ఈ సినిమా చూస్తున్నంత సేపూ నాకు మా నాన్న అనే మాటే గుర్తొస్తూ ఉంది.
“కట్టం జేసుకొని బతకాలి గానీ మంది సొమ్ముకి ఆస బడగుడదు. రెక్కలాడినంత కాలం ఒకళ్ళు బెడతారనీ జూడగుడదు”.
నేనెప్పుడైనా చేనికి పోకుండా యగ్గొట్టాలని చూసినప్పుడల్లా పంజెయ్యక పోతే తిండ్యాన్నించి వత్తదిరా అని సనిగేవాడు.
శ్రామిక జీవుల్లో పని అనేది అత్యంత ముఖ్యమైన థియరీ.
దోపిడీ చేసే వాడికీ దోపిడీకి గురయ్యే వాళ్ళకి మధ్య పెట్టుబడి దారీ సమాజం ఒక వ్యవస్థను సృష్టించింది. అదే మధ్య తరగతి జీవుల వ్యవస్థ. వీళ్ళు పోరాటమూ చేయలేరు. అలాగని గొడ్డు చాకిరీ చేయలేరు. మేం విద్యావంతులం అనే ఒక హుందాతనం వీళ్ళని నడిపిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ వీళ్ళు కిందకీ జారకుండా, పైకీ ఎక్కకుండా జాగర్త పడుతుంది. మధ్యలో వీళ్ళు త్రిశంకు స్వర్గంలో నలిగిపోతూ ఉంటారు.
వీళ్ళు పైకి ఎగబాకాలనే ఆశ దోచుకునే, మోసం చేసేవాడికి మొట్టమొదటి ఆయుధం. ఆ ఆయుధం ఏ రూపేణా కావచ్చు.
ఆ ఆయుధం రాజకీయ నాయకుడు, వ్యాపారస్తుడు చేతుల్లో మంత్రదండంలా ఉండి వీళ్ళకి భూలోక సౌధాలు చూపించి మధ్యపెడుతుంది.
ఈ సినిమాలో అలాంటి ఆయుధాలకు బలై పోతున్న మధ్య తరగతి ప్రజల గురించి స్పష్టంగా చెప్పబడింది.
సులువైన మనీ కోసం మనం పాకులాడినప్పుడల్లా అది మనల్ని ఇంకా అడుక్కి తొక్కుతుంది. సంపాదించుకున్న సొమ్ము గుడ్డిగా పోగొట్టుకున్న వాళ్ళ జీవితాలు ఎంత అస్తవ్యస్తం అయ్యాయో చూపిస్తారు దర్శకులు. దానితో పాటు ఈజీ మనీ జోలికి వెళ్లని వాళ్ళ జీవితాలు కూడా ఏ మార్పుకి గురయ్యారో చెప్పిస్తుంటారు. ఇదంతా వాస్తవికమైన తొసకని కథనంతో నడుస్తుంది.
ఈ కథలో కేవలం ఈజీ మనీకి బలై పోతున్న దిగువ మధ్యతరగతి కుటుంబాల గురించి మాత్రమే చెప్పారు అనుకుంటే పొరపాటే. ఇందులో ఒక రాజకీయ కథ ఉంది. రాజకీయం, వ్యాపారం కలిసిపోయి మనుషులను దోచుకుంటున్న కథ ఇది. ఒక పొలిటికల్ స్టోరీ ఇంకా దోపిడీ, తిరుగుబాటు కథ ఇది.
ఈ సినిమాలో చిరంజీవి పాత్ర అతి ముఖ్యమైనది.
చిరంజీవి మధ్య తరగతి కుటుంబ పోషకుడు అయినా అతనిలో శ్రామిక తత్వం ఉంది.
తన భార్యతో “మన డబ్బులు దొచుకోవచ్చు కానీ కష్టపడేతత్వాన్ని ఎవడు దోచుకుంటాడు” అనే ఒక్కమాట చాలు పూర్తి అతని స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి. అయితే ఇదే మాటని నమ్ముకోవడంలో ఒక తప్పు కూడా ఉంది. కష్టం చేసుకు బతుకుతాను అని కేవలం అలాగే అనుకుంటే ఎవడో వచ్చి నువ్వు పోగుచేసుకున్న దాన్ని లాక్కుపోతున్నా ఆ ఒక్క మాటని మననం చేసుకుంటూ దోపిడీకి గురవుతూనే ఉండాల్సి వస్తుంది. అందుకే చిరంజీవి అక్కడితో ఆగిపోడు. తన కష్టాన్ని దోచుకున్న వాడిని వదిలేసి ఇంతే కర్మ అనుకునేవాడు కాదు. చేతిలో కష్టాన్ని నోటి కందకుండా లాక్కుపోతుంటే రెండు చెంపలూ వాయించే రకం తను. ఈ క్యారక్టర్ లో ఉన్న ప్రత్యేకత ఇదే. సాధారణంగా హీరో పాత్ర చేయటం వలన హీరో కావటం కాకుండా కథా పరంగా ఇందులో చిరంజీవి పాత్రలో నిజమైన హీరో లక్షణాలున్నాయి. ఈ పాత్రలో చైతన్య రావుని తప్పా మరొకరిని ఊహించుకోలేం అనటానికి ఆయన నటన ప్రధాన కారణం. ఈ పాత్రలో ఉన్న వేరియేషన్ని ఆయన బాగా పోషించారు. మిత్రుల దగ్గర, ఇంట్లో, ఆఫీస్లో, పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత భార్యతో ఆయన వైవిధ్యమైన నటనను సూక్ష్మంగా గమనించవచ్చు.
ఈ కథలో చిరంజీవి పాత్ర ప్రధానం అయినా మిగతా పాత్రలు హీరో కారెక్టర్ చుట్టూ ముడిపడి లేవు. అందుకే ఆయా పాత్రలకి ప్రత్యేక ఆస్తిత్వాలు ఉన్నాయి.
విజయ శాంతి పాత్ర భర్త ఇచ్చిన డబ్బులను ఊరికే నీటి పాలు చేసినందుకు తను పడే క్షోభ ఈ కథలో చాలా ముఖ్యమైనది. చిరంజీవి తల్లి తనకు మనవడో, మనవరాలో పుట్టబోతున్న ఆనందంలో డబ్బు పోయిన విషయాన్ని వదిలేసినా, విజయశాంతి మాత్రం లోన్లీకి గురవుతుంది. తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్. ఆమె అనుభవించే బాధ. ఇలా ఎంతమంది ఇంట్లో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నాక అనుభవించి ఉంటారో. భూమి శెట్టి ఈ పాత్రలో రోజూ మన కళ్ళ ముందు మేసిలే మనిషిలా కనిపించారు. మిగతా పాత్రలన్నీ మన చుట్టాలుగా, స్నేహితులుగా, పరిచయస్తులుగా కనిపిస్తారు.
అందరూ కథనానికి ఒదిగి నటించారు. అంతకు మించి ఇంకేం కావాలి.
ఇందులో పసునూరి రవీందర్, పెద్దింటి అశోక్ కుమార్, స్వర్ణ కిలారి గార్లను నటులుగా చూడటం మంచి థ్రిల్ అనిపించింది నాకు.
చైతన్య పింగళి, మల్లెగోడ గంగా ప్రసాద్ ల పాటలు కథను ముందుకు నటపటంలో కీలకంగా పని చేశాయి.
ఇందులో పెళ్ళి పాట, పెళ్ళి చిత్రీకరణ ఈ సినిమా మొత్తానికే హైలెట్. ఒక ప్రాంతపు ప్రజల పెళ్ళి డాక్యుమెంటరీ.
Kumara Swamy అన్న నీ సినిమా చూసేశాను. ఇందులో తెలంగాణ భాష సాంతం వినటం గొప్ప తృప్తి. సెలయేరు జలువారినట్లు భాష సాగుతూ పోయింది. నీ సినిమాలో భాష కూడా ప్రథాన క్యారెక్టర్.
ఈ సినిమాలో శంకరన్నలా ఎవరైనా పెన్ను గుర్తు వాడతారేమో అని అనుకుంటున్నా …
సినిమా aha లో ఉంది. చూడండి.
