పుష్పవర్ణమాసం

Spread the love

ఆ  రోజు  నా మేనకోడలికి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. మా గ్రామ దేవత కామాక్షమ్మ గుడికి ఎడం చేతి వైపున వుంటుంది సుబ్బరాయుని పుట్ట. అందరం అక్కడ చేరాం. పుట్టు వెంట్రుకలు తీస్తుంటే, పిల్ల పాపం ఘోరంగా ఏడ్చేస్తుంది. కొందరు పొంగళ్ళు పొంగించేందుకు  పొయ్యి పెట్టడం కోసం రాళ్ళు వెదుకుతున్నారు. మా గుడి ఆవరణ అంతా పరుచుకుని గల గల లాడుతూ, ఎండలో  వెండిలా మెరిసిపోతూ  వుంటుందో పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ ఎత్తుగా కట్టిన అరుగు వుంటుంది. పుట్ట దగ్గర జరుగుతున్న తతంగాలకి చిరాకు వచ్చి, నేను వెళ్లి ఆ అరుగు పైకి చేరి, మందిరం  ఆవరణలో అక్కడక్కడా తచ్చాడుతున్న భక్తుల్ని  చూస్తూ కూర్చున్నా.

గుడికి కుడి వేపున వున్న మండపంలో   స్తంభానికి ఆనుకుని ఎవరో ఒకామె  కూర్చుని వుంది. గొప్ప అందంగా వుంది. నేను అద్దాలు తీసి తుడిచి పెట్టుకుని మళ్ళీ చూశా. దానిమ్మ పువ్వు రంగు ఝరీ  చీరలో కొంత వాడిన మొగలిపువ్వులా వుంది. ఆవిడ వొంటి రంగు, చీర రంగుల అద్భుత సమ్మెళనమో, మరోటో, వద్దన్నా బలవంతంగా తనవైపుకి లాగేస్తుంది ఆమె  సౌందర్యం. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరీవిడ?  ఇంతక ముందెప్పుడూ ఇక్కడ  చూడలేదే … ? ఎవరినడగాలి ఈవిడ గురించి … ఆలోచిస్తుంటే  విఘ్నేస్వరుడి మందిరం లో నుండి బయటకొచ్చాడు చిన్న పూజారి శేషాచార్యులు . శేషు చిన్నప్పుడు నా ఆటల పాటల  జట్టులో ప్రధాన సభ్యుడు. నా కంటే ఏడెనిమిదేల్లు  చిన్న వాడు. వాడిని పిలిచి గుసగుసగా “ఏం శేషు! ఏంటి సంగతి ఈ మధ్య తపస్సులూ గట్రా మొదలెట్టావా ఏంటి? దేవకన్యలని గుడికి రప్పించావ్” అన్నా. తలా తోక లేని నా మాటలకి  అచ్చు చిన్నప్పట్లానే వెర్రి ముఖం ఒకటి పెట్టేసి, “దేవకన్యలేంటి పెద్దక్కా?” అన్నాడు ఆశ్చర్యపడిపోతూ, నేను ఇంకా గుస గుస పెంచి, అదిగో ఆ మండపం లో స్తంభానికి ఆనుకుని కూర్చుని వుందే ఎవరేమిటి  ఆవిడ దేవకన్య కాకపోతే” అన్నాను. అది విని శేషు ముఖం వికాసంగా పెట్టి “దేవకన్య కాదు పెద్దక్క, దెయ్యం” అన్నాడు పూలు కొబ్బరిచిప్ప  చేతిలో పెడుతూ.

అప్పుడే అటోచ్చిన మా అత్త   “పెద్దమ్మాయ్  నడువ్, నడువ్ ఎక్కడకొస్తే అక్కడ స్నేహితులు, మాటలూ…అందరూ నీ కోసం వెతుకుతున్నారు” అన్నది. నేను అరుగు దిగి అత్త వెనకాలే నడుస్తూ ఆవిడను చూసాను. అదే ఫీలింగ్. దానిమ్మ పూరంగు పట్టుబట్టలో చుట్టిన మొగలి పూపొత్తిని చూసినట్లు. ఆవిడ దెయ్యమేంటి, ఈ శేషుకి చిన్నప్పట్నుంచి వేపకాయంత వెర్రి వుంది.ఇప్పుడది తాటికాయ అయ్యుంటది. మా  గుడికి దయ్యం పట్టిన వాళ్ళని చాలా మందినే తీసుకొస్తుంటారు. చాలా మంది నయమై కూడా వెళ్తుంటారు, కానీ వాళ్ళెవరూ ఈవిడలా శుభ్రంగా వుండరు, ఎందుకో ఆవిడతో మాట్లాడాలనిపించింది. ఆవిడ సౌందర్యం వల్లనేమో…మా అత్త చేతి నుండి నా చేతిని విడిపించుకుని ఇదిగో అత్తా నీ వెనకే వచ్చేస్తా గానీ నువ్వు  పద అని మండపం వైపు నడిచా.

పువ్వులా ఆ స్తంభానికి ఆనుకుని కూర్చుని వుంది ఆవిడ, నిశ్చలంగానో, పరధ్యానంగానో. నేను నిశ్శబ్దంగా, ధ్యానానికి వచ్చిన భక్తురాల్లా ఆవిడకి కొంచం ఎడమగా  కూర్చుని, శేషు  ఇచ్చిన కొబ్బరిచిప్ప  పగలకొట్టడం మొదలుపెట్టాను. ఆవిడ పరిసర స్పృహలో లేదు. దగ్గరగా ఇంకా బాగుంది. రింగుల జుత్తు, నిండు నవ్వు పెదవులు.

కాసేపటికి చేతికొచ్చిన చిన్న కొబ్బరి ముక్క ఆవిడ వైపుకు సాచి, పరిచయపూర్వకంగా నవ్వుతూ “తీసుకోండి” అన్నాను. ఆవిడ చిర్నవ్వి “థాంక్ యు” అంది.  అమ్మయ్య ఈవిడ  దయ్యం కాదు దేవతే. కానీ పలకరించడం  ఎట్లా?  కాస్తా బలంగా  ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి “మాది ఈ ఊరే. కానీ, మిమ్మల్ని ఇంతకు  ముందు ఎప్పుడూ ఇక్కడ చూసినట్టు జ్ఞాపకం లేదు” అన్నాను. ఆవిడ నా మాట విని, పల్లవి అసలే లేని పాటలా “ఇంతకు ముందు ఎప్పుడూ ఇక్కడికి రాలా నేను! దయ్యం పట్టిందట నాకు! దయ్యం పట్టాలని  నేను గాడాతి  గాడంగా కోరుకుంటున్నానూ… అయినా పట్టడం లేదు అని చెప్పా. ఎవరూ వినలా. ఇక్కడ తెచ్చి వదిలారు. కానీ నాకిక్కడ బాగుంది. సందె వాలిందంటే చాలు ఆ చెట్టు పైకి ఎన్ని పక్షులొస్తాయో తెలుసా. అతనితో పాటూ అట్లాగే వచ్చేవి రకరకాల పక్షులు, రంగు రంగులవి, సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను” అన్నది.

నాకు అయోమయం అనిపించింది. ఏం మాట్లాడుతుందీవిడ, శేషు చెప్పినట్లు ఈవిడ తేడానేనా ?కానీ టూ క్యూరియస్. అందుకే తల ఊపి “మీరు భలే అందంగా వున్నారు. ఎంతసేపైనా చూడాలనిపించేట్టు…ఇంతకీ ఎవరతను” అన్నాను

“ఎవరూ”

“అదే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, సౌందర్యాన్ని వెంట తెచ్చేవాడని అతను.”

“ఓ! అతనా, అతను దయ్యం! , పేరు నాక్కూడా తెలియదు”

నేను ఆశ్చర్య పడ్డాను. తల ఒకసారి విదిలించి, వెళ్దామా అని ఆలోచించాను. పగలు మద్యాహ్నం లోకి  జారబోతుంది. సుబ్బారాయుడి పుట్ట దగ్గర, పొయ్యికి మూడురాళ్ళు దొరికినట్టే వున్నాయి సన్నటి పొగ లేస్తుంది. ఎందుకో పోలేక ఆగి, ఆవిడ వైపు చూసి “దయ్యాలు ఉన్నాయంటారా?” అన్నాను. ఆవిడ “దయ్యాలున్నాయి, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్లకి కనిపిస్తాయి” అన్నది. పుష్ప వర్ణ మాసమా…! అదేం మాసం? నేనెప్పుడూ వినలేదే ఆ పేరు, బహుశ   పుష్య మాసాన్ని ఈవిడిట్లా చెప్తుందేమో అనుకుని, “అవునా… ఎక్కడ చూసారు దయ్యాన్ని మీరు?” అన్నాను.

ఆవిడంది “ఒకరోజు మధ్యాహ్నం పన్నెండూ అట్లా అయి వుంటుంది. వైశాఖ మాసపు చివరి రోజులవి. నా పడక గదిలో దిళ్ళకి ఆనుకుని, కిటికీలోంచి చూస్తూ వున్నాను. పెద్ద కిటికీ మాది. కిటికీ లోంచి లోపలికి రావడానికి తెగ ప్రయత్నిస్తూ వుంటుంది సంపెంగ చెట్టు. ఆ పువ్వుల రంగూ, మధురమైన ఆ  వాసన ఎంత బాగుంటాయో. దాని వెనక జామ చెట్టు, బాగా పెద్దది. మా అత్తగారు కాపరానికి వచ్చినప్పుడు వేసిందట. అది కూడా పూత పూసింది. తెల్లటి జామి పూలు. దాని వెనక మామిడి చెట్టు. ‘బేనిషాన్’. బోలెడు కాపు కాసింది ఆ ఏడాది. గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతున్నాయ్. ఆ అందమైన వర్ణాల కలివిడి ఎంత బాగుండిందో, చూస్తూ కూర్చున్నాను.

చాలా సేపటి నుండి ఒక కోయిల ఆర్తిగా, అదే పనిగా ఎవరినో పిలిచినట్టు కూస్తుంది. నేను లేచి, సరిగా కూచుని మామిడి చెట్టులో మూల మూలలా కోయిలని వెతకడం మొదలెట్టాను. అదిగో అప్పుడు చూశాను ఆ దయ్యాన్ని … అదే అతన్ని. కోయిల అతని భుజం పైనే వుంది. మొదట నాకేం అర్ధం కాలేదు. చెట్టు గుబురులో ఆకుల్లో ఆకులా అతను. ధ్యానంగా, ఎక్కడో దూరంలో నిమగ్నమై, శరీరం  మాత్రం అక్కడ వున్నట్లు. నేనేమైనా భ్రమ పడుతున్నానా? లేచి టేబిల్ పైన నీళ్ళు తీసుకుని తాగి, గదిలోనే మూడు నాలుగు సార్లు అటూ ఇటూ నడిచి, మళ్ళీ  వచ్చి చూశాను. అతను అక్కడే, అట్లానే వున్నాడు. చుట్టూ  పింద, దోర మామిళ్ళు, భుజం పైన కోయిల, ఆకులు గాలికి అటూ ఇటూ కదుల్తుంటే అతనిపై  పరుచుకుంటున్న వెలుగునీడల తారాటలు… ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎంత సుందరమైన దృశ్యం కదా అది అని.

మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్ళకి దయ్యాలు కనిపిస్తాయని. మా అమ్మ కూడా అదే మాసంలో పుట్టింది. ఎంత బాగుండేదో మా అమ్మ. మొక్కల్ని, సీతాకోకల్ని,ఆకాశాన్నీ, ఆరుద్రల్నీ, వాన చినుకుల్నీ అన్నింటినీ ప్రేమించేది, తియ్యగా పాడేది, గొప్పగా రాసేది. ఎంత బాగుండేదో తెలుసా! బహుశా మా అమ్మమ్మ ఆ మాసంలో పుట్టలేదనుకుంటా ఆవిడ నగల్ని, వాహనాల్ని, నౌకర్లు చాకర్లు ఉండే మేడల్ని ప్రేమించేది. మా అమ్మ చీటికి మాటికీ మా నానతో గొడవపడి, నన్ను తీసుకుని మా అమ్మమ్మ దగ్గరకి వెళ్ళేది. కానీ మా అమ్మమ్మ మళ్ళీ మా అమ్మని నాన దగ్గరికే  పంపేసేది. ఒకసారి మా అమ్మ చచ్చిపోయింది. అప్పటి నుండి నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగా. మా అమ్మమ్మ, నేను కూడా పుష్ప వర్ణ మాసంలోనే పుట్టినందుకు బాగా దిగులు పడేది. ఆ దయ్యాన్ని చూడగానే నాకు అదంతా గుర్తొచ్చింది.

అట్లా నేను దాదాపు ఒక వారం రోజులు ఆ దయ్యాన్ని చూస్తూ వుండేదాన్ని. చూస్తూ చూస్తూ వుండగా నాకో రోజు అతన్తో మాట్లాడాలనిపించింది. ఏం చెయ్యాలి ఎలా అతని దృష్టి నా  వైపుకి తిప్పుకోవాలి. ఆలోచించి, ఆలోచించీ చివరికి  పని వాళ్ళని రప్పించి, దోర మామిళ్ళను కొయ్యమని చెప్పా. నేను ఆశించినట్టే ఆ మనుషుల అలజడికి అతను ధ్యానంలోంచి బయటకొచ్చాడు.

దయ్యాలలో మనీశ్వరుడు అనే దయ్యాలు కూడా ఉంటాయట. అవి ఎప్పుడూ మౌనంగా ఉంటాయట మా ఊర్లో చెప్పేవాళ్ళు. ఇతను అది కాదు కదా అనుకుంటూ, “మీరు నాకు కనిపిస్తున్నారు అదిగో ఆ గదిలోంచి మిమ్మల్ని చూశా, మీతో మాట్లాడాలని వుంది” అని చెప్పా. అతను తల వంచి ఎత్తైన ఆ చెట్టు పైనుంచి నన్ను చూశాడు. ఆ తరువాతి  నిమిషంలో అతనక్కడ లేడు. ఎంత గుచ్చి గుచ్చి,కొమ్మ కొమ్మా వెతికినా, అతను అక్కడ కనిపించలేదు. నా మాటలు విని, మామిడికాయలు కోస్తున్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నానేమో  అనుకున్నారు. నేను గబగబా నా గదిలోకి  వచ్చి  అక్కడినుండి చూశా. అతను లేడు. ఆ తరవాత నుండీ ప్రతి రొజూ అతని కోసం వెతికా. మధ్యాహ్నం పూట కదా అతను నాకు కనిపించింది. అందుకని, ప్రతి మధ్యాహ్నమూ అది పనిగా వెతికేదాన్ని. కానీ  అతను మళ్ళీ కనిపించలేదు.

ఒకరోజు పగలంతా బాగా ఎండ కాసింది, రాత్రి ఏడూ ఎనిమిది అవుతుండగా వర్షం మొదలయింది. ఉరుములూ, మెరుపులతో  ఆకాశం ఎర్రగా మెరుస్తూ ఉగ్రరూపమెత్తింది. రాత్రంతా వర్షమే. వర్షాన్ని వింటూ నిదురపోయాను. పొద్దుట లేచి చూద్దును కదా, ఎంత బీభత్సమో… ! మామిడికాయలు పిందెల తో సహా రాలి పొయ్యాయి. ఆకులూ, అక్కడక్కడా రాలి పడిన కొమ్మలూ… గొప్ప యుద్ధక్షేత్రంలా వుంది అక్కడంతా. అదిగో ఆ రోజు మధ్యాహ్నం, మళ్ళీ చూశా అతన్ని. ఎంత దిగులో  ముఖం నిండా, గబ గభా లేచి, చెట్టు క్రిందకి వెళ్ళా. రాత్రి వర్షానికి తడిసి జడిసిన పక్షులు అతని దగ్గర సేద తీరుతున్నాయ్. నేను తల పైకెత్తి “ఇన్ని రోజులు రాలేదే, ఏమయ్యారు?” అన్నాను. అతను నన్ను చూశాడు. నేను అతన్నే చూస్తూ వున్నాను. చూస్తూ ఉండగానే, బోర్డు మీద వేసిన బొమ్మ డస్టర్తో చెరిపేస్తే ఎలా చెరిగిపోతుందో అలా చెరిగిపోయాడు. పక్షులు మాత్రం మిగిలాయి.

నాకు ఏడుపొచ్చింది. గదిలోకొచ్చి మామిడి చెట్టు వంక చూస్తుంటే, ఎందుకో తెలీదు… రాత్రి కురిసిందే ఉదృతమైన వర్షం, ఉరుముల మెరుపుల వర్షం, అట్లా వచ్చింది ఏడుపు. గది తలుపులు భిగించి, పెద్ద పెట్టున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుని ఏడ్చుకుని పడుకున్నాను. బహుశా గంట తర్వాత అనుకుంటా మెలకువ వచ్చింది. మామిడి చెట్టు వంక చూడటానికి తల తిప్పానో లేదో, నా కిటికీ దగ్గరగా ఊచల్ని పట్టుకుని, సంపెంగ పూచెట్టు కొమ్మ పైన కూర్చొని వున్నాడు అతను. నా మెలుకువ కోసమే చూస్తున్నట్లు, ఆత్రుతగా “ఎందుకు ఆ ఏడుపు?” అన్నాడు. నేనతన్ని చూశాను. యధావిదిగా అతని చుట్టూతా పక్షులు, సీతాకోకలూ, ఇప్పుడు సంపెంగలూ…చూసి చూసి, అతన్ని కళ్ళనిండుగా నింపుకుని “తెలీదు” అన్నాను. అతను నిశ్శబ్దంగా మామిడి చెట్టు వంకే చూసి, చాలాసేపటికి “ఒకటేరోజుటి వర్షం, చెట్టు చూడండి ఎట్లా అయిపోయిందో పిచ్చిదానిలాగా” అన్నాడు. అతని ముఖం నిండుగా దిగులు.

అట్లా మొదలయింది మా పరిచయం. అతను ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష’ మాట్లాడేవాడు. మొదట్లో ఆ భాష నాకు అర్ధమయ్యేదే కాదు. తరువాత నెమ్మదిగా నేర్చుకున్నాను. ఆ భాష, అతని మాటా ఎలా ఉంటుందంటే, అతనితో మాట్లాడిన తరువాత హృదయం, చినుకులతో తడిసిన పుడమిలా మారేది.

ఆ కొత్తల్లోనే ఒకసారి అడిగా “ఈ ఇంటితో మీకేమైనా అనుభందమా?” అని. ఎందుకడిగానో నిజంగా నాకూ తెలీదు. ఆ ప్రశ్న వినగానే అతను దిగులుగా తలవాల్చి “ఈ ఇంట్లో తనుంది” అన్నాడు.

“తనంటే?”

“నేనూ తనూ ప్రేమించుకున్నాం, కోతకొచ్చిన పంటని ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుందే …అట్లా వాళ్ళ  ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చేసేసారు. ఆ తరువాత నించీ నేనిట్లా. ఈ మామిడి చెట్టు వున్న చోటే. ఏడు మామిడి చెట్లు  పెరిగీ …మరణించీ  … పెరిగాయి. కానీ ఆవిడ ఆ  ఇంట్లోంచి బయటకు రాదు ఎంత ప్రార్దించినా……..” అతని కళ్ళలో నీళ్ళు. ఎలా ఓదార్చను అతన్ని.

నాకు హట్టాత్తుగా గుర్తొచ్చింది. నా పెళ్ళైన కొత్తల్లో ఓ మధ్యాహ్నం తలారా స్నానం చేసి, ఎందుకో ఏడుస్తూ వట్టి గచ్చు మీదే పడుకున్నా. గచ్చు మీద పరుచుకుని నా జుత్తు. ఎందుకో, ఆ మగతలో ఎవరో తెల్లగా ఇంత పెద్ద కన్నులున్న ఒకావిడ చల్లగా నా నుదుటిని, జుట్టుని నిమిరినట్టు, నా దుఖాన్ని ఒదార్చినట్టు భ్రాంతి కలిగింది. మా అమ్మేమో అనుకున్నాను అప్పుడు. కానీ కాదు. ఆవిడ, ఇతను చెప్పే ఆవిడ. అతనితో  అన్నాను “ఆవిడ తెల్లగా ఉంటారా” అని. అతను దుఃఖంలోంచి ఒత్తిగిలి “తను మేలి ముత్యం లాగుంటుంది” అన్నాడు మురిపెంగా. అంతే ఆ తరువాత మా మధ్య ఆ సంభాషణ మళ్ళీ ఎప్పుడూ రాలేదు.

అతను ఎంత పురాతనుడో, ఎప్పటి వాడో, ఎక్కడి వాడో నాకేం అవసరం? నేనేం చేసుకుంటా ఆ వివరాలన్నీ? అదీకాక దుఃఖంతో నిండిపోయిన అతని గతాన్ని నేనెందుకు కదిలించాలి. అందుకే ఏడు మామిడి చెట్ల అతని గతాన్ని నేనెప్పుడూ ప్రస్తావించలేదు.

క్రమంగా అతను నాకొక వ్యసనమయ్యాడు. సంపెంగ పూ చెట్టుపైకి అతను రావడం ఆలస్యం  ఎక్కడెక్కడి  పక్షులూ  వచ్చి నా కిటికీ పైనా, నా పైనా, అతని పైనా వాలేవి. ఎన్నెన్నో పాటలు పాడేవి. ఆ పాటల్లో మా మాటలు మాకే కొన్నిసార్లు వినిపించేవి కాదు. ఆ పక్షుల్లో ఒక కోయిల నా గదిలోపలికొచ్చి గూడు పెట్టడం మొదలెట్టింది. ఎక్కడినుండో పుల్ల పుల్లా ఏరుకొచ్చి గూడు కట్టేది. పొరపాటున  అదెక్కడ  ఫాన్ రెక్కలు  తగిలి చచ్చిపోతుందోనని నాకు భయమేసేది. ఫాను స్విచ్చికి  గట్టి టేప్ ఒకటి అతికించి ఫాన్ తిరగకుండా చేసేశాను.

అప్పుడడిగాడు మా ఆయన ”ఫాన్ స్విచ్ ఎందుకిట్లా చేశావు” అని. నేను మామూలుగానే చెప్పా కోయిల గూడు కడుతుందండీ, ఫాన్ రెక్కలు  తగిలితే చచ్చిపోతుంది అని. విచిత్రంగా మా ఆయన నా వంక వెర్రి చూపు చూసి,”కోయిల  గూడా? ఎక్కడ? అసలు కోయిల గూడు పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నావా?” అని వాదులాటకొచ్చాడు.

నేను ఓపికగా స్టూలు తెప్పించి కోయిల పేర్చిన పుల్లల్ని, సగం పూర్తయిన దాని గూటినీ  చూపించాను. అప్పుడు కోయిల, కిటికీ ఊచల మీదే నిలబడి మా ఆయన వంకే చూస్తుంది కూడా. అయినా సరే అదేం మా ఆయనకి  కనిపించలేదు. నా వంక అనుమానంగా చూట్టం మొదలెట్టాడు. ఇంట్లోవాళ్ళు, నేనతనితో  మాట్లాడేప్పుడు దొంగచాటుగా వినే వాళ్లు. ఏదో  పిచ్చి భాషలో మాట్లాడుతానట, నవ్వుతానట. ఆ విషయం మా ఆయన ఒక రాత్రి ప్రస్తావించాడు. నేనెట్లా చెప్పేది, నీలిమేఘం అడవితో మాట్లాడే భాష ఒకటి ఉంటుందని …ఆయనకి  నేనెట్లా అర్ధం చేయించగలను? ఆయన పుష్ప వర్ణ మాసంలో పుట్టలేదు కదా. ఆ దయ్యాన్ని, అదే అతన్ని నేనెలా ఈయనకి చూపించగలను? అందుకే అదేమీ లేదండీ, ఏదో పాట నేర్చుకుంటున్నాను, అంతే అని చెప్పా.

అప్పటి నుండి ఇక జాగ్రత్త పడడం మొదలు పెట్టాను. మా ఇంటికి  వెనక వైపు పది పన్నెండు మెట్లు పైన రెండు గదులున్నాయ్..ఒక దాంట్లో ఎప్పుడో ఒక వంటావిడ ఉండేదట. ఒకసారి వాళ్ళ ఊరికెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదట. ఎందుకనో ఆ గదికి, నేను వచ్చినప్పటినుండి తాళం వేళ్ళాట్టమే చూశాను గానీ, తెరవడం చూళ్ళేదు. దాని పక్కనే ఇంకో చిన్న రూమ్ వుంటుంది. దాంట్లో, మా తోటల్లోంచి కోసుకొచ్చిన దోర పళ్ళని పెట్టి మగ్గ వేస్తుంటారు. రక రకాల పళ్ళు. మగ్గిన తర్వాత ఇంటిలోపలికి తీసుకొస్తారు. ఆ గది భలే వుంటుంది. రంగురంగుల పళ్ళతో, మిళితమై పోయిన అనేక రకాల వాసనలతో…

మేమిద్దరం అక్కడ కలుసుకునేవాళ్ళం. అక్కడా కిటికీ బయట తను, లోపల నేను. భూమికి ఆకాశానికి మధ్య కిటికీ వుంటే ఎట్లా వుంటుందో అట్లా అనిపించేది నాకు. ఒక్కోసారి అతను రెండు మూడు రోజులు వొచ్చేవాడు కాదు. అప్పుడు నేనతనికి, రాత్రంతా కూర్చుని నా మనసు నిండుగా  ఉత్తరం రాసేదాన్ని. ఒకరోజు అట్లాగే నా మనసుని బల్లపైన పరచి రాస్తూ కూర్చున్నాను. బల్లంతా బంగారు  రంగు జలతారు వెలుతురు పరుచుకుంది. అతని స్మృతి నా పెదాలపై నవ్వై పరుచుకుంది. నేను రాసుకుంటూ పోతున్నాను. హటాత్ గా మా ఆయన నిదరనించి  లేచి “ఏం చేస్తున్నావ్” అన్నాడు. అంతే నేను గబగబా నా మనసునంతా జవిరి నా రెండు చేతుల మధ్యకు నెట్టి, కష్టపడి ఆ కాంతినంతా దాచి దాచి “ఏం లేదు ఏదో రాసుకుంటున్నా” అన్నాను. ఆయన ఆశ్చర్య పడి, ”చీకట్లో ఏం రాస్తున్నావ్” అన్నాడు. చీకటా! చీకటెక్కడ! మిల మిల మెరిసిపోయే ఇంత కాంతి ఉండగా…నేను మౌనంగా ఉండిపోయాను. మా ఆయన చిరాకు పడి “వచ్చి పడుకో” అని గద్దించాడు. నేను నెమ్మదిగా లేచి వెళ్లి పడుకున్నాను.

మరుసటి రోజు అతనొచ్చాడు. ఉత్తరం చదివావా అని నేనతన్ని అడగలేదు, అడగాల్సిన అవసరమూ లేదు. ఆ ఉత్తరాన్ని ఎలా చదవాలో అతనికి తెలుసు.

ఆ రోజుల్లో మేం గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. ఏం మాట్లాడుకునే వాళ్ళమో ఇప్పుడు కొంచేమన్నా గుర్తు  లేదు. కానీ అతనితో మాట్లాడటం నాకు చాలా బాగుండేది. ఎందుకంటె అతను, చీకటిని బంతాడే సూర్యుడి లాగా, మరో ప్రపంచపు కల లాగా, స్వప్నాలకే స్వప్నం లాగా సంభాషించే వాడు.  కొండవాలు లో పుట్టిన అనాది  గానంలా ఉండే వాడు. అతనికి పక్షుల భాష, పూల భాషా అన్నీ  తెలుసు. ఒక సారి నా ముందే మా కుక్క అతనితో మాట్లాడటం నేను చూశాను.

మా ఇంట్లో నా గురించి గుస గుసలు ఎక్కువై పోయాయి. నేను ఒక్కదాన్నే వెళ్లి ఆ మూల గదిలో కూర్చుంటున్నానని, నాలో నేను మాట్లాడుకుంటూ, నవ్వుకుంటున్నానని అనుకోవడం మొదలుపెట్టేరు. మా ఆయన విసిగి నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళాడు. అందరికీ, సంక్రాంతి పండుగకి ఊరికెళ్ళిఒదని  చెప్పుకున్నారు. మా ఊరంటే మామూలు రోజుల్లో నాకెంత సంతోషమో. ఈసారి అట్లా అనిపించలేదు. నా బట్టలంతా నాకు తెలీకుండానే  పనిపిల్ల ఎప్పుడో సర్ది పెట్టేసింది. రాత్రి పదిగంటల వేళ మా ఆయన “బయల్దేరు” అన్నాడు. నేను ముందు మొరాయించాను, ఏడ్చాను,  అతనికి చెప్పకుండా ఎలా వెళ్ళగలను ?. అతను నన్ను వెతుక్కోడా …ఏమనుకుంటాడు, ఇంకెప్పటికీ రాకుండా అద్రుశ్యమైపోడా?

మా ఆయన, అమ్మమ్మకి ఏమిటేమిటో చెప్పాడు. నేను మాట్లాడుతున్న పిచ్చి భాష గురించి చెప్పాడు. వినివిని మా అమ్మమ్మ “ఏం చేసేది నాయనా అన్నీ వున్నా సుఖ పడే రాత నా నుదుటున రాసిపెట్టలేదు ఆ దేవుడు, లేకుంటే తల్లిలాగే ఇదీ పుష్పవర్ణ మాసంలోనే పుట్టాలా” అని ఏడ్వటం మొదలుపెట్టింది.

నేను మా అమ్మమ్మ తిప్పిన గుడులూ, మసీదులూ అన్నీ తిరిగాను. నాకేం కాలేదని చెప్పినా మా అమ్మమ్మ వినిపించుకోలా. నీలిమేఘం అడవితో మాట్లాడే భాష గురించి చెప్పబోయినప్పుడల్లా టపటపా చేత్తో తల బాదుకునేది. నేనింక భయపడి ఆమాటే ఎత్తడం మానేశా. కొన్ని రోజులకిక  నేను కుదుట పడ్డానని చెప్పి  మా అమ్మమ్మ నన్ను మా ఇంటికి తెచ్చి వదిలి వెళ్ళింది.

ఆ రోజు తలస్నానం చేసి, కిటికీ దగ్గర కూర్చుని, వేళ్ళతో జుత్తు చిక్కులు  తీస్తూ వున్నాను. దిగులుగా ఉంది. అతను ఇక రాడా …నన్ను మరిచిపోయుంటాడా! అని. అతను వచ్చాడు. అతనితో పాటు వచ్చిన పక్షులు, మేత తెచ్చిన అమ్మకోసం నోరంతా తెరిచి అరుస్తాయే బుజ్జి పిట్టలు, అట్లా నన్ను చూసీచూడగానే అరవడం మొదలుపెట్టాయి. అతన్నట్లా చూడగానే నాకు  ఒక్క సారిగా లక్ష ఊచల పెద్ద పంజరాన్నై పోయి అతన్ని చుట్టేసి అతన్నీ, అతని పక్షుల్నీ అట్లాగే బంధించేయ్యాలనిపించింది.  అతను నన్ను చూసి   గొంతు పెగల్చుకొని ,చాలా నీరసంగా  “ఇన్ని రోజులూ ఎక్కడికెళ్ళారు వీణాధరి” అన్నాడు. అదే అతని పెదవులు నా పేరుని మొదటిసారి పలకడం. నేనెప్పుడూ అతనికి నా పేరు చెప్పలేదు, అతని పేరూ అడగలేదు. ఆ తరువాత ఇంకొక్కసారి అతను నన్ను పేరుతో పిలిచాడు మా మొత్తం పరిచయంలో.

అతని నోటి వెంట  నా పేరు వినగానే ఒక్కసారిగా  శరీరమంతా కంపించి  పోయింది. గుండె దడదడమని కొట్టుకుంది. కళ్ళలో నీరు కమ్మింది. ఆ ఉద్వేగం నుండి బయటకు రాక మునుపే, అతను చాలా మొరటుగా “ఏం గొంతు నొప్పా? మాట్లాడవేం…? చెప్పడానికేం…? ” అని ఏకవచనంతో గద్దించాడు. ఆ గద్దింపుకి నవ్వొచ్చింది. అతని అక్కరకి ఏడుపు పొంగుకొచ్చింది. నవ్వి, కళ్ళ నీళ్ళని కళ్ళలోనే దాచిపెట్టేసి ”అచ్చు దయ్యం లాగే మాట్లాడుతున్నారు” అన్నాను. అతను నెమ్మదిగా శాంతించాడు. ఎన్ని ఆలోచనలో  తెలుసా? పగలూ రాత్రి ఆ మామిడి చెట్టు మీదే కూర్చున్నా తెలుసా! అన్నాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ” మీకు ముగ్గులేయడం వచ్చా ?” అన్నాడు పిచ్చిగా. మళ్ళీ “పండగకి ఏం చీర కట్టుకున్నారు” అన్నాడు. నేను ఉక్కిరిబిక్కిరయ్యాను ఆ కొత్త కొత్త ప్రశ్నలకి. ఎట్లాగో మనసు కూడదీసుకుని “అడవి పచ్చ రంగు చీర, ఆకాశ నీలం రవిక “అన్నాను.అతను కళ్ళు మూసుకుని ధ్యానంగా  “చినుకు చుంబించిన నేల పరిమళంలా ఉన్నావ్” అన్నాడు.

ఆ రోజు రాత్రి, మా ఆయన పని మీద ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళాడు.  అతను మొగ్గలు విడుతున్నసంపెంగ చెట్టు మీద, నేను కిటికీ లోపల కూర్చుని వెన్నెల కౌగిట్లో తడిసి ముద్దయ్యాం. చంద్రుడు ఆకాశాన్ని  ఆ ఒడ్దు నుండి ఈ ఒడ్డుకి త్వరత్వరగా ఈదేస్తున్నాడు. అట్లా ఈదే చంద్రుడిలో కొంత భాగం తీసుకుని , ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి నాకిచ్చాడు. ఆ పువ్వు ధగ ధగా మెరిసిపోతూంది. గమ్మత్తుగా గుబాలిస్తుంది. దాన్ని పక్కనుంచుకుని వేకువున, ఎప్పుడో అతను వెళ్ళాక నిదురపోయాను.

మరుసటి రోజు నిదురలేచినప్పట్నుంచి ఏదో దిగులు. ఒక చోట నిలువనీయని దిగులు. నాకేదో కావాలి, ఏదో కాదు, నాకు అతను కావాలి, నాకు నాకే సొంతంగా కావాలి, అతను నావాడైపోయి నేను అతని దాన్నైపోవాలి, హృదయంలోంచి  పొంగుకుని పొంగుకుని వచ్చింది దుక్కం. ఏడుస్తుంటే నా గదిలో గూడు కట్టుకున్న కోయిల నన్నే రెప్ప వేయకుండా చూడటం మొదలుపెట్టింది. చూసీ చూసి చివరకి  ” అతనితో నేను చెప్తానులే ఏడవకు” అన్నది.

అతనొచ్చాడు .ఇవాళ అతని ముఖం కాంతిగా ఉంది. పెదాలపై నవ్వుంది. అతనొచ్చీ రాగానే  కోయిల వెళ్లి అతని భుజంపై కూర్చుని, ఒక పాట పాడటం మొదలుపెట్టింది.’ ఆకుపచ్చటి పాట’. పాట వింటూ ఉండగానే అతని ముఖం వివర్ణమవడం మొదలు పెట్టింది. పాట ముగిశాక, కోయిలని భుజంపై నుండి చేతిలోకి తీసుకుని “నువ్వు పాడకుంటే నేను తెలుసుకోలేననుకున్నావా  కోయిలా” అన్నాడు.

నేను తలవంచుకుని కూర్చున్నాను. మనసంత ఆందోళనగా, భయంగా ఉంది. దిగులు పొగలాగా కమ్ముకుంటూ ఊపిరాడనీయకుండా ఉంది. అయినా అట్లాగే దిగులుగా చెప్పాను “నాకు మీరు కావాలి” అని. అతనేం మాట్లాడలేదు చాలాసేపు. చివరికి “ మీరు అతని భార్య వీణాధరి, మిమ్మల్ని ఎట్లా స్వీకరించగలను” అన్నాడు.నాకేం మాట్లాడాలో తోచలేదు. సంపెంగల గాలికి పక్షులన్నీ శాంతిగా, నిశ్సబ్దంగా కూర్చున్నాయ్. ఆ నిశ్శబ్దం లోంచి నేను మొండిగా  “నాకు నువ్వు కావాలి” అన్నాను. అంత ఏక వచనపు చనువు ఎట్లా పుట్టిందో  నాకు …మళ్ళీ రెట్టించి ”నాకు నువ్వు కావాలి”అన్నాను. నాకు అదొక్కటే తెలుసు మరి.

అతను నిట్టూర్చి “మీకు అట్లాంటి ఆలోచన కలగడానికి నేను చేసిన తప్పేంటి? అన్నాడు. అతను మాట్లాడుతూ ఉండగానే, హటాత్తుగా  నా మనసులో ఒక మొక్క మొలవడం చూశాను.  అది మారాకు  వేసుకుంటూ అతి వేగంగా పైకి వస్తున్నది. నేనా మొక్కనే గమనిస్తూ వున్నాను. అతను  “నాకు మీతో మాట్లాడటం బాగుంటుంది. అయినా  నేను ఆమెని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా. మనం మంచి స్నేహితులం అంతే ” అన్నాడు . నేనేం మాట్లాడలేదు. నా మనసులో పుట్టిన మొలకను మొదలకంటా పీకి, గోటితో చిన్న చిన్న తునకలుగా చేసి కిటికీలోంచి విసిరేశాను. అతనది చూశాడు, దిగులుగా “మీది చాలా మంచి జీవితం వీణా, ఇది మీకు మంచిది కాదు, కొంచెం  కూడా మంచిది కాదు” అన్నాడు. నేను ఊరుకున్నాను. అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు. ఒక వేసం   కాలపు నీల మేఘం, అతని ప్రియమైన మామిడి చెట్టును ఏం చెయ్యగలిగిందో  తెలిసిన వాడు, అతనికి బదులు మాట్లాడటం నాకెలా సాధ్యం?. సాధ్యా సాధ్యాల ప్రసక్తి ఎలా వున్నా ,నాకు ఇష్టం లేదు అంతే. నేను ఊరుకున్నాను. అతను వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు అతను రాలేదు, ఆ తర్వాత చాలా రోజులు రాలేదు. బట్టల అల్మారాలో  దాచిపెట్టుకున్న  వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది. నేను కృశించి పోవడం మొదలుపెట్టాను. అయినా అష్ట సిద్దులలోని మూడు సిద్ధులు ప్రాప్తి, ప్రాకామ్య,వశత్వాలు పొందాలని తీవ్రంగా ధ్యానించేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు, గది తలుపులు బిగించుకునే దాన్ని. తిండి తినేదాన్ని కాదు. ఒకే ఒక్క ఆలోచన  ‘అతను కావాలి’. ఈ సంఘటనకు ముందువున్న యధాతధ స్థితి ఇంకెలా సాధ్యం. ఏమో ఇదంతా కాదు, నాకు అతను కావాలి .

ఒకరోజు అతనొచ్చాడు. నా అవతారాన్ని చూసి దిగులుపడి, వర్షించి, చివరికి  అన్నాడు “ఎందుకట్లా?” అని. నేను “ఎందుకు రావటం మానేశావ్”? అన్నాను. అతను తలొంచుకున్నాడు. అతని చుట్టూ ఇప్పుడు పక్షులు లేవు.”తప్పు చేసానో ఏమో ?” ఇదంతా ఎలా జరిగింది.అతన్ని కోరుకోవడమేంటి, ఏం చేసుకుంటానతన్ని నేను? అతను నాకేం ఇవ్వగలడు? నాకు లేనిదేమిటి? మా మధ్యనున్న కిటికీని ఏం చేసి ఎవరమైనా తొలగించగలం? ఒకర్నొకరు ఏం చేసుకోగలం? ఇదంతా సరే, అయినా సరే అతను నాకు కావాలి, నువ్వు నాదానివని అతను నాకు చెప్పాలి

నా మౌనాన్ని, ఆలోచనలని విరగగొడుతూ అతను “రాకూడదని కాదు, రాకుండా వుండగలిగీ కాదు, మీరు బాగుండాలి మీ జీవితం మంచిది. మీరు కోరుకుంటున్నది మంచిది  కాదు ” అన్నాడు. ఏడు మామిడి చెట్లను చూసిన వాడు కదా అతను, అందుకని ఏడుపుని ఆపేసుకుని, నవ్వి ఊరుకున్నాను. అతను వెళ్ళిపొయ్యాడు.

మా ఇద్దరి పరిచయపు మొదటి రోజుల్లో అతను, నాకో గోమేధికం పొదిగిన  పతకాన్ని ఇచ్చాడు. చిన్న కుంకుడు గింజంత రాయి అది. ఆవు పంచతం రంగులో, నిప్పు కణిక రంగులో మెరిసి పోయేది. అదంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ నా గుండెల మీద అందంగా నిలిపి వుంచుకునేదాన్ని. ఎప్పుడైతే అతను రావడం మానేసాడో, అప్పట్నిండి అది ప్రతి రోజూ కొంత కొంతగా పెరగడం మొదలు పెట్టింది. విపరీతమైన బరువు, మోయలేనంత బరువు, మెడలు వంచేసేంత బరువు, ఏ పనీ తోచనీయంత బరువు, ఆ బరువు మోయడం కన్నా చచ్చి పోతే పోతుంది కదా హాయిగా అనిపించేంత బరువు వేసేది ఆ రాయి.

మొదట్లో దాన్ని తీసేద్దామని ప్రయత్నించాను. నాకు చేత కాలేదు, నువ్విచ్చింది  నువ్వే తీసుకెళ్ళు అని అతనికే చెప్తామనుకున్నాను. అయినా ఎందుకు చెప్పాలి.అతనికి తెలియకనా. అందుకే ఒక సానరాయి తీసుకుని గోమేధికాన్ని కొంత కొంతగా అరగదీయడం మొదలుపెట్టాను, గది తలుపులు బంధించుకునే అరగదీసేదాన్ని, అయినా ఇంట్లోవాళ్ళు  నా మీద గూడచర్యం చేశారు. నాకు దయ్యం పట్టిందనీ, ఇదంతా దయ్యం చేష్టలేనని తేల్చారు. అక్కడికీ నేను చెప్పా, మీరనుకున్నట్టు నాకు ఏ దయ్యమూ పట్టలేదు, పట్టాలని నేను తపస్సు చేస్తున్నా అని. గోమేధికాన్ని కూడా చూపించా. ఏం చెప్పినా, ఏం చూపించినా వాళ్లకి కొంచం కూడా అర్ధం కాలేదు. ఎక్కడ నీ గోమేధికం ?, ఎక్కడ నీ దయ్యం? అన్నారు. నన్నిక్కడకి  తీసుకొచ్చి వదిలారు. నాకేం దిగులు లేదు, ఇక్కడ చాలా బాగుంది, ఎప్పుడో ఒక రోజు అతను వస్తాడు. మా మధ్య  మాటలు  లేవు   కానీ, నా గురించి అతను యోచించే క్షణాలు నాకు, అతని గురించి నేను కలగనే క్షణాలు అతనికీ, తెలిసి పోతూనే ఉంటాయ్. ఈ గాలిలోనో, ఈ కొమ్మల్లోనో దాగి అతను నన్ను చూస్తూనే ఉంటాడు, నాకు తెలుసు. అన్నట్లు నేను చెప్పేదంతా మీరు నమ్ముతున్నారా, చూడండీ పెద్ద మామిడికాయంత పెరిగి పోయింది ఈ గోమేధికం. మీకు కనిపిస్తుందా?’’ అన్నదావిడ. నేను భ్రాంతిలోంచి బయట పడ్డట్టు ఆవిడ గుండెవైపు చూశాను. మొదట ఏమీ కనిపించలేదు, రెండవ క్షణంలో కనిపించింది ‘బండ రాయంత గోమేధికం’ కణకణ మండిపోతున్నట్లు నిప్పు రంగులో.

నేను దిగులుగా ఆవిడ వైపు చూసి “మీదే పొరపాటేమో అతను మొదటే చెప్పాడు కదా తను ఎవర్నో ప్రేమిస్తున్నట్లు” అన్నాను. ఆవిడ చిన్నగా నవ్వింది . ”అతను నన్ను ప్రేమిస్తున్నాడని భ్రమ పడ్డాననా మీ భావన” అన్నది. నేను తలూపాను. ఆవిడ “మా మధ్య నడిచిన గాలికి కూడా అమ్బిగుఇట్య్ [ఆమ్బిగ్యుటి]  ఉంది.దానిని మీకెలా కావాలంటే అలా మలుచుకోవచ్చు . నాకు కావలసినట్లు నేను, అతనికి కావలిసినట్లు అతను చెప్పుకోవచ్చు. మీ పేరేంటో నాకు తెలీదు కానీ , మీకో విషయం చెప్పేదా, ఏనుగులను మచ్చిక చేసుకునే మావటీలు, ఏనుగులతో ఒక ప్రత్యేక భాషలో సంభాషిస్తారు, అది మీకు ఐడియా ఉందా ? ఒకసారి నేనో  మావటీని ఇంటర్వ్యూ చేశా . ’’ప్రేమని వ్యక్త పరచడానికి  ఏం పదాలు వాడుతారు మీరు‘’ అని. ఆ  ప్రశ్నకి అతనేం బదులిచ్చాడో తెలుసా ”అందుకేం పదాలూ లేవు. మన చేతలలలో, ప్రవర్తనలో నుండి మన ప్రేమ, అనురాగ  భావనని అవి గ్రహించుకుంటాయి ” అని. ప్రేమ అట్లాటిది. దానికి భాషే అవసరం లేదు, ఆ ఇంట్లో వున్నావిడని ఇష్టపడ్డాడని కదా మీరు అడిగారు, ఆ ఇంట్లో వున్నది మరెవరో కాదు “నా మరో నేను ” అన్నది.

ఆవిడని తీసుకెళ్ళడానికి ఎవరో వచ్చారు. నేను లేచి మా  వాళ్ళ వైపు నడిచాను. వెళ్తున్న దారిలో ఎవరో ఒకావిడ మట్టిలో దొర్లి దొర్లి ఏడుస్తుంది. ”ఒసేయ్ కామాక్షి , నన్నొదిలి పెట్టే…నన్నొదిలి పెట్టే …నా చేతుల్ని  కట్టేయ్యకే కామాక్షి , నేనీ బాలని తీసుకెళ్ళ డానికే వచ్చానే కామాక్షి , దీని మీద నాకు మోజే కామాక్షి, దీన్ని నేను వదిలి పెట్టనే …అని ఏడుస్తుంది. ఎందుకో  దిగులేసింది. చిన్నప్పటినుండీ అమ్మవారి మందిరం చుట్టూ, దయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తూనే పెరిగా. ఎప్పుడూ భయం కలగ లేదు. ఇవాళెందుకో మొదటి సారి భయమేసింది. ఇందాక నేను ఆవిష్కరించలేక పోయిన ”పుష్ప వర్ణ మాసం” నాకు ఆవిష్క్రుతమవడం మొదలు పెట్టింది. దిగులు, ఆవిడ చెప్పిన పొగలా ఊపిరాడనీయకుండా నన్ను కప్పేయడం మొదలు పెట్టింది.

సామాన్య

చాలా అరుదుగా రాసినా బలంగా రాసే సామాన్య  తెలుగు కథా పాఠకులకు  సుపరిచితులు. "కొత్తగూడెం పోరగాడికొక లవ్ లెటర్", "మహిత" కథా సంకలనాలు తెచ్చారు. గతంలో  ప్రాతినిధ్య వార్షిక కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *