ప్రాణం తీసిన ప్రేమ – ఒరు ఫ్లాష్ బ్లాక్

1980లో SUMMER OF 42అనే అమెరికన్ ఫిల్మ్ చూశాను. విశాఖపట్నంలో, జగదాంబ థియేటర్లో.

పదిహేనేళ్ళ విద్యార్థి ఒకడు స్కూల్ టీచర్ని ఇష్టపడతాడు. ఆమెకి పెళ్ళయింది. భర్త ఎక్కడో యుద్ధరంగంలో ఉంటాడు. కుర్రాడికి కాంక్ష … నవయవ్వనం… క్యూరియాసిటీ… ఆమె కావాలని బలంగా అనిపిస్తుంది. కొన్ని వూరించే చిన్న చిన్న సంఘటనలు… కవిత్వలాంటి విజువల్స్,

వెన్నాడే సంగీతం… సముద్రకెరటాల్లా సినిమా మనల్ని లోనికి లాక్కుపోతుంది.

చివరి సీను: తెగించి, ఒక ఉద్రేకంతో ఆమె ఇంటికి వెళతాడు. చీకటి పడుతున్నవేళ ఆ యిల్లు విచారంగా ఉంటుంది. హాల్లో టీపాయ్ మీద, పేపర్ వెయిట్ కింద వున్న కాగితం ఒకటి గాలికి రెప రెపలాడుతూ వుంటుంది. కుర్రాడు ఆ కాగితాన్ని చూస్తాడు. అది టెలిగ్రాం. ఆమె భర్త చనిపోయాడని కబురు. కుర్రాడు బెరుగ్గా లోపలి గదిలోకి చూస్తాడు. బెడ్రూంలో మంచమ్మీద టీచర్ ఏడుస్తూ వుంటుంది. కొంచెం ముందుకి వెళ్ళి నించుంటాడు.

కొద్దిసేపటికి ఆమె చూస్తుంది. దగ్గరకెళ్ళి

ఆమె చెయ్యి పట్టుకుని అలా వుండిపోతాడు.

వాణ్ణి దగ్గరికి తీసుకుని ఆమె ఏడుస్తూనే వుంటుంది. క్రమంగా వాళ్ళు చేరువ అవుతారు. వోదార్పులాంటి కావలింత. నెమ్మదిగా విషాదమూ కన్నీళ్లూ, కాంక్షా పెనవేసుకుంటాయి. కెరటాల హోరులాంటి సంగీతం… వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు.

ఆ కుర్రాడు ఆమెని అనుభవిస్తాడు.

ఒక విభ్రమంలాంటి షాక్ తో

ఆ చివరి సన్నివేశం చూస్తాము. నేనైతే కుర్చీలో కూర్చోలేకపోయాను. చివరి కొన్ని నిమిషాలు నించునే చూశాను. చాలాసేపటి దాకా తేరుకోలేకపోయాను. దాన్ని ఒక శృంగార సన్నివేశంగా కాకుండా , ఒక జీవన విషాదాన్ని పంచుకున్న కొన్ని అపూర్వమైన క్షణాలుగా తెరమీద పరిచిన తీరు ఎప్పటికీ మరిచిపోలేం. దర్శకుడు రాబర్ట్ మలిగన్ కన్నీళ్ళతో రాసిన కవితయిది.

సమ్మర్ ఆఫ్ 42కి స్క్రీన్ ప్లే రాసిన రౌచర్ అనే రచయిత సొంత అనుభవం యిది. రౌచర్ 1970లో కథరాస్తే 1971లో ఈ సినిమా విడుదల అయింది.

ఆ ఏడాది ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది . సమాజం తట్టుకోలేని ఈ ఉదాత్తమైన అక్రమం పేరు SUMMER OF 42.

…… …… ……

బాలు మహేంద్ర తీసిన ‘కొంటె కుర్రాళ్ళు’ తమిళ సినిమా తెలుగులో 1981లో రిలీజయింది.

పల్లెటూరికి వచ్చిన అందమైన టీచరమ్మని ముగ్గురు తొమ్మిదో క్లాసు కుర్రాళ్ళు యిష్టపడటం – సమ్మర్ ఆఫ్ 42 కథే. తెరమీద ఆ గ్రామీణ సౌందర్యాన్ని బాలు మహేంద్ర కేమెరాలోంచి చూస్తే, కృష్ణశాస్త్రి కవిత కాదు కదా అనిపిస్తుంది. టీచర్ తో విద్యార్థి సెక్స్ చేసినట్టు క్లయిమాక్స్ తీస్తే తమిళ తెలుగు ప్రేక్షకులు బాలు మహేంద్రని నడిరోడ్డు మీద ఉరి తీస్తారు గనక,

చివరి సీను మార్చి దర్శకుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. కొంటె కుర్రాళ్ళలో హీరోయిన్ టీనేజ్ స్టార్ శోభ. ప్రతాప్ పోతన్ హీరో. కథ స్క్రీ ప్లే బాలు మహేంద్ర. హాలివుడ్ కథని చాకచక్యంగా భారతీయ కథగా మార్చారు బాలు.

విమర్శకులు ఈ సినిమా చూసి విస్తుపోయారు.

……… …….. …….

‘కోకిల కన్నడ సినిమా గుర్తుందా?

బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన తొలి కన్నడ సినిమా ‘కోకిల’. 1977లో రిలీజైంది. ఆ ఏడాది జాతీయ ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గెలుచుకున్నాడు బాలు మహేంద్ర. ‘కోకిల’ ఒక బ్లాక్ అండ్ వైట్ వండర్. అందమైన, లేత తమలపాకులా వుండే పదహారేళ్ళ శోభ హీరోయిన్. హీరో కమల్ హాసన్. తమిళ నటుడు మోహన్కి అది మొదటి సినిమా.

1977లో కమల్ హసన్ అంటే… ఆడపిల్లలు తట్టుకోలేని అందంతో మెరిసిపోతున్నాడు.

హీరోయిన్ శోభ పేరు ‘కోకిల’. కమల్ ఒక బ్యాంకులో గుమాస్తా. కోకిల ఎం.బి.బి.ఎస్ చదువుతూ వుంటుంది. పరిచయం ప్రేమ అవుతుంది. కలుసుకోవడం, కాఫీలు, కళ్లల్లోకి చూసుకోవడం… ప్రేమ పరవసిస్తుంది.

అయితే ఒక సెలవురోజు కథని మార్చేస్తుంది.

బ్యాంకు సెలవని కమల్ తన రూంలోనే వుంటాడు. పనమ్మాయి వస్తుంది. ఇల్లు తుడుస్తూ, క్లీన్ చేస్తూ వుంటుంది. యవ్వనంలో వున్న ఆ అమ్మాయి కమల్ కి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఒక ఉద్వేగం అతన్ని నిలవనివ్వదు. పనమ్మాయి (రోజారమణి) చెయ్యి పట్టుకుంటాడు. ఒక శృంగారానుభవం – గిల్టీగా, తప్పుగా, ఘోరమైన నేరంగా అతన్ని చుట్టుకుంటుంది. నాలుగు రోజులైనా కోకిలకి కమల్ కనిపించడు. బ్యాంకుకి వెళ్ళడు. కోకిల కంగారుగా కమల్ రూమ్ కి వెళుతుంది. తాళం వేసి వుంటుంది. ఏమయ్యాడో, ఎక్కడికెళ్ళాడో ఎవరికీ తెలీదు.

మిడిల్ క్లాసు మొరాలిటీకి కట్టుబడిన హీరో, రోజా రమణిని తీసుకుని ఒక మారుమూల గ్రామానికి వెళిపోతాడు. వాళ్ళకో పాప పుడుతుంది.

చివరి సీను : ఒంట్లో బాగోని పాపని ఎత్తుకుని, గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి వెళతాడు కమల్.

అక్కడ డాక్టర్ హీరోయిన్ శోభ… చూస్తుంది. మందులు రాసి యిస్తుంది. పాప పేరేంటి? అని అడుగుతుంది. ‘కోకిల’ అని చెబుతాడు కమల్. అవాక్కయినా, ఆమె నార్మల్గానే వున్నట్టు నటిస్తుంది. సినిమా అయిపోతుంది. ఒక ఉదాత్తమైన ప్రేమ వోడిపోతుంది! (కోకిల సంగీత దర్శకుడు సలీల్ చౌధురి)

….. …… …….

1978 : గొప్పదర్శకుడూ, స్టార్ ఫోటోగ్రాఫర్,

పెళ్లయి, ఒక కొడుకు వున్న బాలు మహేంద్ర హీరోయిన్ శోభని పెళ్ళి చేసుకున్నాడు.

అప్పుడు సౌతిండియన్ సూపర్ స్టార్ శోభ.

వయస్సు పదహారేళ్ళు. బాలనటిగా, నవయవ్వనం తొణికిసలాడుతున్న టాలెండెడ్ హీరోయిన్ గా

25 సినిమాల్లో నటించి, చికిలి చూపుతో, వెలిగే చిరునవ్వుతో దక్షిణ భారతదేశాన్ని పాదాక్రాంతం చేసుకున్న ఒక పరిమళవు తుఫాన్ శోభ!

నా శోభని నాకు దూరం చేసినందుకూ, నాలాంటి లక్షలమంది అభిమానులకూ ఏమీ కాకుండా చేసినందుకూ బాలూమహేంద్రని నేను చాలా

ఏళ్ళు క్షమించలేకపోయాను, కుర్రతనం వల్ల!

……. ….. …..

1979 రానే వచ్చింది. అది చాలా మఖ్యమైన సంవత్సరం, శోభ జీవితంలో, దక్షిణ భారత సినీ చరిత్రలో…. శోభ హీరోయిన్ గా ‘పసి’ అనే తమిళ సినిమా వచ్చింది 1979లో.

దురై అనే అతను దర్శకుడు. ‘పసి’ అంటే ఆకలి.

ఆ సినిమా తమిళనాడులో బీభత్సమైన హిట్.

శోభ మాత్రమే… శోభ ఒక్కతే !

శోభ సహజ నటనా విశ్వరూప సాక్షాత్కారం ‘పసి’.

ఆ ముక్కుపచ్చలారని చిన్నవయస్సులో జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపిక అయింది.

అన్ని భాషల్లో, జాతీయ పత్రికలన్నీ శోభ గురించి రాశాయి. శోభ అసలు పేరు మహాలక్ష్మీ మీనన్. మళయాళ తల్లిదండ్రులకు మద్రాసులో పుట్టింది. Simply a Sridevi in the Making.

14-15 ఏళ్ళకే హీరోయిన్. తెలుగులో ‘తరం మారింది’ (1977)లో నటించింది. మనవూరి పాండవులు (1978) లో పిచ్చిపిల్ల ఈ శోభే.

1962 సెప్టెంబర్ 23న పుట్టిన శోభ, 15 ఏళ్ళకే, 1977 నాటికే సూపర్ స్టార్డమ్ సాధించింది. గొప్ప ఆర్టిస్ట్ అని యావత్ చిత్రపరిశ్రమ గుర్తించింది.

బాలు మహేంద్రతో పెళ్ళయినా వరసబెట్టి సినిమాలు చేస్తూనే వుంది. అప్పట్లో ఒక సావిత్రి, ఒక రేఖ సినిమా రిలీజ్ అంటే ఎంత ఉద్వేగంతో ఎదురు చేసేవాళ్ళో, శోభ సినిమా అంటే అంతే

Expectation తో వుండేవాళ్ళు ప్రేక్షకులు.

…… ….. …..

మన ఫోటోగ్రాఫర్ అసలు పేరు బాలనాధన్ బెంజిమన్ మహేంద్ర. శ్రీలంకలోని బట్టికలోవలో పుట్టాడు. తండ్రి కాలేజీ ప్రొఫెసర్. బాలు లండన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు. 1969లో ఫిల్మ్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేశాడు.

బాలు రావడం రావడమే సంప్రదాయ ఫిల్మ్ ఫోటోగ్రఫీ సూత్రాలని బ్రేక్ చేశాడు. చాంతాడు డైలాగులు, అరుపులు కేకల్ని ఎత్తి అవతల పారేశాడు.

బాలూది అబ్సెసివ్ కంపల్సరీ విజువల్ నేరేటివ్. తక్కువ మాటలు… అంటే డైలాగ్ అనేది రెండోస్థానంలోకి వచ్చింది. ప్రధానమైన మూడో అంశం నేచురల్ లైటింగ్. ప్రకృతీ, పరిసరాలూ, మనుషుల మొహాలూ సహజమైన కాంతిలో… సమ్మశక్యం కానంత నేచురల్ గా వున్నాయంటే ..

అది బాలూమహేంద్ర సినిమా!

…… …… …….

‘మూండ్రాంపిరై’ చూశారా?

అదే తెలుగులో వసంత కోకిల.

శ్రీదేవి, కమల్ హాసన్, సిల్క్ స్మిత, సుబ్రమణి అనే చిన్నకుక్కపిల్ల, ఆకాశాన్ని తాకే పొడవాటి ఊటి చెట్లు.. ఏదీ మరిచిపోలేం, ఆ సినిమాలో.

దర్శకుడూ, ఫోటోగ్రాఫరూ బాలుమహేంద్ర.

పచ్చని కొండల మీద కమల్ హసన్, సిల్క్ స్మిత డాన్స్, పాట… శృంగారమూ, సౌందర్యమూ పెనవేసుకున్న ఒక విజువల్ ట్రీట్.

గమనిస్తే , ఒక మేథమెటికల్ ప్రిసెషన్

వుంటుంది ఆ కదలికల్లో, నృత్యంలో!

1982లో తిరుపతిలో రచయిత పతంజలి గారితో కలిసి చూశాను ‘మూండ్రాంపిరై’.

…… …… ……

మణిరత్నం అనే దర్శకుడు వెండితెర మీదికి ఒక కళాత్మకమైన వెల్లువలా రావడానికి ముందు,

దారిలో తుప్పల్ని రాళ్ళనీ తొలగించి, గోతులుపూడ్చి, పూలమొక్కలు నాటి సినీ రహదారిని సువిశాలం చేసినవాడు బాలు మహేంద్ర. భారతీయ తెరకి

కొత్త అందాల్ని అద్దినవాడూ, కొత్త దర్శకులకు

దారిదీపమై వెలిగినవాడూ బాలూ మహేంద్ర!

ఓ పూవు పూసింది

1980 – ఏప్రిల్ నెల : ఢిల్లీలో జాతీయ అవార్డుల మహోత్సవం. ‘పసి’ లో సూపర్లేటివ్ పెర్ ఫార్మెన్స్ కి జాతీయ ఉత్తమ నటి అవార్డు.

లిటరల్ గా మబ్బుల్లో తేలుతోంది శోభ.

పట్టుమని పద్దెమిది ఏళ్ళు కూడా నిండని ఒక పసిదానికి ప్రతిష్టాత్మకమైన జాతీయ గుర్తింపు!

ఢిల్లీ వెళ్ళింది. అవార్డు అందుకుంది. శోభ విజయాన్ని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ సెలబ్రేట్ చేసుకుంది. పూలగుత్తులు అందుకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ చెన్నై వచ్చింది శోభ.

అభిమానులకీ, చిత్ర పరిశ్రమలో అందరికీ

శోభే కావాలి .

శోభకి మాత్రం ఒకే ఒక్క బాలుమహేంద్ర కావాలి.

భర్త, గురువు, తండ్రీ… అన్నీ అతనే!

ఆమెది…. సుకుమారమూ సౌందర్యమూ కలిసిన

ఒక అలవిమాలిన అందం. ఎలాంటి ఎమోషన్ని అయినా క్షణాల్లో సహజంగా పలికించే సామర్థ్యం

ఈ రెండు అద్భుతాలు కలిస్తే అదొక శోభాయమానమైన అనుభవం… ప్రేక్షకుడికి!

కేమెరాకవి, ఆరితేరిన స్క్రీన్ ప్లే రచయిత, కమర్షియల్ సినిమాని కవిత్వంగా మార్చిన దర్శకుడూ, వెండితెరకి కొత్త భాషని నేర్పిన గురువూ….. ఒకటా! అయిదారు అద్భుతాలు

ఒకే ఒక్క బాలూ మహేంద్ర.

వీళ్ళిద్దరూ గాఢమైన ప్రేమికులు.

నిజజీవితంలో హీరో హీరోయిన్లు. భార్యాభర్తలు….

అయినా, ఆ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు.

ఓ పూవు రాలింది.

ఆ రోజు రానే వచ్చింది.

తోసుకొచ్చింది అంటారు పెద్దాళ్ళు.

1980 ఏప్రిల్ 30వ తేదీ… శోభ ఫోన్ చేసింది.

బాలుమహేంద్రని ఇంటికి రమ్మనింది. వస్తాను… కొంచెం లేట్ గా వస్తాను – అన్నాడు.

మళ్ళీ ఫోన్ చేసింది….. మళ్ళీ….. మళ్ళీ అసహనంతో ఇంట్లో అటూయిటూ తిరిగింది.

మరోసారి ఫోన్ చేసింది. తొమ్మిదేళ్ళ కొడుకున్నాడు నాకు, వాణ్ణి చూసుకోవాలి అన్నాడు బాలూ.

వెయిట్ చేసింది. వస్తాడనుకుంది.

రాత్రి గడిచిపోతోంది. అతని జాడలేదు.

18 ఏళ్ళు కూడా నిండని చిన్నపిల్ల విలవిల్లాడిపోయింది. మద్రాసులోని ఆర్కేనగర్… శోభ ఇంట్లో నిశ్శబ్దం… కన్నీటి పర్యంతమైంది శోభ. ఆమెని ఒక ఆవేశం సుడిగాలై చుట్టుకుంది. చేతికందిన జార్జెట్ చీరని తీసుకొని,

ఫేన్ కి ఉరివేసుకుంది.

తెల్లవారింది. మే ఒకటవ తేదీ…

ఇంట్లో శోభ చనిపోయి వుంది.

ప్రేమ కోసం పరితపించిన ఒక బంగారు పిచ్చిక

ఎటో ఎగిరిపోయింది.ఈ

విషాదవార్త చెన్నైలో భూకంపం పుట్టించింది.

వేలమంది జనం శోభ ఇంటికి చేరుకున్నారు.

బాలు మహేంద్ర నేరస్తుడని అన్నారు…

దర్యాప్తు జరిగింది. ఆత్మహత్య అని కన్ఫర్మ్ అయ్యింది. దిక్కుతోచని బాలు మహేంద్ర ఒంటరిగా మిగిలి పోయాడు. ఒక కవి హృదయాన్ని పసిపాదాల్తో నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ వెళిపోయింది శోభ.

కవి ఇస్మాయిల్ గారు, ‘ఆత్మహత్య’ అని ఒక చిన్న పోయం రాశారు. ” తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని పీకిపారేసి ఈ పిల్ల చకచకా ఎటో నడిచి వెళిపోయింది.”

శోభ చనిపోయిన రెండేళ్ళ తర్వాత, దర్శకుడు కె.జి. జార్జి, ఆమె కథనీ, విషాదాంతాన్నీ సినిమా తీశాడు. ఆ మళయాళ సినిమా పేరు ‘లేఖాయుడే మరణం ఒరు ఫ్లాష్ బ్యాక్’. ఆ సినిమాలో హీరోయిన్ పేరు శాంతమ్మ లేఖ. అందుకే ఆ పేరు.

శోభ వెళ్ళిపోయాక, మళ్ళీ ప్రేక్షక జనాలనీ, దక్షిణ భారత చిత్రరంగాన్ని దిగ్భ్రాంతి పరిచి, కకావికాలు చేసిన సంఘటన సిల్క్ స్మిత ఆత్మహత్య ఒక్కటే!

రెండు జాతీయ అవార్డులు, లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, అనేక ప్రాంతీయ అవార్డులు పొందిన బాలూ మహేంద్ర, 74 ఏళ్ళ వయసులో, 2014 ఫిబ్రవరి

14న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన గౌరవార్థం తమిళ సినీ పరిశ్రమ ఆ రోజు బంద్ పాటించింది.

శోభ… బాలూ… ఏది ఆనందం? ఏది విషాదం?

ఏది ప్రేమ? ఏది సాఫల్యం?

ఏది విజయం? ఏది వైఫల్యం?

ఈ పడవ ఏ తీరానికి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *