(మే 7, 2024. అల్లూరి శతవర్డంతి దినోత్సవం సందర్బంగా)
ఆరోజు మన్యం అడవుల్లో ఎండ తీవ్రగావుంది. చెట్లు ఆకులు కదలడం లేదు.
అక్కడ లోయలో బుట్ల చప్పుడు. ఇంతలో తుపాకి కాల్పుల శబ్దం… గుంపులుగా పక్షులు ఆకాశం లోనికి ఫైరిపోయాయి. ‘వందే మాతరం ‘
అనే నినాదం అడివంతా మారుమోగింది.. అది నెమ్మదిగా తగ్గిపోతుంది. చెట్టుకు కట్టివేసిన అతని గుండె నుండి రక్తం ప్రవహించింది..
అది చెట్టు మొదలులో భూమి లోనికి ఇంకి పోయింది.
అది 1924 మే 7 వ తేది, సాయంత్రం 4 గంటలు. బ్రిటిష్ తుపాకి గుళ్లకు బలి అయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆంటే సరిగ్గా ఈరోజుకు వంద సంవత్సరాలు అయ్యింది.
***
అల్లూరి సీతారామరాజు నాయకత్వాన్న మన్య ప్రజల వీరోచిత తిరుగుబాటు1920 దశకంనాటి మాట. తరువాత దేశంలో స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు విప్లవాలు జరిగాయి. అహింస ద్వారా స్వాతంత్ర్యాన్ని మేమే తెచ్చాం అని కాంగ్రెస్‌వారు అంటున్నారు. కాదు మేమే నిజమైన వారసులమని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు వాదిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 77 సంవత్సరాల తరువాత నేడు 2024లో మనం వున్నాం. స్వాతంత్ర్యం సాధించింది ఏమిటి? అని ఎవరైనా ప్రశ్నించుకుంటే దిక్కులు లెక్కపెట్టే స్థితిలో వుంది నేటి పరిస్థితి. నాటి స్వాతంత్ర్య సమరయోధులు ఆశించిన స్వరాజ్యం ఇదేనా? . నాడు సీతారామరాజువంటి విప్లవవీరులు,అనేకమంది సమరయోధులు ఆశించినది ఈనాటి తరహా భారత్‌ను కాదు. అలనాడు మన్య ప్రజలు మొత్తంగా పీడన నుంచి విముక్తి కావాలనీ, మన్య ప్రజల విముక్తి భారత ప్రజల విముక్తికి నాందీవాచకం పలకాలనీ సీతారామరాజు ఆశించాడు. స్వాతంత్ర్యం వచ్చింది. మన్య ప్రజల పరిస్థితి ఇంకా అద్వాన్నంగానే వుంది.
* * *
ఏ తల్లి నిన్ను కన్నదో రాజా!
“పెట్టుబడిదారీ వర్గం కడుపుతో వుండి కార్ల్‌మార్చ్‌ను ప్రసవించింది” అన్నాడు ప్రఖ్యాత రష్యన్ విప్లవ కవి “మయకొనిస్కీ.” కారల్ మార్క్స్ శ్రామికవర్గ సిద్ధాంతకర్తగా ప్రపంచానికి సుపరిచితుడే… బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, దాని నుండి పెట్టుబడిదారీ సమాజం ఆవిర్భవిస్తాయని, పెట్టుబడిదారీ సమాజ గర్భంలోనే ఉన్న కార్మిక వర్గం విప్లవం ద్వారా పెట్టుబడిదారీ వర్గాన్ని కూలద్రోసి శ్రామిక వర్గ సోషలిస్టు రాజ్యాన్ని నిర్మిస్తుందని మార్క్ తన రచనలలో వివరించాడు. కావునే శ్రామికవర్గ సిద్ధాంతకర్తయెన మార్క్‌ను పెట్టుబడిదారీ వర్గమే కన్నదని మయకొనిస్కీ చమత్కరించాడు.
సామాజిక పరిస్థితులే ఒక వ్యక్తి విప్లవకారునిగాగానీ, మహారచయితగాగానీ, శాస్త్రజ్ఞుడిగాగానీ రూపొందటానికి
కారణమవుతాయి. ఏ సమాజిక పరిస్థితులు సీతారామరాజును విప్లవవీరునిగా మార్చాయో ఆ సామాజిక పరిస్థితులను మనంఅధ్యయనం చేయాలి. 1922 ఆగస్టు నుంచి 1925 జూన్ వరకు సుమారు రెండు సంవత్సరాల పాటు మన్య విప్లవం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించింది.ఈ విప్లవ పోరాట ప్రారంభానికి ముందు ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ ఆంధ్రావనిలో కూడా అనేక రాజకీయ, సాంఘిక మార్పులు వచ్చాయి. 1914-18, మొదటి ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాద దేశాల మధ్య మార్కెట్ల పునర్విభజన కోసం జరిగింది. 1917లో రష్యన్ సామ్రాజ్యంలో కామ్రేడ్ “లెనిన్” నాయకత్వాన బోల్షివిక్ విప్లవం విజయవంతమై సోషలిస్టు రాజ్యం ఏర్పడింది. దీని ప్రభావం ప్రపంచంలో జరిగే స్వతంత్ర పోరాటాలపై గణనీయంగా
పడింది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా బాలగంగాధరతిలక్‌చే ఇవ్వబడిన “స్వరాజ్యం నా జన్మహక్కు” అనే నినాదం వల్ల, వందేమాతరం ఉద్యమం మొదలయినవి అప్పటికి దేశ ప్రజలపై గాధమయిన ప్రభావాన్ని కలుగజేశాయి. పంజాబ్‌కు చెందిన గదర్ వీరుల వీరోచిత పోరాటం, చిట్టగాంగ్ వీరుల తిరుగుబాటు-ఇవి దేశాన్ని కుదిపివేశాయి. ఈ కాలంలోనే (1920) గాంధీజీ నాయకత్వాన కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు నిచ్చింది. ఈ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగానే ఆంధ్రదేశంలో ప్రజలు ఎంతో ఉత్సాహంతో చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. “చీరాల పేరాల” పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు అటవీ ప్రాంతంలో “పుల్లరి” వసూలుకు వ్యతిరేకంగా
పోరాటం, బాపట్ల తాలూకా పెదనందిపాడు గ్రామంలో పన్నుల నిరాకరణోధ్యమం- ఇవి ఆంధ్ర ప్రాంతాన్ని కుదిపివేసిన రాజకీయ పోరాటాలు. అదేసమయంలో ఉత్తర భారతంలో “చౌరా-చౌరీలో జరిగిన స్వల్పమయిన హింసాత్మక సంఘటనల సాకుతో ఉధృతంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని గాంధీజీ నిలిపివేసారు. అనేకమంది ఉద్యమంలో పాల్గొన్న నాయకులుయువకులు నిస్పృహతో స్వరాజ్యం కోసం నూతన మార్గాన్ని అన్వేషించసాగారు.తరువాత కాలంలో కొంతమంది యువకులు కాంగ్రెస్ మార్దానికి భిన్నంగా క్రొత్త పంథా తొక్కారు. (ఉదాహరణకు తరువాతకాలంలో ఉద్భవించిన “భగత్‌సింగ్” వంటివారు).
ఇటువంటి రాజకీయ వాతావరణం,స్వతంత్ర్య పిపాస గల ఏ యువకునిపైనయినా ప్రభావం చూపించకుండా వుండగలదా? ఈ చైతన్యంగల రామరాజు మనోఫలకంపై ఈ పై రాజకీయ వాతావరణ ప్రభావం గాఢంగా ముద్రవేసింది. ఇదే అతడిని మాతృభూమి స్వేచ్చకై అంకితం అయ్యేటట్లు చేసింది. ఆశయం ఏర్పడింది. ఆశయాన్ని సాధించటానికి ఏ మార్గాన పయనించాలో ఆ మార్గాన్ని మన్యం చూపించింది. తెలుగు కవి “ఆరుద్ర” పై భావాన్ని చక్కని పదాల్లో ఇలా రాశారు-
“వందేమాతరమంటూ నినదించిన బెంగాలం
స్వరాజ్యం జన్మహక్కు అని చాటిన మహారాష్ట్రం
హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం (పంజాబ్)
అన్నిటికీ నెలవాయెను ఆంధ్ర వీర హృదయం రామరాజు హృదయం”
బ్రిటిష్ సామ్రాజ్యవాద పీడన నుంచి విముక్తి కోసం జరిగే వీరోచితపోరాటాలు, ఉద్యమాలతో నిండిన ఆనాటి భారతావనియే సీతారామరాజు కన్నతల్లి. మంకుపట్టు పరధ్యానంలో వుండే కుర్రవాడ్ని విప్లవ వీరునిగా తీర్చిదిద్దింది ఆనాటి పరిస్థితే.
అరుణోదయం
ఈనాటి పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం తాలూకా “మోగల్లు” గ్రామంలో అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మల ప్రథమ పుత్రుడే సీతారామరాజు. సీతారామరాజు 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన “ప్రాండ్రంకి” గ్రామంలో జన్మించాడు. విజయనగరం దగ్గరలో గల ప్రాండ్రంకి సూర్యనారాయణమ్మ పుట్టినిల్లు. తండ్రి వెంకటరామరాజు ఫొటోగ్రాఫర్‌గా జీవనం వెళ్ళబుచ్చుతూ వుండేవారు. 1901లో వీరికి “సీతమ్మ” అనే కుమార్తె జన్మించింది. 1902లో రాజమండ్రిలో వీరు స్థిరపడ్డారు. ఫొటోగ్రాఫర్‌గా వెంకటరామరాజుగారికి మంచి పేరు వచ్చింది. ఆనాడు రాజమండ్రిలోగల సెంట్రల్ జైలులో వున్న తిలక్, లాలాలజవతిరాయ్ వంటి జాతీయ నాయకుల ఫోటోలు కూడా
తీశారు.వెంకట్రామరాజుగారికి దేశభక్తి ఎక్కువగానే వుండేది. 1905లో వచ్చిన స్వదేశీ ఉద్యమం ఆయనను ఎంతగానో ఆకర్షించింది.
కుటుంబ పోషణ భారంవల్ల ఆయన ఉద్యమానికి దూరంగానే వుండిపోవలసి వచ్చింది. వందేమాతరం ఉద్యమ ప్రభావంతో పాడుకునే అనేక పాటలు వెంకట్రామరాజుగారు ఇంటివద్ద పాడుకునేవారు. ఈ ప్రభావం రామరాజుపై పడింది. సోదరుడు సత్యనారాయణరాజు 1906లో జన్మించాడు. తండ్రిలోని జాతీయతాభావం రామరాజుపై ముద్రను వేసింది. ఒకరోజు సాయంత్రం రాజమండ్రిలో తండ్రితో కలిసి వీధిలో వెళ్తుండగా ఒక తెల్లదొర ఎదురుగా గుర్రంమీద రావటం వచ్చింది.చుట్టూ వున్న ప్రజలు చేతులెత్తి
నమస్కరించారు. అది చూసి రామరాజు కూడా చేతులెత్తబోయాడు. కాని తండ్రి వెంకట్రామరాజు నివారించి తెల్లవాడికి నమస్కారం పెట్టకూడదు అని మందలించాడు. చిన్న నాటనే రామరాజు హృదయంపై ఈ సంఘటన నిలిచిపోయింది.
దేశ పరిస్థితులలో ఎంతో మార్పు వచ్చింది. స్వాతంత్రోద్యమం ఉరకలు వేస్తోంది. ఆ సమయంలోనే బిపిన్ చంద్రపాల్ వంటి జాతీయ నాయకుల ఉపన్యాసాలెన్నో రామరాజు, తండ్రితోపాటు విన్నాడు.
1908వ సంవత్సరం రాజమండ్రిలో పుష్కరాల కోలాహలంలో కలరా వ్యాధి వ్యాపించింది. ఎందరో ఈ వ్యాధికి బలి అయ్యారు. రామరాజు తండ్రి కూడా కలరా
వ్యాధితోనే మరణించారు. తండ్రి మరణంతో కుటుంబ జీవనం దుర్భరమయింది. తల్లి నారాయణమ్మగారు అప్పటినుంచి తన జీవిత చరమదశ వరకు అనేక కష్టాలు పడుతూ ఎక్కడా స్థిరనివాసం లేకుండా గడపవలసి వచ్చింది. రామరాజు కాకినాడలోగల పిఠాపురం రాజా హైస్కూలులో 3వ ఫారంలో చేరాడు.
“తెల్లవాడు మన గుండెలపై తిష్టవేసాడు”
కాకినాడ పి.ఆర్. హైస్కూలులో చదువుకునే రోజుల్లో ప్రముఖ కాంగ్రెస్‌వాదిగా పేరుపొందిన శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్యగారు రామరాజుకు సహోధ్యాయుడుగా వుండేవారు. రామరాజు ఎప్పుడూ ఆలోచిస్తూ ఒంటరిగానే ఎక్కువ సమయం గడిపేవాడు. మితభాషిగానే వుండేవాడు. గుర్రపుస్వారీ, వ్యాయామం, యోగాభ్యాసం చేసేవాడు. కవిత్వంలో కొద్దిగా ప్రవేశం వుండేది. చదువుపై మాత్రం పూర్తిగా అశ్రద్ధతో వుండేవాడు. ఆ రోజులలో 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేక వార్పికోత్సవ సందర్భంగా కాకినాడ పి.ఆర్. కాలేజీలో కూడా వేడుకలు జరిగాయి. శశిరేఖ పరిణయమను నాటకంలో శశిరేఖగా రామరాజు నటించి ప్రేక్షకుల మన్ననలందుకున్నాడు. ఈ సందర్భంగానే రామరాజుకు 5వ జార్జి చక్రవర్తి బొమ్మగల పతకం ఒకటి బహుకరించారు. ఈ పతకాన్ని గురించి “తెల్లవాడు మన గుండెలపై తిష్టవేసాడు. ఆ విషయాన్నే హెచ్చరిస్తున్నట్లు నేను దీన్ని ధరిస్తాను” అని చెప్పేవాడట. క్రమక్రమంగా పెరుగుతున్న రాజకీయ పరిజ్ఞానంతోపాటు పరధ్యానం, ఒంటరిగా తపస్సు చేసుకోవాలన్న కోరిక పెరగసాగాయి. సన్యాసం తీసుకోవాలనే అభిప్రాయం స్నేహితులముందు వెలిబుచ్చుతుండేవాడు. 1913 నుంచి 1918 వరకు వారి కుటుంబం తునిలోనే వుంది. ఆ సమయంలోనే తరువాత విప్లవ ప్రాంతమయిన కృష్ణదేవుపేట, ధార పర్వతాలు,అడవులు తిరిగేవాడు. ఈ కాలంలోనే జాతకాలు రాయటం, వాస్తుశాస్త్రం, మూలికా వైద్యం మొదలయినవి నేర్చుకున్నాడు. తరువాత కాలంలో సాధువులా జీవించాలనే కోరికతో వుండేవాడు. యోగాభ్యాసం, ఆసనాలు లాంటివి చేసేవాడు. ఈ సమయంలోనే ఉత్తర దేశయాత్ర చేయాలనే కోరిక రామరాజుకు కలిగింది.
దేశ యాత్రానుభవాలు
1916 ఏప్రిల్‌లో కాలినడకనే దేశయాత్ర ప్రారంభమయింది. నర్సీపట్నం విజయనగరం మీదుగా నెలరోజులు ప్రయాణం చేసి కలకత్తా నగరానికి చేరుకున్నాడు.రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లయిన బెంగాల్, దాని నడిబొడ్డయిన కలకత్తా, రాజు చేరటం వలన అతని రాజకీయ పరిస్థితికి ఎంతో ఉపయోగపడింది. ప్రఖ్యాత కాంగ్రెస్ నాయకుడయిన సురేంద్రనాథ్ బెనర్జీకి తలవని తలంపుగానే అతిధిగా వెళ్ళాడు రామరాజు. ఆ మహా నాయకుని ఇంటివద్ద గడిపిన రోజులలోనే మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, మాలవ్యా వంటి నాయకులతో పరిచయం ఏర్పడింది. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌కు రామరాజు హాజరయ్యాడు. తరువాత బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, కాశీ, హరిద్వార్, నేపాల్, బ్రహ్మకపాలం, బదరీనాధ్, గంగోత్రి, ప్రయాగ మొదలయిన అనేక ప్రదేశాలు కాలినడకతోనే సందర్శించాడు.ఈ యాత్రవల్ల రామరాజులో రాజకీయ అనుభవం పరిణతి చెందింది. అలాగే శారీరకంగా కూడా తరువాత విప్లవకాలంలో భరించవలసిన కఠోరశ్రమకు ఈ యాత్రానుభవం పాఠశాలగా మిగిలింది. 1000 మైళ్ళ యాత్రను ముగించుకుని చివరికి కృష్ణదేవుపేట చేరుకున్నాడు. అక్కడ చిటికెల భాస్కరుడు అనే వ్యక్తితో పరిచయమేర్పడింది. ఆయన ఇంటివద్దే కొన్ని రోజులు గడిపాడు. ఈ సమయంలోనే రాజు ధ్యాన యోగంలో ఎక్కువ కాలం గడిపేవాడు. ప్రజలు చాలామంది రామరాజుచే జాతకాలు, సమాధానాలు చెప్పించుకునేవారు. పాలు పళ్ళు లాంటి ప్రతి ఫలాలు రాజుకు ముట్టజెప్పేవారు. రాజు యాత్ర ముగించుకుని వచ్చిన సంగతి తెలిసిన తల్లి, కుటుంబసభ్యులు అతనివద్దకు చేరుకున్నారు.
హృదయం కదిలించిన మన్యం
1918 జూన్ ప్రాంతంలో మరల రెండవసారి రామరాజు యాత్రకు వెళ్ళి వచ్చాడు, పిదప ఈ ప్రాంతంలోనే గల ధార పర్వతం మీద దీక్షను ప్రారంభించాడు. కృష్ణదేవుపేటకు సుమారు మైలు దూరంలో తాండవనది ఎగువన గ్రామస్థులు రామరాజుకు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆశ్రమానికి వ్యవసాయం కోసం కావలసిన భూమిని అచ్చటి “ముఠాదారులు” ఇచ్చారు. కుటుంబ బాధ్యతలన్నీ తల్లికి అప్పగించి రామరాజు యోగివలె తపస్సు చేసుకునే వాడు. ఏజెన్సీ ప్రాంతమంతా తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే వాడు. ఈ కాలంలోనే కత్తియుద్ధం బాణం వేయటం నేర్చుకున్నాడు. ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలను అధ్యయనం చేయసాగాడు. కాళీ ఉపాసన చేయటం వలన కొండజాతి ప్రజలకు మరింత చేరువయ్యాడు. మూలికా వైద్యం, సలహాల కోసం మందుకోసం వస్తుండేవారు.ఏజెన్సీ ప్రజల స్థితిగతులను రామరాజు గమనిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ తోచిన సలహాలను వారికిస్తూండేవాడు. ఈ సమయంలోనే మన్య ప్రజల దీనాతి దీనమైన బ్రతుకు బ్రిటీష్ పాలకుల కర్కశత్వం, వారు చేస్తున్న హింసలు రామరాజు హృదయాన్ని కలచివేశాయి. బహుశా ఈ దశలోనే మన్యప్రజల పరిస్థితి రామరాజును యోగాభ్యాసం ధ్యానాన్ని వదిలి విప్లవ రంగంలోనికి ఉరికేటట్లు చేశాయి. రామరాజు అండ చూసుకొని కొంత చైతన్యంతో మన్య ప్రజలు అధికారులను ఎదిరించసాగారు. ప్రజల దురలవాట్లను మాన్పించి వారిమధ్య కట్టుబాటు నేర్పించాడు.
ఏజెన్సీలో బ్రిటిష్ వలసవాద పీడన
అటవీ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఒక విధమైన పంట పండించే పద్ధతిని “పోడు వ్యవసాయం” అనేవారు. కొండ ప్రాంతాలలో గల అడవిలో కొంత భాగాన్ని నిప్పుపెట్టి కాలిన మసిని, బూడిదను ఎరువుగా ఉపయోగిస్తూ ఆ ప్రదేశంలో అడవి జొన్నలు, రాగులు వంటి పంటలు పండించేవారు. ఒకటి రెండు పంటల తరువాత ఆ ప్రదేశాన్ని వదలి మరో ప్రదేశానికి వెళ్లేవారు. మరల ఈ ప్రాంతం అభివృద్ధి అయిన తరువాతనే వచ్చి ఈ అడవిని కాల్చి మరల పోడు వ్యవసాయం చేసేవారు. ఈ వ్యవసాయం వల్ల ఆటవిక ప్రజల జీవనం కొంతయినా మెరుగ్గా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ పోడును నిషేధిస్తూ అనేక ప్రాంతాలను రిజర్వ్ అడవులుగా ప్రకటించింది. దీనితో అనేక ఆటవిక ప్రాంతాలలో ప్రజలు ప్రభుత్వంతో ఘర్షణలు పడసాగారు. కొండజాతుల ప్రజలు కుంకుడులు, చింతపండు, తేనె విప్ప పువ్వు వంటి అనేక ఆటవిక ఉత్పత్తులు అనుభవిస్తూ, అమ్ముకుంటూ ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చట్టంద్వారా స్థానిక ప్రజలకు ఈ హక్కు లేకుండా చేసింది. ఆఖరుకు కోయజాతి, అడవి ప్రజలను తమ పొయ్యిలోకి పుల్లలు కూడా అడవిలోనివి వాడుకొచ్చేవారు కాదు. తీవ్రతరమయిన ఈ సామ్రాజ్యవాద దోపిడి విధానం వలన ఆటవిక కోయజాతి ప్రజలకు, బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య వైరుధ్యాలు తీవ్రతరమయ్యాయి. అక్కడ ప్రజల ఆర్థిక జీవనం మరింత హీనస్థితికి దిగజారి వారిని రోజు కూలీలుగా మార్చివేసింది. తమ పూర్వపు జీవనోపాధిని కోల్పోయిన ఆటవిక, కోయ ప్రజలకు ప్రభుత్వమే పని కల్పించేది.
ఏజెన్సీ ఏరియాలో రోడ్ల నిర్మాణంలోను, కలప ఎగుమతులు వంటి పనులు చేయించేవారు. వీరు ఎక్కువ సమయం పని చేయించుకుని అతి తక్కువ నామమాత్రపు కూలిరేట్లను ఇచ్చేవారు. అడవిలో కాంట్రాక్టర్లు మరింత క్రూరంగా ఈ కూలీలను దోచుకునేవారు. ప్రభుత్వం కొంత కూలీ ఇస్తే అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత కాంట్రాక్టర్లు దోచుకునే వారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పీడనలకు వ్యతిరేకంగా బయలుదేరిన మన్య విప్లవానికి ప్రధానంగా పైన పేర్కొన్నవి కారణాలుగా వున్నాయి. సామ్రాజ్యవాదుల దోపిడీవల్ల తరతరాలుగా చేసుకొనే పోడువ్యవసాయం లేకుండా పోయింది. కొండజాతి ప్రజలకు చిన్న చిన్న ఆటవిక ఉత్పత్తులపై కూడా హక్కు లేకుండా చేయటం మూలంగా జీవనోపాధి కోసం కూలీలుగా మారిన వీరందరికి పరిస్థితులు మరింత నికృష్టస్థితికి నెట్టబడ్డాయి. వీరికి విప్లవ మార్గమే శరణ్యమయ్యింది. దీంతోపాటు మైదాన ప్రాంతంలో గల ప్రజల స్థితిగతులు కూడా విప్లవ పరిస్థితులకు సహాయకరంగా వున్నాయి.
విప్లవమే ఏకైక మార్గం.
విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి తాలూకా తహసిల్దారుగా ఉన్న బాస్టియన్ చాలా క్రూరుడు. జాలి, కరుణ లేకుండా అమానుషంగా ప్రవర్తిస్తూ వుండేవాడు. లంచాలు విపరీతంగా గుంజేవాడు. డబ్బుకోసం ఎలాంటి పనికైనా సిద్ధపడేవాడు. అతనితోపాటు ఓవర్‌సీరుగా పనిచేసే సంతానం పిళ్ళై, ఇద్దరూ తోడు దొంగలై ఎన్నో ఘోరకృత్యాలు చేసేవారు. కూలి డబ్బులో నుంచి కొంతభాగం కాజేసేవారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే వారి బట్టలూడదీసి శరీరంపై కొరడాలతో కొట్టించేవారు. అనేక చిత్రహింసలు పెట్టేవారు. వీరి ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయేవి. ఈ విషయం తెలిసిన రామరాజుపై అధికారులకు రిపోర్టు పంపిస్తే ప్రభుత్వమే ప్రతిగా రామరాజు పై సెక్యూరిటీ కేసు పెట్టింది. బాస్టియన్ దురాగతాలవలననే మన్యవిప్లవం నాందీవాచకం పలకబడింది.
గత కాలంలో కొండజాతి ప్రజలు ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటులను “పితూరీలు” అనేవారు. పూర్వపు తిరుగుబాటులకు ధ్యేయం తినడానికి తిండి, లేక కట్టుకోవడానికి బట్ట, తమ హీనమైన బ్రతుకులలో మార్చు వంటివి మాత్రమే. గతంలో మన్యం ఏజెన్సీ ప్రాంతాలలో కూడా “లంగరాయి పితూరీ” “గోపన్న పితూరీ” వంటి తిరుగుబాట్లు జరిగాయి. రామరాజు ఈ పితూరీల మార్గం ద్వారానే మరింత ముందుకు సాగిపోయాడు. అతని ఉత్తరదేశ యాత్ర సందర్భంలో పంజాబ్‌లోని పృథ్వీసింగ్, చంద్రశేఖర్ ఆజాద్, గదర్ వీరులతోనూ ఈశాన్య ప్రాంతంలోని చిట్టగాంగ్ వీరులతోనూ రిచయమున్నట్లుగా తెలుస్తోంది. రామరాజు ఉత్తరదేశ యాత్రజరిపే సమయానికి అతనికి విప్లవం తీసుకు రావాలనే ఆలోచన లేకపోయినా అప్పటి పరిచయాలు ఇక్కడి మన్య పరిస్థితి అతన్ని సాయుధపోరాట మార్గం వైపుకు నడిపించింది. మన్యంలో గల ప్రభుత్వ వ్యతిరేక వైరుధ్యాలను సామ్రాజ్యవాద వ్యతిరేక విష్లవపోరాటంలో భాగంగా సీతారామరాజు సమర్థవంతంగా మలచగలిగాడు.
తుఫానుకు ముందు
1921 సంవత్సరాంతానికి సహాయనిరాకరణోద్యపు పెనుగాలులు ఆంధ్రదేశాన్ని వూపివేస్తున్నాయి. ఈ ఉద్యమంలో భాగమయిన స్వదేశీ వస్త్రధారణ, (ఖాదీ ధరించటం) మద్యపాన నిషేధం, పన్నులు ఎగవేత, గ్రామపంచాయితీల స్థాపన (స్వపరిపాలన) ఇలాంటి ఉద్యమ భాగాలను రామరాజు మన్యంలో సమర్థవంతంగా అమలు జరిపించాడు. దీనివలన అస్పష్టంగా వున్న మన్య ప్రజల బ్రిటిష్ వ్యతిరేకతను నిర్మాణయుతమైన పటిష్టమయిన పోరాటం రూపంగా అభివృద్ధిచేయడానికి ఉపయోగపడింది.
బ్రిటిష్ పెత్తనానికి లొంగని ముఠాదార్లను అధికారాల నుండి తొలగించడం, శిక్షలు వేయడం లాంటివి ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో చింతపల్లి తాలూకాలో “నడిమిపాలెం” గ్రామానికి చెందిన గాము మల్లుదొర, గాము గంటందొర అనే ముఠాదారులతో ప్రభుత్వానికి పొసగక వారిని ముఠాదారులుగా తొలగించారు. దీనితో వీరికి ప్రభుత్వంమీద ద్వేషం రెట్టింపు అయ్యింది. అప్పటికే పేరుపొందిన రామరాజు వద్దకుచేరి అనుచరులుగా మారారు. పెదవలస అనే గ్రామానికి చెందిన గ్రామ నాయకుడు కంకిపాటి ఎండు పడాలు బాస్టియన్ వద్ద తీసుకున్న రోడ్డు కాంట్రాక్టులో మోసగింపబడి రామరాజు వద్దకు చేరుకున్నాడు. రామరాజు సహాయంతో గాము సోదరులు విశాఖపట్నం కలక్టరుకు బాస్టియన్ దురాగతాలపై వినతిపత్రం రాసారు. వీటన్నింటి వల్ల బాస్టియన్ దృష్టి రామరాజుపై పడింది. రామరాజుపై ప్రభుత్వానికి లేనిపోనివి రాసి రిపోర్టు పంపించాడు. రామరాజుపై పోలీసు నిఘా విధించారు. 1922 జనవరిలో అధికారులు రామరాజును కృష్ణదేవు పేటనుంచి నర్సీపట్నం తీసుకువెళ్ళి నిర్భందవాసంలో ఉంచారు. నర్సీపట్నంలో నాలుగు వారాల ప్రవాసం తరువాత తన సొంత కుటీరానికి పంపించివేశారు. అయితే పోలీసు నిఘామాత్రం ఉంది. రామరాజు మాత్రం ఎంతో నమ్రతతో ఏమీ తెలియనట్లు నటిస్తూ రహస్యంగా చురుకైన విప్లవ ప్రయత్నాలు ప్రారంభించాడు. గాము గంటం దొర, గాము మల్లుదొర, ఎండుపడాల్ సైనిక కమాండర్‌లలాగా రాజుకి సహాయపడ్డారు. సామ్రాజ్యవాద దోపిడీ ఫలితంగా మన్యంలో ఉద్భవించిన అనేకమంది పీడితులు, అధోజనం అందరూ కలిసి రామరాజు నాయకత్వాన జరిగే విప్లవానికి ఆకర్షితులై బ్రిటిష్‌వారిపై తమ క్రౌర్యాన్ని చూపించటం కోసం విప్లవ గెరిల్లాలుగా మారిపోయారు. 1922వ సంవత్సరం జూన్ నెల నాటికి వాతావరణం మారిపోయింది. విష్లవపు గాలులు వీయడం ప్రారంభించాయి. రామరాజు వెనుక వందలమంది మన్యవీరులు సమీకరించబడ్డారు. వారందరికి శిక్షణతో కూడిన గెరిల్లా పోరాట ఎత్తుగడలు నేర్పారు. ప్రభుత్వం ఆలస్యంగానే కళ్ళు తెరిచింది. అప్పటికే సమయం మించిపోయింది.
విప్లవ శంఖారావం
విప్లవానికి కావలసిన ఆయుధాలకొరకై మొదట దాడి ప్రారంభమైంది. 1922వ సంవత్సరం ఆగష్టు 22వ తేదీన రంపచోడవరం ఏజెన్సీలో చింతపల్లి గ్రామంలో గల పోలీసు స్టేషన్‌ను లూఠీ చేయడంతో విప్లవ శంఖం పూరించబడింది.సుమారు మూడువందల మంది అనుచరులు చింతపల్లి స్టేషన్‌ను ముట్టడించారు.ప్రతిఘటన ఏమీ జరుగలేదు. రామరాజు అక్కడవున్న ఆయుధాలన్నిటిని లెక్కించి ఆ వివరాలు రికార్డు పుస్తకంలో రాసి సంతకం చేశాడు. తరువాత రోజు అదే దళం విజయోత్సాహాంతో కృష్ణ దేవుపేట పోలీసు స్టేషన్‌పై దాడి జరిపారు. ఇక్కడ కూడా ప్రతిఘటన లేకుండానే పోలీసులు పారిపోయారు. 24వ తేదీన రాజవొమ్మంగి స్టేషన్‌పై దాడిచేశారు. ఈ స్టేషన్‌లో గతంలో లంగరాయి పితూరీలో పాల్గొన్న వీరయ్యదొరను ఈ స్టేషన్‌లోనే అరెస్టుచేసి ఉంచారు. గత రెండు స్టేషన్‌లవలె కాక పోలీసులు కాల్పులు జరిపారు. ఏ నష్టమూ జరుగకుండానే పోలీసులు విప్లవ వీరులకు లొంగిపోయారు. వీరయ్యదొరను కారాగారము నుండి విడుదల చేశారు. తరువాత అతను రామరాజు అనుచరుడుగా మారాడు. మూడవ రోజుకూడా విప్లవ దళానికి విజయం అభించింది. మూడుస్టేషన్‌లు కొల్లగొట్టబడ్డాయి. అల్లూరిసీతారామరాజు పేరు ఆంధ్రదేశంలో మారుమోగసాగింది. విప్లవ నాయకుని విజయవార్తలు యావద్భారత దేశంలోను సంచలనం కలిగించాయి. ఈ మూడు దాడులలోను 26 తుపాకులు 2500 మందుగుండ్లు స్వాధీనమయ్యాయి. ప్రభుత్వాధికారులు ఈ దాడులతో భయపడిపోయారు. పై అధికారులకు వెంటనే రిపోర్టులు, వర్తమానాలు పంపించారు.
రిజర్వుదళాలు హుటాహుటిన ఆ ప్రాంతం చేరుకున్నాయి. అనుభవజ్ఞులైన తెల్ల ఉద్యోగులు రప్పింపబడ్డారు. కాని విప్లవవీరుల ఉత్సాహానికి వీరి ప్రయత్నాలేమీ ఆటంకం కాలేదు. మల్లుదొర,గంటందొర, ఎండు పడాలు, అగ్గిరాజులతోపాటు వీరయ్యదొర కూడా. రామరాజుకు అండ నిలబడటంతో వారిశక్తి రెట్టింపయినట్లుగా తయారయింది. వివ్లవదళం నానాటికి బలపడసాగింది. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని పోలీసులను అనేక సమయాలలో ధిక్కరించసాగారు. మన్యానికి రప్పింపబడిన సైనికులను విప్లవకారులు ప్రజలు దోచుకునేవారు. మూడుస్టేషన్ల ముట్టడి తరువాత పదకొండు రోజులు చెదురు మదురు సంఘటనలు జరిగాయి. సెప్టెంబరు నాల్గవ తేదీన ట్రైమన్‌హోర్ నాయకత్వాన ముప్ఫెమంది సైనికులు బాస్టియన్‌తో కలిసి విప్లవకారుల కోసం వెడుతూండగా ముంజేరీ అనే గ్రామంవద్ద విప్లవవీరులు దాడి జరిపారు. భీకర యుద్ధం జరిగింది. ఒక పోలీసు మరణించాడు. ట్రైమన్‌హోర్, బాస్టియన్, సైనికులు పలాయనం చిత్తగించారు. క్రూరమృగాలు తిరుగుతున్న అటవీ ప్రాంతాలలో కూడా రాజుదళం తిరగడం వలన ఆ ప్రాంతపు ప్రజలు రామరాజుకు మహిమలున్నాయని అనుకునేవారు.
తోడేళ్ళ చావు
రామరాజు కాళీపూజ జరుప నిశ్చయించుకున్నాడు. మన్య ప్రజలకి కాళీమాతపై భక్తిభావం ఎక్కువగా ఉండేది. ఎలాగైనాసరే ఈ ఉత్సవాన్ని చెడగొట్టాలనే ఉద్దేశ్యంతో సైన్యం పన్నాగం పన్నింది. ఈ వార్త మన్యం వీరులలో వ్యాపించింది,మన్యం వీరుల కోపాగ్ని మిన్నుముట్టింది. టాల్బర్టు, సాండర్సు అనే ఇద్దరు సేనాధిపతుల నాయకత్వాన రెండు దళాలుగా దాడిచేయాలని నిర్ణయించారు. దీనికి ప్రతిగా మరాజు ఉపాయంగా మొదట టాల్బర్టు దళాలను ముట్టడించి సాండర్సుకీ విషయం తెలియజెప్పారు. విషయం తెలిసిన సాండర్సు వెనుకకు తగ్గాడు. విప్లవవీరులు విజయం పొందారు. దేవీపూజ నిరాఘాటంగా సాగిపోయింది. ఈ పూజవల్ల మన్యవీరులలోను ప్రజలలోను ఐక్యతను రామరాజు పఠిష్టపరిచాడు.అపజయంపాలైన బ్రిటిష్ సైన్యాలు మరింత ఎక్కువమందిని ఏజెన్సీ ప్రాంతంలోనికి దింపారు. మరింత అనుభవజ్ఞులైన సేనా నాయకులు రప్పింపబడ్డారు. చింతపల్లి ప్రాంతంలో అసిస్టెంట్ సూపరిండెంట్‌గా కవర్డు, హైటర్ అనే సేనా నాయకులు నియమింపబడ్డారు. అడవిజాతి ప్రజలను వేటాడి చంపడంలో వీరు నిపుణులు. మదనపల్లి ప్రాంతంలో తిరుగుతున్న విప్లవ దళం కోసం వీరు బయలుదేరారు.
ఆ రోజు సెప్టెంబరు 24వ తేదీ. ఈ వార్త వివప్లవ దళానికి ముందే తెలిసింది. విప్లవ వీరులు సర్వసన్నద్దమయ్యారు. మధ్యాహ్నాం అయ్యింది. దట్టమైన అడవి ప్రాంతం గుండా సైనికులు ప్రయాణం చేస్తున్నారు. కృష్ణదేవిపేట మొగలిదొడ్డి ఘాట్ గుండా సైనికులు వెళ్ళవలసి వచ్చింది. ఇద్దరు కలిసి వెళ్ళలేని అతి సన్నని దారి, ఒకపక్క అగాధంలో జలపాతం ఉంది. ఒక్కొక్క సైనికుని వెంటబెట్టుకుని కవర్డు, హైటరులు నడవసాగారు. కొండలలో గల చిక్కటిపొదలలో మన్యవీరులు తుపాకులు గురిపెట్టి సమయం కోసం ఎదురుచూడసాగారు. సైనికులందరూ చేతిలోని ఆయుధాలతోనే జాగ్రత్తగా నడుస్తున్నారు. ముందు వెనుక సైనికులు మధ్య కవర్డు, హైటర్‌లు ఘాట్ వంపువద్దకు వచ్చారు. గోకిరి ఎర్రేశు చేతిలో తుపాకీ పేలింది. గుండు కవర్డు మెదడు నుండి దూసుకుపోయింది. మరుక్షణమే అగాధంలోకి దొర్లిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన హైటర్ వెనుకకు తిరిగి తుపాకి ఎత్తబోయాడు. మరొక గుండు హైటర్ భుజంలో నుండి దూసుకుపోయింది. ఈసారి కూడా ఎర్రేశు గురిచూడ్డంలో విజయం సాధించాడు. ప్రక్కకు ఒరుగుతున్న హైటర్‌ను వెనుకనే వస్తున్న హెడ్ కానిస్టేబుల్ పట్టుకోబోయాడు. *”తెల్లవాడిని ముట్టుకోవద్దు” అనే కేక వినిపించింది. నిర్లక్ష్యంచేసి పట్టుకోబోయిన మరుక్షణమే అతని ప్రాణం కూడా పోయింది. ఈ పోరాటం విప్లవ దళానికి అనుకూలమైన వాతావరణంలో జరిగింది. 803 తుపాకులు విప్లవవీరుల వశమయ్యాయి. పట్టుబడ్డ ఇద్దరు బందీల వద్ద నుండి నెం.303 తుపాకీ కాల్చే విధానాన్ని నేర్చుకున్నారు. తరువాత వెంటనే ఆర్మీటేజి నాయకత్వాన మన్య వీరులపై దాడికి బయలుదేరింది. మొగలిదొడ్డి ఘాట్ వద్దనే విప్లవవీరులు ఆర్మిటేజి సైన్యంతో తలపడ్డారు. కొద్దిసేపటికే ఆర్మిటేజి సైన్యం పలాయనం చిత్తగించింది. మరునాడు స్టీవర్టు అనే సేనాని ఎక్కువ సైన్యంతో బయలుదేరినా ధైర్యం చాలక వెనుదిరిగి పారిపోయాడు. మధ్యవర్తులచే శవాలు అప్పజెప్పబడ్డాయి. ప్రభుత్వం వారు ఈ పోరాటంలో మరణించిన తెల్లవారికి అందమైన స్మారక చిహ్నాలు గోరీలు నిర్మించారు. అదే పోరాటంలో చనిపోయిన భారతీయ సైనికుల స్కృతి ఏమీ మిగలకుండానే పోయింది. స్మశానంలో కూడా రంగు బేధం చూపించారు తెల్లవారు.
వస్తున్నాం కాచుకోండి!
బ్రిటిష్ అధికారుల మరణం తరువాత ప్రభుత్వం గడగడలాడింది. మన్య విప్లవవీరులపై తమ అంచనాలు తప్పని రుజువయ్యింది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై అణిచివేత చర్యలను తీవ్రం చేసింది. మన్య ప్రాంతంలో అధికారులను మార్చి సమర్ధవంతమైన అధికారులను తీసుకువచ్చారు. మన్యప్రాంతంలో మార్షల్‌లాను అమలుపరిచేలా చేశారు. అటవీ ప్రజలను చంపడంలో ఆరితేరిన మలబారు స్పెషల్ పోలీసులను తీసుకువచ్చారు. ముఠాదారులంతా విధిగా ప్రభుత్వానికే సహాయపడాలని లేకుంటే ముఠాదారిని ప్రభుత్వమే వశపరుచుకొంటుందని అత్యంత ఆధునిక ఆయుధాలను రవాణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. వైర్లెస్ సెట్లు ఏర్పాట్లు చేయబడ్డాయి. గూఢచారుల సంఖ్య పెంచబడింది. విప్లవ వీరుల జాబితా ప్రకటించి వీరికి సహాయపడిన వారికి కఠిన శిక్షలు పడతాయని హెచ్చరిక చేశారు.
అక్టోబరు 13వ తేదీన అడ్డతీగల పోలీసు స్టేషన్ ముట్టడి జరుగుతుందని ముందుగానే వర్తమాన విప్లవ దళం పంపినది. అనేక అదనపు పోలీసు దళాలు సమీకరించబడ్డాయి. ఆ రాత్రి విప్లవకారులు దాడి జరిపారు, అప్పటివరకు పోరాటానికి సిద్ధంగా ఉన్న సబ్ ఇన్‌స్పెక్టరు పారిపోయాడు. ప్రతిఘటన లేకుండానే పోలీసు స్టేషన్ స్వాధీనం చేసుకొన్నారు. కాని ముందుగానే దాచివేయడం వల్ల ఒక్క కాగితం కూడా చిక్కలేదు. 16న అడ్డతీగెలలో బయలుదేరిన విప్లవ వీరులు దళాలుగా విడిపోయి మూడు రోజులు ప్రచారం చేసారు. 19వ తేదీన రంపచోడవరం విప్లవ దళాలు చేరాయి. ప్రతిఘటన లేకుండానే చోడవరం స్టేషన్ కూడా ముట్టడి జరిగింది. ప్రజలందరూ బహిరంగంగానే రామరాజును లదండలతో సన్మానించారు. అడ్డతీగెల, రంపచోడవరం ముట్టడితో విప్లవవీరుల విజయం, ప్రభుత్వం యొక్క అసమర్ధత ప్రజలకు అర్ధమయ్యాయి. దీనితోపాటు ప్రభుత్వం కూడా విప్లవ ఆశయ లక్ష్యాలు, బలాన్ని కూడా సరిగా అంచనా వేసుకోగలిగింది. బ్రిటిష్ సైన్యం అనేక పథకాలను పన్నింది.
తొలి అపజయం
విప్లవ వీరులని పట్టి ఇచ్చిన వారికి ప్రభుత్వం బహుమతులు ప్రకటించింది. అల్లూరి సీతారామరాజుకు 1500 రూ. గాము సోదరులకు ఒకొక్కరికి 1000 రూ. విప్లవ వీరులు ఎవ్వరికైనా 50 రూ. చొప్పున ప్రకటించింది. ప్రజలపై దారుణమయిన అణచివేత చర్యలు ప్రారంభించింది. విప్లవ వీరులు తిరుగాడే గ్రామాల ప్రజలపై వారం వారం పన్నులు విధించింది.
డిశంబరు 6వ తేదీన జాన్ నాయకత్వాన గల 59 మంది మలబారు పోలీసులు పెద్ద గడ్డిపాలెం గ్రామం వద్ద విప్లవకారులను చుట్టుముట్టారు. ఉన్న కొద్దిమంది విప్లవకారులు వీరోచితంగా పోరాడారు. నలుగురు ఈ పోరాటంలో చనిపోయారు. ఒక వ్యక్తి గాయాలతో పట్టుబడ్డాడు. అతనిని దారుణంగా హింసిస్తూ మృతదేహాలతోపాటు గ్రామంలో ఊరేగించారు. ప్రజలు భయాందోళనతో గడగడ ఒణికిపోయారు. వెంటనే బ్రిటిష్ సేనాధిపతుల సమావేశం జరిగింది. ఆరోజు రాత్రికే మరొకసారి యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నారు. లింగాపురం దగ్గర ఉన్న యేరు వద్ద బ్రిటిష్ సైన్యాలు విప్లవ దళంతో ఢీ కొన్నాయి. అర్ధరాత్రి తీవ్ర పోరాటం జరిగింది. మలబారు పోలీసులు ఫిరంగులను విసృతంగా ఉపయోగించారు. ఈ పోరాటంలో 8 మంది వీరులు నేలకొరిగారు. నలుగురు పట్టుబడ్డారు. సైనికులు వీధులలో వికటాట్టహాసం చేశారు. ప్రభుత్వానికి జైర్యం కలిగింది. ఈ పోరాటంలో గాయాలు తలిగిన విప్లవ వీరులకు ప్రజలే సపర్యలు చేశారు. ఇంతటి ప్రభుత్వ వత్తిడిలో కూడా ప్రజలు విప్లవకారుల పక్షానే నిలబడ్డారు.
నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనే నిలుస్తాం గత పోరాటంలో విప్లవవీరుల ఓటమితో విప్లవం పరిసమాప్తమైందని ప్రభుత్వంవారు అనుకొన్నారు. మన్యవీరులు తాత్మాలికంగా విప్లవం నిలుపు చేశారు. ఈ సమయం వారు కోలుకొంటానికి ఉపయోగపడింది. నాలుగు నెలల కాలం గడిచిపోయింది. 1928లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు రామరాజు మారువేషంలో హాజరయ్యాడు. 1928 ఏప్రియల్ 17వ తేదీన కొద్దిమంది అనుచరులతో అన్నవరం చేరి అక్కడి పోలీసు స్టేషన్‌పై దాడి జరిపాడు. ఆయుధాలేమీ దొరకలేదు. ఇంతలోనే అనేక వేలమంది ప్రజలు రామరాజును కనులారా చూడాలని గుమిగూడారు. ప్రజలు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వానాలు చేశారు. అక్కడే ఆంధ్రపత్రిక విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. రామరాజు అన్నవరం నుండి వెళ్ళిన తరువాత కలెక్టరు సైన్యంతో దిగాడు. అధికారులెవ్వరికి లభించని స్వాగతం రామరాజుకి లభించడంతో ఈర్ష్య పడి ఆ గ్రామ ప్రజలపై నాలుగువేలు రూపాయలు అదనపు పన్ను వేశాడు. అదే సమయంలో భీమవరం వద్దనున్న కుముదవల్లి గ్రామవాసి అయిన వేగిరాజు నారాయణరాజు మరొక మిత్రునితో కలిసి కలకత్తాకు వెడుతూ అన్నవరం స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు రామరాజు చేసిన స్టేషన్ ముట్టడి గురించి విని సీతారామరాజును కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. తరువాత ఆయన కూడ దళంలో చేరి అగ్గిరాజుగా పేరు పొందాడు.
విప్లవ పోరాట అంతిమ ఘట్టాలు
సీతారామరాజు అనుచరులలో ముఖ్యుడు గాము మల్లుదొర దుర్వ్యసనాలైన తాగుడు, వ్యభిచారానికి లోనయ్యాడు. ఎన్నోసార్లు మందలించినా మానలేదు. విప్లవం ప్రారంభం అయిన తరువాత ఈ అలవాట్లను తగ్గించుకొన్నాడేగాని పూర్తిగా మానలేదు. ఒక సందర్భంలో ఒళ్ళు మరిచేటట్లు తాగి పోలీసు వేగులకు రహస్యాలన్నీ చెప్పివేశాడు. ఈ విషయం గమనించిన విప్లవదళ సభ్యులు ఆ వేగుని కాల్చివేయబట్టి సరిపోయింది. దురభ్యాసాలను విసర్జించిన తరువాతే దళంలోకి రమ్మని మల్లుదొరని పంపించివేశారు. చివరిసారిగా వ్యసనాలను తీర్చుకొని మారిపోదామనే ఉద్దేశ్యంతో మందు తాగి ప్రియురాలి ఇంటికి చేరాడు మల్లు. ఇది గమనించిన పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి మల్లుదొరను బంధించారు. మల్లుదొర లొంగిపోవడంతో మన్య విప్లవానికి గట్టి దెబ్బ తగిలింది.
అక్టోబరు 22వ తేదీన గూడెంలో వున్న మిలటరీ శిబిరంపై దాడి చేయాలని వ్యూహం పన్నారు. ఈ దాడి చిన్న పొరపాటు వలన విఫలమయ్యింది. మన్య వీరులెవ్వరికీ నష్టం కలుగలేదు. మన్యంలో పోలీసుల దారుణహింసాకాండ ప్రజ్వరిల్లింది. మన్యవీరులకు సహాయం చేసిన ఏ గ్రామాన్నెనాసరే అగ్నికి ఆహుతి చేసేవారు. ప్రతి గ్రామం అడవులు ఫిరంగి మోతలతో దద్ధరిల్లేది. వృద్ధులు, స్త్రీలు, పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. తల్లి ఒడిలో శిశువు ఒడిలోనే చంపబడుతూ ఉండేది. ఇందులో యువ వీరులు బలి అయిపోతూ వుంటే వారి భార్యల దీనాలాపాలు హృదయవిదారకంగా ఉండేది. మన్యం ప్రజల ఆక్రందనలతో ఆ ప్రాంతం కలచివేయబడింది. పరిస్థితులు రామరాజు గమనించాడు. విప్లవం తిరోగామి దశలో ఉందని, ఇక ఎంతమాత్రమూ ముందుకు వెళ్ళలేని దశలో ఉందని తెలుసుకొని 1924 మే నెలలో తమ అనుచరుల సమావేశంలో వీర మరణం పొందాలని నిశ్చయించారు. మే 6వ తేదీన అగ్గిరాజు నాయకత్వాన ఆ దళం శత్రువులను ఎదుర్కొంది. చాలాసేపు తుపాకీ కాల్పులు జరిగాయి. తన తుపాకీలో తూటాలు అయ్యేవరకు తన శత్రువు చేతికి చిక్కరాదన్న విషయం అగ్గిరాజుకు గుర్తురాలేదు. శత్రువులు వెన్నంటి కాలుస్తున్నప్పుడు, ఒక బావిలో దూకి వీరమరణం పొందాలన్న ప్రయత్నం కూడ విఫలమయ్యింది. తరువాత ప్రాణాలతో చిక్కిన అగ్గిరాజు అండమాన్ దీవులకు పంపబడ్డాడు.
నింగికెగసిన అరుణతార
ప్రభుత్వాధికారులు నూతనోత్సాహంతో రామరాజు జాడ కోసం ప్రజలను చిత్రహింసలపాలుచేస్తున్నారు. రెండు సంవత్సరాల విప్లవపోరాటంలో మన్య ప్రజలు అలసిపోయి ఉన్నారు. సైనికుల మారణహోమం విపరీతంగా పెరిగింది. మన్య ప్రజలను పెడుతున్న బాధలు, కష్టాలను తెలుసుకొన్న సీతారామరాజు హృదయం క్షోభించింది. తన కోసం అమాయక ప్రజలు బలికాకూడదని కోరుకొన్నాడు. ఆ రోజు రాత్రి కృష్ణదేవిని పేట వద్ద నున్న మంపగ్రామ మునసబు వద్దకు వెళ్ళి తన ఆచూకీని ప్రభుత్వానికి తలియచేయమన్నాడు. దానికి మునసబు అంగీకరించలేదు. మే 7వ తేదీ ఉదయమే యేటి వద్దున స్నానం చేస్తున్న రామరాజుకు ఒక కోయబాలుని ద్వారా మంప మునసబు పాలు పంపించాడు. ఆ బాలుని ద్వారానే సైనిక శిబిరానికి ఒక లేఖను పంపించాడు రామరాజు. వారు రామరాజును బంధించి దగ్గరలో వున్న కొయ్యూరుకు తీసుకువెళ్ళారు. అక్కడ వున్న మేజర్ గుఢాల్ రామరాజుతో కరచాలనం చేయాలని ప్రయత్నించాడు. రామరాజు నిరాకరించి తెల్లవారి వలన దేశానికి కల్గిన దుర్భర పరిస్థితి గురించి చెప్పాడు. రెచ్చిపోయిన గుఢాల్ చెట్టుకు రామరాజును కట్టించి అనేకసార్లు తుపాకితో కాల్చి చంపాడు. చివరి ఊపిరిదాకా రామరాజు గొంతు నుండి, హృదయం నుండి వచ్చిన స్వతంత్ర పోరాట నినాదం మన్యంలో మారుమోగింది. 8-5-1924వ తేదీన కృష్ణదేవి పేటలో రాజు శరీరం దహనం చేయబడింది.
1922 ఆగస్టు 22వ తేదీన సీతారామరాజు నాయకత్వాన ప్రారంభమైన బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక సాయుధ విప్లవం మన్యంలో 1924 జూన్ నెలాఖరులో ముగిసింది.
***
ఏమైనప్పటికీ సీతారామరాజు ఏ ధ్యేయంకోసమైతే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం సాగించాడో ఆ ధ్యేయం ఇప్పటికీ నెరవేరలేదు. స్వాతంత్ర్యం వచ్చింది. కాని అది ప్రజలందరి కోర్కెలు నెరవేర్చే విధంగా లేదు. 77 సంవత్సరాల స్వాతంత్ర్యం కొద్దిమందిగా ఉన్న గుత్త పెట్టుబడుదారుల
ఆస్తులను విపరీతంగా పెంపుచేసింది. స్వతంత్రానంతర ప్రభుత్వం అత్యాధికులైన శ్రమజీవుల కోర్కెలకు వ్యతిరేకంగా విదేశీ సామ్రాజ్యవాదంతోను మనదేశ భూస్వామ్య వర్దాలతోను చేతులు కలిపింది. ఆనాడు మన్య వివ్లవాన్ని నమర్థించే విషయంలో ఊగినలాట, ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా వంతపాట- వీటిని బట్టి కాంగ్రెస్, బిజెపి ప్రజావ్యతిరేక వైఖరిని గమనించవచ్చు. ఇప్పటికీ అనేక వర్గాలు సీతా రామరాజును వక్రీకరించి తమ వర్గ ప్రయోజనాల ప్రచారానికి ఉపయోగించుకొన్నారు. మన్య విప్లవం ఆశించిన ధ్యేయాలు నేటికీ నెరవేరలేదు. ఇప్పటికీ ఆటవిక, కోయప్రజలు, స్థానిక భూస్వామ్యుల వల్ల ప్రభుత్వ ఆఫీసర్ల వల్ల పీడింపబడుతూనే వున్నారు. ప్రజా వ్యతిరేకమైన కొద్ది మంది
గుత్త పెట్టబడిదారులు ఈ ప్రభుత్వం స్థానే కార్మిక కర్షక, శ్రమజీవులందరి అభివృద్ధికి కృషి చేసే ప్రభుత్వాన్ని స్థాపించుకోవాల్సిన అవసరం వుంది. మనదేశ నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణంగా శ్రమజీవుల రాజ్యాన్ని సాధించాల్సి వుంది. ఇదే నేటి కర్తవ్యం, రామరాజు త్యాగానికి నివాళి కూడా!
***
