నీకిష్టం కదా యీ కేక..
‘వాడి దూము తగల నీలికళ్ల దయ్యం:
అలాఅలా నోట్ బుక్ లో రాసేస్తూ.. రాసేస్తూ.. నీ చిన్ని నవ్వు.. యెన్ని సార్లు చదువుకున్నా.. మళ్ళీ మళ్ళీ నీకిష్టమైన ఆ పిలుపు దగ్గరే… చెవొగ్గి…
…
చైత్ర మాసాన విన్న కోకిల పాటలా
కొన్ని అనుభూతులు యెప్పుడు వాడిపోవు.
మరుపు పొరల్లో కనుమరుగై పోవు.
యే పుస్తకం గురించి రాక్ లో చూస్తున్నా ముందు చేతిలో కి వచ్చే పుస్తకం – ఆ పుస్తకంలోoచి నేరుగా గుండెల్లోకి నడిసొచ్చే యెర్ర సైనికురాలైన అమాయకపు బెస్తపిల్ల ‘మార్యూత్కా’ జర్మన్ లెస్ టెనెంట్ ‘ఒత్రోక్’. యెలాంటి వాళ్లనైనా తన ఆకర్షణలోకి లాగేసే అరల్స్ సముద్రపు అగాధనీలిమ లాంటి అతడి ‘నీలికళ్ళు’ ‘కారకుమే’ మంచు యెడారి.
‘అరల్స్ సముద్రం, ‘బర్స్ కెల్మన్’ దీవి. పుస్తకం చేతిల్లోకి తీసుకున్నప్పుడల్లా అప్రయత్నంగా పేజీలు తిప్పి ‘బర్స కెల్మన్’ దీవిలో చిక్కుకుపోయిన రెండు శతృకూటములకు చెందిన మార్యుత్కా, ఓత్రోక్ ల అందమైన ప్రేమని, ఘర్షణని, వసంత మాసపు ఆహ్లాదoలో అరల్స్ సముద్ర తీరపు యిసుకలో పెనవేసుకున్న వాళ్ళ పాద ముద్రల్ని ప్రేమతో, నీళ్ళు నిండిన కళ్ళతో తాకకుండా వుండలేo.
తమని చుట్టుముట్టిన వైట్ గార్డుల్ని తప్పించుకొని యిరవై మూడు మంది యెర్ర సైనికులు కారకుమే యెడారిలోకి ప్రవేశిస్తారు. మంచు గడ్డ కట్టేసిన ఆ యెడారిలోని కత్తోర ప్రయాణం వాళ్ళల్లో వొకొక్కరినే నేల కూల్చేస్తుంటుంది.
వాళ్లకు మధ్యలో వో బిడారుతో పాటు పయనిస్తోన్న జర్మన్ లెఫ్టినెంట్ వో త్రోక్ బందీగా చిక్కుతాడు.
యెర్ర సైనికుల్లోని వొకే వొక్క ఆడపిల్ల మార్యుత్కా. గొప్ప గురిగత్తే. ఆమె గురి యెప్పుడు తప్పదు. అప్పటి దాకా 40 మందిని గురి తప్పకుండా కాల్చే స్తుంది. కానీ యెడారి చలిలో బిగుసుకుపోయిన ఆమె చేతులు యీ 41 వ వాడి దగ్గర గురి తప్పుతాయి. యీ అతి విలువైన బందీ కాపలా బాధ్యత మార్కు త్కాకే అప్పజెపుతారు. కారకుకు యెడారిలోకి 23 మందితో ప్రయాణం ప్రారంభించిన యెర్ర సైనికులు అరల్స్ సముద్రతీరం చేరేసరికి బందీ అయిన శత్రువు తో కలిసి కేవలం తొమ్మిది మంది మాత్రమే అస్థిపంజారాల ఆకారాలతో మిగిలి వుంటారు.
యెడారి ఇసుక తిన్నె మీద నుంచి సుదూరంగా అరల్స్ సముద్ర తీరం కనిపించినప్పుడు ఆ చల్లని యిసుక మీద బోర్లాపడి కొంకర్లు పోయిన వేళ్ళుతో గీకుతాడు యెర్ర సైన్యం కమీస్సార్. ఆ కమీస్సార్ యెప్పుడూ కొలంబస్ పేరు వినలేదు.
కొలంబస్ వెంట వున్న స్పానిష్ నాయకులు ‘నేల’ అని కేక వింటూనే వోడ డెక్కు మీద అలాగే తమ వేళ్ళతో గోకారని అతడికే తెలియదు.
శత్రువుని జాగ్రత్తగా తమ కేంద్ర స్థానానికి చేర్చేందుకు మార్యుత్కాతో పాటు మరో యిద్దరు యెర్ర సైనికులతోడుగా చిన్న పడవలో పంపుతారు. అది తుఫానులో చిక్కుకొని ఆ యిద్దరు సైనికులు సముద్రంలో గల్లంతై పోతే శత్రువులో వొంటరిగా బర్స్ కెల్మన్ ద్వీపానికి చేరుతుంది మర్యుత్కా. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది యిద్దరు శత్రువుల మధ్య ప్రేమ. వొకరు నూతన మానవ సంబంధాల కోసం పోరాడుతున్న విప్లవ ప్రజానీకానికి ప్రతినిధి అయితే, మరొకరు వ్యక్తిగత సౌఖ్యం, కీర్తి కోసం పాకులాడే వర్గానికి ప్రతినిధి.
యిద్దరూ తాము నమ్మిన దాని కోసం చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడేందుకు సిద్ధం. వొంటరి ద్వీపంలో చిక్కుకున్న ఆ ప్రేమిక శత్రువులు యెలాంటి స్థితిలో వుంటారంటే యిష్టం లేకపోయినా సరే వాళ్ళు తమ మానవ విలువలలో పరస్పరం పోటీ పడతారు. మొరటు, నిరక్షర యువతి మార్యుత్కా ఆ అగ్ని పరీక్షను తట్టుకోవడానికి సిద్ధపడటం, వుదారమైన అనుభూతులతో పాటు నిస్వార్థంలోనూ, ఆదర్శాల స్థిరత్వంలోనూ తన ఆధిక్యాన్ని యెప్పుడూ ప్రదర్శి స్తూనే వుంటుంది. స్వార్ధ సౌఖ్యాన్ని యే మాత్రం అంగీకరించదు.
కానీ యిద్దరి మధ్య వికసించే మధురమైన ప్రేమ యిద్దర్నీ వూగిసలాడేట్టు చేస్తుంది. శత్రువుల పడవ ఆ దీవి తీరాన్ని సమీపించినప్పుడు యీ సారి తన 41 వ వాడిని గురితప్పకుండా కాల్చేస్తుంది. ‘వాడి దూము తగల నీలికళ్ల దయ్యం’.
హృదయం సకల నియమాలను ధిక్కరించినా, యెంతైనా మనిషి జీవితం మనిషి చైతన్యాన్ని నిర్ణయిస్తుందని నిర్ణయించే యీ చిన్ని నవల మనల్ని కుదిపేస్తూనే వుంటుంది యెప్పుడు చదివినా.
యీ ‘నలభై ఒకటవ వాడు’ నవల రచయిత బి.లవ్రెన్యోవ్ గారికి హృదయ పూర్వక నమస్సులు.