ప్రజాబంధులో “బడదీదీ” నవశక్తిలో “దేవదాసు” “పరిణీత”లు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చాల ఆతురతతో చదివేవాణ్ణి. “చక్రపాణి” భాషాంతరీకరణం భాషాంతరీకరణంగా కన్పడక అసలు స్వతంత్రరచనగానే కన్పడేది. వారు తిరిగి పాంచజన్యమను పేర కొన్ని కథలను తర్జుమా చేశాక వాటిని కూడా చాల ఆతురతతో చదివాను.
“పిల్లి”లో, ఆకలిబాధచే మాడుతూ ఉన్నవారికి కష్టాలు; ధనవంతులకు, తిండికి లోటులేని వారికి గౌరవాలూ వస్తాయి. ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ధనవంతులు సమాజంపై తమ లాభాలకోసం విధించిన నిబంధనలనుల్లంఘించడమే మార్గమని “పిల్లి” ఉపన్యసిస్తుంది. “తిండిదొరకని సమాజోన్నతినాకెందుకు” అన్నది పిల్లి, దానికేకాదు ఏ మనిషికీ కూడా అవసరం లేదు. అసలు అది సమాజోన్నతికూడా కాదు !!
“సామ్యవాదం మంచిదని మేము ఒప్పుకుంటాము, కాని దానికి ఒక హద్దున్నది.” తమకు పైనున్న వారు తమ్ము సమానంగా చూడాలి. తాము తమకన్న క్రిందనున్న వారిని తమతో సమానంగా జూడరు. ఈ ధోరణిని వ్యక్తీకరిస్తూ ఉన్న ఒక చిన్న వ్యంగ్యం “కానీ కడగండ్లు.”
ప్రభుత్వాలు, ఉద్యోగస్తులు, “కుట్ర” భయంతో ఎంత నిరాధారంగా ప్రజలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు చేస్తారో “కుట్ర” వెల్లడిస్తూ ఉంది.
‘దేశద్రోహి’ తన సర్వస్వం దేశసేవలో ధారపోస్తాడు. తల్లికి తిండికూడ ఏర్పాటుచేయడు. కారాగారంలోపడి క్షయతో బయటపడతాడు. ఈతని త్యాగసేవలపై నాయకత్వం సంపాదించిన వ్యక్తి, ఇతనిని నిరసిస్తాడు. “దేశద్రోహి” అని అంటాడు. ప్రజలు ఈ వింత “దేశద్రోహి”ని కొట్టి చంపుతారు. ఈ చిన్నకథ ప్రస్తుతం మన దేశసేవకుల స్థితిని ఒక పర్యాయం కన్నులకు కట్టినట్లు తెలియచేస్తూ ఉంది. దేశానికి సర్వస్వం ధారపోసి పనిచేస్తూ ఉన్నవారికి, వారి కుటుంబాలకు, తగిన ఉపాధులు కల్పించడం, వారిని మరచిపోకుండడం ప్రజలు చేయవలసిన కనీసధర్మమని ఇది ఎలగెత్తిచాటుతూ ఉంది.
“మీరు – మేము” ప్రాచ్యదేశాలకు, పాశ్చాత్యదేశాలకు ఉన్నవనుకొనే భేదాలను తీసుకొని వ్యంగ్యంగా వ్రాయబడింది. మన దేశంలోని మూఢవిశ్వాసాలను, తీవ్రంగా ఎత్తిపొడుస్తూఉంది. ఈ ఎత్తిపొడుపులతో పౌరుషం తెచ్చుకొని, దేశస్థితి మార్చడానికి పాఠకులు నడుము కట్టుతారనుకుంటాను.
కాని ఈ కథలన్నిటిలోనూ పాఠకుల్ని, భారతీయుని ఎక్కువ సంతృప్తి పరచేది “కథ అడ్డంతిరిగితే.” కాని ఈ సంతృప్తి చేతకానివానికి మాత్రమే కలుగుతుంది.
భారతీయులు ఇంగ్లండుపై రాజ్యాధికారం చేస్తున్నారనుకోండి. అప్పుడు మనం వారిని ఇంగ్లీషువారు మనకు నేడు చూపుతున్న మార్గానవెళ్ళితే, ఇంగ్లీషువారిని ఏ విధంగా అవమానాలకు గురిచేయగలమో తెలియజేసే ఒక ఊహాచిత్రం. భారతీయులకెప్పుడూ ఇంగ్లండుపైగాని మరియే యితర దేశంపైగాని పెత్తనంవద్దు. వారిని మనం ప్రతీకారంకోసమని, నీచంగా చూడము. కాని ఊహాచిత్రంలో ప్రతి భారతీయుడు తన జీవితంలో ప్రతిఘట్టమందు ఇంగ్లీషువారు తన్ను ఏ విధంగా అవమానపరుస్తూ ఉందీ గుర్తించి స్వాతంత్య్ర పిపాసి అవుతాడని వ్యంగ్యంగా వ్రాయబడింది. ప్రతి భారతీయుడు దీనిని చదవాలి. ఆత్మగౌరవం కాపాడుకోవాలి. దాని కోసం స్వాతంత్య్రం సంపాదించుకోవాలి.
ఇలాంటి కథలు, బెంగాలీ భాషనుండీ అనువదించి ఇచ్చిన చక్రపాణికి ఆంధ్రులు కృతజ్ఞులు. కాని ఆంధ్రభాషలోనే ఇట్టి కథలు స్వతంత్రంగా ఎప్పటికి రచించడము.