ఒకసారి ఆయన నన్ను కుచుక్ – కోయ్ గ్రామంలో తనని సందర్శించవలసిందిగా ఆహ్వానించాడు. అక్కడ ఆయనకి ఓ చిన్న మడి చెక్కా, తెల్లటి రెండు అంతస్థుల యిల్లు వున్నాయి. ఆయన అంతసేపూ ఉత్సాహంగా మాట్లాడుతూ నాకు తన “ఎస్టేట్”ని చూపించాడు.
“నాకు గనక పుష్కలంగా డబ్బు వుంటే యిక్కడ రోగిష్టి గ్రామీణ ఉ పాధ్యాయుల కోసం ఒక శానటోరియం కడతాను. చక్కటి వెలుతురుతో వుండేట్టు, తెలుసుగా, చాలా వెలుతురు వుండేట్టు పెద్ద కిటికీలతోటీ యెత్తుగా వుండే కప్పుతోటీ వుండే భవనం. ఒక అద్భుతమైన లైబ్రరీని, అన్ని రకాల సంగీత వాయిద్యాలని, ఒక తేనెటీగల క్షేత్రాన్ని, కాయగూరల తోటని, పళ్ళతోటని సంపాదించే వాణ్ణి; వ్యవసాయశాస్త్రం మీదా, వాతావరణశాస్త్రం మీదా ఉపన్యాసాలు యేర్పాటు చేయించేవాణ్ణి. ఉపాధ్యాయులకి అన్నీ తెలిసి వుండాలి, అన్నీ!”
ఆయన మధ్యలో మాట తుంచేశాడు. దగ్గాడు. నాకేసి ఓరగా చూసి, తన కమ్మని, మృదుమైన చిరునవ్వు నవ్వాడు. ప్రతిఘటించలేని ఒక మనోహరత్వం, ఆయన చెప్పేదాన్ని అతి నిశితమైన శ్రద్ధతో అవతలివాడు అనుసరించేటట్టు చేసేటటువంటిది ఆ చిరునవ్వులో వుంది.
“నా కలల్ని వినడం మీకు విసుగ్గా వుందా? నాకు దీన్ని గురించి మాట్లాడ్డం అంటే యిష్టం. రష్యన్ గ్రామీణ ప్రాంతంలో మంచి, తెలివైన, విద్యావంతులైన ఉపాధ్యాయులు వుండాలనే విషయం యెంత ముఖ్యమైందో మీకు తెలిస్తేనా! రష్యాలో మనం వేలుపెట్టి చూపించడానికి లేని పరిస్థితుల్ని ఉపాధ్యాయులకి కల్పించాలి. అదీ యెంత త్వరగా వీలైతే అంత త్వరగా. యేమంటే ప్రజలు సర్వసౌష్ఠవ పూరితమైన విద్యని పొందాలి. లేకపోతే రాజ్యం సగంసగం కాలిన యిటుకలలో కట్టిన యిల్లులాగా కూలి చక్కాపోతుంది. ఉపాధ్యాయుడు ఒక నటుడుగా, కళాకారుడుగా, తన పనిపట్లయెంతో తీవ్రమైన అపేక్షతోటి వుండాలి. మరి మన ఉపాధ్యాయుడు కూలీ. సగంసగం చదువు వున్న వ్యక్తి. ప్రవాసానికి పోవడానికి యిష్టపడినంతగా వూరికి పిల్లలకి పాఠాలు చెప్పడానికి పోతాడు. వాడు తిండి లేక మాడిపోయిన వాడు, అణగారి పోయినవాడు, తన జీవనాధారం యెక్కడ పోతుందోనని నిత్యం భయంతో వుండేవాడు. ఉపాధ్యాయుడే వూళ్ళోకల్లా మొదటి మనిషిగా, రైతులు వేసే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగల వాడుగా, భక్తిశ్రద్ధలకి యోగ్యమైన తన శక్తిమీద రైతులకి గౌరవభావం కలిగించేటట్టుగా, యెవరూ తనకేసి చూసి యెగతాళి చెయ్య సాహసించలేనట్టుగా అంటే తన గౌరవాన్ని తగ్గించలేనట్టుగా వుండాలి. యివాళ్ళ మన దేశంలో ప్రతివాళ్ళు అంటే గ్రామ పటేల్, ధనికుడైన దుకాణదారుడు, పూజారి, పాఠశాల పోషకుడు, పెద్ద పర్యవేక్షకుడు అని పిలిచినా విద్యా విధానంలోని పరిస్థితుల్ని మెరుగుపరచడానికి కాకుండా జిల్లా సర్క్యులర్లలోని అక్షరాలని తు. చ. తప్పకుండా అమలు జరిపేవాడు- అలా చేస్తున్నారు. ఉపాధ్యాయుడు యెవళ్ళూ తన గౌరవాన్ని తగ్గించలేని వాడుగా వుండాలి. ప్రజల్ని విద్యావంతుల్ని చెయ్యాల్సిన పని అప్పగించిన వాడికి కొసరికొసరి భత్యం యివ్వడం అసంబద్ధం – గుర్తుంచుకోండి ప్రజల్ని విద్యావంతుల్ని చేసే వాడికి! అలాంటివాడు పీలికలు తొడుక్కుని శిధిలమైన బడిలో చలికి బిగిసిపోతూ వుండడం, సరిగా పొగపోవడానికి లేకుండా కట్టిన పొయ్యిల్లో నుంచి వచ్చే ధూమంతో విషపూరితం కావడమూ, యెప్పుడూ పడిశంతో బాధపడ్డమూ, ముప్ఫై యేళ్ళకే లారింజిటిస్, కీళ్ళవాతం, క్షయ లాంటి రోగాల పుట్ట కావడమూ భరించలేనిది. యిది మనకి సిగ్గు! సంవత్సరంలో ఎనిమిది, తొమ్మిది నెలలు మన ఉపాధ్యాయులు సన్యాసుల్లాగా, మాట్లాడ్డానికి ఒక పురుగు లేకుండా వుంటారు. పుస్తకాలూ సరదాలూ లేకుండా వాళ్ళు ఒంటరితనంలో మొద్దు బారిపోతారు. వాళ్ళు స్నేహితుల్ని తమని చూడ్డానికి రావాల్సిందిగా పిలిచారో, వాళ్ళు రాజకీయ అసంతృప్తులయ్యారని అధికారులు అనుకుంటారు- కుత్సితమైన వాళ్ళు అమాయకుల్ని బెదిరించడానికి వాడే మూర్ఖ పదం అది…. యిదంతా రోతగా వుంది…. మహత్తరమైన బ్రహ్మాండమైన పని చేసేటటువంటి మనుషుల్ని ఒక రకంగా అధిక్షేపించడమే. నేను యెవరేనా ఉ పాధ్యాయుణ్ణి కలుసుకుంటే అతని ముందు మహా, మహా యిబ్బందిగా వున్నట్టు బాధపడతాను, తెలుసా- అతని పిరికితనంతోటీ, ఎడ్డితనంతోటీ. ఉపాధ్యాయుడి దరిద్ర స్థితికి ఒక రకంగా నాదే దోషం అనిపిస్తుంది నాకు- నిజం!”
ఒక క్షణం ఆగి, ఆయన చెయ్యి చాచి మెల్లిగా అన్నాడు:
“మన రష్యా యెంత అసంబద్ధమైన, వికృత దేశం!”
ఒక దీర్ఘ విచార ఛాయ ఆయన అందమైన కళ్ళని కమ్మింది. చక్కని ముడతల వరస కనుకొలకుల్లో ప్రత్యక్షమై ఆయన చూపుని గాఢం చేసింది. ఆయన చుట్టూతా చూసి తనని తనే వేళాకోళం చేసుకోవడం మొదలుపెట్టాడు.
“అదీ విషయం- ఒక ఉదారవాద వార్తాపత్రికలో ముఖ్యమైన వ్యాసానికి సరిపడా సమాచారం మీకు యిచ్చేశాను. రండి, మీ ఓపికకి బహుమానంగా కాస్త టీ యిస్తాను….”
తరచుగా ఆయనతో అలానే వుంటుంది. ఒక క్షణంలో ఆయన ఆత్మీయత తోటీ, గంభీరతతోటీ, చిత్తశుద్ధితోటీ మాట్లాడతాడు. ఉత్తర క్షణంలో తనన్న దాని పట్ల తనే నవ్వుకుంటాడు. యీ మృదువైన, విచారభరితమైన నవ్వు కింద మాటల విలువా, కలల విలువా తెలిసిన మనిషికి వుండే సూక్ష్మ సంశయాత్మక దృష్టి యెవళ్ళకేనా తగుల్తుంది. దీనితో బాటుగా, ఒక ఆకర్షకమైన వినయ లక్షణపు ఛాయ, సహజాతమైన సున్నితత్వం ఆయన నవ్వులో ద్యోతకం అవుతాయి.
మేం ఆయన యింటికి తిరిగి నిశ్శబ్దంగా వెళ్ళాం. ఆ రోజు వెచ్చగా, ప్రకాశవంతంగా వుంది. మబ్బుల్లేని యెండలో తళతళ మెరుస్తూ, అలల శబ్దం వినిపిస్తోంది. లోయలో కుక్క యేదో దేన్ని గురించో తన సంతోషాన్ని తెలియజేస్తూ కీచుమంటోంది. చేహొవ్ నా చేతిని పట్టుకుని మెల్లిగా అన్నాడు, మధ్య మధ్య దగ్గు తెర అడ్డం వచ్చింది:
“యిది చాలా అవమానకరమైందీ, విచారకరమైందీనీ. కాని యిది నిజం- కుక్కలయి వుంటే మేలనేవాళ్లు చాలా మంది వున్నారు…..
తర్వాత ఆయన నవ్వుతూ అన్నాడు:
“యివాళ నే మాట్లాడేదంతా వార్థక్యద్యోతకంగానే వుంది – నేను ముసలి వాణ్ణి అయిపోతున్నాను.
మళ్ళీ మళ్ళీ ఆయన యిలా అంటూ వుండడం నేను విన్నాను:
“చూశారా – ఒక ఉపాధ్యాయుడు యిప్పుడే వచ్చాడు…. అతనికి వంట్లో బాగాలేదు, భార్య వుంది – మీరు ఆయనకి యేమన్నా చెయ్యగలరా, యేం? నేను యీ వేళకే రమ్మన్నానతన్ని….”
లేదా :
“గోర్కీ విన్నారా! ” ఒక ఉపాధ్యాయుడు మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాడు. అతను జబ్బుతోటి మంచాన పడివున్నాడు. అతన్ని చూడకూడదూ మీరు వెళ్ళి?”
లేదా:
“ఓ ఉపాధ్యాయుడు వున్నాడు అతనికి పుస్తకాలు కావాల్ట…
ఒకో అప్పుడు నాకు యీ “ఉపాధ్యాయుడు” ఆయన యింట్లోనే కనిపించేవాడు- మామూలుగా ఆ ఉపాధ్యాయుడు తన దేబితనం తనకే తెలిసినట్టు ముఖం యెర్రబారి, కుర్చీ అంచున కూర్చుని, చెమట కక్కుతూ మాటల్ని తడుముకుంటూ, తనకి చేతనైనంత వరకూ “చదువుకున్న వాడి”లా మెత్తగా మాట్లాడ ప్రయత్నించే వ్యక్తి. లేదా, బహుశా అప్పుడే తన బుర్రకి తట్టిన ప్రశ్నలతోటి చేహోవ్ ని ముంచెత్తి ఆ రచయిత దృష్టిలో బడుద్దాయిలాగా కనిపించకూడదనే కోరికలో పూర్తిగా ములిగిపోయి రోగం లాంటి సిగ్గరితనపు అతి చనువు వుండే వ్యక్తి అయి వుండేవాడు.
చేహొవ్ అతని మోటు మాటలని శ్రద్ధగా వినేవాడు. ఆయన విచారభరిత నేత్రాలని ఒక చిరునవ్వు వెలిగించేది. కణతలమీద ముడతలు యేర్పడేవి. ఆయన లోతైన, మృదువైన, నిశ్చల స్వరంతో సాదా మాటలని, స్పష్టమైన పదాలని, జీవితానికి సన్నిహితంగా వుండే వాటిని ఉపయోగిస్తూ మాట్లాడేవాడు. దాంతోటి అతిధి తక్షణం కులాసాగా అయ్యేవాడు. యుక్తిగా కనిపించాలనే ప్రయత్నం మానేసేవాడు. తత్ఫలితంగా యింకా తెలివిగానూ, యింకా ఆసక్తికరంగానూ అయ్యేవాడు….
యీ ఉపాధ్యాయులలో ఒకరు నాకు గుర్తు వున్నాడు. పొడగరి, సన్నగా వున్నాడు. పాలిపోయి శుష్కించిన ముఖం, చుబుకం వేసి విచారంగా వంగినట్టు వుండే కొక్కం లాంటి నాసిక వున్నాయి. అతను తన నల్లని కళ్ళతో చేహొవ్ కేసే నిశ్చలంగా చూస్తూ ఆయన కెదురుగా కూర్చున్నాడు. యేకతార శ్రుతిలో ఒకే తీరుగా మాట్లాడుతున్నాడు:
“బోధనాత్మక కాలమంతా సజీవ పరిస్థితుల్లో సేకరించిన యీ రకపు భావముద్రలు, ఒక మానసిక మిశ్రంగా సంకలనం చెంది, పరివేష్టిత ప్రపంచం యొక్క వస్తుగత దృక్పథం యొక్క కనీస అవకాశాన్ని కూడా సంపూర్తిగా మృగ్యం చేస్తాయి. ప్రపంచం అనేది, సరే, దాన్ని గురించి మనకి వున్న భావన తప్ప మరేమీ…..”
యిక్కడ అతను తాత్విక రంగంమీద, తాగినవాడు మంచుమీద జారినట్టుగా జారిపోతూ, లంకించుకున్నాడు.
“సరే నాకీ విషయం చెప్పండి, మీ పేటలో పిల్లల్ని కొట్టేవాళ్ళు యెవరు?” అని చేహొవ్ నిదానంగా, దయాన్వితంగా అడిగాడు.
ఆ ఉపాధ్యాయుడు కూర్చున్న కుర్చీలోనుంచి గెంతి, కోపంగా చెయ్యి వూపడం మొదలుపెట్టాడు.
“ఏమిటి? నేనా? ఎన్నడూ! వాళ్ళని కొట్టడం?” అతను దెబ్బతిన్నట్టు బుసకొట్టడం మొదలుపెట్టాడు.
“వూరికే తత్తరపడకండి” అని చేహొవ్ అతన్ని శాంతింప చెయ్యడానికి చిరు నవ్వు నవ్వుతూ అన్నాడు. “మీరు అని నేనన్నానా? మీ పేటలో బడిపిల్లల్ని కొట్టేవాళ్ళెవరో వున్నారని నేను పేపర్లో చదివాను….”
ఆ ఉపాధ్యాయుడు మళ్ళీ కూర్చుని, చెమటలు కక్కుతూ వున్న ముఖాన్ని తుడుచుకుని, అమ్మయ్య అని నిట్టూర్చి, గంభీర స్వరంతో అన్నాడు:
“అలా అన్నారు బాగుంది. ఓ కేసు వుంది. ఆయన మకారొవ్. వింత యేం లేదు! అది అసహజంగానే వుంటుంది, కాని అర్థం చేసుకోవచ్చు, ఆయనకి పెళ్ళి అయింది, నలుగురు పిల్లలు. భార్య రోగిష్టి. అతనూనూ – క్షయరోగి – జీతమా – యిరవై రూబుళ్ళు…. బడి చూస్తే కోళ్ళ గూడులాగా వుంటుది. ఉపాధ్యాయుడికి ఒకే గది. అలాంటి పరిస్థితుల్లో పై నుంచి దిగి వచ్చిన దేవతకేనా సరే యెవళ్ళేనా పిసరు బెసికితే బేడీలు వేసేస్తారు, మరి చదువుకునే పిల్లలు దిగి వచ్చిన దేవతలు కారుకదా, యేమంటారు!”
ఒక్కక్షణం కితం భారీ పదగుంఫనతోటి చేహోవ్ ని సమ్మోహితం చెయ్యాలని ప్రయత్నించిన యీ మనిషి, హఠాత్తుగా దుశ్శకున సూచకంగా తన గద్ద ముక్కుని ఆడిస్తూ, సాదాగా భారంగా రాళ్ళల్లాగా వుండే పదాలతోటి మాట్లాడేశాడు. రష్యన్ గ్రామ జీవితంలోని శాపగ్రస్త కఠోర సత్యాన్ని అది తేటతెల్లం చేసింది…..
తన ఆతిధేయుడి నుంచి సెలవు తీసుకునేటప్పుడు ఆ ఉపాధ్యాయుడు తన రెండు చేతుల నాజూకైన వేళ్ళతోటి చిన్నగా, యెండిపోయి వున్న చేహొవ్ చేతిని అదిమాడు.
“యేదో ఉన్నతాధికారిని చూడ్డానికి వచ్చినట్టుగా మిమ్మల్ని చూడ్డానికి వణికి పోతూ వచ్చాను. పండితమ్మన్యుడిలాగా నేను కూడా అంతో యింతో ప్రయోజకుణ్ణినని మీకు ప్రదర్శించు కోవాలని గర్వంగా వచ్చాను. యిప్పుడు ఒక సహృదయుడైన, సర్వమూ అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. యిది యెంత మహత్తర విషయం – ప్రతీదాన్నీ అర్ధం చేసుకోవడం! కృతజ్ఞుణ్ణి! నే వెడుతున్నా. నాతో కూడా ఒక మంచి విలువైన ఆలోచన వుంది: గొప్పవాళ్ళు కల్లాకపటం లేకుండా వుంటారు, వాళ్ళు యెక్కువ అర్ధం చేసుకుంటారు; మేం కలిసి జీవించే సామాన్యుల కంటే యెక్కువగా వాళ్ళు మా దౌర్భాగ్య జీవులకి సన్నిహితంగా వుంటారు. సెలవు, మిమ్మల్ని యెన్నటికీ మర్చిపోలేను.”
అతని నాసిక వణికింది, అతని పెదాలు బిగువు సడిలాయి చిరునవ్వు నవ్వుతూ, అనుకోకుండా అతను అన్నాడు:
“చెడ్డవాళ్ళు దురదృష్టవంతులు – వాళ్ళ ఖర్మ!”
అతను వెళ్ళిపోగానే చేహొవ్ అతన్ని కళ్ళతోటే అనుసరిస్తూ, చిరునవ్వు నవ్వి, అన్నాడు:
“మంచి వాడు. అతను యెక్కువ కాలం ఉపాధ్యాయుడుగా వుండడు!”
“యేం, యెందుకని?”
“అతన్ని తరిమేస్తారు…. వదిలించుకుంటారు.”
కొంచెంసేపు ఆగి, తగ్గు స్థాయిలో, మృదువుగా అన్నాడు:
“రష్యాలో నిజాయితీ పరుడైన వాడు చిన్న పిల్లల్ని దాదులు బెదిరించడానికి చూపించే బూచి లాంటివాడు.”
చేహొవ్ సమక్షంలో సాదాగా, మరింత సత్యపూరితంగా, నిసర్గతత్వంతో వుండాలని ప్రతివాళ్ళకీ తెలియకుండానే కోరిక పుడుతుందేమో ననుకుంటాను. అనాగరిక తెగలవాళ్ళు పూసలతోటీ, కొమ్ములతోటీ అలంకరించుకున్నట్టుగా, రష్యన్లు యూరపియన్ల మాదిరీ కనిపించాలనే తమ తాపత్రయంలో అలంకరించుకున్న తమ చవక బారు వేషాలనీ, గంభీరమైన పుస్తక పదకోశపు శాలువాలనీ, మోజైన పదబంధాలనీ ఆయన ముందు యెలా విసిరేసేవాళ్ళో పరిశీలించే అవకాశాలు నాకు చాలా వచ్చాయి. చేహొక్కి పూసలన్నా, యెరుపు తెచ్చుకున్న నెమలి యీకలన్నా యిష్టం లేదు. “గంభీరమైన వాలకం” కోసం మనుషులు తొడుక్కునే ఆడంబరాలు, గంగిరెద్దు గంటలు, పరాయివైన సకలమూ ఆయనకి చిరాకు కలిగించేవి. యీ సరంజామా అంతా వేసుకున్న వాడు యెవడేనా యెప్పుడు తగిలినా ఆ సంభాషించే వ్యక్తి నిజస్వరూపాన్ని వికృతం చేసే భారమైన అదనపు తొడుగులన్నీ విప్పేసి అతన్ని విముక్తుణ్ణి చెయ్యాలని ఆయనకి పట్టలేని సహజ ప్రేరణ కలిగేది. చేహొవ్ తన యావజ్జీవితమూ పరిశుద్ధాత్ముడుగానే వున్నాడు. యెప్పుడూ ఆంతరంగికంగా అమలినంగానే వున్నాడు. కొంతమంది తననుంచి ఆశించిన దాన్ని గురించి గాని, యింకొంచెం తక్కువ నాజూకైన యితరులు చేహొవ్ నుంచి ఆపేక్షించిన దాన్ని గాని, ఆయన పట్టించుకునే వాడు కాదు. “ఉదాత్తమైన విషయాల గురించిన సంభాషణలు ఆయనకి యిష్టంగా వుండేవి కావు- యిది చమత్కారం అవడం మాట అటుంచి, అసంబద్దం అనే విషయాన్ని మర్చిపోయి రష్యన్లు తమ అమాయకత్వంలో ప్రస్తుతం మర్చాదైన లాగు లేకపోయినా భవిష్యత్తులోని చీని చీనాంబరాల గురించి మాట్లాడ్డం సరదాగా భావించేలాంటి సంభాషణలు.
తనే యెంతో ముచ్చట వేసే సాదాతనంతో వుండే ఆయన నిరాడంబరమైన, నిజమైన నిజాయితీ పూర్వకమైన దాన్నంతటినీ ప్రేమించాడు. యితరులని నిసర్గంగా చేసే సొంత పద్ధతీ ఆయనకి వుండేది.
ఒకసారి విపరీతమైన అలంకారప్రీతి వున్న ఆడవాళ్ళు ఆయన్ని చూడ్డానికి వచ్చారు. సిల్కు గౌన్లు రెపరెపలతో గది అంతా సువాసనల గుబాళింపుతో నిండిపోతూ వుంటే వాళ్ళు దర్పంగా తమ ఆతిధేయుడి ముందు కూర్చున్నారు. రాజకీయాల మీద గాఢమైన ఆసక్తి చూపిస్తూ వాళ్ళు ఆయన్ని “ప్రశ్నలు అడగడం” మొదలు పెట్టారు.
“యుద్ధం యెలా ముగుస్తుందనుకుంటున్నారు?”
ఆయన దగ్గి, ఆలోచించుకోవడం కోసం ఆగి తన మృదువైన, గంభీరమైన, దయాన్వితమైన స్వరంతో జవాబు చెప్పాడు:
“నిస్సందేహంగా శాంతితోనే.”
“అది సరే లెండి. కాని యెవరు నెగ్గుతారు? గ్రీకులా, టర్కులా?”
“బలమైన పక్షం గెలుస్తుందని నా కనిపిస్తుంది.”
“యేది బలమైన పక్షం అని మీరనుకుంటున్నారు?” ఆడవాళ్ళు ముక్త కంఠంతో అడిగారు.
“బాగా తిండీ, బాగా చదువూ వున్న పక్షం. ”
“ఆయన చమత్కారంగా లేడూ?” అని ఒకామె అరిచింది.
“మీరు యెవళ్ళని అభిమానిస్తారు? గ్రీకుల్నా, టర్కుల్నా?” అని యింకో ఆవిడ అడిగింది.
చేహొవ్ ఆమెకేసి దయాపూరితంగా చూసి, తన సహజ ధోరణిలో మెతగ్గా, మర్యాదగా వుండే చిరునవ్వు నవ్వుతూ అన్నాడు:
“నాకు పళ్ళతో చేసిన తినుబండారాలంటే యిష్టం, తెలుసా?”
“ఓ, అవునా!” అందామె ఆతృతగా.
“అవి యెంత రుచిగా వుంటాయో” అని గంభీరంగా వంత పలికింది రెండవ ఆమె .
ఆ ముగ్గురూ పళ్ళతో చేసిన పదార్థాల గురించి, ఆ చర్చనీయాంశం మీద అద్భుతమైన పాండిత్యమూ, నిగూఢ పరిజ్ఞానమూ ప్రదర్శిస్తూ, ఉత్సాహ భరితమైన సంభాషణ మొదలుపెట్టారు. ఆ క్షణం దాకా ఒక్క పిసరు కూడా ఆలోచించి యెరగని టర్కుల గురించీ, గ్రీకుల గురించి పెద్ద ఆసక్తి వున్నట్టు నటించి, తమ బుర్రలు బద్దలు కొట్టుకోకుండా వుండటంతో వాళ్ళు సంతోషపడ్డట్టే కనిపించింది.
సెలవు తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చేహోవ్ కి హుషారుగా వాగ్దానం చేశారు:
“మేం మీకు ఒక బుట్టెడు పళ్ళతో చేసిన తినుబండారాల్ని పంపుతాం.”
“మంచి సంభాషణ జరిగిందే” అని నేను వాళ్ళు వెళ్ళిపోయింతర్వాత అన్నాను.
చేహొవ్ మృదువుగా నవ్వాడు.
“యెవడి భాష వాడు మాట్లాడాలి” అన్నాడాయన.
యింకో సారి ఆయన గదిలో నాకు స్పురద్రూపి అయిన ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనిపించాడు. చేహొవ్ ముందు నిలబడి, ఉంగరాల జుట్టు యెగరేస్తూ, అతను బింకంగా అంటున్నాడు:
“మీరు రాసిన ‘దోషి’ అనే కథలో మహా చిక్కు సమస్య తెచ్చి పెట్టారు నాకు. దెనీస్ గ్రిగోర్యెవ్ లో చెడ్డ పనిచేసే ఉద్దేశపూర్వకమైన యిచ్ఛ వున్నట్టు నాకు కనిపిస్తే సమాజ ప్రయోజనాలు ఆపేక్షించబట్టి, దేనీస్ ని యే వూగిసలాటా లేకుండా జైలుకి పంపడం నా విధి అవుతుంది. కాని అతను అనాగరికుడు, తను చేసే పనిలోని నేరం గురించిన యెరుక అతనికి లేదు. పాపం, అందుకని అతనంటే జాలి పడతాను. అహేతుకంగా వర్తించే వాడని భావించి జాలి చూపించా ననుకోండి, మళ్ళీ దెనీస్ సీలలు వూడదీసి రైలుని పడగొట్టెయ్యడని సంఘానికి నేను యెలా హామీ యివ్వాలి? అదీ సమస్య. యేం చెయ్యాలి?”
అతను కుర్చీలో వెనక్కి వాలి, వెదికే చూపులతో చేహొవ్ ముఖంలోకి చూస్తూ, ఆగాడు. అతని యూనిఫారం సరి కొత్తది. ఆ పడుచు వీరభక్తుడి నవనవలాడే ముఖంలోని కళ్ళల్లాగే ఆ యూనిఫారపు ముందు బొత్తాలు కూడా బింకంగా, మొద్దుగా ఓ క్షణం మెరిశాయి.
“నేను జడ్జీని అయివుంటే దెనీస్ ని నిర్దోషిగా విడుదల చేసి వుండేవాణ్ణి” అని చేహొవ్ గంభీరంగా అన్నాడు.
“యే ఆధారంతోటి?”
“నువ్వు యింకా యెరుక వున్న నేరస్తుడి లాంటి రకం కాలేదు, దెనీస్, పోయి అలా అవ్వు’ అని అతనికి నేను చెప్పి వుండేవాణ్ణి.”
ఆ ప్రాసెక్యూటర్ నవ్వాడు. కాని తక్షణం తన విపరీతమైన గంభీరత్వం పుంజుకుని అన్నాడు:
“వుహుఁ, మీరు లేవనెత్తిన సమస్యని సంఘ శ్రేయస్సు దృష్ట్యానే పరిష్కరించాలి. నేను సంఘ శ్రేయస్సుని కాపాడవలసిన వాణ్ణి. దెనీస్ అనాగరికుడు నిజమే కాని అతను నేరస్థుడు. మరి అందులోనే వుంది నిజం.”
“మీకు గ్రామఫోన్ వినడం యిష్టమేనా?” అని వున్నట్టుండి చేహొవ్ అడిగాడు.
“ఓ, యిష్టమే! బాగా! అది అద్భుతంగా కనిపెట్టిన వస్తువు” అని ఆ యువకుడు హడావుడిగా జవాబు చెప్పాడు.
“కాని నేను గ్రామఫోన్ అంటే భరించలేను” అని చేహొవ్ విచారంగా అన్నాడు.
“యెందుకని?”
“యెందుకేమిటి? అది యే అనుభూతీ లేకుండా మాట్లాడుతుంది, పాడుతుంది. దాన్నుంచి వచ్చే ధ్వనులన్నీ బోలుగా, జీవరహితంగా వుంటాయి. మరి మీకు ఫోటోగ్రఫీ అంటే యిష్టమేనా?”
ఆ ప్రాసెక్యూటర్ కి ఫోటోగ్రఫీ అంటే వెర్రి ఆపేక్షట. అతను తక్షణం దాన్ని గురించి ఉత్సాహంగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు, గ్రామఫోన్ విషయంలో, యిక యే మాత్రం ఆసక్తి కనబరచకుండా. “అద్భుతంగా కనిపెట్టిన” ఆ వస్తువుకీ తనకీ మధ్య వున్న పోలిక చేహొవ్ యెంతో సూక్ష్మంగా ఖచ్చితంగా గమనించాడు. నేను మరోసారి ఆ యూనిఫారంకింద ఉత్సాహంగా ఆసక్తికరంగా వుండే మానవుణ్ణి, వేటకి తీసికెళ్ళిన కుక్కపిల్లలాగా జీవిత మార్గాల్లో యింకా కొత్తగా వున్న వ్యక్తిని, చూశాను. ఆ యువకుణ్ణి సాగనంపాక చేహొవ్ చిరచిరలాడుతూ అన్నాడు:
“యిదిగో న్యాయానికి వెనకతట్టున వుండే యిలాంటి మొటిమగాళ్ళే మానవ జాతకాల్ని పరిష్కరించేవాళ్ళు. “
కొంచెంసేపు ఆగాక ఆయన అన్నాడు:
“ప్రాసెక్యూటర్లకి యెప్పుడూ చేపల్ని పట్టడమంటే సరదా, ముఖ్యంగా పరిగల్ని.”
యెక్కడ వున్నా గానీ నైచ్యాన్ని తూర్పారబట్టే నేర్పు ఆయనకి వుంది. తన జీవితంలో ఉన్నతమైంది ఆపేక్షించే వాడికే పట్టుబడిన నైపుణ్యం అది. మానవుడిలో నిష్కాపట్యం, అందం, సమరూపత దర్శించాలన్న తీవ్రమైన కాంక్ష నుంచే అది ఉ తన అవుతుంది. ఆయన నైచ్యాన్ని కఠినంగా, నిర్దాక్షిణ్యంగా విమర్శించే మనిషి.
బాగా ప్రచారంలో వున్న ఒక పత్రిక సంపాదకుడు, ప్రేమ అవసరం గురించి, జాలి చూపించడం గురించీ నిరంతరంగా మాట్లాడే అతను, నిష్కారణంగా ఒక రైల్వేగార్డును అవమాన పరిచాడనీ, తన కింద పని చేసే కాల్చుకు తింటాడనీ ఎవరో చేహొవ్ ముందు అన్నారు.
“సహజమే” అన్నాడు చేహొవ్, నిష్ఠూరంగా నవ్వుతూ. “అతను ఉన్నత వర్గం వాడు, సంస్కారి…. గొప్ప పాఠశాల్లో చదువుకున్నాడు. వాళ్ళ నాన్న నారబూట్లే తొడుక్కునే వాడు, కాని తను మాత్రం సిసలైన తోలు బూట్లు తొడుక్కుంటాడు.”
యీ మాటలని అన్న తీరు ఆ “ఉన్నత వర్గం” మనిషిని ఒక సామాన్యుడిగా, పరిహాసాస్పద వ్యక్తిగా తీసి పారేసింది.
“చాలా ప్రతిభావంతుడు” అని ఆయన ఒక జర్నలిస్టుని గురించి అన్నాడు. “అతను రాసేది యెప్పుడూ యెంతో ఉన్నతంగా, మానవత్వంతో వుంటుంది…. పంచదార పూత. అతను నలుగురి ముందూ పెళ్ళాన్ని చవట అని తిడతాడు. అతని నౌకర్లు చెమ్మగా వుండే గదుల్లో పడుకుంటారు, వాళ్ళందరికీ కీళ్ళనొప్పులు వస్తాయి…. “
“మీకు ఫలానా వాడు యిష్టమేనా ?”
“అయ్యో, యిష్టమే. మంచి మనిషి” అంటాడు చేహొవ్, దగ్గుతూ, “అతనికి అన్నీ తెలుసు. బోలెడు చదువుతాడు. నావి మూడు పుస్తకాలు తీసికెళ్ళాడు, మళ్ళీ యివ్వలేదు. కొంచెం పరాకు. ఒక రోజున యెవళ్ళతోటో మీరు భేషైన మనిషని చెప్తాడు, మర్నాడే మీరు మీ ప్రియురాలి భర్తగారికి వున్న నల్ల మేజోళ్ళు, నీలం పట్టీలు వున్నవి, కొట్టేసారని వేరే యెవళ్ళతోనో అంటాడు.”
ఆయన ముందు యెవరో గాని ఓ సారి “గొప్ప” పత్రికలలోని “సీరియస్” విభాగాలు నిరుత్సాహంగా, కష్టంగా వుంటున్నాయని అన్నారు.
“ఆ వ్యాసాలని చదవకండంతే” అని చేహొవ్ పరమ విశ్వాసంతోటి సలహా యిచ్చాడు. “అది సహకార సాహిత్యం…. శ్రీమాన్ ఎరుపుగారు, నలుపుగారు, తెలుపుగారు రాసిన సాహిత్యం. ఒకళ్ళు ఒక వ్యాసం రాస్తారు. యింకో ఆ విమర్శిస్తాడు. యీ యిద్దరిలోనూ వున్న అసంబద్ధతల్ని మూడో ఆయన సర్ది చెప్పేస్తాడు. డమ్మీని పెట్టుకుని వింట్ పేకాట ఆడ్డం లాంటిది. కాని యిదంతా పాఠకుడికి యెందుకు అవసరమా అనేదాన్ని గురించి వాళ్ళల్లో ఒకళ్ళూ పట్టించుకోరు.”
ఒకసారి లావుగా, ఆరోగ్యంగా, అందంగా, బాగా ముస్తాబైన ఒక ఆడావిడ ఆయన్ని చూడ్డానికి వచ్చింది. వచ్చిన వెంటనే “చేహొవ్ ధోరణి”లో మాట్లాడ్డం మొదలుపెట్టింది.
“బతుకు యెంతో నిరుత్సాహంగా వుంది! ప్రతీదీ యెంతో వెలవెలబోతున్నట్టుంది – జనం, ఆకాశం, సముద్రం, ఆఖరికి పువ్వులు కూడా నాకు వెలవెల బోయినట్టే వున్నాయి. కోరుకోవాల్సిందేమీ లేదు- నా హృదయం మూలుగుతోంది. యిది ఒక రకమైన జబ్బు….”
“యిది ఒక జబ్బు” అని చేహొవ్ గట్టిగా అన్నాడు. “సరిగ్గా అంతే అది. దానికి లాటిన్ పేరు మార్బస్ కుహనా -ఇటిస్ అని. “
అదృష్టవశాత్తూ ఆమెకి లాటిన్ రాదు, లేకపోతే రానట్టు నటించిందో.
“నేలని దున్నకుండా గుర్రానికి చిర్రెత్తించే జోరీగల్లాంటి వాళ్ళు, విమర్శకులు” అన్నాడాయన తెలివిగా నవ్వుతూ. “గుర్రపు కండరాలు ఫిడేలు తీగల్లాగా బిగువుగా వుంటాయి. వున్నట్టుండి ఓ జోరీగ వృష్ఠభాగం మీద రొజపెడుతూ, కుడుతూ వాలుతుంది. గుర్రపు చర్మం వణుకుతుంది. తోక ఆడిస్తుంది. జోరీగ యెందుకు రొజ పెడుతోంది? అది దానికే తెలీదు, బహుశా. అది వూరికే నిలకడగా వుండలేదంతే, ‘నేనూ బతికే వున్నాను తెలుసా?’ అంటున్నట్టుంటుందది. ‘చూడండి, రొజ పెట్టడం యెలాగో నాకు తెలుసు, నేను రొజ పెట్టనిది లేదు!’ నేను యిరవై ఐదు యేళ్ళుగా నా కథల సమీక్షలు చదువుతున్నాను. వాటిల్లో ఒక దాంట్లో కూడా ఒక్క పనికొచ్చే పాయింటు కాని పిసరు మంచి సలహా కాని గుర్తుకు రాదు. నాకు అంతో యింతో ఫరవాలేదు అనిపించే సమీక్షకుడు ఒక్కడూ విమర్శకుడు. నేను తాగి ఓ అగాధంలో పడిచస్తానని అతను జోస్యం చెప్పాడు….”
ఆయన బూడిదరంగు విచారగ్రస్త నయనాల్లో ఒక రకమైన సూక్ష్మ వ్యంగ్యం దాదాపు యెప్పుడూ మిలమిల లాడేది. కాని యెప్పుడేనా యీ కళ్ళు అనార్ద్రంగా, నిశితంగా, కఠినంగా తయారయేవి. అలాంటప్పుడు ఆయన మృదువైన, ఆర్ద్రమైన స్వరంలో కటువైన జీరలు గోచరమయ్యేవి. అలాంటప్పుడే నాకు అనిపించేది యీ వినమ్రుడైన, దయాపూరిత మానవుడు యే విద్వేషపూరిత శక్తికైనా గానీ వ్యతిరేకంగా, దృఢంగా, దానికి వశం కాకుండా నిలబడగలడు అని.
యితరుల పట్ల ఆయన వైఖరిలో ఒక నిరాశాపూరిత ఛాయ, అనార్ధ్ర పూరిత నిశ్చల నిర్వేదసమమైనదేదో వుండినట్టు నాకు ఒకో అప్పుడు అనిపించేది.
“రష్యన్ మనిషి వింత జీవి” అన్నాడాయన ఒక సారి. “అతను జల్లెడలాంటి వాడు. దేన్నీ ఎక్కువకాలం వుంచుకోలేడు. యౌవనంలో తనకి అందిన దాన్నంతటినీ ఆతృతగా అంది పుచ్చుకుంటాడు, ముప్ఫై యేళ్ళు దాటేటప్పటికి రంగు మాసిన చెత్తపోగు తప్ప మరేం మిగలదు. యెవళ్ళేనా గానీ మంచి జీవితం, మానవ జీవితం గడపాలనుకుంటే, శ్రమించి తీరాలి. ప్రేమతోటి, విశ్వాసంతోటీ పని చెయ్యాలి. మరి దాన్ని యెలా చెయ్యాలో మన దేశంలో మనకి తెలీదు. రెండు మూడు మర్యాదైన – యిళ్ళు కట్టిన వాస్తుశిల్పి యిక జీవితాంతం పేకాడుతూ కూర్చుంటాడు, లేకపోతే నాటక రంగస్థలం వెనక భాగంలో తచ్చాడుతూ వుంటాడు. డాక్టరు యెవడికేనా కొంచెం ప్రాక్టీసు పుంజుకుందీ అంటే అతను “చికిత్సావిధాన సమాచారం” తప్ప మరేమీ చదవడు. శాస్త్రంతో సంబంధం పెట్టుకోవడం మానేస్తాడు. నలభై యేళ్ళు వచ్చేటప్పటికి జబ్బులన్నీ జలుబుల వల్లనే వస్తాయని తీర్మానించుకుంటాడు. తన పని యేమిటైందీ దాని ప్రాముఖ్యం గురించి పిసరు కూడా తెలిసిన అధికారి నాకు ఒక్కడు తగల్లేదు – రాజధానిలోనో, లేకపోతే యేదేనా రాష్ట్ర పట్టణంలోనో తిష్టవేసి యేదో కాగితాలని సృష్టించి ఓ పట్టణానికి పంపుతాడు. అక్కడ యీ పత్రాలవల్ల యెవడి స్వేచ్ఛకి అంతరాయం కలుగుతుంది అన్నది యీ అధికారికి ఖాతరీలేదు, నరక బాధలని గురించి నాస్తికుడికి లాగా. ఒక కేసు నెగ్గేటట్టు వాదించి పేరు తెచ్చుకున్న లాయరుకి సత్యాన్ని పరిరక్షించాలన్న బాధ లేదు, అతను ఆస్తి హక్కుల్ని సమర్ధించడం, గుర్రాలమీద పందెం కట్టడం, సీపిగుల్ల చేపల్ని తినడం తప్ప మరేం చెయ్యడు. సకల కళల్లోనూ రసజ్ఞత వున్నవాడుగా చలామణీ అయిపోతాడు. రెండు మూడు పాత్రలు బాగా పోషించిన నటుడు, యింకే పాత్రనీ నేర్చుకోడు, కీర్తి కిరీటం తగిలించుకుని తనో దైవాంశ సంభూతుణ్ణని భావించుకుంటాడు. రష్యా ఆశపోతు సోమరిగాళ్ళ దేశం. జనం తెగ తింటారు, తెగ తాగుతారు, పగలు నిద్రపోవడం అంటే వీళ్ళకి యిష్టం. నిద్రలో గురక కొడతారు. యిళ్ళల్లో ఓ పద్ధతి వుండడం కోసమని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సంఘంలో గొప్ప కోసం యింకొకత్తిని పుంచుకుంటారు. వీళ్ళ బుద్ధి కుక్క బుద్ధి. కొట్టండి, ముడుచుకుపోయి మూలుగుతూ మూలకి పోతారు. బుజ్జగించండి, వెల్లకిలా పడుకుని, కాళ్ళు పైకెత్తి తోకలు ఆడిస్తారు.”
యీ మాటల వెనక ఒక అనార్ద్ర, విచారభరిత తృణీకారం వుంది. కాని తృణీకరించుకుంటున్నప్పుడు కూడా ఆయన జాలి పడగలడు. ఎవళ్ళనేనా ఆయన ముందు నిందిస్తే చేహొవ్ ఖాయంగా ఆ వ్యక్తి పక్షం వహిస్తాడు:
“పోన్లెండి! ఆయన ముసలాడు, డెబ్బై యేళ్ళు వున్నాయి….”
లేదా:
“అబ్బే అతనింకా కుర్రాడు, వూరికే తెలియనితనం అంతే….”
ఆయన యిలా మాట్లాడేటప్పుడు ఆయన ముఖంలో యే యేవగింపూ కనిపించేది కాదు.
యెవళ్ళేనా చిన్న వయసులో వున్నప్పుడు, సంకుచితత్వం అనేది సరదాగా, అప్రాముఖ్యంగా కనిపించవచ్చు కాని అది క్రమేపీ మనిషిని చుట్టు ముడుతుంది. బొగ్గు ధూపం లాంటి విషంలాగా దాని వెలిబూది ఆవిరి బుర్రలోకీ, రక్తం లోకీ పాకుతుంది. మనిషి తుప్పు పట్టిపోయిన కుల్లుదుకాణం పాత బోర్డులాగా అవుతాడు ఆ బోర్డుమీద యేదో రాసినట్టే వుంటుంది, కాని యేమిటైందీ ఆనవాలు పట్టడం అసాధ్యం.
మొదటినుంచీ కూడా సంకుచిత ప్రవర్తన వెలిబూది మహా సముద్రంలో దాని విషాదభరిత మసక విషయాలని వెల్లడించేవాడు చేహొవ్. యెవళ్ళేనా గానీ ఆయన “హాస్యపూరిత” కథలని జాగ్రత్తగా చదవాలంతే – రచయిత తన వినోదభరిత వర్ణనలోనూ, పరిస్థితుల్లోనూ యెంత క్రూరమైందాన్ని చూసిందీ, సిగ్గుపడుతూ దాచిందీ గుర్తించాలంటే.
ఆయనకి దాదాపుగా కన్యాత్వపు అణకువ వుంది. ఆయన యెన్నడూ మనుషుల్ని బహిరంగంగా, గట్టిగా సవాలు చేసే స్థితికి పోలేడు. వాళ్ళు తమంతట తామే యింకా మర్యాదగా వుండాల్సిన అత్యవసరాన్ని గుర్తిస్తారని వృధాగా విశ్వసిస్తూ “యింకొంచెం మర్యాదగా వుండండి, వుండలేరూ?” అని అనలేడు. అసభ్యంగా అపరిశుభ్రంగా వున్నదాన్నంతా యేవగించుకుంటూనే, ఆయన జీవితపు ఆనాకర్షక భాగాల్ని కవికి వుండే ఉదాత్త భాషతో, హాస్య చతురుని మృదువైన లాస్యంతో వర్ణించాడు. ఆయన కథల్లో మెరుగుపెట్టిన పై పూత కింద అంతర్లీనంగా వుండే మందలింపు కనిపించీ, కనిపించకుండా వుంటుంది.
మాననీయులైన ప్రజలు “ఇంగ్లీషు ఆడపడుచు” చదివి నవ్వుకుంటారు. యిందులో పరిత్యక్త వ్యక్తి పట్ల, ప్రతివాళ్ళకీ, ప్రతిదానికీ పరాయి అయిన వ్యక్తిపట్ల, బాగా పెరిగిన జమీందారుగారి యేహ్యమైన యెగతాళిని బహుశా చూడలేరు. చేహొవ్ రాసిన అన్ని హాస్యపూరిత కథల్లోనూ నిష్కళంకమైన నిజమైన మానవ హృదయపు మృదు, గంభీర నిశ్వసనం వినిపిస్తూ వున్నట్టే వుంటుంది నాకు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేక, పాశవిక శక్తికి లొంగిపోతూ, బానిసల్లాగా బతుకుతూ, ప్రతిరోజూనోరూరించే కాబేజీ పులుసు యెంత వీలైతే అంతా జుర్రుకోవడపు అవసరాన్ని తప్ప మరిదేన్నీ విశ్వసించకుండా,బలవంతులూ పొగరు మోతులూ తమని బాధిస్తారన్న భయం తప్ప మరియే అనుభూతులు లేకుండా వుండే మానవుల పట్ల సానుభూతిభరిత నిరాశా నిశ్వసనం వినిపిస్తూ వున్నట్టే వుంటుంది నాకు.
జీవితపు అప్రాముఖ్య విషయాల విషాద స్వభావాన్ని చేహొవ్ అంత స్పష్టంగా, సహజాతంగా యే రచయితా అర్థం చేసుకోలేదు. మధ్యతరగతి జీవితాల మలిన కల్లోలంలోని అవమానకరమూ, జాలి పడదగనిదీ అయిన దాని మొత్తం నిర్దాక్షిణ్యం సత్యపూరిత చిత్రాన్ని మానవాళి ముందు యే రచయితా యింతకు ముందు పెట్టి వుండలేదు.
ఆయన శత్రువు అసభ్యత. ఆయన తన యావజ్జీవితం దానికి వ్యతిరేకంగా పోట్లాడాడు, దాన్ని అధిక్షేపిస్తూ యెత్తిపట్టాడు. పైకి అంతా సవ్యంగా, సౌకర్యంగా యింకా చెప్తే అద్భుతంగా వుంటుందనుకునే చోట కూడా అసభ్యత అనే నాచుని చూసి నిష్పాక్షిక రచనలలో ప్రదర్శించాడు; ఆయన మృతకాయాన్ని- కవి శరీరాన్ని సీపిగుల్లలు రవాణా చేసే రైలు వాగన్లో పెట్టడం ద్వారా అసభ్యత వికారమైన కుయుక్తితోటి ఆయనమీద పగతీర్చుకుంది.
మలినంగా ఆకుపచ్చగా వున్నరైలు వాగన్ డస్సిన తన శత్రువుమీద అసభ్యత సాధించిన విశాల విజయాట్టహాసంగా కనిపిస్తుంది నాకు. అసభ్య పత్రికల అసంఖ్యాక “జ్ఞాపకాలు” – వొట్టి కపట శోకం; తన శత్రువు మరణం పట్ల లోపల్లోపల సంతోషపడుతున్న అదే అసభ్యత శీతల దుర్గంధపూరిత శ్వాస వాటి వెనక తగులుతున్నట్టు వుంటుంది నాకు.
చేహొవ్ రచనలని చదివితే అదేదో ఆకురాలు కాలం బాగా గడిచిపోయిన తర్వాత వుండే విచారకరమైన రోజులాగా వుంటుంది నాకు. గాలి స్వచ్చంగా వుండి, ఆకాశపు నేపథ్యంలో ప్రస్ఫుట ఆకార రేఖా వైశిష్ట్యంతో బోసిపోయిన చెట్లన్నీ నిటారుగా వుండి యిళ్ళన్నీ గుబురుగా వుండి ప్రజలు అంతా మబ్బుగా బావురుమంటూ వున్నట్టుండే రోజులాంటిది. ప్రతీదీ కూడా యెంతో వింతగా, ఒంటరిగా, నిశ్చలంగా, శక్తిహీనంగా వుంది. సుదూర ప్రాంతం నీలంగా, శూన్యంగా వుండి నిస్తేజపు ఆకాశంతో అర్థఘనీభూత మృత్తికమీద విషాద శీత శ్వాస పీలుస్తూ మిళితం అయిపోతోంది. రద్దీగా నడిచే రోడ్లు, మెలికలు తిరిగిన వీధులు, మురికిగా, కిక్కిరిసిపోయిన యిళ్ళు, ఆళ్ళల్లో జాలిగొలిపే సామాన్య జనం, విసుగుదలతోటీ, సోమరితనంతో, తమ వాసస్థానాల్ని అర్థరహితంగా, మగతగా వుండే సందోహంతో నింపేస్తూ రొప్పుతూ వుంటారు. దీన్నంతటినీ ఆకురాలు కాలపు యెండలాగా, రచయిత మనసు నిర్దాక్షిణ్యమైన స్పష్టతతో ప్రకాశింపచేస్తూ వుంటుంది. అక్కడ చిన్న బూడిద రంగు చుంచులాగా పిరికిగా, అపరిమితంగా దాస్య తత్వంతో ప్రేమించే మధురమైన, అణకువ అయిన ఆడమనిషి “ది డార్లింగ్” చరిస్తుంది. ఆమె చెంపమీద ఒక లెంపకాయ కొట్టండి, పాపం అణకువైన దాసి, ఆమె అరవను కూడా అరిచే ధైర్యం చెయ్యదు. ఆమె పక్కన “ముగ్గురు అక్క చెల్లెండ్లు” లోని శోకభరిత ఓల్గా వుంటుంది. ఆమె కూడా అపరిమితంగా ప్రేమించగలది. సోమరిపోతు అన్నగారికి పతనమైన, నీచమైన భార్య ఓల్గా ఆ వదినగారి తిక్కలన్నిటికీ ఓపిగ్గా తల ఒగ్గుతుంది. తన తోబుట్టువుల జీవితాలు ఆమె పక్కనే నాశనం అయిపోతున్నాయి, ఆమెయేమీ చెయ్యలేని నిస్సహాయతతో రోదిస్తుంది అంతే; అసభ్యతకి వ్యతిరేకంగా నిరసన తెలియచేసే సజీవమైన శక్తివంతమైన మాట ఒక్కటి కూడా ఆమెలో రూపు తీసుకోదు.
అదుగో అక్కడున్నాడు “చెర్రీ ఆర్చర్డ్” పూర్వపు యజమానులు, రనేవ్ స్కయీ , యితరులు – పిల్లల్లాగా స్వార్థపూరితంగా, పెద్ద వాళ్ళల్లాగా బిగువు సడలీ వున్నవాళ్ళు. తమ చుట్టూతా యేం జరుగుతోందో చూడలేనంత గుడ్డిగా, యేమీ గ్రహించలేకుండా, తమ చోషకాలని తిరిగి జీవితంతో బంధించుకోలేని పరాన్నభుక్కులు, యేనాడనగానో చచ్చిపోయి వుండాల్సిన వాళ్ళు, రాగాలు తీస్తూ శోకన్నాలు పెడుతూ వుంటారు. పనికి మాలిన విద్యార్థి త్రొఫీమొవ్ శ్రమించాల్సిన అవసరం గురించి ధారాళంగా చెపుతూ, తన కాలాన్ని జులాయిగా తగలేస్తూ, వార్యాని మందబుద్ధి యెత్తిపొడుపు మాటలు అని సరదాపడుతూ వుంటాడు. ఆమె సోమరిపోతుల బాగు కోసం గుక్క తిప్పుకోకుండా పనిచేస్తూనే వుంటుంది.
వెర్షీనిన్ (“ముగ్గురు అక్కచెల్లెండ్ల” నాయకుడు) మూడు వందల యేళ్ళల్లో రాబోయే మంచి జీవితాన్ని గురించి కలగంటాడు గాని యీ లోపున తన చుట్టూతా వున్నది శిధిలమై పోతోందనీ, జాలిగొలిపే బారన్ తుసెన్ బాఖ్ ని విసుగుదల వల్లా మూర్ఖత్వంవల్లా సొల్యోనీ తన కళ్ళముందే చంప సిద్ధపడుతున్నాడనీ గుర్తించడు.
ప్రేమకి, మూర్ఖత్వానికి, సోమరితనానికి, ఐహిక సుఖాలకోసం వెంపరలాటకి బానిసలైన వాళ్ళ పెద్ద శ్రేణి పాఠకుల కళ్ళ ముందు పోతుంది. జీవితపు అదృశ్య భయానికి బానిసలైన వాళ్ళు, అస్పష్టమైన ఆందోళనతో చరిస్తూ, భవిష్యత్తుని గురించిన అవ్యక్త ప్రలాపాలతో నభోంతరాళాన్ని దద్దరిల్ల జేస్తూ, వర్తమానంలో తమకి స్థానం లేదని భావిస్తూ వుండే బానిసలు యిక్కడ వున్నారు.
ఒకో అప్పుడు బూడిదరంగు సమూహంలో ఓ తుపాకీ పేలుడు వినిపిస్తుంది – యిక చెయ్యాల్సిన పని అల్లా ఒకటేనని కనిపెట్టిన ఇవానోవో (“ఇవానొవ్” నాటకం), త్రేప్లెవో (“సముద్ర పక్షి” నాటకం) చనిపోవడం అది.
వాళ్ళల్లో చాలా మంది రెండు వందల యేళ్లల్లో రాబోయే వైభవోపేత జీవితాన్ని గురించి కమ్మని కలలు గంటారు కాని అతి సామాన్యమైన యీ ప్రశ్నని అడగడం గురించి మాత్రం యెవరూ ఆలోచించరు: మనం కలలు గనడం తప్ప మరేమీ చెయ్యకపోతే యెవరు దీన్ని వైభవోపేతం చేసేవాళ్ళు?
యీ జడ, విషాదభరిత, శక్తిహీనుల గుంపు పక్క నుంచి ఒక గొప్ప, తెలివైనవాడు వెడతాడు. వీళ్ళందరి కేసీ, తన మాతృదేశంలో నివశించే విషాదభరితులైన వీళ్ళ కేసి గా చూసి, విచారకరమైన చిరునవ్వుతో వదనంమీదా, హృదయం లోనూ నిరాశాభరిత దుఃఖం వుండగా, పరమచిత్తశుద్ధిగల స్వరంతో, మృదువైనా గానీ గాఢమైన మందలింపు మాటలతో అంటాడు:
“యేం జడజీవితం గడుపుతున్నారండీ, మీరు!”
అయిదు రోజులుగా జ్వరం, అయినా విశ్రాంతి తీసుకోవాలనే కోరిక లేదు. ఫిన్నిష్ వాన చెమ్మధూళి వున్న నేలమీద జల్లులుగా పడుతోంది. ఫోర్ట్ ఇన్నొ ఫిరంగిలు విరామం లేకుండా దద్దరిల్లుతున్నాయి. రాత్రి పూట సెర్చ్ లైట్ దీర్ఘనాలిక మేఘాలని నాకుతుంది. దరిద్రపు దృశ్యం, యేమంటే అది కర్కోటక వ్యాధిని – యుద్ధాన్ని గుర్తుచేస్తుంది.
నేను చేహొవ్ పుస్తకం చదువుతున్నాను. ఆయన పదేళ్ళ కితం చచ్చిపోయి వుండనట్టయితే యుద్ధం బహుశా ఆయన్ని చంపేసి వుండేది, మొదటగా ఆయన్ని మనుష్యుల పట్ల ద్వేషంతో విషపూరితం చేస్తూ. ఆయన అంత్యక్రియలు గుర్తుకు వచ్చాయి.
మాస్కో అంత “మార్దవంగా ప్రేమించిన” యీ రచయిత శవపేటిక “సీపిగుల్లలు” అని తలుపుమీద పెద్ద అక్షరాలతో రాసివున్న ఆకుపచ్చ వాగన్ లో వచ్చింది. రచయితని దర్శిస్తామని స్టేషన్ కి వచ్చిన జనంలో కొంతమంది అప్పుడే మంచూరియా నుంచి తీసుకువచ్చిన జనరల్ కెల్లర్ శవపేటిక వెనకాల వెడుతూ, చేహొవ్ ని మిలిటరీ బాండ్ తోటి శ్మశానికి తీసుకుపోతున్నారేమో అని ఆశ్చర్యపోయారు. పొరపాటు గుర్తించగానే కొందరు సరసులు నవ్వడమూ, వ్యంగ్యంగా హాస్యం చెయ్యడమూ మొదలు పెట్టారు. చేహొవ్ శవపేటిక వెనక్కాల ఓ వందమంది వెళ్ళి వుంటారేమో, అంతే. యిద్దరు లాయర్లు మాత్రం నాకు బాగా గుర్తున్నారు. యిద్దరూ కూడా కొత్త బూట్లు తొడుక్కుని, మెరిసిపోయే టైలు కట్టుకుని పెళ్ళి కొడుకుల్లాగా వున్నారు. వాళ్ళిద్దరి వెనక్కాల నడుస్తూ వెళ్ళాను. వాళ్ళల్లో ఒకతను కుక్కల తెలివితేటలు గురించి మాట్లాడ్డమూ, రెండో అతను తన వేసవి విడిది సౌకర్యాన్నీ, దాని పరిసరాల అందన్నీ వర్ణించడమూ విన్నాను. గులాబీ రంగు బట్టలు తొడుకున్న ఆడావిడ నీడ కోసం లేసు గొడుగు పట్టుకుని కొమ్ము అంచుగల కళ్ళజోడు పెట్టుకున్న ముసలి పెద్దమనిషి యెవరితోనో అంటోంది:
“పాపం, అతను యెంత ప్రేమాస్పదుడు, యెంత చమత్కారంగా వుండేవాడు….”
ఆ ముసలాయన నమ్మలేనట్టు దగ్గాడు. ఆవేళ వేడిగా వుంది, దుమ్ము లేస్తూ వుంది. వూరేగింపు ముందు ఒక లావాటి పోలీసు ఆఫీసరు లావాటి తెల్లని గుర్రంమీద కూర్చుని దారితీస్తున్నాడు. యిదంతా కూడా ఆ మహత్తర, సునిశిత రచయిత స్మృతికి శుద్ధ అనుచితంగానూ, వెలపరం పుట్టేటంత అసభ్యంగానూ వుంది.
వృద్ధ ఎ. సువోరిన్ కి చేహొవ్ రాసిన ఒక ఉత్తరంలో యిలా వుంది:
“జీవితానందాన్ని ధ్వంసం చేస్తూ, విముఖతని కలిగిస్తూ, జీవించడం కోసమే రసహీనమైన పోరాటం చెయ్యడం కంటే నిరుత్సాహభరితమైందీ, విషాద భరితమైందీ మరొకటి లేదు.”
యీ మాటలు పరమ రష్యన్ స్వభావాన్ని వ్యక్తం చేస్తాయి. నా అభిప్రాయంలో చేహొవ్ అలాంటి వాడు కానే కాదు. రష్యాలో ప్రతీదీ అంతగా వున్నప్పుడు, కాని ప్రజలకి పని చెయ్యాలనే యిచ్ఛలేనప్పుడు, అధిక సంఖ్యాకులు అలానే భావిస్తారు. రష్యన్లు శక్తిని మెచ్చుకుంటారు, కాని నిజంగా అదంటే వాళ్ళకి నమ్మకం వుండదు. క్రియాత్మక స్థితిని ప్రవచించే రచయిత, ఉదాహరణకిజాక్ లండన్ లాంటి వాడు, రష్యాలో అసంభవం. జాక్ లండన్ పుస్తకాలు రష్యాలో చాలా ప్రచారం పొందాయి. కాని అవి రష్యన్ల సంకల్పాన్ని క్రియకి ప్రేరేపిస్తాయని అనుకోను, అవి వూరికే వాళ్ళ వూహల్ని రేపుతాయంతే. కాని చేహొవ్ ఆ అర్థంలో అంత రష్యన్ కాదు. ఆయన చిన్నతనం నుంచీ ఒక రొట్టె ముక్కకోసం నిత్యం రొష్టుపడే సంతోషరహిత, కాంతిహీన రూపంలో “జీవన పోరాటం” సాగించాల్సి వచ్చింది – తను పోషించాల్సిన కుటుంబానికి పెద్ద రొట్టె ముక్క అవసరం. యీ యాతనలకే, సంతోషం లుప్తమైన వీటికే, ఆయన యువశక్తులన్నీ ధారపోశాడు. చిత్రం యేమిటంటే ఆయన హాస్య చతురతని నిలబెట్టుకోవడం. తగినంత తిండి కోసం, శాంతి కోసం రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమగా తప్ప మరోలా జీవితం ఆయనకి కనిపించలేదు. జీవితపు మహత్తర సంఘటనలూ విషాదాలూ నిస్సార విషయాల మందమైన పొర మాటున కప్పడిపోయాయి. యితరులని పోషించడం కోసం తను సంపాదించాల్సిన ఆందోళన తొలగిపోయినప్పుడే ఆయన యీ సంఘటనల గురించిన సత్యాన్ని నిశితంగా చూడగలిగాడు.
సంస్కృతికి పునాదిగా శ్రమ వుండడం అనే దాని ప్రాముఖ్యాన్ని చేహొవ్ అంత గాఢంగా, వైవిధ్యభరితంగా చూసిన వాళ్ళెవరూ నాకు కనిపించలేదు.యీ అనుభూతి కుటుంబ జీవితపు చిల్లర మల్లర విషయాలన్నిటిలోనూ, వస్తువులని వస్తువులుగానే ప్రేమించడంలో ద్యోతకం అయింది. కూడబెట్టుకోవాలనే కాంక్షవల్ల యేం మలినం కాకుండా ఆయన వాటిని మానవుడి సృజనాత్మక శక్తి ఉత్పత్తిగా విసుగు లేకుండా అభినందించేవాడు. యిళ్ళు నిర్మించడాన్ని, తోటలు నాటడాన్ని, నేలని అలంకరించడాన్ని ప్రేమించాడు. ఆయన శ్రమలోని రసాన్ని అనుభూతి చెందేవాడు. తను స్వయంగా నాటిన పళ్ళ చెట్లూ, పూల మొక్కలూ యెదుగుతూ వుంటే ఆయన యెంతో హత్తుకునే శ్రద్ధతోటి పరిశీలించేవాడు. తన యిల్లు కట్టుకోడానికి సంబంధించిన అనేక బాధల్లో వుండి ఆయన అన్నాడు:
“ప్రపంచంలోని ప్రతి ఒక్కడూ తన సొంత మడిమీద తను చెయ్యగలిగినంతా చేస్తే యీ ప్రపంచం యెంత యింపుగా వుంటుంది!”
సరిగ్గా ఆ సమయంలోనే నేను నా నాటకం “వసీలీ బుస్లాయెవ్” రాసే యాతనలో వున్నాను. వసీలీ దాంభికంగా అనే స్వగతాన్ని ఆయనకి చదివి వినిపించాను:
మరింత శక్తే నాలో వుంటే!
వేడి నిట్టూర్పుతో చుట్టూ వున్న మంచుని కరిగిస్తా,
ప్రపంచమంతా తిరిగి భూముల్ని దున్నుతా;
ఠీవిగల పట్టణాలనీ, నగరాలనీ స్థాపిస్తా,
చర్చిలని కడతా, పళ్ళ తోటల్ని నాటతా.
అందమైన అమ్మాయిలా అగుపిస్తుంది అవని!
ఒక వధువులాగా దీన్ని గ్రహిస్తా నా హస్తాల్తో
అక్కున హత్తుకుంటా నీభూతలాన్ని.
దాన్ని మోసుకుపోతా ప్రభువు దగ్గరికి.
“చూడు, ప్రభూ, దేవా, యిలాతలం చూడు
యెంత మనోహరంగా మలిచానో చూడు!
ఆకాశం పైకి దీన్ని రాతిలాగ విసిరావు నువ్వు
వెలగట్టలేని వజ్రంగా నేను దీన్ని మార్చా!
దీన్ని చూడు, నీ హృదయం పులకలెత్తి పరవశించు
సూర్య కాంతిలో యెంతటి హరితంగా వుందో కద!
సంతోషంగా నీకు దీన్ని అర్పణ కావింతు, గాని
యివ్వను, యివ్వలేను – యిది నాకు అమిత ప్రియం.
చేహొవ్ కి యీ స్వగతం నచ్చింది, వణుకుతూ దగ్గి ఆయన నాతోటీ, డా.ఎ. అలేక్సిన్ తోటి అన్నాడు:
“బాగుంది…. చాలా బాగుంది…. నిజంగా, మానవుడి లక్షణంతో వుంది. సరిగ్గా అక్కడే “సకల తత్వశాస్త్రాల అర్థం” వుంది. మానవుడు ప్రపంచంమీద వున్నాడు, అతను దాన్ని వాసయోగ్యమైన స్థలంగా చేస్తాడు.” నిశ్చయంగా తల పంకించి ఆయన రెట్టించాడు: “చేస్తాడు!”
మళ్ళీ చదవమని ఆయన నన్ను అడిగాడు, విని, కిటికీలోనుంచి చూస్తూ :
“ఆఖరి రెండు పాదాలూ లాభం లేదు. అవి ధిక్కరిస్తున్నట్టు వున్నాయి. అతిరిక్తం
తన సాహిత్య కృషిని గురించి తక్కువగానూ, అయిష్టంగానూ ఆయన మాట్లాడేవాడు. లియో టాల్ స్టాయ్ గురించి ఆయన అంతటి మొహమాటంగానూ జాగ్రత్తగానూ మాట్లాడేవాడు. యెప్పుడేనా, హుషారుగా వున్నప్పుడు, ఆయన ఓ కథ యితివృత్త నిర్మాణం చెప్పేవాడు, నవ్వుతూ- అది యెప్పుడూ హాస్యభరితమైన కథే.
“ఓ నాస్తికురాలు బడిపంతులమ్మ గురించి కథ రాస్తాను. ఆమె డార్విన్ని ఆరాధిస్తుంది, జనంలో వున్న దురభిప్రాయాలనీ, మూఢ నమ్మకాలనీ యెదిరించాల్సిన అవసరం గురించి నమ్మకం వున్న మనిషి. తనే ఓ అర్థరాత్రి స్నానాల గదికి నల్ల పిల్లిని ఉడికించడానికి పోతుంది, యెవడేనా మగాణ్ణి ఆకర్షించి, తన పట్ల ప్రేమ కలిగించే మంత్రమయమైన అస్థిక కోసం ఎలాంటి యెముకో తెలుసా….”
ఆయన తన నాటకాలు “సరదా”గా వుంటాయనే యెప్పుడూ అనేవాడు. నిజంగా తను “సరదా నాటకాల”ని రాసాననే ఆయన మనస్ఫూర్తిగా అనుకునేవాడు. “చేహొవ్ నాటకాలని లాలిత్యభరిత మోదాంతాలుగా ప్రదర్శింపచెయ్యాలి” అని మొండిగా అంటున్నప్పుడు సవ్వ మొరోజోవ్ చేహొవ్ మాటల్నే తిరిగి వల్లిస్తున్నాడనడంలో సందేహం లేదు.
కాని సాహిత్యం పట్ల సామాన్యంగా ఆయన అతి నిశితమైన శ్రద్ధ చూపించే వాడు, మరీ ముఖ్యంగా “కొత్త వాళ్ళ” విషయంలో స్పందించేటట్టు అది వుండేది.
“మనకి యింకా రచయితలు కావాలి” అన్నాడాయన. “మన నిత్య జీవితంలో సాహిత్యం యింకా కొత్తది, “వరప్రసాదు”లకి కూడా. నార్వేలో ప్రతి రెండు వందల ఇరవైయారు మందికీ ఒక రచయిత వున్నాడు, యిక్కడ మిలియన్ కి ఒకడు.”
ఆయన జబ్బు ఒకో అప్పుడు అకారణ నిర్వేద సంబంధమైనా, మానవద్వేష సంబంధమైనా మానసిక స్థితిని ఆయనకి కలిగించేది. అలాంటప్పుడు ఆయన మహా విమర్శనాత్మకంగా తయారయేవాడు, ఆయనతో నెగ్గుకు రావడం చాలా కష్టంగా వుండేది.
ఓ రోజున సోఫామీద పడుకుని, పొడి దగ్గుదగ్గుతూ, ధర్మామీటరుతో ఆడుతూ, ఆయన అన్నాడు:
“వూరికే చచ్చిపోవడం కోసం బతకడం అనేది యేం ఉల్లాసంగా వుండదు, కాని మీరు అకాలంగా చచ్చిపోతారు అనే యెరుకతో బతకడం వుందే అది నిజంగా అవివేకం….”
యింకో సారి తెరిచిన కిటికీ ముందు కూర్చుని, దూరంగా సముద్రం కేసి చూస్తూ ఆయన హఠాత్తుగా, ముక్కోపంగా అన్నాడు:
“వాతావరణం బాగా వుంటుందనీ, యీ యేడు పంట దిగుబడి బాగా వుంటుందనీ, ప్రేమ వ్యవహారం సజావుగా వుంటుందనీ ఆశిస్తూ బతకడానికీ, ధనవంతుల మవుతామనీ, పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ అయిపోతామనీ ఆశిస్తూ బతకడానికీ మనం అలవాటు పడ్డాం. కాని తెలివైన వాళ్ళుగా అవాలని ఆశించిన వాడెవడూ నాకు తగల్లేదు. మనకి మనమే అనుకుంటాం: చక్రవర్తి మారితే పరిస్థితి బాగుంటుంది, రెండు వందల యేళ్ళల్లో యింకా మెరుగ్గా వుంటుంది అని. యీ శుభఘడియని రేపే తీసుకురావడానికీ యెవళ్ళూ ప్రయత్నించరు. మొత్తంమీద జీవితం రోజు రోజుకీ సంక్లిష్టం అవుతోంది, తన దారిన తను గడుస్తోంది, జనం యింకా యింకా బడుద్ధాయిలవుతున్నారు, జీవితం నుంచి యింకా యింకా దూరం అయిపోతున్నారు.”
నుదురు ముడుచుకుని, ఒక క్షణం ఆగి, ఆయన మళ్ళీ అన్నాడు.
“ఒక మతం వూరేగింపులో అవిటి భిక్షకుల్లాగా.”
ఆయన డాక్టరు. డాక్టరు జబ్బు అతని రోగుల జబ్బు కంటే యెప్పుడూ అధ్వాన్నమే మరి. రోగులు వూరికే బాధపడతారు అంతే, డాక్టరుకి బాధతో బాటుగా తన శరీర నిర్మాణంమీద ఆ జబ్బుకి వున్న వినాశకర ఫలితం గురించి కూడా తెలుస్తుంది. జ్ఞానం మృత్యువుని చేరువకు తెస్తుంది అనడానికి యిదో దాఖలా.
ఆయన నవ్వినప్పుడు ఆయన కళ్ళు చాలా అందంగా వుంటాయి- అప్పుడు వాటిల్లో ఒక స్త్రీత్వపు మృదుత్వం, యేదో మెత్తనిదీ, మార్దనమైందీ వుంటుంది. ఆయన నవ్వులో, దాదాపు యే సద్దూ చెయ్యకుండా, ప్రత్యేకం ఆకర్షకమైందేదో వుంది. నిజంగా ఆయనకి నవ్వడం అంటే సంతోషం. అంత “ఆధ్యాత్మికంగా,” యీ పదాన్ని వాడే అభ్యంతరం లేకపోయినట్లయితే, నవ్వగలిగే వాళ్ళెవరూ నాకు తెలియదు.
అశ్లీలకరమైన కథలెప్పుడూ ఆయనకి నవ్వు తెప్పించలేదు.
ఒకసారి ఆయన ఆహ్లాదరకమైన, దయాన్వితమైన చిరునవ్వు నవ్వుతూ అన్నాడు:
“టాల్ స్టాయ్ మీ విషయంలో అంత చంచలంగా యెందుకు వుంటాడో మీకు తెలుసా? ఆయనకి అసూయ. సులెర్ జీత్ స్కీ మిమ్మల్ని తన కంటే యెక్కువ ప్రేమిస్తాడని. నిజంగా అంతే! ఆయన నిన్న నాతో అన్నాడు: ‘ఇది యెందుకనో నాకు తెలీదు గాని గోర్కీతోటి నేను నేనులాగా వుండలేను. సులెర్ జీత్ స్కీ అతనితో వుండటం నాకు యిష్టం లేదు. అది సులెర్ జీత్ స్కీ కి మంచిది కాదు. గోర్కీ దుష్టుడు. సకల ప్రపంచం పట్ల కసి వుండి, బలవంతంగా సన్యాసి ప్రమాణం తీసుకొనేటట్టు చేసిన భగవచ్ఛాస్త్ర విద్యార్థి లాంటి వాడతను. అతనిది విధినిర్వహణ దూత లక్షణం. అతను యెక్కడినుంచో కనాన్ కి వచ్చాడు. అతని కది పరాయి దేశం. అతను ప్రతిదాన్నీ గమనిస్తూ చుట్టూ చూస్తూనే వుంటాడు, దీన్నంతటినీ తన దేముడెవరికో చెప్పాలని. అతని దేముడు దానవుడు, మన పల్లెటూరి ఆడవాళ్ళు భయపడేలాంటి వనపిశాచమో, జలపిశాచమో.”
చేహొవ్ దీన్ని నాకు చెప్తూ కళ్ళమ్మట నీళ్ళు తిరిగే దాకా నవ్వాడు; కళ్ళ నీళ్ళు తుడుచుకుని అన్నాడు:
“గోర్కీ మంచివాడు” అన్నాన్నేను. కాని ఆయన అన్నాడు: ‘వద్దు, వద్దు, నాకు చెప్పద్దు! బాతు ముక్కు లాంటి ముక్కు వుంది అతనికి, దురదృష్ట వంతులకీ, చిర్రు బుర్రులాడే వాళ్ళకీనే అలాంటి ముక్కు వుంటుంది. ఆడవాళ్ళు అతనంటే యిష్టపడరు.ఆడవాళ్లు కుక్కల్లాంటి ఘాణశక్తి గలవాళ్ళు, వాళ్ళకి యెప్పుడూ మంచి మనిషి యెవరో తెలుసు. సులెర్ జీత్ స్కీ వున్నాడు, అతనికి ప్రజలపట్ల నిష్కామ ప్రేమ అనే అమూల్యమైన వరం వుంది. ఆ విషయంలో అతను మేధావి. ప్రేమించగలిగి వుండడం అంటే దేనికేనా సామర్థ్యం వున్నట్టే….”
కొంచెంసేపు ఆగి చేహొవ్ మళ్ళీ అన్నాడు:
“అవును ఆ ముసలాయనకి అసూయ…. ఆయన అద్భుతమైన వాడు కాదూ?…”
ఆయన టాల్ స్టాయ్ గురించి మాట్లాడినప్పుడు దాదాపుగా యెప్పుడూ ఆయన కళ్ళల్లో, తక్షణం మార్దవంగా, బెరుగ్గా వుండే కనిపించని చిరునవ్వు వుండేది. ఆయన యేదో సున్నితంగా, మాయగా వుండే దాన్ని గురించి మాట్లాడుతున్నట్టూ, బహు జాగ్రత్తగా, ఆప్యాయంగా వ్యవహరించాల్సిన దాన్ని గురించి మాట్లాడుతున్నట్టూ గొంతు తగ్గించేవాడు.
టాల్ స్టాయ్ పక్కన ఆ వృద్ధముని అన్న నిశితమైన, వూహించని, తరుచుగా స్వవచోవ్యాఘాతంగా వుండే మాటలని రాసి వుంచేటువంటి ఎక్కెర్ మాన్ యెవరూ లేకపోయారే అని చేహొవ్ యెప్పుడూ బాధపడుతూ వుండేవాడు.
“మీరు ఆ పనిచేసి వుండాలి” అని ఆయన సులెర్ జీత్ స్కీ ని ఒప్పించ ప్రయత్నించాడు. “టాల్ స్టాయ్ మీరంటే యెంతో యిష్టం, ఆయన మీతో యెంతో మాట్లాడతాడు, అంత అద్భుతమైన విషయాలు చెప్తాడు.”
సులెర్ జీత్ స్కీ గురించి చేహొవ్ నాతో అన్నాడు:
“విజ్ఞుడైన బాలుడు.”
బాగా అన్న మాట.
ఒకసారి టాల్ స్టాయ్ చేహొవ్ కథనొక దాన్ని పొగడ్డం విన్నాను – “ది డార్లింగ్”
అనుకుంటాను.
“శీలవంతురాలైన కన్య అల్లిన లేసులాంటిది అది” అన్నాడాయన. “పూర్వం రోజుల్లో లేసు అల్లే ఆడపిల్లలు వుండేవాళ్ళు. జీవితాంతం వాళ్ళు తమ ఆనంద స్వప్నాలని ఒక పద్ధతిలో అల్లుకునే వాళ్ళు. తమ ప్రియాతి ప్రియమైన కలలని అల్లుకునే వాళ్ళు. వాళ్ళ లేసు ప్రేమని గురించిన అస్పష్ట శుద్ధ అభిలాషతో నిండిపోయి వుండేది.” టాల్ స్టాయ్ నిజమైన ఆవేశంతో, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ మాట్లాడాడు.
కాని ఆ రోజు చేహొవ్కి జ్వరంగా వుంది. ఆయన తల వంచుకుని కూర్చున్నాడు. బుగ్గలమీద రంగు మచ్చలు స్పష్టంగా వున్నాయి. తన పిన్స్-నెజ్ కళ్ళ జోడుని తుడుచుకుంటూ కూర్చున్నాడు. కొంచెం సేపు ఆయన యేమీ మాట్లాళ్ళేదు. ఆఖరికి నిట్టూర్పు విడుస్తూ, మెల్లిగా, యిబ్బందిగా అన్నాడు:
“అందులో అచ్చుతప్పులు వున్నాయి.”
చేహొవ్ ని గురించి చాలా రాయవచ్చు. దానికి సూటి అయిన వివరణ కావాలి, మరి నా లోపం అదే. ఆయన్ని గురించి, ఆయన తన “స్తెప్ మైదానం” రాసుకున్నట్టుగా రాయాలి. అది పరిమళభరిత, స్వచ్ఛ వాయువులు వీచే యెంతో రష్యన్ కథ, ఆలోచనాయుతంగా, తీరని అస్పష్టమైన కోరిక గల కథ. యెవళ్ళదేనా ఆత్మ కథ.
అలాంటి మనిషిని గుర్తుచేసుకోవడం యెవళ్ళకేనా హాయినిస్తుంది. హఠాత్తుగా ఉల్లాసం దర్శించినట్లు వుంటుంది, జీవితపు పరమార్థాన్ని మళ్ళీ అది అందిస్తుంది.
మానవుడు విశ్వానికి అక్షం.
మరి అతని చెడు, అతని లోపాలు? అని మీరగడవచ్చు.
మనం అంతా మనతోటి మనిషిపట్ల ప్రేమ కోసం ఆకలితో వుంటాం. మరి యెవళ్ళకేనా గాని ఆకలిగా వున్నప్పుడు ఉడికీ ఉడకని అన్నం ముద్ద కూడా అమృతంలాగే వుంటుంది.
* * *