హృదయంతో జీవించడం యెలాగో నేర్పించింది చలమైతే,మెదడుతో యెలా ఆలోచించాలో నేర్పిన వాడు కొడవటిగంటి. అందుకే కుటుంబరావు ని “బుధ్ధివాది” చలాన్ని “హృదయవాది” అంటారు. మానవస్వభావాన్ని కాచి వడబోసి కథలుగా తీర్చిదిద్ది మనకు అందించిన వాడు కొ.కు.
ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ విలువ కట్టలేనిది. .ఆయన రాసినన్ని కథలు ఇంకో తెలుగు రచయిత రాసినట్టు కనపడడు.శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు కూడా చాలా కథలు రాశారు గానీ ఈయన రాసినన్ని కాదు.
అన్ని కథలు రాశారు గదా తప్పా తాలూ వుంటాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే .ఏ కథకి ఆ కథే ప్రత్యేకంగా వుంటాయి.
దురాచారాలని ఖండిస్తూ,మూఢనమ్మకాలని వేళాకోళం చేస్తూ, మానవస్వభావాన్ని విశ్లేషిస్తూ ,హేతువాద దృక్పథంతో ఆయన చేసిన రచనలు ఆలోచనలని రేకెత్తించి,మనలోకి మనం తొంగి చూసుకునేటట్లు చేస్తాయి.
ప్రతి రచనకూ ఒక సామాజిక ప్రయోజనం వుండాలనీ,అది ఒక కాలాన్ని (పీరియడ్ ని రిప్రజంట్ చేయాలని)ప్రతిబింబించాలనీ కొ.కు తన అభిప్రాయంగా చెబుతారు.ఆయన రచనలన్నీ ఆ విలువలని పాటించాయి.
నేను మొట్టమొదటగా చదివిన కొడవటిగంటి కుటుంబరావు కథ “దయ్యం”.ఆ కథ నా మనసులో అలా ముద్రపడిపోయింది.ఆయన గొప్ప రచయితని నాకానాడు తెలియదు.నేనా కథ “యువ” లో చదివేనాటికి బహుశా నాకు ఏడెనిమిది యేళ్లు వుండి వుంటాయి..ఆ కథేమిటంటే తల్లిని కోల్పోయిన చిన్నపిల్ల తల్లిమీద బెంగపడి జ్వరం తెచ్చుకుని అన్నం నీళ్లూ కూడా మానుకుని చివరకు చనిపోతుంది.
చుట్టూ వున్నవాళ్లందరూ ఆ పిల్ల బెంగ గురించి పట్టించుకోకుండా,ఆ పిల్లకు దయ్యం పట్టిందని దానిని వదిలించే ప్రయత్నాలు చేస్తారు గానీ,దానిని ఒక మానసిక సమస్యగా గుర్తించరు.చివరికి ఆ పిల్ల చనిపోతే దయ్యమే తీసికెళ్లిపోయిందని వ్యాఖ్యానిస్తారు.ఈ కథ రాయడం వెనక ఆయన ఉద్దేశం నాకు ఆనాడు అర్థం కాకపోయినా నాజ్ఞాపకాల్లో అలా నిలిచిపోయింది ఆ రెండుపేజీల కథ. తిరిగి నేను పెద్దయ్యి ఆయన రచనలన్నీ చదువుకునేటప్పుడు,ఈ కథ వెదుక్కుని మళ్లీ చదివి అర్థం చేసుకున్నాను.
ఆయన కథల్లో “ఆదాయవ్యయాలు”అనే కథ చాలా ఇష్టం నాకు.ఒక మనిషి తాను చేసే ఖర్చుల గురించి ఆలోచిస్తూ తనని తను యెలా సమర్ధించుకుంటాడో,తన అవసరాలకోసం ఇతరులని యెలా ఉపయోగించుకుంటాడో,యెంత లౌక్యంగా జీవనం సాగిస్తాడో తెలిపే కథ.ఈ కథలో కొ.కు మానవ స్వభావాన్ని యక్స్ రే తీసిచూపించినట్టనిపిస్తుంది.
కొన్ని కొన్ని రచనల్లో ఆయన తన పాత్రల ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయాలు జీవన సూత్రాలుగా అనిపిస్తాయి.అప్పుడప్పుడూ నాకు వచ్చే సందేహాలకి కొ.కు కథల్లో సమాధానాలు దొరుకుతాయి.
“చెడిపోయిన మనిషి” కథలో ఒక పెద్దమనిషి తన కూతురు ప్రవర్తన నచ్చక ఆమె మీద అలిగి ఇంట్లోంచి బయటకు వచ్చి నీరసంతో పడిపోతాడు.ఒక లేడీ డాక్టరు సమయానికి చూసి రక్షించి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది.ఒక రోజు ఆమె తన స్నేహితుడితో చనువుగా వుండటం చూసిన ఈయన ఆమెను మనిషికి వుండవలసిన కట్టుబాట్ల గురించీ నీతీ అవినీతుల గురించీ ప్రశ్నిస్తాడు.దానికి ఆవిడ చెప్పిన సమాధానం”మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ,సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేటట్టు చూసుకోవడమే సరి అయిన ప్రవర్తన.మిగిలిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి”.దానితోఆయన పశ్చాత్తాపంతో తన కూతురు దగ్గరకు తిరిగి వెళతాడు
నిజంగా ఈ మాటలు నా జీవితంలో నాకు శిలాక్షరాల్లాగా నిలిచి ,అనేక సార్లు దిశానిర్దేశం చేశాయి.
“నా కథా రచన”అనే వ్యాసంలో కొ.కు యేమంటారంటే.తాను కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు ,కథలు రాయడం చాలా తేలిక అని నిరూపించడానికే కథలు రాసే వాణ్ణనీ,కథా శిల్పం పట్టుబడడం కోసమే చాలా వేగంగా,చాలా కథలు రాశాననీ.అయితే అవేమీ తనకి తృప్తి కలిగించలేదనీ ,కథకి ఒక ప్రయోజనం వుండాలని గ్రహించిన తర్వాత రాసిన వాటిల్లో “తాతయ్య” అనే కథ తనకి నచ్చిందనీ.
ఆ తర్వాత ఆయన అనేక సమస్యల మీద కథలు రాశారు.
కుల నిర్మూలన గురించి రాసిన కథలు “కులంలేని మనిషి,కులంగాడి అంత్యక్రియలు”.
అనాకారితనం గురించి రాసినవి “కురూపి,కురూపి భార్య”
స్త్రీ,పురుష సంబంధాల గురించీ,దాంపత్యజీవితంలో వుండే డొల్లతనం గురించీ ఇంకా యెన్నో విషయాల గురించి ఆయన కథలు రాశారు..
ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల పెళ్లి నుండీ అణ్వాయుధాల వరకూ ఆయన స్పృశించని సమస్య లేదు.
ఆయన కేవలం కథలే కాదు ,నవలలూ ,గల్పికలూ (ఇదిఒక ప్రత్యేకమైన, ఆయనే కనిపెట్టిన సాహితీ ప్రక్రియ అని గుర్తు. పేరు కూడా ఆయనే పెట్టారనుకుంటాను) ,నాటికలూ,డిటెక్టివ్ కథలూ కూడా రాశారు.ఇక ఆయన రాసిన వ్యాసాలయితే లెఖ్ఖేలేదు.అనేక విషయాల గురించి విస్త్రతంగా చర్చించారు ఆ వ్యాసాలలో.సాహిత్య వ్యాసాలు,సినిమా వ్యాసాలు,చరిత్ర వ్యాసాలు ,సంస్కృతి వ్యాసాలు,సైన్సు వ్యాసాలు,తాత్విక వ్యాసాలు,రాజకీయ వ్యాసాలు అని విభజించి వాల్యూములుగా ప్రచురింప బడ్డాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన యెంత సాహిత్య నిధిని సమకూర్చారో!ఆయన ఇతరులకి రాసిన లేఖలు కూడా ఆయన ఆలోచనా పధ్ధతిని తెలియజేస్తాయి.
ఆయన రాసిన నవలలు “అనుభవం,అరుణోదయం,వారసత్వం,చదువు,ప్రేమించిన మనిషి ,కురూపి,సవతి తల్లి,ఐశ్వర్యం,గడ్డురోజులు ,బెదిరిన మనుషులు,బ్రతుకు భయం” మొదలైనవి వివిధ సమస్యలను విశదంగా చూపెట్టినవే.
ముఖ్యంగా “చదువు” నవల ఆయనకు చాలా పేరు తెచ్చిపెట్టింది.ఎవరైనా కొ.కు పేరు చెబితే కోట్ చేసేది ఆ నవలనే.”అనుభవం”అద్భుతమైన నవల .అది ఆయన స్వీయచరిత్రేమో అనిపిస్తుంది.ఒక్కటని కాదు అన్నీ అన్నే
ఇక “బ్రతుకు భయం,బెదిరిన మనుషులు” లో చిత్రించిన సీతప్ప ఒక స్పెషల్ కేరక్టర్ .ప్రతీదానికీ భయపడుతూ,తోటి వారినికూడా భయపెడుతూ బతుకు దుర్భరంగా గడిపే మనిషి.ఇలాంటి వారు మన చుట్టుపక్కల చాలామంది కనపడతారు.కొ.కు ఈ పాత్ర గురించి యేమంటారంటే ఈ సీతప్ప గురించి కొన్నాళ్లు రాశాక,ఇక ఇతను నన్ను పట్టుకు వదిలేట్టు లేడని భయమేసి ఇంక రాయడం ఆపేశాను అని.
అయితే ఆయన రాసిన”నీకేం కావాలి” అనే నవల కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది నాకు.ఒక రకంగా ఇది కొ.కు రాసిన రొమాంటిక్ నవల.మామూలుగా ఇద్దరు యువతీ యువకుల మధ్య నడిచే రొమాన్స్ కాదది.ఒక మధ్య వయస్కుడికీ,ఒక వేశ్యకీ మధ్య నడిచే రొమాన్స్ .ఆ మధ్య వయస్కుడు ఆమెను కొంత సంస్కరించాలనుకుంటాడు. “కన్యాశుల్కం”లో మధురవాణి ఒక మాటంటుంది “సానిదానికైనా నీతి వుండొద్దా?” అని .డబ్బుకు ఒళ్లమ్ముకునే మనిషిలో నైనా ఒక ఆత్మగౌరవం వుంటుందనీ,ఆమెకు కూడా ఆత్మాభిమానమూ,స్థిరమైన అభిప్రాయాలూ ,అచ్చమైన ప్రేమా వుంటాయనీ, ఈ విలువల విషయంలో డబ్బు ఆమె దగ్గర యేమీ పనిచెయ్యదనీ నిరూపిస్తుంది ఈ నవలలో కథానాయకి కస్తూరి.చివరికి కథానాయకుడు ఆమె ను సంస్కరించే ఆలోచనకు స్వస్తి చెప్పి తానే ఆమె ప్రేమలో పడతాడని వేరే చెప్పక్కరలేదుగా!
అసలు కొ.కు ఈ నవల రాయడం వెనక చిన్న పిట్టకథ వుంది
.
ఏదో అమెరికన్ పత్రికలో పడ్డ “sally”అనే పెద్ద కథను చూపించి “ఇలాంటి కథను మన వాళ్లెవరైనా రాయగలరా” అన్నారట గోరా శాస్త్రి మన కొ.కు తో.
“ఇంతకన్నా బాగా రాయవచ్చునే “అన్నారటఈయన కొంచెం పొగరుగా.
“రాయి చూస్తాం” అన్నారట శాస్త్రి గారు.
కొ.కు ఆ రోజు ఇంటికి వెళ్లి ఈ నవల మొదలు పెట్టి ఒక్కరోజులో పూర్తి చేసి, మర్నాటికల్లా గోరాశాస్త్రి గారికి చూపెట్టారట.అది చదివిన గోరా శాస్త్రి “ఇది బాగానే వుంది ఒప్పుకుంటాను” అన్నారట .ఈ పెద్దకథ లేక నవలని భారతికి పంపితే నిరాకరించారట.
ఇదంతా చెబుతూ కొ.కు యేమంటారంటే ఇందులో కస్తూరి పాత్ర శాలీ పాత్రకేమీ తీసిపోదనీ,భారతి పత్రిక నిరాకరించినా సాటి రచయితలు కొంతమంది ఈ నవలని పొగిడటం తనకు ఆశ్చర్యం కలిగించిందనీ.
ఈ నవల “కస్తూరి” పేరుతో చిన్న పుస్తకంగా వెలువడితే చదివిన గుర్తునాకు.అయితే “యువ” పత్రికలోనూ ,కొ.కు.సంకలనాల్లోనూ ఇది “నీకేం కావాలి “పేరుతో ప్రచురించబడింది.
ఆయన “చందమామ” పత్రికలో దాదాపు ముఫ్ఫయి సంవత్సరాలు పని చేశారు.ఆ కాలమంతా ఆయన అందులో ప్రచురణకై వచ్చిన ప్రతి కథనీ నిశితంగా పరిశీలించేవారు .అది పిల్లల మనోవికాసానికి దోహదం చేసేలా వుందో లేదో నిర్ణయించడం ,అవసరమైతే ఎడిట్ చేయడం ,ఒకోసారి కథనంతా తిరగరాయడం కూడా చేసేవారు .కొన్ని కొన్ని పురాణ కథలని పిల్లలభాషలో రాసి సీరియల్ గా అందించేవారు .ఈ పనంతా చక్రపాణి గారి పర్యవేక్షణలోనే జరిగినప్పటికీ “చందమామ”ను తీర్చిదిద్దడంలో కొ.కు పాత్ర మరువలేనిది,ముఖ్యమైనది.ఆయన “చందమామ”లో తన పని యెలాంటిదంటే పహిల్వాన్ కోడిరామ్మూర్తి యేనుగును తన గుండెలమీద కెక్కించుకున్నంత కష్టమైనది అని కృష్ణాబాయి గారికి రాసిన లేఖలో చెప్పటం గమనార్హం.
సాహిత్యానికి ఒక ప్రయోజనం వుందని గుర్తెరిగి ,తాను రాసిన ప్రతి వాక్యమూ ఆలోచనాత్మకంగా వుండేట్టు రచనలు పండించిన వ్యక్తి కుటుంబరావు. కుటుంబరావు రచనలలో ఉద్వేగాల కంటే లాజిక్ ప్రధాన పాత్ర వహిస్తుంది. సూర్యోదయమైంది,ఆకాశం మనోహరంగా వుంది లాంటి ప్రకృతి వర్ణనలు యే రచన లోనూ కనపడకపోవడం ఆయన ప్రత్యేకత. మామూలుగా జన సామాన్యం మాట్లాడుకునే మాటలే వాడుతూ చిన్న చిన్న వాక్యాలలో యే ఆడంబరాలూ లేకుండా సూటిగా చెప్పినట్టున్నప్పటికీ,ఆయన వాక్యాలు అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. లోతైన అర్థం వున్న వాక్యాలు కాబట్టి చాలా సార్లు మళ్ళీ మళ్ళీ చదువు కోవాలిసి వస్తుంది.అనుకరణకి సాధ్యం కాని శైలి ఆయనది.ఎవరినైనా అనుకరించవచ్చు కానీ కుటుంబరావుని అనుకరించడం అసాధ్యం .అలా అనుకరించిన వారిని నేనింతవరకూ చూడలేదు.
ఆయన మనిషినీ ,జీవితాన్నీ అపరిమితంగా ప్రేమించినట్టు అనిపిస్తుంది ఆయన రచనలు చదువుతుంటే .చిన్నపిల్లల మనస్తత్వాన్నీ,సవతి తల్లుల కీ ,పిల్లలకీ వుండే అనుబంధాన్నీ లోకంలో ఈ విషయం పట్ల వున్న అపోహనీ అనేక కోణాలలో విశ్లేషిస్తూ రచనలు చేసిన వాడు తెలుగులో కుటుంబరావు తప్ప మరొకరున్నారని అనుకోను.
ఆయన రచనలని కూడా విమర్శించిన వారున్నారు.బుర్రా వెంకట సుబ్రహ్మణ్యంగారు(పారిస్ , జేబురుమాలు కథలు రాశారు)కొ.కు “కారుణ్యం” కథల సంపుటిలోని కథలను విమర్శించారు.కొ.కు ఈ విమర్శను తిప్పికొట్టారు మన తెలుగులో తన రచనలను విమర్శించేస్థాయి విమర్శకులు లేరన్నారు.తన కథలను తానే విమర్శించుకున్నారు.శిల్పం పట్టుబడటం కోసం పుంఖానుపుంఖాలుగా రచనలు చేయడం వలన కొన్నిరచనలలో తాను రాసిన విషయాలు సంఘ వ్యతిరేకమైన విషయాలను ప్రోత్సహించినట్టుగా తప్పు అర్థం కలిగించాయి పాఠకులకి అని బాధ పడ్డారు .
1980 ఆగస్టు 17వ తేదీ సాయంత్రం చనిపోయే అరగంట ముందు వరకూ ఆయన నిర్విరామంగా రాస్తూనే వున్నారు.ఆయన దస్తూరి చూడముచ్చటగా చిన్నచిన్న అక్షరాలతో దండ గుచ్చినట్టుగా వుంటుందనీ,యే విధమైన కొట్టివేతలూ,దిద్దుళ్లూ వుండవనీ అంటారు.ఆయనకి మంచం మీద బోర్లాపడుకుని రాయడం అలవాటట యెంత సేపయినా! ఆయనకు సంగీతం లో మంచి అభిరుచీ ,ప్రవేశం కూడా వున్నాయి.కర్ణాటక ,హిందూస్థానీ సంగీతాలు రెండూ సమానంగా ఇష్టపడేవారు.హార్మోనియమ్ ,దిల్ రుబా వాయించడం వచ్చు.ఆయన రచనలలో ప్రకృతి వర్ణనలు లేకపోయినా ఆయనకు తోటపని చాలా ఇష్టం,వారి ఇంటి పెరట్లో మొక్కల సంరక్షణ బాధ్యత స్వయంగా చూసుకునే వారట.
ఆయన చనిపోయినప్పుడు నేను గుంటూరులో మెడిసిన్ చదువుతున్నాను.ఆయన మరణ వార్త విని చాలా దిగులుపడ్డాను.ఆ మరుసటి రోజో యెప్పుడో ఒక నోటీసు మా కాలేజ్ లో కనపడింది.దాని సారాంశం తాలూకా ఆఫీసు దగ్గర కొ.కు సంస్మరణ సభ జరుగుతుందని.నేనొక స్నేహితురాలిని వెంటబెట్టుకుని తాలూకాఫీసు వెదుక్కుంటూ వెళ్లాను. ఆ రోజు వాతావరణం కాస్త చల్లగా చినుకులు పడేటట్టుగా వుంది.సభ ప్రారంభమైంది .ఒక పెద్దాయన పంచెకట్టుతో చేతిలో గొడుగు తో వచ్చాడు .కొంతమంది మాట్లాడాక ఈ గొడుగు మనిషి కూడా లేచి మైక్ దగ్గరకి వచ్చాడు .ఇంక ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు మేము మంత్ర ముగ్ధులమయ్యాము .ఏమి భాష అది మన తెలుగేనా ,మన తెలుగు పలుకుతుంటే ఇంత మధురంగా వుంటుందా !అనిపించింది.ఆయన కుటుంబరావు “కులంలేని మనిషి” గురించి మాట్లాడాడు .మాట్లాడటం అయిపోయాక గొడుగు చంకలో పెట్టుకుని మామూలుగా నడుచుకుంటూ జనసామాన్యంలో కలిసి పోయాడు.ఆయనే ఏలూరిపాటి అనంత రామయ్య .అప్పట్లో ఆయన గుంటూరులో యేదో కాలేజ్ లో బహుశా సంస్కృత కళాశాలలో అనుకుంటాను అధ్యాపకుడుగా పనిచేసేవారనుకుంటాను.ఎందుకో ఈ సంఘటన నాకు బాగా గుర్తుండిపోయింది.
కుటుంబరావు రచనలు ఈ నాటికి కూడా రిలవెంటే.ఈ తరం వాళ్లు కూడా ఆయన రచనలు చదవవలసిన అవసరం వుంది.ఆయన ఆనాడు యే సమస్యల గురించి రాశాడో అవన్నీ ఈ నాటికీ సమాజంలో అదే రూపంలోనో ,వేర్వేరు రూపాలలోనో వీరవిహారం చేస్తున్నాయి.
కులవివక్ష శాఖోపశాఖలుగా విస్తరించి విరాజిల్లుతోంది.ధనికులకీ ,పేదలకీ మధ్య దూరం ఈ నాడూ అలాగే వుంది.దురాచారాలూ,మూఢనమ్మకాలూ ,మూఢభక్తీ అప్పటికంటే పెరిగాయేమో అనిపిస్తోంది.వీటన్నిటితో పాటు తన రచనలలో ఆయన అప్పటి కాలాన్నీ,సంఘటనలనీ నిక్షేపించాడు ఒక రకంగా అది చరిత్రని దాఖలా పరచడమే.దాని కోసం కూడా చదవాలి ఆయన రచనలు.
కొ.కు సమగ్ర సాహిత్యం కేతు విశ్వనాథరెడ్డి గారి సారథ్యం లో ఆయన ముందు మాటతో,చక్కని అథోజ్ఞాపికలతో విశాలాంధ్ర వారు 1984 లో చాలా నాణ్యంగా ప్రచురించారు.ఆ తర్వాత చలసాని ప్రసాద్ గారూ,కృష్ణాబాయి గార్ల సమిష్టి కృషితో,మరిన్ని చేర్పులతో మళ్లీ సంపుటాలుగా ఆయన రచనలు వెలువడ్డాయి.చదువుకోవాలనుకున్న వారికి చదువుకోగలిగినంత కొ.కు సాహిత్యం అందుబాటులో వుంది
చలం,కుటుంబరావు వీరిద్దరి మార్గాలూ వేరయినా,వారి భావాలలో వైరుధ్యమున్నా వారి గమ్యం ఒకటే అది సమాజంలో కుళ్లును బయటపెట్టటం,పీడితుల పక్షాన నిలవడం.
అందుకే వీరిద్దరినీ నేను అమితంగా అభిమానిస్తాను.