శిశిర ఋతువులో ఎండమావి దప్పిక, కలత నిద్ర

లేటెస్ట్ అప్డేట్ వర్షన్ పేజీల్లో పాత్రలు మారిపోతున్నాయి అనిపించింది… నరేష్ నాకు పరిచయం ఉన్న వ్యక్తిగా తన కథలు కొన్ని ముందుగా పరిచయం ఉన్నా, ఇప్పుడు ఇక్కడ ఒకచోట చదువుతుంటే మాత్రం చుట్టూ కొత్తగా పరిసరాల్లో ఆ మనుషులే తారసపడ్డారు. ఒక్కోసారి నరేష్ తీసుకొని చెప్పిన ప్రతి పాత్రలోకి మనం ప్రవేశించవచ్చు., కాదు కాదు మనలోనే ఆ పాత్ర ఉందేమో.., ఏదో ఒక సందర్భంలో కనిపించే ఉంటుంది మనలో కూడా కొన్ని భావాలు చెప్పకుండా మిగిలిపోయినవి ఇక్కడ తారసపడతాయేమో.

“అరే ఈ పాత్ర నాకు తెలిసిందే కదా అని అనిపిస్తూనే మన వ్యూ ఎక్కడ మిస్ అవుతుందో అక్కడ తన కథ మొదలవుతుంది” .

ఓ ముక్కోణపు ప్రేమ కథ చెప్పినా, సల్మా కన్నుల్లో జీవితపు కలను కన్నా, ఆలాపనగా విన్నా, ఎన్నో ఏండ్లు గతించిపోయినా మారని కొన్ని చరిత్రలోని రహస్యాల్ని విప్పి చెప్పినా… మెలిపెట్టే సంఘటనలు ఉన్నాయి అని అనలేను కాని ఆ క్యారెక్టర్స్ అన్నింటిని మన అనుభవంలో చూసే ఉంటాం, కాని ఆ పాత్రల్ని పలకరించడం మర్చిపోతూ ఉంటాం. అక్కడే ఆ పాత్రల్ని స్పృశించి సున్నితత్వాన్ని చూపించి మనల్ని కథల్లోకి లాక్కెళ్తాడు.

బస్సులో ప్రయాణాన్ని చిత్రిస్తూ పక్క సీటులో కూర్చునే మనిషి గురించి ఉండే కుతూహలం, చిరాకు, సంతోషం, అవి ఇచ్చే ఓ చిన్న రెండు నిమిషాల ఫీలింగ్స్ ని కూడా చిత్రించిన తీరు బాగుంటుంది.

జెండర్ ఫీలింగ్ ఎంతగా మనుషుల మధ్య పాతుకుపోయిందో చిన్న వాక్యాలలో వివరిస్తాడు. ఫలానా పాత్ర గొప్పగా ఉంది అనిపించదు కాని ప్రతి పాత్రకు ప్రాణం పోశాడు.

లీలా, కావేరిని తలుచుకుంటూ కాపాడుకోలేకపోయిన మనుషుల్ని తలుచుకుంటూ పక్షుల గూడుని కాపాడుకునే అమాయకపు లోకాన్ని చూపిస్తాడు.

కొన్ని కథల్లో అక్కడక్కడ సూసైడ్ టెండెన్సీ నుండి బయటపడే విధానం కనిపిస్తుంది. కారణం లేకపోలేదు ఈ జనరేషన్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, అప్డేట్ వర్షన్లు ఎంత సున్నిత మనస్కులో చెప్పేస్తాయి ఈ కథలు.

కులం, మతం చూసే మనుషులు అందరిలో ఉన్నారు, అనే విషయాన్ని హావభావాల వెనుక ఎలా దాచేస్తూ బయటకు సహజనటులు అవ్వడాన్ని సందర్భానుసారంగా వెల్లడి చేస్తాడు.

అన్ని కథలు రీడబిలిటీ ఉంటాయి., కథల్లో ప్రారంభం ఎంత హఠాత్తుగా ఉంటుందో ముగింపు కూడా అంతే హఠాత్తుగా ఉంటుంది.
ఇక్కడ పాత్రల కంటే ఎక్కువగా మనకు సందర్భం డామినేట్ చేస్తుంది. ఒక సందర్భంలో
“ఒక్కటి యాది పెట్టుకో రాఘవ, కోట్లాట మంచిది కాకపోవచ్చు కానీ కోట్లాడుడు మర్చిపోతే బతకలేం ఎవడో వచ్చి సంపుడు కాదు మనకు మనమే చంపుకున్నట్లు” అంటూ ఆలోచన ఆవేశము కలిగిన యువత ఎలా ఉండాలో ఎలా ఉంటున్నారో తన కథల్లో నిర్మించాడు.

ఈ కథల్లో ప్రకృతి అందాలతో ఏ పాత్రకైనా ఒక ప్రత్యేకత, కాస్త మ్యూజిక్ టచ్, వెన్నెల రాత్రిని, ఉర్దూ కవాలిని, ఫోటోగ్రఫీని, సూర్యోదయాన్ని, కలం పట్టి రాసే రాతల్ని పరిసరాలపై ఓ చిత్తరువు ని చేర్చి ఊటీ చల్లదనంలో శిశిర ఋతువు ఆగమనం, చిరుజల్లులు, పొగమంచులు తన కథల్లో పాత్ర యొక్క నేచర్ కింద కనిపిస్తాయి.

అంతేనా… అక్కడక్కడ వేసవి తాపాలు, ఎండమావి దప్పికలు, కలత నిద్రలు ఉక్కపోతలు తారసపడతాయి.

మీకు ప్రతి కథలో సిగరెట్ వాసన, గాజు గ్లాసుల చప్పుడు నేటి యువత మాట తీరుగా కనపడుతూ వినపడుతూ ఉంటాయి, కాఫీ వాసనల్లో ఈ పేరు లేని వెన్నెలని పలకరించి చూడండి తప్పక మంచి అరోమా ప్లేవర్స్ మధ్య ఓ కేపచీనో అందుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *