కుటుంబ సంబంధాలలోని అతి సున్నితమూ, సంక్లిష్టమూ కూడా అయిన అంశాలను ఆసక్తికరంగా చెప్పిన సినిమా

“నన్ను హైదరాబాద్ దాకా దిగబెట్టి వెంటనే వచ్చేద్దురు గాని ,”

” కుదరదు,లీవ్ దొరకదు.”

” ఒంటరిగా ట్రెయిన్లో ప్రయాణం చెయ్యటం నాకు భయమని మీకు తెలుసుగా,” ఆమె కళ్ళలో నిండుతున్న నీళ్ళు చూస్తే తెలుస్తుంది, ఎంత భయమో!

కానీ, అతడు ఆఫీసు పనిలో బిజీ. చూట్టానికి టైం లేదు.

అస్సలు కుదరదు . వీలయితే వచ్చేవాణ్ణి గా, ” లాప్ టాప్ లోంచి తలెత్తి చూసేంత టైం కూడా లేదు.

అతణ్ణింకా విసిగించలేక కన్నీళ్ళు కళ్ళలోనే ఆగిపోయాయి.

ఔను. నాందేడ్ నుంచి హైదరాబాద్ దాకా ట్రెయిన్లో వెళ్ళటంలో ఎవరయినా భయపడేందుకు ఏముందని?కానీ, ఆమె స్థితి అందరిలాంటిది కాదు, చాలా ప్రత్యేకం.

ఒంటరిగా రైలెక్కితే చాలు _ గుండె రైలుకన్నా వేగంగా కొట్టుకుంటుంది, చెమటలు కారిపోతాయి, గొంతెండిపోయి కళ్ళు తిరుగుతాయి, బుర్ర బ్లాంక్ అయిపోతుంది, ఏ క్షణమైనా స్ప్రుహ తప్పిపోవచ్చు.

పానిక్ అటాక్!

కారణం చిన్నదే! చెబితే సిల్లీగా కూడా కనబడొచ్చు.

ఎప్పుడో పసితనంలో నాన్నతోబాటు రైలు ప్రయాణం.

ఏదో స్టేషన్లో దిగాడాయన, సిగిరెట్ కాల్చుకునేందుకు. రైలు కదిలింది. దొరికిన కంపార్ట్ మెంట్ లో ఎక్కేశాడు.

పాప భయంతో వణికిపోతోంది. పక్క ప్రయాణికుల ప్రశ్నలు , ఓదార్పులు! పాపకు మరింత భయంతో మతి పోతోంది.

ఇంతలో నాన్న వచ్చేశాడు.మధ్యలో గడిచిన సమయం ఎంతో లేదు _ పావుగంటే! అది సరిపోయింది, ఆమె మనసులో శాశ్వతంగా ఒక పీడకలను ముద్రించటానికి. ఒంటరిగా రైలెక్కినప్పుడల్లా అది ప్రత్యక్షమవుతూనే ఉంది.

జీవితంలో ఏ సమయంలోనో ఎదురయిన కొన్ని అనుభవాలు _ నిమిషాలో, క్షణాలో మాత్రమే కావచ్చు, అవి తీవ్రమైన దిగుళ్ళుగా, ఫోబియాలుగా మారి జీవితాంతం వెంటాడతాయని; దారుణమైన శారీరక , మానసిక రుగ్మతలుగా మారి ప్రాణాలే తీయవచ్చని మనలో ఎందరం గమనిస్తున్నాం? బాధితులను చులకన చెయ్యకుండా, చిరాకు పడకుండా, పిచ్చివాళ్ళనే ముద్రలు వెయ్యకుండా మనసులో మాట పంచుకునేందుకు కాస్త చోటు కల్పిస్తున్నాం?

చాలా కష్టం! సంసారాల్లో, భార్యాభర్తలనే మూసల్లో ఇరుక్కున్న మనుషుల నడుమ మరింత అసాధ్యం!

8ఎఎం మెట్రో అనే ఈ సినిమాలో ఇరావతి వెదుక్కున్నది కూడా అలాంటి కాసింత స్పేస్ కోసమే.

ఆమె ప్రపంచమే చాలా చిన్నది. దానికి కేంద్రం ఆమె ఎంతో ప్రేమించే,విశ్వసించే, మానసికంగా ఆధారపడే భర్త.

తన అనుభవాలు ,భయాలు, ఆసక్తులు అతనితో పంచుకోవాలని ఆమె తపన. అలా అతనికి మరింత సన్నిహితం కావాలని, మనసు తేలిక పరచుకునే మోరల్ సపోర్ట్ పొందాలనీ ప్రయత్నం.

పెద్ద కోరికలేమీ కావు, కానీ ప్రయత్నించిన ప్రతిసారీ నిరాశ!

కారణం _ వాళ్ళు భార్యాభర్తలు కావటమే!

అలాగని ఉమేష్ చెడ్డవాడేమీ కాదు. అధికారం చెలాయించే పెత్తందారీ భర్త అసలే కాదు. కష్టపడి ఉద్యోగం చేస్తాడు.దురలవాట్లు లేవు. భార్యాపిల్లలను ఇష్టంగా, బాధ్యతగా చూసుకుంటాడు. ఆమె పుట్టింటి వాళ్ళ కష్టాల్లో కన్సర్న్ చూపుతాడు. ఒక్కమాటలో _ ఆదర్శవంతమైన భర్త. అందుకే తమది ప్రేమ పెళ్ళి కాకున్నా, పెళ్ళయ్యాక ప్రేమలో పడిపోయానంటుంది ఇరా.అతడి గురించి ఇష్టంగా, గౌరవంగా చెబుతుంది ఎవరితోనైనా.

కానీ, ఆమె అతణ్ణి భర్తగానే కాక, స్నేహితుడిగా కూడా కోరుకుంటోంది. అరమరికలు లేని ఓ సోల్ మేట్ ని చూడాలనుకుంటోంది.

ఆమె భాష అతడికి అర్థమే కాదో, అర్థం చేసుకునే సమయమే లేదో కానీ ఆమె లోలోపల ఒంటరితనం గడ్డకడుతోంది.

దాన్ని కరిగించే చోటు అపరిచితుడైన సహప్రయాణికుడి దగ్గర అనూహ్యంగా దొరికింది. ప్రీతమ్ ప్రత్యేకమైన మనిషేమీ కాదు. మామూలు ఉద్యోగి. నలుగురిలో కలవలేని ఇంట్రొవర్ట్.

సాహిత్యంపై ఆసక్తి ఒక్కటే అదనపు అర్హత.

భర్త పాత్రలో ఉన్నన్నాళ్ళూ అతడిదీ ఉమేష్ తత్వమే.

భార్యాపిల్లలపై బోలెడంత ప్రేమ. కానీ తన సమయాన్ని గడపటానికి ప్రాధాన్యం పుస్తకాలకే. అతని సామీప్యాన్ని కోరుకుని దగ్గరకు వచ్చినప్పుడల్లా మృదుల చిన్నబుచ్చుకునే వెనక్కు తగ్గుతుంది. పిల్లలు నిద్రపోయాక ముద్దాడటానికి తప్ప వాళ్ళ ఆటపాటల సమయంలో అతడు పుస్తకాల్లో మునిగి ఉంటాడు. ” వీళ్ళను ఎంత ప్రేమించి ఉండాల్సింది? వీళ్ళనుండి ఎంత ప్రేమను పొంది ఉండాల్సింది?” అని విలపించే నాటికి జీవితమే చేజారిపోయింది.

భార్యాభర్తల నడుమ స్వార్థాలతో, ద్వేషాలతో ధ్వంసమయిపోయే సంసారాల గురించి ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈ సినిమాలో జంటల సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి?

స్త్రీపురుషులు కలిసి బతికే యూనిట్ లో భౌతికమైన అవసరాలు, బాధ్యతలేగాక మానసికమైన అవసరాలుంటాయని గుర్తించకపోవటం. అలా గుర్తించాలన్న స్ప్రుహకే చోటివ్వని విధంగా వాళ్ళ పాత్రలు తయారయిపోయి ఉండటం. ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తులను గ్రాంటెడ్ గా తీసుకోవటం. ఒకరికొకరు ఆంతరికమైన స్పేస్ ను కేటాయించాలన్న సున్నితత్వం లోపించటం. ఒకరికొకరు “అలవాటుపడి” బతికెయ్యటం. జంటలోని ఇద్దరూ ఇలాగే బతికెయ్యగలిగితే సమస్యే లేదు. ఏ ఒక్కరో ఆ రొటీన్ లో ఇమడకపోతే కథ మలుపు తిరుగుతుంది. మనసు కోరుకునే స్నేహాన్ని ఇంటి వెలుపల వెదుక్కోవటం మొదలవుతుంది. అది కేవలం మానసికమైనదే కావచ్చు. కానీ ఆపోజిట్ సెక్స్ నడుమ ఏర్పడినప్పుడు సమాజం నుండి ఆమోదం దొరకదు. ఆ ‘ సమాజం’ లో తన భర్త/ భార్య కూడా భాగమేనన్న ఎరుక ఆ వ్యక్తులలో గిల్ట్ కు కారణమవుతుంది. ఇరా లో ఏర్పడిన అపరాధ భావన, ఆమె భర్తలో సందేహం వాళ్ళ జీవితాల్లో కొత్త సమస్యలను సృష్టిస్తాయా? లోపించిన అవగాహనను కల్పిస్తాయా? అనే ప్రశ్నను ఓపెన్ ఎండెడ్ గా వదలటం ద్వారా ఈ చర్చకు మరింత విస్తృతిని తెచ్చింది సినిమా.

మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ‘అందమైన జీవితం’ ఆధారంగా రాజ్ రాచకొండ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలుగా వచ్చిన హిందీ చిత్రం 8AM METRO లో చెప్పుకోదగిన అంశాలు చాలానే ఉన్నాయి.

హైదరాబాద్ లోని ఆహ్లాదకరమైన పార్శ్వాన్ని, గుల్జార్ గీతాల తాత్వికతను చక్కగా ఉపయోగించుకున్నారు. సినిమాకు, సాహిత్యానికి సంబంధం తెగిపోతోందని బెంగపడే వాళ్ళకు దేశ, విదేశీ రచయితల ప్రస్తావన ఒక ఊరట.

సినిమాకు అనుగుణంగా కథను తీర్చటంలో తెలుగు కథకులు వెంకట్ సిద్దారెడ్డి, డా. భారతి (గీతాంజలి)పేర్లు టైటిల్స్ లో కనబడటం మనకు మరికాస్త దగ్గరతనాన్ని ఇస్తుంది.

కుటుంబ సంబంధాలలోని అతి సున్నితమూ, సంక్లిష్టమూ కూడా అయిన అంశాలను ఆసక్తికరంగా చెప్పిన ఈ సినిమా zee5 లో ఉంది.

May be an image of 2 people and text that says "ኔ &n Α.Μ. Μ METRO M PREMIERES 10 MAY ZEE5 WATCH FOR FREE"

Kathyayani S

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *