మనసును తీవ్రంగా కదిలించినదో…కలిచివేసిందో ఒక వాస్తవికత, దానిచుట్టూ సృజనాత్మకంగా అల్లిన కాల్పనికత ..ఇదే కదా “కథ”అంటే. అందరి బతుకులు ఒక్క తీరుకానట్టు గానే వాటి కథలన్నీ ఒకటి కావు!… ఒక తోటలో పూసిన రంగురంగుల పూవుల్లా, ఒకే చోట జీవించే మనుషులందరూ కలిసిమెలిసి హాయిగా ఎందుకు నవ్వలేరు?
ప్రతి పువ్వు తనదైన పరిమళం వెదజల్లినట్టు ,ప్రతీ మనిషి తనదైన జీవన శైలిలో, సంస్కృతిలో ఏ న్యూనత ,ఏ వెలివేత లేకుండా ఎందుకు మనుగడ కొనసాగించలేడు? ఈ ప్రశ్నలలోంచి, అవి రగిలించే వేదనలోంచి పుట్టినట్లు ఉన్న కథలే అఫ్సర్ కలం నుంచి వెలువడిన “సాహిల్ వస్తాడు “,మరి కొన్ని కథలు.
అప్పటి (1979) నుంచి ఇప్పటి దాకా
పరిచయం అక్కరలేని ప్రసిద్ధ కవి, కథకుడు, జర్నలిస్టు ,సాహితీవేత్త అఫ్సర్. అతని కవితా వాక్యాలు ఎంత బలమైనవో, కథలు కూడా అంతే గాఢమైనవి. ప్రతీ కథ ఒక సంఘటనతో మొదలై మెల్లగా దాని నేపధ్యంలోకి ప్రయాణిస్తూ మొత్తం జీవితాన్ని తడుముతుంది. కథల్లో ఆలోచనాత్మక, కవితాత్మక వాక్యాలు ఎదురై పాఠకుల మనసుల్లోకి చొచ్చుకుపోయి చిక్కని అనుభూతిని అద్దుతాయి.
ఈ కథల్లో అఫ్సర్ అక్కడక్కడ మరో పేరుతో ఎదురవుతూ ఆశ్చర్యపరుస్తాడు.కథకు జీవం పోస్తాడు.
ఈ కథా సంపుటిలో మొత్తం 11 కథల్లో రెండు తప్ప మిగతా తొమ్మిది ముస్లిం అస్థిత్వ వేదన పలికించిన కథలే!
ఈ దేశ పౌరులుగా దేశ స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడి అమరులైన ముస్లింలు ఎందరో ఉన్నా, వారి త్యాగాలు ఎక్కడా కీర్తించబడక పోయినా కనీసంగా గుర్తించబడవు. పైగా దేశ విభజన తర్వాత ఈ దేశంలో సంఖ్యలో తక్కువగా మిగిలిన సమూహపు( మైనారిటీల)దేశ భక్తి అనుక్షణం శల్య పరీక్షకు గురవుతూ ‘ఇతరులు’ గా వేరుచేసే మతరాజకీయలు అన్నీఇన్నీ కావు! “బాబ్రీ శిథిలాలు, గుజరాత్ గాయాలు, ఇంకా చాలా చాలా… మత రాజకీయాల విద్వేష పూరిత చర్యలు, వారి ఆత్మవిశ్వాసాన్ని ఎంతో కుంగదీసాయి, ఎంతో అభద్రతకు , అశాంతికి గురిచేసాయి.నిత్యం చుట్టూ అల్లుకుంటున్న అనుమానాలు, వెక్కిరింతలు, అలుముకుంటున్న అనేక చీకట్లు… వీటన్నిటిని చాలా లోతుగా పరిశీలించిన వాడుగా, కొన్ని అనుభవించిన వాడుగా…వాటినన్నింటిని వేర్వేరు కోణాల్లోంచి మలిచిన కథలివి!
బాబ్రీ మసీదు కూల్చివేత ఒక్కటే కాదు,
దేశంలోని చాలా చోట్ల ముస్లింల పవిత్ర స్థలాలకు చెందిన భూములు,ఖబరస్తాన్ స్థలాలు , చివరికి సొంత ఇంటి స్థలాలు కూడా కావొచ్చు మతం ఆధారంగా ఎంత సునాయాసంగా లాక్కోబడుతున్నాయో చూపించే కథ “గోరిమా”.
ఈ కథలో తనదైన నేలను కాపాడుకోడానికి గోరిమా చేసిన పోరాటం ముస్లింల అస్థిత్వ పోరాటానికి సింబాలిక్ గా అనిపిస్తుంది.ఆ పోరాటంలో ‘తనవాళ్ళు’ ఎవరూ తనకు తోడు రాకపోవడం పరోక్షంగా ముస్లింలలోని రాజకీయ చైతన్య రాహిత్యాన్ని, వారిలోని అనైక్యతను సూచిస్తుంది.
ఈ కథలో కథకుడికి బాల్యంలో అండగా నిలబడిన
గోరిమా, అతడు ఊరికి దూరంగా పెరిగి పెద్దయ్యాక తిరిగి ఊరికి వచ్చాక రైల్వే స్టేషన్ దగ్గర తలవంచుకుని అడుక్కునే స్థితి లో కన్పించడం మనసును మెలిపెడుతుంది.
ఈ గోరిమా “ముస్తఫా మరణం” కథలో ఎదురై కథకునితో ” ఆధ్యాత్మికత అంటే మనిషిని విశాలంగా విస్తరింపజేసేదే కానీ ఇరుకు గదిలోకి ముడుచుకుని మూఢత్వంలోకి లాగేది కాదు.” అంటుంది. ఈ కథ లో ఆమె మాటల్లో ఒక సూఫీ గురువు కనిపిస్తాడు. కుటుంబ బాధ్యతలను తప్పించుకొని ‘బాబా ‘గా మూఢ భక్తి లో జీవితాన్ని అర్థ రహితం చేసుకున్న “ముస్తఫా”లు మనకు చాలా చోట్ల కనిపిస్తారు. వాళ్ళ మరణం కుటుంబం సభ్యులకే ఎంత నిర్లిప్తంగా అన్పిస్తుందో “ముస్తఫా మరణం కథలో చూస్తాం.
ముస్లిం యువకులు అంటేనే ” వయోలెంట్ మైండ్” అనే ముద్ర వేయడం కొత్తేమీ కాదు. పాకిస్థాన్ కు పాత బస్తీలో ఉండే ముస్లిం యువకులను ఏదో ఒక సంబంధాన్ని అంటగట్టి ఎక్కడ ఏ బాంబు పేలినా వారి వంకే అనుమానం గా చూడడం, అక్రమంగా కేసులతో వేధించడం కూడా కొత్తవేమీ కాదు. ఈనేపథ్యంలో సంగీతాన్ని, గజల్ సాహిత్యాన్ని ప్రేమించే సాహిల్, జీవితాన్ని ప్రేమమయం చేసుకోవాలని ఆరాటపడేవాడేగాని, ఇతరులకు హాని కలిగించే ఆలోచన కూడా చేయలేనివాడు. జిగ్రీ దోస్తులతో స్నేహితులతో తన సాయంత్రాలను పంచుకునే ఒక సెక్యులర్ సెన్సిటివ్ ముస్లింకు ప్రతీక అయిన సాహిల్ ఉన్నట్లుండి కనిపించకుండా పోతే అతని స్నేహితుడు రాము , రాము చిన్నారి కూతురు “తితలీ” ఎంత ఆందోళన చెందుతారో, హృద్యంగా వర్ణించే కథ “సాహిల్ వస్తాడు” . ఎంతో కుతూహలం కల్గించే ఈ కథ శీర్షికే మనల్ని నేరుగా కథ లోకి నడిపిస్తుంది.కథ మొత్తం సాహిల్ చుట్టే తిరుగుతుంది కానీ అతనెక్కడా కనిపించడు.ఏమయ్యాడో! ఎప్పుడొస్తాడో! , ఏ కుట్ర కు బలయ్యాడో తెలియదు!కానీ కథ చదువుతూ సాహిల్ ను ఇష్టపడకుండా ఉండలేము.సాహిల్ కుటుంబంపై మనుకు తెలియకుండానే సానుభూతి కలుగుతుంది.కథ చివర్లో “తితలీ” లాగే మనం కూడా ” సాహిల్ వస్తాడు” అని బలంగా అనుకుంటాం. రావాలని కోరుకుంటాం.
అప్పుడే రేకులు విచ్చిన పువ్వుల్లాంటి పిల్లలు, అప్పుడే రెక్కలు విప్పిన “తితలీ” (సీతాకోక)లాంటి పిల్లలు . వారు ఏ మతం రంగు లేనివారు. ఏ మలినం అంటని మనసులు!. వారి సేహ్నానికి పెద్దలు మతం అనీ, “మన ధర్మం గంగనీరు పరధర్మం ఎండమావి”అనీ అడ్డుగోడలు కడితే, వారి ఆటల్లోకి దేవుడిని తీసికొనివచ్చి అడ్డుపెడితే వారి మనసు ఎంత నలిగిపోతుందో “చమ్కీ పూల గుర్రం” కథ చెప్తుంది.
“తెలంగీ పత్తా”ది మరో కథ! శీను తనతో ఆడుకోవడానికి వాళ్ళ అమ్మ అడ్డు చెప్తే” మున్నా” కు నిద్ర పట్టక కలవరిస్తే, వాళ్ళ నాన్న”ఖిల్లా “లోని ఎత్తయిన “ఇరుకు” గోడల మధ్య ఇమడలేక మామిళ్ళగూడెంలో స్వేచ్ఛ గా గాలి పీలుస్తూ బతుకొచ్చు అనుకొంటాడు.కానీ.ఇక్కడ మనుషులు తన కుంటుబాన్ని ‘ఇతరులు’గా, వేరుగా చూస్తే అటు ఉర్దూ, ఇటు తెలుగూ కానీ “తెలంగీ పత్తా” గా మిగిలి నలుగుతూ ఆ తండ్రికీ నిద్ర పట్టదు.
ఫాసిజం ప్రశాంతంగా ఉన్న ఊళ్ళలోకి పాకి అభద్రత ను పెంచుతుంటే కూడా ఏమి పట్టనట్లు ఒక “కంఫర్ట్ జోన్” తలుపు వెనకాలే ఉండిపోయే వాళ్ళ ప్రతి రూపమే “తలుపు వెనకాల” కథలో ‘ఫైజ్’ పాత్ర.
తన “సమూహం “అస్థిత్వం కోసం ఏదో చేయాలనే ప్రయత్నంలో ” మూకదాడి”కి లోనై చివరికి మరణిస్తాడు ఫైజ్ స్నేహితుడు అన్వర్. అతన్ని చివరి సారిగా చూడడానికి కూడా వెళ్ళలేని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.ఫైజ్ లాంటి వాళ్ళు మనలో ఎందరో!
భార్యా పిల్లల ఆకలి తీర్చని చిన్నప్పటి అరబ్బీ చదువు కన్నా, చెప్పులు కుట్టే విద్య చాలా గొప్పదనిపించే కథే “ధేడీ .”ఈ కథ దారిద్ర్య రేఖ కింద నలిగి పోతున్న సగటు ముస్లింల కథ.
కాలం గడుస్తున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతావు. ఒకప్పటిలా పుట్టిన ఊరిలో చివరి దాకా బతికి అదే మట్టిలో కలిసిపోవడం అందరికీ కుదరకపోతే. ఒకసారి పల్లెనుంచి వలస అంటూ మొదలైనాక అది దేశాలు దాటొచ్చు! అప్పుడు మనం హిందువా? ముస్లిమా? అనేది కేవలం సగమే!
మిగితా సగం ఆ కొత్త నేలతో, కొత్త ప్రపంచంతో ఎంత బాగా సర్దుబాటు చేసుకుంటాం అనేది.
అలా మనం మన పరిధిని విశాలం చేసుకునే కొద్దీ ఈ ప్రపంచం అంతా చిన్నదవుతుందని చెప్పేకథ “చోటీ దునియా”.
స్త్రీ, పురుషల జీవితంలో పెళ్లి అనే బంధం చాలా సున్నితమైనది. పెళ్లి మగాడికి తన వాంఛలు ఎలగైనా తీర్చుకొనే హక్కును కల్పించిందని భావిస్తే, “వాంఛ”ను వ్యక్తం చేయడంలో సున్నితత్వం పోయి “పశుత్వం” చేసుకుంటే ఎంత సాంప్రదాయ పరదాల చాటున పెరిగిన స్త్రీ అయినా ఏం చేస్తుంది? తన అక్క అనుభవాలు చెల్లి మనసులో మగాడి పట్ల ఎలాంటి భయాలను కల్గిస్తాయే చాలా సున్నితంగా వివరించే కథే “సహేళీ”.
ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతీ కథ ముస్లింల జీవితంలోని ఒక పార్శ్వాన్ని తడిమేదే. ఈ కథల్లో వేగంగా మలుపులు తిరిగే నాటకీయత కన్నా నిదానంగా ఆలోచింప జేసే జీవన వాస్తవికత ఎక్కువ. చింతకాని నుంచి అమెరికా దాకా అఫ్సర్ విస్తృతమైన జీవితం, అధ్యాపకుడిగా తనకు గల అనుభవం ఈ కథల్లోని పాత్రల చేత సందర్భాను సారం మాట్లాడించడం మనం గమనిస్తాం. ఈ కథలు ముస్లిం సమాజం తను వదిలించుకోవాల్సిన విషయాలను, విశాల చైతన్యాన్ని అలవరచుకోవాల్సిన అవసరాన్ని చెప్తాయి. ముస్లిమేతరులకు ముస్లింల జీవితాల్లోని విషాదాన్ని, వేదనను చూపిస్తాయి. ముఖ్యంగా రేపటి తరాన్ని మత విద్వేషాల ముళ్ళ కంచెల నుంచి కాపాడుకోవాల్సిన అవసరాన్ని చాలా ఆర్తిగా అర్థం చేయిస్తాయి.
Sahil vasthadu —-ok book
But how many times. Book review ///JUST POLITICS