నా చదువు కథ Part 2

మా రోజుల్లో వారపత్రికలంటే ప్రధానంగా ఆంధ్రజ్యోతి,ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలే . ఆ తర్వాత చాలాకాలానికి పల్లకి ,స్వాతి,మయూరి లాంటి పత్రిక లుప్రారంభమై వీటితో దీటుగా నడిచేవి.పల్లకిలో యండమూరి వీరేంద్రనాథ్ ,మల్లాది వెంకటకృష్ణమూర్తి,చందు సోంబాబు ,కొమ్మనాపల్లి గణపతి రావు లాంటి వారు సీరియల్స్ రాస్తుండేవారు.

అన్నట్టు ఆంధ్రప్రభలో యండమూరి “నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య”,మల్లాది “అద్దెకిచ్చిన హృదయాలు” ఆ రోజుల్లో చాలా ఆసక్తి తో చదివిన సీరియల్స్ .

వారపత్రికలతో పాటు నెలనెలా వచ్చే మాసపత్రికలు కూడా ప్రజలకు ప్రధాన ఆకర్షణగా వుండేవి.

మాస పత్రికలలో బాగా పేరున్నవి —యువ,జ్యోతి,జయశ్రీ

యువ మాస పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

యువ మాస పత్రిక విజయా సంస్థకి చెందిన చక్రపాణి గారి సారథ్యంలో 1960ప్రాంతాల నుండీ వెలువడిన మాస పత్రిక.అది చక్రపాణి గారి సొంత పత్రిక. మొదట్లో ముఖ్యంగా యువతని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించారేమో అనిపిస్తుంది  కాలక్రమేణా అది చదువరులందరికీ అభిమాన పత్రికగా పేరుతెచ్చుకుంది. “యువ “లోగో కూడా పొద్దున్నే ప్రజలను మేల్కొలిపే కోడిపుంజు.

బహుశా సాహితీ పాఠకులకు ఈ పత్రిక ఒక మేలుకొలుపు లా వుండాలి అని ప్రచురణ కర్తలు భావించి వుండవచ్చు

“యువ “పేరు వెనక కూడా చిన్న కథ వుంది.మొట్టమొదట 1935 ప్రాంతాలలో కొడవటిగంటి కుటుంబరావు గారు తెనాలి నుండీ “యువ” పేరుతో ఒక మాస పత్రిక ప్రారంభించారు అది కొన్ని సంచికలు వచ్చి ఆగిపోయింది.తర్వాత కొడవటిగంటి “యువ పబ్లికేషన్స్” పేరుతో కొన్ని పుస్తకాలు ప్రచురించారు.

ఆ తర్వాత చక్రపాణి గారు “యువ పబ్లికేషన్స్ “పేరు తీసుకుని పుస్తకాలు పబ్లిష్ చేస్తూ వుండేవారు.చలం గారి పుస్తకాలు,తాను  బెంగాలీ  నుండీ తెలుగులోకి చెసిన అనువాద పుస్తకాలు ప్రచురించే వారు

1947ప్రాంతాలలో చక్రపాణి గారు మద్రాసు నుండీ”యువ” పేరుతో మాస పత్రిక ప్రారంభించినా అది యెక్కువ రోజులు నడవలేదు.

తిరిగి 1960లో హైద్రాబాద్ నుండీ  చక్రపాణి సంపాదకత్వంలో “యువ” మాసపత్రిక ప్రారంభమైంది.

ప్రజలలో “యువ” మాస పత్రిక కి ఒక స్థాయి వుండేది,ఒక క్రేజ్ వుండేది.యువ ముఖచిత్రం ,అట్ట వెనక చిత్రమే గాక,రెండవ అట్ట మీదా,మూడవ అట్ట మీదా కూడా వడ్డాది పాపయ్య గారి అపురూప వర్ణ చిత్రాలుండేవి.(యువ మొదటి సంచిక కవర్ మాత్రం “బుజ్జాయి”గారు వేశారట) అప్పుడప్పుడూ లోపలి పేజీల్లో కూడా ఆయన వేసిన వర్ణ చిత్రాలుండేవి.ఇవే కాకుండా వడ్డాది పాపయ్య గారు వ్యంగ్య చిత్రాలూ,బెంగాలీ కథలకూ, కొన్ని తెలుగు కథలకూ బ్లాక్ అండ్ వైట్ లో  రేఖాచిత్రాలు వేసేవారు.

మాములుగా మిగతా వార,మాస పత్రికలన్నీ సినీతారల ఫోటోలని ముఖచిత్రాలుగా వేసే సంప్రదాయాన్ని పాటించేవి.ఎప్పుడైనా పండగలకో ప్రత్యేక సందర్భాలకో మాత్రమే వర్ణచిత్రాలో వేరే బొమ్మలో ముఖచిత్రాలు గా వచ్చేవి.

కానీ “యువ ” పత్రిక మాత్రం మొదటి నుండీ చివర వరకూ వడ్డాది పాపయ్య బొమ్మలనే ముఖచిత్రాలు గా ఉపయోగించి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. చందమామ పత్రికకు కూడా వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రాలేవుండేవి.చందమామలో వచ్చే పౌరాణిక సీరియల్సుక్కూడా వడ్డాది పాపయ్య గారే బొమ్మలు వేసేవారు.ఆయన సంతకం భలే విచిత్రంగా వుండేది.వ.పా అనే పొడి అక్షరాలు గానీ ,010 అనే అంకెలు గానీ చిత్రాల కింద సంతకంగా వాడేవారు.ఆయన 1992లో తనువు చాలించే వరకూ చందమామ,యువ, స్వాతి పత్రికలలో ఆయన బొమ్మలు వచ్చేవి

యువ పత్రికలో యెక్కువగా కథలే వుండేవి.ఒకటో రెండో సీరియల్సుండేవి.

“పనిలేని మంగలి” అనే శీర్షిక ఒకటి వుండేది . ఒక మంగలిపిల్లి తల గొరుగుతున్నట్లు గా వేసిన బొమ్మ వేసి వుండేది.ఈ శీర్షిక కింద సమకాలీన రాజకీయాల పట్ల సున్నితమైన విసుర్లూ,వ్యంగ్యోక్తులూ వుండేవి.రచయిత పేరు వుండేది కాదు.అయితే సంపాదకుడు చక్రపాణి గారే ఇది రాస్తారు అనుకునే వాళ్లు కానీ ఆ వ్యాసాలు కుటుంబరావు గారూ,చక్రపాణి గారూ ఇద్దరూ రాసేవారని ,కొడవటి గంటి కుటుంబరావు గారి అల్లుడు గణేశ్వరరావు గారీ మధ్య మాటల్లో చెప్పారు.

యద్దన పూడి సులోచనా రాణి గారి “మీనా”సీరియల్ గా వస్తూ వుండేది.చాలా ఉత్కంఠ గా వుండేది.కేవలం రెండు పేజీలే వేసేవారు ఒకోసారి. అబ్బా! మళ్లీ నెల రోజులు వెయిట్ చెయ్యాలా అని నిరాశ పడేవాళ్లం.

కోడూరి కౌసల్యా దేవి గారి “చక్రనేమి” కూడా ఇందులోనే వచ్చింది.ఇవికాక ఇంకా ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి,ద్వివేదుల విశాలాక్షి గారి,కావిలి పాటి విజయలక్ష్మి గారి రచనలు కూడా వుండేవి.

ఇక చక్రపాణి గారు బెంగాలీ నుండీ తెలుగులోకి అనువదించిన అద్భుతమైన నవలలూ ,పెద్ద కథలూ  “యువ”కే ప్రత్యేకంగా వుండేవి.వాటికి వ.పా .వేసిన బొమ్మలు ఇంకెంత బాగుండేవో మాటల్లో చెప్పలేను. వాటన్నిటినీ కలిపి కుట్టి బైండ్ చేయించుకునే వారుకూడా వుండేవారు.నేను మా బంధువుల నడిగి ఆ బెంగాలీకథల బైండింగ్ తెచ్చుకున్నాను ఇప్పటికీ అది నా లైబ్రరీలో వుంది.

చక్రపాణి గారి అనువాదాలెంత బాగుండేవంటే ఆరోజుల్లో చాలామంది శరత్ బాబుని మన తెలుగు రచయిత అనుకునే వారు.బెంగాలీ రచయిత అంటే నమ్మేవారు కాదు.అందుకే జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు యేదైనా అనువాదం బాగుందని చెప్పడానికి “అనువాదం చక్రపాణీయంగా వుంది”అనేవారట!

నేను అలా యువలో చదివిన బెంగాలీ రచనలు —-

శరత్ “బడదీదీ,విరాజ్ బహు,పల్లీయులు,శేషప్రశ్న,దేవదాసు,నిష్కృతి(దీనినే తెలుగులో తోడికోడళ్లు సినిమాగా తీశారు)

బంకించంద్ర ఛటర్జీ—-“ఆనందమఠ్ ,కపాల కుండల”

ఇంకా”బిందు గారబ్బాయి”,రామునిబుధ్ధిమంత తనం” ఇలా యెన్నో

మొసలి కంటి సంజీవరావు గారి “మొగల్ దర్భారు కుట్రలు” అనే రచన భలే  ఉత్సుకత రేకెత్తించేది.

యువ దీపావళిప్రత్యేక సంచిక కోసం రెండు మూడు నెలల ముందునుండే యెదురు చూస్తూ వుండేవాళ్లం.

యువ దీపావళి సంచిక పెద్ద సైజులో సుమారు 250,300 పేజీలతో వర్ణచిత్రాలతో మంచి మంచి కథలతో చక్కటి విందుభోజనంలా  వుండేది.

యువ దీపావళి సంచికలో పాలగుమ్మి పద్మరాజు,కొడవటిగంటి కుటుంబరావు,భానుమతీ రామకృష్ణ గారి కథలు తప్పకుండా వుండేవి .ప్రతి సంవత్సరం ఈసారి వీళ్లేం కథలు రాస్తారా అని యెదురు చూస్తూ వుండేవాళ్లం.ఒకసారి భానుమతి గారు చక్రపాణి గారిని వేళాకోళం పట్టిస్తూ “రంభా-చక్రపాణీయం” అనే కథ రాశారు .

పాలగుమ్మి పద్మరాజు గారి కథ “ఎదురు చూస్తున్న ముహూర్తం” దీపావళి యువలోనే చదివాను ఆ కథలో ఆయన చేసిన పాత్రల మనో విశ్లేషణ కొత్తగా అనిపించి గుర్తుండి పోయింది .అంత వరకూ అలాంటి కథ చదవ లేదు నేను.ఆయన అద్భుతమైన కథకులు .1952 లో ఆయన రాసిన “గాలివాన” కథకి న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారు నిర్వహించిన ప్రపంచ కథానికల పోటీలో రెండవ బహుమతి లభించిందని చెపుతూ వుండేవారు 

యువతో పాటు ఆంధ్రజ్యోతి,జ్యోతి మాస పత్రిక కూడా దీపావళి ప్రత్యేక సంచికలు వెలువరించేవి .వాటికోసం కూడా పాఠకులు ఆత్రంగా యెదురు చూసేవారు.

1975 లో చక్రపాణి గారు పరమపదించాక వారబ్బాయి సుధాకరరావు గారి ఆధ్వర్యంలో 1985వరకూ యువ ప్రచురింప బడి ఆ తర్వాత ఆగిపోయింది.

విజయా సంస్థనుండీ “చందమామ”తో బాటు వెలువడినవి “వనిత”,”విజయచిత్ర”

“విజయచిత్ర” కి నాకు ప్రియమైన  మాస పత్రిక.సినిమా విశేషాలను వివరిస్తూ ,నటీనటుల గురించి ప్రత్యేకమైన వ్యాసాలు ప్రచురిస్తూ ,యే మాత్రం గాసిప్ కి స్థానం ఇవ్వకుండా ఉన్నతమైన స్థాయిలో కొనసాగిన పత్రిక.అలాంటి పత్రిక అప్పటికీ ఇప్పటికీ మరొకటి కనపడదు.

దాని స్థాయీ,ప్రమాణాలు యెలాంటివంటే నేటికీ సినిమాకి సంబంధించిన సమాచారమేదన్నా కావాలంటే రిఫరెన్సుకి విజయచిత్ర ని ఆశ్రయించాలిసిందే 

విజయచిత్ర సంపాదకుడుగా గా “విశ్వం” అనే పేరుండేది (బి.నాగిరెడ్డి గారి అబ్బాయి).సహాయకుడుగా రావి.కొండల్రావు గారి పేరుండేది.(పత్రిక పనంతా దాదాపు రావి.కొండల్రావుగారే చూశేవారట ,నాకు పరిచయమైన తర్వాత కొండల్రావు గారు మాటల్లో నాకు చెప్పారు)

సినీ సంగీతం గురించి వి.ఎ.కె .రంగారావు గారు రాసే విలువైన వ్యాసాలుండేవి.ఆయనే పాత నటీనటుల గురించి “ఇప్పుడేం చేస్తున్నారు” అనే శీర్షిక  కూడా నిర్వహించే వారు.

అప్పట్లో ఆయన విజయచిత్రలో రాసిన వ్యాసాలు చదివే నేను ఆయన అభిమాని నయ్యాను.

ఆ తర్వాత నేను రంగారావు గారి పుస్తకం “ఆలాపన”  ప్రచురించి పబ్లిషర్ గా మారడానికి ఒక రకంగా విజయచిత్రే కారణం అని చెప్పవచ్చు.

ఇంకా ఆ పత్రికలో సినీ నటీనటుల ఆత్మకథలుండేవి—-షావుకారు జానకి,భానుమతి,జమున,నాగయ్య గార్ల జీవితచరిత్రలు అందులోనే చదివాను.

భానుమతి ఆత్మకథ “నాలోనేను”కి సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా లభించింది.

వి.చి. విహారం పేరిట రావి కొండల్రావు గారు స్టూడియో విశేషాలు రాసే వారు. కె.ఆర్ .వి.భక్త అనే ఆయన తీసిన మంచి కలర్ ఫోటోస్ వేసేవారు.

ఇంకా యెన్నో ఆసక్తికరమైన శీర్షికలతో అత్యంత జనాదరణ తో  1990 ప్రాంతాల వరకూ నడిచింది విజయచిత్ర 

ఆ తర్వాత సితార,జ్యోతిచిత్ర ,శివరంజని ,అనే సినీ మాగజీన్లు కూడా  వచ్చినప్పటికీ,  విజయచిత్ర స్థానం ప్రత్యేక మయినది.పాత సంచికలన్నీ బైండ్ చేయించి దాచుకుని మధ్యమధ్యలో  చదువుకుంటూ వుండే వారెంతమందో నాకు తెలుసు నాతో సహా!

“వనిత” పక్షపత్రిక కేవలం స్త్రీల కోసమే ప్రారంభించబడినది.

ఆ రోజుల్లో అది ఒక కొత్త ఆలోచనే ,ఇంకా అప్పటికి స్త్రీవాదం పేరు గట్టిగా వినపడటం లేదు .వనితలకి ప్రత్యేకమైన శీర్షిక లుండేవి.కుట్లూ,అల్లికలూ ,వంటలూ వీటిగురించే కాక మహిళా సాధికారతను బలపరిచే కథలూ,వ్యాసాలూ,ఇంటర్వ్యూలూ వుండేవని గుర్తు.

మాలతీ చందూర్ గారి సీరియల్ “హృదయనేత్రి” వనితలోనే వస్తూ వుండేది.బామ్మగారి పేజీ అని ఒక శీర్షిక వుండేది.మంగళా కందూర్ గారి వ్యాసాలు కూడా వచ్చేవని జ్ఞాపకం.

జ్యోతి మాసపత్రిక కూడా బాగానే చదివే వాళ్లం .మేమా పత్రిక చదివే కాలంలో ఎడిటర్ పేరు లీలావతీ రాఘవయ్య అని వుండేది అయితే మొదటగా ఆ పత్రిక స్థాపించింది లీలావతి గారి భర్త వి.వి.రాఘవయ్య గారట.

ఇక్కడ జ్యోతి మాస పత్రిక గురించి నాకు తెలిసిన విశేషాలు కొన్ని పంచుకుంటున్నాను. ఇవి నాకు శ్రీ వి.ఎ.కె. రంగారావు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ వలన తెలిశాయి..

1963 లో జ్యోతి పత్రిక స్థాపించింది వి.వి.రాఘవయ్య గారు .ఆయన  మంచి అభిరుచితో ఒక సంపాదక వర్గాన్ని యేర్పాటు చేసుకున్నారు.

అందులో నండూరి రామ్మోహన్రావు గారు,బాపూ,ముళ్లపూడి వెంకటరమణ,రావికొండల్రావు,వి.ఎ.కె. రంగారావు వుండేవారు.

మంచి మంచి శీర్షికలతో,బాపూ కార్టూన్లతో,ముళ్లపూడి రచనలతో,ఇంకా యువతను ఆకట్టుకునే అంశాలతో వెలువడేది.

ఇందులో వి.ఎ.కె. “మానసోల్లాసం”,”చిత్రరథుని చైత్రయాత్ర” శీర్షికలు నిర్వహించేవారు.ఆరుద్ర కూనలమ్మ పదాలు రాసేవారు.

అన్నట్టు అప్పటి దాకా కథలు రాస్తున్న యద్దనపూడి సులోచనా రాణి గారిచేత పట్టుబట్టి  సీరియల్ నవల రాయించారు బాపూ,రమణ ,అదే “సెక్రటరీ” .ఆ తర్వాత అది ఆమెకి యెంత పేరు తెచ్చిందో యెన్ని పునర్ముద్రణలు అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే .చివరికి సినిమాగా కూడా రూపొందింది కదా!

జ్యోతి లో ఈ సంపాదక వర్గం పని చేస్తున్నప్పుడే కృష్ణాష్టమి కి ఒక ప్రత్యేక కృష్ణ సంచిక వచ్చిందనీ అది చాలా అద్భుతమైన సంచిక అనీ వి.ఎ.కె. రంగారావు గారు చెబుతారు.

1966 ప్రాంతాలలో ఈ సంపాదక వర్గం విడిపోయింది.బాపూ,రమణలు సినిమా రంగానికి వెళ్లిపోయారు.రాఘవయ్య గారే పత్రిక ఎడిటర్ గా కొంతకాలం పత్రిక నడిపారు .వారు కాలంచేశాక చాలా కాలం లీలావతీ రాఘవయ్య జ్యోతి పత్రిక నడిపారు.

తర్వాత వచ్చిన మాస పత్రికలలో స్వాతి ,జయశ్రీ గుర్తున్నాయి.

స్వాతి బాపూ గారి లోగోతో అందంగా వెలువడేది.

కథలపత్రికతో బాటు ఒక నవలను సప్లిమెంట్ గా ఇచ్చే సంప్రదాయానికి తెరతీసింది స్వాతి.కావాలంటే ఆ నవలని పత్రిక నుండీ విడదీసి విడిగా చదువుకోవచ్చు. అలా అప్పుడు చదివిన నవల యండమూరి వీరేంద్రనాథ్ గారి “ఋషి”. స్వాతి మాస పత్రిక లో మాలతీచందూర్ గారు “పాత కెరటాలు” పేరిట ప్రపంచ సాహిత్యంలో ఉత్తమమైన నవలల్ని పరిచయం చేసే వారు.అలా మంచి అభిరుచిని పెంపొందింపజేశారామె.సోమర్సెట్ మామ్ “ఆఫ్ హ్యూమన్ బాండేజ్ “ఆవిడ కాలమ్ ద్వారా చదివి ,ఆ తర్వాత  కాలంలో ఆయన కథలూ ,నవలలూ వెతుక్కుని చదివాను .

అలా యెన్నో మంచి మంచి నవలలు”యానీ ఫ్రాంక్ డైరీ,ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రె,రెబెక్కా, గాన్ విత్ ద విండ్ “ఇవన్నీ ఆవిడ పుణ్యమా అంటూ చదువుకున్నాం.

ఆ తర్వాత వచ్చినవి స్వాతి,ఉదయం,పల్లకి,ఆంధ్రభూమి వారపత్రికలు.

“స్వాతి “వారపత్రికలో సరసమైన కథ ఒకటి వస్తూ వుండేది.

“ఉదయం”లో నన్ను బాగా ఆకట్టుకున్నది ఆర్టిస్ట్ మోహన్ గారి “కార్టూన్ కబుర్లు”

“ఆంధ్రభూమి”లో యండమూరి “తులసీ దళం”,”వెన్నెల్లో ఆడపిల్ల” సీరియల్స్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

 2001ప్రాంతాలలో ఒకరోజు బజారుకి వెళితే పుస్తకాల స్టాండ్ లో “హాసం” అనే పత్రిక  కనపడింది.తీరా తీసి తిరగేస్తే అన్నీ మనకిష్టమైన శీర్షికలే!.హాస్యానికీ ,సంగీతానికీ పెద్దపీట వేస్తూ ఒక పత్రిక రావడం,అందులో అన్నీ నచ్చే విషయాలే వుండటం యెంత ఆనందం కలిగించిందో.ప్రతి సంచికా చేతికందినప్పుడల్లా ఒకటే అనిపించేది “దేవుడా ఈ పత్రిక ఆగిపోకుండా ఇలాగే వస్తూ వుండాలి” అని .అంత అపురూపంగా అనిపించేది ప్రతి సంచికా.ఉత్తమాభిరుచితో ఈ పత్రక ప్రారంభించిన వారు శాంతాబయోటెక్నిక్స్ వ్వవస్థాపకులు వరప్రసాద్ రెడ్డిగారు.పత్రిక తీర్చిదిద్దినవారు యం.బి.యస్ .ప్రసాద్ గారూ,మ్యూజికాలజిస్ట్ రాజా గారూ(తర్వాత్తర్వాత ఆయన్ని “హాసం రాజా”అనేవారు).

రాజాగారు ఈ పత్రికలో “ఆపాతమధురం” అనే శీర్షిక తాను అంతకు ముందు “వార్త” దిన పత్రిక లో మొదలు పెట్టిందానిని కొనసాగించే వారు.పాత పాటలలోని మాధుర్యాన్నీ,పాట విశేషాలనీ దానికి ఆధారమైన రాగాలనీ వివరిస్తూ సాగేదా శీర్షిక. (ఆ వ్యాసాలన్నీ పుస్తక రూపంలో మా స్నేహితుడు డా”గురవా రెడ్డి సహాయ సహకారాలతో అందంగా రూపుదిద్దుకుని వెలువడింది.)

చివరికి భయపడినంత పనీ జరిగింది .హాసం పత్రిక ఆగిపోయింది. మొత్తం డెభ్భయి పైచిలుకు పత్రికలన్నీ సేకరించి దాచుకున్నాను నేను .ఆ తర్వాత రోజుల్లో వరప్రసాద రెడ్డి గారితో జరిగిన మొదటి పరిచయంలో ఆయనతో “మీ పత్రికంటే చాలా ఇష్టమండీ,అన్ని సంచికలూ బైండింగ్ చేయించి దాచుకున్నాను” అని చెప్పాను.ఆయన చాలా సంతోషించారు.

 రచన పత్రిక  భారతి స్థాయిలో ఉన్నతమైన అభిరుచితో మంచి మంచి శీర్షికలతో వస్తూ వుండేది.శ్రీరమణ గారి “మిథునం”,”నాలుగో యెకరం ” రచనలోనే చదివిన గుర్తు .దీని ఎడిటర్ సాయి గారిని “రచన సాయి” అంటారందరూ.

ఈ పత్రికలన్నీ కాక మా ఇంట్లో “ఆంధ్రప్రదేశ్ “అనే పత్రిక తెప్పించేవారు.అందులో  యేవేవో రాజకీయ విషయాలుండేవి.నేను అవన్నీ వదిలేసి అందులో వచ్చే పిలకా గణపతి శాస్త్రి గారు రాసిన “గృహిణి” సీరియల్ చదివేదాన్ని .కె.యన్ .వై పతంజలి గారి అద్భుత రచన “రాజుల లోగిళ్లు” కూడా ఇందులోనే సీరియల్ గా నడిచింది కొంతకాలం తర్వాత యెందుకో హఠాత్తుగా ఆగిపోయింది.

1960—1990 వరకూ జరిగిన కాలాన్ని తెలుగు పత్రికల పాలిట స్వర్ణయుగంగా భావించ వచ్చు  .ఆ కాలంలో వుండటం వలన బోలెడన్ని మంచి మంచి  కథలూ,నవలలూ ,వ్యాసాలూ చదివే అవకాశం లభించింది.ఆ కాలంలో వుండటం నా అదృష్టం అనుకుంటాను.

వార,మాస పత్రికలతో పాటు డిటెక్టివ్ నవలలు కూడా మాకో అద్భుత ప్రపంచాన్ని సృష్టించేవి.

కొమ్మూరి సాంబశివరావు,గిరిజశ్రీ భగవాన్ ,టెంపోరావు పేరొందిన ఆనాటి డిటెక్టివ్ రచయితలు.డిటెక్టివ్ యుగంధర్ కొమ్మూరి సాంబశివరావు సృష్టి.గిరిజశ్రీ భగవాన్ నవలల్లో డిటెక్టివ్ నర్సన్ వుండేవాడని గుర్తు.

నాకు కొమ్మూరి సాంబశివరావు రచనలంటే ప్రాణం.ఆయన రచనా శైలి నన్ను అలా చేయిపట్టుకుని లాక్కు వెళ్లిపోయేది.

కొమ్మూరి సాంబశివరావు

ఆయన అప్పుడప్పుడూ డిటెక్టివ్ నవలలే కాకుండా రొమాంటిక్ నవలలు కూడా రాసేవారు .అవికూడా చాలా బాగుండేవి.ఆయన నవలలలో  నాకు గుర్తున్న పేర్లు “చావు తప్పితే చాలు”,”పదమూడు గంటలు కొట్టిన గడియారం”

“ప్రాక్టికల్ జోకర్ ,మోటారుకారులో శవం” మొదలైనవి. ఆయన నవలల్లో డిటెక్టివ్ క్రిస్లర్ కారులో పోతుంటాడు.ఆమధ్య అమెరికాలో డెట్రాయిట్ వెళ్లినప్పుడు అక్కడ క్రిస్లర్ కార్ల ప్రధాన కార్యాలయం చూసినప్పుడు నాకు ఈ డిటెక్టివ్ నవలలే గుర్తొచ్చాయి.

కొమ్మూరి సాంబశివరావు  ఇంత బాగా యెలా రాస్తారు? ఆయన కుటుంబ నేపథ్యం యేంటీ? అని తెలుసుకుంటే చాలా వివరాలు తెలిశాయి.

ఆయన ప్రఖ్యాత రచయిత గుడిపాటి వెంకటచలం గారి తమ్ముడి కొమ్మూరి వెంకట్రామయ్య గారి కొడుకు.కొడవటిగంటి కుటుంబరావు గారి భార్య వరూధిని కి తమ్ముడు.ఆయన తల్లి శ్రీమతి కొమ్మూరి పద్మావతి పెద్దపేరున్న నటి  .ప్రఖ్యాత రంగస్థల నటుడు బళ్లారి రాఘవ పక్కన నాటకాలలో నటిస్తూ వుండేవారు .కొన్ని సినిమాలలో కూడా నటించారు.(వాహినీ వారి పెద్దమనుషులు సినిమాలోనూ,దొంగరాముడు సినిమాలోనూ నటించారు).ఆవిడ రచయిత్రి కూడా.కొమ్మూరి సాంబశివ రావు గారి ముద్దు పేరు “ఉవ్వి”.ఆయన ఇంకో సోదరి ఉషారాణి భాటియా కూడా రచయిత్రే

ఈ డిటెక్టివ్ నవలలు చదవడంలో ఒక ఇబ్బంది వుండేది పెద్దవాళ్లకి కనపడకుండా పాఠ్యపుస్తకాలలో దూర్చి చదవవలసి వచ్చేది. వాళ్లు చూస్తే ఊరుకునే వాళ్లుకాదు.ఒక సారి స్కూల్లో అలా చదువుతుంటే మా క్లాసు టీచర్ పట్టుకున్నారు నన్ను ,మా స్నేహితులెంత సాయంచేసినా లాభం లేకపోయింది దొంగని పట్టేశారు.అలాంటి సందర్భాలలో ఆ పుస్తకం మళ్లీ మన చేతికి రాకుండా పోయేది,యెవరి దగ్గరనుండయినా అప్పుగా తీసుకున్నామనుకోండి బోలెడు తిప్పలు పడాలి ఆ ఋణం తీర్చుకోడానికి .ఇలాంటి సమస్యలెన్నో.చిన్న చిన్న పట్టణాల్లోనూ,నగరాల్లోనూ డిటెక్టివ్ నవలలు అద్దెకిచ్చే షాపులుండేవి ,మా ఊర్లో అలాంటి షాపులు చాలా తక్కువ .మా ఇంటి యెదురుగా నా స్నేహితురాలొకామె వుండేది,వాళ్లన్నయ్య లారీ డ్రైవర్ గా పని చేస్తూ వుండేవాడు.అతను డ్యూటీ దిగి వచ్చినప్పుడల్లా కొత్తకొత్త డిటెక్టివ్ నవలలు తీసుకువచ్చి చెల్లెలుకు ఇచ్చేవాడు .అవి నేనూ నా స్నేహితురాలూ పంచుకుని చదివేవాళ్లం అలా చాలా పుస్తకాలు చదివాను .అపరాధ పరిశోధన అనే డిటెక్టివ్ మాసపత్రిక కూడా చదువుతూ వుండేవాళ్లం

నేను ఏడవ తరగతి లోకి వచ్చేసరికి నాకు నవలలు చదవడంఅలవాటయింది.(సశేషం)

One thought on “నా చదువు కథ Part 2

  1. ఆసక్తికరంగా సాగుతోంది . ఒక్క సారి పాత రోజులు , ఆ పత్రికలు గుర్తుకు వచ్చాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *