మొదటి తరగతి రైలు పెట్టిలో ఎర్రని ముఖమల్ మెత్తపై ఒక అందమైన మహిళ సగం వాలి కూర్చుని ఉంది. గట్టిగా బిగుసుకున్న ఆమె వేళ్ళ మధ్య ఖరీదైన విసనకర్ర సుతారంగా ఊగుతోంది. ఆమె అందమైన ముక్కుమీదకు కళ్ళద్దాలు జారి ఉన్నాయి. సముద్రంలో నావలా ఆమె వక్షంమీద పతకం ఊగిసలాడుతోంది. ఆమె చాలా ఆందోళనగా ఉంది.
ఆమెకు ఎదురుగా వున్న సీట్లో ఆ ప్రాంతపు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కూర్చుని ఉన్నాడు. అతను అప్పుడే వెలుగులోకి వస్తున్న రచయిత కూడా. ఉన్నత వర్గాల వారి జీవితం గురించి అతను రాసే పెద్ద కథలు లేదా నవలికలు (అతను వాటిని అలాగే పిలుస్తాడు) ఆ ప్రాంతపు పత్రికలలో ప్రచురింపబడుతూ ఉంటాయి. అతను ఆమె మొహాన్ని తదేకంగా, పరీక్షగా చూస్తున్నాడు. చిక్కు ప్రశ్నలాంటి ఆమె మొహాన్ని అతను పరీక్షగా చూస్తూ, అందులో ద్యోతకమయ్యే ప్రతీ భావాన్నీ చదవటానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి ఎలాగైతేనేం అతను ఆమెను చదవగలిగాడు. ఆమె హృదయమనే అగాధపు లోతులను అతను తెలుసుకోగలిగాడు. యిప్పుడు ఆమె హృదయం అతనికి తెరిచిన పుస్తకం.
“ఓహ్, నీ మనసులోపల పొరల్లో ఏముందో నాకు అర్థం అయింది” అన్నాడతను ఆమె చేతిని మణికట్టు వద్ద ముద్దాడుతూ. “నీ సున్నితమైన మనస్సు స్వేచ్ఛ కోరుకుంటోంది. ఈ యిరుకు పంజరం నుంచి తప్పించుకుని, ఎగిరిపోవాలనుకుంటోంది. నీ పోరాటం చాలా భయంకరమైనది., తీవ్రమైనది. అయినా సరే, గుండె నిబ్బరం కోల్పోకు. చివరకు నువ్వే గెలుస్తావు. నిజంగా చెప్తున్నాను!”
“వోల్దెమార్! నా గురించి రాయవూ?” అంది ఆ అందమైన మహిళ విచారంగా నవ్వుతూ. “నా జీవితం ఎంతో వైవిధ్యభరితమైనది. చిత్రవిచిత్రమైన మలుపులతో నిండినది. అన్నిటికీ మించి నేను దుఃఖితురాలిని, దీనురాలిని. దోస్తోయెవస్కీ పుస్తకంలోని పుటలలో లాగ నేను ఒక అసంతృప్తురాలిని. నువ్వొక మనస్తత్వ శాస్త్రజ్ఞుడివి, మనం తిన్నగా ఒక గంట కూడా కలిసి ప్రయాణించలేదు. అప్పుడే నువ్వు నా హృదయపు లోతుల్లో ఏముందో కనిపెట్టేసావు.
“చెప్పు, చెప్పు! నాకు అంతా చెప్పు. నేను నిన్ను వేడుకుంటున్నాను. నాకు అంతా వివరంగా
చెప్పవూ?”
“సరే, విను మరి. మా నాన్న ఒక చిన్న గుమాస్తా. పేదవాడు. అతనిదెంతో మంచి మనస్సు, తెలివైనవాడే. కాదనను కానీ అతని పరిసరాలు, ఆ కాలమాన పరిస్థితులు… ఏం చెప్పేది? నీకు అర్థం అయ్యే ఉంటుంది. పాపం, మా నాన్నని నేను నిందించను. అతను త్రాగేవాడు, జూదం ఆడేవాడు, దానికోసం లంచాలు తీసుకునేవాడు. ఇక మా సంగతి చెప్పడానికేముంది? ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పేదరికం, అమ్మ పూట గడవడానికి కష్టాలు, గుర్తింపు లేని జీవితం…. అబ్బ, అదంతా గుర్తు చేసుకోవద్దు. నా దారి నేను చూసుకోవాల్సి వచ్చింది. బోర్డింగ్ స్కూల్ చదువులు ఎంత భయంకరంగా ఉంటాయో నీకు తెలియనిది కాదు. పనికిమాలిన నవలాపఠనం, యవ్వనారంభంలో చేసే తప్పులు, తొలిప్రేమ పిరికి పలకరింపు…. ఓహ్ అంతా ఎంత భయంకరం! ఆ ఊగిసలాటలు, జీవితంమీద, మనమీద మనం నమ్మకం కోల్పోవడం…. ఆ యమ యాతనలన్నీ ఏం చెప్పేది? నువ్వొక రచయితవి కదా. నీకు మా ఆడాళ్ళ గురించి తెలిసినదే. నువ్వు అంతా అర్ధం చేసుకోగలవు. దురదృష్టమేమంటే నాది చాలా తీవ్రమైన స్వభావం. నేను ఆనందంకోసం వెతికాను. ఆనందం ఏమిటి? నేను స్వేచ్ఛని కోరుకున్నాను. స్వేచ్ఛలోనే నా ఆనందం ఉందని నాకు అనిపించింది!”
“అందమైన మనిషి!” గొణిగాడు రచయిత, మరో మారు ఆమె చేతిని మణికట్టు వద్ద ముద్దాడుతూ “నేను ముద్దాడుతున్నది నిన్నుకాదు. మానవాళి బాధనూ, వేదననూ. నీకు రస్కాల్నికోవ్, అతని ముద్దూ జ్ఞాపకం ఉన్నాయి కదా!”
“అయ్యో, వోల్దెమార్, నేను గెలుపుకోసం, పేరు, ప్రతిష్ఠల కోసం ఎంత తాపత్రయ పడ్డానో తెలుసా? సిగ్గెందుకు? నేను అసాధారణమైన స్థితిని కాంక్షించాను. సాధారణ మహిళల కంటే భిన్నంగా, ఉన్నతంగా ఏదో సాధించాలని తాపత్రయ పడ్డాను. అదుగో, అప్పుడే… సరిగ్గా అప్పుడే…. నాకు అతను తారసపడ్డాడు. బాగా సంపన్నుడైన ముసలి సైన్యాధికారి, వోల్దెమార్ , దయచేసి నన్ను అర్థం చేసుకో. అది ఆత్మత్యాగం, కేవలం త్యాగం. వేరే ఏమీకాదు. పూర్తిగా త్యాగమే. నువ్వు అది అర్థం చేసుకోవాలి. నేను వేరే ఏమీ చెయ్యలేకపోయాను. నేను కుటుంబాన్ని మళ్ళీ సంపన్నం చెయ్యగలిగాను. యాత్రలు చెయ్యగలిగాను. ఎన్నో మంచి పనులు చెయ్యగలిగాను. అయినా సరే, అతని కౌగిలింతలు ఎంత అసహ్యకరంగా ఉండేవో నేను చెప్పలేను. నాకు వెగటు పుట్టేది. వాంతి వచ్చేది. అలా అయినా కూడా నేను అతని పట్ల నిజాయితీగానే ఉన్నాననుకో. ఆ రోజుల్లో అతను దేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కదా. కానీ కొన్ని క్షణాలు చాలా భయంకరంగా ఉండేవి. భరించరానివిగా ఉండేవి. నేను ఒకే ఒక్క ఆశతో జీవించేను. ఈ ముసలాయన యివాళ కాకపోతే రేపు చనిపోతాడు… అప్పుడు నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా జీవించొచ్చు….. నాకు నచ్చిన వ్యక్తికి నన్ను నేను అర్పించుకోవచ్చు…. సంతోషంగా ఉండొచ్చు. ఇదే ఆశతో బ్రతికాను. అలాంటి వ్యక్తి ఉన్నాడు. నేను యిష్టపడ్డ వ్యక్తి ఉన్నాడు. వోల్దెమార్, నిజంగానే ఉన్నాడు!”
ఆ అందమైన మహిళ మరింత వేగంగా విసనకర్రను ఊపింది. ఆమె మొహంలో దుఃఖం ద్యోతకమైంది. ఆమె కొనసాగించింది.
“చివరికి ఎలాగైతేనేం ఆ ముసలాడు చచ్చేడు. అతను నాకు కొంత ఆస్తి కూడా వదిలి వెళ్ళేడు. ఇక నేను స్వేచ్ఛా విహంగాన్ని. ఇది నా జీవితంలోకెల్లా ఆనందకరమైన సమయం, కాదూ వోల్దెమార్ ఆనందం నా కిటికీ తలుపులను తడుతోంది. నేను తలుపుతీసి దానిని లోనికి రానివ్వడమే తరువాయి. కానీ…. విను, వోల్దెమార్, దయచేసి విను, నేను నిన్ను వేడుకుంటాను. నాకు నచ్చినవాడికి నన్ను నేను అర్పించుకోవాల్సిన సమయం యిదే… అతని జీవిత సహచరిగా మారి, అతనికి సాయపడుతూ, అతని ఆదర్శాలను పాటిస్తూ, సంతోషంగా, విశ్రాంతిగా బతకాల్సిన సమయమిది – కానీ… కానీ…. మన జీవితాలు ఎంత తుచ్ఛమైనవి, హేయమైనవో కదా! ఇదంతా ఎంత నీచం! వోల్దెమార్, నేనెంత నికృష్టమైన దాన్నో కదా! ఎంత దౌర్భాగ్యం! ఎంత దురదృష్టం! మళ్ళీ నా దారిలో ఆటంకం ఏర్పడింది. మళ్ళీ నా సంతోషం నాకు అందకుండా సుదూరంగా వెళ్ళిపోయిందనిపిస్తోంది నాకు. అయ్యో, ఎంత బాధ, ఎంతటి వేదన…. నీకిదంతా అర్థమైతే బాగుండును కదా!”
“కానీ, కానీ యిప్పుడు నీ దారిలో వున్న ఆటంకం ఏమిటి? దయచేసి నాకు చెప్పు, ఏమిటది?”
“ఇంకొక సంపన్నుడైన ముసలి సైన్యాధికారి….”
విరిగిన విసనకర్ర ఆ అందమైన మొహాన్ని దాస్తోంది. రచయిత తన చేతిమీద తన తల ఆన్చుకున్నాడు. అతని ఆలోచనలు – ముడిపడ్డ భృకుటి…. అతను ఒక అసలు సిసలైన మానసిక శాస్త్రవేత్తలా ఆలోచించసాగాడు. కిటికీ తెరలు అస్తమిస్తున్న సూర్యకాంతి వలన ఎర్రబడుతుండగా యింజన్ కూతపెడుతూ పరుగెడుతోంది.
* * *