రష్యన్ స్వభావము

రష్యన్ స్వభావము! ఈ చిన్న కథకు పెట్టిన శీర్షిక మరీ ఆడంబరంగా వుందేమో. అయితే ఏం చేస్తాం. నాకు ఆ స్వభావాన్ని గురించే మీకు చెప్పాలని వుంది.

  రష్యన్ స్వభావము! చూశారూ, దీన్ని వర్ణించడం చాల కష్టం…. శౌర్యపరాక్రమ కార్యాలను గురించి చెప్పడమా? అటువంటివి బోలెడున్నాయి. వాటిలో దేన్ని గురించి చెప్పడమో ఎంచుకోవడం చాలా కష్టం. ఈ సమ యంలో నా మిత్రుడొకడు నా సహాయానికి వచ్చి తన జీవిత చరిత్రలో ఒక సంఘటన చెప్పాడు. అతడు ఫాషిస్టులతో యుద్ధం ఎలా చేశాడో నేను చెప్పబోవడం లేదు. – కాని అతనికి స్వర్ణతార ప్రదానం చేశారు, ఛాతినిండా పతకాలున్నాయని మాత్రం ప్రసంగవశాత్తూ చెబుతాను. అతడు కల్లా కపటము ఎరగని వాడు, నెమ్మదైన మనిషి, సామాన్యుడు. వోల్గవది వొద్దున సరాతోప్ ప్రాంతంలో సమిష్టి క్షేత్ర వ్యవసాయదారుడు. కాని అతడు చక్కగా వుంటాడు – నలుగురి మధ్యనున్నప్పుడు అతనిలో అవయవ సౌష్టవము కొట్ట వచ్చేటట్లు కనపడేది. అతను టాంకు బురుజులోనుండి బయటకు వచ్చినప్పుడు అతని కేసి చూడాలి – సాక్షాత్తూ కుమారస్వామే! టాంకుమీదనుండి దూకి, చెమటతో తడిసిన వుంగరాల జుత్తుమీద వున్న హెల్మెటును కిందకి లాగుకొని, తీసివేసి, చెమటపట్టిన ముఖాన్ని పాతగుడ్డతో తుడుచుకుంటూ, హృదయపూర్వకమైన స్నేహభావంతో నవ్వుతుండేవాడు.

  యుద్ధంలో, మృత్యువుతో బుజాలు బుజాలు రాస్తూనే మనుషులు మంచివాళ్లవుతారు. ఎండకి మాడిన జబ్బుచర్మంలాగ అన్ని రకాల తుక్కూ వాళ్ల నుండి బయటకు వచ్చేసి, ఆసలుగుజ్జు మనిషిలో మిగిలిపోతుంది. ఐతే   ఒకటి – ఒకరిలో ఈ గుజ్జు మరింత చిక్కగా వుంటుంది. మరొకరిలో పలచగా వుంటుంది. అది సహజమేమరి, ఐనప్పటికీ ఎవడిలో ఆ సారం లోపంతోకూడి వుంటవో అలాంటి వాడు కూడా, ఈడ్చుకొస్తూనే, విశ్వాస పాత్రుడైన కామ్రేడ్ గా వుండాలనే కోరుకుంటాడు. కాని నా స్నేహితుడు, ఎగోర్ ద్ర్యోమొన్, యుద్ధానికి ముందు రోజుల్లోనే మంచి కట్టు దిట్టమైన ప్రవర్తనగల మనిషి. తల్లి, మరియు పాలికార్ పావ్న , తండ్రి, ఎగోర్ ఎగోరొవిచ్  పట్ల ఎంతో భక్తి గౌరవాలతో నడచుకొనేవాడు. వారంటే అతనికి అమిత ప్రేమ. “మా నాన్న – అతి నెమ్మదైన మనిషి. అన్నిటికంటే ముఖ్యం – ఆత్మ గౌరవంవున్న వాడు. “ఇదిగో, ఒరే అబ్బాయీ, ప్రపంచంలో నువ్వు చాల చూస్తావు. విదేశాలకి వెళ్తావు. కాని, రష్యన్ పేరుతో గర్వించు….’ అనేవారు.”

            అతడు ప్రదానం చేసుకున్న అమ్మాయిది కూడా వోల్గనది వొడ్డునున్న ఆ పల్లే. పెళ్లి కూతుళ్లను గురించి, భార్యలను గురించి మనలో ఎక్కువగా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా యుక్త రంగంలో ప్రశాంతంగా వుండినప్పుడు, మంచు గడ్డకట్టుకుపోయి శీతలంగా వుంటూ, మట్టి గుడిశలలో దీపం కొడి గట్టి, కుంపటి చిటపట మండుతుండగా, రాత్రి భోజనాలప్పుడూ – ఇటువంటి సంభాషణలు జరుపుతూ వుంటారు. అప్పుడక్కడ ఎటువంటి అభాండాలు చెల రేగుతూ వుంటాయంటే చెవులు చేటలంతేసి అవుతాయి. ఉదాహరణకు సంభాషణ ఇలా ఆరంభమవుతుంది: “ప్రేమ  అన్నది ఏమిటి?” అని ఒకరు అడుగుతారు. ఒకరంటారుకదా: ”గౌరవమునే మూలంలోనుంచి బయలు దేరుతుంది  ప్రేమ….” మరొకరు: “అలాంటిదేం కాదు, ప్రేమ – ఇది ఒక అలవాటు. మనిషి పెళ్లాన్నేకాదు, తల్లిదండ్రుల్నీ, జంతువుల్నీ కూడా ప్రేమిస్తాడు…. “థూ, మొద్దు ఘటమా!” అంటాడు మూడో వాడు: “ప్రేమ – తనలో అంతా కుతకుత వుడుకుతున్నప్పుడు మనిషి మనస్సు తాగినవాడికి మల్లేనే వుంటుంది….’ ఇహ  అప్పుడు సార్జంటు  మేజరు కల్పించుకుని, అధికారము వుట్టిపడుతూ, అసలు సారం తేల్చేదాకా, ఈ తాత్విక చర్చ గంటల కొద్దీ ఇలా సాగిస్తూనే వుంటారు…. ఈ విషయాలను ఎత్తడమంటే ఎగోర్ ద్ర్యోమొవ్ సిగ్గు పడే వుండాలి మరి, ఎందుచేతంటే మాటల మధ్యలో ప్రసంగవశాత్తూ అతడు తను ప్రదానం చేసుకున్న అమ్మాయి గురించి ఒకసారి నాతో చెప్పాడు – చాలా అందమైనదనీ, ఇహ ఎంతో మంచి అమ్మాయనీ, ఆమె గనక అతని కోసము ఆగుతానని చెప్పిందంటే, చివరికి అతను యుద్ధమునుండి కుంటివాడై తిరిగి వచ్చినా సరే తప్పకుండా ఆగి తీరుతుందనీ…

            యుద్ధంలో శౌర్యపరాక్రమ కార్యాలను గురించి ఎక్కువగా మాట్లాడటమంటే   అతని కంతగా ఇష్టమండేది గాదు. “ఆ విషయాలను గురించి జ్ఞాపకం తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు.” అలా అని ముఖం చిట్లించి గుప్పు గుప్పుమని సిగరెట్టు పీల్చేవాడు. యుద్ధంలో అతని టాంకు ఘనకార్యాలను గురించి అతని టాంకు మనుషులు చెప్పిన మాటలవల్ల తెలుసుకున్నాము, అందులోనూ ముఖ్యంగా ద్ర్యోమొన్  శ్రోతలను ఆశ్చర్యంలో ముంచెత్తేవాడు.

            “…అర్థమైంది కదా మీరు, సరిగ్గా అప్పుడే మేం మా టాంకుని వెనక్కి తిప్పాం. చిన్న దిబ్బవెనకనుండి వస్తూంది… అరిచాను: ‘కామ్రేడ్ లెఫ్టినెంట్, టైగర్ బాంక్ ! ‘ * ‘ముందుకి పద, పూర్తిగా గ్యాసు ఇచ్చేయ్!’ అని కేకేశాడు. నేను వెంటనే ఆ టాంకుని చెట్లు మధ్యనుండి ఓ సారి కుడివైపూ, ఓ సారి ఎడమవైపూ తప్పించుకుంటూ పోనిచ్చాను. టైగర్ గురిచూడడానికవి తన ఫిరంగి గొట్టాన్ని ఇటూ అటూ గుడ్డిగా తిప్పి, పేల్చింది, మీదకే గుడ్డిగా వెళ్లి, సరిగ్గా మా ఎదుటే గురితప్పింది…. అప్పుడు కామ్రేడ్ లెఫ్టినెంట్ దానికి పార్శ్వంలో ఖర్చుకి ఇచ్చుకున్నాడు – ఢామ్,ఢామ్  అనీ! మళ్లీ ఇచ్చుకున్నాడు బురుజుకి దానితో అది పృష్టం  ఎత్తేసింది…. మళ్లీ మూడో మాటు ఇచ్చుకున్నాడు — టైగర్ టాంకు  అన్ని సందుల్లో నుండీ బుస్ మని  దూసుకొచ్చింది. – మంట నూరుమీటర్ల ఎత్తువరకు ఎగజిమ్మింది. బాంకులోనుండి అదనపు ద్వారము గుండా బయటకొచ్చారు.  వెనకున్న వాంకా లప్షీన్ దానిని అటువైపు తిప్పాడు, వాళ్లు నేలమీద పడి వున్నారు, కాళ్ళు, ఎగదన్ని ఇహ, మా దార్లో  ఏ అడ్డూ లేదు. అయిదు నిము షాల తరువాత మేం రైయ్ మని గ్రామానికి వెళ్తాం ఇకప్పుడు నేను చచ్చినట్టు నవ్వాను ….ఫాషిస్టులు చిందరవందరగా పరుగెత్తారు. అరె అక్కడ బురదగా  వుంది, అర్థమైందిగా ఎవడో ఒకడు వుత్తకాళ్ళతోనే బయటికొచ్చి, చప్పున పారిపోయాడు. అందరూ షెడ్డులోకి పరుగు తీశారు. కామ్రేడ్ లెఫ్టినెంట్ నాకు ఉత్తర్వు జారీ చేశాడు ‘షెడ్డు మీదకి తోసుకుపో!’ ఫిరంగి ప్రక్కకు తిప్పాం. పూర్తిగా గ్యాసు ఇచ్చి షెడ్డును కూల్చేశాం.. అరె, దేవుడా’ గర్డర్లూ, బల్ల చెక్కలూ, ఇటుకలూ కవచ శకటం మీదపడుతూ ఖంగ్ ఖంగ్ మంటు న్నాయి. చూరు క్రింద దాకున్న ఫాషిస్టులూ మిగిలిన వాళ్లూ చేతులు  ఎత్తేశారు. హిట్లర్ గోవిందా!

            లెఫ్టినెంట్ ఎగోర్  ద్ర్యోమొన్ దురదృష్ట కాలం రానంత వరకు అలా పోరాడాడు. కూర్స్క్ కసాయి కోతి యుద్ధంలో, జర్మన్లు ధారాపాతంగా రక్తాలు కార్చుకుని ఇక తొట్రుపాటు పడడం మొదలు పెట్టిన రోజుల్లో, అతని టాంకు గోధుమ పాలాలలో చిన్న దిబ్బ  దగ్గర ఫిరంగి దెబ్బ తిన్నది. అతను గాయపడ్డాడు. అతని టాంకు మనుషుల్లో ఇద్దరు అక్కడికక్కడే చచ్చి పోయారు. రెండో ఫిరంగి దెబ్బకి టాంకు తగలబడి పోయింది. అప్పుడే ముందునున్న ద్వారం గుండా బయటపడ్డ (డ్రైవరు చువిల్యోవ్, మళ్లీ వెనక్కి మళ్లీ కవచశకటం దగ్గరకు వెళ్లి లెఫ్టినెంట్ ను టాంకు  నుండి బయటకు ఈడవగల్గాడు  – లెప్టెనెంట్ వంటిమీద తెలివిలేదు, అతను తొడుక్కున్న ఓవరాల్సు నుండిపోతున్నాయి. చువిల్యోవ్ లెఫ్టినెంట్ను బయటకు లాగాడో లేనేలేదో, టాంకు ఎంత జోరుగా పేలిపోయిందంటే, దాని బురుజు ఏభై మీటర్ల  ఎత్తుకు ఎగిరిపోయింది.  మంటలు ఆర్పటానికి చువిల్యోవ్ మట్టిని దోశెళ్ళతో తీసి లెఫ్టినెంట్ ముఖంమీద, తలమీద, బట్టలపైన చల్లాడు. తరువాత అతణ్ణి ఒక ఫిరంగి గుండు పేల్చిన బిలంనుండి మరొకదానివరకు, వాటిలో ఒక్కొ దశలోనూ మాటు చూసుకుంటూ, చికిత్సాకేంద్రము చేరేవరకూ లెఫ్టినెంటును మోసుకుని పాకుకుంటూ వెళ్లాడు…. “నేను అతనిని ఎందుకు మోసుకెళ్లా నంటారా?” చువిల్యోవ్ అన్నాడు. “లెప్టెనెంట్ గుండె కొట్టుకోవడం విన్నాను”

            ఎగోర్ ద్ర్యోమొన్  బ్రతికాడు అంతేగాకుండా, కళ్ల కేమి దెబ్బ తగలలేదు, కాని అతని ముఖము ఎంతలా మాడిపోయిందంటే, అక్కడక్కడా ఎముకలు కూడా బయటకు కనపడ్డాయి ఎనిమిది మాసాలు అతను ఆస్పత్రిలో వున్నాడు. ప్లాస్టిక్ ఆపరేషన్లు ఒక దాని తరువాత మరొకటి ఎన్నో చేశారు. పెదవులు, కనురెప్పలు, చెవులు అతికారు.  ఎనిమిదినెలలూ అయ్యాక  కట్లు విప్పిన తరువాత, అతను తన ముఖం అద్దంలో చూసుకొని ఆ ముఖం తనది కానే అనుకున్నాడు. అతనికి అద్దాన్ని ఇచ్చిన స్టాఫ్ నర్సు ప్రక్కకు తిరిగి ఏడ్చింది. వెంటనే అతడు అద్దాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు.

“ఇంతకంటే ఘోరాలు జరుగుతాయి” అన్నాడు అతను, “వీటితో బ్రతక వచ్చు.”

            మరింకెప్పుడూ అతను స్టాఫ్ నర్సుని అద్దము చూపించమని అడగలేదు. కాని ఎప్పుడూ,ముఖానికి అలవాటు పడుతున్నట్టుగా, అలవాటున్నట్లూ వేళ్లతో తన ముఖాన్ని తడుముకొనేవాడు. అతడు యుద్ధశ్రేణికి వెళ్లేందుకు అనుమతించక, యుద్ధే తరమైన ఉద్యోగమే చేయాలని మెడికల్ బోర్డు సిఫార్సు చేసింది. అప్పుడతను జనరల్ దగ్గరకు పోయి ఇలా అన్నాడు. “నా  రెజి మెంటుకి నేను తిరిగి వెళ్లిపోడానికి మీ అనుమతిని కోరుచున్నాను “”కాని, మీరు జబ్బు మనుషులుగా,” అన్నాడు జనరల్. “అబ్బే, అదేంకాదు. నేను కురూపేని, కాని ఈ పనికి ఇది ఏ మాత్రం అడ్డం రాదు. నా యుద్ధ పటిమకి  ఏ లోపమూ లేదు” (తనతో మాట్లాడుతున్నప్పుడు, తన పక్కకు సాధ్యమైనంత వరకు చూడకుండా వుండేందుకు జనరల్ చేసిన ప్రయత్నం ఎగోర్ ద్ర్యోమొన్ కనిపెట్టాడు. అందవికారంగా వున్న పెదవుల నుంచి తనలో తాను నవ్వుకున్నాడు) పూర్తిగా ఆరోగ్యం కోలుకుందుకని అతను ఇరవై రోజులు శలవు తీసుకొని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అన్నట్లు ఇది ఈ సంవత్స రము మార్చినెలలో జరిగింది.

            రైలుస్టేషనులో బండి కట్టించుకుందామనుకున్నాడు కాని ఆ పదిహేను మైళ్లూ నడచి వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు చుట్టుపక్కల ఇంకా మంచు  పడివుంది, చెమ్మగావుంది మనిషి సంచారము లేదు రయ్ రయ్ మని కొడుతున్న చలిగాలికి యూనిఫారమ్ ఓవరుకోటు అంచులు ఇటు అటు కొట్టుకుంటున్నాయి. చెవిలో ఈలవేసినట్లు గాలి వూరికే మోత పెడుతూంది. సంజే వేళ మునిచీకటికల్లా పల్లెకు చేరుకున్నాడు. అదిగో బావి – ఎత్తున వున్న గిలకపడి ఇటూ అటూ ఆడుతూ కిర్రుమని చప్పుడు చేస్తంది.  ఇక్కడ నుండి ఆరో గడపే – తల్లిదండ్రులది జేబుల్లో చేతులు పెట్టుకొని తటాలున ఆగిపోయాడతను. లోపలికి వెళ్లామా వద్దా అని సంశయిస్తూన్నట్లు గా తలవూపాడు. ఇంటి ప్రక్కకు వెళ్లాడు. మంచుమీద మోకరించి కిటికీలో నుండి తల్లిని చూశాడు. ఆమె అప్పుడే గుడ్డి దీపపు వెల్తురులో బల్ల మీద రాత్రి  భోజనానికి ఏర్పాటు చేస్తూంది – మునుపటి నల్లరంగు తలరుమాలునే వేసుకుంది, నీ తొందరా లేకుండా నిదానమైన చలనాలు, మంచితనం ఉట్టిపడుతూంది ఆ ముఖంలో ఆమెకు ముసలితనం వచ్చింది. చిక్కిపోయిన బుజాలు పైకితోసుకొస్తున్నాయి “అయ్యో, నా గురించి ఆమెకు ప్రతిరోజూ కనీసము రెండుముక్కలైనా రాసే వుండాల్సింది.” సామాన్యమైన భోజనం బల్ల పైన పెట్టింది – కప్పుతో పాలు, రొట్టె, రెండు గరిటెలు, ఉప్పుగిన్నె తరువాత బల్ల  కెదురుగా నించుని చిక్కిపోయిన చేతులు గుండెల మీద వుంచుకుని ఏదో ఆలోచించుకుంటూంది . కిటికీలోగుండా ఎగోర్ ద్ర్యోమొన్ తన తల్లిని చూపిన తరువాత ఆమెను ఏమాత్రమూ భయపెట్టకూడదనీ, ఆమె ముసలి ముఖము నిరాశా నిస్పహలతో వణికి పోయేటట్లు చేయరాదనీ తెలుచుకున్నాడు.

            “సరేలే” అనుకున్నాడు అనుకుని గేటు తీసుకుని పోర్చి దగ్గ రకు వెళ్లి తలుపు తట్టాడు అది విని, “ఎవరక్కడ” అన్నది తల్లి. “లెప్టె నెంటు, సోవియట్ యూనియన్ వీరుడు గ్రోమొన్” అని అతను సమాధానము చెప్పాడు.

            అతనిలో గుండె ఎలా కొట్టుకుంటూందంటే, భుజాలతో ద్వారబంధాన్ని ఆనుకుని నుంచోవలసివచ్చింది లేదు, తల్లి తన గొంతు గుర్తు పట్టులేదు. అనుకొన్నాడు. అన్ని ఆపరేషన్లూ అయిన తరువాత బొంగురుపోయి, నాదం మారిన తన గొంతుని అతను తనకు తానే ఇదే మొదటిసారిగా విన్నాడు.

“ఏం, నాయనా ఎవరికోసం వచ్చావు” అని ఆమె అడిగింది.

   “మరీయ పాలికార్ పోవ్న కు  ఆమె కుమారుడు సీనియర్ లెఫ్టినెంట్ ద్ర్యోమొన్  వద్ద నుంచి అభివందనలు తెచ్చాను.”

  అప్పుడామె తలుపు తీసి, అతనిమీద పడి చేతులు పట్టుకుని,

“నా ఎగోర్ బ్రతికున్నాడా ? ఆరోగ్యంగా వున్నాడా? నాయనా  ఇంటి లోకి రా బాబూ” అన్నది

             ఎగోర్ ద్ర్యోమొన్ బల్ల వద్దనున్న బెంచిమీద కూర్చున్నారు. తనకాళ్ళు  ఇంకా నేలకు అందని రోజుల్లో, తల్లి తన వంకుల జుట్టుని నిమురుతూ “నా  ముద్దుల మూటా! తినమ్మా” అంటూ బల్ల దగ్గర ఏ స్థలంలో కూచోబెట్టి భోజనం తినిపించేదో సరిగ్గా ఆ స్థలంలోనే కూర్చున్నాడు. ఆమెతో అతను ఆమె కుమారుని గురించి, అంటే తన గురించే, ఎట్లా తింటాడో, తాగుతాడో, ఎందులోనూ కూడా తొందరపడకుండా ఎలా నిధానంగా వుంటాడో, ఎలా ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా వుంటాడో చెప్పడం మొదలు పెట్టాడు. అతను తన టాంకుతో పాల్గొన్న యుద్ధ పోరాటాల్ని గురించి కూడా సంగ్రహంగా చెప్పాడు.

            “నాయనా, నేను తెలీక అడుగుతాను.  యుద్ధం భయంకరంగా  వుంటుందా, బాబూ?” అంటూ కళ్లు పైకి స్ఫుటంగా కనపడకుండా వున్న అతని నల్లని ముఖములోనికి చూస్తూ ఆమె అడిగింది.

“అవును, మరి, భయంకరంగానే వుంటుందండి. అమ్మా. కానీ, అలవాటైపోతుంది.”

            అతని తండ్రి, ఎగోర్ ఎగోరోవిచ్, వచ్చారు. ఆ రోజుల్లో మనిషి బాగా చిక్కిపోయున్నాడు – గడ్డం ముగ్గు బుట్టలా వుంది. లోపలికి వచ్చిన తరు వాత తన చిరిగి పోయిన ఫెల్ట్ బూట్లను గుమ్మంమీద దులుపుకుని, మప్లరును  ఏ తొందరలేకుండా తీసివేసి, బొచ్చుకోటు విప్పుకున్నాడు. బల్ల దగ్గరకు వచ్చి అతిధిని పలకరించి కరచాలనము చేశారు. ఆహా! కన్న తండ్రిచేయి, ధర్మమే ఎరిగిన ఆ చేయి, ఆ వెడల్పాంటి చేయి చక్కగా ఎరిగినదే కదా? ఏమీ అడగ కుండానే — ఆ పతకాలు ధరించిన వ్యక్తి తమ దగ్గరకి ఎందుకు వచ్చాడో అర్థమైంది. కనుక – అక్కడ కూర్చుని అతను చెప్పేది తాను కూడ ఆలకించటం మొదలు పెట్టాడు.

            అక్కడ కూర్చుని లెప్టెవెంట్ ద్ర్యోమొన్ తానుగానీ మరొకనిని గురించి, కానీ నిజంగా తన గురించే, ఎంత సవిరంగా చెప్పటం చెబుతున్నాడో, అంత అసాధ్యమై పోయింది. అతనికి లేచి నిలబడి అసలు విషయము బయట పెట్టడం: “అమ్మా… నాన్నా! నన్ను ఈ కురూపిని గుర్తు పట్టండి” అని. తల్లిదండ్రులతో బల్ల దగ్గర కూర్చోవడం అతని కొకపక్క హాయిగా వుంది, మరొక పక్క  అవమానకరంగా వుంది,

            “ఇంక భోంచేద్దామండి. అమ్మి, అతిధికి ఏదో ఒకటి చేసి వడ్డించు” అన్నాడు ఎగోర్  ఎగోరోవిచ్ అలా అంటూ అతడు తాతల కాలంనాటి బీరువా దగ్గరకు వెళ్లి దాని తలుపుతీశాడు. అందులో ఎడమపక్క మూలను వుంది చేపలు పట్టే గొలములు వుంచిన ఆగి పెట్టె ఇంకా ఆ గాలాలు అక్కడే వున్నాయి, టీపాట్  వుంది – అదీ మునుపటిలాగానే అక్కడే వుంది, ఆ బీరువాలో రొట్టె  పీసళ్ళ వాసన, ఉల్లిపాయ తొక్కల  వాసనా ఇంకా కొడుతూనే వుంది. ఎగోర్ ఎగోరోవిచ్ ఆ బీరువాలోనుంచి ద్రాక్ష సారాయి సీసా  బయటకు తీశాడు. మొత్తం రెండు వైన్ గ్లాసుల సారాయి వుందేమో. సారాయి ఎక్కువ లేనందుకు నిట్టూర్చాడు.  వెనకటి రోజుల్లోలాగానే రాత్రి భోజనానికి కూర్చు న్నారు. కానీ, భోజనము చేస్తున్నంతసేపూ సీనియర్ లెఫ్టినెంట్ ద్ర్యోమొన్ గమనించుతూనే వున్నాడు. చెమ్చా పట్టుకుని వున్న తన చేతికేసి తల్లి అదే పనిగా చూడటం నవ్వుకున్నారు తల్లి తల పైకెత్తింది.   బాధతో వణికిపోయింది.

            వసంత రుతువు ఎలా వుండబోతుందో, ప్రజలు ఈ సంవత్సరం పాలాలలో చిత్తనాలు చల్లుతారో, చల్లరో, యుద్ధం అంతమయ్యేందుకు వేసవి కాలంవరకూ ఆగాలో  ఏమిటో ఇలాగే అన్నిటి గురించీ, అందరి గురించి మాట్లాడుకున్నారు.

“ఏమండీ, ఎగోర్  ఎగోరోవిచ్ ,ఈ సంవత్సరం వేసవికాలంతో యుద్ధం  ఆగిపోతుందని ఎందుకనుకుంటున్నారు మీరు?”

“ప్రజలు కోపంతో మండి పోతున్నారు . ఈ చావులు చూడలేక  ఇప్పుడిక నిర్ణయించేసుకున్నారు. ఇప్పుడు వాళ్లని ఆపతరంగారు జర్మన్ల పని

ఇహ సరి” అని ఎగోర్  ఎగోరోవిచ్ సమాధానము చెప్పాడు.

మరియ పాలకార్ పావ్న  అడిగింది:  

            “వాడికి ఎప్పుడు పెలులిస్తారో, సెలవులకు ఇంటికి వస్తాడో రాడో చెప్పారు కారు వాణ్ణి చూసి మూడు సంవత్సరాలైంది బహుశా వాడు బాగా ఎదిగే వుంటాడు, మీసం వచ్చి వుంటుంది. అలాగు ప్రతి రోజూ చావు దగ్గర, బహుశా వాడి గొంతు ఇప్పుడు బొంగురుగా వుందేమో?”

“ఇంటికి రాకపోవడమేమిటిలెండి — వస్తాడు. మీరు గుర్తు పట్టక  పోవచ్చేమో కూడా అన్నాడు. లెఫ్టినెంట్ .

            పాయ్యిగూటిమీద అతనికి పడక ఏర్పాటు చేశారు పొయ్యిగూటీ ప్రతి ఇటుకా, కలపగోడ ప్రతి దుంగా, ఇంటికప్పుడు వేసిన ప్రతి కొమ్మముడి అతనికి గుర్తుంది. తను  పుట్టిన ఇంటి వాసన, ఆఖరి గడియలో సహితం మరపురాని  వాసనలు – రొట్టె వాసన, కాయగూరల వాసన తగిలింది, మార్చి గాలి ఇంటి కప్పులోనుంచి ఈల వేస్తూంది అడ్డుగోడ అవతల తండ్రి గుర్రు పెట్టుతున్నాడు. తల్లి అటూ, ఇటూ కదులుతుంది నిట్టూర్చుతుంది. నిద్ర పోవటంలేదు. లెఫ్టినెంట్ అరిచేతుల్లో ముఖం పెట్టుకుని బోర్లా  పడుకున్నాడు. “నిజంగా గుర్తు పట్టలేదా” అనుకున్నాడు, “గుర్తు పట్టలేదా’ అమ్మా! అమ్మా!”

            వంటపొయ్యిలో కర్రల చురచుర మోతకు అతనికి ఉదయాన్నే నిద్ర నుండి మెళకువ వచ్చింది, తల్లి వాటిని జాగ్రత్తగా పొయ్యి దగ్గరకి తీసుకు వెళ్తూంది. దండెం మీద అతని ఉతికి ఆరవేసిన మేజోళ్ళు వేలాడుతున్నాయి. శుభ్రం చేసిన అతని బూట్లు గుమ్మం దగ్గర పెట్టబడి వున్నాయి.

“బాబూ, గోధుమ అట్లు తింటావా?” ఆమె అడిగింది.

            అతను వెంటనే సమాధానం చెప్పలేదు పొయ్యిగూడు దిగి, యూనిఫారం షర్టు వేసుకున్నాడు, పటకా బిగించుకున్నాడు బూట్లు వేసుకోకుండానే వట్టి కాళ్లతో వచ్చి బెంచిమీద కూర్చున్నాడు.  

“ఏమండీ, మీ పల్లెలో కాత్య మాలిషెన- అంచ్రేయ్ స్తెపారోవిచ్ మాలిషెన్ కూతురు, వుందాండి?” అని అడిగాడు

“ఆమె పోయిన సంవత్సరమే చదువు పూర్తి చేసి, మా పల్లెలోనే టీచరు నిచేస్తూంది. ఏం, ఆమెను చూడాలా?”

“మీ అబ్బాయి తన అభివందనలు ఆమెకు తప్పకుండా చెప్పమన్నాడు.”.

            ఆ అమ్మాయి కోసం తల్లి ఎక్కింటివాళ్ల పిల్లని పంపించింది. లెఫ్టినెంట్ ఇంకా బూట్లు కూడ వేసుకోలేదు, అంతట్లోనే కాత్య  మాలిషెవ పరిగెత్తుకొచ్చింది, వెడల్పాటి ఆమె కలికవన్నె కళ్లు తళతళ మెరిశాయి, బుగ్గలు సంతోషంతో ఎర్రబడ్డాయి. తలపై కట్టుకున్న గుడ్డని ఆమె తీసివేయగానే లెఫ్టినెంట్ దుఃఖంతో నిట్టూర్పు విడిచాడు – ఈ వెచ్చటి కాంతివంతమైన శిరోజాలను ముద్దు పెట్టుకుంటేనో!… తన స్నేహితురాలు అచ్చంగా ఇలా వుంటుందనే, ఎప్పుడూ ఇంత స్వచ్ఛంగా, సున్నితంగా, ఉల్లాసంగా, మంచిదిగా, ఇక ఎంత అందంగా అంటే – ఆమె గుమ్మంలో అడుగు పెట్టిన వెంటనే గుడిసె అంతా బంగారమైపోయినంత అందంగా వున్నట్టే- అతను ఎల్లప్పుడూ ఊహించుకునేవాడు.

            “ఎగోర్ మిమ్మల్ని అభినందనలు చెప్పమన్నాడా?” అని అడిగిందామె. (అతను వెలుతురికి అడ్డంగా నుంచున్నారు, తల మాత్రం వూపాడు, ఏమంటే అతడు మాట్లాడలేక పోయాడు). “ఆ! అతను ఎప్పుడొస్తాడా అని అతని కోసం రాత్రింబగళ్లు కనిపెట్టుకుని వుంటున్నానని అతనితో చెప్పండి.”

            ఆమె అతనికి దగ్గరగా వెళ్లింది. అతన్ని చూసింది. చూసి, ఎవరో నెమ్మదిగా తన ఎదురు రొమ్ముపై కొట్టినట్లు ఆమె జడుసుకుని వెనక్కు తగ్గింది. అప్పుడు అతను వెళ్లిపోడానికే ధృఢంగా విశ్చయించుకున్నాడు- ఆ రోజునే.

            తల్లి వేడి పాలల్లో వేసి గోధుమ అట్లు పోసింది. అతను మరల లెఫ్టినెంట్ ద్ర్యోమొన్ గురించి చెప్పాడు. ఈ సారి అతని యుద్ధ ప్రతిభలను గురించి చెప్పాడు. – ఆలా చెప్పుతున్నంత సేపూ కాత్య ముఖంలో తన కురూపాన్ని చూసి ఆమెకు అసహ్యం పుట్టకుండా వుండేందుకని ఆమె అందమైన ముఖం కేసి చూడకుండా ఎంతో కష్టంమీద తన కళ్లను కిందకి దించేసుకునే వున్నాడు. ఎగోర్ ఎగోరొవిచ్ గుర్రపు బండికోసం సమిష్టి క్షేత్రా నికి పరిగెత్తుకెళ్లి నట్లున్నాడు. కానీ ద్ర్యోమొన్ , ఎట్లా వచ్చాడో, అట్లాగే నడిచే స్టేషనుకు వెళ్లాడు. జరిగిపోయిన దానిని గురించి అతను చాలా బాధ పడ్డాడు. అంతేగాక మధ్య తోవలో ఆగి, ముకం అరచేతులతో కొట్టుకుంటూ, బొంగురు గొంతుతో పదే పదే అన్నాడు: “ఇప్పుడిహ ఏంచేయడం?”

            యుద్ధ శ్రేణికి ఎంతో వెనుకతట్టున దేశంలోపల మకాంలో వున్న తన రెజిమెంటుకు తిరిగి వెళ్లిపోయాడు. యుద్ధంలో భుజం భుజం కలసి పోరాడిన మిత్రులు ఎంత మనఃపూర్వక ఆనందంతో అతనికి స్వాగతం చెప్పారంటే, దేనివలన ఐతే అతనికి నిద్రాహారాలు, ఉచ్ఛాసనిస్వాసాలు కష్టమై పోయామో, అది అతని మనస్సులో నుండి బయటికొచ్చేసి అతనికి ఊరట కలిగించింది. అతను తన దురదృష్టం గురించి తల్లికి ఇంకా తెలియకూడదనీ, ఇకపోతే కాత్య విషయంలో ఈ ములుకును తన హృదయంలో నుంచి పెరికి వేసేయాలనే నిశ్చయించుకున్నారు.

రెండు వారాల తరువాత తల్లి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది:

            “అబ్బాయీ, నా ముద్దులమూటా! ఆశీస్సులు – నీకు ఉత్తరం రాయడానికి భయపడుతున్నాను, ఏమీ పాలుపోకుండా వుంది. నువ్వు చెప్పి పంపిన అతను మా దగ్గరకి వచ్చాడు. మహామంచి మనిషి. ముఖం ఒక్కటే బాగు లేదు, అంతే. మా దగ్గర కొన్నాళ్లు వుందామనుకున్నాడు. కాని, ఏమి నిశ్చయించుకున్నాడో, వెంటనే వెళ్లిపోయాడు. అబ్బాయీ! అప్పటినుండి రాత్రిళ్లు నిద్దరేలేదు నాకు అందుకు ఎగోర్ ఎగోరోవిచ్ నన్ను చీవాట్లు పెట్టుతున్నాడు: ‘ఓ ముసలిదానా! నీకు పూర్తిగా పిచ్చెత్తి బుర్ర పనిచేయడం మానేసింది. అతడే గనక మన అబ్బాయే అయివుంటే మనకు చెప్పకుండా వుండడే! ఈ మనిషి ముఖంలాంటి ముఖంతో మనవాడే గనక వస్తే మనం నిజంగా గర్వించవలసిన విషయం,’ అంటూ నా మనస్సు మార్పించాలని చూస్తాడు ఎగోర్ ఎగోరోవిచ్ కాని తల్లి గుండె – తల్లిదే. తల్లి గుండెకి తెలుసు, అతడు వీడే, వాడు మన దగ్గరకు వచ్చాడు.. ఆ మనిషి పొయ్యిగూటిమీద నిద్ర పోయాడు నేను అతని యూనిఫారమ్ ఓవర్ కోటుని బ్రష్ చేయడానికని దాన్ని తీసుకుని తలుపు దగ్గరకు వెళ్లాను దాన్ని గుండెలకు హత్తుకుని ఏడ్చాను. అతడు వీడే, ఇది వాడిదే.. ఎగోరుష్క, నా బాబూ, నాకు వెంటనే ఉత్తరం రాయి, నాయనా క్రీస్తుతోడు, అసలేం జరిగిందో రాస్తావు కదూ? నువ్వు రాయకపోయేమాటుంటే, నాకు పిచ్చెత్తి పోతుంది – అది మాత్రం నిజం…”

            తన వృత్తాంతం నాతో చెబుతూ ఎగోర్ ద్ర్యోమొన్ ఈ ఉత్తరాన్ని నాకు, ఇవాన్ సూద రెవ్ కు  చూపించి చేతితో కళ్ళు తుడుచుకున్నాడు. నేను అతనితో ఇలా అన్నాను “ఇదుగో చెబుతున్నాను, స్వభావాలు ఘర్షణ పడుతు న్నాయి’ నీది వొట్టి తెలివితక్కువతనం’ వెంటనే తల్లికి ఉత్తరం రాయి. క్షమించమని ఆమెను వేడుకో. ఆమెకు మతి భ్రమించకుండా చూడు .. నీ ముఖం చూడడం ఆమెకెంతేనా అవసరం. ఇహ నిన్ను తన పంచప్రాణాలకంటే ఇంకా ఎక్కువగా చూసుకుంటుంది.”

            అతడు ఆ రోజునే ఇలా ఉత్తరం రాశాడు: “ప్రియమైన అమ్మా – మరియు పాలికార్ పావ్నకు , నాన్న ఎగోర్ ఎగోరోవిచ్ కీ!  నా అజ్ఞానానికి క్షమించండి మీ దగ్గరకు వచ్చింది నిజంగా నేనే, మీ కుమారుణి” ఈ  విధంగా, చిన్న అక్షరాలతో నాల్గు పేజీల ఉత్తరం రాశాడు. ఇంకా రాయగల్గే  వుంటే ఇరవై పేజీలు కూడా రాసేవాడే.  

            కొన్ని రోజులు గడిచిన తరువాత, ఒక రోజు మేము ఫిరంగులు పరిక్షించే ప్రదేశంలో నిల్చునున్నాం. సైనికుడొకడు  అక్కడికి పరిగెత్తు కొచ్చి, ఎగోర్ ద్ర్యోమొన్ తో , “కామ్రేడ్  కాప్టెన్’ మీరెక్కడున్నారని అడుగుతున్నా రెవరో… “అన్నారు. ఆ సైనికుడి వైఖరి అప్పుడేలా వుందంటే, అతడు రివాజు ప్రకారం సెల్యూట్ చేసి ఎటెన్షన్లో నిలబడినప్పటికీ, మంచి సరదాగా వున్నాడు. మేము గ్రామంలోకి వెళ్లాం. నేనూ, ద్ర్యోమొను  బసచేసిన ఇల్లు చేరుకున్నాం. ద్ర్యోమొను మనస్సు ఈ లోకంలో వున్నట్టు  లేదు. అంత సేపూ అలా దగ్గు తూనే వున్నాడు. నేనిలా అనుకున్నాను. “టాంకు మనిషి, అయితే నరాలపోగు.” ఇంటిలోపలికి వెళ్లాం. అతడు నా కంటే ఓ అడుగు ముందున్నాడేమో, నాకు వినబడింది. “అమ్మా! నమస్కారం. నేనే నమ్మా!…” నేను కన్నెత్తి చూశాను. ఆ ముసలి మనిషి పొట్టిగా వుంది, అతని హృదయంపై వాలిపోయివున్నది. చుట్టుపక్కలు కలియజూసేసరికి, అక్కడ మరో స్త్రీ కూడా వున్నట్టనిపించింది. నేను వొట్టు వేసుకుని చెబుతున్నాను – మరింకెక్కడైనా ఆవిడ కంటె అందమైన స్త్రీ వుండి వుండొచ్చు, కాని నేను మాత్రం చూడలేదు.

            అతడు తల్లివి వదలి ఈ అమ్మాయి వైపు వెళ్లాడు. కండలు తిరిగిన ఆ మల్లు జెట్టి  విగ్రహం చూస్తే నాకప్పుడు సాక్షాత్తూ యుద్ధ దేవుడు కుమారస్వామే గుర్తు కొచ్చాడు. “కాత్య!” అతను అన్నాడు. “కాత్య, మీరెందుకిక్కడికి వచ్చారు? మీరు నా కోసం కాసుకొని వుంటామని మాట ఇచ్చారు కాని, ఇందుకు కాదుగా….”

            నేను అప్పటికే ముందు నడవలోకి వెళ్లిపోయాను. కాని, అందాల బరిణ కాత్య  అతనికి చెబుతూన్న సమాధానం నాకు వినబడింది: “ఎగోర్, నేను మీతో జీవితమంతా వుండడానికే నిశ్చయించుకున్నాను. ముమ్మాటికీ మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను…. నన్ను వెనక్కి పంపించేయకండి ….’

            అదుగో అని రష్యన్ స్వభావాలు! సామాన్యపు మనుషుల్లానే కనబడుతారు. కానీ, కఠిన బాధలు ఎదురైనప్పుడు మాత్రం వాళ్ళ నుండి ఉత్కృష్టమైన శక్తి బయట పడుతుంది – అదే మానవ సౌందర్యం.

                     *   *  *

————————————————————————————————-

* సోవియట్ యూనియన్ ప్రధానం చేసే బహూకృతులన్నిటిలోనూ ఉన్నతోన్నతమైనది. – సం.

* పొగ రెండవ ప్రపంచయుద్ధంలో జర్మన్లు వుపయోగించిన పెద్దటాంకు . – సం

అలెక్సేయ్ తోల్ స్తోయ్

అలెక్సేయ్ తోల్ స్తోయ్ (1883-1945)  ప్రసిద్ధి కెక్కిన సోవియట్ రచయిత. ఆయన ప్రపంచ ఖ్యాతి గడించిన "మొదటి పీటర్" , "అగ్ని పరీక్ష" మొదలైన నవలల్ని, ఇంకా కొన్ని చిన్న కథలను, నాటకాలను, పిల్లల కథలను రాసాడు.

కొసరాజు లక్ష్మి నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *