ఇతర రచలకంటే కథారచన చాలా తేలిక పనల్లే కనిపిస్తుంది చప్పున చూసేవాడికి. ప్రస్తుతం మన దేశంలో రాతగాళ్ళను తీసుకుంటే పద్యాలూ, నాటకాలూ మొదలైనవి రాసేవాళ్ళ కంటే కథలు రాసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దీనికంతటికీ ఒకటే కారణం కథలు ఎట్లా పడితే అట్లా రాయవచ్చుననే ఒక దురభిప్రాయం.
దీన్ని ఎవరో ఒకరు ప్రకటించాలి, ఇది నలుగురిచేతా చదవబడాలి అనుకుని మరీ కలం పట్టుకునే వాడేది రాయటం మొదలుపెట్టినా కొన్ని నియమాలూ కట్టుబాట్లూ అడ్డు పడతై. అవి లేకుండా రచనే లేదు.
అయితే ఏమిటంటే కథారచన ఎంత భిన్నంగా ఉందంటే, దాన్ని నియమబద్ధం చెయ్యబూనటం సులసాధ్యమైన పని కాదు. అటువంటిదింతవరకు జరగలేదు. కట్టుబాట్లకు లోబడటం ఇష్టంలేక, ఏదో ఒకటి రాయాలని ఉండి రాయబూనిన వారికి, శారదాబిల్లు తప్పించుకోదలిచిన వారికి బందరు ఫ్రెంచి పేటా నిజాం రాష్ట్రమూ దొరికినట్టు, కథారచన ఒకటి తేరగా ఉన్నది. పత్రికా సంపాదకులు కూడా పెద్ద చిక్కులోనే ఉన్నట్టున్నారు. ప్రకటనార్థం వచ్చిన కథల్లో వేటిని స్వీకరించాలి? వేటిని తోసెయ్యాలి? తోసేసిన వాటిని ఏ వంకపెట్టి తోసెయ్యాలి? ‘నాకిది బాగుండలేదు. దీన్ని నే ప్రకటించను!’ అనవచ్చుననుకోండి; సొంత అభిరుచులమీద ఆధారపడటం తప్ప గత్యంతరం లేదా? వాదించలేనివాడు ‘నా ఇష్టం! ‘ అన్నట్టు, కేవలం’ ఇది నాకు బాగుండలేదు’ అనటంతోనే పోనివ్వకుండానే, అనేక మార్గాల కథలు స్వీకరించటం, నిరాకరించటం జరుగుతున్నది. కథావస్తువు సంపాదకుడికి ఆమోదకరంగా ఉండదు; కథలో కాంగ్రెసు సంస్థ హేళన చెయ్యబడటమో, స్వేచ్ఛానురాగం ప్రశంసించబడటమో, సనాతన ధర్మం సమర్థించబడటమో, సంపాదకుడి బుద్ధికి దారుణంగా తోచే సందర్భం ఏదో కలుగుతుంది. లేదూ. భాష దుర్భరంగా తోస్తుంది; రచన నిండా పాసాణాల వంటి సమాసాలుండటమో, వాడుక భాషలోనే మరీ గ్రామ్యమైన – బొత్తిగా వ్యాకరణంలేని – రచన కావటమో జరుగుతుంది. లేదా, కథ అచ్చుపుటలు ముఫైమూడు ఆక్రమించటమో, మొదటి పేజీకే చివరల్లా రాకపోవటమో అవుతుంది. ఇంతకుమించి సంపాదకుడి చేతిలో ఆయుధం లేదు. ఇక చదివేవాడి సంగతీ అంతే. ఎవడి అభిరుచిని బట్టి వాడు ఫలానా కథ బాగుందనీ, ఫలాని కథ బాగాలేదనీ, తన అజ్ఞానాన్ని బయటపెట్టటానికి జంకని ధైర్యస్తుడయితే తనకొక కథ అర్థం కాలేదనీ అన్నాడు. అంతతో సరి. అప్పుడప్పుడూ చదినేవాడి అభిరుచిని ధిక్కరిస్తూ మునిమాణిక్యం వారి కాంతం కథలంటివి బయలుదేరతై. అందరికీ బాగుండేవి. అటువంటి వాటిలో బాగేమిటో అర్థం చేసుకుందామని చదివేవాడు బలహీనంగా ప్రయత్నం చేసి, నేనెక్కడో రాసినట్టు – కాంతం కథలో కొంచెం ‘ఇది’ ఉందని తేల్చుకుంటాడు. వాటిలో ఉన్న ఇది ఇతర కథ ఎందుకులేదో, అది లేని కథలెందుకు పత్రికల్లో కెక్కాలో పట్టదు. కథలకు ఏ నియమాలుండాలనే విషయాన్ని గురించి రాసే వాళ్ళూ, సంపాదకులూ, చదివేవాళ్ళూ అజ్ఞానంలో ఉండటం శోచనీయమైన విషయమే. కాని నియమాలు ఏర్పాటు చేసినంత మాత్రాన ఏం జరిగింది? వాటన్నిటినీ పాటిస్తూ ఎందుకూ కొరగాన్ని రాయవచ్చును; వాటన్నిటినీ ధిక్కరించి చక్కని పద్యాలు రాయవచ్చును. ఈ నియమాలు అసమర్ధుడికి సహాయం చెయ్యలేవు, కాని సమర్ధుడికి అడ్డం వస్తాయి. వాటి పనే అది. రాయగల వాడికి స్వేచ్ఛ ఎంత ఉపకరిస్తుందో రాయలేని వాడికది అంత దుర్వినియోగానికి ఉపకరిస్తుంది. కనక ఎటొచ్చీ జరగవలసిందేమిటంటే పత్రికా సంపాదకులు విడవకుండా రకరకాల కథలు చదువుతూండటమే. మంచి కథకూ చెడ్డ కథకూ వ్యత్యాసం కనుక్కోటానికంత కన్నా మంచి అభ్యాసం లేదు.అక్కడక్కడ కథా రచనను తృణీకారభావంతో చూసే సంపాదకులున్నట్టు నా కనుమానం ఉంది. వారు వారి పత్రికల్లో కథలు ప్రకటించడమే మానివెయ్యటం బహు యోగ్యమైన పని. మంచి కథను వారు గుర్తించటం జరగని పని.
కథల్లో అనేక జాతులుంటై. కథా రచన కళగా చూసుకొని రాసే వారున్నారు. ప్రచారార్ధం కథలు రాసే వారున్నారు. తమ అక్కర నిమిత్తం – గిట్టని వాళ్ళని తిట్టి ఏడిపించుదామని – కథలు రాసి ఆత్మవంచనా పరవంచనా చేసుకునే వారున్నారు. కేవలం ఉత్సాహం కొద్దీ రాసి ఇతరులను సంతోషపెడదామని కథలు రాసే వారున్నారు.
కళాసహితమైన కథా రచన ఇతర కళలతో పాటు స్థానం పొందుతుంది. ప్రచారార్ధం రాయబడే కథలను చదివేటప్పుడు ఏమరుపాటున ఉండరాదు. టాల్ స్టాయ్ వంటి రాతగాడు ఒక్క క్షణంలో మన కళ్ళలో దుమ్ముకొట్టి మనల్ని తన వెంట ఈడ్చుకుపోగలడు. అటువంటి వాడి చేతులో చిక్కామో, మన దేశ పరిస్థితులు రష్యాలో మాదిరిగానే ఉన్నావనీ, బుర్రతో పని చెయ్యటమంటూ లేనే లేదనీ, కూలినాలి చేసుకు బతికే వాళ్ళ హృదయాలు మన హృదయాలకంటె స్వతస్సిద్ధంగా పరిశుద్ధమైనవనీ అవలీలగా నమ్మించగలడు. కథల ద్వారా పగ తీర్చుకోవటంలో గల అవినీతిని గురించి చెప్పేదేమీ లేదు. ఉత్సాహంతో రాసే కథలు సరదాకు చదవదగినవే కాని వాటికి సారస్వతంలో తావు దొరకటం అసంభవం.
నూటికీ కోటికీ ఒక చిత్రం జరుగుతుంది. ఏ ప్రచారార్ధం రాయబడ్డ కథో, లేక పగ తీర్చుకోటానికి రాయబడ్డ కథో ఇతర కారణాల వల్ల అత్యద్భుతంగా తయారయి సారస్వతంలో స్థానం పొందుతుంది. ఒక నిజమైన మూఢుణ్ణి తీసుకుని, రచనలో వెకిలితనం లేకుండా – నేను ‘పెళ్లినాడిచ్చిన కట్నం’ అన్న కథ రాసినట్టు కాకుండా -ఆ మూఢుణ్ణి జయప్రదంగా కథానాయకుణ్ణి చేశాడు టాల్ స్టాయ్ . ఇది ఎంత కష్టమో ప్రయత్నించి చూస్తే తెలుస్తుంది. అటువంటి కథ ఇంకొకటి రాయటానికి మరో టాల్ స్టాయ్ పుట్టాలి. ఆ మహాశయుడి ప్రచారోద్దేశం అవతలపెట్టి ఆ కథకు నేను ఉత్తమ స్థానం ఇస్తాను.ఆ విధంగానే లార్డ్ చెస్టర్ ఫీల్డ్ ను బహిరంగ లేఖ ద్వారా అనవసరంగా (అందుకేమీ సందేహం అవసరం లేదు) తిట్టి,ఆ ఉత్తరానికి ఘనత సంపాదించాడు డాక్టర్ జాన్సన్. ఆ ఉత్తరం యొక్క ఘనత జాన్సన్ యొక్క దూషణయందు గల న్యాయం వల్ల రాలేదు, దాన్ని రచించటంలో జాన్సన్ చూపిన నిపుణత వల్ల కలిగింది.
ఎవడన్నా అమానుషంగా ప్రవర్తిస్తే ‘వీడు మనిషి కాదురా!’ అని ఏ ఉద్దేశంతో అంటామో, ఆ ఉద్దేశంతోనే ఒక నాటకాన్ని నాటకం కాదనీ, కథను కథ కాదనీ అనవచ్చును. మనిషిని మనిషి కాదనేటప్పుడు మనిషి ఒక విధంగా ప్రవర్తిస్తాడని ఒక అస్పష్టమైన జ్ఞానం ఉంటుంది. అట్లాగే కథలను గురించీ చూడదగినది కాకపోతే నాటకం కాదు, చెప్పదగినది (వినదగినది) కాకపోతే కథ కాదు.
అప్పుడే కథ అనే దానికొక అస్పష్టమైన ఆకారం వచ్చేసింది. కథకిది మొదటి నిబంధన. కనీసం చెప్పదగినదీ వినదగినదీ అయినా కాకపోతే కథ కాదు. ఈ మొదటి నిబంధనలే తట్టుకోలేని కథలెన్ని ప్రకటించబడుతున్నై ప్రతి నెలా ?
ఇప్పుడు మనం కథలనేవి ప్రపంచంలో లేవని భావించుకుని ఈ సూత్రం మీద కథ జన్మించి ఎట్లా పెరుగుతూ ఎట్లా మారుతుందో ఆలోచిద్దాం.
సహజంగా మొదటి కథలు చాలా అసామాన్యంగా, దాదాపు అసహజంగా, అసంభవంగా ఉంటై. వాటి నిండా ఉద్రేకపూరితాలైన హత్యలూ, ఎవరూ కనీ వినీ ఎరగని నరకాలూ (స్వర్గాలూ-రొండూ ఒకటే!) ఉంటై. కాలక్రమాన చదివేవాళ్ళకిటువంటి అసహజమైన రచనలను చూస్తే అసహ్యం పుడుతుంది. క్రమంగా ఈ అసంభవాలు స్థానే సులభంగా ఊహించుకోదగిననీ, అయినా అసామాన్యమైనవీ బయలుదేరతై. ఈ కథలు వెనకటి వాటికన్న ఎక్కువ కాలం నిలబడతై. కాని చదివే వాళ్ళకు వాటి మీదా రోత పుడుతుంది. అక్కడక్కడా కథలు గమనిస్తారు, వినదగిన విషయాలు మన నాలుగు బజార్ల మధ్యా జరుగుతుంటే ఏవేవో ఊహించుకోవటం అవసరం కాదా అని. కథల్లో వ్యక్తులు క్రమంగా సంఘంలో వ్యక్తులను సమీపిస్తారు. కథల్లో జరిగే విషయాలు సంఘంలో జరగదగిన విషయాలుగా మారతై, ఇంకా కాలం గడిచినకొద్దీ నాలుగు బజార్ల మధ్య జరిగే వాటి స్థానే నాలుగు గోడల మధ్య జరిగేవి వస్తాయి. ‘పాతాళ గృహం’ అవతల పారేసి ‘కాంతం కథలు’ చేపడతారు జనం.
ఇదంతా శాస్త్రీయంగా చర్చించదగిన కథ యొక్క అభివృద్ధి. కథకులు అశాస్త్రీయంగా అనేక అలంకారాలు తెచ్చిపెడతారు. కథల జీవం యావత్తూ ఈ అలంకారాల్లో ఉంటుంది. ఒక్కో కథకుడు కథను కొసతుంచి మెయిలుబండి స్టేషనులో ఆగినట్టు చేస్తాడు. మరొకడు తను చెప్పదలచుకున్న విషయం తప్ప మిగతాదంతా చెప్పి సూచన ఇచ్చి వదిలిపెట్టేస్తాడు. ఇటువంటి కథలు రాసేటప్పుడు చదివే వాడికి రెండు మూడు రకాల భావించటానికవకాశం ఇస్తే కథ యొక్క విలువ పోతుంది. ఆ చేసే సూచన పొరపాటు లేకుండా చెయ్యాలి. మరొకడు కథను కావాలని తారుమారు చేసి వెనకది ముందూ ముందుది వెనకా చెప్పి తన కథను మరోసారి చదివిస్తాడు. ఒక ఇంగ్లీషు కథకుడు ఏ క్షణానికా క్షణం కొంపలు మునగబోతున్నట్టు రాసుకొచ్చి చివరకేమీ లేకుండా కథ తేలుస్తాడు. ఇటువంటి స్వల్ప విషయాలతో కథకులు తమ కథలకు తమ వ్యక్తిత్వాన్ని కలిగిస్తారు. పత్రికలు చదివే వాళ్ళు ఒక కథకుడి రచనలు కొన్ని చదివి అవి రుచించిన మీదట అతడు ప్రకటిస్తూ ఉండే కథలను అతని ద్వారా ప్రేమిస్తారు (అతన్ని గురించి అతను రాసే కథలు మినహా ఏమీ తెలీకపోయినా సరే!) ఇది చాలా చిత్రం కాని నిజం. నేను మొదటిసారి చింతా దీక్షితులుగారి పిల్లల కథలు చదివినప్పుడు ఇతర కథలు చదివినట్టే చదివాను. కాని ఆయన ‘పర్సనాలిటీ’ నాకు కథల ద్వారా చిక్కిన తరవాత ఆయన కథలో నేను వెతికేది నాకు పరిచితమైన ఆయన వ్యక్తిత్వమే. కనక కథలు ఒక్కసారే రెండు పనులు చేసేస్తయి. మొదట వాటిని చదివిన వాళ్ళకు రాసిన వాడియొక్క ‘పర్సనల్ టచ్’ కలిగించి,ఆ వెనక ఆ ‘పర్సనల్ టచ్’ యొక్క ఆధారం వల్ల కొంత వ్యక్తిత్వం పొందుతై.
కనక, కథలేవిధంగా ఉండాలంటే ఉజ్జాయింపుగా ఈ మూడు విషయాలూ చెప్పవచ్చును. ఒకటి, కథ చెప్పబడ్డట్టుండడం; రెండు సంఘం (చదివే వాళ్ళు) యొక్క నాగరికతా అభిరుచులను బట్టి చెప్పదగినదిగా (వినదగినదిగా) ఉండటం; మూడు, రాసే వాడి ‘పర్సనాలిటీ’ కథలోనించి తొంగి చూస్తుండటం.
మాట్లాడటానికి ఉపయోగించే ధారాళమైన భాష ఉపయోగించకపోతే (మాట్లాడేటప్పుడొచ్చే తొస్సులు మాత్రం లేకుండా) మొదటి నియమానికి భంగం వస్తుంది. వినదగిన విషయాలూ – వీటి విచక్షణ తెలీని కథకుడయితే రెండో నియమం చెడుతుంది. ఒకరి కథలను ఒకరు ఆకారంతో సహా దొంగిలించటం మొదలుపెడితే మూడో నియమం చెడుతుంది. (మూడు నియమాలూ చెడ్డ కథలు అప్పుడప్పుడూ పత్రికలలో కనిపించటమూ కద్దు!) కథలు రాసే వారింకో పని కూడా చెయ్యాలి. కొంత మందికి జరిగిన విషయాలు కథలో రాస్తేనే బాగుంటుందని ఒక అభిప్రాయం ఉంది. అంటే కథకుడుకు తన భావనాశక్తి వినియోగించి కథ రాయటం కంటే అనుభవం మీద రాస్తే కథ బాగుంటుందని. దానికి ఒకటే అభ్యంతరం. చూడదగినవన్నీ చెప్పదగినవిగా ఉండవు. వ్యాసం రాయటానికి కిందుమీదవుతున్న తండ్రికి కొడుకు ఖగోళశాస్త్ర సమస్యలతో అడ్డురావటంలో చూడదగినదేముంటుంది? ఒక్కోసారి మనం కళ్ళారా చూసిన విషయాలే మరో డింకోడితో చెబుతుంటే మనకు వినబుద్ధి పుడుతుంది. అట్లా చెప్పగలవాడు సహజ కథకుడు. ఇటువంటి సహజ కథకులు సామాన్యంగా కాగితం మీద కలం పెట్టలేదంటే, ఆ పని చెయ్యటానికి కొన్ని నిబంధనలు వాళ్ళని భాధిస్తవని సులభంగా ఊహించుకోవచ్చును. అవేవో రాయటం మొదలుపెట్టినవాడికి గాని తెలిసి రావు. అవి ఒక కథా రచననేకాక రచనకు సంబంధించినది కావటంచేత మనకవసరం లేదు. తెలుగులో ఇంకా చెప్పుకోతగ్గ కథలు లేకపోయినా కథలుగా ప్రత్యేకత పొందిన వారి కథలను గురించి క్లుప్తంగా రాస్తాను.
దీక్షితులుగారి చిన్న పిల్లల కథలు :- అనుభవం జ్ఞానంకాదని నిరూపిస్తాయి ఈ కథలు. మనకందరికీ బాల్యం గడిచింది. జరిగినదంతా మరిచిపోయినం. వెనక్కు తిరిగి చూసుకుంటే అయోమయం. ఒక్కసారి దీక్షితులుగారి కథలు తిరగవెయ్యగానే అయోమయం మాసిపోయి కలలో చూసినట్టున్న ఒక నూతన ప్రపంచం కాంతి వంతంగా మన ఎదట సాక్షాత్కరిస్తుంది.
వెంకటచలం గారి ‘బూతు’ కథలు :- వీటికదే పేరు! ఇంతకూ వెంకటచలం గారు చేసిన తప్పేమిటంటే మనం అశుద్ధమన్నట్టుగా కప్పిపెడుతున్నదాన్ని బయటికీడ్చి అవివేకం, అజ్ఞానం, మూఢత్వం, మొండితనం, చాటుబుద్ధి మొదలైన దుర్గుణాలమీద తీవ్రమైన జ్ఞాన ప్రకాశం చేస్తున్నారు. చేజేతులా అశుద్ధం చేసుకున్నామంటారు. కథలలో కొంత ప్రచారధోరణీ, జ్ఞానబోధచేసే ఉద్దేశమూ ఉన్న. ఇవి ఆయనయొక్క మత కథలనీ, ఆయన దృష్టిలో పవిత్రములైనవిగా ఉద్దేశించబడ్డవనీ చెప్పవచ్చును.
నరసింహరావుగారి కాంతం కథలు :- కాంతం తెలుగువాళ్ళకు కొత్త సాంప్రదాయం ప్రబంధాలనాటినుంచీ ఆడదానికి వ్యక్తిత్వం లేకపోవటం, ఆడది నోరుతెరిస్తే వెధవకంపూ ఆచారంగా వస్తున్నాయి. కాంతం (తెలుగు సారస్వతంలో కొత్త) తెలివిగలది. కొయ్య బొమ్మ కాదు. స్వతంత్రంగా ఆలోచిస్తుంది. తప్పులు చేసి దిద్దుకుంటుంది. ఇంట్లో సందడిగా ఉంటుంది. కాంతం లేకపోతే ఇల్లు చిన్నబోతుంది. వెంకట్రావు మనస్సు చిన్న బోతుంది. పిల్లలు నాగరికత పోగట్టుకున్న జాతి మాదిరిగా ప్రవర్తిస్తారు. మళ్ళీ కాంతం ఇంట్లో అడుగుపెట్టగానే ఎవరి స్థానంలో వారు అమరి ఊరుకుంటారు.
సుబ్రహ్మణ్యశాస్త్రిగారి సాంసారిక కథలు :- ఈ కథలలో విశేషమేమిటంటే పాత్రలు నూట్లాడతై – ఇతర కథలలో పాత్రలల్లే పోర్షను వప్పించకుండా కథ చదవటం మొదలుపెట్టగానే ఒక తెలుగు కుటుంబం మధ్య వెళ్ళి పడతాం. కథ అంతమయేవరకూ ఆ భావం పోదు. కథ నినదగడం యావత్తూ కథనంలోనే ఉంటుంది. సంభాషణ జాస్తిగా ఉండటంవల్ల కథ కుదుపులేకుండా దొర్లిపోతుంది. సంభాషణలో పాలు తీసుకునేవాళ్ళు మాట్లాడే విషయం మీదికి ఎగబడా మాట్లాడతారు. (ఇతర్ల సంభాషణల్లో పాత్రలు దూరాన నుంచుని దేవుడి మీద అక్షింతలు విసిరేసినట్టు విషయచర్చ జరుగుతుందని గమనించేది!)
ఇంకా ఇతర కథకులనేకమంది ఉన్నారు. కాని వారి వారి కథల ప్రత్యేకత నేను గ్రహించలేకపోవటం చేత వాటిని గురించి రాయలేదు.
తెలుగు కథలు చాలా అభివృద్ధి కావలిసి ఉంది. ఇప్పుడు జరుగుతున్నదాని కన్న ఇంకా చాలా దృఢంగా భావ ప్రకటన చెయ్యటం ఒకటి అవసరం. తరవాత కథలు యావత్తూ ఒక్క బ్రహ్మణ సంసారాల చుట్టూ తిరుగుతున్నై. సంసార్లను గురించి రాయబడే కథలలో మించరాని అబద్ధాలూ, తప్పులూ కనబడుతున్నై. కాకపోయినా అ కథలకు ప్రత్యేకత ఇవ్వగలిగినంత రాతగాళ్ళు రాకుండా ఉన్నారు. తెలుగు సంఘం ఒక్క బ్రాహ్మణులతోనే లేదు. బి. ఏ.లు పాసయిన యువకులతోనూ లేదు. తెలుగువాళ్ళ ముఖ్య వ్యాపారం స్త్రీ పురుషులొకర్నొకరు ప్రేమించుకోవటమూకాదు. కాని కథలు ఎంతసేపటికీ ఈ ధోరణి లోనే ఉంటున్నై. దానికి కారణం రాసేవాళ్ళను సంఘం యొక్క నాలుగు మూలల్ని గురించి కథలు రాయటానికి కావలిసినంత తెలీకపోవటమే. తరువాత కథకుడు చదువరిని బుర్ర లేనివాడల్లే చూసి ప్రతి స్వల్ప విషయమూ వాడికి మేస్టరు బోధ చేసినట్టు చూస్తూ చెబితే చదువరి ఊరుకోడు. ఇప్పటి కథకులు చదివేవాళ్ళకు పనికలిపించటం నేర్చుకోవాలి. వాళ్ళకు తెలీని విషయాలుకూడా తెలిసినట్టు మనకు తెలుసునన్నట్టు నటించాలి. ఇప్పటి రాజకీయాలూ సాంఘికాలూ మనమీద ఎట్లా పని చేస్తున్నవో కథలలో పనిగాని పనిగా సూచించి వదిలిపెడితే ముందు కాలంలో ఇప్పటి కథలకు చారిత్రాత్మకమైన గౌరవం కొద్దిగా ఉంటుంది.
