రఫీ అభిమానులకు తెలుగులో వచ్చిన ఓ కానుక

“రఫి ఒక ప్రేమ పత్రం” పుస్తకం రఫీ అభిమానులకు తెలుగులో వచ్చిన ఓ కానుక. మృణాళిని గారు ఈ పుస్తకం కోసం సేకరించిన సమాచారం చాలా వరకు రఫి అభిమానిగా నాకు తెలిసినదే అయినా రఫి పాటలతో హీరోలుగా వెలుగొందిన వారిని, రఫీ తో పని చేసిన సంగీత దర్శకులను స్మరించుకుంటూ రఫీ పాడిన గొప్ప గీతాలను మరో సారి గుర్తు చేసుకుంటూ వెళ్ళడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది ఓ 40 పాటలను (కొన్ని నేను మర్చిపోయినవి కొన్ని ఎప్పుడో ఓ సారి విన్నవి) ఈ సందర్భంగా ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకుని నా కలెక్షన్ కి జత చేసుకోగలగడం ఈ పుస్తకం నాకు కలిగించిన ప్రయోజనం.

పాటల పట్ల ఒకొక్కరిది ఒకో టేస్ట్. కాని ఇందులో కొన్ని పాటలను వ్యాఖ్యానిస్తూ రచయిత్రి చేసిన కొన్ని అబ్జర్వేషన్స్ నా టేస్ట్ కు అతి దగ్గరగా ఉండడం నాకు సంతోషం కలిగించిన మరో సంగతి. బర్సాత్ కీ రాత్ పాటలో రఫీ మధ్యలో వచ్చినప్పుడు కలిగే ఆనందం, ఓ మేరె సోనరే సోనరే పాటలో అతను మధ్యలో వచ్చినప్పుడు కలిగే ఫీల్, గురించి రాస్తూ రఫీ కోసం ఎదురు చూడని శ్రోత ఉండడు అని రచయిత్రి కోట్ చేసినప్పుడు నా గురించే రాసినట్లు అనిపించింది. ఇవే కాదు, చురా లియా హై పాటలో కూడా, బహార్ బన్ కె ఆవూ కభీ అనె రఫీ చరణం కోసమే ఆ పాటను నేను ఎప్పటికీ వింటాను. చుపాకర్ తేరీ ఆంకోమె పాటలో రఫీ పాడే ఆ అతి చిన్న భాగం ఎన్ని సార్లు విన్నా ఫీమేల్ వర్షన్ దాని దగ్గరకు కూడా రాదనిపిస్తుంది. ఈ పాట ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో రావడం నాకు ఎంతో సంతోషానిచ్చింది.

రఫీ కంఠస్వరానికి అందరికంటే కుదిరిన స్వరం గీతాదత్ దేనేమో అని రచయిత్రి రాస్తే నాకు కలిగిన ఆనందం చెప్పనలివికాలేదు. నిజంగా ఇది నేను ఇప్పటి దాకా ఎవరికీ చెప్పలేకపోయిన నా మనసులో మాట.

పుస్తకం ఆఖరున రఫీ పాటలలో కొన్నిటిని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ లో నేను ఇప్పటిదాకా వినని ఓ నాలుగు పాటలున్నాయి. వాటి గురించి ఇచ్చిన వివరణ బావుంది.

గాయకులు ఎందరున్నా, ఎంత మంది పాటలు వింటున్నా రఫి గీతాలిచ్చే ఆనందం ఎంచలేను. చాలా మంది పాత పాటలను మనం ఇష్టపడేది ఆ నాస్టాల్జియా కోసం అంటారు. కాని నాకు ఎనిమీదేళ్ళ వయసులో మరణించిన ఈ గాయకుడి తరువాత ఎందరినో నా కాలెజీ రోజుల నుండి వింటూనే ఉన్నాను. రఫీ పాటలను వినే స్నేహితులు అప్పట్లో నాకు లేరు. కాని ఆ చిన్నప్పటి రోజులనుండి ఇప్పటి దాకా రఫీ నా ఫస్ట్ చాయిస్. అందుకే రఫీ ప్రస్తావన తీసుకువచ్చే ఏ పుస్తకమయినా నాకిచ్చే ఆనందం వెలకట్టలేనిది.

రఫీ గొంతు లేకపోతే ఈ ప్రపంచంలో నాకు ఆనందించే అంశాలు అతి తక్కువ. రఫీ గొంతు, సాహిర్ కలం, ఘంటసాల గానం, మా ఎన్టీవోని నలుపు తెలుపు సినిమాలు, కాసిని టీ నీళ్ళూ ఇవి ఆస్వాదించగల శక్తి ఈ శరీరానికి ఉన్నంతవరకు పర్లేదు బతికేస్తాను.

P. Jyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *