నేను మా ప్రకాశం జిల్లా అద్దంకి హైస్కూలు/కాలేజి (ఇంటర్) చదివే రోజుల్లో తీరిక దొరికినప్పుడల్లా శాఖా గ్రంధాలయంలో గడిపేవాడిని. అందరిలాగే నాకూ తెలుగు నవలలు, పత్రికలు, అనువాద సాహిత్యం లైబ్రరీలోనే పరిచయమయ్యాయి. హైస్కూలు అంటే తెలిసీ తెలియని వయసు. ఆ వయసులోనే కనిపించిన అనువాద పుస్తకమల్లా చదివేవాడిని. ఆరోజుల్లో ఆ వయసుకు పుస్తక రచయిత ఎవరు? అనువాదకుడు ఎవరు? వంటివి చూసేవాడిని. చదవడమొక్కటే చేసేపని. అంత చిన్న వయసులో పరిచయమైంది అనువాద కథల విపుల మాస పత్రిక. ‘చదువుతున్నది మంచి సాహిత్యం’ అనే ఎరుక లేకుండా ప్రతినెలా విపుల రాగానే అసాంతం అన్ని కథలు చదివేసేవాడిని. విపుల నా భావనా ప్రపంచాన్ని విస్తృత పరిచింది. కథల పట్ల నా ఎరుకని పెంచింది.
ఇటీవల పరేశ్ దోశీ ‘వరద గుడి’ అనువాద కథల పుస్తకం చూసి అందులోని కథలన్నీ ఒకప్పుడు విపులలో వచ్చిన అనువాద కథలేనని తెలిసి ఆనందం కలిగింది. అందుకు కారణం ఆయా కథల విలువ.
కథా వస్తువు ఎంపిక రచయిత వ్యక్తిత్వం నుంచి పుడుతుంది. అలానే అనువాదకుడి వ్యక్తిత్వం కూడా. ఈ పుస్తకంలోని కథల్లో ఉన్న వైవిధ్యం, ప్రాపంచిక దృక్పథం ఇప్పటికీ పరేశ్ దోశీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంటాయి. ఆయన వ్యక్తిగతంగా, ముఖాముఖీ నాకు పెద్దగా పరిచయంలేదు. ఆయన రాసినవి చదవటం తప్ప ఎదురుపడింది ఎప్పుడూ లేదు. కథా వస్తువులు ఎంత వైవిధ్యంగా ఉండొచ్చో, సున్నితమైన మానవ స్పందలను ఎంత సరళంగా, సుందరంగా చెప్పొచ్చో ఇందులోని అనేక భాషల భారతీయ కథా రచయితల కథలు తెలియజేస్తాయి. అనువాదం అంటేనే స్థానికంగా మనది కానిది. పరదేశ, భాషా, సంస్కృతీ సాహిత్యాలలో తెలియని ఆకర్షణ ఉంటుంది. అందులోని వైవిధ్యాన్ని చదివి చదివి ఆనందించగలగడం మంచి అభిరుచి.
ఇందులోని కథలు విడమర్చి చెప్పడం కథల్ని పలచన చేయడమే అవుతుంది. విభిన్నమైన కథా వస్తువులే కాదు, కథల్లోని కొన్ని వాక్యాలు కూడా మనల్ని అక్కడక్కడా ఉలిక్కిపడేట్లు చేస్తాయి.
యవ్వనంలో హృదయాన్ని అర్పించి ఆ జ్ఞాపకాలనే జీవితాంతం మోసే అభాగినిలు (ఓ జేబురుమాల, ఓ ఉంగరం, ఓ జల్లెడ), నమ్మి, శరీరార్పణ చేసి చివరికి మోసపోవడం (సమాధి అయిన ఆశలు), ప్రతిరోజూ రాత్రి గంటా రెండుగంటల పాటు కళ్ళమ్మట నీళ్లు కారే జబ్బున్న బ్రోతల్ హౌస్ ఓనర్ (అపరిచిత నేత్రాలు), రిటైరయిన మాష్టారికి జపాన్స్కూ పెన్ను బహుకరించిన స్కూలు కుర్రాడి సంశయం (జపాన్ పెన్ను), బొమ్మలు కొనడానికి వచ్చి కేవలం అతడిని ప్రతిభని పొగిడి ఏదీ కొనకొండా వెళ్లిపోయే కళాప్రేమికులు (కళాసేవ). లాంటి వైవిధ్యమైన కథలు ఇందులో ఆద్యంతం ఉన్నాయి. ఏ ఒక్క కథా తీసేయదగింది కాదు.
ఇవన్నీ అమృతాప్రీతం, అమృతలాల్ నాగర్, యశ్ పాల్, కిషన్ చందర్, అనితా దేశాయ్, పన్నాలాల్ పటేల్, కుందనికా కపాడియా, కమలా దాస్, వైకం మహమ్మద్ బషీర్, పొట్టెక్కాట్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమేంద్ర మిత్ర, ఆశాపూర్ణాదేవి వంటి ప్రసిద్ధ రచయితలు రాసిన కథలు.
మంచి సాహిత్య అభిరుచి ఉన్న పాఠకులు చదవాల్సిన సిసలైన అనువాద కథల పుస్తకం ఇది.
