ఇప్పటిదాకా నడిచొచ్చిన సగం దూరం ఒక ఎత్తైతే హోటల్ నుండి ఎక్కాల్సిన మిగతా సగం దూరం మరోఎత్తు అసలు కష్టమంతా ఇక్కన్నుండే మొదలవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన రాళ్ళ, మట్టి దార్లతోపాటు ఇక్కణ్ణుండి సిమెంట్ మెట్ల దారి కూడా సందర్శకులకు ఎదురవుతుంది. కొంతదూరం నిట్ట నిలువుగా పైకెక్కి, ఆ వెంటనే అంతే దూరం కిందికి దిగాల్సి వుటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కల్లోల కడలిలో భీకర అలల మాదిరి పైకి కిందికీ ఎక్కుతూ దిగుతూ వెళ్ళాల్సి వుంటుంది.
చిక్కనౌతున్న అడవితో పాటు ‘ర్హోడోడెండ్రోన్’ పూలచెట్ల పొదలు ఎదురౌతూ సందర్శకుల అలసటను కొంతలో కొంత తగ్గిస్తుంటాయి. ఒక మెరక మీదికి ఎక్కి మోనెస్ట్రీ దిక్కు చూస్తే అక్కడి కొండశిఖరంలో ఏర్పడిన చీకటి గుహ, నోరు తెర్చుకున్న శాపగ్రస్త భీకరాకార మొసలి మాదిరిగా వుంది. అది ఒకేసారి అనేక ఏనుగుల్నీ పట్టి ఆ నోట కర్చుకున్నట్టుగా వుంది. గుండెలు చెదిరిపోతున్న భయాన్ని అదిమిపెట్టుకుంటూ మరింత తీక్షణంగా దాని దిక్కే చూస్తే కొన్ని వేల అడుగుల ఎత్తులోవున్న దాని కింది దవడ ఎముకల అంచున ఆ మోనెస్ట్రీ నిర్మించినట్టుగా గోచరమవ్వసాగింది.
ఈ టైగర్ నెస్ట్ మోనెస్ట్రీ చరిత్రను గురించి కొంత అవలోకనం చేసుకుంటే దీన్ని ‘పరో తక్త్సంగ్’ అని కూడా అంటారు. ఇది హిమాలయన్ పర్వతశ్రేణిలో అంతర్భాగమైవుంటుంది. వజ్రాయాన బౌద్ధ ధర్మానికి సంబంధించిన పదమూడు ముఖ్యమైన మోనెస్ట్రిల్లో ఒకటి. నేపాల్ దేశంలో పుట్టి, టిబెట్ లో బౌద్ధాన్ని అనుసరించిన గురు పద్మసంభవుడు ఇక్కడికి రాకముందు ఆ గుహలో అనేక రకాల దుష్ట, తాంత్రిక శక్తులు నివాసముంటూ స్థానికంగా వుండే సామాన్య ప్రజలను నానారకాలుగా పీడిస్తుండేవట. అది తెలుసుకున్న గురు పద్మసంభవుడు ఆ దుష్ట శక్తులను రూపుమాపాలన్న సంకల్పంతో టిబెట్ నుండి నేరుగా ఈ గుహ దగ్గరికొచ్చి అందులోని దుష్టశక్తులన్నింటినీ పారదోలాడట.
తరువాత ఆ గుహలోనే కూర్చుని మూడు సంవత్సరాల, మూడు మాసాలా, మూడు వారాల, మూడు రోజుల, మూడు గంటల, మూడు నిమిషాలు తపస్సుచేసి జ్ఞానసిద్ధిని పొందాడట. ఈ మూడులన్నింటినీ కలిపిచూస్తే పద్ధెనిమిది వస్తుంది. పద్ధెనిమిది అనేది పౌరాణికంగా ఎంతో విలువైన అంకే. గురు పద్మ సంభవుడు అక్కడ ఎనిమిది రకాలుగా తనకు తాను ఆవిస్కృతుడయ్యాడట. అందుకు తార్కాణంగా అక్కడ ఎనిమిది మందిరాలుంటాయి. ఆ ఎనిమిది మందిరాల్లో ఎనిమిది రకాల పేర్లతో బోధగురువులుంటారు.
పద్మసంభవుడు ఈ గుహలోకి రెక్కలున్న పులిమీద వచ్చి ఇక్కడున్న దుష్ట శక్తుల్ని పారదోలిన తరువాత ఆ దుష్టశక్తులన్నీ కలిసి ఒక దుష్టరాజుకు తమ శక్తులను ధారపోసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజానీకాన్ని పలురకాలుగా హింసకు గురిచేయసాగారు. అది గమనించిన గురు పద్మసంభవుడు మరో గురువు అవతారంలో పులి మీద వచ్చి ఆ రాజును సంహరించాడట. ఆ విషయంలో టిబెట్ దేశానికి చెందిన ఓ మహారాణి అతనికి అనుంగు శిష్యురాలై తనను తాను పులిగా మార్చుకుని గురువును తన మీద కూర్చొబెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి ప్రజా కంటకుడైన ఆ రాజును సంహరించడంలో తనవంతు కర్తవ్యాన్ని తాను నిర్వహించి ముక్తిని పొందిందట.
హిందూ ధర్మంలో మాదిరిగానే బౌద్ధ ధర్మంలో కూడా ఈ విధంగా ఎన్నెన్నో ఆస్పష్ట గాధలు వేల ఏండ్లుగా ప్రజల్లో పాతుకుపోయివున్నాయి.
ఇప్పటికీ ఆ కొండల మీద మనకు భీతిగొల్పేటంతటి అడవి కళ్ళముందు కన్పిస్తుందంటే, ఎప్పుడో 1692లో నాలుగవ గురువు ద్రుదేశి తెన్ జిన్ రబ్జీ ఈ మోనెస్ట్రీని నిర్మించారట. అది ఏవిధంగా సాధ్యమయ్యిందో ఆలోచిస్తే మనకు అనూహ్యంగా అన్పిస్తుంది. ఎంత మంది బౌద్ధ పరివ్రాజకులు, ఎంత మంది సాధారణ ప్రజలు ఎన్నెన్ని కష్ట నష్టాలకు ఓర్చి ఆ మోనెస్ట్రీని నిర్మించారో?ఎంత స్వేదాన్ని చిందించారో? చరిత్ర పుటల్లో వారంతా చిరునామా లేకుండా పోయారుగదా?. అదంతా తల్చుకుంటే గుండే దిగులుతో నీరైపోతుంది.
కారణాలు ఏవైనప్పటికీ ఈ మోనెస్ట్రీ ఇప్పటికీ మూడు మార్లు కాలిపోయిందట. ఎంతో విలువైన సమాచారం, అమూల్యమైన గ్రంధాలు, గాధా చిత్రిత చిత్రాలు బూడిదైపోయాయట. అయినప్పటికీ చాలావరకు వివిధమార్గాల్లో, వివిధపద్దతుల్లో వాటిని సేకరించి మళ్ళీ చాలావరకు పునర్నిర్మించారు. అవే ఇప్పుడు మనకు గతవైభ చరిత్ర పాఠాలను బోధిస్తుంటాయి. మా బృందం ఎనిమిది మందిలో మా దంపతులం, మాతోపాటు సునీత గారు,అందరికన్నా కాస్త ముందుగా నడుస్తుంటే మా వెనుకనే లింగయ్య, నాగేశ్వరరావు, సుబ్బారావు గార్లూ వస్తూనే వున్నారు. కానీ అందెశ్రీ, సారంగపాణి గార్లు మాత్రం చాలా వెనుకబడిపోయారు.
మేము ప్రధాన మోనెస్ట్రీకి చాలా దగ్గరికి చేరుకున్నాము. గుడికి సమీపంలో రెండువందల అడుగులకు పైచిలుకున వున్న కొండ మీది నుండి ఓ అందమైన జలపాతం కుబుసం విడిచిన కోడె తాచులా కిందికి దుముకుతూ సందర్శకులను ఆశ్చర్యచకితుల్నిచేస్తుంది. కొంతసేపు దాని అందాలను వీక్షించిన మేము తిరిగి మెల్లగా ముందుకు సాగుతుంటే గుడి తలవాకిట రెండు కొండల సందున ఏర్పాటుచేసిన మెట్లమీదుగా కొంత దూరం పైకెక్కిన తరువాత ఆ పైన ఎక్కడో వున్న, ఏదో ఒక మందిరం దగ్గర్నుండి వేలాడదీసిన మోట బావి మోకంత లావు మోకుని సగానికి పైగా మెట్ల కిందికి వచ్చే విధంగా వెళ్ళాడ దిశారు. అక్కడికి వెలుతున్న కొద్దిపాటి మంది ధైర్యస్థులైన భక్తులు ఆ మోకును పట్టుకుని, దానిసాయంతో మెట్ల మీదుగా పైకి వెళుతున్నారు.
అది చూసిన నేను మా ఆవిడ దిక్కు తిరిగి “అందెశ్రీ గారు వాళ్ళు వచ్చెలోపుగా నేను ఆ తాడుపట్టుకుని పైకెక్కి ఆక్కడున్న విశేషం ఏమిటో చూసి వస్తాను” అంటూ నా ప్రతిపాదనను ఆవిడ ముందు వుంచాను. దానికి తను “మీరు ఆ తాడుపట్టుకుని పైకి వెళ్ళే ప్రయత్నానికి నేను ససేమిరా ఒప్పుకొను” అంటూ నా ప్రతిపాదనను నిర్ధయగా వీటో చేసేసింది.
ఎక్కడైనా హోంశాఖకు పవర్స్ అధికంగా వుంటాయి. కావున ఆ నా ప్రయత్నాన్ని విరమించుకుని తిరిగి ప్రధాన మందిరం దిశగా కదిలాను. తానూ నా వెనుకే పదం కదిపింది.
ఇంకా కేవలం నాలుగు మెలికలు తిరిగితే మందిరాన్ని చేరుకుంటాము. ఇగిరి పోయిన ఉత్సాహాన్ని తిరిగి చిగిరింప జేసుకుంటూ “నాలుగు ఇరవైలు ఎనభై మెట్లుంటాయేమో? అంతేగదా?” అనుకుంటూ మొదటి మెట్టు మీద పాదం మోపి రెండో మెట్టు మీదికి మరో పాదం లేపుతుంటే మెట్టు మెట్టుకూ తొడకండరాలు పఠ పఠ పఠ మంటూ నరాలు చిట్లి పోతాయేమోనన్నంత బాధకు గురిచేయ సాగాయి. పొద్దుటి నుండి మేము ఎక్కి వచ్చిన బాధ దీని ముందు పూచిక పుల్లతో సమానం అనిపించింది. మెట్ల పక్కనున్న రాతి గోడను ఆసరాగా చేసుకుంటూ బ్రహ్మ ప్రళయంగా ఇరవై, ముప్పై నిమిషాల పాటు మా ఆమ్మా నాన్నలను స్మరించుకుంటూ ఎట్టకేలకు మందిర ప్రాంగణంలో అడుగుపెట్టాము.
మా కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. అక్కడ కనీసం మంచినీళ్ళ బాటిల్స్ కూడా దొరకవు. సుబ్బారావు గారి సంచీలో రెండు బిస్కట్లు, ఓ చిన్న యాపిల్ కాయా వున్నాయి. పక్కన నాగేశ్వటావు ఓ ముప్పావు భాగం నీళ్లున్న సీసా కనిపించింది. నేను వెంటనే “నాకో బిస్కెట్” అన్నాను. వారు వెంటనే “నేనివ్వను. ఇక్కడ అవసరం వుంటుందని మీకు ముందుగా తెలియదా? ఎవరి ప్రాణం వారికి తీపి. ఒక బిస్కెట్ మీకిస్తే మీకేటూ సరిపోదు. అదే నేను ఈ రెండు బిస్కెట్లు, యాపిల్ తిని ఇన్ని నీళ్ళు తాగితే ప్రాణం కుదుటపడుతుంది” అంటూ సహజంగా ఏ ప్రాణికైనా వుండే ప్రాణం మీది తీపిని, తనకు మాలిన ధర్మం చేయగూడదన్న నగ్న సత్యాన్నీ ఆక్షణంలో నాకు విప్పి చెప్పిన నిఖార్సైన భౌతికవాది సుబ్బారావు సార్ జ్ఞానం పునః ప్రాప్తమయ్యింది.
ఇంతలో కిందెక్కడో అందెశ్రీ, సారంగపాణి గార్లు వస్తూ కనిపించారు. “వాల్లోచ్చేసరికి ఎంతలేదన్నా మరో గంట పడుతుంది. కాబట్టి మీరు దర్శనం టిక్కెట్లకు డబ్బులిస్తే నేను వెళ్ళి టిక్కెట్లు తీసుకుంటాను” అన్నాడు గైడ్ ఫెమా. దాంతో మేము వెంటనే తలో వెయ్యి ఇచ్చేశాము. తను మాముందే వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టాడు. కానీ, ఆ టిక్కెట్లు మాకు చూపించలేదు. మా తొందర్లో మేమా టిక్కెట్లను గురించి అస్సలు పట్టించుకోలేదు. అదే విషయంలో తరువాత మాకు అతని నిజాయితీ పట్ల సందేహ కారణమయ్యింది. జరిగిపోయినదానికి వగపేల? అనుకున్న మేము అంతటితో ఆ విషయాన్నివదిలేశాము.
కౌంటర్ ముందు నుండి వచ్చిన గైడ్ ఫెమా ఆ మోనెస్ట్రీ చరిత్రను గురించి సంక్షిప్తంగా వివరించాడు. ఆ మోనెస్ట్రీకి మూల యంత్రం లాంటి ఓ శంకాకారపు పెద్దరాయి, దాని మీద మన బొటన వేలు పరిమాణంలో కన్నులాంటి చిన్న గుంటా వుంది. ఒక వ్యక్తి ఆ రాతి దగ్గరి నుండి కళ్ళు మూసుకుని రెండు అడుగులు వెన్నక్కి వెళ్ళి, కళ్ళు తెరవకుండానే మనసులో ఒక కోరిక కోరుకుని ఆ రెండు అడుగులు ముందుకొచ్చి కుడి చేతి బొటన వేలును మూడు ప్రయత్నాల్లో ఆ చిన్న గుంటలో పెట్టగలిగితే ఆ కోరిక నెరవేరుతుందనేది అక్కడి ప్రజల విశ్వాసం. గైడ్ ఫెమా మా అందరినీ ఓ ప్రయత్నం చేయమన్నాడు. అటువంటి వాటికి సుబ్బారావు గారు దూరం కాబట్టి వెంటనే తను చేయనన్నారు. తను తప్పుకుంటే ముందుగా వచ్చిన మా ఆరుగుర్లో అయిదుగురం మిగిలాము. ఆ అయిదుగుర్లో నేను, లింగయ్య మూడో ప్రయత్నంలో సఫలమయ్యము.
అ వెంటనే మా సెల్ ఫోన్స్ తదితరాలు బ్యాగులో పెట్టి ఆక్కడి సెక్యూరిటీ వారు ఇచ్చిన లాకార్లో పెట్టి వేరే గైడ్తో పాటు లోపలికెళ్ళాము. ఇంతలో అందెశ్రీ, సారంగపాణి గార్లు కూడా వచ్చి ఫెమాకు కలియడంతో అతను వాళ్ళను వెంటపెట్టుకుని వచ్చి మాతో కలిసిపోయారు. ఆ మోనెస్ట్రీలో గురు పద్మసంభవ ఎనిమిది రూపాలలో ఎనిమిది మందిరాలు వున్నాయి. ఒక్కో మందిరం తిప్పి చూపించిన గైడ్ వాటిని గురించి క్లుప్తంగా వివరించాడు.
మా జీవితాలలో ఇంత క్లిష్టమైన ట్రెక్కింగ్ ను ఎక్కి మందిరాలను దర్శించుకోవడంలోనిని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ తిరుగు ముఖం పట్టము. కిందకి చేరేసరికి సాయంత్రం ఆరుగంటలయ్యింది.
కిందవున్న మా మిత్రులంతా పొద్దుగూకులూ మా కోసం ఆతృతగా ఎదురుచూస్తూ వుందడంతో వాళ్ళ స్నేహశీలతకు పైకి వెళ్లొచ్చిన మేమంతా అభినందనలు తెలియజేసుకున్నాము.
అంతా కలిసి ఆరున్నర ఏడు గంటలకు హోటల్ చేరుకున్నాము.
మేము హోటల్ కి వెళ్ళే సరికి జనార్ధన్ గారు రిసెప్షన్ హాల్లోనే కూర్చుని కనిపించారు. రోజంతా చాలా ఇబ్బంది పడ్డారట. హోటల్ వాళ్ళు వ్యాన్లో హాస్పిటల్ కి తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించారట. వాళ్ళిచ్చిన మందులు వేసుకున్న తరువాత కాస్త నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టుగా వుందని చెప్పారు. అదేసమయంలో క్యాంటీన్లో అమలాపురం నుండి వచ్చిన మన తెలుగువాళ్ళు రేపు ఉదయం టైగర్ నెస్ట్ మానెస్ట్రీకి వెళతారట. కాబట్టి వాళ్ళు మావాళ్ళందరినీ దాని గురించి ఆసక్తిగా అనేక వివరాలు అడిగారు.
మేము రూమ్ కి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానించి భోజనం కోసం కిందికి దిగాము. అక్కణ్ణుండి భోజన హోటల్ కి వెళ్ళాలంటే వర్షం పడుతుంది. దాంతో ఆ హోటల్ వాళ్ళు మూడు పెద్ద పెద్ద గొడుగులిచ్చారు. రుఖేష్ మూడు ట్రిప్పుల్లో ఆ గొడుగుల క్రింద మమ్ముల్ని భోజన హోటేల్ కి చేర్చాడు. మేమంతా భోజనాలు చేసి తిరిగొచ్చే టప్పటికి వర్షం తెరిపిచ్చింది.
పొద్దున్నే లేచి తయారైన మేము కిందికి వచ్చి టిఫిన్ చేసే సరికి లాగేజ్ గాల్స్ మా బ్యాగేజీ నంతా కిందికి, కింది నుండి బస్సు మీదికీ చేర్చేశారు. డ్రైవర్ దోరో తల్లి తీవ్రమైన అనారోగ్యంతో వుందట. కాబట్టి ఈరోజు సాయంత్రం అతను వెళ్ళిపోయి అతని స్థానంలో మరో కొత్త డ్రైవర్ వస్తాడట.
తొమ్మిదిన్నరకు మా బస్సు మెల్లగా ‘చెలేలా పాస్’ దిశగా పరుగందుకుంది. అది ఫారో నుండి ముప్పై కి.మీ. దూరంలో వుంటుంది. మేము వెళుతున్న రోడ్డు ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఫారో విమానాశ్రయానికి కుడి పక్కగా ముందుకు సాగుతుంది. విమానాశ్రయం దగ్గర కొంచంసేపు ఆగి, ముందుకు సాగాము. ఈ రోజు మేము వెళుతున్న చలేలా (కనుమ) పాస్ ఎత్తు 13 వేల పైచిలుకు అడుగులుంటుంది. అయితే, అక్కడిదాకా వాహనాలు వెళ్ళడం సందర్శకులకు ఒక గొప్ప ఊరట.
మేము వెళ్ళే దారిలో పాచ్ మరియు వాంచుక్ నదుల అద్భుత సంగమం దర్శన మిస్తుంది. పై పై కి వెళుతున్నాకొద్ది క్షణ క్షణం మారిపోయే వాతావరణం మనకు గిలిగింతలు పెడుతుంటుంది. కొండల పైన తెలుపు, పసుపు, గులాబీ వర్ణాలతో తయారుచేసిన అతి పొడవైన నూటా ఎనిమిది జండాలు, వజ్రాయాన భౌద్ధ ధార్మిక, మార్మిక, మరణానంతర తంతులకు ప్రతీకలుగా ప్రతిష్టించబడి కన్పిస్తాయి. అవి చూడడానికి కొండల కొమ్మున సింగారించిన పక్షి ఈకల మాదిరిగా గాలికి అల్లల్లాడుతూ మనోహరంగా ఎంతెంతో దూరతీరాలకు కన్పిస్తూ ఇథమిద్ధంగా ఇదీ అని నిర్వచించలేని భావాలకు లోనూ చేస్తూ మానసికంగా మనలను అంతరిక్షంలోకి లాక్కుపోయి పతంగుల్లా గిరికీలు కొట్టిస్తుంటాయి.
రోడ్ల పొడవునా ఉల్లికాడల్లాంటి చిన్న చిన్న మొక్కలకు పర్పుల్ కలర్లో ఒక్కో పువ్వు మాత్రమే పూస్తూ భూమాత కట్టుకున్న గరిక పచ్చ చీర మీద తీర్చి ధీద్దిన బుఠాల్లా మెరిసిపోతూ కొండల నిమ్నోన్నతాలను మనకు పట్టిస్తుంటాయి. పరువాని కొచ్చిన పడుచు పిల్లల మాదిరిగా కనువిందు చేస్తుంటాయి. ముప్పై కి.మీ. దూరాన్ని చేరుకోడానికి గంటన్నర పట్టింది.
మేము ‘చెలేలా పాస్’ వ్యూ పాయింట్ చేరేటప్పటికే అక్కడ చాలా వాహనాలు ఆగున్నాయి. మేము వ్యూ పాయింట్ చేరేటప్పటికి ఆకాశం మేఘావృతమైపోయింది. మా చుట్టూ వున్న కొండలను కమ్మెసిన మేఘాలు స్థిమితంగా నిలబడిపోయి మమ్ములను మధురోహలకు గురిచేయసాగాయి. కొండలను పూర్తిగా కమ్మేసిన మేఘాలు వాటి శిఖరాలను మాత్రం కాస్త కరుణించి విడిచి పెట్టాయి. అది చూస్తున్న మనకు పాపమా పర్వతాలకు శ్వాస ఆడాలన్న ఉద్దేశంతోనే మేఘాలు అలా శిఖరాలను దయదలిచి విడిచి పెట్టాయేమో అన్న ఊహ అంతాంతరాల్లో కదంతొక్కుతూ పదం పాడిస్తుంది.
ఆ వ్యూ పాయింట్ కి కుడి ఎడమల వున్న ఆకుపచ్చ కనుమల్లో విస్తరించిన గ్రామాలు వర్ణ వర్ణాల రజాయిలను కప్పుకుని ముడగదీసుకు పడుకున్న అతివల్లా ఆహ్లాదంగా కన్పిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఆ గ్రామాల నంటుకొని శిఖరాల శిరస్సులను ఎత్తి చూస్తున్న కొండల పీచమణుస్తూ మానవులు నిర్మించిన రహదారులు, మంచు తెరల దుపట్టాల క్రింద నుండి కూడా మనోహరంగా దర్శనమిస్తూ మనిషి ఆధిఖ్యతను అంగీకరిస్తున్నట్టుగా అన్పిస్తుంది.
కొండ, కోన, నింగి, నేల సమస్తం ధవళాచ్చాధితమై ఓ మనోహర దైవీకృత శోభతో మనిషిని తనలో నిభిఢీ కృతం చేసుకుంటున్న ఆ మహోజ్వల ప్రకృతిలో మునిగీతలుకొట్టిన మేము మెల మెల్లగా బాహ్యస్ర్ముతిని తిరిగి పొందుతూ వాస్తవంలోకి వచ్చాము.
ఆ వెంటనే మా మిత్ర బృందమంతా గ్రూప్ ఫోటోస్ దిగే కార్యక్రమం పెట్టారు.
ఆ కార్యక్రమాన్ని ముగించిన వెంటనే నేను ఆ పక్కనే వున్న ఓ మొబైల్ వ్యాపార వాహనం దగ్గరికి వెళ్ళాను. దాన్నిండా ఉన్ని దుస్తులు, హ్యాండ్ గ్లౌస్ లున్నాయి. మొత్తం వ్యాపారాన్ని ఓ మధ్య వయస్కు రాలైన స్త్రీ చూసుకుంటుంది.
అంత ఎత్తులో, ఆ చలి వాతావరణంలో, ఆ కొండల మీదికి మొదటి సందర్శకునికంటే ముందుగానే ఒక మహిళ, వ్యాపారం కోసం వచ్చిందిగదా!? అన్న ఆలోచనకు లోనైన నా మానసంలోకి తక్షణమే మార్క్స్ మహాశయుడు వచ్చి తిష్ట వేసుకు కూర్చుని “ఒక పెట్టుబడి దారునికి తన పెట్టుబడి మీద వంద శాతం లాభం వస్తుందంటే ఏ వ్యాపారమైనా చేస్తాడు. రెండు వందల శాతం లాభం వస్తుందంటే ఎంత దూరమైనా వెళతాడు. మూడు వందల శాతం లాభం వస్తుందంటే తనను తానే అమ్ముకుంటాడు’’ అంటూ నిత్యనూతన మైన తన ఆర్ధిక గీతను మరో మారు గుర్తు చేస్తూ తరలిపోయాడు.
అక్కన్నుండి బయలుదేరిన మేము నేరుగా నేషనల్ మ్యూజియం దగ్గరికి చేరుకున్నాము. అక్కడ మనిషికి ఐదు వందల రూపాయల టిక్కెటు తీసుకుని లోపలికి వెళ్ళిన మేము నిరాశగానే వెనుదిరిగి హోటల్ కి వెళ్ళి భోజనాలు చేశాము.
భోజనాలు అయిపోయిన వెంటనే మావాళ్ళంతా బస్సెక్కి షాపింగ్ చేయడానికి బయలు దేరారు.
భూటాన్ దేశంలో నాకు నచ్చిన మరో అంశం వస్త్ర ధారణ. ఆక్కడ ఆ దేశ చక్రవర్తి నుండి మున్సిపాలిటిలో రోడ్లు వూడ్చే వాడి వరకు మగవారైతే ‘గో’ అనే దుస్తులను. ఆడవారైతే ‘కీరా’ అనే దుస్తులను మాత్రమే ధరిస్తారు. అవి వారి జాతీయ దుస్తులట. హోదాల కంచెలను ఇరగ దొక్కి దేశ ప్రజలందరికీ ఒకే విధమైన దుస్తులుండడం అనేది ఓ అద్భుతమైన విషయంగా అన్పించిన నేను, నా శ్రీమతితో కలిసి మనిషికి మూడు వందల చొప్పున బాడుగకు తీసుకుని, ధరించి ఫోటోలు తీసుకుని ఎంతో ఆనందించాము.
ఆ తరువాత బస్సెక్కిన మేము నేరుగా ఆ దేశ రాజధాని థింపు దిశగా సాగి రాత్రి ఎడున్నరకల్లా హోటల్ “కుమ్ చుమ్ ఇన్” చేరుకున్నాము. రూమ్స్ ఎలాట్ కాగానే వాటిల్లోకి లాగేజ్ కూడా చేరింది. మేమంతా వెంటనే స్నానాలు చేసి డైనింగ్ హాల్ కి వెళ్ళి ఫలహారం మాత్రమే చేసొచ్చి పడుకున్నాము.
18 ఏప్రియల్, 2024 ఉదయం 80.30 గంటలకు ‘థింపూ’ లోని హోటల్ “కుమ్ చుమ్ ఇన్” నుండి ‘దోచులా పాస్’ మీదుగా ‘పునఖా’ కు బయలుదేరాము. దేశ రాజధాని నగరమైన ‘థింపూ’ జనాభా కేవలం లక్ష మంది మాత్రమేనట. అక్కడ నిర్మించే ప్రతి ఇల్లూ బాహ్యంగా చూసినప్పుడు ఎవరైనా స్థానికంగా లభించే కర్రతో ఒకే విధమైన సాంప్రదాయ పద్దతిలో మాత్రమే నిర్మాణం చేయాల్సి వుంటుంది. లోపల మాత్రం ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు అధునిక వసతులతో నిర్మించుకోవచ్చును. పూర్వ కాలంలో లోపల, వెలుపల ఇడ్లన్నీ కలపతోనే నిర్మించేవారట. ప్రస్తుతం సిమెంట్, స్టీల్ కూడా వాడుతున్నారు.
కొత్త డ్రైవర్ పేరు ‘ఉగ్గేన్’. హోటల్ నుండి బయలుదేరిన మా బస్సు 11 కి.మీ. వరకు ఆ దేశ పెరేడ్ గ్రౌండ్ రోడ్డు మీదుగా ముందుకు సాగింది. మేము వెళ్ళాలనుకున్న ‘పునఖా’ థింపూ నుండి సుమారు 73 కి.మీ.దూరంలో వుంటుంది. అయితే, దానికన్నా ముందు మేము 22 కి.మీ. దూరంలో వుండే ‘దోచులా పాస్’ ను సందర్శించాల్సి వుంటుంది.
అద్భుతమైన కొండదారి కనువిందు చేస్తుంటే మమ్ముల్ని మేము మరిచిపోయి చూడసాగాము. సుమారు గంటన్నర తరువాత ఇరవై రెండు కి.మీ.దూరంలో వున్న ‘దొచులా పాస్’ దగ్గరున్న ఓ పెద్ద హోటల్ ముందు ఆప్పటికే ఆగి వున్న వాహనాల సముదాయం పక్కన ఆగింది. మేమంతా వెంటనే కిందికి దిగాము. అప్పటికే ఆ ప్రాంత మంతా మేఘ సమూహంతో కప్పబడిపోయివుంది. ఆ అవిచ్చిన మేఘ సమూహాల శీతల స్పర్శకు మా శరీరాలు ఝిల్లంటూ మమ్ముల్ని మరో లోకంలోకి లాక్కుపోతుంటే,గంజాయి దమ్ముకు గుమ్మెక్కిపోయిన సాధువుల్లా ఆనందంతో ఊగిపోతూ కేరింతల్తో చుట్టూ పరికించి చూశాము.
మాకు ఎదురుగా ఆకాశంలోకి దూసుకు పోయిన చిక్కటి ఆకుపచ్చ దేవదారు వనాల మీద మంచు పెరుకు పోవడంతో అవి కాస్తా మంచి ముత్యాలు జాలెబోసిన కల్పవృక్షాల మాదిరి నిశ్చలంగా నిలబడిపోయి, వివాహ సమయంలో తమను తాము చూకుని మురిసిపోయే నూతన వధూవరుల మాదిరిగా మురిసిపోతున్నట్టుగా అన్పించసాగాయి. నేరుగా వాటి దగ్గరగా వెళితే వాటి వెనుక అగాధమైన లోయ భీతిగొల్పేలా దర్శనమిస్తుంది. చూస్తుండగానే విశ్వ క్రీడల్లో భాగమైన పరుగు పందెంలో ముందుకు దూసుకు పోతున్న క్రీడాకారుల మాదిరిగా మేఘ సమూహాలు తమ పరుగుల ఉధృతిని మరింతగా పెంచాయి.
ఆ లోయకు ఎడమ పక్కగా వున్న హోటల్ని దాటి మరికొంత ముందుకు వెళితే తీర్చిదిద్దినట్టున్న ఓ పూలవనం మధ్యలో ఓ అద్భుతమైన మోనెస్ట్రి దర్శనమిస్తుంది. దాని వైపుగా వెళ్ళాలా? వద్దా? అన్న నా సంశయానికి చుక్క పెడుతూ మా గైడ్ ఫైమా “మనకు వెనుక వైపు నున్న స్మారక స్థూప సముదాయాన్ని ముందుగా చూద్దురుగాని రండీ!” అంటూ కేక వేయడంతో మేమంతా ఆ వైపుగా కదిలాము.
విశాలమైన ఆ స్థూప సముదాయం వృత్తా కృతిలో మూడు తంతెలుగా నిర్మితమైవుంది. మొదటి తంతెలో 45, రెండవ తంతెలో 36, మూడవ తంతెలో 27 స్థూపాలు నిర్మితమై వున్నాయి. వాటన్నింటినీ కలిపి చూస్తే వచ్చేది మళ్ళీ 108 దే. వీటిని ‘డృక్ వాంగ్యల్ చొర్టేన్స్’ అని కూడా అంటారు. వీటిని నిర్మించినవాడు అషి డోర్జీ. ఒకప్పటి రాజుకున్న నలుగురు రాణుల్లో పెద్దరాణి తల్లికి కూడా ఇక్కడ ఒక స్థూపం నిర్మించబడింది. వాటితో పాటు డృక్ వాంగ్యాల్ లఖాంగ్ (ఆలయం) అని పిలువబడే ఒక మఠం కూడా నిర్మించబడింది. ఇక్కడ ప్రతి యేటా వార్షిక ఉత్సవాలు నిర్వహించ బడతాయట.
ఇక్కడున్న ప్రధానమైన 108 స్థూపాల నిర్మాణం వెనుక ఒక వీరోచిత గాధ కూడా వుంది. అస్సాం తిరుగుబాటు దారులకు, భూటాన్ సైన్యానికి మధ్య జరిగిన భీకర పోరాటంలో తిరుగుబాటు దారులు పరాజితులైనప్పటికీ భూటాన్ సైన్యంలో నూటా ఎనిమిది మంది సిపాయిలు అమరులయ్యారట. వారి స్ర్ముత్యర్ధం ఈ స్థూపాలను నిర్మించారని కూడా చెబుతారు.
క్షణ క్షణానికీ మరింత చల్లదనాన్ని, హర్షామోదాన్ని సంతరించుకుంటున్న అక్కడి, అప్పటి అద్బుత వాతావరణాన్ని వేరేదానితో పోల్చలేని స్థాయిలో మా బృందమంతా ఆస్వాదిస్తూ ఆ స్థూప సముదాయం చుట్టూ ఒక పరిక్రమ చేద్దామని బయలుదేరాము. నాగేశ్వరావు గారు, నేను మాత్రమే పరిక్రమ పూర్తి చేశాము. పరిక్రమ తరువాత పూర్తిగా పైకెక్కి మఠం ముందు కొన్ని క్షణాలు నిల్చుని దేశం కోసం అమరులైన సిపాయిలకు మనసులోనే నివాళులు అర్పించి కిందికి వచ్చాము.
అప్పటికి మావాళ్ళంతా ఎదురుగా వున్న మోనెస్ట్రి ప్రధాన ద్వారం వరకూ వెళ్ళి అక్కడున్న ‘ర్హోడ్రెండమ్’ పూల మొక్కల దగ్గర నిలబడి ఫోటోలు దిగడంతోనే సంతృప్తి చెందారు. ఆ పక్కనే వున్న ప్రధాన ద్వారంలోని సెక్యూరిటీలో 250 రూ.లు టికెట్ కొని లోపలికి వెళ్ళడానికి సంకోచించారో? లోపాలవున్న చారిత్రక విషయాలను గురించి తెలియదో? నాకు అర్ధం కాలేదు. ఏ సమూహంలో నైనా సహజంగా కొందరు వ్యక్తులు అక్కడక్కడా పర్యటనను తెంచివేస్తూ ముందుకు పోతుంటారు. మావాళ్ళే ఒకవేళ టిక్కెట్లు కొనుక్కుని లోపలికి వెళ్ళి వుంటే, అక్కడ స్వర్ణ కవచ తాపడంతో శోభితమైన మోనెస్ట్రి పైకప్పు ప్రాభవాన్నిచూసివుండేవారు. అంతేకాదు, ఆ మోనెస్ట్రీ వెనుక ఒకానొకప్పుడు బౌద్ధ సన్యాసులు నివసించిన చిన్న చిన్న సొరంగ నివాసాల సముదాయాన్నీవీక్షించగలిగి వుండేవారు.
అప్పటికే అక్కడ చాలా సమయం గడిచి పోవడంతో పాటు, తాను ముందుగా వాటిని గురించి మాకు ఏమాత్రం తెలియజేయని మా గైడ్ ఫెమా తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటూ “ ఆలస్యమౌతుంది వెళ్ళిపోదాం రండి” అంటూ కేకలు వేస్తుండడంతో అక్కడి విషయాలన్నీ చదివి వున్న నేను కూడా ఏమీ మాట్లాడలేక, అక్కడికెళ్ళి చూడనూ లేక సందిగ్ధంలో పడిపోయాను. “నిజంగా అది క్షమించలేని మా అలసత్వం కిందికే వస్తుంది” అనుకుంటూ నేనూ అందరితోపాటు వెను దిరిగి వెళ్ళి బస్సెక్కాను.
వెనక ఎప్పుడో (1972) నేను 7వ తరగతి చదివే రోజుల్లో పిల్లలతో తీసిన ‘బాలభారతం’ అనే తెలుగు సినిమాలో పాండవ మధ్యముడు అర్జునుడు శరాలతో స్వర్గానికి నిచ్చెన వేస్తే, భీముడు దాని మీదుగా పైకెళ్లి దేవేంద్రుని భృత్యులను యుద్దంలో ఓడించి ఇంద్రుని దగ్గరుండే ‘ఐరావతం’ అనబడే తెల్ల ఏనుగును తమ చెల్లెలైన దుస్సల నోము కోసం భువికి తీసుకొచ్చే సందర్భంలో మానవుని గొప్పతనాన్ని కీర్తిస్తూ సినీ కవి ఆరుద్ర ఓ గేయం వ్రాయగా గాన గంధర్వుడు ఘంటసాల అద్భుతంగా పాడాడు. మేము ‘దోచులా పాస్’ నుండి బయలు దేరి ముందుకు సాగుతుంటే అక్కడి ప్రకృతి సౌందర్యం నన్ను మరోలోకాలకు తీసుకుపోయిన సందర్భంగా ఎందుకో నా ప్రమేయంలేకుండానే మానవుని సామర్ధ్యాన్ని కీర్తిస్తూ పైన పేర్కొన్న పాట నాలో సుడులు తిరగసాగింది.
అదే సమయంలో మాకు కుడి పక్కగా ఎక్కడో తూర్పుదిశలో హిమానీనదాల్లో పుట్టి, పడమర దిశగా ఎక్కడికో సాగిపోతున్న ‘పునా సాచి’ నది సోయగాలు చూడడానికి మనిషి కున్న రెండు కండ్లు చాలవన్పిస్తుంది. కొండొకచోట వయసు పరవళ్ళు తొక్కుతున్న యువతీ యువకులు కొందరు ఆ నది నీటిలో రాప్టింగ్ అనే సాహస జలక్రీడలో తమను తాము మర్చిపోయిన ఆనందపు ఉన్మాదంతో వేస్తున్న కేకలు జేగంటల నాదంలా వాయుతరంగాల్లో వలయాలు వలయాలుగా సుదూరతీరాలకు విస్తరిస్తూ గిరి శిఖరాలను సున్నితంగా స్పృశిస్తూ వెనుదిరుగుతున్న దైవీభూత దృశ్యాన్ని మనో నేత్రంతో నైనా చూడగల అదృష్టవంతులకు నిజంగా అదో మనోహర నందనోద్యానం.
అత్యంత సుందరమైన వస్తువు ఏదైనా అరుదుగా మన కంట పడితే ఆ ఆనందం ఆవర్ణంగా మారిపోతుంది. కానీ, అది ఎంతటి అపురూపమైన వస్తువైనా పదే పదే మనకు అత్యంత సమీపంగా వస్తే క్రమంగా దానిమీద మన ఆసక్తి తగ్గిపోతుంది. తగ్గిపోడమే కాదు దాన్ని పట్టించుకోకపోవడం కూడా జరుగుతుంది.
మేము సాగిపోతున్న రహదారికి ఇరువైపులా మొదట మొదట కన్పించినప్పుడు ‘ర్హోడ్రెండమ్’ మొక్కల్ని అపురూపంగా చూసిన మేము పోను పోను విపరీతంగా కాన్పించడంతో ఇక మేము వాటిని పట్టించుకోవడం మానేశామంటే అతిశయోక్తికాదు.
‘దోచులా పాస్’ సందర్శనం ఇచ్చిన కిక్ తో మేమంతా మరింత ఉత్సాహంతో తిరిగి బస్సెక్కి ‘పోబ్జి కా వ్యాలీ’ సందర్శనానికి బయలుదేరాము. కొద్ది దూరం వెళ్ళిన తరువాత మాకు హోటల్ చికెన్ డిన్నర్ ఎదురయ్యింది. అక్కడ నేను నా జీవితంలో మొదటిసారి కప్పు కాఫీ నూటా ఎనభై రూపాయలు పెట్టి తాగానంటే నాకు నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే నా చిన్నప్పుడు మా బాపు వరినాట్ల కాలంలో బురద పని చేసి అలిసిపోయినప్పుడు ఎప్పుడో ఒకరోజు మా ఊళ్ళో వున్న దశరధ రామయ్య హోటల్ కి వెళ్ళి పావలా ఇచ్చి ‘ఛాయ్’ తాగి వచ్చేవాడు. వచ్చిన వెంటనే మా అమ్మతో “అనవసరంగా పావలా పెట్టి హోటల్లో ‘ఛాయ్’ తాగి వచ్చాను. ఆ పావలా పెట్టి నాలుగు గోంగూర కట్టలు కొనుక్కొస్తే పిల్లలంతా రెండు పూటలా కమ్మగా తినే వారు కదా?” అంటూ బాధపడేవాడు. బాపు మాటలు వింటూనే మా అమ్మ “అయితే, అయిందిలే బాధపడకు. రోజూ తాగవుకదా?” అంటూ ఊరడించేది.
సుమారు యాభై ఐదు, అరవై ఏండ్ల తరువాత అలాంటి దృశ్యమే ఇప్పుడు మిత్రులతో కలిసి ఆ కాఫీ తాగిన తరువాత మా దంపతుల మధ్య మధ్య జరిగిన సంభాషణ మా ఆమ్మా! బాపులను గుర్తుకు తెచ్చింది.
“మనం రాత్రికి తిరిగి ఇదే హోటల్ కి వస్తాం. కాబట్టి బస్సు మీది లగేజీ అంతా ఈ హోటల్ ల్లోనే దించి పోదాము. ఎందుకంటే పోను పోను మనం వెళ్ళే దారి స్టీఫ్ హైట్ వుంటుంది. కాబట్టి లగేజ్ ఒక్కోసారి కిందపడి పోయే ప్రమాదం వుంటుంది. మీ సామానుకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం” అంటూ చెప్పడంతో మేమంతా “సరే” అనక తప్పలేదు. సామ్మను దించిన వెంటనే మమ్ములను ఎక్కించుకున్న బస్సు ‘పోబ్జీకా వ్యాలీ’ దిశగా పరుగందుకుంది.
‘పోబ్జీ కా వ్యాలీ’ మధ్య భూటాన్ లో పడమర దిశలో పధహారు వేల అడుగుల ఎత్తు వుండి తూర్పుగా పోను పోను తొమ్మిది వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తుతో వాలుగా వుంటుంది. మొత్తం మీద లోయ అంతా కలిపి నూటా అరవై మూడు చ.కి.మీ. విస్తీర్ణంతో ‘యు’ ఆకృతిలో నెలకొని వున్న ఓ చిత్తడి నేల. అది ఎల్లవేళలా పచ్చగడ్డితో తివాచీ పరిచినట్టుగా వుంటుంది. ఆ లోయలో పెరిగే చిన్న చిన్న మరుగుజ్జు వెదురు మొక్కలు చాలా ప్రత్యేకమైనవి. ఏవిధంగా నంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా అంతరించి పోతున్న ‘నల్ల మెడ కొంగలు’ టిబెట్ నుండి ఇక్కడికి వలస వస్తాయట. ప్రపంచ ప్రసిద్ద పర్యావరణ శాస్త్ర వేత్తల ప్రస్తుత అంచనా ప్రకారం ప్రపంచం మొత్తంలో ఇప్పుడు కేవలం ఎనిమిదంటే ఎనిమిది మాత్రమే ఈ ‘నల్ల మెడ కొంగలు’ మిగిలి వున్నాయని తేలింది. అంతటి అరుదైన, అపురూపమైన ఆ పక్షులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి చిత్తడి నెలల్లో పెరిగే మరుగుజ్జు వెదురు లేత ఇగుళ్ళను ఇష్టంగా తింటాయట.
ఎప్పటి మాదిరిగానే గత సంవత్సరం ‘టిబెట్’ నుండి ఈ ‘పోబ్జీ కా వ్యాలీ’ కి ఆ పక్షులు వలస వచ్చినప్పుడు అందులో రెండు పక్షులు వాటి ఎత్తు, రెక్కల పొడవు కారణంగా విద్యుత్ తీగలకు తగిలి గాయాలపాలై ఎగిరి పోలేక ఇక్కడే మిగిలిపోయాయట. దాంతో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అటవీ సిబ్బంది వారు, వాటిని పట్టుకుని వైద్యం చేయిస్తున్నారు. ఆ పక్షులు రెండింటి కోసం ఓ పక్షి సంరక్షణా కేంద్రమే ఏర్పాటుచేసి, అందులో ఒక వైద్యుణ్ణి కూడా నియమించారు. వాటిని ప్రత్యేకమైన అథితుల మాదిరిగా భావించి అపురూపంగా సంరక్షిస్తున్నారు. ఇప్పుడా రెండు పక్షులే సందర్శకులకు అక్కడో ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచిలిపోయాయి. కొడిగట్టి ఆరిపోబోతున్న దీపానికి, ఇంధనం అందించి దాని వెలుగులు ఆరిపోకుండా నిలబెట్టినట్టు, భూగోళం మొత్తం మీదనే అంతరించి పోతాయనుకుంటున్న అరుదైన పక్షుల సంరక్షణను నెత్తికెత్తుకున్న భూటాన్ ప్రభుత్వాన్ని మనమంతా తప్పకుండా అభినందించాల్సిన ఆవశ్యకత వుంది.
మేమా కనుమలోకి అట్లా అడుగు పెట్టామో లేదో! కనుమ మొత్తం విస్తృత మేఘా వృతమై లే చీకట్లు కమ్ముకు రాసాగాయి. లోయలో ఇంటికీ ఇంటికీ మధ్య చాలా ఎడం వుంటుంది. ఆ ఖాళీస్థలాల్లో బంగాళా దుంపను విత్తడానికి వాటిని కాకర పండు మాదిరిగా దున్ని పాటు చేసి పెట్టుకున్నారు.
మనం వెళ్ళే దారికి సమీపంలోనే అతి పురాతనమైన ‘గాంగ్ టెంగ్ మోనాస్ట్రీ’ గత చరిత్ర వైభవానికి సాక్షీ భూతంగా నిలిచి, మౌన గంభీరంగా కన్పిస్తూ చూపరులను రసాత్మకోద్రేకాని గురిచేసెట్టుగావుంది.
ఇక లోయ చుట్టూ వున్న కొండలను కప్పి వేసిన మేఘాలు స్థిర, ధీరత్వాలకు ప్రతీకాలైన పర్వతాలను తాత్కాలికంగానైనా కనుమరుగుచేసామన్న ఆనందంతో మౌన గంభీరంగా నిలిచి పోయాయి. మేము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్టు అంతలోకే నింగి నుండి నిశ్శబ్దంగా దూసుకొచ్చిన వాన చినుకులు టప టప మని గరికపచ్చ భూమిని చుంభించ సాగాయి. భూలోక స్వర్గం మాదిరిగా భాసిస్తున్న ఆ కనుమ మనోజ్ఞ సౌందర్యాన్ని మేమంతా అప్రతిభూతులమై చూస్తుండగా మా బస్సు వెళ్ళి నల్ల మెడ కొంగల సంరక్షణ విద్యా కేంద్రం దగ్గర నిలిచి పోయింది.
అసలే చలి, దానికి తోడు వర్షం కూడా పడుతుండడంతో మా వాళ్ళల్లో కొందరు “దిగాలా? వద్దా?” అన్న సంశయంలో వుండగానే, అందరికన్నా ముందుగా కిందికి దిగిన లింగయ్య మా కోసం సంరక్షణా కేంద్రంలోకి వెళ్ళడానికి టిక్కెట్లు తీసుకున్నాడు. దాంతో మేము అయిదుగురం కిందికి దిగాము.
ఆ తరువాత మా మిత్రులంతా మెల మెల్లగా కిందికి దిగి టిక్కెట్స్ తీసుకుని తడుస్తూనే మా వెనుక ‘నల్ల మెడ కొంగల’ ద్వయం వున్న ఇనుప జాలీ శిబిరం దగ్గరికి చేరుకున్నారు. ఈ భూమి మీద పుట్టిన సర్వ ప్రాణులకూ జీవించడానికి సమానమైన హక్కును ప్రసాదించిన ప్రకృతి మాత సామన్యాయ సిద్ధాంతాన్ని అగాధంలోకి పడదోస్తూ, సమస్త ఆధునిక ఆవిస్కరణలకు కేంద్ర బింధువైన విద్యుత్ తీగల కారణంగా ఆ పక్షులు తమ జీవించే హక్కు హననం చేయబడుతుండగా, ఆ వయన మేమిటో అర్ధం కాక, ఇనుప జాలీల మధ్య దిగాలుగా నిలబడి, మౌనరోదనతో నిస్సత్తువుగా నిలిచి, తాము స్వేచ్ఛగా విహరించాల్సిన ఆకాశం దిక్కు తల లెత్తి చూస్తూ దీనంగా కనిపించాయి.
స్వేచ్చా విహంగ భంగమై, బంగారు సంకేలలో చిక్కిపోయిన నిరపరాధుల మాదిరిగా నిలిచి పోయిన వాటిని నిశ్శబ్దంగా చూస్తూ, ఫోటోలు తీసుకుని ఆ పక్కనే వున్న ఓ విశాల భవన సముదాయంలో మేమంతా అడుగుపెట్టాము. అక్కడా కనుమ చారిత్రక విశేషాలను గురించి ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలను చూసుకుంటూ పై అంతస్తు మీద కెళ్ళిన మాకు చేతి మగ్గాల మీద తయారైన ఉన్ని దుస్తులు ఆమ్మకానికి పెట్టి కనిపించాయి. మా మిత్రులు కొందరు ఆ దుస్తులను కొన్నారు కూడా. ఆ తరువాత పక్కనే వున్న ఓ మినీ థియేటర్లో ‘నల్ల మెడ కొంగల’ మీద తీసిన ఓ పావుగంట నిడివిగల డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆసక్తిగా చూశాము. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తేదీన ‘నల్ల మెడ కొంగల’ పెస్టివల్ జరుగుతుందట. దానికి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుంటారట.
ఆ సంరక్షణా కేంద్రంలో సుమారు ఓ గంటపాటు గడిపిన మేమంతా మెల్లగా బయట కొచ్చాము. మమ్ముల్ని చూస్తూనే డ్రైవర్ ఉగ్గెన్ “ఇంకా పెద్ద వర్షం పడితే మనం వెనక్కెళ్లడం కష్టమౌతుంది. కాబట్టి వెంటనే బయలు దేరుదాం బస్సెక్కండి!” అంటూ మమ్ముల్ని తొందర పెట్టసాగాడు. అతని మాటలను విన్న నేను “ఇతని మాటలేవో కొంచం తేడాగావున్నాయి. ఇతని పని ఇలాక్కాదులే” అనుకుంటూ మా అందరికన్నా కాస్త వెనగ్గా మెల్లగా బస్సు దగ్గరికి వస్తున్న గైడ్ ఫెమాకు ఎదురెళ్ళి “చూడు బేటా! మేమంతా అరవై ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ మి. అంతా రిటైర్డ్ ఉద్యోగులం. మేం అతికష్టం మీద దాదాపు రెండున్నర వేల కి.మీ. దూరం వచ్చాం. ఇంత దూరం మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం మాలో ఎవ్వరికీ లేదు. కాబట్టి దయచేసి ఇక్కడ మేం ఇంకా ఏమేమి చూడాలో కొంచం ఆలస్యమైనా తప్పకుండా చూపించమని మా అందరి తరపునా అభ్యర్ధిస్తున్నాను. కాబట్టి ఆలోచించు” అంటూ నా మనసులోని మాటను వెల్లడించాను.
దాంతో అతను డ్రైవర్ మాటలను తోసిపుచ్చి వెనక్కి తిరుగుదాం అన్న బస్సును మంరింత ముందుకే తీసుకు పోయాడు. ఆలా వెళ్ళడం నిజంగా మాకు ఓ జీవిత కాల జ్ఞాపకాన్ని తనివిదీరా అందించింది.
ఎలాగో వివరిస్తాను–
చిన్నప్పుడు నేను నాలుగైదు తరగతులు చదివేటప్పుడు మా సాంఘీక శాస్త్రంలో భూటాన్ దేశాన్ని గురించి తెలియజేసే పాఠంలో జడల బర్రెలను గురించిన ప్రస్థావన వచ్చేది. అది చదివినప్పుడల్లా ఆ చిన్న వయసున్నే “ఎప్పటికైనా ఈ జడల బర్రెలను ప్రత్యక్షంగా చూడగలనా?” అన్న ప్రశ్న నాకు నేనే వేసుకునే వాణ్ణి. ఈ క్షణంలో అది వాస్తవమై నా కండ్ల ముందు సజీవంగా కదలాడుతుంటే నాకదో మరపురాని సంఘటనగా మనస్సనే తెల్లకాగితం మీద వర్ణ వర్ణాల తైల చిత్రాలై ముద్రిత మవ్వసాగాయి.
మహా కవి శ్రీ శ్రీ తన విస్తృత సాహితీ యానంలో ఒకానొక గేయ కవితలో “యముని మహీషపు లోహ ఘంటికలు” అంటూ ఓ ప్రమాద సూచిక సమాజానికి అందించారు. ఇక్కడ నా బాల్య కాల ఊహ వాస్తవమై కళ్ళ ముందు కదలాడుతుంటే చాలా సందర్భాల్లో మన పెద్దలు ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుతూ “బొందితో కైలాసానికి పోయినోడెవ్వడు?” అంటూ సందర్భోచితంగా ఒక పురాణోక్తిని ఉటంకించడం మనలో చాలా మందిమి వినే వుంటాము.
మా ఎదురుగా విశాలమైన చిత్తడి నెలలో యముని వాహనంలా బలిష్టమైన కాయంతో, పెద్ద పెద్ద కుచ్చు తోకలతో, అక్కడక్కడా కొన్నింటికి బ్యూటీ స్పాట్ పెట్టినట్టుగా అందమైన తెల్ల మచ్చలతో మందలు మందలుగా తిరుగాడుతూ, తమలో తామే సరదాగా కుమ్ములాడుకుంటూ, పచ్చగడ్డిని పెరుక్కు తింటూ రస రమ్య ప్రకృతి మానసికోల్లాస ఉత్ప్రేరకమై చౌలు రేపుతుంటే, కదులుతున్న కొండల్లాంటి జడల బర్రెల సమూహాల భయద సౌందర్యానికి ఊగిపోతూ నేను “పెద్దలు చెప్పినట్టుగా బొందితో కైలాసానికి వచ్చినంతగా అనుభూతికి లోనౌతున్నాను” అంటూ చిన్న పిల్లవాడిలా కేరింతలు కొడుతుంటే, పక్కనే వున్న నా శ్రీమతికీ మా బాల్యకాలపు స్ర్ముతులేవో గుర్తుకొచ్చినట్టు మూసి మూసిగా నవ్వుకుంటూ “మరీ వాటి దగ్గరికి వెళ్ళకండీ! వాటిలో అవి కుమ్ముకుంటూ మీద కొచ్చి పడ్డాయంటే ఇంకేమన్నా వుందా?” అంటూ మాటలతోనే నా ఉత్సాహానికి కనిపించని కళ్ళాలు వేయసాగింది.
నా తోటి మిత్రులు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు మా మనసుల మీద ప్రకృతి చేస్తున్న మాయా జాలానికి అనుగుణంగా స్పందిస్తూ రక రకాల విన్యాసాలు చేస్తూ గట్లు తెగిన వారద నీటి మాదిరిగా పరవళ్ళు తీస్తూ ఆ చిత్తడి నేలను చిత్తు చిత్తుగా తోక్కెయ్య సాగారు.
కాలిక స్పృహను కోల్పోయిన మమ్ముల్ని చూస్తూ మాతోపాటు ఆ వానలో, ఆ గాలిలో నర్తించిన గైడ్ ఫెమా, టూర్ ఆపరేటర్ రుఖేష్ లు చివరికి “పొద్దు పోతుంది వెళ్దాం పదండీ!” అంటూ హెచ్చరించడంతో ఇక విధిలేక వెళ్ళి బస్సెక్కాము.
(ఇంకా వుంది)