మూడవ భాగం
అధ్యాయం-3
పచ్చని సూర్యకాంతి తెచ్చిన ఉక్కపోతతో కప్పబడినట్టు ఉంది ఆ పచ్చిక మైదానం. పంటలు కోసే యంత్రం పట్టుకుంటేనే చుర్రుమనేంత కాలుతూ ఉంటే, నీలం-పచ్చ మిళిత రంగులో ఉన్న ఆకాశం కూడా తలెత్తి చూడటానికి భయపడేంత వేడిగా ఉంది.గోధుమలు కోసినా, అక్కడక్కడా పెరిగిన చిన్న పొదలు, వాటికి పూసిన పూలతో అక్కడంతా పసుపుపచ్చగా ఉంది.
ధాన్యం కోతల కోసం ఆ గ్రామమంతా ఆ పచ్చిక మైదానం దగ్గరే ఉంది. ఆ కోతల వల్ల గుర్రాలు ఒకపక్క అలసిపోతూ ఉంటే, అక్కడ గాలిలో కలిసిపోయిన దుమ్ము, వేడి వల్ల ఆ గ్రామస్థులు కూడా ఊపిరాడనట్టు అయిపోతున్నారు. అప్పుడప్పుడు నది మీదుగా వస్తున్న గాలి వల్ల అక్కడ ఉన్న దుమ్ము పైకి లేస్తూ, భగ్గుమంటున్న సూర్యుడి కాంతికి మధ్యలో ఓ పొరలా గాలిలో ఏర్పడుతూ ఉంది.
ధాన్యాన్ని కోస్తూ ఉన్న పెట్రో, అప్పటికే ఉదయం నుండి సగం పీపా నీళ్లు తాగాడు.గోరువెచ్చగా, ఏ రుచి లేకుండా ఉన్న ఆ ద్రవాన్ని అతను తాగిన మరుక్షణమే నోరంతా ఎండిపోయినట్టు అనిపించేది. అతని చొక్కా, పైజామా చెమటతో తడిసిపోయి, అతని ముఖం మీద నుండి కిందకు చెమట కారుతూ ఉంది.ఆ ఎండకు చెవులు గింగుర్లు తిరుగుతున్నట్టు,గొంతులో మాట పూడుకుపోయినట్టు అనిపించింది అతనికి. ముఖం అంతా కప్పుకుని ఉన్న దర్యా,ధాన్యాన్ని పనలుగా కడుతూ,ఆ ఎండకు లోపల గాలి ఆడనట్టు ఉండటంతో గౌను పైన హుక్సులు తీసింది. ధాన్యం గింజల్లా చెమట ఆమె రొమ్ముల మధ్య బిందువుల్లా జారుతూ ఉంది.నటాల్య కోత పరికరానికి కట్టి ఉన్న గుర్రాలను అదిలిస్తూ ఉంది. ఆ ఎండలో ఆమె బుగ్గలు బీట్ రూట్ చాయలోకి మారాయి,ఆమె కళ్ళ నుండి నీరు కారుతూ ఉన్నాయి. పాంటెలి ఎవరో తరుముతున్నట్టు ఆ పంట వరుసల్లో నడుస్తూ జరిగే పనిని చూస్తూ ఉన్నాడు. అప్పటికే చెమటతో తడిసి ఉన్న అతని చొక్కా ఎండకు ఇంకా వేడెక్కి,చిందరవందరగా ఉన్న గడ్డం బుగ్గ నుండి ఏదో కరిగిపోతున్న గ్రీజు వేలాడుతున్నట్టు ఉంది.
‘ఎండతో తడిసిపోయావా?’పక్కనే బండి మీద వెళ్తూ ఉన్న ఖ్రిస్టోన్య అరిచాడు.
‘బాగా తడిసిపోయాను’!’పాంటెలి అతనికి బదులిస్తూనే అతని పక్క నుండి నడుచుకుంటూ వెళ్తూ, తన పొట్టను చేత్తో నిమురుకున్నాడు.
‘పెట్రో!ఇకా చాలు,నేను ఉండలేను’,దర్య అరిచింది.
‘కొద్దిసేపు ఆగు,ఈ వరస పూర్తి చేద్దాము.’
‘అలా అయితే ఎండ తగ్గేవరకు ఆగుదాము.ఇక నా వల్ల కాదు.’
నటాల్య గుర్రలతో సహా ఆగిపోయింది. తానే పంట కోస్తున్నట్టు రొప్పుతూ ఉంది. దర్య మెల్లగా ఆమె వైపు నడుచుకుంటూ వెళ్లింది,ఆమె పాదాలు బూట్ల రాపిడి వల్ల నల్లగా మారిపోయాయి.
‘పెట్రో, ఇక్కడికి దగ్గరలో ఒక సరసు ఉంది.;
‘ఎక్కువ దూరం కాదు! మూడు వెరస్టులు ఉంటుంది!’
‘నాకు అందులో ఈత కొట్టాలని ఉంది.’
‘మనం ఇక్కడ నుండి నడిచి వెళ్ళేటప్పుడు వెళ్దాము…’అంది నటాల్య.
‘మనమెందుకు నడవాలి?గుర్రాలను బండి నుండి విప్పదీసి,వాటి మీద వెళ్దాము!’
ధాన్యపు పనలను శుభ్రంగా ఉన్న చోట పెడుతూ ఉన్న తండ్రి వైపు పెట్రో చూశాడు.
‘వాటిని తీసుకువెళ్ళండి,అమ్మాయిలు!’
దర్య వెంటనే అక్కడే ఉన్న ఓ ఆడగుర్రాన్ని బండి నుండి వేరు చేసి,దాని మీద ఒడుపుగా ఎక్కింది.
నటాల్య తడారిపోయిన తన పెదవులను తడుపుకుంటూ,చిన్నగా నవ్వి, కోత పరికరం కట్టి ఉన్న బండి దగ్గరకు వెళ్ళింది. ఒక గుర్రం కట్టి ఉన్న ఆ బండి మీద ఆమె ఎక్కబోతుంటే, ‘నేను నీకు చేయి అందిస్తాను’,అన్నాడు అప్పటికే దానిలో ఎక్కిన పెట్రో.
వారు ఆ బండి మీద ముందుకు పోతూ ఉంటే, గౌను మోకాళ్ళ పైకి లేచిపోయి, తలకు కట్టుకున్న చేతి రుమాలు కిందకు జారిపోతూ ఉంటే, దర్య గుర్రాన్ని ముందుకు దౌడు తీయించింది. ఆమె గుర్రం మీద కొసాక్కులా కూర్చుంది.’జాగ్రత్త! ఆ గుర్రంకు ఏమి కాకుండా చూడు’, వెనుక నుండి పెట్రో అరిచాడు.
‘ఎవడికి కావాలి!’ చేయి ఊపుతూ అరిచింది దర్య.
కొద్దిగా దూరం ముందుకు వెళ్ళాక, పెట్రో ఎడమ వైపు చూశాడు.దూరంగా బూడిద రంగులో దుమ్ము రహదారి నుండి పైకి లేస్తూ, గ్రామం దిశగా పయనించసాగింది.
‘ఎవరో హడావుడిలో ఉన్నట్టు ఉన్నారు’, పెట్రో అటు వైపే చూస్తూ అన్నాడు.
‘అవును. అతను వెళ్తూ రేపుతున్న దుమ్ము చూస్తే అలానే అనిపిస్తుంది’, నటాల్య ఆశ్చర్యంగా అంది.
‘దేని కోసం? దర్య!’పెట్రో అరుస్తూ, తన భార్యను దాటుతూ,’ఒక్క నిమిషం ఆగు! అటువైపు వెళ్తూ ఉన్న ఆ మనిషి ఎవరో చూద్దాము’, అన్నాడు.
పైకి లేస్తున్న దుమ్ము దగ్గరవుతూ ఉంది.
ఆ దుమ్ములో నుండి గుర్రం మీద వస్తున్న ఓ వ్యక్తి కనిపించాడు.ఇంకో ఐదు నిమిషాల్లో ఆ వ్యక్తి కొద్దిగా కనిపించాడు. పెట్రో తన టోపీ మీద చేయి పెట్టుకుని అతని వైపే చూస్తూ ఉన్నాడు.
‘అతని గుర్రం ఎక్కువ సేపు అంత వేగంగా వెళ్ళలేదు, మరి అంత వేగమా!’
పెట్రో ముఖం చిట్లిస్తూ, తల కిందకు దించాడు. ఓ రకమైన అయోమయం అతని మెదడులో నిండిపోయింది.
ఇప్పుడు ఆ యాత్రికుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఇంకా అతను అంతే వేగంగా ముందుకు సాగిపోతూ,తన టోపీని ఎడమ చేత్తో పట్టుకుని, కుడి చేతిలో ఏదో జెండా లాంటిది గట్టిగా పట్టుకుని ముందుకు సాగిపోతూ ఉన్నాడు.
అప్పుడే ఆ మార్గం గుండా వెళ్తున్న అతను పెట్రోకి ఎంత దగ్గరగా వచ్చాడంటే, అతని గుర్రం ఆ వేడి గాలిలో రొప్పుతూ, ఊపిరితిత్తుల్లోకి తీసుకుంటున్న శ్వాస శబ్దం కూడా పెట్రోకి వినిపించింది.’జాగ్రత్త!’ అని ఆ స్వారీ చేస్తున్న వ్యక్తి అరిచినప్పుడు అతని నోరు చదనపు రాయిలా అనిపించింది.
అతను ముందుకు సాగిపోతూ ఉంటే, గుర్రపు డెక్కలు దుమ్ము రేపుతూ ఉన్నాయి.పెట్రో ఆ స్వారీ చేస్తున్న వ్యక్తిని తన కళ్ళతోనే అనుసరించాడు, ఆ తర్వాత అతనికి గుర్తుంది మాత్రం రొప్పుతూ అతి కష్టం మీద శ్వాస తీసుకుంటున్న గుర్రం, అలాగే చెమటతో తడిచిన జీను,అంతే!
ఇంకా తలెత్తిన ఉపద్రవం గురించి పూర్తిగా తెలియక, పెట్రో ఆ గుర్రపు వేగంతో సమానంగా గాలిలోకి లేస్తున్న దుమ్ముని, అది ముందుకి సాగుతూ ఉంటే, వెనుక బడుతూ ఉన్న పచ్చికలను చూస్తూ ఉన్నాడు. కొసాక్కులు అన్ని దిక్కుల నుండి వేగంగా ఆ పచ్చిక మైదానం మీదుగా వేగంగా గుర్రాల మీద పోతూ ఉన్నారు. ఆ పచ్చిక మైదానం మొత్తంగా ఎక్కడ నుండి అయితే కొండ చిన్న చుక్కలా కనిపిస్తూ ఉందో, అక్కడ నుండి గ్రామం వరకు కొసాక్కులు గ్రామం వెళ్ళే దారి వరకు ఉన్న దారంతా దుమ్ముతో నిండిపోయింది.
మిలిటరీ సేవకు అర్హమైన ప్రతి కొసాక్కు పొలంలో ఎక్కడి పని అక్కడ వదిలేసి, గుర్రాలను కోత యంత్రాల నుండి తప్పించి వేగంగా వాటి మీద గ్రామం వైపు సాగిపోయాడు. పెట్రో చూస్తుండగానే ఖ్రిస్టోన్యా బండికి కట్టి ఉన్న తన మేలు జాతి గుర్రాన్ని బండి నుండి తప్పించి, వేగంగా దాని మీదకు దూకి,పదేపదే వెనక్కి చూస్తూ ముందుకి వెళ్తున్నాడు.
‘అసలు ఇదంతా దేని గురించి?’ నటాల్య పెట్రో వైపు భయంగా చూస్తూ అంది. ఆ చూపు భయపడిన కుందేలు పిల్ల చూపులా ఉంది. ఆ భయం పెట్రోలో కూడా తెలియని చింతను కలిగేలా చేసింది.
వెంటనే అతను వెనక్కి వెళ్ళి, గుర్రం ఆగకముందే కిందకు దూకి, వేడికి తట్టుకోలేక కింద పడేసిన పైజామాను వేసుకుని, తండ్రి వైపు సూచనగా చేయి ఊపి, మిగిలిన వారిలానే దుమ్ము గాలిలోకి రేపుతూ వారితో కలిసిపోయాడు.
* * *
అధ్యాయనం-4
కూడలి దగ్గర జనం గుమిగూడుతూ ఉన్నారు. గుర్రాలు, కొసాక్కుల యుద్ధ సామాగ్రి, రెజిమెంట్ల సంఖ్యలను సూచించే భుజాల పట్టీలు, వరుసల్లో పెట్టబడ్డాయి.సాధారణ రెజిమెంటు కన్నా ఒక హోదా ఎక్కువైన అటామన్ లైఫ్ గార్డ్స్ రెజిమెంట్ కు చెందిన వారు, లేత నీలం రంగు టోపీలు ధరించి డచ్ కు చెందిన మేలైన బాతులు తమ కన్నా తక్కువ రకానికి చెందిన మిగిలిన వాటితో తిరుగుతున్నట్టు వారు ఆ ప్రదేశంలో తచ్చాడుతూ ఉన్నారు.
సత్రాలన్నీ మూసివేయబడ్డాయి. మిలిటరీ పోలీస్ చీఫ్ ముఖం చాలా బాధగా, ఎందుకో దిగులు పడుతున్నట్టుగా ఉంది. ఆ ఆదివారం స్త్రీలందరూ మంచి బట్టలు వేసుకుని వీధుల దగ్గర ఉన్న కంచెల దగ్గర నిలబడి ఉన్నారు. అక్కడ గుంపుగా ఉన్న జనాల పెదవుల మీద ఒకటే మాట తాండవమాడుతుంది:’జనాల కూడిక.’ముఖాలు కందిపోయి అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ, వాదించుకుంటూ ఉంటే అక్కడే ఉన్న గుర్రాలకు కూడా అదే అర్థమైనట్టు కోపంగా సకిలించాయి..ఆ కూడలి వీధులన్నీ దుమ్ముతో నిండిపోయి ఉంటే, ఆ దుమ్ములోనే ఖాళీ వోడ్కా సీసాలు, స్వీట్ల కవర్లు కూడా కలిసిపోయాయి.
పెట్రో నడుస్తూ, తన వెనుకే గుర్రాన్ని కూడా నడిపించసాగాడు. అక్కడ ఉన్న ఒక కంచె దగ్గర ఎత్తుగా, దృఢo గా, నల్ల జుట్టుతో ఉన్న ఒక గార్డ్స్ మెన్ నీలం రంగు పైజమాను సరిచేసుకుంటూ ఉన్నాడు. అతని పెదవుల మీద చిరునవ్వు. అతని పక్కనే బలమైన దేహంతో ఉన్నది ఓ స్త్రీ.. అతని భార్య లేక ఉంపుడుకత్తె కావచ్చు. ఆమె ఏదో నసుగుతూ ఉంది.
‘నేను నీకు అది ఇస్తాను..నువ్వు తిరుగుతున్న దాని కోసమే కదా!’
ఆమె తాగి ఉన్నది, చిందరవందరగా ఉన్న ఆమె జుట్టులో, ఆమె భుజాల మీదుగా కప్పి ఉన్న రంగురంగుల శాలువా నుండి పొద్దుతిరుగుడు ఊక ఉంది. తన బెల్టు బిగుతుగా పెట్టుకుంటూ, అతను తన రెండు కాళ్ళు మధ్యలో జాగా ఉండేలా జరిపాడు, ఆ జాగా ఎంత ఉందంటే ఒక సంవత్సరం వయసున్న దూడ చాలా తేలికగా ఆ జాగాలో నుండి అతని కిందిగా వెళ్ళిపోవచ్చు.
‘పో, మాష్కా!’
‘నువ్వో కుక్కవి, కనిపించిన ఏ ఆడదానిని వదలవు!’
‘సరే, అయితే ఏమిటి?’
‘నువ్వు, ఎర్రగా ఉండే నీ కళ్ళు!’
దగ్గరలోనే ఎర్ర గడ్డంతో ఉన్న ఒక సార్జెంట్ మేజర్, ఆయుధాల దళంలో పని చేసిన ఓ వ్యక్తితో వాదిస్తున్నాడు.
‘అలాంటిదేమి జరగదు! మనల్ని ఇలా ఒక రోజో రెండు రోజులో ఇలా ఇక్కడ ఉంచుతారు, తర్వాత తప్పకుండా ఇళ్ళకు పంపించేస్తారు.’
‘కానీ యుద్ధం జరగబోయే అవకాశం ఉందని అంటున్నారు?’
‘స్నేహితుడా! దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!ఈ ప్రపంచంలో ఏ దేశం మన ధాటికి నిలబడగలేదు?’
వాళ్ళ పక్కనే ఓ వాదన నడుస్తూ ఉంది;యవ్వనంతో అందంగా ఉన్న ఒక కోసాక్కు తన నిగ్రహాన్ని కోల్పోతూ ఉన్నాడు.
‘మనకి, దానికి సంబంధం లేదు. వాళ్ళకు కావాలంటే వాళ్ళే యుద్ధం చేస్తారు, ఇంకా మనకు ఇంకా పంట కూడా చేతికి రాలేదు.’
‘ఇది చాలా భయంకరంగా ఉంది!ఒక్కసారి చూడండి ఎంతమందిని ఇక్కడ పోగు చేశారో చూడండి. సంవత్సరంలో ఈ సమయంలో మనకు ప్రతి రోజు విలువైనదే!’
‘పశువులను అలా వదిలేసి ఎలా వెళ్తాము.’
‘ఇప్పుడే బార్లీ కూడా చేతికి రాబోతుంది.’
‘అంటే ఆ ఆస్ట్రీయా జారును దింపేశారు, అవునా?’
‘అతని వారసుడిని.’
‘ఓ కోసాక్కు, నువ్వు ఏ రెజిమెంటులో ఉన్నావు?’
‘ఏంట్రా ఎలా ఉన్నావు? ఒకేసారి ధనవంతుడివి అయిపోయావా ఏంటి?’
‘నీకెందుకు? అయినా నువ్వు ఎక్కడనుండి ఊడిపడ్డావు?’
‘ఒకవేళ ఏదైనా జరుగుతుందేమోనని ముందు జాగ్రత్తగా మనల్ని ఇక్కడకు పిలిచారని అటామన్ చెప్పాడు.’
‘కోసాక్కులు, జాగ్రత్తగా ఉండండి!’
‘ఇంకొక సంవత్సరం ఆగితే నేను మూడవ రిజర్వు నుండి బయటకు వచ్చేస్తాను.’
‘నువ్వు ఇక్కడకు ఎందుకొచ్చావు తాతయ్యా? ఇంకా నీకు ఇక్కడ స్థానం ఉందనే అనుకుంటున్నావా?’
‘ఒక్కసారి మనల్ని పంపించడం మొదలుపెడితే, త్వరలోనే వారు వృద్ధుల వద్దకు కూడా వస్తారు.’
‘వాళ్ళు మద్యం దుకాణం కూడా మూసివేశారు.’
‘నోరు మూసుకో!మర్ఫుట్కా తలుచుకుంటే ఇక్కడ కూడా మందు అమ్మగలడు నీకు కావాలంటే!’
అక్కడకు వచ్చిన కమిషన్ తనిఖీ మొదలుపెట్టింది. ముగ్గురు కోసాక్కులు ముఖమంతా రక్తం కారుతూ ఉన్న ఒక తాగుబోతును పరిపాలన కార్యాలయానికి తీసుకువెళ్తూ ఉన్నారు.అతను వెనక్కి వాలిపోతూ, చొక్కా చించుకుంటూ, తన కాల్మక్ కళ్ళు తిప్పుతూ,’ఆ ముజిక్కుల రక్తం కళ్ళజూస్తాను! వాళ్ళకు డాన్ కొసాక్కు బలం ఏంటో చూపిస్తాను’, అని అరుస్తున్నాడు. అక్కడ ఉన్నవారు వెనక్కి తొలగి వారికి దారిచ్చి, వారు ముందుకు వెళ్తూ ఉంటే నవ్వుకుంటూ, జాలితో కూడిన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
‘అదే సరైనది, వారికి అలానే బుద్ధి చెప్పాలి!’
‘అతన్ని ఎందుకు అలా బాదారు?’
‘ఆ ముజిక్కుల్లో ఒకడిని కొట్టాడంట.’
‘వాళ్ళకు అలా జరగాల్సిందే!’
‘మనం కూడా నాలుగు తగిలించాలి!’
‘ఓ అబ్బాయి,1905 లో నేను సైన్యంలో పని చేసేటప్పుడు నన్ను వారిని సరిగ్గా అదుపులో ఉంచమని పంపించారు. అదో నవ్వుకునే విషయమే!’
‘ఒకవేళ మళ్ళీ యుద్ధం వస్తే అదే పని మనకు మళ్ళీ ఇస్తారు.’
‘సరే,వాళ్ళకు కావాలంటే ఎంతమందినైనా పెట్టుకోని! కావాలంటే స్వచ్చందంగా వచ్చే వారిని పెట్టుకుంటారు. లేకపోతే పోలీసులు యుద్ధం చేస్తారు. కానీ కోసాక్కుల పని అయితే ఇది కాదు.’
మొఖోవ్ దుకాణంలో కౌంటర్ దగ్గర ఓ గొడవ మొదలైంది. తాగి ఉన్న ఇవాన్ టోమిలిన్ అక్కడ ఉన్న యజమానులతో గొడవకు దిగాడు. తన చేతులు చాచి, సెర్జి ప్లాటోనోవిచ్ అతనితో గొడవ పడుతూ ఉంటే; అతని భాగస్వామి లిస్పి అట్యోపిన్ తలుపు దగ్గరకు వెనక్కి వెళ్తూ ఉన్నాడు.
‘నిజంగా ఇది చాలా దౌర్జన్యం! ఒరేయ్, త్వరగా వెళ్ళి అటామాన్ ను పిలుచుకుని రా!’అని అరిచాడు.
చెమట పట్టిన తన చేతులను తన పైజామాకు తుడుచుకుంటూ, టోమిలిన్ ముఖం చిట్లించుకుంటూ తన వైపే చూస్తున్న సెర్జి ప్లాటోనోవిచ్ వైపుకి దూసుకు వెళ్ళాడు.
‘ఒరేయ్ వెధవా!నువ్వు నా అంతు చూస్తావా? నువ్వా? ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నావా? నేను నీ ముఖం పచ్చడి చేస్తాను, అయినా నువ్వు నన్ను ఏమి చేయలేవు! మా కోసాక్కుల హక్కులను హరిస్తున్నావు!మురికి కుక్క!పనికిమాలినోడా!’
ఆ గ్రామపు అటామాన్ తన మనసులోనే ఆ సంఘటనను తన చుట్టూ ఉన్న కోసాక్కులకు అనుకూలంగా ఉండేలా ఏం చేయొచ్చో ఆలోచించుకుంటూ ఉన్నాడు.
‘యుద్ధమా? లేదు, ఎటువంటి యుద్ధము లేదు. పై అధికారులు కేవలం ఇదంతా ఊరికే తప్ప నిజంగా యుద్ధం రాదంటా. దానిని మనం నమ్మొచ్చు.’
‘సరే, అయితే అది మంచి విషయమే!అయితే నేను ఇంటికి వెళ్ళగానే పొలానికి వెళ్తాను.’
‘పని అటూ ఇటూ కాకుండా మధ్యలో ఆగిపోయింది.’
‘అసలు అధికారులు దీని గురించి ఏమనుకుంటున్నారో దయచేసి చెప్పండి. నా 250 ఎకరాలలో జొన్న వేసాను.’
‘టిమోష్కా!వెళ్ళి మనవాళ్ళకు రేపటి కల్లా ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పు.’
‘వాళ్ళు ఆ నోటీసులో చదవబోతుంది కూడా అదే అనుకుంటా, రండి వెళ్ళి విందాము ఏమి చెప్తారో.’
ఆ కూడలి ఆ రాత్రి అంతా సందడిగానే ఉంది.
* * *
నాలుగు రోజుల తర్వాత ఎరుపు రంగు వేసి ఉన్న గూడ్స్ వ్యాన్లలో కోసాక్కు రెజిమెంట్లను దూరంలో ఉన్న రష్యా-ఆస్ట్రీయా సరిహద్దులకు తీసుకువెళ్ళాయి.
యుద్ధం…
పశువుల శాలలు గుర్రాల సకిలింపులు, వాటి మూత్రవిసర్జనల కంపుతో నిండిపోయాయి. మనుషులు ఉండే చోటు నుండి వారి శైలిలోని మాటలు, పాటలు వినవచ్చేవి. ఎక్కువగా వారు ఈ పాటను పాడుకునేవారు:
డాన్ ప్రాంతం మేలుకుంది ఉద్వేగంతో,
నిజమైన క్రైస్తవ డాన్,
నియంత ఆజ్ఞకు బద్దుడై,
ముందుకు సాగుతాడు, ముందుకు సాగుతాడు.
స్టేషన్ల దగ్గర వారిని ఎన్నో కూతుహలమైన ముఖాలు పరికిస్తూ చూస్తూ ఉన్నాయి. కోసాక్కుల వేషధారణతో పాటు పొలాల్లో పని చేసి ఉండటం వల్ల ఇంకా ముఖాలు నల్లబడి ఉన్నాయి.
యుద్ధం!..
ఎన్నో ఉద్విగ్నభరిత యుద్ధ భేరులు వార్తా పత్రికల్లో….
స్టేషన్ దగ్గర ఎందరో స్త్రీలు నవ్వుతూ చేతి రుమాళ్ళు ఊపుతూ వీడ్కోలు చెబుతూనే కోసాక్కు బృందం రైలు దగ్గర వారికి స్వీట్లు, సిగరెట్లు కూడా అందించారు. రైలు వోరోనేజ్ దాటాక పెద్ద వయసులో ఉన్న ఒక రైల్వే అధికారి పెట్రోను, అతనితో పాటు ఉన్న ముప్ఫయి మంది ఇతర కోసాక్కులను చూస్తూ,’యుద్దానికి వెళ్తున్నారా?’అని అడిగాడు.
‘నువ్వు కూడా మాతో రా, తాతయ్యా’, వారిలో ఒక కొసాక్కు అందరి బదులుగా జవాబు ఇచ్చాడు.
‘ఎంత చక్కటి యవ్వనంలో ఉన్నారు… కానీ ఇలా చావుకి దగ్గరగా వెళ్తున్నారు!’ అక్కడే నిలబడి, తల ఆడిస్తూ,సాలోచనగా అనుకున్నాడు.
* * *
అధ్యాయం-5
జూన్ ఆఖరి రోజుల్లో గ్రెగరి రెజిమెంట్ యుక్తులు పన్నడం ఆరంభించింది. వారి ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు రోవ్నో పట్టణంకు, ఎక్కడైతే రెండు పదాతి దళాలు,అనేక అశ్వదళాల కొరత ఉందో,అక్కడకు వెళ్ళారు. నాలుగవ దళం వ్లాడిశ్లావ్కా గ్రామంలో ఉంచబడింది.
ఒక రెండు వారాల తర్వాత, ఎప్పుడైతే ఆ దళమంతా అక్కడ శిక్షణ మరియు యుక్తుల రూపకల్పనతో అలసిపోయి ఉందో,అక్కడ దగ్గరలో ఉన్న పట్టణమైన జాబోరోన్ లో కార్యలయం ఏర్పాటు చేసుకుంది.ఆ దళానికి కమాండర్ అయిన కెప్టెన్ పోల్కొనికోవ్ ఆ రెజిమెంటు కార్యాలయం నుండి ఒక్క ఉదుటున గుర్రాన్ని ముందుకు లంఘించాడు. తన దళంలోని ఇతర కోసాక్కులతో తమ గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్న గ్రెగరి, తమ బృంద కెప్టెన్ అక్కడి నుండి ఆఘమేఘాల మీద గుర్రం మీద అక్కడ ఇరుకుగా ఉన్న వీధి గుండా వెళ్ళడం చూశాడు. మిగిలిన వారు కూడా ఈ విషయాన్ని గమనించారు.
అప్పటి వరకు కులాసాగా ఉన్న వారంతా ఒక్కసారిగా జాగురుకులయ్యారు.
‘అంటే మనం మళ్ళీ వెళ్ళాల్సిందేనా?’ అక్కడ ఉన్న మిగిలినవారి సమాధానాలాను ఆశిస్తూ,ప్రోఖోర్ జికోవ్ సూచిస్తున్నట్టు అన్నాడు.
ఆ దళపు సార్జెంట్ తన టోపీ పైన ఉన్నా కుచ్చులోకి సూదిని లోపలికి గుచ్చి పెట్టాడు (అప్పటి దాకా ఆయన తన ప్యాంటు కుట్టుకున్నాడు).
‘చూస్తే అలాగే ఉంది.’
‘ఆ దెయ్యాలు మనకు అసలు విశ్రాంతి అన్నదే ఇవ్వరు.’
‘బ్రిగెడ్ కమాండర్ త్వరలోనే వస్తాడని కెప్టెన్ చెప్పాడు.’
ఆ సమయంలోనే బాకా వాయిద్యపు శబ్దం వినిపించింది.
ఒక్కసారిగా కోసాక్కులు ఉలిక్కిపడ్డారు.
‘నా చేతి సంచి ఎక్కడ ఉంది?’ ప్రొఖోర్ అంతా వెతుకుతూ కంగారుగా అన్నాడు.
‘అందరూ బయలుదేరండి’,ఆజ్ఞాపించాడు అధికారి.
‘నీ చేతి సంచి సంగతి తగలెట్టా!’అరుస్తూనే గ్రెగరి బయటకు పరిగెత్తాడు.
సార్జెంట్ బయటకు వచ్చి, తన ఖడ్గం సరిచేసికుంటూ, గుర్రాలు కట్టివేసి ఉన్న స్థలంలోకి పరుగు పెట్టాడు. గుర్రాలు వాటి స్థానాల్లో కట్టివేయబడి ఉన్నాయి. గ్రెగరి గుడారాల పై కప్పులు తీసి సర్దుతూ ఉంటే,ఆ దళపు సార్జెంట్ గుసగుసగా,’ఇది యుద్ధపు పిలుపు, అబ్బాయి!’ అన్నాడు.
‘మీరు హాస్యానికి అంటున్నారా?’
‘దేవుడి మీద ఒట్టు, సార్జెంట్ మేజర్ నాకు స్వయంగా చెప్పాడు.’
ఆ దళపు కమాండర్ తన గుర్రం మీద ఎక్కి, తన దళం ముందుకు వచ్చాడు.
‘వరుసలో ఉండండి!..’ తన కీచు గొంతుతో అరిచాడు.
ఆ దళం పట్టణం నుండి బయటకు వెళ్తూ ఉంటే, గుర్రపు డెక్కల ధ్వని మార్మోగిపోయింది. కుస్టెన్ గ్రామం నుండి మొదటి, ఐదవ దళాలు కూడా స్టేషన్ వైపు సాగాయి.
ఒక రోజు తర్వాత, ఆ రెజిమెంట్ ఆస్ట్రియా సరిహద్దులకు ముప్పై అయిదు వెరస్టుల దూరంలో ఉన్న వెర్బా స్టేషన్ లో దిగారు.స్టేషన్ లో ఉన్న అడవి రావి చెట్ల వెనుక నుండి అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ, మంచి ఉదయానికి ప్రారంభ సూచికలా ఉంది ఆ రోజు. పెద్ద శబ్దం చేస్తూ అప్పుడే ఒక లోకోమోటివ్ ఆగింది. అక్కడ పట్టాల మీద పడుతూ ఉన్న మంచు వార్నిష్ లా మెరుస్తూ ఉంది. అప్పుడే ఆగిన వ్యాన్ల నుండి గుర్రాలు సకిలిస్తూ ఏటవాలు దారిలో దిగాయి. గట్టిగా అరుపులు, అధికారులు జారీ చేస్తున్న ఆజ్ఞలతో ఆ స్టేషన్ అంతా ప్రతిధ్వనిస్తూ ఉంది.
నాలుగవ దళానికి చెందిన కొసాక్కులు గుర్రాలతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. వారి స్వరాలు ఆ చీకటిని తాకుతూ, వారి ఉనికిని తెలియజేస్తున్నాయి. మధ్యలో వచ్చే చిరు వెలుగుతో వారి నీడలు కనిపిస్తూ, మరలా అవి చీకటిలో మాయమైపోతూ ఉన్నాయి.
‘ఏ దళం?’
‘ఎక్కడి నుండి వచ్చావు?’
‘నేను ఎక్కడి నుండి వస్తే నీకు ఎందుకురా? పై అధికారితో మాట్లాడే పద్ధతి ఇదేనా?’
‘నన్ను క్షమించండి, సార్!… చీకటి వల్ల మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను.’
‘ముందుకు వెళ్ళండి!’
‘ఏంటి ఇంకా కదలకుండా అలాగే చూస్తున్నావు? కదులు.’
‘సార్జెంట్ -మేజర్,మీ మూడవ దళం ఎక్కడ ఉంది?’
‘దళం …వెనక ఉంది సార్!’
వెనుక గుసగుసలు మొదలయ్యాయి:
‘రెండు రాత్రులు నిద్ర లేకపోతే,వెనుక ఉండక ముందు ఎలా ఉంటాము?’
‘యోమ్కా ,నాకు ఓ సిగరెట్టు ఇవ్వు. నిన్న సాయంత్రం నుండి ఒక్కటి కూడా కాల్చలేదు.’
‘ఆ గుర్రాన్ని సంభాళించు.’
‘అది పలుపు తాడుని నమిలేసినట్టు ఉంది,దయ్యం ముఖంది.’
‘నా గుర్రపు వెనుక కాలి నాడా పోయింది.’
ఆ నాలుగవ దళం ముందుకు వెళ్తూ ఉంటే, ఇంకో దళం కూడా అదే దారిలో వెళ్తూ ఉండటం వల్ల వారికి ముందుకు వెళ్ళడానికి దారి లేకుండా పోయింది.
ఆ వెళ్తున్న వారి ఆకారాలు నీలపు ఆకాశం కింద ప్రత్యేకంగా గీసిన చిత్రాల్లా పడ్డాయి. నలుగురు నలుగురిగా వారు ముందుకు వెళ్తున్నారు.వారి కరవాలాలు,జీన్లు కదులుతున్న శబ్దం అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంది.
‘ఓ,అబ్బాయిలు,ఎక్కడికి వెళ్తున్నారు?’
‘మా బావ కొడుకు బారసాల వేడుకకు.’
‘హా!హా!హా!’
‘నిశ్శబ్దంగా ఉండండి!దేని గురించి మాట్లాడుకుంటున్నారు?’
ప్రోఖోర్ జికోవ్ తన గుర్రాన్ని నెమ్మదిగా అదిలించి,గ్రెగరి ముఖంలోకి చూస్తూ, గుసగుసగా మాట్లాడాడు.
‘నీకు భయంగా లేదా మెలఖోవ్?’
‘దేనికి భయపడాలి?’
‘ఇప్పుడు మనం కూడా యుద్దానికి వెళ్లాల్సి రావచ్చు. ‘
‘వెళ్ళాల్సి వస్తే, వెళ్తాము.’
‘నాకు భయంగా ఉంది’, ప్రొఖోర్ ఒప్పుకున్నాడు,గుర్రపు పగ్గాల మీద ఉన్న అతని చేతి వేళ్ళు, అప్పటికే మంచు వల్ల తడిగా ఉండి, జారిపోతూ, చిన్నగా వణుకుతున్నాయి.’అసలు నిన్న రాత్రి రైలులో కంటి మీద కునుకే లేదు.చాలా అలసటతో ఉన్నాను.’
ఆ సమూహ నాయకుడు ముందుకు వేగంగా స్వారీ చేస్తూ వెళ్తూ,మూడవ దళాన్ని చురుగ్గా చేశాడు.గుర్రాలు వేగంగా ముందుకు పోతూనే ఉన్నాయి. స్వారీ చేస్తున్న వారి కాళ్ళకు కట్టి ఉన్న కత్తులు, అటూ ఇటూ చిన్నగా కదులుతూ ఉన్నాయి గాలికి.
గ్రెగరి పగ్గాలు దాదాపుగా వదిలేసి నిద్రలోకి జారుకున్నాడు. చిన్న అడుగులతో వెళ్తూ ఉన్న అతని గుర్రం కాదు అతన్ని మోసుకు వెళ్తూ ఉంది, ఓ రోడ్డులో ఒంటరిగా అతనొక్కడే తనను తాను మోసుకుంటూ వెళ్తూ ఉన్నట్టు ఉంది.
ప్రొఖోర్ ఆపకుండా ఏదో ఒకటి అతని చెవిలో గొణుగుతూనే ఉన్నాడు. కాని అతని స్వరం ఆ గుర్రపు జీను కదులుతున్న శబ్దంలోనూ, గుర్రపు డెక్కల ధ్వనులోనూ కలిసిపోయి, ఏ ఆలోచనలు లేని నిద్రలోకి జారుకున్న అతనికి భంగం కలిగించలేకపోయింది. వారు బండ్ల కోసం ఉన్న దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ మౌనం అతని చెవులకు ప్రశాంతంగా ఉంది. పండిన ఓట్స్ వాసన గాలిలో మిళితమై ఉందిగుర్రాలు ఆ చెట్లకు కింద వంగి వేలాడుతున్న పూల గుత్తుల దగ్గరకు వెళ్లాయి. అలసిపోయి, ఉబ్బి ఉన్న గ్రెగరి కనురెప్పలపై ఏదో వెలుతురు తగిలి, వెంటనే తల ఎత్తి చుట్టూ చూసి ఈ లోకంలోకి వచ్చాడు, ప్రొఖోర్ స్వరం, బండి చక్రాల ధ్వనిలా ఆపకుండా మూలుగుతున్నట్టే ఉంది.
ఒక గంభీరమైన మరియు బిగ్గరగా వినవచ్చిన ఒక అరుపు వల్ల అతను ఓట్స్ పొలాల నుండి ఈ లోకంలోకి వచ్చాడు.
‘కాల్పులు!’ప్రొఖోర్ గట్టిగా అరిచాడు.
దూడ లాంటి ప్రొఖోర్ కళ్ళల్లో భయం నిండిపోయింది. గ్రెగరి తల పైకి ఎత్తాడు. ఆ దళపు సార్జెంట్ వేసుకున్న బూడిదరంగు కోటు గుర్రం వేగంగా వెళ్తూ ఉంటే ఆ కదలికలకు అనుగుణంగా పైకి కిందకు ఎగురుతూ ఉంది. ఇంకా పంటకు రాని వరి పొలంలో ఓ పక్షి ఎత్తులో ఎగురుతూ ఆ దారిలో సాగిపోయింది. దళమంతా కాల్పుల మోతకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దళపు కెప్టెన్ పొల్కొవ్ నికొవ్, ఒక్కసారిగా వేగాన్ని పెంచి, దళాన్ని వేగంగా వెళ్ళమని సూచన ఇచ్చాడు. కాసేపటికి వారు కొన్ని దారులు కలిసే కూడలి దగ్గరకు వచ్చారు. అక్కడ ఖాళీగా ఉన్న ఓ సత్రం కనిపించింది. అప్పుడే శరణార్థులను తీసుకువస్తున్న బండ్లు ఎదురు వచ్చాయి. అప్పటికే ఓ ఆశ్విక దళం ఆ కొసాక్కుల దళాన్ని దాటి ముందుకు వెళ్ళింది. ఆ దళపు కెప్టెన్ మేలైన జాతి గుర్రం మీద స్వారీ చేస్తూ కొసాక్కులను పరీక్షగా చూశాడు. కొద్దిగా ముందుకు వెళ్ళాక శతాగ్ని దళం చిత్తడిగా ఉన్న చోట గుర్రాలను ముందుకు నడపలేక ఇబ్బంది పడుతూ ఉంది. ఆశ్వికులు గుర్రాలను బలవంతంగా ముందుకు అదిలిస్తూ ఉన్నారు.ముఖం మీద మచ్చలు ఉన్న ఒక వ్యక్తి ఆ సత్రం నుండి చేతి నిండుగా చెక్క ముక్కలు బయటకు తీసుకువస్తూ కనిపించాడు.
ఆ దళానికి తర్వాత పదాతి దళం ఎదురైంది. ఆ సైనికులు తాము ధరించిన కోట్లు సరి చేసుకుంటూ వేగంగా మార్చింగ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే సూర్యకాంతి కిరణాలు వారి వీపుల మీద పడుతూ ఉన్నాయి. పొట్టిగా ఉండి,ఆ దళం వెనుక వస్తూ ఉన్న కార్పోరల్ ఎండిన బురద ముద్దను గ్రెగరి మీదకి విసిరి, ‘నీకు దమ్ముంటే ఇది పట్టుకో! దీనినే ఆ ఆస్ట్రియా వాళ్ళ మీద విసరవచ్చు’,అన్నాడు.
‘నాతో ఇలాంటి వేళాకోళం చేయవద్దు’, గ్రెగరి తన వైపుకి వచ్చిన ఆ ముద్దను తన ఖడ్గంతో రెండుగా చేస్తూ అన్నాడు.
‘వారికి మా నమస్కారాలు తెలియజేయండి కొసాక్కులు!’
‘మీకు మీరే స్వయంగా వారిని త్వరలోనే కలుస్తారు!’
ముందు వెళ్తున్న దళం ఒక అసభ్యకరమైన పాటను సరదాగా పాడుకుంటూ ఉంది; లావుగా,కొద్దిగా స్త్రీ పోలికలతో ఉన్న ఓ సైనికుడు ఆ దళం పక్కనే వెనక్కి నడుస్తున్నాడు. అధికారులు నవ్వుతూ ఉన్నారు. యుద్ధం తీసుకువచ్చిన ప్రమాదం వారందరిని తోటి మనుషులతో కలిసేలా,వారితో సహనంగా ఉండేలా చేసింది.
ఆ సత్రం నుండి హోరోస్ విశ్చుక్ గ్రామం వరకు కూడా దారంతా పదాతి దళాలతోనూ,సైన్యాన్ని తీసుకువస్తున్న రైళ్ళతోనూ, మొబైల్ ఆసుపత్రులతోనూ,హడావుడిగా ఉంది. ఆ ప్రాంతంలోని గాలి కూడా అనివార్యమైన యుద్ధ వీచికలను వీస్తున్నట్టుగా ఉంది.
బెరెస్తెకో గ్రామం దగ్గరకు నాలుగవ దళం చేరుకునేసరికి వారికి రెజిమెంట్ కమాండర్ కల్నల్ కలేడిన్ ఎదురొచ్చాడు. అతనితో పాటు కొసాక్కుల లూయిటెంట్ కల్నల్ కూడా ఉన్నాడు. మంచి శరీర సౌష్టవంతో ఉన్న కల్నల్ వెళ్లిపోతూ ఉంటే, అతనితో లూయిటెంట్ కల్నల్ దిగులుగా, ‘ఈ గ్రామం మన మ్యాప్ లో గుర్తించలేదు,వాసిలి మాక్సిమోవిచ్’, అని అనడం గ్రెగరికి వినిపించింది.
కల్నల్ చెప్పిన సమాధానం గ్రెగరికి వినిపించలేదు. వారి వెనుకే ఒక సైన్య సహాయక అధికారి వేగంగా గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్ళాడు,అతని గుర్రం వెనుక కాళ్ళ మీద బరువు అంతా వేస్తూ రొప్పుతూ ఉంది,ముందుకు వెళ్తూ. యాంత్రికంగానే ఆ గుర్రం మీద ఏ మేరకు ఆధారపడవచ్చో గ్రెగరి అంచనా వేశాడు.
వారు ఏటవాలుగా ఉన్న దారిలో పొలాలను దాటాక ఒక కుగ్రామం వచ్చింది. ఆ రెజిమెంట్ అంతా మోస్తరు వేగంతోనే వెళ్తున్నా,అప్పటికే గుర్రాలకు చెమటలు పట్టేశాయి. గ్రెగరి తన గుర్రం మెడ మీద చేయి వేసి నిమురుతూ,చుట్టూ చూశాడు. ఆ గ్రామం వెనుక పచ్చటి అడవి ఉంది, చూడటానికి ఎంతో మనోహరంగా ఉంది. అప్పుడే ఫిరంగుల కాల్పుల మోతలు మిన్నంటేలా ఎగిసిపడుతూ,అక్కడి ఉన్న అందరి చెవుల్లో ఉరుముల్లా ఉరుముతూ, గుర్రాలను,వారిని ఒక్కసారిగా జాగురుకులను చేశాయి. అప్పటివరకూ ఉల్లాసంగా ఉన్న ఆ వాతావరణం అంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ఆ ఫిరంగుల కాల్పులు,వాటి నుండి వచ్చే పొగతో ఆ అందమైన అడవి నిండిపోయింది.కాసేపటికి ఆ మోతలు ఆ దిశలో ఆగిపోయి,కుడివైపు మళ్ళాయి,మరలా కొద్దిసేపట్లో మరలా మొదలయ్యాయి.
గ్రెగరి అలా వినవచ్చే ప్రతి ధ్వనిని ఎంతో జాగ్రత్తగా వింటూ విన్నాడు,ఆ ధ్వనులు అతనిలో భయాన్ని,ఒత్తిడిని పెంచాయి. ప్రోఖోర్ జికోవ్ ఏదేదో నిరంతరాయంగా మాట్లాడసాగాడు.
‘ఆ కాల్పులను విను,గ్రెగరి. అవి అచ్చం పిల్లలు కంచెల మీద కర్రలతో కొడితే వచ్చే శబ్దాల్లా లేవు!అవునా,కాదా?’
‘వదరబోతా నోర్మూసుకో!’
ఆ దళం కుగ్రామంలోకి వెళ్ళింది. అక్కడ అంతా సైనికులతో నిండి ఉండటంతో;భయంతో ఉన్న గ్రామస్తులు అటూ ఇటూ పరిగెడుతూ,సర్దుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. గ్రెగరి ఒక ఇంటిని దాటుతూ ఉనప్పుడు కొందరు సైనికులు అక్కడ ఉన్న ఓ ఇంటి వెనుక ధాన్యపు కొట్టానికి నిప్పు పెట్టారు. జుట్టు నెరిసి ఉన్న ఆ ఇంటి యజమాని చూడటానికి బెలారస్ కు చెందినవాడిలా ఉన్నాడు,అతను తనకు హఠాత్తుగా సంభవించిన ఆ దురదృష్టానికి ఎంత బాధలో ఉన్నాడంటే అతను ఆ సైనికుల చర్య గురించి ఏమి పట్టించుకోలేదు. అతని కుటుంబంలోని సభ్యులు దిండ్లను గలేబుల్లో పెట్టి,ఇంకా అటువంటి వస్తువులనే సర్ది,వాటిని వారి పెరడులో ఎన్నాళ్ళనుంచో వాడకుండా పడి ఉన్న బండి దగ్గరకు చేర్చారు.
విలువైన వస్తువులను వదిలేసి పూల కుండీలను,పతకాలను తీసుకువెళ్తున్న ఆ ఇంటి స్త్రీల మూర్ఖత్వానికి గ్రెగరికి ఆశ్చర్యం వేసింది. బాతుల ఈకలు ఆ వీధిలో ఎగురుతూ ఉంటే, మంచు ముక్కల్లా ఉన్నాయి. ఆ గాలంతా కాలిన వాసనలతో నిండిపోయింది. ఆ గ్రామం దాటాక రోడ్డు మీద పరిగెడుతూ ఒక యూదుడు వారికి ఎదురొచ్చాడు. అతను గాయపడి ఉన్నాడు. ‘ఓ కొసాక్కు! దేవుడా!ఎంత పని చేశావు ?’అని వాపోతూ అన్నాడు.
గుండ్రంగా,చిన్నగా ఉన్న తలతో ఉన్న ఒక కొసాక్కు అతని అరుపులని పట్టించుకోకుండా,ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాడు.
‘ఆగు!’ రెండవ దళపు కెప్టెన్ వెనుక నుండి అతన్ని ఉద్దేశించి అరిచాడు.
వేగంగా వెళ్తూ ఉన్న ఆ కొసాక్కు వేగాన్ని తగ్గించి వెనక్కి చూశాడు.
‘ఆగరా వెధవా! నీది ఏ రెజిమెంటు?’
వెంటనే ఆ కొసాక్కు వేగంగా గుర్రాన్ని ముందుకు దౌడు తీయించి,వెంటనే అక్కడి నుండి మాయమైపోయాడు.
‘ఇక్కడ తొమ్మిదవ రెజిమెంటును ఉంచడం జరిగింది,సార్. బహుశా అతను దానికి చెందిన వాడే అయ్యి ఉండొచ్చు’, సార్జెంట్ మేజర్ బదులిచ్చాడు.
‘వాడు ఎవడైనా కానీ’, ముఖం చిట్లిస్తూ ఆ కెప్టెన్ ఆ యూదుడి వైపు చూస్తూ, ‘వాడు నీ దగ్గర ఏం తీసుకున్నాడు?’అని అడిగాడు.
‘సార్ …నా గడియారం,సార్!’ తమలో తాము కళ్ళు గీటుకుంటూ నవ్వుకుంటూ ఉన్న ఇతర అధికారుల వైపు కూడా తల తిప్పి చూస్తూ సమాధానం ఇచ్చాడు అతను.
ఆ కెప్టెన్ తన గుర్రాన్ని గట్టిగా అదిలించి,ముందుకు వెళ్ళిపోతూ,’జర్మన్లు ఇక్కడికి వస్తే ఎలాగూ అది నువ్వు కోల్పోతావు’, నవ్వుకుంటూ అన్నాడు.
ఆ యూదుడు ఆ వీధి మధ్యలో నిలుచుని, అయోమయంగా చూస్తూ ఉన్నాడు.అతని కళ్ళు అదురుతూ ఉన్నాయి.
‘ఓ యుదూడా,దారి ఇవ్వు!’అని ఆ దళపు కమాండర్ గట్టిగా అరిచి, తన కొరడాను పైకి ఎత్తాడు.
నాలుగవ దళం గుర్రపు డెక్కల మరియు జీనుల ధ్వనుల్లో కలిసిపోతూ ముందుకి సాగిపోయింది.కొసాక్కులు కలవరపడి ఉన్న ఆ యుదూడి వైపు చూస్తూ, తమలో తామే రకరకాలుగా మాట్లాడుకోసాగారు.
‘మన వాళ్లు ఇలాంటి పనేదో ఒకటి చేయకుండా ఉండలేరు.’
‘కొసాక్కులు స్వభావ రీత్యా కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు.’
‘అయినా వాళ్ళు కూడా విలువైనవి అలా వదిలేసి వెళ్ళిపోకుండా ఉండాల్సింది.’
‘అది తెలివైన పనే, కానీ…’
‘అతను ఆ కంచె దాటి భలే వెళ్ళాడు’
వారి వెనుక వస్తూ ఉన్న సార్జెంట్ మేజర్ కొసాక్కులతో కలిసి తను కూడా నవ్వుతూ తన కరవాలాన్ని సరిచేసుకున్నాడు.
‘ఇక్కడి నుండి పోతావా లేకపోతే దీనితో ఒక వేటు వేయమంటావా!’
ఆ యూదుడు భయపడి ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. సార్జెంట్ మేజర్ వేగంగా గుర్రం మీద వెళ్ళి కొరడాతో ఒక్కటిచ్చాడు వెనుక నుండి.ఆ దెబ్బతో నడక తడబడి అతను వెనక్కి తిరిగి సార్జెంట్ మేజర్ వైపు చూస్తూ తన ముఖాన్ని చేతులతో కప్పుకున్నాడు, ఇదంతా గ్రెగరి చూస్తుండగానే జరిగింది. అతని సన్నని వేళ్ళ మధ్య నుండి రక్తం కారుతూ ఉంది.
‘ఇప్పుడు ఎందుకు ఇలా కొట్టారు?’ అని ఏడుస్తూ అడిగాడు.
అతని ప్రశ్నకి అపహాస్యం చేస్తున్నట్టు నవ్వుతూ, అక్కడి నుండి వెళ్ళిపోతూ,’అనవసర విషయాల్లో తలదూర్చకు వెధవా!’అని అరిచాడు.
ఆ గ్రామం బయట, ఓ నది వద్ద లిల్లీ చెట్లు, తేమకు పెరిగిపోయే అనేక గడ్డి చెట్లు ఉన్నాయి. అక్కడ కొందరు ఇంజనీర్లు ఒక బ్రిడ్జి కట్టే ఏర్పాటులో ఉన్నారు. అక్కడ ఒక మోటార్ కారు ఆగి ఉంది, దాని ఇంజను మాత్రం శబ్దం చేస్తూ నడుస్తూనే ఉంది. ఆ కారు డ్రైవరు అటూఇటూ హడావుడిగా తిరుగుతూ ఉన్నాడు. భారీకాయంతో నెరిసిన జుట్టుతో, పెద్ద గడ్డంతో, సాగిపోయినట్టు ఉన్న బుగ్గలతో ఉన్న జనరల్ వెనుక సీట్లో కూర్చుని ఉన్నాడు. పన్నెండవ రెజిమెంటుకి కమాండర్ అయిన కల్నల్ కాలేడిన్, ఇంజనీర్ల బృందానికి నాయకుడు ఆ జనరల్ పక్కన వినయంగా నిలుచుని ఉన్నారు. చేతిలో ఉన్న మ్యాప్ ని చూస్తూ, ఆ జనరల్ కోపంగా ఇంజనీర్ మీద అరుస్తున్నాడు.
‘నీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ పని నిన్నే నువ్వు పూర్తి చేసి ఉండాలి.నిశ్శబ్దం!అసలు నువ్వు కావాల్సిన వస్తువులు ముందే తెచ్చుకుని ఉండాల్సింది. నిశ్శబ్దం!’, అతను గట్టిగా ఉరిమినట్టే అన్నాడు, ఆ ఇంజనీర్ నోరు మూసుకునే ఉన్నాసరే.’సరే ఇప్పుడు నన్ను అవతలి వైపుకి ఎలా వెళ్ళమంటావు. సరే కెప్టెన్, నిన్ను అడుగుతున్నాను, చెప్పు, ఎలా?’
ఆ అధికారికి ఎడమ వైపు కూర్చుని ఉన్న కుర్ర జనరల్ సిగరెట్టు వెలిగించుకుని, నవ్వాడు. ఇంజనీర్ల నాయకుడు ముందుకు వంగి ఆ బ్రిడ్జి పక్కకు చూపిస్తూ ఏదో చెప్తూ ఉన్నాడు.
ఆ దారి గుండా ఆ దళం ముందుకు వెళ్ళింది. ఆ చిత్తడి బురద నేలలో బురద గుర్రాల మోకాళ్ళ వరకు వచ్చింది, ఆ కొత్త బ్రిడ్జి కట్టడపు పై పూతలు వారి మీద చిన్న తుంపరగా పడ్డాయి.
వారు ఆ సరిహద్దు మధ్యాహ్న సమయానికి దాటారు. గుర్రాలు ఆ సరిహద్దు గీతను ఒక్క ఉదుటున దూకి దాటాయి. ఇప్పుడు తుపాకీ కాల్పుల మోత కుడి వైపు నుండి వినిపించసాగింది.ఆస్ట్రియాకు చెందిన ఒకడి పొలం అందులో ఒక పాక కొంత దూరంలో కనిపించాయి. అప్పటికే సూర్యుడి కిరణాలు సూటిగా పడుతూ చుర్రుమనేలా చేస్తున్నాయి. ఆ దారిలో అనేక మంది ప్రయాణం చేసి ఉండటం వల్ల దుమ్ము రేగి ఉంది. ఆ రెజిమెంట్ కమాండర్ ఇంకా అధిక సైన్యం కావాలని ఆజ్ఞ జారీ చేశాడు. లూయిటెంట్ సెమ్యోనోవ్ ఆధ్వర్యంలో ఉన్న నాలుగవ రెజిమెంటు ముందుకు సాగిపోయింది. మిగిలిన దళాలకు చెందిన వారు ఆ కమాండర్ ఆజ్ఞను అనుసరించి ఆ దుమ్ము రేగిన దారిలోనే ఆగిపోయారు. ఒక ఇరవై మంది కొసాక్కులు తమ దళం నుండి విడిపడి ఆ పొలం పక్కన ఉన్న దారిలో ముందుకు సాగారు.
ఇంకో మూడు వెరస్టుల దూరం తన బృందంతో కలిసి ముందుకు ప్రయాణం చేశాక, ఆ లూయిటెంట్ ఆగి తన మ్యాప్ లో తాము ఎక్కడ ఉన్నామో చూసే ప్రయత్నం చేశాడు. ఆ విరామ సమయంలో కొసాక్కులు పొగ వెలిగించుకున్నారు. గ్రెగరి గుర్రం కిందకు దిగి సిగరెట్టు వెలిగించుకుందామనుకుని,కిందకు దిగబోతున్నప్పుడు సార్జెంట్ మేజర్ అతని వైపు తీక్షణంగా చూశాడు.
‘ఏం చేస్తున్నావు! గుర్రం దిగకు!’
లూయిటెంట్ ఒక సిగరెట్టు వెలిగించుకుని పక్కనే ఉన్న పెట్టెలో నుండి బైనాక్యులర్స్ తీసి,దానిని జాగ్రత్తగా తుడిచి,అందులో నుండి దూరంగా ఉన్న ప్రదేశాన్ని చూశాడు. ముందు చాలా దూరం వరకు జనసంచారం లేకుండా ఖాళీగా ఉంది. కుడివైపున ఓ అడవి,దాని పక్కనే ఒక దారి ఉన్నాయి. ఇంకొక వెరస్టున్నర దూరంలో ఒక కుగ్రామం,అక్కడ ఓ చిన్న లోయ ప్రాంతం, ఓ సెలయేరు కనిపించాయి. లూయిటెంట్ ఎడారిలా మనుషులు లేకుండా ముందు ఉన్న వీధుల వంక ఇంకోసారి చూశాడు,అచ్చం శ్మశానంలానే అనిపించింది అతనికి. కానీ ముందు ఉన్న ఓ చిన్న కొలను లాంటి దాంట్లో ప్రవహిస్తున్న నీరు మాత్రం జీవానికి సూచనగా ఉంది.
‘అది కోరోలేవ్కా కదూ?’ లూయిటెంట్ కనుచూపు మేరలో ఉన్న గ్రామం వైపు చూపిస్తూ అడిగాడు.
సార్జెంట్ మేజర్ అతని పక్కకు గుర్రాన్ని నడిపించి,ఏ బదులు ఇవ్వకుండా ఉన్నాడు. ‘మీకే మాకన్నా బాగా తెలుసు.మా పని మీ ఆజ్ఞలు నిర్వర్తించడమే’,అన్నట్టు ఉంది అతని మౌనం.
‘సరే అయితే ఆ దిక్కులో వెళ్దాము’, లూయిటెంట్ ఎటూ నిర్ణయించుకోలేక,ఏదో పంటి నొప్పితో బాధ పడుతున్నవాడిలా అని,ఆ బైనాక్యులర్స్ పక్కన పెట్టేశాడు.
‘అలా వెళ్తే,సరాసరి వారికే ఎదురుగా వెళ్తామేమో,సార్?’
‘మనం జాగ్రత్తగా ఉందాము.ఇక కదలండి.’
ప్రోఖోర్ జికోవ్ గ్రెగరికి దగ్గరగా వచ్చాడు. వారిద్దరి గుర్రాలు ఇప్పుడు పక్కపక్కన వెళ్తూ ఉన్నాయి. ఏదో తెలియని బాధతో వారు ఆ ఖాళీ వీధుల్లో వెళ్తున్నారు. ఆ ఖాళీ వీధుల్లో ఉన్న ప్రతి ఇంటి కిటికీ కూడా ప్రతీకారం కోసం చూస్తున్నట్టు, తెరిచి ఉన్న ప్రతి తలుపు ఒంటరితనాన్ని గుర్తు చేస్తున్నట్టు అనిపించి,వారి వెన్నులో భయం పుట్టింది. కంచెలు,మురికి గుంటలు వారి దృష్టిని అయస్కాంతం ఆకర్షించినట్టు బలంగా లాగాయి. వాళ్ళు అచ్చం ఆహారం కోసం వేటాడే జంతువుల్లా,చలికాలపు రాత్రుల్లో ఇళ్ళల్లో దూరే తోడేల్లల్లా ఉన్నారు. కానీ వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. కానీ ఆ నిశ్శబ్దం భయానకంగా ఉంది. వారు వెళ్తూ ఉన్నప్పుడూ ఖాళీగా ఉన్న ఒక ఇంటి లోపల ఉన్న గడియారపు గంటల శబ్దం వారి చెవులకు తుపాకి కాల్పుల మోతలా మార్మోగినట్టు అనిపించింది. వెంటనే లూయిటెంట్ ఆ శబ్దానికి ప్రతిస్పందనగా తన రివాల్వర్ వైపు చేతిని కదల్చడం గ్రెగరి గమనించాడు.
ఆ గ్రామంలో ఒక్క ప్రాణం ఉన్న జీవి కూడా లేదు. ఆ పహరా బృందాలు ముందుకు వెళ్ళాక అక్కడ బురద నీటితో ఉన్న ఒక కొలను ఎదురొచ్చింది. ఆ నీరు గుర్రాల పొట్టల లోతు వరకు వచ్చాయి. దాహంతో ఉన్న ఆ గుర్రాలు సంతోషంగా తమను స్వారీ చేస్తున్న యాజమానుల ఆజ్ఞలను లెక్క చేయకుండా ఆ నీటిని కడుపు నిండా తాగాయి. గ్రెగరి ఆ బురద నీటి వైపే చూస్తూ ఉన్నాడు; ఎంతో సమీపంలో ఉన్న ఆ నీరు అతన్ని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. ఒకవేళ అవకాశం ఉంటే అతను తప్పకుండా, తన గుర్రం మీద నుండి ఒక్క ఉదుటున కిందకు దూకి,తన బట్టలన్నీ విప్పేసి, చెమట పట్టి ఉన్న తన శరీరం చల్లబడే వరకు అందులోనే ఈదుతూ ఉండేవాడు.
కొండ దగ్గర ఉన్న గ్రామం వెనుక వారికో పట్టణం కనబడింది; ఆ పట్టణంలో ఎన్నో భవనాలు,తోటలు, చర్చిలు దూరం నుండే కనిపించాయి.
లూయిటెంట్ ఆ కొండ దగ్గరగా వచ్చాక మరలా బైనాక్యులర్స్ పెట్టుకున్నాడు.
‘అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు!’ అతను తన ఎడమ చేతి వేళ్ళతో ఒక వైపుకి చూస్తూ గట్టిగా అరిచాడు.
ఆ అరుపుతో సార్జెంట్ మేజర్ మరియు కొసాక్కులు,ఒకరి తర్వాత ఒకరు ఆ కొండ పైకి వచ్చి చూడసాగారు.అక్కడ జనాలందరూ వీధుల్లో హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. కొన్ని వీధులు బండ్లతో నిండిపోయి,కదలడానికి ఖాళీ లేకుండా ఉంది. గుర్రాలను వేగంగా ముందుకు దుమికిస్తూ చాలా మంది అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు.సూర్య కాంతికి తన కళ్ళ పైన చేతులు పెట్టుకున్న గ్రెగరి బూడిద రంగులో ఉన్న యూనిఫార్మ్ లను చూడగలిగాడు. ఆ పట్టణంలో అప్పుడే తవ్వి ఉన్న కందకాలు క్రూర మృగాల నుండి మనుషులను కాపాడే కవచాల్లా ఉన్నట్టు ఉంటే,సమూహాలుగా ప్రజలు వాటి ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
‘ఎంత మంది ఉన్నారో!’ప్రోఖోర్ ఆశ్చర్యంగా అన్నాడు.
మిగిలిన వారికి కూడా అదే భావన కలిగినా వారంతా నిశ్శబ్దంగా ఉన్నారు. గ్రెగరి తనకే వినిపిస్తున్న తన గుండె కొట్టుకునే శబ్దాన్ని వింటూ ఉన్నాడు(చిన్నగా ఉన్న వ్యక్తి ఎవరో బలంగా ఆ గుండె మీద తిరుగుతున్నట్టు అతనికి అనిపించింది).అతనికి ఈ భావన అంతకుముందు శత్రువులను చూసినప్పుడు కలిగిన దాని కన్నా భిన్నంగా ఉందని అర్ధమైంది.
లూయిటెంట్ అక్కడ ఉన్నదాన్ని చూస్తూ పరిస్థితిని ఒక కాగితంలో రాశాడు. సార్జెంట్ మేజర్ కొసాక్కులను గుర్రాలు దిగి,కొండ కిందకు రమ్మని ఆజ్ఞాపించి, లూయిటెంట్ దగ్గరకు వెళ్ళాడు.ఒక క్షణం తర్వాత లూయిటెంట్ గ్రెగరిని దగ్గరగా రమ్మని సంజ్ఞ చేశాడు.
‘మెలఖోవ్!’
‘ఇక్కడకు రా.’
చలనం లేనట్టు ఉన్న తన కాళ్ళు మొండికేసినా గ్రెగరి కొండ ఎక్కి పైకి వెళ్ళాడు. లూయిటెంట్ అతని చేతికి ఆ కాగితాన్ని ఇచ్చాడు.
‘నీ గుర్రం మిగిలిన వారి కన్నా మెరుగ్గా ఉంది. ఇది తీసుకువెళ్ళి రెజిమెంట్ కమాండర్ కు అందజేయ’,అని చెప్పాడు.
గ్రెగరి ఆ కాగితాన్ని తన పైజేబులో పెట్టుకుని,తన గుర్రం దగ్గరకు కిందకు వెళ్ళి,దాని జీను సరి చేసి, తన టోపీని సరి చేసుకున్నాడు.
లూయిటెంట్ గ్రెగరి గుర్రం ఎక్కే వరకు అతని వైపు చూస్తూ ఉండి, తర్వాత తన దృష్టిని తన చేతికి ఉన్న గడియారం వైపు మళ్ళించాడు.
గ్రెగరి బయల్దేరిన సమయానికే రెజిమెంట్ కోరోలేవ్కా గ్రామానికి సమీపంలో ఉంది.
తన సహాయకుడికి కల్నల్ కాలేడిన్ కొన్ని సూచనలు ఇచ్చి మొదటి దళం వద్దకు పంపాడు.
నాలుగవ దళం కోరోలేవ్కా గ్రామం సరిహద్దుల దగ్గరకు రాగానే తెలివిగా అక్కడ మొహరించింది. లూయిటెంట్ సెమ్యోనోవ్ ఆ కొండ దగ్గర నుండి మిగిలిన మూడవ దళపు కొసాక్కులతో కలిసి ముందుకు వెళ్ళాడు.
గుర్రాలు దోమలు కుట్టడం వల్ల తలలు ఊపుతూ,శబ్దాలు చేస్తూ ఉంటే ఆ దళం ఒక వరుసలా ఏర్పడింది.మొదటి దళం ఆ ఊరు దాటి వారిని కలవడానికి ముందుకు వెళ్తూ ఉంటే గుర్రపు డెక్కల శబ్దం చాలా మంద్రస్థాయిలో గాలిలో కలిసిపోయింది.
కెప్టెన్ పోల్కోనికోవ్ ఆ వరుసకు ముందు తన మేలు జాతి గుర్రంతో వచ్చి, దాన్ని పగ్గాలతో గట్టిగా ఒక చేత్తో పట్టుకుని,ఇంకో చేత్తో ఖడ్గంతో సిద్ధంగా ఉన్నాడు. గ్రెగరి తన ఊపిరి బిగబట్టి,ఆజ్ఞ కోసం చూస్తూ ఉన్నాడు. మొదటి దళం ఆ యుద్ధ వ్యూహనికి తగ్గట్టు తమ పొజిషన్ ను మార్చుకునే సరికి ఎడమ వైపు నుండి ఆ ధ్వనులు వచ్చాయి.
ఆ కెప్టెన్ కమాండ్ ఇవ్వడానికి సిద్ధమై ఆ ఖడ్గాన్ని గాల్లోకి ఎత్తాడు.
‘దళ సభ్యులారా…!’ ఆ ఖడ్గం గాల్లో ఎడమ వైపు,కుడి వైపు అటూ ఇటూ వేగంగా తిరిగి, చివరకు నిక్కబొడుచుకు ఉన్న గుర్రపు చెవుల పైన ఆగింది. ‘ఛార్జ్!’ ఇంకా కెప్టెన్ నోటి నుండి రాని ఆ మాటను గ్రెగరి తానే మనసులో మననం చేసుకున్నాడు. ‘మీ ఆయుధాలతో సిద్ధంగా ఉండి,దాడి చేయండి!’ కెప్టెన్ ఆ ఆజ్ఞను ఇచ్చి,వెంటనే తన గుర్రాన్ని ముందుకు దుమీకించాడు.
అక్కడ నేల అంతా ఒక్కసారిగా వేల గుర్రపు డెక్కలతో హత్యకు గురైనట్టుగా ఆ వాతావరణం మారిపోయింది. గ్రెగరి తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని అతి కష్టం మీద కిందకు దించగలిగాడు(అతను మొదటి వరుసలో ఉన్నాడు)అతని గుర్రం వెంటనే వేగాన్ని అందుకుని,ముందుకు లంఘించి,ఆ సందర్భానికి సిద్ధమైపోయింది. కెప్టెన్ పోల్కోనికోవ్ ముందు ఉన్న ఓ ఖాళీ క్షేత్రాన్ని చూపించాడు. వాళ్ళ ఎదురుగా సేద్యానికి అనుకూలంగా ఉండే నేల ఉంది. మొదటి దళం ఉత్సాహంగా అరుపులు మొదలుపెట్టగానే,దాన్ని నాలుగవ దళం కూడా అందుకుంది. గుర్రాలు కూడా ఆ అరుపుల అర్థాన్ని అర్థం చేసుకున్నట్టు వేగంగా ముందుకు దౌడు తీసాయి. ఓ వైపు బలమైన గాలి తన చెవుల్లో రొద చేస్తూ ఉన్న గ్రెగరి స్పష్టంగా దూరం నుండి వినవస్తున్న తుటాల ధ్వనులు విన్నాడు. మొదటి తూటా అతని తల మీదగా దూసుకుపోయిందిగ్రెగరి భయంతో తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని గట్టిగా నొక్కాడు,దాని వల్ల తనకు నొప్పి కలిగితే కానీ బాహ్య స్పృహలోకి రాలేదు. అతని చేతులు చెమట పట్టి ఉన్నాయి. గాలిలో వేగంగా దూసుకు వస్తున్న తుటాలు అతని మెడను కిందకు వంచి గుర్రం మీద దగ్గరకు తెచ్చేలా చేశాయి. ఆ గుర్రపు చెమట వాసన అతని నాసికలను తాకింది. అతనికి అక్కడ ఉన్న కందకాలు,వాటి దగ్గర అటూ ఇటూ పరిగెడుతున్న ఆకారాల, మంచు అడ్డం పడి అస్పష్టంగా ఉండే దృశ్యంలా కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుండో ఒక మెషీన్ గన్ లో నుండి తుటాలు వేగంగా కొసాక్కుల వైపుకు దూసుకు వస్తూనే ఉన్నాయి,వాటిలో చాలా మటుకు కొసాక్కుల తలల పై నుండి వెళ్ళి గుర్రాల కాళ్ళ ముందు మట్టి దగ్గరే ఆగిపోయి గాలిలో దుమ్మును నింపుతున్నాయి.
ఆ దాడి మొదలు కానప్పుడు గుండెలో బరువుగా అనిపించింది కాస్త అప్పుడు ఓ చెక్క ముక్కగా మారిపోయినట్టు గ్రెగరికి అనిపించింది. అతనికి చెవుల్లో ఆ కాల్పుల శబ్దాలు,ఎడమ పాదంలో నొప్పి తప్ప ఇంకా ఏం తెలియడం లేదు. భయంతో అతని ఆలోచనలన్నీ చిక్కు పడినట్టు మారిపోయాయి.
మొదట గుర్రం మీద నుండి కింద పడింది కార్నెట్ లాఖోవ్ స్కీ. ప్రోఖోర్ అతని మీదుగా ముందుకు సాగిపోయాడు.
వెనక్కి తిరిగి చూసిన దృశ్యం ఒక్క క్షణంలో గ్రెగరి మెదడులో నిక్షిప్తమై పోయింది. ప్రోకోర్ గుర్రం, ఇంకో అధికారి గుర్రం ఎదురుపడటంతో ఆ కంగారులో ముందుకు దూకించబోతే,ఆ గుర్రం మెడ వెనక్కి తిరిగినట్టు అయ్యి,అది కింద పడటం,దాని మీద నుండే బలంతో ప్రోకోవ్ కింద పడిపోవడం జరిగింది. ప్రోఖోవ్ కింద పడ్డాక అతని మీదుగా వెనుక నుండి వస్తున్న వారు గుర్రంతో సహా తొక్కుకుంటూ వెళ్లిపోవడం,అతని అరుపులు ఎవరికి వినబడకపోవడం,దూడ లాంటి అతని కళ్ళల్లో కన్నీళ్లు ,ఆ క్రూర చర్య ఎంత అమానుషమో చెప్తున్నట్టు అనిపించింది. చాలామంది కొసాక్కులు కింద పడిపోయారు. కొందరు గుర్రలతో సహా పడిపోతే,కొందరు విడిగానే పడిపోయారు. కన్నీళ్ళతో నిండిన కళ్ళతో గ్రెగరి కందకాల నుండి గుంపులుగా వస్తూ ఉన్న ఆస్ట్రియా వాళ్ళ వైపు చూశాడు.
ఒక వరుసలా ఏర్పడి,ఒక వ్యూహంతో దాడి చేయాలన్న ప్రతిపాదికతో ఉన్న ఆ బృందం కాస్త చెల్లాచెదురు అయిపోయింది. ముందు వరుసలో ఉన్న వారు గ్రెగరితో సహా అందరూ కందకాల వైపు వెళ్తూ ఉంటే,మిగిలిన వారు వెనుకే ఉండిపోయారు.
పొడుగ్గా, ఒత్తయిన కనుబొమ్మలతో ఉన్న ఆస్ట్రియా వాడు, తన హోదాను సూచించే టోపీని తన కళ్ళ పైకి లాక్కుని, మోకాళ్ళ మీద కూర్చొని, గ్రెగరి వైపు లక్ష్యంగా తుపాకీ పేల్చాడు. ఎండ వల్ల గ్రెగరి చెక్కిళ్ళు ఎర్రగా మారిపోయాయి. వెంటనే గ్రెగరి తన బలాన్నంతటిని ప్రయోగించి, తన వేగంగా ముందుకు గుర్రం మీద దౌడు తీసి, అతని గుండెల్లో బల్లెం దింపాడు.అతను తప్పించుకునే ప్రయత్నం చేసినా, అది సరాసరి అతని గుండెల్లోనే దిగబడి, అతని శరీరంలో సగం, మిగిలిన భాగం శరీరం బయట ఉంది. గ్రెగరి ఇంకా వెనక్కి తగ్గే అవకాశం లేదు. గ్రెగరి కళ్ళ ముందే చేతిలో తుపాకి పట్టుకుని ఉన్న అతను వెనక్కి కుప్పకూలిపోయాడు, అప్పుడు గ్రెగరి తన పట్టును బల్లెం మీద సడలించి, తన ఖడ్గం మీద చేతిని ఉంచాడు.
అప్పటికే ఆస్ట్రియా సైనికులు ఆ ప్రాంతపు శివార్లవైపు పరుగులు తీస్తున్నారు.బూడిద రంగు దుస్తులతో ఉన్న వారిని గుర్రాల మీద కొసాక్కులు వెంబడిస్తూ ఉన్నారు.
బల్లెమును వదిలేసిన ఒక్క నిమిషం లోపే తనకే తెలియకుండానే గుర్రాన్ని ముందుకు లంఘించాడు. అతని వెనుక కోపంగా పళ్ళు కొరుకుతూ వస్తూ ఉన్న సార్జెంట్ మేజర్ ను అతను చూశాడు. గ్రెగరి ఆ హడావుడిలో ఖడ్గం వెనుక నుండి పొడుస్తూ అదిలిస్తూ ఉంటే,గుర్రం పరుగు అందుకుని ఒక వీధిలోకి దారి తీసింది.
ఒక ఆస్ట్రియావాడు ఎత్తుగా ఉన్న ఇనుము రైలింగును పట్టుకుని అటూఇటూ తూలుతూ, భయంతో పరిగెడుతూ ఉన్నాడు.అతని చేతిలో తుపాకీ లేదు, టోపీ పట్టుకుని ఉన్నాడు. గ్రెగరి కళ్ళు అతని మెడ మీద నిలిచాయి, యూనిఫార్మ్ అంటా చెమట పట్టి ఉంది. గ్రెగరి అతన్ని దాటి, చుట్టూ ఉన్న హింసాత్మక వాతావరణం ప్రేరేపించిన ఉన్మాదంతో తన ఖడ్గాన్ని పైకి ఎత్తాడు.జీను నుండి పక్కకు వంగి, దానిని కొద్దిగా ఏటవాలుగా చేసి, అతని ఛాతి మీద పడేలా వేటు వేసాడు. ఒక్క అరుపు కూడా లేకుండా అతను తన ఛాతి గాయం మీద చేతిని పెట్టుకుని,వెనక్కి తిరిగాడు.గ్రెగరి గుర్రాన్ని అదుపు చేయలేక, కొంత దూరం ముందుకు వెళ్ళాక, మరలా వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ ఆస్ట్రియా వాడి దీర్ఘచతురస్రాకార ముఖం, భయంతో ఇంకా పెరిగినట్టయి, భయంగా నల్లగా అయ్యింది. అతను తన చేతులను పక్కలకు గట్టిగా పెట్టుకుని ఉన్నాడు, అతని పెదవులు కదులుతూ ఉన్నాయి. గ్రెగరి వేసిన రెండు వేటుకి అతని చర్మం ఒక పొర ఊడి చెక్కిళ్ల నుండి ఒక ఎర్ర ముద్దలా వేలాడుతూ ఉంది. రక్తం ధారలుగా అతని దుస్తుల మీదకు కారుతూ ఉంది.
వారిద్దరి కళ్ళు కలిసాయి. ఆస్ట్రియా వాడి కళ్ళు చావు భయంతో నిండి ఉన్నాయి. అతను మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అప్పుడు అతని గొంతులో నుండి బిగ్గరగా ఏడుపు వచ్చింది.సగం మూసిన కళ్ళతో గ్రెగరి తన చేతిలోని కరవాలాన్ని గాలిలోకి ఎత్తాడు.బలంగా దాన్ని కిందకు తెచ్చాడు.ఈ సారి పడిన వేటు అతని పుర్రెను రెండుగా చేసింది. చేతులు పక్కకు వాల్చేసి అతను పడిపోయాడు. విరిగిన పుర్రె అక్కడే నెమ్మదిగా కదులుతూ పడింది. గ్రెగరి గుర్రాన్ని అదిలించగానే అది పక్క వీధిలోకి దూసుకుపోయింది.
ఆ వీధులన్నీ కాల్పుల మోతలతో మార్మోగిపోతున్నాయి. నురగలు కక్కుతూ ఉన్న ఓ గుర్రం ఒక చనిపోయిన కొసాక్కును ఇడ్చుకుంటూ గ్రెగరి కళ్ళ ముందే వెళ్తూ ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి కాలు ఇంకా దాని జీనుకి ఉన్న కాలి పట్టీకే ఇరుక్కుపోయి ఉంది. రక్తసిక్తమై,సగం నగ్నంగా ఉండి, ఆ మార్గంలో ఎగిరెగిరి పడుతూ ఉంది.
అతని మెదడు అంతా గందరగోళంతో నిండిపోయింది. గ్రెగరి గుర్రం మీద నుండి దిగి,తల గట్టిగా అదిలించాడు. మూడవ దళానికి చెందిన కొసాక్కులు అతని పక్కకు గుర్రాలను స్వారీ చేస్తూ వచ్చారు. ఒక గాయపడిన వ్యక్తిని మోసుకువెళ్తూ ఉన్నారు. ఖైదీలుగా చిక్కిన ఆస్ట్రియా వారిని నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు ముందు. వారు నడుస్తూ ఉంటే వారి బూట్ల చప్పుడు వినిపిస్తూ ఉంది. వారి ముఖాలు పాలిపోయి ఉన్నాయి. గ్రెగరి ఎందుకు చేస్తున్నాడో తెలియకుండానే తన పగ్గాలను వదిలేసి,తను చంపిన సైనికుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ మనిషి శవం ఇంకా అక్కడే ఉంది. సహాయాన్ని ఆర్ధిస్తున్నట్టు అతని చేతులు చాచి ఉన్నాయి. గ్రెగరి అతని ముఖంలోకి చూశాడు. చిన్నగా ఉన్న ఆ ముఖం,చిన్న బాలుడి ముఖంలా అనిపించింది,అతనికి పెరిగిన గడ్డం ఉన్నాసరే. అప్పటి వరకు ఉన్న సంతోషమంతా అతని నుండి ఈ దాడితో మాయమైపోయినట్టు ఉంది అతని ముఖం.
‘ఓ,నువ్వా!’ అటు వైపు వెళ్తున్న ఒక తెలియని కొసాక్కు అధికారి అతన్ని పలకరించాడు.
గ్రెగరి ఆ అధికారి టోపీ మీద ఉన్న దుమ్ము చూసి, మరలా తన గుర్రం వద్దకు వెళ్ళాడు. అతని అడుగులు భారంగా ముందుకు పడ్డాయి,ఏదో తెలియని బరువును భుజాల మీద మోస్తున్నట్టు ఉంది అతని నడ. బాధ,కోపం,అసహ్యం అతని హృదయాన్ని కాల్చేస్తున్నాయి. గుర్రం దగ్గరకు వచ్చినా చాలాసేపటి వరకు అతను దాని మీద స్వారీ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు.
* * *
అధ్యాయం-6
టాటర్ స్కై మరియు పొరుగు గ్రామాలనుండి వచ్చిన రెండవ వరుస రిజర్విస్టులు తమ గ్రామమైన ఇయా నుండి వచ్చాక రెండవ రాత్రి గడిపారు. టాటర్ స్కై దిగువ భాగంలో ఉండే కోసాక్కులు పై ప్రాంతం వారితో ముభావంగా ఉన్నారు.
కనుక పెట్రో మెలఖోవ్, అనికే,ఖ్రిస్టోన్య, స్టీఫెన్ అష్టకోవ్, ఇవాన్ టోమిలిన్, మరియు ఇంకొందరు ఒక బృందంలా ఒకే చోట ఉండాల్సి వచ్చింది.వారికి పొడుగ్గా ఉన్న ఓ వృద్ధుడు ఆతిధ్యమిచ్చాడు. ఆయన టర్కీ యుద్ధంలో పాల్గొన్నాడు. వారు వంటగదిలో, ముందు గదిలో పడకలు వేసుకుంటూ, ఆ రోజుకి ఆఖరికి సిగరెట్ వెలిగించుకుని, తర్వాత పోడుకుందామనుకుంటున్నప్పుడు ఆయన సంభాషణను మొదలుపెట్టాడు.
‘మీరు యుద్దానికి వెళ్ళబోతున్నారా, సైనికులారా?’
‘అవును, వెళ్లాల్సిందే.’
‘ఇది ఖచ్చితంగా టర్కీలకు వ్యతిరేకంగా చేసిన యుద్ధం. కన్నా భిన్నమైన యుద్ధమనే, నేను అనుకుంటున్నాను.ఇప్పుడు ఉన్న ఆయుధాలు చూడండి!’
‘తేడా ఏమి లేదు!టర్కీ యుద్ధంలో చాలా మందిని చంపారు, ఇప్పుడు కూడా అదే రక్తపాతం’, కోపంగా అన్నాడు టోమిలిన్, ఎవరి మీద కోపంగా ఉన్నాడో ఎవరికి తెలియకపోయినా.
‘అది వ్యర్థ ప్రలాపన, అబ్బాయి. ఇది తప్పకుండా వేరే రకపు యుద్ధమే.’
‘అవును, అలాగే ఉండొచ్చు’, ఖ్రిస్టోన్య ఆవులిస్తూ, బద్ధకంగా, సిగరెట్ పీక కింద నలిపేస్తూ అన్నాడు.
‘మనం చేయాల్సింది మనం కూడా యుద్ధంలో చేస్తాము’, పెట్రో మెలఖోవ్ ఆవులిస్తూ అని, సిలువ ఆకారంలో ప్రార్థన చేసి, తన కోటు తల పైకి లాక్కున్నాడు.
‘చూడండి అబ్బాయిల్లారా! నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైనది. ఏదో ఒక రోజు తప్ప నేను చెప్పింది మీరు గుర్తు తెచ్చుకుంటారు’, ఆ వృద్ధుడు అన్నాడు.
పెట్రో తన కోటు పక్కకు తీసి, శ్రద్ధగా వినసాగాడు.
‘ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి! మీరు జీవించి ఉండాలంటే, యుద్ధం నుండి ప్రాణాలతో బయట పడాలంటే, మీరు మానవ ధర్మాన్ని తప్పకూడదు.’
‘ధర్మమా?’ ఆ వరుస చివరిలో ఉన్న స్టీఫెన్ అష్టకోవ్ అడిగాడు. నమ్మలేనట్టు నవ్వాడు అతను. అతను యుద్ధం గురించి తెలిసినప్పటి నుండి నవ్వుకుంటూనే ఉన్నాడు. నిజానికి అది అతన్ని బాగా ఆకర్షించింది, ఆ సందర్బంగా ఇతరులు పొందే దిగ్భ్రమ, బాధలో తన సొంత బాధకు ఓదార్పును పొందేవాడు.
‘సరే, నేను చెప్తాను. యుద్ధంలో మీకు సంబంధించని దేనిని మీరు తీసుకోకూడదు. అది ఒక విషయం. ఇంకొక విషయం, పరాయి స్త్రీల జోలికి వెళ్ళవద్దు. వీటితో పాటు మీకు యుద్ధంలో ప్రార్థించడానికి ప్రార్థన తెలియాలి.’
ఆ మాటలతో కొసాక్కులు వారిలో వారు ఒక్కసారిగా అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు.
‘ఇంకొకరిది తీసుకోవడం కన్నా మనకున్న దానితో తృప్తి పడటం మంచిది.’
‘అంటే దాని ఉద్దేశం ఏమిటి? అసలు స్త్రీను తాకకుండా ఉండాలా? వారిని బలవంతం చేయకూడదు-అది నాకూ అర్థమైంది. కానీ ఒకవేళ ఆమెను మాట్లాడి ఒప్పించగలిగితే?’
‘అటువంటి సంబంధాలు మాత్రం ఎంత కాలం ఉంటాయి?’
‘అవును, అది నిజమే.’
‘ఇంతకు మీరు ఏ ప్రార్ధన గురించి చెబుతున్నారు?’
ఆ వృద్ధుడు వారి వైపు దృష్టి సారించి, వారి ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పాడు.
‘స్త్రీల ప్రసక్తే ఉండకూడదు!అది స్పష్టమే కదా! మీరు దీనికి కట్టుబడి ఉండలేకపోతే, మీ తల ఎగిరిపోతుంది లేదా తీవ్రంగా గాయపడతారు. అప్పటికి మీరు తెలుసుకున్నా, సమయం మించిపోయి ఉంటుంది. నేను మీకు ఆ ప్రార్థన చెబుతాను. నేను టర్కీ యుద్ధం మొత్తంలో ఉండి, చావును భుజాల మీద మోస్తూ కూడా ప్రాణాలతో బయట పడ్డానంటే అది ఆ ప్రార్ధన మహత్యమే.’
ఆయన ముందు గదిలోకి వెళ్ళి, అక్కడ ముందున్న అరలో వెతికి చిరిగిపోయి ఉన్న ఒక పచ్చటి కాగితాలను తీసుకువచ్చాడు.
‘ఇది తీసుకోండి. లేచి, దీనిని ఎక్కడైనా రాసుకోండి.రేపు కోడి కూత కన్నా ముందే మీరు బయల్దేరి వెళ్ళాలి కదా?’
ఆ వృద్ధుడు నలిగినట్టు ఉన్న ఆ కాగితాన్ని సరిచేసి బల్ల మీద ఉంచి, బయటకు వెళ్ళాడు. అనికే మొదటిగా లేచాడు. బయట వీస్తున్న గాలి వల్ల దీపం నుండి కదులుతున్న నల్లటి నీడలు ఏర్పడుతూ ఉంటే, స్త్రీ లాంటి కోమలమైన ముఖంతో దాన్నే కాసేపు చూసి తరువాత రాసుకున్నాడు అతను.స్టీఫెన్ తప్ప అందరూ అతనితోపాటే ప్రార్ధన రాసుకున్నారు. అందరికన్నా ముందు అనికే పూర్తి చేశాడు. ఆ కాగితాన్ని అతను అక్కడ ఉన్న ఓ నోటు పుస్తకంలో నుంచి చించి, తన మెడకు ఉన్న సిలువ పైన దాన్ని కట్టుకున్నాడు.స్టీఫెన్ అక్కడే కులాసాగా తన కాళ్ళు ఊపుతూ, వారిని హేళన చేస్తూ ఉన్నాడు.
‘పురుగుల కోసం మంచి ప్రదేశమే తయారు చేశారు.ఈ తాళ్ళ దగ్గర వాటికి హాయి ఉండదని, వాటికి కాగితాలతో ఇల్లు లాగా కట్టినట్టు ఉన్నారు. ఊరికే అంటున్నా!’
‘చూడు అబ్బాయి! నీకు నమ్మకం లేకపోతే నువ్వు మౌనంగా ఉండు!’వారి అతిధి మధ్యలో అన్నాడు.’ఇతరుల దారిలో నిలబడి, వారి నమ్మకాన్ని హేళన చేయకు. అది సిగ్గు పడాల్సిన విషయం, పాపం కూడా.’
ఆ పరిస్థితిలో ఏర్పడిన అసౌకర్యాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక స్టీఫెన్ మౌనంగా ఉండిపోయాడు.
‘ఒక ప్రార్ధనలో ఎలుగుబంటి, ఈటె, బాణాల గురించి ఉంది. వాటికి ఏమిటి సంబంధం?’అనికే ఆ వృద్ధుడిని అడిగాడు.
‘దాడి చేసే సమయంలో ప్రార్ధన ఇప్పుడు రాసింది కాదు. మా తాతయ్యకు వాళ్ళ తాతయ్య చెప్పాడు దీని గురించి. అందువల్ల అది ఆ కాలానికి సంబంధించినది అయ్యి ఉంటుంది. పూర్వపు రోజుల్లో వాళ్ళు ఈటెలు, బాణాలతోనే యుద్ధం చేసేవారు.’
మూడు ప్రార్ధనలు ఉన్నాయి, కొసాక్కులు అందులో నచ్చింది ఏదైనా ఒకటి ఎన్నుకోవచ్చు.
ఆయుధాల నుండి రక్షణ ప్రార్ధన
దేవుడు మనల్ని ఆశీర్వదించు గాక!కొండ మీద గుర్రంలా ఒక తెల్లటి రాయి ఉంటుంది. ఎలా అయితే నీరు ఆ రాయిలోకి ప్రవహించలేదో, అలాగే ఏ తూటా, బాణం కూడా దేవుడి బానిసనైనా నా శరీరంలోకి, నా మిత్రుల శరీరాల్లోకి, గుర్రాల్లోకి ప్రవేశించకుండా చూడు. ఎలా అయితే పట్టేడకి కొట్టిన సుత్తి, వెనక్కి వచ్చి పడుతుందో,అలాగే తూటా కూడా నా నుండి అలాగే దూరం వెళ్ళేలా చూడు ; ఎలా అయితే గుండ్రాయి చుట్టూ తిరుగుతూ ఉంటుందో, అలాగే బాణం కూడా నా చుట్టూ తిరుగుతున్నా నన్ను తాకకుండా చూడు. సూర్యుడు, చంద్రుడు కాంతివంతంగా ఉన్నట్టే, నీ బానిసనైన నేను కూడా బలంగా ఉండేలా చూడు.పర్వతం వెనుక ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం మూసి వేసి, ఆ తాళాన్ని నేను సముద్రం లోతులో ఉండే తెల్లటి రాయి కిందికి విసిరేస్తాను. అది ఏ మంత్రగాడు, మంత్రకత్తె, లేదా సన్యాసి, సన్యాసిని కంటపడకుండా. ఎలా అయితే సముద్రంలో ప్రవహిస్తున్న నీరు అక్కడి నుండి బయటకు పారిపోదో,ఒడ్డున ఉండే ఇసుక రేణువులను లెక్కబెట్టలేమో అలాగే దేవుడి బానిసనైన నేను కూడా అజేయంగా ఉండేలా చూడు. దేవుడి నామమున స్తుతించుగాక!ఆమెన్.
దాడి నుండి రక్షణ ప్రార్ధన
ఒక గొప్ప సముద్రం ఉంది. అందులో ఒక తెల్లటి రాయి బలిపీఠంగా ఉంది. దాని మీద రాయి లాంటి ఒక మనిషి తొమ్మిది మూరలకు మూడు రెట్లు ఎత్తుతో ఉన్నాడు. దేవుడి బానిసనైన నేను, నా మిత్రులు,తూర్పు నుండి దక్షిణం వరకు, భూమి నుండి ఆకాశం వరకు, పదునైన ఖడ్గాలు, కత్తుల నుండి, బల్లెల నుండి;చాకు, గొడ్డలి,ఫిరంగుల నుండి; లోహపు తూటాల నుండి;వివిధ పక్షులైన రాబందుల,బాతుల, కాకుల, హంసల ఈకలతో ఉన్న అన్ని రకాల బాణాల నుండి;టర్కీలు, క్రిమిటన్లు, ఆస్ట్రీయన్ల దాడుల నుండి;ఆక్రమణలు చేస్తూ ఉండే శత్రువులైన టాటర్ల నుండి, లితూనియన్స్ నుండి, జర్మన్ల నుండి, సైబిరీయా నుండి, కాల్మకుల నుండి మమ్మల్ని ఆ రాయి లాంటి మనిషిలో ఉండే రక్షణ కల్పించు. పరలోకం నందు ఉన్న దేవుడా, నీ బానిసనైన నన్ను, కాపాడు. ఆమెన్.
యుద్ధంలో రక్షణ ప్రార్ధన
దోషరహితమైన పవిత్ర ఆత్మ మేరీ మరియు జీసెస్ క్రీస్తు నామమున, యుద్ధంలోకి ప్రవేశిస్తున్న ఈ బానిసను, బానిస స్నేహితులను ఆశీర్వదించుము. మమ్మల్ని ఓ మేఘం లోపల ఉంచి, రక్షణ కవచంతో కాపాడుము. సలోనికా సెయింట్ డ్మిట్రి, దేవుడి బానిసనైన నన్ను, నా మిత్రులను నాలుగు దిక్కుల నుండి;దుష్టుల బాణాల నుండి, వారి ఈటెల నుండి, గొడ్డల్ల నుండి, ఖడ్గం, కత్తి, ఇతర ఆయుధాల నుండి;మంత్రగాళ్ళ నుండి అన్ని రకాల హానికర శక్తుల నుండి మమ్మల్ని రక్షించు. ఏ సత్యాలు లేకుండా నన్ను నేను నగ్నం నీ ముందు ఉంచుతున్నాను, నీ తీర్పు కోసం వేచి చూస్తూ. సముద్రం లోపల, బయన్ ద్వీపంలో గేటు దగ్గర ఇనుము మనిషి ఒకడు ఉంటాడు. అతను ఇనుము, తగరం, వెండి, సీసం ఇక ఏ లోహంతో దాడి చేసినా వాటిని తిప్పి కొట్టగలడు. దేవుడి బానిసనైన నన్ను, నా మిత్రులను ఇనుము లోహాల నుండి కాపాడు.చెక్కతో తయారైన బాణం అడవిలోకి తిరిగి వెళ్ళిపోయేలా, ఈకలతో ఉన్నది పక్షిని తిరిగి చేరుకునేలా చూడు. దేవుడి బానిసనైన నన్ను బంగారపు కవచంతో తూటాల నుండి, ఫిరంగుల నుండి, బల్లెం, కత్తుల నుండి కాపాడు. నా శరీరం కవచం కన్నా శక్తివంతంగా మారేలా చూడు. ఆమెన్.
తాము రాసుకున్న ప్రార్ధనలను కొసాక్కులు తమ తల్లులు ఆశీర్వదించి, తమ మట్టి మీద, బిడ్డల మీద ప్రేమతో ఇచ్చిన సిలువలకు కట్టుకున్నారు. కానీ ఆ ప్రార్ధన కూడా కొందరిని చావు నుండి కాపాడలేదన్నది కూడా నిజమే.
తూర్పు ప్రష్యా, గాలిషియా, రొమానియా మైదానాల్లో యుద్ధ జ్వాలలు వెలిగినప్పుడల్లా కొసాక్కు గుర్రపు డెక్కల ముద్రల సాక్షిగా అనేక శవాలు కుళ్ళిపోయాయి కూడా.
* * *
అధ్యాయం-7
డొనేట్ ప్రాంతానికి ఎగువ భాగంలో ఉన్న స్టానిట్సాలైన యెలాన్ స్కాయా, వ్యోషెన్ స్కాయా, మిగులిన్ స్కాయా మరియు కజాన్ స్కాయా ప్రాంతాలకు చెందిన కొసాక్కులను 11,12 కొసాక్కు రెజిమెంట్లలోనూ, అటామాన్ లైఫ్ గార్డుల్లో నియమించడం ఎప్పటినుండో వస్తూ ఉన్న నియమం.
కానీ 1914 లో సైన్యంలో పని చేయడానికి పిలిపించింబడ్డ వ్యోషెన్ స్కాయా కొసాక్కుక్కులను మాత్రం కొన్ని కారణాల వల్ల మూడవ డాన్ కొసాక్కు రెజిమెంటులోకి తీసుకున్నారు. మూడవ రెజిమెంటులోకి సాధారణంగా ఉస్ట్ మెడ్ వెదిత్సాకు చెందిన కొసాక్కులను తీసుకుంటారు. ఎర్మాక్ టిమోఫెయేవిచ్ పేరు మీదుగా ఆ రెజిమెంటుకి అదే పేరు వచ్చింది.ఈ మార్పు వల్ల ఆ రెజిమెంటులోకి వచ్చినవాడే మిట్కా కోర్షునోవు.ఆ రెజిమెంటుని మూడవ ఆశ్విక దళానికి చెందిన విభాగంతో పాటు విల్నో లో ఉంచారు. జూన్ లో ఆ దళాలన్నీ పట్టణం వెలుపలకి పచ్చిక మైదానాల్లోకి బయలుదేరాయి.
వేసవి కాలంలో కొద్దిగా వేడి గాలులు వీస్తూ ఉన్న రోజు అది. మేఘాలు ఆకాశంలో ముగ్గులా విస్తరిస్తూ, సూర్యున్ని కప్పేస్తూ ఉన్నాయి. రెజిమెంటు మార్చింగ్ చేస్తూ ఉంది.యుద్ధ సమయంలో వాయించే వాయిద్య ధ్వని మార్మోగుతూ ఉంది. వేసవి కాలంలో ధరించే తెల్లటి టోపీ, తెలికైన దుస్తులతో అధికారులు గుర్రాల మీద వెళ్తూ ఉంటే, వారు వదులుతున్న పొగ వలయాలుగా తల పైన తిరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలోని పచ్చికల్లో పని చేస్తూ ఉన్న రైతులు, గాడి రంగు దుస్తులు ధరించిన వారి భార్యలు, ఆ కొసాక్కుల సైన్యం వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. గుర్రాలు అప్పటికే చెమటతో వగరుస్తూ ఉన్నాయి. పసుపు పచ్చ నురగలు వాటి మర్మాంగాల చుట్టూ పట్టి ఉన్నాయి.ఆగ్నేయ దిశ నుండి వస్తూ ఉన్న గాలులు ఆ చెమట ఆరిపోయేలా చేయలేకపోయింది, పైపెచ్చు అక్కడ వాతావరణంలో ఇంకా వేడి పెరిగేలా చేసింది.
వారు గమ్యస్థానానికి సగం దూరం వచ్చారు. ఇంకొద్ది దూరం వెళ్తే ఓ కుగ్రామం వస్తుంది. ఇంతలో ఓ సంవత్సరం వయసున్న గుర్రపు పిల్ల ఐదవ దళం మధ్యలో అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంది. అది ఒక కంచె వెనుక నుండి వచ్చింది, అక్కడ అనేక గుర్రాలు కనిపించడంతో, సంతోషంతో గెంతులు వేస్తూ అక్కడకు వచ్చింది.ఆ గుర్రపు పిల్ల అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటే దాని మెత్తటి తోక పక్కకు ఊగుతూ, డొప్పల్లా ఉన్న దాని డెక్కల నుండి దుమ్ము పైకి లేస్తూ, కింద ఉన్న పచ్చిక మీద స్థిరపడుతూ ఉంది. అది అక్కడ నుండి ముందు ఉన్న దళం దగ్గరికి పరిగెత్తి, మూర్ఖంగా సార్జెంట్ మేజర్ గుర్రం తోక దగ్గర తన తలను చిన్నగా కుమ్మింది. ఆ గుర్రం కొద్దిగా అదిలించినట్టు ముందుకు కదిలింది తప్ప, ఆ చిన్న పిల్ల పట్ల జాలితో తన్నలేదు.
‘మూర్ఖపుదానా! దారి నుంచి అడ్డు తొలుగు!’సార్జెంట్ మేజర్ కొరడా పైకెత్తుతూ అరిచాడు.
కానీ ఆ పిల్లకు అదంతా తన ఇల్లులా స్నేహపూర్వంగా అనిపించినట్టు అలానే అల్లరి చేస్తూ ఉంటే, కొసాక్కులకు కూడా నవ్వు వచ్చింది. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అది అధికారుల గుర్రాల మధ్యలో పరిగెత్తడం వల్ల మొత్తం దళాల క్రమం అంతా చిందరవందర అయిపోయింది. కొసాక్కులు ఎంత అదిలిస్తూ ఉన్నా సరే, ఆ గుర్రాలు ఆ ఆజ్ఞలు పాటించలేదు. ఆ అస్తవ్యస్థతకు కారణమైన ఆ గుర్రపు పిల్ల పక్కకు పరిగెత్తి, దగ్గరలో ఉన్న గుర్రాన్ని కొరికే ప్రయత్నం చేసింది.
ఆ దళపు కమాండర్ ఆ గందరగోళం గమనించి అక్కడికి వచ్చాడు.
‘ఇక్కడ ఏం జరుగుతుంది?’
ఏ చోటులో అయితే ఆ గుర్రపుపిల్ల తన అల్లరితో తిరుగుతూ ఉందో, అక్కడ ఉన్న గుర్రాలు అటూ ఇటూ గెంతుతూ, చిన్నగా అరుస్తూ ఉంటే, కొసాక్కులు చిరునవ్వుతో కొరడాలను అదిలిస్తూ ఉన్నారు. లక్ష్యం లేకుండా ఎటుపడితే అటు వెళ్తున్న ముందు దళాలను వెనుక దళాలు కూడా అనుసరించాయి. కోపంతో ఉన్న ఓ దళపు అధికారి వెనుక నుండి ముందుకు వచ్చాడు.
‘ఏం జరుగుతుంది?’ ఆ దళపు కమాండర్ తన గుర్రాన్ని అదిలిస్తూ మరలా గట్టిగా అడిగాడు.
‘అది ఈ గుర్రపు పిల్ల..’
‘ఈ పిల్ల మన దారి మధ్యలోకి వచ్చేసింది..’
‘మేము ఈ కుర్ర దయ్యాన్ని ఇక్కడ నుండి తరమలేకున్నాము!’
‘మీ కొరడాలను వాడండి! ఎందుకంతా జాలిగా ఉన్నారు?’
కొసాక్కులు చిన్నగా తమలో తామే నవ్వుకుంటూ, పగ్గాలు అందుకున్నారు.
‘సార్జెంట్ మేజర్! లూయిటెంట్, ఏమి చేస్తూ ఉన్నావు? నీ దళాన్ని క్రమంలో పెట్టు. ఇప్పటికే హద్దు దాటింది…’
ఆ దళపు కమాండర్ ముందుకు వెళ్తూ ఉంటే, అతని గుర్రం తడబడే సరికి, దారి పక్కన ఉన్న మురికి గుంట పక్కన జారింది. వెంటనే అతను దాన్ని ముందికి ఉరికించాడు, అది ముందు పెరిగి ఉన్న పసుపు -తెలుపు రంగులతో ఉన్న డైసి పువ్వుల దగ్గరకు గెంతు వేసింది. ఓ అధికారుల బృందం కొద్ది దూరం వెళ్ళి ఆగింది. ఓ లూయిటెంట్ కల్నల్ తల వెనక్కి వాల్చి, ఓ చేత్తో ఫ్లాస్కులో నుండి నీళ్ళు తాగుతూ , ఇంకో చేత్తో తన గుర్రాన్ని ప్రేమతో నిమిరాడు.
సార్జెంట్ మేజర్ ఆ దళక్రమం గురించి పట్టించుకోకుండా, పిచ్చి కోపంతో తిడుతూ ఆ గుర్రపు పిల్లను దారి నుండి బయటకు తరిమాడు. మరలా దళాలు ఒక క్రమంలో ఏర్పడ్డాయి. ఆ గుర్రపు పిల్లను అలా ఆయన తరుముతూ ఉంటే నూట యాభై జతల కళ్ళు చూశాయి.
ఆ మేజర్ దాన్ని తరుముతూ ఉంటే అది కొద్దిగా ముందుకు వెళ్ళి, తన పక్కలకు అంటి ఉన్న పశువుల పేడను సార్జెంట్ మేజర్ గుర్రానికి రుద్ది, ఆయన తన కొరడా ఎత్తే లోపు ముందుకు పరిగెత్తేది. అప్పటికే ఆ కొరడా దాని తోకకు సుతారంగా తాకినా, అది ముందుకు కదిలేసరికి గాలిలోనే ఉండిపోయేది.
అధికారులతో సహా దళమంతా ఇదంతా చూసి నవ్వుతూ ఉంది. ఆఖరికి కోపంగా ఉన్న జనరల్ ముఖంలో కూడా ఓ చిన్న చిరునవ్వు తారాడింది.
మిట్కా కోర్షునోవ్ వ్యోషెన్ స్కాయా సమీపంలో ఉండే కార్గిన్ గ్రామానికి చెందిన మైఖేల్ ఇవాన్ కోవ్,స్పోటకం మచ్చలతో, ఒంటె అనే ముద్దు పేరుతో పిలవబడే కోజమా క్రిచ్ నోవ్ లతో కలిసి మూడవ దళంలో ఉన్నాడు. కోజమా ఎప్పుడు అతన్ని ఏడిపిస్తూ ఉండేవాడు. క్రిచ్ నోవ్ ఒక ‘వృద్ధ కొసాక్కు’, అంటే దాని అర్థం అతను సైన్య సేవలో ఆఖరి సంవత్సరంలో ఉన్నాడు, అందుకే అలిఖిత నియమాల ప్రకారం,అతనికి తన కన్నా చిన్న కుర్రవాళ్ళను ఆట పట్టించడానికి, ఏడిపించడానికి, అలాగే వివిధ పనులు చేయించడానికి ; ఎదురు తిరిగితే నాలుగు తగిలించడానికి కూడా.అప్పటికే అలా ఎదురు తిరిగితే వేసే శిక్ష కూడా నిర్ణయమైపోయి ఉంది.1913 వరకు మార్పులు లేకున్నా ఉన్న రెజిమెంటులో ఉన్నవారికి బెల్టుతో పదమూడు దెబ్బలు అయితే,1914 వారికి పద్నాలుగు. సార్జెంట్ మేజర్లు, అధికారులు ఈ చర్య వల్ల సీనియర్ల పట్ల గౌరవం, భక్తి ఉంటాయన్న ఉద్దేశ్యంతో దానిని ప్రోత్సహించారు.
ఈ మధ్యే కార్పోరల్ హోదాకు ఎదిగిన క్రిచ్ నోవ్, తన గుర్రం మీద, వంగిన పక్షి వలె కూర్చుని ఉన్నాడు. ఆకాశంలో బూడిద రంగులో ఉన్న పెద్ద మేఘాన్ని చూస్తూ మొహం చిట్లిస్తూ,బలిష్టంగా ఉండే తమ దళపు కమాండర్, మేజర్ పోపోవ్ స్వరాన్ని అనుకరిస్తూ, మిట్కాను ఇలా అడిగాడు,’సరే.. ఇప్పుడు చెప్పు, కోర్షునోవ్, మన దళపు కమాండర్ పేరు ఏమిటి?’
అప్పటికే తన దురుసుతనం వల్ల అనేక బెల్ట్ దెబ్బలు తిన్న మిట్కా బలవంతంగా ముఖం మీద గౌరవ భావాన్ని పులుముకున్నాడు.
‘మేజర్ పోపోవ్, కార్పోరల్!’
‘ఏమిటి?’
‘మేజర్ పోపోవ్, కార్పోరల్!’
‘అది కాదు నేను అడుగుతున్నది. మన కొసాక్కులలో అతన్ని ఎలా పిలుస్తారో చెప్పు.’
ఇవాన్ కోవ్ మిట్కాను వారిస్తున్నట్టు కన్ను గీటి, కుందేలు పెదవిలా ఉండే తన పెదవితో చిరునవ్వు నవ్వాడు. మిట్కా చుట్టూ చూస్తే, అతనికి కొద్ది దూరంలో మేజర్ పోపోవ్ వెనక నుండి గుర్రం మీద వస్తున్నట్టు కనిపించింది.
‘బదులు చెప్పు!’
‘మేజర్ పోపోవ్ అన్నదే సరైన సంబోధన, కార్పోరల్!’
‘పద్నాలుగు బెల్టు దెబ్బలు! ఇప్పుడు చెప్పు, వెధవా!’
‘నాకు తెలియదు, కార్పోరల్!’
‘సరే అయితే, మనం పచ్చిక మైదానంలోకి వెళ్ళినప్పుడు, నీకు బెల్టు దెబ్బల పూజ చేస్తాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఇప్పుడు!’ క్రిచ్ నోవ్ గొంతు ఇప్పుడు కోపంగా మారింది.
‘నాకు తెలియదు!’
‘పనికిమాలినోడా! నీకు వాడికి మేము పెట్టుకున్న పేరు తెలియదా?’
మిట్కా అప్పుడే వెనుక నుండి చిన్నగా మేజర్ గుర్రం వస్తున్న శబ్దం వింటూ మౌనంగా ఉన్నాడు.
‘సరే అయితే’, క్రిచ్ నోవ్ కోపంగా అరిచాడు.
వెనుకనుండి హెచ్చరిస్తున్నట్టు చిన్న నవ్వులు వినిపించాయి. ఆ నవ్వులకు కారణం తెలియక, వారు తనను చూసే ఎగతాళిగా నవ్వుతున్నారనుకుని ఇంకా రెచ్చిపోయాడు.’సరే, కోర్షునోవ్. మనం అక్కడకు వెళ్ళాక, నీకు తప్పక యాభై దెబ్బలు పడతాయి!’
మిట్కా ఆ మాటలకు భుజాలు ఎగరేసాడు.
‘నల్ల ముక్కు!’
‘ఆ, అదే సరైంది.’
‘క్రిచ్ కోవ్!’ వెనుక నుండి ఓ స్వరం కంగుమంది.
ఆ ‘వృద్ధ కొసాక్కు ఒక్కసారిగా ఉలిక్కిపడి, అప్రమత్తమయ్యాడు.
‘ఏంటా పేరు, నువ్వు అడుగుతున్నది, మూర్ఖుడా?’ మేజర్ పోపోవ్ అతనికి దగ్గరగా వస్తూ అడిగాడు.’ఇదేనా నువ్వు యువ కొసాక్కులకు నేర్పేది?’
క్రిచ్ కోవ్ కళ్ళు అదిరాయి. అతని బుగ్గలు ఎర్రగా మారిపోయాయి. వెనుక నుండి ఆపుకుంటున్న నవ్వులు వినిపించాయి.
‘పోయిన సంవత్సరం నేను ఎవరికి పాఠం నేర్పించాను? ఎవరి ముఖాన్ని ఈ వేలు గోరుతో గీరి తర్వాత పగలగొట్టాను?’ మేజర్ పొడుగు గోరుతో ఉన్న తన చేతి చిటికెన వేలిని క్రిచ్ నోవ్ ముక్కు కింద పెడుతూ మరలా అన్నాడు, ‘కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో!ఇవేమి మళ్ళీ నేను వినకూడదు!ఓ స్నేహితుడా, నీకు అర్థమైందా?’
‘నాకు బాగా అర్థమైంది, సార్!’
మేజర్ ఒక్క నిమిషం ఆగి, పక్కకు గుర్రాన్ని దౌడు తీయించి, కొద్దిసేపు ఆపి, ఆ దళం అంతా ముందుకు వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. నాలుగవ, ఐదవ దళాలు ముందుకు సాగిపోయాయి.
‘ఒకే వేగంతో వెళ్ళండి!’ అని అరిచాడు.
క్రిచ్ నోవ్ తన భుజానికి ఉన్న పట్టీని సరి చేసుకుని, వెనక్కి తిరిగి, కనుమరుగవుతున్న జనరల్ ఆకారం చూస్తూ, తల ఊపి, తన కరవాలం సర్దుకున్నాడు.
‘ఆ నల్లముక్కోడు ఎక్కడ నుండి ఊడిపడ్డాడు?’
నవ్వుకుంటూ, ఇవాన్ కోవ్ అతనితో చెప్పాడు.’ఆయన మన వెనుకే చాలా సేపటి నుండి వస్తూ ఉన్నాడు. అంతా విన్నాడు కూడా. బహుశా ఆయన గురించే మాట్లాడుతున్నావని ఊహించే ఉంటాడు.’
‘వెధవా!మరి నాకెందుకు సైగ చేయలేదు రా?’
‘నేనేందుకు చేయాలి?’
‘ఎందుకు చేయాలో చూపిస్తాను నీకు. నీ నగ్న పిర్రలపై పద్నాలుగు బెల్టు దెబ్బలు పడతాయి!’
చుట్టూ పరిసరాల్లో ఉన్న ఎస్టేట్ల దిశగా దళాలు ప్రయాణం కొనసాగించాయి. పగళ్ళు వాళ్ళు ఆ యజమానుల కోసం పచ్చికల్లో గడ్డి కోసేవారు, రాత్రుళ్ళు తమకు కేటాయించిన స్థలాల్లో తమ గుర్రాలను మేపుతూ, మంట వేసుకుని, పేకాట ఆడుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు.
ఆరవ దళం పొలాండుకు చెందిన పెద్ద భూస్వామి అయిన స్కీనిడర్ కోసం పని చేస్తూ ఉంది. అధికారులందరూ లాడ్జిల్లో ఉంటూ తాగుతూ, జూదమాడుతూ, ఆ ఎస్టేట్ మేనేజర్ కూతురికి వల వేసే ప్రయత్నం చేస్తూ ఉండేవారు.ఆ ఎస్టేటుకి మూడు వెరస్టుల దూరంలో కొసాక్కులు తమ గుడారాలు వేసుకున్నారు. ప్రతి ఉదయం మేనేజరు తన గుర్రపు బండి మీద వారి వద్దకు వచ్చేవాడు. భారీకాయంతో ఉండే ఆయన ఆ బండి దిగి, ముందుకు నడిచి,కొసాక్కులను పలకరించేవాడు.
‘మాస్టర్!మీరు కూడా ఆ బండి దిగి మాతో పాటు పని చేయండి!’
‘మీ కొవ్వు తగ్గుతుంది!’
‘ఆ కొడవలి అందుకుని పని చేయండి లేకపోతే కనీసం నడవలేరు కూడా తర్వాత!’ అనేక కొసాక్కు స్వరాలు స్పందించేవి. ఆ మేనేజర్ బదులుగా నవ్వుకుంటూ, తనకు పట్టిన చెమటను చేతి రుమాలుతో తుడుచుకుంటూ, సార్జెంట్ మేజర్ తో కలిసి గడ్డి కోయాల్సిన కొత్త స్థలాలను చూపించేవాడు.
మధ్యాహ్ననానికి భోజనాలు వచ్చేవి. కొసాక్కులు చేతులు కడుక్కుని, భోజనాలకు వచ్చేవారు.
వారు నిశ్శబ్దంగా భోజనం చేసేవారు. కానీ రాత్రి భోజనం తర్వాత దొరికే అరగంట తీరిక సమయంలో మాత్రం అంతకు ముందు మాట్లాడుకోనివి మాట్లాడుకునేవారు.
‘ఇక్కడ ఉన్న గడ్డి అస్సలు పనికి రానిది. మన పచ్చిక బీడుల్లో గడ్డికి, దీనికి పోలికే లేదు.’
‘ఇక్కడ గడ్డి కూడా పెద్దగా పెరగలేదు.’
‘డాన్ ప్రాంతంలో మన వాళ్ళంతా ఈపాటికి గడ్డి కోసేసి ఉంటారు.’
‘ఇక్కడ కూడా త్వరలోనే అయిపోతుంది. నిన్నే పున్నమి చంద్రుడు వచ్చాడు. ఇంకా వానలే పడాలి.’
‘వాడసలు చూడటానికి పోలాండ్ వాడి లానే లేడు. మన ఒళ్ళు నొప్పులకు కనీసం ఒక్క సీసా మందు అయినా ఇచ్చి ఉండాలి.’
‘హా!హా!వాడు ఆ సీసా కోసం శిఖరం ఎక్కి ఉచ్చ పోస్తాడు.’
‘అంటే ఏంటి అబ్బాయిలు? ఎంత ధనవంతులైతే, అంత చెడ్డవారు అవుతారనా?’
‘ఆ విషయం జారును అడిగితే మంచిది!’
‘ఆ యజమాని కూతురిని ఎవరైనా చూశారా?’
‘ఆమె గురించి విషయం ఏమిటి?’
‘ఆ పిల్లకు ఒంటి మీద కాస్త కండ ఉంది.’
‘చక్కటి గొర్రెలా ఉంటుందా?’
‘అవును!’
‘ఆమెతో ఎంత మొరటుగా ఉన్నా బాగానే ఉంటుందనుకుంటా!’
‘ఆమెకు ఎవరో యువరాజుతో సంబంధం ఉందంట నిజమేనా?’
‘అంత అందం, సౌష్టవం ఉన్న ఆడది మామూలు మగవాళ్ళకు పడదు!’
‘అబ్బాయిలు, ఆ తర్వాత రోజు ఒక వార్త విన్నాను, అదేమిటంటే మనల్ని ఎవరో ఒక అధికారి పరిశీలిస్తారట.’
‘ఆ బండ పిల్లి గాడు ఇలాంటివి చేయలేడు, వాడు..’
‘అలా మాట్లాడకు, తారస్!’
‘నాకు ఆ కాల్చిన సిగరెట్ ఇవ్వవా..’
‘నువ్వొక బిచ్చగాడివి! ఆ పెద్ద చేత్తో అచ్చం దయ్యంలా ఉన్నావు. వెళ్ళి ఆ చర్చి దగ్గర అడుక్కో, పో!’
‘చూడండి మిత్రులారా!ఫెడోట్కా పొగ భలే రింగులు రింగులుగా వదులుతాడు! కానీ, పాపం వాడికి కాల్చడానికి సిగరెట్టే లేదు.’
‘కేవలం బూడిద మాత్రమే మిగిలింది.’
‘మిత్రుడా!సరిగ్గా కళ్లు తెరిచి చూడు. అక్కడ అగ్ని ఇంకా మండుతూనే ఉంది, పరిపూర్ణ స్త్రీ లో ఉండే కాంక్షలా!’
వెల్లికిలా పడుకుని, సిగరెట్లు కాలుస్తూ, ఎండకు వెనుక వీపులు కాలుతూ ఉంటే, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.ఒక వైపు, ఐదుగురు వృద్ధ కొసాక్కులు ఒక కొత్తగా సైన్యంలోకి వచ్చిన వాడు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు.
‘ఏ స్టానిట్సా వాడివి నువ్వు?’
‘యెలన్ స్కాయా.’
‘ఆ గొర్రెలదా?’
‘అవును, కార్పోరల్.’
‘మీ ప్రాంతంలో ఉప్పు రవణా చేయడానికి ఏ జంతువును ఉపయోగిస్తారు?’
కొంచెం దూరంలో కోజ్మా క్రిచ్ కోవ్ గుర్రపు గుడ్డ మీద పడుకుని, తన వేళ్ళతో మీసం సరి చేసుకుంటూ, ఏమి తోచక ఉన్నాడు.
‘గుర్రాలు.’
‘ఇంకే జంతువులను వాడతారు?’
‘ఎద్దులు.’
‘క్రిమియా నుండి చేపలను తీసుకురావడానికి ఏ జంతువును వాడతారు? నీకు తెలుసు. అవి ఓ రకమైన ఎద్దుల్లా ఉంటాయి,వాటి వెనుక ఎత్తుగా ఉంటుంది,అవి ముళ్ళు తింటాయి. వాటిని ఏమంటారు?’
‘ఒంటెలు.’
‘హా.. హా..’
క్రిచ్ కోవ్ బద్ధకంగా లేచి వంగిపోయిన తన భుజాలను ఒంటె మూపురంలా ఉంచి, మెడ సాగదీస్తూ, ఆ కుర్రాడి దగ్గరకు వస్తూ, తన బెల్టు తీసాడు.
‘కిందకు వంగు!’
జూన్ నేల వేసవి సాయంకాలాల్లో కొసాక్కులు క్యాంప్ ఫైర్ల చుట్టూ కూర్చుని పాడుకునేవారు.
దూర ప్రాంతానికి కొసాక్కు పయనమయ్యేవాడు
ధ్రుడమైన మేలైన నల్లటి గుర్రం మీద
శాశ్వతంగా ఆ స్వదేశాన్ని వదిలిపెట్టి
ఆ పాడుతున్న స్వరం బాధతో రోదిస్తూ ఉంటే, మిగిలిన గొంతులు బాధతో ఆ పాటను అందుకునేవి.
అతను ఎప్పటికీ తిరిగి రాడు
అప్పుడు ఆ గొంతులన్నీ జోరందుకుని, వేగాన్ని పెంచేవి:
నిస్సహాయంగా అతని యవ్వన వధువు
ఉత్తరం దిక్కు వైపు ఉదయం, సాయంత్రం చూస్తూ ఉండేది
తన కొసాక్కు తిరిగి గుర్రం మీద
అతను ఎప్పటికీ వదిలి రాలేని భూమి నుండి వస్తాడని
ఇంకా ఎన్నో గొంతులు కలిసి ఆ పాట పాడుతూ ఉంటే ఆ పాట పోల్సి ప్రాంత బీరులా చిక్కపడేది:
చలికాలంలో కొండల వెనుక ప్రాంతంలో
మంచు కొరుకుతూ, మంచు తుపాన్లు కురుస్తున్న వేళ
దేవదారు, పైన్ వృక్షాలు భయానకంగా తలలు వంచి ఉన్నచోట,
కొసాక్కుల ఎముకలు మంచు కింద గడ్డ కడుతున్నాయి
వారి స్వరాలు కొసాక్కుల సాదాసీదా జీవితం గురించి చెప్పేవి. ఆ స్వరాలు కొసాక్కుల జీవన విషాదం గురించి ఆలపిస్తూ ఉంటే, అందులో వణుకు స్పష్టంగా కనిపించేది.
చనిపోతూ ఉన్న కొసాక్కు తన శవాన్ని
అనాధశవంగా చేయవద్దని
అర్థించేవాడు, ప్రార్థించేవాడు.
మరలా ఆ స్వరాల్లో ఆ మరణ విషాదం తొంగి చూసేది:
తన ఊరిలో పూసే గులాబి పూల చెట్టు
తన సమాధి పైన విరబూయాలని కోరుకునేవాడు.
ఇంకో చిన్న బృందం ఇంకో పాటను అందుకుంది:
కల్లోలంగా ఉండే అజోవ్ సముద్రం నుండి
ఓడలు డాన్ వైపు ప్రయాణం చేస్తున్నాయి
తన సొంత దేశానికి
ఓ కుర్ర అటామన్ తిరిగివచ్చాడు.
ఆ దళంలో ఇంకొక వ్యక్తి సిగరెట్టు పొగకు దగ్గుతూ,ఎంతో అద్భుతంగా కథలు అల్లి చెబుతున్నాడు.కళ్ళ రెప్పలు కూడా వేయకుండా అక్కడున్న వారు వింటూ ఉన్నారు. కేవలం కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఆ కథలో నాయకుడు ఎప్పుడైతే శత్రువులు పన్నిన పన్నాగాల నుండి తెలివిగా తప్పించుకుంటాడో, అప్పుడు మాత్రం ఎవరో ఒకరు గట్టిగా చప్పట్లు కొడుతూ,’అది అలా చేయాలి!అద్భుతంగా ఉంది!’అనేవాడు. ఆ మాటలతో ఉత్సాహం పుంజుకున్న ఆ వ్యక్తి ఇంకా రసవత్తరంగా ఆ కథను కొనసాగించేవాడు.
ఆ రెజిమెంటు పచ్చిక మైదానంలోకి వచ్చిన వారం తర్వాత, మేజర్ పోపొవ్ ఆ దళపు కమ్మరిని, సార్జెంట్ మేజర్ ను పిలిపించాడు.
‘గుర్రాలు ఎలా ఉన్నాయి?’ సార్జెంట్ మేజర్ ను అడిగాడు.
‘బాగానే ఉన్నాయి, సార్. నిజం చెప్పాలంటే బాగున్నాయి. వాటి వెనుక నిండిపోయినట్టు, కండ పట్టి ఉన్నాయి.’
ఆ మేజర్ తన నల్ల మీసాన్ని బాణం ఆకారంలో చేస్తూ, (అందుకే ఆయనకు నల్ల ముక్కు అని పేరు పెట్టబడింది) అన్నాడు.’గుర్రపు జీను సామగ్రి అంతా కూడా మరమ్మత్తులు చేసి, కొత్త వాటిలా చేయాలని రెజిమెంట్ పై అధికారి ఆదేశించారు. రెజిమెంట్ మొత్తాన్ని రాజ్యానికి చెందిన అధికారి ఒకరు పరిశీలన చేస్తారట. కాబట్టి అన్నీ మెరిసిపోతూ, కొత్త వాటిలా ఉండాలి. అలాగే కొసాక్కులు కూడా చూడటానికి బాగా ఉండాలి.ఇదంతా ఎప్పటికీ అవుతుంది?’
సార్జెంట్ మేజర్ కమ్మరివైపు చూశాడు. అతను తిరిగి సార్జెంట్ మేజర్ వైపు చూశాడు. ఇద్దరూ మేజర్ వైపు చూశారు.
‘ఈ ఆదివారం అయితే పర్లేదా, సార్?’సార్జెంట్ మేజర్ సూచిస్తూ అన్నాడు.
‘అయితే ఈ ఆదివారం తప్పకుండా చూసుకో!’ మేజర్ హెచ్చరిస్తునట్టు అన్నాడు. ఆ సమావేశం అంతటితో ముగిసింది.
ఒక్కసారిగా ఆ రాచరిక పరిశీలన కార్యక్రమం కోసం సన్నాహాలు మొదలయ్యాయి.
కార్గిన్ స్కాయా కమ్మరి కొడుకైన మైఖేల్ ఇవాన్ కోవ్, స్వయాన కమ్మరి పనితనపు నేర్పు ఉన్నవాడు కావడం వల్ల, ఆ దళపు కమ్మరికి పనుల్లో సాయం చేశాడు. మిగిలిన వారు తమ గుర్రాలను శుభ్రం చేసి, వాటి డెక్కల నుండి మొత్తం శరీరమంతా మెరిసిపోయేలా చేసి, గుర్రపు బండ్ల ఇరుసులు, చక్రాలు అన్నిటికీ అవసరమైన మరమ్మత్తులు చేశారు.
ఒక వారం తర్వాత ఆ రెజిమెంటు అంతా కూడా కొత్త ఇరవై కొపెక్కుల నోటులా మెరిసిపోతూ ఉంది. గుర్రపు డెక్కల నుండి కొసాక్కుల ముఖాల వరకు అన్ని కొత్త కాంతితో వెలుగుతున్నట్టు ఉన్నాయి. శనివారం నాడు ఆ రెజిమెంటు కమాండర్ అయిన కల్నల్ గ్రెకోవ్ ఆ రెజిమెంటును పరీక్ష చేసి, అధికారులకు, మిగిలిన వారికి అంత ఉత్సాహంగా ఆ పనులన్నీ చేసినందుకు అభినందించాడు.
ఆ జూలై నెలలో రోజులన్నీ గడిచిపోతూ ఉన్నాయి. కొసాక్కుల గుర్రాలన్నీ మంచి తిండి వల్ల బలంగా తయారవుతుంటే, కొసాక్కులకు మాత్రం చిరాకుగా ఉంది. అప్పటికి ఇంకా రాచరిక పరిశీలన గురించి ఏ వార్త తెలియకపోవడంతో వారిలో వారే తమకు తోచినట్టు ఊహించుకునేవారు. అలా ఓ వారం వారి చర్చలతో, మరలా అన్నిటిని కొత్త వాటిగా మెరిసేలా చేయడంతో గడిచిపోయింది. అప్పుడే అనుకోకుండా విల్నో ప్రాంతానికి ఆ దళం అంతా వెళ్ళాలని ఆజ్ఞ వచ్చింది.
వారు సాయంత్రానికి కల్లా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రెండో ఆజ్ఞ కూడా జారీ చేయబడింది. కొసాక్కులు అందరూ తమ సామాన్లు సర్దుకుని, ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని.
అసలు ఇదంతా ఏమిటి సార్?’ కొసాక్కులు ఆ రెజిమెంట్ అధికారుల నుండి నిజానిజాలు తెలుసుకోవడానికి అడుగుతూ ఉండేవారు.
కానీ ఆ అధికారులు భుజాలు ఎగరేసేవారు. వారు కూడా తమకు కూడా పూర్తి వివరాలు తెలియవనే చెప్పేవారు.
‘నాకు తెలియదు’
‘ఒకవేళ జారు సమక్షంలో పరిశీలన కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయేమో?’
‘మాకు ఇంకా ఆ విషయం గురించి ఏ సమాచారం లేదు.’
ఆ అధికారుల నుండి వారికి లభించిన సమాచారం అదే. జూలై 9 న రెజిమెంట్ కమాండర్ దగ్గర ఉండే ఒకతను, ఆరవ దళానికి చెందిన తన స్నేహితుడైన కొసాక్కు మ్రైఖిన్ గుర్రపు శాలలో పని చేస్తూ ఉండగా అసలు విషయం చేరవేశాడు.
‘యుద్ధం రాబోతుంది!’
‘నువ్వు అబద్ధం చెబుతున్నావు!’
‘దేవుడి సాక్షిగా చెప్తున్నా. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు!’
ఆ తర్వాతి రోజు ఉదయం బ్యారక్ కిటికీల ముందు రెజిమెంట్ అంతా సిద్ధంగా ఉంది. అందరూ గుర్రాల మీద సిద్ధంగా ఉండి, కమాండర్ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
మేజర్ పోపొవ్ ఆరవ దళం ముందు, మేలైన తన గుర్రం మీద,తెల్లటి గ్లోవు ధరించిన తన ఎడమ చేతితో పగ్గాలు పట్టుకుని ఉన్నాడు. ఆ గుర్రం కూడా యజమాని ఆజ్ఞ కోసం చూస్తూ ఉంది.
ఆ రెజిమెంటు కమాండర్ బ్యారక్ చుట్టూ ఒక రౌండు వేసి, అందరిని గమనించడానికి పక్కన ఆగాడు.ఆయన సహాయకుడు చేయి చాచి చేతి రుమాలు తీసి ఆయన ముందు పెట్టాడు,ఆయన ముక్కు చీదే సమయం అతనికి లేకపోయింది. ఆ భయంకరమైన మౌనంలో ఆ కల్నల్ ‘కొసాక్కులారా!’ అని గట్టిగా అరిచాడు, ఓ ఒక్క మాట అందరిని జాగురుకులను చేసింది.
‘ఇక సమయం వచ్చేసింది!’ఇదే ఆలోచన ప్రతి ఒక్కరి మెదడులో ఉంది. ఒత్తి పెట్టి ఉన్న స్ప్రింగ్ లా అక్కడంతా ఒకటే ఉద్వేగం!మిట్కా కోర్షునోవు తన పాదాలను అసహనంగా అటూ ఇటూ కదిలిస్తూ ఉన్నాడు. అతని పక్కనే జీను మీద కూర్చుని ఉన్న ఇవాన్ కోవ్, నల్లగా ఉన్న పళ్ళు బయటకు కనిపిస్తూ ఉంటే కుందేలు లాంటి నోరును తెరిచి అలానే చూస్తూ ఉన్నాడు. అతని వెనుక వరుసలో ఉన్న క్రిచ్ కోవ్, ముందుకు ఒంగుతూ, ముఖం చిట్లిస్తూ ఉంటే; అతని వెనుక గుర్రంలా మెలికలు పడిన చెవులతో లాపిన్, అతని పక్కనే షేగోల్కొవ్ కంఠం దగ్గర గాయపు మచ్చతో ఉన్నాడు.
‘… జర్మనీ మన మీద యుద్ధం ప్రకటించింది.’
అప్పుడే బలంగా గాలి వీయడం మొదలుపెట్టింది. ఓ గుర్రపు సకిలింపులో ఆ గాలి ధ్వని కలిసిపోయింది. అందరి కళ్ళు, తెరిచిన నోళ్ళు, గుర్రపు సకిలింపు వినవచ్చిన మొదటి దళంవైపు తిరిగాయి.
కల్నల్ మాట్లాడుతూనే ఉన్నాడు.పదాలను సరైన కూర్పుతో ఉపయోగిస్తూ, అక్కడ ఉన్న వారిలో దేశభక్తి రగిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ కొసాక్కుల దృష్టిలో శత్రుదేశపు ఓటమి కాదు కనిపించింది.తమ భార్యలు, పిల్లలు, తమకు ప్రియులు, పండ కోయని పొలాలు, మగాళ్ళు లేని గ్రామాలు దృశ్యచిత్రంగా మెదడులో ప్రత్యక్షమయ్యింది. తమ రోజువారి జీవితం, తమ కలలు, కోరికలు, లోపలి నుండే ఓ నిరసనను ప్రకటించాయి.
‘ఇంకో రెండు గంటల్లో ప్రయాణం’అన్న ఒక్క మాట మాత్రమే, ఆ ప్రసంగంలో వారి మెదడులకు ఎక్కింది.
అధికారుల భార్యలు పెరేడ్ గ్రౌండ్ దగ్గర నిలబడి, తమ కన్నీళ్ళను చేతి రుమాళ్ళతో తుడుచుకుంటున్నారు. కొసాక్కులందరూ బృందాలుగా తమ బ్యారక్కులలోకి వెళ్ళిపోయారు.లూయిటెంట్ ఖోప్రొవ్ గర్భవతి అయిన తన పోలాండ్ భార్యను దాదాపుగా ఎత్తుకుని తీసుకువెళ్ళాడు.
ఆ రెజిమెంటు అంతా స్టేషన్ కు పాటలు పాడుకుంటూ వెళ్ళింది. వారి స్వరాలు సగం దూరం వరకు ఉత్సాహంగా ఉన్నా,తర్వాత వాటి తీవ్రత తగ్గింది. అధికారుల భార్యలు కూడా భర్తలకు వీడ్కోలు పలకడానికి బయలుదేరారు. గుర్రపు డెక్కలు దారిలో దుమ్ము పైకి లేపుతూ ఉంటే, తన దుఃఖాన్ని, ఇతరుల దుఃఖాన్ని మరిచిపోయేలా చేయడానికి, ఆ రెజిమెంటు పాటల నాయకుడు ఓ కొసాక్కుల పాట అందుకున్నాడు.
ఓ, అందమైన ఆడపిల్లా, నేనో చేప పట్టాను….
ఆ దళం అంతా తమ దుఃఖాన్ని పాటలో దాచుకుని, స్టేషన్ కు మోసుకువెళ్ళారు. ఆ హడావుడిలో, అరుపుల్లో ఆ పాట కలగాపులగం అయిపోయింది.
జొన్నలు తెచ్చాను, మెత్తగా చేశాను
ఓ అందమైన ఆడపిల్ల, నేను సూపు చేశాను
ఓ కప్పు సూపు చేశాను
ఆ రెజిమెంటు సహాయ అధికారి నవ్వుతూ, ఓ రకమైన ఇబ్బంది పడుతూ, వెనుక నుండి ముందుకు వచ్చాడు.ఆ పాట పాడుతున్న వ్యక్తి పగ్గాలు పక్కన పడేసి, వీడ్కోలు పలకడానికి వచ్చిన వారిని చూస్తూ ఉన్నాడు. చెమట అతని బుగ్గల నుండి మీసాల మీదకు జారింది.
ఓ అందమైన పిల్లా, నేను ఒకడికి ఆ సూపు ఇచ్చాను
అతను ఒక కొసాక్కు, కొసాక్కు….
అప్పుడే రైలు వస్తున్న శబ్దంతో పాటు అది వదులుతున్న పొగ కూడా అందరికి కనిపించింది.
* * *
యుద్ధ దళాల రైళ్ళు.. యుద్ధ దళాల రైళ్ళు….లెక్క లేనన్ని రైళ్ళు అవి!
కోపంతో రగిలిపోతున్న రష్యా, తన దేశపు రక్తాన్ని, రైలు మార్గం ద్వారా పశ్చిమ సరిహద్దుకు పంపింది.
* * *