాన్ కోవ్ గుర్రాన్ని ముందుకు దౌడు తీయిస్తూ మధ్యమధ్యలో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అతని ముఖమంతా పాలిపోయి,భయంతో రక్తం ఇంకిపోయినట్లు అయిపోయాడు. అష్టకోవ్,వెంటనే మెరుపు వేగంతో ముందుకు వెళ్ళాడు. క్రిచ్ కోవ్,స్టెగోల్ కోవ్ ముందుకు వెళ్తూ ఉంటే ఒక దుమ్ము పొర గాలిలోకి లేచింది.
‘వాళ్ళు నన్ను పట్టుకుంటారు!’ ఈ ఆలోచనతో ఇవాన్ కోవ్ మెదడు స్థంభించిపోయి,తనను తాను కాపాడుకోవాలన్న ఆలోచనే తట్టలేదు. తన శరీరాన్ని ఒక ముద్దలా చేసి, గుర్రపు మెడకి దగ్గరగా వంగి,వేగంగా గుర్రాన్ని పోనిస్తూ వెళ్తున్నాడు.
పెద్ద గడ్డంతో ఉన్న ఒక జర్మను అతన్ని దాటి ముందుకు వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ వెనుక నుండి ఖడ్గంతో ఒక పోటు పొడిచాడు.ఆ కత్తి అతని బెల్టుని తాకి, ఒక ఇంచు మేర అతని శరీరంలో దిగబడింది.
‘పారిపోండి!’ అని అతను పిచ్చిగా అరుస్తూ,తన ఖడ్గాన్ని బయటకు తీశాడు. అతని వైపు గురి పెట్టబోతున్న రెండవ కత్తి పోటుని అతని ఎదుర్కోవడానికి సిద్ధమై,తన ఎడమ వైపుకి వచ్చిన జర్మన్ ని వెనుక పొడిచాడు. అతన్ని అందరూ చుట్టుముట్టారు. ఒక జర్మన్ గుర్రం అతని గుర్రం దగ్గరకు వచ్చింది,అతని కళ్ల ముందు భయపడుతూ ఉన్న ఒక విదేశీ ముఖం కనిపించింది.
అష్టకోవ్ ముందు ఆ ప్రదేశానికి వచ్చాడు. అతని మీద దాడి చేసి,అతన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేసినా,అతను గుర్రం మీద నుండే అటూయిటూ మెలికలు తిరుగుతూ తన ఖడ్గంతో వారిని ఎదుర్కుంటూనే ఉన్నాడు,అతని ముఖంలో చావు భయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక జర్మన్ ఖడ్గం ఇవాన్ కోవ్ మెడ మీద వేటు వేసింది. అతని ఎడమ వైపు ఒక బృందం వచ్చింది, ఒక ఖడ్గం అతని కంటి మీద దాడి చేస్తే,ఇంకొకటి అతని భుజాన్ని రక్తసిక్తం చేసింది. అతనికి వెనుక స్ఫోటక మచ్చలతో, చెమట పట్టి ఉన్న ఒక వృద్ధ జర్మన్ కనిపించాడు. కింద దవడ వణుకుతూ ఉండగా, అతను ముందుకు వస్తూ ఇవాన్ కోవ్ ఛాతీ మీద వేటు వేయడానికి వస్తూ ఉన్నా,అతన్ని అందుకోలేకపోయాడు. అక్కడితో అతను ఆ ఆ ఖడ్గాన్ని వదిలేసి,పక్కనే ఉన్న పెద్ద తుపాకీని అందుకుని, భయపడుతున్న కళ్ళతో ఇవాన్ కోవ్ వైపు చూశాడు. అతను ఆ తుపాకీతో కాల్చబోయేలోపే అక్కడికి క్రిచ్ కోవ్ తన ఖడ్గంతో వచ్చాడు.ఆ వేటుకి అతను వెనక్కి వాలిపోయి,భయపడుతూ, ‘చచ్చాను రా!’అని అరిచాడు.
దాదాపుగా ఎనిమిది జర్మన్ బృందాలు క్రిచ్ కోవ్ ని చుట్టుముట్టాయి,అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలని. కానీ అతను తన గుర్రాన్ని మెరుపు వేగంతో వెనక్కి తిప్పుతూనే, పొట్ట పై భాగ శరీరాన్ని వేగంగా కదిలిస్తూ,తన ఖడ్గంతో వారితో పోరాడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కత్తి అతని చేతిలో నుండి జారిపోయిందో,అప్పుడు అతను తనకు దగ్గరలో ఉన్న జర్మన్ ఈటె తీసుకుని దానిని తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు.
ఆ జర్మన్లు వెనక్కి తగ్గి,ఆ ఈటెను తమ కత్తులతో ఎదుర్కున్నారు. ఆ తర్వాత అందరూ ముందుకు వేగంగా సాగిపోయారు,పక్కన,వెనుక ఉన్న శత్రువుల మీద దాడి చేస్తూ ముందు ఉన్న పొలంలోకి వెళ్లారు. భయంతో వణికిపోతున్న జర్మన్లు,కొసాక్కులు తమకు కనిపించిన ఎదురొచ్చిన ప్రతి దానిపైన దాడి చేశారు;చేతులు,వీపులు,గుర్రాలు,ఆయుధాలు ఏది కనిపించినా సరే వారు తమ కత్తులతో వాటిని పొడిచారు. భయంతో ఉన్న గుర్రాలు కూడా ముందు ఉన్న గుర్రాలను తగులుకుంటూ,తొక్కిసలాటలో దౌడు తీస్తున్నాయి. కొద్దిగా తన భయాన్ని పోగొట్టుకున్న ఇవాన్ కోవ్, తనకు సమీపంలో ఉన్న బృందం మీద ఆపకుండా ప్రతిదాడి చేస్తూనే ఉన్నాడు.
అష్టకోవ్ రక్తం కారుతూ ఉంటే, ముందుకు రొప్పుతూ గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు.అతన్ని వెంబడించిన జర్మన్ అధికారిని తన తుపాకీతో గురి పెట్టి కాల్చాడు,ఆ తూటా అతని భుజం మీదుగా లోపలికి దూసుకుపోయింది,ఆ ఒక్క తూటాకే అతను చచ్చిపోయాడు. ఆ యుద్ధంలో అదే మలుపు తిప్పే సన్నివేశం. అప్పటికే గాయాలతో ఏ దిశా నిర్దేశం లేకుండా ఉన్న జర్మన్లు తమ నాయకుడు చచ్చిపోవడంతో భయపడి తమకు తోచిన దిక్కుకి విడివడి పారిపోయారు. ఎవరూ కూడా కొసాక్కులను వెంబడించలేదు,వారిపై దాడి చేసే ప్రయత్నం చేయలేదు ఆ తర్వాత. కొసాక్కులు సరాసరి పెలికాలేకి,అక్కడి నుండి తమ దళ నివాసానికి వెళ్ళిపోయారు. జర్మన్లు గాయపడి కిందపడి ఉన్న ఒక జర్మన్ సైనికుడిని తీసుకుని సరిహద్దు వైపుకి వెళ్ళిపోయారు.
ఒక అర వెరస్టు దూరం ప్రయాణించిన తర్వాత,ఇవాన్ కోవ్ గుర్రపు జీను మీద వాలిపోయాడు.
‘ఇక నేను వెళ్ళలేను…. కింద పడిపోయేలా ఉన్నాను!’అన్నాడు.అష్టకోవ్ అతని వెనక్కి వచ్చి,అతనికి ఆసరా ఇస్తూ,’పర్లేదు,పద’అన్నాడు.
క్రిచ్ కోవ్ తన ముఖం మీద ఉన్న రక్తాన్ని తుడుచుకున్నాడు,అతని బట్టలు కూడా రక్తంతో నిండిపోయి ఉన్నాయి.
ఏ భవనం వద్ద అయితే రెండవ ఔట్ పోస్ట్ అంతకుముందు ఉందో,అక్కడ వారు విడిపోయారు.
‘ఇప్పుడు మేము కుడి వైపుకి వెళ్తాము’,అష్టకోవ్ ఆ దిశలో ఉన్న పచ్చటి చెట్ల వైపు చూపిస్తూ అన్నాడు.
‘లేదు,ఎడమ వైపుకి వెళ్దాం’,క్రిచ్ కోవ్ గట్టిగా అన్నాడు.
వాళ్ళు విడిపోయారు. తర్వాత కొద్దిసేపటికి అష్టకోవ్, ఇవాన్ కోవ్ పట్టణానికి వచ్చారు. వారి దళానికి చెందిన కొసాక్కుల బృందం సరిహద్దుల దగ్గర వారి కోసం వేచి చూస్తూ ఉంది.
ఇవాన్ కోవ్ తన పగ్గాలను వదిలేసి, గుర్రం మీద నుండి కిందకు దూకుతూ పడిపోయాడు. వారు కష్టం మీద అతని చేతి వేళ్ళ మధ్య ఉన్న కత్తిని తీశారు.
ఒక గంట తర్వాత ఆ దళం మొత్తం ఎక్కడైతే జర్మన్ అధికారి చంపబడ్డాడో ఆ ప్రాంతానికి వెళ్లారు. కొసాక్కులు అతని బూట్లను,బట్టలను,ఆయుధాలను తీసి,ఆ శవం చుట్టూ గుమిగూడి,అప్పటికే పచ్చరంగులోకి మారిపోయిన ఆ యవ్వనపు ముఖంలోకి చూశారు. ఉస్త్ ఖోపోర్ స్కాయా కు చెందిన తారాసోవ్,అప్పటికే ఆ చనిపోయిన వ్యక్తి చేతికి ఉన్న గడియారాన్ని తీసుకుని,అక్కడే ఆ ట్రూప్ సార్జెంట్ కు అమ్మేశాడు.ఆ వ్యక్తి జేబులో వారికి కొంత డబ్బు,ఒక ఉత్తరం,ఒక నవ్వుతూ ఉన్న అమ్మాయి ఫోటో వారికి దొరికాయి.
* * *
అధ్యాయం-9
ఆ ఉదంతంతో ఆ దళపు పరాక్రమం గుర్తించబడింది. ఆ దళపూ కమాండర్ కు ఇష్టమైన వాడైన క్రిచ్ కోవ్ కి అతని రికమండేషన్ మీద సెయింట్ జార్జ్ క్రాస్ పథకం బహుకరించారు. అతనితో అంతే వీరోచితంగా పోరాడిన వారు మాత్రం వెలుగులోకి రాలేదు. ఆ నాయకుడిని ఆ విభాగపు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడం జరిగింది.అక్కడ అతను యుద్ధం పూర్తయ్యే వరకు సోమరిగా కాలం గడుపుతూ ఉన్నాడు,అయినప్పటికి అతను మాస్కోలో మరియు పెట్రోగ్రాడ్ లో ఉన్న అధికారులను, పరపతి ఉన్న స్త్రీలను తనను చూడటానికి రప్పించుకోగలడంతో అతన్ని ఇంకో మూడు పతకాలు వరించాయి. ఆ స్త్రీలు అతన్ని ప్రశంసాపూర్వకంగా చూస్తూ ఆ డాన్ కొసాక్కుకు ఖరీదైన సిగరెట్లు,అతనికి ఇష్టమైనవి ఇస్తూ అతనితో స్నేహాన్ని కొనసాగించేవారు. మొదట వారిని ఎంతో విమర్శించినా,ఆ తర్వాత ఆ ప్రధాన కార్యాలయంలో ఉన్న కొందరు అధికారుల ప్రభావం వల్ల,దాన్ని అతను ఆకర్షణీయమైన వృత్తిగా చేసుకున్నాడు,తన ఆత్మసాక్షిని తప్పి, వారి ద్వారా పనులు జరిపించుకునేవాడు,వారి పనులు జరిగేలా చూసేవాడు. ప్రతి ఒక్కరూ సంతుష్తులై ఉన్నారు,ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు.
ఆ కార్యాలయానికి జారు వచ్చినప్పుడు,క్రిచ్ కోవ్ ని ఏదో సంతలో వస్తువులా ప్రదర్శనకు పెట్టారు. అతన్ని తన గుర్రాన్ని చూసినట్టు చూస్తూ ఆ జారు భుజం మీద చిన్నగా తట్టాడు.
‘నువ్వు మంచివాడివి,కొసాక్కు!’ అని, తన బృందం వైపుకి తిరిగి, ‘నాకు తాగడానికి నీరు తీసుకురండి’అన్నాడు.
పెద్ద నుదురుతో ఉండే క్రిచ్ కోవ్ ముఖం వార్తాపత్రికల్లోనూ,ప్రముఖ పత్రికల్లోనూ శాశ్వత స్థానం సంపాదించుకుంది. క్రిచ్ కోవ్ బొమ్మతో ఒక సిగెరట్ల బ్రాండు కూడా ఉంది. నిజ్నీ నోవ్గోరోడ్ వ్యాపారస్తులు అతనికి బంగారు ఖడ్గాన్ని బహుకరించారు.
అష్టకోవ్ చంపిన జర్మన్ అధికారి యూనిఫారంను ఒక చెక్కకు తగిలించి, రష్యన్ జనరల్ వన్ రెనిన్ కాంఫ్ ఇవాన్ కోవుని,తన సహాయ అధికారిని తన కారులో ప్రదర్శనకు తీసుకువెళ్ళి,యుద్ధానికి బయలుదేరబోతున్న బృందాలకు అవి చూపించి , గొప్ప ఉపన్యాసాలతో వారిని సాగనంపేవారు.
కానీ నిజానికి జరిగిందేమిటంటే వారిలో కొందరు,ఎవరైతే ఇంకా తమ తోటి మనుషులను ధ్వంసం చేసే కళలో ఆరితేరలేదో వారు యుద్ధభూమిలో చావు భయంతో,బెదిరిన పశువులా వారి మీదకి లంఘించి,గుడ్డిగా దాడి చేస్తూ తమ ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నం చేసేవారు. వారి దళంలో ఏ ఒక్కరూ చనిపోయినా వారు నైతికంగా ధ్వంసమైపోయి,ఎటు పడితే అటూ చెల్లాచెదురయ్యేవారు.
దీనినే యుద్ధంలో ప్రదర్శించిన వీరత్వంగా పిలిచేవారు.
* * *
అధ్యాయం-10
యుద్ధభూమి ఇంకా ప్రమాదకరమైన విషనాగులా మారలేదు, భవిష్యత్తులో అలా మారబోతున్నా సరే. కానీ ఆశ్విక దళాల మధ్య తగాదాలు, వారి మధ్య చిన్నపాటి యుద్ధాలు సరిహద్దుల దగ్గర జరిగేవి. యుద్ధం ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత జర్మనీ బలమైన ఆశ్విక దళాలను పహారా సేనలుగా పెట్టింది. దీనితో జాగురుకులైన రష్యా సైన్యం ఔట్ పోస్టుల నుండి తొలగిపోయి, తమకు బలాన్ని చేకూర్చే వ్యూహాలతో కొనసాగుతున్నాయి. బృసిలోవ్ ఎనిమిదవ బృందానికి జతగా 12 వ ఆశ్విక దళం జనరల్ కాలేడిన్ ఆజ్ఞ మీద రప్పించబడింది. ఎడమవైపు, పదకొండవ ఆశ్విక దళ విభాగం ఆస్ట్రియా సరిహద్దుని దాటి, ముందుకు వస్తూ ఉంది. అది అప్పటికే లెసజనోవ్ ను, బ్రాడిని ఆక్రమించింది. ఆపాటికే ఆస్ట్రియా అదనపు బలగాలతో వచ్చి, హంగేరియన్ ఆశ్విక దళాలు సరాసరి రష్యన్ ఆశ్విక దళాలపై దూసుకొచ్చి వారిని వెనక్కి బ్రాడి వైపు తరిమికొట్టాయి.
లేస్జోవ్ పట్టణంలో జరిగిన ఘటనల తర్వాత నుండి గ్రెగరి మెలఖోవ్ ఏదో తెలియని బాధతో కుమిలిపోతూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే సన్నగా అయిపోయి,బరువు తగ్గిపోయాడు. మార్చింగ్ చేస్తున్నప్పుడు,విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు,మెలకువగా ఉన్నా,పడుకున్నా సరే, తను చంపిన ఆస్ట్రియా వాడే అతని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేవాడు. సమయం గడుస్తున్నకొద్ది అతను దాన్ని మరలా మరలా గుర్తు తెచ్చుకుంటూ,దాన్నే కలగా కనేవాడు. మేలుకున్నాక ఆ కలను మర్చిపోవడానికి కళ్ళు గట్టిగా రుద్దుకుని తెరిచేవాడు.
ఆశ్విక దళాలు పొలాలను తొక్కుతూ వెళ్ళడం వల్ల పంట అంతా నాశనమై, గుర్రపు డెక్కల ముద్రలతో ఆ పొలాలు నిండిపోయాయి. పెద్ద పాదాలు ఉన్నసైనికుల బూట్లు బండ్ల ముద్రలు పడిన నేలను తొక్కుతూ మొత్తం బురదమయం చేశాయి.
ఎక్కడైతే యుద్ధాలు జరిగాయో అక్కడ భూమి అంతా స్ఫోటక మచ్చలు ఉన్న ముఖంతో రంధ్రాలు పడినట్టు,ఆయుధాల వల్ల జరిగిన రక్త ప్రవాహం వల్ల ,ఇంకా రక్తం దాహంతో ఉన్నట్టు ఉంది. రాత్రులు తమ చేతులను ఆకాశంలోకి చాపుతూ ఉంటే ఆ గ్రామాలు పట్టణాలు విద్యుధ్గాతానికి గురైనట్టు మారిపోయాయి. ఆగస్టు నెలలో పంట వచ్చే సమయంలో కూడా ఆకాశం గంభీరంగా ఉండి, వేడిగా ఉండి,ఒక్క చినుకుతోనూ నేలను తడపలేదు.
ఆగస్టు చివరి రోజులు వచ్చాయి. తోటల్లో ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటే,దూరం నుండి వాటిని చూస్తే, అవి గాయపడి దెబ్బలతో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది.
ఇతర కొసాక్కుల్లో వచ్చిన మార్పులను గ్రెగరి ఆసక్తితో గమనించసాగాడు. అప్పుడే సైన్యపు ఆసుపత్రి నుండి తిరిగి వచ్చి,ఇంకా బుగ్గపై గుర్రపు డెక్కల గాయం మచ్చతో ఉన్న ప్రోఖోర్ జికోవ్ కళ్ళల్లో ఇంకా ఆ గాయం తాలూకు నొప్పి,బాధ ఉన్నాయి. దూడ కళ్ళలా ఉండే అతని కళ్ళు పదేపదే కొట్టుకుంటూ ఉన్నాయి. యెగోర్ జార్కోవ్ ఏ సందర్భంలోనైనా సరే,బండబూతులు తిడుతూ మాట్లాడేవాడు,మామూలుగా కన్నా ఇప్పుడు ఎక్కువ బూతు కథలు చెప్తున్నాడు,ప్రతి దానిని బహిరంగంగానే తిడుతున్నాడు;గ్రెగరి గ్రామానికి చెందిన యెమెల్యాన్ గ్రోషేవ్, గంభీరంగా వాస్తవికంగా ఉండేవాడు.అతని ముఖం కూడా మాడిపోయినట్టు నల్లగా మారి, సందర్భం లేకపోయినా ప్రతి దానికి నవ్వుతూ ఉండేవాడు. ప్రతి ముఖంలోనూ ఒక మార్పు వచ్చింది,యుద్ధం వారిలో నాటిన విత్తనాల నుండి తమను తాము ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో ఓదార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. గ్రామాల నుండి నిండు యవ్వనంతో యుద్ధానికి సిద్ధమైన ఆ కొసాక్కులు చుట్టూ చావు,విధ్వంసం ఉన్న వాతావరణంలో రోజురోజుకి వాడిపోతున్న మొక్కలా అయిపోసాగారు.
సరిహద్దు నుండి సైన్యాలు వెనక్కి రప్పించబడ్డాయి. డాన్ నుండి అదనపు బలగాలు వచ్చేవరకు వారికి మూడు రోజుల సెలవు ఇవ్వబడింది. గ్రేగరి దళం అప్పుడే ఇంటి యజమాని ఇంటిలో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు స్నానానికి బయలుదేరిన సమయంలోనే,అక్కడి నుండి మూడు వెరస్టుల దూరంలో ఉన్న స్టేషన్ నుండి పెద్ద ఎత్తున బయలు దేరిన ఆశ్విక దళాలు వారికి కనపడ్డాయి.
నాలుగవ దళానికి చెందిన కొసాక్కులు డ్యామ్ వైపు ఉన్న సరస్సు దగ్గరకు నడుస్తూ ఉంటే, వెనుక ఉన్న బృందాలు ఏటవాలు దారి గుండా స్టేషన్ నుండి వస్తున్నారు,వారిని కొసాక్కులుగా గుర్తించారు.
ప్రోఖోర్ జికోవ్ ముందుకి వంగి చూస్తూ, ‘వాళ్ళు మన వాళ్ళే,డాన్ నుండి వస్తున్నారు’,అన్నాడు.
గ్రెగరి ఎస్టేట్ వైపుకి వెళ్తున్న ఆ బృందాల వైపు పరిశీలనగా చూశాడు.
‘వాళ్ళు రిజర్వులు.’
‘మనతో కలవడానికి వచ్చిన అదనపు బలగం అనుకుంటా.’
‘వాళ్ళు రెండవ వరుసలో వ్యక్తుల్ని పిలుస్తున్నారు.’
‘అటు చూడండి! అతను స్టీఫెన్ అష్టకొవ్ కదూ?ఆ మూడవ వరుసలో!’గ్రోషేవ్ గట్టిగా నవ్వుతూ,ఆశ్చర్యంగా అన్నాడు.
‘అవును,వాళ్ళు ఇప్పుడు వీళ్ళని తీసుకుంటున్నారన్న మాట.’
‘అదిగో అనికే అక్కడే ఉన్నాడు!’
‘గ్రీషా! మెలఖోవ్!అదిగో అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు! చూశావా?’
‘నేను చూశాను.’
‘నువ్వు నాకు ఓ మందు సీసా బాకీ,నేనే అతన్ని ముందు చూశాను!’
గ్రెగరి బుగ్గల మీద ఉన్న చర్మం కొద్దిగా ముడతలు పడింది,అతను పెట్రో నడిపిస్తున్న గుర్రాన్ని గుర్తు పట్టే ప్రయత్నం చేసినప్పుడు. తన కోసం ఒక కొత్త గుర్రం తెచ్చే ఉంటారు,అని అనుకుంటూ, తన దృష్టిని గుర్రం మీద నుండి అన్నయ్య ముఖం మీదకు మళ్ళించాడు. చివరిసారిగా కలిసినప్పటికంటే ఆ ముఖం ఇప్పుడు ఎంతగానో మారిపోయింది.సూర్యకాంతికి కమిలిపోయిన ముఖం, క్షవరం చేసిన గడ్డం, చెమట పట్టి ఉన్న కనుబొమ్మలతో అలసిపోయి ఉన్నాడు. గ్రెగరి తన టోపీ తీసేసి, యాంత్రికంగా చేయి ఊపుతూ అతన్ని కలవడానికి వెళ్ళాడు. అర్ధ నగ్నంగా ఉన్న మిగిలిన కోసాక్కులు కూడా ఆ డ్యామ్ దగ్గర నుండి అతని వెనుకే వెళ్ళారు.
ఆ రిజర్వు దళం ఎస్టేట్ భవనం ముందు ఉన్న తోట నుండి ఎక్కడితే దళానికి నివాసం ఏర్పాటు చేయబడిందో అక్కడికి వెళ్ళింది. వారికి నాయకుడిగా పెద్ద వయసులో చక్కగా క్షవరం చేసిన జుట్టు,గడ్డంతో ఉన్న వ్యక్తి ఉన్నాడు.
ఆ గుర్రం గొప్పగా ఉంది,అనుకుంటూ గ్రెగరి అన్నను చూసి నవ్వుతూ, ఆ మేజర్ వైపు ఒక చూసి,కాల్మక్ జాతికి చెందిన అతని గుర్రం వైపు మరోసారి చూశాడు.
‘దళ సభ్యులారా!’ ఆ మేజర్ గట్టిగా,శిక్షణ పొందిన స్వరంతో గట్టిగా అరిచి, ‘ఎడమ వైపుకి మార్చింగ్’అన్నాడు.
‘అన్నయ్యా!’గ్రెగరి పెట్రో వైపు చూసి నవ్వుతూ,ఒక రకమైన ఉద్విగ్నతతో సంతోషంగా అరిచాడు.
‘దేవునికి స్తుతి! మొత్తానికి నిన్ను ఇలా కలిశాను. ఎలా ఉంది ఇక్కడా?’
‘మరి అధ్వాన్నంగా లేదు.’
ఇంకా బతికే ఉన్నావా?’
‘ఇప్పటివరకు.’
‘మన కుటుంబం నిన్ను అడిగినట్టు తెలియజేయమంది.’
‘వాళ్ళు ఎలా ఉన్నారు?’
‘అందరూ బాగున్నారు.’
పెట్రో ఒక్కసారి వెనక్కి తిరిగి గ్రెగరి వైపు నవ్వుతూ చూసి,పగ్గాలు అందుకుని ఇతర కొసాక్కులతో కలిసి ముందుకు వెళ్ళిపోయాడు.
‘హలో, మెలఖోవ్! మన గ్రామం నుండి నీకు నమస్కారాలు!’
‘నువ్వు కూడా వచ్చావా?’ గ్రెగరి నవ్వుతూ అంటూ,అతన్ని మైఖేల్ కొషివోయ్ గా గుర్తు పట్టాడు.
‘అవును,వచ్చేశాము.మేము అచ్చం గింజల వెనుక పడే కోళ్ళలా ఉన్నాము.’
‘ఇక్కడ చాలా దొరుకుతాయి.చూస్తూ ఉంటే నీ ముక్కునే పక్షులు పొడిచేలా ఉన్నాయి.’
‘ఇక చాల్లే పరిహాసం!’
యెగోర్ జార్కోవ్ ఒక్క కాలి మీద గెంతుకుంటూ వస్తూ,ఇంకో కాలిని ప్యాంటులో పెట్టుకుంటూ అక్కడికి వచ్చాడు.
‘హాయ్,కొసాక్కులు!’
‘హా …నువ్వు యెగోర్ జార్కోవ్ కదా?’
‘ఏమైంది? ఒంటి కాలి గుర్రంలా గెంతుతున్నావు? నీ కాళ్ళు కూడా విరగ్గొట్టారా?’
‘మా అమ్మ ఎలా ఉంది?’
‘ఇంకా బతికే ఉంది.’
‘ఆమె నీకు తన ప్రేమ,ఆశీస్సులు అందజేయమంది,కానీ ఆమె నీ కోసం పంపించిన బహుమతి మాత్రం నేను తీసుకోలేదు ఎందుకంటే అప్పటికే నేను మోయాల్సినవి చాలా ఉన్నాయని.’
యెగోర్ ఆ సమాధానాన్ని అసాధారణ గంభీరత్వంతో విన్నాడు ,అలాగే అక్కడే ఉన్న పచ్చిక మీద కూలబడ్డాడు,తన నిరాశను ముఖం మీద కనబడకుండా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నా,అప్పటికి కూడా వణుకుతున్న రెండో కాలిని ప్యాంటులోకి దూర్చలేదు.
అర్ధ నగ్నంగా ఉన్న కొసాక్కులు అందరూ నీలం రంగు వేసి ఉన్న కంచె దగ్గర వరుసగా నిలబడి ఉన్నారు, ఈ లోపు అదనపు బలగంగా వచ్చిన కొసాక్కుల బృందం ఆ ఎస్టేట్ వాకిట్లో ఉన్న చెట్ల దగ్గరా విశ్రాంతి తీసుకుంటున్నారు.
‘హలో కొసాక్కు!’
‘మా బంధువు అలెగ్జాండర్ యేనా నువ్వు?’
‘అవును నేనే.’
‘ఆండ్రియాన్! దెయ్యం ముఖమొడా,నన్ను నువ్వు గుర్తు పట్టలేదా?’
‘నీ భార్య నిన్ను అడిగినట్టు చెప్పమంది,సైనికుడా!’
‘దేవుడు నిన్ను రక్షించుగాక!’
‘బోరిస్ బిలోవ్ ఎక్కడ ఉన్నాడు?’
‘ఏ దళంలో ఉన్నాడతను?’
‘నాకు తెలిసి నాలుగవ దళంలో అనుకుంటా.’
‘అతను ఎక్కడి వాడు?’
‘జాటోన్, వ్యోషేన్ స్కాయా స్టానిట్సా వాడు.’
‘అతని వివరాలు ఇప్పుడు ఎందుకు?’ ఇంకొకతను ఆ సంభాషణలో పాల్గొంటూ అడిగాడు.
‘అతని కోసం నేను ఒక్క ఉత్తరం తెచ్చాను.’
‘ఓ,అవునా! రాయిబ్రోడి దగ్గర తర్వాతి రోజే అతను చంపబడ్డాడు.’
‘నిజమా?’
‘దేవుడి మీద ఒట్టు! నా కళ్ళతో చూశాను. తూటా అతని ఛాతీ గుండా దూసుకుపోయింది!’
‘కొర్నాయా రెచ్కా నుండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా?’
‘ఎవరూ లేరు.ఇక కదలండి.’
ఆ దళం ఆగి ఆ వసరా మధ్యలో గుండ్రంగా కూర్చున్నారు. కొసాక్కులు స్నానం చేయడానికి డ్యామ్ దగ్గరకు తిరిగి వచ్చేశారు.
కొద్దిసేపటి తర్వాత రిజర్వు దళంగా వచ్చినవారంతా కొసాక్కుల దగ్గరకు వచ్చారు. గ్రెగరి తన అన్నయ్యతో కలిసి కూర్చున్నాడు. ఆ డ్యామ్ దగ్గర ఉన్న తడి వల్ల మట్టి దుర్వాసన వస్తూ ఉంది.ఆ సరస్సు అంచుల దగ్గర ఉన్న చిన్న చిన్న గడ్డి మొక్కల వల్ల అక్కడ పచ్చగా ఉంది. గ్రెగరి అన్నతో మాట్లాడుతూ మధ్యలో అక్కడ గాలిలో ఎగురుతూ ఉన్న పురుగులను చేత్తో చంపుతూ ఉన్నాడు.
‘నాకు అసలు ఏం బాగోలేదు,పెట్రో. నాకు కేవలం ఇక్కడ చంపబడిన మనిషిగా మిగిలిన భావన మాత్రమే ఉంది….తిరగలి రాళ్ళ మధ్య ఉన్నట్టు ఉంది నాకు, ఏదో ఒక సమయంలో నేను గుజ్జుగా మారిపోతాను.’ గ్రెగరి గొంతు దుఃఖంతో పూడుకుపోయి ఉంది, కళ్ళు పాలిపోయి,కింద గుంటలు కనబడుతూ ఉన్నాయి(పెట్రో దీనిని భయంగా గమనించాడు) . వాటిని చూస్తేనే అతను ఎంత భయంతో,బాధతో ఉన్నాడో పెట్రోకి అర్థమైంది.
‘ఇటు చూడు’అంటూ పెట్రో తన చొక్కా తీసి, తన తెల్లటి శరీరంపై సూర్యకాంతి వల్ల మెడ దగ్గర ఏర్పడిన నల్లటి వలయాలను చూపించాడు.
‘అవును, ఇలాగే జరుగుతూ ఉంటుంది’, గ్రెగరి వేగంగా మాట్లాడుతూ ఉన్నాడు, అతని స్వరం కోపంతో నిండింది.’జనాలను ఒకరికొకరిని విరోధులుగా చేస్తారు, ఈ ఆటలో వీలైనంత మేరకు దొరక్కుండా ఉంటే మేలు. జనాలు తోడేళ్ల కన్నా ప్రమాదకరమైన వారు. ఎక్కడ చూసినా ద్వేషమే నిండి ఉంది. నేను నీకు ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఎవడినైనా కరిస్తే తప్పక వాడికి రాబిస్ వస్తుంది.’
‘నువ్వు ఎవరినైనా చంపాల్సి వచ్చిందా?’
‘అవును, నేను చంపాను!’ గ్రెగరి దాదాపు అరిచినట్టుగా అంటూ, తన చొక్కాను పీలికలుగా చేసి పాదాల దగ్గర పడేసాడు. కళ్ళు పక్కకు తిప్పుకుని, తన గొంతు దగ్గర చేత్తో రుద్దుకుంటూ ఉన్నాడో, అక్కడ ఉన్న ఏదో మాటలని బయటకు తీసుకురావడానికి అన్నట్టు.
‘నాకు దాని గురించి చెప్పు’, పెట్రో ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు, తన తమ్ముడి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు.
‘నా మనస్సాక్షి నన్ను చంపేస్తుంది. లెసజోవ్ దగ్గర నేను నా కత్తితో ఒక వ్యక్తిని పొడిచాను… అది యుద్ధంలో.. అదొక్కటే అక్కడ చేయదగిన పని… కానీ నేను ఇంకో వ్యక్తిని ఎందుకు చంపాను?’
‘ఇంకొకరు ఎవరు?’
‘ఏ కారణం లేకుండానే ఒక వ్యక్తిని నేను చంపాను, ఇప్పుడు ఆ బాధ మోయలేకుండా ఉన్నాను. అతను నా ఆలోచనల నుండి పోవడం లేదు. వాడి గురించే రాత్రి కలలు వస్తూ ఉంటాయి. కానీ ఇది నా తప్పా?’
‘నువ్వు ఇంకా ఈ వాతావరణానికి అలవాటు పడలేదు. నీకు మెల్లగా అలవాటు అవుతుంది.’
‘మీది రిజర్వు దళమా?’
‘కాదు. మేము 27వ రెజిమెంటులో భాగం.’
‘నేను మీరు మాకు సాయంగా వచ్చారేమో అనుకున్నాను.’
‘మా దళం ఏదో ఒక పదాతి దళానికో లేకపోతే ఇంకో విభాగానికో జోడించబడుతుంది. మాకు ఆ విషయం కూడా త్వరలోనే తెలుస్తుంది. కానీ మాతో ఒక రిజర్వు దళం కూడా ఉంది. మీకు కుర్రాళ్ళనే ఇస్తున్నారు.’
‘సరే అయితే. ఈత కొడదాం రా.’
గ్రెగరి వేగంగా తన ప్యాంటు విప్పేసి, ఆ డ్యాములో తక్కువ ప్రవాహం ఉన్న చోటుకి వెళ్తూ ఉంటే పెట్రోకి గతంలో చూసిన దాని కన్నా తమ్ముడు ఎంతో వయసు పై బడిన వాడిలా కనిపించాడు. అతను ఈత కొడుతూ, ముందు గుంపుగా ఈత కొడుతూ ఉన్న మిగిలిన కొసాక్కుల దగ్గరకు వెళ్ళాడు.
తను రాసుకున్న ప్రార్ధనను తల్లి ఆశీర్వాదంతో కలిపి కుట్టి తన మెడలో వేసుకున్న క్రాసును తీయడానికి పెట్రో చాలా సమయం తీసుకున్నాడు. అతను దాన్ని తన చొక్కా జేబులో పెట్టి, చొక్కాను అక్కడే ఉంచి నీటిలో మొదట ఛాతి, భుజాలు తడుపుకుంటూ ప్రవేశించాడు. తర్వాత మెల్లగా ఈత కొడుతూ గ్రెగరి ఉన్న వైపుకి వెళ్ళాడు. వారిద్దరూ ఇతరుల నుండి విడిపోయి వ్యతిరేక దిశలో అవతలి వైపు ఒడ్డుకి ఈత కొడుతున్నారు.
ఒంటిని చల్లటి నీరు తాకుతూ ఉండటం గ్రెగరిని కూడా శాంతాపరిచింది. అంతకుముందు ఉన్న భావావేశం లేకుండా మాములుగా మాట్లాడసాగాడు.
‘నా తలంతా పేలు పట్టాయి. నాకు ఇంటి మీద బెంగగా ఉంది. నాకు ఇంటికి వచ్చేయాలని ఉంది. నాకే కనుక రెక్కలు ఉంటే, నేను అక్కడికి వెళ్తే, నాకు అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పు?’ అని అన్నను అడిగాడు.
‘నటాల్య మాతోనే ఉంటుంది.’
‘అవునా?’
‘అవును మాతోనే ఉంది.’
‘అమ్మా, నాన్నా ఎలా ఉన్నారు?’
‘వాళ్ళు బాగానే ఉన్నారు. నటాల్య ఇంకా నీ కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె మనసులో ఎప్పుడో ఒకసారి నువ్వు ఆమె కోసం తిరిగి వస్తావన్న ఆలోచన నాటుకుపోయింది.’
గ్రెగరి ఒక్కసారిగా ఉలిక్కిపడి, నోట్లో ఉన్న నీటిని బయటకు ఊసాడు.
పెట్రో తల తిప్పి, అతని కళ్ళల్లోకి సూటిగా చూసే ప్రయత్నం చేశాడు.
‘కనీసం నువ్వు నీ ఉత్తరాల్లో ఆమె క్షేమం గురించి అడుగుతూ రాయొచ్చు. ఆమెకు నువ్వే సర్వస్వం.’
‘పగిలిపోయిన కుండను మళ్ళీ మాములుగా చేయొచ్చని ఆమె అనుకుంటుందా?’
‘నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కానీ ప్రయత్నిస్తాను… ఆ నమ్మకమే ఆమెను బతికి ఉండేలా చేస్తుంది. ఆమె చాలా మంచి స్త్రీ, అలాగే శీలవతి కూడా. తనను తానే శిక్షించుకుంటుంది. అందరిలా సరదాగా జీవితం గడపదు. నిస్సారంగా జీవితాన్ని సాగిస్తుంది.’
‘ఆమె ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు కదా?’
‘అలా మాట్లాడటం పనికిమాలినతనం.’
‘లేదు, లేదు. నిజానికి అలా జరిగితే బావుంటుంది.’
‘సరే అయితే అది మీ విషయం. నేను జోక్యం చేసుకోను.’
‘దున్యక్ష ఎలా ఉంది?’
‘తను ఇప్పుడు పెళ్ళి వయసుకి వచ్చింది. పోయిన సంవత్సరం ఎంత ఎత్తు పెరిగిందంటే, నువ్వు తనను చూస్తే గుర్తు పట్టలేవు.’
‘అవునా?’గ్రెగరి ఆశ్చర్యపోతూ ఇంకా ఉత్సాహంగా అడిగాడు.
‘అవును. తనకు పెళ్ళి చేసేస్తారు కానీ మనం మాత్రం ఆ వేడుకలో విస్కీ తాగలేము.మనల్ని ఆ పాటికే ఆ దుర్మార్గులు చంపొచ్చు.’
‘అలాగే జరగొచ్చు.’
వాళ్ళు ఇసుక ఒడ్డు దగ్గరకు వచ్చి,చేతిలో చేయి వేసుకుని సూర్యుని ఎండకు అభిముఖంగా పడుకుని,ఆ వేడికి సేదతీరుతూ ఉన్నారు.మిష్కా కొష్వోయ్ సగ భాగం శరీరాన్ని బయటే ఉంచుతూ ముందుకి ఈత కొడుతున్నాడు.
‘గ్రీషా, రా!’
‘నేను కొద్దిసేపట్లో వస్తాను.’
ఇసుకలో మిడతని కప్పి పెడుతూ , ‘అక్సిన్య గురించి ఏమైనా తెలిసిందా?’
‘యుద్ధం ప్రకటించకముందు ఆమె గ్రామానికి రావడం నేను చూశాను.’
‘అక్కడికి తను ఎందుకు వచ్చింది?’
‘భర్త దగ్గర ఉన్న తన వస్తువులను తీసుకోవడానికి.’
గ్రెగరి దగ్గి, ఇంకా ఇసుకను ఆ మిడతపై వేశాడు.
‘నువ్వు తనతో మాట్లాడలేదా?’
‘ఆ రోజు అలా గడిచిపోయింది. ఆమె చాలా సంతోషంగా కనిపించింది. చూస్తూ ఉంటే ఆ ఎస్టేట్ లో ఆమె జీవితం చాలా బాగున్నట్టు ఉంది.’
‘మరి స్టీఫెన్ ఏమన్నాడు?’
‘అతను ఆమె వస్తువులన్నీ ఇచ్చేశాడు.ఆమెతో హుందాగా ప్రవర్తించాడు. కానీ నువ్వు మాత్రం అతనితో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి తాగినప్పుడు అతను నిన్ను తన తుపాకీలోని తూటాతో నువ్వు యుద్ధంలో ఉన్నప్పుడే చంపేస్తానని చెప్పాడట కొసాక్కులతో.’
‘హా..’
‘అతను నిన్ను క్షమించడు.’
‘నాకు తెలుసు.’
‘నేను ఒక గుర్రాన్ని తీసుకున్నాను’ పెట్రో ఆ విషయం మారుస్తూ అన్నాడు.
‘ఎద్దులను అమ్మేశావా?’
‘అవును,ముసలివాటిని నూట ఎనభైకి అమ్మేసాము. గుర్రం ధర నూట యాభై ఉంది.కానీ గుర్రం మేలు జాతికి చెందింది! నేను దాన్ని సుట్కాన్ నుండి తెచ్చాను.’
‘సరే పంట బాగా పండిందా?’
‘హా.కానీ కుప్ప నూర్చే సమయమే లేదు,ఈ లోపే మమ్మల్ని ఇక్కడకు తెచ్చారు.’
తర్వాత వాళ్ళ సంభాషణ వ్యవసాయ విషయాల మీదకు మళ్ళీ అంతకుముందున్న ఉద్విగ్నత మాయమైంది. గ్రెగరి ఎంతో ఆసక్తితో సంతోషంతో ఇంటికి సంబంధించిన విషయాలను విన్నాడు,కొంతసేపు అతను అంతకు పూర్వం ఉన్న చిలిపి కుర్రవాడిలా మారిపోయాడు.
‘సరే అయితే,ఇంకొక మునుగు మునిగి బట్టలు వేసుకుందాం’, పెట్రో తన పొట్ట మీద ఉన్న ఇసుక దులుపుకుంటూ సూచించాడు. అతని వీపు మీద మరియు భుజాల మీద ఉన్న చర్మం నిక్కబొడుచుకుని ఉంది చలితో.
వాళ్ళు మిగిలిన గుంపుతో కలిసి సరస్సు నుండి తిరిగి వచ్చారు. కంచె దగ్గరకు వచ్చాక వాళ్ళు విడిపోయాక, వారికి స్టీఫెన్ అష్టకోవ్ ఎదురొచ్చాడు. అతను చిక్కులు పడిన తన ముంగురులను దువ్వుకుంటూ,గ్రెగరికి సరాసరి ఎదురుగా వచ్చాడు.
‘హలో,స్నేహితుడా!’
‘హలో’, గ్రెగరి వెనకే ఆగిపోయి, ఓ రకమైన ఇబ్బంది మరియు పశ్చాత్తాప భావనతో అతనివైపు చూస్తూ అన్నాడు.
‘నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదా?’
‘దాదాపుగా మర్చిపోయాను.’
‘కానీ నేను మాత్రం నిన్ను గుర్తు పెట్టుకున్నాను’, స్టీఫెన్ పరిహాసంగా నవ్వుతూ, పక్కనే ఉన్న కొసాక్కు భుజం మీద చేయి వేస్తూ ముందుకు వెళ్ళిపోతూ అన్నాడు.
ఆ రోజు చీకటి పడిన తర్వాత టెలిఫోన్ ద్వారా ఆ విభాగపు ప్రధాన కార్యాలయం నుండి అక్కడ నుండి ముందు ఉన్న పొలాల గుండా బయలుదేరమని సందేశం వచ్చింది. ఒక్క పావుగంటలో ఆ దళాలన్నీ బయలుదేరి పాటలు పాడుకుంటూ యుద్ధంలో అవసరమైన ఆశ్విక దళాల భర్తీ కోసం సాగిపోయాయి.
ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటున్న సమయంలో పెట్రో తన సోదరుడికి మడత పెట్టి ఉన్న ఒక చిన్న కాగితం ఇచ్చాడు.
‘ఏంటి ఇది?’గ్రెగరి అడిగాడు.
‘నేను నీ కోసం ఒక ప్రార్థన రాశాను.అదే ఇది,తీసుకో.’
‘దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?’
‘నవ్వకు,గ్రెగరి.’
‘నేను నవ్వడం లేదు.’
‘సరే,వీడ్కోలు,సోదరా. నిన్ను నువ్వు జాగ్రత్త గా చూసుకో. అందరికన్నా ముందు ఆవేశంగా వెళ్ళకు. ఆవేశపరులే ముందు మరణిస్తారు.జాగ్రత్త !’పెట్రో అరిచాడు.
‘అయితే ఇక ఈ ప్రార్థన ఎందుకు?’
పెట్రో ఆ మాటను పట్టించుకోకుండా చేయి ఊపాడు.
ఆ రాత్రి పదకొండు గంటల వరకు వారు ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్లారు. ఆ తర్వాత సార్జెంట్ మేజర్ ఆ దళాల చుట్టూ తిరిగి, నిశ్శబ్దంగా వెళ్లాలని,పొగ కాల్చకూడదని ఆజ్ఞాపించాడు.
పొగ ఆ అడవి చివర నుండి పైకి లేస్తూ ఉంది.
* * *
అధ్యాయం-11
అది గోధుమ రంగులో ఉన్న చిన్న నోట్ పుస్తకం. అప్పటికే దాని అంచులు అరిగిపోయి,కొంత చిరిగిపోయి ఉన్నాయి,బహుశా అది యజమాని జేబులోనే ఎక్కువ కాలం ఉండి ఉంటుంది. ఆ పుస్తకపుటలు వంకర తిరిగిన అక్షరాలతో నిండి ఉన్నాయి.
* * *
….కొంత కాలం నుండి నా మనసులో ఉన్నది కాగితం మీద పెట్టాలని అనుకుంటున్నాను. నా మనసులో ఉన్నది స్పష్టం చేసే ఒక డైరీలా ఇది రాయలనుకుంటున్నాను.ఇందులో అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫిబ్రవరి నెలలో (నాకు తేదీ సరిగ్గా గుర్తు లేదు),తన దేశానికి చెందిన వ్యక్తి మరియు ఒక విద్యార్థి అయిన బోయార్ష్కిన్ ద్వారా,సినిమా హాలు బయట ఆమె నాకు పరిచయం అయ్యింది. ఆమెను నాకు పరిచయం చేస్తూ,బోయార్ష్కిన్ “ఈమె లిజా, కోసాక్కు అమ్మాయి,వ్యోషేన్ స్కాయా స్టానిట్సా నుండి. ఆమెతో మంచిగా ఉండు,టిమోఫీ. ఆమె మంచి అమ్మాయి”,అన్నాడు. ఆ సమయంలో మెత్తగా చెమట పట్టి ఉన్న ఆమె చేతిని,నా చేతిని కలుపుతూ ఏదో అన్నాను,అది నాకు గుర్తు లేదు. అలా నేను యేలిజవెటా మొఖోవాను కలిశాను. ఆమెను చూడగానే ఆమె కన్య కాదని నాకు అర్థమైపోయింది. అటువంటి అమ్మాయిల కళ్ళు చాలా చెబుతాయి. నిజం చెప్పాలంటే ఆ మొదటి పరిచయంలో ఆమె మీద నాకు సదభిప్రాయం అయితే కలగలేదు,దానికి కారణం ఆ చెమట పట్టిన చేయి అయ్యి ఉండొచ్చు. నేను కలిసిన వారిలో ఎవరి చేతులు చెమట పట్టి అంత తడిగా లేవు. ఆ కళ్ళు మాత్రం అందమైన కళ్ళు,వాటిల్లో ఏదో మెరుపు ఉంది,కానీ ఆ మెరుపు మాత్రం ఆహ్లాదభరితంగా లేదు.
నా ప్రియమైన స్నేహితుడా వాస్యా, నేను ఇది చాలా జాగ్రత్తగా నా శైలిని గమనించుకుంటూ రాస్తూ,రాసేటప్పుడు ఆ జరిగినవి దృశ్యాలుగా జ్ఞాపకం చేసుకుంటూ మరి రాస్తున్నాను. ఎందుకంటే ఈ డైరీ సెమిపాలాటిస్క్ లో ఉన్న నిన్ను చేరుకునేసరికి,(నేను ఇది నీకు యెలిజవెట మొఖోవాతో పెట్టుకున్న సంబంధం ముగిసిపోయాక నీకు పంపాలనుకుంటున్నాను;అప్పటికి ఇది నీకు మంచి వినోదాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను)నీకు అసలు ఏం జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. నేను జరిగిన విషయాలన్నీ తేదీల వారీగా క్రమపద్ధతిలో రాస్తాను. నేను నీకు చెప్పినట్టు,అక్కడ మా పరిచయాలు అయ్యాక ఓ పనికిమాలిన సినిమాకు ముగ్గురము వెళ్ళాము. బోయార్ష్కిన్ ఆ సమయంలో మౌనంగా ఉన్నాడు(అతనికి ‘పంటి నొప్పి’ఉందని చెప్పాడు)నేనేమో సంభాషణ కొనసాగించలేకపోయాను. ఆ తర్వాత మాటల్లో మేము ఒకరికొకరం పొరుగున ఉంటామని తెలిసింది,అంటే పక్క పక్కనే ఉన్న స్టానిట్సాలకు చెందిన వారమని;కానీ ఆ గడ్డి మైదానాలు,పచ్చిక బీడుల జ్ఞాపకాలు మాట్లాడుకున్నాక మా మధ్య ఇంకా మాట్లాడటానికి ఏమి లేకుండా పోయింది. నేనేమో దాదాపుగా ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోతే,ఆమె ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడుతూనే ఉన్నా నా నుండి స్పందన లేకపోవడం వల్ల కొంత విచిత్రంగా చూసింది. ఆమె వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతున్నదని,వర్తక కుటుంబం నుండి వచ్చిందని,ఆమెకు టీ అంటే ఇష్టమని తెలిసింది. లేత గోధుమ రంగులో ఉన్న కళ్ళతో కవ్వింపుగా ఉండే అలాంటి అమ్మాయి నుండి అంతకన్నా ఎక్కువ సమాచారం రాబట్టడం కష్టమే కదా!మేమిద్దరము ఆమెకు వీడ్కోలు చెప్పినప్పుడు,ఆమె నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆమె చిరునామా నేను రాసుకున్నాను. ఏప్రిల్ 28 న ఆమె దగ్గరకు వెళ్ళాలని అనుకున్నాను.
ఏప్రిల్ 29
ఈ రోజు ఆమె ఇంటికి వెళ్ళాను,ఆమె నాకు టీతో పాటు తినడానికి అల్పాహారం కూడా పెట్టింది. నిజం చెప్పాలంటే ఆమెలో ఏదో ఉంది. కొద్దిపాటి తెలివితేటలు,ఎప్పుడూ వాగుతూ ఉండే నోరు,వీటికి తోడు ఆర్ట్సిబాషేవ్ సిద్ధాంతమైన ‘నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో’ ను ఎంత దూరంలో ఉన్నా సరే గ్రహించేలా ఉంటుంది. నేను ఇంటికి ఆలస్యంగా వచ్చాను, సిగరెట్లు కాల్చాను,పూర్తిగా ఆమెతో సంబంధం లేని విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాను,ముఖ్యంగా డబ్బు గురించి. నేను వేసుకునే సూటు పూర్తిగా శిథిల స్థితిలో ఉంది,నా దగ్గర డబ్బు లేదు. మొత్తం మీద, విషయాలేమి అనుకూలంగా లేవు.
మే 1
ఈ రోజు ప్రాధాన్యత ఉన్న ఒక ఘటన జరిగింది. సోకొలింకి పార్కులో మేము సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఒక సంఘటనలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పోలీసులు,ఒక ఇరవై మంది కోసాక్కుల బృందం కలిసి శ్రామికుల దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఓ సమావేశాన్ని చెల్లాచెదురు చేస్తున్నారు. తాగి ఉన్న ఒకడు ఒక కోసాక్కు గుర్రాన్ని కర్రతో కొట్టాడు,వెంటనే ఆ కోసాక్కు గుర్రాన్ని విదిలించే కొరడాతో అతన్ని కొట్టాడు.నేను జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ పని చేసేటప్పుడు ఒక మంచి పని చేయాలన్న భావన నాకు నిజంగా కలిగింది.అప్పుడు నేను ఆ కోసాక్కును, ‘పనికిమాలినవాడని’,అలాగే ఇంకొన్ని మాటలతో నిందించాను. అప్పుడు ఆ కొరడా అతను నా మీద కూడా ప్రయోగించబోయాడు, అప్పుడు నేను అతనితో నేను కూడా కొమెన్ స్కాయా స్టానిట్సా కు చెందిన కోసాక్కునేనని, ఆ వారంలో ఏదో ఒక రోజు మక్కెలిరగదీస్తానని ధృఢంగా హెచ్చరించాను. అతను యవ్వనంలో ఉన్నాడు,మంచి స్వభావం ఉన్నవాడే,ఇంకా సైన్యంలో ఎక్కువ కాలం ఉండలేదనుకుంటా అందుకే అతను ఇంకా కఠినంగా మారిపోలేదు. అప్పుడు అతను ఉస్ట్ కొప్యోర్ స్కాయా స్టానిట్సాకు చెందినవాడినని బదులిచ్చాడు. తర్వాత మేము ఏ గొడవ లేకుండానే విడిపోయాము. ఆ సమయంలో అతను ఏదైనా గొడవ చేసి ఉంటే, ఖచ్చితంగా నేను కూడా గొడవ పడాలనే అనుకున్నాను. బహుశా ఇక్కడ లిజా నా సమక్షంలో ఉండటమే నేను అలా స్పందించడానికి కారణమనుకుంటా!నేను ఒక కుర్ర పుంజులా మారిపోతూ,ఏదో ఆమె నుండి ఆశిస్తూ ఉండటం …అసలు ఏం చేస్తున్నాను నేను!
మే 3
ఇప్పుడు నేనున్న స్థితిలో నాకు ఒకే ఒక్క పని చేయాలని ఉంది,అది తాగడం. అసలు విషయం ఏమిటంటే నా దగ్గర డబ్బు లేదు. ఇంకా నా దీన స్థితి ఎలా ఉందంటే నా పైజమా ఎక్కడైతే చిరగకూడదో అక్కడే చిరిగిపోయింది. కాకపోతే ఆ చిరుగు బయటకు కనబడే అవకాశాలు చాలా తక్కువ. త్వరలోనే అక్కడ చిరుగు కుట్టుకోవాలి. రేపటి నుండి పాఠాలు వినడానికి తప్పకుండా వెళ్తాను.
మే 7
నాన్న నుండి డబ్బు వచ్చింది. అలాగే తిడుతూ ఒక ఉత్తరం కూడా వచ్చినా,నాకు ఇసుమంతైనా సిగ్గు కలుగలేదు. నాన్నకు ఇంకా నా నైతిక జీవితం ఇంత పతనం అయిపోయిందని తెలియదు,తెలిస్తే ….మొత్తానికి ఒక సూట్ కొనుక్కున్నాను. నేను కొత్తగా కొన్న టై రోడ్డు మీద అందరినీ ఆకర్షిస్తూ ఉంది. వెరస్కాయా వీధిలో ఒక మంచి క్షవరశాలలో క్షవరం చేయించుకున్నాక,బయటకు వచ్చేసరికి నాకు నేనే కొత్తగా అనిపించాను. సాడోవో ట్రింఫాల్నాయ వీధి చివరలో పోలీస్ దుస్తులు వేసుకున్న ఓ అధికారి నా వైపు చూసి నవ్వాడు. ముసలి వెధవ! ఇప్పటి నా రూపంలో అతనికి,నాకు ఏవో పోలికలు ఉన్నట్టు నాకు అనిపించిది! కానీ మూడు నెలల క్రితం? ఓ, ఇక గతం తాలూకు నీడల్లో తారాడటం అంత మంచిది కాదు…. అనుకోకుండా ఒక ట్రామ్ కారులో వెళ్తున్న లిజాను నేను అప్పుడే చూశాను. ఆమె కూడా నన్ను చూసి తన చేయి ఊపింది. ‘అబ్బా! ఏమున్నాడు?’ అని అనుకుని ఉంటుందేమో!
మే 8
‘ప్రేమ ముందు ఏ వయసు వారైనా మోకరిల్లాల్సిందే….’ ఇప్పటికీ నాకు ఫిరంగి గొట్టంలా నోరు తెరుచుకుని నా వైపే చూస్తూ ఉన్న తాత్యానా భర్త కనిపిస్తునట్టే ఉంది. గ్యాలరీలో నా సీటులో కూర్చుని ఉన్నప్పటికి అతని నోట్లో ఉమ్మాలన్న బలమైన కోరికను నేను అణచుకున్నాను. ఆ వాక్యంలోని ‘మోకరిల్లాల్సిందే’అన్న పదం గురించి ఆలోచించినప్పుడల్లా,నా దవడలు నొప్పితో బిగుసుకుంటాయి. బహుశా ఏదో అసహనానికి సూచనగా అనుకుంటా!
కానీ విషయం ఏమిటంటే నేను, ఇప్పుడు నా వయసులో, ప్రేమలో ఉన్నాను. ఇది రాస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉన్నా సరే …..నేను లిజాను రమ్మని పిలిచాను. ఆమె వచ్చిన తర్వాత నేను సుధీర్ఘమైన పరిచయంతో మొదలుపెట్టాను. ఆమె నేను చెప్పింది అర్థం కానట్టు నటించి,ఆ విషయం మార్చే ప్రయత్నం చేసింది. ఆ విషయం మాట్లాడటానికి నేను తొందరపడ్డానేమో? ఏది ఏమైనా కానీ, ఈ కొత్త సూటు నన్ను అందుకు ప్రేరేపించింది. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు, ఎవరూ తిరస్కరించలేనంత అందంగా ఉన్నానని నాకే అనిపించింది. ఇదే సరైన సమయమని కూడా అనుకున్నాను. అసలు ఇది చేయడానికి కారణం నేను ఇంగిత జ్ఞానంతో ఆలోచించడం వల్లే. ఇప్పుడు నేను ఆమెకు నా ప్రేమ గురించి చెప్పకపోతే,ఇంకో రెండు నెలల సమయంలో ఇంకా ఆలస్యం అయిపోతుంది;ఆపాటికి నా కొత్త బట్టలు పాడైపోతాయి, నా ప్యాంటు అయితే ఎక్కడ పాడవ్వకూడదో అక్కడే అయ్యి,ఇక ప్రేమ ఆలోచనే రాకుండా చేస్తుంది. ఇది రాస్తున్నప్పుడు,నన్ను నేనే అభినందించుకుంటున్నాను. మా రోజుల్లో ఉత్తమ గుణాలతో ఉండే నా లాంటి వారిలో ఎన్ని తెలివితేటలు సమయానుసారం బయటపడతాయో! ఇక్కడ పారవశ్యంతో కూడిన ప్రేమ,కోరికతో పాటు తర్కంతో ఆలోచించగల బుద్ధి కూడా ఉండాలి. అయినా రష్యా దేశస్తుడు అంటేనే మేలు లక్షణాల కలయికతో ఉంటాడు, అత్యుత్తమ గుణాలకు అతిథిగా ఉంటాడని చెప్పనవసరం లేదు కదా.
నేను నా ప్రాథమిక పరిచయాన్ని దాటి ఆమెతో ఎక్కువగా మాట్లాడలేదు.ఆమె ఇంటి యజమానురాలు ఈ లోపు ఆమెను బయటకు పిలిచింది.ఆమె లిజాను అప్పు అడిగితే, లిజా దానికి అంగీకరించలేదని వారి మాటలు విన్న నాకు అర్థమైంది. లిజా డబ్బు ఉన్నా సరే అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు.కానీ తన దగ్గర డబ్బు లేదని లిజా ఎంతో నిజాయితీగా ఆమెకు చెప్పడాన్ని, అదే నిజాయితీ ఆమె కళ్ళల్లో ప్రతిఫలించడాన్ని దృశ్యంగా నా కళ్ళ ముందు చిత్రికరించుకున్న నేను ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆమెతో ప్రేమ గురించి మాట్లాడాలనుకోలేదు.
మే 13
నేను బాగానే ఉన్నాను, నిజంగానే ప్రేమలో కూడా ఉన్నాను. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. నా చుట్టూ జరుగుతున్నవి అదే నాకు స్పష్టం చేస్తున్నాయి. రేపు తప్పకుండా ఆమెకు నా ప్రేమ గురించి చెబుతాను. అది ఎలా చెప్పాలి అన్న విషయం గురించి ఇంకా నాకు ఏ స్పష్టత, సంసిద్ధత లేవు.
మే 14
అసలు ఊహించనివిధంగా అది జరిగిపోయింది. ఆ రోజు సన్నపాటి తుంపరతో వాన మొదలైంది. మేము మొఖోవాయా లో వీధుల గుండా నడుస్తూ ఉన్నాము, ఆ వానకు బలమైన గాలి కూడా తోడైంది. నేను మాట్లాడుతూ ఉంటే, ఆమె తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు కిందకు చూస్తూ ఉంది. వాన చినుకులు ఆమె టోపీపై నుండి బుగ్గల మీదకు జారుతూ ఉన్నాయి, అప్పుడు ఆమె చాలా అందంగా కనిపించింది నాకు. అప్పుడు జరిగిన సంభాషణ వివరంగా చెప్తాను.
‘యెలిజావెట సెర్జియేవ్న, నా మనసులో ఉన్నది నీకు చెప్పాను. ఇక నిర్ణయం నీదే.’
‘మీ మాటల్లో నిజాయితీ మీద నాకు నమ్మకం కలగడం లేదు.’
నేను ఓ తెలివితక్కువ వాడిలా నా భుజాలు ఎగరేసి,ఆ సమయంలో నా నిజాయితీ నిరూపించుకోవడానికి ఏ ప్రమాణం అయినా చేస్తానని, అటువంటి పిచ్చివేవో వాగాను.
‘ఇటు చూడు, నువ్వు ఏదో ఊహల్లో విహారిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాకు అర్థమయ్యేలా సూటిగా చెప్పలేవా?’అని ఆమె అడిగింది.
‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంతకన్నా సూటిగా నేను చెప్పలేను.’
‘అయితే ఇప్పుడు ఏమిటి?’
‘అది నువ్వే చెప్పాలి.’
‘అయితే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలని ఆశిస్తున్నావా?’
‘నువ్వు ఏదో ఒకటి చెప్తే బావుంటుందని అనుకుంటున్నాను.’
‘ఇటు చూడు, టిమోఫీ ఇవానోవిచ్… ఇది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు.. నాకు నువ్వంటే కొద్దిగా ఇష్టమే… నువ్వు ఎత్తుగా ఉంటావు.’
‘నేను ఇంకా ఎత్తు పెరుగుతాను కూడా’, ఆమెకు వాగ్దానం చేసే ధోరణిలో అన్నాను.
‘మనకు ఒకరి గురించి ఒకరికి చాలా తక్కువ తెలుసు.. మనం…’
‘మనం కొంతకాలం కలిసి ఉంటే ఒకరి గురించి ఒకరికి ఇంకా బాగా తెలుస్తుంది.’
తడిగా ఉన్న బుగ్గలను, గులాబీ రంగులో ఉన్న చేతులతో రుద్దుకుంటూ, ‘సరే అయితే, ఇద్దరం కొంతకాలం కలిసి ఉందాము. సమయమే స్పష్టత వచ్చేలా చేస్తుంది.కానీ నేను ముందు పెట్టుకున్న సంబంధం నుండి బయటకు వచ్చే సమయం ఇవ్వాలి.’
‘ఎవరతను?’ నేను అడిగాను.
‘నీకు అతను తెలియదు. అతను ఓ వైద్యుడు, వెనరాలాజిస్ట్.’
‘ఎప్పటికల్లా నువ్వు ఆ పని చేయగలవు?
‘శుక్రవారం కల్లా అని అనుకుంటున్నాను.’
‘మనిద్దరం కలిసే ఉండబోతున్నామా? అంటే నా ఉద్దేశ్యం ఒకే ఫ్లాట్ లోనేనా అని?’
‘అవును, నాకు తెలిసి అదే బావుంటుంది. నువ్వు నా ఫ్లాట్ కు వచ్చేయ్.’
‘ఎందుకు?’
‘నా ఫ్లాట్ చాలా సౌకర్యంగా ఉంటుంది. శుభ్రంగా ఉంటుంది, యజమానురాలు కూడా మంచావిడ.’
నేను దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు.వరస్కాయా మూల దగ్గర మేము విడిపోయాము. విడిపోయేటప్పుడు మేము ముద్దు పెట్టుకోవడం అటూ వెళ్తూ చూసిన ఓ స్త్రీ ఆశ్చర్యపోయింది.
భవిష్యత్తులో ఇంకేం జరగబోతుందో చూడాలి!
మే 22
ఇది మా హనీమూన్ సమయం. ఈ రోజు నా ‘హనీమూన్’ మూడ్ ని లిజా నా లోదుస్తులు మార్చమని చెప్పి పాడు చేసేసింది. ఆమె చెప్పింది నిజమే, నా లోదుస్తులు అసహ్యకరమైన స్థితిలో ఉన్నాయి. కానీ అన్నింటికి డబ్బు కావాలి…. ఇప్పుడు మేము నా డబ్బుతోనే గడుపుతున్నాము, ఇంకా ఎక్కువ కూడా లేదు…. నేను ఏదో ఒక పని వెతుక్కోవాలి.
మే 24
నేను ఈ రోజు కొత్త లోదుస్తులు కొనుక్కుందామని అనుకుంటే లిజా ఊహించని ఖర్చు నా నెత్తి మీద వేసింది. ఆమెకు హఠాత్తుగా మంచి రెస్టారెంట్ లో డిన్నర్ చేయాలని, మంచి సాక్సుల జత కొనుక్కోవాలని కోరిక కలిగింది. మేము డిన్నర్ చేసాక, ఆమెకు అవి కొనిచ్చాను. కానీ నాకే అసహనంగా ఉంది, ఇప్పుడు నేను వేసుకోవడానికి నాకే లోదుస్తులు లేవు!
మే 27
ఆమె నాలో సారాన్ని పీల్చేస్తూ ఉంది.శారీరకంగా ఇప్పుడు నేను వడలిపోయిన పొద్దుతిరుగుడు కాడలా ఉన్నాను. ఆమె స్త్రీ కాదు, కోరిక అగ్నితో జ్వలించుకోపోయే కార్చిచ్చు!
జూన్ 2
ఈ రోజు మేము ఉదయం తొమ్మిది గంటలకు నిద్ర లేచాము.
నా కాలి వేళ్ళను ముందుకు వెనక్కి అనే నా దరిద్రపు అలవాటు వల్ల ఈ కింది పరిణామాలు సంభవించాయి. ఆమె కప్పుకున్న దుప్పటిని పక్కకు లాగి, నా పాదాన్ని పరీక్షగా చూసింది. ఆ గమనింపును గురించి ఇలా చెప్పింది:
‘గుర్రపు డెక్కలా ఉన్నాయి నీ పాదాలు. చండాలంగా ఉన్నాయి!దానికి తగ్గట్టు వాటి మీద జుట్టు-ఛీ!’ ఒక రకమైన అసహ్యంతో ఆమె భుజాలు పక్కకు తిప్పుకుని, దుప్పటిలో తల దాచుకుని గోడ వైపుకి తిరిగింది.
నాకు సిగ్గు వేసింది. నా పాదాలు కనపడకుండా ఉంచి, అనునయంగా ఆమె భుజాల మీద నా చేయి వేసాను.
‘లిజా!’
‘నన్ను ఒంటరిగా వదిలేయ్!’
‘లిజా! ఇలా ఉండటం మంచిది కాదు. నేను నా పాదాల ఆకారం మార్చలేను, అవి తలచుకోగానే మారిపోయేవి కావు, అది నీకు తెలిసిందే. ఇకపోతే జుట్టు విషయానికి వస్తే, శరీరంలో ఎక్కడ జుట్టు పెరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అది అన్ని చోట్లా పెరుగుతుంది. నువ్వు ఓ వైద్య విద్యార్థినివి, నీకు ఈ ప్రకృతి నియమాల గురించి తెలిసే ఉండాలి. ‘
ఆమె వెనక్కి తిరిగింది.
ఆ లేత గోధుమరంగు కళ్ళల్లో ఓ కొంటె మెరుపు కనిపించింది.
‘కనీసం సువాసన వచ్చే పౌడర్ అయినా కొనుక్కో. శవం వాసన వస్తుంది ఆ పాదాల నుండి!’
నేను కూడా దీనికి ప్రతిస్పందన గా ఆమె చేతులు ఎప్పుడు తడిగా ఉంటాయని అన్నాను. అప్పుడు ఆమె నిశ్శబ్దంగా ఉంది, ఇంకా అర్థం అయ్యేలా చెప్పాలంటే, ఒక దట్టమైన మేఘం నా మనసును కమ్మినట్టు అనిపించింది… దానికి పాదాలు, జుట్టుతో సంబంధం లేదు…
జూన్ 4
ఈ రోజు మేము మోస్కవా నదిలోకి పడవలో వెళ్ళాము. మేము డాన్ గురించిన విషయాలు మాట్లాడుకున్నాము.లిజా ప్రవర్తన చాలా దుర్భరంగా ఉంది. నేను పెట్టే ఖర్చుల గురించి హేళన చేసేది, కొన్నిసార్లు అవి చాలా అవమానకరంగా ఉండేవి. ఆమెకు తగ్గట్టు ఎదురు సమాధానం చెప్పడం వల్ల మా బంధం తెగిపోతుంది, అది జరగడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నా, నేను రోజు రోజుకి ఆమెకు దగ్గరవుతూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఆమె గారాబం వల్ల చెడగొట్టబడిన పిల్ల. కానీ నా ప్రభావం వల్ల ఆమె ప్రవర్తనలో చెప్పుకోదగిన మార్పులు ఏవి రావనే భయం నాకుంది. ప్రేమించదగిన అమ్మాయే కానీ కాస్త పద్ధతులు తప్పిన పిల్ల. చిన్న పిల్లే అనిపిస్తుంది కానీ, నేను అక్కడ ఇక్కడ ఎవరో చెప్పుకోగా విన్నవి అన్ని కూడా ఆమె స్వయంగా తెలిసిన పిల్ల. ఇంటికి వెళ్లే ముందు ఒక షాపుకు తీసుకెళ్ళి, నవ్వు ముఖంతో,సువాసన వచ్చే ఒక పౌడర్ తో పాటు ఏవో కొనిచ్చింది నా చేత.
‘వీటి వల్ల నీకు అంత చెమట పట్టదు.’
ఆమెకు కృతజ్ఞతలు చెప్పాను.
కానీ, విషయాలు అక్కడితో ఆగలేదు!
జూన్ 7
ఆమెకు తెలివి తక్కువే కానీ, అనవసరమైన అన్ని విషయాల గురించి తెలుసు.
ప్రతి రోజు రాత్రి పడుకోబోయేముందు నా పాదాలు వేడి నీటితో కడుక్కుని, కాస్త పరఫ్యూమ్ కొట్టుకుని, దాని మీద పౌడర్ తో పాటు కొన్న మిగిలినవి కూడా పూసుకునేవాడిని.
జూన్ 16
రోజు రోజుకి ఆమె ప్రవర్తనలో అసహనం పెరిగిపోతూ ఉంది. నిన్న దాదాపుగా హిస్టిరియా వచ్చిన వ్యక్తిలా అరిచింది. ఇటువంటి స్త్రీతో కలిసి ఉండటం చాలా కష్టం.
జూన్ 18
మా ఇద్దరి అభిరుచుల్లో ఒక్కటి కూడా కలవలేదు. మేము కనీసం ఒకే భాషలో కూడా మాట్లాడుకోవడం లేదు. మేము కలిసే ఒకే ఒక్క అంశం పడక మీద మాత్రమే.జీవితంలో జీవం పోయినట్టు అనిపిస్తుంది.
ఈ ఉదయం ఆమె బేకరీ షాపుకి వెళ్ళే ముందు నా జేబులో డబ్బు కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఈ పుస్తకం ఆమె కంటపడింది. దాని వైపు చూసింది.
‘నువ్వు జేబులో పెట్టుకున్న ఈ పుస్తకం ఏమిటి?’
ఆ ప్రశ్న వినగానే నాకు కంగారు పుట్టింది. ఒకవేళ అది తెరిచి ఆమె చూసి ఉంటే? ‘అది లెక్కల కోసం నేను రాసుకునే పుస్తకం అంతే!’ సహజంగా ఆ అబద్దం చెప్తూ ఉంటే,నన్ను చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది.
ఆమె వెంటనే దానిని జేబు లోపల పెట్టేసి, ఏమి పట్టనట్టు బయటకు వెళ్ళిపోయింది. నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తికి తెలియనంతవరకే ఈ రాతలు బావుండేది, తెలిస్తే అంతే సంగతి!
ఇవన్నీ కూడా నా నేస్తం వాస్య సరదాగా చదువుకుంటాడని రాసినవే.
జూన్ 21
నాకు లిజాను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆమె వయస్సు ఇరవై ఒకటి మాత్రమే.
అంతలా చెడిపోయేంతగా ఆమెకు సమయం ఎలా దొరికింది? ఆమె కుటుంబం ఎటువంటిది, ఎటువంటి వాతావరణంలో పెరిగింది? ఈ ప్రశ్నలు నాలో ఎంతో కుతూహలాన్ని రేకెత్తించాయి. ఆమె నిజంగా గొప్ప సౌందర్యవతి. తన రూపాన్ని చూసుకుని ఎప్పుడు గర్వపడుతూ ఉంటుంది. తనను తాను గొప్పగా భావించుకోవడం తప్ప, ఆమెలో ఏ విశేషము లేదు. ఆమెతో నేను చాలా సార్లు గంభీరంగా మాట్లాడటానికి ప్రయత్నించాను. దేవుడున్నాడని నమ్మే వాడిని దేవుడు లేడని నమ్మించడం సులభమవ్వొచ్చు కానీ లిజాను ఒప్పించేలా మాట్లాడటం మాత్రం సాధ్యం కాదు.
ఇద్దరం కలిసి ఉండటం చాలా అసంబద్ధంగాను, అసాధ్యంగాను అనిపించసాగింది. ఇంకా ఈ బంధం నుండి నాకు బయటపడాలని లేదు. నిజం ఒప్పుకోవాలంటే ఆమెలో ఎన్ని లోపాలు ఉన్నా సరే, తనంటే నాకు ఇష్టం. అలా నా అభిరుచులకు భిన్నంగా ఉన్న ఆమె పట్ల నా ఇష్టం మాత్రం స్థిరంగానే ఉండిపోయింది.
జూన్ 24
ఈ చిక్కు వీడని ప్రశ్నకు మొత్తానికి ఈ రోజు సమాధానం వచ్చేసింది. ఈ రోజు మేము ఒకరితో ఒకరం మనసు విప్పి మాట్లాడుకున్నాము. ఆ మాటల్లో ఆమె నేను తనను శారీరకంగా సంతృప్తి పరచలేకపోతున్నానని చెప్పింది. ఇంకా మేము విడిపోలేదు, ఇంకొన్ని రోజుల్లో అది కూడా జరుగుతుంది.
జూన్ 26
ఆమెకు కావాల్సింది స్టానిట్సా జాతికి చెందిన గుర్రం! ఎప్పుడు యావ మీద ఉండే గుర్రం అంతే!
జూన్ 28
ఆమెను వదలడం చాలా కష్టంగా ఉంది. ఆమె నన్ను బురదలా కిందకు లాగేస్తూనే ఉంది. ఈ రోజు మేమిద్దరం వోరోబ్యోవి కొండల దగ్గరకు వెళ్ళాము. ఆమె హోటల్ లో కిటికీ దగ్గర కూర్చుని ఉంటే, చెక్కినట్టు ఉన్న ఆమె చెవుల మీదగా సూర్యకాంతి ఆమె కురుల మీద పడింది. ఆమె జుట్టు బంగారపు వర్ణంలో ఉంది. ఇది నేను నీ కోసం రాస్తున్న కవిత్వం సుమా!
జూలై 4
నేను నా పని వదిలేసాను. లిజా నన్ను వదిలేసింది. ఈ రోజు నేను స్ట్రెజ్ నేవ్ తో కలిసి బీరు తాగాను. నిన్న మేము వోడ్కా తాగాము. లిజా, నేను చదువుకున్నవారిలానే మర్యాదగా విడిపోయాము. ఎటువంటి వాదనలు పెట్టుకోలేదు.ఈ రోజు నేను ఆమెను డ్మిట్రోవకా వీధిలో జాకీ బూట్లు వేసుకున్న ఒక కుర్రవాడితో చూశాను. నేను పలకరిస్తే ఆమె తల ఊపి ఊరుకుంది. ఇక ఈ రాతలు రాయడం మానెయ్యాలి… ఎందుకంటే దేని కేంద్రంగా రాస్తున్నానో ఆ వ్యక్తే ఇప్పుడు నా జీవితంలో లేదు కనుక.
కానీ అనుకోని పరిస్థితుల్లో నేను మరలా కలం పట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితే యుద్ధం. పశువుకుండే కూతుహల విస్పోటనమే యుద్ధం. ప్రతి టోపీ నుండి దేశభక్తి పొరలుతుంది, పురుగులు పట్టిన కుక్క కన్నా కూడా ఈ దేశభక్తి వాసన భరించలేనిదిగా ఉంటుంది.
మిగిలిన వారికి ఇలా అన్నందుకు కోపం వచ్చినా సరే, నాకు మాత్రం సంతోషంగానే ఉంది. నేను ఇంకా అందిన స్వర్గం చేజారిన భావనతో విరహవేదనతో బాధ పడుతూనే ఉన్నాను. పోయిన రాత్రి లిజా గురించి నాకు కామంతో కూడిన ఒక కోరిక కలిగింది. ఆమె నాలో కోరికల గాఢతను పెంచి వెళ్ళింది… ఇప్పుడు వేరే ఏదైనా విషయంలో పడిపోతే తప్ప ఈ బాధ తప్పదు.
ఆగస్టు 1
ఆ విషయం మర్చిపోదామని చేసే ఇతర పనులు అన్ని కూడా ఏ లాభం లేకుండా అయిపోయాయి. పూర్వపు కోరిక మరలా నాలో చెలరేగింది. బొమ్మ కోసం ఏడ్చే పిల్లవాడిలా ఉంది నా పరిస్థితి.
ఆగస్టు 3
ఒక దారి దొరికింది! నేను యుద్దానికి వెళ్తాను. పిచ్చి నిర్ణయమా? సిగ్గు పడాల్సిన విషయమా?
కానీ ఇప్పుడు ఇలా అనుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? నాకు ఇంకో మార్గం కనిపించడం లేదు. కనీసం యుద్దానికి వెళ్తే జీవితంలో ఏదో కొత్తగా ప్రయత్నం చేసిన అనుభవం అయినా ఉంటుంది. రెండేళ్ళ క్రితం నాకు ఇలాంటి భావన ఎప్పుడు కలగలేదు. నేను వృద్ధుడిని అయిపోతున్నానా?
ఆగస్టు 7
ఇప్పుడు నేను రైలులో కూర్చుని రాస్తున్నాను. ఇప్పుడే వోరోనేజ్ దాటాము. రేపటికి నేను కామెన్ స్కాయా దగ్గర దిగుతాను. నా నమ్మకం కోసం, జార్ కోసం, నా పితృభూమి కోసం యుద్ధం చేయాలని నేను నిర్ణయించుకున్నాను.
ఆగస్టు 12
ఎటువంటి వీడ్కోలు వేడుక చేశారు!అటామన్ కడుపు నిండుగా తాగి, పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. ఆ తర్వాత నేను అతనితో గుసగుసగా ‘నువ్వు ఒక వెధవ్వి’అన్నాను.అతను ఆ మాటలకు విస్తుపోయి, అవమానకరంగా భావించాడు, అతని ముఖం ఎర్రగా మారిపోయింది.
‘నువ్వు పెద్ద చదువుకున్నవాడివని అనుకుంటున్నావా? మేము 1905 లో మేము కొరడాలతో కొట్టిన వాళ్ళ పాటి విలువ కూడా చేయవు నువ్వు. అవునా? కాదా? చెప్పు’అని ఒక పక్కా ఉమ్ముతూ కోపంగా అన్నాడు. ‘నేను వారిలో ఒకడిని కాదు’ అని అతని మాటలను నిరసిస్తూ, అతన్ని సోషల్ డెమోక్రాట్స్ లో చేరమని సలహా ఇచ్చాను. మా నాన్న ఆనందబాష్పాలతో తన ముక్కు పైన ఉన్న మంచు బిందువు కిందకు జారుతూ ఉండగా నాకు బుగ్గ మీద ముద్దు పెట్టాడు.
‘ ఓ నాన్నా! ఆయన నా పరిస్థితిలో ఉంటే అర్థమయ్యేది. నేను సరదాగా ఆయన్ని కూడా నాతో పాటు రమ్మని సూచించాను. దానికి ఆయన,’నేను వస్తే పొలం ఎవరు చూసుకుంటారు?’అని ఆశ్చర్యంగా అన్నాడు. రేపు నేను వెళ్ళబోతున్నాను.
ఆగస్టు 13
పంట పండని పొలాలు. కొండల మధ్య తిరుగుతూ మెత్తటి చర్మంతో ఉన్న ఉడుతలు. వాటిని చూస్తుంటే కోజమా క్రైచుకోవ్ బల్లెం మీద నాణ్యత లేకుండా చిత్రించిన జర్మన్లు గుర్తుకు వచ్చారు. ఒకానొక కాలంలో నేను గణిత శాస్త్ర మరియు శాస్త్రీయ అంశాల విద్యార్థిని. అప్పట్లో నేను ఎప్పుడు కూడా జీవించడానికి యుద్దాన్ని ప్రేమించే వ్యక్తిగా మారాల్సి వస్తుందని అనుకోలేదు. నేను రెజిమెంటుకు వెళ్ళాక కోసాక్కులతో ఈ విషయం గురించి మాట్లాడతాను.
ఆగస్టు 22
ఒకానొక స్టేషన్ లో నేను వరుసగా నిలబడి ఉన్న ఖైదీలను చూసాను. చూడటానికి చక్కగా ఉన్న ఒక ఆస్ట్రియా అధికారిని బంధించి స్టేషన్ భవనం వైపు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ ప్లాట్ ఫారం మీద ఉన్న ఇద్దరు స్త్రీలు అతన్ని చూసి నవ్వారు. ఆగకుండానే వారికి గాలిలోనే ముద్దు పంపిస్తున్నట్టు సంజ్ఞ చేశాడు.
ఒక ఖైదీగా ఉన్నప్పటికీ, చక్కగా గడ్డం చేసుకుని, చూడటానికి ధైర్యవంతుడిలా, పాలిష్ చేయబడి మెరుస్తూ ఉన్న బూట్లు ధరించి ఉన్నాడు. అతను వెళ్లిపోతూ ఉంటే అతన్నే చూస్తూ ఉన్నాను.యవ్వనంతో, రైతు ముఖంతో, చూడటానికి ఆకర్షించే విధంగా ఉన్నాడు. ఒకవేళ అతను యుద్ధంలో ఎదురుగా ఉంటే, అతనిపై దాడి చేయడానికి మనస్కరించదు!
ఆగస్టు 24
శరణార్థులు…శరణార్థులు..శరణార్థులు…. రైళ్ళ నిండా గుంపులుగా వస్తూ ఉన్న వీరితోనూ, యుద్ధంలో పాల్గొనడానికి వస్తున్న వారే ఉన్నారు.
అప్పుడే వచ్చిన మొదటి రైలు అప్పుడే కదిలింది. అది ఆగినప్పుడు, ఒక యువ సైనికుడు అందులో నుంచి కిందకు దూకాడు. అతని ముఖం మీద కట్టు ఉంది. మేమిద్దరం మాట్లాడుకున్నాము. తూటాలు అతన్ని గాయపరిచాయి. అతని కంటి చూపు కూడా దెబ్బ తిన్నది. అయినా ఇక యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం తప్పినందుకు అతను సంతోషంగా ఉన్నాడు. నిజానికి అతను నవ్వుతూ ఉన్నాడు.
ఆగస్టు 27
నేను నా రెజిమెంటుతో ఉన్నాను. ఆ రెజిమెంటు అధికారి మంచివాడు, వృద్ధుడు. అతను డాన్ ప్రాంతపు దిగువ భాగానికి చెందిన వాడు. అక్కడ ఎక్కడ చూసినా రక్తం వాసనే! మేము ఎల్లుండి మొదటి వరుసలో ఉండాల్సి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. నేను కాన్ స్టాంటినోవాస్కాయా కోసాక్కులు ఉన్న మూడవ స్క్వాడ్రన్ లో మూడవ బృందంలో ఉన్నాను. వాళ్ళంతా పెద్ద ఆసక్తి కలిగించలేని బృందం వారు. వారిలో పాటలు పాడుతూ చురుగ్గా ఉంది ఒక్కడే.
ఆగస్టు 28
మేము పైకి వెళ్తూ ఉన్నాము. ఈ రోజు ఇక్కడంతా ఏవో ధ్వనులు వినబడుతూ ఉన్నాయి. ఒక ఉరుము ఎక్కడో దూరంలో ఉరిమింది. నేను వాన పడుతుందేమో తెలుస్తుందేమోనని ఆ గాలిని ఇంకా బలంగా పీల్చుకున్నాను.కానీ ఆకాశం మాత్రం నీలపు గుడ్డలా ఉంది.
ఆగస్టు 30
నిన్న రాయడానికి సమయం దొరకలేదు. ఇప్పుడు కూడా నేను గుర్రం జీను మీద పుస్తకం పెట్టుకుని రాస్తున్నాను. మధ్యమధ్యలో గుర్రం కదులుతూ ఉండటం వల్ల నా పెన్సిల్ కూడా అటుఇటూ కదులుతూ కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంది. మేము ముగ్గురం పశువుల గ్రాసం కొరకు వెతుకుతూ సంచులతో బయలుదేరాము.
మిగిలిన ఇద్దరూ ఆ సంచులలో గ్రాసం నింపుతూ ఉంటే నేను నిన్న జరిగింది రాస్తూ ఉన్నాను. నిన్న సార్జెంట్ మేజర్ టోలోకోనికోవ్ (ఆయన నన్ను కోపంగా ‘విద్యార్థి’ అని సంభోదిస్తూ ఉంటాడు.’హలో, ఓ విద్యార్థి, నీ గుర్రపు నాడా ఒకటి బయటకు వచ్చేసింది. చూసుకోలేదా?’)మా ఆరుగురిని పర్యవేక్షణ పని మీద పంపాడు. ఆ సమయంలో మేము ఒక చిన్న పట్టణం గుండా వెళ్తూ ఉన్నాము, అది సగానికి పైగా కాలిపోయి ఉంది. చాలా వేడిగా ఉంది. గుర్రాలకు చెమట పడుతూ ఉంది,మాది కూడా అదే పరిస్థితి. కోసాక్కులు వేసవికాలంలో ఉన్ని పాంట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పట్టణం బయట నేను మొట్టమొదటి శవాన్ని చూశాను. ఒక జర్మన్ ది. ఒక మురుగు కాలువలో కాళ్ళతో, బోర్లా పడి ఉన్నాడు. ఒక చేయి అతని కింద మెలి తిరిగి ఉంది,ఇంకో చేతిలో తుపాకి పెట్టుకునే లోహపు చుట్టు లాంటిది ఉంది. దగ్గరలో ఎక్కడా తుపాకి కనిపించలేదు. అదొక భయానక దృశ్యం. దాని గురించి తలుచుకుంటేనే నా వెన్నులో వణుకు పుడుతుంది….అతను చూడటానికి ఆ మురుగుకాలువలో కాళ్ళు పెట్టుకుని ఆ తర్వాత వెనక్కి వాలి విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉన్నాడు. బూడిదరంగు యూనిఫారంతో పాటు హెల్మెట్ కూడా ధరించి ఉన్నాడు. అతని సిగరెట్ల పెట్టెలో చక్కటి డిజైన్ తో ఉన్న క టిష్యూ పేపర్ సిగరెట్లు పాడవ్వకుండా చుట్టూ ఉంది. ఈ మొదటి అనుభవం నన్ను ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందంటే నాకు అతని ముఖం సరిగ్గా గుర్తు లేదు. కేవలం పెద్ద పసుపు పచ్చ చీమలు అతని నుదుటి మీద నుండి సగం మూసినట్టు ఉన్న ఆ కళ్ళవైపుకి పాకడం మాత్రమే గుర్తుంది. ఆ దారిన వెళ్తూ కోసాక్కులు దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. అతని యూనిఫారంకు కుడి వైపు ఉన్న చిన్న రక్తపు మరకను నేను చూశాను. తూటా అతన్ని కూడి వైపు తాకి,సూటిగా లోపలికి చొచ్చుకుపోయింది. నేను ముందుకు వెళ్తూ ఆ తూటా ఎటువైపు నుండి బయటకు వచ్చిందో చూస్తూ ఉంటే,యూనిఫారం మీద,నేల మీద పెద్ద రక్తపు మడుగు, ఆ యూనిఫారం అంతా వెనుక వైపు చిరిగిపోయి ఉంది.
వణుకుతూ ఆ దారి దాటాను. అంటే ఇలా జరుగుతుందన్నమాట…..
మాతో పాటు ఉన్న ఓ సీనియర్ సార్జెంట్ అధికారి, టీజర్, మా మనసులను ఆ పరిస్థితి నుండి మరల్చడానికి ఏదో ఒక బూతు జోకు చెప్పడం మొదలు పెట్టినా, అతని పెదవులే వణుకుతూ ఉన్నాయి.
ఆ పట్టణం నుండి ఒక అరవెరస్టు దూరం ప్రయాణించాక,మేము కేవలం గోడలు మాత్రమే మిగిలి ఉన్న ఒక ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాము: ఇటుక గోడలు మొత్తం పై నుండి పొగతో మసిబారి ఉన్నాయి. దాడికి గురైన ఆ కట్టడం ఉన్న ఆ దారి గుండా సూటిగా వెళ్ళడానికి మేము భయపడి, చుట్టూ తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. మేము ఆ దారి దాటి కొద్దిగా ముందుకు రాగానే ఎవరో ఆ ఫ్యాక్టరీ నుండి మా మీద కాల్పులు ప్రారంభించారు. ఇది చెప్పడానికి సిగ్గు పడుతున్నా సరే,ఆ మొదటి గుండు శబ్దం నన్ను ఎంత భయపెట్టిందంటే దాదాపుగా నేను గుర్రం నుండి కింద పడిపోయేవాణ్ణే. వెంటనే అప్రమత్తతో పగ్గాలు గట్టిగా అదుపులోకి తెచ్చుకున్నాను. మేము వెంటనే వెనక్కితిరిగి మేము వచ్చిన మురుగుకాలువ దగ్గర ఉన్న ఆ జర్మన్ శవాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చాము , ఆ పట్టణం వదిలి వచ్చేవరకు దడ తగ్గలేదు. అప్పుడు మేము వెనక్కి తిరిగి, గుర్రాలు దిగాము. ఆ గుర్రాలను ఇద్దరికి అప్పగించి,మిగిలిన నలుగురం ఆ మురుగుకాలువ దగ్గరకు వెళ్ళాము. ఆ దారి గుండా వెళ్ళడానికి మేము వంగాల్సి వచ్చింది. కొద్ది దూరం నుండి నాకు చనిపోయిన జర్మన్ కాళ్ళు బూట్లతో ఒక వైపు వేలాడుతూ కనిపించాయి. అతన్ని దాటుతూ ఉంటే, అతనేదో నిద్రలో ఉంటే, నా వల్ల మెలకువలోకి వస్తాడేమోనన్నట్టు నేను ఊపిరి బిగపట్టాను. అతని కింద గడ్డి తడిగా, పచ్చగా ఉంది.
మేము ఆ గుంటలో కొన్ని నిమిషాలు ఉన్నాము. తర్వాత తొమ్మిది మంది జర్మన్ ఊహ్లాన్లు ధ్వంసమైపోయి ఉన్న ఫ్యాక్టరీ వెనుక నుండి గుర్రాల మీద వచ్చారు. వాళ్లు ధరించిన దుస్తులను బట్టి వారిని ఊహ్లాన్లుగా నేను గుర్తించాను. వారిలో ఒకరు, చూస్తూ ఉంటే అధికారిలా ఉన్నాడు, ఏదో కీచుగొంతుతో అరిచాడు, అంతే, ఆ బృందం అంతా మేమున్న దిక్కు వైపుకే స్వారీ చేసింది… మిగిలిన కుర్రాళ్ళు నన్ను గడ్డి ఎక్కించడానికి పిలుస్తున్నారు. ఇక నేను వెళ్ళాలి.
ఆగస్టు 30
నేను మొదటిసారిగా ఒక మనిషి మీదా ఎలా మొదటిసారి కాల్పులు జరిపానో వివరించాలనుకుంటున్నాను. జర్మన్ ఊహ్లాన్లు మా దారి గుండా ముందుకు సాగిపోయారు.ఇంకా నాకు పచ్చ రంగులో ఉన్న వాళ్ళ యూనిఫారం దుస్తులు, గంట ఆకారంలో వాళ్ళ తలల చుట్టూ ఉన్న హెల్మెట్ లు,వాళ్ళ దేశపు చిహ్నం వాళ్ళ కరవాలాల చివర్లో మెరుస్తూ ఉంది.
ముదురు రంగు గుర్రాలపై వాళ్లు ఉన్నారు.ఏదో కారణం వల్ల నేను గుంట చివర గడ్డి దగ్గర ఉన్న పచ్చరంగు మిడత మీద నా దృష్టి నిలిచింది. అది నా కళ్ళ ముందే పెరిగి పెద్దదవుతూ గడ్డి మీదగా ఎగురుతూ, ఆ గుంటలో పొడిగా ఉన్న ఇసుకపై పెట్టిన నా మోచేతి మీద వాలింది.అది అక్కడి నుండి పైకి పాకి, నా తుపాకీ మీద వాలింది.నేను ఇంకా దాని ప్రయాణాన్ని గమనిస్తూ ఉంటే,’కాల్చు!ఏంటి చూస్తున్నావు?’ అన్న టీజర్ అరుపు వినిపించింది. నేను నా మోచేతిని గట్టిగా కింద ఉంచి, ఒక కన్ను మూసి గురి పెడుతూ ఉంటే, నా గుండె కూడా ఆ మిడత అంత పెద్దగా ఉబ్బుతున్నట్టు అనిపించింది. నా దృష్టి ఒక ఆకుపచ్చ దుస్తులపై నిలిచింది. టీజర్ అప్పటికే ఒకసారి కాల్చాడు. నేను ట్రిగ్గర్ నొక్కి,తూటా గాలిలో నుంచి దూసుకువెళ్తున్న శబ్దం విన్నాను. ఆ సమయంలో గాలిలో రేగిన దుమ్ము వల్ల నాకు చూపు సరిగ్గా కనబడలేదు. అదే మొదటిసారి నేను ఒక వ్యక్తి మీద కాల్పులు జరపడం. నేను ఏ గురి పెట్టకుండానే మొత్తం తుటాలు ఖాళీ చేశాను. నేను ట్రిగ్గర్ నొక్కి ఏ తూటా ఇంకా మిగలలేదని గుర్తించినప్పుడే ఆ జర్మన్ల వైపు చూశాను.వాళ్ళు గుర్రాల మీద వెనుకకు వస్తూ ఉండటం కనిపించింది. వాళ్ళు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు,ఓ అధికారి ముదురు గోధుమ రంగు గుర్రం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
* * *