పిచ్చి మారాజు

నిద్ర నుంచి మెలకువ రాగానే రాజం కళ్ళు నులుముకుని లేచి కూర్చున్నాడు. నిద్రమత్తు అంతగా లేనప్పటికీ, దేని కోసమో ఎదురుచూస్తున్న వాడిలా కాసేపు వేచిచూశాడు. అతను ఎదురు చూసినట్లే పక్కింటి కోడిపుంజు ‘కోక్…కోక్..కోక్కొర్కో’ అని కూయగానే అతనికి అసంకల్పితంగా నవ్వొచ్చింది.

‘నేను కళ్ళు తెరవాలనే ఈ కోడిపుంజు ఎదురుచూస్తుంది కాబోలు! ఇప్పుడు సమయమెంతవుతుంది తెలుసా? సరిగ్గా నాలుగున్నర’ అని తనలో తాను తలుచుకుని, నవ్వుకుంటూ,  నడుముకున్న  పంచెను గట్టిగా కట్టుకొని పైకి లేచాడు.

అతని బాధంతా ఉదయం  లేచిలేవగానే అమ్మముఖం చూడకూడదన్నదే. చీకట్లో కాళ్ళతో తడుముకుంటూ చెల్లెలిద్దరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ పక్కనే అమ్మ పడుకునుంది. కిందకు వంగకుండా స్విచ్ వేశాడు. లైట్ వెలుతురు రాగానే అరచేతులు రుద్దుకుని చూసుకున్నాడు. మేకుకు వేలాడుతున్న అద్దాన్ని చేతుల్లోకి తీసుకుని ముఖం చూసుకున్నాడు. ఆ తర్వాతే మనసు కాస్త కుదుటపడింది. అదేంటోగాని పొద్దుపొద్దున్నే అమ్మముఖం చూసి నిద్రలేస్తే ఆ రోజంతా ఒకటే గొడవ గోల కింద ఉంటుంది.

గడియారంలో సమయం చూశాడు. సరిగ్గా నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు కావొచ్చింది.

పక్కింటి పెరట్లో ఒక చిన్న కోళ్ళఫారం ఉంది. కోడిపుంజు తోడు లేకుండానే కోళ్ళన్నీ ఎడెనిమిది నెలలుగా గుడ్లు పెట్టే వింత అక్కడ మాత్రమే చోటుచేసుకుంటుంది. మరో పక్కింటాయన ఊరికే డాబుసరి కోసమని ఒక కోడిపుంజును పెంచుకుంటున్నాడు. మేలుజాతి పుంజు; ఒకటిన్నర అడుగుల ఎత్తు; తెల్లతెల్లగా టీనోపాలతో ఉతికారేసిన బట్టల్లా తళతళలాడుతూ మెరిసిపోతుంది. ప్రతిరోజు చెప్పిపెట్టినట్టు నాలుగున్నరకే టంచనుగా అదే కూస్తోంది.

ఏదో ఒకరోజు నేను ఏం చేస్తానంటే? ఆ గోడ దూకెళ్ళి ఆ కోడిపుంజు పీక నులిమి, దాని కాళ్ళువిరిచి, పొయ్యిలో పెట్టి, కూర వండుకుని తినేస్తాను. అదెలా అది చెప్పి పెట్టినట్టు సరిగ్గా నాలుగున్నరకే కూస్తోంది.

పొద్దుపొద్దున్నే ఎవరో పోయినట్టు ‘అయ్యో…అమ్మా’  అన్నట్టు ఒకే ఏడుపులుపెడబొబ్బల్లా దాని కూతలు సహించలేము.

అతని దృష్టి చేనేతమగ్గం వైపుకు మళ్ళింది. మరో రెండు మూరలు నేస్తే ఆ చీరను మగ్గం నుంచి తుంచవచ్చు. పైగా అదే ఆఖరి చీర. ఈ రోజు సాయంత్రానికల్లా ఏదో రకంగా దాన్ని పూర్తిచెయ్యాలి. అది అయ్యే పనేనా? యజమాని పిలిచి మధ్యలో ఏ పని చెప్పకుండా ఉండాలి. అదే సమయంలో అమ్మ మరో వైపు పోరు పెట్టకుండా ఉండాలి. యజమాని పిలిస్తే ఏదో ఒక కుంటిసాకు చెప్పుకోవచ్చు. అయితే  అమ్మబారి నుండి ఎలా తప్పించుకోవాలో మాత్రం ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు.

కిందకు వంగుని ధైర్యంగా ఒకసారి అమ్మముఖంలోకి, ముఖం పెట్టి చూశాడు. నిద్రలో కూడా ఉర్రుమని చూసేందుకు ఏమాత్రం సహించలేనట్టు భద్రకాళిలా ఉంది. కన్నతల్లిని అలా అనడం మహాపాతకం కాదా? ఒకటారెండా గంపెడు సంతానం. ఐదుగురు మగ పిల్లలు, ఐదుగురు ఆడ పిల్లలని పదిమందిని కనిపడేసింది. అందులో ఏ ఒక్కరికి ఎటువంటి శారీరక లోపాలు లేకుండా అంతా సవ్యంగానే ఉన్నారు. నాన్న నేతపనిలో అందెవేసిన చెయ్యి. అయితే రోజూ తప్పతాగొచ్చి అమ్మని  అడ్డుఆపు లేకుండా చావకొడతాడు. కేవలం కొట్టడంతో సరిపెట్టుకుంటే పర్వాలేదు. మళ్ళీ రాత్రైయితే అమ్మకాళ్ళ మీద పడడం ఒకటే తక్కువ అన్నట్లు ఆ పూటంతా ఏడుస్తూ కూర్చుంటాడు.

రాజం ఇంటికి పెద్ద కొడుకు. అమ్మానాన్న తగువులాడుకుని, ఆ పదిమంది పిల్లల్ని ఎలా కన్నారన్న సంగతి అతడికి మాత్రమే బాగా తెలుసు.

‘బహుశా ఇన్ని గొడవలు పడకుంటే, ఇలా గంపెడు మంది పుట్టేవారు కాదేమో? పెళ్ళాన్ని కొట్టడం దేనికి? మళ్ళీ కాసేపటికి ఆమె గడ్డంపట్టుకుని బుజ్జగించడం దేనికి? ఇవేవి నాకు ఒక పట్టాన అర్ధమయ్యేవి కావు.’

అమ్మ బహుశా నాన్నవలనే ఇంత దారుణంగా తయారయ్యుండొచ్చు. మొదట్లో అమ్మ, నాన్నని ఎదిరించి పల్లెత్తుమాట కూడా మాట్లాడేది కాదు. ఆ తర్వాత పోను పోను నాన్న కొట్టే దెబ్బలు తట్టుకోలేక నోరాడించడం మొదలయ్యింది. వంట్లో శక్తి కాస్తా సన్నగిల్లేసరికి తిరగబడి తన్నడం, కొరకడం వంటి చేష్టలు వంటబట్టించుకుంది.

అమ్మ పళ్ళు గవ్వల్లా ఉంటాయి; పెదవులను పహారా కాస్తున్నట్లు  బయటకు తన్నుకొచ్చినట్లుంటాయి. తాగినమత్తులో నాన్న ఆమెను కొట్టినప్పుడల్లా, కాళ్ళుచేతులు, ముక్కూమూతి, కడుపు ఇలా ఏ చోటు దొరికితే ఆ చోటు అని పంటికి చిక్కిన ప్రతి భాగాన్ని కొరికిపారేసేది.

నాన్న, అమ్మ పంటిగాట్ల నుండి తప్పించుకోవడం కోసం నేతమగ్గం చుట్టూ పరుగులు తీసే దృశ్యాన్ని తలుచుకున్నప్పుడల్లా అతడికి నవ్వు ముంచుకువస్తుంది.

“నువ్వు కుక్కలా పుట్టాల్సిన దానివి…”

“అందుకేగా నిన్ను కట్టుకొని తగలడింది”

స్వతహాగా అమ్మ, నాన్నను ‘ఏమండీ’ అని మర్యాదపూర్వకంగా పిలవడం రివాజు. అయితే గొడవ ముదిరి పాకాన పడినప్పుడు మాత్రం ఆ మర్యాద కాస్తా గాల్లో కలిసిపోతుంది.

“నీకిమధ్య  నోరు బాగా ఎక్కువైపోయిందే. పళ్ళు ఇరగ్గొట్టి చేతిలో పెడితేనే దారికొస్తావు”

“ఏదీ ఇరగ్గొట్టు చూద్దాం. నువ్వు సరైన మగోడివైతే నాతో కొట్లాటకురా, నువ్వానేనా అని తేల్చుకుందాం” అని అమ్మ సవాలు విసిరి మరీ పళ్ళు విరగగొట్టించుకోవడం కోసం ఈఈ…అని  పళ్ళు సకిలించి చూపించేది.

అయితే నాన్న, ఆమె పంటిగాట్లకు జడిసి ఆమె దగ్గరకు వెళ్ళేందుకు కూడా ధైర్యం చేసేవాడు కాదు. మత్తు దిగగానే మళ్ళీ ఎక్కించుకోవడం కోసం కల్లు దుకాణం వైపు పరుగులు తీసేవాడు.

స్వతహాగా అమ్మ ప్రసవాలన్నీ ఇంట్లోనే జరిగేవి.  తోడుకు అత్తయ్య ఒకర్తి మాత్రం వచ్చేది. బిడ్డ పుట్టిన విషయాన్ని తాంబూలం పళ్ళెం మోత మోగించి అందరికీ చెప్పేది.

“ఏ బిడ్డ?” అని అడిగారు నాన్న.

“లెక్క సరిపోయింది. మగపిల్లలు ఐదుమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఐదుకు చేరుకున్నారు.

“అయితే అమ్మాయి పుట్టిందంటారా?”

 “ఆ…అదే అంటున్నా”

“ఆ ఐదుమంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసరికి నేను ఏ గోదాట్లోనో కలిసిపోతానేమో?  పోయి పోయి ఆడపిల్లనా కంది.”

“మీరేం పెళ్ళిళ్ళు చేసి తగలబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ తలరాతలో ఎలా తగలడితే అలా జరుగుతుంది. దానికి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు” అంది అమ్మ  గదిలో నుంచే.

“బాధపడకుండా నేనెలా ఉండగలను చెప్పు? నీ సొమ్మేం పోయింది? నువ్వు ఆడదానివి, ఇంట్లో కూర్చొని ఎన్నయినా మాట్లాడతావు. రేపు నలుగురిలో తలెత్తుకు తిరగాల్సింది నేనే కదా. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు వరుసపెట్టి నిలబడితే నన్నేగా నలుగురు నాలుగు రకాలుగా ఆడిపోసుకుంటారు.”

“ఇప్పుడేగా బిడ్డ పుట్టింది. ఈలోపే పెళ్ళికోసం గుబులెందుకో?”

“అంతకుముందే నలుగురిని కనెట్టుకున్నావుగా. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు, పేరంటాలు చేయడమంటే ఆషామాషీ వ్యవహారమా ఏంటి?  పోయి పోయి ఆడపిల్లను కన్నావు” అన్నాడు నాన్న.

తనభార్య, ఆడపిల్లను కన్న బాధను మర్చిపోవడం కోసమే ఆయన ఉదయం నుండి తాగడం మొదలుపెట్టాడు. ప్రతిగంటకు ఒకసారి మధ్యలో గది గుమ్మం ముందు తలచూపించేవాడు;  పోయి పోయి ఆడపిల్లనా కన్నావు?” అని నిట్టుర్చేవాడు. బయటికెళ్ళి తాగేసి వచ్చేవాడు; రోజంతా ఈ ప్రశ్నతోనూ, మద్యం మత్తుతోను పొద్దుపుచ్చేవాడు.

ఆ రాత్రి ఏమైందని తెలియలేదు. ఇల్లంతా వాంతులతో ఒకే కంపు. ఆ తర్వాత రక్తం కక్కుకుంటూ కళ్ళు తిరిగి పడుకున్నవాడు కాస్తా, ఆడపిల్లలకు పెళ్ళి చేయాల్సిన ఎటువంటి కష్టం లేకుండానే, గాల్లో కలిసిపోయాడు.

ఆ తర్వాత, ఆ బాధ్యతలన్నీ అమ్మతలపై పడ్డాయి.

బాధ్యతలు అమ్మవయినంత మాత్రాన ఆమె అంత గొప్పగా వెలగపెట్టిన రాచకార్యం ఏముందనిలే ? పిల్లలను రాచి రంపాన పెట్టి, వెట్టి చాకిరీ చేయించుకుని దబాయించుకుని పొట్ట నింపుకునేది. ఆమె కడుపు నింపుకోవడం తప్ప, అంతకుమించి ఆమెకు ఏమి తెలియదు.

చప్పుడు విని అమ్మ నిద్రనుంచి లేస్తుందేమోనని రాజం అప్రమత్తంగా చడీచప్పుడు లేకుండా పళ్ళు తోముతుంటే అతడికొక పాత జ్ఞాపకం నవ్వు తెప్పించింది.

చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మ పళ్ళు తోమడం చూడ ముచ్చటేసేది. గుప్పెడు బూడిదను నీటిలో ముంచి పళ్ళు తోమేది; ఒక్కో పన్నును తోమేందుకు ఆమెకు చాలా సమయం పట్టేది. చిన్నపిల్లాడు అయినటువంటి అతడు ఆమె చెంతకు వెళ్ళి “ఓయ్ అమ్మా, ఫోక్ స్వస్తాక్ దాత్ కూర్ కెల్లర్తెక్కో?” (ఓయ్ అమ్మా! నాన్నను కరిచేందుకు పళ్ళు పదును పెడుతున్నావా?) అని అడిగేవాడు.

“అరేయ్ దోకో, ఒండే, పాడో ఫందా! కాయ్ దిమిర్సా!” (పాడే మీద పోయే వెధవ, ఏం పొగరురా నీకు?) అని ఎంగిలి చేత్తో అమ్మ వాడిని కొట్టేందుకు తరుముకువచ్చేది.

ఆమె చేతికి చిక్కకుండా వాడు వీధి వైపు పరుగులు తీసేవాడు.

లోలోపల ముసిముసి నవ్వులు పోతూ, పళ్ళు తోమడం పూర్తి చేశాడు. పంజామి హోటలుకెళ్ళి ఒక కాఫీ తాగి, ఇంటికొచ్చి చెల్లిని నిద్రలేపి నేతమగ్గం దగ్గరకు ఆమెను వెంటతీసుకు వెళ్ళాలన్నదే అతడి కోరిక.

ముఖం తుడుచుకుని తూర్పు దిశగా చూసి, ఉదయించని సూర్యుడికి చేతులెత్తి మొక్కాడు. నేతమగ్గానికి పక్కన ఎత్తులో అద్దం ఉంది. అందులో ముఖం చూసుకుని, తలదువ్వుకున్నాడు. చొక్కా తొడుక్కొని బయటకువెళ్ళేందుకు సిద్ధమయ్యాడు.

అమ్మ చిన్న శబ్దంతో గురకపెడుతోంది, ఆడవాళ్ళు గురక పెట్టొచ్చా? చెబితే వినిపించుకుంటేగా? అతడి మాట ఆమె ఏ రోజు వినింది గనుక, ఈ రోజు వినేందుకు. అతను ఆ మాట అన్నందుకయినా మరింత బిగ్గరగా గురక పెట్టేది. నేను హోటల్ నుండి వచ్చేంతవరకు తను గురక పెట్టింది.

“రేయ్ రాజం గోట్ జారిస్తే?” (రేయ్ రాజం, ఎక్కడికి వెళుతున్నావు?” అని అమ్మ గొంతు గునపంతో గుచ్చినట్టు అతడి చెవిన తాకింది.

హుమ్, జరగకూడదనుకుందే జరిగింది. అతడు నోరు మెదపలేదు.

“క్లబ్బుకే కదా ? వెళ్ళి గ్లాసు సాంబార్ కొనుక్కు తీసుకురా.”

“క్లబ్బులో సాంబార్ ఇవ్వడు.”

“ఏం, ఎందుకు ఇవ్వడు? దాంతో పాటు ఒక దోస తీసుకో.”

“పార్సెల్ తీసుకున్నా, పంజామి క్లబ్బులో సాంబార్ విడిగా ఇవ్వడు.”

“అవన్నీ ఇస్తాడులే గాని, నువ్వెళ్ళి అడుగు.”

“దోస కొనుక్కుంటే సాంబార్ ఎందుకు ఇవ్వడు? నాకు ఒక దోస కొనివ్వడానికి నీకు ఇష్టం లేదని చెప్పు. ఇరవై పైసలు ఖర్చై పోతుందని ఏడుస్తున్నావు. నువ్వు మాత్రం నోటికి రుచిగా సాంబార్ వేసుకుని తగలబడి స్పెషల్ దోస తినేసి వస్తావు”

“పొద్దున్నే నేనొక కాఫీ తాగేసి నేతమగ్గం దగ్గరకి వెళదాం అనుకున్నాను. నువ్వు పొద్దున్నే ఇలా నసపెడితే…”

“కడుపున మోసి కన్నది ఒక దోసా, సాంబార్ అడిగితే పొద్దున్నే నసలా ఉందా నీకు?’

“ఇల్లు నిశ్శబ్దంలో మునిగి తేలుతుంది. ఎందుకిలా ప్రాణం పోయేలా అరుస్తున్నావు? పంజామి క్లబ్బులో, గ్లాసులో  సాంబార్ విడిగా ఇవ్వరని చెబితే.”

“అక్కడికి వెళ్ళమాకు. ఇంకో క్లబ్బుకి వెళ్ళు. సాంబారుతోనే నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి”

రాజం నాలుకపై పంజామి హోటల్ కాఫీ రుచి నాట్యం చేస్తుంది. కుంభకోణంలో చిక్కని ఆవుపాల కాఫీకి ఈ హోటల్ ప్రసిద్ధి గాంచింది.

అమ్మ సాంబారును వదిలే ప్రసక్తి లేదు. కుళ్ళి, ఒసేయ్ కుళ్ళి! లెగు, నేతమగ్గం దగ్గరకి వెళ్ళాలి.”

“నువ్వు కాఫీ తాగుతావో, మానేస్తావో నాకు సంబంధం లేదు, నాకు మాత్రం దోసా, సాంబారు కొని తీసుకురా.”

“నా దగ్గర డబ్బుల్లేవు; డబ్బులివ్వు, కొని తెస్తాను”

అంతసేపు చాప మీద పడుకుని మాట్లాడుతున్న ఆమె, టక్కున లేచి కూర్చుంది.

“ఏమన్నావు? మళ్ళీ ఇంకోసారి అను ఆ మాట, ఏమన్నావు?”

“ఇప్పుడేమన్నానని వింతగా అడుగుతున్నావు? డబ్బులిస్తే దోసా, సాంబారు కొని తెస్తాను అన్నాను”

“కన్నదానికి ఒక దోస కొనివ్వడానికి దిక్కులేదుగాని? ఇంకా తాళి కూడా కట్టలేదు కానీ, ఈలోపు కట్టుకునే దాని కోసం మాత్రం కట్టలు మూట గడుతున్నావు కదు”

“చూడమ్మా, నోరు వుంది కదా అని అనవసరంగా పారేసుకోకు. చుట్టుపక్కల అద్దెకున్నవాళ్ళు పడుకునున్నారు. నీ అరుపులకు లేచిపోబోతారు. నేను ఎవ్వరికి ఏవి కొనివ్వలేదు”

“పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరు చూడలేదు అనుకుందట. నువ్వు ఎదురింటి అమ్మాయి కోసం ఏమేం ఖర్చు పెడుతున్నావన్న సంగతి నాకు తెలియదా ఏంటీ?”

“నోరు మూసుకో. ఊళ్ళో ఆడోళ్ళ కోసం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడమాకు”

“అంత కానీ మాట ఏమన్నాను? అది ఉన్నమాటేగా. వీధులోకి వెళుతున్నప్పుడు నువ్వు దాన్ని చూసి నవ్వడం, అది నిన్ను చూసి పళ్ళీకిలించడం, ఊరే మీ బాగోతం చూసి కోడై కూస్తుంటే. నేనేనొకటి చెబుతున్నాను విను; నువ్వు దాన్ని కట్టుకోవాలని ఆశ పడుతున్నావు, అది ఎన్నటికీ జరుగదు. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు, అది ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టలేదు.”

రాజం, అమ్మ ముఖాన్ని ఉరిమి చూశాడు. ఆమెను తప్పించుకోవడం కోసం నాన్న మగ్గం చుట్టూ పరుగులు తియ్యడం గుర్తుకొచ్చింది.

“ఏం చేస్తావ్? కరుస్తావా?” అని కోపంగా ఎదురు ప్రశ్నించాడు.

“ఒరేయ్ పాడే మీద పోయే వెధవ, నన్ను కుక్కా అని అంటున్నావా? అని అమ్మ మండిపడింది.” తప్పు నీది కాదు, ఆ ఎదురింటి గాడిద నీకు ఏదో కనికట్టు చేసింది. అదే నిన్నిలా ఆడిస్తుంది. కన్నతల్లిని కుక్క అన్న ఆ నోటికి పురుగులు పట్టి పోతావురా, పురుగులు పట్టి పోతావు.”

“పక్కింటి కోడి అయ్యయ్యో అన్నట్టు కూత కూసింది. రాజం మండిపడ్డాడు. సాంబార్ గొడవను అడ్డం పెట్టుకుని అమ్మ పంకజాన్ని కూడా ఆడిపోసుకుంటుంది. తిట్లతో ఊరు ఊరంతా తెల్లారిపోయేలావుంది. ఇవన్నీ పంకజం తల్లిదండ్రులు చెవిన పడితే ఇంకేమైనా వుందా? పంకజం ఎంతగా నొచ్చుకుంటుంది?

“అమ్మా మహాతల్లీ! కాస్త నోరుముయ్యి. తెల్లారేలోపు ఇలా గావు కేకలు పెడితే ఏమైనా బాగుంటుందా? నీకు ఏం కావాలి? దోసా, సాంబారే కదా? ఆ గ్లాసు ఇటివ్వు?

అమ్మ అక్కడి నుంచి కదలలేదు.

“ఆ సాంబారు, దోసా తీసుకెళ్ళి ఆ గాడిద ముఖాన కొట్టు. నన్ను కుక్క అంటావా? నీ జిమ్మడిపోను!. నోరు మూసుకుని ‘పోతే పోనీ అని ఊరుకుంటే, నాకే చెవులో పూలు పెడతావా? ఎక్కడికి పోతాయిలే బాబు బుద్ధులు? బాబు పచ్చితాగుబోతు, తాగుబోతోడి కొడుకు ఇంతకు మించి ఎలా ఉంటాడులే?”

“సరే, ఇక ఆపుతావా నీ సోబ. నిన్ను కుక్కా అని నేను అన్నానా. గ్లాసు తీసివ్వు, సాంబార్ కొనితెస్తాను.”

అతడు చెప్పింది ఆమె వినిపించుకున్నట్టు లేదు. నోట్లో ఉన్న తిట్ల దండకం అప్పజెప్పాకే ఆపుతుంది  కాబోలు.

రాజానికి కోపం కట్టలు తెంచుకువస్తోంది. దరిద్రపుగొట్టుది. నోటికి అడ్డూఆపు ఉండదు; దవడ మీద చెళ్ళు చెళ్ళుమని  నాలుగు ఇచ్చుకుంటే తప్ప దారికి వచ్చేలా లేదు. ఒక లెంపకాయ కొట్టి ఉండేవాడే కానీ, ఆమె నోటికి జడిసి అదుపు చేసుకున్నాడు.

“ఏంట్రా? మిర్రున చూస్తున్నావు? నా దగ్గర ఇవన్నీ పెట్టుకోమాకు. ఆడదేగా కొడితే, గిడితే అడిగేదెవరులే అనుకుంటున్నావేమో? ఏదీ, కన్నదాని మీద చేయెత్తు చూద్దాం? ఏం చేస్తానో చూడు. వంట్లో చేవలేదనుకున్నావా? నేను కాళి కుప్పమ్మ (అమ్మోరు తల్లి) వంశానికి చెందినదానిని. నా మీద చెయ్యిపడిందో, నీ డొక్కచించి, పేగులు మేడలో మాలలా వేసుకుని, ఆ ఎదురింటి దాని ఇంటి ముందుకెళ్ళి నిలబడతాను ఏమనుకున్నావో ఏమో?

కాళి కుప్పమ్మ, మొగుడి కడుపును కత్తిపీటతో చీల్చి, మెడలో మాలగా వేసుకుని, వీధులెమ్మట చేతిలో కత్తిపీటతో పోలీసులకు లొంగిపోయిందని కుంభకోణం శౌరాస్ట్రీయులు కథలుకథలుగా చెప్పడం గతంలో రాజం కూడా విన్నాడు. అమ్మ, కాళి కుప్పమ్మ వంశానికి చెందినదని, ఈ రోజు కొత్తగా బంధుత్వం కలుపుతుంది. ఆమెకు అంత ధైర్యం లేదే. అమాయకులైన పిల్లల్ని బెదిరించడం తప్ప.

ఆమె నోట్లో నోరెట్టి మనశాంతిగా ఉండలేమని రాజానికి అర్ధమయ్యింది. తనే ఒక ఎవర్ సిల్వర్ గ్లాసును తీసుకుని హోటలుకు బయలుదేరాడు.

అతడు కిక్కురుమనకుండా వెళుతున్నప్పటికీ, అమ్మ అతన్ని వదలడం లేదు; “నా కోసం నువ్వేమి పడిగాపులు పడి తేవాల్సిన అవసరం లేదులే, ఒక వేళ తెచ్చినా కాలువలోకి విసిరి కొడతాను.”

అతడు సమాధానం చెప్పకుండా అక్కడి నుండి బయలుదేరాడు. ఒక క్షణం సంకోచంగా నిలబడ్డాడు. అమ్మను పట్టుకుని, కొప్పు పట్టుకుని ఈడ్చి, రెండు చెంపల మీద రెండు లెంపకాయలేసి, ముఖం మీద, నడుం మీద పిడిగుద్దులు గుద్దుతుంటే ‘వదలరా, వదలరా, ఇకపై నీ జోలికి రాను; నువ్వు ఆ ఎదురింటి పంకజాన్నే పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండు; నన్ను వదిలేయ్, నీకు పుణ్యముంటుందిరా’ అని అరిచేవరకు చితకబాది ఒక మూలన కూర్చోబెడదామా అన్న ప్రశ్న మనసులో తలెత్తినప్పుడు  అతడి మనసుకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. ‘నాన్న కొడుతున్నప్పుడు, ఆయన్ని కరిచేందుకు మీదకు ఉరుకుతుందే, అలా మీద పడుతుందేమో? రానీ; నా దగ్గర ఆమె పప్పులేం ఉడకవు. పళ్ళు రాలగొట్టి చేతులో పెడతాను’ అని మనసులో అనుకున్నాడు.

ఒక్క క్షణం అలా అనుకున్నాడో లేదో వెంటనే అమ్మో తాటకి; ఆమె పళ్ళ కంటే, నోటికి పదునెక్కువ, అతడు చెయ్యెత్తేలోపే, ఆమె ‘బాబోయ్ చంపేస్తున్నాడు, చంపేస్తున్నాడు నన్ను కాపాడండి’ అని అరిచిగీపెడుతుంది. ఐదుగురు కుటుంబస్తులు కాపురముంటున్న ఇల్లు, కనీసం ఇరవైమందన్నా ఉంటారు; అందరూ లేచి వచ్చేస్తారు. పైగా అతడికే చీవాట్లు పెడతారు.

అమ్మను మాటలతో నెగ్గుకురావడం కష్టం.

అతడు మౌనంగా నడిచి వెళ్ళాడు. పౌర్ణమి వచ్చి వెళ్ళి ఆరేడు రోజులు అయ్యుంటుంది. సగం చంద్రుని వెలుతురు వసారాలో పిండారబోసినట్టు వుంది. మాఘ మాసం;  చలి తరువాతి కాలం; రాత్రంతా బాగా చలి వేస్తోంది. పావురాల గూళ్ళలా ఇరుకు ఇరుకుగా విభజించిన ఆ గదుల్లో ఆ ఇంట్లోవాళ్ళందరు నిద్రపోయుంటారు. మెలకువగా ఉంటే మాటల శబ్దం వినబడుతోంది కదా? నేతమగ్గం శబ్దం వినబడుతోందిగా; మూడవ పోర్షనులో ఉన్నటువంటి సిద్దమ్మ మాత్రమే ఆరుబయట పడుకుంటుంది. ఆమెపై వెన్నెలవెలుతురు పడుతుంది. దుప్పటి కాలికింద పడుండటంతో ఆమె శరీరం వంకర్లుపోతూ ముడుచుకుని పడుకోవడం చూస్తే ఆమె కూడా నిద్రపోతున్నట్లు ఉంటుంది.

ఇంట్లోవాళ్ళెవ్వరు ఇంకా నిద్ర నుండి లేవలేదు, అమ్మ గావు కేకలు వినబడలేదు అన్న తృప్తితో రాజం ఇంటి ముందుబాగాన్ని చేరుకోగానే, “ఏంటి రాజం, పొద్దుపొద్దున్నే హోటలుకు బయలుదేరావా?” అని ఒక గొంతు తమిళంలో వినబడింది.

సారంగన్ ; తెలివేసి ఉన్నాడు కాబోలు.  బహుశా అమ్మ, రాజం ఇద్దరూ గొడవ పడటం వినుంటాడేమో? వింటే వినని; తను మాత్రం ఏమైనా పెద్ద పత్తిత్తా ఏంటి? రోజూ భార్యతో ఒకే గొడవలు; మరిది ఇద్దరికీ మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తుంటాడు. సౌరాష్ట్రాలో పుట్టినవాడు గనుక, సౌరాష్ట్రా భాషలో మాట్లాడితే సొమ్మేం పోతుందట? అయినా తమిళంలోనే మాట్లాడతాడు.

“హాయ్, హాయ్ ఏఖేడిక్ వెళో కోట్ జాన్?” (అవునవును, ఈ సమయంలో ఇంకెక్కడికి వెళతారు?) అని సౌరాష్ట్ర భాషలో రాజం బదులిచ్చాడు.

“ఒక వేళ కల్లు దుకాణానికి గాని వెళుతున్నావేమో అని చూశాను” అని తమిళంలో నవ్వాడు సారంగన్.

“అక్కడ భోధా తెలింజ సెనికా” (ఇంకా మత్తు దిగలేదా?)

“అదెలా దిగుతోంది? పక్కనే కుండలో పెట్టుకున్నానుగా? అది సరే కానీ, నాకు ఒక గ్లాసు సాంబార్ కొని తీసుకురా, అలాగే రెండు ఇడ్లీ పార్సెల్ కట్టించు” అని సారంగన్ ఒక సత్తు గ్లాసును చేతికిచ్చాడు.

రాజం వద్దనకూడదని ఆలోచిస్తున్నాడు. అయితే సారంగన్ అదోరకమైన మనిషి. హోటల్ నుంచి తిరివచ్చేలోపు ఇంటికి తాళం వేసుకుంటాడు. గొంతు చించుకుని అరిచినా తలుపు తెరవడు. రాజం గొంతు విని అమ్మ తలుపు తెరుస్తుందా? కళ్ళు తెరవగానే భద్రకాళి వేషం కట్టేస్తుందిగా.

“హోటలుకు రావొచ్చుగా” అన్నట్టు రాజం గ్లాసును తీసుకున్నాడు.

“కేవలం తలుపు వేసుకుని మనం వెళితే , దొంగ వెధవ ఎవడో ఒకడు లోపలి దూరి పడుగు(నేతలో నిలువు దారం పోగులు) తెంపుకుని పోతే దిక్కెవరు? నేను కాపలా ఉన్నాను; నువ్వెళ్ళి ఇడ్లీ తీసుకువచ్చి ఇవ్వు” అని తెలివిగా నవ్వాడు.

మనసులో తిట్టుకోవడం తప్ప, తను మరేం చెయ్యలేకపోయాడు. రెండు చేతులతో గ్లాసులు పట్టుకుని వీధిలోకి వచ్చాడు.

ఆకాశంలో సగంచంద్రుడు, నక్షత్రాలు చలిలో వణుకుతున్నాయి. రాజాన్ని చూడగానే ఒక వీధికుక్క లేచి నిలబడింది. అతని వెనుక పరుగులు తీసింది. అతడు ఏ రోజూ దానికి ఒక ముద్ద అన్నం కూడా పెట్టి ఎరుగడు. ఏం కారణమో ఏమిటో వేకువజామున అతడు హోటలుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కాపలాగా వెంట వచ్చేది. వీధిలో ఎలుకలు, పందికొక్కులు దాని అడుగుల చప్పుడు విని చెదిరిపోయి పరుగులు తీసేవి. పందులు, గాడిదలు మేత కోసం వెదికాయి. కొందరు మహిళలు వీధుల్లో, ఇంటి గుమ్మం ముందు కల్లాప్పి జల్లి, ముగ్గులు పెడుతున్నారు. కుక్క అతడి వెనుకే వచ్చింది.

రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఎప్పుడూ వచ్చే పాత కలే. తనుకు ఊహ తెలిసిన రోజు నుంచి బహుశా వెయ్యి సార్లకు పైగా ఆ కల వచ్చివుంటుంది. అతడు ఏదో ఒక వీధి వెంబడి వెళుతున్నాడు. ‘వావ్..వావ్’ అని మొరుగుతూ ఒక వెఱ్రికుక్క అతడిని వెంబడిస్తోంది; అతడు రొప్పుతూ పరుగులు తీస్తున్నాడు. అది అతడి మీద దూకి కుడి కాలు పిక్కను కొరికి పట్టుకుంటుంది. ‘అయ్యో’ అని ముక్కుతూ, మూలుగుతూ అతడు నిద్ర నుంచి లేస్తాడు. కలే అని నిర్ధారణకు వచ్చేందుకు కాస్త సమయం పడుతోంది.

మళ్ళీ రాత్రి కూడా అదే కల; అదే వెఱ్రికుక్క అతడి కాలి కండను కొరికింది. వెఱ్రికుక్క కరిస్తే మనిషికి పిచ్చి పడుతోంది అంటారు.  నిజానికి కుక్క కల్లోకి వచ్చి కరిచినా వెఱ్రి పడుతోందా?

అతడు వీధి చివరకు వచ్చాడు. నలువైపులా తేరిపారా చూశాడు. మనుష్యుల సంచారం లేదని నిర్ధారణకు వచ్చాడు. వెంట ఉన్నది వీధి కుక్క మాత్రమే. అతడు ఆగడంతో అది కూడా ఆగింది. కలలో వచ్చిన వెఱ్రికుక్క ఈ కుక్కలా సాధుజీవి కాదు. అది ఎంతో భయంకరంగా మొరిగింది. అతడు అలా మొరిగితే అమ్మ భయపడుతోందా, లేదా?  అతడు ఆ వీధి కుక్కను చూసి కీచ్ కీచ్ అనే గొంతుతో “వావ్…వావ్” అని మొరిగాడు. అంతవరకు మనిషి కుక్కలా అరవడం వినని ఊరకుక్క భయపడినట్టు వుంది; అది తిరిగి చూసి పదడుగులు వెనక్కి వేసి, మళ్ళీ ఒక చోట నిలబడి అతడిని తేరిపారా చూసింది. నేను మొరిగితే అమ్మను పరిగెత్తే కొద్దీ వెంబడించవచ్చు అని మనసులో నవ్వుకున్న రాజం హోటలు వైపు నడిచాడు.

కుక్క అతడిని వెంబడించింది.

వినాయకుడి గుడి పక్కనే హోటల్ ఉంది. ఆ వేకువజామున కూడా హోటల్ జనంతో కిక్కిరిసింది. చద్దన్నం తినేసి నేతకార్మికులు మగ్గం నేసేందుకు వెళ్ళే రోజులు ఎపుడో కొండెక్కాయి. ఇప్పుడు ఏ కాఫీనో, ‘టీ’నో ఆరగించే గుంపు కదా. హోటల్లో ఏ వంటకం అయినా, అడిగినంతమేరకు దొరుకుతుంది. కాఫీ కూజా నిండా అడిగితే ఎలా నాణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది? రెండు ఇడ్లీ  పార్సల్ కట్టుకుని ఒక గ్లాసు సాంబార్ అడిగితే ఇడ్లీ ఎలా సంతోషంగా ఉంటుంది? దానికి హోటల్ వాడిని ఎలా తప్పు పట్టగలము?

“ఏంటి రాజం? ఆశ్చర్యంగా ఉంది, ఈ వైపు కొత్తగా వచ్చావు? నీకు ఈ పంజామి హోటలేమి గుత్తకు ఇవ్వబోవడం లేదోయ్” ఎంతో అక్కర కొద్దీ విచారించాడు హోటల్ సప్లైర్ సీమ.

“అరేయ్ సీమవా? నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వచ్చి చేరావు? పంజామి హోటల్ వదిలి ఎన్ని రోజులవుతుంది?”

“ఒక వారం అవుతోంది”

సీమా, పురోహితుడు రామసామి అయ్యంగార్ కొడుకు. అతడికి పౌరోహిత్యం అంటే ఇష్టం లేదు. పైగా చదువు కూడా వంటబట్టలేదు. సినిమా స్టారుగా వెలుగొందాలి అనే కలతో హోటల్ సప్లైరుగా జీవితం మొదలెట్టాడు. పట్టుమని రెండు నెలలు కూడా అతడిని ఒక హోటల్లో చూడలేము. కేవలం హోటల్ మాత్రమే కాదు తరుచూ ఊర్లు కూడా మకాం మార్చుకుంటాడు. తంజావూరు, తిరుచ్చి, మధురై, మద్రాస్ ఇలా ఒక ఊరి నుంచి ఇంకో ఊరు మకాం మారుతాడు. అతని దగ్గర ఒక మంచి గుణముంది. హోటలుకు వచ్చిన కస్టమర్లతో ఎంతో ఆదరణగా నడుచుకుని సప్లై చేస్తాడు. వాళ్ళు ఒక్కటి అడిగితే తను రెండు ఇస్తాడు. బిల్లు కూడా తగ్గించి వేస్తాడు. ఆపై వాళ్ళను ఒక వారం పది రోజులకు ఒకసారి ఒంటరిగా వెళ్ళి కలిసి సినిమాకు వెళ్ళేందుకు కావలిసిన డబ్బులు అడిగి తీసుకుంటాడు. అందువలన అది ఇద్దరికీ లాభదాయకం కూడాను. దీనివలన ఏ హోటల్ యజమాని నాశనం అయ్యిన దాఖాలా లేదు లెండి.

“సీమ, అక్కడ ఏంటి బాతాకాని కొడుతున్నావు?” అని కాష్ కౌంటర్ వద్ద ఉన్నఫళంగా గొంతు పెంచాడు హోటల్ యజమాని.

“వేడిగా ఒక కాఫీ”

“ఇడ్లీ వేడి వేడిగా ఉంది. ఏ1 ఆధరవు తీసుకువస్తాను” అని సీమా హడావిడిగా వెళ్ళాడు.

రెండు ఇడ్లీ, ఒక నేతి రవ దోస, డిగ్రీ కాఫీతో పైకి లేచాడు రాజం. అమ్మకు, సారంగనుకి పార్సల్ తీసుకున్నాడు. సీమా దయ చూపడం వలన రెండు గ్లాసుల సాంబారు, పైగా బిల్లులో ఇరవై ఐదు పైసలు లాభం కూడాను.

“ఇందుకేరా రాజం గ్లాసు నీ చేతికి ఇచ్చిపంపాను!” అని సారంగన్ మెచ్చుకున్నాడు.

అమ్మను శాంతింపజేయడమే రాజం తక్షణ కర్తవ్యం.

“అమ్మా! సాంబారు కొని తెచ్చాను. హోటల్ చాలా జోరుగా ఉంది. మన సీమనే ఇచ్చాడు. గ్లాసు నుండి కారిపోయేంత నిండుగా ఉంది…” అని ఆమె వైపు చెయ్యి చాపాడు. ఆమె అందుకోలేదు.”

“తెచ్చావా, ఎళ్ళి ఆ ఎదురింటి దానికి తీసుకువెళ్ళి ఇవ్వు, సరేనా!”

రాజం ఆమె ముఖాన్ని చూశాడు. ఆ ముఖంలోని హావభావాలు అతడికి ఏ మాత్రం రుచించలేదు. ఈ దరిద్రపుగొట్టు దానిని ఎవరూ తృప్తి పరచగలరు గనుక? తనని తిట్టని, రెండు దెబ్బలు కొట్టని, ఏమైనా చెయ్యని. కానీ ఎదురింటి పంకజాన్ని ఆడిపోసుకోవడంలో ఏమైనా న్యాయం వుందా? మనిషనేవాడు ఎవడైనా ఆమె నోట్లో  నోరు పెట్టగలడా?

ఆమె ఎక్కడికైనా వెళ్ళి దాపరిస్తేనే నాకు మనశాంతిగా వుంటుంది. తనంతట తానుగా అయితే ఆమె నన్ను వదిలిపోదు. నేనే ఆమెను ఎక్కడైనా వదిలించుకుని, నీళ్ళు జల్లుకోవాలి.

“సాంబార్ తెమ్మన్నావు కదా అని తెచ్చాను. వద్దంటే ఇక నీ ఇష్టం. కుళ్ళి, పళ్ళు తోముకున్నావా? మగ్గం దగ్గరకి వెళదామా?”

కుళ్ళికి తొమిదేళ్ళు ఉంటాయి, ఇంటికి ఆఖరి బిడ్డ. అన్నయ్య రాక కోసం ఎదురుచూస్తుంది. రాజం ఎత్తులోనున్న గడియారాన్ని చూశాడు. సమయం ఐదున్నర కావొస్తుంది.

అమ్మ ఏ మాత్రం తీసిపోలేదు. “నువ్వు తెచ్చిన దాన్ని నేను ఎందుకు ముట్టుకోవాలి. వెళ్ళి నీకు కాబోయే పెళ్ళానికి తీసుకెళ్ళి ఇవ్వు…”

“ఊళ్ళో ఆడోళ్ళ కోసం  ఇలా నోరు పారేసుకుంటే మర్యాద దక్కదు చూసుకో ఆహ్…”

“ఏం మాట్లాడితే ఏమవుతదంట?  ఒక దోస తీసుకురమ్మంటే ఎన్నేసి మాటలన్నావు?  పైగా నన్ను పట్టుకుని కుక్క అంటావా?;  కోతి అంటావా?  కన్నదానికి కొనివ్వాలంటేనేమో డబ్బులుండవు.  అదే కట్టుకునే దానికి అయితే మాత్రం జరీఅంచు చీర, మంగళసూత్రం. ఒక తులంలో  తాళిబొట్టు చేయించి, అన్నిటిని పెట్లో పెట్టి  భద్రంగా తాళం వేశావుగా. నాకు తెలియవు అనుకుంటున్నావా నీ వేషాలు?  వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంట తమరికి?”

రాజానికి కడుపులో పోట్లగిత్త కొమ్ములతో కుమ్మేస్తున్నటు వుంది. “ఏమే ఎందుకే నా  పెట్టే దొంగతనంగా తెరిచి చూశావు?  నన్ను అడక్కుండా నా పెట్టె ఎలా తెరిచావు?  అని అరిచాడు.

“నా ఇంట్లో పెట్టె  నేను తెరవడానికి నిన్నెందుకు అనుమతి అడగాలి?  నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడు.  ఎవర్ని దొంగ అంటున్నావు?  ఏది ఇంకోసారి అను ఆ మాట,  ఆ నాలుక తెగ్గోస్తాను ఏమనుకుంటున్నావో?

తన ఇన్ని రోజుల రహస్యం బట్టబయలు కావడంతో రాజ్యానికి కళ్ళు తిరిగాయి.  అతడు  తన కాబోయే భార్య పంకజం కోసం,  జరీలో పూల డిజైను నేసిన పట్టుచీరను, తన స్వహస్తాలతో నేసి,  యజమాని దగ్గర తక్కువ ధరకే  తీసుకున్నాడు. ఒక పెద్ద తాళిబొట్టును ఇంకొక చిన్న తాళిబొట్టును చేయించాడు.  దానితోపాటు ఒక బంగారు పేటగొలుసు కూడా చేయించాడు. ఎవరి కంట్లో పడకుండా భద్రంగా తాళం వేసి పెట్టాడు. రేపు పెళ్ళంటే అప్పటికప్పుడు ఒకే సమయంలో వాటన్నిటిని సిద్ధం చేసుకోగలడా?  కొంచెం కొంచెంగా ఆదా చేస్తూ వచ్చాడు. అమ్మ తన ఇంట్లో లేని సమయం చూసి ఇంకో నకిలీ తాళం చెవితో పెట్టె తెరిచి చూసింది. ఎన్ని గుండెలు ఆమెకి.

“ఎందుకే నా పెట్టె తెరిచావు?” అని అమ్మ రెండు చేతులను అతడు గట్టిగా పట్టుకున్నాడు. ఉక్రోశంతో పొత్తి కడుపు నుంచి చాతిమీదుగా ఓ విధమైన నిస్సత్తువ ఆవహించింది.

“ఛీ!  చెయ్యివదులు కుక్కా?   అని ఆమె తన రెండు చేతులను వదిలించుకుంది. “ఇంకా తాళి కూడా కట్టలేదు కానీ, ఈ లోపే  ఇంత మిడిసిపాటా? తల్లిని నేనొక మాట అంటున్నా రాసి పెట్టుకో. ఆ వగలమారిని  కట్టుకోవాలని ఆశపడుతున్నావు.  అది ససిమేరా జరగదు;  అది ఇంట్లో అడుగుపెడితే  ఇంట్లో శవమే లేస్తుంది;  అవును కచ్చితంగా ఒక శవం లేస్తుంది.”

అమ్మ అడ్డుఆపు లేని మాటలు రాజం నోటిని కట్టిపడేశాయి. “నేను ఎవరిని కట్టుకోలేదు. కుళ్ళీ, ఏంటి దిక్కులు చూస్తున్నావ్?  వెళ్ళి మగ్గం ఎక్కు.”

అతడు ఆమె వెనకే మగ్గం ఎక్కాడు. నాడాను కళ్ళకు అద్దుకుని, దేవుడ్ని మొక్కిన తర్వాత పని మొదలెట్టాడు.  చెల్లి అంచులను చేర్చి కలిపి ఇవ్వడంతో అతడు  నెయ్యడం  మొదలుపెట్టాడు.  నాడ అటు ఇటు పరుగులు తీసి  దారపు పోగులుగా ఉన్నటువంటి పీలిక  చీరగా రూపుదిద్దుకోసాగింది.  రాజం మార్చి మార్చి కాలితో చెక్కను తొక్కేటప్పుడు ‘పొయ్’ మనే శబ్దం వచ్చింది…ఆ తర్వాత అతను పలక కొట్టే శబ్దం రావడంతో  కుళ్ళి మారుమాట్లాడలేదు. అమ్మ పోయిందా? ఆమె పోవడమా? ఒకటి అతడైనా చావాలి లేదా ఆమైనా చావాలి అంతవరకు ఆమె వదిలి పోదు.

ఒక కన్నతల్లి ఇలా కూడా ఉంటుందా? కన్నతల్లిని తిట్టడం, కొట్టడం పాపమట. ఆమె మాత్రం ఊరెక్కడా చూడలేనంత వింతగా నడుచుకోవచ్చా? పంది పిల్లల్ని పెట్టినట్టు, పిల్లల్ని కనడం తప్ప ఇంకేమైనా చేసిందా?

నాన్నకేమో అత్యాశ?  ఏదో ఒకరోజు ధనవంతుడు అయిపోవాలని కలలు కనేవాడు. కష్టపడి అంచలంచెలుగా  ఎదగొచ్చనే  నమ్మకం ఆయనకు ఏ మాత్రం ఉండేది కాదు.  లాటరీ టికెట్లలో  భారీ మొత్తంలో బహుమతులు గెలుచుకుంటారు కదా, అలా నాన్న పిల్లల్ని బహుమతిగా పొందాడు. ఈ బిడ్డ జాతకం సరిలేదు.  ఆ తర్వాత పుట్టే బిడ్డైనా మంచి గడియల్లో పుడుతుందేమో చూడు?  అని ఆ తర్వాతి బిడ్డ కోసం తయారయ్యేవాడు. అందులో ఏదో ఒక బిడ్డకి జాతకంలో యోగం కుదిరి, తద్వారా అయినా తను ధనవంతుడు అయిపోవచ్చునని ఆయన కలలు కనేవాడు.

అమ్మ అలా అనుకునేది కాదు. తను  ఏదో పుణ్యానికి కనిపారేసింది కనుక ఒక్కొక్కబిడ్డ ఎన్ని అగచాట్లు పడైనా  తనకు ముద్ద పెడితే చాలని ఎదురుచూసేది. మగ బిడ్డలే కాదు ఆడపిల్లల పరిస్థితి కూడా అంతే.

ఐదవ ఏట తన చేతికి నాడ ఇచ్చారు. ఈరోజుకి అతడికి 25 ఏళ్ళు. నాడ అతన్ని వదిలిన పాపాన లేదు. వెంట పుట్టిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళ పరిస్థితి కూడా ఇంతే. ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి అమ్మ నుంచి తప్పుకున్నారు. చివరగా ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం మిగిలారు. కుళ్ళికి ఇప్పుడు తొమ్మిదేళ్ళు,  రాజామణికి పదమూడేళ్ళు. ప్రస్తుతం ఇంట్లో వీళ్ళిద్దరూ నేతపని చేస్తున్నారు. తమ్ముళ్ళు నలుగురూ ఒంటరిగా ఉంటున్నారు. నెల నెలా అమ్మకు డబ్బులిచ్చి రెండుపూటలు ఇంట్లో తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి అమ్మతో పెద్దగా ఎటువంటి ఇబ్బంది లేదు.

మురికి  గుంటలో పడింది కేవలం రాజం మాత్రమే.  తను కూడా ఒంటరిగా ఉండి ఉండేవాడు.  నేత మగ్గం విడిగా అద్దెకు ఇచ్చేవాళ్ళు దొరకడంలేదు. గతంలో నేతమగ్గానికి మాత్రం రెండు రూపాయల అద్దె ఉండేది. ఇప్పుడది కాస్తా ఏడూ రూపాయలకు చేరుకుంది. పైగా పెట్టే చోటు దక్కడం లేదు. దీనికి తోడు ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళికి చేసిన అప్పులు తీర్చాలి.  దాంతోపాటు తన పెళ్ళికి కూడా కాస్త చేర్చి పెట్టుకోవాలి. చెల్లెలిద్దరికి కాస్త డబ్బులు పొదుపు చేయాలి.  మిగిలిన తమ్ముళ్ళకి ఎటువంటి బాదరాబందీ లేదు. కానీ తను అలా ఉండలేడు కదా.  అమ్మతోపాటు ఉంటే నాలుగు డబ్బులు పొదుపు చేయొచ్చు అని ఆమెతో పాటు ఉన్నాడు.

ఇలా బాధ్యతలన్ని నెత్తినెట్టుకుని ఆశపడటం వలనో ఏమో, అమ్మ దగ్గర ఇలా ఇరుక్కున్నాడు. అతడు ఇంటికి ఎంత చేసినా సరే అమ్మ అతడి ప్రత్యర్థివర్గమే.  అసలు పంకజానికి ఏం తక్కువని?  తల్లిదండ్రులు ఉన్నారు.  నలుగురు అన్న తమ్ముళ్ళ మధ్య ఒక్కగానొక్క అమ్మాయి.  పైగా నేతపని తెలుసు.  ఇంటి పనులన్నీవచ్చు. చూడ్డానికి మరీ సినిమా హీరోయినులా లేనప్పటికీ, ఖచ్చితమైన శరీరతత్వంతో వుంటుంది.  ఆమె కన్నవాళ్ళు అతనికి పిల్లనిచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు.  వాళ్ళే ముందుగా తన యజమానితో మాటలు కలిపారు. యజమాని ఇద్దరికీ జాతకం పొంతనలు అవి చూశారు.  కట్నకానుకల లాంచనాలన్నీ ఆయనే దగ్గరుండి మాట్లాడారు.

ఇంత వ్యవహారం జరిగిన తర్వాత తీరా ఇప్పుడొచ్చి “నాకు ఆ పిల్ల నచ్చలేదు, ఆమెను పెళ్ళి చేసుకోకూడదు అనడం ఏమైనా పద్దతిగా వుందా?  మొదట్లో ఆమెను అడగలేదని గోల. ఆమెతో సంప్రదింపులు జరిపి ఉంటే కనుక ఒంటరిగా తీసుకెళ్ళి ఏ యాభైనో, వందో అడిగి తీసుకొనేది. కేవలం అది దొరకలేదు అన్న  అక్కసు మాత్రమే. పోయి పోయి దీనికోసం పంకజాన్ని నోటికొచ్చినట్టు కేవలంగా మాట్లాడుతుందే, ఆమెకు పుట్టగతులుంటాయా?  పైగా పంకజం ఎదురింట్లోనే ఉంటుంది.  ఏ రోజు అతడు ఆమెను తలెత్తి చూసిన దాఖలా అయినా ఉందా?  లేదా ఆమె ఇతడు  ఉన్న వైపు కన్నెత్తైనా చూసిందా?  అటువంటి ఉత్తమురాలు మీద నోరేసుకుని బయలుదేరుతుంది ఈ దరిద్రపుగొట్టిది, దీని నోట్లో పురుగులు పట్టవా. నాన్నను చెయ్యెత్తి కొట్టిన ఈ రాక్షసికి, పంకజం గురించి మాట్లాడేందుకు ఏం అర్హత ఉందని అసలు?

ఇలా ఆలోచనలు ఒకదానితో ఒకటి పోటీపడి నాడ పైకి ఎగిరింది. ఇంత అయోమయంలో కూడా ఒక్క దారం పోగు కూడా తెగలేదు.  అన్నయ్య బాధను  అర్థం చేసుకొని కుళ్ళి వెంటనే నాడాను అందుకుని ఇచ్చింది.

‘యజమాని తన వైపే ఉన్నాడు. అతడంటే ముందు నుంచి ఒక రకమైన అభిమానం. ఒక విధమైన నమ్మకం. ప్రతిపనికి అతడినే పిలిచేవాడు. రాజం అతడి సహాయంతోనే తన ముగ్గురు చెల్లెలు పెళ్ళి అప్పులు తీర్చగలిగాడు. తన పెళ్ళి కోసం చీర, గొలుసు, తాళిబొట్టు ఇలా అన్నింటిని సమకూర్చుకోగలిగాడు.

అమ్మ కంట్లో పడకూడదని వాటన్నింటినీ అతడు పెట్లో పెట్టి తాళం వేశాడు. ఆ పెట్టెని దొంగతనంగా తెరిచి చూడ్డానికి ఆమెకు ఎన్ని గుండెలు.

అతడికి కోపం కట్టలు తెంచుకువచ్చింది అదే సమయంలో అమ్మ గొంతు. “కుళ్ళి, ఓవ్ కుళ్ళి, ఎడ్ ఆవ్”  (కుళ్ళి, ఒసేయ్ కుళ్ళి ఇటు రావే అని పిలిచింది.)

చిన్నారి కుళ్ళికి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి.  ఆమెకి ఒకపక్క అమ్మా కావాలి, ఇంకోవైపు అన్నయ్యా కావాలి.

“అన్నయ్యా! అమ్మ పిలుస్తుంది” అని నాడాను ఆపేసింది.

“పని సమయంలో దేనికట పిలవడం?”

“కాయ్ కీ” (ఏంటంట)

“ఉండు జరీలో పూలు డిజైను నేశాక  వెళ్ళొచ్చు”

ఈ లోపు అమ్మ గొంతు మళ్ళీ వినిపించింది. “ఓవ్ ఫోవరదే కానుం ఫోడార్నీ? ఆవిష కీన్ హీ?” (ఒసేయ్ పిలిచేది చెవులో వినబడడం లేదా?)

కుళ్ళి అక్కడ అంతకు మించి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. నాడాను ఉన్నఫళంగా పారేసి, మగ్గం నుండి లేచి కిందకు దూకి అమ్మ వద్దకు పరుగులు తీసింది.

రాజానికి ఉక్రోషం పొంగుకు వచ్చింది. ఆ ఉక్రోషం వలన తల దిమ్మెక్కింది. ముడుచుకుని పడుకుండి పోవాలి. ఇక పైకి లేవనే లేవకూడదు. వంట్లో గొడవ పడేందుకు కూడా సత్తువ లేదు. వంట్లో నరాలు శుష్కించినట్టు వున్నాయి. ఆఖరికి సాంబార్ గొడవ పెళ్ళి గొడవ దగ్గరకొచ్చి ఆగింది. ఇంకా ఎక్కడ ఆగిందిలే, అగ్నికి ఆజ్యం పోసినట్టు రగులుతుంటేనూ.

అతడు మౌనంగా తలవాల్చి దారాలను శుభ్రం చేస్తున్నాడు.

వంటగది పది అడుగుల దూరంలోనే ఉంది. అమ్మ కుళ్ళిని బెదిరించడం స్పష్టంగా వినబడింది.

“ఏమే, నా మాటలు చెవికెక్కలేదా? ఎందుకే రావడానికి ఇంత సమయం పట్టింది?

“మగ్గం శబ్దంలో సరిగ్గా వినబడలేదు”

“ఇకపైన నువ్వు నేతకు వెళ్ళమాకు. కొత్త వీధిలో చెన్నప్పన్ వంద రూపాయలు బజానా ఇస్తానన్నాడు. చద్దన్నం పడుచుకుని తిని అక్కడికెళ్ళు”

కుళ్ళి ఆ అన్యాయాన్ని భరించలేకపోయింది. “అన్న మగ్గం మీద ఇంకా ఒకటిం ముప్పావు మూరలు వరకు నెయ్యాలి. ఒక పక్క యజమాని గారు కూడా మరో వైపు చీర కావాలి అంటున్నారు…”

“అవన్నీ నీ కెందుకు? మూసుకుని ఆ చద్దన్నం కాస్త మెక్కు.” అని కుళ్ళి తలపై గట్టిగా మొట్టికాయలు వేసింది.

వీటన్నిటిని వింటున్న రాజం మగ్గాన్ని విడిచి కిందకు దిగాడు.

“ఏంటే? ఏమంటున్నావు?”

“కొత్తవీధి చెన్నప్పన్ కుళ్ళికి బజానా వంద రూపాయలు ఇస్తానన్నాడు. ఆమెను అక్కడికి వెళ్ళమని చెప్పాను.”

అంచులు పట్టే చిన్నారులకు ఇప్పుడు మంచి గిరాకీ. యాభై, వందా బజానా ఇచ్చి నేతకారులు వారిని పనుల్లో పెట్టుకుంటున్నారు. అమ్మకి కూడా ఈ విషయం తెలుసు.

“ఆమెను అక్కడకు పంపిస్తే నేనేం చెయ్యాలి?”

“నువ్వు ఇంకెవరినైనా చూసుకో. కుళ్ళినే కావాలి అంటే వంద రూపాయలు బజానా ఇవ్వాలి”

రాజానికి ఆమె  తంత్రం అర్ధమైంది. దొంగతనంగా పెట్టెను తెరిచి చూసింది కదా? పెట్టెలో తాళి, చీర, గొలుసుతో పాటు వంద రూపాయలు డబ్బులు కూడా ఉండడం చూసేసింది.  ఆ డబ్బులు ఎలాగైనా లాక్కోవడం కోసమే ఇలా అడ్డదారులు తొక్కుతుంది.

“వీళ్ళ ముగ్గురి కోసమే నేను రెక్కల కష్టం చేస్తున్నాను.  అటువంటప్పుడు కుళ్ళి బయటకెళ్ళి పని చేస్తుందా?”

“నువ్వేమీ మాకోసం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. వంద రూపాయలు బజానా ఇస్తేనే కుళ్ళి నీతో పాటు పనిచేస్తుంది. రాజమణి ఈడుకు వచ్చింది. ఆమె పెళ్ళికి కావలసినవన్నీ అమర్చుకోవాలి. ఆమెకు ఒక చెవిపోగు కొనాలి”

అతడు పెళ్ళికి కావలసినవి సమకూర్చుకుంటున్నాడు కదా?  దానికి పోటీగా రాజామణి పెళ్ళికి కావలసినవి సమకూరుస్తుందట. రాజమణికి పదమూడేళ్ళు. ఈలోపు పెళ్ళికి ఏమి అవసరం వచ్చిపడింది. ఒకవేళ ఏదైనా మంచి సంబంధం వచ్చినప్పటికీ ఆ బాధ్యత అంతా అతని నెత్తి మీద కదా వచ్చి పడుతుంది.

ముగ్గురు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేసే కదా, తను అప్పుల పాలయ్యింది?  ఆ రోజు ఏం చేసిందట ఈవిడ?  రాజమణికి చెవిపోగు కొనేందుకు డబ్బులు అడుగుతుంది?  అది కేవలం అతను చేతిలో ఉన్న డబ్బులు ఎలాగైన చేజెక్కించుకోవాలని మాత్రమే. అతడికి పెళ్ళి కాకుండా మధ్యలో ఇబ్బంది కలిగించాలి. అతడు పని చేసుకోలేనంతగా మధ్యలో అడ్డంకులు కల్పించాలి.  కేవలం ఇది మాత్రమే ఆమె కోరిక.

కన్నోళ్ళకి ఇంతటి కసాయితనం ఉంటుందా?  రాక్షసి, బ్రహ్మ రాక్షసి.

నాన్న ఉన్నంతవరకు ఎలక పిల్లలా ఉన్న ఆమె,  ఆయన పోగానే పందికొక్కులా మారిపోయింది. కొడుకులు, కూతుళ్ళు సంపాదించి పెట్టేసరికి ఈమె  బాగా బలిసి కొట్టుకుంటుంది. ఎందుకు ఉండదులే?  నేతపని చేసేందుకు కూడా ఆమె ఒళ్ళు వంగడం లేదుగా.  పైగా ఒక పక్క అతని కూలిసొమ్ము తీసుకుంటూ, అతనితోనే సగం పని చేయించుకుంటుంది. రోజస్తమాను ఏదో ఒకటి నోట్లో దాణా ఆడిస్తూ, కొవ్వెక్కిపోయేసరికి ఇలా నోటికొచ్చినట్లు ఏదో ఒకటి అంటుంది. ఆ పొగరును ఎలాగన్నా వంచాలి. నాన్న చనిపోయినప్పుడు ఊరు కోసం ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది. ఆమె ఒంట్లో ఆ కొవ్వు కరిగేదాకా కుమిలి కుమిలి ఏడవాలి.

అతని నోట్లో నుంచి వచ్చిన మాటల్లో ఎటువంటి ఉక్రోషం లేదు. “రాజామణి పెళ్ళికి ఇప్పుడు అంత కంగారేముంది?  దాని పెళ్ళి నేను చేయనా?”

“అటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. పెళ్ళికి ముందే ఓ తెగ మిడిసిపడుతున్నావు. ఇక పెళ్ళయిన తర్వాత ఎవరి బుద్దులెలా ఉంటాయో ఏమో?  ఎవరికి తెలుసు?”

“పెట్టెలో ఉన్న డబ్బులు చూసినప్పటి నుండి, వాటిని చేజిక్కించుకునే దాక ఆ కళ్ళు చల్లబడవుగా?”

“నేనేం నిన్ను బిక్షమెయ్యమని అడగలేదు!  నా కూతురు నీ దగ్గర పని చేసి ఆ డబ్బులు  లెక్కతీరుస్తుంది!”

“నేను ఇవ్వను”

“ఇందులో బలవంతం ఏముంది? కుళ్ళి కొత్తవీధిలో పనికి వెళుతుంది.”

“నువ్వే తీసుకో! ఇందా!”  అని అతడు మేకుకు తగిలించిన పెట్టె తాళం చెవిని  ఆమె ముఖాన విసిరికొట్టాడు. వంటిపై చొక్కా తగిలించుకున్నాడు. అద్దంలో ముఖం చూస్తూ పౌడర్ రాసుకున్నాడు.  క్రాప్‌ను సరి చేసుకున్నాడు. అతనికి, తన నోటి నుంచి వెలువడే మాటలన్నీ కుళ్ళిపోయి, కంపు కొడుతున్నట్టు అనిపించింది.

“పెట్టెలో వంద రూపాయలున్నాయి తీసుకో, చీర ఉంది కట్టుకో,  గొలుసు తీసుకుని వేసుకో, వెళ్ళు సరేనా”

ఆమెతో మాట్లాడేందుకు తన వద్ద ఇక ఎటువంటి మాటలు లేవు. మాటలన్నీ కరువయ్యాయని అతనికి అర్థమైంది.  అతను ఇంకేమి సమాధానమివ్వకుండా, సంకోచంగా వంగినట్లు నడుస్తున్నవాడల్లా కాసేపు ఆగాడు.

“కాయ్ ధా” (ఏంటి అన్నయ్యా?) అన్నట్లు ఆమె పరిగెత్తుకు వచ్చింది.

“రాజమణి దగ్గర నేను ఐదు రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆమె భోజనానికి వచ్చినప్పుడు ఇంకో రూపాయి ఆమెకు చేర్చి తిరిగిచ్చేయ్.”

“మరి ఏడు రూపాయలు ఎందుకు అన్నయ్యా ఇచ్చావు?”

“అందులో ఒక రూపాయి నీకు, నీకు నచ్చినవి ఏమైనా కొనుక్కుని తిను.  అమ్మకు చూపించకు”

“దానికి ఒక రూపాయి దేనికన్నయ్యా?”

“ఉంచు నీ దగ్గర పెట్టుకో”

అని మాట్లాడుకుంటూ అతడు ముందుకు నడిచాడు. బుర్ర వేడెక్కుతోంది.  గుండెలో ఒకే మంట.  వడివడిగా ఇల్లు వదిలి బయటకు వచ్చాడు. తూర్పు దిశగా నడిచాడు.

మాదప్ప సంతను దాటి, దిగువ కడలంగుడి వీధిని చేరుకున్నాడు. ఒంట్లో చెప్పలేని నిస్సత్తువ ఆవహించింది. ఎవరో మెడ పట్టుకొని ముందుకు తోసేస్తున్నట్టు వుంది. ఆ రణగుణ ధ్వనులన్నీ సద్దుమణిగి ఒకే ఒక  ధ్వని మాత్రం వినిపించింది. అది కుక్క మొరిగే శబ్దం. మొరుగుతూ అతడిని కరిచేందుకు దగ్గరకొచ్చింది. అతను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరిగెడుతున్నాడు. ఛీ! ఇదేంటి కలలో వచ్చిన కుక్క వాస్తవంలో వెంటపడి తరుముతుందా? కరిచేందుకు మీద మీదకి వస్తుందా?  ఇదేంటి పిచ్చితనం కాకపోతే?

అతను నడుస్తూ ఉన్నాడు.

అతడు ఆ మహామహ చెరువు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. ఈ చెరువులో దూకి చనిపోయినవారు స్వర్గం చేరుకొంటారు అంటుంటారు. గతనెల కూడా  తమ వీధిలోని ఒక ముసలిది ఈ చెరువులోనే  దూకి ఆత్మహత్య చేసుకుంది. పలువురు ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తను కూడా ఈ చెరువులోకి దూకితే ఏమవుతుంది?  చెరువు నీటిలో మెదులుతున్న శవం అంటారు. ఒక్కసారి తను అది తలుచుకుని చూశాడు. అతడు చెరువులో పడి చనిపోయి బుస్సుమంటూ పెద్ద బుడగలా తేలుతుంటే  అమ్మ అతడి శవాన్ని గుర్తుపడుతుందా?  భయపడుతుందా?  ఏడుస్తుందా?

అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే అతనికి ఈత రావడం వలన, చెరువులో దూకినా సరే  అంత తేలిగ్గా చచ్చేందుకు వీలుపడదు. అతనికది కష్టం కూడాను.

అతను దారి పొడుగునా నడుస్తూనేవున్నాడు. ప్రాణభీతితో పరుగులు తీస్తున్నవాడిలా, చెమటలు కక్కుకుంటూ వడివడిగా నడుస్తున్నాడు. వెఱ్రికుక్క మళ్ళీ అతడిని తరుముకు వచ్చింది. వాస్తవానికి అది నిజమైన కుక్క కాదు, తరుచూ అతని కలలో వచ్చే కుక్కే. అయినా సరే అది కరిచేందుకు అతడిని తరుముకొస్తుంది. అది చాలదన్నట్టు దానికి తోడు పక్కింటి కోడిపుంజు అయ్యయ్యో అని  కూస్తోంది.

అతడు కళ్ళు తేలేస్తూ రైల్వే స్టేషన్‌ని వచ్చి చేరుకున్నాడు.  సమయం తొమ్మిది గంటల నలభై నిమిషాలు. సరిగ్గా తొమ్మిది గంటల యాభై నిమిషాలకు అటువైపుగా ఒక రైలు వస్తుంది.  అదే అదనుగా భావించాడు.

అతడు రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నాడు. రెండు ఫర్లాంగులు నడిచాడో లేదో, ఈలోపు ఎదురుగా రైలు రావడం కనిపించింది.  హమ్మయ్యా అని ఉత్సాహం పుంజుకున్నాడు. రైలుకు ఎదురుగా పరిగెడితే గనుక ఒకవేళ డ్రైవరు రైలు ఆపేందుకు ఏమైనా అవకాశం ఉంటుందేమోనని అప్పుడు కూడా అతడు అప్రమత్తంగా ఉన్నాడు. అందువలన అతడు పక్కకు జరిగే నిలబడ్డాడు.

సగం దూరం చేరుకోగానే రైలు వస్తున్నానహో అన్నట్టు కూత పెట్టింది. అతడు పగలబడి నవ్వాడు. అది దడదడమని బ్రిడ్జిని అధిగమించే లోపు, అతడికి ఒత్తిడి మరింత ఎక్కువైంది. మనసులో వందసార్లు పడిపోయాను అనుకున్నాడు.

ఇంజన్ అతడిని అధిగమించి వెళ్ళింది. డ్రైవర్ అతడిని చూసి  నవ్వుతూ చెయ్యి ఊపాడు. అగ్గి వేడి అతడిని దహించి వేసింది. కుక్క మొరుగుతుంది; కోడిపుంజు కూస్తోంది; అమ్మ అరుస్తుంది;  రాజం పరుగు పందానికి సన్నద్ధమైన వాడిలా కుడికాలు ముందుపెట్టి నిలబడ్డాడు.

“దు రోష్” (నువ్వు ఏడుస్తూ చావాలి)  అని దగ్గరగా అరుస్తూ  రెండు పెట్టెలకు మధ్య దూకాడు.

ఆసుపత్రి నుంచి శవాన్ని తీసుకెళ్ళమని రాత్రి పదింటికి కబురు అందింది. శవాన్ని నట్టింట్లోకి తీసుకురాకూడదు కనుక, వసారాలోనే ఒక కుర్చీ వేసి అందులో కూర్చోబెట్టారు. రైల్ డ్రైవర్ కాస్త సందేహంతో బ్రేక్ వేయడం వల్ల ప్రాణం పోయేంత తల వెనుక పెద్ద దెబ్బ తప్ప, రాజాం శరీరానికి అంతగా దెబ్బలేమి తగల్లేదు.  ఆసుపత్రి సిబ్బందులు కూడా  శుభ్రంగా పనిచేశారు. అందువల్ల రాజం శరీరం చూడ్డానికి మరీ అంత వికృతంగా అయితే ఏమీలేదు. మెడలో రోజామాలను ధరించి పెళ్ళి కొడుకులా బేషుగ్గా కూర్చొని ఉన్నాడు.

అమ్మ ఏడవకుండా ఉండగలదా?  కుమిలి కుమిలి ఏడ్చింది.  ఈ వీధి వాళ్ళు మాత్రమే కాదు,  పక్క వీధుల నుంచి కూడా జనం తండోపతండాలుగా వచ్చి నివాళి ఘటించారు.

పంకజం ఎదురింట్లోనే ఉంది. ఆమె తల్లిదండ్రులు ఎదురింట్లోకి  మకాం మార్చడం వలన, ఆమె తన అన్నదమ్ములతోపాటే ఉంటుంది.

“హయ్యా, తుజితో?” (ఏమేయ్, అతడిని నువ్వు వెళ్ళి చూడవా?)  అని అన్నయ్య అడిగాడు.

“చూడకుంటే ఏముందిలే? తింగరోడు!  పెళ్ళైన తర్వాత ఈ పని చేయకుండా ఉన్నాడే అంతవరకు సంతోషం” అని పంకజం కొంగుతో తన తలను కూడా కప్పుకుంది.

కుంభకోణంలో చలి మాత్రమే కాదు; దోమలు బెడద కూడా కాస్త ఎక్కువగానే ఉంది.

***

(ఈ కథ మధ్యలో వచ్చేభాష ‘సౌరాష్ట్ర’ భాష. గుజరాతి నుండి తమిళనాడుకు వలస వచ్చిన వారు దీనిని మాట్లాడతారు అని వినికిడి. ఇది గుజరాతీ, మరాఠి, తమిళ బాషల సమ్మేళనం అని విన్నాను)

మూలం : తమిళ కథ ‘పైత్తియక్కార పిళ్ళై’

ఎమ్.వి. వెంకట్రామ్

1920లో, కుంభకోణంలో ఎమ్.వి.వెంకట్రామ్ జన్మించారు. తన పదహారవ ఏటనే రచనా వ్యాసంగానికి నాంది పలికి 120 కి పైగా కథలు, 8 నవలలు, రెండు వ్యాస సంపుటలూ, 50 మంది జీవిత చరిత్రలు రచించారు. ఆకలిని ఎలుగెత్తి పాడిన రచయిత ఎమ్.వి.. జయమోహన్ 'అరం' కథ ఆయన జీవితంలోని సంఘటనల ఆధారంగానే రాయబడింది. తన చెవులు నవల ప్రపంచ నవలల సరసన చేర్చతగిన నవలగా తమిళ సాహిత్యకారులు కొనియాడుతారు. ఆ నవలకు గాను సాహిత్య అకాడమీ అందుకున్నారు.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *