“మరచిపోయిన జీవితాన్ని గుర్తు చేసేదే ‘జాతర’ కవిత్వం”

Spread the love

‘జాతర’  కవితలో లోకం మొత్తాన్ని అన్ని కోణాల్లో చూపించి, మనిషి స్వరూప స్వభావాలను తేల్చి చెప్పారు కవి శ్రీనివాస వాసుదేవ్.

“జాతర” బ్రతుకు పాటల కోరస్.. కవితా సంపుటిలో కవి శ్రీనివాస్ వాసుదేవ్ అన్నట్టు

“ఓ కవిత కాగితంపై రూపం సంతరించుకునేముందు రెండు ప్రధానమైన స్థితులను దాటి వస్తుంది. ముందుగా కవి తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తాడు. అక్కడే అతను మామూలు మనిషిని దాటి ముందుకెళ్తాడు. ఇకరెండో అడుగు– తను పరిశీలించిన ప్రపంచాన్ని ఎంత హృద్యంగా చెప్పగలిగాడన్నది. ఇక్కడే భాష ప్రాధాన్యం బయల్పడుతుంది. భాషా, భావం కల్సినప్పుడే ఓ కవిత చాలా సహజంగా పాఠకునిముందుకొస్తుంది.”.

“జాతర” కవిత్వం నిండా మనిషి కోల్పోయిన జీవితం ఉంది.మనిషి మరచిపోయిన బాల్యం, అనేక అనుభూతులు, స్నేహాలు, ప్రేమలు ఉన్నాయి.

“పావలా రంగుల రాట్నం, పది పైసల సిన్మాబొమ్మలూ మామిడితాండ్రా, రంగుటద్దాలూ

ఓ స్వేచ్ఛానుగీతం! పావలాకే జీవితావిష్కరణ… రంగుల్లో!” అంటూ మొదలవుతుంది”జాతర” కవిత.

“అందాన్నీ ఆనందాన్నీ రంగుల్లో వెతుక్కునే జనం /అమాయకంగా జీవితాన్ని దాటవేసేది ఇక్కడే/ తాటితాండ్రా, తాటాకులో మడిచిన మాంసమూ/ ఉప్పూరగాయా, ఉసిరికాయల పులుపూ /జీవితాన్ని నిర్వచించేవే /ఐనా, అమాయకత్వం లో బతికేయటం ఎంత బావుంటుందనీ…”అని కవి అనటంలోని మార్మికత పాఠకులకు జీవితం గురించి, తమ గతం గురించి, బాల్యం గురించి పునరాలోచింప చేస్తుంది.

*

“జీవితమే ఓ జాతరయితే!ఆఖరికి …బతికుండడమే/ ఓ జాతర”  అనటంలోని తాత్వికత జీవితం పట్ల పాఠకులకు కొత్త ఎరుక కలిగిస్తుంది.

*

మనిషి గురించి, వర్షం గురించి, ఒంటరితనం గురించి, స్నేహం గురించి ,ఔదార్యం గురించి ,నటనల గురించి, మనిషి లోపలి మనసు గురించి, కొన్ని ఆనవాళ్ళ గురించి మరికొన్ని జ్ఞాపకాల గురించి.. మనందరి గురించి ఎన్నెన్నో వాస్తవాలు ఈ జాతర నిండా…!

వర్షంలో పాటలాంటి “జాతర” పాఠకులకు కవిత్వ దాహాన్ని తీరుస్తుంది.

*

ప్రేమైక జీవితం, మనసుతో కాసిన్ని మాటలు, కొత్త ఏకాంతం, వర్షం, సముద్రం, పంకిణీ…శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వం “ఆకుపాట ” నుండి ఇప్పుడు “జాతర”వరకు వచ్చింది.

చాలా నిశ్శబ్దంగా మొదలై మనలోని  గొప్ప సంగీతాన్ని మనకే పరిచయం చేసే కవిత్వం శ్రీనివాస్ వాసుదేవ్ ది. తన కవిత్వం నిండా అనేక వస్తువులు.. వస్తు వైవిధ్యం ఉంటుంది. కవిత్వం అంతటా జీవితం అనే ఒకే వస్తువు విభిన్న రూపంలో కొనసాగుతూ ఉంటుంది. కవిత్వం చదువుతున్నంత సేపు ఒక మనోమయ ప్రపంచంలో మనం నిశ్శబ్దంగా ఉండిపోతాం. వర్షపు చిరుకుల్లో తడిసిపోతాము. పక్కనే సముద్రం హోరు వినిపిస్తూ ఉంటుంది. గుడిమెట్లు గుర్తొస్తాయి.మనదైన ఒక ఊరు అమ్మ నాన్నలు గుర్తుకొస్తారు.మరణం తర్వాత జీవితం ఏమిటో ఇతడి కవిత్వం చెబుతోంది. జీవితాన్ని ప్రశ్నించే మరణాల గురించి జీవితాన్ని నిర్వచించే మరణాల గురించి, మనల్ని సమయాత్తపరిచే మరణాల గురించి ఇతడి కవిత్వం చెబుతోంది.

*

మరణం చాలా విషయాలను చెబుతుంది. మరణానికి ముందు అర్థం కాని చాలా విషయాలు మరణం తర్వాత అర్థం అవుతాయి మరణం అనేక ఆలోచనలను మనిషికి కల్పిస్తుంది. మరణం గురించి మరణానికి ముందు తర్వాత గురించి శ్రీనివాస్ వాసుదేవ్ తన కవిత్వంలో ఏమంటున్నాడో చూడండి

“ఓ మరణం తర్వాత…”

                “ నచ్చిన పెదాలపై ఘాఢమైన ముద్దు/స్నేహితుడి ఆలింగనం/పువ్వులమ్మే పద్మ పలకరింపు పొద్దున్నే/రంగోలీ అంటూ రంగులమ్మే రామాయమ్మా/ఇవేమీ ఉండవనే బాధే మరణభయం- “ అంటాడు కవి. ఎంత సున్నితమైన, ఎంత సత్యవంతమైన తాత్వికతకు ఎంత అందమైన కవితా రూపం ఇచ్చాడో చూడండి.

                జీవితంలో ఎన్ని లెక్కలు ఉంటాయో అన్ని లెక్కల గురించి శ్రీనివాస్ వాసుదేవ్ చెబుతాడు..మానవ సంస్కారానికి సంబంధించిన కవిత్వం తనది. మానవసంబంధాలను మెరుగు పరచుకోవటానికి ,మనిషిని సమయాత్తపరిచే కవిత్వం తనది. ఈ కవిత్వం నిజానికి చాలా భాషల్లోకి అనువాదం కావాల్సి ఉంది. ఈ కవితా సంపుటి లోని చాలా కవితలు అన్ని భాషల్లోకి అనువాదం అయితే అన్ని భాషల్లోని వాళ్ళు ఈ కవిత్వాన్ని చదువుకోగలిగితే అప్పుడు ఈ కవిత్వం విశ్వవ్యాప్తం అవుతుంది.

                స్నేహం గురించి జీవితం గురించి మంచి గురించి ప్రేమ గురించి దుఃఖం గురించి, నాన్న గురించి, మానవ సంబంధాల గురించి, అనుబంధాల గురించి ఈ కవితా సంపుటిలోని నిర్వచనాలు ఆశ్చర్యం కలిగిస్తాయి .ఎంత లోతైన అవగాహనతో ఎంత సృజనాత్మకంగా చాలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఈ కవిత్వం ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కవిత్వం లో ఎక్కడా సంక్లిష్టతా లేదు , అయోమయం అసలే లేదు.

                ముఖ్యంగా కొత్తగా రాస్తున్న కవులు శ్రద్ధగా అధ్యయనం చేయాల్సిన కవుల్లో శ్రీనివాస్ వాసుదేవ్ ఒకరు. ఒక వస్తువు కవితగా ఎట్లా రూపాంతరం చెందుతుంది. ఒక కవిత మంచి కవితగా ఎలా పాఠకుల అభిమానాన్ని సంపాదించుకుంటుందో తెలుసుకోవడానికి ఈ కవిత్వం ఒక అద్భుతమైన ఉదాహరణ.

                మంచి కవిత్వాన్ని పదేపదే చదువుకోవటం కొత్త కవులకు ఎంతో మేలు చేస్తుంది .అట్లా శ్రద్ధగా అధ్యయనం చేయాల్సిన కవుల్లో శ్రీనివాస్ వాసుదేవ్ ఒకరని  ఈ కవితా సంపుటి నిరూపిస్తున్నది.

*

శరీరంలోని ప్రతి కణం హృదయం ఐతే ఏమవుతుందో ఈ కవిత్వం చెబుతుంది. మనసు కష్టంలోంచి మాట, పాట వస్తే ఎలా ఉంటుందో ఈ కవి చెబుతాడు. ఏదీ ఒక రేపటికి ఉండదు కానీ ,ఎప్పటికీ కవిత్వం ఉంటుందని, జీవితం ఉంటుందని, చెబుతూనే మరణానంతర జీవితం అంటే ఏమిటో కూడా చెబుతాడు కవి. జీవితంలోని ప్రతిక్షణం ప్రతి అనుభవం ప్రతి అనుభూతి ప్రతి మనిషి ప్రతి సందర్భం ప్రతి కలయిక ప్రతి వీడ్కోలు ప్రతి విరామం ప్రతి ముగింపు ప్రతి మరణం మనిషిని ఎలా మారుస్తున్నాయో, ఎలా ఏమారుస్తున్నాయో కవి నిస్సంకోచంగా నిర్భయంగా నిర్మొహమాటంగా చెబుతాడు. ఏవైనా ఎవరి పట్ల అయినా ఎందుకైనా మనకు మిగిలిన భ్రమలని పటాపంచలు చేస్తుంది ఈ ‘జాతర’ కవిత్వం. నిఖార్శైన ఈ కవిత్వంలోంచి తేరుకోవడం చాలా చాలా కష్టం. ఒకే సమయములో ఏకాంత సమూహాల్లోకి మనం చేసే ఒక నిశబ్ద ప్రయాణం ఈ కవిత్వం.

                అనేక ముగింపులతో, అనేక ప్రారంభాలతో,  అనేక కొసమలుపులతో,అనేక కొసమెరుపులతో, ఒక గొప్ప తాజాదనంతో ఈ కవిత్వం మనల్ని ఏవేవో లోకాలకు తీసుకువెళుతుంది. అన్ని లోకాలు చూశాక అంతర్ లోకంలోకి ప్రవేశిస్తాం. మనల్ని ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే మనల్ని మనం వెతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం.

                బహుశా ఒక వాంగ్మూలం లాంటి కవిత ఏదో మనకు పడాల్సిన శిక్షల గురించి, మన తప్పుల గురించి సత్యవంతంగా వాస్తవాలను మాత్రమే మాట్లాడుతుంది.

ఒక కవి మాట్లాడటానికి, ఒక కవిత మాట్లాడటానికి ఉన్న, ఉండాల్సిన తేడాను ఈ కవిత్వం చదువుతున్నప్పుడు మనం తెలుసుకుంటాం. కవి మాట్లాడటం కన్నా కవిత్వం మాట్లాడటమే ఎప్పుడూ మహత్తరంగా ఉంటుందని ఈ పుస్తకం చదివాక అర్థం అవుతుంది.

*

మంచి కవిత్వాన్ని  చదవాలనే  కొత్త కవులకు, పాఠకులకు ఈ పుస్తకం ఒక పాఠ్యాంశం. శ్రద్ధగా అధ్యయనం చేయాల్సిన కవుల్లో శ్రీనివాస్ వాసుదేవ్ ఒకరని ‘జాతర’ కవితా సంపుటి చెపుతుంది.

*

                 “ అమానుషమిది బియాస్! ” కవితలో హిమాచల్ ప్రదేశ్ లో జల ప్రవాహం లో కొట్టుకు పోయిన హైదరాబాద్ విద్యార్థుల దారుణమైన చావులు మనకు కన్నీళ్ళు తెప్పిస్తాయి.

                అమానుషమిది, అన్యాయమిది బియాస్/అలలకీ, కెరటాలకీ మధ్య నీచ నిర్వచనం/ఊపిరికీ, ఊసులకీ మధ్య ప్రాణంతొ పెనుగులాట/మాయ చేసి మభ్యపెట్టేసావు/కన్నీళ్ళకి, కర్మకాండలకీ కానరాకుండా కలిపేసుకున్నావు

                పార్ధీవదేహాల బొమ్మలకొలువు నీకవసరమైందా బియాస్!

….

                జీవితాన్నింకా తవ్విపోసుకోలేదు, /లోపలిమెట్లనీ లెఖ్ఖకట్టలేదు/ ఆప్యాయత ఆర్ద్రత తడింకా ఒంటికంటలేదే/

అలల పొట్టన కట్టేసుకున్నావు/ ఓ కెరటాన్నైనా వెనక్కి లాక్కెళ్ళగలవా?/అమ్మల రోదనలూ అమ్మమ్మల వేదనలూ/ వినపడలేదా బీభత్స బియాస్/ మరణాన్ని వాయిదా వెయ్యమన్న/ఆర్తనాదాలు నీ హోరులో కల్సిపోయాయా

అమానుషమిది, అన్యాయమిది బియాస్

*

ప్రపంచీకరణ, కరోనా, బ్రతకటానికి తీరిక లేని మనుషులు, భయపెట్టే ప్రమాదాలు , మరణాల మధ్య ఎన్నో కవితలు..ఈ “జాతర” కవితా సంపుటి నిండా మనకు కొత్త చూపునిస్తాయి.

*

మంచి కవిత్వానికి మొహం వాచిపోయిన పాఠకులకు ఈళ “జాతర ” మంచి కవిత్వాన్ని రుచి చూపిస్తుంది.

 ఈ కవితా సంపుటి చదివాక మనం ఈ కవిత్వం గురించి నలుగురితో మాట్లాడకుండా మౌనంగా ఉండలేం.మనచేత  మాట్లాడించే “జాతర”లాంటి మంచి పుస్తకాలను మనం తప్పకుండా వెతికి చదవాల్సిందే.

పలమనేరు బాలాజీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *