చీనా కవి దుఫు కవితలు

1.శ్వేతాశ్వం

—---------


ఈశాన్యం నుంచి

దౌడు తీసుకొచ్చింది

ఓ శ్వేతాశ్వం.


కాలి జీనుకి

గుచ్చుకొని రెండు బాణాలు..


పాపం..రౌతు !

అతని కథ ఎవరు చెపుతారు..?


అర్థరాత్రి వేళ

అతని దళాధిపతి

ఎలా పోరాడాడో..ఎలా గాయపడ్డాడో..

ఎలా మరణించాడో..


ఈ పోరు వల్ల

ఎంతోమంది అమరులయ్యారు.


నా కన్నీళ్ళు ఆగడం లేదు..

నేను విలపిస్తూ వున్నాను.2.వెన్నెల రాత్రి

—------------


ఈ రాత్రి

ఈ వెన్నెలలో

ఇంట్లో కిటికీ దగ్గర

నా భార్య ఒంటరిగా వుంది.


నా పిల్లల గురించిన ఆలోచన

తట్టుకోలేక పోతున్నాను.


ఇంటికి నేనెందుకు రాలేకపోతున్నానో

అర్థం చేసుకోలేని పసిప్రాయం వారిది.


ఈ పొగమంచులో

ఆమె కురులు తడిబారి వుంటాయి.

ఈ జాబిలి వెలుగులో

ఆమె చేతులు వడలిపోయి వుంటాయి.


తెరలు తొలిగి మేమిద్దరం

ఒక దగ్గరయినప్పుడు

మా ముఖాల మీద

కారే కన్నీటి చారికల్ని

ఈ వెన్నెల మాపగలదా..?

One thought on “చీనా కవి దుఫు కవితలు

  1. యుద్ధంలో వున్న సైనికుని మానసిక స్థితిని హృద్యంగా చెప్పిన కవితలు. మీ అనువాదం చాలా బాగుంటుంది. అభినందనలు సర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *